వ్యవసాయంలో కృత్రిమ మేధ వినియోగంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బిట్స్ పిలానీల మధ్య శుక్రవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని అగ్రి హబ్‌లో జరిగిన కార్యక్రమంలో పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య, బిట్స్ పిలానీ ఉపకులపతి ప్రొఫెసర్ వి. రాంగోపాల్ రావు సమక్షంలో అవగాహన ఒప్పందం పత్రాలపై ఇరుసంస్థల అధికారులు సంతకాలు చేశారు. పరస్పరం ఒప్పంద పత్రాల్ని మార్చుకున్నారు. ఈ రెండు ప్రతిష్టాత్మకమైన సంస్థల మధ్య జరిగిన ఈ అవగాహన ఒప్పందం సంయుక్తంగా పరిశోధన ప్రాజెక్టుల రూపకల్పనకు, పీహెచ్.డీ. విద్యార్థులకు పరిశోధన సలహాలు ఇవ్వడానికి దోహదం చేస్తుందని బిట్స్ పిలాని ఉపకులపతి ప్రొఫెసర్ వి. రాంగోపాల్ రావు అన్నారు. ఇరు సంస్థల శాస్త్రవేత్తలు కలిసి నాణ్యమైన పరిశోధనా పత్రాలు ప్రచురించడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. దుబాయ్ తోపాటు దేశంలోని 4 చోట్ల బిట్స్ క్యాంపస్‌లు ఉన్నాయని, అందులో ప్రతి ఏటా సుమారు 600 మంది పీహెచ్.డీ.లో ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. దేశంలోనే మూడవ అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ నెట్వర్క్ బిట్స్ పిలానీ సంస్థ కు ఉందని తెలిపారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించి రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని వివరించారు. పిజేటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రాచీన వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండోదని, ఇది అమెరికా ల్యాండ్ గ్రాంట్ మోడల్‌లో ఏర్పాటయిందని తెలిపారు. గ్రామీణ స్థాయి వరకు అత్యంత పటిష్టమైన పరిశోధన నెట్ వర్క్ కలిగి ఉండడంతోపాటు అనేక వ్యవసాయ విద్య, విస్తరణ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా కలిగి ఉండి రైతులకు మెరుగైన సేవలు అందించడంలో నిమగ్నమైందని అన్నారు. 2047 నాటికి మానవ రహిత వ్యవసాయం తీసుకురావాలనే లక్ష్యంతో తాము ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం డిజిటల్ అగ్రికల్చర్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. బిట్స్ పిలానీతో జరిగిన ఈ అవగాహన ఒప్పందం వల్ల తాము అనుకున్న మానవ రహిత వ్యవసాయ లక్ష్యాలను సాధించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ పరిజ్ఞానం (హార్డ్ వేర్), బిట్స్ పిలానీలోని సాఫ్ట్ వేర్ కలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటల సాగుకి ఉపయోగపడే అగ్రి రోబోల రూపకల్పన జరగాలని జానయ్య ఆకాంక్షించారు. పరిశోధనా సంచాలకులు డాక్టర్ బలరాం అవగాహన ఒప్పందం ముఖ్య లక్ష్యాల గురించి సమావేశంలో వివరించారు. రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఇ.సీహెచ్. విద్యాసాగర్, బిట్స్ ఫిలానీ డీన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డాక్టర్ సంకేత్ గోయల్, పిజేటిఏయు అంతర్జాతీయ కార్యక్రమాల సంచాలకులు డాక్టర్ రాములు, డిజిటల్ అగ్రికల్చర్ సంచాలకులు డాక్టర్ బాలాజీ నాయక్, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, బిట్స్ పిలానీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నెలకొల్పిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి సాంకేతిక సహకారం అందించడం కోసం భారత వ్యవసాయ పరిశోధన మండలి సంస్థ అయిన నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్) తో అవగాహన ఒప్పందంపై ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్. సి. అగర్వాల్ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఇ.సిహెచ్. విద్యాసాగర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ అల్దాస్ జానయ్య సమక్షంలో సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం వచ్చే మూడు సంవత్సరాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు / సిబ్బందికి నూతన అంశాలు, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై నార్మ్ సహకారంతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా నార్మ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. సి. అగర్వాల్ మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని, అవగాహన ఒప్పందం చేసుకొనుటకు ముందుకు వచ్చిన విశ్వవిద్యాలయ ఉపకులపతిని అభినందించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, మానసిక వికాసం అంశాలు మరియు సిబ్బందికి నిర్వహించే సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి మరియు పరిపాలన తదితర శిక్షణ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ మానవ అభివృద్ధి కేంద్రానికి తమ సంస్థ నుండి పూర్తి సహకారం అందిస్తామని అగర్వాల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ బలరాం, డాక్టర్ ఝాన్సీరాణి మరియు డాక్టర్ వి. రాములు నార్మ్ అధికారులు పాల్గొన్నారు
హైదరాబాదులోని భారతీయ వరి పరిశోధనా సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంల మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో జరిగిన కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఇ.సిహెచ్. విద్యాసాగర్, భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్) సంచాలకులు డాక్టర్ ఆర్. మీనాక్షి సుందరం పి.జె.టి.ఎ.యు. ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జానయ్య మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పరిశోధనలు ప్రాధాన్యతా పద్ధతిలో చేపట్టాలని, వరిలో ఉత్పత్తి, ఉత్పాదకతల పెంపుతో పాటు రైతులకు, వినియోగదారులకు కూడా ప్రయోజనాలు కలిగించే విధంగా ఇరు సంస్థలు కలిసి పనిచేయాలన్నారు. వరిలో కార్భన్ క్రెడిట్ ద్వారా రైతులు మరింత ఆర్థికపరమైన ప్రయోజనం కలిగించే విధానాలపై దృష్టి నిలపాలన్నారు. వరిలో వాతావరణ మార్పులను తట్టుకునే వరి రకాల రూపకల్పన ప్రస్తుతం అవసరమన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణ 5 మిలియన్ టన్నుల మేర వరి ధాన్యం మిగులు ఉత్పత్తి చేస్తోందని, అందుకు ఎగుమతులే సరైన విధానమని, రైతులను అటువైపు మళ్లించడానికి అవసరమైన సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో వరి ధాన్యాన్ని దిగుమతి చేసుకునే దేశాలలో అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశమైన ఫిలిప్పైన్స్‌కు మన రాష్ట్రం నుండి ఎగుమతి చేయడానికి ఉన్న అద్భుత అవకాశాలను వినియోగించుకునే విధంగా వరి పంట సాగును ఒక ఆధునికమైన పరిశ్రమగా మార్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా రెండు సంస్థలు తదనుగుణంగా పనిచేయాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ వరి పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్ ఆర్. మీనాక్షి సుందరం మాట్లాడుతూ రైతులకు మేలైన సేవలు అందించేందుకు ఇరు సంస్థలు సమన్వయంతో పనిచేసేందుకు ఈ అవగాహన ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, ఐఐఆర్‌ఆర్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
2047 నాటికి వ్యవసాయ రంగంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని విశ్వవిద్యాలయం కులపతి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. భాగస్వాముల అందరితో సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణలో పురోగతి సాధించాలని సూచించారు. రాజేంద్రనగర్‌లో 2 రోజులపాటు జరుగుచున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రాజేంద్రనగర్‌లోని పి.జె.టి.ఎ.యు. క్రీడా మైదానంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనల్ని ప్రారంభించారు. వివిధ స్టాళ్లను పరిశీలించారు. తర్వాత ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వజ్రోత్సవాల మీనియేచర్ పైలాన్‌ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పి.జె.టి.ఎ.యు. ఉపకులపతి అల్దాస్ జానయ్యతో కలిసి ప్రారంభించారు. కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ గుర్తింపు పత్రాలని అందజేశారు. తర్వాత విశ్వవిద్యాలయం అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించారు. 60 ఏళ్లుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ అభివృద్ధికి అసమాన సేవల్ని అందించిందన్నారు. సొనామసూరి, తెలంగాణ సోనా వంటి వంగడాలు రూపొందించిందన్నారు. భవిష్యత్ ప్రణాళికల అమలులో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి అధునాతన పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలని గవర్నర్ సూచించారు. భారతీయ స్టేట్ బ్యాంక్ సహాయంతో విశ్వవిద్యాలయం త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్‌నీ ప్రారంభించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ విద్యని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫీజులు తగ్గించడం స్వాగతించదగినదన్నారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదం ఇచ్చిన మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చేతుల మీద ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం వాతావరణ మార్పులు వంటి కొత్త సవాళ్లని ఎదుర్కొని మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గవర్నమెంట్ పిలుపునిచ్చారు. ఉదయం ఉత్సవాల ప్రారంభ సదస్సులోనూ. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కిసాన్ మేళాలోను తుమ్మల నాగేశ్వరరావు రైతులని ఉద్దేశించి ప్రసంగించారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం భవిష్యత్తులో దేశానికి దిక్సూచిగా మారాలన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలు, మన నేల స్వభావానికి తగ్గట్లుగా అనువైన పంటలు, అందుకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలను రైతులకు అందించాలని విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకి ఆయన సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వ్యవసాయ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు. రైతు బీమా, రైతు రుణమాఫీలతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసాను అమలు చేస్తామన్నారు. హార్టికల్చర్, పంటలు, కూరగాయలు పామాయిల్ సాగు పెరగాలన్నారు. బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి చేయుతనిస్తామన్నారు. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో వ్యవసాయ పట్టభద్రులు రావాలని వ్యవసాయ రంగంలో అధిక జనాభా నిమగ్నం కావాలని తుమ్మల ఆకాంక్షించారు. దేశ ప్రధానుల చేతుల మీద ప్రారంభమైన విశ్వవిద్యాలయం రైతాంగానికి ఎల్లప్పుడూ చేదోడువాదోడుగా ఉందని ఆయనన్నారు. గత కొన్నేళ్లుగా ఈ విశ్వవిద్యాలయం వెనుకబాటుకి గురి అయింది అని.. దాని అధిగమించి పూర్వ వైభవం తీసుకురావటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ఉపయోగించుకుని పరిశోధన, విస్తరణ విద్యలో ముందుకెళ్లాలని మంత్రి సూచించారు. రానున్న రోజుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి 10 ర్యాంకుల్లో నిలవాలని తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రతి వ్యవసాయ కళాశాల పరిధిలో ఒక ”మోడల్ అగ్రికల్చర్ ఫార్మ్”ను అభివృద్ధి చేయాలన్నారు. వాతావరణ మార్పుల కనుగుణంగా కరికులమ్‌లో రీసెర్చ్‌లో మార్పులు తీసుకురావాలని, ఆర్టిఫిషియల్, డిజిటల్ టెక్నాలజీలను వినియోగించుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వజ్రోత్సవ ఉత్సవాల ప్రారంభ సమావేశంలో భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ఉపకులపతి అల్దాస్ జానయ్యతో తనకు పూర్వం నుంచి పరిచయం ఉందని ఆయన నాయకత్వంలో విశ్వవిద్యాలయ అభివృద్ధి పథాన సాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత విజయాలతో సంతృప్తి చెందకుండా భవిష్యత్తు లక్ష్యాల్ని నిర్దేశించుకోవాలన్నారు. నిధుల లభ్యత తగ్గడం వల్ల పరిశోధనలు వెనుకబడుతున్నాయని ఆ విషయంపై దృష్టి సారించాలన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఆహార ధాన్యాల ఉత్పాదక గణనీయంగా పెరిగిందన్నారు. తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాలు, ఆహార ధాన్యాలు ఉత్పత్తి బాగా పెరిగిందన్నారు. అయితే కూరగాయలు, ఉద్యానవన పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని దీన్ని అధిగమించాలన్నారు. అదేవిధంగా వ్యవసాయ విద్యనభ్యసించిన వాళ్ళు కేవలం ఉద్యోగాల కోసమే చూడకుండా ఎంటర్ ప్రెన్యూర్‌లుగా తయారు కావాలని రమేష్ చంద్ సూచించారు. గతంలో రైతులకి దక్కిన గౌరవం నేడు దక్కడం లేదని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి అన్నారు. రైతుకి వ్యవసాయానికి మూలమైన విత్తనాలు 90 శాతం ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లడం దురదృష్టకరమని ఆయనన్నారు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు, వ్యవసాయ సంక్షేమం ప్రథమ ప్రాధాన్యాలని అందుకు అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పనిచేయాలన్నారు. శాస్త్రవేత్తలు గ్రామాల్ని దత్తత తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో సహకార వ్యవసాయ విధానం అవసరమని కోదండ రెడ్డి అన్నారు. రైతు సుఖంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూమి, విత్తనం, నీరు, రైతు చెమట వ్యవసాయానికి ఆధారాలన్నారు. మన వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశానికి తలమానికంగా ఉండాలని ఆకాంక్షించారు. పురుగుమందుల రహిత వ్యవసాయం కోసం మనమందరం కృషి చేయాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో అమెరికా అధ్యకక్షుడు జార్జి బుష్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సందర్శించడం గొప్ప అనుభవం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యకక్షులు జి. చిన్నా రెడ్డి అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమధ్య ప్రధాని 131 కొత్త వంగడాలు విడుదల చేశారని వాటిలో కనీసం మన విశ్వవిద్యాలయం వంగడాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. విద్య, పరిశోధన, విస్తరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ జన్యు మార్పిడి పంటల సాగు నీ అనుసరించవలసిందేనన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇక్రిసాట్, క్రిడా వంటి సంస్థల సహకారం తీసుకోవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీలని వ్యవసాయ రంగంలో విస్తృతంగా వినియోగించుకోవాలని చిన్నారెడ్డి సూచించారు. రైతుల కష్టాలు నాటికి నేటికి అలానే ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. ధరల పెరుగుదల, వాతావరణ మార్పులకి అనుగుణంగా రైతులకి చాలా చేయవలసి ఉందని ఆయన అన్నారు. వందేళ్ళ క్రితమే వ్యవసాయంగా ప్రాముఖ్యత గురించి మహాత్మా గాంధీ చెప్పారని మరో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సమరసింహా రెడ్డి అన్నారు. వ్యవసాయానికి అవసరమైన అన్నింటిని రైతులకు అందుబాటులో ఉంచాలని సమరసింహారెడ్డి సూచించారు. 60 ఏళ్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తానాన్ని పి.జె.టి.ఎ.యు. ఉపకులపతి అల్దాస్ జానయ్య వివరించారు. నాటి ప్రధానులు లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీలు, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతి మొరార్జీ దేశాయ్‌లు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం చుట్టూ సుమారు 10 భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంస్థలు ఉన్నాయన్నారు. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వల్ల హైదరాబాద్ విత్తన రాజధానిగా రూపొందిందని జానయ్య వివరించారు. 60 ఏళ్లలో సుమారు 500 వంగడాలని విడుదల చేశామన్నారు. అదేవిధంగా సుమారు 32 వేల మంది గ్రాడ్యుయేట్లు బయటకొచ్చారన్నారు. 12 రాష్ట్రాల్లో సుమారు 3 కోట్ల ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపొందించిన వరి విత్తనాలు సాగు చేస్తున్నారని తెలిపారు. ఇతర పంటల్లోనూ విశ్వవిద్యాలయం రూపొందించిన వంగడాలు విస్తృత వ్యాప్తి పొందాయన్నారు. 21 పేటెంట్లు సాధించామన్నారు అలాగే పౌల్ట్రీ, పశుసంవర్ధక రంగాల్లోనూ వ్యవసాయ విశ్వవిద్యాలయం అపూర్వ ప్రగతి సాధించిందని అల్దాస్ జానయ్య అన్నారు. ఈ సందర్భంగా 60 ఏళ్ల విశ్వవిద్యాలయం ప్రయాణం పై ఒక లఘు చిత్రాన్ని విడుదల చేశారు. అలాగే వివిధ సాగు పద్ధతులపై అనేక ప్రచురణల్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎ.పి.సి. రఘునందన్ రావు, కమిషనర్ బి. గోపి, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ బాల్ రాజు, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డి. రాజి రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, పద్మశ్రీ గ్రహీతలు చింతల వెంకటరెడ్డి, వై. వెంకటేశ్వర రావు, విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు రఘువర్ధన్ రెడ్డి, రాఘవ రెడ్డి, పద్మరాజు, వెటర్నరీ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రభాకర్ రావు, పూర్వ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కిసాన్ మేళా వేదికపై పలువురు తమ రైతులకు ఈ సందర్భంగా అవార్డులను బహుకరించారు.
‘రైతునేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ”వరి కొయ్యలు కాల్చడం నష్ట నివారణ చర్యలు” కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సెక్రటేరియట్ నుంచి పాల్గొని రైతులతో ముచ్చటించడం జరిగింది. అదేవిధంగా పత్తి మరియు వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలోని రైతులతో మంత్రిగారు ముచ్చటించి అక్కడి సౌకర్యాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో 06.03.2024 నాడు 110 రైతు వేదికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున దృశ్య శ్రావణ పరికరములు ఏర్పాటు చేసి రైతులతో నేరుగా మాట్లాడే ”రైతు నేస్తం” కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయంతెలిసిందే. .రైతు నేస్తం కార్యక్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవసాయ మరియు అనుబంధ శాఖల కార్యకలాపాలపై రైతు సమాజానికి అవగాహన కల్పించడానికి ప్రతి మంగళవారం, ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇప్పటివరకు 33 ఎపిసోడ్‌లను నిర్వహించి రైతులకు విజయవంతంగా శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ”వరి కొయ్యలు కాల్చడం నష్ట నివారణ చర్యలు” పై వ్యవసాయ శాస్త్రవేత్త టి. ప్రభాకర్ రెడ్డి, కెవికె, పాలెం నుండి దృశ్య శ్రావణ మాధ్యమం ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. అభ్యుదయ రైతులు చంద్రయ్య మరియు దేవేందర్ రెడ్డి గార్లు వారి అనుభవాలను పేర్కొంటూ వరి కొయ్యలు కాల్చవద్దని, తద్వారా కలిగే లాభాలను తమ అభిప్రాయాలను తోటి రైతులతో పంచుకొన్నారు. మంత్రివర్యులు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నాగర్ కర్నూల్ రైతులతో కూడా పత్తి కొనుగోలు అంశాలపై మట్లాడుతూ, వరి మరియు పత్తి కొనుగోలు విషయంలో సంబంధిత అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినారు. పంట సాగుచేసిన రైతుల ఖాతాలలో మాత్రమే నగదు జమ చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. కామారెడ్డి, జనగాం, మహబూబ్‌నగర్, పెద్దపల్లి జిల్లాలలోని రైతులతో వరి కొనుగోలు కేంద్రాల నుండి ముఖాముఖి మాట్లాడి, వరి ధాన్యం దిగుబడులు, కొనుగోలు కేంద్రాలలో రైతులకు సంబందించిన సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. వరి సన్న ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ గురించి, సన్న ధాన్యం పండించి, ఇప్పటికే కొనుగోలు కేంద్రాలలో అమ్మి, బోనస్ డబ్బులు జమ అయిన రైతులతో మాట్లాడినారు. ఈ సందర్భముగా రైతులు స్పందిస్తూ, వరి కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు బాగున్నాయని, ముఖ్యముగా సన్న ధాన్యం అమ్మిన రైతులకు రెండు రోజులలోనే బోనస్ డబ్బులు రూ.500 ప్రతి క్వింటాలుకు జమ అవుతున్నాయని, రాష్ట్రంలో మొదటిసారిగా ఈ విధమైన చర్యలు చేపట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. పిమ్మట మంత్రి గారు మాట్లాడుతూ వరి, మొక్కజొన్న, పత్తి పంటలు, కోసిన తర్వాత, వాటి అవశేషాలను రైతులు కాల్చి వేయడం వలన, భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గుతుందని, ఈ విధంగా చేయడం వలన భూమి కొంతకాలానికి నిస్సారంగా మారుతుందని, పంట అవశేషాలను రైతులు కాల్చకుండా, భూమిలో కుళ్ళి పోయేటట్లు చేసుకోవాలని, ఈ విషయమై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 566 రైతు వేదికల నుంచి జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది, మరియు రైతులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ వింగ్, వ్యవసాయ విశ్వ విద్యాలయం రాజేంద్రనగర్ నుండి హాజరై రైతులకు అవగహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి ఉదయ్ కుమార్ వ్యవసాయ అదనపు సంచాలకులు విజయ కుమార్ మరియు పౌర సరఫరా అధికారులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ నూనె గింజల పరిశోధనల సమీక్ష మరియు ప్రణాళికల రూపకల్పనకు ఉద్దేశించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాటర్ టెక్నాలజీ సెంటర్‌లో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కుసుమ మరియు అవిసెలు పంటలపై పరిశోధనలు చేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్తలు 150 మంది పాల్గొని వివిధ పరిశోధన అంశాలు మరియు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై కూలంకుషంగా చర్చించారు. ఈ కార్యక్రమంను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) మరియు జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ (ICAR-IIOR)లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంకు డా. టి.ఆర్. శర్మ (ICAR-DDG, న్యూ ఢిల్లీ) అధ్యక్షత వహించి ప్రస్తుతం ఇండియా 1.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నూనెలని దిగుబడి చేసుకుంటున్నదని, దీన్ని తగ్గించడానికి జాతీయ నూనె గింజల మిషన్‌ని భారత ప్రభుత్వం ప్రారంభించిందన్నారు కావున మనం చేసే పరిశోధనలు నూనె గింజ పంటల సాగును పెంచి, రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. ముళ్ళు లేని కుసుమ రకాలను వృద్ధి చేయాలన్నారు. అన్ని పరిశోధన సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేయడం వల్ల కుసుమ మరియు అవిసెలలో చాలా నూతన రకాలను వృద్ధి చేయడం జరిగిందని శర్మ వివరించారు. డా. సంజీవ్ గుప్త (ICAR-DDG, న్యూ ఢిల్లీ) మాట్లాడుతూ చాలా ప్రాంతాలలో కుసుమ మరియు అవిసె పంటలకు ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ముఖ్యంగా ఈ నూనె గింజలలో లైనోలేనిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అన్నారు. కాబట్టి ఈ పంటల సాగు ఇంకా పెంచి రైతులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు. డా.మాథూర్ (డైరెక్టర్, IIOR) గత సంవత్సరం కుసుమ మరియు అవిసెలలో చేపట్టిన పరిశోదన ఫలితాలను క్లుప్తంగా వివరించారు. డా. జెల్లా సత్యనారాయణ (డీన్ అఫ్ అగ్రికల్చర్, PJTAU) మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం చాలా వరకు కుసుమ సాగును ప్రోత్సహిస్తూ రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంను అందిస్తుందన్నారు. విశ్వ విద్యాలయం చీడ పీడలను తట్టుకునే రకాలను వృద్ధి చేయడమే కాకుండా కుసుమ నూనె కూడా ఉత్పత్తి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కుసుమ మరియు అవిసెలు సాగు చేస్తున్న రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రతినిధులు, ప్రధాన శాస్త్రవేత్తలు, వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మంది శాస్త్రవేత్తలు, విద్యార్థులు మరియు రైతులు పాల్గొన్నారు.