ప్రోత్సాహం అందిస్తే వ్యవసాయ రంగంలో మహిళలే మహరాణులు

గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొన్నట్లయితే గతంలో మహిళలను పలు రకాల వివక్షలకు బలిచేశారు. మహిళలను అన్ని విధాలుగా అణచి వేశారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి కూడా మహిళలను అణచి వేస్తూనే ఉన్నారు. మహిళలను బానిసలుగా, ఆటబొమ్మలుగా, విలాస వస్తువులుగా చూసిన సమాజం మనది. అప్పట్లో గ్రంథాలు వ్రాసినవారు అందరూ కూడా మగవారే కాబట్టి ఆడవారిని 'అణచి వేయడానికి, మగవాడు చెప్పినట్లు ఆడటానికి మాత్రమే ఆడమనిషి పుట్టింది' అనే విధంగా గ్రంథాలలో వ్రాశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొంతమంది అయితే ఆడమనిషి పిల్లలను కనే యంత్రం మరియు భర్తకు సేవ చేసే పనిమనిషి మాత్రమే అన్నట్లు ప్రవర్తించారు. ఇంకా కూడా కొన్ని చోట్ల అలానే ప్రవర్తిస్తున్నారు. దానిని అవకాశంగా తీసుకుని కొంతమంది మగవారు మహిళలకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకపోగా చులకనగా చూడటం మొదలయ్యింది. ఆడమనిషి ఇల్లు దాటి బయటికి వచ్చిందంటే హేళనగా చూడటం, డబ్బు సంపాదన కోసం ఇల్లుదాటి ఆడమనిషి బయటకు వచ్చింది కాబట్టి డబ్బులు ఆశచూపి లొంగదీసుకోవచ్చు అనే భావనను మనసులో పెట్టుకున్న మగవారు అనేకమంది ఉన్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొంతమంది మగవారు అయితే ఆడమనిషి కనిపిస్తే అవకాశం ఉంటే గిల్లుదామని, గిచ్చుదామని, ఎక్కడపడితే అక్కడ పట్టుకుందామని ప్రయత్నించే మగవారు బస్పులో, రైళ్లలో, రద్దీ ప్రదేశాలలో, ఆఫీసులలో ఉంటూనే ఉంటారు. ఇలాంటి పనికిమాలిన చేష్టలు చేస్తూ మహిళలను ఏడిపించే మగవారు తమ అక్కకో, చెల్లికో, కూతురుకో, భార్యకో ఇలాంటి పరిస్థితులే వేరే మగవారి నుంచి ఎదురైతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించగలిగితే ఎలాంటి వెధవ పనులు చేయరు. ఇలాంటి మగవారు పైకి మాత్రం నీతులు చెబుతూ బయటకు మాత్రం మంచిగా నటిస్తూ ఆడమనిషిని విలాస వస్తువుగానే చూస్తూ అణగదొక్కాలనే చూస్తుంటారు. ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమాజంలో కూడా కొంతమంది అభ్యుదయ భావాలు గల మగవారు ఆదర్శంగా ఆలోచించి ఆడమనిషి కూడా మగవారితో సమానము అని భావించి వారికి అవకాశం ఇస్తే మగవారిలాగానే అన్ని రంగాలలో ముందడుగు వేయగలరని నమ్మి ఆడవారి ప్రతిభని సమాజానికి తెలియచేయాలనుకునే జ్ఞానవంతులు తమ కుటుంబంలోని మహిళలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను ఇచ్చి ప్రోత్సహిస్తూ ఆడవారిని ఎదగనిస్తూ సరైన సహకారం అందిస్తే మహిళలు ఏరంగంలోనైనా, చివరకు వ్యవసాయ రంగంలో కూడా రాణించగలరని నిరూపిస్తున్నారు. ఈ కోవకు చెందిన అభ్యుదయ భావాలున్న యుగేష్‌ ఆదర్శంగా ఆలోచించి తన భార్య ఐశ్వర్యను ప్రోత్సహించి వ్యవసాయ రంగంలో అడుగుపెట్టించి అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగటానికి తనవంతు ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేస్తున్నాడు.

యుగేష్‌ ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ బాధ్యతలు కొనసాగిస్తున్న క్రమంలో తన అర్థాంగి ఐశ్వర్య గృహిణి బాధ్యతలు నిర్వహిస్తుంది. ఉన్నత చదువులు చదివిన ఐశ్వర్య తన ఖాళీ సమయాన్ని చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్నకుండీలు లేదా సిరామిక్‌ పాట్‌లలో పెట్టి ఆన్‌లైన్‌లో అమ్మకం చేయడం మొదలు పెట్టింది. అవి అమ్మకం చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతూ ఉండేది. ఐశ్వర్యకు మొక్కల మీద ఉన్న శ్రద్ధను గమనించిన భర్త యుగేష్‌ తన భార్యకు ప్రోత్సాహాన్ని అందిస్తే వ్యవసాయ రంగంలో కూడా రాణించగలదని గ్రహించి తాను ఉద్యోగం కొనసాగిస్తూనే ఐశ్వర్యను పంటల సాగులో అదీను సేంద్రియ సాగులోకి ప్రోత్సహించటం జరిగింది.

తమకు సొంత పొలం లేదు కాబట్టి హైదరాబాదు శివారులో ఐదున్నర ఎకరాల భూమిని కౌలుకి తీసుకుని నాలుగున్నర సంవత్సరాలు ఆ భూమిలో వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేయడంతో పాటు, నాటు కోళ్ళను కూడా పెంచుతూ నాటు కోడి మాంసం మరియు నాటుకోడిగ్రుడ్లు అమ్మకం చేస్తూ వస్తున్నారు. వీరి నివాసగృహానికి పొలం దూరంగా ఉండటంతో నిర్వహణ ఇబ్బందిగా ఉందని గ్రహించి ఆ పొలాన్ని వదలి వేసి ఇంటి సమీపములోనే 2023వ సంవత్సరం జనవరి నెలలో ఎకరంన్నర పొలాన్ని కౌలుకి తీసుకుని ఆ పొలంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, కోళ్ళ పెంపకం, స్ట్రాబెర్రీ సాగు మొదలు పెట్టి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం స్ట్రాబెర్రి సాగు మరియు కొన్ని రకాల ఆకుకూరల సాగుతో పాటు నాటుకోళ్ళ పెంపకం కొనసాగుతుంది.

స్ట్రాబెర్రి: అర ఎకరంలో స్ట్రాబెర్రి పంట సాగులో ఉంది. ఇందుకుగాను స్ట్రాబెర్రి మొక్కలను ఒక్కొక్కటి 13/-ల చొప్పున పూణే నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దుక్కిలో కోడి ఎరువు, ఆవుల ఎరువు, వర్మికంపోస్టు మిశ్రమాన్ని అందించి అర ఎకరం పొలాన్ని బెడ్‌లు చేసుకున్నారు. బెడ్‌కి బెడ్‌కి మూడు అడుగుల దూరం పాటించి బెడ్‌లపై మల్చింగ్‌ షీటు పరచారు. మల్చింగ్‌ షీటుకు అడుగు దూరంలో బెజ్జాలు చేసుకుని ఆ బెజ్జాలలో మరలా సేంద్రియ ఎరువు మిశ్రమాన్ని అందించి నవంబరు నెలాఖరులో అర ఎకరానికి గాను 5000 మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు ఆరోగ్యంగా లేకపోవడంతో సుమారు 2000 మొక్కలు చనిపోగా మిగిలిన 3000 మొక్కలను పోషిస్తూ వచ్చారు. మొక్కలు నాటిన తరువాత 10 నుంచి 15 రోజుల వ్యత్యాసంలో రెండుసార్లు సేంద్రియ ఎరువుల మిశ్రమాన్ని అందించారు. వారానికి 200 లీటర్ల చొప్పున జీవామృతాన్ని డ్రిప్పు ద్వారా అందిస్తూ వస్తున్నారు. జీవ సంబంధిత కీటకనాశనులను ఒకసారి డ్రిప్పుద్వారా నేలకు అందించారు. వివిధ రకాల చీడపీడల నివారణకు పుల్లటి మజ్జిగ, అగ్నాస్త్రం, గంజి ద్రావణం,, నీమాస్త్రం మొదలగు వాటిని ప్రతి మూడు రోజులకు ఏదో ఒకటి పిచికారి చేస్తూ వస్తున్నారు. వీటన్నింటితో పాటు ఎర పంటలుగా ఆముదము, టమాట మొక్కలు, దీపపు ఎర, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ జనవరి మొదటి వారంలో మొదట దిగుబడి పొందగలిగారు. పిబ్రవరి మొదటి వారం వరకు 3000 మొక్కల నుండి 30 కిలోల దిగుబడి పొందారు. పంటను గమనించినట్లయితే ఇంకా 50 కిలోల వరకు దిగుబడి వచ్చేలా ఉంది. కిలో 600/-ల నుంచి 800/-ల వరకు అమ్మకం చేస్తూ వస్తున్నారు. వచ్చిన దిగుబడిని అమ్మటానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.

నాటుకోళ్ళు: వీరు వ్యవసాయ రంగంలో అడుగుపెట్టినప్పటినుంచి నాటు కోళ్ళను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వీరి దగ్గర సోనాలికా, అసిల్‌ క్రాస్‌, వనరాజా, కడక్‌నాథ్‌, గిన్నె కోళ్ళు మొదలగు రకాలు అన్నీ కలిపి 250 వరకు ఉన్నాయి. వీటి నుండి ప్రతి రోజు 40 వరకు గ్రుడ్ల దిగుబడి పొందుతూ ఒక్కొక్క గ్రుడ్డును 13 నుంచి 14 రూపాయల వరకు అమ్మకం చేస్తున్నారు. గ్రుడ్లతో పాటు నాటుకోడి మాంసాన్ని కూడా అమ్ముతున్నారు. లైవ్‌ వెయిట్‌ అయితే నాటుకోడి కిలో 450/- లకు, కడక్‌నాథ్‌ కిలో 750/-లకు, కోడిమాంసం అయితే నాటుకోడి మాంసం కిలో 650/-లకు, కడక్‌నాథ్‌ కోడి మాంసం కిలో 850/-లకు అమ్మకం చేస్తున్నారు. నెలకు 70 నుంచి 80 కిలోల మాంసం అమ్మకం చేస్తున్నారు.

రెండు ఆవులను కూడా పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగుకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రకాల ఆకుకూరలు సాగులో ఉన్నాయి. భవిష్యత్తులో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల సాగుతో పాటు ఇంటిపంట నిర్వహించే వారికి అవసరమయిన మొక్కలను సరఫరా చేయడానికి వీలుగా నర్సరీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. భర్త యుగేష్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో ఐశ్వర్య అతి క్లిష్టమైన సేంద్రియ వ్యవసాయ రంగంలో అడుగుపెట్టి పట్టుదలతో ముందుకు సాగుతూ కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తే మహిళలు వ్యవసాయ రంగంలో కూడా రాణింగలరని నిరూపిస్తున్నారు. మరిన్ని వివరాలు 7671075270 / 6302308300 నెంబర్లకు ఫోను చేసి తెలుసుకోగలరు.       

దీపపు ఎర : స్ట్రాబెర్రి పంటకు ఒకానొక సమయంలో పొగాకు లద్దె పురుగు విపరీతంగా ఆశించింది. ఆ పురుగు నివారణకు వివిధ రకాల కషాయాలు, జీవ సంబంధిత పురుగు మందులు పిచికారి చేయడంతో పాటు భవిష్యత్తులో ఆ సమస్య రాకుండా ఉండటానికి దీపపు ఎరలను ఏర్పాటు చేశాము. బల్బు క్రింద బక్కెట్లు ఏర్పాటు చేసి బక్కెట్లో 70% నుంచి 80% నీటిని నింపి బక్కెట్‌ పైన బల్బును వేలాడదీసి సాయంకాలం 6 గంటల తరువాత బల్పును వెలిగించి రాత్రి ఒంటి గంటకు బల్బు ఆగిపోయేలా ఏర్పాటు చేసుకున్నాము. ఈ విధంగా చేయడం వలన తరువాత పొగాకు లద్దె పురుగు సమస్య స్ట్రా బెర్రి పంటకు రాలేదు అని ఐశ్వర్య వివరించారు.

కుటుంబ  సభ్యుల సహకారం తప్పనిసరి

ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో మహిళల సహకారం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమాజంలో భర్త సహకారంతో ఐశ్వర్య వ్యవసాయ రంగంలో అదీను సేంద్రీయ వ్యవసాయ రంగంలో అడుగు పెట్టి వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. ఆడవారిని బయటకు పంపడానికే వ్యతిరేకించే పరిస్థితులనుంచి, ‘మగవారితో పోల్చుకుంటే ఆడవారు ఎందులోనూ తక్కువ కాదు’ అని అనేక మంది మహిళలు నిరూపిస్తున్నారు. సమాజంలో బుద్ధి లేని మగవారి నుంచి ఎదురయ్యే అనేక సమస్యలను ఎదుర్కొంటూ వివిధ రంగాలలో మహిళలు రాణించగలుగుతున్నారు. ఏ రంగంలో మహిళలు విజయం సాధించినా అందుకు ప్రధాన కారణం తమ కుటుంబంలోని పురుషుల సహకారం, ప్రోత్సాహం అందడం వలననే సాధ్యమవుతుంది. అన్ని రకాలుగా తమ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా తన భర్త యుగేష్‌ నుంచి మంచి సహకారం, ప్రోత్సాహం అందడం వలన నేను ఈ రంగంలో ముందుకు సాగ గలుగుతున్నానని తన కుటుంబసభ్యులకు ఐశ్వర్య కృతజ్ఞతలు తెలియజేశారు.

Read More

ఆయిల్‌పామ్‌ రైతులకు ఆశాకిరణం

తుమ్మల నాగేశ్వరరావు

మట్టే శ్వాస…  పల్లే  ప్రాణం… సాగే ధ్యాస… రైతే  నాడిగా జీవిస్తూ… 

కాడి, మేడి బాగుకోసం నిరంతరం తపించే రైతు సేవాతత్పురుడు తుమ్మల నాగేశ్వరరావు.

సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నా ఏనాడూ వ్యవసాయం వదలలేదు. ఆ మూలాలు మరవకపోవటం విశేషం. నరనరాన మట్టితో మమేకమైన జీవిత వాసనలు  జీర్ణించుకున్నారు. రాజకీయ జీవితంలో ఆటుపోట్లు ఉన్నా, కష్ట సమయంలో వ్యవసాయంలో సేదతీరారు. దానిలో పండిపోయి రైతు శాస్త్రవేత్త కాగలిగారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు తన సంప్రదాయ వారసత్వ విజ్ఞానం జోడించి మార్కెట్‌కు ధీటుగా పలు పంటలు సాగు చేస్తూ తోటి రైతులకు మార్గదర్శిగా నిలిచారు. ఆధునిక జీవనశైలికి భిన్నంగా గ్రామీణ ప్రాంత రైతు జీవితాన్నే కోరుకున్నారు.  రైతు జీవితాన్ని పూర్తిగా స్వేచ్ఛగా ఆస్వాదించారు. ఏనాడూ  రైతు స్వభావాన్ని వదులు కోలేదు. స్వేదవేదాన్ని ఔపోసన పట్టారు. దాన్ని ఆత్మ సౌందర్యాన్ని వంట బట్టించుకుని ఆ పరిమళ భరితమైన సుగంధాన్ని నలుగురికి పంచారు. ఏడు పదుల వయసులో మరలా వ్యవసాయ మంత్రిగా సేవచేసే అవకాశం దొరికింది. తనకు ఇష్టమైన శాఖలో తనదైన ముద్ర వేసేందుకు ప్రణాళికా బద్ధంగా పనిచేయాలనే దృఢసంకల్పంతో తుమ్మల నాగేశ్వరరావు ముందుకు సాగుతూ ఉన్నారు. రైతులు కూడా తోటి రైతు నాయకత్వంలో తమకు కష్టనష్టాలు ఇక ఉండవనే భరోసాతో ఉన్నారు. దీనికి సాక్ష్యంగా మూడు రాష్ట్రాల ఆయిల్‌పామ్‌ రైతులు  వారి సాగు సమస్యలు గురించి చర్చించటానికి రావటాన్ని ఉదహరించవచ్చు.

పామాయిల్‌.. వంట నూనెగా సుపరిచితం. పామాయిల్‌ చరిత్ర చూస్తే ఏడాదికి మన దేశం దిగుమతి చేసుకునే పామాయిల్‌ చిన్న రాష్ట్రాల బడ్జెట్‌ కంటే ఎక్కువగా ఉంది. 2022 – 23 ఏడాదికిగాను మన దేశం 164 లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి చేసుకుంటే అందులో 59 శాతం పామాయిల్‌దే సింహభాగం. ఏడాదికి మన దేశం లక్షా 38 వేల కోట్ల రూపాయల విలువైన వంట నూనెలు దిగుమతి చేసుకుంటే అందులో 85 వేల కోట్లు పామాయిల్‌ వాటా. అంతలా డిమాండ్‌ ఉన్న పామాయిల్‌ చరిత్ర చూస్తే 5 వేల సంవత్సరాల క్రితం పామాయిల్‌ సాగు మొదట ఆఫ్రికా దేశాల్లో మొదలైంది. దక్షిణ ఆఫ్రికాలో మొదలైన పామాయిల్‌ సాగు ప్రపంచమంతా విస్తరించింది. పారిశ్రామిక విప్లవంతో యంత్రాల కందెనగా పామాయిల్‌ వాడేవారు. దాంతో బ్రీటీష్‌ వ్యాపారులచే ఆఫ్రికా నుంచి పామాయిల్‌ ఎగుమతులు మొదలైయ్యాయి. ఇండోనేషియా, మలేషియా, నైజీరియా, ధాయ్‌లాండ్‌ దేశాలు పామాయిల్‌ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి.

ఇక మన దేశంలో పామాయిల్‌ సాగు  విషయానికోస్తే  1886లో కోల్‌కతాలోని నేషనల్‌ రాయల్‌ బొటానికల్‌ గార్డెన్‌లో ఆయిల్‌పామ్‌ను  పరిచయం చేశారు. మహారాష్ట్ర అసోషియేషన్‌ ఫర్‌ కల్టివేషన్‌ ఆఫ్‌ సైన్సెస్‌ పూణె వారు కాలువ గట్లు,  ఇంటి ఆవరణ, అటవీ భూముల్లో 1949 నుంచి 1959 వరకు నాటారు. తరువాత కేరళలో ప్లాంటేషన్‌ ఆఫ్‌ కేరళ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో, ఆ తరువాత అండమాన్‌ ఫారెస్ట్‌ అండ్‌ ప్లాంటేషన్‌ ఆధ్వర్యంలో 1984 వరకు పెద్దఎత్తున నాటారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్రకారం దేశంలో 22 రాష్ట్రాల్లో 27 లక్షల హెక్టార్లల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు అవకాశాలున్నట్లు నివేదిక రూపొందించారు. దేశంలో ఆయిల్‌ పామ్‌  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ,  కేరళ,  తమిళనాడు,  గుజరాత్‌, చత్తీస్‌ ఘడ్‌, మిజోరం,  అస్సాం,  ఒడిషాలో సాగు చేస్తున్నారు. విస్తీర్ణంలో మొదటి స్థానం  ఏపీ దే కావటం విశేషం.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ లో ఆయిల్‌ పామ్‌ సాగుకు బాటలు ఎన్టీఆర్‌, తుమ్మల నాగేశ్వరరావు కలసి వేశారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రిగా  ఎన్టీఆర్‌ ఉన్న సమయంలో నాటి  ఖమ్మం జిల్లాలో పెదవేగి నుంచి ఓ ఆయిల్‌ పామ్‌  మొక్క తెప్పించి  నాటి అప్పుడు  జిల్లా మంత్రిగా ఉన్న తుమ్మల ఆయిల్‌ పామ్‌ సాగుకు శ్రీకారం చుట్టారు.  దీని సాగుకు ఎకరంలో 57 మొక్కలు నాటాలి.  తెలంగాణలో సబ్సీడీ మీద ఉద్యాన శాఖ వారు మొక్కలు అందిస్తారు.

నాలుగు సంవత్సరాల వరకు రాయితీల రూపంలో ఎకరాకు 50వేలు రైతులకు అందుతాయి. మొక్కలు పాతిక నుంచి నలభై సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తాయి. నాలుగో ఏట నుంచి పంట దిగుబడి వస్తుంది. అంతర పంటలుగా కోకో, జాజికాయ తదితర  ఉద్యాన పంటలు  సాగు చేయవచ్చు. దిగుబడి మొదలైన తరువాత నెల నెల ఆదాయం ఉంటుంది. గత ఏడాది టన్ను గెల ధర 20 వేల వరకు పలికింది.

గతంలోకి తొంగి చూస్తే ఆయిల్‌ పామ్‌  సాగుతో రైతును రాజు చేసిన ద్వయం  ఎన్టీఆర్‌, తుమ్మల అని చెప్పవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణలో తొలిసారిగా ఆయిల్‌పామ్‌  సాగుకు శ్రీకారం చుట్టిన ఘనత  నేటి  మంత్రి తుమ్మల కావటం విశేషం. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయిల్‌పామ్‌ తొలి మొక్కను తొలుత తన వ్యవసాయ క్షేత్రం దమ్మపేట మండలం గండుగులపల్లిలో నాటి తనలో ఉన్న అభ్యుదయ రైతును వెలికితీసి పట్టం కట్టారు.  తుమ్మల ప్రేరణతో మరికొంత మంది ఔత్సాహిక రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టారు. అలా మొదలైన ఆయిల్‌పామ్‌ సాగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే  50 వేల ఎకరాలకు పైగా సాగు చేయటం విశేషం. అశ్వారావుపేటలో ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెరిగింది. ఆయిల్‌పామ్‌  సాగుకు బాటలు వేసిన తుమ్మల కేసీఆర్‌ క్యాబినేట్‌లో మంత్రిగా ఉన్న సమయంలో దమ్మపేట మండలం నూతన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నెలకొల్పారు. దాంతో రైతులకు ఇది  వరంగా మారింది. వ్యవసాయం చేయడమే కాదు తోటి రైతులను రాజుగా మార్చి తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు క్యాబినేట్‌లో ఆమోదం చేయించి తుమ్మల చరిత్రలో నిలిచారు. వారిలో రైతు సేవా తత్పరతకు ఇది నిలువెత్తు నిదర్శనం.

ఇప్పుడు గెల ధర 12 వేలుగా ఉంది. ఒక ఉద్యమస్ఫూర్తితో తెలంగాణలో 9 జిల్లాలకు ఆయిల్‌పామ్‌ సాగు విస్తరించింది. వేల ఎకరాల నుంచి లక్షల ఎకరాలకు పెరిగింది. గెల ధరలు పడిపోవటంకు  దిగుమతుల సుంకం 17.5 నుంచి 12.5  శాతంకు తగ్గించటం కారణం. మరో వైపు సాగు వ్యయం పెరగటం ఆందోళన కలిగించే అంశం. ఆయిల్‌ పామ్‌సాగుకు సంభందించి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం అందరూ తుమ్మలనే ఎంచుకుని, వారిలో  ఆప్త బంధువును చూసుకోవటం తుమ్మల మీద రైతులకు ఉన్న గురి, నమ్మకం తెలియచేస్తున్నాయి. ఈ క్రమంలో జుఆ ం|ఉఓజూఈ చైర్మన్‌ రాఘవరావు  మంత్రిని కలిసి రైతుల కోసం కలసి రాజకీయాలకు అతీతంగా సాగుదాం అని పిలుపు ఇవ్వటం, దానికి మంత్రి తుమ్మల సానుకూలంగా  స్పందించి అందరం కలసి కేంద్ర రైతు వ్యతిరేఖ విధానాలకు  వ్యతిరేకంగా పోరాడడం జరుగుతుందని చెప్పటం విశేషం. ఇది తుమ్మల పట్ల రైతులకు ఉన్న  విశ్వసనీయతకు నిజాయితీకి నిర్భీతికి లభిస్తున్న ఆదరణ అని చెప్పక తప్పదు.

మరీ ముఖ్యంగా తుమ్మల రైతును మహారాజు చేయటం కోసం, యువత పొలం బాట పట్టడం కోసం, వ్యవసాయం లాభసాటి వ్యాపకం చేయటం కోసం అహరహం శ్రమించి అందరి సహకారంతో   ఆచరణతో విజయాలు సాధించేవరకు ఉమ్మడిగా ఒక్కటిగా రైతే మంత్రంగా నడుద్దామని పిలుపు నివ్వడం ఒక మంచి పరిణామంగా భావించవచ్చు. భవిష్యత్‌లో రైతుకు, వ్యవసాయ సమాజానికి  తుమ్మలే  ఒక ఆశాకిరణంగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్మేలా కృషి చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు. సందేహపడలిసిన అవసరం లేదని ఘంటాపధముగా చెప్పవచ్చు.

Read More

ఉత్పత్తి తగ్గుతున్నా పత్తి ధరలు ఎందుకు పెరగటం లేదు?

2023-24 సంవత్సరంలో భారతదేశంలో పత్తి ఉత్పత్తి 295.1 లక్షల బేళ్ళకు తగ్గుతుందని ప్రభుత్వ, వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత 15 సంవత్సరాల్లో ఇదే కనిష్ట స్థాయి ఉత్పత్తిగా నమోదవుతుందని ఈ అంచనాలు తెలుపుతున్నాయి. 2013-14లో దేశంలో 398 లక్షల బేళ్ళ ఉత్పత్తయింది. అత్యధికంగా ఆ సంవత్సరంలో 117 లక్షల బేళ్ళ పత్తి విదేశాలకు ఎగుమతి అయింది. ఇటీవలికాలంలో 2021-22లో 338 లక్షల బేళ్ళ పత్తి గరిష్టంగా ఉత్పత్తయింది. 2022-23లో ఉత్పత్తి 336 లక్షల బేళ్ళకు తగ్గగా, 2023-24లో 300 లక్షల బేళ్ళ కన్నా తక్కువ స్థాయికి దిగజారటం ఆందోళన కలిగిస్తున్నది. 2022లో పత్తిధర క్వింటాలుకి రూ. 8,000 నుండి రూ. 10,000 మధ్య కదలాడింది. ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో ధరలు మరింత పెరుగుతాయని రైతులు ఆశించారు. కాని 2023 నవంబరు నుండి ప్రారంభమైన సీజనులో ధరలు కనీస మద్దతు ధర కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి. మధ్య పింజ పత్తికి క్వింటాలుకి రూ. 6620, పొడుగు పింజ పత్తికి రూ. 7020 గా కనీస మద్దతు ధరలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వర్షాల వల్ల తడిసి, తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తికి క్వింటాలుకి రూ. 5000 నుండి రూ. 6000 కన్నా ఎక్కువ ధరలు లభించటం లేదు. తేమ శాతం తక్కువగా ఉండి, నాణ్యమైన పత్తికి కూడా కనీస మద్దతు ధరల కన్నా ఎక్కువ ధరలు లభించటం లేదు.

అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితి

ప్రపంచ వ్యాప్తంగా కూడా పత్తి ఉత్పత్తిలో స్తబ్ధతే నెలకొన్నది. గింజ తీసిన పత్తి ఉత్పత్తి 2017-18లో అత్యధికంగా 27 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా నమోదైంది. 2018-19 లో 25.98 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, 2019-20లో 26.13 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, 2020-21లో 24.32 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, 2021-22లో 26.44 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా పత్తి ఉత్పత్తి అంచనా వేశారు. 2022-23లో 23.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, 2023-24లో 23.4 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు పత్తి ఉత్పత్తయినట్లు అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ ప్రకటించింది. గత ఆరేడేళ్ళగా పత్తి ఉత్పత్తిలో ప్రగతి లేనట్లుగా ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఐతే పత్తి వినియోగంలో కూడా తగ్గుదల కనిపిస్తున్నది. 2021-22లో పత్తి వినియోగం 25.18 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా నమోదైంది. అది 2022-23లో 23.79 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు తగ్గింది. వరుసగా రెండు, మూడేళ్ళుగా ఉత్పత్తి కన్నా వినిమయం తక్కువగా ఉండటం వల్ల ఎంతో కొంత నిల్వలు పెరుగుతున్నాయి. వినిమయం తగ్గటానికి వివిధ దేశాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కొంత కారణమైతే, కృత్రిమ దారాల వినిమయం పెరగటం, నూలు దారాలతో కృత్రిమ దారాలను కలిపి వాడటం కూడా కారకాలే. మన దేశంలో బట్టలకు వాడుతున్న దారాల్లో 73 శాతం వాటా నూలు దారాలదే. కృత్రిమ దారాల వాటా 27 శాతం మాత్రమే. కాని ప్రపంచ స్థాయిలో చూస్తే 62 శాతం వాటా నైలాన్‌, పోలియెస్టర్‌, ఏక్రిలిక్‌, రేయాన్‌ వంటి కృత్రిమ దారాలదే. 38 శాతం వాటా మాత్రమే నూలు దారాలది. శీతోష్ణ స్థితుల్లో ఉండే తేడాల వల్ల వివిధ దేశాల్లో నూలు దారాలు, కృత్రిమ దారాలు, ఉన్ని, తోలు, పట్టు వంటి వివిధ మూలపదార్థాల నుండి బట్టలు తయారవుతున్నాయి. వచ్చే ఐదారేళ్ళలో నిపుణుల అంచనాల ప్రకారం నూలు దారానికి గిరాకీ సాలీనా 2.7 శాతం పెరుగుతుందనీ, కృత్రిమ దారాలకు గిరాకీ మాత్రం సాలీనా 7.4 శాతం చొప్పున పెరుగుతుందనీ తెలుస్తున్నది. 2022లో యుక్రెయిన్‌-రష్యాల యుద్ధం మొదలైన తర్వాత ముడిచమురు ధరలు బారెల్‌కి 100 డాలర్లు దాటాయి. అప్పుడు ముడి చమురు నుండి తయారయ్యే కృత్రిమ దారాలు ధరలు కూడా పెరిగాయి. వాటికనుగుణంగానే నూలు ధరలు కూడా పెరిగాయి. అందువల్లనే పత్తికి గిరాకీ తగ్గి, వినిమయం తగ్గి ఉండవచ్చు. 2023లో ముడి చమురు ధరలు 75 డాలర్లకు తగ్గటంతో కృత్రిమ నూలు ధరలు, పత్తి నూలు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి ధరలు కూడా మందగించాయి.

ఉత్పాదకతలో ప్రతిష్ఠంభన

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు పత్తిని 43 లక్షల హెక్టార్లలో సాగు చేసేవారు. హెక్టారుకి 132 కిలోల సగటు దిగుబడితో 23 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. 2013-14 కల్లా ఉత్పత్తి 17 రెట్లు పెరిగి 398 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. పత్తి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. దిగుబడులు కూడా నాలుగైదు రెట్లు పెరిగాయి. 1970వ థకంలో సంకరజాతి పత్తి విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. 1980-81లో కూడా పత్తి సగటు దిగుబడి హెక్టారుకి 169 కిలోలే. అప్పటికి సంకర జాతి రకాలు కేవలం ఐదు శాతం విస్తీర్ణంలోనే సాగయ్యాయి. 2000-01 నాటికి 45 శాతం పత్తి విస్తీర్ణంలో సంకర పత్తి రకాలు సాగయ్యాయి. అప్పటికి పత్తి దిగుబడులు హెక్టారుకి 308 కిలోలకు చేరుకున్నాయి. 21వ శతాబ్దం ప్రారంభంలో  ‘బాసిల్లస్‌తూరెంజెన్స్‌’ (బి.టి.) జన్యువుని సంకర రకాల్లో ప్రవేశ పెట్టటం మొదలైంది. బి.టి. సంకర రకాలను రైతులు బాగా ఆదరించడంతో 2007-08 కల్లా సగటు దిగుబడులు హెక్టారుకి 580 కిలోల వరకు పెరిగింది. 2013-14 కల్లా పత్తి విస్తీర్ణంలో 97 శాతం వరకు బి.టి. సంకర రకాలను సాగు చేసారు. హెక్టారుకి 565 కిలోల సగటు దిగుబడితో పత్తి ఉత్పత్తి గరిష్టంగా 398 లక్షల బేళ్ళకు చేరింది. సంకర జాతి రకాలకు అధిక దిగుబడినిచ్చే శక్తి ఉంది. అయితే పత్తి పంటకు కాయతొలిచే పురుగుల బెడద ఎక్కువగా ఉండేది. సంకర జాతి రకాల్లో బి.టి. జన్యువుని ప్రవేశపెట్టటం వల్ల కాయతొలిచే పురుగులను చాలావరకు నియంత్రించటం సాధ్యపడింది. పురుగు మందుల ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది. అయితే రసం పీల్చే పురుగులపై ఇప్పటికీ రసాయనాలను వాడుతున్నారు. అలాగే బి.టి. జన్యువు ప్రభావం 90 రోజుల వరకే ఉంటుంది. ఆలస్యంగా పంటనాశించే గులాబీ రంగు కాయతొలిచే పురుగులపై బిటి జన్యువు ప్రభావం తక్కువగా ఉంటుంది. వాటి నివారణకు పురుగు మందుల వాడకం తప్పటం లేదు. అయినా కూడా గులాబీ రంగు కాయతొలిచే పురుగుల వల్ల నష్టం తప్పటం లేదు. ముఖ్యంగా పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో గులాబీరంగు కాయతొలిచే పురుగు బెడద తీవ్రంగా ఉంది. గత పది సంవత్సరాలుగా పత్తి సాగులో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏదీ అందుబాటులోకి రాలేదు. హెక్టారు దిగుబడులు 500 కిలోలకు అటూఇటూ కదలాడుతున్నాయి. ఇక పత్తి ఉత్పత్తి పత్తి సాగు విస్తీర్ణంపైన, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల తాకిడి పైన ఆధారపడుతున్నది.

తెలుగురాష్ట్రాల్లో పత్తి సాగు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013-14 నాటికి పత్తిసాగు 23.89 లక్షల హెక్టార్లలో జరిగింది. హెక్టారుకి 555 కిలోల సగటు దిగుబడితో 78 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. 2014-15లో తెలంగాణాలో 17.13 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. హెక్టారుకి 501 కిలోల సగటు దిగుబడితో 50.5 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. ఆంధ్రప్రదేశ్‌లో పత్తి సాగు 8.21 లక్షల హెక్టార్లలో జరిగింది. 549 కిలోల హెక్టారు సగటు దిగుబడితో 26.5 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. 2021-22లో తెలంగాణాలో పత్తి సాగు 23.59 లక్షల హెక్టార్లలో జరిగింది. 432 కిలోల సగటు దిగుబడితో 59.95 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. ఆంధ్రప్రదేశ్‌లో పత్తి సాగు 6.06 లక్షల హెక్టార్లకు తగ్గింది. హెక్టారుకి 450 కిలోల దిగుబడితో 16.04 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణాలో పత్తిసాగు పెరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తగ్గింది. దేశపు సగటు దిగుబడి తగ్గినట్లుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పత్తి దిగుబడులు తగ్గాయి. 2022-23, 2023-24లో కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనూ పత్తి సాగు ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైంది. 2021-22లోనూ, 2022-23లోనూ పత్తికి మెరుగైన ధరలు లభించడం వల్ల పత్తి సాగుపట్ల ఆసక్తి పెరిగింది. కాని వర్షాభావం వల్ల కొన్ని థల్లోనూ, అధిక వర్షాల వల్ల మరికొన్ని థల్లోనూ పత్తి పంట దెబ్బతిన్నది. సగటు దిగుబడులు 500 కిలోలలోపే ఉన్నాయి. ఈ సంవత్సరం ధరలు కూడా తగ్గటంతో చాలామంది రైతులు నష్టపోయే అవకాశం కనిపిస్తున్నది. ఈ సంవత్సరం కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాపై సేకరణ బాధ్యతలు పెరిగాయి. తెలంగాణాలో నల్గొండ, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో పత్తిసాగు ఎక్కువగా కేంద్రీకృతమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా జరుగుతున్నది. ఈ జిల్లాలన్నిటిలోనూ రెండొంతుల విస్తీర్ణంలో పత్తిని వర్షాధారంగానూ, ఒకవంతు విస్తీర్ణంలో నీటి వసతితోనూ సాగు చేస్తున్నారు. 2022-23లో తెలంగాణాలో 20.25 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగినట్లు అంచనాలున్నాయి. 58.54 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయినట్లు అంచనా వేసారు. ఆంధ్రప్రదేశ్‌లో 2022-23లో 6.02 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగినట్లు, 17.85 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తి అయినట్లు అంచనాలున్నాయి. 2023-24లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పత్తి ఉత్పత్తి తక్కువగా ఉండవచ్చని ప్రాథమిక అంచనాలున్నాయి.

సాపేక్షికంగా తగ్గిన పత్తి ధర

సాంకేతిక అభివృద్ధి కారణంగా వస్తువులు, సేవల వాస్తవ ధరలు తగ్గటం సహజంగా జరుగుతున్నది. కంప్యూటర్ల వాస్తవ ధరలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు సంపన్నులు మాత్రం వాడగలిగిన సెల్‌ఫోన్లను ఇప్పుడు పేద ప్రజలు కూడా వాడగలుగుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విషయం కూడా అంతే. ప్రస్తుత ధరల్ని ద్రవ్యోల్బణ సూచీతో భాగిస్తే వచ్చే వాస్తవ ధరలు వరి, గోధుమ, పప్పులు, వంట నూనెల వంటి ఏ వ్యవసాయ ఉత్పత్తి విషయంలోనైనా తగ్గటం మన అనుభవంలో అర్థమవుతుంది. అయితే ఏ పంట సాగులో దిగుబడులు పెరిగి, వాస్తవ ఉత్పత్తి వ్యయం తగ్గుతుందో ఆ పంట ఉత్పత్తి ధరలు బాగా తగ్గుతున్నాయి. కోడిగుడ్డు ఉత్పత్తి వ్యయం బాగా తగ్గటం వల్ల, దాని వాస్తవ ధర వేగంగా తగ్గి, అందరికీ అందుబాటులోకి రావటం మనందరి అనుభవం. అమెరికన్‌ మార్కెట్‌లో గత 50 సంవత్సరాల్లో ముఖ్య ఉత్పత్తుల ధరల్లో వచ్చిన మార్పుల్లో పత్తి వాస్తవ ధరలు బాగా తగ్గినట్లు తెలుస్తున్నది. 1973లో మొక్కజొన్న ధర బుషెల్‌కు 2.17 డాలర్లుగా ఉండేది. అది 2012లో గరిష్టంగా 6.92 డాలర్లకు చేరి, 2024లో 4.55 డాలర్లుగా ఉంది. 50 సంవత్సరాల్లో దాని ధర 2.09 రెట్లు పెరిగింది. మరో ముఖ్యమైన పంట సోయాచిక్కుడు ధర బుషెల్‌కు 1973లో 6.95 డాలర్లుగా ఉండేది. అది 2012లో గరిష్టంగా 14.62 డాలర్లకు చేరి, 2024లో 12.42 డాలర్లుగా ఉంది. 50 సంవత్సరాల్లో దాని మార్కెట్‌ ధర 1.79 రెట్లు పెరిగింది. పత్తి ధర 1973లో పౌండుకి 60 సెంట్లుగా ఉండేది. అది 2011తో గరిష్టంగా 1.36 డాలర్లకు చేరి, 2024లో 81 సెంట్లుగా ఉంది. పత్తి మార్కెట్‌ ధర 50 సంవత్సరాల్లో 1.35 రెట్లు మాత్రమే పెరిగింది. మొక్కజొన్న, సోయాచిక్కుడు, పత్తి వాస్తవ ధరలు బాగా తగ్గాయి. కాని ఈ మూడింటిలో పత్తి ధర అన్నిటి కన్నా బాగా తగ్గింది. పత్తి సాగులో వచ్చిన సాంకేతిక మార్పులు వినిమయదారులకే లాభించాయి కాని రైతులకుకాదు. అమెరికాలోనైనా, చైనాలోనైనా, పశ్చిమాఫ్రికాదేశాల్లో ఐనా, భారత్‌, పాకిస్తాన్‌లలో ఐనా పత్తిని పండిస్తున్న రైతులకు అరకొరా లాభాలు, అప్పుడప్పుడు నష్టాలే మిగులుతున్నాయి. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ, సరఫరాల సమతుల్యతను బట్టి ధరలు నిర్ణయించబడతాయి. కాని ఇప్పుడు సరఫరా తగ్గినా చైనా వంటి దేశాలు పత్తి దిగుమతిని తగ్గించటం వల్ల గిరాకీ లేక మార్కెట్‌లో మాంద్యం కనిపిస్తున్నది. చైనాలో పత్తి వినియోగం ఎక్కువ కనుక పత్తిని దిగుమతి చేసుకొని నిల్వ పెట్టుకుంటుంది. కాని ఆ దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యల వల్ల పత్తి దిగుమతుల్ని పరిమితం చేసింది. చైనా తర్వాత బంగ్లాదేశ్‌, వియత్నాం, టర్కీ, ఇండోనేషియాలు పత్తిని దిగుమతి చేసుకునే దేశాలు. పత్తిని ఎగుమతి చేసే దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌, ఉజ్బెకిస్తాన్‌, పశ్చిమాఫ్రికాలోని బుర్కినాఫాసో, బెనిన్‌, కామేరూన్‌ వగైరా దేశాలతో పాటు ఇండియా కూడా ఉంది. భారత్‌లో ఉత్పత్తి తగ్గుతున్నట్లుగా కాక ఇతర దేశాల్లో మెరుగైన పరిస్థితులుండటం వల్ల కూడా మార్కెట్‌లో ధరలు పెరగకపోతుండవచ్చు. ఏదైనా రెండు మూడు నెలలు గడిస్తే గాని పత్తి మార్కెట్‌లో కదలిక ఉండకపోవచ్చు. కాని ఈలోగా చాలామంది రైతులు తెగనమ్ముకోవాల్సిరావచ్చు. 

పత్తిసాగులో లాభ, నష్టాలు

పత్తి మార్కెట్‌ ఎప్పుడూ అనిశ్చితికి పెట్టింది పేరే. జూదప్రియులకు కాటన్‌ మార్కెట్‌ ఆడటం ఇష్టమైన వ్యాపకం. ‘ఓపెనింగ్‌’, ‘క్లోజింగ్‌’ ధరలపై పెట్టే పందాలతో తలకిందులైన కుటుంబాలు వేల సంఖ్యలో ఉంటాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలోని నల్లనేలల్లో పండించే పత్తిని ఇంగ్లాండ్‌ తరలించటానికే బ్రిటిష్‌ కాలంలో రైలు మార్గాలను నిర్మించారనే వాదం కూడా ఉంది. బొంబాయి నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి అక్కడ ఏర్పడిన నూలు మిల్లులే కారణంగా చెబుతారు. పత్తి నుండి గింజను వేరు చేయటం, బేళ్ళగా నొక్కి, రవాణా చేయటం, పత్తి నుండి నూలు దారం తీయటం, దారం నుండి బట్టలు నేయటం, బట్ట నుండి దుస్తులు తయారు చేయటం, వాటిని దేశవిదేశాల్లో అమ్మటం అన్నీ వాణిజ్యీకరణకు దోహదపడ్డాయి. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ రాట్నం వడకటం, ఖాదీ బట్టల తయారీ దేశభక్తికి చిహ్నాలుగా నిలిచాయి. పత్తి సాగు సాంప్రదాయకంగా వర్షాధారంగా నల్ల నేలల్లో ఎక్కువగా జరిగేది. నీటి వసతిని కల్పించడం, సంకర జాతి రకాలను వాడటం వల్ల పత్తిసాగు కూడా ఒక వాణిజ్య కార్యక్రమంగా మారింది. 50 సంవత్సరాల క్రితం గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో భారీగా పెట్టుబడి పెడుతూ, సస్యరక్షణను ఒక క్రమ పద్ధతిలో చేస్తూ వ్యవసాయాన్ని ఒక జూదంగా మార్చారు. స్వంత భూమితో పాటు పొలాల్ని కౌలుకి తీసుకొని, వాణిజ్య స్థాయిలో పత్తి సాగుని విస్తరించారు. రైతులే కాకుండా ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కూడా పత్తిసాగులో పెట్టుబడులు పెట్టారు. ఏ ఇద్దరు కలిసినా ‘పత్తి వేశావా?’ అనే పలకరింపు సర్వసాధారణంగా ఉండేది. కొందరు లాభించగా, మరికొందరు నష్టపోయారు. తెల్లదోమ, కాయతొలిచే పురుగుల ఉధృతి పెరిగి కొన్ని సంవత్సరాల్లో పత్తి సాగు చేసిన రైతులంతా భారీగా నష్టపోయారు. వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పత్తి సాగు నల్లనేలల నుండి ఎర్రనేలలకు, ఇసుక నేలలకు కూడా పాకి, వాతావరణం, మార్కెట్‌ అనుకూలిస్తే లాభాలొచ్చాయి. లేకుంటే నష్టాలొచ్చాయి. బి.టి. పత్తి రకాలు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలపాటు రైతులు కుదుటపడ్డారు. కాని మళ్ళీ కొత్త పురుగులు, రోగాలు ప్రబలుతున్నాయి. అనావృష్టి, అతివృష్టి ప్రతి సంవత్సరం ఏదో ప్రాంతంలో విలయతాండవం చేస్తున్నాయి. ఎన్నో ఉపద్రవాలు, అనిశ్చితి పరిస్థితుల్లో రైతులు ఆశాభావంతో పత్తిని సాగు చేస్తున్నారు. ఒక క్వింటాలు పత్తి ఉత్పత్తి వ్యయం రూ. 6000 నుండి రూ. 9000 వరకు వివిధ రాష్ట్రాల్లో భిన్నంగా ఉంది. కాని పత్తి ధరలు రూ. 7000 లకు అటూఇటూగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది రైతులు నష్టపోతున్నారు. ధరలు రూ. 8000 నుండి రూ. 10,000 వరకు ఉంటాయనే ఆశాభావంతో రైతులు సాగు చేసారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా క్రియాశీలకంగా కొనుగోళ్ళు చేస్తేనే ప్రస్తుతం ఉన్న ధరలైనా నిలుస్తాయి. రెండు మూడు నెలలు నిలవ చేస్తే క్వింటాలు ధర రూ. 8000లు దాటవచ్చు. చాలా కొద్దిమంది రైతులే తమ పంటను నిల్వ చేసుకునే స్థితిలో ఉన్నారు. పత్తిరైతులు నష్టపోవటం ఇది మొదటిసారే కాదు, చివరి సారీ కాదు. భవిష్యత్‌లో ధరలు పెరుగుతాయనీ, రైతులు నిలదొక్కుకుంటారనీ ఆశిద్దాము.                  

డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్‌ & కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More

శీతాకాలంలో జీవాలలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలు

జీవాల పెంపకం అనేది కులవృత్తిగా తెలుగు రాష్ట్రాలలో తరతరాలుగా వస్తున్నది. ఇప్పుడు అనేక వర్గాల వారు కూడా గొర్రెలు మరియు మేకల పెంపకాన్ని వృత్తిగా ఎంచుకొని జీవిస్తున్నారు. అయితే ఈ జీవాల పెంపకం అనేది చాలా వరకు ఆరుబయట మేపే ప్రక్రియ. దీని వలన జీవాలు రాత్రి, పగలు కూడా, ఎండ, వాన మరియు చలిగాళ్లు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండి అనేక రకమైన వ్యాధులు సంక్రమించి తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. 

ముఖ్యంగా శీతాకాలంలో తీవ్రమైన చలి గాలులకు గురవడం వలన పి.పి.ఆర్‌,  గాలి కుంట వ్యాధి,  నీలి నాలుక,  దొమ్మరోగం మరియు నిమోనియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  ఈ వ్యాధులకు వివిధ రకముల సూక్ష్మాతి సూక్ష్మజీవులు (వైరస్‌) మరియు సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా) కారణం.

ముఖ్యంగా ఈ కాలంలో పి.పి.ఆర్‌ వ్యాధి జీవాలలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. పి.పి.ఆర్‌ వ్యాధి కారకం పారామిక్సో వైరస్‌ కుటుంబానికి చెందిన మారబిల్లి (ఖళిజీలీరిజిజిరి ఖీరిజీతిరీ) జాతి వైరస్‌ వలన కలుగుతుంది. దీనిని ముసర వ్యాధి, పారుడు రోగం,  లేక గోట్‌  ప్లేగ్‌  అని కూడా అంటారు. వ్యాధి సోకిన పశువులను మందలోకి ప్రవేశించడం వలన, దగ్గు తుంపర్ల వలన లేక వ్యాధి సోకిన పశువుల మలమూత్ర విసర్జ కాల వలన ఇతర పశువులకు ఈ వ్యాధి సోకుతుంది.

జీవాలలో ఈ వ్యాధులు వ్యాప్తి చెందితే అధిక మరణాలు సంభవించి రైతులకు తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తాయి. పశుశాలాల్లో లేక జీవాల కొట్టాల్లో లేక ఫారాల్లో జీవాల్లో తీవ్రమైన జ్వరం, దగ్గు, ముక్కు మరియు నోటి నుండి నీరు  కారటం లేదా చీము కారడం నోటిలో మరియు ముక్కుల్లో పుండ్లు అవ్వడం లేక కాళ్ల గిట్టల మధ్య పుండు ఏర్పడడం, పలుచటి రక్తంతో కూడిన విరోచనాలు  మరియు పశువులు మేత తీసుకోకుండా, నెమరు వేయకుండా ఉండడాన్ని గమనించినప్పుడు రైతులు సరైన సమయంలో వ్యాధి సోకిన జీవాలను వేరు చేసి పశు వైద్యుని సంప్రదించి సరైన చికిత్స చేయించి, వ్యాధి నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించి ఈ కాలంలో లాభాలను పొందవచ్చును.

శీతాకాలంలో పశుశాలాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యలు

*  వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరు చేయాలి.

*  నీరసించి ఉన్న జీవాలకు  తేలికగా జీర్ణమయ్యే గంజి లాంటి ఆహారాన్ని అందించాలి.

*  క్రొత్తగా కొనుగోలు చేసిన జీవాలను వేరుగా ఉంచి వ్యాధులు లేవని నిర్ధారించాకే మందలోకి కలపాలి.

*  పశువైద్యని సంప్రదించి సరైన చికిత్స ఇప్పించాలి.

*  స్థానికంగా వచ్చే వ్యాధులకు పశువైద్యని సంప్రదించి వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయించాలి. 

*  ముఖ్యంగా పి.పి.ఆర్‌,  నీలి నాలుక (బ్లూ టంగ్‌) వ్యాధులకు శీతాకాలానికి ముందే టీకాలు వేయించాలి.

*  టీకాలు వేసే వారం రోజుల ముందు నట్టల మందులు తప్పనిసరిగా వేయించాలి.

*  దోమలు, ఈగల బెడద కోసం వేపాకు పొగ కొట్టాల్లో వేయాలి.

*  రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పశువులుగా ఒకచోట ఉండడం వలన తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నది.  కావున  ఫారాలలో  పరదాలు  కట్టడం ద్వారా చలి ఒత్తిడిని తగ్గించవచ్చు.

*  వాతావరణంలో  తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాలి ధారాళంగా ఉండే విధంగా చూసుకోవాలి.

*  జీవాలకు సమీకృత దాణా పచ్చ గ్రాసం మరియు పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడూ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 

డా. ఎస్‌. వంశీకృష్ణ, ఎం.వీ.ఎస్సీ, పీహెచ్‌డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌, వెటర్నరీ మైక్రోబయాలజీ విభాగం, పశువైద్య కళాశాల, మామ్నూర్‌, వరంగల్‌, పి.వి. నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాయలం, ఫోన్‌: 8712908696

Read More

వ్యవసాయంలో పరిమళించిన ‘పద్మశ్రీ’లు

అండమాన్‌ భూమి పుత్రిక ” కామాచ్చి చెల్లమ్మాళ్‌ “

చెల్లమ్మాళ్‌ చదివింది ఆరో తరగతే. కానీ వ్యవసాయంలో శాస్త్రవేత్తల్ని సైతం ఆకట్టుకొనే ప్రయోగాలు చేశారు.

సేంద్రియంగా కొబ్బరి సాగులో, పంటల యాజమాన్యంలో ఆమెది అయిదు థాబ్దాల అపారమైన అనుభవం ఈ ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైన చెల్లమ్మాళ్‌ వందలాది రైతులకు స్ఫూర్తిప్రదాత.

దక్షిణ అండమాన్‌ ప్రాంతంలో ‘కామాచ్చి చెల్లమ్మాళ్‌’ అంటే ఎవరన్నట్టు చూస్తారు. కానీ ‘నారియల్‌ అమ్మ’ అనగానే వెంటనే గుర్తుపట్టేస్తారు. రంగఛంగ్‌ గ్రామానికి చెందిన అరవయ్యేడేళ్ళ చెల్లమ్మాళ్‌ జీవితం మొత్తం కొబ్బరి తోటలతోనే పెనవేసుకుపోయింది. ఇక సాగు అనుభవం అయిదు థాబ్దాలకు పైనే. మొదట్లో పంటకు చీడపీడలు, సరైన దిగుబడి లేకపోవడం వల్ల ఆమె ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. భూమి సారం తగ్గిపోవడానికీ, వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడానికీ కారణం రసాయనాల వాడకమేనని గ్రహించారు. ”రసాయనాల వాడకం వల్ల మట్టిలో సారం తగ్గిపోతుంది. అది మన ఆరోగ్యాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మట్టిలో కోల్పోయిన పోషకాల్ని భర్తీ చెయ్యడం చాలా కష్టం. కాబట్టి రైతులందరూ సేంద్రియ సాగువైపు మళ్ళాలి” అంటారామె. మాటలకే పరిమితం కాకుండా… తన పది ఎకరాల పొలంలో వివిధ ప్రయోగాలను ఆమె చేపట్టారు. వర్షాకాలం తరువాత పొడిగా ఉండే వాతావరణంలో… మట్టిలో తేమ నిలవడం కష్టం. ఈ సమస్యను అధిగమించడానికి కొబ్బరాకులు, కొబ్బరి పీచును కుళ్ళబెట్టి, ఇతర ఆకులతో పాటు మట్టిని కప్పి ఉంచడం మొదలుపెట్టారు. మట్టిలో తేమ క్షీణించిపోకుండా నిలవడంతో పాటు కలుపు మొక్కల నివారణకు కూడా అది ఎంతో ఉపకరించింది. చీడపీడల నివారణకు వాడే హానికరమైన రసాయనాలకు స్వస్తి చెప్పి… వివిధ సేంద్రియ పదార్థాలతో ‘ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజిమెంట్‌’ వ్యూహాన్ని అమలు చేశారు. మరోవైపు అంతర పంటల పెంపకాన్ని చేపట్టారు. ”ఒకప్పుడు కేవలం కొబ్బరి మాత్రమే సాగు చేసేదాన్ని. కొన్నిసార్లు దిగుబడి తగ్గడం, మార్కెట్‌లో ధరలు పడిపోవడం వల్ల నష్టపోవాల్సి వచ్చేది. అందుకే… ఒకే పంట మీద ఆధారపడకూడదనుకున్నాను. కొబ్బరితో పాటు దాదాపు 460 తాటి చెట్లు పెంచుతున్నాను. అరటి, వేరు శెనగ, పైనాపిల్‌, మిర్చి, కంద, చిలగడ దుంపలు, ఆకుకూరలు, పువ్వులు… అలా రకరకాల పంటలు వేశాను” అని వివరించారామె. ప్రస్తుతం ఏటా 27 వేలకు పైగా కొబ్బరికాయల దిగుబడి వస్తోంది.

చెల్లమ్మాల్‌ చేసిన కొత్త ప్రయోగాలు, ఆచరించిన వినూత్న పద్ధతులు మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటు తోటి రైతులకు స్ఫూర్తిగానూ నిలిచాయి. సుమారు 150 మందికి పైగా రైతులు ఈ పద్ధతులు అనుసరించేలా చేశారామె. ఆమె ప్రభావంతో… వారందరూ సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గుచూపారు. అలాగే రకరకాల పంటలు పండిస్తున్నారు. ”ఇలా చేయడం వల్ల ఏడాది పొడుగునా ఆదాయం ఉంటుంది. ఒక పంట దెబ్బ తిన్నా… మరొకటి ఆదుకుంటుంది” అంటారు చెల్లమ్మాళ్‌. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆమె సాగు విధానాల్ని పరిశీలించి అభినందించారు. గతంలో కొబ్బరి అభివృద్ధి బోర్డుతో సహా పలు సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్న ఆమెకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ని ప్రకటించింది.

చెల్లమ్మాళ్‌కు వ్యవసాయంలో ఆమె కుమారుడు రామచంద్రన్‌ సాయం చేస్తున్నారు. తన తల్లికి వచ్చిన ఈ పురస్కారం తమకు మరిన్ని ప్రయోగాలు చెయ్యడానికి స్ఫూర్తినిస్తోందని ఆయన చెబుతున్నారు. ”ఇప్పుడు ఆగ్రో-టూరిజం’ను ప్రమోట్‌ చెయ్యడానికి ప్రణాళికలు వేస్తున్నాం. మా పొలంలో రకరకాల పంటలు వేస్తున్నాం. సుగంధ ద్రవ్యాల్ని సాగు చేస్తున్నాం. ఫిష్‌ ఫార్మింగ్‌ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఆగ్రో-టూరిజానికి మంచి అవకాశం ఉంది. అది స్థానికుల్నీ, విద్యార్థుల్నీ మాత్రమే కాదు… పర్యాటకుల్ని కూడా ఆకర్షిస్తుందని మేం భావిస్తున్నాం” అని ఆ తల్లి కొడుకులు చెబుతున్నారు. చెల్లమ్మాళ్‌ మునుపటి ప్రయోగాల మాదిరిగానే ఈ ఆగ్రో టూరిజం ఆలోచన కూడా మరింతమంది రైతులను ఆ బాటలో మళ్ళిస్తుందనడంలో సందేహం లేదు.

నేను మారుమూల పల్లెటూర్లో నివసిస్తున్నాను. నాకు ‘పద్మశ్రీ’ పురస్కారం వచ్చిందని ఎవరో చెప్పినప్పుడు… ఎంతో సామాన్యురాలినైన నాకు అంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఎలా ఇస్తారనుకున్నాను. నన్ను ఆట పట్టిస్తున్నారనుకున్నాను. తరువాత అండమాన్‌ అధికారి ఒకరు అది నిజమేనని చెప్పారు. ఇప్పుడు నా నోట మాటలు రావడం లేదు. – కామాచ్చి చెల్లమ్మాళ్‌

బేలేరు రైతుబిడ్డకు ‘పద్మ’ పురస్కారం

కేరళ భూమిపుత్రుడు సత్యన్నారాయణకు జేజేలు

వారి స్ఫూర్తి అందరికీ ఆదర్శం

కేరళ కాసర్‌ఘడ్‌ ప్రాంతంలోని బెలేరు గ్రామ రైతు 50 సంవత్సరాల  సత్యన్నారాయణ బేలేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హోరెత్తుతున్న పేరు. అతను వరి రైతు కాదు.

రబ్బరు, వక్క పండిస్తారు. అయినా వరి కుటుంబం అంతా ఒక్కటిగా ఒక్కసారిగా వారి వైపు దృష్టి సారించారు. ఎందుకో తెలుసా?

తల్లిదండ్రులు, అన్నతో ఉన్న 5 ఎకరాలలో రబ్బరు, వక్క  పంటలు సాగు చేస్తూ ఉమ్మడి వ్యవసాయం చేస్తూ ఉన్నా తనకున్న మక్కువతో 650 వరి రకాల విత్తనాలను సేకరించి, సంరక్షిస్తూ   వరి జర్మ్‌ ప్లాజంకు కేంద్రబిందువై శాస్త్రవేత్తలను, రైతులను, జన్యుసంపద సంరక్షించే కేంద్రాలను   అందరినీ తనవైపు  ఆకర్షించారు. పెద్దగా చదువుకోలేదు. మొన్ననే 12వ తరగతి అక్షరాస్యతా మిషన్‌ ద్వారా పూర్తి చేశారు. 2024  పద్మశ్రీ పురస్కారంకు ఎంపికై చరిత్ర సృష్టించారు. వీరి ఉమ్మడి కుటుంబ వ్యవసాయ భూమి వాలు కలిగి ఉంది. దీనితో వరి సాగు కష్టం. దీనితో సత్యన్నారాయణ వరి రకాల సంరక్షణకు తన పెరటినే కేంద్రం చేసుకున్నారు. గ్రోబ్యాగ్స్‌లో విత్తనాలు నాటి, మొలకెత్తిన తరువాత  మొక్కలను కుండీలలోకి మార్చటం చేస్తూ తన అభిరుచిని సాకారం చేసుకోవటంకు శ్రీకారం చుట్టారు. వంద గ్రాముల విత్తనాలతో కేరళ వరి రకాల సంరక్షణతో మొదలైన కార్యక్రమం నేడు పొడుగు, పొట్టి రకాలు, నలుపు, ఎరుపు వడ్లు, తక్కువ కాలం, ఎక్కువ కాలంలో పంట కొచ్చే రకాలు… ఇలా విభిన్న ప్రాంతాల, పలు వాతావరణ పరిస్థితుల్లో పండే 650 రకాల వరి విత్తనాలను లాభాపేక్ష  లేకుండా సంరక్షిస్తూ ఉండటం మామూలు విషయం కాదు. వీరికున్న జీవ వైవిధ్యం,  పర్యావరణ స్పృహకు శాస్త్ర సమాజం జేజేలు పలికింది. ఇటు శాస్త్రవేత్తలు, అటు వివిధ ప్రాంత రైతులు వారి దగ్గరున్న రకాల విత్తనాలు ఇచ్చి తోడ్పాటు అందించారు. సత్యన్నారాయణ కూడా తను సేకరించి భద్రపరుస్తూ ఉన్న విత్తనాలను తోటి రైతులకు అందిస్తూ వరి జన్యు సంపదను అంతరించి పోకుండా కృషి చేస్తున్నారు. 2021లో వీరికి ప్లాంట్‌ జీనోమ్‌ సేవియర్‌ ఫార్మర్‌ పురస్కారం అందుకున్నారు.      

– ‘రైతునేస్తం’ ప్రత్యేక ప్రతినిధి

Read More

ఫిబ్రవరి నెలలో సేద్యపు పనులు

ప్రభుత్వాల యొక్క రైతు అనుకూల నిర్ణయాల వలన వరికి మార్కెట్‌లో మంచి ధర దొరికే అవకాశమేర్పడింది. కాని, ప్రత్తికి సరైన ధర రావడం లేదు. మద్దతు ధరల కంటే మార్కెట్‌ ధరలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొద్దిగా పెరుగుతున్న టమాట ధర. ఎఫ్‌.పి.ఓలు చాలా కొద్ది చోట్లనే సక్సెస్‌. మిగతా అన్ని చోట్ల ఫెయిల్యూర్లే. పెరుగుతున్న రైతుల, ప్రజల అవసరాలు, ఆకాంక్షలు హైలైట్‌ చేయడానికి, సమస్యల పరిష్కార మార్గాల సూచనలకు స్వతంత్ర రైతు ప్రజా సంఘాల ఆవశ్యకత ఎంతో. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి (శ్రవణ, ధనిష్ట, శతభిష కార్తెలు)లో వివిధ పంటలలో చేయవలసిన పనులను మరియు పండిన పంటల మార్కెటింగ్‌లో కొత్త పోకడలను గురించి…

వరి: తెలంగాణలో ఎన్నికల పుణ్యమా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల మార్పుతో వరికి ప్రోత్సాహం పెరిగింది. మద్దతు ధరల కంటే రైతుకు ఎక్కువ ధర దొరికే అవకాశమేర్పడింది. రబీ/యాసంగి పంటను నాటు పెట్టని వారు వెంటనే నాట్లను పూర్తి చేయాలి. ఎంతముందుగా నాటితే దిగుబడి అంత ఎక్కువగా ఉంటుంది. నాటు నిదానమయ్యే కొద్దీ దిగుబడి తగ్గుతూ వస్తుంది. నాట్లు పూర్తయిన ప్రాంతంలో నాటిన సమయాన్ని బట్టి పైపాటి ఎరువులు వేయుట, కలుపు నివారణ, సస్యరక్షణ ఫిబ్రవరిలో ఉంటాయి. సేంద్రియ వ్యవసాయ విధానంలో ఘన, ద్రవ జీవామృతాలు, వివిధ రకాల కషాయాలు వాడడంతో నేల మరియు ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయి. దీన్ని ప్రోత్సహించడానికి నాటు ఆవులను సబ్సిడీ రూపంలో అందించే పథకాలను బడ్జెట్‌లో చేర్చవచ్చు. చిన్న చిన్న బియ్యం మిల్లులను సబ్సిడీ రూపంలో పంపిణీ చేస్తే వడ్లకు బదులుగా బియ్యాన్నమ్ముకునేటట్లు రైతును మార్చవచ్చు. రైతు ప్రజా సంఘాలకు ప్రతి పల్లెలో నాటు ఆవులను చిన్న చిన్న బియ్యం మిల్లులను సబ్సిడీలో సప్లయి చేయవచ్చు. ఇవి సంఘ సభ్యులందరికి ఉపయోగపడతాయి.

జొన్న: అక్టోబరులో విత్తిన జొన్న పంట ఫిబ్రవరిలో కోతకొస్తుంది. జొన్న మార్కెట్‌ ధరలు మద్దతు ధరల కంటే బాగా ఎక్కువగా ఉన్నాయి. జనవరి నెలలో విత్తిన జొన్నలో నీటి తడి ఇవ్వడం, అంతర కృషి, కలుపు యాజమాన్యం, పైపాటి ఎరువులు వేయుట, సస్యరక్షణ ఈ నెలలో చేయాల్సుంటుంది.

మొక్కజొన్న: చలికాలం/యాసంగి మొక్కజొన్న కోతలు ఫిబ్రవరి నెలలో ఉంటాయి. తయారైన గింజలలో తేమ 25-30% ఉంటుంది. దీనిని 3-4 రోజులు ఎండలో ఆరబెట్టి 15% తేమ వరకు వచ్చేటట్లు చేయాలి. ట్రాక్టరు/నూర్పిడి యంత్రంతో కండెల నుండి గింజలను వేరు చేయాలి. నిల్వ ఉంచడానికి గింజలలో 10-12% తేమ వచ్చే వరకు ఎండబెట్టాలి. పేలాల రకంలో గింజలలో తేమ 30-35% ఉన్నపుడు కోసి, నీడలో ఆరబెట్టాలి. ఎండకు ఆరబెడితే గింజ పగిలి పేలాలు సరిగా రావు. తీపి జొన్న రకాలలో గింజలు పాలుపోసుకొనే థలో కండెలు కోసుకోవాలి. బేబికార్న్‌ కొరకు పీచు వచ్చిన 1 లేదా 2వ రోజున కోసుకోవాలి. నిదానిస్తే బెండులో పీచు పెరిగి నాణ్యత దెబ్బతింటుంది. పశువుల మేతకు పెంచినపుడు మొక్కజొన్న పైరును 50% పూత థలో కోయాలి. ఆ థలో దిగుబడి, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.

సజ్జ: ఆంధ్రప్రదేశ్‌లో ఈ పంటను శ్రవణ, ధనిష్ట కార్తెలలో (ఫిబ్రవరి 20 లోపు)తెలంగాణలో ఫిబ్రవరి కడ వరకు విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. అనుకూలమైన రకాలు/హైబ్రిడ్లు: ఆంధ్రప్రదేశ్‌కు: ఎ.బి.వి.-04 (కాంపోజిట్‌) గింజ దిగుబడి 10-12 క్వి/ఎ; 85-90 రోజులు, వెర్రికంకి, అగ్గి, గింజ కాటుక తెగుళ్ళను, బెట్టను తట్టుకుంటుంది. ఇనుము, జింకు ధాతువులు ఎక్కువగా ఉంటాయి. రాజ్‌-171 (కాంపోజిట్‌): గింజ దిగుబడి 8-12 క్వి/ఎ. 80-85 రోజుల పంట. వెర్రికంకి తెగులును తట్టుకుంటుంది. హెచ్‌.హెచ్‌.బి-67 (హైబ్రిడ్‌): గింజ దిగుబడి 10-12 క్వి/ఎ; అతి తక్కువ పంటకాలం: 68-70 రోజులు, వెర్రి కంకిని తట్టుకుంటుంది. ఐ.సి.ఎం.హెచ్‌-356 (హైబ్రిడ్‌): 10-12 క్వి/ఎ, 10-85 రోజులు, వెర్రికంకిని తట్టుకుంటుంది. తెలంగాణకు: పి.హెచ్‌.బి-3 (హైబ్రిడ్‌): 10-12 క్వి/ఎ. వెర్రికంకిని, బెట్టను తట్టుకుంటుంది. 80-85 రోజులు. ఐ.సి.ఎమ్‌.హెచ్‌-356 (హైబ్రిడ్‌): 10-12 క్వి/ఎ. వెర్రికంకిని తట్టుకుంటుంది. పి.బి.హెచ్‌-1625 (హైబ్రిడ్‌): ఐరన్‌, జింకు ఎక్కువ, 10-11 క్వి/ఎ. వెర్రికంకిని తట్టుకుంటుంది.

రాగి: ఈ పంటను తెలంగాణలో ఫిబ్రవరి తొలి పక్షంలోను, ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి కడవరకు విత్తి అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ పంటను కొద్దిపాటి చౌడు సమస్య ఉన్న భూముల్లో కూడా సాగు చేయవచ్చు. నీరు నిల్వ ఉన్న భూములు పనికి రావు. అనుకూలమైన రకాలు: భారతి, ఇంద్రావతి, తిరుమల, సువర్ణముఖి. వీటిలో దిగుబడి 14-15 క్వి/ఎ.

పెసర: ఈ పంటను ఫిబ్రవరిలో విత్తినపుడు అత్యధిక దిగుబడినిస్తుంది. విత్తనాభివృద్ధికి కూడా ఈనెలలో విత్తడం చాలా అనుకూలం. ఈ నెలలో విత్తడానికనువైన రకాలు: తెలంగాణకు: డబ్ల్యు.జి.జి-42 (యాదాద్రి), ఎం.జి.జి-351 (శ్రీరామ), డబ్ల్యు.జి.జి-37 (ఏకశిల). ఆంధ్రప్రదేశ్‌కు: ఎల్‌.జి.జి.-460, ఎల్‌.జి.జి-410, ఎల్‌.జి.జి.-407, టి.యం-96-2 నీటి సౌకర్యం అవసరం.

మినుము: ఫిబ్రవరిలో విత్తడం మినుము దిగుబడికి కూడా అత్యంత అనుకూలం. విత్తనోత్పత్తి చేపట్టడానికి కూడా అత్యంత అనుకూలమైన సమయం. అత్యధిక దిగుబడినిచ్చే పాలిష్‌ రకాలు: జి.బి.జి-101, టి.బి.జి-104 అత్యధిక దిగుబడినిచ్చే పాలిష్‌ లేని రకం: పి.యు-31. వీటిని రెండు తెలుగు రాష్ట్రాల్లోను సాగుకు చేపట్టవచ్చు. నీటి వసతి ఉండాలి.

ప్రొద్దుతిరుగుడు: భూమి తయారు చేసి విత్తాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రొద్దుతిరుగుడును ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తి ఎక్కువ దిగుబడులు పొందవచ్చు. నీటి సౌకర్యం అవసరం. విత్తనోత్పత్తికి కూడా ఈ సమయం మంచి అనుకూలం. అగ్రిమెంట్లు కుదుర్చుకొని వివిధ కంపెనీల విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. పలు ప్రైవేట్‌ కంపెనీల అధిక దిగుబడినిచ్చే ప్రొద్దు తిరుగుడు హైబ్రిడ్‌ విత్తనాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

నువ్వులు: తెలంగాణలో ఈ పంటను ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తి ఎక్కువ దిగుబడులు పొందవచ్చు. అనుకూలమైన రకం: జగిత్యాల తిల్‌-1 (జె.సి.ఎస్‌-1020). ఇది అత్యధిక దిగుబడినిచ్చే తెల్లగింజ రకం. గింజ దిగుబడి 5-8 క్వి/ఎ. శ్వేత, హిమ, రాజేశ్వరి రకాలకంటే ఎక్కువ దిగుబడినిస్తుంది. బూడిద, ఆకుమచ్చ తెగుళ్ళను కొంతవరకు తట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రకం అధిక దిగుబడులనిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో నువ్వులు విత్తడానికనువైన సమయం: మే 15 నుండి మే 31 వరకు; డిశంబర్‌ 15 నుండి జనవరి 15 వరకు. నువ్వులు విత్తేటప్పుడు కనీస ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్‌ కంటే అధికంగా ఉండాలి. చలి ఎక్కువగా ఉన్నపుడు, మంచు పడుతున్నపుడు విత్తరాదు.

కుసుమ: ఈ పంట కోతలు, నూర్పిడి, మార్కెట్‌లో అమ్ముట ఈ నెలలో ఉంటాయి. పంటకోతకు ముందు, ఎండిన పూరేకులను సేకరించుకోవచ్చు. ఎకరాకు 25-45 కిలోల ఎండిన పూరేకులను సేకరించే అవకాశముంది. దీని వలన గింజ దిగుబడి తగ్గదు. పూరేకులనమ్మి ఆదాయం పెంచుకునే వీలుంది. రక్తపోటు, కీళ్ళనొప్పులు, మెదడులో రక్తం గడ్డకట్టకుండా మరియు శ్వాసకోశ సంబంధ రోగాల నివారణకు వీటిని ఉపయోగిస్తున్నారు.

వేరుశనగ: పచ్చికాయలుగా వేరుశనగ వాడకం విపరీతంగా పెరుగుతున్నది. మంచి రేటుకు అమ్ముడుపోతున్నాయి. చిల్లరగా హైదరాబాదులో కిలో రూ. 80/-లకు అమ్ముతున్నారు. రైతుకు 50 రూపాయలు కిలోకు గిట్టే అవకాశముంది. పచ్చికాయలుగా అమ్మడానికి అనుకూలమైన రకాలు: విశిష్ట (టి.సి.జి.ఎస్‌-1694), కదిరి-7, కదిరి-9, నిత్యహరిత వంటి విత్తనాలకు విపరీతమైన గిరాకీ ఉంది. విత్తనానికి, పండిన పంటకు నిష్పత్తి 1:8 నుండి 1:10 వరకు ఉంటుంది. అందువలన ప్రైవేటు సంస్థలు వీటి విత్తనాల తయారీ చేపట్టడం లేదు. రైతులు, యూనివర్సిటీలు చేసే ఉత్పత్తి చాలడం లేదు. రైతు ప్రజా సంఘాల ద్వారా వీటి విత్తనోత్పత్తిని ప్రోత్సహించి, పెద్ద మొత్తంలో వేరుశనగ విత్తనాల ఉత్పత్తి పెంచాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. దీనికి వ్యవసాయ శాస్త్రవేత్తల, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవచ్చు.

టమాట: చిల్లరగా టమాట కిలోకు 20-25 రూపాయలు అమ్ముతున్నారు. రైతుకు రూ. 10-15 గిట్టుతున్నది. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో దిగుబడులు తగ్గే అవకాశం లేదు. ధరలు పెరిగే అవకాశం కూడా మే నెల వరకు కనిపించడంలేదు. జూన్‌-జూలైలో ధరలు కొంత పెరిగే అవకాశముంది. ఈ పంట విస్తీర్ణాన్ని కట్టడి చేసుకోవలసిన అవసరముంది. రేటు తక్కువగా ఉన్నపుడు విలువ జోడించిన పదార్థాల తయారీ మరియు వాటి ఎగుమతిని బాగా పెంచడం చాలా అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలలో ఎగుమతికి బాగా ప్రాధాన్యమివ్వాలి. విపరీత వాతావరణ పరిస్థితులు-తుఫాన్లు ఏర్పడితే వడగండ్లు పడితే ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరలు కొంత నిలకడగా ఉండే వంగ, బెండ లాంటి కూరగాయలను టమాట పండించే రైతులు సాగు చేయవచ్చు.

వంగ: ఇప్పటి పరిస్థితుల్లో టమాటతో పోల్చితే వంగ ధరలు అధికంగా ఉన్నాయి. ఈ నెలలో నారు పోయవచ్చు. ఈనెలలో నాటవచ్చు. దిగుబడులు బాగుంటాయి. నారు పోసిన తర్వాత 30-35 రోజులలోపు నాటాలి. పంటచేతికొచ్చే సమయానికి ధరలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశముంది. ధరలు బాగుంటే కార్శి పంట (రెటూన్‌) తీసుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో బాగా ధర పలికే రకాలను ఎంపిక చేసుకొని సాగు చేయాలి.

బెండ: ఫిబ్రవరి మొదటి వారంలో విత్తవచ్చు. వేడి ఎక్కువయ్యేకొద్ది దిగుబడి పెరుగుతుంది. విపరీతమైన ఎండాకాలంలో ఈ పంట సరిగా పెరగక దిగుబడి తగ్గుతుంది. పల్లాకు తెగులు వేసవిలో ఎక్కువగా ఉంటుంది.

మెంతి, జీలకర్ర, సోంపు, ధనియాలు: వీటి కోతలు ఫిబ్రవరిలో ఉంటాయి. ధరలు అనుకూలంగా ఉండటం వల్ల సులభంగా అమ్ముకునే అవకాశముంది.

చేమగడ్డ: ఫిబ్రవరి నుండి ఏప్రిల్‌ వరకు చేమగడ్డ నాటడానికి అనుకూలం. మంచి రకాలు: కె.సి.ఎస్‌-3: 5 నెలల పంట, దిగుబడి 9-6 ట/ఎ. కె.సి.ఎస్‌-21: 8 నెలల పంట. దిగుబడి 14 ట/ఎ.

ఉల్లి: విత్తడానికి/నాటడానికి ఫిబ్రవరి నెల అనుకూలం. పంట విస్తీర్ణాన్ని పెంచి, దిగుబడులు పెంచి ఎగుమతి చేసే అవకాశం బాగా ఉంది. ప్రభుత్వం ఎగుమతి పాలసీలను కనీసం 5-6 నెలల ముందే తెలిపితే ఆ కూరగాయ పంట విస్తీర్ణంలో మార్పులు చేర్పులు చేసుకునే దానికి రైతులకవకాశం బాగుంటుంది.ఈ నెలలో విత్తడానికి మంచి రకాలు: అర్కప్రగతి, అర్కనికేతన్‌. 

బూడిద గుమ్మడి: ఈ నెలలో విత్తవచ్చు. కూరగాయగా కో-2, స్వీట్‌ (పేట) తయారీకి బి.హెచ్‌-24, బి.హెచ్‌-25 రకాలు అనుకూలం.

గెనుసుగడ్డ/చిలగడ దుంప: ఆరోగ్యరీత్యా, బంగాళాదుంపకంటే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు విరివిగా వాడదగిన పంట. వీటి తీగలను ఫిబ్రవరి-మార్చి నెలల్లో నాటవచ్చు. అధిక దిగుబడి రకాలు: ఆర్‌.ఎన్‌.ఎస్‌.పి-1: దిగుబడి 6-7 ట/ఎ. సామ్రాట్‌:110-120 రోజులు, 7-8 ట/ఎ. కిరణ్‌: 8 ట/ఎ. 120 రోజులు.

కాకర: సాధారణ పొడవు కాకర రకాలు: అర్కహరిత, విశేష్‌ మొ|| హైబ్రిడ్లు: శ్రేయ, శ్వేత మొ|| పొట్టికాకర: 1315 స్టార్‌: ఈ రకం పందిళ్ళపై, ట్రెల్లీస్‌ విధానంలో కూడా అధిక దిగుబడినిస్తున్నది. పొడవు కాకర కంటే కిలోకు 10 రూ. ఎక్కువ రేటు వస్తున్నది. సాధారణ పంట కాలం 4 నెలలు. ఈ కాలాన్ని మంచి యాజమాన్య పద్ధతలను ఉపయోగించి 6-8 నెలల వరకు పెంచవచ్చు. సాధారణ దిగుబడి 6-8 ట/ఎ. మంచి యాజమాన్యంతో 20 ట/ఎ వరకు పొందే వీలున్నది.

మిరప: పండిన కాయలను కోయుట, ఆరబెట్టుట, మార్కెటింగ్‌ ఈ నెలలో ఉంటాయి. తయారైన కాయలను వెంటవెంటనే కోయుట వలన కోతలెక్కువవుతాయి. దిగుబడి కూడా బాగా పెరుగుతుంది.

పశుగ్రాస పంటలు: ఈ నెలలో విత్తుకోగల్గిన పశుగ్రాస పంటలు: మొక్కజొన్న, జొన్న, సజ్జ, బాజ్రానేపియర్‌ హైబ్రిడ్‌, పారాగడ్డి, అలసంద. పశువులున్న వాళ్లు వీటిని పండించి పశువులకు మేపి, పాల దిగుబడి బాగా పెంచుకోవచ్చు. దాణా ఖర్చు తగ్గించుకోవచ్చు. పశువులు లేని వారు బాగా ఎక్కువ లాభాలతో పచ్చిగడ్డిని అమ్ముకోవచ్చు. 

బంతి: నారును ఫిబ్రవరి మొదటి వారంలో నాటి ఏప్రిల్‌లో పూలను మార్కెట్లకు పంపవచ్చు

ప్రతిపల్లె / జనావాసానికొక రైతు ప్రజా సంఘం: 

పెద్ద మార్కెట్లకు చాలా దూరంగా ఉన్న చిన్న చిన్న పల్లెల్లో రైతులు ప్రజల అభివృద్ధి ఇంకా చాలా తక్కువగానే ఉంది. ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు అభివృద్ధి చెందిన ప్రాంతాలకే ఎక్కువగా వెళుతున్నాయి. సుదూర, మారుమూల ప్రాంతాల అభివృద్ధిని వేగిరపరచాల్సిన ఆవశ్యకత పెరుగుతున్నది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా తాగు/సాగు నీరు చాలా ప్రాంతాలకు అందడం లేదు. తలసరి ఆదాయం బాగా పెంచాల్సిన అవసరముంది. పై నుండి వచ్చే ప్రణాళికలు ప్రజల ఆశలను, ఆకాంక్షలను అందుకోలేకపోతున్నాయి. వీటిని అట్టడగు నుండి తెలుసుకుని, అట్టడుగు నుండి ప్లానింగ్‌ (ప్రణాళికలు) మొదలయ్యేటట్లు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీని సాధనకు మంచి ఉపాయం. ప్రతి పల్లె / జనావాసంలో ప్రజా సంఘాలను ఏర్పాటు చేయడం. ఇందులో రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ప్రజానీకమంతా సభ్యులుగా ఉండవచ్చు. ఏమి చేస్తే త్వరగా అభివృద్ధి చెందుతారో తెలుపుటకు, అదీ, వ్రాతపూర్వకంగా తెలుపుటకు, ఊరిలో ఒక్కొక్కరి అభివృద్ధి మార్గాలను విశదపరుస్తూ దాన్ని ప్రణాళికాబద్ధం చేసి ఆచరణ సాధ్యమయిన విన్నపాలుగా ప్రభుత్వాలకు స్థానిక / గ్రామ / మండల / తాలూకా / జిల్లా / రాష్ట్ర / దేశ స్థాయిల వ్యవస్థల / సంస్థల అధికారులకు తెలిపి, వారి ద్వారా నిజమైన అభివృద్ధి జరిగే వరకు మానిటర్‌ చేయడానికి ప్రతి పల్లె/జనావాసంలో ప్రజా సంఘాల ఏర్పాటు అత్యావశ్యకం. వాటిని త్వరగా సాధించాలంటే ప్రభుత్వాల ప్రోత్సాహం అనివార్యం. 

పైనుండి ప్రజలపై మోపిన ఆలోచనలు, ఉదాహరణకు ఎఫ్‌.పి.ఓలు కొన్ని తప్ప అన్నీ ఫెయిలయినాయి. అలా కాకుండా చూడాలి. ఏ జనావాసంలో ఉండే సమస్యలు ఆ జనావాసంలోనే పరిష్కారమయ్యేటట్లుగా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా సూచనలివ్వగలిగేటట్లు, పనిచేసే సంస్థల ఏర్పాటు జరగాలి. అవే ప్రజాసంఘాలు. వీటిని రైతులెక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతు – ప్రజా సంఘాలనడం మంచిదనిపిస్తుంది. రైతులలో సంఘాలేర్పరచుకునే శక్తి చాలా తక్కువగా ఉన్నందున ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమైనందున, రైతు ప్రజా సంఘాల ఏర్పాటు సముచితమనిపిస్తుంది.

Read More

దేశీ విత్తనాలను ఉత్పత్తి చేయండి – విస్తరించండి

‘నమస్తే కిసాన్‌’ అనే దేశీ విత్తనాల సాగును ప్రోత్సహిస్తున్న సంస్థ మరియు సికిందరాబాద్‌ (వెస్ట్‌) రోటరీ క్లబ్‌వారు సంయుక్తంగా డిసెంబర్‌ 24న హైదరాబాద్‌ (షేక్‌పేట్‌)లోని నారాయణమ్మ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాల నుండి సుమారు 150 మందికి పైగా అభ్యుదయ రైతులు, గోప్రేమికులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని తాము పండించిన వివిధ రకాల వరి విత్తనాలు, చిరుధాన్య విత్తనాలు, ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. ఐటి రంగంలోనూ, బిజినెస్‌ రంగంలోనూ ఉన్నత విద్యలను అభ్యసించిన యువకులు, విశ్రాంత ఉన్నతాధికారులు, ప్రొఫెసర్లు, ఆధ్యాత్మిక వేత్తలు, గోప్రేమికులు, దేశీ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని సేంద్రియ వ్యవసాయం, దేశీ విత్తనాల ఉత్పత్తిలో తమ అనుభవాలను సభికులకు ఆసక్తికరంగా వివరించారు.

దేశీయ విత్తనాలను ”భద్రపరచు, సంరక్షించు మరియు విస్తరించు” (Conserve – Protect and Propagate)  అనే లక్ష్యంతో కొందరు యువ కర్షకులు నిర్వహిస్తున్న ”నమస్తే కిసాన్‌” ఎంతైనా ప్రశంసనీయమని సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూనాకు చెందిన యోగి చంద్రకాంత్‌ కులకర్ణి మహరాజ్‌ – నిర్వాహకులను అభినందించారు. 

సేంద్రీయ కర్షకుడు – రాష్ట్రపతి పురస్కార గ్రహీత మరియు దేశీ విత్తన సంరక్షణ ఉద్యమకారుడు రఘువీర్‌, బ్రిగేడియర్‌ గణేశం (పల్లెసృజన), శ్రీమతి సూర్యకళ (మన వూరు-మన బాధ్యత), సుబ్రహ్మణ్యరాజు (గోఆధారిత వ్యవసాయదారుల సంఘం), రొటేరియన్‌ ఏకాంబరరెడ్డి (ఛైర్మన్‌ నారాయణమ్మ ఇంజనీరింగ్‌ కాలేజీ), రొటేరియన్‌ శ్రీమతి పద్మినీ ప్రసాద్‌, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి) విశ్రాంత డీన్‌ శ్రీమతి జ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో ఆసక్తికరమైన పలు అంశాలపై ప్రసంగించారు.

సంగం డెయిరీ విశ్రాంత అధికారి, వ్యవసాయ పాత్రికేయుడు, గోసేవకుడు డా. అహోబలరావు తన ప్రసంగంలో గోశాలల ఆర్థిక సమస్యల పరిష్కారానికి తమ తమ గోశాలలలోని ఎంపిక చేసిన గోవులను, విశిష్ఠమైన అత్యున్నతమైన దేశీ జాతి పశువుల ఉత్పత్తికి ఏవిధంగా వినియోగించుకోవచ్చో వివరించుటతోపాటు, సులువుగా సేంద్రీయ ఎరువుల తయారీకి మరింత సమర్థవంతమైన ఉత్పత్తికి, పంపిణీకి, వినియోగాలకు యువరైతు క్లబ్బుల ఏర్పాటుకు కొన్ని సూచనలు చేశారు. దేశీ పశువుల ఉత్పత్తి – దేశీ విత్తనాల ఉత్పత్తి మరియు సహజ కీటక నాశకాల వినియోగం – ఈ మూడూ ఒకే వ్యవస్థలో సమన్వయంగా కొనసాగినప్పుడే కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిన ఈరోజుల్లో రైతుకూ, దేశానికి మేలు చేకూరగలదని ఆయన అన్నారు. దేశీ విత్తనాల ఉత్పత్తిలో అత్యంత ప్రతిభ కనబరచిన రైతులను, డాక్టర్‌ అహోబలరావును నిర్వాహకులు సత్కరించారు.

ఈ దేశీ విత్తనాల పరస్పర మార్పిడి కార్యక్రమంలో పాల్గొనదలచినవారు నమస్తే కిసాన్‌ ఫోన్‌ నం. 7516841687 మరియు 1800-202-0120 (టోల్‌ ఫ్రీ) నెంబర్లలో సంప్రదించవచ్చునని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ‘నమస్తే కిసాన్‌’ వ్యవస్థాపకులు దుర్గాప్రసాద్‌ బృందం ఎంతైనా అభినందనీయులు. వివిధ రకాల విత్తనాలతో పాటు రోబోటిక్‌ వ్యవసాయ యంత్రాల ప్రదర్శన సందర్శకులను విశేషంగా అలరించింది.

Read More

భారత్‌ వంటనూనెల దిగుమతుల్ని తగ్గించగలదా?

భారతదేశంలో ప్రజలకు సగటున 2400 కిలోకేలరీల శక్తి, 60 గ్రాముల మాంసకృత్తులు, 50 గ్రాముల కొవ్వు పదార్థాలు రోజుకి అవసరం అని జాతీయ ఆహార పర్యవేక్షణ బోర్డు సిఫార్సు చేసింది. తాజా అంచనాల ప్రకారం దేశంలో ప్రజలకు సగటున 2500 కిలోకేలరీల శక్తి, 60 గ్రాముల మాంసకృత్తులు, 52 గ్రాముల కొవ్వు పదార్థాలు లభ్యమౌతున్నట్లు తెలుస్తున్నది. మాంసకృత్తుల లభ్యత సిఫార్సు మేరకు ఉన్నా, కేలరీలు, కొవ్వు పదార్థాల విషయంలో అవసరం కన్నా లభ్యతే ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతుంది. అయినా దేశం ఆహార భద్రత, ఆకలి సూచీల విషయంలో ప్రపంచ దేశాల్లో భారత్‌ చాలా వెనకబడటం ఆలోచించదగ్గ విషయం. తీవ్రమైన ఆర్థిక అసమానతల వల్ల చాలామంది గ్రామీణ, పట్టణ పేదలు అవసరానికి తగ్గ పోషకాహారాన్ని పొందలేకపోతుండవచ్చు. కొనుగోలు శక్తితో పాటు అవగాహన కూడా లోపించటం వల్ల పోషకాహార లోపం వల్ల పిల్లలు ఎదగలేకపోవటం, బక్కచిక్కి ఉండటం, చనిపోవడం వంటి సూచికల వల్ల ఆకలి సూచీలో దేశం వెనకబడుతున్నది.

కొవ్వు పదార్థాల లభ్యత

కొవ్వు పదార్థాలు పాలు, పాల పదార్థాలు, కొన్ని చేపలు, మాంసం, రొయ్యలు వంటి జంతు సంబంధ వనరుల ద్వారా లభ్యమౌతున్నా, ముఖ్యంగా మొక్కల ద్వారా లభించే గింజలు, ఎండుపళ్ళు, కాయల నుండే ఎక్కువగా లభిస్తున్నాయి. వంటనూనెల గిరాకీ గత 73 సంవత్సరాల్లో బాగా పెరిగింది. 1950లో దేశంలో వంటనూనెల తలసరి వినియోగం సంవత్సరానికి కేవలం నాలుగు కిలోలే. ఇప్పుడది 19 కిలోలకు పెరిగింది. ఆహార ధాన్యాల లభ్యత 1950లో సంవత్సరానికి 170 కిలోలుండగా ఇప్పుడు అది 220 కిలోలకు పెరిగింది. పప్పు ధాన్యాల లభ్యత కొంతమేరకు తగ్గింది. కాని కూరగాయలు, ఎండుపళ్ళు లభ్యత పెరగటం వల్ల మాంసకృత్తుల లభ్యత తగ్గలేదు. కేలరీల శక్తి లభ్యత కొద్దిగా పెరగ్గా, మాంసకృత్తుల లభ్యత స్థిరంగా ఉండగా, కొవ్వు పదార్థాల లభ్యత మాత్రం నాలుగైదు రెట్లు పెరిగింది. వంటనూనెల వినియోగం అవసరాన్ని మించి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు ప్రకారం సంవత్సరానికి ఒక్కొక్కరికి 12 కిలోల వంటనూనెలు సరిపోతాయి. దానితో పోలిస్తే ప్రస్తుత వినియోగం 55 శాతం ఎక్కువగా ఉంది. మాంసాహారం ఎక్కువగా తీసుకునే అమెరికా, యూరోప్‌ దేశాల్లో కూడా వంట నూనెల వాడకం ఎక్కువ. ఆఫ్రికన్‌ దేశాల్లో వంటనూనెల వాడకం బాగా తక్కువ. భారత్‌ వంటి పేదదేశంలో వంట నూనెల వాడకం ప్రపంచ సగటు వినియోగంతో సమానంగా ఉంది. మాంసాహార వాడకం భారత్‌లో తక్కువే ఐనా, పాలు, పాలపదార్థాల వాడకం ఎక్కువగా ఉండటం వల్ల కొవ్వు పదార్థాల లభ్యతలో కొరత లేదు. దేశంలో స్థూలకాయులు, మధుమేహ పీడితులు పెరుగుతున్న సందర్భంలో వంటనూనెల వాడకంపై నియంత్రణ అవసరం. కాని ఆదాయాలు పెరుగుతున్నకొద్దీ వంటనూనెల వాడకం పెరుగుతున్నది. ధరలు పెరిగినప్పుడు వాడకం తగ్గటం, ధరలు తగ్గినప్పుడు వాడకం పెరగటం జరుగుతున్నది. 1994లో ప్రపంచ వాణిజ్య ఒప్పందం జరిగినప్పటి నుండీ దిగుమతులపై ఆంక్షలు, సుంకాలు తగ్గటం వల్ల వంటనూనెల ధరలు సాపేక్షికంగా తగ్గాయి. ఫలితంగా గిరాకీ హెచ్చింది. వాడకం పెరిగింది. 1950లో 4 కిలోలు, 1990లో 7 కిలోలుగా ఉన్న వంటనూనెల తలసరి వాడకం ఇప్పుడు 19 కిలోలకు చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వాలకు ఒక దీర్ఘకాలిక వ్యూహం లేకుండా ప్రపంచ మార్కెట్‌లో ధరలు తగ్గినప్పుడు దిగుమతి సుంకాలను పెంచడం, ధరలు పెరిగినప్పుడు దిగుమతి సుంకాలను తగ్గించడం చేస్తున్నాయి. నూనె గింజల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను విస్మరించి, వినిమయదారుల మెప్పుకోసం దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల వంటనూనెల వాడకం పెరుగుతున్నది.

ప్రపంచ మార్కెట్‌ పరిస్థితి

2022లో ప్రపంచ వంటనూనెల మార్కెట్‌ విలువ 21,260 కోట్ల అమెరికన్‌ డాలర్లుగా అంచనా వేయబడ్డది. ఇది ప్రతి సంవత్సరం 4.8 శాతం చొప్పున పెరిగి 2027 నాటికి 26,890 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. ప్రపంచంలో ఉత్పత్తవుతున్న నూనెల్లో సోయా చిక్కుడు వాటా 30 శాతంగా ఉంది. 27 శాతం వాటాతో పామోలిన్‌ ఆయిల్‌, 15 శాతం వాటాతో ఆవాలనూనె, 10 శాతం వాటాతో పొద్దు తిరుగుడు గింజలనూనె వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాలను ఆక్రమిస్తున్నాయి. వేరుశనగ నూనె వాటా 5 శాతం గానూ, పత్తిగింజల నూనె వాటా 4 శాతంగానూ, ఆలివ్‌ నూనె వాటా 3 శాతంగానూ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన వంటనూనెలన్నీ కలిపి 6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. సోయాచిక్కుడు నూనె ఉత్పత్తిలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రెజిల్‌, అర్జెంటీనా, మెక్సికోలు అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఆ దేశాల నుండే ఎక్కువగా సోయాచిక్కుడు నూనెల ఎగుమతులు జరుగుతున్నాయి. ఇక పామోలిన్‌ ఆయిల్‌ ఉత్పత్తిలో ఇండోనేషియా, మలేసియాలు అగ్రస్థానానికి పోటీపడుతున్నాయి. ఎగుమతుల విషయంలో కూడా ఆదేశాలే ప్రముఖంగా నిలుస్తున్నాయి. ఆవనూనె ఉత్పత్తిలోనూ, ఎగుమతుల్లోనూ కెనడా ముందువరసన నిలుస్తున్నది. పొద్దుతిరుగుడు గింజల నూనె ఉత్పత్తి ఎక్కువగా రష్యా, యుక్రెయిన్‌లలో జరుగుతున్నది. మధ్యధరా దేశాల్లో ఉత్పత్తవుతున్న ఆలివ్‌ ఆయిల్‌కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. ఆరోగ్య ప్రయోజనాలు బాగున్నాయనే నమ్మకంతో అత్యధిక ధర పలుకుతున్నది. ఆసియా, ఆఫ్రికాల్లో సాగయ్యే వేరుశనగ పప్పులనూనె వాటా క్రమేపీ తగ్గుతుంది. అనేక దేశాల్లో ఉత్పత్తవుతున్న పత్తిగింజల నూనెను కొన్ని దేశాల్లో వంట నూనెగానూ, మరికొన్ని దేశాల్లో ఇతర అవసరాలకు వాడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సేంద్రియ పద్ధతుల్లో ఉత్పత్తయిన వంటనూనెలకు గిరాకీ పెరుగుతూ 2022లో 270 కోట్ల అమెరికన్‌ డాలర్లకు చేరింది. వంటనూనెలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో కొన్ని వాటిని బయోడీజిల్‌ ఉత్పత్తికి వినియోగిస్తున్నాయి. మొక్కజొన్న నుండి, చెరకు నుండి ఇథనాల్‌ తయారవుతున్నట్లుగా, వంటనూనెల నుండి బయోడీజిల్‌ తయారీ ఊపందుకుంటున్నది. ముడి చమురు కొరత భవిష్యత్తులో సమస్య కానుందనే భయంతో పెట్రోల్‌లో ఇథనాల్‌ను, డీజెల్‌లో బయోడీజిల్‌ను పది నుండి 20 శాతం వరకు కలుపుతున్నాయి. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కూడా బయోడీజిల్‌ ఉపకరిస్తుందనే ఉద్దేశ్యంతో ధనిక దేశాలు వంటనూనెలను బయోడీజిల్‌ తయారీకి వాడుతున్నాయి. ముడిచమురు, వంటనూనెల ధరల మధ్య ఉండే వ్యత్యాసం తగ్గే కొద్దీ బయోడీజిల్‌ రంగం నుండి వంటనూనెలకు గిరాకీ పెరుగుతున్నది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఏర్పడే అనావృష్టి, అతివృష్టి పరిస్థితుల కారణంగానూ, దేశాల మధ్య యుద్ధాల కారణంగానూ వంటనూనెల ధరల్లో హెచ్చుతగ్గులుంటున్నాయి. 2022లో రష్యా, యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం ప్రారంభం కాగానే వంట నూనెల ధరలు 30 శాతం పెరిగాయి. పొద్దు తిరుగుడు గింజల నూనె ఎగుమతులు తగ్గటం వల్ల, పామాయిల్‌ ధరలు టన్నుకి రెండు వేల డాలర్లకు చేరుకున్నాయి. 2023 నవంబరు నాటికి వాటి ధరలు వెయ్యి డాలర్లకు తగ్గాయి. ముడిచమురు ధరల లాగానే వంటనూనెల ధరల్లో భారీ హెచ్చు తగ్గులుంటున్నాయి. ఈ రెండింటినీ అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటున్న భారతదేశం భారీగా విదేశీమారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తున్నది.

నిరంతర కొరతలో భారతదేశం

వంటనూనెల విషయంలో భారతదేశం అనేక థాబ్దాలుగా కొరతను ఎదుర్కొంటూ దిగుమతులపై ఆధారపడుతున్నది. 1984లో రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత నూనెగింజల ఉత్పత్తిని ప్రోత్సహించటానికి ఒక టెక్నాలజీ మిషన్‌ని ఏర్పాటు చేశారు. దిగుమతి సుంకాలను పెంచి, నూనె గింజల పంటలకు మద్దతు ధరను పెంచారు. 1990 నాటికి నూనె గింజల ఉత్పత్తి పెరిగి, వంటనూనెల దిగుమతి తగ్గింది. వంటనూనెల దిగుమతి ఖర్చుకి దీటుగా నూనెతీసిన చెక్క, పిండి ఎగుమతుల ద్వారా ఆదాయం లభించడంతో, దేశం స్వయం పోషకత్వాన్ని సాధించిందని గర్వంగా చెప్పుకున్నాము. కాని అప్పుడు దేశంలో వంటనూనెల తలసరి వినియోగం సంవత్సరానికి ఏడు కిలోలు మాత్రమే. 1994లో ప్రపంచ వాణిజ్య ఒప్పందం తర్వాత దిగుమతి సుంకాలను తగ్గించడం, ప్రపంచ మార్కెట్‌లో పామోలిన్‌ ఆయిల్‌ చౌకగా లభించడంతో దిగుమతులు బాగా పెరిగాయి. నూనెగింజల ధరలు దేశీయంగా తగ్గటం వల్ల రైతులకు నూనెగింజల పంటల సాగుపై ఆసక్తి తగ్గింది. 1980ల్లో వేసిన పామాయిల్‌ తోటల్ని 2000 ప్రాంతంలో రైతులు తీసివేసారు. ప్రపంచ మార్కెట్‌లో నూనెగింజలు, వంటనూనెల ధరలు పెరగటంతో ప్రభుత్వాలు మళ్లీ పామాయిల్‌ తోటలను పెంచటానికి మద్దతునందిస్తున్నాయి. అనేక కొత్త రాష్ట్రాలకు, జిల్లాలకు పామాయిల్‌ సాగుని విస్తరిస్తున్నది. సాంప్రదాయంగా పండించే వేరుశనగ, ఆవ, సోయాచిక్కుడు, నువ్వులు, అవిసె, కుసుమలను ఎక్కువగా వర్షాధారంగా పండిస్తున్నారు. కాని పామాయిల్‌ను మాత్రం నీటి వసతితోనే పండిస్తున్నారు. వాటి దిగుబడులు హెచ్చుగా ఉండటం వల్ల రైతులు ఉత్సాహం చూపుతున్నారు. అయినా పామాయిల్‌ తోటలు ఇండోనేషియా, మలేషియాల్లో వర్షాధారంగానే పెరుగుతుండటం వల్ల ఉత్పత్తి వ్యయం తక్కువ. ప్రపంచ మార్కెట్‌లో పామాయిల్‌ ధరలు తగ్గినప్పుడు దేశంలో పామాయిల్‌ ఉత్పత్తిని కొనసాగించడానికి ప్రభుత్వాల మద్దతు అవసరమౌతుంది. పామాయిల్‌ ఉత్పత్తి కొంత పెరిగినా, ఇతర నూనెగింజల ఉత్పత్తిలో చెప్పుకోదగ్గ పెరుగుదల లేకపోవటంతో వంటనూనెల విషయంలో దిగుమతులపైనే ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. దేశంలో 287.6 లక్షల హెక్టార్లలో 2021-22 సంవత్సరంలో నూనెగింజల సాగు జరిగింది. నూనెగింజల ఉత్పత్తి 385 లక్షల టన్నులుగా నమోదైంది. హెక్టారుకి 1339 కిలోల సగటు దిగుబడి నమోదైంది. దేశీయంగా వంటనూనెల ఉత్పత్తి 12.64 మిలియన్‌ టన్నులుగా ఉంది. 14.07 మిలియన్‌ టన్నుల వంటనూనెలు దిగుమతి జరిగింది. మొత్తం వంటనూనెల వినియోగంలో52 శాతం దిగుమతుల ద్వారా లభించాయి. మొత్తం దిగుమతులకు ఒక లక్షానలభై వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.

భవిష్యత్తులో లక్ష్యాలు

దేశంలో వంటనూనెలు, ఆయిల్‌పామ్‌ ఉత్పత్తిని పెంచటానికి ఒక జాతీయ మిషన్‌ పనిచేస్తున్నది. తమ వ్యూహం, మద్దతు వల్ల దేశంలో నూనెగింజల సాగు, ఉత్పత్తి, వంటనూనెల తయారీ ఊపందుకుంటాయని ఈ మిషన్‌ కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది. నూనెగింజల సాగు 2025-26 కి 322.8 లక్షల హెక్టార్లకు, 2030-31కి 338.1 లక్షల హెక్టార్లకు పెరుగుతుందని అంచనా వేసింది. సగటు దిగుబడి 2025-26కి 1676 కిలోలకు, 2030-31కి 1781 కిలోలకు పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఫలితంగా నూనెగింజల ఉత్పత్తి 2025-26కి 541 లక్షల టన్నులకు, 2030-31కి 602 లక్షల టన్నులకు చేరుకుంటుందని భావిస్తున్నారు. వంటనూనెల దేశీయ ఉత్పత్తి 2025-26 నాటికి 18.5 మిలియన్‌ టన్నులకు, 2030-31 నాటికి 22.8 మిలియన్‌ టన్నులకు పెరుగుతుందని ఊహిస్తున్నారు. అందువల్ల వంటనూనెల దిగుమతి 2025-26 నాటికి 9.5 మిలియన్‌ టన్నులకు, 2030-31 నాటికి 7.2 మిలియన్‌ టన్నులకు తగ్గుతుందని అచంనా వేశారు. దిగుమతుల విలువ 2025-26 నాటికి 95 వేల కోట్లకు, 2030-31 నాటికి 70 వేల కోట్లకు తగ్గుతాయని ఆశిస్తున్నారు. మొత్తం వంటనూనెల వాడకంలో దిగుమతుల వాటా 2025-26 నాటికి 36 శాతానికీ, 2030-31 నాటికి 23 శాతానికి తగ్గుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం సగంపైగా దిగుమతుల ద్వారా వంటనూనెలు లభిస్తుంటే 2030-31 నాటికి పావు వంతు కన్నా తక్కువ స్థాయికి దిగుమతులుంటాయని భావించడం అత్యాశగానే కనిపిస్తున్నది. స్వాతంత్య్రం లభించినప్పటి నుండీ అనేక పథకాలు, మిషన్‌లు ప్రవేశపెట్టినప్పుడు భారీ లక్ష్యాలను ప్రకటించాయి. కాని అవి పాక్షికంగానే నెరవేరాయి. పథకాలు, మిషన్‌లు రూపొందించే అధికారులకు ఎగుమతి, దిగుమతి విధానాలను నిర్ణయించే అధికారం ఉండదు. దేశంలో నూనెగింజల ఉత్పత్తిని పెంచాలంటే రైతులకు నూనెగింజల సాగు గిట్టుబాటు కావాలి. 2023లో పామాయిల్‌ ధర టన్నుకి 980 డాలర్లుగా ఉంది. 2022లో 1276 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకున్న ధరలు ఈ సంవత్సరంలో 27 శాతం తగ్గాయి. దేశంలోకి దిగుమతి అవుతున్న ముడి పామ్‌ ఆయిల్‌, ముడి పొద్దుతిరుగుడు గింజనూనె, ముడి సోయాచిక్కుడు గింజ నూనెలపై గతంలో 2.5 శాతం దిగుమతి సుంకం ఉండేది. ఇప్పుడు దానిని పూర్తిగా తీసివేసారు. ఈ వంట నూనెలపై అగ్రికల్చరల్‌ సెస్‌ని 5 శాతానికి తగ్గించారు. మనదేశం దిగుమతి చేసుకుంటున్న వటనూనెల్లో 62 శాతం వాటా పామ్‌ ఆయిల్‌దే. సోయాచిక్కుడు గింజల నూనె వాటా 22 శాతం, పొద్దుతిరుగుడు గింజల నూనె వాటా మరో 15 శాతంగా ఉన్నాయి. ఈ మూడు రకాల వంటనూనెలు తక్కువ సుంకంతో దిగుమతి కావడం వల్ల దేశీయంగా నూనెగింజల ధరలు పెరగటం లేదు. ప్రస్తుతం వేరుశనగ ధర క్వింటాలుకి రూ.6724 గా ఉంది. కనీస మద్దతు ధర రూ. 6373తో పోలిస్తే మార్కెట్‌ ధర కొంచెం ఎక్కువగా ఉంది. కాని ఆవాల మద్దతు ధర క్వింటాలుకి రూ. 5450/- కాగా మార్కెట్‌ ధర రూ. 5,268గా ఉంది. అలాగే సోయాచిక్కుడు ధర రూ. 4494/- కూడా మద్దతు ధర రూ. 4600 కన్నా తక్కువగా ఉంది. ఇలా ముఖ్యమైన నూనెగింజల ధరలు మద్దతు ధరలకు కొంచెం అటూ ఇటూగా ఉంటున్నాయి. కనీస మద్దతు ధరల కన్నా పదిశాతం ఎక్కువగానైనా మార్కెట్‌ ధరలుంటే రైతులకు గిట్టుబాటుగా ఉంటుంది. అలా ఉండాలంటే దిగుమతులపై 10 శాతమైనా దిగుమతి సుంకాలుండాలి. వినిమయదారులకు తక్కువ ధరలకు వంటనూనెలు లభించాలని ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని సున్నా శాతానికి తగ్గించింది. వినిమయదారులకు తక్కువ ధరకు వంటనూనె లభిస్తుంటే రైతులకు గిట్టుబాటు ధరలు లభించవు. ఇలా రైతుల, వినిమయదారుల ప్రయోజనాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ప్రభుత్వం ఎవరి పక్షాన నిలుస్తుందో అనేదానిపై వారిమధ్య ఆదాయ పంపిణీ ఉంటుంది. గత మూడు థాబ్దాలుగా ప్రభుత్వం వినిమయదారుల పక్షాన నిలవటం వల్ల నూనెగింజల్ని పండించే రైతులకు గిట్టుబాటు ధరలు లభించలేదు. ఫలితంగా రైతులకు ఆ పంటపై ఆసక్తి తగ్గి, ఉత్పత్తిని పెంచలేదు. దిగుమతుల్ని తగ్గించి, దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచాలంటే, కొంతవరకు వినిమయదారుల్ని బాధించక తప్పదు.  

డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్‌ & కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More

మట్టితోనే  చీడపీడల నివారణ చింతల వెంకటరెడ్డి

అడవులలో పెరిగే చెట్లు మరియు రోడ్ల వెంబడి పిచ్చి పిచ్చిగా పెరిగే మొక్కలు అన్నీ ఆరోగ్యంగా పెరుగుతుండడం అందరికి తెలిసిందే. ఈ మొక్కలకు ఎవరు బయట నుండి ఎటువంటి పోషకాలు అందించకుండానే వాటంతటవే ఎదుగుతూ ఎలాంటి చీడపీడలు ఆశించకుండా ఆరోగ్యంగా పెరగడం గమనించదగ్గ విషయం. అంటే అవి పెరిగే మట్టిలో నుంచి పోషకాలను తీసుకుంటాయి కాబట్టి మట్టిలో అన్ని రకాల పోషకాలు అందుబాటులో ఉంటాయనే విషయం ఇక్కడ అర్థమౌతుంది. కాబట్టి మట్టి ద్రావణంతోనే తెగుళ్ళు మాయం అని  డిసెంబర్‌ 6న ‘నాబార్డు’ సహకారంతో ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ జిల్లా, కీసర మండలం, కుందనపల్లి గ్రామం ప్రాకృతిక రైతు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి  గారి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ సాగు, మిశ్రమాలు, కషాయాల తయారీ మరియు పంట ఉత్పత్తులకు విలువ జోడిరపుపై జరిగిన అవగాహన సదస్సులో ప్రాకృతిక రైతు చింతల వెంకటరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆదిలక్ష్మి, రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

భూమి పైపొర అంటే రెండు, మూడు అంగుళాల మందం ఉన్న మట్టిని పై మట్టిగా తీసుకోవాలి. అదే విధంగా భూమిపై నుండి ఒక అడుగు వదలివేసి రెండవ అడుగునుండి ఎంత లోతుగా అవకాశం ఉంటే అంత లోతులో సేకరించే మట్టిని లోపలి మట్టిగా భావించాలి. పై మట్టి 15 కేజీలు మరియు లోపలి మట్టి 15 కేజీలు తీసుకొని మొత్తం 30 కిలోల మట్టిని 200 లీటర్ల నీటిలో కలిపి కొద్దిసేపు తిప్పినట్లైతే అందులో జిగట వస్తుంది. అప్పుడు దానిని తేరుకునేలాగ చేసి వడపోసుకొని అన్ని పంటలపై పిచికారి చేసుకొని వివిధ రకాల చీడపీడలను నివారించుకోవచ్చని వివరిస్తూ తాను పాటించే పద్ధతులను చింతల వెంటకరెడ్డి విపులంగా వివరించారు.

సేంద్రియ సాగులో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాల గురించి వాటి తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ వ్యవసాయ శాఖ ఏ.డి. డి. ఆదిలక్ష్మి వివరించడం జరిగింది. పంట ఉత్పత్తులకు విలువ జోడిరపునకు సంబంధించిన సమాచారాన్ని వాటికి సంబంధించిన యంత్రపరికరాలను, విలువ జోడిరపు వలన రైతులకు లభించే అధిక ఆదాయం గురించి  రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై. వేంకటేశ్వరరావు వివరించారు.  చింతల వెంకటరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రాన్ని ప్రత్యక్షంగా తిలకించారు.  మట్టి ద్రావణం తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం హాజరైన రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు.

Read More

జనవరి నెలలో సేద్యపు పనులు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరి కోతలూ, నూర్పిడిలూ ముమ్మరంగా జరుగుతున్నాయి. మద్దతు ధర కంటే ఎక్కువ రేటు పెట్టి కొంటామన్న హామీలు ఇంకా మొదలు కాలేదు. తుపాన్లు, అకాలవర్షాల వలన, రెండు తెలుగు రాష్ట్రాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. పెంచిన రైతు బంధు సహాయం కూడా ఇంకా మొదలు కాలేదు. చలికాలం పంటల సాగు కూడా మొదలయింది. ఈ నేపధ్యంలో జనవరి (పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ కార్తెలు) లో వివిధ పంటలలో చేయవలసిన వ్యవసాయ పనులను గూర్చి, పండిన పంటను అమ్ముకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన మెలకువలను గురించి…

వరి: వర్షాకాలపు వరి పంట కోతలు కొన్ని చోట్ల పూర్తి అవగా, ఇంకొన్ని చోట్ల నడుస్తున్నాయి. తుపాన్ల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విపరీతంగా నష్టం వాటిల్లింది. తెలంగాణాలో తూర్పు ప్రాంత జిల్లాల్లో కూడా బాగా నష్టం జరిగింది. వడ్ల సేకరణ ఇంకా మొదలు కాలేదు. త్వరగా ప్రొక్యూర్మెంటు చేసి, రైతుల బాధలు తగ్గించడం అత్యవసరం. మద్దతు ధర కంటే అధికంగా ఇస్తామన్న ధరను తెలంగాణాలో అమలు త్వరగా చేస్తే రైతుకు మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సేకరణ ధర పెంచాల్సిన అవసరముంది. ఎక్కువ ధర పెట్టి కొన్న ధాన్యాన్ని కర్ణాటక వంటి రాష్ట్రాలకు పంపే అవకాశమున్నందున, సేకరణ ధర పెంచి తెలుగు రైతులకు మేలు చేయవచ్చునని నా అభిప్రాయం. వరి పంటను ఇతర దేశాలకు ఎగుమతికి అనుమతించి మన రైతులకు ఇంకా ఎక్కువ మేలు చేయవచ్చు. చలికాలం వరిని జనవరి మొదటి వారం లోపల విత్తితేనే అధిక దిగుబడులు సాధ్యం. నిదానిస్తే దిగుబడి బాగా తగ్గుతుంది. మొలకెత్తిన విత్తనాలను ప్రధాన పొలంలో తయారు చేసిన భూమిలో బురదనీటిలో వెదజల్లడం లేక డ్రమ్‌సీడర్‌ ద్వారా విత్తడం చేయవచ్చు. కొత్తరకాలను, వాటికి మంచి ధర వస్తుందో, రాదో తెలియని రకాలను, కొద్ది విస్తీర్ణంలో పరీక్షించడానికి మాత్రమే సాగు చేయాలి. పండించిన పంటకు మంచి లాభాలొస్తాయని నిరూపణ అయిన రకాలను విస్తారంగా పంట పెట్టవచ్చు. ప్రస్తుతం వరికి మంచి గిరాకీ ఉంది.

మొక్కజొన్న: దుక్కి దున్నకుండా వరి మాగాణులలో నేరుగా విత్తడానికి ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతంలో జనవరి మొదటివారం వరకు అనుకూలం. ఆ తరువాత విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాలు మొక్కజొన్నను జనవరిలో విత్తడానికి అంత అనుకూలం కాదు. నవంబరు-డిసెంబరు నెలల్లో విత్తిన మొక్కజొన్న పంటలో అంతర కృషి, పైపాటి ఎరువులు వేయుట, సస్యరక్షణ, కలుపు నివారణ జనవరిలో చేయాల్సి ఉంటుంది. సస్యరక్షణలో ముఖ్యంగా కాయతొలుచు పురుగు, కత్తెర పురుగులు సమస్యాత్మకము. వీటిని వెంటనే అదుపు చేయాల్సి ఉంటుంది.

జొన్న: సెప్టెంబరు, అక్టోబర్‌లలో విత్తిన, మాఘీ, రబీజొన్న కోతలు జనవరిలో ఉంటాయి. చలికాలం జొన్న విత్తడం తెలంగాణలో డిశంబరులోపు పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆలస్యంగా జనవరిలో కూడా విత్తుతారు. అవి ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాలు. అనుకూలమైన రకం: పర్భని శక్తి (ఐ.సి.ఎస్‌.ఆర్‌-14001). నీటి తడులతో విత్తన దిగుబడి 28-32 క్వి/ఎ. చొప్ప దిగుబడి 1.6-2.0 ట/ఎ. తెల్లగింజ. 120 రోజుల పంట. ఎకరాకు 3 కిలోల విత్తనం సరిపోతుంది. చేను మీద పడిపోదు. విత్తనాలను తయారు చేసి అమ్ముకుంటే రైతుకు మంచి లాభాలుంటాయి. జొన్న మార్కెట్‌ ధరలు మద్ధతు ధరల కంటే బాగా ఎక్కువగా ఉన్నాయి.

సజ్జ: రెండు తెలుగు రాష్ట్రాల్లో సజ్జ పంటను జనవరిలో విత్తవచ్చు. విత్తనోత్పత్తి కూడా చేపట్టవచ్చు. హైబ్రిడ్‌లతో సమానమైన గింజ దిగుబడినివ్వగలిగిన కాంపోజిట్‌ రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కాంపోజిట్‌ విత్తనాల నుండి పండించిన విత్తనాలను రైతులు తిరిగి విత్తుకోవచ్చు. అనుకూలమైన కాంపోజిట్‌ రకాలు: ఎ.బి.వి-04, రాజ్‌-171, ఐ.సి.టి.పి-8203. సజ్జ మద్దతు ధర: రూ.2500/క్వి.

రాగి: ఈ పంటను నీటి పారుదల సౌకర్యమున్న చోట 2 తెలుగు రాష్ట్రాల్లో, జనవరిలో విత్తవచ్చు. నారుపోసి, నారు ఎదిగినాక నాటవచ్చు. విత్తనోత్పత్తి కూడా చేపట్టవచ్చు. వానాకాలం, చలికాలం, వేసవిలలో పండే అధిక దిగుబడి (14-15 క్వి/ఎ.) నివ్వగలిగిన రకాలు: భారతి, ఇంద్రావతి, సువర్ణముఖి, తిరుమల.

పెసర: నవంబర్‌లో విత్తిన పెసర జనవరిలో కోతకొస్తుంది. పెసర మద్దతు ధర రూ.8558/- క్వి. వరి మాగాణుల్లో పెసరను జనవరిలో విత్తవచ్చు. ఫిబ్రవరిలో విత్తితే అత్యధిక దిగుబడులొస్తాయి. విత్తే సమయంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌ కంటే పై నుంటే మొక్క మొలుస్తుంది. తక్కువగా ఉంటే మొలక మొలవడం నిదానమవుతుంది. అందువలన ఉష్ణోత్రలు పెరిగేదాక ఆగి విత్తడం మంచిది. జనవరిలో విత్తడానికనువైన రకాలు: టి.ఎం-96-2, డబ్ల్యు.జి.జి-42 (యాదాద్రి), ఎల్‌.జి.జి-460, ఎల్‌.జి.జి-410, ఎల్‌.జి.జి-407, ఎం.జి.జి-351 (శ్రీరామ).

మినుము: అక్టోబరు-నవంబరులలో విత్తిన మినుము జవనరిలో కోతకొస్తుంది. జనవరిలో విత్తాలంటే 15 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలుంటే మొక్క మొలుస్తుంది. తక్కువ ఉంటే నిదానంగా మొలుస్తుంది. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్‌ రకాలు: అన్ని కాలాలకు అనువైన పాలిష్‌ రకాలు: టి.బి.జి-104, జి.బి.జి-1. మద్దతు ధర రూ. 6950. మార్కెట్‌ ధరలు దీనికంటే అధికంగా ఉన్నాయి.

నవ్వులు: నువ్వు పంటలో అత్యధిక దిగుబడులు సాధించాలంటే కోస్తా జిల్లాల్లో డిశంబరు 15 నుండి జనవరి 15 వరకు, తెలంగాణలో జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు, రాయలసీమలో జనవరి 2-3 వారాలలో విత్తుకోవాలి. అన్ని ప్రాంతాల్లో అత్యధిక దిగుబడినిచ్చే రకం: జగిత్యాల తిల్‌-1 (జె.సి.ఎస్‌-1020). 5-8 క్వి/ఎ. పంటకాలం: 85-90 రోజులు. తెల్లగింజ. శ్వేత, హిమ, రాజేశ్వరి రకాలకంటే ఎక్కువ దిగుబడినిస్తుంది. బూడిద తెగులును, ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం విత్తనాలకు మంచి డిమాండు ఉంది. విత్తనోత్పత్తి చేసి లాభపడవచ్చు. మద్ధతు ధర రూ. 8635/క్వి.

ప్రొద్దుతిరుగుడు: వరి మాగాణుల్లో ప్రొద్దుతిరుగుడు విత్తడానికి డిశంబరు ఆఖరివారం నుండి జనవరి మొదటి వారం వరకు అనుకూలం. భూమి తయారు చేసి విత్తాలంటే జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు విత్తడం మేలు. విత్తనోత్పత్తికి కూడా ఈ సమయాలలో విత్తడం అనుకూలం. బైబ్యాక్‌ అగ్రిమెంట్లు కుదుర్చుకొని హైబ్రిడ్‌ ప్రొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి చేపట్టడానికి కూడా ఈ సమయంలో విత్తడం అనుకూలం. వివిధ కంపెనీల ప్రొద్దుతిరుగుడు హైబ్రిడ్‌లను కూడా అగ్రిమెంట్ల ద్వారా ఈ నెలలో ఉత్పత్తి చేపట్టి అధిక దిగుబడి పొందవచ్చు.

వేరుశనగ: వేరుశనగ విత్తనాలకు విపరీతమైన డిమాండు ఉన్నది. పచ్చికాయలుగా అమ్మడానికి అనుకూలమైన రకాలు: విశిష్ట (టి.సి.జి.ఎస్‌-1694), కదిరి-7, కదిరి-9, నిత్యహరిత. ఈ రకాల విత్తనాలను ఎంత ఉత్పత్తి చేసినా చాలడం లేదు. విత్తుకునే సీజన్‌ వచ్చినపుడు విత్తనాల కొరత తీవ్రంగా ఉన్నది. కదిరి లేపాక్షి (కె-1812) రకం అధిక దిగుబడినిస్తున్నప్పటికి వీటి గింజలతో తయారైన పదార్థాలు వగరుగా ఉన్నందున ఈ రకాన్ని కొనడానికి కొందమంది తయారీదారులు విముఖత చూపిస్తున్నారు. నవంబరు, డిశంబరు నెలల్లో విత్తిన వేరుశనగ పంటలో అంతరకృషి, కలుపుతీయుట, సస్యరక్షణ ఈ నెలలో చేపట్టాల్సుంటుంది. చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది. తేమ తక్కువై పంట ఎదగలేదని నీటి తడులు ఇస్తూ పోతే అధిక తేమకు పంట దిగుబడి బాగా పడిపోతుంది.

చెరకు: మోడెం/కార్శి తోటలు పెంచుట, కొత్త తోటలు నాటుట జనవరిలో ఉంటాయి. భూమిలో సరిపడినంత తేమ ఉన్నపుడు కార్శి/మోడెం తోటల్లో సాళ్ళ మధ్య దున్ని భూమి గుల్లబారేలా జనవరిలో చేయాల్సి ఉంటుంది. కొత్తగా చెరకు నాటుకోవాలనే రైతులు, భూమిని లోతుగా దున్ని దుక్కి చేయాలి. పురుగులు, రోగాల బారిన పడని నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు: ఆంధ్రప్రదేశ్‌కు: స్వల్పకాలిక రకం: 2009ఎ107 (వశిష్ట): దిగుబడి 50-52 ట/ఎ. చక్కెర 20%. బెండు ఉండదు. పూత పూయదు. నీటి ముంపును, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. మధ్యకాలిక రకం: 86ఎ146: దిగుబడి 61.2 ట/ఎ. చక్కెర 18.5%. బెండు ఉండదు, పూత పూయదు. నీటి ముంపును, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎర్రకుళ్లు తెగులును సహజ పరిస్థితుల్లో తట్టుకుంటుంది. తెలంగాణకు: స్వల్పకాలిక రకం: 2003వి46 (భరణి): దిగుబడి 50 ట/ఎ. చక్కెర 18%. బెండు లేదు. పూత పూయదు. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎర్రకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. మధ్యకాలిక రకం: 97ఆర్‌401: దిగుబడి 58 ట/ఎ. చక్కెర 18.5%. బెండు లేదు. కొద్దిగా పూత పూస్తుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎర్రకుళ్ళు తెగులును కొద్దిగా తట్టుకుంటుంది.

టమాట: ప్రస్తుతం టమాట ధరలు చిల్లరగా కిలోకు 20/- అమ్ముతుండగా రైతు దగ్గర 10 రూపాయల వరకు అమ్ముతున్నది. జనవరిలో నారు పోసి, తర్వాత నాటిన పంట చేతికొచ్చే సమయానికి ధరలు కొద్దిగా పెరగవచ్చు. జూన్‌-జూలై ప్రాంతంలో ధరలు పెరిగే అవకాశముంది. వాతావరణంలో విపరీత మార్పులొస్తే, అధిక అకాల వర్షాలు, వడగండ్లు వచ్చి పంటలు ఒక ప్రాంతంలో దెబ్బతింటే, మిగతా అన్ని ప్రాంతాల్లోనూ, రేట్లు పెరిగే అవకాశముంది.

వంగ: టమాటతో పోలిస్తే వంకాయల ధరలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశముంది.

బఠాణీలు, ప్రెంచ్‌బీన్స్‌, కొత్తిమీర: చలికాలంలో అధిక దిగుబడి కారణంగా ఈ పంటల ధరలు తక్కువగా ఉండే అవకాశముంది. ధనియాల కొరకు పెంచిన పంట నూర్పిడి మార్కెట్‌లో అమ్ముట జనవరిలో ఉంటాయి.

బెండ: దిగుబడులు చలికి తగ్గుతాయి. ధరలు ఎక్కువగా ఉండే అవకాశముంది.

బూడిద గుమ్మడి, బీర: వీటిని జనవరి, ఫిబ్రవరి నెలల్లో విత్తవచ్చు. అనుకూలమైన బీర రకాలు: జగిత్యాల లాంగ్‌, అర్కసుజాత. అనుకూలమైన బూడిద గుమ్మడి రకాలు: బి.హెచ్‌-24, బి.హెచ్‌-25.

గుమ్మడి, పొట్ల: వీటిని జనవరి కడవరకు విత్తవచ్చు. మంచి గుమ్మడి రకాలు: పూసా అలంకార్‌, పూసా విశ్వాస్‌. నేలపై పెంచడానికనువైన పొట్ల రకం: కో-2.

పశుగ్రాస పంటలు: హైబ్రిడ్‌ జొన్న పశుగ్రాస రకాలు ఎన్‌.ఎస్‌.జి-59-3, ఎం.పి.చారి, పి.సి.-6 మొ|| మొక్కజొన్న పశుగ్రాస రకాలు: టి.ఎస్‌.ఎఫ్‌.ఎం-15-5, జె-1006, ఆఫ్రికల్‌ టాల్‌ మొ||. సజ్జ పశుగ్రాస రకాలు: జైంట్‌ బాజ్రా, టి.ఎస్‌.ఎఫ్‌.బి-15-8, మోతీ బాజ్రా మొ||, బాజ్రా నేపియర్‌ హైబ్రిడ్లు: ఎ.పి.బి.ఎన్‌-1, బి.ఎన్‌.హెచ్‌-14.

చామంతి: పూలు తెంపి మార్కెట్‌ చేయుట ఈ నెలలో ఉంటుంది.

బంతి: జనవరిలో నారు పోయవచ్చు. 25 రోజుల నారు నాటుకోవచ్చు. నాటిన 60 రోజులకు పూలు కోతకొస్తాయి. 

ప్రతిపల్లె/జనావాసానికొక రైతు ప్రజా సంఘం

ఎఫ్‌.పి.ఓలు మొత్తం భారతదేశంలో చాలా కొద్ది చోట్లనే సక్సస్‌ అవుతున్నాయి. మిగతా అన్ని చోట్ల ఫెయిలవుతున్నాయి. వీటిపై ఖర్చు చేస్తున్న వేల కోట్ల రూపాయల ప్రజాధనం అనుక్ను ఫలితాలను సాధించలేక నిరుపయోగమవుతున్నది. ఇంత ప్రజాధనాన్ని ప్రతిపల్లె / జనావాసంలో రైతు ప్రజాసంఘాల ఏర్పాటుకు వినియోగించుకుంటే సుమారు 6 లక్షల పైచిలుకు ఉన్న గ్రామాలు, పల్లెలు, మరియు ఇతర జనావాసాలలో రైతు ప్రజాసంఘాలనేర్పాటు చేసి ఉండేవాళ్లం. ఒక్కొక్క జనావాసం/పల్లె సంఘానికి ఒక లక్ష రూపాయలు మంజూరు చేసినా ప్రతి గ్రామంలోను ఇలాంటి సంఘాలేర్పడి ఉండేవి. నేను స్వతంత్రంగా 28 సంవత్సరాలుగా కృషి చేసి, రైతు ప్రజా సంఘాలనేర్పాటు చేశాను. నా స్వంత ఖర్చులతో తిరిగి ప్రయత్నించాను. 800 పైచిలుకు ప్రదేశాలలో, సంఘాలు/సమాఖ్యలు ఏర్పాటుకు ప్రయత్నించడం జరిగింది. అందులో పోయినవిపోను 250 దాకా ఫోనులో కాంటాక్ట్‌లో ఉన్నాయి. 60కి పైగా నడుస్తున్నాయి.

రైళ్లు నడవాలంటే పట్టాలెంత ముఖ్యమో, పల్లె ప్రాంతాలు, జనావాసాలు, గ్రామీణాభివృద్ధి, ప్రజలు కోరుకున్న విధంగా ఉండాలంటే రైతు ప్రజా సంఘాలు, పార్టీలకతీతంగా ఉండడం అంత ముఖ్యం.

మారుమూల ప్రాంతాలతో సహా అన్ని జనావాసాల్లో ఈ సంఘాలు ఏర్పాటు చేయడం వలన, ప్రజలందరి అభివృద్ధికి తగిన సూచనలు సలహాలు ఇవ్వగలిగిన సంస్థలు ప్రతిచోట ఏర్పడతాయి. ఇవి స్వయం సమృద్ధాలు. స్వతంత్రంగా నిర్ణయాలు నిష్పక్షపాతంగా తీసుకుంటాయి. చిన్న చిన్న సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించుకోవడానికి ఉపయోగపడతాయి. సభ్యులకవసరమైన చిన్న చిన్న డబ్బు అవసరాలను కూడా తీర్చగల్గుతాయి.

ఎవరికీ అన్యాయం జరగకుండా పారదర్శకంగా, అన్యాయాలను ప్రతిఘటిస్తాయి. దిక్కులేని వారికి సహాయకారిగా ఉంటాయి. ఏ పార్టీవారైనా, పార్టీలకతీతమైన సంస్థల ఏర్పాటుకు సహకరించడం వలన చిరస్థాయి కీర్తిని పొందవచ్చు. ఈ రైతు ప్రజా సంఘాలు, వ్యవసాయ, అనుబంధ శాఖల విస్తరణ కార్యక్రమాలకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ప్రతి కుగ్రామానికి విస్తరణ కార్యక్రమాలు సులభంగా అందుతాయి. అన్ని జనావాసాలలో ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేయడం ఆచరణ సాధ్యం. వ్యవసాయ అనుబంధ శాఖల వారందరికి శిక్షణలను ట్రెయినర్స్‌ ట్రైనింగ్‌ పద్ధతిలో ఇవ్వడం సాధ్యమే. అపార అనుభవాన్నుపయోగించుకోవడానికి ఏ పార్టీ వారైనా, స్వతంత్రులైనా ముందుకు రావచ్చు. అన్ని జనావాసాలలో రైతు ప్రజాసంఘాల ఏర్పాటుకు సహకరించి చిరస్థాయి కీర్తిని పొందండి. తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించిన ప్రపోజల్స్‌కు సానుకూలంగా స్పందిస్తే ఇంకా ఎక్కువ ప్రజాదరణ పొందే అవకాశముంది. ఇది రానున్న ఎలక్షన్లలో ఓట్లను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. పార్లమెంటు, పంచాయతి ఎలక్షన్‌లలో ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఎలక్షన్‌లలో మెజారిటి సాధనకు కూడా ఉపయోగపడుతుంది.

Read More