కలెక్టర్లకు సీఎస్ విజయానంద్ ఆదేశాలు
బర్డ్ ఫ్లూ వైరస్‌పై తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయం నుంచి కలెక్టర్లతో బర్డ్ ఫ్లూ, దాని నియంత్రణ చర్యలపై సమీక్షించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. చనిపోయిన కోళ్లను సరైన విధానంలో పూడ్చిపెట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
మనుషులకు సోకడం అత్యంత అరుదు
ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ రాష్ట్రంలో మనుషులకు సోకినట్లు ఎక్కడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. మనుషులకు ఈ వైరస్ అత్యంత అరుదుగా సోకుతుందని, గత అయిదేళ్లలో హరియాణా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో కేవలం నాలుగు కేసులు నమోదయ్యాయని వివరించారు.
15 రోజులకోసారి నివేదికలివ్వాలి
ప్రతి జిల్లా, మండలంలో ఏర్పాటు చేసే కోళ్ల ఫారాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయించేలా చూడాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ కమిషనర్ డాక్టర్ అభిజిత్ మిత్రా అధికారులకు సూచించారు. ప్రతి 15 రోజులకు కోళ్లకు సంబంధించిన నమూనాలు తీసి, నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. వ్యాధి సోకిన ఫారాలకు కిలోమీటరు పరిధిని రెడ్ జోన్ ప్రకటించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు పాల్గొన్నారు.

