పిల్లల పెంపకం, ప్రవర్తనపై తల్లిదండ్రుల దృక్పథాల ప్రభావం

తల్లిదండ్రులు పిల్లల వికాసంపైన అత్యంత ప్రభావం చూపుతారు. శైశవథ మొదలుకొని జీవితాంతం వరకు కుటుంబ బాంధవ్యాల వివిధ ప్రభావాలు వ్యక్తి వికాసం మీద ఎంతగానో ఉంటాయి. పిల్లల పెరుగుదల, వికాసంతోబాటు వారి అవసరాలు కూడా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు, పిల్లలకు గల అనుబంధం కూడా దానికి అనుగుణంగా మారుతూ ఉన్నప్పుడే వారు సరైన దృక్పథంతో ప్రవర్తించగలరు.

పిల్లలు కుటుంబ స్థాయికి, సంఘ సమరూపత పొందటం నేర్చుకోవాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. దీని ఫలితంగా వచ్చే కొన్ని మానసిక ఒత్తిడులను తట్టుకొని పెద్దలు కోరిన విధంగా ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రులు పిల్లల మధ్యగల సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. అంతేగాక, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఎటువంటి అనుబంధం ఉన్నదనే విషయం, తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల గల ధోరణిని బట్టి ఉంటుంది. వాంఛనీయమైన తల్లిదండ్రుల పిల్లలు అనుబంధం వాత్సల్యపూరితమైన బాంధవ్యం తల్లిదండ్రులకు వారి పిల్లల మీద భద్రత, నమ్మకం ఉన్నప్పుడే వారి పిల్లలకు తల్లిదండ్రుల మీద విశ్వాసం పెంపొందుతుంది. ఈ విధమైన అనుకూల బాంధవ్యం ఉన్నప్పుడే పిల్లలు బాధ్యతాయుత ప్రవర్తన కలిగి ఉంటారు. 

పిల్లల పెంపకం అన్నది ఒక కళ. తల్లిదండ్రుల పెంపక విధానాలపై పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. చిన్నప్పటి పెంపకం విధానాలపైనే పిల్లల భావి జీవితాలకు పునాది ఏర్పడుతుంది. తల్లిదండ్రుల పెంపక విధానాలలో లోపమున్నట్లయితే వాటి పర్యవసానాలు, దుష్పరిణామాలు పిల్లలు అనుభవించాల్సి ఉంటుంది. కనుక, ప్రతి తల్లిదండ్రి పెంపక విధానాల గురించి వాటి పరిణామాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పిల్లల పెంపక విధానాలు – వాటి పరిణామాలు

*  విమర్శలతో పెంచబడిన బిడ్డ, తనను తాను దోషిగా తలుస్తాడు.

*  కోపతాపాలతో పెంచిన బిడ్డ, కయ్యానికి కాలు దువ్వుతాడు.

*  పరిహాసములతో పెంచబడిన బిడ్డ, పిరికివానిగా తయారవుతాడు.

*  అవమానాలతో పెంచబడిన బిడ్డ, న్యూనతా భావానికి గురవుతాడు.

*  సహనంతో పెంచబడిన బిడ్డ, క్షమాగుణాన్ని నేర్చుకుంటాడు.

*  రక్షణ భావంతో పెంచబడిన బిడ్డ, జీవితంపై దృఢమైన నమ్మకాన్ని పెంచుకొంటాడు.

*  నిష్పక్షపాతంగా పెంచబడిన బిడ్డ, నీతిగా పెరగటం నేర్చుకొంటాడు.

*  స్నేహ భావంతో పెంచబడిన బిడ్డ, ఇతరుల మీద ప్రేమ అభిమానాన్ని పెంచుకొంటాడు.

*  పిల్లలను పెంచే విధానం తల్లిదండ్రుల దృక్పథాల మీద ప్రేమ, అభిమానాన్ని పెంచుకొంటాడు.

*  పిల్లలను సక్రమ పద్ధతిలో పెంచితే వాళ్ళు మంచి అలవాట్లను, ఉత్తమ లక్షణాలను నేర్చుకొని కుటుంబంలోను సంఘంలోను ఉపయోగపడే వ్యక్తులుగా రూపొందగలరు. కాబట్టి పెంచటంలో తల్లిదండ్రులకు సరియైన దృక్పథాలు ఉండటం ఎంతో అవసరం.

తల్లిదండ్రుల దృక్పథాలు ముఖ్యంగా మూడు రకాలు: 1) స్వీకారం, 2) తిరస్కారం 3) అతి సంరక్షణ

స్వీకారం: తల్లిదండ్రులు ప్రేమగా చూడటమే ప్రతిబిడ్డకు జీవితంలో ప్రాథమిక అవసరం. తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. ఇది వారు భారమైన విధి అని భావించకుండా ప్రకృతి సిద్ధమైన బాధ్యతగాను, ఆనందమయమైన కార్యంగాను గుర్తించాలి. పిల్లలను వారి అందచందాలు చూచిగాని, తెలివితేటలను చూచిగాని ప్రేమించకూడదు. బిడ్డలు ఎటువంటి వారయినా, ఎలాంటి గుణగణాలు ఉన్నా వారిని తల్లిదండ్రులు ఆత్మీయతతో ఆదరించి, సమభావంతో పెంచాలి. ఈ విధంగా పెంచిన బిడ్డలను స్నేహ సహకార స్వభావాలు, నిశ్చిలబుద్ధి ఉండి స్వయం శక్తితో సంతోషంగాను, సుఖంగాను వృద్ధిలోకి రాగలరు.

స్వీకారం వలన తల్లిదండ్రులకు, బిడ్డలకు కూడా ఆనందంగా ఉంటుంది. స్వీకారం తిరస్కారం దృక్పథాలు తల్లిదండ్రులలో సాధారణంగా కన్పించే లక్షణాలని మానసిక మనోవిజ్ఞాన పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మానసిక పరిపక్వత ఉన్న తల్లిదండ్రులలో స్వీకారం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు స్వేచ్ఛ ఉన్నప్పుడే వారిలో సృజనాత్మక శక్తి సహకరించడం, ఆత్మవిశ్వాసం, సర్దుబాటుతత్వం లాంటి లక్షణాలు అలవాటవుతాయి. పిల్లలు, బాధ్యత, నమ్మకం, విధులు నిర్వహించడంలో నైపుణ్యం అలవాటు చేసుకొంటారు.

తల్లిదండ్రులు ఎక్కువ జోక్యం చేసుకొంటే పిల్లలు స్వార్ధపరులుగా, మొండిగా తయారవుతారు. అంతేకాక అటువంటి పిల్లలు, తల్లిదండ్రుల మరియు ఇతరులు కూడా వారిపైనే శ్రద్ధ చూపాలి అనే భావనలో ఉంటారు. ఇటువంటి పిల్లలను క్రమశిక్షణలో పెట్టినా ఓర్పులేక కోపాన్ని వెళ్ళబుచ్చుతారు. సాంఘికంగా అంటే ఇతరులు తమ గురించి ఏ విధంగా అనుకుంటారనే విషయం కూడా చాలా ముఖ్యమైనది. తమను జట్టులో గాని, సమూహాలలో గాని ఇతరులు స్వీకరించే విధానాన్ని బట్టి, ఇతరులు వారిపట్ల చూపే ఆదరాభిమానాలను బట్టి, వారి తప్పులను క్షమించి వారి ప్రయత్నాలను మెచ్చుకోవడాన్ని బట్టి, ఇతరులు తమ గురించి ఏ విధంగా భావిస్తున్నారో పిల్లలు తెలుసుకోగలరు.

సాంఘికంగా అంగీకారం పొందే వ్యక్తి చురుకుగా ఉంటాడు. మనసులోని మాటను పైకి చెప్తాడు. ఇతరుల కార్యక్రమాలలో సహకరిస్తాడు. ఇతరులకు సహాయం చేయటం, ఇతరులతో మర్యాదగా ఉండటం, విషయాలను పరిశీలించటం, విచారించడం మొదలైనవి సాంఘికంగా అంగీకరింపబడే వ్యక్తి లక్షణాలు. అటువంటి వ్యక్తి సమూహంలో నాయకత్వాన్ని వహిస్తాడు. ఇతను నిజాయితీ పరుడుగా ఉంటాడు. ప్రవర్తనలో ఒక మెట్టుపైన ఉంటాడు. తాము చేపట్టిన బాధ్యతలను స్వశక్తితో చక్కగా నెరవేరుస్తాడు.

ఈ దృక్పథం తల్లిదండ్రుల, పిల్లల బంధాన్ని బలపరుస్తుంది. పిల్లల అభివృద్ధికి అభ్యాసనకు ఎన్నో విధాల సహకరిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల మధ్య చక్కని అవగాహన, ఆరోగ్యవంతమైన అనుబంధం ఏర్పడుతుంది. ఇటువంటి పిల్లలు తల్లిదండ్రులను సంతోషపరచాలని చూస్తారు.

తిరస్కారం: తల్లిదండ్రులు బిడ్డల పట్ల తిరస్కారాన్ని చాలా విధాలుగా వ్యక్తపరుస్తారు. కొందరు బిడ్డల పట్ల బాహ్యంగా శత్రు భావాన్ని చూపుతారు. మరికొందరు వారిని నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు తిరస్కార భావం, ద్వేషం బాహ్యంగా చూపకుండా మనస్సులోనే ఉంచుకొని వారికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఇవ్వక అన్ని విషయాలలోను ఆటంకపరుస్తారు. ఇలా చేయటం వల్ల పిల్లలలో క్రోధం, అణకువ, పిరికితనం, అశాంతి మొదలైన కొన్ని అవాంఛనీయమైన గుణాలు ఏర్పడతాయి.

తల్లిదండ్రుల నిర్లక్ష్యం, పిల్లలలో ఏమి చేయలేని పరిస్థితిని కల్పించి భద్రతను, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. దీని వలన నిద్రలో పక్కతడపటం, గోళ్ళు కొరకటం, సరిగా తినకపోవటం లాంటి ప్రవర్తనా సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం కోరుకోవడం వలన వస్తాయని తెలుస్తోంది. ఎటువంటి బాధ్యతలు లేనివారుగా తయారవుతారు. బిడ్డలను పెంచడంలో తిరస్కారం లేక అతి సంరక్షణ అవలంబించితే పిల్లల అభివృద్ధి కుంటుపడుతుంది.

అతి సంరక్షణ వలన తల్లి, పిల్లల మధ్య అనుబంధం ఎక్కువయి, వారు తల్లిదండ్రుల మీద ఎక్కువగా ఆధారపడతారు. దీని వలన వారు స్వశక్తితో ఏ పని చేయరు, చేయవలసి వచ్చినా భయపడతారు. అంతేకాక వారిలో ఇతర కార్యాలపైన ఉత్సాహం త్వరగా కలవలేరు. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనలేక, ఇంటికే పరిమితమైపోతారు. దీనితో ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా విశ్వాసాన్ని కోల్పోతారు. ఇందువలన వారిలో ఆత్మవిశ్వాసం, సహనం, ఉత్సాహం తగ్గిపోతుంది. విమర్శలను తట్టుకోలేరు.

ఈ కాలంలో తల్లిదండ్రులు వివిధ కారణాల వల్ల ఒక బిడ్డను కని వారిని అతిగారాబంగా పెంచుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల అవసరాలను తీరుస్తూ వారికి ప్రేమ, వాత్సల్యాలతో కూడిన వాతావరణాన్ని ప్రసాదిస్తూ పిల్లల అభివృద్ధికి దోహదపడాలి తప్ప, అతి జాగ్రత్తతో పెంచి పిల్లలను ఎందుకూ పనికిరాని వాళ్ళుగా తయారు చేయకూడదు. తల్లిదండ్రులు ఈ దృక్పథాల ప్రభావాన్ని గుర్తించి పిల్లలను సక్రమంగా పెంచాలి.       

డా. పి. శ్రీదేవి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, మానవ అభివృద్ధి మరియు కుటుంబ అధ్యయన విభాగం, సామాజిక విజ్ఞాన కళాశాల, సైఫాబాద్‌, హైదరాబాద్‌.

డా. బి. ప్రశాంతి, టీచింగ్‌ అసోసియేట్‌, ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, సామాజిక విజ్ఞాన కళాశాల, లాం, గుంటూరు.

ఫోన్‌: 8333850282

Read More

ప్రకృతి వ్యవసాయంలో 5 లేయర్‌ సాగు

పాలేకర్‌ బాటలో విజయరామ్‌

రసాయనిక వ్యవసాయం వలన సంభవించిన, సంభవిస్తున్న అనర్ధాల నుండి బయటపడడానికి అనేకమంది నిపుణులు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, కొన్ని సంస్థలు రసాయనాలు అవసరం లేని వివిధ రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేస్తున్నారు. వీటిలో ఫుకుఓక ప్రకృతి వ్యవసాయ పద్ధతి, భాస్కరసావే పద్ధతి, చౌహాన్‌క్యూ పద్ధతి, నమ్మళ్వార్‌ పద్ధతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతి, సుభాష్‌పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి లాంటి వాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటిలో సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి చాలా వేగంగా రైతులోగిళ్ళకు చేరింది. ఇంకా చేరుతూనే ఉంది అని చెప్పవచ్చు. సుభాష్‌ పాలేకర్‌ వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఈ పద్ధతి గురించి ప్రచారం చేయడంతోపాటు, కొన్ని ప్రభుత్వాలు ఈ పద్ధతిని ప్రోత్సహించడం మరియు రైతులు అమలుపరచటానికి అనుకూలంగా ఉండడం, ఈ పద్ధతిలో మన దేశీయ జాతి గోవు ప్రముఖ పాత్రను పోషించటం లాంటి వివిధ రకాల కారణాల వలన మిగతా పద్ధతులతో పోల్చుకుంటూ సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి చాలా వేగంగా రైతు లోగిళ్ళకి చేరిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే సుభాష్‌పాలేకర్‌ వలననే రసాయన వ్యవసాయం వలన జరిగిన, జరిగే నష్టాలు వేగంగా రైతులు తెలుసుకుంటున్నారు. రసాయన రహిత వ్యవసాయం ఇంత వేగంగా రైతులకు తెలియడంలో సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి ప్రధాన పాత్ర పోషించింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ పద్ధతిని సుభాష్‌ పాలేకర్‌ ప్రచారం చేయకుండా ఉండి ఉంటే రసాయన రహిత వ్యవసాయం రైతులోగిళ్ళకు చేరటానికి చాలా సమయం పట్టేది కావచ్చు. పాలేకర్‌ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడం, వారి పుస్తకాలు చదివిన వారు, వారి సభలకు హాజరయ్యి ఈ పద్ధతుల గురించి తెలుసుకున్న చాలామంది రైతులు తమ రసాయనిక సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ బాట పట్టించారు. ఇంకా పట్టిస్తున్నారు. వ్యవసాయేతర ఉద్యోగ, వ్యాపారం లాంటి వేరే రంగాలలో ఉన్న వారు కూడా సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతుల గురించి తెలుసుకుని ఈ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతారు కృష్ణాజిల్లా, తరకటూరులో, వికారాబాద్‌ సమీపములో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకృతి సాగు చేస్తున్న విజయరామ్‌.

వాస్తవానికి విజయరామ్‌ ఆర్టిస్ట్‌ (బొమ్మలు గీస్తుంటారు). ఆర్టిస్ట్‌గా తన వృత్తిని కొనసాగిస్తూ హైదరాబాదు నగరంలో ఇందిరాపార్కు సమీపంలో ఒక మిఠాయి దుకాణాన్ని నడుపుతూ వస్తున్న సమయంలో నీటి యొక్క విలువను తెలుసుకుని నీటి సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని మిఠాయి దుకాణంకి వచ్చిన వినియోగదారులకు తెలియచేస్తూ ఉండేవారు. అందుకు సంబంధించి చార్టులను తయారు చేయించి అవసరమైన వారికి ఆ చార్టులను ఉచితంగా అందిస్తూ ఉండేవారు. ఆవిధంగా తన ఆలోచనలని సామాజిక రంగాలవైపు కూడా మళ్లించి కొనసాగుతున్న క్రమంలో 2010వ సంవత్సరంలో సుభాష్‌పాలేకర్‌ గారి జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి గురించి తెలుసుకొని తాను కూడా గో-ఆధారిత వ్యవసాయం చేయాలనే తలంపుతో అటువైపు అడుగులు వేసి ప్రకృతి వ్యవసాయంలో అడుగు పెట్టారు. ఈ పద్ధతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే తలంపుతో సుభాష్‌పాలేకర్‌ గారి ద్వారా సదస్సులు ఏర్పాటు చేయడంలో తనవంతు పాత్రను పోషించారు…. పోషిస్తూన్నారు.

గోఆధారిత వ్యవసాయంలో ప్రధానమయినవి మన దేశీయ జాతి గోవులు, మన పురాతన నాటు విత్తనాలు కాబట్టి తన సాగులో ఈ పద్ధతులను అమలుపరచడంతో పాటు అంతరించి పోతున్న మన పురాతన విత్తనాలను అభివృద్ధి చేసి వాటి లభ్యత పెంచాలనే తలంపుతో మన పురాతన విత్తనాల సేకరణకు నడుంబిగించి వాటిని సేకరిస్తూ అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. వీటన్నింటికిగాను కృష్ణాజిల్లా తరకటూరులో, వికారాబాద్‌ సమీపంలో పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తున్నారు. ఇందుకుగాను మన దేశీయ జాతులు ఒంగోలు, గిర్‌ లాంటి ఆవులను మరియు ఎద్దులను పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటలసాగులో వినియోగిస్తున్నారు. ఆవు పాల ద్వారా మన తాత, ముత్తాతలు పాటించిన పద్ధతులతో నాణ్యమైన ఆవు నెయ్యిని తయారు చేసి అవసరమైన వారికి అమ్ముతూ వస్తున్నారు.

వరి, చెరకు, ఉల్లి, పసుపు, అల్లం, వివిధ రకాల కూరగాయలు అరటి మొదలగు పంటలతో పాటు 5 అంచెల పద్ధతిలో వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. దుక్కిలో ఘనజీవామృతం అందించడంతో పాటు జీవామృతాన్ని భూమికి అందిస్తుంటారు. అవసరాన్ని బట్టి జీవామృతం, నీమాస్త్రం, పుల్లటి మజ్జిగ లాంటి వాటిని పంటలపై పిచికారి చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతుంటారు. పంట దిగుబడిలో నాణ్యతకు, పోషకాలకు ప్రాముఖ్యతని ఇస్తూ ఎంత దిగుబడి వచ్చిందనే దానిని పట్టించుకోకుండా వచ్చిన దిగుబడి నాణ్యమైనదా కాదా అనే కోణంలో ఆలోచిస్తూ పంటల సాగు కొనసాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాటు విత్తనాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కాబట్టి తాను సాగు చేసే పంటలన్నింటికీ నాటు విత్తనాలనే ఉపయోగిస్తున్నారు. నాటు విత్తనాలను తన పంటల సాగులో వినియోగించడంతోపాటు తోటి రైతులకు కూడా అందచేస్తుంటారు. మన పురాతన విత్తనాలు అంతరించి పోతున్నవి కాబట్టి అందుబాటులో ఉన్న పురాతన విత్తనాలను ప్రత్యేకించి వడ్లను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరించి వాటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అభివృద్ధిపరచి తోటి రైతులకు అందచేసి మన పురాతన విత్తన నిధిని కాపాడుటలో విజయరాం ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. పురాతన వడ్లలో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు అని తెలుసుకొని పురాతన విత్తనాల అభివృద్ధి మరియు పంపిణీని ఒక ఉద్యమంగా చేస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయంలో అడుగుపెట్టి, దేశీయ జాతి గోసంతతిని, మన పురాతన విత్తనాలను అభివృద్ధిపరుస్తూ తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తూ పంట దిగుబడులు ముఖ్యం కాదు, నాణ్యమైన దిగుబడులు ముఖ్యం అంటూ విజయరాం ముందుకు నడుస్తున్నారు. మరిన్ని వివరాలు 83746 62262 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

ఐదు అంచెల సాగు విధానం

ఐదు అంచెల సాగు విధానాన్ని సుభాష్‌ పాలేకర్‌ బాగా ప్రచారం చేశారు. ఈ విధానంలో 36 అడుగుల దూరంలో మామిడి, నేరేడు లాంటి పెద్దగా ఎదిగే మొక్కలు పెంచుకొంటూ వాటి మధ్యలో వివిధ రకాల మొక్కలను, కూరగాయలు, ఆకుకూరలను 4 అంచలుగా సాగు చేయడం దాని ప్రధాన ఉద్దేశ్యం. ఈ విధానం 36 * 36 అని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ 36 * 36 విధానం ప్రచారంలోకి వచ్చిందేకాని క్షేత్రస్థాయిలో విజయం సాధించిన వారు పెద్దగా లేరు. కారణం ఈ విధానంలో దిగుబడులు సక్రమంగా రావడం లేదు అని తెలుసుకుని విజయరాం ఈ విధానానికి వేరే రూపం ఇచ్చారు. అంటే 36 కి బదులుగా 50 అడుగుల దూరం పాటిస్తే అన్ని అనుకూలంగా ఉంటాయని అనుభవ పూర్వకంగా తెలుసుకుని 50 * 50 అడుగుల దూరంలో 5 అంచెలుగా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 50 అడుగుల దూరంలో మొదటి అంచెలో నేరేడు, మామిడి, పనస, బాదం లాంటి పెద్దగా ఎదిగే వృక్షాలు 50 అడుగులలో సగం అంటే 25 అడుగుల దూరంలో రెండో అంచెగా బత్తాయి, నిమ్మ, నారింజ లాంటి మొక్కలు, 25 అడుగులలో సగం అంటే 12 1/2 అడుగుల దూరంలో 3వ అంచెగా బొప్పాయి, అరటి లాంటి మొక్కలు, 12 1/2 లో సగం 6 1/4  లో 4వ అంచగా మునగ, అవిశ లాంటి మొక్కలు 61/4 అడుగులకు మధ్యలో సొర, బీర, కాకర, బెండ లాంటి కూరగాయలతోపాటు తోటకూర, గోంగూర, చుక్కకూర లాంటి ఆకుకూరలు, పసుపు, అల్లం, చేమ దుంపలాంటి పంటలు పండిస్తున్నారు. వీటన్నింటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోనే పండిస్తున్నారు. 5 అంచెల విధానంలో లైనుకి లైనుకి 6 1/4 అడుగుల దూరం ఉంటుంది. లైనుకి లైనుకి మధ్య ఒక కాలువ చేసుకుని ఆ వచ్చిన మట్టి లైనులో ఎత్తుగా వేసుకోవడం వలన కలుపు సమస్య తగ్గడంతో పాటు లైనులో ఉన్న మొక్కలకు పోషకాలు బాగా అంది అవి ఆరోగ్యంగా పెరుగుతూ ఎలాంటి కషాయాలు, ద్రావణాలు అవసరం పడటంలేదు. తప్పనిసరి పరిస్థితులలో నీమాస్త్రం, పుల్లటిమజ్జిగ, జీవామృతం లాంటివి పంటపై పిచికారి చేస్తుంటారు. విజయరాం పండించే అన్ని పంటలకు నీటిని అందించటానికి ఎలాంటి డ్రిప్పు, స్ప్రింక్లర్‌ లాంటి విధానాలను ఉపయోగించకుండా కాలువల ద్వారానే నీటిని అందిస్తుంటారు. 5 అంచెల విధానంలో కాలువ ద్వారా నీటిని అందిస్తూ ఆ కాలువలలో అరటి, బొప్పాయి లాంటి ఆకులు మల్చింగ్‌గా ఉపయోగిస్తుంటారు. 

Read More

విత్తనాలు కొనుగోలు చేద్దామిలా…

1) వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి.

2) రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన సందర్భంలో, నిర్ణీత ఫార్మాట్‌లో ఉన్న బిల్లు (రసీదు) అనగా దుకాణదారుని పేరు, అడ్రస్‌, సీడ్‌ లైసెన్స్‌ నంబరు, స్త్రఐఊ నంబరు మొదలగునవి ఉన్న రసీదును మాత్రమే అంగీకరించాలి.

3) రసీదుపై విత్తన కంపెనీ పేరు, విత్తన రకం పేరు, లాట్‌ నెంబరు, గడువు తేదీ మరియు డీలర్‌ సంతకము తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

4) కొనుగోలు చేసిన విత్తన ప్యాకెట్‌, సంచి, డబ్బాలపై సీలు ఉందా లేదా అని సరిచూసుకోవాలి. విత్తన ప్యాకెట్లపై ముద్రించిన సమాచారాన్ని బిల్లులో ఉన్న వివరాలతో సరిచూసుకోవాలి.

5) కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి.

6) విత్తన ప్యాకెట్‌ మరియు బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవడం తద్వారా జన్యు స్వచ్ఛత లోపాల వల్ల లేదా మొలక శాతం తక్కువైనప్పుడు తగిన పరిహారం కోరే హక్కు రైతుకు ఉంటుంది.

7) లూజుగా ఉన్న సంచులు మరియు పగిలిన ప్యాకెట్లు, డబ్బాల్లో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదు.

8) గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితులలో కొనరాదు.

9) బిజి-3 పేరుతో చలామణి అవుతున్న HT విత్తనాలకు జిఇఏసి (GEAC) అనుమతి లేనందున ఈ రకం విత్తనాలను కొనడం, అమ్మడం మరియు సాగు చేయడం నేరము.

10) బీటీ కాటన్‌ విత్తన ప్యాకెట్లపై జి ఇ ఏ సి అప్రూవల్‌ నెంబర్‌ తేదీ, సదరన్‌ జోన్‌ అనగా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయుటకు అనువైనదో కాదో విత్తన ప్యాకెట్‌పై ఉన్న సమాచారంతో సరి చూసుకోవాలి.

11) గ్రామాల్లో రాత్రికి రాత్రి వచ్చి అనధికారికంగా విక్రయించే నకిలీ విక్రయదారుల నుండి ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు కొనుగోలు చేయరాదు.

12) అనధికారికంగా, బిల్లు లేకుండా కలుపు మందును తట్టుకొనే H.T. (B.T.) ప్రత్తి విత్తనాలు అమ్ముతున్నట్లయితే సంబంధిత మండల వ్యవసాయ అధికారి లేదా జిల్లా వ్యవసాయ తనిఖీ బృందంకు ఫిర్యాదు చేయవలెను. 

13) కలుపు మందును తట్టుకొనే బి టి (B.T.) ప్రత్తి పంట సాగుకు మన దేశంలో ప్రభుత్వ అనుమతి లేదు. స్త్రజూజ్పు అనుమతి లేని కలుపు మందు తట్టుకొనే ప్రత్తి విత్తనాలు సాగు చేసినా, అమ్మినా చట్టరీత్యా నేరము.

14) కలుపు మందును తట్టుకొనే ప్రత్తి విత్తనాలు ఉత్పత్తి చేసిన మరియు రైతులు పంట పొలాల్లో సాగు చేసినా, విత్తన చట్టం 1966, పర్యావరణ పరిరక్షణ చట్టం (జూఆజు) 1986 ప్రకారము నేరము.

15) అటువంటి వ్యక్తులపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకొనబడును. మన రాష్ట్ర ప్రభుత్వము ఆ.ఈ. యాక్ట్‌ ప్రకారం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకొనబడుతున్నవి. కనుక రైతు సోదరులు ఇటువంటి ప్రత్తి విత్తనాలు సాగు చేయకూడదని కోరుచున్నాను.

16) నకిలీ విత్తనాలు / నకిలీ ప్రత్తి విత్తనాలు / కలుపు మందును తట్టుకొనే బి.టి. విత్తనాలు మరియు లూజు విత్తనాలను అమ్ముతున్నట్లు నమ్మశక్యమైన సమాచారం తెలపడము ప్రతి ఒక్కరి బాధ్యత మరియ వారి వివరాలు గోప్యంగా ఉంచబడును.

17) ఇట్టి సమాచారాన్ని మండల / డివిజన్‌ / జిల్లా వ్యవసాయాధికారికి తెలియచేయండి.    – వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం

Read More

ఆరోగ్యం లేకుంటే ఆదాయం వృథా అంటున్న  సునంద

ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం ఆనందంగా జీవితాన్ని గడపడమే. ఆరోగ్యం సక్రమంగా లేకుంటే ఆనందంగా జీవితాలను గడపలేము అనే విషయం అందరికి తెలిసిందే. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నపుడే ఎలాంటి ఆనందమయినా పొందగలం. మన ఆరోగ్యం మనం తినే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీటిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ మూడింటిలో మనం తినే ఆహారం విషయం గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం మనం తినే ఆహారం చాలా వరకు రైతులు రసాయన వ్యవసాయం చేసి పండిస్తున్నదే కాబట్టి విష రసాయన అవశేషాలు ఉన్న ఆహారాలు తినడము వలన మన ఆరోగ్యాన్ని పాడు చేయడములో రసాయన అవశేషాలు ఉన్న ఆహారాలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా చాలామంది రైతులు సేంద్రియ బాటపట్టి విష రసాయనాలు లేకుండా సేంద్రియ ఆహారాలను పండిస్తున్నారు. వినియోగదారులు కూడా వారికున్న అవకాశాలను బట్టి సేంద్రియ ఆహారాలను తినడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సేంద్రియ ఆహారానికి ఉన్న ప్రాముఖ్యత గమనించి తాము సేంద్రియ ఉత్పత్తులను తినడంతో పాటు సమాజానికి కూడా నాణ్యమయిన సేంద్రియ ఉత్పత్తులు అందించడంలో తన వంతు పాత్రను పోషిద్దాము అనే లక్ష్యంతో సేంద్రియ సాగులో అడుగు పెట్టారు సునంద.

సునందది వ్యవసాయ నేపథ్యం. అయినా కాని ఉన్నత చదువులు చదివి అధ్యాపక వృత్తిలో ప్రవేశించి కొనసాగుతున్న క్రమంలో ఆసీఫాబాదు జిల్లాకు చెందిన రవికుమార్‌తో వివాహం జరిగింది. రవికుమార్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అప్పట్లో వీరి కుటుంబం హైదరాబాదు నగరం ఆల్వాలు ప్రాంతంలో నివాసం ఉండేది. ఎం.ఎస్సీ. కెమిస్ట్రీ పూర్తి చేసిన సునంద పీహెచ్‌.డి. పూర్తి చేసి ఏదైనా కాలేజీలో లెక్చరర్‌గా మరలా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండగా భర్త రవికుమార్‌ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడటము జరిగింది. అంతేకాకుండా వీరిపిల్లలు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో అనునిత్యం సతమతమవడం ప్రత్యక్షంగా అనుభవించారు. అదే సమయంలో రవికుమార్‌ ప్రాణ స్నేహితుడు క్యాన్సర్‌తో మరణించడం జరిగి భార్యా, పిల్లలను అనాథలను చేయడము సునంద మనసుని కలచి వేసింది. ఎంత డబ్బున్నా కాని ఆరోగ్యం సక్రమంగా లేకుంటే అంతా వృథా అని ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. ఈ పరిణామాలన్నీ అనారోగ్య సమస్యలకు కారణాలు వెతకడానికి ప్రేరేపించి కారణాలు తెలుసుకోగా, ప్రధానంగా ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొనే అనారోగ్య సమస్యలకు కారణాలు చాలావరకు తాము తినే ఆహారంలో ఉండే విషరసాయన అవశేషాలు అని గ్రహించి తాము విష రసాయన అవశేషాలు లేని ఆహారాన్ని తినాలని నిశ్చయించుకుని అటువైపు అడుగులు వేయడం జరిగి, మొదటగా తాము ఉపయోగించే నూనెను మార్పు చేసి మార్కెట్‌లో దొరికే రిఫైండ్‌ నూనెకు బదులుగా కోల్డ్‌ ప్రెస్డ్‌ నూనెను ఉపయోగించడం మొదలు పెట్టారు. చాలా వరకు అనారోగ్య సమస్యలు దూరం అవటం గమనించిన తరువాత తాము తినే ఆహారాలను చాలా వరకు సేంద్రియ పద్ధతులతో పండించినవే తినడం మొదలుపెట్టారు. ఈ మార్పుల వలన తమ కుటుంబసభ్యులు ఎదుర్కొనే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం ప్రత్యక్షంగా తెలుసుకోగలిగారు. అదే సమయంలో కరోనా మహమ్మారి వలన లాక్‌డౌన్‌ ప్రకటించడం జరిగి హైదరాబాదు నుంచి తమ కుటుంబాన్ని రవికుమార్‌ సొంత ఊరు అసీఫాబాదు జిల్లా విజయనగరంకి మార్చడం జరిగింది. 

వీరి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు మరియు కరోనా సమయంలో ప్రపంచం మొత్తం ఎదుర్కొన్న ఇబ్బందులు కక్షుణ్ణంగా అధ్యయనం చేసిన సునంద ఆదాయం కంటే ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం అని తెలుసుకుని తాను వ్యవసాయ రంగంలో దిగి పూర్తి సేంద్రియ పద్ధతులలో వివిధ రకాల పంటలు పండించాలనుకుంటున్నానని భర్త రవికుమార్‌కు తెలియచేయగా రవికుమార్‌ ఆనందంగా సునంద నిర్ణయాన్ని స్వాగతించి తను మాత్రం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ రంగంలో కొనసాగుతూ, తన ఖాళీ సమయాన్ని వ్యవసాయంలో సునందకు సహకారం అందిస్తూ సునందని పూర్తిగా వ్యవసాయరంగంలో దించడం జరిగింది.

తమ సొంత పొలం 8 ఎకరాలలో సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల పంటల సాగు మొదలు పెట్టారు. సేంద్రియ పద్ధతులకు సంబంధించిన సమాచారం కొరకు వివిధ రకాల పుస్తకాలు చదవడం, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన రైతులను కలవడం, రైతుల యొక్క వీడియోలను యూట్యూబ్‌లో చూడడము, సేంద్రియ పద్ధతులను ప్రచారం చేస్తున్న నిపుణులను కలసి వివరాలు తెలుసుకోవడం లాంటివి చేస్తూ సేంద్రియ సాగు మొదలు పెట్టి అనుభవం గడించే కొలది తాము పాటించే పద్ధతులలో మార్పులు చేసుకుంటూ వస్తూ సుమారు 30 రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తూ ఆరోగ్యకరమయిన దిగుబడులు సాధిస్తూ వస్తున్నారు. వచ్చిన దిగుబడిని హోల్‌సేల్‌గా అమ్మినట్లయితే సరైన ధర రావడం లేదు కనుక సేంద్రియ సాగులో లాభాలు ఆర్జించాలంటే పంట ఉత్పత్తులకు విలువ జోడింపు మరియు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయడమే సరైన దారి అని నమ్మి తమ పంట ఉత్పత్తులకు విలువ జోడించి అనగా వడ్లను బియ్యం చేసి, కందులు, పెసలు, మినుములు లాంటివి పప్పులు చేసి… ఈ విధంగా తాము పండించే పంటలను సాధ్యమైనంతవరకు విలువ జోడించి నేరుగా వినియోగదారులకు అమ్మడం మొదలు పెట్టారు. తాము పాటించే సాగు పద్ధతులు మరియు తాము పండించే పంటల వివరాలు ఎక్కువమంది ప్రజలకు తెలియ చేయడానికి సామాజిక మాధ్యమాలను సరైన పద్ధతిలో వినియోగించుకుంటూ రోజురోజుకు వినియోగదారుల సంఖ్య పెంచుకుంటూ వస్తున్నారు.

తమ ఈ ప్రయాణంలో అనేకమంది వినియోగదారులు సమకూరడంతో పాటు అనేక మంది సేంద్రియ రైతులు కూడా తమ ఉత్పత్తులకు ఆశాజనకమయిన ధర లభించడానికి గాను సునందను కలవగా తాము పండించే ఉత్పత్తులతో పాటు తోటి సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తులను కూడా కలిపి వినియోగదారులకు అందించగలిగితే అటు వినియోగదారులకు ఇటు రైతులకు ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుందని గ్రహించి తోటి సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అమ్మకం చేయడం మొదలు పెట్టారు. 

వివిధ రకాల పంటల సాగులో వివిధ రకాల సేంద్రియ పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యకరమయిన దిగుబడి సాధిస్తున్న క్రమంలో తోటి రైతులు కూడా సేంద్రియ పద్ధతుల గురించి సునందను సంప్రదించటము మొదలయ్యింది. తన సేంద్రియ సాగు అనుభవాలు ఎక్కువమందికి చేరాలంటే హైదరాబాదు సమీపంలో పంటల సాగు మొదలు పెడితే ఫలితాలు బాగా ఉంటాయని, దానికి తోడు హైదరాబాదు మార్కెట్‌ చాలా పెద్ద మార్కెట్‌ కాబట్టి తాము ఆర్థికంగా కూడా ఉద్యోగం చేస్తే వచ్చే ఆదాయాన్ని వ్యవసాయం చేస్తూ కూడా పొందవచ్చు అని తోటి యువతకు ప్రత్యేకించి మహిళలకు చూపించాలనే లక్ష్యంతో ఉన్న సునంద హైదరాబాదు శివారు ప్రాంతాలు తిరిగి శంషాబాదు సమీపంలోని పెదవేడు గ్రామంలో 25 ఎకరాలు వివిధ రకాల పండ్ల తోటను 2023 ఆగస్టు నెలలో కౌలుకు తీసుకుని తమ కుటుంబాన్ని ఆ పొలంలోకి మార్చారు. రవికుమార్‌ ఉద్యోగ బాధ్యతలు కూడా హైదరాబాదులోనే కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటాయని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం సునందగారు కౌలుకి తీసుకుని సాగు చేస్తున్న 25 ఎకరాల తోటలో మామిడి, సపోట, బత్తాయి మొదలగు వివిధ రకాల పండ్ల మొక్కలు దిగుబడిని ఇస్తున్నాయి. వచ్చిన దిగుబడిని నేరుగా వినియోగదారులకు, కొంత భాగం దిగుబడిని సేంద్రియ ఉత్పత్తులు అమ్మకం చేసే దుకాణాలకు అమ్మకం చేస్తూ వస్తున్నారు. తాము పండించే పంట దిగుబడులతో పాటు తోటి రైతులు పండించే నాణ్యమయిన సేంద్రియ ఉత్పత్తులను కూడా మార్కెటింగ్‌ చేస్తూ తోటి రైతులకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. మరిన్ని వివరాలు 7799544705కు ఫోను చేసి తెలుసుకోగలరు. 

కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి

ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అనే విషయం అందరికి తెలిసిందే. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగం, అదీను సేంద్రియ వ్యవసాయ రంగంలో కుంటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా ఉండాలి. సేంద్రియ సాగులో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు లాంటి వాటిని సొంతంగా తయారు చేసుకోవడంతో పాటు పంట ఉత్పత్తులకు విలువ జోడింపు మరియు మార్కెటింగ్‌ లాంటి విషయాలలో కూడా కుటుంబ సభ్యుల సహకారం తప్పని సరి అవుతుంది. కాని ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్లయితే చాలామంది మహిళలకు వ్యవసాయరంగం అంటే పెద్దగా ఇష్టం ఉండడం లేదు. కాబట్టే మగవారు వ్యవసాయం అంటే మక్కువ ఉన్నా కూడా తమ ఇంటి మహిళలకు వ్యవసాయరంగం అంటే ఇష్టం లేకపోవడం వలన వ్యవసాయరంగంలో అడుగు పెట్టలేక పోతున్నారు. కొంతమంది మగవారు అయితే తమ ఇంట్లోని మహిళల ఇష్టాలను పట్టించుకోకుండా వ్యవసాయరంగంలోకి అడుగు పెట్టి తమ మక్కువను తీర్చుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలావరకు ఇలా ఉంటే సునంద గారి మనస్తత్వం ఇందుకు భిన్నంగా తోటి మహిళలకు స్ఫూర్తినిచ్చేదిగా ఉంది. ఉన్నత చదువులు చదివి కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి కుటుంబ బాధ్యతల నిమిత్తం ఉద్యోగం మానివేసి కుటుంబ బాధ్యతల నుంచి కొంచెం బయట పడ్డ తరువాత మరలా ఉద్యోగంలో చేరదామనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్న సమయంలో ఆదాయం కంటే ఆరోగ్యం ముఖ్యం అని తెలుసుకుని తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడడం ఒక ఇల్లాలిగా తన బాధ్యత అని గుర్తించి ఉద్యోగ ప్రయత్నాలు మానివేసి, తమ కుటుంబాన్ని నగరాన్నుంచి గ్రామానికి మార్చి వ్యవసాయరంగం అదీను శారీరక శ్రమ ఎక్కువగా ఉండే సేంద్రియ వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టవలసి వచ్చింది. పరిస్థితులకు అనుకూలంగా తన లక్ష్యాన్ని మార్చుకుని ప్రత్యక్ష వ్యవసాయరంగంలోకి దిగిన సునందకు భర్త రవికుమార్‌ కృతజ్ఞతలు తెలియచేశారు. అదేవిధంగా తాను ఉద్యోగం చేస్తూ, అవసరమయితే పంటల సాగు కొరకు తన డబ్బును ఇవ్వడముతో పాటు పంటల సాగు, విలువ జోడింపు మరియు మార్కెటింగ్‌ లాంటి విషయాలలో తన వంతు పాత్ర పోషిస్తున్న భర్త రవికుమార్‌కు సునంద కృతజ్ఞతలు తెలియచేశారు. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ముందుకు సాగుతుంటే ఆరోగ్యకరమయిన, ఆనందకర జీవితం పెద్ద కష్టం కాదు అని సునంద, రవికుమార్‌లు నిరూపిస్తున్నారు.

(గమనిక: సునంద గారు సాగు చేసే పంటలు, పాటించే పద్ధతుల గురించి ‘రైతునేస్తం’ యూట్యూబ్‌ ఛానల్‌లో ఆవిడ మాటల్లోనే వినగలరు.)

Read More

వేసవిలో కోళ్ళ పెంపకం – జాగ్రత్తలు 

వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమగా పేరుగాంచిన కోళ్ల పెంపకం యజమానులకు వేసవిలో సవాలుగా మారింది. చలి, వర్షాకాలంలో అధికంగా కోళ్ల దిగుబడి పెరుగుతూ రైతులకు లాభాల బాటలో ఈ పరిశ్రమ కొనసాగుతుంటుంది. కానీ వేసవి కాలం రాగానే రైతులు భయపడి త్వరగా ఇతర రాష్టాలకు ఎగుమతి చేస్తారు. ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగేకొద్దీ కోళ్లు చనిపోతున్నాయి. వేసవికాలం ఆరంభం మార్చి నుంచి జూన్‌ వరకు కొనసాగే వేడి వాతావరణం కోళ్ల పరిశ్రమను నష్టాలలోకి తీసుకొని పోతుంది. అంతేగాక బ్రాయిలర్‌, లేయర్‌లను ఎగుమతి చేసి ఫారాలను ఖాళీగా ఉంచుతారు. ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడదెబ్బకు గురై 25-90 శాతం వరకు చనిపోతున్నాయి. ఇందుకోసం రైతులు తగు జాగ్రత్తలతో పశుసంవర్థక శాఖ అధికారులతో సంప్రదించి ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే ఆర్థిక నష్టం రాకుండా చేసుకోవచ్చును. 

వేడిమి వల్ల కోళ్లలో వచ్చే లక్షణాలు ఏమిటి?

  •     కోడి శరీరం చలిని తట్టుకునే విధంగా పూర్తిగా ఈకలతో కప్పబడి ఉంటుంది. వాటి శరీరంలో చెమట గ్రంథులు లేకపోవడం వలన ఉష్టోగ్రత 105-107 డిగ్రీల ఫారన్‌ హీట్‌ ఉంటుంది. వాతావరణ ఉష్టోగ్రత 107 డిగ్రీల ఫారన్‌హీట్‌ వరకు కోళ్లకు సదుపాయంగా ఉంటుంది. ఆ పై కోడి యొక్క దేహ రసాయన ప్రక్రియ దెబ్బతింటుంది. 
  •     ముఖ్యంగా వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కోళ్లు ఆయాసపడుతూ తక్కువ మేత తింటూ ఎక్కువ నీళ్లు తాగుతాయి. అలాంటప్పుడు వడబెబ్బకు గురై చనిపోయే ప్రమాదం ఉంటుంది. గుడ్ల ఉత్పత్తి కూడా బాగా పడిపోతుంది. 
  •   వేడిమి వాతావరణము వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గుతుంది మరియు పెరుగుదల ఉండదు. అంతేగాక కోళ్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కోళ్లు ఆయాసపడుతుంటాయి. దీంతో దాణా తక్కువగా తింటాయి.
  •     లేయర్‌ కోళ్లులో కోడిగుడ్డు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. పౌష్టిక మైన దాణా పెట్టిన గుడ్ల సైజు పెరగదు మరికొన్ని అసలు గుడ్లు పెట్టవు.
  •   బ్రాయిలర్‌ కోళ్లు చనిపోతే రైతు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతాడు. వేసవిలో ఈ కోళ్ల ఎదుగుదల ఎక్కువగా ఉండదు. దీని వల్ల మాంసం ఉత్పత్తి తగ్గుతుంది. 
  •   ఎండ వేడికి కోళ్లు, పిల్లలు నీరసంగా కనిపిస్తాయి. నీళ్ల విరేచనాలు అవుతాయి. సరిగ్గా నిలబడలేవు. వణుకుతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించగానే కోళ్ల ఫారం యజమానులు అప్రమత్తమై తగిన మందులు వేయించాలి. 
  •     కోళ్లలో మెడలు వాల్చడం, సన్నగా మూలగడం, కళ్లనుంచి నీరు కారడం వంటి లక్షణాలున్న కోళ్లను వెంటనే ఇతర కోళ్ల నుంచి వేరు చేసి సరైన చికిత్స అందించాలి.
  •   వేసవిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల అనేక వ్యాధులకు గురయ్యే అవకాశాలుంటాయి. అంటు వ్యాధులు కూడా వస్తాయి. దీంతో మందుల కొనుగోలుకు అధికంగా ఖర్చులు పెట్టాల్సి వస్తుంది.
  •     10 అడుగుల ఎత్తులో నిర్మించబడిన షెడ్ల కన్నా ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న వాటిలో ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది.
  •     కొన్ని జాతుల జన్యు సంబంధం మీద కూడా వాటి ప్రాణ నష్టం ఆధారపడి ఉంటుంది.
  •     40 వారాల కన్నా తక్కువ వయస్సు గల కోళ్లలో మరియు కొత్తగా ఈకలు రాల్చిన కోళ్లలో ప్రాణనష్టం ఎక్కువ.

వేసవిలో కోళ్ళ దాణాలో తీసుకోవలసిన జాగ్రత్తలు

  •     ముఖ్యమయిన జాగ్రత్త యేమిటంటే పోషకాలున్న దాణా పెట్టాలి. ఒకేసారి ఎక్కువగా దాన వేయ కూడదు.
  •     వేసవిలో కోళ్లు తక్కువ మేత తింటాయి. ఉష్ణోగ్రతలు పెరిగినకొద్దీ నీరు ఎక్కువగా తాగుతాయి. నీటిని ఎక్కువగా తాగుతుండడంతో దాణా తక్కువగా తీసుకుంటాయి. ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్న సమయంలో దాణా ఇస్తే ప్రయోజనం ఉంటుంది. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో దాణా ఇచ్చినా ప్రయోజనం ఉండదు.
  •     దాణాను కొద్దిగా తడిపి పెట్టడం ఉత్తమం. ఎక్కువ తడిపితే దాణాకు బూజుపట్టే ప్రమాదం ఉంది.
  •     వేసవిలో కోళ్లు పగటిపూట సరిగా తినవు. కాబట్టి ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం నాలుగు గంటల తర్వాత దాణా ఇవ్వాలి. కోళ్లకు నిత్యం ఉదయం నాలుగు గంటలకు 70 శాతం, రాత్రి 9 గంటలకు 30 శాతం దాణాను ఇవ్వాలి. మధ్యాహ్నం వేడిమి సమయంలో ఇవ్వకూడదు.
  •     దాణాలో అవసరమైన మోతాదులో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండేలా చూసుకోవాలి. మాంసకృతులు తగ్గించాలి.
  •     ఒత్తిడికి లోనైన కోళ్లకు సి విటమిన్‌ ఎక్కువ ఇవ్వాలి. ఒక టన్ను దాణాలో వంద గ్రాములు విటమిన్‌-సి, 50 గ్రాములు విటమిన్‌ – ఈ ఉపయోగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగును. అంతే కాకుండా విటమిన్‌-సి వాడడం వల్ల గుడ్డు పొట్టు గట్టిగా ఏర్పడును. విటమిన్‌-ఈ ఫలధీకరణ శాతాన్ని, గుడ్ల ఉత్పత్తిని పెంచును. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలో విటమిన్‌-సి కలిపినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ విటమిన్‌-ఈ మాత్రం ముందు జాగ్రత్తగా ఇవ్వాలి. టీకాలు వేయుటకు రెండు వారాల ముందుగా ఇవ్వడం ఎంతైనా మంచిది. 
  •     మిథియోనిన్‌ అనే అమైనో ఆమ్లం కోళ్ల దాణాలో ఉపయోగించడం వల్ల ఎండ వేడి నుంచి కాపాడి గుడ్డు పొట్టు సాధారణంగా ఏర్పడుటకు సహాయపడును. 
  •   అమ్మోనియం క్లోరైడ్‌, పొటాషియం క్లోరైడ్‌ 0.25 శాతం ఇవ్వడం వల్ల కోళ్లు ఎక్కువగా నీరు తాగును. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గించవచ్చు.

వేసవిలో కోళ్లకు నీరు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

  •     తక్కువ నీరు ఇవ్వడం ఉత్తమం. 
  •     కోళ్లు వేసవిలో ఎక్కువగానే నీళ్లు తాగుతాయి. దాణా, నీటి నిష్పత్తి 1:2 ఉంటుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు 1.4 నిష్పత్తి ఇవ్వాలి. కోళ్లకు వీలైనంత వరకు చల్లని నీటిని ఇవ్వాలి. అందువల్ల షెడ్లలో అదనంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేసి అవసరం మేరకు నీటిని అందించాలి.
  •     కోళ్లు తాగే నీటిలో ఎల్లక్ట్రోలైట్‌లు – విటమిన్స్‌ వంటివి కలిపితే అవి వత్తిడికి గురి కాకుండా చూడాలి.
  •     నీళ్ల ట్యాంకులు చల్లదనంగా ఉండేలా చూసుకోవాలి. నీటి ట్యాంకుల మీద గోనే సంచులు కప్పి వాటిని ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలి. దీనివల్ల ట్యాంకుల్లోని నీరు వేడెక్కదు. లేదంటే 2000 లీటర్ల నీళ్ల ట్యాంక్‌లో 20 కేజీల మంచు గడ్డలు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల సమయం లో వేసి ఉంచడం వలన నీటి ఉష్ణోగ్రతను 22 నుంచి 24 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు తగ్గించుకోవచ్చు.
  •     నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు నియంత్రించాలంటే శుభ్రమైన నీటిని ఇవ్వాలి.
  •   ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కోళ్లపైన నేరుగా నీటిని పిచికారి చేయవచ్చు.

వేసవిలో కోళ్లకు షెడ్ల నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

  •     సూర్యరశ్మి తగలకుండా ఉండాలంటే కోళ్ల షెడ్లను తూర్పు, పడమరగా నిర్మించాలి. వెడల్పు 30 అడుగులకు మించకుండా ఉండాలి. 
  •     వేసవికాలంలో కోళ్ల షెడ్డు పైన గడ్డి, స్పింక్లర్స్‌ అమర్చి అరగంటకు ఒకసారి షెడ్డుపైన నీళ్లు చల్లాలి. దీంతో షెడ్డులోపల చల్లదనం చేకూరుతుంది. కోళ్లు మృత్యువాతనుంచి తప్పించుకోవచ్చు. షెడ్డుకు గాలి వచ్చే దిశలో పలుచని గోనె సంచులు లేదా గ్రీన్‌ నెట్‌ లాంటివి కట్టాలి. వాటిపై పది నుంచి పదిహేను సార్లు నీళ్ళు చల్లాలి. ఇలా చేయడం వల్ల వడగాల్పులు నేరుగా షెడ్డులోకి వెళ్ళకుండా ఉంటుంది. తడిచిన గ్రీన్‌ నెట్‌ వల్ల షెడ్డులోకి చల్లని గాలి వీస్తుంది. షెడ్డు లోపలి భాగంలో ఫాగర్స్‌ అమర్చి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అరగంటకోసారి నీళ్లు వదిలినచో కోళ్లపై తుంపరగా పడటం వల్ల కోడికి చల్లదనం ఇస్తుంది.
  •     కోళ్ల ఫారాలు ఇరుకుగా ఉండకూడదు.షెడ్డులో ఎప్పుడు తేమ లేకుండా పొడిగా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లిట్టర్‌ ఎత్తును తగ్గించి షెడ్డులో దుమ్ము దూళీ లేకుండా చూసుకోవాలి.
  •     ఉష్ణోగ్రత తగ్గించేందుకు షెడ్డు పైన గడ్డిని దట్టంగా వేసిదానిపై అప్పుడప్పుడూ నీళ్లు చల్లుతుండాలి. దీంతో షెడ్డులోపల ఉష్ణోగ్రత తగ్గుతుంది. షెడ్డు కప్పుపై తెల్లని రంగు వేసి కూడ కొంత వరకు ఉష్ణోగ్రతను తగ్గించవచ్చును.
  •     షెడ్డు చుట్టూ పది అడుగుల దూరంలో నీడనిచ్చే చెట్లు పెంచాలి.
  •     షెడ్లలో కోళ్లను డీప్‌ లిట్టర్‌ పద్దతిలో లేదా కేజెస్‌లో నిర్దేశించిన సంఖ్యలోనే ఉండాలి. కేజెస్‌లో పెద్దకోడికి 0.75 వరకు చదరపు అడుగులు, డీప్‌ లిట్టర్‌ అయితే రెండు చదరపు అడుగుల స్థలంలో ఉంచాలి.

వేసవిలో కోళ్లకు ఆరోగ్య విషయములో తీసుకోవలసిన జాగ్రత్తలు

  •   వాతావరణం చల్లగా ఉన్నప్పడే కోళ్ల ముక్కులు కత్తిరించిడం, టీకాలు వేయించడం, నట్టల నివారణ మందులు ఇవ్వడం వంటి పనులను పూర్తి చేయాలి. కోళ్ల వయస్సు ఎండ తీవ్రతను బట్టి దాణాలో ఆమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, మోతాదును పెంచాలి.
  •     ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల సమయంలో కోళ్లను పట్టుకోవడం, కలత చెందించడం వంటివి చేయకూడదు. వేసవిలో ఉదయం పూట మాత్రమే టీకాలు వేయాలి.
  •   ఒకవేళ వేడిమికి ప్రాణనష్టం జరుగు తూ ఉంటే పది నుంచి 20 గ్రాముల దాణా తగ్గించాలి. దాణా మీద బూజు పట్టకుండా కొంచెం నీటిని చిలకరించాలి.
  •  వేసవిలో ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ వేడిగాలులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఎక్కువగా వ్యాధుల భారీన పడతాయి. కొక్కర, మారెక్స్‌, ఆర్‌డి, బర్డ్‌ప్లూ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఎండాకాలంలో వచ్చే వ్యాధుల నివారణకు ముందుగానే టీకాలు వేయించాలి.
  •     మృత్యువాతకు గురైన కోళ్లను ఎక్కడ పడితే అక్కడ వేయరాదు. మృత్యువాత పడ్డ కోళ్లను 7 లేదా 8 ఫీట్ల గుంత తవ్వి పూడ్చాలి. ఇలా చేయడం ద్వారా ఒక ఫామ్‌ నుంచి మరొక ఫామ్‌కు ఈ వ్యాధులు వ్యాపించవు. 

ఇలా వేసవిలో కోళ్ల పెంపకం దారులు అప్రమత్తంగా ఉంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కోళ్ల పెంపకాన్ని లాభసాటిగా చేయవచ్చు.     

డాక్టర్‌. జి. రాంబాబు, పశువైద్యాధికారి, కడప. ఫోన్‌: 96184 99184

Read More

మే నెలలో సేద్యపు పనులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ నెలలో విపరీతమైన ఎండలు, వడగాడ్పులు, అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు. మే నెలలో కూడా అధిక ఎండలు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు కొనసాగే అవకాశం. మార్కెట్లలో, కళ్లాలలో కొన్ని చోట్ల తడిచి ముద్దవుతున్న ధాన్యం. మామిడి మొదలయిన పండ్ల తోటలు, కూరగాయల పంటలకు అక్కడక్కడ గాలులతో కూడిన వర్షాలతో నస్టాలు. దీనికి తోడు మే 13న జరిగే ఎన్నికల కొరకు అభ్యర్థుల ప్రచార హోరు. ఈ నేపథ్యంలో మే (భరణి, కృత్తిక, రోహిణి మొదటి భాగం)లో వివిధ పంటలలో చేయవలసిన కార్యక్రమాలు, చేతికొచ్చిన పంటలను అమ్ముకునేటప్పుడు మెళకువలు, ఇందులో రైతు ప్రజా సంఘాల పాత్ర మొదలయిన విషయాల గురించి…

వరి: యాసంగి/రబీ పంట మే మాసంలో మార్కెట్‌కు ఎక్కువగా వస్తుంది. వెంటవెంటనే మార్కెట్లలో కళ్ళాల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా అకాల వర్షాలకు తడిసి ముద్దవకుండా అమ్ముడుబోయే ఏర్పాట్లు జరగాలి. ప్రకటించిన ధరల డబ్బులు రైతులకు వెంటవెంటనే అందేటట్లు ఏర్పాట్లు జరగాలి. రైతు ప్రజా సంఘాలు ఈ విషయంలో రైతులకు బాగా సహాయపడే అవకాశముంది. ఎలక్షన్‌ జరుగుతున్న నెల కాబట్టి, రైతుల అభివృద్ధికి ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తులకు, పార్టీలకు ఓటు వేయండి. నిజంగా మేలు చేసేదెవరు, ఒట్టి మాటలతో కాలం వెల్లదీసే వారెవరనే విషయాలను రైతు ప్రజా సంఘాల నెలవారీ సమావేశంలో విశదంగా చర్చించండి. నిర్ణయాత్మక తీర్మానాలను ఆచరణలో ఓటు ద్వారా చేసి చూపించండి. వడ్లుగా కాకుండా బియ్యం చేసి అమ్మడం లాభదాయకం. రాబోయే ఖరీఫ్‌ పంటకు నార్లు పోయడం ఈ నెల కడవారంలో రోహిణి కార్తె (25.5.24 నుండి 7.6.24 వరకు)లో మొదలవుతుంది. ఈ సమయంలో నీరున్న వాళ్ళు నార్లు పోసుకుని, లేత నారు నాటితే చీడపీడలు తక్కువగా ఆశించి, దిగుబడి బాగా ఎక్కువగా వస్తుంది. వీలయినంత త్వరగా మంచి ధరవచ్చే నాణ్యమైన విత్తనాలను ముందే సేకరించి పెట్టుకోండి. నాటే సమయంలో కూడా నీరు పుష్కలంగా ఉండాలి. నీటిలభ్యత నమ్మకం లేనిచోట, నారుపోయడం నిదానించి, తర్వాత నీటి లభ్యత మెరుగైనాక నారుపోసి, నాటుకోవడం మేలు. ముదురునారు నాటితే దిగుబడి తగ్గుతుంది. రకాల ఎంపికలో, బాగా పండి, మంచి ధర పలికే తెలిసిన రకాలను ఎంపిక చేసుకోండి. కొత్త రకాలను, కొద్దిపాటి భూమిలో పరీక్షించి, అవి బాగా పండి, మంచి ధరవ స్తే తర్వాతి పంటలలో, వీటి విస్తీర్ణాన్ని పెంచవచ్చు. ఈ సంవత్సరం వరికి బోనస్‌ లేనట్లే. వచ్చే ఖరీఫ్‌ పంటకిస్తామని తెలంగాణలో ప్రకటించినారు. మిగతా రాష్ట్రాల్లో కూడా అలా ప్రకటిస్తే రైతుకు లాభం.

ప్రత్తి: ప్రత్తి ధరలు రూ. 7000-రూ. 7500 మధ్య నడుస్తున్నాయి, రూ. 8000 వరకు రావచ్చు. ముంగారి పత్తిని రోహిణి కార్తెలో మే కడవారంలో, మంచి వర్షం వచ్చినాక లేక నీటితడులిచ్చి విత్తుతారు. రోహిణిలో విత్తిన పత్తిలో చీడపీడల బెడద ముఖ్యంగా గులాబిరంగు పురుగు ఉధృతి తక్కువ. ప్రత్తిని అధిక సాంద్రత విధానంలో 80þ20 సెం.మీ. (ఎకరాకు 25,000 మొక్కలుండేటట్లు) విత్తుకోవచ్చు. వర్షాధారంలోనూ, నీటి తడులిచ్చి కూడా అధిక సాంద్రతలో పండించవచ్చు. ఈ విధానంలో పంట త్వరగా పూర్తవుతుంది. తర్వాత పంటగా నువ్వులు, శనగ, వేరశనగ, పెసర, మినుము సాగు చేయవచ్చు. నీటి ఆధారమున్నచోట దిగుబడి బాగా ఎక్కువ ఉంటుంది. అధిక సాంద్రతలో విత్తనానికి అనువైనరకం: ఎల్‌.హెచ్‌.డి.పి.ప్రత్తి-5: ఇది సూటి రకం. శాఖీయ కొమ్మలు లేకుండా ఉంటుంది. జిన్నింగ్‌ శాతం 37.6. పింజ పొడవు 27.5 మి.మీ. పంటకాలం 140-150 రోజులు. దిగుబడి: 10-11 క్వి/ఎ. పచ్చదోమ, బాక్టీరియా ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. ప్రత్తి కొత్త రకాలు: ఎన్‌.డి.ఎల్‌.హెచ్‌.2056-4, ఎన్‌డి.ఎల్‌.హెచ్‌.3104-4 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక మరియు తమిళనాడులో సాగుకు అనుకూలమైనవి. అధిక దిగుబడి, పురుగులు, రోగాలను తట్టుకుంటాయి. 160 రోజుల పంట. 

మొక్కజొన్న: పురుగులు రోగాలు తక్కువగా ఉండి అత్యధిక దిగుబడులు సాధించడానికి మే చివరి వారం నుండి జూన్‌ మొదటి వారం వరకు విత్తాలి. భూమిలో సరిపడినంత తేమ లేకపోతే, తడి ఇచ్చి విత్తాల్సుంటుంది. తేమ తక్కువ కాకుండా నీటి తడులను ఇవ్వగలిగితే అత్యధిక దిగుబడులు సాధ్యమవుతాయి. పలు ప్రైవేట్‌ హైబ్రిడ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి 40-50 క్వి/ఎ. గింజ దిగుబడినివ్వగల సామర్థ్యముంది.

అల్లం: మే నెలలోపల విత్తడం పూర్తి చేయవలసిన పంట. తెలంగాణకు అనుకూలమైన రకాలు. మారన్‌, రియోడిజెనెరో, హిమాచల్‌ మొ||. ఆంధ్రప్రదేశ్‌కు అనువైన రకాలు: రియెడిజెనెరో, మారన్‌, నడియా మొ|| నిదానంగా విత్తితే దుంపకుళ్ళు ఎక్కువ. దిగుబడి తక్కువ.

పసుపు: స్వల్పకాలిక రకాలు (6-7 నెలల్లో త్రవ్వకానికి వచ్చే రకాలు) ఆంధ్రప్రదేశ్‌లో మే రెండవ పక్షంలో నాటడానికి అనుకూలం. తెలంగాణాలో జూన్‌ మొదటి పక్షంలో నాటడానికి కనుకూలం. మంచి రకాలు: సృజన్‌, సుదర్శన్‌, ప్రగతి, ప్రతిభ మొ||.

నువ్వులు: అధిక దిగుబడులకొరకు నువ్వు పంటను కోస్థా ఆంధ్రలో మే 15 నుండి 31 వరకు, రాయలసీమలో మే-జూన్‌ నెలల్లో, తెలంగాణాలో మే మొదటి పక్షంలో విత్తుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత అధిక దిగుబడినిస్తున్న రకం: జగిత్యాలతిల్‌-1 (జె.సి.ఎస్‌-1020): 90-125 రోజుల పంట. దిగుబడి: 5-8 క్వి/ఎ. ఖరీఫ్‌, రబీ, వేసవి కాలాల్లో సాగుకు అనుకూలం. విత్తనోత్పత్తి చేపట్టి మంచి ధరలకు అమ్ముకోవచ్చు.

కొత్తిమీర: ఎండాకాలంలో పాక్షిక నీడలో కొద్ది నీళ్లతో, అత్యధిక ఆదాయాన్నివ్వగల్గిన పంట. ఎకరాకు లక్షకుపై మాటే. పంట జాగ్రత్తగా పెట్టాలి. కొత్తిమీరకనుకవైన రకాలు: సురుచి: తొలికోత విత్తిన 35-55 రోజులకు. హరితగృహాలలో బాగా ఎదుగుతుంది. దిగుబడి 1.0-1.8 ట/ఎ. యాసంగి/రబీ దిగుబడి 6.0-7.2 ట/ఎ. ఎ.జి.సి.ఆర్‌-1: వేసవిలో 50% నీడనిచ్చే షేడ్‌నెట్‌ క్రింద దిగుబడి బయట పొలం కంటే  3 నుండి 4 రెట్లు అధికం. అర్కఇషా: ఎక్కువ సార్లు కోతకొస్తుంది (మల్టీకట్‌). విశాలమైన ఆకులు, గుబురు మొక్కలు,  మంచి వాసన, ఎక్కువ రోజుల వరకు తాజాగా ఉంటుంది. చల్లగా ఉంచితే 21 రోజులు నిల్వ చేయవచ్చు. ఆకు దిగుబడి 4.0-4.8 ట/ఎ. (3 కోతల్లో, 70 రోజుల్లో) ఆకులో విటమిన్‌ సి: 167 మి.గ్రా./100 గ్రా. ఆకుకు. పెరటితోటల్లో కూడా కొత్తిమీరను ఆరోగ్యం కొరకు పండించవచ్చు.

పొదీనా: ఎండాకాలంలో ఇంకొక మంచి ఆదాయ పంట పొదీనా. దీనిని వేర్ల ద్వారా, కాండపు ముక్కల ద్వారా ప్రవర్థనం చేయవచ్చు. ఎకరాకు 3-4 క్వింటాళ్ళ తీగ ముక్కలు కావాలి. మన దేశంలో జపాన్‌ పొదీనాకు ఎక్కువ ప్రాచుర్యం ఉది. మంచి రకాలు: కోసి, సక్షమ్‌, హిమాలయ, శిలిక్‌. ఆకుకూరగాను, తైలం ఉత్పత్తికి ఉపయోగం. నాటిన 120 రోజుల నుండి కోత ప్రారంభవుతుంది. దిగుబడి: 15-20 ట/ఎ. పెరటి తోటల్లో కూడా పండించవచ్చు. ఆరోగ్యదాయకం.

ఆకుకూరలు: పెరటితోటల్లోనూ, మిద్దెతోటల్లోనూ, కొద్దిగా నీళ్ళు, కొద్దిగా భూమి ఉన్న సాధారణ పొలాల్లోనూ ఆకుకూరలను, ఉత్పత్తి చేయవచ్చు. పాలకూర, తోటకూర, ఎర్రతోటకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర, పొన్నగంటి కూర, సొయకూర, కొయ్యగూర మొదలయినవి. మునగాకు కూడా ఆకుకూరగా ప్రాచుర్యంలో కొస్తున్నది. ఆరోగ్యంతో పాటు అగ్గువకే ఆకుకూరలు ఎండాకాలంలో దొరుకుతున్నందున కొనడం ఎక్కువయింది. 

పూలు: ఈ నెలలో నారుపోయదగిన పూలు – కనకాంబరం. మే-జూన్‌ నెలల్లో నారుపోసుకుని, ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో నాటుకోవాలి. నాటిన తర్వాత 2 సం|| వరకు లాభదాయకంగా పూత తీసుకోవచ్చు. 2 సంవత్సరాలలో పూత దిగుబడి 1500-2000 కిలోలు. పూలకాడల్లో పూలు తెంపడం అయిపోయాక, పూల గుత్తులను, ఎండిన కొమ్మలను తీసి వేస్తూ ఉంటే సంవత్సరం పొడవునా పూలను పొందవచ్చు. వర్షాకాలంలో దిగుబడి తక్కువగా ఉంటుంది.

టమాట: ఎండలు, వడగాల్పులు మే మొదటి వారం వరకు విపరీతంగా ఉన్నాయి. అక్కడక్కడ వడగండ్ల వానలు, అకాల వర్షాలు పడి, పంట దెబ్బతిన్నది. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. దిగుబడి తగ్గితే ధరలు పెరగవచ్చు. జూన్‌-జూలైలో ఎక్కువ ధరలుండే సూచనలు కనబడుతున్నాయి. తర్వాతి ధరలు జూన్‌-జూలైల్లో కురిసే వర్షాల మీద ఆధారపడతాయి.

కీరదోస, బెంగుళూరు మిర్చి: సాలాడ్‌గా ఉపయోగం, చైనీస్‌ ఫుడ్‌లలో బాగా వాడటం వలన వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. పాలీహౌస్‌లలో, నెట్‌హౌస్‌లలో, షేడ్‌నెట్‌లలో వీటిని పెంచడం బాగా పెరుగుతున్నది.

కందగడ్డ: ఖరీఫ్‌ పంటను ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు, మేలో కూడా నాటితే నవంబరు నుండి జనవరి వరకు త్రవ్వకానికి తయారవుతుంది. మంచిరకాలు: గజేంద్ర: 6-8 నెలల పంట. దిగుబడి 26-28 ట/ఎ. శ్రీత్రిపుర: 9-10 నెలల పంట. దిగుబడి: 14 ట/ఎ.

మామిడి: తయారైన కాయలను మందులు వేయకుండా చెట్ల క్రింద వరి లేక బోద గడ్డిలో మాగబెట్టితే ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు. ఆ విధంగా బోర్డు పెట్టుకోవాల్సుటుంది. ఈ పండ్లు పుల్లగా ఉండకుండా, తియ్యగా, కమ్మగా ఉంటాయి.

ఫ్రెంచ్‌బీన్స్‌: ఎండాకాలంలో పంట సరిగా ఎదగదు. పాక్షిక నీడ ఉండాలి. కొండ ప్రాంతాల్లో చల్లగా ఉన్న ప్రాంతాల్లో ఎదుగుతుంది. వెజ్‌బిరియానీలో వాడకం ఎక్కువ. మంచిరేటొస్తుంది. పాక్షిక నీడ ఉన్న తోట పంటలలో, సాగుచేసి మంచి ఆదాయం పొందే వీలుంది. అనుకూలమైన రకాలు: అర్కకోమల్‌: 70 రోజులకు కాయకోత కొస్తుంది. కాయ దిగుబడి 4.0-4.8 ట/ఎ. కాయనాణ్యత చాలా బాగుంటుంది. రవాణాను తట్టుకుంటుంది. పంత్‌ అనుపమ: 55-65 రోజుల్లో మొదటికోత. గింజ త్వరగా పట్టదు. కాయలు ఆకుపచ్చగా ఉంటాయి. ఆకుమచ్చ తెగులును కొద్దిగా తట్టుకుంటుంది. వెర్రి తెగులును కూడా తట్టుకుంటుంది. కాయదిగుబడి 3-6 ట/ఎ.

జొన్న: జొన్న పంటను ఇదివరకు తెలంగాణ ప్రభుత్వము ఎకరాకు 8-8.5 క్వింటాళ్లు మాత్రం మద్దతు ధరకు (రూ.3180/క్వి) కొంటామనేవారు. ఇప్పుడు ఎకరాకు 12 క్వింటాళ్ళ దాకా కొంటామంటున్నారు. 

చింతచిగురు: చింతచిగురు చిల్లరగా హైదరాబాదులో 100 గ్రా. రూ. 80 నుండి 100 దాకా అమ్ముతున్నారు. 

అకాల వర్షాల్లో నష్టపోయిన పంటలు: వరి, మొక్కజొన్న, జొన్న, నువ్వులు, మామిడి, బొప్పాయి.

ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు: టన్ను ధర కనీసం 550 డాలర్లు (సుమారు రూ. 46000) గా ఉంటే ఎగుమతులకు అంగీకరిస్తారు. ఎగుమతి సుంకం 40% ఉంటుంది. మొత్తం 770 డాలర్లు (సుమారు రూ. 64000) రైతులకు ఎంతవరకు ఉపయోగమో గమనించాలి.

9 లోగా సంపూర్ణంగా రైతు భరోసా: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అందరి ఖాతాల్లోకి మే 9వ తేదీలోగా జమచేస్తామంటున్నారు. మంచి పని.

మనసుండాలి-ధైర్యముండాలి-మార్గమదే సాధ్యం: ప్రతి సంవత్సరం ఎండలు, వానలు, గాలులు, వడగండ్లు, కడగండ్లు, రైతుల మొరల ఆలకింపే లేదు. 75 ఏండ్లయింది స్వతంత్రమొచ్చి. మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం మొలకలు వస్తూనే ఉన్నాయి. టెక్నాలజీలు అభివృద్ధి చెందుతున్నాయి. ఆ ఊర్లో పంటలు నా ఊర్లోనే, ఏ రైతు పంటలనారైతు పొలం దగ్గరే కొంటే అతనికెన్ని బాధలు తప్పుతాయి. ప్రభుత్వాల విధానాలలో మార్పులు తేవాల్సిన అవసరముంది. రైతులను వ్యాపారులు మోసగించకుండా కాపాడడానికి ప్రతి జనావాసం/కుగ్రామం/గ్రామం/పెద్ద ఊర్లలో రైతు ప్రజాసంఘాలను సులభంగా ప్రోత్సహించవచ్చు. అవి రైతులకు అన్ని విధాలా అండగా ఉండేటట్లు తీర్చిదిద్దవచ్చు. ఇప్పటికే ఉన్న వ్యవసాయ, తదనుబంధ శాఖల అధికారులను ఉపయోగించి వీటిని ఏర్పాటు చేయవచ్చు. పండిన సరుకును వీడియోకాన్ఫరెన్స్‌ల ద్వారా అమ్మే విధానం సులభతరం చేయవచ్చు. మార్కెట్లకే వెళ్లాలి. అక్కడ దళారీలకు కొంత మేపాలనేది మార్చాలి. ఇండ్ల దగ్గరే మంచి రేటుకు బాధలు లేకుండా అమ్ముకునేందుకు యంత్రాంగం సహకరించే విధంగా మార్పులు జరగాలి. బాధలు తగ్గాలి. పనితనం పెరగాలి. రైతుల జీవితాలు గాలిలో పెట్టిన దీపాలు గాకుండా కాపాడాలి. అందుకు గొప్ప మనసుతో, పట్టుదలతో ప్రభుత్వాలు సహకారమందించాలి. మార్పుతప్పకుండా వస్తుంది.

Read More

కొబ్బరి / వక్క తోటలలో ప్రత్యామ్నాయ పంటగా జాజికాయ

జాజికాయ (మిరిస్టికా ఫ్రాగ్రెన్స్‌) అనే శాస్త్రీయ నామంతో పిలవబడే ఈ మొక్క ఇండోనేసియాలోని మొలక్కాస్‌ దీవులు దీని పుట్టినిల్లు. దీనిని సాధారణంగా ఇండోనేసియా మరియు గ్రెనెడౌ వంటి దేశాలలో విరివిగా సాగు చేస్తున్నారు. దీనిని మన దేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు తమిళనాడులోని కర్టల్లామ్‌లో స్వాతంత్య్రానికి పూర్వం తెచ్చి వారి సుగంధద్రవ్య పంటల తోటలో నాటారు. తద్వారా మన దేశంలో ప్రాచుర్యంలోకి ఈ పంట వచ్చింది. మన దేశంలో దీని సాగు వాణిజ్య సరళిలో కేరళలోని త్రిశూర్‌, ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాలలో, తమిళనాడులోని కన్యాకుమారి మరియు తిరునల్వేలి జిల్లాల్లో, మహారాష్ట్రలోని దపోలి, వెంగుర్లా ప్రాంతాలలో సాంప్రదాయబద్ధంగా సాగు చేస్తూ వస్తున్నారు. కానీ దీని సాగుకు మన తెలుగు రాష్ట్రాలలో కోస్తా ప్రాంతాలు కొబ్బరి మరియు వక్క తోటలలో అంతర పంటగా/ప్రత్యామ్నాయ పంటగా దీని సాగు చేయడం ద్వారా లాభసాటి సేద్యం సాధ్యమవుతుంది. ఈ మొక్క రెండు రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలను ఇస్తుంది. జాజికాయ మరియు జాపత్రి రెండూ కూడా ఈ మధ్యకాలంలో అన్ని రకాల వంటలలో అతి ముఖ్యమైన స్థానం సంపాదించుకొంది. దీని సాగు చేయడం ద్వారా వీటి గిరాకీని అందిపుచ్చుకోవడమే కాకుండా లాభాలను పొందవచ్చు.

అవసరమైన వాతావరణం మరియు నేలలు

గాలిలో తేమ అధికంగా ఉండే ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. వర్షపాతం సంవత్సరం పొడవునా 1500 మిల్లీ మీటర్లు అంతకన్నా ఎక్కువ పొందే ప్రాంతాలలో సాగు చేపట్టవచ్చు. సముద్ర మట్టం నుంచి 1300 మీ. ఎత్తైన ప్రాంతాలలో కూడా సాగుచేపట్టవచ్చు. ఉష్ణోగ్రతలు 25-35 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు అనుకూలం. పొడి వాతావరణం ఉండే ప్రాంతాలలో సాగు చేపట్టరాదు. సారవంతమైన ఒండ్రునేలలు, ఎర్ర గరప నేలలు మరియు ఇసుక గరప నేలలలో సాగు చేపట్టవచ్చు. నీరు నిల్వ ఉండే మరియు మురుగు సౌకర్యం సరిగాలేని నేలలలో సాగు చేపట్టరాదు.

అందుబాటులో ఉన్న మేలైన రకాలు: కొంకణ్‌ సుగంధ, కొంకణ్‌ స్వాద్‌, కొంకణ్‌ శ్రీమంతీ, IISR కేరళీ, IISR విశ్వశ్రీ.

నాటడం మరియు నాటుకునే సమయం

సాధారణంగా విత్తనం ద్వారా ప్రవర్ధనం చేసిన వాటిని నాటుకోవడానికి వినియోగిస్తారు. కానీ ఈ పంట యొక్క పుష్పాలు (ఆడ మరియు మగ పుష్పాలు) ఒక మొక్కపైన కాకుండా వేరు వేరు మొక్కల పైన వస్తాయి. కావున విత్తనం ద్వారా ప్రవర్ధనం చేసినట్లు అయితే నాటిన మొక్కలలో 50 శాతం మగ మరియు 50 శాతం ఆడ మొక్కగా మారడానికి ఆస్కారం ఉంది. మనం విత్తనం ద్వారా పెంచిన మొక్కలను నాటినచో సరైన నిష్పత్తిలో ఆడ మరియు మగ మొక్కలు ఉండకపోవడం మూలాన లాభసాటి సాగు సాధ్యమవదు. దీనిని నివారించడానికి మనం కొమ్మ అంట్లు లేదా మొగ్గ అంట్లు చేసిన మొక్కలను ప్రతి 20 ఆడ మొక్కలకు, ఒక మగ మొక్కను నాటటడం ద్వారా పంటను లాభసాటిగా మరియు మంచి దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంది. 12-18 నెలల వయస్సు గల మొక్కలను వరుసల మధ్య ఎనిమిది మీటర్లు మరియు మొక్కల మధ్య ఎనిమిది మీటర్లు ఉండేలా చూసుకొని కొబ్బరి మొక్కల మధ్యలో నాటుకోవాలి. అదే వక్క తోటలలో ప్రతి మూడు వరుసల తర్వాత ఒక జాజికాయ పంటను ఏక పంటగా నాటుకోవాలంటే ఈ మొక్కలకు నీడ అవసరం అందుకు అనుగుణంగా నీడనిచ్చే మొక్కలుగా మోదుగ, సిల్వర్‌ ఓక్‌ లేదా గ్లైరిసీడియా 5-6 నెలలు ముందుగా నాటుకోవాలి. వర్షాలు ఆరంభమైనప్పుడు లేదా వర్షాకాలం ముగుస్తున్న సమయంలో నీటి వసతి గల ప్రాంతాలలో నాటుకోవడం అనుకూలం. దీని కోసం 60 సెం.మీ. వెడల్పు, 60 సెం.మీ. పొడవు, లోతు గల గుంతల్లో పశువుల ఎరువు, కంపోస్ట్‌ కలిపి నాటుకోవాలి.

ఎరువుల యాజమాన్యం

మంచి ఎదుగుదల మరియు రాబడి కోసం సమగ్ర ఎరువుల యాజమాన్యం అత్యంత కీలకం. సేంద్రియ ఎరువులు పది కిలోలు ప్రతి మొక్కకు వేసుకోవాలి. ఎదిగిన 15 సంవత్సరముల వయస్సు కలిగిన మొక్కలకు గరిష్టంగా 50 కిలోలు వేసుకోవాలి. 20 గ్రా. నత్రజని, 18 గ్రా. భాస్వరం, 50 గ్రా. పొటాషియం ప్రతి మొక్కకు మొదటి సం||లో అందించాలి. ఎదిగిన లేదా 15 సం|| వయస్సు మొక్కలకు 500 గ్రా. నత్రజని, 250 గ్రా. భాస్వరం, 1000 గ్రా. పొటాషియం ప్రతి సం|| ప్రతి మొక్కకు అందించాలి. ఎరువులను 2 దఫాలుగా మొదట మే-జూన్‌ మరియు రెండవసారి సెప్టెంబర్‌-అక్టోబర్‌ మాసంలో సేంద్రియ ఎరువులతో పాటు వేసుకోవాలి. మొక్క వేర్లు తక్కువ లోతులలో ఉండటం వలన ఎరువులను మొక్క కాండం నుంచి 1-5 మీటర్ల దూరంలో మాత్రమే వేసుకోవాలి. పొలంలో కలుపు లేకుండా నివారించుకోవాలి. దీనికోసం అంతరకృషి క్రమం తప్పకుండా చేసుకోవాలి. అందించే ఎరువులను సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. 

కోత మరియు కోతానంతర చర్యలు

విత్తనం ద్వారా వృద్ధి చేసిన మొక్కలు నాటిన 7-8 సంవత్సరాల తర్వాత మరియు కొమ్మంట్లు లేదా మొగ్గంట్లు నాటిన తోటలలో 4-5 సంవత్సరాల తర్వాత పూత మరియు కాత మొదలవుతుంది. 15-20 సంవత్సరాల వయస్సుగల తోటలు స్థిరమైన దిగుబడులను అందిస్తాయి. మొక్కలు సంవత్సరానికి 6 సార్లు కొత్త చిగుర్లు తొడగటం గమనించవచ్చు. అందులో మే-జూన్‌ మరియు సెప్టెంబర్‌ మాసంలో వీటి తీవ్రత గణనీయంగా అధికంగా ఉంటుంది. ఇందులో మగ జాతి మొక్కలు సంవత్సరం పొడవునా పుష్పిస్తాయి. కానీ ఆడ జాతి మొక్కలు సంవత్సరంలో 7 మాసాల కాలం పాటు మాత్రమే పుష్పిస్తాయి. అత్యధికమైన మగ మరియు ఆడ పుష్పాలను మొక్కలపై జూలై మరియు అక్టోబర్‌ మాసంలో గమనించవచ్చు. కీటకాలు మరియు గాలి ద్వారా పరాగ రేణువుల రవాణా జరిగి ఫలదీకరణం జరిగి కాయ ఏర్పడుతుంది. కోతకు వచ్చిన కాయలలో పగుళ్లు ఏర్పడి లోపల ఉన్నటువంటి జాపత్రి, రకాన్ని బట్టి ముదరు ఎరుపు/ఊదారంగు/పసుపు వర్ణంలో కన్పించిన వెంటనే కోసుకోవాలి. కోసిన వెంటనే జాజికాయ మరియు జాపత్రిని వేరు చేసి జాపత్రిని 10-15 రోజుల పాటు ఎండనివ్వాలి. ఎండిన జాపత్రి పెలుసుగా మరియు ఎరుపు లేదా తేలిన పసుపు వర్ణంలోకి మారుతుంది. జాజికాయ 4-8 వారాల పాటు ఎండలో లేదా కృత్రిమ పద్ధతుల ద్వారా ఓవెన్‌ డ్రైయర్‌ ఉపయోగించి లోపల విత్తనం శబ్దం చేసే వరకు ఎండనివ్వాలి. తర్వాత కాయలను పగలకొట్టి విత్తనం తీసి మార్కెట్టుకు తరలించాలి. ఇందులో జాజికాయ మరియు జాపత్రి మాత్రమే కాకుండా కాయలో ఉండే గుజ్జు లేదా తోలును ఊరగాయలు, జామ్‌ మరియు జెల్లీ తయారీలో వినియోగించవచ్చు.

దిగుబడి

ప్రతి కాయ సగటున 60 గ్రా. బరువు. అందులో విత్తనం 6-7 గ్రా. జాపత్రి 3-4 గ్రా. మిగిలినది గుజ్జు ఉంటుంది. పూర్తిగా వృద్ధి చెందిన మొక్క నుండి సగటున 2000-3000 కాయలను ప్రతి సంవత్సరం కాస్తుంది. సంవత్సరానికి 65% ఆడ జాతి మొక్కలను కలిగిన తోటల నుండి 800 కిలోల జాజికాయ మరియు 100 కిలోల జాపత్రి, ప్రతి హెక్టారుకు దిగుబడిని పొందవచ్చు. కొమ్మంట్లు లేదా మొగ్గంట్లు నాటిన తోటలలో మరింత అధిక దిగుబడిని తొందరగానే పొందవచ్చును.

సస్యరక్షణ చర్యలు

సాధారణంగా ఎండు తెగులు మరియు వడలు తెగులుతో పాటుగా కాయ కుళ్ళు గమనించవచ్చు. ఎండు తెగులు ఆశించిన మొక్కలలో ఎదిగిన మరియు ఎదుగుతున్న కొమ్మలలో చిగుర్లు నుండి కొమ్మలు ఎండిపోవడం గమనించవచ్చు. ఆశించిన కొమ్మలను కత్తిరించి, కత్తిరించిన చోట బోర్డియక్స్‌ పేస్ట్‌ పూసినచో నివారించవచ్చు. వడలు తెగులు ఆశించిన కొమ్మలు మరియు ఆకులలో వడలు లక్షణాలు గమనించినచో 1% బోర్డో మిశ్రమం పిచికారి చేయాలి. కాయకుళ్ళు ఆశించిన చెట్లలో కాయ పగుళ్లు మరియు జాపత్రి కుళ్ళడం గమనించవచ్చు. 1% బోర్డో మిశ్రమం పిచికారీ చేసి నివారించవచ్చు. 

డా. సిలారు రఘువీర్‌, అక్కుర్తి నీరజ, గండికోట బ్రాహ్మణి,

డా. చంద్రమోహన్‌ రెడ్డి, ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట,

డా. వైయస్‌ఆర్‌. ఉద్యాన విశ్వవిద్యాలయం.

Read More

కథ… ఏనుగమ్మ ఏనుగు…

శెలవు దినం కావడంతో అయిదో తరగతి చదివే టిట్టు సైకిల్‌ తీసుకుని సరదాగా రోడ్డు మీదికి వెళ్ళాడు. కొత్త సైకిల్‌ కావడంతో ఉత్సాహంగాను, సంతోషంగానూ ఉంది.  రోడ్డు పక్కనున్న  పచ్చటి తైలం చెట్లు చూస్తూ ఊరికి చాలా దూరం వెళ్ళిపోయాడు. ‘ఎలాగూ ఊరి బయటికి వచ్చాము కదా, మైలు దూరంలో ఉన్న కొండవరకు వెళ్లి వద్దాము’ అని అనుకున్నాడు.

 రోడ్డు పక్కన  ఓ అవ్వ చెరుకులు అమ్ముతూ కనిపించింది. డబ్బులిచ్చి ఓ పెద్ద చెరుకు గడ కొనుక్కున్నాడు. దారిలో తిందామని దాన్ని నాలుగు ముక్కలుగా చేయించి సైకిల్‌ వెనుక పెట్టుకున్నాడు. 

 కొద్ది దూరం పోయేసరికి దారిలో కార్లు, పెద్దపెద్ద వాహనాలు నిలబడి ఉండటం కనిపించింది. ‘ఏమి జరిగిందా’ అని ఆతృతగా చూశాడు. అడవిలో నుంచి రెండు ఏనుగులు రోడ్డుకడ్డంగా వచ్చాయని చెప్పుకుంటున్నారు. 

 సర్రున బండ్ల సందుల్లో దూరి ఏనుగులున్న చోటికి వెళ్లి చూశాడు. 

 చెరుకు లారీకి అడ్డంగా ఒక పెద్ద ఏనుగు, మరో గున్న ఏనుగు నిలబడి ఉన్నాయి. లారీ వెనుక బండ్లన్నీ నిలబడి పోయాయి.

 లారీ డ్రైవర్‌ ఎంతసేపు హారన్‌ కొట్టినా అవి పక్కకి తొలగడం లేదు. తొండం ఎత్తి ఘీంకారం చేస్తూ లారీ చుట్టూ తిరగసాగాయి. డ్రైవర్‌ కానీ, క్లీనర్‌ కానీ ధైర్యం చేసి లారీనుంచి దిగి వాటిని తరిమే ప్రయత్నం చేయడం లేదు.

 ఏమి చేస్తే అవి పక్కకి తొలుగుతాయని ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కున్న  ప్రయాణీకులంతా ప్రణాళికలు వేయసాగారు. కొందరు ఫైర్‌, పోలీస్‌ స్టేషన్లకు, ఫారెస్టు వారికి ఫోన్‌ లు చేస్తున్నారు.

 ‘వాటిని పక్కకి పంపడం ఎలా’ అని టిట్టు కూడా ఆలోచనల్లో పడ్డాడు. చెరుకు తింటూ ఆలోచిద్దామని గడను తీస్తూ ఉంటే తళుక్కున మెరుపులాంటి ఆలోచన వచ్చింది.

 వెంటనే లారీ డ్రైవర్‌, క్లీనర్‌లు చూసేట్లుగా తన సైకిల్‌ వెనుక ఉన్న చెరుకు గడ ముక్కలని దూరంగా రోడ్డు  పక్కకి విసిరేశాడు.

 అంతే…లారీ డ్రైవర్‌కి చక్కటి పరిష్కారం దొరికినట్లయింది. వెంటనే క్లీనర్‌కి చెప్పి లారీ పైకి ఎక్కించాడు. ఏనుగులు గమనించేట్లు అందినన్ని చెరుకు గడ కట్టలు తీసి రోడ్డు పక్కన ఉన్న పచ్చికలో వేయించాడు.

 క్లీనర్‌ అలా మూడు కట్టలు  పడేసినా ఏనుగులకు చీమ కుట్టినట్లుగా కూడా అనిపించలేదు. చూసీ చూడనట్లు ఉండిపోయాయి. నిరాశపడ్డాడు క్లీనర్‌. ”ప్రయత్నించి చూద్దాం, మరో మూడు కట్టలు విసిరేయ్‌” అని  చెప్పాడు  డ్రైవర్‌. అలాగే మరో మూడు కట్టలు పచ్చికలో పడేశాడు క్లీనర్‌.  

 మొత్తం ఆరు కట్టలు పచ్చికలో పడ్డాక  కానీ,  ఆ ఏనుగుల్లో  కదలిక  రాలేదు. తృప్తిగా  ఏనుగులు  చెవులాడిస్తూ చిన్నచిన్నగా  చెరుకు గడల కోసం పచ్చికలోకి వెళ్ళాయి. ”హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకున్నారు అక్కడి జనం. 

 ఏనుగుల అడ్డు తొలగడంతో వాహనాలన్నీ సర్రుసర్రున బయలుదేరాయి. కార్లలో వెళ్తున్న  పిల్లలు ఏనుగును చూస్తూ  ”ఏనుగమ్మ… ఏనుగు!” అని చప్పట్లు కొడుతూ వెళ్ళారు.

 ట్రాఫిక్‌ జామ్‌ సమస్య తీరిపోవడంతో లారీ డ్రైవర్‌ నవ్వుతూ టిట్టును దగ్గరికి పిలిచాడు. చెరుకు గడల మోపును బహుమానంగా ఇచ్చాడు. టిట్టు దాన్ని  సైకిల్‌ వెనక పెట్టి, గట్టిగా కట్టి… టాటా చెప్పి సైకిల్‌ని ఇంటి వైపు తిప్పాడు. 

చెరుకు గడలను ఇంటికి తీసుకు వెళ్ళిన టిట్టు కడుపారా తనే తినకుండా, చుట్టుపక్కల పిల్లోళ్ళకి కూడా పంచాడు. పిల్లోల్లందరూ తియతియ్యటి  చెరుకును ఆడుతూపాడుతూ ‘జ్యాంజ్యాం’ అని తిన్నారు.

– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు,  ఫోన్‌: 9393662821

‘ప్రజాశక్తి’ ఆదివారం అనుబంధం స్నేహ 17-12-2023లో ప్రచురింపబడింది.

 

Read More

సరైన మెళకువలతోనే గొర్రెల పెంపకం విజయవంతం

మనది వ్యవసాయక దేశం. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే ఎక్కువమంది రైతులు పంటల సాగుతో పాటు పాడిని కూడా పోషిస్తూ ఉండేవారు. పంట వ్యర్థాలను పశువులకు, పశువుల వ్యర్థాలకు పంటలకు అందిస్తూ కొనసాగేవారు. పాడి పశువులతో పాటు అవకాశం ఉన్న రైతులు కోళ్ళు, గొర్రెలు, మేకల పెంపకం లాంటివి కూడా కొనసాగిస్తూ ఉండేవారు. అప్పట్లో వాతావరణ కాలుష్యం తక్కువగా ఉండేది. ప్రజలకు గాని, పశువులకు గాని విష రసాయనాలు లేని ఆహారం అందుబాటులో ఉండేది కాబట్టి తినే ఆహారం ద్వారా అనారోగ్య సమస్యలు పెద్దగా వచ్చేవి కావు. కాని కాలం గడిచే కొలది పరిస్థితులలో వివిధ రకాలు మార్పులు సంభవించి తినే ఆహారంతో పాటు, త్రాగే నీరు, పీల్చే గాలి, పండించే నేల .. అన్నీ కలుషితం అయ్యాయి కాబట్టి ప్రజలతో పాటు పశు పక్ష్యాదులకు కూడా అనారోగ్య సమస్యలు ఏఏటికాయేడు పెరుగుతూ వస్తున్నాయి. పశు పక్ష్యాదులలో మిగతా వాటితో పోల్చుకుంటే గొర్రెలలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టే గొర్రెల పెంపకందారులు తమ విలువైన గొర్రెలను నష్టపోవలసి వస్తుంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా గొర్రెల పెంపక విధానంలో మార్పులు చేసుకొని మెళకువలు పాటిస్తే గొర్రెల పెంపకంలో విజయం సాధించవచ్చని తోటి రైతులకు తెలియచేయడానికి నల్లగొండకు చెందిన అభ్యుదయ రైతు అంజిరెడ్డి కృషి చేస్తున్నాడు.

అంజిరెడ్డి గారివి వ్యవసాయ మూలాలు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన తరువాత ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంలోకి దిగి వివిధ రకాల పంటలు పండిస్తూ, తన పంటల సాగులో ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా కేవలం సేంద్రియ పద్దతులను మాత్రమే పాటిస్తూ ఆరోగ్యకరమైన పంట దిగుబడులు సాధిస్తూ వస్తున్నాడు.

అంజిరెడ్డి ప్రతినిత్యం లాభసాటి వ్యవసాయం గురించి ఆలోచిస్తూ పంటల సాగును లాభాల బాట పట్టించడానికి అవసరమయిన వివిధ రకాల మార్గాల గురించి ఆలోచించి సమీకృత వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుందని గ్రహించి తన పంటల సాగుని కొనసాగిస్తూనే గొర్రెల పెంపకాన్ని చేపట్టాలని తలంచి అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టాడు. అంజిరెడ్డి గారి పెద్దలు గతంలో గొర్రెల పెంపకం చేపట్టారు కాబట్టి ఆ అనుభవం అంజరెడ్డిగారికి బాగా ఉపయోగపడింది. దానికి తోడు ప్రభుత్వం కూడా గొర్రెల పెంపకానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న విషయం తెలుసుకుని విచారించగా ఎన్‌ఎల్‌ఎం (నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌) స్కీము ద్వారా కేంద్ర ప్రభుత్వం గొర్రెల పెంపకానికి ప్రోత్సాహకాలను అందిచటాన్ని తెలుసుకున్న అంజిరెడ్డి తాను ఈ స్కీము ద్వారా ప్రభుత్వ సహాయాన్ని పొంది గొర్రెల పెంపకం చేపట్టినట్లయితే అన్నివిధాలుగా ప్రయోజనం ఉంటుందని గ్రహించి అటువైపు అడుగులు వేసి ఎన్‌ఎల్‌ఎమ్‌ స్కీముకు అవసరమయిన అర్హతలను పొంది 2023 వ సంవత్సరంలో గొర్రెల పెంపకంలో అడుగు పెట్టాడు.

ఎన్‌ఎల్‌ఎమ్‌ స్కీమ్‌లో కోటి రూపాయల ప్రాజెక్ట్‌ వివరాలు

నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ లోని ఒక కోటి రూపాయల ప్రాజెక్టును అంజిరెడ్డిగారు ఎంపిక చేసుకుని అందుకుగాను ముందుగా బ్యాంకు వారి నుంచి (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) కోటి రూపాయల లోనుకు సంబంధించిన అనుమతి పొందడం జరిగింది. కోటి రూపాయల లోనుకు గాను అవసరమయిన గ్యారంటీలను అంజరెడ్డి గారు బ్యాంకు వారికి చూపించిన తరువాత గొర్రెల పెంపకంలో అనుభవం ఉండటానికి సంబంధించిన ధృవపత్రాన్ని అందచేయడముతో పాటు ఎన్‌ఎల్‌ఎమ్‌ స్కీములోఇంకొక అర్హత అయినవంటి 5 ఎకరాల భూమిని కూడా చూపించడం జరిగింది. కోటి రూపాయల ప్రాజెక్టుకు గాను కనీసం 5 ఎకరాల సొంత భూమి లేదా కౌలు (కనీసం 7 సంవత్సరాలు) పొలం అయినా సరిపోతుంది. కోటి రూపాయలు ప్రాజెక్టు క్రింద 500 ఆడ గొర్రెలు మరియు 25 మగ గొర్రెలు (పొట్టేళ్ళు)ను పోషించవలసి ఉంటుంది. అంజిరెడ్డి గారికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోటి రూపాయల ప్రాజెక్టును మొదలు పెట్టారు. అలాంటి అవకాశాలు లేని వారికి కూడా తక్కువ అంటే 100 గొర్రెలు, 200 గొర్రెలు, 300 గొర్రెలు లకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా అందుబాటులోకి తెచ్చారు అని అంజిరెడ్డి గారు వివరించారు. కోటి రూపాయల ప్రాజెక్టులో 50 లక్షల రూపాయల సబ్సిడీ ఉంటుంది. సబ్సిడీలో సగం అయినటువంటి 25 లక్షల సబ్సిడీని అంజిరెడ్డి గారు అందుకోవడం జరిగింది. త్వరలో మిగతా 25 లక్షలు సబ్సిడీని కూడా అందుకుంటాను అని అంజిరెడ్డి గారు వివరిస్తున్నారు.

గొర్రెలకు మేత

ఎన్‌ఎల్‌ఎమ్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం కనీసం 5 ఎకరాల పొలం ఉండాలి. కాని అంజిరెడ్డి గారి అభిప్రాయం ప్రకారం 525 గొర్రెలు మరియు వాటికి పుట్టే పిల్లలకు స్టాల్‌ ఫీడింగ్‌ చెయ్యాలంటే కనీసం 15 ఎకరాల పొలంలో పశుగ్రాసాలను పెంచుకోవాలి. అందులో ఏడు ఎకరాల సూపర్‌ నేపియర్‌ లాంటి ధాన్యపు జాతి పశుగ్రాసాలను, ఏడు ఎకరాల థరథగడ్డి/హెడ్జ్‌లూసర్న్‌ లాంటి పప్పుజాతి పశుగ్రాసంతో పాటు ఒక ఎకరంలో అవిశ, మునగ లాంటివి సాగు చేయాలి అని అంటున్నాడు. కాని తాము ప్రస్తుతానికి 4 ఎకరాలలో సూపర్‌ నేపియర్‌, 5 ఎకరాలలో హెడ్జ్‌లూసర్న్‌, రెండు ఎకరాలలో చిలకడ దుంపలను పశుగ్రాసాలుగా సాగు చేస్తున్నాము. ఈ పశుగ్రాసం సరిపోవడం లేదు కనుక ప్రక్కనే అందుబాటులో ఉన్న పొలం ఆరు ఎకరాలను కౌలుకు తీసుకుని జూన్‌ తరువాత పశుగ్రాసాలను సాగు చేయాలనే ప్రణాళికతో ఉన్నాడు. వీటితో పాటు వేరుశనగ, శనగ మొదలగు పంట వ్యర్థాలను, దానా కింద మొక్కజొన్న తవుడు, నూకలు లాంటివి అందిస్తూ వస్తున్నాడు. వీటన్నింటితోపాటు పొలంలో అందుబాటులో ఉన్న మునగ, సుబాబుల్‌, వేప ఆకులను అవసరాన్ని బట్టి అందిస్తున్నాడు. షెడ్‌లో అక్కడక్కడ మినరల్‌ మిక్చర్‌ ఇటుకలను వ్రేలాడదీస్తుంటాడు.

గొర్రెలు: అందుబాటులో ఉన్న వివిధ రకాల గొర్రెలలో మాచర్ల చుక్క రకాన్ని పోషించాలని నిర్ణయించుకొని ఆ రకం గొర్రెలు దొరికే ప్రదేశాలు తిరిగి వివిధ ప్రాంతాలలో నేరుగా రైతుల దగ్గర నుంచి, సంతలలో, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఎన్ని అందుబాటులో ఉంటే అన్ని కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మొత్తం 500 పైగా గొర్రెలు 25 పొట్టేళ్ళతో పాటు 100కు పైగా పిల్లలు ఉన్నాయి. మాచర్ల చుక్క రకం గొర్రెలకు మంచి మార్కెట్‌ ఉండడముతో పాటు మన వాతావరణానికి బాగా తట్టుకుంటాయనే ఆలోచనతో ఈ రకం గొర్రెలను ఎంపిక చేసుకున్నాడు. అమ్మకానికి సిద్ధం అయిన గొర్రెలను అవకాశాన్ని బట్టి లైవ్‌ వెయిట్‌ కిలో 400 నుంచి 450 రూపాయల చొప్పున స్థానికంగానే అమ్మకం చేసుకుంటూ వస్తున్నాడు.

గొర్రెలకు వసతి సౌకర్యం

ఎన్‌ఎల్‌ఎమ్‌ గైడ్‌ లైన్స్‌ ప్రకారం ఆడ గొర్రెలకు ఒక్కొక్క దానికి 10 చదరపు అడుగులు, మగ గొర్రెల (పొట్టేళ్ల)కు ఒక్కొక్క దానికి 15 చదరపు అడుగుల స్థలం కావాలి. కాని నేను మొత్తం 9000 చదరపు అడుగుల షెడ్‌ నిర్మాణం చేసుకున్నాను. భూమి మీద గొర్రెల పెంపకం చేపట్టినట్లయితే గొర్రెలకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు కూలీల ఖర్చు ఎక్కువగా అవుతుంది. కాబట్టి నేను ఎత్తులో ఎలివేటెడ్‌ షెడ్‌ని నిర్మాణం చేసుకున్నాను. ఎత్తులో షెడ్‌ నిర్మాణం చేసుకోవడం వలన పెట్టుబడి పెరుగుతుంది కాని భవిష్యత్తులో చాలా రకాల ప్రయోజనాలు ఉటాయి కాబట్టి ఖర్చు ఎక్కువ అయినా ఆలోచించకుండా ఈ విధంగా నిర్మించుకున్నాను. షెడ్‌ని ఉత్తర, దక్షిణ దిక్కులలో నిర్మించుకుంటే తూర్పు నుంచి మా పొలం నుంచి చల్లని గాలులు వీస్తుంటాయి కాబట్టి షెడ్‌ని ఉత్తర, దక్షిణాలలో నిర్మించుకుంటే తూర్పు నుంచి వచ్చే చల్లగాలులు షెడ్‌లోకి బాగా రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ విధంగా నిర్మించుకోవడం జరిగింది. చలికాలంలో చల్లనిగాలులు, వర్షాకాలంలో వచ్చే వర్షాల నుంచి రక్షణ కొరకు షేడ్‌ నెట్‌లు ఏర్పాటు చేసుకున్నాను. గొర్రెలు ఎక్కడానికి మరియు క్రిందకు దిగటానికి వీలుగా ర్యాంపును నిర్మించుకున్నాను. గొర్రెల మేతకు మరియు నీటి వసతి కొరకు షెడ్‌లో తగిన ఏర్పాట్లు చేసుకున్నాను. ఎండు మేతలు అంటే వేరుశనగ చెత్త, శనగ చెత్త లాంటి వాటిని నిల్వ చేసుకోవడానికి గాను 5 లక్షల ఖర్చుతో వేరుగాఇంకొక షెడ్‌ని ప్రక్కనే నిర్మించుకున్నాను అని అంజిరెడ్డి వివరించాడు.

గొర్రెల పెంపకం విజయవంతం కావడానికి అవసరమయిన మెళకువలను చాలా వరకు పాటిస్తూ అంజిరెడ్డి ముందుకు సాగుతున్నాడు. మరిన్ని వివరాలు 99482 55544 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

– డి. ప్రసాద్‌, రైతునేస్తం ప్రతినిధి

Read More

ఆంక్షల వల్ల కుదేలైన భారత వ్యవసాయ ఎగుమతులు

ప్రతి ఆర్థిక వ్యవస్థలోనూ వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనే మూడు విభాగాలుంటాయి. అన్ని దేశాల్లోనూ జాతీయాదాయంలో వ్యవసాయరంగపు వాటా తగ్గుతూ వస్తుంది. పరిశ్రమల వాటా మధ్యస్తంగా ఉండగా, సేవారంగపు వాటా పెరుగుతూ అత్యధిక స్థాయికి చేరింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగపు వాటా 15 నుండి 16 శాతం మధ్య కదలాడుతున్నది. సేవారంగపు వాటా 60 శాతం వాటాగా, పరిశ్రమల వాటా 25 శాతం కన్నా తక్కువగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతి పెద్దదైన అమెరికాలో వ్యవసాయరంగపు వాటా ఒక శాతం కన్నా కూడా తక్కువగా ఉంది. పరిశ్రమల వాటా 17.88 శాతం కాగా, సేవా రంగపు వాటా 77.6 శాతంగా ఉంది. రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా దేశాదాయంలో వ్యవసాయరంగపు వాటా 7.1 శాతంగానూ, పారిశ్రామిక రంగపు వాటా 38.3 శాతంగానూ, సేవా రంగపు వాటా 54.6 శాతంగానూ ఉన్నాయి. పేద దేశాల్లో వ్యవసాయరంగపు వాటా ఎక్కువగా ఉండగా, ధనిక దేశాల్లో సేవా, పారిశ్రామిక రంగాలు ముఖ్యమైనవిగా నిలుస్తున్నాయి. నేటి పరస్పరాధార ప్రపంచంలో వస్తువులు, సేవలు ఒక దేశం నుండి మరెన్నో దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచాదాయంలో 56.3 శాతం ఎగుమతి, దిగుమతి వాణిజ్యం ద్వారా లభిస్తున్నట్లు 2021 సంవత్సరపు లెక్కలు తెలుపుతున్నాయి. అత్యధికంగా చైనా ఎగుమతుల ద్వారా చైనా దేశం 3.4 ట్రిలియన్‌ డాలర్లను ఆర్జిస్తున్నది. ప్రతి దేశమూ తన ఎగుమతుల్ని పెంచుకోవాలని చూస్తుంది. అదే సమయంలో తమ పౌరులకవసరమైన వస్తువుల్ని, సేవలను దిగుమతి చేసుకుంటున్నది. 2023లో భారతదేశపు ఎగుమతుల విలువ 770 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. భారతదేశపు ఎగుమతులకన్నా దిగుమతుల విలువ సుమారుగా 124 బిలియన్‌ డాలర్లు ఎక్కువ. దాదాపు చైనా, ఇండియాల జనాభా సమంగా ఉన్నా చైనా ఎగుమతులు భారత్‌ ఎగుమతులతో పోలిస్తే ఐదు రెట్లుగా ఉన్నాయి. జాతీయాదాయాల్లో కూడా ఈ రెండు దేశాల మధ్య ఇంతే అంతరం ఉంది. భారతదేశం వస్తువాణిజ్యంలో 269 బిలియన్‌ డాలర్ల కొరత ఉంది. ఐతే సేవారంగ వాణిజ్యంలో భారత్‌కు 145 బిలియన్‌ డాలర్ల మిగులు ఉండటం వల్ల వాణిజ్య లోటు 124 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఎగుమతుల్ని పెంచుకొని వాణిజ్య లోటుని తగ్గించుకోవాలని అన్ని దేశాల్లాగే భారతదేశం కోరుకుంటుంది. 2030 కల్లా భారత ఎగుమతులు మూడు రెట్లు పెరిగి 2000 బిలియన్‌ డాలర్లుకి చేరుతుందని వాణిజ్య శాఖామాత్యులు పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. 2022-23లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 53 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. 2030 కల్లా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని 100 బిలియన్‌ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. ఎగుమతుల్ని పెంచడానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నది. కాని ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే నెపంతో పలు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని నిషేధించటం, ఆంక్షల్ని విధించటం జరిగింది. ఇలా ఆంక్షలు విధిస్తూపోతే ఎగుమతుల లక్ష్యాలు ఎలా నెరవేరతాయి?

ఆహారోత్పత్తిపై ‘ఎల్‌నినో’ ప్రభావం

వాతావరణ పరిస్థితుల్ని ‘లానినో’, ‘ఎల్‌నినో’లుగా విభజిస్తారు. 2022-23లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా నమోదైంది. ఆహారోత్పత్తి 329.6 మిలియన్‌ టన్నులుగా తుది అంచనాలు వెల్లడయ్యాయి. 2022-23 వ్యవసాయ సంవత్సరంలో ‘లానినో’ పరిస్థితులే  ఉన్నాయి. కాని 2023-24 వ్యవసాయ సంవత్సరంలో ‘ఎల్‌నినో’ పరిస్థితులుండవచ్చనే అనుమానాన్ని వాతావరణ శాఖ అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇండియన్‌ మెటీరిలియోలాజికల్‌ డిపార్టుమెంటు (భారత వాతావరణ శాఖ) 2023-24లో వర్షపాతం 96 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. వాస్తవంగా నైరుతీ రుతుపవనాలు ముగిసే సరికి సాధారణ వర్షపాతంలో 94 శాతమే కురిసిందని వాతావరణ శాఖ గణాంకాలు ప్రచురించింది. ఈశాన్య రుతుపవన కాలంలో కూడా సాధారణం కన్నా 9 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. తాజాగా వాతావరణ శాఖ 2024-25లో ఎల్‌నినో ప్రభావం అంతరించి పోతుందనీ, సాధారణ వర్షపాతం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ వర్షం కురుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. గతంలో ‘ఎల్‌నినో’ ప్రభావం రెండు మూడు సంవత్సరాలున్న అనుభవం దేశానికుంది. ఒక్క సంవత్సరం తక్కువ వర్షపాతం కురవటంతో వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా ఆహారోత్పత్తి కొంతవరకు ప్రభావితమైంది.

ముఖ్యంగా వరి ధాన్యపు ఉత్పత్తిలో తగ్గుదల నమోదైంది. 2022-23లో బియ్యం ఉత్పత్తి 135.76 మిలియన్‌ టన్నులుగా నమోదై రికార్డుని నెలకొల్పింది. 2021-22లో ఉత్పత్తైన 129.47 మిలియన్‌ టన్నులతో పోలిస్తే 2022-23లో అదనంగా 6.28 మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తయ్యాయి. అంతకుముందు ఐదు సంవత్సరాల సగటు బియ్యం ఉత్పత్తితో పోలిస్తే 15.37 మిలియన్‌ టన్నుల బియ్యం అధికంగా ఉత్పత్తయ్యాయి. అంత రికార్డు స్థాయిలో బియ్యం ఉత్పత్తి కావటంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. నిల్వలు కూడా పెరిగాయి. 2023-24లో ఎనిమిదేళ్ళు వరసగా పెరిగిన తర్వాత బియ్యం ఉత్పత్తి 123.8 మిలియన్‌ టన్నులకు తగ్గింది. 2022-23తో పోలిస్తే బియ్యం ఉత్పత్తి 11.96 మిలియన్‌ టన్నులకు తగ్గింది. కాని గోధుమ ఉత్పత్తి 2022-23లో ఉత్పత్తి అయిన 110.6 మిలియన్‌ టన్నుల కన్నా 1.3 శాతం పెరిగి 112 మిలియన్‌ టన్నులకు పెరిగింది. ముడి ధాన్యాల ఉత్పత్తి 2022-23లో 57.3 మిలియన్‌ టన్నులు కాగా 2023-24లో 50 మిలియన్‌ టన్నులకు తగ్గుతుందని అంచనా వేశారు. మొక్కజొన్న ఉత్పత్తి కూడా 2022-23లో 38 మిలియన్‌ టన్నులుండగా 2023-24లో 32.4 మిలియన్‌ టన్నులకు తగ్గుతుందని అంచనా వేసారు. కంది ఉత్పత్తి 2022-23 స్థాయిలోనే 2023-24లో కూడా ఉంటుందని భావిస్తున్నారు. మినుముల ఉత్పత్తి కూడా గత సంవత్సరం స్థాయిలోనే ఉంటుందని అంచనా వేశారు. మొత్తం ఖరీఫ్‌ కాలంలో అపరాల ఉత్పత్తి గత సంవత్సరం కన్నా కొంత తక్కువ ఉండవచ్చని అంచనాలు తెలుపుతున్నాయి. రబీకాలంలో అపరాల ఉత్పత్తి గత సంవత్సర స్థాయిలోనే ఉంటుందని ఆశిస్తున్నారు. వరి మొక్కజొన్న, ముతకధాన్యాలు, అపరాల ఉత్పత్తి తగ్గటం వల్ల మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 309.1 మిలియన్‌ టన్నులకు తగ్గే సూచనలున్నాయి. వరి సాగు విస్తీర్ణం 2023-24 ఖరీఫ్‌లో 41.1 మిలియన్‌ హెక్టార్లుగా అంచనా వేయబడింది. 2022-23లో ఖరీఫ్‌ వరి విస్తీర్ణం ఖరీఫ్‌లో 40.43 మిలియన్‌ హెక్టార్లతో పోలిస్తే 6.7 లక్షల హెక్టార్లు పెరిగింది. కానీ రుతుపవనాల్లో వర్షపాతం తగ్గటం, కొన్ని సమయాల్లో వర్షాభావం, మరికొన్ని సమయాల్లో అధిక వర్షాల కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. రబీలో కూడా వరి విస్తీర్ణం తగ్గకున్నా దిగుబడులు తగ్గాయి. నీటి ఎద్దడి కారణంగా బియ్యం దిగుబడులు ఖరీఫ్‌, రబీ కాలాల్లో తగ్గాయి. సహజంగా దిగుబడులు, ఉత్పత్తి తగ్గినప్పుడు ధరలు పెరుగుతాయి. కాని ప్రభుత్వ విధానాల వల్ల రైతులకు లభించే ధరలు పెరగలేదు.

వ్యవసాయ ఎగుమతుల్లో తగ్గుదల

2022లో భారతదేశం గోధుమ ఎగుమతుల్ని నిషేధించింది. మే 13వ తేదీన గోధుమ ఎగుమతుల్ని నిషేధించిన తర్వాత ఆగస్టులో గోధుమ ఉత్పత్తులైన గోధుమ పిండి, మైదా, సెమోలినాల ఎగుమతిని కూడా నిషేధించింది. 2022 జులైలో బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి పన్నుని విధించింది. జులై 2023లో బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల్ని నిషేధించింది. వెంటనే ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 20 శాతం పన్ను విధించింది. పంచదార ఎగుమతుల్ని 60 లక్షల టన్నులు దాటకూడదనే ఆంక్షలను 2022లో విధించి 2023లో కూడా కొనసాగించారు. డిసెంబరు 2023లో ఉల్లి ఎగుమతుల్ని నిషేధించి కొనసాగిస్తున్నారు. ఇటీవల కొన్ని దేశాలకు పరిమిత స్థాయిలో ఎగుమతుల్ని చేయటానికి సడలించింది. 2021-22, 2022-23లో ఉత్పత్తి ఎక్కువగానే ఉన్నా ఆంక్షలు పెట్టటం వల్ల ధరలు తగ్గి రైతులు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారు. రష్యా-యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలైన తర్వాత గోధుమ ధరలు పెరిగినా ఆ ప్రయోజనం గోధుమ రైతులకు దక్కకుండా గోధుమ, గోధుమ ఉత్పత్తుల ఎగుమతులను నిషేధించింది. అలాగే అంతర్జాతీయంగా బియ్యం ధరలు పెరుగుతున్నా 2022లో ఎగుమతి పన్ను విధించి, 2023లో ఎగుమతుల్ని నిషేధించి రైతులకు గిట్టుబాటు ధరలు రాకుండా తొక్కి పెట్టింది. పంచదార ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగినా, దేశంలో నిల్వలున్నా ఎగుమతులపై పరిమితుల్ని విధించి చెరకు రైతుల ప్రయోజనాల్ని దెబ్బతీసింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించే బాధ్యత రైతులదేనన్నట్లుగా వారికి కనీస మద్దతు ధరలు మాత్రమే దక్కాలిగాని, గిట్టుబాటు ధరలు లభించకూడదనే కక్షతో రైతుల్ని నష్టపరుస్తున్నారు. వ్యాపారులు, దళారీలపై ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల్ని దోచుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు. సేకరణ వ్యవస్థను నిర్వీర్యం చేసి రైతులను ధరలు తగ్గినప్పుడు ఆదుకోకుండా, ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగినా దేశంలో వాటిని తొక్కిపెట్టి తీరని నష్టం రైతులకు కలిగిస్తున్న ప్రభుత్వ విధానాలు బ్రిటిష్‌ పాలకుల రోజుల్ని గుర్తు చేస్తున్నాయి. ఎగుమతుల్ని నిరుత్సాహపరుస్తూ దేశ ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నది. ఎగుమతుల్ని పెంచాలని ప్రకటించే లక్ష్యాలకు అర్థం లేకుండా పోతున్నది. 

2022 ఏప్రిల్‌-సెప్టెంబరుల మధ్య వ్యవసాయ ఎగుమతులు 26.7 బిలియన్‌ డాలర్లుండగా, 2023లో ఇదే సమయంలో అవి 23.6 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 2022-23లో వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు 39.24 బిలియన్‌ డాలర్లుండగా, వాణిజ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం 2023-24లో మొదటి తొమ్మిది నెలల్లో ఈ ఎగుమతులు 24.93 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. పూర్తి సంవత్సరంలో 32 బిలియన్‌ డాలర్ల కన్నా తక్కువ స్థాయిలోనే ఎగుమతులుండే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 20 శాతం తగ్గుదల ఉండటం ఆత్మహత్యా సదృశంగా కనిపిస్తున్నది. బాస్మతీ బియ్యం ఎగుమతుల విలువ తగ్గలేదు కాని నాన్‌-బాస్మతీ బియ్యం ఎగుమతులు సగానికి తగ్గిపోయాయి. గోధుమ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇతర గింజ ధాన్యాల ఎగుమతులు కూడా సగానికి పడిపోయాయి. పంచదార ఎగుమతుల విలువ సగానికి పడిపోయింది. పొగాకు, నూనె గింజలు, నూనె తీసిన పిండి, పండ్లు, కూరగాయలు, మాంసం, మద్యం, డెయిరీ ఉ్పత్తులు, పత్తి ఎగుమతులు మాత్రం గత సంవత్సర స్థాయిలోనే 2023-24లో కూడా ఉన్నాయి.

తగ్గని నిల్వలు

బియ్యం నిల్వలు 2018-19 ప్రారంభంలో 22.6 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. అవి 2019-20 ప్రారంభంలో 33.9 మిలియన్‌ టన్నులకు పెరిగాయి. 2021-22 ప్రారంభంలో 29.5 మిలియన్‌ టన్నులకి, 2020-21 ప్రారంభంలో నిల్వలు బాగా పెరిగి రికార్డు స్థాయిలో 37 మిలియన్‌ టన్నులకు చేరాయి. 2022-23 ప్రారంభంలో బియ్యం నిల్వలు 34 మిలియన్‌ టన్నులుగా ఉండగా, 2023-24 ప్రారంభానికి ఆ నిల్వలు 32.5 మిలియన్‌ టన్నులకు స్వల్పంగా తగ్గాయి. బాస్మతీ, నాన్‌-బాస్మతీ రకం బియ్యాలు కొంత మేరకు ఎగుమతి అయినా నిల్వల స్థాయి తగ్గలేదు. దేశంలో వినియోగంతో పాటు ఎగుమతులు జరుగుతున్నా ఉత్పత్తి ఏటేటా పెరుగుతుండటం వల్ల ప్రారంభ నిల్వలు సంతృప్తికర స్థాయిలోనే ఉన్నాయి. 2022 జులైలో నాన్‌-బాస్మతీ రకం బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకం విధించారు. ఆ సుంకాలు చెల్లించి కూడా ఎగుమతిదార్లు సుమారుగా 15 మిలియన్‌ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసారు. 2023-24 ప్రారంభంలో కూడా 32.5 మిలియన్‌ టన్నుల బియ్యం నిల్వలున్నా జులై 2023లో నాన్‌-బాస్మతీ రకం బియ్యం ఎగుమతుల్ని నిషేధించింది. ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. 2023 ఆగస్టు ఒకటవ తేదీకి బియ్యం నిల్వలు 37.6 మిలియన్‌ టన్నులకు చేరాయి. వాస్తవానికి అవసరమైన నిల్వలు 13.5 మిలియన్‌ టన్నులు మాత్రమే.

ఖరీఫ్‌ పంట మార్కెట్‌లోకి వచ్చేలోగా ప్రజాపంపిణీ వ్యవస్థ అవసరాలకు ఆ నిల్వలు సరిపోతాయి. అవసరమైన నిల్వల కన్నా దాదాపు మూడు రెట్లు నిల్వలున్నా నిషేధం పెట్టటం, ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించడం సమర్థనీయమైన చర్యలు కావు. ప్రైవేటు వ్యాపారస్తులకు ఎగుమతి చేసే అవకాశం లేకపోవడంతో బియ్యం ధరలు పెరగలేదు. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ కోఆపరేటివ్‌ ఎక్సో ్పర్ట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థను నెలకొల్పి దాని ద్వారా చుట్టుపట్ల ఉన్న దేశాలకు పరిమితంగా బియ్యం ఎగుమతులు చేయించింది. 2023-24 సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, మాల్దీవులు, మలేసియా, ఇండోనేషియా, వియత్నాం, ఇరాన్‌ దేశలకు 567 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు విలువైన బియ్యాన్ని ఎగుమతి చేయటం జరిగింది. ఇవికాక ఇతర ఏషియా ప్రాంతంలోని దేశాలకు మరో 341 మిలియన్‌ డార్ల విలువైన బియ్యాన్ని ఎగుమతి చేసారు. తెల్ల బియ్యం ఎగుమతితో పాటు గోధుమల్ని కూడా ఎగుమతి చేసారు. 14,184 టన్నుల గోధుమలు, 5326 టన్నుల గోధుమ పిండి, 15,226 టన్నుల మైదా ఎగుమతి జరిగింది. నూకల్ని మాలీ దేశానికి ఒక లక్ష టన్నులు, సెనెగెల్‌కు 5 లక్షల టన్నులు, జాంబియాకి 50 వేల టన్నులు, ఇండోనేషియాకు 2 లక్షల టన్నులు, భూటాన్‌కి 48,804 టన్నుల మేరకు ఎగుమతి చేశారు. ఇలా భారత ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఒప్పందాలు, అవగాహనలను అమలు పరచటానికి పరిమితంగా వరి, గోధుమ, నూకల ఎగుమతులు జరిగాయి.

రాజకీయ కారణాలు

2024 పార్లమెంటు ఎన్నికల ముందు ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందేమోననే భయంతో ప్రభుత్వం గోధుమ, వరి ఎగుమతుల్ని నిషేధించింది. కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ‘ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్నదాన యోజన’ కింద దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాల నందించే పథకాన్ని ప్రారంభించింది. దాన్ని పొడిగించుకుంటూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావటానికి ఈ ఉచిత ఆహార ధాన్యాల పథకం ఉపయోగపడిందని విశ్లేషించి, పార్లమెంటు ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని రాబోయే ఐదు సంవత్సరాల వరకు కొనసాగిస్తామని అధికార పార్టీ ప్రకటించింది. దీనితో పాటు ”భారత్‌’ అనే బ్రాండుతో కిలో బియ్యం 29 రూపాయలకు అమ్మటానికి ఒక ప్రభుత్వ సంస్థని రంగంలోకి దించింది. నిసేధాలు, ఎగుమతి పన్నుల వల్ల దేశంలో గోధుమలు, వడ్లు ధరలు తగ్గేలాగా చేసింది. మధ్యదళారీలు చౌకగా గోధుమల్ని, వడ్లను కొని వాటి ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతున్నారు. కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు ఆహారధాన్యాలను ఉచితంగా కానీ, తక్కువ ధరకు గానీ పేద ప్రజలకు అందిస్తున్నాయి. అవి ఆహార ధాన్యాలను తక్కువ ధరకు కొనటం ద్వారా వారి ఆర్థిక లోటుని అదుపులోకి తెచ్చుకుంటున్నారు. తాజాగా మార్కెట్‌ ధరల్లో సగానికి ‘భారత్‌’ బ్రాండ్‌ బియ్యాన్ని, గోధుమ పిండిని అమ్మి వినిమయదారుల మెప్పు పొందటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వాస్తవానికి ఆహారధాన్యాల కొరత లేకున్నా వాటి ఎగుమతుల్ని నిషేధించటం ద్వారా వాటి ధరల్ని క్వింటాలుకి ఐదారు వందలు తగ్గేలా చేసి, వినిమయదారలకు, మధ్యదళారీలకు లాభాన్ని చేకూర్చే విధానాలను ప్రభుత్వం అనుసరించింది. రాజకీయ నాయకుల ప్రజాకర్షక పథకాలకు చౌకగా ఆహార ధాన్యాలు లభించటం కూడా ఈ విధానాల వల్ల వీలయింది. రైతుల ఆదాయాలను రెండు లక్షల కోట్ల రూపాయల వరకు తగ్గించి ఆ మేరకు మధ్యవర్తలకు, ప్రభుత్వాలకు, వినిమయదారులకు లాభం కలిగించింది. దానితో పాటు దాదాపు 10 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం కోల్పోయింది. రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ఆదాయాన్ని తగ్గించి, ఎగుమతుల్ని దెబ్బతీయటం అసమంజసం.  

డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్‌ & కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More