ప్రకృతిని ఇబ్బంది పెట్టకూడదు

మనతోపాటు ఈ విశ్వంలో జీవనాన్ని కొనసాగిస్తున్న అనంత జీవకోటి, ఈ విశ్వంలో ఉన్న అన్నీ కూడా ప్రకృతిలో భాగమే. మిగతా వాటి గురించి ప్రక్కన పెడితే భూమండలంలో జీవించే ప్రాణికోటి మొత్తం ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తుంది. మనం పీల్చే గాలి, మనం త్రాగే నీరు, మనం తినే ఆహారం. ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో నుంచి మనం పొందుతున్నాము. ఈ విషయం అందరికీ తెలిసిందే కాని చాలామంది ఈ విషయాన్ని గ్రహించకుండా ప్రకృతిని అశ్రద్ధ చేస్తున్నారు. ప్రకృతి అంటే ఏదో తమకు సంబంధించినది కాదు అనే భావంతో చాలామంది తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిని అశ్రద్ధ చేస్తున్నారు. ప్రకృతిని అశ్రద్ధ చేయటం వలన, ప్రకృతికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వలేకపోవడం వలన  అనేక అనర్థాలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇంకా కూడా జరుగుతూనే ఉంటాయి అనే మాట అక్షర సత్యం. ప్రకృతి వలన జరిగే అనార్థల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే ఇటీవల ఉద్భవించిన కరోనాను ఉదాహరణగా తీసుకుంటే అందరికీ బాగా అర్థం అవుతాది కరోనా ఇటీవల జరిగిన వినాశనం కాబట్టి అందరికీ గుర్తు ఉంటుంది. ప్రపంచం మొత్తం కరోనాతో అతాలకుతలం అయ్యిందనే విషయం అందరికీ తెలిసిందే. 

కరోనా వలన కొంతమంది చాలా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది తక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయం అర్ధం అవుతుంది. ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ, ప్రకృతితో ఎక్కువగా మమేకమయ్యేవారు కరోనా వలన పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. ప్రకృతికి దూరం జరిగి, ప్రకతికి విరుద్ధమైన జీవనశైలికి అలవాటు పడ్డవారు కరోనా వలన ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయం అక్షర సత్యం. ఈ ఉదాహరణతో ప్రకృతి యొక్క ప్రాముఖ్యత సులభంగా తెలుసుకోవచ్చు. మనము మరియు మనతోపాటు జీవనాన్ని కొనసాగించే అనంత జీవకోటి క్షేమంగా జీవనాన్ని కొనసాగించాలంటే ప్రకృతిని ఇబ్బంది పెట్టకూడదు. ప్రకృతిని నాశనం చేయకూడదు అనే విషయం తెలుస్తుంది. మిగతా రంగాలను ప్రక్కన పెడితే వ్యవసాయ రంగం కూడా ప్రకృతిని ఇబ్బంది పెట్టడములో తనవంతు పాత్రను పోషిస్తుందనడంలో సందేహం లేదు. దాని ఫలితంగానే వ్యవసాయరంగంలో అనేక ఆటుపోట్లు సంభవిస్తున్నాయి. రైతులు అనేక రకాలుగా నష్టాలను భరించవలసి వస్తుంది. విష రసాయనాలతో పండించిన ఆహారాలను రైతులు ప్రజలకు అందిస్తున్నారు. విష రసాయనాలతో నేల, నీరు, ఆహారం, వాతావరణం కలుషితమవుతుంది. అందువలననే అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. ఈ విషయాలను గమనించిన చాలామంది ఔత్సాహికులు ప్రకృతిని ఇబ్బంది పెట్టని సాగు పద్ధతుల వైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. ఈ కోవకి చెందుతారు హైదరాబాదు శివారు ఘట్‌కేసర్‌లో వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తున్న విజయ్‌.

వ్యవసాయరంగంతో ఏలాంటి ప్రత్యక్ష సంబంధం లేని విజయ్‌ ఉన్నత చదువులు చదివి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో మనం తినే ఆహారంలో ఉండే విష రసాయనాల గురించి తెలుసుకుని తన గమ్యం ఆరోగ్యకర ఆహారాన్ని సమాజానికి అందిస్తూ రసాయన అవశేషాలు లేని భూమిని తరువాత తరాలకి అందించడమే అని తలచి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయరంగంలో అడుగు పెట్టాడు. తనకు సొంత భూమి లేదు కాబట్టి ఘట్‌కేసర్‌ సమీపంలోని అవిషాపూర్‌లో కొంత పొలాన్ని కౌలుకి తీసుకుని 2015 వ సంత్సరం నుండి పూర్తి సేంద్రియ పద్ధతులో వరి, మామిడి, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల సాగుతో పాటు నాటుకోళ్ళను కూడా పోషిస్తూ గుడ్లను వినియోగదారులకు అందిస్తూ వస్తున్నారు.

తాము వ్యవసాయంలోకి ప్రవేశించిన ప్రారంభంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినాకాని వెనుకంజ వేయకుండా అన్ని ఆటుపోట్లను తట్టుకుంటూ ముందుకు నడుస్తూ తమ సమస్యలకు కొంతలో కొంత పరిష్కారంగా సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల దుకాణాన్ని హైదరాబాద్‌ నగరంలోని అల్వాలు ప్రాంతంలో ప్రాచీన పేరుతో ఏర్పాటు చేశారు. సేంద్రియ  సాగులో ఎదరుయ్యే ఆర్థిక సమస్యలకు పరిష్కారం కావాలంటే తమ సేంద్రియ ఉత్పత్తులను ఆశాజనకమయిన ధరలకు వినియోగదారులకు నేరుగా అమ్మగలగాలి. దానికి సరైన దారి సేంద్రియ ఉత్పత్తుల అమ్మకం దుకాణం కాబట్టి అటువైపు అడుగులు వేశారు. వినియోగదారులకు అవసరమయిన అన్ని వస్తువులను అందుబాటులో ఉంచాలి కాబట్టి తాము పండించలేని ఆహార ఉత్పత్తులను తోటి రైతుల చేత పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేయించి రైతుల వద్ద నుంచి మంచి ధరలకు ఉత్పత్తులను కోనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. తాము ఒప్పందం కుదుర్చుకున్న రైతులకు అన్ని సాంకేతిక సలహాలను సమయానుకూలంగా అందిస్తూ రైతులు ఆరోగ్యకర దిగుబడి సాధించటములో తమవంతు పాత్రను పోషిస్తున్నారు.

మామిడి: మిగతా ఆహార పదార్థాల కంటే మామిడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాము సొంతంగా మామిడి సాగు చేయడముతో పాటు తోటి మామిడి రైతుల వద్ద నుంచి కూడా మామిడి కాయలు కొనుగోలు చేస్తూ సంవత్సరానికి 10000 కిలోలకు తగ్గకుండా ఆరోగ్యకరమయిన, రుచికరమైన మామిడి కాయలను వినియోగదారులకు సరసమైన ధరలకు అందిస్తున్నారు. ఒక్కసారి ఈ మామిడి కాయల రుచి చూసిన వినియోగదారులు తిరిగి తిరిగి కొనుగోలు చేస్తున్నారు. మొదటలో 100 మందితో మొదలైన వినియోగదారుల సంఖ్య ప్రస్తుతానికి 3000 పైగా పెరిగింది. మామిడి కాయల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడకపోవటం వలననే వినియోగదారుల సంఖ్య పెరిగింది.

మామిడితో పాటు వరి, వివిధ రకాల ఆకుకూరలు, గోరుచిక్కుడు, చిక్కుడు, టమాట, చెర్రి టమాట లాంటి వాటిని పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తున్నారు. వీరు సాగు చేసే పంటలకు దుక్కిలో పశువుల ఎరువు, గొర్రెల, మేకల ఎరువు అందించడంతో పాటు పంచగవ్య, జీవామృతం, థపర్ణి కషాయం, నీమాస్త్రం లాంటి వాటిని ఉపయోగిస్తూ ఎలాంటి రసాయనాలు లేకుండా పూర్తి సేంద్రియ పద్ధతులతో ఆరోగ్యకర దిగుబడులు సాధిస్తూ సొంతంగా వినియోగదారులకు అమ్మకం చేస్తున్నారు. మరిన్ని వివరాలు 9848312988 కి ఫోను చేసి తెలుసుకోగలరు.     

మామిడి కాయలను ఇబ్బంది పెట్టకుండా సహజంగా పండనివ్వాలి

మనం పొందే ఆహారం ప్రకృతి నుంచే లభిస్తుంది కాబట్టి ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని పొందగలిగితే ఆ ఆహారం రుచిగా, ఆరోగ్యంగా ఉంటుందనడంలో సందేహం లేదు. మామిడిని ఉదాహరణగా తీసుకుంటే కొంతమంది రైతులు వివిధ రకాల కారణాలు, సమస్యల వలన పూర్తిగా తయారు కాని మామిడి కాయలను వివిధ రకాల పద్ధతులతో మాగించి మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నారు. కాబట్టి అవి సరిగ్గా రుచిగా లేకపోవడంతో పాటు అరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా పూర్తిగా తయారయిన కాయలను మాత్రమే చెట్టునుంచి కోసి, ఆ కాయలను 40 డిగ్రీల సెంటీగ్రేడు ఉన్న వెచ్చని నీటిలో కడిగి అవి ఆరిన తరువాత వరిగడ్డిలో మాగపెట్టి వినియోగదారులకు అందిస్తున్నారు. ఇక్కడ వీరు మామిడి కాయలను ఇబ్బంది పెట్టకుండా సహజ సిద్ధంగా పండే అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి రుచి బాగా ఉంటుంది. కాబట్టి వినియోగదారులు మరలా మరలా కొనుగోలు చేస్తున్నారని విజయ్‌ అంటున్నారు. బంగినపల్లి, చిన్నరసాలు, పెద్ద రసాలు, థేరి, కేసరి లాంటి రకాలను ఎక్కువగా అమ్మకం చేస్తున్నారు.  

వినియోగదారుల ఆరోగ్యం, ఆనందం మాకు తృప్తినిస్తుంది

వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాము కాబట్టి వినియోగదారుల సంఖ్య ఏఏటికాయేడు పెరుగుతూ ఉంది. మేము అందించిన మామిడికాయలు తిన్న వినియోగదారులు మామిడి కాయల రుచిని ఆస్వాదించిన తరువాత తమ ఆనందాన్ని మాకు తెలియచేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు మామిడి రుచి ఇలా ఉంటుందనే విషయం మేము అందించిన మామిడి పండ్లను తిన్న తరువాత తెలిసిందని, నిజమైన మామిడి రుచిని తెలియ చేసినందుకు మాకు కృతజ్ఞతలు చెబుతూ మెసేజ్‌లు పంపుతుంటారు. ఇలాంటి మెసేజ్‌లు మాకు ఎంతో తృప్తిని కలుగ చేస్తున్నవని, సమాజానికి ఆరోగ్యకర ఆహారాన్ని అందించే సామాజిక బాధ్యత గల వ్యాపకంలో ఉండటము మాకు చాలా ఆనందంగా ఉందని విజయ్‌ అభిప్రాయపడుతున్నాడు. 

Read More

సమగ్ర సుస్థిర వ్యవసాయంలో పంట అవశేషాల ప్రాముఖ్యత

ప్రపంచ వ్యవసాయంలో భారతదేశం ఆహార ధాన్యాలు, నూనెగింజలు మరియు చెరుకు ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. వివిధ విభిన్న వ్యవసాయ వాతావరణ పంటలు దేశం మండలాల్లో అనేక రకాలు నలుమూలల్లో పండిస్తున్నారు. ఈ పంటల నుండి ప్రధాన ఆర్థిక ఉత్పత్తుల వినియోగం కోసం కోతానంతరం దాదాపు 500 మిలియన్‌ టన్నులు ఒక సంవత్సరానికి పంట అవశేషాలు భారతదేశంలో లభ్యమవుతున్నాయి. స్థానిక అవసరాలైన పశువుల మేత, వంట చెరకు మరియు సేంద్రియ ఎరువులుగా వాడిన తర్వాత కూడా దాదాపు 30% పంట అవశేషాలు మిగులు ఉంటుంది. అంటే సంవత్సరానికి 234 మిలియన్‌ టన్నులు మిగులు ఉంటుందని చాలామంది రైతులు ఎంతో విలువైన పంట అవశేషాలను తగులబెట్టి తర్వాత పంటకు నేలని తయారు చేస్తున్నారు. ముఖ్యంగా వరి, ప్రత్తి, మొక్కజొన్న, చెరకు మరియు వేరుశనగ లాంటి పంట వ్యర్థాలు ప్రపంచ వ్యాప్తంగా పంట వ్యర్థాలను తగలబెట్టటంలో చైనా, భారత్‌, అమెరికా మరియు ఆఫ్రికా దేశాలు అగ్ర స్థానంలో నిలుస్తున్నాయి. కేవలం వరి, గోధుమ మరియు చెరకు పంటల వ్యర్థాలు తగలబెట్టటంలో 82% వాటా కలిగి ఉన్నాయి.

పంట అవశేషాలను తగలబెట్టుటకు ముఖ్య కారణాలు:

  • వరిని కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో కోత కోసినప్పుడు వెలువడిన అవశేషాలు ఏరుట కష్టంగా ఉండడం
  • పశు సంపద తగ్గిపోవడం
  • పంట వ్యర్థాలు కుళ్ళడానికి 15-20 రోజుల సమయం వృధా కావడం
  • వేగంగా కలుపు మరియు చీడపీడల నివారణ జరగడం
  • వ్యర్థాల యాజమాన్యానికి అధిక ఖర్చు కావడం

పంట అవశేషాలను తగలబెట్టడం వలన కలిగే నష్టాలు

  • వాతావరణ కాలుష్య కారకాలు అయిన విషవాయువులు ముఖ్యంగా మీథేన్‌ మరియు కార్బన్‌డయాక్సైడ్‌ వెలువడటం.
  • వాతావరణ మార్పులు జరగడం
  • నేలలో పోషకాల క్షీణత అనగా ఒక టన్ను పంట వ్యర్థాలు తగలబెట్టడం వలన 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరము, 25 కిలోల పొటాష్‌, 1.2 కిలోల గంధకము మరియు 400 కిలోల సేంద్రీయ కర్బనం నష్టపోవడం జరుగుతుంది.
  • నేలలోని పోషక లభ్యతకు అనుకూలించే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు చనిపోతున్నాయి.
  • విలువైన పశుగ్రాసాల నష్టం జరుగుతుంది.
  • మానవుల ఊపిరితిత్తులకు సమస్యలు కలిగించే క్యాన్సర్‌ కారకాలు విడుదలవుతున్నాయి.

పంట అవశేషాలు సుస్థిర యాజమాన్యం

  • స్వల్పకాలిక వరి రకాలను ఎన్నుకోవడం ద్వారా త్వరగా కోతలు చేపట్టి పంట వ్యర్థాలను నేలలో కలియదున్నుకోవాలి.
  • పంట మార్పిడి చేయడంతో పంట అవశేషాలు యాజమాన్యం సలువుగా ఉంటుంది.
  • పంట అవశేషాలను సైలేజ్‌గా పశుగ్రాసాలుగా వాడుకోవడం
  • పంట అవశేషాలను వివిధ రకాల జీవుల సమ్మేళనంతో (వేస్ట్‌ డికంపోజర్‌) కంపోస్టింగ్‌ పద్ధతిలో వాడుకోవడం ద్వారా నేల భౌతిక మరియు రసాయన లక్షణాలు మెరుగపడడమే కాకుండా భూసారం మరియు నీరు నిలుపుకునే శక్తి పెరుగుతుంది.
  • వరి, గోధుమ, పొద్దు తిరుగుడు మరియు మొక్కజొన్న వంటి పంటల వ్యర్థాలను, విద్యుత్‌ ఉత్పత్తి పరిశ్రమకు ముడి సరుకుగా వాడుతున్నారు.
  • వరి, మొక్కజొన్న, జొన్న మరియు సజ్జ వంటి పంటల నుండి వెలువడిన అవశేషాలను మల్చింగ్‌గా వాడవచ్చు.
  • వరి అవశేషాలను పుట్టగొడుగుల పరిశ్రమకు వాడడం జరుగుతుంది.
  • మొక్కజొన్న, జొన్న వ్యర్థాలను జీవ ఇంధనం తయారీకి వాడుతున్నారు.
  • ప్రత్తి, చెరుకు పంటల అవశేషాలతో పేపర్‌ తయారు చేస్తున్నారు.
  • ప్యాకింగ్‌ పదార్థాలుగా పంట అవశేషాలు వాడడం
  • వరి కోత యంత్రాలకు, వరిగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసే పరికరాన్ని అమర్చుకోవడం ద్వారా పంట అవశేషాలు నేలలో త్వరగా విచ్ఛిన్నం కావడానికి వీలుగా ఉంటుంది.
  • వరిగడ్డిని చుట్టలుగా చుట్టే యంత్రంను వాడడం.
  • పత్తి పంటను తీసుకున్న తర్వాత షెడ్డర్‌ యంత్రంతో చిన్న ముక్కలుగా చేసి నేలలో కలియదున్నడం.
  • వరి పంట తర్వాత దున్నకుండా మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్‌ పద్ధతిలో సాగు చేయడం.
  • పత్తి, కంది కట్టెలను బయోచార్‌ రూపంలో కాలబెట్టి పంటలకు వాడటం.
  • పంట వ్యర్థాలను బయోగ్యాస్‌ ప్లాంట్‌ ద్వారా బయోగ్యాస్‌ తయారీకి వినియోగించడం.
  • పంట అవశేషాలను వర్మీకంపోస్ట్‌గా తయారు చేసి కేవలం 45 రోజుల్లో పంటలకు ఎరువుగా అందించడం.
  • హ్యాపీ సీడర్‌ పరికరంతో తరువాత పంటను సాళ్లల్లో పెట్టుకోవడం ద్వారా పంట అవశేషాలు నేలలో ఉన్నప్పటికీ మొకల శాతం దెబ్బతినకుండా ఉంటుంది.
  • మల్చర్‌ అనే పరికరంతో వరి, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు మరియు పొగాకు పంట అవశేషాలను మల్చింగ్‌ కొరకు వాడుకోవడం
  • రోటోవేటర్‌ను ఉపయోగించి వేసవిలో మిగిలిన పంట వ్యర్థాలను భూమిలో కలియ దున్నడం.

ఈ విధంగా ఎంతో విలువైన పంట అవశేషాలు తగలబెట్టకుండా వ్యవసాయంతో పటు వివిధ పరిశ్రమలకు ముడి సరుకుగా వాడుతూ సద్వినియోగం చేయడం ద్వారా వృధాగా పోయే వాటిని సంపదగా మార్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని రైతు సోదరులు గమనించాలి. 

డా. టి. వినోద్‌ కుమార్‌, వ్యవసాయ విస్తరణ విభాగ శాస్త్రవేత్త, 

బి. నవ్య, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త, డా|| ఎ. శ్రీనివాస్‌, ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ అండ్‌ హెడ్‌, కెవికె, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రామ్‌గిర్‌ ఖిల్లా, పెద్దపల్లి. 

Read More

పుట్టగొడుగుల సాగు యువతకు ఎంతో మేలు

వ్యవసాయనికి అనుబంధ రంగమైన పుట్టగొడుగుల పెంపకం, యువతకు మరియు ఇంట్లోనే ఉంటూ ఉపాధి చేసుకోగలిగిన మహిళలకు ఎంతో లాభకారమైనది. వివిధ రకాల పుట్టగొడుగులు మన దేశములో సాగు చేయబడుచున్నవి. అందులో ముఖ్యముగా  శ్రీకాకులము జిల్లా యొక్క వాతావరణ పరిస్థితుల్లో ముత్యపుచిప్ప పుట్టగొడుగు, వరి గడ్డి పుట్టగొడుగు  మరియు పాల పుట్టగొడుగుల పెంపకము చేపట్టవచ్చును. ఎన్నో పోషక విలువలు కలిగి ఉండి, క్రొవ్వు మరియు పిండి పద్ధారం తక్కువగా ఉండటం మరియు ముఖ్యంగా మాంసకృత్తులు అధికంగా ఉండటం వీటి ప్రత్యేకత. పెరుగుదలకు కావాల్సిన లైసిన్‌ అనే అమైనో ఆమ్లం వీటిలో ఉండటం వల్ల ఇవి అధిక జీర్ణ శక్తిని (60-70%) కలిగి ఉంటాయి.  పుట్టగొడుగుల్లో కొవ్వు పదార్ధాలు చాలా తక్కువగా ఉండటమేకాక ఇవి శరీరానికి అవసరమైన మంచి కొలస్ట్రాల్‌ ను పెంచుతూ, గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలస్ట్రాల్‌ ను తగ్గిస్తుంది.

ఇటీవల కాలంలో పుట్టగొడుగులలో ఉండే పోషక విలువలు, ఉపయోగాల గురించి అందరిలో అవగాహన పెరుగుతున్నందు వల్ల, మరియు వాతావరణ పరిస్ధితులకు అనుకూలమైన వివిధ రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉండటం వలన చాలా మంది నిరుద్యోగ యువత, రైతులతో పాటు  మహిళలు కూడా పుట్టగొడుగుల పెంపకం పై ఆసక్తి చూపిస్తున్నారు.

1. ముత్యపు చిప్ప పుట్టగొడుగులు

ఈ పుట్టగొడుగులు విచ్చుకొని ముత్యపు చిప్ప ఆకారంలో ఉండటం వల్ల వీటికి ఆపేరు వచ్చింది. వీటిలో తెల్ల ముత్యపు చిప్ప, ఎల్లో ముత్యపు చిప్ప, గ్రే మరియు పింక్‌ రకం ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిని రైతులు తమ వద్ద లభించే వరిగడ్డితోనే కాక వ్యవసాయ సంబంధమైన ఏ వ్యర్ధపదార్డం ఉపయోగించి అయినా సులభంగా పండించవచ్చును. మిగతా రకాలతో పోలిస్తే ఇవి అధిక దిగుబడులను ఇస్తాయి. కాబట్టి తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడికి అధిక లాభాలను సంపాదించే రకంగా ఇవి ప్రాచుర్యాన్ని పొందాయి. వీటిని అధికంగా దక్షిణ భారతదేశంలో సాగు చేస్తారు.

సాగు చేయు విధానం : 

వరిగడ్డి చౌకగా మరియు సులభంగా దొరకటం వల్ల దీన్ని వాడతారు. ముందుగా వరిగడ్డిని 3-5 సెం.మీ. ముక్కలుగా చేసుకోవాలి. తరువాత మంచి నీటిలో 4-6 గంటలు నానబెట్టిన తర్వాత నీటిని తీసివేయాలి. ఇలా నానబెట్టిన గడ్డిని గొనె సంచిలో నింపి వేడి నీటిలో ఒక గంట పాటు ఉంచి తరువాత తీసివేసి గడ్డిలో 60-65% తేమ ఉండేలా ఆరబెట్టాలి. తేమ శాతం తనిఖీ చేయడానికి చేతినిండా గడ్డిని తీసుకోని వెళ్ళ మధ్య ఉంచి పిండినట్లయితే నీరు కారకుండా ఉన్నట్లయితే తగినంత తేమ శాతం ఉన్నట్లుగా నిర్ధారించుకోవచ్చు. పాలిధీన్‌ సంచుల్లో ఆరబెట్టిన వరిగడ్డి ముక్కల్ని 5 సెం. మీ. మందాన వేసి విత్తనాన్ని అంచుల వెంట కాకుండా మధ్యలో వేయాలి. 1 కేజీ వరిగడ్డికి 50 గ్రా. స్పాన్‌ కలిపి మరి గట్టిగా వత్తకుండా సంచులలో నింపి రబ్బరు బ్యాండ్‌ బిగించాలి. తర్వాత సంచులను స్పాన్‌ రన్నింగ్‌ గదిలోకి మార్చాలి.

ప్రతి రోజు గదిలో తగినంత తేమ, ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3-4 వారాల్లో బెడ్లపైన తెల్లని శిలింధ్రం దట్టంగా వ్యాపిస్తుంది. ఇలా తయారైన బెడ్లపైన పాలిధీన్‌ సంచులను శుద్ధి చేసిన బ్లేడుతో కత్తిరించాలి. గదిలో గాలి మరియు వెలుతురు సరఫరా అయ్యేలా చూసుకోవాలి.

ఇలా చేసిన తర్వాత 6-7 రోజులకు మొదటి పంట వస్తుంది. బెడ్లను రోజుకు 2 సార్లు తడిపి తేమ 65% ఉండేలా చూసుకోవాలి. తర్వాత 15 రోజుల వ్యవధిలో రెండవ మరియు మూడవ పంట వస్తుంది. బెడ్లను ప్రతిరోజు పరిశీలిస్తూ నలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగు ఉన్న బెడ్లను తీసి దూరంగా గుంటలో వేయాలి. లేకుంటే ఇతర బెడ్లకు వ్యాపించే అవకాశం ఉన్నది. ప్రతి కిలో ఎండు గడ్డి నుండి దాదాపు కిలో పచ్చి పుట్టగొడుగులు వస్తాయి. వీటిని తాజాగా ఉన్నప్పుడే 24 గంటల్లో మార్కెటింగ్‌ చేయాలి. ఫ్రిజిలో అయితే 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అదే ఎల్లో పుట్టగొడుగులు గది ఉష్ణోగ్రత వద్ద 3 రోజులు మరియు ఫ్రిజ్‌ లో అయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి.

2. పాల పుట్టగొడుగులు

ఈ పుట్టగొడుగుల పెంపకం కొద్దిపాటి చిన్న మార్పులతో ముత్యపుచిప్ప పుట్టగొడుగుల పెంపకమును పోలి ఉంటుంది. ఈ పుట్ట గొడుగుల పెంపకానికి 30-35 డిగ్రీల సెం. ఉష్ణోగ్రత మరియు 80-95% గాలిలో తేమ తగిన వెలుతురు అవసరం. మార్చి నుండి అక్టోబరు వరకు గల వాతావరణం చక్కగా అనుకూలిస్తుంది. పరిస్దితులకు అనుకూలంగా తగుపాటి జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరమంతా ఈ పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చును.

సాగుచేయు విధానం

వీటి సాగులో రెండు థలు ఉంటాయి. మొదటి 21- 24 రోజులు ఇంక్యుబేషన్‌ కోసం డార్క్‌ రూమ్‌ సృష్టించుకోవాలి. 24వ రోజున కేసింగ్‌ చేసి కాంతి అందే చోట సాగు చేయాలి.

పాల పుట్టగొడుగు సాగు కోసం వరిగడ్డిని సేకరించి క్రీమిరహితం చేసుకోవాలి. ఇలా క్రిమీరహితం చేసిన గడ్డిని 50% తేమశాతం ఉండేలా ఆరబెట్టుకోవాలి. నాణ్యమైన పాల పుట్టగొడుగు స్పాన్‌ను తీసుకొని, సమాన నాలుగు భాగాలుగా చేసుకోవాలి. స్పానింగ్‌ చేసే ముందు చేతులను క్రిమిరహితం చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్‌ సంచిలో స్పాన్‌ మరియు వరిగడ్డి పొరలుగా వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బ్యాగులకు రంధ్రాలు పెట్టి వాటిని డార్క్‌ రూమ్‌ లో 21-24 రోజుల వరకు ఉంచవలెను. డార్క్‌ రూమ్‌ లో  28-35 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉండాలి.

కేసింగ్‌ ప్రక్రియ 24 వ రోజున పాటించవలెను. ఇందుకోసం నల్లమట్టి, కొకోపీట్‌, వెర్మికాంపోస్ట్‌,వంటివి వాడవలెను. పి. హెచ్‌ నిర్వహణ కోసం చాక్‌ పౌడెర్‌ వంటివి కలపవచ్చు. ఒక సంచిని రెండు భాగాలుగా చేసి దానిమీద కేసింగ్‌ మట్టిని వేసుకోవాలి. ఇలా కేసింగ్‌ చేసిన వాటిని కాంతి అందే గదిలో పెట్టుకోవాలి. ఇక్కడ 28-35 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత మరియు 80-85% తేమశాతం ఉండవలెను. ప్రతిరోజు పైన ఉన్న మట్టిలో తేమశాతం ఉండేలా చూసుకోవాలి. ఒక 10-12 రోజుల తరువాత మొలకలు కనిపిస్తాయి అనంతరం 18-20 రోజుల్లో పంట అందుతుంది.

3. వరిగడ్డి పుట్టగొడుగులు

ఈ  పుట్టగొడుగులు  ఉత్తరకోస్తాంధ్రలో  మరియు ఒడిస్సా ప్రాంతాలలో ఎక్కువగా  సాగు చేయబడుచున్నవి. వీటిని పెంచటానికి వరిగడ్డిని ఉపయోగిస్తారు. వీటి కాడలు మృదువుగా ఉండి పొడవుంటాయి. వీటి పెరుగుదలకు 30-350 సెల్సియస్‌ ఉష్ణోగ్రత మరియు 85-90% గాలిలో తేమ ఉండే ప్రదేశాలు అనుకూల మైనవి. వరిగడ్డి పుట్టగొడుగులను గడ్డి పుట్టగొడుగులు అని, ప్యాడి స్ట్రా పుట్టగొడుగులు అని అంటారు. ఈ పుట్టగోడుగులు విత్తనం వేసిన 15 రోజులలో కోతకు వస్తాయి. ఈ రకం పుట్టగొడుగుల నిల్వ కాలం 24 గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత పుట్టగొడుగులు నీరులాగ వాసన ప్రసరింపచేస్తాయి. 

సాగు చేయు విధానం

ఒక కిలో వరిగడ్డిని సుమారు 5 సెం. మీ. మందం, 85-90 సెం.మీ. పొడవు గల కట్టలుగా కట్టాలి. ఇటుకలు పేర్చి నేల మట్టానికి కొంచెం ఎత్తుగా మడి చేయడానికి ప్లాటఫారామ్‌  తయారు చేయాలి. గడ్డి కట్టలను నీటిలో ముంచి సుమారు 12-16 గంటలు నానబెట్టి తీయాలి. ఎక్కవగా ఉన్న నీరు జారిపోయేటట్లుగా కట్టలను 15-20 నిమిషాలు నిలబెట్టాలి. కొయ్య చట్టాన్ని  తుడుచి శుభ్ర పరచాలి. దానిని ప్లాట్‌ ఫాం పై ఉంచి మొదటి వరుస 6-8 గడ్డి కట్టలను ఒకదాని ప్రక్కన ఒకటిగా పేర్చాలి. మొదటి వరుస కట్టలపై పుట్టగొడుగుల విత్తనాన్ని అంచుల నుండి 10 సెం. మీ ఎడంగా కుప్పలుగా నాలుగు ప్రక్కలా ఉంచాలి. మొదటి వరుస గడ్డి కట్టల పై సుమారుగా 5 గ్రా. పప్పుపోడిని మరియు నీటిని చల్లాలి. అదే విధంగా మొదటి వరుసకు అడ్డంగా నీటిని చల్లాలి. అదే విధంగా మొదటి వరుసకు అడ్డంగా రెండో వరుస వేసి మూడవ వరుసకు అడ్డంగా నాల్గవ వరుస గడ్డి కట్టలను పేర్చుతూ వరుసల మధ్య విత్తనాన్ని, పప్పుపొడి, యూరియా నీళ్ళను చల్లాని. ఐదవ వరుస పై అంచుల వెంటనే కాకుండా ఉపరితలం అంతటా విత్తనం పప్పుపొడి, యూరియా నీళ్ళను చల్లాలి. చేతులతో కట్టలను కొంచెం నొక్కి మైనపు కాగితంతో కప్పాలి. ప్రతి రోజు మైనపు కాగితాన్ని తీసి మడిలో తేమ ఆరిపోకుండా కొంచెం మంచి నీటిని చల్లాలి. గది/పాకలో తగినంత తేమ, చల్లదనం కొరకు గోడల వెంట తడిపిన గొనె పట్టాలను వ్రేలాడదీసి అవసరము మేర వాటిని నీటితో తడుపుతూ ఉండాలి. వారము నుండి పది రోజులలో పుట్టగొడుగుల మొలకలను గమనించవచ్చును.

ఇవి 4-5 రోజులలో బాగా పెద్దవి అవుతాయి. గొడుగులు విచ్చుకోకముందే అంటే గుండు థలోనే వాటిని కోసుకోవాలి. ఒక వారం రోజులలో రెండవ కాపు మరొక వారంలో మూడవ కాపు వస్తాయి. పుట్టగొడుగులు ప్రతి మడికి 2-3 కిలోలు రాగలవు. మడికి చీమలు పట్టకుండా 10 శాతం బి.హెచ్‌.సి పొడిన చల్లాలి. మడిని నీలి / ఆకుపచ్చ / నలుపు రంగు గల శిలీంధ్రము ఆశించే అవకాశముంది. అటువంటి వాటిని తీసి నాశనం చేయాలి. లేనిచో మిగిలిన వాటికీ కూడా ఈ శిలింధ్రం వ్యాపించి ఎక్కువ నష్టం కలుగచేస్తుంది. గొడుగులు విచ్చుకోక ముందు కోయవలెను. కోసిన తరువాత వేడి నీళ్ళలో గాని, ఉప్పు నీళ్ళలో గాని ఉంచవలెను.

పుట్టగొడుగులపై వచ్చే వ్యాధులు-నివారణ

ఏ రకానికి చెందిన పుట్టగొడుగులు అయినా, పరిశుభ్రమైన వాతావరణంలో తగు జాగ్రత్తలతో పెంచి ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలి. లేకుంటే తరచుగా బెడ్స్‌ మీద నలుపు, ఆకుపచ్చ బూజులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి బెడ్లపై కనిపిస్తే దానిని జాగ్రత్తగా చాకుతో తీసివేసి, ఆ ప్రదేశాలలో బావిస్టిన్‌ (0.1 శాతం) పిచికారి చేయాలి. స్పాన్‌ రన్నింగ్‌ గదుల్లో దోమలు, నల్లులు, స్ప్రింగ్‌ టైల్స్‌, నులి పురుగులు, బాక్టీరియా మరియు వైరస్‌ ఆశిస్తాయి. పుట్టగొడుగులను ప్రధానంగా స్టాప్‌ మిల్‌ డ్యూ, బ్రౌన్‌ ప్లాస్టర్‌ మోల్డ్‌, వైట్‌ ప్లాస్టర్‌ మౌల్డ్‌, అవివ్‌ గ్రీన్‌ మాల్డ్‌, నలుపు, ఆకుపచ్చ, బాక్టీరియా మచ్చ తెగుళ్ళు ఆశిస్తాయి.

వీటి నివారణకు గదిలో బావిస్టిన్‌ (0.1 శాతం) లేదా ఫార్మాల్డీహైడ్‌ (10%) గదులు, గోడల వెంట గోనె సంచుల పైన మరియు నేల మీద ఉన్న ఇసుక పైన ప్రతి 10 రోజులకు ఒకసారి చల్లాలి. అలానే బెడ్స్‌లో దోమ కన్పించినట్లయితే వేప ద్రావణాన్ని (5 మి. లీ./లీ. నీటికి) కలిపి చల్లాలి.  పుట్టగొడుగుల బెడ్‌పై బాక్టీరియా మచ్చలు కనిపేస్తే 2 గ్రా. బ్లీచింగ్‌ పౌడర్‌ 10 లీ. నీటిలో కలిపి చల్లాలి. క్రాపింగ్‌ రూమ్‌లో ఎప్పటికప్పడు ఫార్మలిన్‌ 5% ద్రావణాన్ని పిచికారి చేయాలి.

పుట్టగొడుగుల పెంపకములో పాటించవలసిన మెళకువలు

*    మంచి రకం విత్తనం (స్పాన్‌)నే వాడాలి. సాగు చేయు స్థలంలో పూర్తి పరిశుభ్రతను పాటించాలి.

*    గదిలో తగినంత ఉష్ణోగ్రత, తేమ వుండేలా జాగ్రత్త వహించాలి.

*    వారానికి కనీసం 2 సార్లు గోడలు, నేలపై ఫార్మాలిన్‌ ద్రావణాన్ని పిచికారి చేయాలి.

*    పిచికారి చేసే సమయంలో బెడ్స్‌ పై నీరు పడకుండా తప్పనిసరిగా ఏదైనా కప్పాలి. క్రాపింగ్‌ రూములలో తగినంత వెలుతురు, గాలి ప్రసరణ వుండేలా చూడాలి. 

*    క్రాపింగ్‌ సమయంలో పుట్టగొడుగులు తీసిన తరువాత మాత్రమే బెడ్స్‌పై నీరు చల్లాలి.

*    గదిలోకి ఎలుకలు, కీటకాలు ప్రవేశించకుండా చూడాలి. గది కిటికీలకు జాలి బిగించాలి.

*    ఆకుపచ్చని నల్లని మచ్చలు కనిపించిన బెడ్స్‌  తక్షణం అక్కడి నుండి తొలగించి పారవేయాలి. తద్వారా వ్యాధి వ్యాపిచకుండా నిరోధించవచ్చు. 

డా.వై.సృజన, డా.ఎస్‌.రమేష్‌ బాబు, డా.డి.శ్రీనివాస్‌, పి. అంజని శ్రీ, ఎస్‌.జోష్ణ, డి. అఖిల సిరి, అన్షుమన్‌ రౌల్‌, కే.చాందినీ, దేవి శివాని కోట, ఎస్‌.దినేష్‌, బి.హర్షవర్ధన్‌, డి.ఝాన్సీ, మొనీష్‌ రెడ్డీ, బి.మౌనిక, సిహెచ్‌. మౌనిక, వ్యవసాయ కళాశాల నైరా, శ్రీకాకుళం జిల్లా,  ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము.

Read More

నేలలో సేంద్రియ పదార్థం తప్పనిసరిగా పెంచాలి  

రిటైర్డ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌  డా|| కె. రామచంద్రం

గతంలో వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టకముందు సేంద్రియ పదార్థం తగిన మోతాదులో అందిస్తూ పంటల సాగు చేపట్టేవారు కాబట్టి సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణం ఉండేది.  ప్రస్తుత పరిస్థితుల్లో నేలలో సేంద్రియ పదార్థం తక్కువగా ఉంది కాబట్టి సేంద్రియ పదార్థాన్ని పెంచుకోడానికి అవసరమైన చర్యలు అయినటువంటి పచ్చిరొట్ట పైర్లు వేయడం, వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియదున్నడం మరియు సేంద్రియ ఎరువులు ఉపయోగించడానికి చర్యలు చేపట్టి క్రమంగా సేంద్రియ పదార్థాన్ని పెంచుకుంటూ పోతే సేంద్రియ సాగు విజయవంత మవుతుందని ఏప్రిల్‌ 29, 30, మే 1 తేదీలలో రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేంద్రియ సాగు విధానం, కషాయాలు, మిశ్రమాల తయారీతోపాటు రైతులు పండిరచిన వ్యవసాయ దిగుబడులకు విలువ జోడిరపు వంటి అంశాలపై గుంటూరు జిల్లా, పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్‌లో నిర్వహించిన రైతు శిక్షణా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ముఖ్య అతిధిగా పాల్గొన్న రిటైర్డ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌  డా. కె. రామచంద్రం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా. సుధ, రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు పొల్గొన్నారు.

పంటల దిగుబడులు, నాణ్యతను పెంచటం, స్వయం ఉపాధిగా తేనేటీగల పెంపకం బాగా ఉపయోగపడుతుంది. తక్కువ పెట్టుబడితో తేనేటీగల పెంపకం చేపట్టవచ్చు. ప్రస్తుత సమాజంలో తేనే వాడకం రోజు రోజు పెరుగుతూ వస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తేనేటీగల పెంపకం చేపట్టగలిగితే స్వయం ఉపాధిగా ఉపయోగపడడంతోపాటు రైతులకు పంట దిగుబడి, నాణ్యత పెరుగుతుందనే లక్ష్యంతో  తేనేటీగల పెంపక విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా. సుధ  విపులంగా వివరించారు. అదే విధంగా తక్కువ పెట్టుబడితో స్ధాపించుకోదగ్గ కుటీర పరిశ్రమలలో పాల పుట్టగొడుగుల పెంపకం ముందు వరుసలో       ఉంటుంది. అంతే కాకుండా అదనపు ఆదాయ వనరుగా కూడా వీటి పెంపకాన్ని సులభంగా చేపట్టవచ్చు అని వివరిస్తూ పాల పుట్టగొడుగుల పెంపకం విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ  డా. సుధ  వివరించారు.

ఫౌండేషన్‌లో ఏర్పాటు చేసిన గోశాల, కట్టెగానుగతో నూనె తీసే ప్రక్రియ, వానపాముల ఎరువు, ఘనజీవామృతం తయారీ విధానం ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. 

ఆహారమే ఔషధం కావాలి : డా. జి.వి. పూర్ణచంద్‌

మనం తినే ఆహారం మనకి శక్తిని ఇవ్వడంతోపాటు మన ఆరోగ్యాన్ని కాపాడగలిగేదిగా ఉండాలి. కాని ప్రస్తుతం మన ఆహారపు అలవాట్లు పరిశీలించినట్లయితే ఈరోజుల్లో మనలో చాలా మంది తినే ఆహారం శక్తిని సక్రమంగా ఇవ్వకపోగా రసాయనాలతో పండిరచిన ఆహారాన్ని తింటున్నాము కాబట్టి మనం తినే ఆహారంలో ఉండే రసాయనిక అవశేషాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం వైపు అడుగులు వేయాలి. అందుకు అనుగుణంగా రైతులు కూడా రసాయానాలు లేకుండా పోషకాలు సక్రమంగా గల ఆహార పదార్థాలను అందించే వ్యవసాయ పద్ధతుల వైపు అడుగులు వేయాలి. ఏది ఏమైనా గాని మనం తినే ఆహారం మనకు ఔషధంలా పనిచేయాలని శిక్షణా కార్యక్రమం మూడవ రోజు ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. జి.వి. పూర్ణచంద్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ సహాయ సంచాలకులు కె. శ్రీకాంత్‌ రెడ్డి, సేంద్రియ రైతులు మీసాల రామకృష్ణ, శబరీనాధ్‌, ఏడుకొండలు మరియు రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు పొల్గొన్నారు.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండే ఆకు కూరలు మరియు కూరగాయలు చాలా వరకు రసాయనాలతో పండిరచినవే అందుబాటులో ఉంచుతున్నారు. కొన్ని సార్లు రైతులు రసాయనాలు పిచికారి చేసిన వెంటనే కూరగాయలు, ఆకుకూరలను మార్కెట్‌లో అందుబాటులో ఉంచడం వలన వాటిలో ఉండే విష రసాయనిక అవశేషాలు ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయం సేంద్రియ పద్ధతులలో కూరగాయలు మరియు ఆకుకూరలు పండిరచడమే. బొప్పాయి మరియు అరటి పంటలు సేంద్రియ సాగుకు అనుకూలం అని మీసాల రామకృష్ణ అన్నారు.  రసాయనిక వ్యవసాయంలో జామ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జామ పంటను ఆశించే నెమటోడ్స్‌ సమస్యకు రసాయనాల్లో సరైన పరిష్కారం లేదు. సేంద్రియంలోనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయం శబరీ అనుభవ పూర్వకంగా తెలుసుకుని గత కొన్ని సంవత్సరాల నుంచి జామ సాగును పూర్తి సేంద్రియ పద్ధలతో సాగు చేస్తూ ఎలాంటి సమస్య లేకుండా మంచి దిగుబడులు సాధించవచ్చని తన అనుభవాన్ని రైతులకు జామ రైతు శబరీనాధ్‌  వివరించారు.

వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపునకు సంబంధించిన వివిధ యంత్రపరికాల వివరాలు అనగా వాటి ధర, అవి పనిచేసే విధానాలను, అవి దొరికే ప్రదేశాలను రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు. శిక్షణకు హాజరైన రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు.

Read More

తొలకరిలో లోతు దుక్కులు అధిక దిగుబడులకు సోపానాలు

వేసవి పంట కోసిన తర్వాత (మార్చ్‌-ఏప్రిల్‌) తొలకరి వానలు కురిసే వరకు (జూన్‌) భూమి ఖాళీగా ఉంటుంది.  సుమారు రెండు, మూడు నెలలు ఎటువంటి వ్యవసాయ పనులు చేయక పోవడం వలన భూమి గట్టి పడుతుంది. మే-జూన్‌ మాసాల్లో తొలకరి జల్లులు కురిసిన వెంటనే కొందరు అనుభవం ఉన్న రైతులు తగినంత తేమ  ఉన్నపుడు నేలను దున్నడం ప్రారంభిస్తారు. కానీ, కొందరు రైతులు ఖరీఫ్‌, రబీ పంటల కోతల తర్వాత మళ్ళీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. ”దున్నకుండా వేస్తే కొయ్యకుండా పోతుంది” అనేది తెలుగు నానుడి. విత్తనాలు విత్తాలన్నా, నారు నాటేయాలన్నా దుక్కిని దున్ని విత్తేందుకు, నాటేందుకు అనుకూలంగా తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ సామెత తెలియచేస్తుంది. ”దుక్కికొద్దీ పంట” అనే తెలుగు సామెత తొలకరిలో చేసే  దుక్కి యొక్క ప్రాముఖ్యతను తెలియ చేస్తుంది.

దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలేయడం వలన కలుపు మొక్కలు మరియు ఇతర గడ్డి జాతి మొక్కలు పెరిగి భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి, భూమిని సత్తువ లేకుండా నిర్వీర్యం చేస్తాయి. దీని వలన భూసారం తగ్గి పోవడమే కాకుండా, నీరు భూమి లోపలి పొరల నుండి గ్రహించబడి ఆవిరి అయిపోతుంది. అంతే కాకుండా ముడి పోషకాల కొరత ఏర్పడి తర్వాత పంటలకు అత్యధిక మోతాదుల్లో రసాయన ఎరువులు వేయవలసిన అవసరం ఏర్పడుతుంది. కావున, ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సోదరులు వేసవి లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున రైతులు వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్‌, మే  మాసాల్లో కురిసే తొలకరి జల్లులను సద్వినియోగపరుచుకొని దాదాపు 9-10  అంగుళాలకు (25-30 సెం.మీ.) తగ్గకుండా దుక్కులు చేసుకోవడం శ్రేయస్కరం. వీటినే వేసవి దుక్కులు (లేదా) తొలకరి సేద్యం అంటారు. వర్షాలకు ముందు భూమిని దున్నడం వలన తొలకరి వర్షాలు పడగానే మట్టి పెళ్లలు మెత్తపడతాయి. వర్షాలు పడిన తర్వాత నీరు బాగా ఇంకడం వలన అవసరం అయితే ఈ నేలను మరోసారి దున్ని వెంటనే విత్తుకోవచ్చు. నేల రకాన్ని బట్టి, వేయబోయే పంటను బట్టి నేలను ఎన్నిసార్లు దున్నాలి అనేది నిర్ణయం తీసుకోవాలి. దుక్కి అనేది దున్నడం వలన నేల ఏ విధంగా తయారు అయింది అనేది తెలుపుతుంది. మంచి దుక్కి వచ్చింది అంటే నేల విత్తనం వేసుకోవడం కోసం అనుకూలంగా తయారు అయింది అన్నమాట. ప్రాధమికంగా దుక్కి దున్నే విధాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. 

1. లోతుగా దున్నడం: వేసవిలో తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని లోతుగా దున్నడం వలన క్రింది పొర మట్టి పైకి తిరగబడుతుంది.  తద్వారా నేలలో హానికర కీటకాల గుడ్లు, ప్యూపాలు మరియు శిలీంద్ర బీజాలు  సూర్యరశ్మికి గురై నశిస్తాయి. నేలను ఎంత లోతుకు దున్నాలి అనే విషయం – నేల లోతు, ముందు వేయబోయే పంట, కలుపు ఉదృతి పైన ఆధార పడి ఉంటుంది. సాధారణంగా కనీసం 25-30 సెం.మీ. లోతు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూమిని దున్నుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

2. నేల క్రింది గట్టి పొరలను చేదించే విధంగా దున్నుట (సబ్‌ సాయిలింగ్‌): సాధారణంగా చాలా మంది రైతులు ప్రతి సంవత్సరం పొలాన్ని కల్టివేటరు తో తక్కువ లోతులో (సుమారు 10-15 సెం. మీ.) దున్నుతుంటారు. తద్వారా భూమి లోపలి పొరల్లో గట్టి పొర ఏర్పడుతుంది. ఈ గట్టి పొరల వలన వర్షపు నీరు భూమిలోనికి ఇంక కుండా చేయడమే కాక, పంట వేళ్ళు భూమి లోపలి పొరలకు విస్తరించకుండా అడ్డుపడతాయి.  కావున ప్రతి 2  మీ. దూరంలో సుమారు 60-75 సెం.మీ. లోతుగా దున్ని ఈ నేల క్రింది పొరలను చేదించడం వలన మెట్ట పంటల్లో సుమారు 20-30 శాతం దిగుబడి పెరిగింది అని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ విధంగా ప్రతి 2-3 సంవత్సరాలకొకసారి లోతుగా దున్నితే సరి పోతుంది. ఈ విధంగా దున్నడానికి సబ్‌ సాయిలర్‌ /చిజిల్‌ నాగలిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా దీర్ఘ కాలిక మరియు లోతైన వేరు వ్యవస్థ గల కంది, ఆముదం వంటి మెట్ట పంటల్లో ఈ పద్ధతి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

3. సంవత్సరం పొడవునా దున్నడం:  పంట వేసే ముందు దున్నడమే కాకుండా పంట వేసిన తర్వాత వరుసల మధ్య వివిధ రకాల పనిముట్లను ఉపయోగించి పంటలను కలుపు మొక్కల భారి నుండి కాపాడటమే గాక, పలుమార్లు దున్నడం వలన, నేల గుల్ల బారి పడిన వర్షపు నీరు అంతా నేల లోనికి ఇంకి పంటలు బెట్టకు గురి కాకుండా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ రకమైన సేద్యం మెట్ట ప్రాంతాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.          

లోతు దుక్కులకు ఉపయోగించే పనిముట్లు 

కొయ్య నాగలి, రెక్కల నాగలి, పెద్ద మడక, మోల్డ్‌ బోర్డ్‌ నాగలి, పల్లెపు నాగలి, 5/7 – కొయ్యల బాతు కాళ్ళ నాగలి, చిజిల్‌ నాగలి.

తొలకరిలో లోతు దుక్కుల వలన కలిగే ప్రయోజనాలు: 

*    లోతైన దుక్కులు (30 సెం. మీ.) వాలుకు అడ్డంగా దున్నడం వలన వర్షపు నీరు వృధాగా పోకుండా భూమి లోపలి పొరల్లోకి చేరుతుంది. వాలుకు అడ్డంగా దున్నుకోవడం వలన ఈ సమస్య అధిగమించబడి, భూమి ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకొనే సామర్ద్యాన్ని పెంపొం దించుకుంటుంది. తద్వారా నీటిని పరిరక్షించడమే కాకుండా నేల కోతను కూడా నివారిస్తుంది. వర్షాధార పంటలు వివిధ కీలక థల్లో బెట్టకు గురైనప్పుడు (లేదా) తక్కువ వర్షపాతం నమోదు అయినప్పుడు పంట వేర్లు లోతుగా పోవడం వలన నేల లోపలి పొరల్లోని తేమను మరియు పోషకాలను గ్రహించి బెట్టను తట్టుకునే శక్తిని చేకూరుస్తుంది.    

*    లోతు దుక్కుల వలన ఖరీఫ్‌ మరియు రబీ పంట అవశేషాలు, కలుపు మొక్కలు, పంట మొక్కల  నుండి రాలిన ఆకులు వంటి వివిధ సేంద్రీయ పదార్థాలు ఎరువుగా మారతాయి. తద్వారా నేలలో తేమ శాతం పెరగడంతో పాటు సేంద్రీయ కర్బన శాతం, పోషక పదార్థాలు పెరుగుతాయి. దీని వలన మేలు చేసే సూక్ష్మ జీవులు గణనీయంగా వృద్ధి చెందడమే కాకుండా, వానపాములు కూడా వృద్ధి చెందుతాయి. తద్వారా భూసారం వృద్ధి చెందుతుంది. 

*    లోతు దుక్కుల వలన భూమి లోపలి పొరల్లోని మట్టి భూమి పైకి మరియు భూమి పైమట్టి లోపలి పొరల్లోకి కలసిపోవడం ద్వారా భూసారం సమానంగా మొక్కలకు అందుతుంది.  

*    లోతు దుక్కులు చేసినట్లైతే బహు వార్షిక మొండి జాతి కలుపు మొక్కలైన తుంగ, గరిక, దర్భ మరియు జమ్ము లాంటి సమస్యాత్మక కలుపు మొక్కల వేర్లు, దుంపలు భూమి పైకి వచ్చి వేసవిలో ఉండే అధిక సూర్యరశ్మికి గురై నశిస్తాయి. అంతే గాక, నేల పైకి వచ్చిన వేర్లు, దుంపలు ఏరివేయడం ద్వారా వీటిని అరికట్టవచ్చు. తద్వారా ఆ తర్వాత పంట కాలంలో కలుపు మందులకు మరియు ఇతర క్రిమిసంహారక మందులకు వెచ్చించాల్సిన పెట్టుబడి ఖర్చు కూడా తగ్గిపోతుంది. 

*    వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన భూమిలో దాగి ఉన్న చీడ పీడల కోశాలు, గుడ్లు మరియు ఇతర శిలీంద్ర జాలాలు కూడా బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు గురవడం ద్వారా నశిస్తాయి. అంతే గాకుండా, భూమి పైన బయట పడిన ప్యుపాలను, గుడ్లను కొంగలు, కాకులు మొదలైన పకక్షులు తిని నాశనం చేస్తాయి. దుక్కి దున్నేటపుడు, మనుషులు, పశువుల తొక్కిసలాటలో కొన్ని పురుగులు, ప్యూపాలు చనిపోతాయి. కావున సమగ్ర సస్యరక్షణలో వేసవి లోతు దుక్కులకు మొట్టమొదటి ప్రాధాన్యమివ్వాలి. తద్వారా పురుగు మరియు తెగుళ్ల మందు ఖర్చు కొంతవరకు తగ్గుతుంది మరియు వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.

*    గత పంటకు (ఖరీఫ్‌/రబీ) సంబందించిన మొక్కల దుబ్బులు, కొయ్యలు, వేర్లు కుళ్ళి పోయి సేంద్రీయ ఎరువుగా మారుతాయి.

*    లోతు దుక్కుల వలన భూమిపై మట్టి లోనికి తిరగబడుతుంది. అంతేగాక, కొన్ని లవణాలు, క్షారాలు భూమి లోపలి పొరలకు చేరుకొని పై భాగంలో ఉదజని సూచిక సమంగా ఉంటుంది.

*    వేసవి లోతు దుక్కుల వలన మట్టి రేణువుల లోనికి గాలి వెళుతుంది.నేల ఆరోగ్యంగా ఉండాలంటే మట్టి రేణువుల్లో 50 శాతం నీరు, 25 శాతం గాలి ఉండాలి.

కావున రైతుసోదరులు వేసవిలో కురిసే తొలకరిజల్లులను ఉపయోగించుకొని భూమిని బాగా లోతుగా దుక్కి చేసుకోవాలి. తద్వారా భూమిలో తేమను నిల్వచేసుకొనే శక్తీ పెరగడమే కాకుండా, భూసారం కూడా పెంపొందించుకోవచ్చు మరియు నేలకోతను నివారించు కోవచ్చు. అంతే గాకుండా మొండి జాతి కలుపు మొక్కల నివారణ తో పాటు చీడ పీడలను కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. కావున రైతు సోదరులు ప్రతీ 2-3 సంవత్సరాలకు ఒకసారి వేసవిలో లోతుడుక్కులను (20-30 సెం.మీ.) చేసుకోవడం వల్ల పైన చెప్పిన లాభాలు పొంది, మెట్ట పంటల్లో అధిక దిగుబడులు పొందవచ్చు.

ఎ. మల్లీశ్వర రెడ్డి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 

వి. సంధ్యారాణి, బి. శ్రీరాం ప్రవీణ్‌, విద్యా ప్రవల్లిక, కావ్య, పి.జి. రీసెర్చ్‌ స్కాలర్స్‌, 

ఎం. శ్రీనివాస రెడ్డి, ప్రొఫెసర్‌, పి.వి. రమేష్‌ బాబు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మరియు జయసింహారెడ్డి, టీచింగ్‌ అసోసియేట్‌,

సేద్య విభాగం, వ్యవసాయ కళాశాల, మహానంది, నంద్యాల జిల్లా.

Read More

జూన్‌ నెలలో సేద్యపు పనులు

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని జూన్‌ 4వ తేదీన తాకి, ఆంధ్రప్రదేశ్‌ను తర్వాత 3 రోజుల్లో, హైదరాబాదును 6 రోజుల్లో తాకవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలను 10 రోజుల్లో పూర్తిగా విస్తరించవచ్చు. తన పొలంలో, ఎప్పుడు ఎంత వర్షం పడిందనేది రైతు గమనించుకోదగిన ముఖ్యాంశం. ఈ నేపథ్యంలో జూన్‌ (రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు) లో చేయవలసిన వ్యవసాయ పనులను గూర్చి తెలుసుకుందాం.

ఏ పంట పండించాలి. ఆ పంటలో, అందుబాటులో ఉన్న రకాలలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే రకాన్ని సరైన పదనులో విత్తాలి. త్వరగా విత్తితే ముందుగా కోతకొస్తుంది. తదుపరి పంట పెట్టడానికి భూమి త్వరగా ఖాళీ అవుతుంది.

టమాట: క్రితం సంవత్సరం ఎండాకాలంలో ధరలధికంగా కిలో 100 రూపాయల దాకా పలికినాయి. విస్తీర్ణం పెరిగి ఈసారి ఎండాకాలం టమాట పంట విపరీతంగా మార్కెట్‌కు వచ్చి ధరలు బాగా తగ్గినాయి. రుతుపవన ప్రభావంతో మేఘావృత వాతావరణం, ఎక్కువ వర్షాలు, ముసురు ఏర్పడితే పంట దిగుబడి తగ్గుతుంది. ధరలు పెరిగే అవకాశముంది. 

కొత్తిమీర: ఎండాకాలంలో క్రమం తప్పకుండా అధికాదాయాన్నిస్తున్న పంట కొత్తిమీర. ఈ పంట పెరగడానికి ఎండల్లో పాక్షిక నీడ అవసరముంటుంది. కొత్తిమీర ధరలు జూన్‌ మాసం అంతా అధికంగా ఉండే అవకాశముంది. జూలైలో తగ్గే అవకాశముంది. చల్లని ఎత్తైన ప్రాంతాలైన మదనపల్లి ప్రాంతాల్లో ఈ నెలలో ఈ పంటను విత్తి, మంచి దిగుబడులతో పాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చు. వర్షాలు కూడా ఈ ప్రాంతంలో తక్కువే. మంచి పంట వస్తుంది. అధిక వర్షాలకు ఈ పంట దెబ్బతింటుంది. జూన్‌లో అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఈ పంట విత్తకపోవడం మంచిది. పందిరి కూరగాయపొలాల్లో మామిడి, మునగ, కొబ్బరి మొదలగు తోట పంటల్లోని ఖాళీ భూమిలో పాలీహౌస్‌లు, షేడ్‌నెట్లు, నెట్‌హౌస్‌లు, చెట్ల కొమ్మలతో ఏర్పాటు చేసిన పందిర్ల క్రింద పాక్షిక నీడలో కొత్తిమీర సాగు చేసి, జూన్‌లో అధిక లాభం పొందవచ్చు.

ఫ్రెంచిచిక్కుడు: ఎండాకాలంలో పాక్షిక నీడలో పండే పంట. అత్యధిక ధరలుండే దాని వలన పాక్షిక నీడలో పండించవచ్చు. మొక్కజొన్న, ఆముదం పంటలలో అంతరపంటగా కూడా పండుతుంది.

ఆకుకూరలు: వర్షాధారంగా పండే ఆకుకూరలు జూలై మూడవ వారంలో మార్కెట్‌కు వస్తాయి. అంతవరకు నీటితడులతో పండించిన ఆకుకూరలకు బాగా గిరాకీ ఉంటుంది. ఇవి ఎండలకు వేడికి కూడా బాగా పెరుగుతాయి. అన్ని రకాల భూములను ఆకుకూరల పంటకు వినియోగించవచ్చు. పాల కూర కొద్దిగా తక్కువ దిగుబడితో చౌడు భూముల్లో కూడా పెరుగుతుంది. వేసవిలో మంచి ఆదాయాన్నిచ్చే ఆకుకూరలు: పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, గోంగూర, పొన్నగంటి కూర, సోయకూర, కొయ్యగూర మొదలయినవి.

సిరిధాన్యాలు: సేంద్రియ వ్యవసాయంలో, రసాయనాలు వాడకుండా, వర్షానికి, జూన్‌ నెలలో కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికలు విత్తడానికి అనుకూలం. మొలకెత్తడానికి సరిపడ వర్షం పడితే విత్తవచ్చు. రసాయనాలు లేకుండా పండిస్తున్నామని వాట్సాప్‌లో ప్రచారం చేసుకుంటే ఖర్చులేకుండా, మంచి ప్రచారం జరుగుతుంది. రైతు వద్దకే వచ్చి కొనుక్కెళతారు. పంట పెట్టిన తర్వాత సిరిధాన్యాలను బియ్యం చేసి అమ్మడం వలన రైతుకు మంచి లాభం వస్తుంది. బుచ్చి మెథడ్‌ ద్వారా రోజుకు 20 కిలోల వరకు చిన్న మిక్సీ ద్వారా పొట్టు తీసే అవకాశముంటుంది. ఇంటివద్దనే క్లీన్‌ చేసి బియ్యం చేసే అవకాశముంది. ఇంకా సులభంగా బియ్యం చేయ గల్గిన చిన్ని చిన్న యంత్రాల ఆవిష్కరణలు జరగాలి.

వర్షాధార కూరగాయలు: వర్షాధారంగా పండే భూముల్లో పలు కూరగాయలను పండించవచ్చు. 

జూన్‌లో విత్తగలిగిన కూరగాయ పంటలు:

బెండ: జూన్‌లో విత్తవచ్చు. విత్తిన 40-45 రోజుల్లో తొలి కోత మొదలవుతుంది. సొంత వితనాలుపయోగిస్తే ఖర్చు తగ్గుతుంది. ఎగుమతి కనువైన పలు రకాలు/హైబ్రిడ్లు మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయి. ఉదా: విశాల్‌, నాథ్‌శోభ, వర్ష మొ|| నీటి ఆధారముంటే, బెట్ట సమయాల్లో తడులిస్తే దిగుబడి బాగా పెరుగుతుంది. 

వంగ: జూన్‌-జూలైలో నారు పోసి 30-35 రోజుల తర్వాత నాటుకోవచ్చు. ఆయా ప్రాంతంలో ప్రాచుర్యంలో గల రకాలను ఎంపిక చేసుకుంటే మార్కెటింగ్‌ సులభమవుతుంది. పచ్చని రకాలకు ధర ఎక్కువ లభిస్తుంది. టమాట కంటే రేటు ఎక్కువగా లభిస్తుంది.

గోరుచిక్కుడు: తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి నివ్వగల్గిన మొండి పంట. జూన్‌-జూలై నెలల్లో విత్తుకోవచ్చు. పశువుల దాణాగా, పచ్చిమేతగా, పచ్చి రొట్ట ఎరువుగా కూడా పనిచేస్తాయి. గింజల నుండి గమ్‌ తయారు చేస్తారు. లేత కాయలను కూరగాయగా వాడుతారు. అనుకూలమైన రకాలు: పూసా సదాబహార్‌, పూసా మౌసమి మొ|| కూరగాయల దిగుబడి 3 నుండి 6 టన్నులు/ఎ. గింజ దిగుబడి 600-800 కిలోలు/ఎకరాకు.

పందిరి కూరగాయలు: జూన్‌-జూలై నెలల్లో విత్తుకోదగినవి.

ఆనప/సొర: అనుకూలమైన హైబ్రిడ్లు: అమిత్‌, విక్రాంత్‌, వరద్‌ అనుకూలమైన రకాలు: పి.ఎస్‌.పి.ఎల్‌. అర్కబహార్‌, పూసానవీన్‌. 

దోస: వీటిని లేతగా ఉన్నపుడు సాలాడ్‌ (పచ్చిదోస) గా వాడుతారు. ముదిరిన తర్వాత కూరకు వాడతారు. అనుకూలమైన రకాలు: ఆర్‌.ఎన్‌.ఎస్‌.ఎం-3, ఆర్‌.ఎన్‌.ఎస్‌.ఎం-1

పచ్చిదోస: సాలాడ్‌గా పనికొచ్చే రకాలు: పూసాఖీర, కొ-1. సాలాడ్‌గా పనికొచ్చే హైబ్రిడ్‌లు: జిప్సి, మాలిని. 

కాకర: ప్రస్తుతం అధిక ధర పలుకుతున్న రకాలలో స్టార్‌ కాకర చాలా ముఖ్యమైనది. దీనిని జూన్‌లో విత్తి అధిక దిగుబడి, అధిక ఆదాయం పొందవచ్చు.

గుమ్మడి: గుమ్మడి గింజల్లో జింకు లభ్యత ఎక్కువ. పూజల్లో ఎక్కువగా వాడుతారు. ఎప్పుడైన అమ్ముకోవచ్చు. నిల్వ ఉంటుంది. అధిక దిగుబడి రకాలు: పూసా విశ్వాస్‌, కో-2 మొదలయినవి. అధిక దిగుబడి హైబ్రిడ్‌: పూసా హైబ్రిడ్‌-1

బూడిద గుమ్మడి: గుండె జబ్బుల నివారణలో ప్రాముఖ్యం వహిస్తున్నది. పేట (గుమ్మడి స్వీట్‌) తయారీలో ఉపయోగపడుతున్నది. మంచి రకాలు: బి.హెచ్‌-25, బి.హెచ్‌-24

పొట్ల: నేలపై పాకే పొట్ల రకం: కొ-2, ఇది పందిరిపై కూడా కాస్తుంది. ఇతర రకాలు: పి.కె.ఎం-1, శ్వేత. అనుకూలమైన హైబ్రిడ్‌ (పందిరిపైన పండించడానికి): ఎం.డి.యు-1.

దొండ: జూన్‌-జూలైలలో నాటవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తాఆంధ్ర ప్రాంతంలో సంవత్సరమంతా నాటుకోవచ్చు.

కీరదోస: మంచి పార్థినోకార్పిక్‌ రకాలు: కియోన్‌, సటిన్‌, అలామిర్‌

పూలు: 

బంతి: ఏదైనా పండుగకు ఈ పూలందివ్వాలంటే ఆ పండుగకు 60 రోజుల ముందుగా బంతి నారు నాటాలి. జూన్‌ రెండవ వారంలో నారు పోసుకుని జూలై 2వ వారంలో నాటితే మార్కెట్‌ చేయడానికి అక్టోబరులో పూలొస్తాయి.

గులాబి: వీటి అంట్లను జూన్‌ నెల నుండి జనవరి నెల వరకు నాటవచ్చు. సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో నాటితే చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది. మంచి రకాలు: హైబ్రిడ్‌ టీస్‌: ఆదిత్య, గ్రాండ్‌గల, అమాలియ మొ|| ఫ్లోరిబండాస్‌: ఆకాష్‌ దీప్‌, రెడ్‌ ట్రెంప్‌ మొ|| మినియేచర్‌: బేబిచాక్లెట్‌, నర్తకి, పింక్‌ స్ప్రే మొ||

మల్లె: జూన్‌-జూలై నెలల్లో వేర్లు వచ్చిన పిలక మొక్కలు నాటాలి. సుమారు 5 కణుపులు గల కొమ్మ కత్తిరింపులను జూన్‌ నుండి సెప్టెంబరు వరకు ఇసుకలో నాటాలి. త్వరగా వేర్లు రావడానికి కాండపు ముక్కలను 4 గ్రా. ఇండోల్‌బ్యూట్రిక్‌ ఆమ్లం (ఐ.బి.ఎ)ను లీటరు నీటిలో కలిపి ద్రావణంలో ముంచి నాటాలి. గుండుమల్లెను 5þ5, జాజిమల్లెను 7þ7, కాగడ మల్లెను 6þ5 అడుగుల ఎడంలో నాటాలి. గుండుమల్లె: రెండు వరస రేకులుంటే దొంతర మల్లె అని, పెద్దపూలుంటే బొద్దుమల్లె అని అంటారు. గుండు మల్లెలు మార్చి నుండి అక్టోబరు వరకు పూస్తాయి. 

జాజిమల్లె: మంచి సువాసన ఉంటుంది. సంవత్సరమంతా పూస్తుంది. కాని ఏప్రిల్‌ నుండి నవంబర్‌ వరకు ఎక్కువ పూలనిస్తాయి. 

కాగడమల్లె: నవంబరు నుండి జనవరి వరకు పూలనిస్తాయి.

కనకాంబరం: మే-జూన్‌ నెలల్లో నారు పెంచి ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ప్రధాన పొలంలో 60þ30 సెం.మీ. దూరంలో నాటాలి. చలికాలం, ఎండాకాంలో బాగా పూస్తుంది. వర్షాకాలంలో తక్కువగా పూస్తుంది. అంటే సంవత్సరమంతా పూస్తుంది.

వేరుశనగ: జూన్‌ 2వ పక్షం నుండి జూలై మొదటి వారంలోపు విత్తి అత్యధిక దిగుబడులు పొందవచ్చు. జూలై మొదటి వారం తర్వాత విత్తడంలో నిదానమయ్యే కొద్దీ దిగుబడి తగ్గుతూ వస్తుంది. విత్తనాల కొరత వేరుశనగలో చాలా ఎక్కువ. మంచి రకాల విత్తనాలకు విపరీతమైన గిరాకీ ఉంది. మంచి రకాలు: విశిష్ట (టి.సి.జి.ఎస్‌-1694), కదిరి-9, కదిరి-7, నిత్యహరిత. విశిష్ట రకాన్ని విత్తనోత్పత్తి చేపట్టి అత్యధిక దిగుబడి, అత్యధిక ఆదాయం పొందండి. విత్తనాలు పండించే వారు వాట్సాప్‌లో ఖర్చు లేకుండా ప్రచారం చేసుకోవచ్చు. సులభంగా మార్కెట్‌ చేసుకోవచ్చు.

ప్రత్తి: కల్తీల బెడద విపరీతంగా ఉన్న పంటలలో ప్రత్తి ముఖ్యమైనది. అందుకే అనుభవమున్న రకాలను, బాగా నమ్మకస్తుడైన డీలరు దగ్గరనే కొనండి. కొత్తవాళ్ల దగ్గర విత్తనాలు కొనద్దు. కొత్త రకాలను వేయాలనుకుంటే కొద్ది విస్తీర్ణంలో (ఒక సెంటు లేక ఒక కుంట)లో పరీక్షించి, బాగా పండితే తదుపరి సంవత్సరంలో వాటి విస్తీర్ణాన్ని పెంచవచ్చు. అధిక సాంద్రత విధానంలో ప్రత్తి పండించి, అధిక దిగుబడులు పొందవచ్చు. నీటి ఆధారంతోను వర్షాధారంగా కూడా, అధిక సాంద్రతలో సాగు చేయవచ్చు. ఈ విధానంలో పంట త్వరగా పూర్తయి, తర్వాత పంటగా పెసర, మినుము, శనగ, నువ్వులు, వేరుశనగ వంటి పంటలు పండించుకోవచ్చు.

వరి: గవర్నమెంటు కొంటామంటుంది. మిల్లుల యాజమాన్యాలు సతాయిస్తుంటాయి. కాబట్టి మిల్లుల యాజమాన్యాల మీద, గవర్నమెంటు మీద ఆధారపడకుండా బయట అమ్ముకున్నా ఎక్కువ రేటుకు అమ్ముడుబోయే రకాలనే విత్తుకోండి. పంట పండినాక దాన్ని దాచుకొని, పాతగయినాక ఎక్కువ రేటుకు బియ్యం చేయించి అమ్ముకోవడానికి మొదటి నుండి ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఈ విధమైన పద్ధతులు అమలు చేయడానికి రైతు ప్రజా సంఘాలను ప్రతి పల్లెలోను, ఏర్పాటు చేసుకోండి. వాటి ద్వారా ఆర్థికంగా బలమైన వారుగా రైతులు ఎదగాలి. వివరాలు కావలిస్తే 9494408619 కు ఫోను చేయండి.

ప్రొద్దు తిరుగుడు: తేలిక నేలల్లో జూన్‌ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. అత్యధిక దిగుబడినిచ్చే ప్రైవేటు హైబ్రిడ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అనువైన పబ్లిక్‌ హైబ్రిడ్లు: ఎన్‌.డి.ఎస్‌.హెచ్‌-1012, దిగుబడి: 600-720 కిలోలు/ఎకరానికి. డి.ఆర్‌.ఎస్‌.హెచ్‌-1, దిగుబడి: 520-640 కిలోలు/ఎకరానికి.

ఆముదం: మే చివరి వారం నుండి జూలై కడవరకు విత్తడానికనుకూలం. అనువైన రకాలు: ప్రగతి: దిగుబడి 6-7 క్వి/ఎ. 85-150 రోజులు. ఎండు తెగులును తట్టుకుంటుంది. త్వరగా కోతకొస్తుంది.అనువైన హైబ్రిడ్‌లు: పి.సి.హెచ్‌111, పి.సి.హెచ్‌-222, దిగుబడి: 7-8 క్వి/ఎ. ఎండు తెగులును తట్టుకుంటాయి. ఐ.సి.హెచ్‌-66: దిగుబడి 7-9 క్వి/ఎ. ఎండుతెగులును మరియు బెట్టను తట్టుకుంటుంది.

మొక్కజొన్న: దిగుబడి పెరిగినా, పౌల్ట్రీ పరిశ్రమలో వినియోగము ఎక్కువగా ఉన్నందున ధరలు నిలకడగా ఉన్నాయి. మార్కెట్‌ ధరలు అనుకూలంగా ఉన్నాయి. 30-35 క్వి/ఎ దిగుబడినిచ్చే పబ్లిక్‌ హైబ్రిడ్లు: డి.హెచ్‌.ఎం-117 (బి.హెచ్‌.-40625), డి.హెచ్‌.ఎం-119 (బి.హెచ్‌-4062), డి.హెచ్‌.ఎం-121 (బి.హెచ్‌-41009). 40-45 క్వి/ఎ దిగుబడినిచ్చే ప్రైవేటు హైబ్రిడ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. స్పెషల్‌ రకాలు: ఈ నెలలో విత్తదగినవి. తీపి రకాలు: కాంపోజిట్‌ రకాలు: విన్‌ఆరంజ్‌, అల్మోరా, ప్రియ, మాధురి, హైబ్రిడ్‌ రకాలు: షుగర్‌-75, బ్రైట్‌ జీన్‌. పేలాల రకాలు: పెర్ల్‌ పాప్‌ కార్న్‌ కాంపోజిట్‌, వి.ఎల్‌. అల్మోరా పాప్‌కార్న్‌, అంబర్‌ పాప్‌కార్న్‌. మన దేశంలో బేబికార్న్‌ రకాలుగా గుర్తించిన కాంపోజిట్‌లు: వి.ఎల్‌-42, హిమ్‌-123, హిమ్‌-129, మాధురి తీపిజొన్న, హైబ్రిడ్‌లు: హిమ్‌-128, ప్రకాశ్‌, హెచ్‌.ఎం.-4, పూసా ఎర్లీ హైబ్రిడ్‌ మొక్కజొన్న-1, పూసా ఎర్లీ హైబ్రిడ్‌ మొక్కజొన్న-2.

పంటలలో అధిక వివరాలకు, రైతు ప్రజా సంఘాలు అన్ని పల్లెలకు విస్తరించడానికి సంప్రదించవలసిన ఫోను నెంబర్లు: 9494408169 / 8639526595, సల్లా నారాయణస్వామి, ఛైర్మన్‌ – నారాయణ ఫౌండేషన్‌.

Read More

ఇంటి పంటలో కాలుష్యాన్ని తగ్గించే మొక్కలు

మార్కెట్‌లో దొరికే ఆకుకూరలు మరియు కూరగాయల లాంటివి చాలా వరకు రసాయనాలు ఉపయోగించి పండిస్తున్నవే కాబట్టి, రసాయన అవశేషాలు లేని కూరగాయలు మరియు ఆకుకూరల కొరకు ఎక్కువమంది ఇంటి పంటను చేపడుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు శారీరక శ్రమ, మానసిక ఉల్లాసం లాంటి ప్రయోజనాలు కూడా ఇంటిపంట వలన లభ్యం అవుతాయి. వీటన్నింటితో పాటు వాతావరణ కాలుష్యంతో పాటు మన దైనందిన జీవితంలో మనం ఉపయోగించే వస్తువుల వలన ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల రసాయన వాయువులను కూడా స్వీకరించగలిగే కొన్ని మొక్కలు కూడా ఇంటిపంటలో ఉన్నట్లయితే ఇంకా ప్రయోజనం ఉంటుందని గ్రహించి తమ ఇంటి పంటలో అన్ని రకాలుగా ఉపయోగపడే వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు సూర్యాపేటకి చెందిన పవిత్ర.

పవిత్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాను బయాలజీ చదివింది కాబట్టి మొక్కల గురించి తనకు తెలిసిన విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ తన ఇంటి పంటలను నిర్వహిస్తున్నారు. ఇంటి పెరటిలో సుమారు రెండున్నర సెంట్ల స్థలంలో పెరటితోటతో పాటు మిద్దె మీద కూడా వివిధ రకాల మొక్కలను వివిధ రకాల కంటెయినర్లలో పెంచుతూ మిద్దెతోటను కూడా నిర్వహిస్తున్నారు. కంటెయినర్లను ఎంపిక చేసుకునే సమయంలో అన్నీ ఒకే పరిమాణానివి కాకుండా మొక్క రకాన్ని బట్టి ఆకు కూరలకు తక్కువ లోతు, వెడల్పు ఎక్కువ ఉండే టబ్బులు, కూరగాయలకు పెరుగు డబ్బాల లాంటివి, పండ్ల మొక్కలకు లోతు ఎక్కువగా ఉండే డ్రమ్ముల లాంటి వాటిని ఉపయోగిస్తున్నారు. మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటెయినర్లకు ఖర్చు చేసే డబ్బు విషయంలో కూడా జాగ్రత్తలు వహిస్తూ తక్కువ ఖర్చుతో సేకరించగలిగే కంటెయినర్లను సేకరిస్తున్నారు. అందులో భాగంగా పెరుగు బక్కెట్లు తక్కువ ధరలో దొరుకుతాయి కాబట్టి ఎక్కువ మొక్కలు పెరుగు డబ్బాలలో పెంచుతున్నారు. పెరుగు డబ్బాలతో పాటు, కుండీలు, ప్లాస్టిక్‌ టబ్బులు, ప్లాస్టిక్‌ డ్రమ్ముల లాంటివాటిని తక్కువ ధరలో కొనుగోలు చేసుకొని వినియోగిస్తున్నారు. మిద్దెతోట వలన స్లాబు పాడవకుండా స్లాబుపై స్టాండులు ఏర్పాటు చేసి స్టాండుపై కంటెయినర్లను ఏర్పాటు చేస్తున్నారు.

మొక్కల విషయంలో అన్ని రకాలుగా ఆలోచించి బహుళ ప్రయోజనాలు ఉన్న మొక్కలను తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ రకాల విటమిన్లు గల మల్టి విటమిన్‌ మొక్క, ఎక్కువ పోషకాలు గల మిరాకిల్‌ మొక్క (మునగ), భారీ రసాయన వాయువులను స్వీకరించగల స్నేక్‌ప్లాంట్‌, సుగర్‌ వ్యాధికి ఉపయోగపడే ఇన్సులిన్‌… ఈవిధంగా ఔషధ గుణాలు గల మొక్కలతో పాటు అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలలో వంగ, టమాట, బెండ, కాకర, బీర, చిక్కుడు, వెల్‌వెట్‌ బీన్స్‌, లాంగ్‌ బీన్స్‌, దోస, గోరు చిక్కుడు, ముల్లంగి, వింగ్డ్‌ బీన్స్‌, మిరప లాంటి మొక్కలతో పాటు లిల్లి, బంతి, మందార, గులాబి లాంటి పూల మొక్కలు, అరటి, బొప్పాయి, డ్రాగన్‌ఫ్రూట్‌, నేరేడు, స్టార్‌ఫ్రూట్‌, అంజీర లాంటి పండ్ల మొక్కలు కూడా పెరటిలో లేదా మిద్దె మీద పెంపకం చేస్తున్నారు.

మట్టి మిశ్రమంగా బాగా నీటితో కడిగిన కోకోపిట్‌, ఎర్రమట్టి, వేపపిండి, వర్మికంపోస్టు, బాగా మాగిన పశువుల ఎరువు లాంటి వాటిని అన్ని సమపాళ్ళలో తీసుకుని మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నారు. చీడపీడల నివారణకు కూడా ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా ఫంగస్‌ సమస్య నివారణకు పుల్లటి మజ్జిగను, పేనుబంకను నివారించుటకు కుంకుడు రసం మరియు హాండ్‌ వాష్‌ మిశ్రమాన్ని ఉపయోగిస్తూ ఇంకా అవసరమయితే చేతితో చీడపీడలను నివారించు కుంటున్నారు. అన్ని రకాల మెళకువలతో ఇంటి పంటలో వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలతో పాటు విషవాయువులను గ్రహించగలిగే మొక్కలను పెంచుతున్న పవిత్రని తోటి ఇంటి పంటదారులు ఆదర్శంగా తీసుకుంటే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని చెప్పవచ్చు. 

– వై. శ్రవణ్‌ కుమార్‌,  స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

ప్రకృతి వ్యవసాయంలో ముందడుగు వేస్తున్న రైతులు, ప్రభుత్వాలు

పల్లెలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే వ్యవసాయం కారణం. కొంతమంది రైతులు ప్రకృతి ఒడిలో ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం లేదా ప్రకృతి సేద్యం గత కొంత కాలంగా ప్రాచుర్యం సంపాదించింది. రసాయన సేద్యంతో నష్టపోయిన రైతులు ఎక్కువ మంది శ్రీ సుభాష్‌ పాలేకర్‌ గారి పద్ధతులను పాటిస్తూ ప్రకృతి సేద్యంలోకి ప్రయాణం చేస్తున్నారు. ప్రధానంగా పద్మశ్రీ గ్రహీత శ్రీ సుభాష్‌ పాలేకర్‌ గారు ప్రకృతి వ్యవసాయంలో అనుసంధానకర్తగా వ్యవహరించి చాలా మంది రైతులకు ఆదర్శంగా నిలిచి తనదైన శైలిలో మన దేశంలో ప్రకృతి సేద్యానికి పితామహుడిగా నిలిచారు. అతి తక్కువ ఖర్చుతో గో- ఆధారిత సహజ ఎరువులు, వాటి మిశ్రమాలతో, ప్రకృతిలో సహజంగా దొరికే వనరులతో కషాయాలు, నూనెలు తయారు చేసుకుని, భూసారాన్ని పెంచుకుంటూ, చీడపీడల్ని నివారించుకుంటూ అధిక దిగుబడులతో పాటు పర్యావరణాన్ని కాపాడుకుంటూ అందరికీ నాణ్యమైన రసాయన రహిత ఆహారాన్ని అందించడానికి కొంతమంది ప్రకృతి నేస్తాలు పూనుకున్నారు. వీరికి సహాయంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి వివిధ పథకాలు ప్రకటించడమే కాక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ శాఖల సమన్వయంతో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన మరియు సమగ్ర ప్రకృతి వ్యవసాయ విధానాన్ని రైతులందరికీ చేరువ చేయటానికి, ”నేషనల్‌ మిషన్‌- ప్రకృతి వ్యవసాయం” పేరిట ఒక విభాగాన్ని స్థాపించింది. ప్రకృతి వ్యవసాయంలో పాటించాల్సిన ముఖ్య సూత్రాలు, రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఆచరించాల్సిన ముఖ్య విధానాలను సమగ్రంగా తెలుసుకుందాం.

ప్రకృతి వ్యవసాయం- ఆవశ్యకత

హరిత విప్లవం మన దేశంలో ఆహారధాన్యాల వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు ఆహారధాన్యాల నిల్వలు పెరిగి సమృద్ధత చేకూర్చింది. దీనితో పాటు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు, పురుగు మందులు మరియు ఇతర హానికారక రసాయనాల వాడకం పెరిగి ప్రకృతి వనరుల దుర్వినియోగమై భూసారం తగ్గటంతో పాటు భూమి నిర్వీర్యంగా తయారవుతున్నది మరియు ప్రకృతిలో వాతావరణం, నీరు, ఆహార కాలుష్యానికి దోహదపడుతున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా రసాయన రహిత ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించడానికి మరియు మన సహజ వనరులను కాపాడుకుంటూ, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకుంటూ, రైతులకు సుస్థిర వ్యవసాయ దిగుబడులను అందిచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడానికి పూనుకుంటున్నాయి. ఇప్పటికే కొందరు ఆదర్శ రైతులు దేశంలో సుభాష్‌ పాలేకర్‌ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను సమర్ధవంతంగా పాటిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు, ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, కేరళ, జార్ఖండ్‌, ఒరిస్సా, పంజాబ్‌, హర్యానా, ఉత్తప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఛత్తీస్‌ ఘడ్‌, తెలంగాణ, మేఘాలయ ప్రకృతి వ్యవసాయం మరియు సేంద్రీయ వ్యవసాయంలో ముందంజలో ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయం, రెండు పద్దతులలో రసాయన రహిత సేద్యం గురించి చెబుతున్నప్పటికీ కొంతవరకు రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. సేంద్రీయ పద్దతులలో కొన్ని సేంద్రియ మరియు జీవ ఉత్పత్తులను బయట నుంచి కొనుగోలు చేసి వాడతారు మరియు అవసరాన్ని అనుసరించి కొన్ని ప్రకృతి ఖనిజాల నుంచి పోషకాలు వాడి భూసారాన్ని సరిచేస్తారు. ప్రకృతి వ్యవసాయంలో పూర్తిగా ప్రకృతి సహజ ఎరువులు (మల్చింగ్‌), సహజ కషాయాలు, గోఆధారిత సహజ తయారీలు (ఆవు పేడ, గోమూత్రం) మాత్రమే వాడి, బయట నుంచి జీవసంబంధమైన మందులు కానీ, సేంద్రీయ ఉత్పత్తులు కానీ కొనుగోలు చేయకుండా సేద్యం చేయాలి.

ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన సూత్రాలు

ప్రకృతిలో జీవుల మనుగడ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. రసాయన వ్యవసాయం జీవుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రకృతి వ్యవసాయంలో మాత్రమే జీవ వైవిధ్యం మనుగడ సాగించే అవకాశం ఉంది. మన భవిష్యత్‌ తరాలకు సారవంతమైన నేల, నాణ్యమైన ఆహారం, కాలుష్యం లేని వాతావరణం అందించాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు మన రైతులంతా మొగ్గు చూపాలి. సుభాష్‌ పాలేకర్‌ అనుసరించిన వ్యవసాయ విధానాలు మన రైతులకు ఆదర్శంగా నిలిచాయి. ప్రభుత్వాలు కూడా ఈ వ్యవసాయ విధానాలతో ఆమోదించబడిన ప్రకృతి లేదా సహజ వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరువ చేసే పథకాలను రూపొందించాయి. ప్రకృతికి మేలు చేసే జీవుల వినాశనం కలుగకుండా ఒక ఆవుతోనే వ్యవసాయం సాగించవచ్చు. రసాయన ఎరువులు కాని పురుగు మందులు కాని వాడకుండా మన ఇంట్లో మరియు పరిసరాల్లో సహజ వనరుల రూపంలో దొరికే పదార్ధములను వాడి, సేద్య పద్ధతుల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని నిరూపించబడినది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని నేషనల్‌ మిషన్‌- ప్రకృతి వ్యవసాయం నిర్దేశించిన ప్రధాన విషయాలు లేదా సూత్రాలు ఈ విధంగా ఉన్నాయి.

  • ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా వైవిధ్యమైన వివిధ పంటల వ్యవస్థలను, పంటల సరళిని, అంతరపంటలని తీసుకోవలసిన అవసరం ఉంటుంది.
  • దేశవాళి అవులనుంచి వచ్చే వివిధ వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఉత్పాదకాలతో మొక్కలకు కావలసిన పోషకాలు అందచేయటం, భూసారాన్ని పెంచటం
  • పంటల సస్యరక్షణకు వివిధ మొక్కలు మరియు చెట్ల నుంచి తయారు చేసే కషాయాలు వాడటం
  • వీటితో పాటు పచ్చిరొట్ట ఎరువులు వాడకం, వ్యవసాయ వ్యర్ధాలు లేదా పచ్చని ఆకులతో మల్చింగ్‌(ఆచ్ఛాదన) విధానం వంటి పద్ధతులు జోడించడం, నేలలో తేమ మరియు గాలి సమతుల్యం అనుసరించడం, నేలను వీలున్నంత వరకు దుక్కి చేయకపోవడం

దేశవాళి ఆవులు, దేశీయ విత్తనాలు, దేశీయ వానపాములు, దేశీయ సూక్ష్మజీవులు, సంప్రదాయ పద్ధతులతో శ్రీ సుభాష్‌ పాలేకర్‌ గారు ప్రతిపాదించిన గోఆధారిత ప్రకృతి వ్యవసాయం లేదా సహజ/ సంప్రదాయ వ్యవసాయాన్ని మన దేశంలోని రైతులు ఆదర్శంగా పాటించవలసిన తరుణం ఆసన్నమైంది.  దీనికి మద్దతుగా తోటి రైతులు, స్వచ్ఛంద సంస్థలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలలో ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ సేంద్రీయ మరియు ప్రకృతి ఆధారిత ఉత్పత్తులలో ముందంజలో ఉంది. ఒక దేశీయ ఆవుతో ముప్పై ఏకరాల వ్యవసాయం చేయవచ్చని ప్రకృతి వ్యవసాయంలో నిర్దేశించబడినది. సహజవనరులతో లబ్ధి చేకూర్చే వివిధ ప్రకృతి వ్యవసాయ పదార్థాల తయారీ గురించి తెలుసుకుందాం.

గో – ఆధారిత కషాయాలు

గో- ఆధారిత కషాయాల తయారీ విధానం రైతునేస్తం వారి ‘ప్రకృతి నేస్తాలు’ ప్రచురణ నుంచి, రైతుల అనుభవాల నుంచి సేకరించబడినవి.

బీజామృతం: 20 లీటర్ల నీటిని ఐదు లీటర్ల గోమూత్రం,5కిలోల పశువుల పేడ, 50గ్రాముల సున్నము మరియు 50 గ్రాముల పుట్టమట్టి కలిపిన మిశ్రమంతో విత్తనశుద్ధి చేయటం  వలన మొలక శాతం పెరిగి విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నియంత్రించవచ్చు. బీజామృతంను తయారు చేసిన వెంటనే వాడుకోవాలి. నిల్వ ఉంచరాదు.

జీవామృతం: దీనిని రెండు విధాలుగా వాడుకోవచ్చు.

ఘన జీవామృతం: వంద కిలోల తాజా పశువుల ఎరువుకు 5 లీటర్ల గోమూత్రం, 2 కిలోల నల్ల బెల్లం, 2 కిలోల పప్పులపొడి (పెసర, మినుము, శనగ, ఉలవ పిండి) మరియు 50 గ్రాముల పుట్టమట్టి కలిపి తయారు చేస్తారు. ఈ విధంగా తయారు చేసిన 50 కిలోల జీవామృతం ఎకరానికి 400 కిలోల చొప్పున రెండు దఫాలుగా దుక్కిలో ఒకసారి, తరువాత 30-45 రోజులకు ఒకసారి పొలానికి అందించాలి. ఈ జీవామృతం రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడి భూసారం, భూమిలో సూక్ష్మజీవులు, వానపాముల సంఖ్య అపారంగా పెంచుకోవచ్చు.

ద్రవ జీవామృతం: డ్రమ్ములో 200లీటర్ల నీటికి 10 లీటర్ల గోమూత్రం, 10 కిలోల తాజా ఆవు పేడ,2 కిలోల నల్ల బెల్లం, 2కిలోల పప్పుల పొడి, 50 గ్రాముల పుట్టమట్టి కలిపి కర్రతో కుడివైపుగా (సవ్య దిశలో) బాగా కలియబెట్టి, గోనె సంచి కప్పి 48 గంటలు నానబెట్టాలి. మధ్యలో అప్పుడప్పుడూ కలియబెడుతూ ఉండాలి. ఈ ద్రవజీవామృతంను సాగునీటి కాలువల ద్వారా కానీ, నేరుగా భూమికి గానీ, పిచికారీ ద్వారా కానీ ఎకరానికి 200 లీటర్ల మోతాదులో అందజేయాలి. ద్రవజీవామృతంను తయారు చేసిన 9 రోజుల లోపుగా వాడుకుంటే మంచిది. ఎప్పటికప్పుడు తాజాగా జీవామృతం తయారు చేసుకుని వాడాలి.

పంచగవ్య: 5కిలోల తాజా ఆవుపేడలో 1/2 కిలో ఆవునెయ్యి కలిపి వెడల్పు మూతి గల ప్లాస్టిక్‌ డ్రమ్ము లేదా మట్టి కుండలో వేసి, మధ్యమధ్యలో కలుపుతూ నాలుగు రోజులు ఉంచాలి. 5వ రోజు ఈ మిశ్రమానికి 3 లీటర్ల ఆవు మూత్రము, 2 లీటర్ల ఆవు పాలు, 3 లీటర్ల కల్లు, 2 లీటర్ల ఆవు పెరుగు, 3 లీటర్ల లేత కొబ్బరి నీరు, ఒక కిలో నల్ల బెల్లం, 12 మగ్గిన అరటిపండ్లు మెత్తగా చేసి బాగా కలియతిప్పాలి. ఈ పాత్రకు గుడ్డతో మూతి బిగించి మధ్యలో కలియబెడుతూ 15 రోజులు ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పలుచటి గుడ్డలో వడబోసి ఎకరానికి  మూడు లీటర్ల పంచగవ్యను 100 లీటర్ల నీటికి కలిపి పంటల యొక్క వివిధ థలలో పిచికారీ చేయవచ్చు. పంచగవ్యని మొక్కల ఎదుగుదలకు, చీడపీడల నివారణకు, విత్తనశుద్ధికి, నారుమళ్ళలో వాడవచ్చు. పంచగవ్య పంటలకు వ్యాధినిరోధక శక్తిని అందిస్తుంది. పంట ఉత్పత్తుల నాణ్యతను, నిల్వను,రుచిని పెంచుతుంది. సాగునీటి ద్వారా, బిందు సేద్యంద్వారా కూడా పంచగవ్యను వాడవచ్చు. పంచగవ్యను ఆరునెలల వరకు వాడుకోవచ్చు.

నీమాస్త్రం: 5 కిలోల వేప ఆకు బాగా దంచి 200 లీటర్ల నీటిని కలపాలి. ఈ మిశ్రమంలో 5 లీటర్ల తాజా గోమూత్రం, 1 కిలో తాజా ఆవుపేడ వేసి కర్రతో బాగా కలియబెట్టాలి. దీనిని 24-48 గంటలు మూతతో కప్పి నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి పంటలపై ఎకరానికి పిచికారీ చేయవచ్చు. పంటలను ఆశించే పురుగుల నివారణకు  నీమాస్త్రం ఉపయోగపడుతుంది.

బ్రహ్మాస్త్రం: 2-3 కిలోల వేప ఆకు, రెండు కిలోల పల్లేరాకు,రెండు కిలోల ఉమ్మెత్త ఆకు, 2 కిలోల సీతాఫలం ఆకు, విడివిడిగా, బాగా మెత్తగా నూరి ఒక పాత్రలోకి తీసుకుని 10 లీటర్ల తాజా గోమూత్రం కలిపి బాగా కలియబెట్టిన తరువాత మూతపెట్టి అరగంట పాటు మరగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని 48 గంటల పాటు చల్లారనిచ్చి గుడ్డలో వడపోయాలి.ఎకరానికి  మూడు లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని 100 లీటర్ల నీటికి కలిపి పంటలపై పురుగులు మరియు తెగుళ్ల నియంత్రణకై పిచకారీ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఆరునెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. పైన చెప్పిన ఆకుల లభ్యత లేనపుడు పొంగామియా ఆకు, మామిడి ఆకు, మారేడు ఆకు లేదా జామ ఆకులతో కూడా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు.

అగ్ని అస్త్రం: 1 కిలో పొగాకు, 1/2 కిలో వెల్లుల్లి,  1 కిలో పచ్చిమిర్చి 5 కిలోల వేపాకులను విడివిడిగా దంచుకుని ఒక పాత్రలోకి తీసుకుని 10 లీటర్ల గోమూత్రాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి నాలుగు సార్లు పొంగు వచ్చేటట్లు మరిగించాలి. 48 గంటల పాటు చల్లారనిచ్చిన తరవాత మూడు లీటర్ల అగ్ని అస్త్రంను 100 లీటర్ల నీటికి కలిపి  పంటలపై పిచికారీ చేయాలి.పంటలపై ఆశించే లద్దెపురుగులు, పచ్చ పురుగులు, కాండం మరియు కాయ తొలుచు పురుగుల నివారణకు అగ్ని అస్త్రం వాడవచ్చు.

పైన వివరించిన గోఆధారిత కషాయాలతో పాటు ప్రకృతి వ్యవసాయంలో వివిధ మొక్కలు, చెట్లు, గింజల నుండి తయారు చేసిన కషాయాలు పురుగులు మరియు తెగుళ్ల నివారణకు వాడతారు. వీటిలో ముఖ్యంగా వేపగింజల కషాయం, వావిలాకు కషాయం, లొట్ట పీసు (తూటాకు) కషాయం, పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి కషాయం, థపత్ర కషాయం, మారేడు పత్ర కషాయం, పిచ్చి తులసి కషాయం, కానుగ పప్పు కషాయం, నిమ్మగడ్డి కషాయం వంటివి వాడుకలో ఉన్నాయి. రైతులు మరెన్నో కషాయాలను వివిధ పంట ఉత్పత్తుల కలయికతో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వాడుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో చేప కషాయం (మీనామృతం) వంటి ఔషధ శక్తి కలిగిన ద్రావణాన్ని ఉద్యాన పంటలలో చీడపీడల నివారణకు వాడుతున్నారు. ఇవి కాకుండా రైతులు గానుగ చేత తీసిన ఆముదం, నువ్వులు, కానుగ, వేప, కొబ్బరి నూనెలు కూడా ప్రకృతి వ్యవసాయంలో వాడి పోషకాలు అందచేయటం, చీడపీడలను నివారిస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన సమస్యగా ఉండే  గో- ఆధారిత ఉత్పత్తులు, వాటి లభ్యత, వాటి తయారీ, పాడి కొరత రైతులకు కొంత అవరోధం కలుగజేసే అవకాశం ఉంది. దీనిని అధిగమించడానికి ప్రభుత్వం రైతులకు పాడి చేకూర్చే ప్రయత్నాలు చేపట్టాలి. నీతి ఆయోగ్‌ సభ్యులు రమేష్‌ చంద్‌ మన దేశంలో గోశాలలను ఆర్థిక సహాయంతో వృద్ధి చేసి గోఆధారిత ఉత్పత్తులను రైతులకు అందించడానికి కృషి చేయాలని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయంలో వాడే వివిధ పద్ధతులను వ్యవసాయ పరిశోధన సంస్థలలో కూడా పరిశీలించే నిమిత్తం మరియు రైతులకు అవగాహన కల్పించటం కొరకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంస్థ ఏ.పి. రైతు సాధికార సమస్త 2021లో అన్ని పంటలకు ప్రకృతి వ్యవసాయంలో పాటించవలసిన సాగు పద్దతుల ప్యాకేజీ మరిన్ని వివరాలతో రూపొందించి  రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఈ నివేదిక ప్రకృతి వ్యవసాయానికి ఒక నిఘంటువు లాగా ఉపయోగ పడుతోంది.

అధిక ఖర్చులు, పెట్టుబడులతో చేసే రసాయన వ్యవసాయం కన్నా అతి తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో చేసే ప్రకృతి వ్యవసాయం సుస్థిర పంట దిగుబడులతో ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు సాగాలని మన ప్రధాన మంత్రి మన దేశ నలుమూలల రైతులను చైతన్య పరచడానికి సమగ్ర ప్రణాళికతో కార్యాచరణ మిషన్‌ను ప్రతిపాదించారు. ఈ మిషన్‌ను సమిష్టి బాధ్యతగా అందరం ముందుకు తీసుకువెళ్లాలి.   

ఎస్‌.ఎం. విద్యాశేఖర్‌, జీ. శ్రీకృష్ణ, డి.ఎల్‌.ఏ.గాయత్రి, వి.మారుతి, ఎం. శ్రీనివాసరావు,  వీ.కె.సింగ్‌, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, సంతోష్‌ నగర్‌, హైదరాబాద్‌-500059, తెలంగాణ.

Read More

మట్టి పరీక్షకు నమూనా సేకరణ విధానం

భూమిలోని పోషకాలు, లోపాలను తెలుసుకుని సాగుచేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. చాలా మంది సాగు సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దిగుబడులు కోల్పోతున్నారు. తోచినట్లు సాగు చేయడం, ఏటా ఒకే రకమైన పంటలు వేయడం, ఇష్టానుసారంగా మందులు, ఎరువులు వినియోగించడం, తదితర కారణాలతో వ్యవసాయంలో అనుకున్నంతగా రాణించలేక పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖాధికారులు, సిబ్బంది రైతులకు చైతన్యం కలిగిస్తున్నారు. భూసార పరీక్షల ఆవశ్యకత, మట్టి నమూనా సేకరణ, పరీక్షల విధానం లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. మట్టి నమూనాలకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు.

నమూనాల సేకరణ విధానం

*    భూమి రకాలను బట్టి 1 నుంచి 5 ఎకరాల వరకూ ఒక నమూనాను సేకరించవచ్చు. నమూనా సేకరించాల్సిన భూమి రంగు, ఎత్తు వాలును బట్టి చౌడు వంటి సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకొని భాగాలుగా విభజించాలి.

*    వేరు చేసిన భాగాలను వేరువేరు భూములుగా గుర్తించాలి. ప్రతి భాగం నుంచి వేరువేరు నమూనాలు సేకరించాలి.

*    నమూనా తీయాల్సిన చోట చెత్తాచెదారం లేకుండా చేతితో పక్కకు తోయాలి. నాగలి సాలు పోయేంత లోతు ఆరు అంగుళాల లోతు వరకూ&ఙ ఆకారంలో తవ్వాలి. తవ్విన గుంతలో నుంచి అరకేజీ వరకూ మట్టి సేకరించాలి. మొత్తం మట్టిని కలిపి వాటిలో ఉండే రాళ్లు, వేర్లు, కొయ్యలు, చెత్తను శుభ్రం చేసుకోవాలి.

*    మట్టి తడిగా ఉంటే నీడలో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మొత్తం మట్టిని నాలుగు భాగాలుగా ఉంచి రెండు భాగాలుగా తీసివేయాలి.

*    మిగిలిన రెండు భాగాల్లో అరకేజీ వరకూ ఉంచుకోవాలి. ఈ మట్టిని శుభ్రమైన సంచిలో గానీ, గుడ్డ సంచిలో గానీ నింపు కోవాలి. రైతు పేరు, సర్వే నెంబర్‌, ఊరు, వంటి వివరాలు రాసి అందులో ఉంచాలి.

*    నమూనాలు సేకరించాల్సిన పొలంలో గట్టు, నీడ, చవుడు వంటి ప్రదేశాలను గమనించాలి. చెట్ట నీడ, బురద ఉండే ప్రదేశాలు, తేమగా ఉన్న చోట నమూనాలు సేకరించకూడదు.

*    పొలం గట్లు, ఎరువు కుప్పులు, పైరుకు దగ్గరగా నమూనాలు తీయకూడదు. సున్నం, బూడిద, రసాయన ఎరువులు వేసిన మూడు నెలల వరకూ తీయకూడదు.

ఆర్‌బీకే పరిధిలో నమూనాలు

ఉదాహరణకు కాకినాడ జిల్లాలో ప్రతీ రైతు భరోసా కేంద్రంలో రెండు మట్టి నమూనాలు సేకరించేలా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది 836 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ 402 నమూనాలు సేకరించారు. మరో వారంలోపు మిగిలినవి సేకరించనున్నారు. ఆర్బీకేల వారిగా మట్టి నమూనాలను ఆయా సిబ్బంది సమీపంలోని భూసార పరీక్షా కేంద్రానికి పంపుతారు. వీటిని ప్రయోగశాలల్లో పరీక్షించాక ఫలితాలను రైతులకు కార్డులు రూపంలో అందిస్తారు. ఫలితాలను బట్టి పొలాల్లో నెలకొన్న సమస్యలు, అనుసరించాల్సిన పద్ధతులు, ఎరువుల మోతాదులు, ఇతర వివరాలను సంబంధిత వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు తెలియజేస్తారు.

నేలను కాపాడుకోవాలి

ప్రస్తుత పరిస్థితుల్లో భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. నేల ఆరోగ్యంగా ఉంటే అందరం ఆరోగ్యంగా ఉంటాం. మట్టి పరీక్షల ఆధారంగానే రైతులు పంటలు వేసుకుంటే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు కూడా బాగా తగ్గుతాయి. నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మట్టి నమూనాలు సేకరించే విధంగా చర్యలు తీసుకొంటున్నాం అని అంటున్నారు.      \

– ఎన్‌ విజయ్‌కుమార్‌, కాకినాడ జిల్లా వ్యవసాయశాఖాధికారి 

Read More

జై కిసాన్‌   జై కిసాన్‌   జై కిసాన్‌

దేశంలో అన్ని వర్గాల ప్రజలు వారి భవిత కోసం, ప్రగతి కోసం ఆరాటపడుతున్నారు. అప్పుడప్పుడు విధిలేని పరిస్థితుల్లో రోడ్లు ఎక్కి ఆందోళనలకు దిగుతున్నారు. వారి హక్కులు అనండి లేదా వారి సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తూ కొన్నిసార్లు విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే మరోవైపు ఆరుగాలం కష్టించి తన చెమట చుక్కలను ఆహార రంగంలో దేశ స్వయం సమృద్ధికోసం అహర్నిశలు రైతులు తమ జీవితాలను ధారపోస్తున్నారు. అకాల వర్షాలకు నోటికాడ పంట నాశనం అయినా చీడపీడలతో దిగుబడులు, వాటి నాణ్యత దెబ్బతిన్నా, తనను తాను ఓదార్చుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నారు.

ప్రతి థలో వారికి ఎదురీతే. ఇటీవల కురిసిన అకాల వర్షాలు దెబ్బతీశాయి. పంట దిగుబడి వచ్చినా, మార్కెట్‌ కనికరించక ఇబ్బందులే. ఎన్ని పథకాలు అండగా ఉన్నా, భరోసా అనుకున్నా అనుకున్న ఫలితం రాక వ్యవసాయం గిట్టబాటు కావటం లేదు. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నది, ఉండేది రైతులోకం ఒక్కటే. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఆచరణలో మాత్రం ఒరిగేది ఏమీ లేదు సుమా. ఇతరరంగాల సమస్యలను అధిగమించటానికి జరుగుతున్నంత కృషి, ప్రయత్నం, మేధో మథనం రైతు దిశగా సాగకపోవటం శోచనీయం. అయినా ఏనాడూ రైతు తన పని మానుకోలేదు. తన శక్తియుక్తులను కూడదీసుకుని నిరంతరం ఒక పంటకాలం తరువాత మరో పంటకాలం గురించి ఆలోచిస్తూ, దేశ భవిష్యత్‌కు భరోసాగా ఉంటున్నారు. తను కృంగి, కృశించిపోతున్నా దేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఇంతెందుకు… కాలం కలిసి రాలేదు. ప్రకృతి అండగా లేదు. అంతా సమస్యల వలయమే. ఎవ్వరూ  రాకపోయినా ఉన్న వనరులతో మంచి దిగుబడులు సాధించి దేశ లక్ష్యాలను సాధించారు. అందుకు నిదర్శనమే నిన్నగాక మొన్న కేంద్రం తాజాగా ప్రకటించిన అంచనాలు. దాదాపు అన్ని పంటలలో అంచనాలకు మించి ఉత్పత్తి వస్తుందని నిగ్గు తేల్చారు. అంటే రైతులు  ప్రభుత్వ అంచనాలను మించి అదరగొట్టినట్లే కదా! ఇది వారికి ఎప్పుడూ అలవాటే. థాబ్దాలుగా వారి రికార్డ్స్‌ను వారే తిరిగి రాస్తున్నారు. అయితే వారి కృషికి త్యాగానికి తగిన న్యాయం జరగకపోవటమే పెద్ద విషాదం.

ఇన్ని అపశ్రుతులు, అవరోధాలు ఎదురైనా రైతులు వారి శక్తియుక్తులుతో ఎదుర్కొని ఉత్పత్తి సాధిస్తున్నారు లక్ష్యాలకు అనుగుణంగా. కరోనా సమయంలో కూడా ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే ఆదుకుంది. అన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా దేశానికి అండగా నిలిచారు. నిలుస్తున్నారు కూడా. కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022-23 తిండిగింజల ఉత్పత్తి లక్ష్యం 288.31 మిలియన్‌ టన్నులు కాగా, సవరించిన అంచనాల ప్రకారం 303.3 లక్షల టన్నులు..  అలానే ఇతర వాటిలో కూడా…

దీనిని బట్టి అర్థమయ్యే విషయం ఒక్కటే మనం అంతా జైకిసాన్‌ అంటూ వారికి మద్దతుగా, వారి సంక్షేమం కోసం పని చేయాలి. వారి బాగుకోసం పాటుపడాలి. వారు విశ్రమిస్తే దేశం మొత్తం దివాళానే అన్న సంగతి మరచిపోకూడదు. ‘జైకిసాన్‌ జైకిసాన్‌ జైకిసాన్‌’ నినాదం మరోసారి దేశమంతా మార్మ్రోగాలి. వారిని రక్షించుకోవటం మన అందరి బాధ్యత.

– వెంకటేశ్వర రావు 

Read More