ప్రస్తుతం ఉన్న చట్టంలో నష్టపరిహారం గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.
వివిధ రాష్ట్రాలలో విత్తనచట్టం 1966కు అదనంగా అమలు అవుతున్న చట్టాలపై చర్చ 1966లో తీసుకొచ్చిన విత్తన చట్టం మారిన పరిస్థితుల దృష్ట్యా మరియు స్థానిక అవసరాల దృష్ట్యా వాటిలో కొన్ని అదనపు రూల్స్ లేదా క్లాజ్‌లను కలపాల్సి ఉంటుందని, మరీ ముఖ్యంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కంపెనీల ఆర్ అండ్ డి వసతులపై నిరంతర నిఘా అవసరమని, ఎవరైనా కల్తీ విత్తనాలు సరఫరా చేస్తే తీసుకొనే చర్యలు కఠినంగా రూపొందించాలని, అదేవిధంగా విత్తనోత్పత్తి రైతులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చే విధంగా విత్తనచట్టం 1966లో కొన్ని మార్పులు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మంత్రి అధ్యక్షతన జరిగిన సమగ్ర విత్తన చట్టం, ఆవశ్యకత, చట్టంలో అదనంగా చేర్చాల్సిన అంశాలు, మున్నగువాటిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ మార్పులు కూడా చట్టాల పరిధిలోకి లోబడి తీసుకొచ్చేవిధంగా ముసాయిదా రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. దానికి సమావేశంలో సభ్యులు వెల్లిబుచ్చిన అభిప్రాయాలు అన్నిటినీ పరిగణలోనికి తీసుకోవాలని ఆదేశించారు. 3 నుండి 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన ఒక నిర్ధిష్టమైన కాలపరిమితిలో 3 నెలలలో ముసాయిదా సిద్ధం అయ్యేట్లు చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఛైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ…. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో విత్తనచట్టంలో మార్పుల కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయని, అప్పటి ప్రభుత్వం ప్రయత్నం వల్లనే బి.టి కాటన్ విత్తనం ధర రూ.1800 నుండి రూ. 650కి రావడం జరిగిందని తెలిపారు. సునీల్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న చట్టాల వివరాలు ముఖ్యంగా మహారాష్ట్రలో అమలవుతున్న పరిహారం చెల్లింపు వంటివి పరిశీలించవచ్చని తెలిపారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఉందని, విత్తన రైతుల ప్రయోజనాలు కూడా కాపాడేవిధంగా చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు.
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయంలో ఉపయోగపడే విధంగా కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి బుధవారం సచివాలయంలో వివిధ సాంకేతిక కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ”పంటలకు వచ్చే చీడపీడలను ముందుగానే గుర్తించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగే పంట నష్టాన్ని త్వరితగతిన అంచనా వేయడం, పంటల కొనుగోళ్లకు సంబంధించి ముందుగానే దిగుబడులు అంచనా వేయడం, నమోదైన సాగు విస్తీర్ణాలను ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా సరిపోల్చడం తదితర అంశాల్లో ఏఐని వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది” అని మంత్రి పేర్కొ న్నారు. అనంతరం ఇక్రిశాట్, అగ్రివాస్ కంపెనీ ప్రతినిధులు పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టన్నుకు 20871/- రూపాయాలకు చేరుకున్న పామాయిల్ గెలల ధర – మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత మరియు వంట నూనెల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్ సాగును రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేసారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో టన్నుకి ఆయిల్ పామ్ గెలల ధర రూ13135/- ఉండగా ఈ నెల ఆయిల్ పామ్ గెలల ధర రూ20871/-కి పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని మంత్రి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ రైతులకు అధిక ధరలను అందించి ఆయిల్ పామ్ సాగును లాభ సాటిగా చేయటమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రివర్యులు పేర్కొన్నారు.
ఆయిల్ ఫెడ్ వారి ప్రోసెసింగ్ మిల్లులలో నూనె రికవరీ శాతం మరియు ముడి పామాయిల్ అమ్మకం ధరల ఆధారంగా ప్రతి నెల ఆయిల్ పామ్ గెలల ధర నిర్ణయించడం జరుగుతుంది. అయితే తెలంగాణ ఆయిల్ ఫెడ్ ద్వారా నడపబడుతున్న అప్పరావ్ పేట మరియు అశ్వరావుపేటలోని ఆయిల్ పామ్ కర్మాగారాలలో నూతన టెక్నాలజీతో కొత్త యంత్రాలు ఏర్పాటు చేయడం మరియు ఉన్న యంత్రాలను అధునికరించడం వల్ల ఆయిల్ పామ్ గెలల నుండి వచ్చే నూనె రికవరీ 19.02 శాతం నుండి 19.42 శాతముకు పెరగడం వల్ల ఆయిల్ పామ్ గెలల ధర పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయించబడిన ఆయిల్ పామ్ గెలల ధరను ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవ్వాల్సిరావడంతో అక్కడ పామ్ ఆయిల్ రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయిల్ పామ్ కంపెనీలు కొంత మంది బ్రోకర్లను ఏర్పాటు చేసి వారి ద్వారా తెలంగాణ ఆయిల్ ఫెడ్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని, వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఆయిల్ ఫెడ్ రైతుల సంక్షేమం కోసం పని చేస్తూ నూనె రికవరీ శాతం పెంచుతూ ఆయిల్ పామ్ రైతుల మన్నలను అందుకుంటున్నదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 1992-93 నుంచి ఇప్పటి వరకు 2.39 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడం జరిగిందని, వచ్చే సంవత్సరంలో మరో లక్ష ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని మంత్రివర్యులు పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహించేందుకు ఏకరాకు రూ. 50918/- రాయితీని నాలుగు సంవత్సరాల కాలానికి ఇవ్వడం జరుగుతున్నదని, రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేయడానికి ముందుకు రావాలని మంత్రి కోరారు.
– పామాయిల్‌తో పాటు ఇతర పంటలకు డ్రిప్ మరియు తుంపర సేద్య పరికరాలను అవసరం మేరకు రైతులకు అందించాలని ఆదేశాలు- రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్ క్లస్టర్లను ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశాలు – జూన్ మొదటి వారంలోపు రాష్ట్రంలో మరో ఆయిల్ పామ్ కర్మాగారం అందుబాటులోకి, మరో రెండు ఫ్యాక్టరీల నిర్మాణ పనులు ఆరంభించేలా చర్యలు-
మెకడమియా పంట సాగుకు అవసరమైన పరిస్థితులను, అనువైన ప్రాంతాలను అధ్యయనం చేయాల్సిందిగా ఉద్యానశాఖ అధికారులకు ఆదేశాలు- ప్రగతి చూపని ఆయిల్ పామ్ కంపెనీలపై చర్యలు ఆరంభం, ఇప్పటికే విశ్వతేజ ఆయిల్ పామ్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు కోతులు, ఇతర అడవి జంతువుల వల్ల ఇబ్బంది ఉన్న అన్ని జిల్లాలలో ఉద్యాన పంటల రక్షణకు సోలార్ పెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు వీలుగా సోలార్ పెన్సింగ్ స్కీం అమలవుతున్న హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో పర్యటించి, రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీపై అందచేయుటకు విధివిధానాలు వెంటనే సిద్ధం చేయాలని ఈ రోజు సచివాలయంలో ఉద్యానశాఖ అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. దీనివల్ల కూరగాయలు మరియు ఉద్యాన పంటల సాగు చేయడానికి రైతులు ముందుకు రావడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న అన్ని ప్రాంతాలలో కూరగాయాల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం పెరి అర్బన్ క్లస్టర్లను ఏర్పాటుచేసి, రైతులకు ప్రోత్సహకాలు కూడా అందించేలా చూడాలన్నారు. కూరగాయల సాగు కోసం అవసరం మేరకు యంత్ర పరికరాలు సబ్సిడిపై అందించి, సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో కూరగాయల పంటలను పెద్ద ఎత్తున ఉత్పత్తిచేసి, కూరగాయలను దిగుమతి చేసుకొనే స్థితి నుండి ఎగుమతి చేసే స్థితికి తీసుకురావాలని మంత్రిగారు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం సంబంధించి కూడా ముందస్తుగా డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల పంపిణీ కోసం ధరఖాస్తులను స్వీకరించి, గ్రౌండింగ్ మొదలు పెట్టాల్సిందిగా ఆదేశించారు. ఇతర రాష్ట్రాలలో సాగు చేస్తు లాభాలు పొందుతున్న మెకడమియా పంటను రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి గల వాతావరణ స్థితిగతులు, నేలలు, నర్సరీలు, మార్కెటింగ్ అవకాశాలను అధ్యయనం చేయాలని ఉద్యానశాఖ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. మార్చి నెలాఖరుకల్లా ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, తక్కువ పురోగతి ఉన్న కంపెనీలకు నోటిసులు జారీ చేసి, ఏఏ జిల్లాలలో తక్కువ పురోగతి ఉందో వాటికి అనుమతులు రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్‌పామ్ చట్టంలో ఉన్న నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటికే విశ్వతేజ ఆయిల్ పామ్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి మల్టి నేషనల్ కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీకి సదరు ప్రాంతాన్ని అప్పగించడం జరిగిందని, అలాగే ఇంకా ఎక్కడైతే కంపెనీలు మూడు, నాలుగు సంవత్సరాలు అయినప్పటికి ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి భూమి గుర్తించక పోవడం, ప్లాంటేషన్ లక్ష్యాన్ని చేరుకోని కంపెనీలను తొలగించి, వాటి స్థానంలో ఆయిల్‌ఫెడ్‌కు బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆయిల్‌పామ్ సాగు కోసం 2 లక్షల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని ఆదేశించారు. ఆయిల్ ఫెడ్ సిబ్బందికి కూడా లక్ష్యాలు నిర్ధేశించి వాటిని చేరుకొనే విధంగా పనిచేసేటట్లు చూడాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు కూడా లక్ష్యానికి అనుగుణంగా ప్లాంటేషన్ పూర్తి చేసేట్టుగా, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పర్యవేక్షణ చేయాలని ఉద్యానశాఖ డైరెక్టర్‌కు సూచించారు. వచ్చే సంవత్సరం చివరికల్లా ఉమ్మడి జిల్లాలలో కనీసం ఒక పామ్‌ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేలా చూడాలని, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కనీసం సంబంధింత జిల్లాలలో 6 వేల ఎకరాలకు పైన ప్లాంటేషన్ ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టిఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో నిర్మాణం జరుగుతున్న ఆయిల్‌పామ్ కర్మాగారాన్ని మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని, అదేవిధంగా గద్వాల జిల్లా బీచుపల్లిలో, ఖమ్మం జిల్లా కల్లూరిగూడంలో ఆయిల్‌పామ్ కర్మాగారాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేసి, పనులు ప్రారంభించి, ఈ డిసెంబర్ కల్లా వాటి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా 6 వేల ఎకరాలపైన ప్లాంటేషన్ పూర్తి చేసిన ప్రైవేట్ కంపెనీలు కూడా వెంటనే పామ్‌ఆయిల్ కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా, ఆయిల్‌ఫెడ్ అధికారులు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు
ఆయిల్‌పామ్ గెలల ధర టన్నుకు గరిష్టంగా రూ. 20 వేలు కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి కేంద్ర వ్యవసాయ మంత్రిని త్వరలో కలవనున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తన మూడు రోజుల మలేసియా పర్యటనలో అక్కడి ఆయిల్‌పాం సాగు విధానాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు తెలిపారు. పొట్టిరకం, అధిక దిగుబడిని అందించే ఆయిల్‌పాం మొక్కలను తెలంగాణకు ఇవ్వాల్సిందిగా అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. అక్కడ నర్సరీల్లోనే నిర్దేశిత రకానికి చెందని (ఆఫ్ టైప్) మొక్కల గుర్తింపు, గ్యానోడెర్మా వ్యాధి నివారణ చర్యలు తీసుకుంటున్నారని, ఈ విధానాలను మన రాష్ట్రంలోనూ అమలు చేస్తామన్నారు.