ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె

జన్యు సవరణ ద్వారా సృష్టి

ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ (జీన్‌ ఎడిటింగ్‌) ద్వారా సృష్టించడంలో జమ్మూ కశ్మీర్‌లోని షేర్‌-ఎ-కశ్మీర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీకి (ఎస్‌కేయూఏఎస్‌టీ) చెందిన పరిశోధకులు విజయం సాధించారు. ఇది భారత్‌లో తొలి జన్యు సవరణ గొర్రె అని, చరిత్రాత్మక మైలురాయి అని వారు వివరించారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధిని నియంత్రించే మయోస్టాటిన్‌ జన్యువును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. నాలుగేళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశు వైద్య విభాగం డీన్‌ రియాజ్‌ అహ్మద్‌ షా నాయకత్వం వహించారు. ‘జన్యు సవరణ ద్వారా 30 శాతం ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని సృష్టించగలిగాం. భారతీయ రకాల్లో సహజంగా మాంసం వాటా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని ఐరోపా గొర్రె జాతుల్లో మాంసం అధికంగా ఉండేలా జన్యు నిర్మాణం ఉంటుంది’ అని అహ్మద్‌ షా తెలిపారు. ‘సంకరం ద్వారా కాకుండా జన్యు సవరణ ద్వారా జన్యు మార్పిడి సాధించడం ఒక నవ్య సాంకేతిక ఘన విజయం. ఇది 21వ శతాబ్దంలో ఆవిర్భవించిన కృత్రిమ మేధ లాంటిదే’ అని పేర్కొ న్నారు. ‘ఇది కేవలం ఒక గొర్రె పిల్లను పుట్టించడం కాదు. జన్యు ఆధారిత పశుగణాభివృద్ధిలో ఒక కొత్త ఆవిష్కారం. కొత్త జన్యు పదార్థాన్ని ప్రవేశపెట్టకుండా ప్రయోజనకరమైన జన్యు సవరణ చేసే సత్తా మనకుందని చాటుకున్నాం’ అని ఆయన వివరించారు. అహ్మద్‌ షా నేతృత్వంలోని పరిశోధక బృందం 2012లో అత్యంత ఖరీదైన ఉన్నిని అందించే కశ్మీరీ పష్మీనా గొర్రె ‘నూరీ’ అనే జన్యు సమరూప జీవిని (క్లోన్‌) ఆవిష్కరించింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

Read More

తెలంగాణలో ప్రకృతి వ్యవసాయం

480 సమూహాల్లో కేంద్ర ప్రభుత్వ పథకం అమలు
2025-26లో 60 వేల ఎకరాల్లో సాగు

కేంద్ర ప్రభుత్వ జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని (ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌) తెలంగాణలో రెండేళ్ల పాటు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంప్రదాయ వ్యవసాయాన్ని శాస్త్రీయ దృక్పథంతో పునరుద్ధరించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ రైతు కుటుంబాలకు, వినియోగదారులకు రసాయనాల బెడద లేని ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ వచ్చే రెండేళ్ల కాలానికి రూ.2,481 కోట్లతో ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ పథకానికి రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా కింద సుమారు రూ.1584 కోట్లు ఖర్చు చేయనుండగా, రాష్ట్రాలు 40 శాతం వాటా కింద సుమారు రూ. 897 కోట్లు భరించాలి. రాష్ట్రంలో 2025-26 సంవత్సరంలో 60 వేల ఎకరాల్లో ఈ పథకం కింద సాగు చేపట్టనున్నారు. ఒక్కో సమూహం (క్లస్టర్‌)లో 125 ఎకరాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 480 సమూహాల్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
అమలు ఇలా…: సేంద్రియ వ్యవసాయానికి అవసరమయ్యే సహజ ఉత్పత్తులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు.. అవసరాన్ని బట్టి జీవాధార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని కృషి విజ్ఞాన్‌ కేంద్రాలు, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో దాదాపు 200 వరకు సహజ పద్ధతుల నమూనా వ్యవసాయ క్షేత్రాలు నెలకొల్పుతారు. ప్రతి సమూహంలో 8 మంది రైతులకు శిక్షణ ఇస్తారు. క్లస్టర్లలో కొత్త పథకంపై అవగాహన కల్పించేందుకు, రైతుల మధ్య సహకారం పెంపొందించేందుకు, ఇతరత్రా సాయం అందించేందుకు 500 మంది సాగు సహాయకులను నియమిస్తారు. జిల్లా, బ్లాక్‌, గ్రామపంచాయతీల స్థాయిల్లో రైతుబజార్లు, మార్కెట్‌ కమిటీలు, డిపోలతో అనుసంధానం ద్వారా సహజ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అవకాశాలు కల్పిస్తారు. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వపరంగా రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వారికి విత్తనాలు, పరికరాలు అందిస్తామని పేర్కొన్నారు.

Read More

చిరుధాన్యాల సాగు, వినియోగం భారీగా పెరగాలి

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంపై ఎఫ్‌ఏవో నివేదిక

ఆకలి, పోషకాహార లోపం, వాతావరణ మార్పులు, జీవవైవిధ్య ప్రభావం, ఆహారభద్రత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు... చిరుధాన్యాల సాగు, వినియోగం పెద్దఎత్తున విస్తరించాలని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) సూచించింది. ఈ మేరకు సాగు మరింతగా అభివృద్ధి చెందాలని, విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాలని, కొత్త వంగడాలకు రూపకల్పన చేయాలని పేర్కొంది. ఉత్పత్తుల మార్కెటింగ్‌ మరింత విస్తృతం కావాలని సూచించింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 ప్రాముఖ్యంపై తాజాగా ఎఫ్‌ఏవో నివేదికను విడుదల చేసింది. వివిధ దేశాల్లో చిరుధాన్యాల సాగు, వినియోగం తదితర అంశాలపై చేపట్టిన అధ్యయనం... నిపుణులు, శాస్త్రవేత్తలు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాల సేకరణ అనంతరం నివేదికను రూపొందించింది. నివేదికలో చిరుధాన్యాల సాగు, వినియోగం విస్తృతికి పలు సిఫార్సులు చేసింది. ముఖ్యాంశలివీ..
  • బాల్యం నుంచే పిల్లలకు చిరుధాన్యాల ఆహారం అందించాలి. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాల ఆధారిత వంటకాలను ప్రవేశపెట్టాలి. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న ఇతర ఉత్పత్తులకు బలమైన ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు మారాలి.
  • జన్యువైవిధ్యంతోపాటు సాంకేతికతను మెరుగు పరిచి విజ్ఞానమార్పిడి జరగాలి. స్థానిక సంస్థలు, రైతులు, మహిళలు, వివిధ సంఘాలను భాగస్వాములను చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.
  • జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజల ఆహార అవసరాలకు అనుగుణంగా చిరుధాన్యాల సాగు చేపట్టాలి. విత్తన సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలి. రైతులు తమకు అనుకూలమైన రకాలను ఎంచుకోవాలి. స్థిరమైన ఉత్పత్తికి సమీకృత పంటల విధానం అనుసరిణీయం.
  • చిరుధాన్యాలు ఆరోగ్యపరంగా అత్యుత్తమ ఫలితాలిస్తాయి. సంప్రదాయ ఆహారంతో పోలిస్తే వైవిధ్య, స్థితిస్థాపకంగా ఉండే చిరుధాన్యాలు రైతుల జీవనోపాధిని నిలబెట్టాలి. దీనికోసం స్థిరమైన విత్తన పరిరక్షణను బలోపేతం చేయాలి. చిన్న కమతాల రైతులు ఈ పంటలవైపు మొగ్గు చూపుతున్నందున వారికి చేయూతనివ్వాలి. నీటి పొదుపు ద్వారా సాగు సజావుగా సాగే ప్రణాళిక ఉండాలి. నేరుగా వంగడాలను రూపొందించడంతో పాటు కలుపు తీయడం, కోత, నిల్వ, ఉత్పత్తుల శుద్ధి శిక్షణకు సులభతర అవకాశాలను కల్పించాలి.
    మరింతగా మార్కెటింగ్‌…
  • స్థిరమైన ఉత్పత్తి, యాంత్రీకరణతోపాటు రైతులకు పంటలు లాభదాయకంగా మారేలా మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించాలి.
  • చిరుధాన్యాల కోసం ప్రత్యేకంగా రైతు బజార్లను ఏర్పాటు చేయాలి. పంట శుద్ధి అనంతరం పిండి, రవ్వ, ఇతర పదార్థాలుగా మార్చి ప్యాకేజింగ్‌ ద్వారా పంపిణీ జరగాలి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వారాంతపు సంతల్లోనూతత… సూపర్‌ మార్కెట్లు, కిరణా దుకాణాల్లోనూ విక్రయాలు సాగాలి.
  • ఆన్‌లైన్‌, మొబైల్‌ యాప్‌లు, ఈ-కామర్స్‌ వేదికల ద్వారా ఇళ్లకే నేరుగా సరఫరా చేయడం ద్వారా విక్రయాలు సులభతరం చేయాలి.
  • చిరుధాన్యాల ఉత్పత్తి ప్రదర్శనలు నిర్వహించాలి. యాంత్రీకరణ, ఆహారశుద్ధి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు గ్రాంట్లను ఇవ్వాలి.

ఉత్పత్తిలో మేటి భారత్‌
చిరుధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారు భారత్‌, దేశంలో ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకొని చిరుధాన్యాలు సాగవుతాయి. తరి, ఖుష్కి, భూముల్లోనూ పెరుగుతాయి. చీడపీడలను సమర్ధంగా ఎదుర్కొంటాయి. నీటి వినియోగం తక్కువ. వీటి సాగువల్ల నేల సాంద్రత పెరుగుతుంది. పోషకాల పరంగా చిరుధాన్యాలతో కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, మినరల్స్‌, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమకూరుతాయి. పూర్వకాలం నుంచి చిరుధాన్యాల సాగు, వినియోగం జరుగుతోంది. ప్రధానంగా రాగులు, జొన్నలు, సజ్జలు విస్తృత ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం ఉత్పత్తిలో దక్షిణాసియా, సబ్‌సహారా ప్రాంతాల్లో 85 శాతం కంటే ఎక్కువ వినియోగమవుతున్నాయి. భారత్‌, నైజీరియా, నైగర్‌, చైనా, మాలి చిరుధాన్యాల ఉత్పత్తిలో తొలి 5 స్థానాల్లో ఉన్నాయి.

Read More

ప్రకృతి వ్యవసాయంలోకి కోటిమంది రైతులు

వచ్చే రెండు సంవత్సరాల్లో కోటిమంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులకు బ్రాండింగ్‌, సర్టిఫికేషన్‌ ఇస్తామని తెలిపింది. శాస్త్రసాంకేతిక సంస్థలు, గ్రామ పంచాయతీల ద్వారా దీన్ని అమలు చేస్తామని, పదివేల బయో-ఇన్‌పుట్‌ రిసోర్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఈ రోజు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి ప్రాధాన్యతను ఇచ్చింది. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించింది. కూరగాయల సాగుకు భారీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌ కోసం ప్రత్యేక సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసేలా అంకుర సంస్థలు, సహకార సంఘాలు, రైతు సంఘాలను ప్రోత్సహిస్తామని కేంద్రప్రభుత్వం తెలియచేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకోగలిగి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాల దిశగా వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహిస్తామని కేంద్రప్రభుత్వం తెలియచేసింది.

Read More

దేశీ విత్తనాలను ఉత్పత్తి చేయండి – విస్తరించండి

‘నమస్తే కిసాన్‌’ అనే దేశీ విత్తనాల సాగును ప్రోత్సహిస్తున్న సంస్థ మరియు సికిందరాబాద్‌ (వెస్ట్‌) రోటరీ క్లబ్‌వారు సంయుక్తంగా డిసెంబర్‌ 24న హైదరాబాద్‌ (షేక్‌పేట్‌)లోని నారాయణమ్మ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాల నుండి సుమారు 150 మందికి పైగా అభ్యుదయ రైతులు, గోప్రేమికులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని తాము పండించిన వివిధ రకాల వరి విత్తనాలు, చిరుధాన్య విత్తనాలు, ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. ఐటి రంగంలోనూ, బిజినెస్‌ రంగంలోనూ ఉన్నత విద్యలను అభ్యసించిన యువకులు, విశ్రాంత ఉన్నతాధికారులు, ప్రొఫెసర్లు, ఆధ్యాత్మిక వేత్తలు, గోప్రేమికులు, దేశీ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని సేంద్రియ వ్యవసాయం, దేశీ విత్తనాల ఉత్పత్తిలో తమ అనుభవాలను సభికులకు ఆసక్తికరంగా వివరించారు.

దేశీయ విత్తనాలను ”భద్రపరచు, సంరక్షించు మరియు విస్తరించు” (Conserve – Protect and Propagate)  అనే లక్ష్యంతో కొందరు యువ కర్షకులు నిర్వహిస్తున్న ”నమస్తే కిసాన్‌” ఎంతైనా ప్రశంసనీయమని సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూనాకు చెందిన యోగి చంద్రకాంత్‌ కులకర్ణి మహరాజ్‌ – నిర్వాహకులను అభినందించారు. 

సేంద్రీయ కర్షకుడు – రాష్ట్రపతి పురస్కార గ్రహీత మరియు దేశీ విత్తన సంరక్షణ ఉద్యమకారుడు రఘువీర్‌, బ్రిగేడియర్‌ గణేశం (పల్లెసృజన), శ్రీమతి సూర్యకళ (మన వూరు-మన బాధ్యత), సుబ్రహ్మణ్యరాజు (గోఆధారిత వ్యవసాయదారుల సంఘం), రొటేరియన్‌ ఏకాంబరరెడ్డి (ఛైర్మన్‌ నారాయణమ్మ ఇంజనీరింగ్‌ కాలేజీ), రొటేరియన్‌ శ్రీమతి పద్మినీ ప్రసాద్‌, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి) విశ్రాంత డీన్‌ శ్రీమతి జ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన పలు అంశాలపై ప్రసంగించారు.

సంగం డెయిరీ విశ్రాంత అధికారి, వ్యవసాయ పాత్రికేయుడు, గోసేవకుడు డా. అహోబలరావు తన ప్రసంగంలో గోశాలల ఆర్థిక సమస్యల పరిష్కారానికి తమ తమ గోశాలలలోని ఎంపిక చేసిన గోవులను, విశిష్ఠమైన అత్యున్నతమైన దేశీ జాతి పశువుల ఉత్పత్తికి ఏవిధంగా వినియోగించుకోవచ్చో వివరించుటతోపాటు, సులువుగా సేంద్రీయ ఎరువుల తయారీకి మరింత సమర్థవంతమైన ఉత్పత్తికి, పంపిణీకి, వినియోగాలకు యువరైతు క్లబ్బుల ఏర్పాటుకు కొన్ని సూచనలు చేశారు. దేశీ పశువుల ఉత్పత్తి – దేశీ విత్తనాల ఉత్పత్తి మరియు సహజ కీటక నాశకాల వినియోగం – ఈ మూడూ ఒకే వ్యవస్థలో సమన్వయంగా కొనసాగినప్పుడే కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిన ఈరోజుల్లో రైతుకూ, దేశానికి మేలు చేకూరగలదని ఆయన అన్నారు. దేశీ విత్తనాల ఉత్పత్తిలో అత్యంత ప్రతిభ కనబరచిన రైతులను, డాక్టర్‌ అహోబలరావును నిర్వాహకులు సత్కరించారు.

ఈ దేశీ విత్తనాల పరస్పర మార్పిడి కార్యక్రమంలో పాల్గొనదలచినవారు నమస్తే కిసాన్‌ ఫోన్‌ నం. 7516841687 మరియు 1800-202-0120 (టోల్‌ ఫ్రీ) నెంబర్లలో సంప్రదించవచ్చునని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ‘నమస్తే కిసాన్‌’ వ్యవస్థాపకులు దుర్గాప్రసాద్‌ బృందం ఎంతైనా అభినందనీయులు. వివిధ రకాల విత్తనాలతో పాటు రోబోటిక్‌ వ్యవసాయ యంత్రాల ప్రదర్శన సందర్శకులను విశేషంగా అలరించింది.

Read More

ప్రకృతి, సేందియ్ర వ్యవసాయంలో తెగుళ్లు, పురుగుల జీవ నియంత్రణ మందులు

ట్రైకోడెర్మావిరిడి (శిలీంద్రము)

పంటలకు హానీ చేసే శిలీంద్రాలను నాశనం చేసి, పంటలను తెగుళ్ళు రాకుండా కాపాడును.

వాడే పద్ధతి: 100 కిలోల సేంద్రియ ఎరువు, అరకిలో నల్లబెల్లం, 1 కిలో ట్రైకోడెర్మావిరిడి, 5 కిలోల వేపపిండి, చెట్టు నీడన గానీ, పాకలో గానీ, పొరలు పొరలుగా ఎరువు, వేపపిండి, ట్రైకోడెర్మావిరిడి వేస్తూ బెల్లపు నీరు చిలకరించి, గుట్టలో తగిన తేమ ఉండేటట్లు చూడాలి. గుట్టపైన తడిపిన గోనె సంచి కప్పి నాలుగు రోజులుంచితే ఎరువంతయు బూజు పట్టినట్లు అగును. చేలో తేమ ఉన్నప్పుడు ఈ ఎరువు వేరు వ్యవస్థ దగ్గరగా, సాయంత్రపు సమయంలో చల్లాలి. పండ్లతోటలలో సంవత్సరానికి కనీసం రెండుసార్లు, ఇతర పంటలకు ఒకసారి చల్లాలి. అవసరమైతే మోతాదు పెంచుకోవచ్చును. చెట్లు/మొక్కల మొదళ్లలో 1 శాతం శిలీంద్రం కలిపిన నీరు పోయాలి.

విత్తనశుద్ధి: 10 గ్రా. ట్రైకోడెర్మావిరిడి, 10 మి.లీ. నీటిలో పేస్టుగా చేసి విత్తనాలకు పట్టించి ఆరబెట్టి విత్తుకోవాలి. పసుపు దుంపలు, చెరకు ముచ్చెలు, నారు వగైరాలకు అరకిలో శిలీంద్రం 50 లీటర్లు నీటిలో కలిపి అందులో అరగంట ఉంచి నాటాలి.

నివారించు తెగుళ్లు: ఎండుతెగులు, వేరు, నారుకుళ్లు తెగులు, మాగుడు తెగులు, ఆకుమచ్చ తెగుళ్లు, దుంపకుళ్లు, పొడ తెగుళ్లు నివారణకు అన్ని పంటలకు వాడుకోవచ్చు.

సూడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ (బ్యాక్టీరియా)

వాడే పద్ధతి: పైన ట్రైకోడెర్మావిరిడి భూమికి వెదజల్లే పద్ధతి దీనికి కూడా పాటించాలి. పంటపై పిచికారీ చేసినప్పుడు 1 కిలో, 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కానీ రెండు రోజుల ముందు 1 కిలో నల్లబెల్లం, 2 లీటర్ల నీటిలో కలిపి తయారు చేసిన పానకంలో 1 కిలో సూడోమోనాస్‌ ఫ్లోరోసెన్స్‌ నానవేసి, పిచికారి చేసిన మంచి ఫలితాలుంటాయి.

విత్తనశుద్ధి: 10 గ్రాములు, కిలో విత్తనానికి, దుంపలు, చెరకు ముచ్చెలు, నారు వగైరాలకు అరకిలో సూడోమోనాస్‌ 50 లీటర్ల నీరు కలిపిన ద్రావణంలో అరగంట ఉంచి విత్తాలి.

నివారించే తెగుళ్లు: ఎండు తెగులు, అగ్గితెగులు, నారుకుళ్లు, ఆకుమచ్చ, పొడతెగులు వగైరాలు పంచగవ్యలో కలిపి సాయంత్రం సమయంలో పిచికారీ చేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి.

బవేరియా బాసియానా (శిలీంద్రం)

అన్ని పంటలపై వచ్చే శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, గొంగళి పురుగు, కాయతొలిచే పురుగు, కొమ్మ, కాండం తొలిచే పురుగులపై సమర్ధవంతంగా పనిచేసే శిలీంద్రము, పంచగవ్యలో కలిపి వాడినప్పుడు దీని సామర్థ్యం బాగా పెరిగింది.

వాడే పద్ధతి: మొక్క పెరిగే థలో 2 కిలోల బవేరియా బాసియానా 100 లీటర్ల నీటిలో కలిపి, దానికి 3 లీటర్ల పంచగవ్య కలిపి పిచికారీ చేయాలి. మొక్కల అన్ని భాగాలు తడిచేటట్లు పిచికారీ చేయాలి. వంగలో మొక్క పెరిగే థలో 2 సార్లు పిచికారీ చేసిన కొమ్మ, కాయ తొలిచే పురుగులు రాలేదు. ప్రస్తుతం చాలా మంది వంగరైతులు వాడుతున్న మందు బవేరియా బాసియానా 2 కిలోలు మరియు 3 లీటర్ల పంచగవ్య సాయంత్రం సమయంలో పిచికారీ చేయాలి.

వర్టిసీలియం లెకానీ (శిలీంద్రం)

అన్ని పంటలపై వచ్చే పేనుబంక, నల్లి, తెల్లదోమ, రసం పీల్చే పురుగులపై సమర్ధవంతంగా పనిచేయును. పంచగవ్యలో కలిపి వాడినప్పుడు సామర్థ్యం పెరిగినది.

వాడే విధానం: 2 కిలోల వర్టిసీలియం లెకాని 3 లీటర్లు పంచగవ్య, 100 లీటర్ల నీటిలో కలిపి సామర్థ్యం పెంచి సాయంత్రం సమయంలో పైరంతా తడిచేటట్లు పిచికారీ చేయాలి. మొదటి సారి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

మెటారైజియం (శిలీంద్రం)

చెదలు, చీమలు, దోమలు, వేరుపురుగు, ఈగలు వగైరా సమర్థవంతంగా నివారించే శిలీంద్రం.

వాడే పద్ధతి: ట్రైకోడెర్మా విరిడిలాగా 100 కిలోల కంపోస్టు, 5 కిలోల వేపపిండి, అర కిలో బెల్లపు నీరు, 2 కిలోల మెటారైజిమ్‌ కలిపి చేలో తగు తేమ ఉన్నప్పుడు భూమిపై వెదజల్లాలి. 2 కిలోల మెటారైజిమ్‌, 100 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయవచ్చు. మొదటి సారి వాడినప్పుడు వారంలో రెండుసార్లు పిచికారీ చేసిన మంచి ఫలితాలు వచ్చును. పంచగవ్యలో కలిపి పైరుపై చల్లవచ్చును.

ట్రైకోడెర్మా హార్జియానమ్‌ (శిలీంద్రం)

ట్రైకోడెర్మా విరిడి భూమిలోపల వాడితే ఇది భూమిపైన కాయకుళ్ళు రాకుండా వాడే శిలీంద్రం. దీనిని కూడా అరకిలో బెల్లం పానకంలో 2 కిలోల ట్రైకోడెర్మా హార్జియానమ్‌ 48 గంటలు నానబెట్టి వాడిన మంచి ఫలితాలు వచ్చును.

డా. ఎన్‌. కృష్ణ ప్రియ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌, ఊటుకూర్‌, కడప.

Read More

వరి పంటలో సహజ ఎరువుల యాజమాన్యం, రసాయనరహిత సమగ్ర సస్యరక్షణ పద్ధతులు

మన తెలుగు రాష్ట్రాలలో ఖరీఫ్‌లో పండించే పంటలలో వరి ప్రధాన పంట. వరిని ఖరీఫ్‌ పంటగా ఆంధ్రప్రదేశ్‌లో  12.5 లక్షల హెక్టార్లలో మరియు తెలంగాణలో 25.8 లక్షల హెక్టార్లలో  పండిస్తున్నారు. రసాయన సేద్యంతో నష్టపోయిన రైతులు అధిక శాతం ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లుతున్నారు గోఆధారిత సహజ ఎరువులు వాడుతూ ప్రకృతిలో లభ్యమయ్యే సహజ కషాయాలతో రైతులు భూసారాన్ని కాపాడుకుంటూ, చీడపీడల బెడద నుంచి ఉపశమనం పొందుతున్నారు. రాబోయే ఖరీఫ్‌లో  వరి పంటలో పాటించవలసిన సహజ ఎరువుల వినియోగం మరియు రసాయన రహిత సస్యరక్షణ పద్ధతులను గురించి తెలుసుకుందాం.

1) వరి పంట పండించే ముందర మే నెలలో భూసారాన్ని మరియు కర్బన శాతం పెంచే పచ్చిరొట్ట పేర్లను (అపరాలు, జనుము, జీలుగ, పిల్లిపెసర, గడ్డిజాతి పంటలను) వేసుకుని 40-75 రోజుల వ్యవధిలో కోసుకుని భూమిలో కలియదున్నటం ద్వారా లేదా తినడానికి పశువుల మేతగా వాడుకోవచ్చు.

2) వరిలో తక్కువ కాలపరిమితి, అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకుని ఖరీఫ్‌ లో వేసుకుంటే, రబీ వరి పంటకు తొందరగానే వెళ్ళవచ్చు. ఆలస్యమైనచో రబీలో అకాలవర్షాలు మరియు వడగండ్ల బెడద ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి రబీలో కూడా తక్కువ కాలపరిమతి రకాలు నవంబర్‌ లో వేసుకుని, తొందరగా పంట కోత తీయవచ్చు. ఈ పద్ధతిలో ప్రకృతి వైపరీత్యాలు తప్పించుకునే అవకాశం ఉంది.

3) బీజామృతంతో విత్తనశుద్ధి, నారుమడి శుద్ధి 5 లీటర్లు / 25-30 కిలోల విత్తనానికి, నారుమడికి వాడవచ్చు. ఈ పద్ధతి భూమిలో సూక్ష్మ జీవులను పెంచడంతో పాటు, విత్తనాలను, మొక్కలను చీడపీడల నుంచి కాపాడతాయి.

4) నీటిపారుదల క్రింద వరిని వరుసలలో విత్తే పద్ధతి, డ్రం సీడర్‌ పద్ధతిలో లేదా శ్రీ పద్ధతిలో వేసుకుంటే మంచిది. వర్షాధారంగా వేసే వరిలో నేరుగా వరుసలలో విత్తే పద్ధతిని (డైరెక్ట్‌ సీడింగ్‌) అనుసరించాలి. ఈ పద్ధతులలో భూమి అతి తక్కువగా కదుపబడుతుంది.

సహజ ఎరువుల యాజమాన్యం

1000-1500 కిలోల ఘన జీవామృతం కలిపిన పశువుల ఎరువు ఎకరానికి దుక్కిలో లేదా కరిగడిలో వేసుకోవాలి. అచ్చం ఘనజీవామృతాన్ని ఎకరానికి 400 కిలోలు రెండు సార్లుగా నాటిన 20 రోజులకీ, 40 రోజులకి వేసుకోవాలి. తరువాత ద్రవజీవామృతమును ఎకరానికి 800 లీటర్లు నాలుగు సార్లు నాటిన 30, 50,65 మరియు 80 రోజులకు సమభాగంగా చేసి (200 లీటర్లు ప్రతిసారి) భూమికి అందజేయాలి. పైపాటుగా 50 లీటర్ల ద్రవజీవామృతాన్ని 100 లీటర్ల నీటికి కలిపి నాలుగు సార్లు నాటిన 20, 35, 50 మరియు 65  రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి.

గోఆధారిత సహజ ఎరువులతో పాటు, అజోల్లా ఎకరానికి 10-15 కిలోలు నాటిన 7 రోజులకు వేసిన ఎడల నత్రజని స్థిరీకరణతో పాటు కలుపు నివారణ కూడా జరుగుతుంది, సేంద్రీయ ఆచ్ఛాదన (మల్చ్‌) వలె ఉపయోగపడుతుంది, నీటి అవసరాన్ని తగ్గించి భూమిలో కర్భన శాత వృద్ధికి తోడ్పడుతుంది.

పంట ఎదుగుదల మరియు పిలకల అభివృద్ధికి, పంచగవ్య ఎకరానికి నాలుగు లీటర్లు పిలక థలో, సప్తధాన్యాంకుర కషాయం 250 మి.లీ. 100 లీటర్ల నీటికి కలిపి గింజ పాలు పోసుకునే థలో పిచికారీ చేస్తే, గింజ నాణ్యత మరియు దిగుబడి పెరుగుతుంది.

సస్యరక్షణ పద్ధతులు (రసాయన రహిత)

వరి పంట నాటే సమయంలో మొక్కల కొనలు తుంచుకోవాలి. పొలంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ వెడల్పున తూర్పు – పడమర దిశగా కాలిబాటలు (అల్లీస్‌) ఏర్పాటు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. బంతి / కంది / మొక్కజొన్న / కూరగాయలతో పాటు. గ్లైరిసీడియా వంటి మొక్కలను గట్ల మీద మరియు కంచే పంటగా వేసుకోవాలి. పసుపు పచ్చ జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, పక్షి స్థావరాలు, లైట్‌ ట్రాప్స్‌ (దీపపు ఎరలు) అమర్చడం వంటి పద్ధతులను అనుసరించాలి. మురుగు నీరు నిలువకుండా చూసుకోవాలి. ఇతర పంటల అవశేషాలు ఉంటే తొలగించాలి.

వరి పంటను ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు పాటించవలసిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు

పురుగుల నివారణ:

కాండం తొలుచు పురుగు: నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచడం, ట్రైకోగ్రామా గుడ్ల పరాన్నజీవులను ఎకరానికి నాలుగు కార్డుల చొప్పున 25వ రోజునుండి ప్రతి 10 పదిరోజులకు ఒక్కసారి చొప్పున 5సార్లు వదలాలి.

ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను పెట్టాలి.  ముందు జాగ్రత్త చర్యగా ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేయాలి. పురుగు నివారణకు 5% వేప కషాయం (శ్రీఐచజూ) 5 లీటర్లు 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. పిలక థలో మరియు అంకురం థలో 3 లీటర్ల అగ్నాస్త్రంను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఆకుముడుత పురుగు: తాడుతో మొక్కలపై లాగడం ద్వారా ఆకు గూడులు, పురుగులు పడిపోతాయి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి.  5% వేప కషాయం లేదా నీమాస్త్రం పంట తొలిథలో ఎకరానికి 200 లీటర్లు పిచికారీ చేయాలి.

సుడిదోమ: పొలంలో కాలిబాటలు తప్పనిసరిగా తీయాలి. పసుపు పచ్చ మరియు తెల్లని  జిగురు అట్టలు, ఎకరానికి 20-25 చొప్పున అమర్చాలి. తూటికాడ కషాయం 5-6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి మొక్కల పాదుల దగ్గర పిచికారి చేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి.

ఉల్లికోడు: ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి. అగ్నాస్త్రం 5 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

తాటాకు తెగులు (హిస్పా): నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచి నాటుకోవాలి. తొలిథలో ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేయాలి. తరువాత థలో ఎకరానికి 6 లీటర్ల బ్రహ్మాస్త్రం 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

వరి ఆకు నల్లి: గట్ల మీద బంతి మొక్కలు నాటుకోవాలి. పంట మీద ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన ఐదు లీటర్ల కషాయం వంద లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

పచ్చదోమ: పసుపు మరియు తెల్లని  జిగురు అట్టలు, ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర) ను పెట్టాలి. ఎకరానికి 5 లీటర్ల వావిలాకు కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

కంపునల్లి (గంధీ బగ్‌): ఉదయం పూట ఎకరానికి 5% వేప కషాయం 5 లీటర్లు లేదా అగ్నాస్త్రంను  3 లీటర్లు చొప్పున 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ల నివారణ:

అగ్గి తెగులు: బీజామృతంతో విత్తనశుద్ధి చేయాలి. గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. మారేడు పత్రం మరియు తులసి ఆకుల కషాయాన్ని ఎకరానికి 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

పొడ తెగులు: పొలంలో నీరు తక్కువగా ఉంచాలి. ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన ఐదు లీటర్ల కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి లేదా పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి  ఎకరానికి పిచికారి చేయాలి.

బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు: ఎండిన అల్లం మరియు పాలతో కూడిన కషాయం 6 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి  ఎకరానికి పిచికారి చేయాలి. తరువాత ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

కాండం కుళ్ళు తెగులు: మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బీజామృతంతో విత్తనశుద్ధి, నారుశుద్ధి చేయాలి. పైన వివరించిన విధంగా ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువలతో చేసిన కషాయాన్ని వాడి తెగులును నివారించవచ్చు.

టుంగ్రో వైరస్‌ తెగులు: గట్ల మీద కలుపు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి.  5% వేప కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

ఆకుమచ్చ తెగులు: పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

మానిపండు తెగులు: వరినాట్లు సకాలంలో వేసుకోవాలి. ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

పైన వివరించిన కొన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్‌లో భాగంగా రైతు సాధికార సంస్థ వారు రూపొందించిన ప్రణాళికలోని అంశాల నుంచి వారికి కృతజ్ఞతలతో సేకరించడమైనది. ఈ పద్ధతులు కొన్ని వ్యవసాయ పరిశోధన పరంగా ద్రువీకరించబడాలి. సేంద్రియ రైతులు స్వతహాగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారు. రసాయన రహిత పద్ధతులు కావున పంటలకు నష్టం ఉండదు. నాణ్యత గల దిగుబడులు సాధించడానికి దోహదపడతాయి.   

డా. ఎస్‌.ఎమ్‌. విద్యాశేఖర్‌, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, ఫోన్‌: 98494 42221; డి.ఎల్‌.ఏ. గాయత్రి, ఎమ్‌. శ్రీనివాసరావు, వి.కే. సింగ్‌, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, హైదరాబాద్‌ మరియు రైతు సాధికార సంస్థ, వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో.

Read More