ఆగస్టు నెలలో సేద్యపు పనులు 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జూన్‌ ఆఖరి వారంలో అరకొర వర్షాలు. జూలై మొదటి పక్షంలో కూడా వర్షాలు ముఖం చాటేసాయి. జూలై మధ్య నుండి తెలంగాణాలో విపరీతమైన ఎడతెరిపి లేని వానలు. తద్వారా వరదలు, ఉత్తరాంధ్రలో విపరీత వర్షాలు. మధ్యాంధ్రలో సాధారణ వర్షాలు. దక్షిణాంధ్రలో తక్కువ వర్షాలు. అనంతపురం జిల్లాలో వర్షాలు రాక వాటి కోసం ప్రార్థనలు. వర్షాధార పంటలు విత్తడం జూన్‌, జూలై నెలల్లో సరిగా జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు (పుష్యమి తొలి రోజులు, ఆశ్లేష, మఖ కార్తెలు)లో వివిధ పంటల్లో చేయవలసిన పనులను గురించి…

టమాట: ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆగస్టు నెలలో కూడా అధిక ధరలే ఉండే అవకాశముంది. అధిక వర్షాలు, మేఘావృత వాతావరణం, వరదలు, ఈ పంట దిగుబడి తగ్గిపోవడానికి తద్వారా ధరలు ఎక్కువగా ఉండడానికి కారణమవుతున్నాయి. దేశమంతా ఇదే పరిస్థితి ఉన్నందున ధరలు ఎక్కువగానే కొనసాగవచ్చు. పొడి వాతావరణం, టమాట విస్తీర్ణత పెంపు, వర్షాధారపు పంట అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుతాయి. 

మిరప: ఈ పంట ధరలు కూడా బాగా అధికంగా ఉన్నాయి. కొత్త పంట వర్షాకాలంలో విత్తిన పంట చేతికొచ్చే దాకా వీటి ధరలు అధికంగానే ఉండే అవకాశం. మంచి రకాలు : ఎల్‌.సి.ఏ-424, ఎల్‌.సి.ఏ-436, ఎల్‌.సి.ఏ-620, ఎల్‌.సి.ఏ-625. కాశీఅభ: ఈ రకం బహుళ ప్రాచుర్యం పొందుతున్నది. ఆకుమచ్చ, ఆకుముడత, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఘాటు ఎక్కువగా ఉంటుంది. పచ్చిమిర్చికి అనువైనది. ఎగుమతికి కూడా మంచి అనుకూలం. ఇవి కాక పలు ప్రైవేట్‌ కంపెనీల విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆగస్టు నెలలో నారుపోయవచ్చు. ప్రధాన పొలంలో నేరుగా విత్తవచ్చు. నారుమడిలో సస్యరక్షణ, ప్రధాన పొలం తయారు చేసి విత్తుట, నాటుట, మొ|| పనులు ఆగస్టులో ఉంటాయి.

వంగ: ఆగస్టులో ఈ పంట నాటవచ్చు. ఆయా ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న రకాలను ఎంపిక చేసుకొని నాటితే మంచి మార్కెట్‌ ఉంటుంది. ఆగస్టులో కూడా ఈ పంట ధరలు ఎక్కువగానే ఉండే అవకాశముంది.

క్యాబేజి, కాలీఫ్లవర్‌, క్యారట్‌, బీట్‌రూట్‌: ఈ పంటలను ఆగస్టు నెలలో విత్తవచ్చు. ఈ పంటల ధరలు కూడా ఆగస్టులో సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశముంది. 

బీర, బూడిదగుమ్మడి: ఈ పంటలను ఆగస్టు మొదటి పక్షం వరకు విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. వీటి ధరలు కూడా ఆగస్టులో సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశముంది.

వరి: భారతదేశం వరి ఎగుమతులు ఆపినందున, ప్రపంచమంతా సన్న బియ్యానికి కొరత ఏర్పడింది. వలస వెళ్ళిన భారతీయులు 3 రెట్లు ఎక్కువ ధర పెట్టి కొనాలన్నా సన్న బియ్యం అమెరికా వంటి దేశాల్లో దొరకుట లేదు. అధిక వర్షాలకు నిండిన రిజర్వాయర్ల నీటిని సద్వినియోగ పరచుకొని సన్న బియ్యాన్ని దండిగా పండించి ప్రపంచానికి సప్లయి చేయడం వలన మన రైతులు లాభపడతారు. సన్నబియ్యం పండించడానికి రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. నార్లు రెడీగా ఉన్న రైతాంగం వెంటనే ప్రధాన పొలం తయారు చేసి నాట్లు వేయాలి. ఎంత లేత నారు నాటితే అంత దిగుబడి పెరుగుతుంది. నాట్లు పెట్టిన వారు అధిక వర్షాలకు ముంపుకు గురై ఉంటే వర్షం నీరు త్వరగా వెళ్ళిపోయేటట్లు గట్లు కొద్దిగా తెగ్గొట్టాలి. మురుగు నీరు త్వరగా వెళ్ళేటట్లు ఇది తోడ్పడుతుంది. మొక్కలు బతికే ఉంటే సేంద్రియ విధాన పంటలో విత్తిన 40-60 రోజుల వయస్సున్న వరికి 5 లీటర్ల ద్రవజీవామృతం 100 లీటర్ల నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి. 60-90 రోజుల పంటకు 10 లీ. జీవామృతం 100 లీ. నీటికి కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి. ఇది సాధారణ పరిస్థితుల్లో చేసే పిచికారీలకు అదనం. మొక్కలు పాడయిన చోట తిరిగి వరి పండించాలంటే లేక కొత్త పొలంలో వరి పండించాలంటే స్వల్ప, లేక మధ్యకాలిక రకాలను విత్తాలి. మొలకెత్తిన విత్తనాలను ప్రధాన పొలంలో నేరుగా వెదజల్లే పద్ధతితో గానీ, డ్రమ్‌ సీడర్‌నుపయోగించి గానీ విత్తాలి. ఇలా చేస్తే, నారు పెంచి నాటిన పంటకంటే వారం రోజులు ముందే కోతకొస్తుంది. వెదజల్లే పద్ధతిని అనుభవమున్న రైతులే చేపట్టాలి. అనుభవం లేకపోతే నారు సరిగా అతకదు. నారు సరిగా మొలవదు. పంట సరిగా రాదు. అనుకూలమైన సన్నరకాలు: తెలంగాణ సోన (ఆర్‌.ఎన్‌.ఆర్‌-15048), బిపిటి-5204 (సాంబమసూరి) ఈ రకాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్‌ ఉంది. నూతన సన్న గింజ రకాలు: ఆంధ్రప్రదేశ్‌కు: ఎం.టి.యు-1280, 135 రో. 28 క్వి/ఎ, సుజాత (ఎం.టి.యు-1210): 135 రో, 26-28 క్వి/ఎ, తెలంగాణకు: తెలంగాణ వరి-3 (జె.జి.ఎల్‌-21078): 120 రో. 32-34 క్వి/ఎ. తెలంగాణ వరి-2 (డబ్లు.జి.ఎల్‌-697):135 రో., 28-32 క్వి/ఎ. కూనారమ్‌ రైస్‌-1(కె.ఎన్‌.ఎమ్‌-733): 120 రో. 28-30 క్వి/ఎ.

ప్రత్తి: విపరీత వర్షాలు కురిసిన చోట ప్రత్తి పంట బాగా దెబ్బతిన్నది. ఎక్కువైన నీరు పల్లానికి వెళ్లేటట్టు నీటికడ్డంగా ఉన్న మట్టిని పారలతో తొలగించాలి. సేంద్రియ వ్యవసాయంలో 10-15 లీ. జీవామృతాన్ని 150-200 లీ. నీటితో కలిపి మొక్కలపై పిచికారి చేయాలి. ఇది సాధారణ పరిస్థితుల్లో పిచికారీ చేసే దానికి అదనం. భూమిపై పొర కొద్దిగా ఆరిన తర్వాత అంతరకృషికి బ్యాటరీతో నడిచే మినీట్రాక్టర్లను వాడవచ్చు. దీనివలన ఖర్చు బాగా తగ్గుతుంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాధారంగా, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆగస్టులో విత్తడం అలవాటు. నల్లభూముల్లో ఎక్కువ దిగుబడి వస్తుంది. మిగతా ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణలలో ఈ నెలలో ప్రత్తి విత్తరాదు. పురుగులు, రోగాలు అధికం. పంట దిగుబడి తక్కువ. మే నెలాఖరు నుండి జూన్‌, జూలై నెలల్లో విత్తిన ప్రత్తిలో అంతర సేద్యం, కలుపు నివారణ పైపాటి ఎరువులు వేయుట, సస్యరక్షణ ఆగస్టులో చేపట్టాల్సి ఉంటుంది. ఆగస్టు నెలలో బెట్ట పరిస్థితులేర్పడితే, వీలయిన చోట తడి ఇస్తే దిగుబడి పెరుగుతుంది.

రాగి: ఆగస్టు చివరి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటను విత్తుకోవచ్చు. అనుకూలమైన రకాలు: ఖరీప్‌, రబీ, వేసవిలలో (అన్ని కాలాలలో) పండి అధిక దిగుబడినిచ్చే రకాలు. భారతి: 12-16 క్వి/ఎ, 105-115 రోజులు, తిరుమల: 14-15 క్వి/ఎ, 115-120 రోజులు, చొప్ప దిగుబడి ఎక్కువ. సువర్ణముఖి: 14-15 క్వి/ఎ, 105-110 రోజులు, వరి మాగాణులకు అనుకూలం. పంట చివరి థ బెట్టను తట్టుకుంటుంది. ఇంద్రావతి: 14-15 క్వి/ఎ. 115-120 రోజులు, కాల్షియం, ఐరన్‌, జింకు ఎక్కువ. నారు పెంచి నాటుకోవచ్చు. నేరుగా ప్రధాన పొలంలో విత్తుకోవచ్చు. రాగి మద్దతు ధర: రూ. 3846/క్వి.

సిరిధాన్యాలు: కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, ఆరికలు ఆగస్టులో కూడా విత్తుకోవచ్చు. అధిక దిగుబడి రకాలు: కొర్రలు: రేనాడు (ఎస్‌.ఐ.ఎ-3223), ఎస్‌.ఐ.ఎ-3156: 11-13 క్వి/ఎ, 85-90 రోజులు, వెర్రకి కంకి తెగులును తట్టుకుంటాయి. సామలు: దిగుబడి 5-6 క్వి/ఎ, 90-110 రోజులు. ఓ.ఎల్‌.ఎమ్‌-36-3, బి.ఎల్‌-6, ఊదలు: డి.హెచ్‌.బి.ఎమ్‌-93-3: 9-10 క్వి/ఎ, 90-95 రోజులు. ఆరికలు: టి.ఎన్‌.ఎ.యు-86: 9-12 క్వి/ఎ, 95-110 రోజులు. జె.కె-13: 9-14 క్వి/ఎ, 95-110 రోజులు, జె.కె-48: 10-11 క్వి/ఎ, 95-100 రోజులు. అండుకొర్రలు: బి.టి.ఎం-1: 9-10 క్వి/ఎ, 100-110 రోజులు, జి.పి.యు.బి.టి.-6: 8-9 క్వి/ఎ, 90-92 రోజులు.

సోయాచిక్కుడు: కోస్తాంధ్రా ప్రాంతంలో ఈ పంటను ఆగస్టు-సెప్టెంబరులలో కూడా విత్తవచ్చును. మిగతా ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణలో ఈ నెలలో విత్తరాదు. దిగుబడి బాగా తక్కువ. అధిక వర్షాలకు దెబ్బతిన్న ఖరీఫ్‌ సోయా పంటను కాపాడడానికి, మచ్చతెగుళ్ళ నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పసుపురంగు సోయాబీన్‌ మద్దతు ధర రూ. 4600/క్వి.

ప్రొద్దు తిరుగుడు: ఈ పంటను బరువైన నేలల్లో ఆగస్టు కడ వరకు విత్తి మంచి దిగుబడులు పొందవచ్చు. ప్రొద్దుతిరుగుడు విత్తనాల మద్దతు ధర రూ. 6760/క్వి. ఎక్కువ దిగుబడినివ్వగల్గిన ప్రైవేట్‌ కంపెనీల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. జూలైలో విత్తిన పొద్దు తిరుగుడు పంటలో అంతర సేద్యం, కలుపు నివారణ, పైపాటి ఎరువులు వేయుట, కాలువలు, బోదెలు ఏర్పాటు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. జూన్‌లో విత్తిన పంటలో బెట్ట పరిస్థితులొస్తే తడి ఇవ్వాలి. చిలుకలు తిని పోకుండా కాపాడాల్సుంటుంది. శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, తామర పురుగులకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎకరాకు 400 గ్రా. బోరాక్స్‌ 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేస్తే గింజల దిగుబడి బాగా పెరుగుతుంది.

నువ్వులు: తెలంగాణాలో నువ్వు పంటను ఆగస్టు రెండవ పక్షంలో విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. భూమి తయారీ, ఎరువులు వేసి విత్తుట ఆగస్టులో పూర్తి చేయాలి. అనుకూలమైన రకాలు: జగిత్యాల తిల్‌-1 (జె.సి.ఎస్‌-1020), తెల్లగింజ. వానాకాలంలో నిదానంగా విత్తిన పంట. దిగుబడి 280-300 కిలోలు/ఎ. 85-90 రోజుల పంట. శారద (ఎలమంచిలి-66): లేత గోధుమ రంగు విత్తనాలతో ఎకరాకు 600 కిలోల వరకు దిగుబడి నిస్తుంది. 80-90 రోజుల పంట. నువ్వుల మద్దతు ధర: రూ. 8635/క్వి. మే లో విత్తిన నువ్వు పంట ఆగస్టులో కోతకొస్తుంది.

చెరకు: చెరకు పంట కాలం మరియు ఎదుగుదలను బట్టి జడచుట్లు ఆగస్టు నెలలో వేయాల్సి ఉంటుంది. ఈ నెలలో దూదేకుల పురుగులు ఎక్కువగా ఉండే అవకాశమున్న చోట తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెలంగాణలో అడ్సాలి పంటగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో చెరకు నాటవచ్చు. బడ్‌చిప్‌ పద్ధతిలో నాటితే విత్తనపు ఖర్చు నాలుగింట మూడువంతులు ఆదా అవుతుంది. ఈ పద్ధతిలో ముచ్చెలకు బదులుగా, చెరకు కన్నులను యంత్ర సహాయంతో వేరు చేసి విత్తనంగా వాడుతారు. కన్నులు తీయగా మిగిలిన చెరకును బెల్లం లేదా చక్కెర తయారీకి, మామూలుగా వాడవచ్చు. నీటి ముంపుకు గురైన చెరకు పంట నుండి అధిక నీటిని వీలయినంత త్వరగా తీసెయ్యాలి. పసుపునల్లి, పొలుసుపరుగు, దూదేకుల పురుగు (స్పైరెల్లా) తెల్లపేను (ఊలి ఎఫిడ్‌), తెల్లనల్లి, రసంపీల్చు పురుగుల ఉధృతి తగ్గడానికి చెరకుపై పక్కన ఉన్న 8 ఆకులను మిగిల్చి క్రింది ఆకులన్నింటినీ జడవలె చుట్టుకోవాలి. అవసరాన్ని బట్టి పురుగుల నదుపు చేయడానికి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

అందివచ్చిన మహదవకాశం – వదలుకోవద్దు: చెరువుల్లో, బావుల్లో రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు. సన్న బియ్యానికి కూరగాయలకు ప్రపంచమంతా మంచిధరలు. రైతులు రైతు సంఘాలను ప్రోత్సహించి, ఈ పంటలను ఎక్కువగా పండించేటట్లు ప్రోత్సహించిన పార్టీలకు రైతుల్లో మంచి పేరు, పలుకుబడి వస్తుంది. దండిగా ఓట్లు వచ్చే అవకాశం. రైతు సంఘాల ద్వారా వడ్లను మరపట్టించి బియ్యంగా తయారు చేయడానికి ప్రోత్సాహకాలనందిస్తే, ఎగుమతి చేయడంలో రైతు సంఘాలకు సహకరిస్తే, రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే దానికి బాగా వీలవుతుంది. మధ్యవర్తులు, దళారీలు పొందే లాభాలను రైతులకే అందించడానికి ఈ పద్దతి బాగా సహకరిస్తుంది.

ప్రతి పల్లె, జనావాసంలో రైతు ప్రజా సంఘాల ఏర్పాటుకుకనీస సపోర్టు ఇస్తే ఆర్థికంగా వారే ఎదగడానికి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకు ఉత్పత్తిదారులకు అనుసంధానం ఏర్పడి, వినియోగదారులకు తక్కువ ధరల్లో పంటల ఉత్పత్తులు అందడానికి వీలవుతుంది. ఉత్పత్తి చేసే రైతులకు కూడా కొద్దిగా ఎక్కువ ఆదాయం వచ్చే దానికి వీలవుతుంది. అట్టడుగు ఆదాయం కల్గిన పట్టణ, గ్రామీణ ప్రజలందరి ఉన్నతికి, అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది. ఈ పాలసీలను ప్రోత్సహించడం వల్ల పార్టీలకేమి ఉపయోగమంటే – ఎన్నికల్లో దండిగా ఓట్లు. దీనిని ఆచరణ సాధ్యం చేయడానికి సలహాలు, సూచనలకు ప్రొఫెసర్‌ సల్లా నారాయణ స్వామి, ఫోను నెంబరు 9494408619  చైర్మన్‌, నారాయణ ఫౌండేషన్‌, హైదరాబాదు. ఇ-మెయిల్‌: profsnswamy@gmail.com,   ఫేస్‌బుక్‌: SALLA Narayana Swamy

Read More

సేంద్రియ వరి సాగులో చీడపీడల యాజమాన్యం

తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహార పంట వరి. ఈ మధ్య కాలంలో వరిని సేంద్రియ పద్ధతిలో సాగు చేయటానికి రైతాంగం ఆసక్తి చూపుతున్నారు. దీని ద్వారా రసాయనిక ఎరువులు, పురుగు/తెగుళ్ళ మందుల వినియోగం తగ్గించి భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మరియు నేలలను అందించడమే ముఖ్య ఉద్దేశం. సేంద్రియ వరి సాగులో చీడపీడల యాజమాన్యంలో వివిధ పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలల్లో చేసిన పరిశోధనల ఆధారంగా, అధిక దిగుబడులు సాధించడానికి ఈ క్రింది పద్ధతులను అవలంభించండి.

కాండం తొలుచు పురుగు

  • నారు కొనలను త్రుంచి నాటుకొన్నట్లయితే గుడ్ల సముదాయాన్ని నివారించడం ద్వారా కాండం తొలుచు పురుగును నివారించు కోవచ్చు, అధికంగా ఉన్న నారును నేలలో కలిపి వేయాలి.
  • పురుగు ఉధృతి తెలుసుకోవడానికి మరియు నివారణకు ఎకరానికి 40 చొప్పున పక్షి స్థావరాలు, 8 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టుకోవాలి.
  • పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి.
  • ట్రైకోగ్రామా జపానికం అనే గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 40,000 గ్రుడ్ల సముదాయం ఉన్న కార్డులను మూడు దఫాలుగా నాటిన 20 రోజుల నుండి పొలంలో విడుదల చేసుకొన్నట్లయితే కాండం తొలుచు పురుగును సమర్ధవంతంగా నివారించుకోవచ్చును.
  • పశువుల పేడ (5 కిలోలు), పశువుల మూత్రం (5 లీటర్లు) 4 రోజులు మురుగ బెట్టిన తర్వాత 150 గ్రాముల సున్నం కలుపుకొని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారీ చేసుకోవాలి (లేదా)
  • ఆవుమూత్రం, పచ్చిమిర్చి మరియు వేప ఆకుల కషాయం ఎకరానికి 3-4 లీటర్ల కషాయం 100 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా కాండంతొలుచు పురుగును నివారించవచ్చు (10 లీటర్ల మూత్రానికి, ఒక కిలో పచ్చిమిరపకాయల ముద్ద, 5 కిలోల వేపాకుల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తరువాత గుడ్డతో వడగట్టి 3-4 దఫాలుగా వాడుకోవచ్చును).

ఆకుముడత

  • వేసవి దుక్కులు చేయడం ద్వారా సుప్తావస్థలో ఉన్న పురుగు గుడ్ల సముదాయాన్ని మరియు కలుపు విత్తనాలను నిర్మూలించవచ్చు.
  • వేప నూనె (1500 పి.పి.యం) లీటరు నీటికి 5 మి.లీ. కలుపుకొని నాటిన 20 మరియు 30 రోజులకు పిచికారి చేసుకవాలి (లేదా)
  • ఆవు మూత్రం, సీతాఫలం ఆకులు మరియు వేప ఆకుల కషాయం ఎకరానికి 2-3 లీటర్లు, 100 లీటర్ల నీటిలో కలుపుకుని మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా ఆకు ముడత నివారించవచ్చు (10 లీటర్ల మూత్రానికి 2 కిలోల సీతాఫలం ఆకుల ముద్ద, 5 కిలోల వేపాకుల ముద్దను చేర్చి ఉడికించి చల్లార్చిన తర్వాత గుడ్డతో వడగట్టి 3-4 దఫాలుగా వాడుకోవచ్చు)
  • బాసిల్లస్‌ తురంజెన్సిస్‌ లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలుపుకొని నాటిన 30-40 రోజుల మధ్యలో పిచికారీ చేసుకొన్నట్లయితే ఆకుముడతను నివారించుకోవచ్చు.
  • ట్రైకోగ్రామా అనే గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 20,000 గ్రుడ్ల సముదాయం ఉన్న కార్డులను మూడు దఫాలుగా నాటిన 15 రోజుల నుండి పొలంలో విడుదల చేసుకొన్నట్లయితే ఆకుముడతను సమర్ధవంతంగా నివారించుకోవచ్చును.

దోమ పోటు

  • తట్టుకునే రకాలైన ఇంద్ర, అమర, కృష్ణవేణి, భావపురి సన్నాలు మరియు శ్రీధృతి రకాలను ఎంచుకోవాలి.
  • దోమపోటు నివారణకు కాలి బాటలు తీయడం (ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలిబాటలు తీసుకోవాలి), పొలానికి వైకల్పికంగా నీరు కట్టడం మరియు ఆరబెట్టడం చేయాలి.
  • మెటారైజియం లేదా బవేరియా లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకొని రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. వేప నూనె లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున కలుపుకొని పిచికారి చేసుకొన్నట్లయితే నివారించుకోవచ్చు.
  • ఉదయం పూట వరి తవుడుతో (5-10 కి.) పాటు వేప నూనె ఒక లీటరు కలుపుకొని పొలంపై చల్లుకున్నట్యలితే దోమను కొంతవరకు తగ్గించుకోవచ్చు.
  • ఆవు మూత్రం, తూటికాడల కషాయం మొక్కల మొదళ్ళపై పడేటట్లు పిచికారి చేసుకోవడం ద్వారా దోమను నివారించవచ్చు (15 లీటర్ల మూత్రానికి, 10 కిలోల తూటికాడల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తరువాత 100 లీటర్ల నీటిలో కలుపుకొని వాడుకోవచ్చు).

ఆకు నల్లి/కంకి నల్లి, కంపు నల్లి, ఉల్లికోడు, పచ్చ దీపపు పురుగులు

  • ఉల్లికోడును తట్టుకొనే రకాలైన కావ్య, దివ్య, ఎర్రమల్లెలు, పోతన మరియు శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను నాటుకోవాలి.
  • నివారణకు ఎకరానికి 600 మి.లీ. వేపనూనె (3000 పి.పి.యం) పిచికారి చేయాలి.

అగ్గి తెగులు, పొడ తెగులు, దుబ్బుకుళ్ళు, గోధుమ రంగు మచ్చ

  • తట్టుకునే రకాలైన సోనామసూరి, సోమశిల, విజేత, తరంగిణి, నెల్లూరు సోన వంటి రకాలను ఎంచుకోవాలి.
  • పొలంలో మరియు పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి.
  • సూడోమోనాస్‌ ఫ్లోరసెన్స్‌ కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున లేదా లీటరు నీటికి 20 గ్రాముల చొప్పున కలుపుకొని లేదా లీటరు నీటికి 30 మి.లీ. పంచగవ్య ద్రావణాన్ని కలుపుకొని 20 నిముషాలపాటు విత్తనాన్ని లేదా నారును శుద్ధి చేసుకోవాలి.
  • లీటరు నీటికి 30 మి.లీ. పశువుల మూత్రాన్ని కలుపుకొని 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి.
  • ఎకరానికి 2 కిలోల చొప్పున సూడోమోనాస్‌ ఫ్లోరసెన్స్‌ నేలకు వేసుకోవాలి.
  • పచ్చిరొట్ట పంటలను నేలలో కలియ దున్నుకోవాలి.

కాండంకుళ్ళు, దుబ్బుకుళ్ళు తెగులు

  • నీటిని ఎప్పటికప్పుడు బయటకు తీసివేయడంతో పాటు మురుగునీరు పొలంలో లేకుండా చూసుకోవాలి.
  • సేంద్రియ ఎరువులను నేలకు అందించడం ద్వారా తెగులు ఉధృతి తగ్గించవచ్చు.
  • మారేడు ఆకులు మరియు పశువుల మూత్రం మిశ్రమంతో తగ్గించవచ్చు (ఒక కిలో మారేడు ఆకులు తీసుకొని 5 లీటర్ల నీటిలో ఉడకపెట్టి చల్లారిన తర్వాత 5 లీటర్ల పశువుల మూత్రం మరియు 100 గ్రాముల సున్నం కలుపుకొని, దీనిని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారి చేయాలి).

ఆకు ఎండు తెగులు

  • తట్టుకునే రకాలైన ఇంద్ర, అమర, పుష్యమి, స్వర్ణ, అక్షయ వంటి రకాలను ఎంచుకోవాలి.
  • 10 లీటర్ల నీటికి 100 మి.లీ. వర్మీవాష్‌, 50 మి.లీ. పశువుల మూత్రం కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి (లేదా)
  • పశువుల పేడ, ఇంగువ ద్రావణాలను (10 శాతం) పిచికారీ చేయడం ద్వారా ఎండు తెగులును నివారింవచ్చును (5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల మూత్రంతో పాటు 500 గ్రాముల బెల్లాన్ని కుండలోకి తీసుకొని 5 రోజుల పాటు కలుపుకొంటూ 5వ రోజు 100 గ్రాముల ఇంగువను కలపాలి. 10 లీటర్లకు 100 లీటర్ల నీటిని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి)
  • ఒక పొలం నుండి వేరొక పొలానికి నీరు పెట్టడం ఆపి వేయాలి.
  • పొలంగట్లపై పెద్ద చెట్లు లేకుండా చూసుకోవాలి.

అగ్గితెగులు

  • తెగులు సోకిన మొక్కలను పీకి వేసి పైపాటుగా సేంద్రియ ఎరువులు వాడుకోవాలి.
  • మజ్జిగ (1 లీటరు), పశువుల మూత్రం (1 లీటరు) 8 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
  • వరిలో వచ్చే చాలా రకాల తెగుళ్ళను మారేడు ఆకులు మరియు పశువుల మూత్రం మరియు 100 గ్రాముల సున్నం కలుపుకొని, దీనిని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారీ చేయాలి). 

పురుగు, తెగుళ్ళ వ్యాప్తి నివారణకు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు

  • వేసవి దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలి.
  • నిరోధకశక్తి గల రకాలను ఎంచుకోవాలి.
  • మంచి విత్తనాన్ని ఎంచుకోవాలి.
  • విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి.
  • పంట అవశేషాలు పూర్తిగా కలిసిపోయేలా దమ్ము చేసుకోవాలి.
  • నారు కొనలను త్రుంచి నాటుకోవాలి.
  • ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలిబాటలు తీసుకోవాలి.
  • లింగాకర్షక బుట్టలతో పురుగు ఉధృతి తెలుసుకోవాలి.
  • వరి దుబ్బులు నేలలో కలిసేలా లోతు దుక్కి చేసుకోవాలి.
  • పొలం గట్లపై బంతి, అలసందలు, నువ్వులు వంటి మొక్కలను పెంచి దోమ పరాన్న జీవులను రక్షించుకోవాలి.
  • ఒక పొలం నుండి వేరొక పొలానికి నీరు పెట్టడం ఆపివేయాలి.
  • పొలం గట్లపై పెద్ద చెట్లు లేకుండా చూసుకోవాలి.

డా. కిరణ్‌ కుమార్‌ రెడ్డి (పంట ఉత్పత్తి విభాగము), డా.ఎస్‌. లోకేష్‌ బాబు, శాస్త్రవేత్త (విస్తరణ విభాగం),  డా. విజయ్‌ కుమార్‌ నాయక్‌ (సస్య రక్షణ విభాగము), హరిసాదు, శాస్త్రవేత్త (మత్స్య విభాగం), డా. ఆర్‌. సుజాత, శాస్త్రవేత్త (గృహవిజ్ఞానం), డా. లలిత శివ జ్యోతి, ప్రోగ్రాం-కో ఆర్డినేటర్‌, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు. ఫోన్‌: 99485 42942

Read More

వరి పంటలో సహజ ఎరువుల యాజమాన్యం, రసాయనరహిత సమగ్ర సస్యరక్షణ పద్ధతులు

మన తెలుగు రాష్ట్రాలలో ఖరీఫ్‌లో పండించే పంటలలో వరి ప్రధాన పంట. వరిని ఖరీఫ్‌ పంటగా ఆంధ్రప్రదేశ్‌లో  12.5 లక్షల హెక్టార్లలో మరియు తెలంగాణలో 25.8 లక్షల హెక్టార్లలో  పండిస్తున్నారు. రసాయన సేద్యంతో నష్టపోయిన రైతులు అధిక శాతం ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లుతున్నారు గోఆధారిత సహజ ఎరువులు వాడుతూ ప్రకృతిలో లభ్యమయ్యే సహజ కషాయాలతో రైతులు భూసారాన్ని కాపాడుకుంటూ, చీడపీడల బెడద నుంచి ఉపశమనం పొందుతున్నారు. రాబోయే ఖరీఫ్‌లో  వరి పంటలో పాటించవలసిన సహజ ఎరువుల వినియోగం మరియు రసాయన రహిత సస్యరక్షణ పద్ధతులను గురించి తెలుసుకుందాం.

1) వరి పంట పండించే ముందర మే నెలలో భూసారాన్ని మరియు కర్బన శాతం పెంచే పచ్చిరొట్ట పేర్లను (అపరాలు, జనుము, జీలుగ, పిల్లిపెసర, గడ్డిజాతి పంటలను) వేసుకుని 40-75 రోజుల వ్యవధిలో కోసుకుని భూమిలో కలియదున్నటం ద్వారా లేదా తినడానికి పశువుల మేతగా వాడుకోవచ్చు.

2) వరిలో తక్కువ కాలపరిమితి, అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకుని ఖరీఫ్‌ లో వేసుకుంటే, రబీ వరి పంటకు తొందరగానే వెళ్ళవచ్చు. ఆలస్యమైనచో రబీలో అకాలవర్షాలు మరియు వడగండ్ల బెడద ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి రబీలో కూడా తక్కువ కాలపరిమతి రకాలు నవంబర్‌ లో వేసుకుని, తొందరగా పంట కోత తీయవచ్చు. ఈ పద్ధతిలో ప్రకృతి వైపరీత్యాలు తప్పించుకునే అవకాశం ఉంది.

3) బీజామృతంతో విత్తనశుద్ధి, నారుమడి శుద్ధి 5 లీటర్లు / 25-30 కిలోల విత్తనానికి, నారుమడికి వాడవచ్చు. ఈ పద్ధతి భూమిలో సూక్ష్మ జీవులను పెంచడంతో పాటు, విత్తనాలను, మొక్కలను చీడపీడల నుంచి కాపాడతాయి.

4) నీటిపారుదల క్రింద వరిని వరుసలలో విత్తే పద్ధతి, డ్రం సీడర్‌ పద్ధతిలో లేదా శ్రీ పద్ధతిలో వేసుకుంటే మంచిది. వర్షాధారంగా వేసే వరిలో నేరుగా వరుసలలో విత్తే పద్ధతిని (డైరెక్ట్‌ సీడింగ్‌) అనుసరించాలి. ఈ పద్ధతులలో భూమి అతి తక్కువగా కదుపబడుతుంది.

సహజ ఎరువుల యాజమాన్యం

1000-1500 కిలోల ఘన జీవామృతం కలిపిన పశువుల ఎరువు ఎకరానికి దుక్కిలో లేదా కరిగడిలో వేసుకోవాలి. అచ్చం ఘనజీవామృతాన్ని ఎకరానికి 400 కిలోలు రెండు సార్లుగా నాటిన 20 రోజులకీ, 40 రోజులకి వేసుకోవాలి. తరువాత ద్రవజీవామృతమును ఎకరానికి 800 లీటర్లు నాలుగు సార్లు నాటిన 30, 50,65 మరియు 80 రోజులకు సమభాగంగా చేసి (200 లీటర్లు ప్రతిసారి) భూమికి అందజేయాలి. పైపాటుగా 50 లీటర్ల ద్రవజీవామృతాన్ని 100 లీటర్ల నీటికి కలిపి నాలుగు సార్లు నాటిన 20, 35, 50 మరియు 65  రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి.

గోఆధారిత సహజ ఎరువులతో పాటు, అజోల్లా ఎకరానికి 10-15 కిలోలు నాటిన 7 రోజులకు వేసిన ఎడల నత్రజని స్థిరీకరణతో పాటు కలుపు నివారణ కూడా జరుగుతుంది, సేంద్రీయ ఆచ్ఛాదన (మల్చ్‌) వలె ఉపయోగపడుతుంది, నీటి అవసరాన్ని తగ్గించి భూమిలో కర్భన శాత వృద్ధికి తోడ్పడుతుంది.

పంట ఎదుగుదల మరియు పిలకల అభివృద్ధికి, పంచగవ్య ఎకరానికి నాలుగు లీటర్లు పిలక థలో, సప్తధాన్యాంకుర కషాయం 250 మి.లీ. 100 లీటర్ల నీటికి కలిపి గింజ పాలు పోసుకునే థలో పిచికారీ చేస్తే, గింజ నాణ్యత మరియు దిగుబడి పెరుగుతుంది.

సస్యరక్షణ పద్ధతులు (రసాయన రహిత)

వరి పంట నాటే సమయంలో మొక్కల కొనలు తుంచుకోవాలి. పొలంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ వెడల్పున తూర్పు – పడమర దిశగా కాలిబాటలు (అల్లీస్‌) ఏర్పాటు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. బంతి / కంది / మొక్కజొన్న / కూరగాయలతో పాటు. గ్లైరిసీడియా వంటి మొక్కలను గట్ల మీద మరియు కంచే పంటగా వేసుకోవాలి. పసుపు పచ్చ జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, పక్షి స్థావరాలు, లైట్‌ ట్రాప్స్‌ (దీపపు ఎరలు) అమర్చడం వంటి పద్ధతులను అనుసరించాలి. మురుగు నీరు నిలువకుండా చూసుకోవాలి. ఇతర పంటల అవశేషాలు ఉంటే తొలగించాలి.

వరి పంటను ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు పాటించవలసిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు

పురుగుల నివారణ:

కాండం తొలుచు పురుగు: నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచడం, ట్రైకోగ్రామా గుడ్ల పరాన్నజీవులను ఎకరానికి నాలుగు కార్డుల చొప్పున 25వ రోజునుండి ప్రతి 10 పదిరోజులకు ఒక్కసారి చొప్పున 5సార్లు వదలాలి.

ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను పెట్టాలి.  ముందు జాగ్రత్త చర్యగా ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేయాలి. పురుగు నివారణకు 5% వేప కషాయం (శ్రీఐచజూ) 5 లీటర్లు 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. పిలక థలో మరియు అంకురం థలో 3 లీటర్ల అగ్నాస్త్రంను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఆకుముడుత పురుగు: తాడుతో మొక్కలపై లాగడం ద్వారా ఆకు గూడులు, పురుగులు పడిపోతాయి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి.  5% వేప కషాయం లేదా నీమాస్త్రం పంట తొలిథలో ఎకరానికి 200 లీటర్లు పిచికారీ చేయాలి.

సుడిదోమ: పొలంలో కాలిబాటలు తప్పనిసరిగా తీయాలి. పసుపు పచ్చ మరియు తెల్లని  జిగురు అట్టలు, ఎకరానికి 20-25 చొప్పున అమర్చాలి. తూటికాడ కషాయం 5-6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి మొక్కల పాదుల దగ్గర పిచికారి చేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి.

ఉల్లికోడు: ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి. అగ్నాస్త్రం 5 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

తాటాకు తెగులు (హిస్పా): నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచి నాటుకోవాలి. తొలిథలో ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేయాలి. తరువాత థలో ఎకరానికి 6 లీటర్ల బ్రహ్మాస్త్రం 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

వరి ఆకు నల్లి: గట్ల మీద బంతి మొక్కలు నాటుకోవాలి. పంట మీద ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన ఐదు లీటర్ల కషాయం వంద లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

పచ్చదోమ: పసుపు మరియు తెల్లని  జిగురు అట్టలు, ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర) ను పెట్టాలి. ఎకరానికి 5 లీటర్ల వావిలాకు కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

కంపునల్లి (గంధీ బగ్‌): ఉదయం పూట ఎకరానికి 5% వేప కషాయం 5 లీటర్లు లేదా అగ్నాస్త్రంను  3 లీటర్లు చొప్పున 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ల నివారణ:

అగ్గి తెగులు: బీజామృతంతో విత్తనశుద్ధి చేయాలి. గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. మారేడు పత్రం మరియు తులసి ఆకుల కషాయాన్ని ఎకరానికి 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

పొడ తెగులు: పొలంలో నీరు తక్కువగా ఉంచాలి. ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన ఐదు లీటర్ల కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి లేదా పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి  ఎకరానికి పిచికారి చేయాలి.

బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు: ఎండిన అల్లం మరియు పాలతో కూడిన కషాయం 6 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి  ఎకరానికి పిచికారి చేయాలి. తరువాత ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

కాండం కుళ్ళు తెగులు: మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. బీజామృతంతో విత్తనశుద్ధి, నారుశుద్ధి చేయాలి. పైన వివరించిన విధంగా ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువలతో చేసిన కషాయాన్ని వాడి తెగులును నివారించవచ్చు.

టుంగ్రో వైరస్‌ తెగులు: గట్ల మీద కలుపు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎకరానికి ఒక లైట్‌ ట్రాప్‌ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి.  5% వేప కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

ఆకుమచ్చ తెగులు: పులిసిన మజ్జిగ 6 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

మానిపండు తెగులు: వరినాట్లు సకాలంలో వేసుకోవాలి. ఆవుపేడ, ఆవుమూత్రం మరియు ఇంగువతో చేసిన కషాయం 5 లీటర్లు 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.

పైన వివరించిన కొన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్‌లో భాగంగా రైతు సాధికార సంస్థ వారు రూపొందించిన ప్రణాళికలోని అంశాల నుంచి వారికి కృతజ్ఞతలతో సేకరించడమైనది. ఈ పద్ధతులు కొన్ని వ్యవసాయ పరిశోధన పరంగా ద్రువీకరించబడాలి. సేంద్రియ రైతులు స్వతహాగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నారు. రసాయన రహిత పద్ధతులు కావున పంటలకు నష్టం ఉండదు. నాణ్యత గల దిగుబడులు సాధించడానికి దోహదపడతాయి.   

డా. ఎస్‌.ఎమ్‌. విద్యాశేఖర్‌, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, ఫోన్‌: 98494 42221; డి.ఎల్‌.ఏ. గాయత్రి, ఎమ్‌. శ్రీనివాసరావు, వి.కే. సింగ్‌, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, హైదరాబాద్‌ మరియు రైతు సాధికార సంస్థ, వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో.

Read More

లార్జ్‌ స్కేల్‌ బ్యాగ్‌ ఫార్మింగ్‌ ద్వారా సేంద్రియ కూరగాయల సాగు

డా|| రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ఫౌండేషన్‌ కృషి విజ్ఞాన కేంద్రం తునికిలో లార్జ్‌ స్కేల్‌ బ్యాగ్‌ ఫార్మింగ్‌కు సంబంధించిన ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగానికి మూలం కెవికె, తునికి ఛైర్మన్‌ టి. వినోద్‌రావు మెదడులో ‘బ్యాగ్‌ ఫార్మింగ్‌’ ఆలోచనరావడం, ఆ ఆలోచనకు కార్యరూపం దాల్చడంలో సేంద్రియ సాగులో మంచి దిగుబడులు సాధించటానికి అవసరమైన సలహాలు అందించిన హార్ట్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఎం.ఎస్‌. సుబ్రమణ్యం రాజుతో పాటు  కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త యం. శ్రీనివాస్‌, కీటక శాస్త్రవేత్త పి. రవికుమార్‌, సేద్య విభాగ శాస్త్రవేత్త డా|| ఎన్‌. ప్రతాపరెడ్డి, వ్యవసాయ ఇంజనీరింగ్‌ శాస్త్రవేత్త యం. ఉదయ్‌ కుమార్‌ మరియు కెవికె కి సంబంధించిన అనేకమంది క్షేత్రస్థాయి సిబ్బంది సహాయ సహకారాలతో ఈ పరిశోధన నిర్వహించబడింది. పరిశోధనా పద్ధతులు, ఫలితాలు క్రింద వివరించబడ్డాయి.

తక్కువ నీటి వనరులు, మురుగు నీటి పారుదల సౌకర్యం లేని, క్షార మరియు రాతి నేలలు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా బ్యాగ్‌ ఫార్మింగ్‌ ద్వారా సేంద్రియ పద్ధతులను అనుసరించి సహచర పంటల యొక్క పెరుగుదల, దిగుబడి మరియు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఈ యొక్క ప్రదర్శన చేపట్టబడింది. ఇక్కడ బ్యాగ్స్‌ని ఎరువులతో నింపిన తర్వాత రెండు వేర్వేరు పద్ధతులలో అనగా నిలువు మరియు సమాంతర స్థానంలో నేలపై పెట్టడం జరుగుతుంది. టమాటా మరియు క్యారెట్‌లను నిలువు సంచులలో సహచర పంటలుగా మరియు క్యాబేజీ, టమాట మరియు క్యాలీఫ్లవర్‌లను సమాంతర సంచులలో సహచర పంటలుగా పండిస్తారు. ఒక నిలువు సంచి నుండి దిగుబడి 2.55 కిలోలు (టమాట మొక్క నుండి దిగుబడి 2.3 కిలోలు మరియు క్యారెట్‌ 0.25 కిలోలు). ఒక సమాంతర సంచి నుండి దిగుబడి 3.2 కిలోలు (టమాట మొక్క నుండి దిగుబడి 2.4 కిలోలు మరియు క్యాబేజి బరువు 500 గ్రా. మరియు క్యాలీఫ్లవర్‌ పువ్వు బరువు 300 గ్రా.). ఈ పద్ధతిలో క్యాబేజి పంటను టమాటతో కలిపి సహచర పంటగా పండించినపుడు డైమండ్‌ బ్యాక్‌ మాత్‌ పురుగు యొక్క ఉధృతి తక్కువగా ఉంటుందని గమనించబడింది. కానీ, కొన్ని రకాల చీడపీడలు మరియు వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా కాలీఫ్లవర్‌ దిగుబడి చాలా తక్కువగా నమోదైంది. అన్ని పంటల నుండి బ్యాగ్‌ పద్ధతిలో పొందిన మొత్తం దిగుబడి 0.25 ఎకరాల్లో 3.5 టన్నులు.

పరిచయం:

ప్లాస్టిక్‌ సంచులు లేదా గ్రో బ్యాగ్స్‌ ఉపయోగించి టెర్రస్‌ లేదా రూఫ్‌ టాప్‌ గార్డెన్‌లలో కూరగాయలు, పండ్లు మరియు పువ్వులను పెంచడం బాగా ప్రాచుర్యం పొందింది. కానీ ప్రస్తుతం, బ్యాగుల ద్వారా కూరగాయల సాగు జనాదరణ పొందుతుంది. ఎందుకంటే అవి సారం లేని లేదా కూరగాయల పంటలు పండించడానికి అనువుగా లేని నేలల నుండి ఉత్పన్నమయ్యే అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాయి. ప్రతి బ్యాగ్‌ని 50% ఎర్రమట్టి, 50% మాగిన పశువుల పేడని మరియు 100 గ్రా.ల వేపపిండితో నింపడం వల్ల అధిక దిగుబడులకు ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఎరువుల మిశ్రమం వదులుగా వుండటం వల్ల మురుగునీటి సౌకర్యం ఉండి, తగినంత గాలి వేరువ్యవస్థకు అందడం వల్ల మొక్క దృఢంగా పెరగడానికి తోడ్పడుతుంది. బ్యాగ్‌ల మన్నిక ప్రధాన లోపం, ఎందుకంటే అవి కేవలం రెండు సీజన్‌లను మాత్రమే తట్టుకోగలవు. మార్కెట్‌లో లభించే అన్ని గ్రోబ్యాగ్‌లు పర్యావరణ అనుకూలమైనవి కావు. ఎందుకంటే అవన్నీ బయో డిగ్రేడబుల్‌ కావు. పాలీప్లాస్టిక్‌తో చాలా గ్రో బ్యాగ్‌లు ఏర్పడుతాయి, కానీ అవి విచ్ఛిన్నం కావు. అప్పుడు గ్రోబ్యాగ్‌లను విసర్జించాల్సిన అవసరం వచ్చినపుడు అవి ఆందోళన కలిగిస్తాయి.

2022 రబీ సీజన్‌లో తెలంగాణ రాష్ట్రంలోని, తునికి, మెదక్‌ (జిల్లా) కృషి విజ్ఞాన్‌ కేంద్రం వ్యవసాయ క్షేత్రంలో 0.25 ఎకరాల విస్తీర్ణంలో బ్యాగ్‌ ఫార్మింగ్‌ పై ప్రదర్శన నిర్వహించబడింది. ఈ పద్ధతిలో వివిధరకాల కూరగాయలను ఉదాహరణకు టమాట మొక్కలను క్యారెట్‌ మొక్కలతో కలిపి నిలువు బ్యాగులలో పండించారు. ఆ బ్యాగులలో 15 కిలోల ఎర్రమట్టి, 15 కిలోల మాగిన పశువుల ఎరువు మరియు 100 గ్రా. వేపపిండి మిశ్రమాన్ని వేసారు. అదేవిధంగా టమాట, క్యాబేజి మరియు క్యాలీఫ్లవర్‌ మొక్కలను బ్యాగులలో అడ్డం వరుసలలో పెట్టి ఒక్కొక్క బ్యాగులో 25 కిలోల ఎర్రమట్టి మరియు 25 కిలోల మాగిన పశువుల ఎరువు నింపి సమాంతర స్థానంలో పెట్టి పండించారు.

ప్రదర్శన యొక్క హేతుబద్ధత:

తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలలోని నేలలు కూరగాయల సాగుకు అనుకూలమైనవి కావు. వాతావరణ మార్పుల కారణంగా అతి తక్కువ సమయంలో కురిసిన భారీ వర్షాలు చాలా వరకు కూరగాయల పంటలను పూర్తిగా నాశనం చేయడం వల్ల తీవ్రమైన కొరత మరియు ధరలు అందుబాటులో ఉండవు. ఈ వాతావరణ మార్పు వాస్తవికతో బ్యాగ్‌ ఫార్మింగ్‌ అనేది అనుకూలమైన పద్ధతి. కూరగాయల పెంపకంలో కలుపు తీయడం చాలా ఖరీదైనది. ఎందుకంటే హైదరాబాద్‌ చుట్టుప్రక్కల ప్రాంతాలలో మహిళా కూలీలకు భారీ సంఖ్యలో డిమాండ్‌ ఉంది. బ్యాగ్‌ ఫార్మింగ్‌లో ఈ సమస్య పరిష్కరించబడుతుంది. కూరగాయ పంటలలో తరచుగా ఎక్కువసార్లు కోత కోయాల్సి ఉంటుంది. అది కూడా బ్యాగ్‌ ఫార్మింగ్‌లో సులభతరంగా ఉంటుంది. డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో బ్యాగ్‌ ఫార్మింగ్‌లో చాలా తక్కువ నీటి వినియోగం ఉంటుంది. ఎందుకంటే సీపేజ్‌ మరియు బాష్పీభవన నష్టాలు గణనీయంగా చాలా తక్కువగా ఉంటాయి. హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉన్న రైతులు బ్యాగ్‌ ఫార్మింగ్‌ను అవలంబించడం ద్వారా లాజిస్టిక్స్‌లో భారీ పొదుపుతో నగరంలోని వినియోగదారులకు అధిక నాణ్యత మరియు సరసమైన ధరలలో కూరగాయలను సరఫరా చేయవచ్చు. భవిష్యత్తులో రైతులు నేలను దున్నకుండా సేంద్రియ పద్ధతిలో బ్యాగ్‌ ఫార్మింగ్‌ చేయడం వల్ల, రసాయనిక ఎరువులు మరియు క్రిమిసంహారక మందులను వాడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల నేలలో కార్బన్‌ను సమర్ధవంతంగా సంగ్రహించడం మరియు నిలుపుకోవడం వల్ల కార్బన్‌ క్రెడిట్స్‌ ప్రోత్సాహకాన్ని పొందవచ్చు. బ్యాగ్‌ ఫార్మింగ్‌ ద్వారా కూరగాయల పంటకోత నంతరం నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. కాబట్టి, పై వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ రాష్ట్రంలోని కృషి విజ్ఞాన కేంద్రం, తునికి, కౌడిపల్లి (మండలం), మెదక్‌ జిల్లాలో ఈ క్రింది లక్ష్యాలతో మొక్కల పెరుగుదల, దిగుబడి, ఆదాయం మరియు నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళ యొక్క ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ప్రదర్శన చేయబడింది.

లక్ష్యాలు:

1. కూరగాయల సాగుకు అనువుగా లేనటువంటి రాతి నేలలను, మురుగునీటి పారుదల సౌకర్యం లేని నేలలు, క్షారనేలలు, సారవంతం లేని నేలలు మరియు తక్కువ నీటి వనరులు ఉన్న నేలలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం.

2. అధిక దిగుబడి మరియు నికర ఆదాయాన్ని ఉత్పత్తి చేయడం

3. నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళను నియంత్రించడానికి.

4. కాలానుగుణంగా మరియు ప్రతికూల కాలానుగుణ పరిస్థితులలో వివిధ పంటలలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రామాణీకరించడం.

అవసరమైన పదార్థాలు లేదా వస్తువులు:

ప్లాస్టిక్‌ సంచులు

  • పొలంలో మొత్తం 1318 సంచులు పెట్టడం జరిగింది. ఇందులో 945 సంచులు నిలువుగా, 373 సంచులను అడ్డంగా ఉంచారు.

సేంద్రియ ఎరువులు:

  • నిలువుగా ఉంచిన సంచులలో 30 కిలోల మీడియా (15 కిలోల ఎర్రమట్టి, 15 కిలోల మాగిన పశువుల ఎరువు మరియు 100 గ్రా. వేపపిండి) మరియు అడ్డంగా ఉంచిన సంచులలో 50 కిలోల మిశ్రమం (25 కిలోల ఎర్రమట్టి, 25 కిలోల మాగిన పశువుల ఎరువుల పేడ మరియు 100-200 గ్రా. వేపపిండితో) నింపుతారు.

విత్తనాలు లేదా నారు:

a. టొమాట – 945 మొక్కలు (ఒక సంచిలో 1 మొక్క)

b. క్యారెట్‌ – 200 గ్రా

c. క్యాబేజీ – 373 మొలకలు (ఒక సంచిలో 1 మొక్క)

d. కాలీఫ్లవర్‌ – 373 మొక్కలు (ఒక సంచిలో 1 మొక్క)

నాటే దూరం:

a. నిలువ సంచులు: వరుసల మధ్య దూరం 2 అడుగులు మరియు వరుసలోని సంచుల మధ్య దూరం 2 అడుగులు.

b. అడ్డం సంచులు: వరుసల మధ్య 3 అడుగులు మరియు వరుసలోని సంచుల మధ్య 2 అడుగులు.

బిందు సేద్యం: డ్రిప్‌ పైపులను బ్యాగులపై అమర్చి, బిందుసేద్యం పద్ధతిలో ఇరిగేషన్‌ ఇవ్వడం జరుగుతుంది.

ఊతం ఇవ్వడం (స్టేకింగ్‌): టమాట పంటకు ఊతం ఇవ్వడానికి వెదురుకర్రలు, స్త్ర| తీగను మరియు జనపనార తాడుని ఉపయోగించారు.

ఎరువుల మిశ్రమం తయారీ విధానం:

  • ఎర్రమట్టి, మాగిన పశువుల ఎరువును అవసరమైన పరిమాణంలో సేకరించి అ్పుఔ సహాయంతో బాగా కలపబడుతుంది.
  • సరిగ్గా కలుపబడిన మిశ్రమాన్ని అవసరమైన పరిమాణంలో బ్యాగులలో నింపబడుతుంది. తరువాత, పొలంలో అంతరం ప్రకారం సంచులను ఉంచుతారు. ఆ తర్వాత, బ్యాగులపై డ్రిప్‌ లైన్‌ వేయబడుతుంది. మరియు ప్రతి బ్యాగు వద్ద నీరందించడానికి డ్రిప్పర్‌ను అమర్చుతారు.

ఫలితాలు మరియు చర్చ:

గత కొన్ని సంవత్సరాల నుంచి పంటల సాగులో విచక్షణా రహితంగా రసాయనిక ఎరువులు మరియు పురుగు మందులు ఉపయోగించడం వలన నేలలు ఉత్పాదకతను కోల్పోయాయి. దానికి తోడు అనవసరంగా పొలాన్ని ఎక్కువగా దున్నడము, సేంద్రియ ఎరువులు సక్రమంగా ఉపయోగించకపోవడం, ఏక పంట విధానం, వ్యవసాయ వ్యర్థాలను సక్రమంగా వినియోగించలేకపోవడం లాంటి వివిధ రకాల కారణాల వలన నేలపై మట్టి కొట్టుకుపోవటం, నేలలో సేంద్రియ పదార్థం తగ్గటము, పోషకాలను వినియోగించుకొనే సామర్థ్యం తగ్గడం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ రకమైన పేలవమైన క్షార మరియు కంకర నేలలలో బ్యాగ్‌ ఫార్మింగ్‌ అనుసరించడం ద్వారా మంచి దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. సేంద్రియ పద్ధతిలో దిగుబడి మరియు నికర ఆదాయాన్ని అంచనా వేయడానికి 2022 రబీ సీజన్‌లో 0.25 ఎకరాల్లో ప్రదర్శన చేపట్టారు. ఈ పద్ధతిలో 20.11.2022న 1318 సంచులలో 945 సంచులులో (నిలువు స్థానం) టమాటా మొక్కలను నాటారు మరియు అదే సంచులలో 23.11.2022న క్యారెట్‌ విత్తనాలు (సుమారు 12 నుండి 15 మొక్కల కోసం) విత్తారు. మిగిలిన 373 సంచులలో (సమాంతర పద్ధతి), ప్రతి సంచిలో టమాటా, క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్‌లను ఒక్కో మొక్కను నాటారు.

ఎ. పోషకాల నిర్వహణ: మొదట్లో పంటకు అవసరమైన పోషకాల అవసరాలను తీర్చడానికి, ఎర్రమట్టి, మాగిన పశువుల పేడ మరియు వేపపిండి నుండి సరఫరా అయ్యే పోషకాలు సరిపోతాయి. పంట ఎదుగుదలకు తర్వాత థల్లో లీటరు నీటికి 20 మి.లీ. పంచగవ్య, 100 లీ. నీటికి కిడ్నీ బీన్‌ డికాషన్‌ 1 కిలో, కొబ్బరి నీరు 10 మి.లీ. లీటరు నీటికి, 5 మి.లీ. హ్యూమిక్‌ ఆసిడ్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయడం మరియు జీవామృతం (1:1 నిష్పత్తిలో), వేస్ట్‌డికంపోజర్‌ (1:1 నిష్పత్తిలో) కలిపి మొక్కల మొదట్లో పోయడం ద్వారా పోషకాల డిమాండ్‌ను తీర్చారు.

బి. మొక్కల పెరుగుదల మరియు దిగుబడులు

ప్రతి మొక్క సరాసరి 7 నుంచి 8 ప్రక్క కొమ్మలను ఉ్పత్తి చేస్తుంది మరియు ఫలదీకరణ శాతం 66%. మొత్తం పంట వ్యవధిలో ప్రతి మొక్క నుండి ఉత్పత్తి అయిన పండ్ల సగటు సంఖ్య 35 మరియు ప్రారంభంలో పండించిన 15 పండ్లు సగటు బరువు 90 గ్రా. మరియు తరువాత పండించిన పండ్ల సగటు బరువు 50 నుండి 55 గ్రా. ఒక మొక్క సగటు దిగుబడి 2.35 కిలోలు మరియు 1318 టమాట మొక్కల నుండి మొత్తం దిగుబడి 150 రోజుల వ్యవధిలో 3.06 టన్నులు. ఈ దిగుబడిని ఒక ఎకరం (8000 మొక్కల)కు లెక్కించినట్లయితే, అప్పుడు ఆశించిన దిగుబడి దాదాపు 24 టన్నులు. సేంద్రియ పద్ధతిలో ఈ దిగుబడి రసాయన పద్ధతి (15 నుండి 16 టన్నులు ఎకరాకు)లో సగటు దిగుబడి కంటే ఎక్కువ.

క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్‌ పంటలలో డైమండ్‌బ్యాక్‌ మాత్‌ మరియు రసంపీల్చే చీడపీడల ఉధృతి కారణంగా అత్యధికంగా పరుగుమందులను వినియోగించే పంటల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి. సేంద్రియ పద్ధతిలో క్యాబేజీ పంటను పండించడం చాలా సవాలుతో కూడుకున్నది. కానీ, క్యాబేజీ పంట నుండి వివిధ సేంద్రియ పద్ధతులను అనుసరించి మొదటి గ్రేడ్‌ పంట 63% మరియు రెండవ గ్రేడ్‌ పంట 12% పొందడం జరిగింది. అదేవిధంగా క్యాబేజీని టమాట పంటతో కలిపి పండించినపుడు డైమండ్‌బ్యాక్‌మాత్‌ ఉధృతి తక్కువగా ఉందని గమనించడం జరిగింది. మిగిలిన 25% మొక్కల పెరుగుదల చిన్నదిగా ఉండి, క్యాబేజీ పరిమాణం కూడా చిన్నగా వుండి ఆకారం కోల్పోయింది. క్యాలీఫ్లవర్‌ పంట నుండి నాణ్యమైన దిగుబడి చాలా తక్కువగా వచ్చింది. దీని నుండి, మొదటి గ్రేడ్‌ పువ్వులు 30%, రెండవ గ్రేడ్‌ పువ్వులు 20.37% మరియు 49.5% పువ్వులు మార్కెట్‌కు పనికిరావు. ఈ యొక్క నాసిరకం దిగుబడికి ప్రధాన కారణం వదులుగా వుండే పువ్వులు ఏర్పడటం, పువ్వులు అధిక ఎండకు గురి కాకుండా ఆకులతో కప్పి వేసినా కూడా గులాబి రంగు పువ్వులు, చిన్న పువ్వులు మరియు పొగాకు లద్దె పురుగు ఉధృతి. 373 బ్యాగ్‌ల నుండి క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్‌ దిగుబడి వరుసగా 148 కిలోలు మరియు 56.4 కిలోలు.

క్యారెట్‌ విత్తనాలను 945 సంచులలో టమాట పంటకు తోడుగా విత్తినారు. 10-12 క్యారెట్‌ మొక్కలు పెరగడానికి అనుమతించిన సంచుల నుండి 500 నుండి 600 గ్రా.ల దిగుబడి మరియు 15 కంటే ఎక్కువ మొక్కలు పెరగడానికి అనుమతించిన సంచులలో క్యారెట్‌ వేర్లు అభివృద్ధి సరిగ్గా లేక ఒక్క సంచికి 180-200 గ్రా. దిగుబడి మాత్రమే వచ్చింది. అంతేకాకుండా, సంచులు దెబ్బతినడం వల్ల కొన్ని వేర్లు సూర్యరశ్మికి గురవుతాయి. మరియు ఆవేర్లు సరిగ్గా అభివృద్ధి చెందాక తక్కువ దిగుబడికి దారి తీస్తుంది. 945 బ్యాగుల నుండి మొత్తం నమోదు చేయబడిన క్యారెట్‌ దిగుబడి 236.25 కిలోలు.

సస్యరక్షణ:

పంట ఎదుగుదల సమయంలో వివిధ తెగుళ్లు మరియు వ్యాధులు గమనించబడ్డాయి. టమాట హైబ్రిడ్‌ ఆర్కాఅభేద్‌ ప్రారంభథలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు లక్షణాలు కనిపించలేదు. నాటిన 60-70 రోజులలో ఈ తెగులు లక్షణాలు గమనించబడింది. కానీ ఈ యొక్క తెగులుని 10 నుండి 15 రోజుల వ్యవధిలో క్రమం తప్పకుండా ఒక లీటరు నీటికి 5 మి.లీ. సూడోమోనాస్‌ ఫ్లోర్‌సెన్స్‌, 30 మి.లీ. పులియబెట్టిన మజ్జిగ కలిపి పిచికారి చేయడం ద్వారా నియంత్రణలో ఉంది. నాటిన 100 నుంచి 105 రోజులకు ఈ యొక్క తెగులు తీవ్రత మళ్ళీ పెరిగింది. ఈ సమయంలో, బాసిల్లాస్‌ సబ్బిలిన్‌ 1 గ్రా. లీటరు నీటికి 4 నుండి 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయడం వలన ఈ తెగులును సమర్ధవంతంగా నియంత్రించవచ్చు.

చీడపీడలలో ముఖ్యంగా గుండుసూది పురుగు యొక్క ఉధృతి శనగపచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగు కంటే ఎక్కువగా ఉంది. గుండుసూది పురుగు, శనగపచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగుల వల్ల వచ్చిన సగటు దిగుబడి నష్టం వరుసగా 3%, 2% మరియు 1% నాటిన వెంటనే లింగాకర్షక బుట్టలు మరియు దీపపు ఎరలను అమర్చడం ద్వారా ఈ కాయ తొలుచు పురుగులను సమర్ధవంతంగా నియంత్రించవచ్చు. నాటిన 60 రోజుల తర్వాత 10 నుంచి 15 రోజుల విరామంతో నాలుగు సార్లు లీటరు నీటికి సీతాఫలం+వేసనూనె 5 మి.లీ. చొప్పున, అదేవిధంగా బాసిల్లస్‌ థురింజెన్సిస్‌ 2 మి.లీ. మరియు బవేరియా బస్సియానా లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారి చేయడం ద్వారా నియంత్రించవచ్చు.

రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గిగంచడానికి, పది పసుపు మరియు పది నీలి రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా సీతాఫలం+వేపనూనె లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున కలిపి క్రమం తప్పకుండా పిచికారి చేయడం వల్ల ఉధృతి తగ్గింది. టమాటలో పండించిన క్యారెట్‌లో ఎలాంటి చీడపీడలు కన్పించలేదు. కానీ ముఖ్యంగా మార్చి నెలలో అధిక ఉష్ణోగ్రత కారణంగా క్యారెట్‌లో పగుళ్ళు కన్పించాయి. టమాట, క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్‌ పంటలను 373 సంచులలో పండించారు. ఈ 373 క్యాబేజీ మొక్కల నుండి 63% మొదటి గ్రేడ్‌ నాణ్యమైన క్యాబేజీ పండించబడింది. రెండవ గ్రేడ్‌లో 12% అంటే డైమండ్‌ బ్యాక్‌ మాత్‌తో కొద్దిగా సోకినవి మరియు మిగిలిన 25% మొక్కలు చిన్నగా మరియు ఆకారం కోల్పోయిన క్యాబేజీలను ఉత్పత్తి చేసినవి. టమాట పంటతో కలిపి క్యాబేజీ సాగు చేస్తున్నప్పుడు డైమండ్‌బ్యాక్‌ మాత్‌ ఉధృతి తక్కువగా ఉంది. అన్ని పంటలకు ఇదే రకమైన సస్యరక్షణ చర్యలు అనుసరించబడ్డాయి.

ఆయా పంటలకు అనువైన ఉష్ణోగ్రత:

ఎ. టొమాట  : 15-32 డిగ్రీల సెంటీగ్రేడ్‌

బి. క్యాబేజీ : చల్లని మరియు తేమతో కూడిన వాతావరణం అవసరం మరియు పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే మించకూడదు

సి. కాలీఫ్లవర్‌ : చల్లని మరియు తేమతో కూడిన వాతావరణం అవసరం మరియు పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే మించకూడదు

డి. క్యారెట్‌ : 18 – 24 డిగ్రీల సెంటీగ్రేడ్‌

ముగింపు

ఈ ప్రస్తుత ప్రదర్శన నుండి, టమోటా పంట దిగుబడి, పరిమాణం మరియు నాణ్యత సాంప్రదాయ పద్ధతి కంటే బ్యాగ్‌ ఫార్మింగ్‌లో మెరుగ్గా ఉంది. అదేవిధంగా టమాట మరియు క్యారెట్‌, టమాట, క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్‌ వంటి సహచర పంటల నుండి మంచి దిగుబడులు పొందవచ్చని నిర్ధారించబడింది. కానీ క్యాలీఫ్లవర్‌ పంట కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా నాణ్యత లేని పువ్వులను ఉత్పత్తి చేసాయి. బ్యాగ్‌ ఫార్మింగ్‌లో నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు లక్షణాలు కనబడలేదు. ఎందుకంటే సంచుల నుండి అదనపు నీరు బయటకు పోతుంది. బ్యాగుల నుండి నీటి ఆవిరి రేటు సాంప్రదాయ పద్ధతికంటే తక్కువగా ఉన్నందున దీనికి తక్కువ నీరు అవసరం.

తద్వారా కూరగాయ పంటలను పండించడానికి ప్రతికూల పరిస్థితులు ఉన్న నేలలలో కూడా బ్యాగ్‌ ఫార్మింగ్‌ ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. రైతులు ఈ పద్ధతిలో చీడపీడలను మరియు కలుపు సమస్యను అరికట్టవచ్చు. బహుళ పంటలను పండించటం వల్ల ఏకపంట కంటే మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చు.

యం. శ్రీనివాస్‌, శాస్త్రవేత్త (హార్టికల్చర్‌), డా. సాంబాది దత్తాత్రేయ నల్కర్‌, సీనియర్‌ సైంటిస్ట్‌ అండ్‌ హెడ్‌, పి. రవి కుమార్‌ శాస్త్రవేత్త, (కీటక విభాగం), డా. ఎన్‌. ప్రతాప్‌ రెడ్డి,  శాస్త్రవేత్త (సేద్య విభాగం),  యం. ఉదయ్‌ కుమార్‌, శాస్త్రవేత్త (వ్యవసాయ ఇంజనీరింగ్‌), డాక్టర్‌ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ఫౌండేషన్‌ కృషి విజ్ఞాన కేంద్రం, తునికి, మెదక్‌ (జిల్లా), తెలంగాణ-502 316, ఇ-మెయిల్‌: kvkmedak2@gmail.com

Read More

సేంద్రియ సాగే శరణ్యం

‘రైతునేస్తం’ శిక్షణలో వ్యవసాయ శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు  డా|| కె. రామచంద్రం

హరితవిప్లవం పేరుతో అప్పటి పరిస్థితులకు అనుకూలంగా వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో ఉన్న వ్యవసాయ పద్ధతులు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార పదార్థాలను అందించలేక పోవడంవల్ల ప్రజలు ఆకలితో అలమటించ వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ విపత్కర పరిస్థితుల నుండి బయట పడడానికి వ్యవసాయంలో రసాయనాలు, అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశ పెట్టి ప్రజల ఆకలిని తీర్చగలిగారు. కాని వివిధ రకాల కారణాల వలన రైతులు విచక్షణా రహితంగా రసాయనాలు వాడడానికి అలవాటు పడడం వలన పెట్టుబడులు పెరిగి పంటల సాగు గిట్టుబాటు కాకపోవడంతో పాటు విచక్షణా రహిత రసాయనాల వాడకం వలన నేల, నీరు, గాలి, వాతావరణం కలుషితమై ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం సేంద్రియ సాగే అని జులై 9న నాబార్డు సహకారంతో ‘రైతునేస్తం’ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వికారాబాదు జిల్లా కొత్తగడి గ్రామంలో మోహన్‌ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ సాగు, పంట ఉత్పత్తులకు విలువ జోడిరపుపై జరిగిన అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు కె. రామచంద్రం అన్నారు. కార్యక్రమంలో సేంద్రియ రైతులు నారాయణ, మనోహరాచారి, మోహన్‌రెడ్డిలతో పాటు ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ మేనేజరు ప్రసాదరావు పాల్గొన్నారు.

సేంద్రియ సాగు ఆవశ్యకత, సేంద్రియ సాగులో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాల తయారీ విధానం, వాటి ఉపయోగాలను మనోహరాచారి వివరించారు.  కంది సాగు, కందిలో అంతర పంటల విధానం, కందులకు విలువ జోడిరచి కందిపప్పుగా అమ్మి తన సేంద్రియ సాగును లాభాల బాటలో నడిపిస్తున్న నారాయణ తన అనుభవాన్ని వివరించారు.  దొండ, బొప్పాయి పంటల సాగు పద్థతులను క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా చూపిస్తూ రైతు మోహన్‌ రెడ్డి వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపునకు సంబంధించిన సమాచారాన్ని, యంత్ర పరికరాల వివరాలను  రైతునేస్తం ఫౌండేషన్‌ మేనేజరు ప్రసాదరావు వివరించారు. అనంతరం  శిక్షణకు హాజరైన రైతులకు సర్టిఫికెట్లను అందజేశారు.

Read More

బియ్యం ఎగుమతుల నిషేధం సమర్ధనీయమా?

జులై 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం నాన్‌-బాస్మతీ బియ్యం ఎగుమతుల్ని తక్షణం నిషేధించింది. గత సంవత్సరం ముందు గోధుమ ఎగుమతుల్ని నిషేధించింది. ఆ తర్వాత గోధుమ పిండి ఎగుమతుల్ని కూడా నిషేధించింది. బియ్యం నూకల ఎగుమతిని కూడా ఆపేసింది. నాన్‌-బాస్మతీ బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. పంచదార ఎగుమతులకు 6.1 మిలియన్ల టన్నుల పరిమితి నిర్ధేశించింది. ఆ మేరకు ఎగుమతులు పూర్తవడంతో పంచదార ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. తాజాగా నాన్‌-బాస్మతీ బియ్యం ఎగుమతిని కూడా పూర్తిగా నిలిపివేసింది. ఈ చర్యలన్నిటివల్ల దేశంలో రైతులు కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారు. వారికి గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఏర్పడినప్పుడల్లా కేంద్రప్రభుత్వం నిరంకుశ చర్యలతో విరుచుకుపడుతున్నది. పంటలు బాగా పండినప్పుడు వాటికి సేకరణ మద్దతుని అందించకుండా రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నది. గిరాకీ ఉండి ఎగుమతి అవకాశాలున్నప్పుడు వారికి గిట్టుబాటు ధరలు లేకుండా చేస్తున్నది. 

2020 నవంబరు నుండి 2021 నవంబరు వరకు ఉత్తర రాష్ట్రాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనీ, కార్పొరేట్‌ శక్తుల ఆధిపత్యాన్ని పెంచే మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక ఆందోళన నిర్వహించారు. ఆ ఆందోళనలను ఉక్కు పాదంతో అణిచివేయాలని ప్రయత్నించి, ప్రభుత్వం విఫలమైంది. చివరకు వారికి క్షమాపణ చెప్పి, కనీస మద్దతు ధరలకు చట్టభద్రత కల్పించటానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కాని ఎన్నికల గండం గట్టెక్కిన తర్వాత ‘ఏరు దాటాక తెప్పతగిలేసిన’ చందంగా వాగ్దాన భంగం చేసింది. ఉద్యమ సమయంలో ఐక్యంగా ఉన్న రైతు సంఘాలు విరమించిన తర్వాత రాజకీయంగా విడిపోయాయి. మళ్ళీ ఉద్యమాలను చేపట్టలేకపోయాయి. గోధుమ ఎగుమతిని నిషేధించినప్పుడు దక్షిణ భారత రైతులు తమకేమీ నష్టం లేదని స్పందించరు. బియ్యం ఎగుమతుల్ని నిలిపివేస్తే ఉత్తర భారత రైతులు బాస్మతీ బియ్యం ఎగుమతిని నిషేధించలేదని ఊరట చెందుతున్నారు. రైతులు ఐక్యంగా లేక, కొద్దిపాటి ఐక్యతను రాజకీయ శక్తిగా మలచుకోలేక భంగపడుతున్నారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలున్నా, దేశంలో 84 శాతం మంది ప్రజల వాస్తవాదాయాలు పడిపోతున్నా పేదలు ఎదిరించే పరిస్థితుల్లో లేరు. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య వైరుధ్యాలను పెంచి, పోషిస్తూ పాలక వర్గాలు పబ్బం గడుపుకుంటున్నాయి. ఆరుగాలం శ్రమించే రైతులు, కూలీలు, కార్మికులు, అసంఘటిత రంగంపై జీవించే వారు పేదరికంలోకి జారిపోతుంటే పెట్టుబడిదార్లు, వ్యాపార వర్గాలు లాభాలు కొల్లగొడుతున్నారు. దేశంలో 145 మంది బిలియనీర్లున్నందుకు గర్విస్తూ, అంబానీ, అదానీలు ప్రపంచంలోఅత్యంత ధనికులుగా ఎగబ్రాకుతున్నందుకు చప్పట్లు చరుస్తూ, అలాంటి సంపద సృష్టి కర్తలను పూజిస్తూ దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం, పౌష్టికాహార లోపం సమస్యలే కాదన్నట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అత్యంత పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను విదిలిస్తూ, కటిక దరిద్రుల సంఖ్య తగ్గిందని సంతోషిస్తున్నాము. సాపేక్షిక పేదరికం, నైరాశ్యంలో ఉన్న రైతులు, గ్రామీణ, పట్టణ పేదలు, స్తంభించిన మధ్యతరగతి జీవన ప్రమాణాలు విధాన కర్తల దృష్టికి రావడం లేదు. కొందరి వద్ద పోగుబడుతున్న సంపద అశేష సంఖ్యలో ఉన్న పేదల జేబుల్లో నుండే వస్తుందనే కార్యకారణ సంబంధాల గురించి అవగాహన మేధావి వర్గాల్లో కూడా లోపించింది. సంపన్నుల పిడికిళ్ల నుండి జారే పెట్టుబడుల ద్వారానే పేదలు తమ ఆదాయాలను మెరుగుపరుచుకోవాలనే దృక్పథం పాలక వర్గాల్లో ఉంది.

బయటకు చెప్పే కారణాలు

దేశంలోని ప్రజలంతా వినిమయదారులే. ద్రవ్యోల్బణం వల్ల వాస్తవాదాయాలు ప్రభావితం అవుతున్నాయి. రెండేళ్ల పాటు కోవిడ్‌-19 కారణంగానూ, ఒక సంవత్సరంన్నరగా రష్యా-యుక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సమస్యగా మారుతున్నది. వడ్డీ రేట్లు పెరగటం వల్ల కొంత శాంతించినా, ఇంకా సమసిపోలేదు. ద్రవ్యోల్బణంలో మూడు విభాగాలున్నాయి. ఒకటి ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల వల్ల ఏర్పడేది. రెండవది మౌలిక ద్రవ్యోల్బణం. దీనిని ఇంగ్లీషులో ‘కోర్‌ ఇన్‌ఫ్లేషన్‌’ అని వ్యవహరిస్తారు. మూడవది ఆహార ద్రవ్యోల్బణం. వాతావరణంలో వస్తున్న మార్పులు, అతివృష్టి, అనావృష్టి, చీడ, పీడల వల్ల ఆకస్మికంగా కలిగే పరిణామాల వల్ల వ్యవసాయ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులేర్పడుతున్నాయి. పంటలు నష్టపోయినప్పుడు, మిగిలిన కొద్ది పంటకు మంచి ధరలు లభిస్తాయి. పంటలు బాగా పండినప్పుడు ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోకుండా, పెరిగినప్పుడు అంకుశం విధిస్తే అన్యాయమే అవుతుంది. యుద్ధ ప్రభావం వల్ల ముడిచమురు ధరలు బారెల్‌కి వంద డాలర్లకు పెరిగి, తర్వాత 80 డాలర్లకు తగ్గింది. చమురు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం పెట్రోల్‌, డీజెల్‌ ధరల్ని పెంచింది. కాని అవి తగ్గినప్పుడు వినిమయదారులకు అదే దామాషాలో ఉపశమనాన్ని కల్గించలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో పోటీ సరిగ్గా ఉంటే మౌలిక ద్రవ్యోల్బణం తగ్గుతుంది. కాని గుత్తాధిపత్యం వల్ల కంపెనీల ఉత్పత్తుల ధరలు పెరిగి, లాభాలొస్తాయి. కాని మౌలిక ద్రవ్యోల్బణం అదుపులోకి రాదు. సాంకేతిక ప్రగతి, డిజిటల్‌ విప్లవాల వల్ల ద్రవ్యోల్బణం తగ్గాలి. కాని గుత్త సంస్థలు సాంకేతిక ప్రగతిని తమ లాభాల్ని పెంచుకోవటానికే వాడతాయి. వ్యవసాయ రంగంలో కూడా కొంత సాంకేతిక ప్రగతి ఉన్నా వాతావరణ ప్రభావం ఉత్పత్తిని ఎక్కువగా శాసిస్తున్నది. పాలక వర్గాలు చమురు ధరలు తగ్గించకుండా, గుత్త సంస్థల్ని నియంత్రించకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలమౌతున్నాయి. కాని వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై మాత్రం ఉక్కుపాదాన్ని మోపుతున్నాయి. గత నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.8 శాతంగా నమోదైంది. ఒక సంవత్సర కాలంలో బియ్యం ధరలు 11 శాతం పెరిగాయి. ఒక నెలలో మూడు శాతం పెరిగాయి. ఉత్తర భారతంలో అధిక వర్షాలు, వింధ్య పర్వతాల క్రింద వర్షాభావం వల్ల ఉత్పత్తిని కొంత వరకు దెబ్బతీయవచ్చు. వీటిని సాకుగా చెప్పి బియ్యం ఎగుమతుల్ని నిషేధించారు.

కొరతలేని ఉత్పత్తి

800 కోట్ల ప్రపంచ జనాభాలో 300 కోట్ల మందికి వరి బియ్యమే ప్రధాన ఆహారం. అయితే బియ్యంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల మధమేహం వంటి అనేక దీర్ఘకాల వ్యాధులు ప్రబలుతున్నాయనే ప్రచారం వల్ల బియ్యం వాడకాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. బియ్యం ఉత్పత్తి, వినిమయాల మధ్య సమతూకం ఉంటున్నది. 2019-20లో ఉత్పత్తి 503.6 మిలియన్‌ టన్నులు కాగా వినిమయం 501.1 మిలియన్‌ టన్నులుగా ఉంది. 2020-21లో 518 మిలియన్‌ టన్నులు కాగా వినిమయం 509.9 మిలియన్‌ టన్నులుగా ఉంది. 2021-22లో ఉత్పత్తి 526 మిలియన్‌ టన్నులు కాగా, వినిమయం 522.7 మిలియన్‌ టన్నులుగా ఉంది. 2019-20లో 181.8 మిలియన్‌ టన్నుల బియ్యం నిల్వలుండగా 2021-22లో అవి 197 మిలియన్‌ టన్నులకు పెరిగాయి. 2022-23లో మాత్రం ఉత్పత్తి 517.6 మిలియన్‌ టన్నులు కాగా, వినిమయం 520.4 మిలియన్‌ టన్నులు కావటం వల్ల నిల్వలు 195.1 మిలియన్‌ టన్నులకు తగ్గాయి. 2023 జులైలో వెలువడ్డ అంచనాల ప్రకారం 2023-24లో ఉత్పత్తి 523.7 మిలియన్‌ టన్నులుండవచ్చనీ, వినిమయం 520 మిలియన్‌ టన్నులుండవచ్చనీ, నిల్వలు 198.5 మిలియన్‌ టన్నులకు పెరగవచ్చనీ తెలుస్తున్నది.

ఈ లెక్కలన్నీ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ వెలువరించినవే. ఈ గణాంకాలు ప్రపంచ స్థాయిలో నిల్వలు తగ్గలేదని తెలుస్తున్నది. ఇక భారత్‌లో కూడా బియ్యానికి ఎటువంటి కొరత లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 129.47 మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తయ్యాయి. వినిమయం 109 మిలియన్‌ టన్నులు కాగా, ఎగుమతులు 22 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. గత నాలుగేళ్ళుగా బియ్యం నిల్వలు పెరిగాయే కాని తగ్గలేదు. బియ్యం సేకరణను సకాలంలో చేపట్టకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుత్సాహపరుస్తున్నాయి. ‘వరి వేస్తే ఉరే’ నన్న నినాదంతో రైతుల్ని బెదిరించటం మన స్మృతి పథం నుండి చెరిగిపోలేదు. వరి సాగుని తగ్గించాలనీ, అనవసరంగా వరి బియ్యం నిల్వలను నిర్వహించాల్సి వస్తుందని ప్రభుత్వ ప్రతినిధులు సూత్రీకరించారు. వారే ఇప్పుడు వరి బియ్యానికి కొరత ఏర్పడనున్నదనీ, అందుకే ఎగుమతుల్ని నిషేధించామని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. ఈ కొరత ఊహాజనితమేనని ఎగుమతిదార్ల సంఘం చెప్పింది.

ఆహారధాన్యాల నిల్వకు ప్రాతిపదిక

2023 మే చివరి నాటికి దేశంలో గోధుమ నిల్వలు 33.12 మిలియన్‌ టన్నులు, బియ్యం నిల్వలు 31.14 మిలియన్‌ టన్నులున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 1వ తేదీకి 21.04 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాల నిల్వ ఉంటే చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌, మే మాసాల్లో గోధుమ, రబీ వరి బియ్యం సేకరణలో గోదాములన్నీ నిండిపోతాయి. జులై 1వ తేదీకి 41.12 మిలియన్‌ టన్నులు, అక్టోబరు 1వ తేదీకి 30.77 మిలియన్‌ టన్నులు, జనవరి 1వ తేదీకి 21.41 మిలియన్‌ టన్నులు ఆహారధాన్యాల నిల్వ ఉంటే చాలని ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలను ప్రకటించింది. జూన్‌ నుండి సెప్టెంబరు మాసాల మధ్య ప్రజాపంపిణీ వ్యవస్థకు 9.75 మిలియన్‌ టన్నుల బియ్యం, 7.5 మిలియన్‌ టన్నుల గోధుమ అవసరమని అంచనా వేసింది. పేదలకు ఉచితంగా అందించే ఆహారధాన్యాల పథకం కోసం 22.9 మిలియన్‌ టన్నుల బియ్యం, 10.2 మిలియన్‌ టన్నుల గోధుమలు సరిపోతాయి. ఇవి పోగా అక్టోబరు 1, 2023 నాటికి 10.3 మిలియన్‌ టన్నుల బియ్యం, 20.8 మిలియన్‌ టన్నుల గోధుమలు మిగిలి ఉంటాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 10.32 మిలియన్‌ టన్నుల బియ్యం, 20.52 మిలియన్‌ టన్నుల గోధుమలు సరిపోతాయి. అక్టోబరు-డిసెంబరు నెలల మధ్య ఖరీఫ్‌ వరి బియ్యం గోదాములకు చేరతాయి. అక్టోబరు 1వ తేదీకి సరిపోనూ ఆహార నిల్వలుంటున్నప్పుడు ఇంకా కొరత గురించి ఆందోళన ఎందుకు? ఖరీఫ్‌ వరి దిగుబడుల గురించి అనుమానం, ఆందోళన వల్లనే ఎగుమతుల్ని నిషేధించడం సమర్ధనీయం కాదు. బాస్మతి బియ్యం, ఉప్పుడు బియ్యం ఎగుమతులను ఆంక్షల నుండి మినహాయించారు. ఇప్పటికే ఎగుమతుల కోసం మార్గమధ్యంలో ఉన్న బియ్యం కూడా అనుమతించబడుతుంది. ఇప్పటికే ఎగుమతి ఒప్పందాలు కుదుర్చుకున్న బియ్యం ఎగుమతిని కూడా అనుమతించటం అవసరం. అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది.

కోల్పోతున్న ఆదాయాలు

గత సంవత్సరం (2022) గోధుమలు, గోధుమ పిండి ఎగుమతుల్ని నిషేధించినప్పుడు గోధుమ ధరలు క్వింటాలుకి రూ. 2700/-నుండి 2200/-కి తగ్గాయి. ఫలితంగా గోధుమ రైతులు టన్నుకి రూ. 5000/-ల చొప్పున కనీసం 60 మిలియన్‌ టన్నులపై రూ. 30 వేల కోట్లు నష్టపోయారు. అలాగే నూకల ఎగుమతిని నిషేధించి, బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించటం వల్ల బియ్యం ధరలు క్వింటాలుకి వెయ్యి రూపాయలు తగ్గాయి. వరి సాగు చేసిన రైతులు 80 మిలియన్‌ టన్నుల బియ్యంపై 80 వేల కోట్ల వరకు నష్టపోయారు. ఎగుమతులపై నిషేధం, పన్నులు, సుంకాలు లేకుంటే వడ్లకు క్వింటాలుకి రూ. 2200 ధర లభించేది. కాని సేకరణ మద్దతు అందక, కనీస మద్దతు ధర కన్నా రెండు మూడు వందల రూపాయలకు తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. బస్తాకు 5 నుండి 10 కిలోలు అదనంగా తీసుకొని మిల్లర్లు లాభించారు. ఈ సంవత్సరం పూర్తి నిషేధం వల్ల వడ్లు, బియ్యం ధరలు ఇంకా తగ్గవచ్చు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లోనే ప్రభుత్వ విధానాల వల్ల వరి, గోధుమ రైతులు లక్ష కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచామని గొప్పలు చెప్పుకోవటానికీ, వినిమయదారులు, పెట్టుబడిదార్లకు లాభాలనివ్వటానికీ రైతుల ఆదాయాలను పణంగా పెట్టారు. 2022-23లో 22 మిలియన్‌ టన్నుల నాన్‌-బాస్మతీ బియ్యం ఎగుమతయింది. ఈ సంవత్సరం దానిని 15 మిలియన్‌ టన్నులకు తగ్గించేలా ఎగుమతి సుంకాన్ని కొంత పెంచితే సరిపోయేది. కాని పూర్తి నిషేధం బియ్యం ధరలను క్రుంగదీస్తుంది. వడ్లకు గిరాకీ తగ్గి, రైతులు నష్టపోవడం ఖాయం. కొంత దిగుబడి ప్రకృతివైపరీత్యాల వల్ల తగ్గితే, మిగిలిన పంటకు కనీస మద్దతు ధర కూడా లభించకుండా రైతులకు ఖర్చులు కూడా రావు. ప్రపంచ మార్కెట్లో 40 శాతం నాన్‌-బాస్మతీ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న భారతదేశపు ప్రతిష్ట దిగజారుతుంది. భారత్‌ను నమ్మకమైన వ్యాపార భాగస్వామిగా గుర్తించరు. 2021-22లో భారత్‌ నుండి 50 బిలియన్‌ డాలర్ల కన్నా ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. 2022 ఏప్రిల్‌ నుండి డిసెంబరు వరకు ఎగుమతుల విలువ సుమారు 39 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కేవలం 2.8 బిలియన్‌ డాలర్లే ఎక్కువ. దిగుమతుల విలువ కూడా 3.8 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. వ్యాపార మిగులు తగ్గింది. గోధుమ, బియ్యం ఎగుమతుల్లో ఏర్పడిన అవకాశాలను కోల్పోవటం జరిగింది. ఈ పంటల్ని సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వ విధానాల వల్ల ఆసక్తిని కోల్పోయి, ఉత్పత్తిని పెంచటంలో ఉత్సాహాన్ని చూపరు. ఎగుమతుల్ని అనుమతిస్తే రైతులు లాభించి మరింత ఎక్కువ పండిస్తారు. వినిమయదారులు, పెట్టుబడిదార్ల ప్రయోజనాల కోసం రైతుల్ని బలి చేయటం అవివేకమౌతుంది. కొరతలేకుండానే నిషేధం విధించి రైతులకు నష్టం కలిగించడం సమర్థనీయం కాదు.   

డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్‌ ఞ కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌)

ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More

డాక్టర్ గారితో అవసరం పడకుండా జీవించాలి

మనిషి జీవించాలి అంటే గాలి, నీరు, ఆహారం తప్పనిసరి. గాలి లేకుంటే కొన్ని నిమిషాలలో, నీరు లేకుంటే కొన్ని రోజులలో, ఆహారం లేకుంటే కొన్ని వారాలలో మనిషి జీవితం ముగుస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇవి మూడూ కూడా మనిషి జీవించాలి అంటే అత్యవసరాలు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాని ప్రస్తుత పరిస్థితులలో మనిషి జీవించాలి అంటే ఈ మూడు కాకుండా ఇంకొకరి అవసరం తప్పనిసరి అని ప్రస్తుత సమాజాన్ని చూస్తే అర్థం అవుతుంది. అతనే డాక్టర్‌/వైద్యుడు. అంటే ప్రస్తుత సమాజంలో ఆరోగ్యంగా జీవించాలి అంటే డాక్టర్‌ అవసరం తప్పనిసరి అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టే మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే గాలి, నీరు, ఆహారంతో పాటు డాక్టరు అవసరం తప్పనిసరి అవుతుంది. కానీ గతాన్ని బాగా పరిశీలించినట్లయితే కొంత మంది వారి జీవితకాలం మొత్తం డాక్టరు అవసరం లేకుండానే జీవించారనే విషయం తెలుసుకోవచ్చు. ఆవిధంగా డాక్టరు అవసరం లేకుండా ప్రస్తుత పరిస్థితులలో జీవించవచ్చా? అనే ప్రశ్నకు మన జీవన శైలిని మార్చుకుంటే తప్పనిసరిగా డాక్టరు అవసరం లేకుండా జీవితాన్ని కొనసాగించవచ్చు అని అంటున్నాడు నారాయణపేట జిల్లా, నారాయణపేటకు చెందిన డాక్టర్‌  జయచంద్ర మోహన్‌.

జయచంద్ర మోహన్‌ మరియు వీరి అర్థాంగి పద్మకళ ఇద్దరూ కూడా వైద్యంలో ఉన్నత చదువులు చదివారు. వీరిది వ్యవసాయ నేపథ్యానికి సంబంధించిన కుటుంబం కాదు. వైద్యంలో ఉన్నత చదువులు చదివిన వారు అందుకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి కొనసాగిస్తున్న సమయములో ప్రకృతి జీవన విధానం గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే తలంపుతో 2014వ సంవత్సరంలో పిడుగురాళ్ళలోని కీ||శే|| కుదరవల్లి విశ్వేశ్వరరావు గారి ప్రకృతి ఆశ్రమంలో 60 రోజులు గడపడం జరిగింది. ఆ సమయంలో విశ్వేశ్వరరావు గారి వయస్సు 94 సంవత్సరాలు. ఆ వయస్సులో కూడా వారికి చూపు తగ్గకపోవడం, వినికిడి లోపం లేకపోవడం అతి సమీపము నుంచి గమనించిన వీరు మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే ప్రకృతికి దగ్గరగా జీవితాన్ని కొనసాగిస్తూ, ప్రకృతికి అనుకూలమైన జీవనశైలిని అలవర్చుకోవడమే సరైన మార్గం అని తెలుసుకుని తాము తమ వృత్తిని కొనసాగిస్తూనే ప్రకృతి అనుకూలమైన ఆహారాన్ని తింటూ ప్రకృతికి దగ్గరగా జీవించటానికి అవసరమైన అవకాశాలవైపు అడుగులు వేశారు. 

తాము మాత్రమే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, తమ దగ్గరకు వచ్చే రోగులకు కూడా ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి తెలియ చేయాలి. అవకాశం ఉంటే ప్రత్యక్షంగా చూపించాలి అని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పద్మకళ తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదలి, జయచంద్ర మోహన్‌ తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూ నారాయణపేట్‌లో ఒక ఆసుపత్రిని నిర్మించుకుని పద్మకళ తన పూర్తి సమయాన్ని, జయచంద్ర మోహన్‌ తన ఖాళీ సమయాన్ని హాస్పిటల్‌ విధులకు కేటాయిస్తూ తమ వద్దకు వచ్చిన రోగులకు కూడా తప్పని పరిస్థితులలో మాత్రమే మందులను సిఫారసు చేస్తూ సాధ్యమయినంతవరకు జీవన శైలిని మార్చుకోమని సలహాలిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే ఎలాంటి రసాయనాలు లేని, మనకు హాని చేయని ఆహారాలను తినడముతో పాటు శారీరక శ్రమ తప్పనిసరిగా చేయాలి. ఈ రెండింటికి సరైన దారి వ్యవసాయమే, అదీను సేంద్రియ సాగే సరైన దారి అని గ్రహించి వ్యవసాయంలో ఎలాంటి అనుభవం లేకపోయినా కానీ ఆర్థికంగా ఇబ్బందులు లేవు కాబట్టి తాము ఆరోగ్యకరమన జీవన శైలిని పాటిస్తూ తోటి వారికి ప్రత్యక్షంగా చూపించాలనే లక్ష్యంతో నారాయణపేట సమీపంలో 2014వ సంవత్సరములో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సేంద్రియ సాగుని మొదలు పెట్టారు. ఆ తరువాత అదే ప్రాంతంలో ఇంకో 23 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులో కూడా పంటల సాగుని కొనసాగిస్తున్నారు.

వరి: వ్యవసాయంలో దిగినప్పటి నుంచి వరిని సాగు చేస్తూ వస్తున్నారు. ఆధునిక వరి రకాలను కాకుండా మన పురాతన వరి రకాలను మాత్రమే సాగు చేస్తున్నారు. తమకు ఉన్న వరి సాగు అనుభవంలో ఎక్కువగా ఎకరానికి 22 బస్తాల వరకు దిగుబడి పొందారు. వచ్చిన వడ్లను అదేవిధంగా అమ్మకుండా వాటికి విలువ జోడించి బియ్యంగా మార్చి తాము సొంతానికి వినియోగిస్తూ మిగతా బియ్యాన్ని అమ్మకం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మైసూర్‌ మల్లిక వరి రకం నారు థలో ఉంది. వీరు సాగు చేసే వరికి తప్పనిసరిగా బీజామృతంతో విత్తనశుద్ధి చేయడంతో పాటు దుక్కిలో తప్పనిసరిగా ఘనజీవామృతం మరియు గోబర్‌ గ్యాస్‌ స్లర్రిని అందిస్తుంటారు. 25 నుంచి 30 రోజులు వయస్సు పెరిగిన నారుని ప్రధాన పొలంలో నాటిస్తుంటారు. కలుపు నివారణకు వీడరును ఉపయోగిస్తుంటారు. పై పాటుగా క్రమం తప్పకుండా జీవామృతం, గో-కృపామృతాలను భూమికి అందించడంతో పాటు అవసరమైతే పంటపై పిచికారి చేస్తుంటారు. వీరు సాగు చేసే వరి పైరులో చీడపీడల ప్రభావం పెద్దగా కనిపించడము లేదు. కాబట్టి చీడపీడల నివారణకు ఏలాంటి నివారణ చర్యల అవసరం పడటము లేదు. పురాతన వరి రకాలను సాగు చేస్తున్నారు కాబట్టి అవి బాగా ఎత్తు పెరుగుతున్నాయి. అయినా కానీ గాలులకు, వర్షాలకు పడిపోవడము లేదు. పశువులకు ఎండు పశుగ్రాసం కూడా ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది.

పశుగ్రాసాలు: సేంద్రియ సాగుకు అతిముఖ్య వనరు అయినటువంటి మన దేశీయ ఆవులను 30 వరకు పోషిస్తున్నారు. వీటికి అవసరమైన పశుగ్రాసాల కొరకు పలు రకాల పశుగ్రాసాలను పెంపకం చేస్తున్నారు. సూపర్‌ నేపియర్‌, రెడ్‌ నేపియర్‌, హీరామణి లాంటి బహువార్షిక గడ్డిజాతి పశుగ్రాసాలతో పాటు థరథగడ్డి, అవిశ, సుబాబుల్‌ లాంటి బహువార్షిక పప్పుజాతి పశుగ్రాసాలను కూడా సాగు చేస్తూ ఆవులకు పచ్చిమేతగా అందిస్తున్నారు. పచ్చి మేతలతో పాటు ఎండుగడ్డి, అజొల్లా మరియు దాణాలను కూడా ఆవులకు అందిస్తున్నారు.

గోబర్‌గ్యాసు: ఆవుల ద్వారా వచ్చిన కొంత పేడతో గోబర్‌ గ్యాసును ఉత్పత్తి చేస్తున్నారు. సుమారు12,000/-ల ఖర్చుతో గోబర్‌ గ్యాసు యూనిట్‌ను ఏర్పాటు చేసుకుని తమ పొలంలో పనిచేసే వారి వంట అవసరాలకు గోబర్‌ గ్యాస్‌ను ఉపయోగిస్తున్నారు. గోబర్‌ గ్యాస్‌ తీసిన తరువాత స్లర్రీలో మిథేన్‌ వాయువు ఉండదు కాబట్టి ఈ స్లర్రీ పంటల సాగుకు బాగా ఉపయోగపడుతుందని గ్రహించి ఆ స్లర్రీని ఒక పిట్‌లోకి పంపించి అందులో ఎండిన ఆకులను, వ్యవసాయ వ్యర్థాలను వేసి బాగా కుళ్ళిన తరువాత పంటల సాగులో వినియోగిస్తున్నారు.

అజొల్లా: అజొల్లాలో అనేక పోషకాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అజొల్లాను పశువులకు దాణాగా అందించడముతో పాటు వరిలో అజొల్లాను పెంచినట్లయితే వరిలో కలుపు సమస్య తగ్గడముతో పాటు వరి పంటకు నత్రజని అందుబాటులోకి వస్తుంది కాబట్టి కొంత మొత్తంలో అజొల్లాను పెంచుతూ రెండింటికి వినియోగిస్తున్నారు.

నీటి నిర్వహణ: పంటల సాగులో నీటి నిర్వహణ అతి ముఖ్యం కాబట్టి తన పొలంలో పడిన వర్షం నీటిని బయటకి పోకుండా భూమిలో ఇంకేలా కందకాలు తవ్వించి ఆ కట్టలపై కొబ్బరి, టేకు లాంటి మొక్కలు నాటించారు. వీరి పొలంలో సుమారు 200 సంవత్సరాల పురాతన బావి ఉంది. ఆ బావిని శుభ్రం చేసి అందులో అందుబాటులోకి వచ్చిన నీటిని పంటల సాగులో వినియోగిస్తున్నారు. బావితో పాటు రెండు బోర్లు కూడా ఉన్నాయి. బావిలో కొన్ని చేపలను పెంచుతూ సొంతానికి ఉపయోగించడంతో పాటు మిగిలినవి అమ్మకం చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. వేసవి కాలంలో కుటుంబ సభ్యులు మరియు సందర్శకులు ఈత కొరకు కూడా ఈబావిని ఉపయోగిస్తున్నారు. 

కట్టెగానుగ: ప్రస్తుతం మనం ఉపయోగించే నూనెలలో చాలా వరకు వివిధ రకాల పద్ధతులతో తయారు చేస్తున్నవి కాబట్టి అవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆరోగ్యానికి హానికలిగించని నూనెలు పొందటానికి సరైన దారి ఎద్దుగానుగ అని భావించిన జయచంద్రమోహన్‌ తన పొలంలో ఎద్దుగానుగను కూడా ఏర్పాటు చేశాడు. ఇందులో కోల్డ్‌ప్రాసెస్‌ పద్ధతిలో నూనెను తయారు చేయవచ్చు కాబట్టి ఈ నూనెలు ఆరోగ్యానికి హాని చేయవు అంటున్నాడు డా. జయచంద్రమోహన్‌. అంతేకాకుండా పంట ఉత్పత్తులను అదేవిధంగా అమ్మకుండా విలువ జోడించి అమ్మగలిగితే రైతులకు అధిక లాభం వస్తుంది. ఈ విషయాన్ని కూడా తోటి రైతులకు తెలియ చేయాలనే లక్ష్యంతో కట్టెగానుగను ఏర్పాటు చేశారు.

వృత్తిరీత్యా డాక్టరు అయ్యుండి ప్రజలు డాక్టరు అవసరం లేకుండా జీవించడానికి అవసరమైన జీవనశైలి మరియు పద్ధతులను ప్రత్యక్షంగా చూపించడమే లక్ష్యంగా డా|| జయచంద్రమోహన్‌, పద్మకళ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు 93965 84805కి ఫోను చేసి తెలుసుకోగలరు.

ఫ్రూట్‌ ఫారెస్ట్‌: 

వివిధ రకాల పండ్ల మొక్కలతో ఫ్రూట్‌ ఫారెస్ట్‌ సాగు చేస్తున్నారు. ఈ ఫారెస్ట్‌లో జామ, మామిడి, సీతాఫలం, అరటి, బొప్పాయి, సపోటా, ఫ్యాషన్‌ ఫ్రూట్‌ మొదలగు పండ్ల మొక్కలతో పాటు మునగ, లెమన్‌ గ్రాస్‌ లాంటివి కూడా పెంపకం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా పంటల సాగు క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. కాబట్టి కుటుంబ సభ్యులు వచ్చిన సందర్భంలో తినటానికి పండ్లు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఫ్రూట్‌ ఫారెస్ట్‌ని ఏర్పాటు చేశారు కాబట్టి సంవత్సరం పొడవునా అంటే 365 రోజులు ఏదో ఒక పండు అందుబాటులో ఉండేలా పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు. 

– డి. ప్రసాద్‌,  రైతునేస్తం ప్రత్యేక ప్రతినిధి

Read More

మామిడిలో కొమ్మ కత్తిరింపులు, యాజమాన్య పద్ధతులు

మామిడి పంటకు మనదేశం ప్రసిద్ధి చెందినది. మామిడి సాగులో మనదేశం మొదటి స్థానంలో, ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో మనదేశం వాటా దాదాపుగా 65 శాతం వరకు ఉంది. ఉత్పత్తిలో మనదేశం ముందు ఉన్నప్పటికీ ఉత్పాదకతలో  మిగతా దేశాలతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నాము. అంతే కాకుండా గత థాబ్దకాలంలో ఉత్పత్తి కూడా హెక్టారుకు 8.1 టన్నుల నుండి 5.5 టన్నులకు పడిపోయింది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో రకాల లభ్యత మరియు వైవిధ్యం చాలా ఎక్కువ. వివిధ రకాల అవసరాలకు (పచ్చళ్ళు, రసాలు, కోత రకాలు మొదలైనవి) అనువైన రకాలు చాలా వున్నాయి. కాబట్టి ప్రపంచ మార్కెట్లో మన వాటా పెంచడానికి, ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి కొన్ని యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా కత్తిరింపులు చేపట్టడం చాల అవసరం.

కత్తిరింపుల వలన లాభాలు

  • ప్రతి సంవత్సరం నిలకడగా కాపు కాస్తుంది.
  • చెట్టుకు గాలి వెలుతురు బాగా సోకి దిగుబడి పెరుగుతుంది.
  • తోటలో అంతర కృషి పనులు చేయటానికి అనువుగా వుంటుంది
  • నాణ్యమైన పండ్ల ఉత్పాదకత పెరుగుతుంది.
  • చీడ పీడల బెడద తగ్గుతుంది.
  • చెట్టు ఎత్తును అదుపులో ఉంచుకోవచ్చు

ఈ కత్తిరింపుల ప్రక్రియ  మొక్క వయస్సును బట్టి చేపట్టాలి. లేత మొక్కలలో ఒకరకంగా, కాపుకు వచ్చిన తోటల్లో ఒకరకంగా, ముదిరిన తోటల్లో ఒకరకంగా చేయాలి.

లేత తోటలలో కత్తిరింపులు 

మొక్కై వంగనదే మానై వంగదు అనే సామెత మన అందరికి తెలిసిందే. మొక్క థలోనే మామిడిని మంచి ఆకారంతో పెంచుకోవాలి. మొక్క నాటిన తర్వాత కాండం బలంగా పెరగడానికి ఒక మీటరు ఎత్తు వరకు పక్క కొమ్మలు లేకుండా పెరగనివ్వాలి. ఆ తర్వాత మొక్క మొదలు నుండి 70 సెం. మీ. ఎత్తులో కాండాన్ని అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో కత్తిరించాలి. తర్వాత అక్కడ నుండి ప్రధాన కొమ్మలు పెరుగుతాయి. నాలుగు వైపులా పెరిగిన 4 ప్రధాన కొమ్మలను మాత్రమే పెరగనిచ్చి 1 మీ. పొడవు పెరిగిన తర్వాత 70 సెం. మీ.కు కత్తిరిస్తే అక్కడనుండి ద్వితీయ కొమ్మలు పెరుగుతాయి. ప్రతి ప్రధాన కొమ్మపై 2-3 ద్వితీయ కొమ్మలను మాత్రమే సమాన దూరంలో పెరగనివ్వాలి. అలాగే ప్రతి ద్వితీయ కొమ్మపై 2 -3 తృతీయ కొమ్మలను పెరగనిచ్చి మిగతా కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన చెట్టు నిటారుగా పెరగకుండా గుబురుగా పెరిగి దిగుబడి పెరుగుతుంది. ఈ కత్తిరింపులు చేసినపుడు ఎండిన కొమ్మలు, తెగులు సోకిన కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు తీసివేయాలి.

కాపుకు వచ్చిన తోటల్లో కత్తిరింపులు

మామిడి కాయలు కొమ్మల చివర్లలో గుత్తులుగా కాస్తాయి. కనీసం 6-8 వారాల వయస్సు పై బడిన కొమ్మలపై మాత్రమే పూత వస్తుంది. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న  కొమ్మలపై పూత రాదు. కాబట్టి కాయ కోత వెంటనే  కత్తిరింపులు చేస్తే కొత్త చిగుర్లు పెరిగి పూత వచ్చేటప్పటికి వాటి వయస్సు 8 వారాలపైనే ఉంటుంది. కాపుకు వచ్చిన తోటల్లో రెండు సార్లు కత్తిరింపులు చేసుకోవాలి.

మొదటి కత్తిరింపులు

మొదటి కత్తిరింపులు కాయ కోత వెంటనే చేపట్టాలి. కాయలు పెరిగిన పూత  కాడలను తొలగించి అక్కడనుండి కొమ్మలను కనీసం 10-15 సెం. మీ. వెనక్కి కత్తిరించాలి. అలాగే బాగా కిందకు వేలాడిన కొమ్మలను తీసేయాలి. చెట్టు లోపలి భాగంలో అడ్డదిడ్డంగా ఒకదానిపై ఒకటిగా పెరిగిన కొమ్మలను తీసివేస్తే చెట్టు లోపల భాగాలలో గాలి, వెలుతురు ప్రసరణకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా చెట్టు లోపల భాగంలో నిటారుగా పెరిగే 2-3 కొమ్మలను కత్తిరించాలి. కత్తిరింపులు చేసినపుడు కొమ్మలు చీలిపోకుండా జాగ్రత్తగా కత్తిరించాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లలో 25% కన్నా ఎక్కువ కొమ్మలు కత్తిరిస్తే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తెగులు సోకిన కొమ్మలు, ఎండిన కొమ్మలు ఉంటే తీసివేయాలి.

రెండవసారి కత్తిరింపులు

రెండవసారి కత్తిరింపులు పూతకు ముందు అంటే నవంబర్‌ – డిసెంబర్‌ నెలల మధ్యలో చేయాలి. ఈ కత్తిరింపులు 1-2 వారాల్లో పూర్తి చేయాలి. ఈ కత్తిరింపుల్లో భాగంగా పూతకు ముందు ఏవైన కొత్త చిగుర్లు వస్తే 10-15 సెం మీ. వెనక్కి (ముదురు భాగం వరకు) కత్తిరించాలి. లేకపోతే ఆ కొమ్మలపై పూత రాదు. అలాగే బాగా కిందకు వేలాడి నేలను తాకే కొమ్మలను తీసేయాలి. ఈ థలో కూడా చెట్టు మధ్యలో లోపలి భాగంలో వత్తుగా పెరిగిన కొమ్మలు లేదా కొమ్మ భాగాలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మ భాగాలను తీసేసి గాలి, వెలుతురు సోకేటట్లు చేయాలి. దీనివలన కాయలు పండిన తర్వాత మంచి రంగు సంతరించుకొని నాణ్యంగా ఉండి అధిక ధర పలుకుతాయి. 

ముదిరిన తోటల్లో కత్తిరింపులు

మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మామిడి తోటలు 50-60 సంవత్సరాలు పైబడినవే ఉండటం వలన వాటి ఉత్పత్తి తగ్గి ఆదాయం రావటం లేదు. ఈ ముదురు తోటలు  ఎత్తుగా ఉండడం వలన సస్య రక్షణ చర్యలు చేపట్టడానికి కూడా అనువుగా ఉండక దిగుబడులు తగ్గుతున్నాయి. అందువలన రైతులు వాటి యాజమాన్యం చేపట్టలేక ముదురు తోటలను తొలగించి వాటి స్థానంలో వేరే పంటలు అంటే నీటి వసతి ఉన్న వాళ్ళు ఆయిల్‌ పాం తోటలు నీటి వసతి లేని వాళ్ళు మళ్ళీ అంటు కట్టిన మామిడి మొక్కలను నర్సరీలనుండి తెచ్చుకొని వేసుకొంటున్నారు. మళ్ళీ కొత్తగా వేసుకోవటం వలన పెట్టుబడి ఎక్కవ అవటమే కాకుండా వాటి నుండి ఆదాయం పొందడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ నష్టాన్ని భరించాలంటే కొత్త మొక్కలు వేసుకోకుండా ఉన్న ముదురు తోటలని పూర్తిగా తొలగించకుండా వాటి వేరు వ్యవస్థను ఉపయోగించుకొని ఎక్కువ పెట్టుబడి లేకుండా ప్రూనింగ్‌ పద్ధతి ద్వారా వాటిని సులభంగా పునరిద్ధరించుకొని మంచి దిగుబడులు పొందవచ్చు.

బాగా ఎత్తుగా పెరిగిన ముదురు చెట్ల కొమ్మలను భూమట్టం నుండి అంటే ఎక్కడైతే కొమ్మలు ఏర్పడతాయో అక్కడ నుండి ఒక అడుగు ఎత్తు వరకు ఉంచి కత్తిరించాలి. అన్ని కొమ్మలు ఒకే సారి కత్తిరించకుండా ఒక వైపు ఉన్న కొమ్మలను ఉంచి వేరొక వైపు ఉన్న కొమ్మలను కత్తిరించుకోవాలి. ఇలా చేస్తే కత్తిరించిన కొమ్మలపై మళ్ళీ చిగుర్లు వచ్చే వరకు కావలసిన పోషకాలను మిగతా సగం కొమ్మల నుండి (కత్తిరించకుండా చెట్టుపై వదిలేసిన కొమ్మలు) పొందుతుంది. అంతే కాకుండా ఈ కొమ్మలనుండి ఎంతో కొంత దిగుబడిని పొందవచ్చు. కత్తిరించిన కొమ్మలపై కొన్ని వారాల తర్వాత చిగుర్లు వస్తాయి. ఇలా వచ్చిన చిగుర్లను ఒక్కో  కొమ్మకు 4 వైపులా 25-30 సెం.మీ. దూరంలో వచ్చిన బలమైన కొమ్మలు మాత్రమే ఉంచి మిగతావి ఎప్పటికప్పుడు వచ్చినవి వచ్చినట్టే తీసేయాలి.

ఒకవేళ ముదురు తోటలు టెంకల  ద్వారా పెరిగినవి అయితే ప్రూనింగ్‌ తర్వాత పెరిగిన కొమ్మలపై మనకు నచ్చిన లేదా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ గిరాకీ ఉండే రకాలను గ్రాఫ్టింగ్‌ చేసుకోవచ్చు. గ్రాఫ్టింగ్‌ చేసిన భాగం అతుక్కొన్న తర్వాత అతుకు కింద భాగం పై వచ్చిన చిగుర్లను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఇలా చేసిన చెట్ల నుండి 3 సంవత్సరాల్లో దిగుబడి పొందవచ్చు.

కత్తిరింపులు చేసేటప్పుడు కొంచెం ఏటవాలుగా చేయాలి. లేకపోతే వర్షం పడినపుడు నీరు కొమ్మలపై ఉండిపోయి శిలీంద్రాలు ఆశించి చెట్లు చనిపోయే అవకాశంఉంటుంది. కొమ్మలు కత్తిరించిన ప్రతి సారి కత్తిరించిన ప్రదేశంలో బోర్దో పేస్టు పూయాలి.

కత్తిరింపుల తర్వాత యాజమాన్యం

కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టు వయస్సును బట్టి సిఫార్సు చేసిన ఎరువులను వేసి నీటి తడులు ఇవ్వాలి.

ఎక్కువుగా సేంద్రియ ఎరువు మరియు జీవన ఎరువులను వేసుకోవాలి. కాపుకు వచ్చిన తోటల్లో మొదటి కత్తిరింపుల తర్వాత తొలకరి వర్షాల సమయంలో ఎరువులు వేసుకొంటే మొక్కకి పోషకాలు అందుతాయి ఒక వేళ వర్షాలు లేనట్లయితే నీటి తడులు ఇచ్చుకోవాలి.

కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత సూక్ష్మధాతు (జింకు, బోరాన్‌, ఇనుము మొదలైన) లోపాలు గమనిస్తే జింక్‌ 2-5 గ్రా., బోరాన్‌  1-2 గ్రా. ఐరన్‌ సల్ఫేట్‌ 2 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ 2 గ్రా. ఒక లీటర్‌ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నీటి యాజమాన్యాన్ని, పురుగులుా, తెగుళ్ల యాజమాన్యాన్ని సరైన సమయంలో చేసుకోవాలి.

కాబట్టి రైతులు ఈ విధంగా కత్తిరింపులు చేసుకొని తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్లైతే నాణ్యమైన దిగుబడి వచ్చి అధిక ఆదాయాన్ని పొందుతారు.        దీ

డా. కె. రాధారాణి, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ (హార్టి), డా. బి.కె.ఎం. లక్ష్మి, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ (ప్లాంట్‌ పథాలజీ) మరియు డా. జి. స్రవంతి, సైంటిస్ట్‌ (ఎంటమాలజీ), మామిడి పరిశోధనా స్థానం, నూజివీడు. 

Read More

విలువ జోడింపుతోనే మామిడి సాగు లాభదాయకం

పండ్లలో రారాజుగా మామిడిని పిలుస్తారు. మామిడి పండుకు ఉండే రుచి వలన ఆ పండుకు ఆపేరు వచ్చింది. మన దేశంలోనే కాక ఇతర దేశాలలో కూడా మామిడి పండును బాగా ఇష్టపడుతుంటారు. కానీ అన్ని దేశాల వాతావరణాలు మామిడి పంటకు అనుకూలం కాదు కాబట్టి పండే దేశాల నుండి దిగుమతి చేసుకుని మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తుంటారు. ప్రజలకు మధురానుభూతిని అందించే మామిడి పండు రైతులకు లాభాలను చేకూర్చుతుందా అంటే జవాబు కాదు అని వస్తుంది. మామిడి సాగు చేసే రైతులు చాలా వరకు సరైన లాభాలు ఆర్జించలేకపోతున్నారు. దిగుబడి ఉంటే ధర ఉండదు. ధర ఉంటే దిగుబడి ఉండదు. రెండూ ఉంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన కాయలు రాలిపోతవి. సాధారణంగా మామిడి కాయలు మార్చి, ఏప్రియల్‌, మే, జూన్‌ మాసాలలో (కొన్ని రకాలు తప్ప) ఎక్కువ రకాలు దిగుబడులను ఇస్తాయి. కానీ ఈ మాసాలలో వాతావరణంలో మార్పులు జరిగి  విపరీతంగా గాలులు రావడం జరుగుతుంది. గాలి ఎక్కువగా వచ్చిన సందర్భాలలో మామిడి కాయలు చాలా వరకు రాలిపోతుంటాయి. అలా రాలి పోయిన కాయలను రైతులు అయినకాడికి అమ్ముకొని ఎంతో కొంత వచ్చిందని సర్దుకుపోతుంటారు. అన్నీ ఒడిదుడుకులు తట్టుకుని దిగుబడిని మొత్తాన్ని సరైన ధరలకు అమ్ముకోగలిగితే మామిడి సాగు లాభదాయకంగా ఉంటుంది. లేదంటే మామిడి రైతులు నష్టాలు భరించవలసిందే. దానికి సరైన పరిష్కారం విలువ జోడింపే అని మామిడికి వివిధ రకాలుగా విలువ జోడించి మామిడితో అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తూ తన మామిడి సాగును లాభాల బాటలో నడిపిస్తున్నాడు కృష్ణాజిల్లా జి.కొండూరు ప్రాంతానికి చెందిన ఎం. నారాయణ ప్రసాదు.

నారాయణ ప్రసాదుది వ్యవసాయ నేపధ్యమైనాకానీ ఇంజనీరింగు వరకు చదువుకుని తన ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో వివిధ రకాల పరిశ్రమలకు సలహాలు ఇస్తుంటారు. వీరికి 50 సంవత్సరాల పైబడ్డ వయస్సు గల 50 ఎకరాల మామిడితోట ఉంది. అయినా కాని మామిడి సాగుపై అంత శ్రద్ధ పెట్టకుండా వచ్చిన కాడికి ఆదాయం పొందుతూ తన ఇంజనీరింగ్‌ వృత్తిలో కొనసాగుతున్న సమయంలో 2014 వ సంవత్సరంలో విజయవాడలో సుభాష్‌పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ పద్ధతిలో ప్రధానంగా ఒక దేశీ ఆవుతో 30 ఎకరాలు సాగు చేయగల పద్ధతి వారికి బాగా నచ్చి అటు వైపు ఆలోచించి తన మామిడి తోటలో సేంద్రియ పద్ధతులు పాటించాలని తలచి 2014 నుంచి తన మామిడి తోటలో పూర్తి సేంద్రియ పద్ధతులు పాటించడం మొదలు పెట్టి కొనసాగిస్తున్నాడు.

సేంద్రియ పద్ధతులు పాటించడము మొదలు పెట్టిన తరువాత అందుకు అవసరమైన దేశీయ ఆవుల పోషణ మొదలు పెట్టి వాటి వ్యర్థాలను తన మామిడి తోట సాగులో వినియోగిస్తున్నాడు. పాదులలో మాగిన పశువుల ఎరువు క్రమం తప్పకుండా అందించడంతో పాటు ఘనజీవామృతం, ద్రవ జీవామృతాలను కూడా అవసరాన్ని బట్టి క్రమం తప్పకుండా అందిస్తూ వస్తున్నాడు. చీడపీడల నివారణకు వేపనూనె, వేప కషాయం, పుల్లటి మజ్జిగలను పంటపై క్రమం తప్పకుండా ఉపయోగించడంతోపాటు లింగాకర్షక ఎరలను, పండుఈగ బుట్టలను కూడా ఏర్పాటు చేస్తుంటాడు. మామిడి తోటలో ఎత్తులో ఉన్న కాయలకు కవరు తొడగడము ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మధ్యస్థంగా ఉన్న కాయలకు కవరు తొడుగుతున్నాడు. కవరు తొడిగిన కాయలు నాణ్యత పెరిగింది కాబట్టి మంచి ధరకు అమ్మగలుగుతున్నాడు. యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటిస్తే పెద్ద వయస్సు ఉన్న మామిడి చెట్టు నుంచి కూడా మంచి దిగుబడిని సాధించవచ్చని నిరూపిస్తున్నాడు.

మామిడి సాగులో మంచి ఆదాయం రావాలంటే మామిడికాయల వృథాను తగ్గించగలగాలి. ఇందుకు గాను కొన్ని కాయలను ఆమ్‌చూర్‌ తయారు చేయడానికి, కొన్ని పండ్లను మామిడి తాండ్ర తయారు చేయటానికి, కొన్నింటిని మామిడి పండ్లుగా అమ్మకం చేస్తున్నాడు. ఏది ఏమయినా కాని తన మామిడి తోటలో సాధించిన దిగుబడి ఏమాత్రం వృథాకాకుండా పంట మొత్తాన్ని అమ్ముకోగలుగుతున్నాడు. తన మామిడి తోటలో తోతాపురి, రసాలు, బంగినపల్లి, అల్ఫోన్సా లాంటి మామిడి రకాలను సాగు చేస్తున్నాడు.

మామిడి తాండ్ర: సరైన ధరకు అమ్మకం చేయలేని మామిడి పండ్ల నుంచి మామిడి తాండ్రను తయారు చేస్తున్నాడు. ఇందుకు గాను అప్పట్లో 8 లక్షలు ఖర్చు చేసి డ్రయ్యరును కొనుగోలు చేసుకున్నాడు. మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి మిక్సీ సహాయంతో మామిడి గుజ్జు చేసి అందులో పూర్తి సేంద్రియంగా తయారు చేసిన బెల్లాన్ని కలిపి అవసరమైనంత మందంలో ట్రేలలో పోసి ట్రేలను డ్రైయ్యరులో పెట్టినట్లయితే గంటకు రెండు లీటర్ల నీళ్ళు ఆవిరి అయిపోతాయి. అందులో ఉన్న నీటిశాతాన్ని బట్టి గట్టిగా తయారయిన తరువాత ట్రేల నుంచి తీసి అవసరమయినంత కొలతల ప్రకారం ముక్కలుగా కోసి మామిడి తాండ్రను అమ్మకం చేస్తున్నాడు. మామిడి కాయలకంటే రెండు, మూడు రెట్ల అధిక ధరకు మామిడి తాండ్రను అమ్మగలుగుతున్నారు.

ఆమ్‌చూర్‌ తయరీ: ఆమ్‌చూర్‌కి గిరాకి రోజురోజుకి పెరుగుతూ ఉంది. మన దేశంలోనే కాకుండా కొన్ని ఇతర దేశాలలో కూడా ఆమ్‌చూర్‌ని ఉపయోగిస్తున్నారు. పుల్లగా ఉన్న కాయలు ఆమ్‌చూర్‌కి ఉపయోగిస్తుంటారు. రాలిపోయిన కాయలు లేదా పండించడానికి అవకాశాలు లేని కాయలతో ఆమ్‌చూర్‌ తయారు చేస్తున్నారు. ఇందుకు గాను కాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి డ్రై చేస్తున్నాడు. మామిడి ముక్కలను డ్రై చేయడానికి తన ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో సుమారు 8 లక్షల వ్యయంతో 60þ20 అడుగులలో పాలీ డ్రైయ్యరును తయారు చేసుకున్నాడు బయట కంటే ఈ డ్రయ్యరులో సుమారు 15 సెంటిగ్రేడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టే త్వరగా ఎండుతున్నాయి. ఈ డ్రయ్యరును ఆమ్‌చూర్‌ తయారీకి, పొదీనా పొడి తయారీకి, అల్లంతో శొంఠి తయారీకి ఉపయోగిస్తున్నాడు. తన మామిడితోటలో అంతర పంటలుగా పొదీనా మరియు అల్లంలను సాగు చేస్తూ వాటిని పొడి చేస్తున్నారు. పచ్చి అల్లంకి మార్కెట్‌లో మంచి ధర లభించడం లేదు కనుక అల్లంని ఎండబెట్టి శొంఠి పొడిచేసి కిలో 150/-లకు అమ్మకం చేస్తున్నాడు. ఆమ్‌చూర్‌ పొడిని కిలో రూ. 300/- నుంచి రూ. 400/- లకు అమ్మకం చేస్తూ వృథా మామిడి కాయల నుంచి కూడా ఆదాయం పొందుతున్నాడు. 

మామిడిపండ్లు మాగబెట్టుట: మామిడి పండ్లను మాగబెట్టటానికి 24 టన్నుల సామర్థ్యం గల గదిని నిర్మించుకుని ఆ గదిలో తన ఇంజనీరింగ్‌ ఆలోచనతో స్లాండ్లు ఏర్పాటు చేసుకుని మామిడి పండ్లను మాగబెడుతున్నాడు. ఇందుకుగాను తయారయిన కాయలను చెట్టు నుంచి చిక్కం సహాయంతో కోసి స్టాండ్లలో ఏర్పాటు చేసిన గడ్డిపై అమర్చి కొంతకుళ్ళిన టమాటాలు లేదా కుళ్ళిన అరటి పండ్లను ఆ గదిలో ఉంచడం జరుగుతుంది. ఈ కుళ్లిన అరటి లేదా టమాటాల నుంచి ఇథలిన్‌ అనే గ్యాసు ఉత్పత్తి అయ్యి మామిడి కాయలను పండించటానికి ఉపయోగపడుతుంది. హానికారకమైన కార్బైడ్‌ లాంటి పొడులను ఉపయోగించకుండా సహజ సిద్ధంగా పండించి నాణ్యత దెబ్బతినకుండా అట్టపెట్టెలలో స్టాక్‌ చేసి వినియోగదారులకు అందిస్తున్నాడు. కొంతమంది వినియోగదారులు నేరుగా తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు.

అన్ని రకాల మెలకువలు పాటిస్తూ పూర్తి సేంద్రియ పద్ధతులతో మామిడి సాగు చేస్తూ దిగుబడి వృధా కాకుండా మామిడి పండ్లు, ఆమ్‌చూర్‌, మామిడి తాండ్రలుగా అమ్మకం చేస్తూ తన మామిడి సాగును లాభాల బాటలో నడిపిస్తున్నాడు.

మరిన్ని వివరాలు 95155 04531 కి ఫోను చేసి తెలుసుకోగలరు.   – వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

తోటలలో చెట్ల మధ్య పశుగ్రాసాల సాగు (సిల్విపాశ్చర్‌)

ఇటీవల కాలంలో పాడి పరిశ్రమను, జీవాల పరిశ్రమను మేత కొరత తీవ్రంగా వేధిస్తోంది. పచ్చిక బీళ్లు కనుమరుగైపోతున్నాయి. మేతకొరత వల్ల పశువుల్ని పోషించలేక అనేకమంది తమవద్ద ఉన్న మేలు జాతి పశువుల్ని సైతం వట్టిపోయిన వెంటనే కబేళాలకు తరలిస్తున్నారు. నిర్వహణ సమస్యల కారణంగా వేలాది ఎకరాల పంట భూములు తోటలుగానూ, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగానూ మారిపోతున్నాయి. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి వంటి తోటలలో చెట్లకు మధ్య వీలైతే చెట్ల నీడలో కూడా అనేక పశుగ్రాసాలను పెంచవచ్చును. ఈ విధంగా తోటలలో పచ్చిగ్రాసాల సాగును సిల్విపాశ్చర్‌ అని వ్యవహరిస్తారు. ఈ తోటలలో పశుపోషణ, గొర్రెల పోషణలను చేపడ్తే పండ్ల సాగు కంటే పశుగ్రాసాల ద్వారా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వచ్చే స్థిరమైన నికర ఆదాయం ఎక్కువగా ఉంటాయి. అది ఎలాగో ఇప్పుడు చర్చిద్దాము.

భూసారాలు పెరుగుతాయి: పశువులు, గొర్రెల వ్యర్థాలతో భూమిలో కార్బన్‌ మరియు నత్రజని సహజరీతిలో పెరుగుటే కాక, భూమిలో నీటిని పీల్చుకొనే గుణం కూడా మెరుగుపడుతుంది. ఏటవాలు భూములేకాక వరదపీడిత ప్రాంతాలలో సారవంతమైన భూములు సైతం కోతకు గురయ్యే ముప్పు తగ్గుతుంది. లూసర్న్‌, బెర్సీమ్‌, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్‌ జాతి గ్రాసాల వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, రసాయన ఎరువుల అవసరాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ గ్రాస పైర్ల సాగును 3-4 సంవత్సరాలకు ఒకసారి పంటమార్పిడి చేస్తే ఈ ప్రయోజనం మరింతగా ఎక్కువగా ఉంటుంది. పారా నేపియర్‌ వంటి గ్రాసాల వేర్లు భూమిని కోతకు గురికాకుండా పటిష్టపరుస్తాయి. 

కార్మికుల లభ్యత పెద్ద సమస్యగా మారిన ఈ రోజుల్లో తోటల కాపలాదారుల్ని తోటలో కొన్నిజీవాలను లేదా ఒకటి, రెండు పాడి పశువుల్ని పెంచడానికి వెసులుబాటు కల్పిస్తే ఈ అదనపు ఆదాయం వల్ల వారు నమ్మకంగా స్థిరంగా అదే కమతంలో విశ్వాసంగా కొనసాగగలరు.

చెట్ల మధ్య పెరిగే గ్రాసాల వల్ల తోటలలో జీవవైవిధ్యం పెరుగుట ద్వారా పరాగసంపర్కము మెరుగుపడి ఫలసాయాలు పెరిగే అవకాశాలు ఉంటాయి.

చెట్లతో పాటు, చెట్ల మధ్య పచ్చగా పెరిగే గ్రాసాలకు అందించే సాగునీటి వల్ల తోటలలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. నేలరాలిన ఎండిన ఆకులు మరియు ఎండుగడ్డి రాపిడి వల్ల లేదా అగ్నిచోదకాల వల్ల మంటలు చెలరేగి తీవ్ర అగ్నిప్రమాదాలకు దారితీసి భారీనష్టాలను కలిగించటం ప్రతి వేసవిలోనూ మనం చూస్తూనే ఉన్నాము.

దూడలు, పడ్డలు, పాడి పశువులు, గొర్రెలు, మేకలకు ఎంతో విలువైన పోషకాలు సహజరూపంలో వివిధ రకాల గ్రాసాల ద్వారా లభిస్తాయి. సహజమైన పచ్చిమేతల వల్ల పశువుల ఎదుగుదలతో వాటి ఉత్పాదకత, ప్రత్యుత్పత్తి సామర్థ్యాలు గణనీయంగా పెరగటంతో పాటు ఖరీదైన సమీకృత దాణాల మీద ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. మండు వేసవిలో సైతం చెట్ల నీడలోని చల్లని వాతావరణం వల్ల గేదెలు ఎదకు వచ్చి చూడి కట్టగలవు. ఇందువల్ల అవి రాబోయే పాలకొరత రోజుల్లో అధిక స్థాయిలో పాలను ఉత్పత్తి చేయగలవు. తోటలలో లభ్యమయ్యే పచ్చిమేతలవల్ల దూడలు కూడా ఆరోగ్యంగా ఉండి వేగంగా యుక్త వయస్సుకు వస్తాయి. గేదెల్ని చల్లదనం కొరకు ప్రత్యేకంగా చెరువులు, కాల్వలు, నదులలోకి వదలటం, స్ప్రింక్లర్లతో తడపటం వంటి అవసరాలు ఉండవు. గడ్డిపెరిగిన తోటలలో పెరిగే పశువులు, జీవాల ఎదుగుదల మరియు ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది.

మానవ వనరుల సద్వినియోగం: ప్రతి తోటలో సంరక్షకులుగా ఉండే కాపలాదారులతోనే గ్రాసాల సాగుకు అవసరమయ్యే మానవ వనరుల అవసరాలు చాలావరకు తీరగలవు. తోటలలో గ్రాసాల సాగును ప్రారంభించడానికి జూలై-ఆగస్టు నెలలు చాలా అనుకూలమైనవి. ప్రారంభానికి ముందు భూసార పరీక్షలు జరిపించి నేలకు అనుకూలమైన గ్రాసాలను ఎంపిక చేసుకొనుట మరియు భూమిలోని లోపాలను సరిదిద్దగల చర్యల్ని చేపట్టుట మంచిది. వాణిజ్య సరళిలో దూడలు, పడ్డలు, వట్టిపోయిన పశువుల పెంపకాన్ని జీవాల పెంపకాన్ని సిల్విపాశ్చర్‌కు అనుబంధంగా ప్రారంభిస్తే వాటి పోషణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.

ప్రస్తుతం చాలా తోటలలో డ్రిప్‌ మరియు స్ప్రింక్లర్‌ ఇరిగేషన్‌ సదుపాయాలు ఉన్నాయి. వాటినే వినియోగించుకుంటూ గ్రాసాలను సాగు చేస్తే గ్రాసాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. గ్రాసాలను కోసి మేపలేని సందర్భాలలో తోటలో పశువుల్ని, జీవాలను స్వేచ్ఛగా వదిలితే అవే మేస్తాయి. ఇందువల్ల వాటిని మేపవలసిన శ్రమ కూడా తగ్గుతుంది.

సిల్విపాశ్చర్‌కు – ఏఏ గ్రాసాలను ఎలా ఎంచుకోవాలి: నీటి ఎద్దడిని, వేసవి తీవ్రతలను తట్టుకుని, బురద నేలల్లో కూడా నశించకుండా ఉండే రకాలు, పోషక విలువలు ఎక్కువగా ఉండి, దంటు తక్కువగా ఉండే మృదువైన గ్రాసాలు, తక్కువ సూర్యరశ్మిలో చెట్ల నీడలో కూడా పెరగగలిగే రకాలు, ఎక్కువ సాగునిచ్చే రకాలు, విష స్వభావాలు లేని గ్రాసాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. పశువులు, జీవాలు, తొక్కినప్పటికీ నశించని అతివృష్టి, అనావృష్టులను తట్టుకోగల గుణం కూడా ఈ గ్రాసాలలో ఉండాలి.

అవిసె, సుబాబుల్‌, మల్బరీ చెట్లు కూడా చాలా పుష్టివంతమైన గ్రాసాలను అందిస్తాయి. కొబ్బరి, తమలపాకు తోటలు వాటి సాగుకు చాలా శ్రేష్ఠమైనవి. తోట హద్దుల మీద సుబాబుల్‌, నేపియర్‌ వంటి ఎత్తుగా పెరిగే గ్రాసాలను ఎంపిక చేసుకోవచ్చు. 

పారాగాడ్డి, దీనానాధ్‌ గ్రాసాలు మరియూ అంజన్‌ గడ్డి, గరిక గడ్డి, లూసర్న్‌, బెర్సీమ్‌, జనుము, స్ట్రెలో హమాటా, పిల్లిపెసర, అలసంద, వెల్వెట్‌ బీన్స్‌, ఉలవ తదితర గ్రాసాలను సాగు చేస్తే ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేస్తూ ఉండాలి.

తోటలలో చెట్ల మధ్య, గట్ల మీద, చేపల చెరువుల గట్ల మీదకూడా పశుగ్రాసాలను సాగు చేస్తూ పశువులు, జీవాల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఆర్థిక, సాంకేతిక సహకారాలు అందించి ప్రోత్సహిస్తే పాడిపరిశ్రమకు జీవాల పెంపకానికీ రైతాంగానికీ, ఎంతో మేలు చేకూరగలదు.

డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611

Read More