కోళ్లు, గుడ్ల రవాణాపై ఆంక్షలు లేవు

పశుసంవర్ధకశాఖ సంచాలకులు దామోదర్‌నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా ఎక్కడా బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ కాలేదని, ప్రజలు ఎలాంటి ఆందోళనా చెందవద్దని పశుసంవర్ధకశాఖ సంచాలకులు టి.దామోదర్‌నాయుడు తెలిపారు. నిఘా పరిధిలోని 5 గ్రామాల్లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా కోళ్లు, గుడ్ల రవాణాపై ఆంక్షలు లేవని వివరించారు. ఎక్కడైనా కోళ్లు, గుడ్ల రవాణాను అడ్డుకుంటే కాల్‌ సెంటర్‌కు (0866-2472543, 9491168699)కు ఫోన్‌ చేయాలని సూచించారు. అసత్య ప్రచారం కారణంగా కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన వారు జీవనోపాధి కోల్పోతున్నారని తెలిపారు. కోడి మాంసం, గుడ్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో చికెన్‌, ఎగ్‌ మేళాలు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో వివరించారు.

Read More

కడక్‌నాథ్‌ కోళ్ళ మహత్యం

”ఏంటి బాబాయ్‌ ఏదో దిగులుగా వున్నావ్‌?” అడిగాడు సుబ్బారావు రామయ్యను. ”ఏమి చెప్పమంటావు నాయనా మా అబ్బాయికి పెళ్లి చేసి నాలుగేళ్లు అయింది. ఇప్పటి వరకు నా కోడలికి కడుపులో కాయ కాయలేదు. అసలు నాకు మనవణ్ణో లేదా మనవరాలినో చూసే భాగ్యం ఉందో లేదో తెలియడం లేదు. అదే నా బాధ! ఇప్పటికే నా కోడలికి వైద్య పరీక్షలు జరిగాయి. ఆమెలో ఏ లోపం లేదని డాక్టర్లు చెప్పారు. ఇక మా అబ్బాయి తనలో ఏ లోపం లేదని అంటున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు! బస్తీకి వెళ్లి పెద్ద డాక్టర్‌ను కలిసి రమ్మని చెప్పినా వాడు నా మాట వినడం లేదు అని నిట్టూర్చాడు.

”అయితే నేను ఒక సలహా ఇస్తాను పాటిస్తావా బాబాయ్‌! ఇప్పుడు కడక్‌నాథ్‌ అనే కారు నలుపు కోళ్లు వస్తున్నాయి. వీటి మాంసంలో ఇతర కోళ్లు ముఖ్యంగా మన నాటుకోళ్ల మాంసం కంటే అనేక పోషకాలు ముఖ్యంగా ఇనుము చాలా ఎక్కువగా వుంటాయట! ఈ మాంసంలో పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధ లక్షణాలు కూడా ఉంటాయని మొన్న ఒక సైంటిస్ట్‌ చెబితే విన్నాను. ఎలాగూ మనం వారంలో రెండు మూడు సార్లు బ్రాయిలర్‌ చికెన్‌ వండుకుంటున్నాం కదా! ఇప్పటి నుండి వారానికి 4-5 సార్లు రెండు నెలల పాటు కడక్‌నాథ్‌ కోడి మాంసాన్ని ఇంట్లో వండించి మీ వాడితో తినిపించు. ఇది అందరికీ మంచిదే ఈ వయస్సులో నీకు కూడా.. అంటూ నవ్వాడు సుబ్బారావు. కావాలంటే మరికొంత సమాచారం తెలుసుకొని నీకు చెప్పగలను. అయినా కొంత ఖరీదైనప్పటికీ దీని ప్రత్యేక రుచి, సువాసన, పోషక విలువలను గుర్తిస్తే ఈ ధర అంత ఎక్కువేమీ కాదని చెప్పగలను.

నాలుగు నెలల తర్వాత – స్వీట్‌ ప్యాకెట్‌తో రామయ్య సుబ్బారావు ఇంటికి వచ్చి ‘ఒరేయ్‌ సుబ్బారావు నువ్వు చెప్పిన చిట్కా బాగా పనిచేసినట్లుంది. మా కోడలు మొన్న లేడీ డాక్టర్‌తో పరీక్షలు చేయించుకుంది. మా కోడలకు ఇప్పుడు మూడో నెల! ఇప్పుడు మా కోడలేకాక అందరమూ మునుపటి కన్నా అన్ని విధాలా ఎక్కువ ఆరోగ్యంగా, బలంగా ఉన్నాము! అంతా నువ్వు చెప్పిన కడక్‌నాథ్‌ కోడి మాంస మహత్యం మరి! అని నాకు స్వీట్‌ ప్యాకెట్‌ ఇస్తూ ఇవాళ మా కోడలు కడక్‌నాథ్‌ చికెన్‌ బిర్యాని వండింది అంటూ సుబ్బారావును భోజనానికి రమ్మని ఆహ్వానించి వెళ్ళాడు!

మానసిక, శారీరక వత్తిళ్ల వల్ల ఇటీవల యువతలో లైంగిక సామర్థ్యం సన్నగిల్లుతోందని వైద్య అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. వత్తిళ్లు తగ్గించుకొని, మంచి పోషణ ద్వారా తమ శరీర పుష్టిని, వ్యాధినిరోధక శక్తిని, లైంగిక పటిష్ఠతను పెంచుకొనుటలో కడక్‌నాథ్‌ కోళ్ల ఉత్పత్తుల పాత్రను కూడా గుర్తించాలి.

ఈ కడక్‌నాథ్‌ కోళ్ల ప్రత్యేకత, పెంపకం, మార్కెటింగ్‌ గురించి తెలుసుకుందాం! కారు నలుపు రంగులో వుండుట వల్ల వాటిని కాలిమసి కోళ్లు అని కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్‌లోని ధర్‌ మరియు ఘాబువా జిల్లాల నుండి ఇవి, ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జాతి కోడిపిల్లలు, పెట్టలు, పుంజులు హైదరాబాదులో కూడా లభిస్తున్నాయి. వీటి పెరుగుదల వేగం, శరీర తూకం, గుడ్ల ఉత్పాదక సామర్థ్యం ఇతర బ్రాయిలర్‌ కోళ్లు, కొన్ని నాటుకోళ్ల కంటే కొంత తక్కువగా ఉంటుంది. ఈ కోళ్ల మాంసంతో పాటు గుడ్లలో కూడా ఉండే అదనపు పోషకాలు, కొన్ని ఔషధ ధాతువుల కారణంగా, వీటి మాంసం ధర, గ్రుడ్ల ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఉత్పత్తి ఖర్చుతో పాటు గిరాకీలు పెరుగుట వల్ల ప్రస్తుతం బ్రతికిన కోడి ధర కిలోకి 500 నుండి 550 రూపాయలు, మాంసం ధర 1000 నుండి 1200 రూపాయలు, గ్రుడ్లు ధర 15-16 రూపాయల వరకు ఉంటున్నాయి.

వీటి చర్మం నల్లగా ఉండి, మాంసం, రక్తం ముదురు రంగులో అంత ఆకర్షణీయంగా కనిపించక పోవుట వల్ల క్రొత్త వినియోగదారుల్ని ఈ మాంసం ఆకర్షించుటలో వెనుకబడింది. అయితే ఒకసారి రుచి చూసిన తర్వాత ఏ అభ్యంతరమూ వుండదు. లేత గోధుమ రంగులో ఉండే వీటి గ్రుడ్ల పరిమాణం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ అందులో 11.67 శాతం నాణ్యమైన మాంసకృత్తులు, ఇతర ముఖ్య పోషకధాతువులు ఎక్కువగానే ఉంటాయి.

కడక్‌నాథ్‌ కోళ్ల వెంట్రుకలు, చర్మం నల్లగా వుండుటకు మాంసము, రక్తము ముదురు రంగులో వుండుటకు వీటిలో ఎక్కువగా వుండే మెలనిన్‌ అనే నల్ల వర్ణ ధాతువుతో పాటు ఇతర మాంసాలలో కంటే సుమారు 10 రెట్లు ఎక్కువగా వుండే ఐరన్‌ కూడా కారణమని, వీటి వల్లనే ఇవి పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని అనుభవజ్ఞులు, నిపుణులు చెబుతున్నారు. కడక్‌నాథ్‌ కోడి మాంసంలో అధికంగా ఉండే నల్లని మెలనిన్‌ పిగ్మెంట్‌ వల్ల బొల్లి (చర్మపు వ్యాధి) వ్యాధిగ్రస్తులకు ఇది బాగా ఉపయోగపడగలదు. కడక్‌నాథ్‌ జాతి కోళ్ల మాంసం తక్కువ క్రొవ్వు (0.73-2.8%), 18 రకాల ఎమైనో ఆమ్లాలు కలిగిన ప్రోటీన్స్‌ (25.47%), మరియు అతి తక్కువ కొలెస్టెరాల్‌ కలిగి గుండెకు ఆరోగ్య భద్రతను ఇస్తుంది. ఈ మాంసంలో ఉండే కొన్ని యాంటి ఆక్సిడెంట్సు మరియు ఇతర పోషకాల వల్ల వినియోగదారులలో రక్తపుష్టితో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతున్నదని అధ్యయనాలలో తెలిసింది.

కడక్‌నాథ్‌ కోళ్లు 22-25 వారాలకు యుక్త వయస్సుకు వస్తాయి. వీటిలో పెట్టలు 1.2 నుండి 1.5 కిలోలు, పుంజులు 1.8 నుండి 2.2 కిలోల వరకు తూకానికి, 5-6 నెలల వయస్సుకు వస్తాయి. ఇవి సంవత్సరానికి 110 నుండి 120 గ్రుడ్లను మాత్రమే ఉత్పత్తి చేయగలవు. ఇవి సుమారు 10 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. వీటిలో వ్యాధి నిరోధక శక్తి కొంత ఎక్కువే అయినప్పటికీ 1-3 రోజుల వయస్సులో రానిఖెట్‌ (మారెక్స్‌) వ్యాక్సిన్‌, 14-16 రోజుల వయస్సులో ఐ.బి.డి. వ్యాక్సిన్‌, 21-30 రోజులకు రానిఖెట్‌ వ్యాక్సిన్‌, మరల 35-40 రోజుల వయస్సులో ఐ.బి.డి. వ్యాక్సిన్‌ చేయించుట మంచిది.

నానాటికి వినియోగదారుల నుండి ఈ కడక్‌నాథ్‌ కోడి మాంసానికి పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా శాస్త్రీయంగా ఫారాలలోనే కాక గ్రామీణ పెరళ్లలో కూడా వీటి పెంపకం మంచి లాభదాయకం కాగలదు. పండ్ల తోటలు, ఫారమ్‌ హౌస్‌లు, డెయిరీ మరియు జీవాల ఫారాల ఆవరణల్లో కూడా కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకాన్ని చేపట్టవచ్చును. సాధారణంగా ఇతర కోళ్లకు పాటించే యాజమాన్య పోషణ పద్ధతులను పాటిస్తే సరిపోతుంది. నమ్మకమైన సరఫరా దారుల నుండి కొనుగోలు చేసిన కోడిగ్రుడ్లను పొదిగిస్తే 65 నుండి 70 శాతం వరకు పిల్లలు జన్మించగలవు. తొలుత 50 నుండి 100 కోడి పిల్లలతో వీటి పెంపకాన్ని ప్రారంభించి క్రమేపీ సంఖ్యను వేలకు పెంచుట మంచిది.

మార్కెటింగ్‌: మార్కెట్‌లోని ఇతర కోడి మాంసాల కంటే కడక్‌నాథ్‌ కోడి మాంసం ధర 3 నుండి 4 రెట్లు అధికంగా వుండటం, ఈ మాంసం రంగు ఆకర్షణీయంగా వుండకపోవడం మరియు ఎముకల బరువు ఎక్కువగా వుండుట వంటి కారణాల వల్ల మార్కెట్‌లో వినియోగదారులలో అవగాహన పెంచుటకు ప్రత్యేక ప్రచార వ్యూహాలను అమలు చేయాలి. నిపుణులు, అనుభవజ్ఞులతో వండించిన బిర్యానీలు, కూరలు, ఫ్రైలను ఎగ్జిబిషన్‌లు, విందులు, వినోద స్థలాలలో తక్కువ ధరకు విక్రయించి ప్రజలకు వీటి రుచిని అలవాటు చేయాలి. వంటల పోటీలలో కడక్‌నాధ్‌ చికెన్‌ మరియు గ్రుడ్లను ప్రవేశపెట్టవచ్చును. ప్రత్యేక డిస్కౌంట్సు, పండుగలు (జాతరలు, సంక్రాంతి, దసరా పర్వదినాలు) సందర్భాలలో నల్లని ఈ కోళ్లను డిస్కౌంట్స్‌తో విక్రయించి వినియోగవర్గాలను ఆకర్షించవచ్చును.

వ్యూహాత్మక శాస్త్రీయ బ్రీడింగు పద్ధతుల ద్వారా కడక్‌నాధ్‌ కోళ్ల పెరుగుదల వేగాన్ని శరీర బరువును గ్రుడ్ల ఉత్పత్తిని, మెరుగుపరచి వీటి లాభదాయకతను పెంచే కృషి చేయాలని మన విశ్వవిద్యాలయాలు పరిశోధనా సంస్థలను కోరుచున్నాను. అదేవిధంగా అంతర్గత సంపర్కం వల్ల గానీ, విచక్షణా రహిత క్రాస్‌ బ్రీడింగ్‌ వల్ల గానీ ఈ జాతి యొక్క సహజత్వం ఈ జాతి జన్యు స్వచ్ఛత నశించకుండా, జాతి అంతరించకుండా పరిరక్షించవలసిన అవసరం కూడా వుంది.

మన ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న గ్రామీణ పెరటి పరిశ్రమలో కడక్‌నాథ్‌ కోళ్లను ప్రవేశపెట్టి లబ్దిదారుల ఆదాయాలతో పాటు, వినియోగదారుల ఆరోగ్యాలను కూడా మెరుగుపరచవచ్చు.        

డా. యం.వి.జి. అహోబలరావు, హైదరాబాద్‌. 93930 55611

Read More

కోళ్లలో కూడా దురలవాట్లు ఉన్నాయా…

మన దేశ వ్యవసాయ పరిశ్రమల్లో కోళ్ళ పెంపకం ఒక ముఖ్యమైన భాగము. కోళ్ళ పరిశ్రమ పెరుగుతున్న  జనాభా యొక్క పోషణ మరియు మాంసకృతుల అవసరాలను అందించడానికి కీలక పాత్ర వహిస్తున్నది. అయితే, ఇతర వ్యవసాయ రంగాల మాదిరిగానే, కోళ్ళ పెంపకం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. కోళ్ళ రైతులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లలో, కోళ్ళ మందలలో దుర్గుణాల ఉనికి సూక్ష్మమైన మరియు సంక్లిష్టమైన ఆందోళనగా నిలుస్తూ వాటి నిర్మూలన రైతులకు ఒక ప్రధాన నిర్వహణ సమస్యగా మారింది. దుర్గుణాలు కోళ్ళు ప్రదర్శించే అవాంఛనీయ ప్రవర్తనలు అవి కోళ్ళ ఆరోగ్యం, ఉత్పాదకత మరియు సంక్షేమాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. దుర్గుణాలు ఒక్క సారి మందలో అభివృద్ధి చెందిన తర్వాత అవి వేగంగా మంద అంతటా వ్యాపించి వాటి నియంత్రణ మరియు నిర్మూలన చాలా కష్ట సాద్యంగా మారుతుంది. ఫలితంగా, ఈ దుర్గుణాలు (చెడు అలవాట్లు) పౌల్ట్రీ రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. 

కోళ్లలో తరచుగా కనిపించు దుర్గుణాలు 

ఈకలు మరియు చర్మాన్ని పొడవడం, పీకడం: ఇది కోళ్లలో ఒక తీవ్రమైన చెడు అలవాటు, కోళ్ళు ఒకదానికొకటి ఈకలు, చర్మం మరియు మలద్వారం ప్రాంతాన్ని పొడుచుకుని పీకుతుంటాయి. పొడుచుకోవడం వల్ల ఏర్పడిన గాయాల ద్వారా వివిధ రకాల రోగాలు మరియు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఈ గాయాలు ఇతర  కోళ్లను తిరిగి పొడవడానికి ప్రేరేపిస్తాయి. ఇలా ఆ గాయాలను తిరిగి మందలోని ఇతర  కోళ్ళు పొడవడం ద్వారా అవి తీవ్రతరమయ్యి చివరికి కోళ్ళ మరణానికి దారితీస్తాయి. ఈ సమస్యలు ప్రదానంగా కోళ్ళ గృహ వ్యవస్థ లో కావాల్సిన స్థలం లేక రద్దీ పెరగడం వలన, పేలవమైన  యాజమాన్య పద్ధతుల కారణంగా మరియు ముఖ్యంగా పోషకాహార లోపాలు (మాంసకృత్తుల లోపాలు, భాస్వరం లోపం మరియు అధిక శక్తి తక్కువ పీచు పదార్థము ఉన్న దాణా) వలన తలెత్తుతాయి. 

గుడ్లను కుక్కడం మరియు తినడం: కోళ్ళు తమ స్వంత లేదా ఇతర కోళ్ళ గుడ్లను తినే  ప్రవర్తనను అలవర్చుకుని మంద అంతటా వ్యాపింపజేస్తాయి. ఈ ప్రవర్తన, ఒకసారి మందలో కనిపించిన తర్వాత, త్వరగా వ్యాపించి ఒక నిరంతర సమస్యగా మారుతుంది, దీని నిర్వహణ మరియు నివారణ కోళ్ళ పెంపకంలో ప్రధాన అంశంగా మారుతుంది. ఈ దురలవాటు  కోళ్ళ  ఉత్పాదకత మరియు ఆర్థిక సాధ్యతను ప్రభావితం చేసి రైతుకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది. 

కోళ్లలో గుడ్లను తినే అలవాటు అవి గుడ్లు పెట్టడానికి ఏర్పరిచిన గూళ్ళ యొక్క పేలవమైన నిర్వహణ వలన కలగవచ్చును, పోషకాహార లోపాల వలన కోళ్ళు పెట్టే గుడ్లలో పగుళ్లు మరియు చీలికలు ఉన్నపుడు కోళ్ళు ఆ గుడ్లను పొడిచే అవకాశం ఎక్కువ అలాగే కోళ్ళు నిత్యం గురయ్యే  ఒత్తిడికి ప్రతిస్పందనగా కూడా ఈ దుర్గుణము ఉద్భవించవచ్చు.

గుడ్లను దాచిపెట్టుట: గుడ్డు దాచడం అనేది పెరటి కోళ్లలో అప్పుడప్పుడు గమనించే ప్రవర్తన, ఇక్కడ కోళ్లు తమ గుడ్లను నియమించబడిన గూళ్ళు, గూడు పెట్టెల్లో కాకుండా ఇతర ప్రదేశాలలో పెట్టడానికి ఎంచుకుంటాయి. గుడ్డు దాచడం అనేది అడవి కోడి యొక్క సహజ ప్రవృత్తి, కొన్ని పెరటి కోళ్లలో కూడా ఈ ప్రవృత్తి జన్యుపరంగా సంక్రమించడం వల్ల అవి గుడ్లను దాచి పెట్టవచ్చును. గుడ్లు పెట్టడానికి సరైన గూళ్ళు మరియు గూడు పెట్టెల్లో లేకపోవుట, అధిక రద్దీ వలన కూడా కోళ్లలో ఈ ప్రవర్తన గమనించవచ్చును. దీనివలన రైతులకు కోళ్ళు పెట్టిన గుడ్లను గుర్తించడం మరియు సేకరించడం సవాలుగా మారుతుంది, ఫలితంగా సేకరించిన గుడ్ల సంఖ్య తగ్గి దిగుబడి పడిపోతుంది.

నివారణ మరియు నిర్వహణ

  • మెరుగైన గృహవ్యవస్థ మరియు సరిపడా నేల స్థలం కేటాయించడం: కోళ్ళలో దుర్గుణాలకు దోహదపడే ప్రదాన కారకం అధిక రద్దీ. తగినంత స్థలం, తగినన్ని దాణా మరియు నీటి తొట్టెలు కల్పించడం ద్వారా పొడుచుకునే సమస్యను నివారించవచ్చును. సరైన గాలి ప్రసరణ మరియు మెరుగైన జీవన పరిస్థితులను కలిగిన గృహవ్యవస్థను అందించడం ద్వారా కోళ్ళలో ఒత్తిడిని తగ్గించి అవాంఛనీయ ప్రవర్తనలను అరికట్టవచ్చును.
  • సమతుల్య పోషణను అందించడం: దుర్గుణాలను నివారించడంలో కోళ్లకు సమతుల్య దాణా  అందేలా చూసుకోవడం చాలా ముఖ్యం. మాంసకృత్తుల లోపాలు, భాస్వరం లోపము మరియు దాణాలో శక్తినిచ్చు పదార్థాలు మరియు పీచు పదార్థాల హెచ్చుతగ్గులు లేకుండా పశువైద్యుల సలహా మేరకు నిర్దిష్ట పోషణ సమతుల్యత కలిగిన దాణాను కోళ్లకు అందించాలి. 
  • కోళ్ళ ముక్కులు కత్తరించడం ద్వారా పొడుచుకునే సమస్యను నివారించవచ్చు: నాలుకను జాగ్రత్తగా వెనక్కి నెట్టి  పై  ముక్కు 2/3వ వంతు మరియు దిగువ ముక్కును 1/3వ వంతు ముక్కులు కత్తిరించు యంత్రం సహాయంతో కత్తిరించాలి.  
  • దుర్గుణాలు కలిగిన కోళ్లను, గాయపడిన కోళ్లను గమనించి వెంటనే మంద నుండి వేరు చేయాలి.  
  • కోళ్ళు గుడ్లు పెట్టుటకు అనువైన గూడు పెట్టలను నిర్మించాలి. 

డా|| ఎన్‌. దీపక్‌, సహాయ ఆచార్యులు, కోళ్ళ శాస్త్ర విభాగము, శ్రీ వేంకటేశ్వర పశు వైద్యవిశ్వ విద్యాలయము – తిరుపతి.

డా|| టి. సాయి ఊర్మిళ, సహాయ ఆచార్యులు, పశు శరీర నిర్మాణ శాస్త్ర విభాగము, శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయము-తిరుపతి

Read More

వంద కోళ్ళ పెంపకంతో కుటుంబ ఖర్చులు సంపాయించవచ్చు

పెరుగుతున్న నిరుద్యోగులకు అవసరమయిన ఉపాధి అవకాశాలు చూపించే సత్తా మనదేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకే ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. మన దేశంలో జనాభాతో పాటు నిరుద్యోగుల సంఖ్య కూడా ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. కొత్తగా స్థాపించే పరిశ్రమలు కాని, సేవా రంగాలు కాని, ప్రభుత్వ ఉపాధి అవకాశాలు గాని నిరుద్యోగులందరికి ఉద్యోగ అవకాశాలు చూపించలేకపోతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి నిరుద్యోగ యువత వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలవైపు అడుగులు వేస్తున్నారు. కాని కొంతమంది అవగాహన లేకుండా ఎక్కువ పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. అలా నష్టపోయిన వారిని చూసి కొంతమంది వెనుకంజవేస్తున్నారు. కాని అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తక్కువ పెట్టుబడితో ఉపాధి అవకాశాలను మొదలుపెట్టి జాగ్రత్తలు పాటించినట్లయితే తప్పని సరిగా ఫలితం పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టగలిగే లాభదాయకమయిన వ్యవసాయ అనుబంధ రంగాలలో నాటుకోళ్ళ పెంపకం ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. 100 కోళ్ళతో నాటుకోళ్ళ పెంపకం చేపట్టి కుటుంబ అవసరాలకు సరిపోను ఆదాయాన్ని పొందవచ్చు అంటున్నాడు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం, చిన్న ఆగిరిపల్లికి చెందిన శివనాగమల్లేశ్వరరావు.

2004 నుండి 2015 వరకు అంటే 11 సంవత్సరాల పాటు బ్రాయిలర్‌ కోళ్ళ పెంపకం చేపట్టి వివిధ రకాల కారణాల వలన బ్రాయిలర్‌ కోళ్ళ పెంపకాన్ని ఆపివేసి 2015 నుండి నాటు కోళ్ళ పెంపకం చేపట్టి కొనసాగిస్తున్నాడు. నాటుకోళ్ళతో పాటు గిన్నెకోళ్ళు కడక్‌నాథ్‌ కోళ్ళు, టర్కీకోళ్ళు, బాతుల లాంటి వాటిని కూడా పెంపకం చేస్తూ తనకు అనుభవం ఉన్న రంగంలో కొనసాగుతున్నాడు. బ్రాయిలర్‌ కోళ్ళ పెంపకానికి ఏర్పాటు చేసిన మౌలిక వసతులు ఉన్నాయి కాబట్టి కేవలం కోళ్ళను మాత్రమే కొనుగోలు చేసుకుంటే సరిపోతది కాబట్టి 2015వ సంవత్సరం కేవలం 70 నాటుకోళ్ళతో మొదలు పెట్టడం జరిగింది. కొత్తగా ఈ రంగంలో అడుగు పెట్టేవారు షెడ్‌ నిర్మాణానికి ఎక్కువ ఖర్చులు పెట్టకుండా తక్కువ ఖర్చుతో కోళ్ళు తడవకుండా షెడ్‌ ఏర్పాటు చేసుకుంటే పెట్టుబడి తగ్గించుకోవచ్చనే సలహా ఇస్తున్నాడు. కోళ్ళను ఫ్రీరేంజ్‌లో తిప్పినట్లయితే అందుబాటులో ఉన్న కలుపు గింజలు, పురుగులు, చిన్నచిన్న మొక్కలను తింటాయి కాబట్టి కోళ్ళకు రోగనిరోధక శక్తి పెరిగి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి శివనాగమల్లేశ్వరారవు అదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. దాణాగా గంట్లు, రాగులు, నూకలు, వడ్లు వంటివి అందిస్తున్నాడు. 

మొదటలో కోళ్ళు పొదగటానికి ఎలాంటి కృత్రిమ పద్ధతులు ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధమైన పద్ధతులనే అనుసరించాడు. ఈ పద్ధతిలో జననాల రేటు ఆశాజనకంగా ఉండకపోవటముతో 2018 వ సంవత్సరం 3500 పిల్లల ఉత్పత్తి సామర్థ్యం గల ఇంకుబేటరుకు అప్పట్లో 2,10,000/- లు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది.  బ్యాచికి 3500 గుడ్లకు గాను 3000 పిల్లలను పొందుతూ అందులో 500 పిల్లలను సొంతానికి ఉపయోగించుకుంటూ ప్రతి బ్యాచికి 2500 పిల్లల చొప్పున అమ్మకం చేసుకుంటూ వస్తున్నాడు.

అన్ని సక్రమంగా ఉంటే నాటుకోళ్ళు 5 నుంచి 6 నెలలలో రెండు నుండి రెండున్నర కిలోల వరకు ఎదుగుతాయి. కోళ్ళకు అందించే నీటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రతిరోజు మంచి శుభ్రమైన నీటిని అందించటంతోపాటు నీటి పాత్రలను ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉండాలి. కోళ్ళ ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా డాక్టరును సంప్రదించి క్రమం తప్పకుండా సక్రమ సలహాలను పాటిస్తూ తోటి కోళ్ళ పెంపకందార్లును కూడా కలుస్తూ వారి అనుభవాలను తెలుసుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చూపించినా కూడా కోళ్ళను నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కోళ్ళకు అందించే టీకాల విషయంలో ఎలాంటి అశ్రద్ధకు తావు ఇవ్వకుండా క్రమం తప్పకుండా తను పెంపకం చేసే కోళ్ళకు అన్ని టీకాలు సమయానుసారం అందిస్తూ వస్తున్నాడు. 

మార్కెటింగ్‌ విషయంలో మధ్యవర్తుల మీద ఆధారపడకుండా సొంతంగా మార్కెట్‌ చేసుకుంటున్నాడు. సామాజిక మాద్యమాలను సక్రమంగా వినియోగించుకోవటంతోపాటు కోళ్ళను ప్రకృతిసిద్ధంగా పెంపకం చేస్తున్నాడు కాబట్టి కోడి మాంసం రుచిని ఒకసారి చూసిన వారు ప్రక్కవారికి చెప్పడంతో పాటు మరలా, మరలా కొనుగోలు చేస్తుండడము వలన తాను పెంపకం చేసే కోళ్ళ మార్కెటింగ్‌ విషయంలో శివనాగమల్లేశ్వరరావు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు. గత 19 సంవత్సరాల నుండి ఈ రంగంలో ఉన్నాడు కాబట్టి వినియోగదారులు నేరుగా కొనుగోలు చేయడంతోపాటు వేరే రకాల గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి వినియోగదారులకు అన్ని రకాలను అందించాలనేధ్యేయంతో నాటుకోళ్ళతో పాటు కడక్‌నాథ్‌ కోళ్ళు, గిన్నె కోళ్ళు, టర్కీ కోళ్ళు, బాతుల లాంటివాటిని కూడా పోషిస్తూ వినియోగదారులకు ఎక్కువ రకాల కోళ్ళను అందుబాటులో ఉంచుతున్నాడు.

కోళ్ళ పెంపకం దగ్గర పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాముల నుంచి రక్షణకొరకు కొన్ని టర్కీ మరియు గిన్నె కోళ్ళను పెంచినట్లయితే పాముల సంచారం తగ్గుతుందని భావించి వాటి పెంపకం చేపట్టి కొనసాగిస్తున్న సమయంలో వినియోగదారులు వీటిని కూడా అడుగుతున్నారు కాబట్టి వాణిజ్యసరళిలో వాటిని పెంచుతున్నాడు. కాని కొత్తగా ఈ రంగంలో అడుగుపెట్టే వారు టర్కీ మరియు గిన్నె కోళ్ళను ఎక్కువ కొనుగోలు చేయకుండా ఒక్కొక్క రకం 10 చొప్పున కొనుగోలు చేసి పోషిస్తుంటే పాముల నుండి రక్షణ లభించడంతోపాటు వినియోగదారుల అవసరాలను పరిశీలించగలిగితే ముందుముందు వాటిని కూడా వాణిజ్యసరళిలో పెంపకం చేయవచ్చు అని కొత్తవారికి శివనాగమల్లేశ్వరరావు సలహా ఇస్తున్నాడు. మరిన్ని వివరాలు 9492979049 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More