నత్తలొస్తాయి… జాగ్రత్త

————————– కథ———————————

”వాడిని ఇంటర్మీడియట్‌లో ఎమ్‌పిసి గ్రూప్‌లో చేర్చింది, బి.టెక్‌లో కంప్యూటర్‌ సైన్సు చదువుతాడని. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు అయితే ఎయిర్‌ కండిషన్డ్‌ గదుల్లో ఉంటూ అమెరికా దేశంలో స్థిరపడతాడని. వీడేమో నా  మాట వినకుండా అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ కోర్సు చేరినాడు. హాయిగా జీవితాన్ని గడపకుండా మట్టి పిసుక్కునే వారికి సేవ చేయాలని ఎందుకు కోరుకుంటున్నాడో?  వేళా పాళా ఉండదు,కయ్యిలమ్మిటా కాల్వలమ్మిటా తిరగాలి, పెద్దగా చదవని రైతులతో, మామూలు జనంతో కలిసి పనిచేయాలి. అదే సాఫ్ట్‌ వేర్‌ అయితే జీవితాన్ని అనుభవించ వచ్చు. విమానాల్లో ఎగురవచ్చు. మేధావులతో, బాగా డబ్బున్న వారితో  కలిసి పని చేయవచ్చు” నిష్టూరపోయినాడు నారాయణరెడ్డి.

”మనకు నచ్చిన చదువు వాడు చదవాలని లేదు కదా. వాడికి నచ్చిన చదువు చదవనివ్వండి. అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ఎవరి నుదిటిన ఏమి రాసి పెట్టి ఉందో…”అని ఈశ్వరమ్మ భర్తను ఓదార్చింది.

* * * * * 

చిత్తూరు జిల్లా, పలమనేరు పట్టణానికి పాతిక మైళ్ళ దూరంలో ఉన్న చిన్న గ్రామమది. ఆ గ్రామం పక్కనే దండిగా పల్లెలున్నాయి. అక్కడి రైతులు కూరగాయ తోటలు పండిస్తారు. పది చదివిన  తరువాత ఐ టి ఐ చదివిన నారాయణరెడ్డి బావి  మోటార్లు రిపేరు చేస్తూ ఉంటాడు. ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ వరకు చదివిన ఈశ్వరమ్మ టైలరింగ్‌ చేస్తూ ఉంది. వీరి ఒక్కగానొక్క కొడుకు చిరంజీవి అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు.

* * * * * 

అప్పుడప్పుడే తెల్లారుతోంది. ఇంటి ముందరి గులాబీ తోటలోని గులాబీలు కోస్తూ ఉన్నాడు చిరంజీవి.

తక్కెడాయన, వాడి పెళ్ళాంతో కలిసి గంపలు, గోతాలు ఎత్తుకుని పరుగులు తీస్తున్నాడు.

”ఏమయ్యింది” అని అడిగినాడు.

”కూరగాయ పంటలు పండించే రైతులకు కొత్త కష్టం వచ్చి పడింది. రాత్రిళ్ళలో మాత్రమే దాడి చేసే దండు…. నత్తల దండు, రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది”

ఆశ్చర్యంగా వారి వైపు చూశాడు చిరంజీవి.

”పగులు కనబడవు, రాత్రిళ్ళలో పొలాల్లోకి వస్తున్నాయి. చేతికి అందాల్సిన పంటలు ధ్వంసం చేస్తున్నాయి.

ఊరికి ఉత్తరాన వుండే గుట్ట కింద మాకు నేల ఉంది. పది రూపాయలు సంపాదించుకుందామని టమోటా తోట వేసినాను. ఇప్పుడు ఈ నత్తల దయ్యాలు వచ్చి నోటికాడి కూడు లాగేస్తా ఉన్నాయి.

మా  పంటే కాదు, ఊర్లో వాళ్ళ ఉర్లగడ్డ, మిరప, చిక్కుడు, బీర తోటలు కూడా నాశనం చేస్తున్నాయి”

చిన్నగా తక్కెడాయనతో కలిసి టమోటా తోట కాడికి బయలుదేరినాడు. పొలాల్లో నత్తల దాడి జరుగుతూ ఉందని తెలుసుకున్నాయేమో ఊరి కుక్కలు, భౌభౌమని అరుస్తూ ఉన్నాయి.

దబ దబా పరుగెత్తుకుంటూ వచ్చిన ఆడంగిలాయన ”ఏందబ్బా, నత్త నడక నడస్తా వుండారే, కొంపలు కొల్లేరు అయిపోతావుంటే…. పరిగెత్తండి… పరిగెత్తండి” అంటూ తోసుకుంటూ వెళ్ళినాడు.

పరుగులు తీస్తూ మబ్బులో గణేష్‌ బీడీ కట్టపై పేపరును తొక్కినాడు. ”అయ్యో..అయ్యో…దేముడి బొమ్మ తొక్కేసినానే ….” అంటూ ఆ పేపరుకు పడీపడీ మొక్కి, మళ్ళీ టమోటా తోటలోకి పరుగులు తీసినాడు.

చిన్నగా మంచు కురుస్తోంది.అప్పటికే కొంత మంది రైతులు పొలాల్లో చేరి ఉన్నారు. వాటిని ఏరి గంపల్లో, తట్టల్లో, గోతాములలో  వేసుకుని దూరంగా పారేస్తున్నారు.

తోటలలో వున్న డ్రిప్‌ పైపుల్లో నుంచి నీరు సరిగా రాక పోవడం గమనించి కారణం అడిగాడు. 

”నత్తలు కూరగాయలను తినడమే కాదు, డ్రిప్‌ పైపుల్లో కూడా దూరి నీళ్లను సరిగ్గా రానివ్వడం లేదు” అని బదులిచ్చినాడు తక్కెడాయన. చిరంజీవి బాధగా తలెత్తి చూశాడు.

వందలాది నత్తగుల్లలు గెనుమలపైన, పొలాల్లో కనిపించాయి. శత్రు సేనపై దాడి చేసే సిపాయిల్లాగా అవి టమోటా మొక్కలన్నిటినీ చుట్టుముట్టి ఉన్నాయి. తేమ వాతావరణం నత్తల మనుగడకు అనువుగా ఉందని గుర్తించాడు. 

నత్తలు నడిచే దారిలో అవి విడిచిపెట్టిన జిగురు తివాచీ పరిచినట్లుగా ఉంది. ఊర్లోని పిల్లలు కొందరు జిగురు వెంబడే, కారులో పోయినట్లు ‘రుయ్‌ రుయ్‌’ మని శబ్దం చేసుకుంటూ ఆడుకుంటున్నారు.

”నత్తా నత్తా 

ఎక్కడి కెళతావ్‌?

మెత్త మెత్త నడకతో 

ఎంత దూరం పోతావ్‌? 

నిన్ను పట్టి అత్తకి ఇస్తా! 

కూర వండించి దుత్తలో పెడతా!!” అని పాడుతున్నాడు ఆడంగిలాయన.

నత్తలు పంటల్ని ఎలా నాశనం చేస్తున్నాయని అక్కడి రైతులను అడిగాడు.

వారు టమోటా చెట్లను చూపిస్తూ ఇలా చెప్పారు ”మొక్కల మొదళ్లలోని మృదువైన భాగాన్ని తినేస్తున్నాయి. మొక్కకు అందాల్సిన సూక్ష్మ పోషకాలు తగ్గి పంట ఎగబడి రావడం లేదు. మొక్కలకు రోగ నిరోధక శక్తి  తగ్గి ఫంగస్‌ కారణంగా తెగుళ్లు సోకుతున్నాయి”

‘నత్తల వల్ల పంటకు నష్టం,రైతులకు కష్టం వచ్చింది కదబ్బా’ అని కొద్దిసేపు అక్కడే గెనుమ మీద కూర్చుని ఆలోచనలలో పడినాడు. తన చేతిలోని మొబైల్‌లోని నెట్‌ ద్వారా వాటిని ఎలా తరిమేయాలో చూశాడు. పరిచయమున్న అగ్రికల్చరల్‌ బి.ఎస్సీ చదువుతున్న సీనియర్లతో మాట్లాడినాడు. పలమనేరులోని వ్యవసాయ అధికారులతో మాట్లాడాడు. వాటిని ఎలా తరిమికొట్టాలో కొన్ని సలహాలు తీసుకున్నాడు.

రెండు మూడు వారాలు రైతులతో పాటే పొలాల్లోకి వెళ్ళాడు. కొన్ని మందులను డ్రిప్పుల ద్వారా, కొన్ని మందులను నేరుగా చల్లించినాడు.

కొద్దికొద్దిగా నత్త గుల్లల తాకిడి తగ్గింది. రైతులు చిన్నగా ఊపిరి పీల్చుకోగలిగినారు.

* * * * * 

కొడుకు, రోజూ రైతులమ్మిట తిరగడం చూసిన నారాయణ రెడ్డి, భార్యతో ఇలా అన్నాడు ”చదువుకునే వాడు బుద్ధిగా చదువుకోకుండా, వాడికి ఊర్లో వాళ్ళతో ఏమి పని? ఎవరు ఎట్లపోతే మనకేమి? దారిన పడి వున్న చెత్తను నెత్తిపైన వేసుకుంటాడెందుకు?

సుఖ పడే లక్షణాలు లేవు వీడికి …జల్సాగా కాలు మీద కాలు వేసుకుని ఉద్యోగాలు చేసే చదువులు చదవకుండా కూలీ లెక్కన పొలాల్లో కష్టపడే చదువు చదువుతున్నాడు. రేపు పెండ్లి చేయాలన్నా కష్టం. అమెరికా అబ్బాయిలకే అమ్మాయిలు దొరకడం లేదు. మట్టిలో దొర్లా డాలకునే వీడికి పిల్లను ఎవరు ఇస్తారు” 

”ఎందుకండీ అలా శాపనార్థాలు పెడతారు. మట్టిని నమ్ముకున్నవాళ్ళెప్పుడూ చెడిపోరు లెండి. అమెరికాలో ఉద్యోగం చేస్తేనే చేసినట్లా? మన ఊర్లల్లో చేస్తే ఉద్యోగాలు కావా” 

”మా పెద్ద నాయన కొడుకు జర్మనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా లక్షలు సంపాదిస్తున్నాడు. మా మేనమామ అల్లుడు అమెరికాలో ఏకంగా పెద్ద బిల్డింగ్‌ కొనేసాడు. సింగపూర్‌లో వుండే మా  పిన్ని మనుమడికి నెలకు నలభై లక్షల జీతమంట. కొడితే అలాంటి జాక్‌పాట్‌లు కొట్టాలి. రవిక గుడ్డల వ్యాపారం చేసేవాడికి, పట్టు చీరల వ్యాపారం చేసేవాడికి ఉన్నంత తేడా ఉంది”

”వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా సంపాదిస్తున్నారు అని ఆలోచిస్తూ కూర్చుంటే మనకి కడుపు మంట, కడుపులో మంట తప్పితే లాభమేముందండీ… ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఫారిన్‌లో వున్నా ఇండియాలో వున్నా ప్రతి మనిషీ కుడిచేత్తోనే కదా తింటాడు. అవీఇవీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి”

* * * * * 

అప్పుడప్పుడే తెల్లారుతోంది. చల్లటి గాలులు మెల్లమెల్లగా వీస్తున్నాయి. ఇంటి దూలాల సందుల్లో, వాసాల ఇరుకుల్లో దాక్కుని వున్న ఊర పిచ్చుకలు కిచకిచ శబ్దాలు చేస్తున్నాయి. 

దడదడమని ట్రాక్టర్లు ఇంటి ముందర వచ్చి నిలిచిన శబ్దం. అంతా గోలగోలగా ఉంది.

నిద్రబోతున్న నారాయణరెడ్డి ‘ఏమయ్యిందబ్బా’ అని ముఖానికున్న దుప్పటి తీసి చూసాడు. చిరంజీవి కంప్యూటర్‌ ముందర కూర్చుని మామిడి తోటల్లో అంతర పంటల సాగు గురించి వెదుకుతున్నాడు. ఈశ్వరమ్మ గాఢంగా గురకపెట్టి నిద్రపోతోంది.

బయట ఏమి జరుగుతోందో చూద్దామని ముఖం మీద నీళ్లు చల్లుకుని ఇంటి బయటికి వచ్చాడు.

ఇంటి ముందర పది ట్రాక్టర్లు నిలబడి ఉన్నాయి. ట్రాక్టర్ల నిండా ఎర్రెర్రని టమోటాలు కళకళ లాడుతూ కనిపించాయి. పండిన టమోటాలను పలమనేరు, బెంగుళూరు పట్టణాలకు తీసుకెళ్లి అమ్మడానికి వెళ్తున్నారు. ముప్పై మంది దాకా మగవారు ట్రాక్టర్ల నుండి దిగినారు.

ఎందుకొచ్చారని అడిగే లోగానే కొందరు ఇంటిలోకి వెళ్లి చిరంజీవిని ఎత్తుకొచ్చారు.

  ”జై చిరంజీవి… జైజై చిరంజీవి” అని అరుస్తూ ఉన్నారు.

టమోటాలతో చేసిన మాలను చిరంజీవి మేడలో వేసినారు. పలకలు కొట్టినారు, పాటలు పాడినారు, పులి అడుగులు వేసినారు, పూలు విసిరినారు, రంగురంగుల నీళ్లు చల్లినారు.

చిరంజీవిని పెద్ద బండ పైన నిలబెట్టినారు. ఆడంగిలాయన ఈలలు వేసింది వేసిందే ….

తక్కెడాయన గట్టిగా ”ఊరికి ఉపకారి బాబూ నువ్వు. ఎప్పుడూ లేనిది ఈసారి నత్తలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. నత్తలవల్ల నష్టపోతున్నామని నీతో చెప్పినప్పుడు మాకు దైర్యం చెప్పినావు. ఎలా ఎదుర్కోవాలో నేర్పినావు. ఏ ఏ మందులు పిచికారీ చేయించాలో చెప్పినావు. దగ్గరుండి మందులను వాడించినావు. పొలాల చుట్టూ సున్నం వేస్తే నత్తల బాధ తగ్గుతుందని చిట్టి చిట్కాలు చెప్పినావు. ఆరుగాలం కష్ట పడిన మాకు ఖాళీ జేబులు మిగులుతాయని అనుకుంటే, మా జేబులు నిండుగా నింపుతున్నావు. ఈసారి టమోటా పంట మాకు దక్కిందంటే, ఇది అంతా  నీ దయ బాబూ…. నీ పనులు కూడా పక్కన పెట్టి మా కోసం కష్టపడినావు” అంటూ పూలమాల వేసినాడు. ఎవరో దూరంగా టపాకాయలు పేల్చినారు.

చిరంజీవిని ఊరేగిస్తూ ప్రతి ట్రాక్టరు వద్దకూ ఎత్తుకెళ్ళి జేజేలు పలుకుతున్నారు. ఈ  మధ్యనే పైటలేసిన ఆడపిల్లలు ఇండ్లనుంచి బయటికి వచ్చి చిరంజీవి వైపు మెచ్చుకోలుగా చూశారు.

అక్కడ గుమికూడిన ఆడవారిని చూస్తూ ఆడంగిలాయన పాట పాడినాడు.

”పట్టు చీర కట్టినావు అత్తా అత్తా 

మల్లె చెండు చుట్టినావు అత్తా అత్తా

నల్ల కాటుక పెట్టినావు అత్తా అత్తా  

నత్త పులుసు చేస్తావా అత్తా అత్తా”

ఆడంగిలాయన పాటకి అక్కడున్న ఆడా మగా, పిల్లాజెల్లా పడీపడీ నవ్వినారు.

ఇంతలో నారాయణరెడ్డి పక్కన వచ్చి నిలబడిన ఈశ్వరమ్మ ”ఏమండీ, మనవాడు అమెరికాలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం సంపాదించి స్థిర పడి ఉంటే మనం, మన ఇంట్లో వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉండే వాళ్ళమేమో… ఇప్పుడు చూడండి…మన ఊర్లోని రైతుల ముఖాల్లో వెలుగులు….ఈ  వెలుగులు మన ఊరి రైతులలోనే కాదు, వేలాది రైతులలో కూడా మన బిడ్డ వెలుగులు నింపుతాడండీ. ఎక్కడో దూరదేశాల్లో ఉద్యోగం చేస్తూ, అప్పుడప్పుడు సెల్‌లో హాయ్‌ హాయ్‌లు చెప్పడం కన్నా మన బిడ్డ మన దగ్గరలో ఉంటూ పదిమందికీ ఉపయోగపడితే దానికి మించిన సంతోషం మనకి ఇంకేమి ఉంటుందండీ?” అని సంతోషంగా చెప్పింది.

నారాయణరెడ్డి కన్నార్పకుండా ఊరేగింపునే చూస్తున్నాడు. ఊర్లోని అమ్మలక్కలు కంచు తట్టలో ఎర్ర నీళ్లు పోసి అందులో కర్పూరం వెలిగించి చిరంజీవికి దిష్టి తీస్తున్నారు. ఆ కర్పూరం వెలుగులో చిరంజీవి ముఖం మిలమిలా మెరుస్తోంది.

నారాయణరెడ్డి చేయి అతడికి తెలియకనే ఇంటి ముందరి గులాబీ చెట్టుకున్న పువ్వును కోసింది. కొడుకు మీదకి విసిరివేయడానికే పువ్వును కోసాడని అర్థం చేసుకున్న ఈశ్వరమ్మ ముసిముసినవ్వులు నవ్వుకొంది.

ఆర్‌. సి. కృష్ణ స్వామి రాజు, 93936 62821

‘స్వాతి’ వార పత్రిక 10-09-2021 సౌజన్యంతో

Read More

కొబ్బరిని ఆశించు నల్లముట్టె పురుగు   జీవ నియంత్రణ

కొబ్బరి ఆగ్నేయాసియాకు చెందిన పంట మరియు ఆ ప్రాంతం అంతటా విస్తృతంగా సాగు చేయబడుతుంది. కొబ్బరిని ”జీవన వృక్షం” అని పిలుస్తారు. ఎందుకంటే దాని సాగు ముఖ్యమైన సాంస్కృతిక మరియు సామాజిక-ఆర్థిక కోణాలను కలిగి ఉంటుంది మరియు ఆసియా-పసిఫిక్‌ అంతటా లెక్కలేనన్ని సన్నకారుదారులకు జీవనోపాధిని కలిగిస్తుంది. భారతదేశం దీని ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో కొబ్బరి అనేక ప్రాంతాల్లో సాగు చేయబడుతుంది, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ ఇంకా తమిళనాడులో ఎక్కువగా సాగు చేస్తున్నారు.

కొబ్బరిలో అనేక చీడ పురుగులు సోకినప్పటికీ నల్లముట్టె పురుగు గణనీయమైన ఉత్పత్తి నష్టాన్ని కలిగిస్తుంది. దేశంలోని కొబ్బరి పండించే అన్ని ప్రాంతాలలో ఈ పురుగు వ్యాప్తి చెంది ఉంది. కొబ్బరిను ఆశించు అన్నీ చీడ పురుగులలోకల్లా ఇది ప్రధానమైంది. కొబ్బరి నల్లముట్టె పురుగు శ్రీలంక మరియు బహుశా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉద్భవించింది. ఇది ఒలిగోఫాగస్‌ శాకాహారి, అనగా కొన్ని రకాల చెట్లను మాత్రమే ఆశిస్తుంది. ఇది ప్రధానంగా వివిధ తాటి జాతులతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ జాతుల అన్నిటిలోకల్లా కొబ్బరి ఈ పురుగుకు అనువైన పంట. ఈ పురుగు కొబ్బరిని కాకుండా ఆయిల్‌ పామ్‌, ఖర్జూరం, వక్క వంటి పంటలను కూడా ఆశిస్తుంది.

నల్లముట్టె పురుగు గుర్తింపు చిహ్నాలు

కొబ్బరి నల్లముట్టె పురుగు జీవిత చక్రంలో నాలుగు అభివృద్ధి థలు ఉంటాయి: గుడ్డు, లార్వా (గొంగళి పురుగు), కోశస్థథ మరియు తల్లి పురుగు థ.

గొంగళి పురుగు: ఇది ఆకుపచ్చని గోధుమ రంగులో ఉంటుంది. ముదురు గోధుమ రంగు తల మరియు ప్రోగ్వక్షం కలిగి ఉంటుంది. శరీరంపై గోధుమ రంగు చారలు ఉంటాయి.

కోశస్థథ: ఇది రెట్టలతో గూడుకట్టుకొని, ఒక పలుచటి పట్టు కోకన్‌లో కోశస్థ థను పూర్తి చేస్తుంది.

తల్లి పురుగు: నలుపుతో కూడిన లేత బూడిద రంగు మచ్చలను కలిగి ఉంటుంది.

తల్లి ఆడ పురుగు: పొడవైన యాంటెన్నా మరియు ముందు రెక్కలపై మూడు మందమైన మచ్చలు ఉంటాయి.

మగ పురుగు: వెనుక భాగం రెక్కలు అంచులు వెంట్రుకలను కలిగి ఉంటాయి.

నల్లముట్టె పురుగు గాయపరుచు లక్షణములు

ఈ పురుగు అన్ని వయసు కొబ్బరి చెట్లను ఆశిస్తుంది. కొబ్బరి దిగువ వరుసాకులలోని పత్రహరితమును గోకి తిని, రంపపు పొట్టు వంటి రెట్టలతో, నోటి దారాలతో గూళ్ళు కట్టి, ఆకులను అతికించి, ఆ గూళ్లలో ఉంటాయి.

మూడు లేదా నాలుగు ఆకులు మాత్రమే ఆకుపచ్చ రంగు కలిగి ఉండి, మిగిలిన ఆకులన్నీ ఎండిన మచ్చలు కలిగి ఉంటాయి.

ఈ పురుగు తీవ్రత పెరిగే కొద్ది మచ్చలన్నీ ఏకమై ఆకు పూర్తిగా ఎండిపోతుంది. ఇందుమూలంగా చెట్టుపై ఆకులన్నీ ఎండిపోయి వాలిపోతాయి. ఈ పురుగు ఆశించిన తోట అంతా కాలిపోయినట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు పురుగు ఉధృతి ఎక్కువ ఉన్నచో కాయలు కూడా దెబ్బతింటాయి.

ఈ పురుగు చిన్న మొక్కలను ఆశించినపుడు మొక్కలు గిడసబారి, ఆలస్యంగా కాపుకు వచ్చును. అలాగే పెద్ద మొక్కలను ఆశించిన యెడల ఆహారం తయారు చేయగల ఆకులలోని పత్రహరిత రేణువులను తినివేయుట వలన ఆహార సరఫరా తగ్గిపోయి చెట్టు కాపు తగ్గడమే కాక కాయ పరిమాణం కూడా తగ్గును. ఆకులు ఎండిపోవటం వలన పిందెలు రాలి, దిగుబడులు తగ్గుతాయి. ఈ పురుగు ఆశించిన పిమ్మట చెట్టు కోలుకోవడానికి రెండు నుండి మూడు సంవత్సరాలు పట్టును.

నల్లముట్టె పురుగు జీవిత చరిత్ర

తల్లి పురుగు 50 నుండి 490 వరకు పాత గూళ్లు ఉన్న దిగువ వరుస ఆకుల దగ్గర గుడ్లు పెడుతుంది. 5 రోజులలో ఈ గుడ్లు పొదగబడి, చిన్న లార్వాలు ఆకు తింటూ ఎదుగుతాయి. గొంగళి పురుగులు ఆకు మడతలలో తింటూ దాదాపు ఒక నెల ఎదుగుతాయి. రెట్టలతో గూడు కట్టుకొని, నిద్రావస్థ థను 10-12 రోజులలో పూర్తి చేసుకుని తల్లి (రెక్కల) పురుగుగా వెలువడుతుంది. ఈ విధంగా ఆరు నుండి ఏడు వారములలో జీవిత చక్రం పూర్తి అవుతుంది.

జీవనియంత్రణ పద్ధతుల ద్వారా నల్లముట్టె పురుగు నియంత్రణ

నల్లముట్టె పురుగు యొక్క లార్వా పరాన్న జీవులు (బదనిలు) అంటే బ్రాకాన్‌ హెబెటర్‌ మరియు గొనియోజస్‌ నెఫాంటిడిస్‌ ఈ చీడపీడను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి.

భారతదేశంలో ఈ గొనియోజస్‌ నెఫాంటిడిస్‌ ఏడాది పొడవునా సంభవిస్తుంది, ఫిబ్రవరిలో గరిష్ట కార్యకలాపాలు గమనించబడ్డాయి. దీని అభివృద్ధికి వెచ్చని మరియు పొడి వాతావరణం సానుకూలం, సాధారణంగా తేమతో కూడిన నెలల్లో తక్కువ పరాన్న జీవనం గమనించవచ్చు. ఆడ గొనియోజస్‌ నెఫాంటిడిస్‌ అతిధేయ లార్వాలను స్తంభింపజేసి అతిధేయ శరీర ద్రవాన్ని త్రాగి బతుకుతాయి. ఈ బదనిక 1 నుండి 2 వ థ లార్వాలను కుట్టడం మరియు పక్షవాతం చేయడం ద్వారా పురుగు వృద్ధిలో కొంతభాగాన్ని తగ్గించగలదు. ఒక ఆడ బదనిక 6-8 లార్వాలను నాశనం చేయగలదు. స్త్రీ సంతానం యొక్క అధిక నిష్పత్తితో సంవత్సరం పొడవునా జి. నెఫాంటిడిస్‌  సంభవించడం, అధిక అతిధేయ శోధన సామరథ్యం, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం మరియు పురుగువృద్ధి తగ్గించడం వలన ఇది నల్లముట్టె పురుగు నివారణకు బహుముఖ పరాన్న జీవిగా మారుతుంది.

సి. సెఫాలోనికా (వరి పురుగు) లార్వాలను జి. నెఫాంటిడిస్‌ యొక్క సామూహిక పెంపకానికి హోస్ట్‌గా ఉపయోగిస్తారు. జి. నెఫాంటిడిస్‌ యొక్క నిరంతర ఉత్పత్తికి ఒక శక్తివంతమైన మరియు ఆరోగ్యకరమైన సి.సెఫాలోనికా కాలనీ అవసరం.

పురుగు తక్కువ స్థాయిలో ఉన్నచో (1 లేదా రెండు ఆకులకు పురుగు ఉన్నచో) గొనియోజస్‌ నెఫాంటిడిస్‌ అనే బదనికను 10 పురుగులు మరియు బ్రాకాన్‌ హెబెటర్‌ 20 పురుగులు/చెట్టుకు చొప్పున తోటలో 10 శాతం చెట్లకు ఆశించినప్పుడు విడుదల చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు ఎక్కువ సంఖ్యలో బదనికలు విడుదల చేయాలి. మొత్తంగా 8-12 విడుదల చేస్తే మంచిది. కొబ్బరి చెట్ల పరిసరాల్లో ఉన్న తాటి చెట్లను కూడా ఈ పురుగు ఆశిస్తుంది కాబట్టి ఈ చెట్లపై కూడా బదనికలను విడుదల చేయాలి.

పరాన్న జీవుల విడుదల తర్వాత ఈ పురుగు సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్రభావిత తోటలలో నల్లముట్టె పురుగు యొక్క లార్వా సంఖ్య మూడు నెలల తర్వాత 34.1 నుండి 75.9 శాతానికి తగ్గిందని, పరాన్నజీవులు విడుదలైన ఆరు నెలల తర్వాత 59.6 నుండి 100.0 శాతానికి తగ్గిందని మరియు కొత్తగా ఉద్భవించిన ఆకులలో ఆకు నష్టం మరియు పురుగు సంఖ్య నమోదు కాలేదు అని పరిశోధనలలో వెల్లడయింది. ఈ పురుగు యొక్క ప్యూపల్‌ సంఖ్య కూడా ఆరు నెలల తర్వాత 33.3 నుండి 94.5 శాతానికి మరియు 92.8 నుండి 100.0 వరకు తగ్గుతుంది అని పరిశోధనలలో వెల్లడించారు.

ఈ విధంగా జీవ నియంత్రణ పద్ధతులని వినియోగించడం ద్వారా పురుగు బెడదని నివారించి మంచి దిగుబడులు పొందడమే కాకుండా రసాయన పురుగు మందుల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చును. అంతేకాకుండా రసాయన నియంత్రణ పద్ధతులతో కంటే ఈ జీవ నియంత్రణ పద్ధతులలో ఖర్చు తక్కువ కాబట్టి రైతుకు లాభసాటిగా ఉంటుంది. 

యల్లపు రామ్మోహన్‌, లోక మౌనిక

డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం.

Read More

జెర్బెరాల సాగు… రైతుకు మేలు

జెర్బెరా వాణిజ్యపరంగా సాగు చేసే పూల మొక్కలలో ముఖ్యమైనది. ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలో ఇది పెరుగుతుంది. ఈ పుష్పాలు అందమైన వివిధ రంగులలో కనిపించటమే కాక వాటి రేకులు అమరికలో ప్రత్యేకతను ప్రదర్శిస్తాయి. పూవులు ఎక్కువ రోజులు తాజాగా ఉండటం కోసం వాటిని కోసిన తరువాత కాడలను నీటిలో ఉంచవలెను. జెర్బెరాను ఆఫ్రికన్‌డైసి లేదా గెర్బెరోడైసి అని పిలుస్తారు. 

చాలా రాష్ట్రాలు హార్టీకల్చర్‌ మిషన్‌ కింద జెర్బెరా పూల సాగును ప్రోత్సహిస్తున్నాయి. రైతులకు డ్రిప్‌, మల్చింగ్‌, హాఫ్‌ హెచ్‌.పి. మోటార్‌ పంపు, షేడ్‌నెట్‌లను ఉచితంగా లేదంటే సబ్సిడి క్రింద అందజేస్తున్నాయి. మార్కెట్‌లో మంచిధర లభిస్తుంది. ఎక్కువ శ్రమ లేకుండా సాగు చేయవచ్చును. 28þ36 మీటర్ల (1000 చ.మీ.) షేడ్‌నెట్‌లో 3700-3800 వరకు జెర్బెరా మొక్కలు అవసరం అవుతాయి. 90 రోజుల తర్వాత జెర్బెరా పుష్పించడం మొదలవుతుంది. ఒక నెలలో 10 సార్లు పువ్వులను కోయవచ్చు. కోసిన ప్రతిసారీ 800-1000 పూలను షేడ్‌నెట్‌ నుండి తీయవచ్చు. ఒక జెర్బెరా పువ్వు ఖరీదు రూ. 5-6/- వరకు ఉంది. ఒక నెలలో 8 వేల నుండి 10 వేల వరకు ఈజీగా వస్తాయి. తద్వారా 40 వేల వరకు ఆదాయం వస్తుంది. అలా ఈ పంటను 5 లేదా 6 సంవత్సరాలపాటు కొనసాగించవచ్చు.

మొక్కల లక్షణాలు: జెర్బెరా మొక్కలు కాండం లేకుండా గుబురుగా పెరిగే బహువార్షికాలు. వీటి పుష్పాలు పసుపు, ఆరెంజ్‌, తెలుపు, గులాబి, ఎరుపు, స్కార్లెట్‌ రంగులలో లభ్యమవుతాయి. పూకాడలు చాలా పొడవుగా ఏవిధమైన ఆకులు లేకుండా ఉంటాయి.

వాతావరణం: జెర్బెరా మొక్కల పెరుగుదలకు ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మరియు గాలిలో తేమ శాతం 60% ఉండవలెను.

నేలలు: ఎర్రటి నేలలు చాలా అనుకూలం. పి.హెచ్‌ 5.5-6.5 మరియు ఇ.సి. 0.50 డి.ఎస్‌.యు/మీ. గా ఉండేటట్లు చూసుకోవాలి. నేలలు వదులుగా గాలి చొరబడేలా ఉంటే వేళ్లు సులభంగా భూమిలోనికి చొరబడి బాగా పెరుగుతాయి. దీనివేళ్ళు 50-70 సెం.మీ. లోతు వరకు వెళ్ళగలవు.

రకాలు: చాలా రంగులతో కూడిన పూలను మనం జెర్బెరాలో చూడవచ్చు. జెఫ్ఫ, సంగ్రియ, రోకుల, ఆఫ్‌రబ్‌, రోమెన, సలీన, టెకొర మరియు స్టార్‌లైట్‌ వంటి మొదలగు రకాలు గ్రీన్‌హౌస్‌లలో పెంచుతారు.

నేల తయారీ: మొక్కలు నాటే ముందు నేలను మీథైల్‌ బ్రోమైడ్‌ లేదా ఫార్మిలిన్‌ను 100 చ.మీ. లకు 7.5-10 లీ. చొప్పున పిచికారి చేసిన తరువాత 2 వారాల పాటు ప్లాస్టిక్‌తో కప్పి ఉంచాలి. తరువాత ఒక చ.మీ.కు. 100 లీ. నీటితో తడిపి రసాయనాల అవశేషాలు లేకుండా చూసుకోవాలి. 2 వారాల తరువాత మొక్కలు నాటుకోవాలి. ఇది పాలీహౌస్‌లో సాధారణంగా చేస్తారు.

బెడ్లు తయారీ: జెర్బెరాలను ఎత్తైన బెడ్‌లపై పెంచుతారు. దీనివల్ల నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది. బెడ్లు 2 అడుగుల (60 సెం.మీ.) వెడల్పుతో 1.5 అడుగుల ’45 సెం.మీ.) ఎత్తుతో తయారు చేసుకోవాలి. బెడ్ల మధ్య దూరం 1.0 అడుగు (30 సెం.మీ.) ఉండాలి.

బెడ్లు వదులుగా ఉండటం కోసం 30 ట్రాక్టర్ల గులక ఇసుక (ఎర్ర మన్ను), 15 ట్రాక్టర్ల సేంద్రియ ఎరువులు ఒక ఎకరంలో వేసుకోవాలి. అనగా 1000 చ.మీ. పాలీహౌస్‌లో 8 ట్రాక్టర్ల గులక ఇసుక (ఎర్రమన్ను), 4 ట్రాక్టర్ల సేంద్రియ ఎరువులు సరిపోతాయి. బెడ్లను ఫ్యూమిగేట్‌ చేసిన తరువాత చ.మీ.కు/కిలో వేపపిండి వేసుకున్నట్లయితే నులిపురుగుల బెడద నుండి తప్పించవచ్చు.

ఎరువులు: బెడ్లు తయారు చేసిన తరువాత 100 చ.మీ.లకు భాస్వరం ఎరులు 2.5 కిలోలు, మెగ్నీషియం సల్ఫేట్‌ 1/2 కిలో, బయోజైమ్‌ గుళికలు 200 గ్రా., హ్యూమిక్‌ ఆసిడ్‌ 200 గ్రా. కలుపుకోవాలి. ఈ ఎరువులను 6 ఇంచుల వరకు భూమిలో కలియబెట్టి నీరు పెట్టాలి. మొక్కలు నాటే ముందు ఈసి మరియు పి.హెచ్‌ గమనించాలి.

నాటేదూరం: మొక్కలను నాటేటప్పుడు ఎల్లప్పుడు మొక్క క్రౌన్‌ భాగం భూమి పైన ఉండేట్లు చూసుకోవాలి. ఒక బెడ్‌లో 2 వరుసల మధ్య 30 సెం.మీ. దూరంలో, మొక్కకు మొక్కకు మధ్య దూరం 30 సెం.మీ. ఉండేటట్లు చూసుకొని నాటుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి భూమిని వదులు చేయటం వల్ల గాలి ప్రసారం జరిగి బాగా పెరుగుతాయి. మొక్కలు నాటిన తరువాత భూమిలో తేమ శాతం 6 వారాలు వరకు 80-90% ఉండేటట్లు చూసుకోవాలి. లేనిచో వాడిపోయే ప్రమాదం ఉంటుంది.

ప్రవర్ధనము: 3 నెలల కంటే ఎక్కువ వయస్సు మరియు 4 లేక 5 ఆకులు ఉన్న టిష్యూకల్చర్‌ మొక్కలను వాడుకోవాలి. 

నీటి యాజమాన్యం: నీటి ఉదజని సూచిక 6.5-7 మరియు ఈ.సి. 0.5-1.0 ఖిఐ/ళీ2 ఉన్న కఠినత్వం 550 పిపియంగా ఉండాలి. మొక్కలు నాటిన వెంటనే 4 వారాల పాటు ఓవర్‌ హెడ్‌ (పైభాగం నుండి) సూక్ష్మ-స్ప్రింకర్లతో నీరు పెట్టాలి. తరువాత బిందుసేద్యం ద్వారా నీరు పెట్టాలి. బిందు సేద్యం ద్వారా ఒక్కొక్క మొక్కకు 500-700 మి.లీ./రోజుకి నీటిని వినియోగించుకుంటాయి. గాలిలో తేమ 90-92% మించరాదు. అంతకంటే ఎక్కువ అయితే పూల అమరిక అధ్వాన్నంగా ఉంటుంది.

అంతరకృషి: మొక్కలు పడిపోకుండా మట్టిని ఎగదోయాలి.

జిస్‌బడ్డింగ్‌ (చిన్న మొగ్గలను తీసివేయడం): మొక్కలను నాటిన 45 రోజుల తర్వాత క్వాలిటి సరిగా లేనటువంటి చిన్న మొదటి థ మొగ్గలను తీసివేయాలి.

పాత ఆకులను తీసివేయడం: రాలి పడిన ఆకులను, ఎండిన కొమ్మలను తీసివేయడం వల్ల రోగాలు రాకుండా నిరోధించవచ్చు.

కోతకోయడం: జెర్బెరా పంట కాలం 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు పూలు పూస్తూ ఉంటాయి. 2-3 వరుసల పుప్పొడి రేణువులు విచ్చుకోగానే పూలను కోయవచ్చు. 14-16 ఆకుల థలో మొక్కలు ఒక చ.మీ.కు 200 పుష్పాల వరకు పొందవచ్చు. పూలను ఉదయం లేదా సాయంత్రం కోయవచ్చు. జెర్బెరా పూల కాడలను వాలుగా కట్‌ చేసి 4 గంటల పాటు చల్లని నీటిలో ఉంచాలి. నీటి ఉష్ణోగ్రత 14-15 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉండి లీటర్‌ నీటికి 7-10 మి.లీ. క్లోరైడ్‌/సిట్రిక్‌ యాసిడ్‌+ఆస్కార్బిక్‌ ఆసిడ్‌ 5 మి.లీ. గాని కలిపి నీటిలో 4 గంటల పాటు ఉంచవచ్చు. బాగా పండిన పువ్వు యొక్క కాడ 45-55 సెం.మీ. పొడవు, 10-12సెం.మీ. వ్యాసం ఉంటే మార్కెట్‌ విలువ బాగా ఉంటుంది. ఒక రోజుకి 700-1000 వరకు పూలను కోయవచ్చు.

సస్యరక్షణ పద్ధతులు:

పునుబంక, తెల్లదోమ, పాము పొడ, ఎర్రనల్లి, థ్రిప్స్‌, ఆకు తినే పురుగులు వంటి చీడపీడలు జెర్బెరా మొక్కలను ఆశిస్తాయి. 

నివారణ: తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి చీడపీడలను నివారించుకోవాలి.

ఇంకా వేరుకుళ్ళు, క్రౌన్‌ రాట్‌, ఫ్యూజేరియం కుళ్ళు వంటి తెగుళ్ళు కనిపిస్తాయి.

నివారణ: తగిన చర్యలు చేపట్టే తెగుళ్ళను నివారించుకోవాలి. 

పూవులు కాల్షియం లోపం వల్ల వంగిపోవడం, కోత ముందు విరిగిపోవడం, లేత పూవులు వాడిపోవడం, ద్విముఖ పుష్పాలు మరియు పూలన్ని ఒకేసారి విచ్చుకోవడం, పొట్టి కాడలు ఉన్న మొక్కలు ఏర్పడటం జరుగుతుంది.      

ఎన్‌. కౌసల్య, పి.హెచ్‌డి. స్కాలర్‌, ఉద్యాన కళాశాల, అనంతరాజుపేట,

డా. టి. రవికుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జే.సి.డి.ఆర్‌. హార్టీకల్చర్‌ కాలేజ్‌, తాడిపత్రి – 515411, ఫోన్‌: 8919593384

Read More

ప్రణాళికతోనే పాడి పదిలం

యాంత్రిక జీవనంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, సామాజికంగా గ్రామాలలో వ్యవసాయ కుటుంబాల్లో వస్తున్న మార్పులు, వ్యవసాయం, పాడి పరిశ్రమల్లో కూలీల కొరత, ప్రకృతి వైపరీత్యాలు, సకాలంలో సేవలందడంలో జాప్యం – వెరసి, పాడి కొంతమేరకు నిరాదరణకు గురవుతోంది అనేది నిజం!

అరకొర వసతులు, పెట్టుబడి లేమి, గిట్టుబాటు ధర లభించక పోవడం లాంటి అంశాలు పాడి ప్రాభవాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి.

నేడు క్షేత్రస్థాయిలో పశువుల నాణ్యత, పాలకు గిట్టుబాటు ధర, పశుఆరోగ్యం, పశుగ్రాస కొరత, దూడల మరణాలు, మేపుకు తగిన ఫలితాలు చాలా వరకు ప్రభావితం చేస్తున్నాయి.

ఈ అంశాలను కొంతమేరకు అధిగమించేలా విజయడెయిరీ అడుగులు వేస్తోంది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా కనిష్టంగా రూ. 50 వేలు, గరిష్టంగా రూ. 10 లక్షల వరకు ముద్ర పథకం ద్వారా ఋణ సదుపాయం కల్పించేలా ఒప్పందం చేసుకుంది. వాసిగల పశువులను రైతులు కొనుగోలు చేసేలా కొన్నిచోట్ల ఎన్‌డిడిబి వారి డెయిరీ సేవల విభాగం సహకారంతో మేలు జాతి పాడిపశువులను రైతులకు అందిస్తోంది. ఈతల మధ్య కాలాన్ని తగ్గించి, మేలు జాతి పెంపొందేలా 1962 సేవలు, గోపాల మిత్రల సేవలు అందేలా ఆదేశాలు జారీ అయినాయి.

పునరుత్పత్తి సమస్యల నివారణకు గ్రామాల్లో పశువైద్య శిబిరాల ఏర్పాటు జరుగుతోంది. అందుబాటులో ఉన్న బీమా సంస్థలచే ‘పశుబీమా’ కు సహకరిస్తుంది. పాల ఉత్పాదకత పెరిగేలా సబ్సిడిపై విజయ పశుదాణా, ప్రాంతీయ ఖనిజలవణ మిశ్రమాలను అందిస్తోంది.

ఈలాంటి ఒకే గొడుగు కింద సేవలు అందేసరికి, పాడిరైతుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిస్తోంది. ఇప్పటికే విజయ తెలంగాణ డెయిరీలున్న జిల్లాలో ఎస్‌బిఐ అధికారుల నిరంతర సమీక్షలతో రుణ జారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. అంతేకాక, స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు పాడి పశువులకై రుణాలు అందిస్తున్నారు. ఆఖజూస్త్రఆ ద్వారా మినిడెయిరీ ఫారాలు, ఐశిబిదీఖితిచీ |దీఖిరిబి ద్వారా ఎస్‌బిఐ ద్వారా రూ. కోటి వరకు రుణాలు అందచేస్తున్నారు. 

గిట్టుబాటు ధరలు

విజయ తెలంగాణ డెయిరీ కేజి వెన్నకు రూ. 810/-, ఆవుపాలు కేజీ ఘన పదార్థాలకు రూ. 350/- చెల్లిస్తుంది. బ్యాంక్‌ ఖాతా ద్వారా పాడిరైతులకు ప్రతి 15 రోజులకోసారి ఖచ్చితంగా పాల డబ్బులు చేరుతున్నాయి. ఇటీవల తీసుకొచ్చిన ‘పాలమిత్ర యాప్‌’ ద్వారా గ్రామ స్థాయిలో పాలనాణ్యత ధర సంక్షిప్త సందేశం ద్వారా రైతుకు చేరేలా చర్యలు తీసుకుంది. వెన్నశాతం మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలు, నాణ్యతా ప్రమాణాలు, సహకార సంఘాల ఏర్పాటు ఆవశ్యకత లాంటి అంశాలపై విజయ శిక్షణా కేంద్రం ద్వారా నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.

సకాలంలో పాడి పశువులు ఎదకు రావడానికి గ్రామాల్లో గోపాలమిత్రల సేవలు వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈతల మధ్య కాలాన్ని తగ్గించి, ఏడాదికో దూడ పొందేలా విజయ డెయిరీ క్షేత్ర పర్యవేక్షకులు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల విజయ శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా వీరోజిరావు చేరాక, పశుసంవర్ధక సేవలతో అనుసంధానం ఇంకా మెరుగైంది.

దాణా ఖర్చు తగ్గిస్తూ, పాల దిగుబడి పెంచడానికి అనువైన మార్గాలను రైతులకు తెలుపుతూ, 1962 అంబులెన్స్‌ సేవలు విజయ పాడి రైతుల దరి చేరేలా చర్యలు తీసుకున్నారు.

పాల ఉత్పత్తి వ్యయంలో ప్రధాన పాత్ర పోషించే జాతి, మేత, పునరుత్పత్తి అంశాలను పాడి రైతుకు వివరిస్తూ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సేవలు విస్తృతమవుతున్నాయి.

పాల సేకరణ పరంగా సుదూర ప్రాంతాల్లో సైతం మినీ పాలశీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ, పాడి రైతుల పాలకు గిరాకీ కల్పిస్తోంది. నిర్వహణ భారం అధికమైనా, వినియోగదారులపై అదనపు భారం పడకుండా, పాడి రైతులకు పక్షానికోసారి పాలడబ్బులు చెల్లిస్తూ, పాడి రైతు శ్రేయస్సుకోరే సహకార డెయిరీ వ్యవస్థను కాపాడుకోవాలి. పాలసేకరణ మరింత పెంచి విజయ తెలంగాణ జెండా ఎగిరేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పాడి రైతుపైనుంది.

మధుసూదనరావు, ఉపసంచాలకులు, విజయ డెయిరీ, ఆదిలాబాద్‌, ఫోన్‌: 91211 60553

Read More

చిన్న సన్న కారు రైతుల కోసం సంవత్సరం పొడగునా కూరగాయల సాగు ప్రణాళిక

కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఆ పంట నుండి తగిన ఆదాయం పొందాలంటే ఆయా పంటలను బట్టి ఒక నెల నుండి 4  లేదా 5 నెలలు పడుతుంది. ఈ లోగా దానికి కావలసిన పెట్టుబడి కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మేవారి దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు చేయాల్సి వస్తుంది. ఒక వేళ ఆ పంటకు ఏదైనా నష్టం జరిగి పంట పోతే వడ్డీ పెరిగిపోయి చేసిన అప్పు తీర్చలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మనం రోజూ చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి రైతులు సంవత్సరం పొడగునా ఒక ప్రణాళిక ప్రకారం అన్ని కూరగాయలను సాగు చేసుకొంటే రోజువారీ ఆదాయంతో అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోయినా, ఇంకేవిధమైన నష్టం జరిగినా ఒకటి రెండు పంట రకాలను  నష్టపోయినా మిగతా వాటి నుండి ఎంతోకొంత ఆదాయాన్ని పొందవచ్చు.

ప్రస్తుతం కూరగాయ పంటల సాగులో ఉండే సమస్యలు 

  • ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం వలన ఒక్కోసారి అధిక వర్షాల వలన పంట మొత్తం నష్ట పోవటం 
  • ఆ ప్రాంతంలో ఉండే రైతులందరూ ఒకే పంటను వేయటం వలన మార్కెట్లో ధర పడిపోవటం
  • పంట కోతకు వచ్చేవరకు ఆదాయం ఉండదు.
  • ఒకే  పంటను వేయటం వలన పురుగులు తెగుళ్ళ సమస్య అధికమవటం.
  • అధిక నష్టభయం.

సంవత్సరం పొడగునా అన్ని కూరగాయలను సాగు చేయటం ముఖ్య ఉద్దేశ్యం 

  • ఉన్న కొద్దిపాటి పొలాన్ని సమర్ధవంతంగా వినియోగించడం.
  • అన్ని రకాల కూరగాయలను ప్రతిరోజూ అమ్మకానికి అందుబాటులో ఉంచడం.
  • రోజువారీ ఆదాయం పొందడం.
  • అధిక ఉత్పత్తితో పాటు మంచి నాణ్యమైన కూరగాయలను పొందడం.
  • భూసార, నీటి యాజమాన్యంను పంట సాగు భాగంగా చేయటం.
  • పంట ఉత్పత్తి మరియు మార్కెట్‌ నష్టాన్ని తగ్గించడం.
  • పురుగులు, తెగుళ్ళ ఉధృతిని అదుపులో ఉంచడం.

సంవత్సరం పొడగునా కూరగాయల సాగు ప్రణాళిక 

పొలాన్ని తయారుచేసుకోవడం: ఉదాహరణకు ఒక రైతుకు ఒక అర ఎకరం పొలం వుంటే ఆ పొలాన్ని 4 అడుగుల వెడల్పు, ఒక అడుగు ఎత్తు మరియు 30 అడుగుల పొడవుతో మడులను ఏర్పాటు చేసుకోవాలి. ఒక మడికి ఇంకో మడికి మధ్య నడవటానికి, కలుపు తీయటానికి, సస్య రక్షణ, కోత వంటి పనులకు వీలుగా ఒక  అడుగు దూరం ఉంచాలి. ఉన్న మడుల్లో 25% పందిరి లేదా తీగ జాతి కూరగాయలు పెంచుకోవటానికి వీలుగా పందిరి ఏర్పాటు చేసుకోవాలి. మిగతా 75% మడుల్లో మిగతా కూరగాయలను సాగుచేసుకోవాలి. మడుల్లో 50% ఎర్రమట్టి, 20% పశువుల ఎరువు, 10% కుళ్ళిన పచ్చిరొట్ట ఎరువు, 10% వర్మీ కంపోస్టు, 10% జీవన ఎరువులు వేసుకోవాలి.  పొలం చుట్టూ అడుగు దూరంతో 3 వరుసలలో జొన్న, మొక్కజొన్న, కంది, ఆముదం వంటి పంటలను రక్షక పంటలుగా వేసుకొంటే పక్క పొలాల నుండి రసం పీల్చే పురుగుల వలస తగ్గుతుంది. ఈ పంటలకు ముందు ఒక వరుసలో మునగ, కూర అరటి, కర్వేపాకు పంటలను 9 అడుగుల దూరంతో వేసుకొంటే బహువార్షిక కూరగాయ పంటలను కూడా అమ్ముకోవచ్చు. అదే పొలంలో సొంతంగా సేంద్రియ ఎరువు తయారు చేసుకోవటానికి వీలుగా ఒక మూల గుంతను ఏర్పాటు చేసుకొని పంటకాలం పూర్తైన మొక్కలను మడుల్లో నుండి పీకి అవి ఎండిన తర్వాత ఆ గుంతలో వేసుకోవాలి. డ్రిప్‌ పద్ధతిలో నీటియజమాన్యం చేయటానికి వీలుగా ఒక నీటి టాంకును కూడా ఏర్పాటుచేసుకోవాలి.

ఒకే కూరగాయ పంటను ఒకే సారి ఒక్క చోటే వేసుకోకుండా తయారు చేసుకొన్న మడుల్లో 3 లేదా 4 చోట్ల కొన్ని రోజుల వ్యవధితో వేయాలి. ఇలా వేయటం వలన మొదట వేసిన పంట కోత కాలం పూర్తైన వెంటనే రెండోది కోతకి సిద్ధంగా ఉంటుంది. అలాగే రెండోది పూర్తైన సమయానికి మూడోది, ఆతర్వాత నాలుగోది కోతకు సిద్ధంగా ఉండి ఆ పంట సంవత్సరం పొడవునా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

మడుల్లో కూరగాయపంటలను వేసుకున్నపుడు ఒకే పంటగా కాకుండా అంతర పంటలు లేదా మిశ్రమ పంటలు (ఒకే స్థలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు) వేసుకుంటే పురుగులు తెగుళ్ళ బెడదను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు.

ఒకే స్థలంలో ప్రతీ సారీ అదే పంటను సాగు చేయకుండా పంట మార్పిడి చేస్తూ ఉండాలి. పంట మార్పిడి చేసినపుడు ఒకే కుటుంబానికి చెందిన పంటలను అలాగే ఒకే రకమైన పోషకాలు అవసరమున్న పంటలను ప్రతీ సారీ ఒకే స్థలంలో వేయకూడదు.నేలనుండి పోషకాలు తీసుకొన్న పంటలను నేలకు పోషకాలు అందించే పంటలైన లేగ్యూం కుటుంబానికి చెందిన చిక్కుడు జాతి పంటలతో పంటమార్పిడి చేసుకోవాలి.

అంతర పంటలు వేసుకున్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు 

  • త్వరగా పెరిగే పంటలను నెమ్మదిగా పెరిగే పంటల మధ్యలో వేయాలి. (ఉదా: కారెట్‌, ముల్లంగి వంటి పంటలను  టమాట, వంగ వంటి పంటల మధ్యలో వేయాలి.)
  • పొడుగ్గా పెరిగే పంటల మధ్యలో పొట్టిగా పెరిగే పంటలను వేయాలి. (ఉదా: టమాట, వంగ, మిరప వంటి పంటల మధ్య ఆకుకూరలు)
  • లోతైన వేరువ్యవస్థ కలిగిన పంటల మధ్య పైపైన వేర్లు ఉండే పంటలను వేయాలి. (ఉదా: బెండ మధ్యలో ఉల్లి, వెల్లుల్లి పంటలు) 

పురుగులు తెగుళ్ళు ఆశించకుండా పంటను కాపాడుట

  • చీడ పీడలను తట్టుకొనే రకాలను ఎంపిక చేసుకోవాలి.
  • విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి.
  • శనగపచ్చ పురుగు నుండి రక్షణకు బంతిని ఎర పంటగా వేయాలి.
  • ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి.
  • పసుపు, నీలం  రంగుపూసిన అట్టలను  ఎకరాకు 4-5 పెడితే వైరస్‌ తెగుళ్ళకు వాహకాలుగా పనిచేసే రసం పీల్చే పురుగులు  దీనికి ఆకర్షింపబడి  వాటి ఉధృతి తెలుస్తుంది. 
  • చీడపీడలు ఆశించే మొక్కల భాగాలను ఎప్పటికప్పుడు తొలగించటం వలన మిగతా మొక్కలకు సోకకుండా తీవ్రతను తగ్గించవచ్చు.
  • కీటకాల లార్వాలను తినటానికి వీలుగా పొలంలో అక్కడక్కడ పక్షి స్థావరాలను (పంగల కర్రలు) ఏర్పాటు చేయాలి.
  • దీపపు ఎరలను పొలంలో అక్కడక్కడా పెట్టుకోవాలి.

ఈ ప్రణాళికను అనుసరించటం మొదట్లో కష్టం అనిపించినా సాధన చేస్తూ ఉంటె ఎలాంటి ప్రణాళిక వేసుకుంటే మార్కెట్‌ గిరాకీకి అనుగుణంగా ఏఏ కూరగాయ పంటలను సంవత్సరం పొడవునా పండించుకోవచ్చో సులభంగా అర్ధమవుతుంది. మొదట్లో కొన్ని ముఖ్యమైన పంటలతో మొదలు పెట్టి క్రమేపి పెంచుకొంటూ పోతూ ఉంటే ఈ ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయవచ్చు. ఈ విధంగా వేసుకోవటం వలన రైతు ప్రతి రోజూ ఆదాయాన్ని పొంది అప్పుల బాధను అధిగమించవచ్చు.

డా. కె. రాధారాణి, ప్రధాన శాస్త్రవేత్త, డా.వై.యస్‌.ఆర్‌. హార్టీకల్చరల్‌ యూనివర్సిటీ

Read More

అరటి పండ్ల నాణ్యత పెంచే మార్గాలు

ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం అరటి సాగులో మొదటి స్థానంలో ఉంది. ఈ పంట ఎక్కువ దిగుబడి ఇవ్వడం ద్వారా రైతులకు, అలాగే అధిక పోషకాలతో కూడిన ఈ పండ్లను తినడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. కానీ భూసారం తగ్గడం, సరైన సమయాల్లో ఎరువులు వేయకపోవడం మరియు సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వలన పండు పరిమాణం, బరువు మరియు నాణ్యత తగ్గి రైతులకు మార్కెట్‌లో సరైన ధర లభించక నష్టం కలుగుతుంది. అందుకొరకు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ, బెంగళూరు వారు ఒక కొత్త పద్ధతిని రూపొందించారు. అదే బంచ్‌ ఫీడింగ్‌ పద్ధతి. దీని ద్వారా కాయ బరువు మరియు పరిమాణం, ఇంకా నాణ్యతను పెంచవచ్చును. దీని వలన రైతులు అధిక దిగుబడి పొందచ్చును మరియు ఎగుమతులు కూడా పెరుగును.

బంచ్‌ ఫీడింగ్‌ మిశ్రమం తయారు చేయడం

ముందుగా 100 మి.లీ. నీటిలో 7.5 గ్రాముల నత్రజని ఎరులు, 7.5 గ్రాముల పొటాష్‌ ఎరులు కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 500 గ్రాముల పేడలో బాగా కలపాలి. ఆ తర్వాత బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని పైన చూపిన విధంగా పాలిథిన్‌ సంచిలో పెట్టాలి. కాయలు కాసిన తర్వాత క్రింది పువ్వును కత్తిరించి, ఆ మిశ్రమం ఉన్న పాలిథిన్‌ సంచిలో కాయలు కాసిన కాడకు ఒక అడుగు దూరం వదిలి గట్టిగా కట్టాలి. దీని వలన కాయ బరువు మరియు పరిమాణం పెరగడం వలన అధిక దిగుబడులు పొందవచ్చును. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ, బెంగళూరు వారు తెలిపిన ప్రకారం ఈ బంచ్‌ ఫీడింగ్‌ పద్ధతిని ఉపయోగించడం ద్వారా అధిక బరువు గెలలను పొందవచ్చు.

బంచ్‌ ఫీడింగ్‌ ఉపయోగాలు

ఇది కాయ పరిమాణం, నాణ్యతను పెంచడానికి (ప్రతి ఒక్క పండు) మరియు పోషకాలు మొక్కల యొక్క అనవసర భాగాలకు వృథా సరఫరా కాకుండా సహాయపడుతుంది. పండ్ల ఏకరీతి ఎదుగుదలకు తోడ్పడుతుంది. పోషక లోపాలను అధిగమిస్తుంది.

యల్లపు రామ్మోహన్‌డా. ఎమ్‌. శివ ప్రసాద్‌, డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం. 

Read More

సెప్టెంబరు నెలలో సేద్యపు పనులు

పడితే కుప్పలు తెప్పలు పడకపోతే ఉరువెలే. ఇలా వుంది ఈసారి వానల పరిస్థితి. అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వానల్లేనట్లే. చాలా వరకు విత్తనాలు విత్తలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరానికి పోయ్యే కొద్దీ వర్షాలు ఎక్కువవుతూ వచ్చినాయి. అదీ గ్యాపులు గ్యాపులుగా, గోదావరి పరీవాహక ప్రాంతంలో వరదలు, వర్షాలు-వర్షాభావ పరిస్థితులు కూడా విపరీతంగా ఉన్నాయి. వర్షాలెక్కువయిన చోట కూడా బెట్టపరిస్థితులు ఎక్కువ కాలముంటున్నాయి. ఇలాంటి పరిస్థితులలో సెప్టెంబరు (పుబ్బ, ఉత్తర, హస్త తొలిరోజులు)లో చేయవలసిన వివిధ వ్యవసాయ కార్యక్రమాలను గురించి…

1. వరి : వర్షాకాలపు వరి పంట తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు థల్లో ఉంది. రోహిణి కార్తెలో, మే జూన్‌ నెలల్లో నారుపోసి నాటి, పైరు పెరుగుదల థనుండి, ఇంకా నారు పోయకుండా, పొలంలో విత్తకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. నారు పోయని వారు, నేరుగా ప్రధాన పొలంలో వెదజల్లే పద్ధతిలో విత్తండి, లేక డ్రమ్‌ సీడర్‌ ద్వారా విత్తండి. ఎదిగిన నారు సిద్ధంగా ఉన్న వారు వెంటనే ప్రధాన పొలంలో నాటే ప్రయత్నం చేయండి. ముందు నాటిన వరిలో పైపాటి ఎరువులు వేయుట, సస్యరక్షణ, కలుపు నివారణ, ఈ నెలలో చేయాల్సుంటుంది. సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా కాండము తొలుచు పురుగు, దోమ, బాక్టీరియా ఎండాకు తెగులు, మానిపండు తెగులు వంటి వాటిని గమనించి, ఎప్పటికప్పుడు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సెప్టెంబరు నెల వర్షాకాలానికి, చలి కాలానికి మధ్యలో ఉన్నందున, ఈ నెలలో విత్తే రకాలు, రెండు కాలాలలో పండేవైతేనే అధిక దిగుబడినిస్తాయి. ఒక కాలంలో మాత్రమే పండే రకాలు తక్కువ దిగుబడినిస్తాయి.

ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న సాంబమషూరి (బి.పి.టి.-5204)ని అత్యల్ప వర్షపాత మండలం (ఉమ్మడి కర్నూలు – అంనంతపురం జిల్లాల్లో) ఈ నెలలో విత్తడానికి సిఫారసు చేయబడినది. ఇప్పుడు విత్తితే 140-145 రోజుల్లో పంటే చేతికొస్తుంది. దిగుబడి 2.5 ట/ఎ. అదే విధంగా ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సోన కూడ ఈ నెలలో విత్తితే దిగుబడి 2.6-2.8 ట/ఎ ఇస్తుంది. దీనిమీద కాండం తొలుచుపురుగు ఎక్కువగా ఆసిస్తుంది. కాబట్టి, తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.       లేకపోతే దిగుబడి బాగా తగ్గుతుంది. ఇవిగాక ఈ నెలలో విత్తడానికి ఆంధ్రప్రదేశ్‌కు, నెల్లూరు సోన (ఎన్‌.ఎల్‌.ఆర్‌-3041), నంద్యాల సోనా (ఎన్‌.డి.ఎల్‌.ఆర్‌-7), సస్య (బి.పి.టి-2411).

తెలంగాణాకు : కూనారంరైస్‌-1 (కె.ఎన్‌.ఎమ్‌-733), తెలంగాణ వరి-2 (డబ్ల్యు.జి.ఎల్‌.-677), తెలంగాణ వరి-3 (జె.జి.ఎల్‌- 21078), సన్న బియ్యానికి ప్రపంచమంతా షార్టేజి ఉంది. సన్న బియ్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. వీటి ఎగుమతిని ఫ్రీగా అనుమతించాలి. రైతు సంఘాల ద్వారా ఎగుమతులు జరిపితే రైతులకు ఎక్కువ మేలు జరుగుతుంది.

2. ప్రత్తి : క్రితం పంట ధరలు అంత ఆశాజనకంగా లేనందున ప్రత్తిపై రైతులకు మోజు తగ్గింది. విస్తీర్ణం తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పశ్చిమ (హింగారి) ప్రాంతంలో తప్ప మిగతా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్తి విత్తడం పూర్తి అయింది. దేశవాళీ రకాలను సెప్టెంబరు 15 వరకు విత్తవచ్చు. 

మంచి దేశవాళి రకం : శ్రీనంది : ఇది 160 రోజులపంట. 8-9 క్వి/ఎ ప్రత్తి దిగుబడి. పింజ పొడవు 22 మి.మీ. 20 నెంబరు నూలు వడకవచ్చు. అనువైన అమెరికన్‌ రకాలు : నరసింహ : 10-11క్విఎ. లాం-603:10-12 క్విఎ, లాం-604: 10-12 క్వి/ఎ. 

వర్షాకాలంలో మే చివరి నుండి, ఆగస్టు వరకు విత్తిన ప్రత్తి పంటలో అంతరకృషి, కలుపు నివారణ విత్తిన 60-70 రోజుల్లో పై పాటి ఎరువులు వేయుట విత్తిన 100 రోజుల్లో పూర్తి చేయాలి. సస్యరక్షణ చర్యలు కూడా అవసరాన్ని బట్టి చేయాలి. వర్షాలు లేక బెట్ట పరిస్థితులేర్పడితే నీటి లభ్యతను బట్టి తడులు ఇస్తే దిగుబడి పెరుగుతుంది. అధిక వర్షాలొచ్చిన చోట అధిక నీటిని వెంట వెంటనే వెళ్ళిపోయ్యేటట్లు గట్లు తెగ్గొట్టాలి. పంట త్వరగా కోలుకొనేందుకు పైపాటి ఎరువులు, సస్యరక్షణ మందులు మామూలుగా వాడే దానికంటే ఎక్కువగా వాడాలి.

3. మిరప : మిరప ధరలు గరిష్ఠ స్థాయిలో ఇప్పటి వరకు ఉన్నాయి. వర్షాకాలపు పంట చేతికొచ్చేదాకా ధరలధికంగా ఉంటాయి.  వర్షాకాలం మొదట్లో నాటిన పంట పచ్చికాయ దిగుబడి సెప్టెంబరులో చేతికొస్తుంది. ధరలు తగ్గుముఖం పట్టవచ్చు. కారం ఎక్కువగా ఉండే కాయల ధరలు అధికంగా ఉంటున్నాయి. అనుకూలమైన రకాలు.

కాశీ అభ : ఘాటు ఎక్కువ. ఆకుమచ్చ, ఆకు ముడత, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఎగుమతికి అనుకూలం. పచ్చిమిర్చికి అనుకూలం. ఈ రకం ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నది. 

ఇతర రకాలు : ఎల్‌.సి.ఏ-625, ఎల్‌.సి.ఏ-620, ఎల్‌.సి.ఏ-436, ఎల్‌.సి.ఏ-424 అనే పబ్లిక్‌ రకాలు. 

పలు ప్రైవేట్‌ రకాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా ప్రాంతానికి అనువైన రకాలనెంచుకోవాలి. 6 వారాల వయసుగలనారును ప్రధాన పొలంలో ఈ నెలలో నాటవచ్చు. 

4. బెంగుళూరు మిర్చి / కూర మిరప : ఈ మిర్చి కూడా సెప్టెంబరులో నాటి అధిక దిగుబడి పొందవచ్చు. ఈ పంటను ముఖ్యంగా పాలీ హౌస్‌లలో, నెట్‌హౌస్‌లలో, ఎక్కువ దిగుబడి పొందే వీలున్నందున పండిస్తున్నారు. హైబ్రిడ్‌తో ఎకరాకు 40 టన్నుల దాకా బెంగుళూరు మిర్చి దిగుబడి సాధిస్తున్నారు. ఎరుపు, పసుపు రకాలు ఆకుపచ్చ రకాలకంటే అధిక ధర పలుకుతాయి. 

5. టమాట : ఆగస్టు కడవారంలో టమాట ధరలు కిలో పదిరూపాయలకు పడిపోయినాయి. విస్తీర్ణం పెరగడం, పొడి వాతావరణం అధిక దిగుబడికి దారి తీసినాయి. అధిక దిగుబడితో ధరలు ఢమాల్‌మంటున్నాయి. వర్షాకాలంలో సెప్టెంబరు కడదాకా వానలు వచ్చే అవకాశముంది. విపరీత వర్షాలు, మేఘావృత వాతావరణం, వరదలు వంటి పరిణామాలొస్తే దిగుబడి తగ్గి ధరలు పెరిగే అవకాశముంది. ఇప్పటి నుండి డిశంబరు వరకు టమాట ధరలు ఒడిదుడుకులుగాను తర్వాత తక్కువగాను ఉండే అవకాశముంది.

6. క్యాబేజి : ఈ పంటలో స్వల్పకాలిక రకాలను ఆగస్టు రెండవ పక్షం నుండి సెప్టెంబరు కడవరకు నాటవచ్చు. మంచిరకం : ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా. గడ్డ 1.5-2.0 కిలోలుంటుంది. 60-80 రోజుల్లో గడ్డ కోత కొస్తుంది. 

మధ్యకాలిక రకాలను సెప్టెంబరులో నారుపోసి 5 వారాల నారును నాటుకోవాలి. ప్రాచుర్యంలోని హైబ్రిడ్‌లు: సోనా, అవంతి, శ్వేత.

మిద్దెతోటలలో ఈ నెలలో పెంచడానికనువైన రకాలు : ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా, గోల్డెన్‌ ఏకర్‌. 

7. కాలిఫ్లవర్‌ : ఈ పంటను సెప్టెంబరు నుండి నవంబరు వరకు నాటవచ్చు. సెప్టెంబరులో నాటడానికనుకూలమైన రకాలు / హైబ్రిడ్‌ : పూసా హైబ్రిడ్‌; ఇందాంఎర్లీ, అరవింద్‌, త్రిష మొ|| మిద్దె తోటల్లో పెంచడానికి అనుకూలమైనవి. పూస సింథటిక్‌, పూసా హిమజ్యోతి, సుహాసిని. 

8. జొన్న : కిలో జొన్న పిండి హైదరాబాదులో రిటైల్‌గా రూ. 90 అమ్ముతున్నారు. క్వాలిటీ జొన్నలకు మంచి ధర వస్తున్నది. సెప్టెంబరులో మాఘీ జొన్నను విత్తే అలవాటు ఉమ్మడి కర్నూలు, కడప, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉన్నది. అత్యధిక దిగుబడినిచ్చే మాఘీజొన్న రకాలు: ఎన్‌.టి.జె-5 : 18-20 క్వి/ఎ గింజ దిగుబడి. 95-100 రోజులు. పొట్టిజొన్న గింజ, చొప్ప నాణ్యంగా ఉంటాయి. అత్యధిక దిగుబడినిస్తున్న రకంగా పేరొందినది. మాఘీ పంటకు మాత్రమే సిఫారసు చేయబడినది. తెల్లగింజ.

ఎన్‌.టి.జె-4 : గింజ దిగుబడి 13-15 క్వి/ఎ. 90-98 రోజులు. మాఘీ, రబీ కాలాల్లో సాగు చేయవచ్చు. తెల్లగింజ. 

కిన్నెర (ఎం.జె-278) : మాఘీకి అనుకూలం. గింజ దిగుబడి 13-15 క్వి/ఎ. 100-115 రోజులు. తెల్లగింజ.

ఎన్‌.టిజె.-3 : 12-14 క్వి/ఎ గింజ దిగుబడి. మాఘీ, రబీ కాలాలకు అనుకూలం.

ఎమ్‌ 35-1 : మాఘీ, రబీ కాలాలకనుకూలం. ముత్యాల్లాంటి తెల్లగింజ. అత్యంత ధర పలుకుతుంది. దిగుబడి తక్కువ. 10-12 క్వి/ఎ. 115-120 రోజుల పంట.

ఎన్‌-15 : పచ్చజొన్న; గింజ దిగుబడి 10-13 క్వి/ఎ 115-120 రోజులు. మాఘీ, రబీ కాలాలకు అనుకూలం.

9. ఉలవలు : సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో విత్తుటకు అనుకూలం. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు : క్రీడ హర్ష (సి.ఆర్‌.హెచ్‌.జి-19): గింజ దిగుబడి : 6.0-7.7 క్వి/ఎ. గోధుమ రంగు గింజ. ఆంత్రాక్నోస్‌ మరియు బూడిద తెగుళ్ళను తట్టుకుంటుంది. 85-95 రోజుల పంట.

క్రీడ వర్థన్‌ (సి.ఆర్‌.హెచ్‌.జి-22) : నలుపు గింజ, గింజ దిగుబడి : 6.0-7.5 క్వి/ఎ. బూడిద, పల్లాకు, ఆంత్రాక్నోస్‌ తెగుళ్ళను తట్టుకుంటుంది. 

10. కంది : చలికాలపు కందిని సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 15 వరకు విత్తాలి. నిదానించి విత్తితే దిగుబడి బాగా తగ్గిపోతుంది. చలికాలంలో పండించి అనుభవమున్న వాళ్ళతోనే మంచి దిగుబడులొస్తాయి. అనుభవము లేకపోతే, తొలుత తక్కువ విస్తీర్ణంలో పంటబెట్టి, అనుభవమొచ్చాక రాబోయే సంవత్సరాలలో ఎక్కువ విస్తీర్ణంలో పంట చేపట్టవచ్చు.

11. అనుములు / అనపకాయలు : ఆగస్టు నుండి నవంబరు వరకు (సెప్టెంబరులో కూడా) ఈ పంటను విత్తి మంచి దిగుబడులు పొందవచ్చు. పచ్చిగింజలకు మంచి గిరాకీ ఉంటుంది. పొట్టు తీసిన గింజలు పితికి పప్పుగా బాగా ప్రాచుర్యం.

13. క్యారెట్‌ : ఆగస్టు నుండి నవంబరు వరకు ప్రతి 15 రోజులకొకసారి విత్తి ఎక్కువ కాలం మార్కెట్‌కు సప్లయి చెయ్యవచ్చు. అనుకూలమైన రకాలు : పూసాయమదగ్ని, పూసాకేసర్‌, చాన్‌టెనీ.

అనుకూలమైన హైబ్రిడ్లు : ఖరుడ, న్యూఖరుడ. మిద్దె తోటలకు : ఇంపెరటర్‌, ఎర్లీనంటేస్‌ మొ||

14. బీట్‌రూట్‌ : ఇది చౌడు భూముల్లో కూడా పండుతుంది. సెప్టెంబరులో విత్తవచ్చు. ఆగస్టు నుండి నవంబరు వరకు కూడా విత్తవచ్చు. అనుకూలమైన రకాలు : డెట్రాయిట్‌ డార్క్‌రెడ్‌, క్రిమ్సన్‌ గ్లోబ్‌, ఎర్లీ వండర్‌ మొ||

15. వెల్లుల్లి : పాయలను సెప్టెంబరు రెండవ పక్షం నుండి అక్టోబరు నెల పూర్తిగా నాటుకోవచ్చు. మంచి రకాలు : యమునా సఫేడ్‌ అగ్రిపౌండ్‌ వైట్‌

16. సిరిధాన్యాలు : ఆరోగ్య కారణాలరీత్యా వీటికి ప్రాముఖ్యత పెరుగుతున్నది. ధరలు కూడా బజార్లో ఎక్కువగానే ఉన్నాయి. పంట దిగుబడి తక్కువయినందున ఎకరాల లెక్కన చూస్తే రైతుకు ఆదాయం తక్కువగా ఉన్నది. నీటి తడులతో పంట పెట్టి, సేంద్రియ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యకరమైన పంటను, కొద్ది ఎక్కువగా ఉత్పత్తి చేయవచ్చు. పంట మొదలు పెట్టినప్పటి నుండి, వినియోగదారులకు తెలియపరచడం ద్వారా మంచి ధరలకు అమ్ముకునే అవకాశముంది. 

వీటి వినియోగాన్ని త్రివిధ దళాలలో ప్రోత్సహించినట్లయితే ఆరోగ్యవంతమైన వారితో రక్షణ వ్యవస్థను పటిష్ఠ పరచవచ్చు

17. పొద చిక్కుడు : సెప్టెంబరు నెలలో విత్తడానికనుకూలం. అనుకూలమైన రకాలు : కొంకణ్‌ భూషన్‌, అర్క విజయ, అర్కజయ మొ||

18. అలసందలు / బొబ్బెర్లు : పచ్చిరొట్టగా, పచ్చిమేతగా, పచ్చి కాయలను, గింజలను, కాయగూరగా, ఎండిన గింజలను పప్పుధాన్యంగా ఉపయోగించవచ్చు. ఈ నెలలో ఈ పంటను విత్తి మంచి దిగుబడులు సాధించవచ్చు. మంచిరకం : వి-240.

19. గులాబి పూలు : సెప్టెంబరు అక్టోబరు మాసాలు గులాబి అంట్లు నాటడానికి అత్యంత అనుకూలం వీలయిన వాల్లు ఈ నెలలోనే  నాటండి. వీలు లేకపోతే జూన్‌ నుండి జవనరి వరకు ఏ నెలలోనైనా నాటండి.

20. చామంతి : ఆగస్టు-సెప్టెంబరు నెలలు నాటుటకు అనుకూలం. 

21. గ్లాడియోలస్‌ : వీటి దుంపలు నాటడానికి అక్టోబరు అత్యంత అనుకూలం. నాణ్యమైన పూలను పొందవచ్చు. అక్టోబరు అనుకూలం కానివారు జూన్‌ నుండి నవంబరు వరకు సెప్టెంబరులో కూడా నాటవచ్చు. 

ఆటోమాటిక్‌ ఎగుమతి విధానం : వ్యవసాయ పంటలకు ఒక ఎగుమతి విధానం నిర్ణయించాలి. మన రైతులు బాగుపడే విధంగా ఎగుమతి విధానం ఉండాలి. ప్రతి పంట ధర ఎంతకు పడిపోతే ఎగుమతులు ఫ్రీగా జరుపుకునేటట్లు ఓపెన్‌ పర్మిషన్‌ ఇవ్వాలి. అనేది నిర్ణయించాలి. దీనివలన రైతులు, ఉత్పత్తిదారులు కొంత ఊరట పొందడానికి వీలవుతుంది. 

రైతు ప్రజా సంఘాలను వ్యవసాయోత్పత్తుల ఎగుమతి వ్యాపారంలో ప్రోత్సహిస్తే అతిదారుణంగా టమాటా మాదిరి పంటల ధరలు పడిపోకుండా కాపాడే దానికి వీలవుతుంది. అన్ని పంటలకు అత్యధిక, అత్యల్పబేస్‌ రేట్లను నిర్ణయిస్తే, దానిమీద ఎగుమతి, దిగుమతి విధాన నిర్ణయాలు సులభమవుతాయి.

ఈ విధాన నిర్ణయాలలో మన రైతులు బాగుపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభుత్వాలకు మంచి ప్రజాదరణ ఉంటుంది. ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

పంటలపైన, రైతు ప్రజా సంఘాలపైన అధిక వివరాలకు 9494408619కు ఫోను చేసి సంప్రదించవచ్చు.

Read More

ఉల్లి రైతులపై విరుచుకుపడ్డ కేంద్ర ప్రభుత్వం

ఆగస్టు 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించి, తక్షణం అమల్లోకి తెచ్చింది. 2022లో గోధుమ ఎగుమతుల్ని, గోధుమ పిండి ఎగుమతుల్ని నిషేధించి, సాధారణ బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించారు. నూకల ఎగుమతుల్ని పూర్తిగా నిలిపివేశారు. 2023 ఫిబ్రవరి 14వ తేదీన కేంద్రప్రభుత్వం 2022-23 సంవత్సరానికి వ్యవసాయ ఉత్పత్తుల రెండవ ముందస్తు అంచనాలను ప్రకటించింది. రికార్డు స్థాయిలో 130.8 మిలియన్‌ టన్నుల బియ్యం, 112.2 మిలియన్‌ టన్నుల గోధుమలు ఉత్పత్తయినట్లు సగర్వంగా చెప్పారు. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తయినప్పుడు వాటి ఎగుమతులపై ఉక్కు పాదం మోపి, వాటి ధరల్ని తొక్కి పెట్టి, రైతుల్ని సంక్షోభంలోకి పెట్టారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో బియ్యం వినియోగం 112 మిలియన్‌ టన్నులు, గోధుమ వినియోగం 99.8 మిలియన్‌ టన్నులు మాత్రమే. 19 మిలియన్‌ టన్నుల బియ్యం, 13 మిలియన్‌ టన్నుల గోధుమలు మిగులు ఉన్నా వాటి ఎగుమతుల్ని తొక్కి పెట్టి, ధరల్ని దించి, సేకరణ బాధ్యతల నుండి తప్పుకుని, అన్నదాతల ఆదాయాలను దాదాపు లక్ష కోట్ల రూపాయల మేరకు తగ్గించటం ప్రభుత్వ విదానాలను తేటతెల్లం చేసింది. జులై నెలలో బాస్మతీ, ఉప్పుడు బియ్యం మినహా బియ్యం ఎగుమతుల్ని నిషేధించి రైతు వ్యతిరేక వైఖరిని ప్రభుత్వం ప్రదర్శించింది. అనావృష్టి, అతివృష్టి వివిధ రాష్ట్రాల్లో వరి ఉత్పత్తులను ప్రభావితం చేసి, కొరత ఏర్పడ వచ్చనే అనుమానంతో బియ్యం ఎగుమతుల్ని నిషేధించామని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. తాజాగా అమెరికా ప్రభుత్వ వ్యవసాయ శాఖతోపాటు దేశంలో విశ్లేషకుల అంచనా ప్రకారం వరి విస్తీర్ణం 47 మిలియన్‌ హెక్టార్ల నుండి 46.5 మిలియన్‌ హెక్టార్లకు మాత్రమే తగ్గుతుందనీ, బియ్యం ఉత్పత్తి గత సంవత్సరంకన్నా ఒక మిలియన్‌ టన్నులు మాత్రమే తగ్గవచ్చని తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో బియ్యం ఎగుమతుల్ని అనుమతించి, ఎగుమతి సుంకాన్ని 25 శాతానికి పెంచితే ఉభయతారకంగా ఉండేది. వచ్చే ఖరీఫ్‌ పంట మార్కెట్‌కి వచ్చినప్పుడు ధాన్యం ధరలు తగ్గకుండా ఉంటాయి. ఆగస్టు 31వ తేదీన జరిపే సవిూక్షలో నిషేధాన్ని ఎత్తివేస్తారని ఆశిద్దాం.

ఉల్లిపై తొందరపాటు చర్య

బియ్యం విషయంలో తప్పుడు అంచనాలను, భయాల ఆధారంగా ఎగుమతుల్ని నిషేధించినట్లుగానే ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించడం కూడా రైతు వ్యతిరేక చర్యే. ఉల్లిని ఎక్కువగా పండించే మహారాష్ట్రలో రైతు సంఘాలు ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. వాస్తవానికి ఆగస్టు 19వ తేదీన నాసిక్‌ జిల్లాలోని ‘లాసల్‌గావ్‌’ మార్కెట్‌లో ఉల్లి హోల్‌సేల్‌ ధర క్వింటాలుకి రూ. 2300గా ఉంది. రిటైల్‌ ధర సగటున రూ. 30.72లు కిలోకి ఉంది. నాణ్యమైన ఉల్లికి హర్యానాలో కిలోకి రూ. 53/-లుగా ఉండగా, మధ్యప్రదేశ్‌లో నాసి రకం ఉల్లికి కిలో ధర రూ. 10/-లుగా ఉండి ఉల్లిలో నీటి శాతంలో ఉండే వ్యత్యాస్యాన్ని బట్టి ధరల్లో తేడాలుంటాయి. టోకు ధర కిలోకి రూ. 23లుంటే ఎగుమతి ధర కిలోకి రూ. 25గా ఉంది. ఇదేవిూ ఆందోళనకరమైన పరిస్థితి కాదు. 2022 జులై నుండి 2023 జూన్‌ వరకు దేశంలో 31.12 మిలియన్‌ టన్నుల ఉల్లిగడ్డలు ఉత్పత్తయినట్లు అంచనా. 1.91 మిలియన్‌ హెక్టార్లలో ఉల్లి పంట సాగయింది. సగటున హెక్టారుకి 16.3 టన్నుల దిగుబడి వచ్చింది. దేశంలో ఒక్కొక్క కుటుంబానికి సగటున నెలకు 5 కిలోల ఉల్లిగడ్డల్ని వినియోగిస్తున్నారు. దేశంలో షుమారుగా 33 కోట్ల కుటుంబాలున్నాయి. సంవత్సరానికి దేశీయ ఉల్లి వినియోం 21 మిలియన్‌ టన్నులుగా లెక్క కట్టవచ్చు. అయినా మిగులు 10 మిలియన్‌ టన్నులకు పైగానే ఉంటుంది. ఏప్రిల్‌, మే మాసాల్లో వచ్చిన అకాల వర్షాల వల్ల ఉల్లిగడ్డల్ని కొంత తేమతోనే నిలవపెట్టారు. నిల్వలో కొంత మేరకు ఉల్లి గడ్డలు కుళ్ళిపోవటంవల్ల రైతులు నష్టపోయారు. సెప్టెంబరు మాసంలో కొంత మేరకు ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. కాని ప్రభుత్వ నిర్ణయంవల్ల ఎగుమతులు తగ్గుతాయని భావిస్తున్నారు. ఫలితంగా ధరలు కూడా తగ్గవచ్చు. ప్రభుత్వ సంస్థ ‘నేఫెడ్‌’ షుమారుగా 3 మిలియన్‌ టన్నుల ఉల్లిగడ్డల్ని నిల్వ ఉంచింది. రోజుకి ఐదు వేల టన్నుల చొప్పున ఈ సంస్థ ఢిల్లీ మార్కెట్‌లో కిలో 25 రూపాయల రేటుకి అమ్మటం ద్వారా ఉల్లిగడ్డల ధరల్ని అదుపులో ఉంచాలని నిర్ణయించింది.

ఉత్పత్తిలో పెరుగుదల

ఉల్లి, వెల్లుల్లి వాడకంవల్ల తామస గుణం పెరుగుతుందని కొందరి నమ్మకం. 1961లో దేశంలో ఉల్లి వాడకం తక్కువగా ఉండేది. తలసరి ఉల్లి వినియోగం కేవలం 2.61 కిలోలు మాత్రమే. సంవత్సరానికి 2.61 కిలోలంటే నెలకు 218 గ్రాములే. కాని కాలక్రమేణా ఉల్లి వాడకం పట్ల ఆసక్తి పెరిగింది. ఉల్లిని వాడితే కూరల రుచి బాగుంటుందనీ, ఆరోగ్యం మెరుగవుతందనీ నమ్మకం పెరిగింది. 2020 నాటికి ఉల్లి తలసరి వాడకం 15 కిలోలు దాటింది. 60 సంవత్సరాల్లో తలసరి వాడకం ఆరు రెట్లుకన్నా ఎక్కువ పెరగటంవల్ల గిరాకీ పెరిగింది. 2020లో దేశంలో ఉల్లి ఉత్పత్తి 26.09 మిలియన్‌ టన్నులుగా అంచనా వేయబడ్డది. 2021లో 26.64 మిలియన్‌ టన్నులు,  2022లో 31.69 మిలియన్‌ టన్నులు, 2023లో 31.01 మిలియన్‌ టన్నులుగా అంచనా వేయబడ్డాయి. కాని ఈ ఉత్పత్తి పెరుగుదలకు విస్తీర్ణం పెరగటం ముఖ్యకారణమైంది. 2018-19లో సగటు దిగుబడి హెక్టారుకి 19.7 టన్నులుగా ఉంది. 2019-20లో దిగుబడి హెక్టారుకి 19.2 టన్నులకు తగ్గింది. 2020-21లో ఇంకా తగ్గి 16.4 టన్నులుగా నమోదైంది. 2021-22, 2022-23లో దిగుబడి 16.2 టన్నులకు తగ్గింది. 2015-16 నుండి 2018-19 వరకు సగటు దిగుబడి 20 టన్నులుగా ఉన్నది క్రమంగా 20 శాతం వరకు తగ్గింది. వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడిన అననుకూలత వల్ల దిగుబడులు తగ్గాయి. ఐతే విస్తీర్ణం పెరుగుతూ ఉండటంవల్ల ఉత్పత్తి పెరిగింది. 2014-15 నుండి 2021-22 మధ్య సగటు విస్తీర్ణం 1.4 మిలియన్‌ హెక్టార్లు కాగా, సగటు ఉత్పత్తి 24 మిలియన్‌ టన్నులుగా ఉంది. 2021-22లో ఉల్లి విస్తీర్ణం 1.62 మిలియన్‌ హెక్టార్లకు పెరిగింది. 2022-23లో మరింత పెరిగి 1.91 మిలియన్‌ హెక్టార్లకు చేరింది. ఉత్పత్తి పెరుగుతుండటంవల్ల సెప్టెంబరు, 2021 నుండి ఉల్లి ధరలు తగ్గుతున్నాయి. ఉల్లి సాగుకి మూడు సీజన్లున్నాయి. ఖరీఫ్‌ పంటను జులై-ఆగస్టులో విత్తి, అక్టోబరు నుండి నవంబరు నెలల్లో ఉల్లిగడ్డలను తీస్తారు. సుమారు 20 శాతం ఉత్పత్తి ఈ మాసాల్లో లభిస్తుంది. ఈ పంట అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో వినిమయదారుల అవసరాలను తీరుస్తుంది. రెండవ పంటను అక్టోబరు-నవంబరు నెలల్లో విత్తి, జనవరి నుండి మార్చి మధ్య తీస్తారు. 15 శాతం పంట ఈ సీజనులో లభిస్తుంది. జనవరి నుండి మార్చి వరకు ఈ పంట వినిమయదారుల అవసరాలను తీరుస్తుంది. డిసెంబరు-జనవరి మాసాల్లో నాటే రబీ పంట ముఖ్యమైనది. మొత్తం ఉత్పత్తిలో 65 శాతం రబీ పంట ద్వారా లభిస్తుంది. ఈ పంటను మార్చి నుండి మే మాసాల మధ్య తీస్తారు. ఎండాకాలంలో వచ్చే ఈ పంట ఏప్రిల్‌ నుండి సెప్టెంబరు వరకు వినిమయదారుల అవసరాలు తీరుస్తుంది. వేసవిలో వచ్చే ఈ పంటలో నీటి శాతం తక్కువగా ఉండి, నిల్వపెట్టడానికి అనువుగా ఉంటుంది. ఈ సంవత్సరం వేసవికాంలో వర్షాలు పడటంవల్ల నీటి శాతం ఎక్కువగా ఉన్న ఉల్లిగడ్డలనే నిల్వ చేయటంవల్ల, నిల్వలో కొంతమేరకు ఉల్లిగడ్డలు పాడయినట్లు వార్తలు వచ్చాయి. జూన్‌ మాసంలో ఉల్లిధరలు, 1.65 శాతం పెరిగాయి. జులై మాసంలో ధరలు 11.72 శాతం పెరిగాయి. జూన్‌ నుండి సెప్టెంబరు వరకు ఉల్లి ధరల్లో కొంత పెరుగుదల ఉండటం ప్రతి సంవత్సరం జరుగుతుంది. కొత్త పంట ఈ సమయంలో రాదు కాబట్టి నిల్వ ఖర్చుల కారణంగా ధరలు పెరుగుతుంటాయి. ఇదేవిూ ఆందోళన చెందాల్సి విషయం కాదు. 

ద్రవ్యోల్బణంపై చింత

ప్రపంచ వ్యాప్తంగా ద్రవోల్బణం 5 శాతానికి పైగా ఉంది. భారతదేశంలో రిటైల్‌ స్థాయిలో ద్రవ్యోల్బణం జూన్‌, 2023లో 4.87 శాతంగా ఉంది. కాని జులై నెలలో 7.44 శాతానికి పెరిగింది. అధిక వర్షాల వల్ల కూరగాయ పంటలు దెబ్బతిని, వాటి ధరలు కిలోకి వంద రూపాయలు దాటాయి. టమోటా ధర కిలోకి రెండు వందలు దాటింది. ఐతే ఇది తాత్కాలికమే. 15 రోజుల తర్వాత టమోటా ధర రూ. 60లకు తగ్గింది. క్రమంగా ఇతర కూరగాయల ధరలు తగ్గవచ్చు. వాటితోపోలిస్తే ఉల్లి ధర తక్కువగా పెరిగింది. ఒక కుటుంబం తమ అవసరాలకు నెలకు ఇరవై వేలు ఖర్చు పెడుతుంటే, అందులో ఆహారానికి ఖర్చు పెట్టేది ఎనిమిది వేల రూపాయలుంటుంది. అందులో కూరగాయలకు వెచ్చించేది ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయలే. కూరగాయాల ఖర్చులో ఉల్లికి ఖర్చు పెట్టేది 13 శాతం మాత్రమే. ఉల్లి ధర పన్నెండు శాతం పెరిగితే దాని ప్రభావం మొత్తం రిటైల్‌ ద్రవ్యోల్బణంలో ఒకటి రెండు పాయింట్లు మించి ఉండదు. సెప్టెంబరులో ఉల్లి ధర రూ. 60లకు చేరుతుందనే భయంతో ప్రభుత్వం హడావుడిగా ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించడం సమంజసం కాదు. దేశంలో ఉత్పత్తయ్యే ఉల్లిలో 10 నుండి 15 శాతం మాత్రమే ఎగుమతి అవుతుంది. 2020-21లో 1.58 మిలియన్‌ టన్నులు, 2021-22లో 1.54 మిలియన్‌ టన్నులు, 2022-23లో 2.53 మిలియన్‌ టన్నులు ఎగుమతయ్యాయి. ఎగుమతులు కొంచెమే అయినా దేశంలో ఉల్లి ధరలు నిలబడటానికి ఊతమిస్తున్నాయి. బంగ్లాదేశ్‌, మల్లేషియా, యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలు మనదేశంనుండి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నాయి. ఎగుమతుల విషయంలో ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. 2019లో ఎగుమతి ధర ఒక కనీస స్థాయిలోనైనా ఉంటేనే ఎగుమతుల్ని అనుమతించే విధానం ఉండేది. 2020 సెప్టెంబరు నుండి డిసెంబరు వరకు ఎగుమతుల్ని పూర్తిగా నిషేధించారు. 2021 జనవరి 1వ తేదీ నుండి ఉల్లి ఎగుమతుల్ని స్వేచ్ఛగా చేసుకోవచ్చని అనుమతించారు. ఉల్లి విత్తనాల ఎగుమతిపై మాత్రం 2023 చివరి వరకు కొన్ని ఆంక్షలను విధించారు. తాజాగా విధించిన 40 శాతం ఎగుమతి సుంకం డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుంది. దీనివల్ల రెండు పరిణామాలు ఏర్పడవచ్చు. భారత్‌ నుండి ఉల్లి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవచ్చు. లేదా చాలా వరకు తగ్గవచ్చు. ఉల్లి దిగుమతులపై ఆధారపడే దేశాలు కొంత మేరకు ఎక్కువ ధర చెల్లించవచ్చు. కాని దీర్ఘకాల ఒప్పందాలు చేసుకున్న కంపెనీలకు అనేక ఇబ్బందులు ఎదురు కావచ్చు. భారత్‌ నుండి దిగుమతి చేసుకునే దేశాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు. కాని ఖరీఫ్‌ పంట మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ధరలు తగ్గవచ్చు. ఐదారు మిలియన్‌ టన్నుల ఉత్పత్తిపై కిలోకి రూ. 15 రూపాయల చొప్పున ఉల్లి రైతుల ఆదాయాలు 9,000 కోట్ల రూపాయల వరకు తగ్గవచ్చు. అంతేకాకుండా క్రిందటి రబీ పంటలో మిగిలిన ఐదారు మిలియన్‌ టన్నుల నిల్వపై లభించే ఆదాయం కూడా అదే విధంగా మరో 9000 కోట్ల రూపాయల మేరకు తగ్గవచ్చు. ఇలా మొత్తం దేశంలోని ఉల్లి రైతులు రూ. 15,000 నుండి 20,000 కోట్ల రూపాయలు నష్టపోవచ్చు. ఆ మేరకు వినిమయదారులు లాభించవచ్చు. ఎగుమతులున్నప్పటికంటే ఎగుమతులు లేనప్పుడు వినిమయదారులకు కిలోకి రూ. 15లు తక్కువ ధరకు నాలుగైదు నెలలపాటు లభించవచ్చు. ఇలా వినిమయదారుల ప్రయోజనాల కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించినప్పుడల్లా రైతులు నష్టపోతున్నారు. ఏదైనా ఉత్పత్తి బాగా తగ్గినప్పుడు ఎగుమతుల్ని నియంత్రివచ్చు. కాని రికార్డు స్థాయిలో, గోధుమ, ఉల్లి ఉత్పత్తులు పండినప్పుడు ఎగుమతి ఆంక్షల్ని విధించడం సమంజసం కాదు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం రైతుల ప్రయోజనాలను బలిపెట్టకూడదు.

పునరాలోచన అవసరం 

ఊహాజనితమైన అంచనాల ఆధారంగా తొందరపాటు చర్యలు చేపట్టటం సమంజసం కాదు. అహ్మద్‌నగర్‌, నాసిక్‌లలో రైతులు ఎగుమతి సుంకాలను ఎత్తివేయాలని ఆందోళన చేస్తున్నారు. కూరగాయల ధరలు పెరిగాయి. కాబట్టి శుద్ధి చేసిన కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. వాటి ఎగుమతిని కూడా నిషేదించే ప్రమాదం ఉంది. ఉల్లి ధరలు తగ్గితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్నాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, బీహార్‌లలో ఉల్లి పండించే రైతులతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి రైతులు కూడా నష్టపోతారు. ఆంధ్రప్రదేశ్‌లో 0.75 మిలియన్‌ టన్నులు, తెలంగాణాలో 0.30 మిలియన్‌ టన్నుల ఉల్లి ప్రతి సంవత్సరం ఉత్పత్తవుతున్నది. ఒక్కోసారి ఉల్లి బాగా పండినప్పుడు రైతులకు రవాణా ఖర్చులు కూడా రావు. కిలోకి ఐదు రూపాయలు కూడా గిట్టని సందర్భాలున్నాయి. రైతుకి కిలోకి రూ. 25 నుండి 30 రూపాయలు లభించడం ఎప్పుడో కాని జరగదు. ఆ సమయంలో ఎగుమతిపై అదిక మొత్తంలో సుంకాలు వేయడం, నిషేధించడం న్యాయం కాదు. కొరతలేని సమయాల్లో కూడా ద్రవ్యోల్బణం నెపంతో రైతుల్ని దెబ్బతీయడం వాంఛనీయంకాదు. ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలతో ప్రభుత్వాలు దుందుడుకు చర్యలకు పాల్పడినప్పుడు రైతులు ఐక్యంగా ఉద్యమించాలి. అహేతుకంగా రైతుల ఆదాయాలను దెబ్బతీసే ప్రయత్నాలను వ్యతిరేకించకుంటే ప్రభుత్వం మరిన్ని రైతు వ్యతిరేక చర్యలను చేపట్టే ప్రమాదం ఉంది.          

డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్‌ & కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌),

ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More

చెకుర్మనీస్‌  మొక్కలో సహజ మల్టీ విటమిన్లు

విదేశీ పంటలు ప్రస్తుతం భారత్‌లో విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఇండోనేషియా, సింగపూర్‌ దేశాలకే పరిమితమైన చెకుర్మనీస్‌, ప్రస్తుతం భారత్‌లో కూడా సాగు చేస్తున్నారు. దీన్ని శాశ్వత ఆకు కూరగా పిలుస్తారు. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని దిగుబడినిస్తుంది. మొక్కలో అధిక ఖనిజ లవణాలు, పోషక విలువలు ఉండటంతో ఔషధాల తయారీకి కూడా వాడుతున్నారు. ఇప్పటికే ఈ మొక్కలను కేరళలలో పెంచటం విశేషం.

కుటుంబం: యుఫోర్బియాసి

మూలం: ఇండో-బర్మా

సాధారణ పేర్లు: మల్టీవిటమిన్‌ గ్రీన్‌ / మల్టీమినరల్‌ / వెజటబుల్‌ ఆఫ్‌ 21వ సెంచరీ, స్టార్‌ గూస్‌బెర్రీ/ స్వీట్‌ లీఫ్‌ / ట్రోఫీకలస్‌

తెలుగు పేరు: చక్రముని 

ఉపయోగాలు: ఈ మొక్క ఆకులలో విటమిన్‌-ఎ అధికంగా ఉండటం  వల్లన కంటి సమస్యలని నివారిస్తుంది. మరియు జ్వరం నయం కావడానికి ఉపయోగిస్తారు. లేత ఆకులను సలాడ్‌, సూప్‌గా వాడటంతో పాటు, పశుమేతగా, పౌల్ట్రీఫీడ్‌గా కూడా వాడతారు. అయితే ప్రత్యేకంగా సాగు చేయలేని రైతులు దీన్నిఇంటి పెరటిలో కూడా పెంచుకునే వీలుంటుంది. ఈ మొక్కలను మీ ఇంట్లో కుండీల్లో కూడా సులభంగా పెంచుకోవచ్చు. కిచెన్‌ గార్డెన్‌లో హెడ్జ్‌గా బోర్డర్‌ లా నాటుకోవచ్చు. ఈ ఆకులను ప్రతి రోజు ఉదయం రెండేసి చొప్పున పిల్లలు, నాలుగు నుంచి ఐదు ఆకుల చొప్పున పెద్దలు తినడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు. మరికొన్ని చోట్ల నేల కోతను నివారించడానికి ఈ మొక్కల మట్టి బైండర్‌గా సాగు చేస్తున్నారు.

నేల మరియు వాతావరణం:  చెకుర్మనీష్‌ మొక్క అన్ని రకాల నేలల్లో బాగా పెరుగుతుంది. మంచి వర్షపాతం ఉన్న వెచ్చని తేమతో కూడిన వాతావరణం ఆకులు మరియు కొమ్మల యొక్క విలాసవంతమైన మరియు రసవంతమైన పెరుగుదలకు బాగా సరిపోతుంది. ఇది కొంతవరకు నీడను తట్టుకోగలదు. కోయంబత్తూరు, కొల్లార్‌, కన్యాకుమారి, కేరళ రాష్ట్రం వంటి సమానమైన ఉష్ణోగ్రతతో తేలికపాటి తేమతో కూడిన పంటలలో ఈ పంట రావడం గమనించబడింది.

ప్రవర్థనం: కాండం కటింగ్‌ ద్వారా ప్రవర్ధనం చేయబడుతుంది మరియు తాజా విత్తనాల ద్వారా కూడా వేస్తారు. 

మొక్కల అందుబాటు మరియు ధర: ఈ మొక్కలు వెంకటరామన్నగూడెం, హార్టీకల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌, డా. వై.యస్‌.ఆర్‌. హార్టీకల్చర్‌ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మొక్కను రూ. 25/-కు విక్రయిస్తున్నారు.

విత్తేదూరం: వరుస నుండి వరస దూరం 30 సెం.మీ. మరియు మొక్క నుండి మొక్క మధ్య దూరం 10-15 సెం.మీ.

దిగుబడి: ఒక మొక్కకు వార్షిక దిగుబడి 3 కిలోల ఆకులు మరియు హెక్టారుకు 30 టన్నుల ఆకులను సంవత్సరంలో పండించవచ్చు.    దీ

డా. నాయుడు మాధవి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, హార్టీకల్చర్‌ విభాగం, ఎస్‌బివిఆర్‌ అగ్రికల్చరల్‌ కాలేజి, బద్వేల్‌, ఫోన్‌: 9494881824

Read More

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుతో మంచి లాభాలు

భారత దేశం వ్యవసాయక దేశం. అనాదిగా మన ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఒకప్పుడు 90 శాతానికి పైగా ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలలో కొనసాగుతున్నారు. సగానికి పైగా ప్రజలు మన దేశంలో వ్యవసాయ రంగంలో కొనసాగుతున్నా కూడా ఎంతమంది తమ పంటల సాగులో లాభాలు పొందుతున్నారు? అని అడిగితే అతితక్కువమంది రైతులు మాత్రమే తమ పంటల సాగుని లాభదాయకంగా కొనసాగిస్తున్నాము. ఎక్కువమంది  వ్యవసాయంలో నష్టాలను భరించవలసి వస్తుందనే సమాధానం వస్తుంది. నష్టాలను భరిస్తూ పంటల సాగును ఎలా కొనసాగిస్తున్నారా అనే సందేహం రావచ్చు. ప్రతి రైతుకు తప్పనిసరిగా ఆశ ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా రాబోవు పంటకాలాలలో లాభాలు రాకపోవా అనే ఆశతో లేదా కొంతమంది గత్యంతరం లేక పంటల సాగుని కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ఎక్కువమంది రైతులు వ్యవసాయంలో లాభాలు పొందలేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏవిధమైన కారణాలు ఉన్నా కాని ప్రస్తుత పంటలసాగు రైతులందరికి లాభదాయకంగా లేదనే విషయం అక్షర సత్యం. ఈ సమస్యకు పరిష్కారం కొరకు మరియు తమ వ్యవసాయాన్ని లాభల బాటలో నడిపించడం కొరకు రైతు ప్రతినిత్యం ఆలోచిస్తూ, అన్వేషిస్తూ ఉంటాడు. ఈ ఆలోచనల, అన్వేషణల ఫలితంగా వివిధ రకాల పరిష్కార మార్గాలైన పెట్టుబడులు తగ్గించుకోవడం, కూలీ ఖర్చులు తగ్గించుకోవడం, పంట ఉత్పత్తులకు విలువ జోడించటం, పంట ఉత్పత్తులను సొంతంగా మార్కెట్‌ చేసుకోవడం, కొత్త పంటలవైపు ఆలోచనలు చేయడము లాంటి వివిధ రకాల పరిష్కార మార్గాలు రైతుల మెదడులో మొలుస్తుంటాయి. ఇన్ని రకాల పరిష్కార మార్గాలలో కొత్త పంటల విధానం గురించి ఎక్కువ మంది రైతులు మొగ్గుచూపిస్తుంటారు. దాని ఫలితమే ఔషధ పంటలు, అడవి ఆముదము, దూలగొండి, టేకు, శ్రీగంధం, చందనం, యాపిల్‌ బేర్‌, తైవాన్‌ జామ లాంటి వివిధ రకాల కొత్త పంటలు రావడము, కొన్నింటిలో రైతులు చేతులు కాల్చుకోవడం అందరికీ తెలిసిందే. ఈ కొత్త పంటలను సాగు చేయాలంటే మొక్కలు లేదా విత్తనాలకు మరియు మౌలిక వసతులకు ఎకరానికి యాభై వేలకు మించి, కొన్నింటికయితే ఎకరానికి ఇరవై వేల రూపాయలలోపే పెట్టుబడులు పెట్టవలసి రావచ్చు. కాని ఇటీవల వచ్చిన కొత్త పంటలు డ్రాగన్‌ ఫ్రూట్‌ మరియు ఖర్జూర పంటలు సాగు చేయాలంటే మాత్రం ఎకరానికి సుమారు 5 లక్షల వరకు పెట్టుబడి అవసరం పడుతుంది. అంత ఎక్కువ ఖర్చు పెట్టి డ్రాగన్‌ఫ్రూట్‌, ఖర్జూర లాంటి పంటల సాగు మొదలు పెట్టాలంటే ఒక సాధారణ రైతుకు సాధ్యమయ్యే పని కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఆర్థిక స్తోమత కలిగిన రైతులు ఈ పంటల సాగును మొదలు పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచి పరిణామమే అని చెప్పవచ్చు. అంత పెట్టుబడి పెట్టి కొంతకాలం వేచిచూసి దిగుబడి వచ్చిన తరువాత, వచ్చిన దిగుబడిని మార్కెటింగ్‌ చేసిన తరువాత మాత్రమే ఆ పంట రైతులకు లాభసాటిగా ఉంటుందా? లేదా? అనే విషయాలను తెలియచేయడానికి, అలాంటి ఖర్చుతో కూడుకున్న కొత్త పంటలను సాగు చేయటానికి కొంతమంది అభ్యుదయ రైతులు ముందుకు వచ్చి డ్రాగన్‌ ఫ్రూట్‌, ఖర్జూర లాంటి పంటలు సాగు చేస్తున్నారు. ఈ కోవకే చెందుతాడు నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన శ్రీనివాసరెడ్డి.

శ్రీనివాసరెడ్డిది వ్యవసాయ నేపథ్యం. వారి తండ్రి, తాతల దగ్గర నుంచి వ్యవసాయం ప్రధాన వృత్తిగా చేసుకుని జీవితాలను కొనసాగిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి చిన్న తనం నుండి వ్యవసాయంలో తన వంతు పాత్రను పోషిస్తూ ఉండేవాడు. ఉన్నత చదువులు చదివిన శ్రీనివాస రెడ్డి ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగ బాధ్యతలలో చేరి ఇప్పటికి 31 వ సంవత్సరాలు పూర్తి అయ్యింది. బ్యాంకులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా తన మనసులో తన ప్రధాన వృత్తి వ్యవసాయం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. తాను త్వరలో ఉద్యోగ విరమణ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ విరమణ తరువాత తన పూర్తి సమయాన్ని వ్యవసాయ రంగంలో గడపాలనే ప్రణాళిక వేసుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేయడం గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. తమకు సొంత భూమి ఉంది, చిన్నతనం నుండి పంటల సాగులో అనుభవం ఉంది కాబట్టి తన అనుభవాన్ని ఉపయోగించుకుని భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో స్థిరపడాలనే తలంపుతో వివిధ రకాల పంటల సాగు గురించి విచారించడం, క్షేత్రస్థాయి పరిశీలన చేయడం మొదలు పెట్టి వివిధ ప్రాంతాలలో, వివిధ రకాల పంటలను పరిశీలించిన తరువాత ఖర్జూర (డేట్స్‌) పంటను సాగు చేయాలనే నిర్ణయానికి వచ్చి అందుకు సంబంధించిన రైతులను కలిసి, ఖర్జూర పంటను పరిశీలించి తాను సేకరించిన సమాచారంతో ఖర్జూర పంట వేయాలని 2019 వ సంవత్సరములో నిర్ణయించుకుని 2019వ సంవత్సరం ఆగస్టు నెలలో ఖర్జూర మొక్కలు నాటించాడు. తరువాత డ్రాగన్‌ ఫ్రూట్‌ గురించి కూడా ఆలోచించి 2022 వ సంవత్సరములో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును కూడా మొదలు పెట్టాడు.

ఖర్జూర: 10 ఎకరాలలో ఖర్జూర (డేట్స్‌) పంట సాగులో ఉంది. ఇందుకు గాను ఒక్కొక్క మొక్క 4250/- చొప్పున కొనుగోలు చేసి 2019వ సంవత్సరం ఆగస్టు నెలలో ఎకరానికి 76 మొక్కలు (ఆడ మొక్కలు+మగ మొక్కలు కలిపి) చొప్పున 10 ఎకరాలకు గాను 760 మొక్కలు నాటించాడు. ఖర్జూరలో చాలా రకాలు ఉన్నాయి కాని వీరు మాత్రం ఫ్రెష్‌ ఫ్రూట్‌ రకాలు అయిన బర్హి మరియు ఎలైట్‌ మొక్కలను ఎంపిక చేసుకుని నాటించాడు. ఎకరానికి 76 మొక్కల చొప్పున వచ్చేలా గుంతలు తీయించి మొక్కలు నాటించాడు. పశువుల ఎరువులో వేరు పురుగు సమస్య ఉంది కాబట్టి, ఆ పురుగులు లేత మొక్కలను తిన్నట్లయితే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉందని భావించి గొర్రెల ఎరువును గుంతలలో వేయించాడు. ఒకవేళ వేరు పురుగులు లేత మొక్కలను పాడు చేసినా కూడా మొక్కలు చనిపోకుండా ఎదుగుదల తగ్గి మరుసటి సంవత్సరం ఇగురు పెట్టడం తాను ప్రత్యక్షంగా చూడడం జరిగిందని శ్రీనివాసరెడ్డి వివరించాడు. ఖర్జూర ఎడారి జాతి మొక్క కాబట్టి పోషకాలు మరియు చీడపీడల విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. కాని రెడ్‌ వీవిల్‌ పురుగు బయటకు కనిపించకుండా చెట్టులోపల గుడ్లు పెట్టి చెట్టును పాడు చేస్తుంది. మనం ఊహించకుండానే ఒక రోజు చెట్టు విరిగి పడిపోతుంది. ఈ పురుగును కనిపెట్టడం చాలా కష్టం. చెట్టు మొదలులో పదార్థం తింటూ చిన్న శబ్దం చేస్తుంది. జాగ్రత్తగా పరిశీలిస్తేనే మనం ఆ పురుగు చేసే శబ్దాన్ని వినవచ్చు. ఈ శబ్దాన్ని కుక్కలు కనిపెట్టి అక్కడ ఏదో ఉన్నట్లు పురుగు ఆశించిన చెట్టు వద్ద కుక్కలు తవ్వుతూ ఉంటాయి కాబట్టి ఆ పురుగును నివారించవలసి అవసరం ఎంతైనా ఉందని శ్రీనివాసరెడ్డి వివరించాడు. ఖర్జూర పండ్ల సాగులో పరపరాగ సంపర్కము చాలా ముఖ్యం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు బాక్స్‌ చూడగలరు.

మొక్కలు నాటిన మూడవ సంవత్సరం అంటే గత సంవత్సరం 10 ఎకరాల నుంచి 1000 కిలోల దిగుబడి పొందాడు. ఈ సంవత్సరం అంటే మొక్కలు నాటిన నాలుగవ సంవత్సరం పది ఎకరాల నుంచి 10 టన్నుల పైగానే దిగుబడి పొంది కిలో 130/-ల చొప్పున అమ్మకం చేశాడు. మొక్కల వయస్సు పెరిగే కొలది దిగుబడి పెరుగుతుంది. దానికి తోడు ఈ మొక్కల జీవితకాలం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని శ్రీనివాసరెడ్డి వివరిస్తున్నాడు. 

డ్రాగన్‌ఫ్రూట్‌: శ్రీనివాసరెడ్డి గారు ఖర్జూర (డేట్స్‌)తో పాటు 13 ఎకరాలలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును కొనసాగిస్తున్నాడు. ఇందులో మూడు ఎకరాలు ఖర్జూరలో అంతరపంటగా మరియు 10 ఎకరాలలో ఏక పంటగా డ్రాగన్‌ ఫ్రూట్‌ని సాగు చేస్తున్నారు. లైనుకి లైనుకి 12 అడుగులు, మొక్కకు మొక్కకు 10 అడుగుల దూరం పాటించి సిమెంటు స్థంభాలను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క స్థంభానికి నాలుగు మొక్కల చొప్పున నాటించాడు. పాదులలో పశువుల ఎరువు చాలా ఎక్కువగా వేయించి ఎత్తు పాదులలో డ్రాగన్‌ మొక్కలు నాటించాడు. నీటి వసతి కొరకు డ్రిప్‌ ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది రైతులు అంటే మొదటలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు మొదలు పెట్టిన రైతులు స్థంభం పైన టైరు ఏర్పాటు చేసుకుని ఆ టైరులో డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలు పెరిగేలా ఏర్పాటు చేసుకున్నారు కాని అనుభవం పెరిగే కొలది డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు పద్ధతులలో అనేక మార్పులు సంభవించాయి. ఇంకా సంభవిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా స్థంభం పైన టైరును కాకుండా సిమెంటు రింగులను శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేయించాడు. డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కకు కొమ్మలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువ కొమ్మల బరువుకు టైరు తట్టుకోలేదు కాబట్టి సిమెంటు రింగులను ఏర్పాటు చేసుకున్నాడు.

మొక్కలు నాటిన ఎనిమిది, తొమ్మిది నెలలలో మొదటి పంట వచ్చింది కాని చాలా తక్కువగా వచ్చింది. ప్రస్తుతానికి రెండవ సంవత్సరం దిగుబడి పొందుతున్నాడు. అంటే మొక్కలు నాటిన 20 నెలలకు రెండవ పంట దిగుబడిని పొందుతున్నాడు. జులై 15 వరకు పది ఎకరాలకు గాను 10 టన్నుల వరకు దిగుబడి పొందడము జరిగింది. ప్రస్తుతం పంట పూత మరియు చిన్న మొగ్గ థలో ఉంది. శ్రీనివాస రెడ్డి సాగు చేసే రకం సియాన్‌ రెడ్‌ రకం. ఈ రకం దిగుబడి మొత్తం ఒకేసారి కాకుండా దఫాలు దఫాలుగా వస్తుంది. ప్రస్తుత పంటను గమనించినట్లయితే ఎకరానికి ఇంకా 4 టన్నుల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంది. అంటే రెండవ సంవత్సరం ఎకరానికి 5 టన్నుల దిగుబడి పొందవచ్చు అని శ్రీనివాసరెడ్డి చెబుతున్నాడు.

మార్కెటింగ్‌ విషయానికొస్తే తాను పొందిన దిగుబడి మొత్తాన్ని సొంతంగా దారి పక్కన పండ్లు అమ్మేవారికి, కాలనీలలో, అపార్టమెంట్లలో కిలో 120/-లకు తగ్గకుండా అమ్మకం చేస్తున్నాడు. వచ్చిన దిగుబడిని అమ్మకం చేసుకోవడంలో శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు. ఇకముందు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉండవు అనే ఆశాభావంతో ఉన్నాడు. ప్రస్తుతం గిరాకి తగ్గట్లుగా పండ్లు అందుబాటులో ఉండడం లేదు కాబట్టి కొన్ని సమయాలలో వియత్నాం నుండి డ్రాగన్‌ ఫ్రూట్‌ పండ్లను దిగుమతి చేసుకుంటున్నారు. మన దగ్గర కూడా సాగు విస్తీర్ణం పెరిగి పండ్లు అందుబాటులోకి వస్తే వియత్నాం నుంచి దిగుమతి చేసుకోవలసిన అవసరం లేకపోగా, మొదట ఖర్చు చేసిన పెట్టుబడులు సాధించిన తరువాత డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతులు ధరలు తగ్గించే అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు మంచి భవిష్యత్‌ ఉందని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడుతున్నాడు. 

రుచి విషయానికొస్తే డ్రాగన్‌ ఫ్రూట్‌లో రెండు రకాలు ఉన్నాయి. వైట్‌ పల్ప్‌ మరియు పింక్‌ పల్ప్‌. తాను పింక్‌ పల్ప్‌ రకాన్ని సాగు చేస్తున్నాను కాబట్టి ఇది మంచి రుచిగా ఉంటుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి డ్రాగన్‌ ఫ్రూట్‌ని రుచి కోసం కాకుండా ఆరోగ్యం కోసం తినాలని, ప్రపంచం మొత్తం అదే విధంగా తింటున్నారు కాబట్టే ప్రపంచం మొత్తం డ్రాగన్‌ ఫ్రూట్‌ అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరెడ్డి వివరించాడు.

ఖరీదైన పంటలు పెద్ద మొత్తంలో అంటే 20 ఎకరాలకు గాను కోటి రూపాయలకు పైగా పెట్టిబడి పెట్టి డ్రాగన్‌ ఫ్రూట్‌ మరియు ఖర్జూర పంటలను సాగు చేస్తూ, వీటి సాగులో ఉన్న సాధకబాధకాలను తోటి రైతులకు తెలియచేయడంతోపాటు తన పదవీ విరమణ తరువాత ఆరోగ్యకర వ్యాపకం కోసం ఈ పంట సాగును శ్రీనివాసరెడ్డి ఎంపిక చేసుకొని కొనసాగిస్తున్నాడు. మరిన్ని వివరాలు 99491 11198 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

పరపరాగ సంపర్కము

ఈ రకం ఖర్జూరాలో మగ మొక్కలు మరియు ఆడ మొక్కలు విడివిడిగా ఉంటాయి కాబట్టి 10 శాతం మగ మొక్కలు ఉండేలా మొక్కలు నాటుకుంటున్నారు. శ్రీనివాసరెడ్డి కూడా అదే నిష్పత్తిలో 10 శాతం మగ మొక్కలు నాటించాడు. మగ మొక్క నుంచి పూలు విచ్చుకొనే సమయంలో పరిశీలించి పుప్పొడిని సేకరించి ఆడ మొక్కలలోని పూలకు నైపుణ్యంతో అద్దవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఏ మాత్రం తేడా వచ్చినా అంటే సేకరించిన పుప్పొడిని అద్దలేకపోతే కాయలు చిన్నవిగా ఉండి అందులో విత్తనం తయారవదు. అవి తినటానికి పనికిరావు. ఆడ మొక్కల పూవులలోని అన్ని పూవులకు పుప్పొడిని అద్దలేకపోయినట్లయితే పుప్పొడి తగిలిన కాయలలో విత్తనం తయారయ్యి ఆ కాయలు లావుగా అయ్యి తినటానికి తీపిగా ఉంటాయి. ఆడ పువ్వులు గెలలోని అన్ని కాయలకు పుప్పొడి అద్దినట్లయితే గెలలోని అన్ని కాయలలో విత్తనం ఉత్పత్తి అయ్యి, కాయలు లావుగా ఉండి మంచి రుచిని కలిగి ఉంటాయి. ఈ మొక్కలలో పరపరాగ సంపర్కము అతి కష్టమయినది కాబట్టి రైతులు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలతో పుప్పొడిని సేకరించవలసి ఉంటుంది. కొన్ని సార్లు పుప్పొడి సరిపోనట్లయితే వేరే రైతుల వద్ద నుంచి పుప్పొడిని కొనుగోలు చేసుకుని ఉపయోగించవలసి ఉంటుంది. గత సంవత్సరం శ్రీనివాస రెడ్డి గుజరాత్‌లోని ఒక రైతు వద్ద నుంచి కొనుగోలు చేయడం జరిగిందని వివరించాడు. తేనెటీగల వలన ఖర్జూర పంటలో పెద్దగా ఉపయోగం లేకపోగా తేనెటీగలు పుప్పొడిని సేకరించుకొని పోతాయి కాబట్టి తేనెటీగల వలన పుప్పొడి కోల్పోవలసి రావచ్చు అని శ్రీనివాసరెడ్డి వివరించాడు. మగ మొక్కల నుంచి పుప్పొడి ఉత్పత్తి అయ్యే సమయములో మరియు పుప్పొడిని ఆడపూలపై అద్దే సమయములో భారీ వర్షాలు పడినట్లయితే పంటను నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్జూర సాగు రిస్కుతో కూడుకున్న పంట అని శ్రీనివాసరెడ్డి వివరిస్తున్నాడు.

Read More