అర ఎకరం పొలంతో ఆనందంగా జీవించవచ్చు

ఈ భూమండలంలో జీవనాన్ని కొనసాగించే అనంతకోటి జీవరాశులలో మనము కూడా ఉన్నాము అనే విషయం అక్షర సత్యం. మిగతా జీవరాశులతో పోల్చుకుంటే మనిషికి తెలివితేటలు ఉన్నాయి అంతే. అంతకు మించి ఏమీ తేడా లేదు. మిగతా జీవరాశుల లాగానే మనక్కూడా ఆకలి, నిద్ర లాంటివి సహజం. ఏ జీవికి సంబంధించిన నిత్యకృత్యాలు అవి పాటిస్తూ ఉంటాయి. కానీ మనిషికి మాత్రం తెలివితేటలు ఉండటము వలన మిగతా జీవులకంటే భిన్నంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తన తెలివి తేటలను మంచి కొరకు కంటే చెడు కొరకు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. తన తెలివితేటలతో కొత్త కొత్త వస్తువులను, ఉత్పత్తులను తయారు చేసుకుని తమ కోరికలను పెంచుకుంటూ, అవసరాలను ప్రక్కకు నెట్టి అనుకరణలకు ప్రాముఖ్యతను పెంచుకుంటూ పోతూ తమ జీవితాలలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతూ ఆర్థికంగా బలపడుతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆరోగ్యం, ఆనందం లేని జీవితాలలో ఆర్థికబలం ఎంత ఉన్నా అది వృథా అనే విషయం తమ తెలివి తేటలతో తెలుసుకోగలిగినా కూడా తమకు ఉన్న వివిధ రకాల బలహీనతల వలన తెలిసిన మంచి విషయాలను అమలు పరచటములో చాలా చాలా వెనుకంజ వేస్తున్నారు అనే విషయం ప్రస్తుత సమాజాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఈ విషయం కరోనా సమయంలో ఇంకా బాగా అర్థం అయ్యింది. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళు కూడా కంటికి కనిపించని చిన్న వైరస్‌కు భయపడి ఇంటి నుంచి బయటకు రాకుండా ముక్కుకు, మూతికి గుడ్డ కట్టుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన నైజీరియా, టాంజానియా, యుగాండా లాంటి దేశాలకంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందినది అనుకుంటున్న అమెరికా లాంటి దేశాలలోనే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందనే విషయం వాస్తవం. కరోనాతో అందరికీ ఇమ్యూనిటీ యొక్క విలువ తెలిసి వచ్చింది. ఇన్‌కం కంటే ఇమ్యూనిటి ముఖ్యం అనే విషయం తెలుసుకోగలిగారు. ఇమ్యూనిటి ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటేనే జీవితాలలో ఆనందం ఉంటుంది. ఇమ్యూనిటి పెరగాలంటే సరైన వ్యాపకం వ్యవసాయం. అందుకే ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు మసనోబు ఫకుఓకా ఏమన్నారంటే ”మనిషి ఆనందంగా బతకాలంటే అర ఎకరం పొలం చాలు, అర ఎకరం పొలంతో మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు” అని అన్నారు. ఈ విషయాన్ని నిజమే అని నిరూపిస్తున్నారు గుంటూరు సమీపములోని పెదపలకలూరు గ్రామంలో కేవలం 70 సెంట్ల స్థలంలో వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలతో పాటు కొన్ని గేదెలను పోషిస్తూ ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు పోలయ్య.

పోలయ్యది వ్యవసాయ నేపథ్యం. గుంటూరు సమీపములోని పెదపలకలూరులో తమకు ఉన్న 70 సెంట్ల భూమిలో వివిధ రకాల పంటలు పండిస్తూ అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని కొన్ని పశువులను కూడా పోషిస్తూ పాలు మరియు వానపాముల ఎరువుతో పాటు కూరగాయలు అమ్ముకుంటూ 70 సెంట్ల భూమిని జీవనోపాధిగా చేసుకుని ఆనందకర జీవనాన్ని కొనసాగిస్తూ అర ఎకరం పొలం ఉన్నా కూడా ఆనందంగా జీవించవచ్చు అని నిరూపిస్తున్నాడు. 

తమ భూమి బాగుపడడముతో పాటు పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నా సేంద్రియ సాగే సరైన దారి అని నమ్మి సేంద్రియ సాగు పద్ధతులను అమలు పరుస్తున్నారు. ఒక ఆవు మరియు దూడలతో కలిపి 12 గేదెలను పోషిస్తున్నాడు. వాటి ద్వారా వచ్చిన పాలను అమ్మకం చేస్తున్నాడు. పశువుల పేడను వానపాముల ఎరువుగా తయారు చేస్తూ తమ పంట పొలానికి ఉపయోగించడంతోపాటు ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇంటి పంటను నిర్వహించే వారికి కిలో 8 నుంచి 10/-ల వరకు అమ్మకం చేస్తూ ఆదాయం గడిస్తున్నాడు. పశువులకు మేత కొరకు ఎండుగడ్డిని అందించడంతో పాటు సూపర్‌ నేపియర్‌ గడ్డిని పెంపకం చేస్తూ అందిస్తున్నాడు. సేంద్రియ పద్ధతిలో పెంచిన సూపర్‌ నేపియర్‌ పశుగ్రాసాన్ని మేపడము వలన పాలు రుచిగా ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు.

పండ్ల విషయానికొస్తే పోలయ్య తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ రకాల పంటలు సాగు చేయకుండా కేవలం ఆకుకూరలు, కొన్ని రకాల కూరగాయలతో పాటు కొన్ని రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం పాలకూర, పొదీన, చుక్కకూర, గోంగూర, కరివేపాకు, వంగ, సొర, టమాట, చిక్కుడు, పొట్ల మొదలగు కూరగాయలు అర ఎకరంలో సాగు చేస్తూ నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తున్నారు. వాటితో పాటు సపోటా, తినే ఉసిరి, బత్తాయి, సీతాపలం, దబ్బకాయ, మునగ, నిమ్మ, జామ, పారిజాతం, శంఖుపువ్వులు, మందార, మల్లె, తులసి లాంటి మొక్కలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నాడు. 

పశువుల ఎరువు మరియు సొంతంగా తయారు చేసుకున్న వానపాముల ఎరువు భూమికి అందిస్తూ పంటలు సాగు చేయడం వలన ఆ భూమిలో పెరిగే మొక్కలు వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటూ పెరుగుతున్నాయి కాబట్టి వీరు సాగు చేసే పంటలను చీడపీడలు పెద్దగా ఆశించటం లేదు. వంగ పంటను ఉదాహరణగా తీసుకుంటే రసాయన పద్ధతిలో సాగు చేసే వంగలో చీడపీడల ప్రభావం విపరీతంగా ఉండడము వలన విచక్షణా రహితంగా రసాయనాలను ఉపయోగిస్తూ వంగ పంటను పండిస్తుంటారు. కాని భూమిలో సేంద్రియ పదార్థం సక్రమంగా ఉండడముతో పాటు తగినంత సేంద్రియ ఎరువులను అందిస్తూ పంటలను సాగు చేసినట్లయితే విపరీతంగా రసాయనాలు అవసరమయ్యే వంగ లాంటి పంటలను కూడా రసాయనాలు ఏమాత్రం ఉపయోగించకుండా కేవలం సేంద్రియ పద్దతులు పాటిస్తూ చీడపీడలు ఆశించని వంగ దిగుబడిని తగినంత పొందవచ్చు అని పోలయ్య నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9666460129 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

Read More

మే మాసంలో ఉద్యాన పంటల్లో సేద్య పనులు

పండ్ల తోటలు

మామిడి: కాయల కోతకు 30-40 రోజుల ముందు నీరు పెట్టడం ఆపితే కాయనాణ్యత పెరుగుతుంది. కాయలను చల్లటి వేళల్లో, కోత పరికరాలను ఉపయోగించి కోయాలి. కాయకు 5-7 సెం.మీ. తొడిమ ఉండేలా కోసి సొన అంటకుండా తలకిందులుగా ఉంచి, సొన మొత్తం కారిపోయిన తర్వాత తర్వాత గ్రేడింగ్‌ చేసుకొని అట్టపెట్టల్లో కాగితపు ముక్కలను ఒత్తుగా వేసి ప్యాకింగ్‌ చేయాలి. దూరప్రాంత రవాణా కోసం కాయలను కోసిన తర్వాత 10 గంటల్లోపు శీతల గిడ్డంగుల్లో 12.5 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత, 80-90 శాతం తేమ వద్ద నిల్వ ఉంచాలి.

అరటి: 30-40 సెం.మీ. లోతుగా, తొలకరి వర్షాలు పడగానే మెత్తగా దున్నాలి.

జామ: చెట్లను బెట్టకు గురి చేయడం ద్వారా ఆకులు రాలేలా చేసి, ఎండిన, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను, కాపు కాసిన కొమ్మలను చివరి నుంచి 5-6 సెం.మీ. లోపలికి కత్తిరించాలి.

ద్రాక్ష: వేసవి కత్తిరింపుల తర్వాత 9వ ఆకు ఏర్పడిన థలో కొమ్మల కొనలను గిల్లడం ద్వారా పిల్లకొమ్మల అభివృద్ధి జరుగుతుంది. కొత్త చిగుర్లలో పక్షికన్ను తెగులు సోకకుండా సరైన చర్యలు చేపట్టాలి.

సపోట: ముదురు తోటల్లో నీటి తడులు ఇవ్వాలి. తయారైన కాయలను ఉదయం వేళల్లో తొడిమతో సహా కోసుకోవాలి. 

పనస: కళ్లు పూర్తిగా విచ్చుకొని, పసుపుపచ్చ రంగులోకి మారి సువాసనలు వెదజల్లే కాయలను కోయాలి. కోత తర్వాత ఎండిన రెమ్మలను తీసివేసి ఎలాంటి తెగుళ్ళు రాకుండా చర్యలు చేపట్టాలి.

దానిమ్మ: చెట్లకు పూర్తిగా విశ్రాంతి నివ్వాలి. బాక్టీరియా తెగులును అదుపులో ఉంచడానికి ఒక శాతం బోర్డోమిశ్రమాన్ని 20 రోజుల వ్యవధిలో 2-4 సార్లు పిచికారి చేయాలి.

రేగు: పాదుల దగ్గర మట్టిని తిరగబెట్టి నిద్రావస్థ థలో ఉన్న కాయతొలుచు పురుగులను నాశనం చేయాలి.

నిమ్మ: ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 5-10 గ్రా. సున్నం చొప్పున కలిపి పిచికారి చేస్తే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే వీలుంటుంది. సున్నం పిచికారి చేశాక 15 రోజుల తర్వాత యూరియా లేదా పొటాషియం నైట్రేట్‌ (10. గ్రా./లీ. నీటికి) పిచికారి చేయాలి.

బొప్పాయి: 5 నెలలు దాటిన తోటల్లో ప్రతి మొక్కకు 25-30 లీటర్ల నీటిని డ్రిప్‌ ద్వారా ఇవ్వాలి. ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం పెరిగేకొద్ది ఆకుముడత, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగుల నివారణకు సరైన చర్యలు చేపట్టాలి. తెల్లదోమ ఉధృతి నియంత్రణకు పసుపు రంగు జిగురు అట్టలను, పేనుబంక ఉధృతి నియంత్రణకు నీలంరంగు జిగురు అట్టలను ఎకరాకు 12-15 చొప్పున పంట ఎత్తులో అమర్చాలి. 

కూరగాయలు

తీగజాతి కూరగాయలు: వేసవి దుక్కులు లోతుగా చేసుకొని నేలలో దాగి ఉన్న పురుగుల కోశస్థ థలు చనిపోయేలా చూడాలి. కంద, చేమ, పెండలం నాటడానికి అనువుగా భూమిని 30-40 సెం.మీ. లోతుగా దున్ని, తొలకరి వర్షాలకు 3-4 సార్లు గొర్రుతో మెత్తగా దుక్కిచేయాలి.

ఉల్లి: ఖరీఫ్‌ ఉల్లిసాగుకు అనువైన అగ్రిఫౌండ్‌ డార్క్‌రెడ్‌, నాసిక్‌ రెడ్‌, అర్కాకళ్యాణ్‌ రకాల నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని నారు పోసుకోవాలి.

పూల తోటలు: కొత్తగా పూల తోటలు సాగు చేయడానికి వేసవిలో లోతుగా దుక్కులు చేయాలి. 

గులాబి: గులాబీ తోటల్లో నీరు పెట్టాలి.

కనకాంబరం: తోటలు వేయడానికి అవసరమైన నారును పెంచుకోవాలి.

తోటపంటలు: కొత్తగా కొబ్బరి నాటడానికి 1þ1þ1 మీ. సైజు గుంతలను 8þ8 మీ. దూరంలో చేయాలి. కాపుకాసే తోటల్లో వారానికి ఒకసారి నీరు పెట్టాలి. పళ్ళాలలో పచ్చిరొట్టను కోసి వేసి తేమ ఆరకుండా చూడాలి. తోటలను ఆశించిన సర్పిలాకార తెల్లదోమ యాజమాన్యం చేపట్టాలి.

తమలపాకు: మొదటి సంవత్సరం తోటలు వేయడానికి నేలను బాగా దున్ని ఎకరాకు 40 బండ్ల పశువుల ఎరువు, 20 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్‌ ఇచ్చే ఎరువులు వేసి, 16-20 కిలోల అవిశ గింజలను సాలుకు సాలుకు మధ్య మీటరు దూరం ఉండేలా ఉత్తర-దక్షిణ దిశల్లో ఒత్తుగా విత్తుకోవాలి. రెండో సంవత్సరపు తోటల్లో వేడి గాలులు తోటలోనికి రాకుండా తోటచుట్టూ దడులు కట్టాలి.

జీడిమామిడి: చెట్ల పాదుల్లో ఎండు ఆకులు గడ్డి మల్చ్‌గా వేసి నేల తేమ ఆరకుండా కాపాడుకోవాలి.

సుగంధద్రవ్య పంటలు

మిరప: పొలాలను లోతుగా దుక్కి చేసి, చెత్తాచెదారాన్ని ఏరి కాల్చివేయాలి. సిఫార్సు చేసిన రకాల విత్తనాలను సేకరించుకోవాలి.

అల్లం: ఏప్రిల్‌లో నాటిన చోట చేతితో కలుపు తీయాలి. మురుగు నీటి కాలువలను సరిచేసుకోవాలి. మే నెలలో నీటి వసతి ఉంటే విత్తుకోవచ్చు.

పసుపు: పంటకు భూమిని లోతుగా దున్ని తొలకరి వర్షాలకు 2-3 సార్లు దుక్కి చేసి ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల ఆముదం పిండి లేదా వేపపిండి, 10 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వేసుకొని స్వల్పకాలిక రకాలైన కస్తూరి, సుగుణ, సుదర్శన రకాలను మే నెల చివరిలో నాటుకోవాలి.

ఔషధ, సుగంధ పంటలు

పామా రోజా: విత్తనాన్ని ఎకరానికి 2 కిలోల చొప్పున ముందురోజు రాత్రి తడి ఇసుకతో మూటకట్టి మరుసటి నారుమళ్ళలో విత్తుకోవాలి.

కలబంద: పంటకు నేలను బాగా కలియదున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు వేసుకోవాలి.

నిమ్మగడ్డి: పిలకలు నాటడానికి పొలం బాగా దున్ని ఆఖరిదుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి.

కె. సాధన (9940236076), డా|| యమ్‌.ఆర్‌. భానుశ్రీ, డా. జె.డి. సరిత, డా. బి. పుష్పావతి, వ్యవసాయ కళాశాల, పాలెం, ప్రొఫెసర్‌ జయంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ.

Read More

సిరిధాన్యాలు… నేటి జీవామృతాలు

చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు (ఖరిజిజిలిశిరీ) ఆహార ధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు. ఇందులో ప్రాముఖ్యత సంతరించుకున్నవి 5 సిరిధాన్యాలు. అవి…

1. కొర్రలు 

2. అరికలు

3. సామలు 

4. ఊదలు 

5. అండుకొర్రలు 

సిరిధాన్యాల విశిష్టత:

సహజ పీచు పదార్థం కల్గి ఉండటమే సిరిధాన్యాల ప్రత్యేకత. మూడు పూటలా తిన్నప్పుడు, ఆ రోజుకు మనిషికి అవసరమైన 25-30 గ్రాముల పీచుపదార్థం (ప్రతీ మానవుడికి రోజుకు 38 గ్రాముల పీచుపదార్థం కావాలి) ధాన్యాల నుండే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములూ కూరగాయల నుండి, ఆకు కూరల నుండి పొందవచ్చు. ఒక్కొక్క సిరిధాన్యమూ కొన్ని రకాల దేహపు అవసరాలనూ, ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తిని కలిగి ఉన్నాయి. 

వరి, గోధుమలలో పీచు పదార్థం / ఫైబర్‌ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్‌ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలలో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తిగా ఉపయోగపడుతుంది. అందువల్లనే ఇవి సిరిధాన్యాలయ్యాయని గుర్తించాలి.

1. కొర్ర బియ్యం – సమతుల్యమైన ఆహారం. 8 శాతం పీచుపదార్థంతో పాటు, 12 శాతం ప్రోటీను కూడా కలిగి ఉంది. గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారమని చెప్పవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్ధకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినపుడు మూర్ఛలు వస్తాయి, అవి శాశ్వతంగా నిలుస్తూ ఉంటాయి

వాటిని పోగొట్టగలిగే లక్షణం వీటికి ఉంది, నరాల సంబంధమైన బలహీనతలకు సరైన ఆహారం కొర్ర బియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఉదర క్యాన్సర్‌, పార్కిన్సన్‌ రోగం, ఆస్మా (అరికెలతో పాటుగా) నివారించడంలో కూడా కొర్రబియ్యం ఉపయోగపడుతుంది.

2. అరికల బియ్యం – రక్త శుద్ధికీ, ఎముకల గుజ్జు సమర్ధవంతంగా పనిచేసేలా చూసేందుకూ, అస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్‌, ప్రేగులు, థైరాయిడ్‌, క్లోమ గ్రంధులు, కాలేయపు క్యాన్సర్లూ తగ్గించుకోవడానికి, అధికంగా చక్కెర వ్యాధి వారికి కూడా అరికలు మేలు చేస్తాయి. డెంగ్యు, టైఫాయిడ్‌, వైరస్‌ జ్వరాలతో నీరసించిన వారి రక్తం శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికలు.

3. సామ బియ్యం – మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి. ఆడవారిలో పిసిఓడి తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకరణాల సంఖ్య పెరుగుతుంది. ఇవికాక మానవుడి లింపు నాడీ వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్త క్యాన్సర్‌, థైరాయిడ్‌, క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నియంత్రణకు సామలు వాడకం వల్ల ప్రయోజనం ఉంటుంది.

4. ఊద బియ్యం – థైరాయిడ్‌, క్లోమ గ్రంథులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం,మూత్రాశయం, గాల్‌ బ్లాడరు శుద్ధికి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదబియ్యం పనికి వస్తాయి.

5. అండుకొర్ర బియ్యం – మొలలు, మూలశంక, అల్సర్లు, మెదడు, రక్తం, స్తనాలు, ఎముకల, ఉదర, ప్రేగుల, చర్మ సంబంధ క్యాన్సర్ల చికిత్సకు బాగాఉపయోగపడతాయి. 

చిరుధాన్య పంటలకు ఎలాంటి ఎరువులు వాడాలి? 

మెట్ట భూముల్లో రసాయన ఎరువుల వాడకుండానే చిరుధాన్య పంటలు బాగా పెరుగుతాయి. అందువలన చిరుధాన్యాలను పండించే రైతులు పర్యావరణ పరిస్థితులలో పశువుల ఎరువునుపయోగించి వీటిని పండిస్తారు. ఇటీవలి కాలంలో రైతులు తమ పెరటిలో స్వయంగా తయారు చేసుకున్న వర్మికంపోస్టు తదితర జీవన ఎరువులను, పంటల పెరుగుదలను పెంచే పంచగవ్య, అమృతపాని మొదలగు వాటినుపయోగించి చిరుధాన్య పంటలను పండిస్తున్నారు. 

చిరుధాన్యాల పంటల సరళి : సంప్రదాయ పద్ధతుల్లో పండించే చిరుధాన్య పంటలు కేవలం పంటలేకాక, ఈ చిరుధాన్య క్షేత్రాలలో జీవవైవిధ్యముంటుంది. ఒకే పొలంలో ఒకేసారి 6 నుండి 12 పంటలను సాగు చేస్తారు. దక్షిణ భారతదేశంలో పన్నెండు పంటల పద్ధతిలో చిరుధాన్య పంటలను ఆపరాలు, నూనెగింజల పంటలతో కలిపి సాగు చేస్తారు.

ఆహార భద్రత : వరి, గోధుమ వంటి పంటలు భారతదేశానికి ఆహారభద్రత అందిస్తే, చిరుధాన్యాలు ఆహారం, పోషకాలు, పశుగ్రాసాలు, పీచు, ఆరోగ్యం, జీవనాధారం, పర్యావరణం వంటి అనేక భద్రతలనందిస్తాయి. అనేక చిరుధాన్య పంటల కాండాలను పశువులు ఇష్టంగా తింటాయి. అనేకసార్లు జొన్న, సజ్జ వంటి పంటలను పశుగ్రాసాలుగానే సాగు చేస్తారు. పశుగ్రాసాలగానే కాక, చిరుధాన్య పంటలు పోషక నిలయాలుగా పోషక భద్రతనందిస్తాయి. సహచర పంటలుగా పండించే లెగ్యూమ్‌ జాతి పంటలు ఆకులను రాల్చి సహజ ఎరువుగా భూసారాన్ని వృద్ధి చేస్తాయి. ఆ విధంగా చిరుధాన్య పంటలు భూసారాన్ని ఉపయోగించుకోడమే కాకుండా భూమికి తిరిగి అందిస్తాయి. 

ఏ సిరిధాన్యం ఏ యే వ్యాధులను తగ్గిస్తుంది?

1. కొర్రలు: నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్ద్రయిటిస్‌, పార్కిన్సన్‌, మూర్ఛరోగాల నుంచి విముక్తి.

2. అరికలు: రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయాబిటిస్‌, మలబద్ధకం, మంచినిద్ర.

3. ఊదలు: లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంథులు (ఎండోక్రెయిన్‌ గ్లాండ్స్‌), కొలెస్టరాల్‌ తగ్గించడం, కామెర్లు.

4. సామలు: అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఓడి, సంతానలేమి సమస్యల నివారణ

5. అండుకొర్రలు: జీర్ణాశయం, ఆరయిటిస్‌, బి.పి., థైరాయిడ్‌, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ. 

ఆరోగ్య ప్రయోజనాలు

*    అందుబాటులో ఉన్న ధాన్యాలలో చిరుధాన్యాలు అతి తక్కువ అలర్జి కలిగించి, జీర్ణశక్తిని పెంచే ధాన్యాలు.

*     చిరుధాన్యాలలోని నీటిలో కరుగని పీచు పదార్థం ట్రైగ్లిసరైడ్లను తగ్గిస్తుంది.

*    చిరుధాన్యాలలో నరాల వ్యవస్థకు మంచి కలిగించే లెసితిన్‌ అధిక పరిమాణాలలో ఉంటుంది.

*    చిరుధాన్యాలలో ఉండే మెగ్నీషియం మైగ్రెన్‌, అధిక రక్తపోటును, గుండెపోటులను తగ్గిస్తుంది.

*    చిరుధాన్యాలు టైప్‌2 డయాబెటీస్‌ను తగ్గిస్తాయి.

*    చిరుధాన్యాలలో జన్యుకోడ్‌ నిర్మాణానికి ముఖ్యమైన న్యూక్లిక్‌ యాసిడ్లలో ఉండే భాస్వరం ఎక్కువగా ఉంటుంది.

*    చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే స్త్రీలలో మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం, పిల్లల్లో ఆస్తమా సమస్యలు తగ్గుతాయి.

*    మెనోపాజ్‌ తర్వాత స్త్రీలలో గుండె సమస్యలు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ మోతాదులను తగ్గించి చిరుధాన్యాలు లాభం కల్గిస్తాయి.

*    చిరుధాన్యాలలో ఉండే బహుళ పోషకాలు కలిగిన లిగ్నాన్లు రొమ్ము క్యాన్సర్‌తో పోరాడి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.      

చిరుధాన్యాలను ఏ భూముల్లో పండించవచ్చు

అనేక చిరుధాన్యాలను అతితక్కువ సారవంతమైన భూముల్లో పండించవచ్చు. కొన్నింటిని ఆమ్లభూముల్లో, కొన్నింటిని చౌడుభూముల్లో సాగు చేయవచ్చు. సజ్జను ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. నిజానికి రాగిని చౌడు భూముల్లో కూడా సాగు చేయవచ్చు. వరి పంట పండని భూముల్లో కూడా ఊదలు పండుతాయి. సమస్యాత్మక భూములను సరిచేయడానికి కూడా చిరుధాన్య పంటలు సాగు చేయవచ్చు

మెట్ట ప్రాంతాలలోని భూములు ఎక్కువగా సారం లేని భూములే. మెట్ట ప్రాంతాలలో వ్యవసాయాన్ని సుస్థిరపరచే పంటలు చిరుధాన్యాలే. చిరుధాన్య పంటలు సగటు వర్షపాతం 500 మి.మీ. కన్నా తక్కువ వున్న ప్రాంతాలలో, ఇసుక, ఆమ్ల నేలల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకుని దిగుబడులనివ్వగల సమర్థవంతమైన పంటలు

బి. నవ్య (గృహ విజ్ఞాన శాస్త్రవేత), డా. కిరణ్‌ పిల్లి, (మృత్తిక శాస్త్రవేత్త), డా. వినోద్‌ కుమార్‌ (విస్తరణ విభాగం శాస్త్రవేత్త), డా. ఎ. శ్రీనివాస్‌ (ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ అండ్‌ హెడ్‌), కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరిఖిల్లా, పెద్దపల్లి జిల్లా

Read More

డ్రిప్‌ పద్ధతిలో సాగు చేసే పంటల్లో ఎరువులు వాడకం – మెలకువలు

పంటల సాగులో ఎరువుల వినియోగం చాలా కీలకమైనది. సాధారణంగా రైతులు ఎరువులు నేలకు నేరుగా వేస్తారు. భాస్వరం, పొటాష్‌ ఎరువుల్ని పైరు విత్తే ముందే వేస్తారు. నత్రజని ఎరువును 2-3 దఫాలుగా వేస్తారు. దీనివల్ల పైరుకు రెండు మూడు నెలల పాటు అవసరమయ్యే పోషకాలు ముందే వెయ్యటం వల్ల, అధిక శాతం ఎరువు వృథా అవుతున్నాయి. దీనివల్ల సాగు ఖర్చు పెరగటంతో పాటు నేల కాలుష్యం, వాతావరణ కాలుష్యం జరుగుతుంది. మరియు పైర్లు ఆశించిన స్థాయిలో పెరగక దిగుబడులు తగ్గుతున్నాయి.

ఇటీవలి కాలంలో ఎరువుల్ని పైరు ఎదుగుదల థలకు అనుగుణంగా ఎరువుల అవసరాన్ని బేరీజు వేస్తూ డ్రిప్‌ పద్ధతి నీటితో పాటుగా అందిస్తే ఎరువుల ఆదాతో పాటు పైరు దిగుబడులు గణనీయంగా పెరిగినట్లు పరిశోధనలలో తేలింది. దీని కోసం పంట మొక్కల వయసును బట్టి పోషకాల అవసరాన్ని లెక్కకట్టి, ఆయా పోషకాలకు కావలసిన ఎరువుల్ని నీటిలో కరిగించి, డ్రిప్‌ లైన్ల ద్వారా మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు ద్రావణాన్ని అందిస్తారు. ప్రత్తి, చెరకు, మొక్కజొన్న వంటి ఆరు తడి పంటలకు మరియు టమాట వంగ వంటి కూరగాయ పంటలకు, బొప్పాయి, జామ వంటి పండ్ల తోటలకు నేరుగా ఎరువు ద్రావణాన్ని డ్రిప్‌ లైన్ల ద్వారా ఇవ్వటానికి అవసరమైన ఎరువుల మోతాదును, వినియోగించవలసిన ఎరువులను సిఫార్సు చేస్తున్నారు. పైరుకు అవసరమయ్యే పోషకాలు పైరు వివిధ థల్లో ఎరువు ద్రావణం రూపంలో డ్రిప్‌ ద్వారా అందించడాన్ని ఫెర్టిగేషన్‌ అంటారు.

ఫెర్టిగేషన్‌ పద్ధతిలో ఎరువు ద్రావణాన్ని ఫెర్టిగేషన్‌ ట్యాంకు ద్వారా గాని, వెంచురీ లేదా ఫెర్టిగేషన్‌ పంపు ద్వారా అందించవచ్చు. ఈ ఫెర్టిగేషన్‌ పరికరం డ్రిప్‌ యంత్రం కంట్రోలు హెడ్‌ దగ్గర అమర్చబడి ఉంటుంది. ఫెర్టిగేషన్‌ పరికరం ద్వారా వచ్చే ఎరువు ద్రావణం మెయిన్‌ లైన్‌లోని నీటితో కలిసి ఫిల్టరు ద్వారా మరల మెయిన్‌ లైన్‌లోకి వెళ్లునట్లు చేస్తారు. ఈ విధంగా చేయడం వలన ఎరువు ద్రావణంలో ఉన్న మలినాలు ఫిల్టరు అవుతాయి. 

ఫెర్టిగేషన్‌ వల్ల కలిగే లాభాలు

*    పైరు ఎదుగుదలకు అనుగుణంగా పోషకాలు అందించటం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పంట మొక్కలకు వయసును బట్టి కావల్సిన మోతాదులో పోషకాలు అందుతాయి.

*    ఎరువులను నేరుగా మొక్క మొదళ్ల వద్ద అందించటం వల్ల వృథాను అరికట్టవచ్చు. ఎరువుల వినియోగం 25 శాతం తగ్గుతుంది.

*    పంట దిగుబడి దాదాపు 30 నుండి 40 శాతం పెరిగే అవకాశం ఉంది.

*    పంట ఉత్పత్తుల నాణ్యత మెరుగవుతుంది.

*    వాలు ఎక్కువ ఉన్న పొలాల్లో డ్రిప్‌ ద్వారా ఎరువు అందించే పద్ధతి అత్యంత అనుకూలమైనది. 

డ్రిప్‌ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎరువులు వాడకంలో మెలకువలు

*    రేగడి నేలలకు ఫెర్టిలైజరు ట్యాంకు పరికరాన్ని వాడాలి. తేలికపాటి భూముల్లో ఫెర్టిలైజరు ఇంజక్టరు పరికరాన్ని వాడాలి.

*    ప్రతిరోజు ఫెర్టిగేషన్‌ ద్వారా పోషకాలను అందించటం అత్యంత శ్రేయస్కరం. కనీసం వారానికి రెండుసార్లయినా పైర్లకు ఫెర్టిగేషన్‌ చెయ్యాలి.

*    పంట మొక్క వయసు బట్టి పోషకాల అవసరం దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి.

*    సాగు నీటి నాణ్యతను పరీక్షించుకోవాలి. సాగు నీటిలో అధిక కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్‌, ఇనుము, మాంగనీసు గనక ఉంటే అవి ఎరువు సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.

*    ఒకే ట్యాంకులో కలిపిన వివిధ ఎరువుల కంపేటబిలిటీ ఉండాలి.

*    పంటకు సిఫార్సు చేసిన మొత్తం పోషకాల మోతాదు, పూర్తి పంటకాలానికి సరిపోయేలా రోజు వారి మోతాదును లెక్కగట్టాలి. 

*    ద్రవ లేదా పొడి రూపంలో ఉండే ఎరువులను టాంకులో కలిపేటపుడు, టాంకు పరిమాణంలో 70 శాతం మించకుండా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. డ్రిప్‌ ద్వారా ఎరువులు అందించడం, డ్రిప్‌ సాగు నీరు పద్ధతిలో అంతర్భాగమై ఉండాలి.

*    ఫెర్టిగేషన్‌ ప్రక్రియ ప్రారంభించే ముందు కొద్దిసేపు డ్రిప్‌ ద్వారా నీటిని వదలాలి. దీని వల్ల పొలం అంతటా సమానమైన ఒత్తిడితో నీరు విడుదలవుతుంది. ఫెర్టిగేషన్‌ తరువాత, కొనసాగింపుగా నీటిని డ్రిప్పర్ల ద్వారా కొద్దిసేపు పంపించాలి. దీనివల్ల పైపులలో మరియు డ్రిప్పర్లలో ఉండే ఎరువు అవశేషాలు కడిగి వేయబడతాయి.

పి. గురుమూర్తి, ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌, సాయిల్‌ సైన్స్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ కెమిస్ట్రీ విభాగం, వ్యవసాయ కళాశాల, నైరా-532185 ఫోన్‌: 9491567949

Read More

మే నెలలో సేద్యపు పనులు

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, రబీ పంటలు మార్కెట్లకు బాగా వస్తున్నాయి. ప్రత్తి రేట్లు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి. మిరప రేట్లు బాగాన్నాయి. టమాట ధరలు బాగా పడిపోయాయి. మిగతా కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయి. వరి ప్రొక్యూర్మెంట్‌ మే నెలలో కూడా కొనసాగే పరిస్థితి. ఎండలు సాధారణంగా ఉండవచ్చనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో మే నెల (భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు)లో పలు పంటలలో చేయవలసిన వ్యవసాయ పనులను గురించి తెలుసుకుందాం. రాబోయే ఖరీఫ్‌ పంటకు ముందుగా చేయవలసిన పనులను కూడా తెలుసుకుందాం. చేతికొచ్చిన పంటను అమ్మేటపుడు గుర్తుంచుకోవలసిన మెళకువలు, సంఘాల సహకారం గురించి కూడా తెలుసుకుందాం.

వరి: మద్ధతు ధరకు మిల్లు యజమానులు తరుగు తీయకుండా వరిని కొంటామని ప్రకటించి దానికవసరమైన చర్యలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నది. మిగతా ప్రభుత్వాలు కూడా ఈ విధమైన పద్ధతులు పాటించి రైతులకు మేలు చేయవచ్చు. తద్వారా పలుకుబడి పెంచుకోవచ్చు. చలికాలపు వరి పంట మే నెలలో కూడా మార్కెట్‌కు ఎక్కువగా వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉన్నదని ధరలు 2024 వరకు అధికంగా ఉంటాయని మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ వారు తెలుపుతున్నారు. అందువలన నాణ్యమైన బియ్యానికి ధరలు బాగుంటాయని ఆశిద్దాం. వడ్లకు బదులు బియ్యాన్ని తయారు చేసి అమ్మడానికి రైతులు, రైతు సంఘాలు ప్రయత్నించండి. చిన్న చిన్న మొబైల్‌ రైస్‌ మిల్లులను రైతు ప్రజా సంఘాలు కొని, అద్దె ప్రాతిపదికన రైతులకిస్తే, రైతులు బియ్యాన్నమ్మే వారుగా ఎదుగుతారు. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుంది. వడ్లను, అనుకూలమైన చోట, పాతవయ్యేంత వరకు నిల్వ చేసి బియ్యం చేసి అమ్మితే ఇంకా ఎక్కువ లాభం వచ్చే వీలున్నది. పల్లెల నుండి పట్టణాలకు వలసపోయిన వారి ఇండ్లు ఖాళీగా ఉన్నవాటిని వడ్ల నిల్వకు  ఉపయోగించవచ్చు. నాణ్యమైన సన్నబియ్యానికి ధరలెక్కువగా వస్తున్నాయి. వచ్చే వర్షాకాలంలో కూడా ధరలెక్కువగా దొరికే సన్న బియ్యాలను సాగు చేయడానికి కావలసిన విత్తనాలను మే నెలలోనే తయారుగా పెట్టుకోండి. వర్షాకాలంలో నారుపోయుట రోహిణి కార్తెలో (25-5-23 నుండి 7-6-23 వరకు) మొదలు పెట్టుట ఆనవాయితి. నాటుకు నీరు పుష్కలంగా ఉన్న చోట రోహిణి కార్తెలో నారుపోసి తర్వాత నాటిన పంటలో చీడపీడల ఉధృతి చాలా తక్కువగా ఉండి దిగుబడి బాగా పెరుగుతుంది. కొత్త రకాలను కొద్ది భూమిలో పరీక్షించడానికి కొనవచ్చు. బాగా పండి, వాటికి ధరలు బాగుంటే తర్వాతి సీజన్లలో ఆ రకాల విస్తీర్ణాన్ని పెంచవచ్చు. విత్తనాలను ముందే తెచ్చి తయారుగా పెట్టుకోండి.

ప్రత్తి: రైతుల దగ్గర ప్రత్తి చాలామటుకు వ్యాపారస్తులకు అమ్ముడు పోగానే, ప్రత్తి ధరలు పెరుగుట క్రితం సంవత్సరం జరిగింది. ఇప్పుడు కొన్ని మార్కెట్లలో ప్రత్తి ధర క్వింటాలుకు 8000 దాటి పలుకుతున్నది. ఇది ఇంకా పెరగవచ్చని ఊహ. వర్షాలు తగినంత పడినా, లేక నీటి తడులివ్వడానికి అవకాశమున్నచోట మేనెల కడ వారంలో (రోహిణి కార్తెలో) ముంగారి ప్రత్తి విత్తడం అలవాటు. రోహిణిలో విత్తే పత్తిలో చీడపీడల బెడద ముఖ్యంగా గులాబి రంగు పురుగు ఉధృతి చాలా తక్కువ. ప్రత్తిని అధిక సాంద్రతలో (80þ20 సెం.మీ.) ఎకరాకు 25000 మొక్కలుండేటట్లు పెంచుకోవాలి. అధిక సాంద్రత విధానం, వర్షాధారంగానూ, నీటితడులిచ్చి కూడా పంటబెట్టవచ్చు. ఈ విధానంలో పంట త్వరగా పూర్తవుతుంది. తదుపరి పంటగా పెసర, మినుము, నువ్వులు, శనగ, వేరుశనగ సాగు చేయవచ్చు. నీటి ఆధారమున్న ప్రాంతాలలో ఎక్కువ దిగుబడులు సాధ్యపడతాయి. వర్షాలు పడకుండా బెట్టవచ్చినపుడు వీలున్నచోట నీటి తడి ఇచ్చి ప్రత్తి దిగుబడి బాగా పెంచవచ్చు. మీరు గమనించిన మంచి దిగుబడినిచ్చే రకాలనే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి నమ్మకంగా అధిక దిగుబడులు సాధించండి. కొత్త రకాలను కొద్ది విస్తీర్ణంలో సాగు చేసి, వాటి దిగుబడి, వాటికి వచ్చే ధర బాగుంటే ఎక్కువ విస్తీర్ణంలో వచ్చే సంవత్సరం ప్రయత్నించవచ్చు. ఇంటి దగ్గరే రైతులు సంఘాలుగా / గ్రూపులుగా ఏర్పడి బాగా బేరమాడి, మోసపోకుండా వ్యాపారులకమ్మితే మార్కెట్‌కు తీసుకెళ్లి అక్కడ పడే బాధల నుండి తప్పించుకోవచ్చు.

మొక్కజొన్న: చీడపీడల బాధ తక్కువగా ఉండి, అత్యధిక దిగగుబడులు సాధించడానికి మే చివరి వారం నుండి జూన్‌ మొదటి వారం వరకు విత్తాలి. ఈ సమయంలో భూమిలో తేమ విత్తనం మొలకెత్తడానికి సరిపడినంత ఉండాలి. బాగా వర్షం కురిసి గాని, నీటి తడి ఇచ్చిగాని విత్తాల్సుంటుంది. బెట్టలేకుండా నీటి తడులివ్వగలిగిన ప్రదేశాల్లోనే అత్యధిక దిగుబడులు సాధ్యమవుతాయి. ఎకరాకు 45-50 క్వింటాళ్ళ గింజ దిగుబడినివ్వగలిగిన ప్రైవేటు హైబ్రిడ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

అల్లం: ఈనెలలోపల విత్తవలసిన పంట. జూన్‌లో విత్తితే దుంపకుళ్ళు ఎక్కువై దిగుబడులు తగ్గుతాయి. అధిక దిగుబడి రకాలు: తెలంగాణకు: రియోడిజనీరో, మారన్‌; ఆంధ్రప్రదేశ్‌కు: రియోడిజనీరో, వైనాడ్‌లోకల్‌. అత్యధిక దిగుబడులకు ఎక్కువ ఎండ, ఎక్కువ వేడి, ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాలు అనుకూలం. పాక్షిక నీడ గల్గిన ప్రాంతాలయిన పందిరి కూరగాయతోటలు, మామిడి, కొబ్బరి, బొప్పాయి, జామ, నిమ్మ తోటలలో కూడా ఈ పంట పండుతుంది. ఎకరాకు 600-800 కిలోల దుంపలు విత్తనానికి సరిపోతాయి.

పసుపు: 6-7 నెలల్లో త్రవ్వడానికి వచ్చే స్వల్పకాలిక పసుపు రకాలను ఆంధ్రప్రదేశ్‌లో నాటడానికి మే చివరి వారం అనుకూలం. అదే తెలంగాణలో అయితే జూన్‌ మొదటి వారంలో నాటాలి. అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకాలు: ఐ.ఐ.ఎస్‌.ఆర్‌. ప్రతిభ: 185-190 రోజుల పంట; దిగుబడి: 15-16 ట/ఎ. రికవరి: 18.5 శాతం. ఐ.ఐ.ఎస్‌.ఆర్‌.ప్రభ: 195 రోజుల పంట, దిగుబడి: 15ట/ఎ. రికవరి: 19.5 శాతం.

నువ్వులు: తెలంగాణలో మే రెండవ వారంలోపు విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. తర్వాత ఆగస్టు రెండవ పక్షం అనుకూలం. రాయలసీమలో మే-జూన్‌ నెలల్లో విత్తడం అనుకూలం. కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో మే రెండవ పక్షంలో విత్తడం మేలు. అనుకూలమైన రకం- రెండు తెలుగు రాష్ట్రాలకు: జగిత్యాలతిల్‌-1 (జె.సి.ఎస్‌-1020): 90-125 రోజుల పంట. నువ్వుల దిగుబడి: 5-8 క్వి/ఎ. చలికాలం, వేసవి కాలాల్లో కూడా పంట పెట్టవచ్చు. ఈ నెలలో విత్తనోత్పత్తి చేపట్టి మంచి ఆదాయం పొందే అవకాశం. 

కొత్తిమీర: ఎండాకాలంలో ఎదుగుదల తక్కువ. మసాలాలలో బాగా వాడతారు. రోగనిరోధక శక్తిని పెంచే గుణముంది. ఎండాకాలంలో బాగా గిరాకీ ఉన్న పంట. ఎకరాకు ఆదాయం లక్షకు పైమాటే. పాక్షిక నీడ గలిగిన తోట పంటలు, పందిర్ల క్రింద, షేడ్‌ నెట్లు, నెట్‌హౌస్‌లు, పాలీహౌస్‌లలో ఈ పంట బాగా వస్తుంది. ఎత్తైన కొండ ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉన్న ప్రాంతాల్లో ఈ పంటను నీడలేకున్నా పండించవచ్చు. చవుడులేని పొలాల్లో పండించడానికి అనుకూలమైన కొత్తిమీర రకాలు: ద్వా, పంత్‌హరితిమా, కో-1, 2, 3. చౌడు భూముల్లో కూడా పెరిగే కొత్తిమీర రకం: కో-2. జూలై మొదటి పక్షం వరకు కొత్తిమీర ధరలు అధికంగా ఉండే అవకాశముంది.

పొదీన: ఎండాకాలంలో మంచి ఆదాయాన్నిచ్చే మరొక పంట పొదీనా. మసాలా వంటల్లో ఆకును వాడుతారు. తైలం తీసి కూడా మార్కెట్‌ చేయవచ్చు. అనుకూలమైన రకాలు హిమాలయ, శిలిక్‌, కోసి. దిగుబడి పొదీనా 15-20 ట/ఎ. నూనె తీస్తే 70-75 కిలోల నూనె/ఎ.

ఆకుకూరలు:  పాలకూర: వేసవిలో మంచి గిరాకీ ఉంటుంది. చౌడు భూముల్లో కూడా కొద్ది తక్కువ దిగుబడితో పండుతుంది. మంచి రకాలు: ఊటీ: 24ట/ఎ. జాబ్‌నగర్‌ గ్రీన్‌: 16-19 ట/ఎ.

తోటకూర, ఎర్ర తోటకూర, మెంతికూర, చుక్కకూర, గోంగూర, పొన్నగంటికూర, సోయకూర, కొయ్యగూర మొదలైన ఆకుకూరలు కొద్దిపాటి నీటితో, కొద్దిపాటి భూమిలోనయినా పండించవచ్చు. మంచి ఆరోగ్యానికి, ఆకుకూరల వినియోగం పెరుగుతున్నది.

పూలు – కనకాంబరం: నాటిన 3 సంవత్సరాల వరకు పూస్తుంది. తొలి రెండు సంవత్సరాలలో పూత ఎక్కువ. తర్వాత తగ్గుతుంది. మే-జూన్‌ నెలల్లో నారు పోసుకుని, ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో నాటాలి. పూల కాడల్లో, పూలు తెంపడం పూర్తయినాక, ఖాళీ కాడలను, ఎండిన కొమ్మలను తీసివేస్తూ, అవసరాన్ని బట్టి, నీరు పెట్టి, సేద్యం చేస్తే, సంవత్సరం పొడవునా కనకాంబరం పూలను పొందవచ్చు.

టమాట: నీరు పుష్కలంగా ఉండడం వలన, టమాట ఎక్కువ విస్తీర్ణంలో పండించడం వలన దిగుబడి ఎక్కువ. ధరలు తక్కువగా ఉన్నాయి. విస్తీర్ణాన్ని నియంత్రిస్తేనే ధరలు పెరుగుతాయి. అధిక వర్షాలు/తుఫాన్లు/వడగండ్ల వానలు వంటి విపరీత పరిస్థితులొస్తే దిగుబడి తగ్గుతుంది. రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. తొలకరిలో మేఘావృత వాతావరణముంటే దిగుబడి తగ్గి ధరలు పెరగవచ్చు.

వంగ: ప్రస్తుతం టమాట రేట్లు తక్కువగా ఉన్నందున ఇతర కూరగాయలను పండించడానికి మొగ్గు చూపుతున్నారు. వంగ ధరలు టమాటల కంటే ఎక్కువగా ఉన్నందున ఈ పంట ప్రాచుర్యం పెరిగింది.

కీరదోస: వీటి వినియోగం సాలాడ్‌ కొరకు విపరీతంగా పెరుగుతున్నది. ఎండాకాలం ఇంకా గిరాకీ ఎక్కువ ఉన్నందున ధరలు బాగుంటాయి. రైతులు పండించి మంచి ఆదాయం పొందవచ్చు.

ఫ్రెంచిబీన్స్‌: ఎండాకాలంలో పాక్షిక నీడ ఉన్న ప్రాంతాలలో లేక చల్లటి కొండ ప్రాంతాలలో పంట తీయవలసి వస్తుంది. వెజ్‌ బిరియానీలో వాడకం ఎక్కువ. అందువలన ఎండాకాలం మంచి రేటొస్తుంది.

సిరిధాన్యాలు: బెట్టను తట్టుకునే శక్తి గలిగిన కొర్రలు, అండుకొర్రలు, అరికలు, సామలు, ఊదలు, తొలకరికి ముందు వచ్చే మంచి వర్షాలకు విత్తుకోవచ్చు. వర్షాధార భూముల్లో ప్రయత్నించవచ్చు. రోహిణిలో వచ్చే వర్షాలను లాభదాయకంగా ఉపయోగపెట్టవచ్చు. బెట్ట సమయములో తడి ఇవ్వగల ప్రదేశాల్లో దిగుబడి మరియు ఆదాయం ఎక్కువగా ఉంటాయి.

రోహిణిలో నీరున్న చోట పంటలు: నీరు బాగా ఉన్న చోట బెండ, గోరుచిక్కుడు, కాకర, పొట్ల, బీర, గుమ్మడి, సొర, విత్తుకోవచ్చు. కూరగాయల నార్లు పోసుకోవచ్చు. కంది, పెసర, మినుము పంటలను విత్తుకోవచ్చు. దానిమ్మ, రేగు మొక్కలను నాటవచ్చు. పామారోజా, కామంచి వంటి సువాసన మొక్కల విత్తనాలు విత్తుకోవచ్చు.

మామిడి: తయారైన కాయలను తెంపి, చెట్ల క్రింద వరిగడ్డి/బోదగడ్డిలో కార్బైడు వేయకుండా మాగబెట్టి ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు. ప్రకృతి సిద్ధంగా మందులు వేయకుండా మాగబెట్టిన పండ్లు అని బోర్డు పెట్టుకోవాలి. రోడ్ల ప్రక్కన ఉన్న తోటల దగ్గర వ్యాపారం అనుకూలం.

పలు పంటల మీద, రైతు ప్రజా సంఘాల మీద, అధికారుల సేవలు ప్రజలకు ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా మార్చే విధానాల మీద సంప్రదించడానికి 9494408619కు ఫోను చేయవచ్చు.

ప్రకృతి విపత్తులు, రైతుల కష్టాలు మార్కెట్లలో సరుకు నష్టాలు- పరిష్కార మార్గాలు

ఏప్రిల్‌, మే నెలల్లో పడే అకాల వర్షాలు, వడగండ్ల వానలు పంటను మార్కెట్‌కు తెచ్చినాక కూడా రైతులను విపరీతంగా నష్టాల పాలు చేస్తున్నాయి. ఈ బాధల నుండి రైతులను కాపాడాలి. ప్రభుత్వ విధానాలలో మార్పులు తేవాల్సిన అవసరముంది. రైతులు పండించిన పంటలను ఇండ్ల దగ్గరికే వచ్చి కొనే వ్యవస్థలను బలోపేతం చేయాలి. వ్యాపారులు ఒక్కొక్క రైతును మోసగించకుండా కాపాడడానికి ప్రతి జనావాసం/కుగ్రామం/గ్రామం/ పెద్ద ఊర్లలో రైతు ప్రజా సంఘాలను ప్రోత్సహించడం ఆచరణ సాధ్యం. ప్రజలు పట్టణాలకు వలస వెల్లడం వలన ఊర్లలో చాలా ఇండ్లు ఖాళీగా ఉంటున్నాయి. వీటిని రైతులు, రైతు సంఘాలు తమ పంటల ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తే మంచి ధర వచ్చినపుడు అమ్ముకోడానికి వీలవుతుంది. ఈ పద్ధతులను ప్రోత్సహించడానికి విస్తరణ విభాగాలను సమాయత్తం చేయవచ్చు. మార్కెట్‌లో దొరికే రేటు, ఊర్లోనే, బాధలు లేకుండా రైతుకు దక్కించవచ్చు. దీనికి రైతు ప్రజా సంఘాలను మారుమూల పల్లెలతో సహా అన్ని జనావాసాలతో ఏర్పాటయ్యేటట్లు ప్రోత్సహించాలి. ఇప్పటికే ఉన్న వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఉపయోగించి వీటిని ఏర్పాటు చేయవచ్చు. బాధలు పడి, ఖర్చు భరించి పండిన పంటను మార్కెట్‌కు తీసుకొని పోయి, అక్కడే అమ్మాలనే పాలసీని మార్చాలి. రైతుల బాధలను తగ్గించాలి. ఇండ్ల దగ్గరే మంచి రేటుకు బాధలు లేకుండా అమ్ముకునేందుకు, ప్రభుత్వ యంత్రాంగం సహకరించే విధంగా విధాన మార్పులు తేవాలి.

ప్రజల/రైతుల కొరకు యంత్రాంగం: రైతుల/ప్రజల వద్దకు యంత్రాంగం అనే పద్ధతికి మారాలి. ఉత్పత్తిదారులకు/వ్యాపారులకు అనుసంధాన కర్తలుగా ఉత్పత్తిదారులకు సహాయపడేందుకు అధికారులను సమాయత్తం చేయాలి.

Read More

ఆరోగ్యకర భవిష్యత్తుకు సేంద్రియ సాగే సరైన దారి

రసాయనిక వ్యవసాయం వలన జరుగుతున్న అనర్థాల నుండి బయటపడటానికి అనేకమంది రైతులు సేంద్రియ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. వినియోగదారులు కూడా ఆరోగ్యంపై అవగాహన పెరిగిన తరువాత సేంద్రియ ఉత్పత్తులవైపు మక్కువ చూపుతున్నారు. ఏదిఏమైనా కాని అటు రైతులు ఇటు వినియోగదారులు సేంద్రియంవైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. సేంద్రియ సాగు వలన తాము ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకొని సొంతంగా వినియోగించడముతో పాటు సమాజానికి కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. వీటన్నింటికంటే అతిముఖ్యంగా రాబోవు తరాల వారికి కలుషితం కాని భూమిని అందించవచ్చు. ఈ ఆలోచనతో అనేకమంది రైతులు సేంద్రియ బాట పడుతున్నారు. ఈ విధంగా ఆలోచించి తన తరువాత తర్వాత తరానికి కాలుష్యం కాని నేలనీ, ఆహారాన్ని అందించాలనే తలంపుతో తన రసాయనిక సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చి వివిధ రకాల పంటలు పండిస్తున్నాడు వికారాబాద్‌ జిల్లా, బొంతారం మండలం, రొంపల్లె గ్రామానికి చెందిన రాజు.

రాజుది వ్యవసాయ నేపథ్యం. రాజు ప్రధాన వృత్తి వ్యవసాయం. 10వ తరగతి వరకు చదువుకొని వ్యవసాయంలోనే కొనసాగుతూ వస్తూ అందరి రైతుల లాగానే తన పంటల సాగులో రసాయనాలు వినియోగిస్తూ కొనసాగుతున్నారు. రసాయనిక సేద్యం వలన పెట్టుబడులు పెరగడముతో పంటల సాగు గిట్టుబాటు కాకపోయినా కూడా తన ప్రధాన వృత్తి వ్యవసాయమే కనుక ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తూ పంటల కొనసాగిస్తూ మిరప, కంది, పత్తి లాంటి పంటల సాగు కొనసాగిస్తున్నాడు. తాను చేస్తున్న వ్యవసాయంలో నష్టాలు రావటంతో పాటు విచక్షణా రహిత రసాయనాల వినియోగం వలన భూమి కలుషతం కావడం గమనించి ప్రత్యామ్నాయ పద్ధతుల అన్వేషణలో వేగం పెంచి సేంద్రియ సాగు గురించి తెలుసుకుని అందుకు సంబంధించిన వివరాలు సేకరించి సేంద్రియ సాగులో ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా కేవలం ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న వస్తువులను ఉపయోగించవలసి ఉంటుందని తెలుసుకుని అటువైపు అడుగులు వేసి తన రసాయనిక సేద్యాన్ని 2018వ సంవత్సరములో సేంద్రియంలోకి మార్చటం జరిగింది. 

సేంద్రియ సాగులో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకు సిద్ధమయ్యి వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేయడం మొదలు పెట్టాడు. సేంద్రియ సాగుకు అవసరమైన మన దేశీయ ఆవులను రెండింటిని పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటల సాగులో వినియోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తున్నాడు. తన ఈ 5 సంవత్సరాల సేంద్రియ సాగు అనుభవంలో అరటి, జామ, క్యారెట్‌, పెసర, మినుము, ఉల్లి, బొప్పాయి, కంది లాంటి పంటలు పండించాడు. ఈ సంవత్సరం కంది, ఉల్లి, బొప్పాయి పంటలు పండించాడు. కంది, ఉల్లి పంటలు దిగుబడి సాధించాడు. బొప్పాయి ఇంకా దిగుబడి వస్తూనే ఉంది.

కంది: అర ఎకరంలో కంది పంట పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేశాడు. ఇందుకు గాను నాటు రకం సొంత విత్తనాలను ఉపయోగించాడు. అర ఎకరానికిగాను బాగా మాగిన ఆవుల ఎరువు ఒక ట్రక్కు వేయడంతో పాటు పంటకాలంలో ప్రతి సారి 100 లీటర్ల చొప్పున 5 సార్లు అంటే 500 లీటర్ల జీవామృతాన్ని కంది పంటకు అందించాడు. చీడపీడల నివారణకు థపర్ణి కషాయం మరియు పంచగవ్యలను కలిపి పిచికారి చేయించాడు. అర ఎకరానికి గాను 450 కిలోల కందుల దిగుబడి పొంది కిలో 100/-ల చొప్పున నేరుగా వినియోగదారులకు అమ్మకం చేశాడు.

ఉల్లి: రెండున్నర ఎకరాలలో ఉల్లి సాగు చేస్తున్నాడు. రెండున్నర ఎకరాలలో ఒకేసారి కాకుండా రెండు దఫాలుగా నారు నాటించాడు. ఇందుకుగాను దుక్కిలో రెండున్నర ఎకరాలకు సుమారు మూడు ట్రక్కుల పశువుల ఎరువు తోలించాడు. నాటు రకం తెల్ల ఉల్లి రకం విత్తనాలను నారు పోసుకున్నాడు. రెండున్నర ఎకరాలకు సుమారు 5 కిలోల విత్తనం ఉపయోగించాడు. కిలో విత్తనం 650/-ల చొప్పున  5 కిలోలకు గాను 3250/-లు విత్తనం కొరకు ఖర్చు చేశాడు. జనవరి 15న నారు పోసుకుని 30 రోజులు పెరిగిన నారుని ప్రధాన పొలంలో నాటించాడు. ప్రధాన పొలంలో మడులు ఏర్పాటు చేసుకుని మడులలో నారు నాటించాడు. రెండున్నర ఎకరాలకు గాను ప్రతిసారి 500 లీటర్ల చొప్పున 3 సార్లు అంటే 1500 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా ఉల్లి పంటకు అందించాడు. చీడపీడల నివారణకు ఒకసారి థపర్ణి కషాయం మరియు పంచగవ్య మిశ్రమాన్ని పిచికారి చేయించాడు. మొదటి దఫా అంటే ఫిబ్రవరి రెండవ వారంలో నాటిన ఉల్లి ఏప్రియల్‌ 25 కి దిగుబడి పొందడం జరిగింది. ఎకరానికి 9000 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కిలో 20/-ల చొప్పున నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తున్నాడు. 

బొప్పాయి: 4 ఎకరాలలో బొప్పాయి సాగులో ఉంది. ఎకరానికి 800 మొక్కల చొప్పున కో-15 రకం మొక్కలను ఒక్కొక్కటి 20/-ల చొప్పున 4 ఎకరాలకు గాను 3200 మొక్కలు కొనుగోలు చేసుకుని 2022  జనవరిలో నాటించాడు. 4 ఎకరాలకు గాను దుక్కిలో మూడు ట్రక్కుల కోడి ఎరువు అందించాడు. ప్రతి 20 రోజులకు ఎకరానికి 200 లీటర్ల చొప్పున జీవామృతాన్ని భూమికి అందించడంతో పాటు చీడపీడల నివారణకు పంచగవ్య, థపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగలను ఇప్పటి వరకు 5 సార్లు పంటపై పిచికారి చేయించారు. 2022 జులై ఆఖరి వారంలో దిగుబడి మొదలయ్యింది. ఇప్పటి వరకు సుమారుగా ఎకరానికి 18 టన్నుల చొప్పున దిగుబడి పొంది టన్ను 11 వేల నుంచి 15 వేల రూపాయల వరకు అమ్మకం చేస్తూ వస్తున్నాడు. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన కొనుగోలు దారులకు కిలో 11/- నుంచి 15/-లకు అమ్మకం చేస్తున్నాడు. కొద్ది మొత్తంలో కొనుగోలు చేసే వినియోగదారులకు మరియు సేంద్రియ దుకాణాలకు కిలో 24/-ల చొప్పున అమ్మకం చేస్తున్నాడు. వచ్చిన దిగుబడిలో సుమారుగా 20 శాతం వరకు 24/-ల చొప్పున అమ్మకం చేస్తూ వస్తున్నాడు. ఈ రకం బొప్పాయి వైరస్‌ రెసిస్టెంట్‌ అవడం వలన ఈ రకాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటి వరకు వైరస్‌ మొక్కలు అసలు కనిపించలేదు. ఇంకా దిగుబడి వస్తూనే ఉంది. పంటను గమనించినట్లయితే ఎకరానికి ఇంకా 12 టన్నులకు తగ్గకుండా వచ్చేలా ఉంది. అంటే సుమారుగా ఎకరానికి 30 టన్నుల దిగగుబడి సాధించవచ్చు.

రసాయనిక వ్యవసాయం వలన జరిగే నష్టాల నుంచి బయట పడటానికి శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న సేంద్రియ పద్ధతుల బాట పట్టి తాను ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ సమాజానికి విష రసాయనాలు లేని ఆహారాన్ని రాజు అందిస్తున్నాడు. మరిన్ని వివరాలు 8309861250 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

  – డి. ప్రసాద్‌, ‘రైతునేస్తం’ ప్రత్యేక ప్రతినిధి

Read More

ఉత్పత్తిని మించిన వినియోగంతో నిలకడగా మొక్కజొన్న ధరలు

ఆహార ధాన్యాలన్నింటిలోనూ ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తవుతున్న పంట మొక్కజొన్న. మధ్య అమెరికా, మెక్సికో ప్రాంతాల్లో మొక్కజొన్నను తొలిగా పండించినట్లు చారిత్రక ఆధారాలు దొరికాయి. మొట్టమొదట్లో ఈ పంటను రైతులు సాగు చేసినప్పుడు ఒక మొక్కజొన్న కండెకు ఎనిమిది గింజలే ఉన్నట్లు నమోదైంది. ఇప్పుడు కొన్ని సంకర రకాల్లో కండెకు 800కి పైగా గింజలుంటున్నాయి. అంతేకాక మొక్కల సాంద్రత పెరగటం వల్ల దిగుబడులు వంద రెట్లకు పైగా పెరిగాయి. పంటలన్నింటిలోనూ సంకర రకాలు తొలిగా అభివృద్ధి చేసింది మొక్కజొన్నలోనే. 2021 -22లో ప్రపంచంలో 1216.87 మిలియన్‌ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తయినట్లు అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2022-23లో మొక్కజొన్న ఉత్పత్తి 4.52 శాతం తగ్గి, 1161.86 మిలియన్‌ టన్నులుగా ఉండవచ్చని అభిప్రాయపడ్డది. మొక్కజొన్న ఉత్పత్తిలో అమెరికాదే అగ్రస్థానం. చైనా, బ్రెజిల్‌, ఆర్జెంటీనా, యూరోపియన్‌ యూనియన్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వాటి తర్వాత భారతదేశం ఆరవ స్థానంలో ఉన్నది. గత సంవత్సరం (2021-22)లో భారతదేశంలో 33.73 మిలియన్‌ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తయినట్లు అంచనాలున్నాయి. గత సంవత్సరం రబీలో దేశంలో 20.22 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగవ్వగా 2022-23లో 22.98 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగవుతున్నట్లు ప్రాధమిక అంచనాలు తెలుపుతున్నాయి. భారత ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం దేశంలో 34.61 మిలియన్‌ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి కావచ్చు. గత సంవత్సరం కన్నా 0.88 మిలియన్‌ టన్నుల మొక్కజొన్న అదనంగా పండవచ్చని భావిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గోధుమ ఉత్పత్తి 4.4 మిలియన్‌ టన్నులు పెరగ వచ్చని ప్రభుత్వం అంచనాలు తెలుపుతున్నాయి. చలికాలంలో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉండటం వల్ల ఆలస్యంగా పక్వానికి వచ్చి, దిగుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. వరి ఉత్పత్తిలో 0.3 మిలియన్‌ టన్నులు, మొక్కజొన్నలో 0.9 మిలియన్‌ టన్నులు, ఇతర ముతక ధాన్యాల్లో 0.7 మిలియన్‌ టన్నులు, అపరాల్లో 0.5 మిలియన్‌ టన్నులు అదనంగా ఉత్పత్తవుతాయని ప్రభుత్వం అంచనాలు తేటతెల్లం చేస్తున్నాయి. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 323.55 మిలియన్‌ టన్నులుండవచ్చనే ఆశాభావంతో ప్రభుత్వం ఉన్నది. గత సంవత్సరం కన్నా 7.94 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు అధికంగా ఉత్పత్తవవచ్చనే అంచనా ఆశాజనకంగా ఉంది. ప్రపంచ జనాభాలో ప్రథమ స్థానం సంపాదించిన భారత్‌లో ఆహార కొరత ఉండకపోవచ్చని భావించవచ్చు. కానీ ఇప్పటికీ తలసరి ధాన్య లభ్యత భారత్‌లో తక్కువగానే ఉంది. ఆహార భద్రత విషయంలో దేశం ఇప్పటికీ కడగొట్టు దేశాల జాబితాలోనే ఉన్నది.

బహుళ వినియోగాలు

గత 60 సంవత్సరాల్లో ప్రపంచంలో మొక్కజొన్న సాగు రెట్టింపయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా మొక్కజొన్న సాగు 105 మిలియన్‌ హెక్టార్ల నుండి 198 మిలియన్‌ హెక్టార్లకు పెరిగింది. ఇదే కాలంలో ఉత్పత్తి సుమారు ఆరు రెట్లు పెరిగింది. 1960లో 200 మిలియన్‌ టన్నులుగా ఉన్న ఉత్పత్తి ఇప్పుడు 1200 మిలియన్‌ టన్నులకు చేరింది. ఉత్పాదకత 1960లో హెక్టారుకు 2 టన్నుల దిగుబడి ఉండగా 2020 నాటికి దాదాపు 6 టన్నులకు పెరిగింది. విస్తీర్ణం రెట్టింపవ్వగా, దిగుబడి మూడు రెట్లు పెరగటం వల్ల, ఉత్పత్తి ఆరు రెట్లు పెరగటం సాధ్యపడింది. భారత దేశంలో 1950-51 సంవత్సరంలో 1.73 మిలియన్‌ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తయింది. అప్పుడు మొక్కజొన్న సాగు కింద 3.16 మిలియన్‌ హెక్టార్లు మాత్రమే. 2020-21లో మొక్కజొన్న సాగు 9.9 మిలియన్‌ హెక్టార్లుగా నమోదైంది. ఖరీఫ్‌లో 7.7 మిలియన్ల హెక్టార్లలోనూ, రబీలో 2.2 మిలియన్‌ హెక్టార్లలోనూ ఈ పంట సాగవుతున్నది. గత 70 సంవత్సరాల్లో మొక్కజొన్న ఉత్పత్తి దేశంలో 20 రెట్లు పెరిగింది. విస్తీర్ణం 3.13 రెట్లు పెరగ్గా, దిగుబడి 6.4 రెట్లు పెరగటం వల్ల మొక్కజొన్న ఉత్పత్తిలో విప్లవాత్మక పెరుగుదల సాధ్యమైంది. సగటు దిగుబడి హెక్టారుకి 3.5 టన్నులకు చేరింది. ఖరీఫ్‌లో 22 మిలియన్‌ టన్నులు, రబీలో 12.6 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరుగుతున్నది. సగటు దిగుబడి ఖరీఫ్‌లో 2.87 టన్నులు మాత్రమే ఉండగా, రబీలో రెట్టింపు దిగుబడి (5.7 టన్నులు) లభిస్తున్నది. దేశంలో రబీ దిగుబడి ప్రపంచ సగటు దిగుబడికి సమీపంగా ఉన్నది. ఖరీఫ్‌ పంటలో దాదాపు 15 శాతానికి మాత్రమే సాగు నీటి వసతి ఉంది. రబీలో దాదాపు మొత్తం విస్తీర్ణానికి నీటి సదుపాయం లభిస్తున్నది. దిగుబడిలో తేడాకి ఇదే ముఖ్య కారణం కావచ్చు. మొక్కజొన్న నుండి 200కి పైగా ఉప ఉత్పత్తులు తయారు చేయవచ్చు. 40 ఉత్పత్తులైతే బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అమెరికాలో ఉత్పత్తవుతున్న మొక్కజొన్నలో 45 శాతం ఇథనాల్‌ తయారీకి వాడుతున్నారు. యూరోప్‌లో పారిశ్రామిక వినియోగం ఎక్కువ. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఎక్కువగా ఆహారానికే దీనిని వినియోగిస్తున్నారు. చైనాలో మొక్కజొన్న ఉత్పత్తిలో 60 శాతం పశువుల దాణాకు వాడుతుండగా, భారత్‌లో ఉత్పత్తవుతున్న మొక్కజొన్నల్లో సగభాగం కోళ్ళమేతకు వాడుతున్నారు. మొక్కజొన్నను ఎగుమతి చేసే దేశాల్లో అమెరికా, యుక్రెయిన్‌, ఆర్జెంటీనా, బ్రెజిల్‌, రష్యాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. యుక్రెయిన్‌, రష్యాలు ఒక సంవత్సరానికి పైగా యుద్ధంలో నిమగ్నమై ఉండటంతో, వాటి ఎగుమతులు దెబ్బతిన్నాయి. ప్రపచ మార్కెట్లో సరఫరా తగ్గటంతో ధరలు పెరిగాయి. ఈ సంవత్సరం ప్రపంచ మొక్కజొన్న ఉత్పత్తి కొంత తగ్గవచ్చనే అనుమానంతో ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. గత సంవత్సరం భారతదేశం కూడా 1.7 మిలియన్‌ టన్నుల మొక్కజొన్నను ఎగుమతి చేసింది. అది ఈ సంవత్సరం మరికొంత పెరిగే అవకాశం కనిపిస్తున్నది.

తెలుగు రాష్ట్రాల్లో సాగు, దిగుబడులు:

దేశంలో అత్యధికంగా మొక్కజొన్న సాగు అయ్యే రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌, కర్నాటకలు. ఈ రెండు రాష్ట్రాలు దేశంలో మొక్కజొన్న సాగయ్యే విస్తీర్ణంలో చెరి 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. మహారాష్ట్రకు 10 శాతం, రాజస్థాన్‌కు 9 శాతం, ఉత్తరప్రదేశ్‌కు 8 శాతం వాటాలతో ముఖ్య రాష్ట్రాలుగా ఉన్నాయి. అయితే ఉత్పత్తిలో కర్నాటక, మధ్యప్రదేశ్‌ల తర్వాత బీహార్‌ మూడవ స్థానంలో ఉన్నది. ఉత్పాదకతలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. బీహార్‌లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ రబీ మొక్కజొన్న వాటా ఎక్కువగా ఉంది. తెలంగాణాలో మొక్కజొన్న సాగు 6.63 లక్షల హెక్టార్లలో జరుగుతున్నది. 2540 కిలోల హెక్టారు సగటు దిగుబడితో 16 లక్షల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న సాగు 3.01 లక్షల హెక్టార్లకే పరిమితం. తెలంగాణాలో సాగవుతున్న మొక్కజొన్న విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌లో సాగు విస్తీర్ణం సగం కన్నా తక్కువగా ఉంది. అయితే సగటు దిగుబడి 7055 కిలోలుగా ఉండటంతో దిగుబడి 21.21 లక్షల టన్నులుగా ఉంది. రబీలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న గుంటూరు జిల్లాలో హెక్టారుకి 10,455 కిలోలు, పశ్చిమ గోదావరిలో హెక్టారుకి 9,108 కిలోల దిగుబడి నమోదవుతున్నది. కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఖరీఫ్‌ విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల సగటు దిగుబడులు తక్కువగా ఉన్నాయి. తెలంగాణాలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో సాంప్రదాయకంగా మొక్కజొన్నని పండిస్తారు. దక్షిణ తెలంగాణా జిల్లాలైన అవిభక్త రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో గతంలో జొన్న, సజ్జ, రాగి వంటి పంటలు సాగయ్యేవి. కానీ క్రమేపీ మొక్కజొన్న వాటి స్థానంలో ఈ జిల్లాలకు కూడా పాకింది. ఇక రబీలో అయితే నీటి వసతి ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. వరంగల్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాల్లో రబీ మొక్కజొన్న సాగువుతున్నది. ఈ జిల్లాల్లో ఎక్కువగా సాగయినా, దాదాపు అన్ని జిల్లాల్లోనూ రబీ మొక్కజొన్న వ్యాపించింది.

ఉత్పత్తి వ్యయం – ఆదాయం:

ఖరీఫ్‌ మొక్కజొన్న సాగుకి హెక్టారుకి రూ. 40 నుండి 50 వేల వరకు ఖర్చవుతున్నది. రబీ మొక్కజొన్న సాగుకి రూ. 60 నుండి 80 వేల వరకు ఖర్చవుతున్నది. ఖరీఫ్‌లో సగటున 25 క్వింటాళ్ళు, రబీలో సగటున 35 నుండి 50 క్వింటాళ్ళ వరకు దిగుబడులు లభిస్తున్నాయి. ఒక క్వింటాలు ఉత్పత్తి వ్యయం ఖరీఫ్‌లో రూ. 1500 నుండి 1800, రబీలో రూ. 1600 నుండి 2000 వరకు వస్తున్నది. ఈ సంవత్సరం మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాలుకి రూ. 1962గా ప్రకటించారు. మార్కెట్‌ ధరలు కనిష్టంగా రూ. 1500, గరిష్టంగా రూ. 2700 నాణ్యతను బట్టి లభిస్తున్నాయి. సగటు ధర రూ. 2000గా చాలా మార్కెట్లలో నమోదవుతున్నది. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌లో వాతావరణ ప్రతికూలతలనెదుర్కొంటున్న రైతులు 20 శాతం వరకు నష్టపోతున్నారు. రబీలో దిగుబడి నిలకడగా ఉంటున్నది కాబట్టి 90 శాతం రైతులు లాభిస్తున్నారు. అయితే లాభశాతం మాత్రం 10 నుండి 20 శాతం కన్నా మించటం లేదు. జొన్న, సజ్జ, రాగి, కొర్ర, సామ వంటి చిరుధాన్యాలకు సాపేక్షికంగా ఎక్కువ ధర లభిస్తున్నది. వాటికి ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా మొక్కజొన్నతో పోలిస్తే ఎక్కువే. అయినా రైతులు వాటి సాగువైపు మళ్ళకపోవటానికి కారణం మార్కెటింగ్‌లో ఎదుర్కుంటున్న సమస్యలే. వాటికి కనీస మద్దతు ధర ఎక్కువగా ఉన్నా ప్రభుత్వాలు సేకరణ మద్దతు నందిస్తాయనే నమ్మకం రైతుల్లో లేదు. ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా బడ్జెట్‌లో ‘సిరిధాన్యాల’కు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రకటించారు. మార్కెట్‌ ధరలు కూడా ఆకర్షణీయంగానే ఉన్నా వాటిని పెద్ద ఎత్తున సాగు చేయటానికి రైతులు ధైర్యం చేయటం లేదు. జొన్న, సజ్జ, రాగి పంటలకు కనీస మద్దతు ధరలు మొక్కజొన్న కన్నా ఎక్కువగానే ఉన్నాయి. వాటితో పాటు కొర్ర, సామ, ఊద, అండుకొర్ర, వరిగ, ఆరిక వంటి సిరిధాన్యాలకు కూడా కనీస మద్దతు ధరల్ని ప్రకటించి, అవసరమైతే వాటిని కొనుగోలు చేస్తామనే హామీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. వాటి ఉత్పత్తి పెరిగితే ధరలు నిలుస్తాయనే నమ్మకం లేక రైతులు వాటి సాగుని చేపట్టటం లేదు. ఎందుకంటే మద్దత ధర ప్రకటించిన పంటల విషయంలో కూడా ధరలు తగ్గినప్పుడు కేంద్రం సేకరణ మద్దతు నందించటం లేదు. అలాంటప్పుడు కొత్త పంటలకు, జొన్న, సజ్జ, రాగి వంటి పంటలకు సేకరణ మద్దతు నందిస్తారనే నమ్మకం లేదు. అందుకే వర్షపాతం తగ్గినప్పుడు మొక్కజొన్న కన్నా వర్షాభావాన్ని తట్టుకోగలిగిన జొన్న, సజ్జ, రాగి, వరిగ, కొర్ర, అండుకొర్ర, సామ, ఊద, అరిక వంటి పంటలు రైతుల అభిమానానికి నోచుకోవటం లేదు. మార్కెట్‌లో గిరాకీ ఉన్న మొక్కజొన్న సాగునే ఇష్టపడుతున్నారు.

కోళ్ళ పరిశ్రమతో లింకు:

మొక్కజొన్నలను ఎక్కువగా కోళ్ళ పరిశ్రమలో దాణాగా వాడుతున్నారు. కోళ్ళ దాణాకు మొక్కజొన్నలు, సోయా చెక్క ముఖ్యమైన ముడి పదార్థాలు. మొక్కజొన్న ధరలు కనీస మద్ధతు ధర కన్నా తక్కువకు పడిపోయినప్పుడు కోళ్ళ పరిశ్రమ రైతులు లాభిస్తారు. కాని సోయాచెక్క ధరలు పెరిగినప్పుడు వారు దాణాకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకనుగుణంగా గ్రుడ్లు, మాంసం ధరలు పెరగకుంటే వారు నష్టాల పాలవుతారు. ప్రస్తుతం వేసవి ప్రభావం వల్ల గ్రుడ్లకు గిరాకీ తగ్గి ధరలు తగ్గాయి. ఒక్కో కోడి గ్రుడ్డు ఉత్పత్తిలో ఒక రూపాయి నష్టపోతున్నామని కోళ్ళ రైతులు వాపోతున్నారు. ఇలా మొక్కజొన్న ధర-కోడిగ్రుడ్ల ధర మధ్య వైరుధ్యం నెలకొని ఉన్నది. కోళ్ళ మేతతో పాటు మొక్కజొన్నను పశువుల దాణాకు కూడా వాడుతున్నారు. అంతేకాక ‘స్టార్చ్‌’ తయారీకి కూడా మొక్కజొన్నను వాడుతున్నారు. స్టార్చ్‌ని మందుల పరిశ్రమలోనూ, కాగితం తయారీలోనూ, జౌళి పరిశ్రమలోనూ విరివిగా వాడతారు. ప్రపంచంలో తలసరి స్టార్చ్‌ వినియోగం 6 కిలోలుంటే భారత్‌లో అది 1.5 కిలోలు మాత్రంగా ఉంది. అయితే మొక్కజొన్న ఆధారిత స్టార్చ్‌ యూనిట్లు కూడా బియ్యం నూకలు, దారి మళ్ళుతున్న రేషన్‌ బియ్యం చౌకగా దొరుకుతుండటంతో వాటిని వాడుతున్నారు. ఇవికాక మొక్కజొన్న పిండిని అనేక వంటకాల్లో, స్నాక్స్‌ తయారీకి కూడా వాడుతున్నారు. కార్న్‌ఫ్లేక్స్‌ను పాలతో కలిపి ఫలహారంగా వాడుతున్నారు. ఇంకా ఎన్నో ఉపఉత్పాదనలను తయారు చేసే అవకాశాలను ఆహార శుద్ధి పరిశ్రమ పరిశీలిస్తున్నది. సాపేక్షికంగా తక్కువ చీడపీడలతో, అధిక దిగగుబడినిచ్చే సత్తా కలిగిన మొక్కజొన్న సాగుపై రైతుల ఆసక్తి పెరుగుతూనే ఉంది. వివిధ అవసరాలకు 40 మిలియన్‌ టన్నుల మొక్కజొన్న అవసరమని, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 36 మిలియన్‌ టన్నులుగా ఉన్న ప్రస్తుత ఉత్పత్తి మరింత పెరిగి రైతులకు, దేశానికి మేలు కలిగే అవకాశం ఉంది.    

డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, 

(రిటైర్డ్‌ & కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More

వ్యవసాయంలో సరైన ప్రణాళిక తప్పనిసరి

మనది వ్యవసాయాధారిత దేశం అయినప్పటికినీ, మన నేలలు, మన భౌగోళిక పరిస్థితులు, మన మానవ వనరులు.. అన్నీ కూడా వివిధ రకాల పంటల సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికినీ, ఎక్కువ మంది రైతులు ఎక్కువ సార్లు తమ పంటల సాగులో లాభాలు ఆర్జించలేకపోతున్నారు. ఎక్కువ శాతం మంది రైతులు పంటలసాగులో నష్టాలను భరించవలసి వస్తుంది. వ్యవసాయం లాభసాటిగా లేకపోవటానికి ఉన్న కారణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. వాతావరణం, ప్రకృతి వైపరీత్యాల లాంటి కారణాలు ఒక రకం కారణంగా చెప్పవచ్చు. ఈ రకం కారణాలు మన చేతులలో ఉండవు కాబట్టి ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు లభించకపోవచ్చు. రెండో రకం కారణాలుగా మన చేతులలో ఉండే విత్తన ఎంపిక, ఏక పంట విధానం, సరైన అవగాహన, పెట్టుడులు లేకపోవడము, అవసరమయిన సమయానికి చర్యలు చేపట్టలేకపోవడము, సరైన ప్రణాళిక వేసుకోలేకపోవడం… లాంటి కారణాల వలన కూడా రైతులు నష్టాలు భరించవలసి వస్తుంది. ఈ రెండో రకం సమస్యలు రైతుల చేతులలో ఉంటాయి కాబట్టి వాటికి రైతులు సరైన పరిష్కార మార్గాలు అన్వేషించి అమలు పరచగలిగితే పంటల సాగు లాభసాటిగా మలుచుకోవచ్చు అనే విషయం అనేకమంది రైతుల అనుభవాలు చెబుతున్నాయి. ఈ తరహాలో ఆలోచించి పక్కా ప్రణాళికతో తమ వ్యవసాయాన్ని లాభాల బాటలో నడిపిస్తున్నారు విశాఖపట్టణం జిల్లా, బక్కనిపాలెంలో రెండు ఎకరాల కంటే తక్కువ పొలంలో పక్కా ప్రణాళికతో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్న రైతు దపంతులు పార్వతి, మాధవ్‌.

మాధవ్‌ సివిల్‌ ఇంజనీరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి రిటైర్‌ అయ్యారు. రిటైర్‌ అయిన తరువాత వీరు వేరే రంగాల వైపు ఆలోచించకుండా వ్యవసాయరంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మనం తినే ఆహారంలో ఉండే విష రసాయన అవశేషాల వలన మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మన ఆరోగ్యం కాపాడుకుంటూ తోటి వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలంటే వ్యవసాయం చేయాలని, అదీను సేంద్రియ సాగు చేయాలనే తలంపుతో విశాఖపట్టణం జిల్లా మధురవాడ సమీపములోని బక్కనిపాలెం గ్రామంలో సుమారు రెండు ఎకరాల పొలం తీసుకుని ఆ పొలంలో పూర్తి సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల కూరగాయలు, కొన్ని రకాల పండ్ల సాగు మొదలు పెట్టారు.

ప్రస్తుతం వ్యవసాయం చేసే రైతులు చాలావరకు లాభాలు ఆర్జించలేకపోతున్నారు కాబట్టి అందుకు కారణాలు తెలుసుకుని అవే సమస్యలు తలెత్తకుండా వీరు జాగ్రత్తపడుతూ పక్కా ప్రణాళికతో పంటల సాగు కొనసాగిస్తున్నారు. సాధారణంగా పంటల సాగులో వచ్చే ప్రధాన సమస్యలు అయిన ఎక్కువ పెట్టుబడులకు పరిష్కారంగా సేంద్రియ బాటపట్టి తామే సొంతంగా సేంద్రియ సాగులో అవసరమయ్యే వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు, సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటూ పెట్టుబడి తగ్గించుకుంటున్నారు. కలుపు సమస్య పరిష్కారానికి పొలం మొత్తం బెడ్‌లు వేసి బెడ్‌లపై మల్చింగ్‌ షీటు పరచి విత్తనాలు లేదా మొక్కలు నాటుతున్నారు. తీగజాతి కూరగాయలకు కూడా తక్కువ ఖర్చుటో ఇంటూ (þ) పందిరి వేసుకున్నారు. సంవత్సరం పొడవునా పలు రకాల పంటల సాగుకు వీలుగా పంటలు సాగు చేస్తున్నారు. ఆశాజనకమైన ధరలు పొందాలంటే సొంత మార్కెటింగ్‌ సరైన పరిష్కారం అని గ్రహించి తాము పండించే పంటలను సాధ్యమయినంత వరకు నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. ఈ విధంగా అన్ని విషయాలను పరిశీలిస్తూ పక్కా ప్రణాళికతో పంటలు సాగు చేస్తూ తమ వ్యవసాయాన్ని లాభాల బాటలో నడిపిస్తున్నారు. 

గడచిన రబీ సీజనులో సుమారు ఎకరం పొలంలో బీర పంట సాగు చేశారు. ఇందుకుగాను ఐఐహెచ్‌&ఆర్‌ బెంగుళూరు నుంచి అర్క ప్రసన్న విత్తనాలను ఎంపిక చేసుకున్నారు. ఈ విత్తనాలు సూటి రకం విత్తనాలు కాబట్టి ప్రతిసారి విత్తనాలను కొనుగోలు చేయకుండా రైతులు తమ పంట నుండి విత్తనాలను సేకరించుకొని మరలా నాటుకోవచ్చు కాబట్టి ఈ విత్తనాలను ఎంపిక చేసుకున్నారు. ఎకరానికి గాను సుమారు 750 గ్రాముల విత్తనం అవసరం పడింది. బీర పంట అయిన తరువాత ఈ పొలంలో వంగ, పుచ్చ లాంటి పంటలు వేయాలనే లక్ష్యంతో ఉన్నారు కాబట్టి రెండు బెడ్‌ల మధ్య దూరం అందుకు అనుకూలంగా పెట్టుకుని బెడ్‌లపై మల్చింగ్‌ షీటు పరచి, మల్చింగ్‌ షీట్‌కి రెండు వసరులలో రంధ్రాలు చేసుకుని రంధ్రాలలో బీర విత్తనాలను నాటించారు. బీర నాటిన 15 రోజులకు బీర తీగ మొదలయ్యింది. తీగ పాకటానికి అనుకూలంగా తక్కువ ఖర్చులో ఇంటూ (þ) పందిరి ఏర్పాటు చేసుకున్నారు. బీరలో వచ్చే చీడపీడల నివారణకు పసుపుపచ్చ జిగురు అట్టలు, సోలార్‌ దీపపు ఎర, పండుఈగ ఎరల లాంటివి ఏర్పాటు చేసుకోవడంతో పాటు అవసరాన్ని బట్టి వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు పిచికారి చేశారు. దుక్కిలో పశువుల ఎరువు, ఘనజీవామృతం, మేకల ఎరువు అందించడంతో బాటు క్రమం తప్పకుండా జీవామృతం, బియ్యం కడిగిన నీటిని నేలకు అందిస్తూ రావడం వలన ఎలాంటి చీడపీడలు ఆశించని నాణ్యమైన దిగుబడి పొందారు. ఎకరం పొలం నుంచి సుమారు 6000 కిలోల బీర దిగుబడి పొంది సగటున కిలో 25/-ల చొప్పున అమ్మకం చేశారు. బీర పంట కాపు మొదలయ్యే సమయానికి బెడ్‌ల మధ్యలో వంగ మరియు పుచ్చ విత్తనాలు నాటారు. వంగ పంట ఇప్పుడే దిగుబడి మొదలయ్యింది. రోజుకు 50 కిలోల వరకు వంగ దిగుబడి పొందుతున్నారు. పుచ్చ పంట దిగుబడి ఇంకా రావాల్సి ఉంది.

వీటితో పాటు కొన్ని రకాల ఆకుకూరలు, అరటి, మునగ, సపోట, నిమ్మ, బత్తాయి, బొప్పాయి, పసుపు, అల్లం, తినే ఉసిరి, నారింజ, చిక్కుడు, బెండ లాంటి మొక్కలను / పంటలను సాగు చేస్తూ పొలం చుట్టూ వెదురు నాటించారు. తాము సాగు చేసే పంటలన్నింటికి దుక్కిలో ఘనజీవామృతం, పశువుల ఎరువు, మేకల ఎరువు అందించడంతోపాటు క్రమం తప్పకుండా జీవామృతం, బియ్యం కడిగిన నీరు, కిచెన్‌ వేస్ట్‌ ద్రావణం, వేరుశనగ చెక్క, వేపచెక్కల ద్రావణం లాంటివి భూమికి అందించడంతో పాటు పంచగవ్య మరియు వివిధ రకాల కషాయాలను పంటపై పిచికారి చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతున్నారు. మరిన్ని వివరాలు 8978198938 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

వేరుశనగ, వేపచెక్కల ద్రావణం:  100 లీటర్ల నీటిలో 5 కిలోల వేరుశనగ చెక్క మరియు ఒక కిలో వేప చెక్క లేదా వేపపిండిని వేసి ప్రతిరోజు రెండు సార్ల చొప్పున కలుపుతూ ఉంటే 5 నుంచి 7 రోజులలో ద్రావణం తయారవుతుంది. ఈ విధంగా తయారైన ద్రావణాన్ని 15 రోజులకు ఒకసారి బీర పంటకు డ్రిప్పు ద్వారా భూమికి అందించారు.

బియ్యం కడిగిన నీరు: 10 కిలోల బియ్యాన్ని 200 లీటర్ల డ్రమ్ములో వేసి రెండు రోజులు కలిపిన తరువాత మూడవ రోజున ఈ ద్రావణాన్ని డ్రిప్పు ద్వారా పంపించి మరలా ఆ డ్రమ్ములో నీటిని నింపుతారు. ఈ విధంగా ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి బియ్యం కడిగిన నీటిని పంపుతుంటారు. నెలకు ఒకసారి ఆ డ్రమ్ములో 10 కిలోల బియ్యం వేస్తుంటారు. ఈ నీటిలో కొన్నిసార్లు కిచెన్‌ వేస్ట్‌ ద్రావణాన్ని కూడా కలుపుతుంటారు.

Read More

ఎకరానికి ఒక పశువు సేంద్రియ సాగుకి ఆదరువు

మనది వ్యవసాయక దేశం. మన తాతలు చేసింది నిజమయిన వ్యవసాయం. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి వ్యవసాయంలో సరైన దారి చూపింది మన పూర్వీకులే అని చెప్పవచ్చు. ప్రపంచంలోని ఏదేశములో పాడి-పంటకు అనుబంధం ఉండదు. ఒక భారతదేశంలోనే పాడికి పంటకు అనుబంధం ఉంటుంది. అందుకే మన పూర్వీకులు పాడి-పంట అంటుండేవారు. అంటే పాడి లేకుండా పంట, పంట లేకుండా పాడి ఉండవు… ఉండకూడదు. ఈ రెండూకూడా విడదీయరాని… విడదీయకూడని అంశాలు. దానిని గమనించి తప్పనిసరిగా ఒక ఎకరానికి ఒక గేదె చొప్పున పోషించగలగాలి. 

దానినే వ్యవసాయం అంటారు. 

లేకుంటే … అంటే పాడి లేకుండా పంటలు పండించే దానిని వ్యవసాయం అనరు. అనకూడదు అంటున్నారు ఏలూరు జిల్లా కొత్తగూడెంకు చెందిన గద్దె సతీష్‌బాబు.

సతీష్‌బాబుది వ్యవసాయ నేపథ్యం. వారి పూర్వీకుల నుంచి వ్యవసాయమే వృత్తిగా కొనసాగుతూ వచ్చారు. వ్యవసాయం అంటే ఒక్క పంటల సాగే కాదు. పాడి పశువులను కూడా పోషిస్తూ పంటల సాగు చేస్తూ వస్తున్నారు. వారి నిర్వచనం ప్రకారం వ్యవసాయం అంటే పంటల సాగు మరియు పశుపోషణ. రెండింటిని కలిపితేనే వ్యవసాయం అని బల్లగుద్దినట్లు చెబుతారు. కానీ కొందరు ఈ నిర్వచనాన్ని మార్చి పశవులను వ్యవసాయం నుంచి వేరు చేసి విడిగా చూస్తున్నారు. అందుకే నిర్వచనం మార్చుకున్న ప్రస్తుత రైతులు తగిన ఫలితాలను పొందలేకపోతున్నారు అంటున్నారు సతీష్‌బాబు. ఉన్నత చదువులు చదివిన సతీష్‌బాబు వ్యవసాయమే సరయిన దారి అని నమ్మి తమ పూర్వీకుల నుంచి వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.

వీరికి మొత్తం 50 ఎకరాల సాగు భూమి ఉంది. భూమితో పాటు 50 వరకు గేదెలను పోషిస్తున్నారు. ఈ 50 ఎకరాలలో కొబ్బరి, వరి, మొక్కజొన్న పైర్లను మాత్రమే ప్రతి సంవత్సరం సాగు చేస్తుంటారు. కొబ్బరిని బోండాల గురించి సాగు చేస్తూ దూర ప్రాంతాల కొనుగోలుదారులకు కొబ్బరి బోండాలను అమ్మకం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం బిపిటి 5204 రకాన్ని సాగు చేస్తూ ఎకరానికి 20 నుంచి 23 బస్తాల దిగుబడి పొందుతూ వచ్చిన దిగుబడి మర పట్టించి బియ్యం చేసి బియ్యాన్ని మంచి ధరకు అమ్ముతుంటారు. కొంత పొలంలో మొక్కజొన్నను ప్రతి సంవత్సరం అక్టోబరు మాసంలో సాగు చేస్తుంటారు. ఎకరానికి సుమారు 40 క్వింటాళ్ళ మొక్కజొన్న దిగుబడి పొందుతూ తమ సొంతానికి అవసరమైన మ్కొజొన్నను ఉంచుకొని మిగతావి మార్కెట్‌లో అమ్ముతుంటారు. ప్రతి సంవత్సరం మొక్కజొన్న, వరి పంటలను ఒకే ఒక పంట అదే ప్రాంతంలో సాగు చేస్తుంటారు. రెండవ పంటగా ఏ విధమైన పంటలు సాగు చేయకుండా పిల్లిపెసర్లు చల్లి అవి పెరిగిన తరువాత పొలంలో గేదెలను వదులుతుంటారు. ఎలాంటి పంట మార్పిడి, అంతర పంటలు, మిశ్రమ పంట విధానాలను పాటించరు. 

తన 50 ఎకరాల పొలాన్ని 365 భాగాలుగా చేసుకుని రోజుకి ఒక భాగంలో 50 గేదెలు ఒక రోజు ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ 50 గేదెల ద్వారా వచ్చిన పేడ మరియు మూత్రాలు ఆ రోజు అదే ప్రాంతంలో పడతవి. ఆ విధంగా 365 రోజులలో 50 ఎకరాలలో గేదెల పేడ మరియు మూత్రాలు అందేలా జాగ్రత్తపడతారు. అంతకుమించి ఏ విధమైన సాగు పద్ధతులు పాటించరు. ఈ విధంగానే ప్రతీ సంవత్సరం చేస్తూ ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం ఎకరానికి 365 గేదెల ద్వారా ఒక రోజులో వచ్చే పేడ మరియు మూత్రాలు అందిస్తూ వస్తున్నట్లు. భూమికి అవసరమయిన మరియు పంటకు అవసరమయిన అన్ని రకాల పోషకాలు ఈ పేడ మరియు మూత్రాలు ద్వారా అందుబాటులోకి వస్తుంటావి కాబట్టి ఆ పొలంలో పండే పంటలు ఆరోగ్యాంగా, చీడపీడలను తట్టుకునే విధంగా పెరుగుతాయి. కాబట్టి ఈ పొలంలో చీడపీడల సమస్య పెద్దగా ఉండదు. ఈ పద్ధతిలో చీడపీడలు పంటలను ఆశించవు. అంటే చీడపీడలు ఆశించకుండా భూమిని, పంటలను తయారు చేయడమే ఇక్కడ మనము చేసేది. ఇదే ఉత్తమమైన పద్ధతి. కానీ నేటి రైతులు ఇందుకు వ్యతిరేకంగా చీడపీడలు ఆశించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చీడపీడలు ఆశించిన తరువాత వివిధ రకాలుగా ఖర్చులు పెడుతూ సాగు ఖర్చు పెంచుకుంటున్నారు కాబట్టి పంటల సాగు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఈ పద్ధతిలో కలుపు సమస్య కూడా పెద్దగా ఉండదు. గేదెలు పొలం మొత్తం తిరుగుతూ ఉండడం వలన వాటి మూత్రానికి కలుపు గింజల మొలక శక్తిని కోల్పోవడంతో పాటు మొలచిన చిన్న చిన్న మొక్కలు గేదెల మూత్రం ఘాటుకి మాడి పోతాయి. నేటి రైతులు తమ వ్యవసాయంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలు కలుపు మరియు పెట్టుబడులు తగ్గించుకోవడానికి మరియు దిగుబడుల నాణ్యత పెరగటానికి ఇదే ఉత్తమమైన మార్గం అంటున్నారు సతీష్‌ బాబు.

ప్రపంచంలో మన దేశంలోనే ఈ విధానం మన పూర్వీకులు వ్యవసాయంలో పాటించారు. కానీ పాశ్చాత్య పోకడలకు అలవాటయిన మనము వ్యవసాయంలో కూడా పాశ్చాత్య పోకడలను అనుకరించి రసాయనాలను ఉపయోగించడం, పశుపోషణకు దూరం జరగడము జరిగింది. కాబట్టి దాని ప్రభావాన్ని మన రైతులు రుచి చూశారు…. చూస్తున్నారు…. ప్రపంచంలోని మిగతా దేశాలు కూడా తమ తమ వ్యవసాయ పద్ధతులలో ఉన్న తప్పులను ఇప్పుడిప్పుడే గుర్తిస్తూ అందుకు పరిష్కారం మన తాతలు చేసిన పాత వ్యవసాయ పద్ధతులు అంటే వ్యవసాయం చేయాలంటే పశువులను తప్పనిసరిగా పోషించాలి. పశువులను పోషిస్తూ పంటల సాగు చేసిన వారిని రైతు అంటారు. అదే మన తాతముత్తాతల నిర్వచనాన్ని ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాయి. 

వ్యవసాయంలో డ్రోన్‌ లాంటి ఆధునిక టెక్నాలజీ వచ్చిందని సంబర పడుతున్నాము. అసలు డ్రోన్‌ అవసరము లేని టెక్నాలజీని అశ్రద్ధ చేసి డ్రోన్‌ టెక్నాలజీ వచ్చింది సంబరపడటాన్ని ఏమంటారంటే? గాయం చేసి ఆయిట్‌మెంట్‌ రాయడం అంటారు. అసలు గాయం చేయకుండా ఉంటే సరిపోతుంది కదా! గాయం చేయటం ఎందుకు? ఆయిట్‌మెంట్‌ రాయడం ఎందుకు? మన పూర్వీకులు చేసిన వ్యవసాయం అదే. అసలు డ్రోన్‌ అవసరము లేని సాగు పద్ధతులు మన సొంతం అయినప్పుడు దానిని ప్రక్కదోవ పట్టించి మరలా డ్రోన్‌ టెక్నాలజీ వచ్చిందని సంబరపడిపోవటాన్ని ఏమనాలో ఆలోచించండి అని సతీష్‌బాబు అంటున్నారు.

ప్రపంచంలో పశువులను వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగించేది మన దేశంలోనే కావచ్చు. చాలా దేశాలలో పశువులను మాంసం కొరకు పెంచుతుంటారు. ఒకప్పుడు అంటే బుద్ధునికి పూర్వం మన దేశంలో కూడా పశువులను వ్యవసాయంలో ఉపయోగించుకోవడంతో పాటు మాంసం కోసం తినటానిక్కూడా పశువులను పోషించేవారు. జంతు బలుల పేరుతో ప్రతి కార్యక్రమంలో బలులు అంటే ఆవులను, గేదెలను బలి ఇస్తూ ఆ బలి ఇచ్చిన జంతువులను ఆహారంగా తీసుకునేవారు. కానీ వ్యవసాయంలో ఉపయోగించే, ఉపయోగపడే పశువులను జంతు బలుల పేరిట బలి ఇవ్వడం సరయినది కాదని, ఈ పద్ధతి ఇదే విధంగా కొనసాగితే మన వ్యవసాయానికి ఏ పశువు అందుబాటులో లేక వ్యవసాయం కుంటుపడుతుందని గ్రహించిన బుద్ధుడు జంతుబలులను నిర్మూలించటానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. తరువాత అశోకుని కాలంలో జంతుబలులను నిషేధించడం కూడా జరిగింది. అప్పటి నుండి (జంతువులను) పశువులను ఆహారంగా ఉపయోగించడం తగ్గించి వ్యవసాయంలో ఉపయోగించడం పెరుగుతూ వచ్చింది. కాబట్టే మన పూర్వీకులు ఆరోగ్యకరమైన వివిధ రకాల పంటలు పండించారు. మన దేశ వాతావరణం వివిధ రకాల పంటల సాగుకి అనుకూలం మరియు మన రైతులు మంచి నైపుణ్యం చూపించగలిగారు కాబట్టి అప్పట్లో ప్రపంచంలో ఎక్కడా పండని సుగంధ ద్రవ్యాలను మన రైతులు పండించారు. ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం వచ్చిన ఈస్ట్‌ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో మన దేశంలో అడుగుపెట్టి చివరకు దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగారు. అంటే ఇక్కడ మనకు అవసరమైన విషయం మనల్ని బ్రిటీష్‌ వారు పరిపాలించటం కాదు. మన రైతుల గొప్పతనం. మన దేశ గొప్పతనం. ఏ దేశం మీద, ఏ ప్రాంతం మీద ఆధారపడకుండా ఏ ప్రాంతానికాప్రాంతంలో అందుబాటులో ఉండే వనరులతో అద్భుతమైన పంటలు మన రైతులు పండించారు. పంటలు పండించటానికి ఊరు కూడా దాట వలసిన పనిలేదు అనేవిధంగా పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితి నుంచి పంటల సాగులో అవసరమైన ప్రతిదానికి షాపులకు వెళ్లాలి. ఊర్లు దాటాలి… జిల్లాలు… రాష్ట్రాలు దాటాలి. చివరకు దేశాలు కూడా దాటాలి అనేలా పరిస్థితులకు దిగజారాయి. వరి పండించే రైతు తన ఇంటికి అవసరమైన బియ్యాన్ని షాపులో కొనుగోలు చేస్తున్నాడు. మారుమూల పల్లెటూర్లలో కూడా పాలు కావాలంటే ప్యాకెట్లలో పాలు కొనుక్కోవలసిందే. విత్తనం కావాలంటే విత్తనాల షాపులకి, చీడపీడల నివారణకు ఏవైనా కావాలంటే పురుగు మందుల దుకాణానికి పరిగెత్తవలసిన దౌర్భాగ్యంలో ప్రస్తుత రైతులు ఉన్నారు. పరిస్థితులు ఇదేవిధంగా కొనసాగితే చివరకు మిగిలేది శూన్యం. ప్రపంచ దేశాలు మన పురాతన సాగు పద్ధతులను గుర్తించినవి కాని మన రైతులే గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికైనా మేల్కొని మన పురాతన సాగు పద్ధతులను తిరిగి ప్రారంభిస్తేనే వ్యవసాయం, రైతు నిలబడగలడు అని చెబుతున్నారు సతీష్‌. మనం కూడా ఒకసారి సతీష్‌ మాటల గురించి ఆలోచిద్దాం.

అసలైన వ్యవసాయానికి సూత్రాలు

వ్యాపారాలకి, రాజకీయాలకి, ఉద్యోగాలకి, సంసారానికి… కొన్ని సూత్రాలు ఉన్నట్లే వ్యవసాయానికి కూడా కొనిన సూత్రాలు ఉన్నాయి. రైతు తప్పనిసరిగా పంటల సాగుతో పాటు పశుపోషణ చేపట్టాలి. పశువ్యర్థాలను పంటలకు, పంట వ్యర్థాలను పశువులకు అందించాలి. పంటలకు చీడపీడలు ఆశించకుండా జాగ్రత్త వహిచాలే కానీ చీడపీడలు వచ్చిన తరువాత నివారించడానికి ప్రయత్నాలు చెయ్యకూడదు. రైతు తప్పనిసరిగా పంటల సాగుకి దగ్గరలో నివాసం ఏర్పాటు చేసుకుని ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి రోజు పంటలను గమనిస్తూ ఉండాలి. సాధ్యమయినంత వరకు వ్యవసాయంలో అవసరమైన అన్ని పనులు కుటుంబ సభ్యుల సహకారంతో చేయగలగాలి. కూలీల మీద ఎక్కువగా ఆధారపడకుండా ప్రణాళిక వేసుకోవాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు, చుట్టప్రక్కల వ్యాపారం, ఉద్యోగం చేసే వారితో పోల్చుకుంటూ తప్పటడుగులు వేయకుండా తనకు ఏది అవసరమో అదే చెయ్యాలి. అంటే అవసరాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి కాని అనుకరణలకు ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. వ్యవసాయాన్ని సిగ్గుపడుతూ కాకుండా గర్వంగా అంటే మేము సమాజానికి ఆహారం అందిస్తున్నాము అనే తృప్తితో, రైతు లేకపోతే ప్రజలు లేరు, అందరికీ రైతు అవసరం తప్పనిసరి అని తెలియచేసేలా వ్యవసాయం చేయాలి లాంటి కొన్ని సూత్రాలను గద్దె సతీష్‌ తోటి రైతులకు తెలియచేశారు. 

గద్దె సతీష్‌ బాబు Cell: 9912511244

కొత్తగూడెం, ఏలూరు జిల్లా 

Read More

వ్యవసాయమే ఊపిరిగా హరిబాబు

భారతదేశంలో ప్రతి ఒక్కరూ వ్యవసాయ మూలల నుండి వచ్చిన వారే. ప్రతి ఒక్కరికీ వ్యవసాయంతో సంబంధాలు ఉండే ఉంటవి. వారో, వారి తండ్రో, వారి తాతా లేక వారి ముత్తాతో ఏవరో ఒకరు వ్యవసాయం చేసే ఉంటారు. అందుకే ఎవరో అన్నారు భారతదేశంలో ప్రతి ఒక్కరూ వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటారు. వ్యవసాయం గురించి మాట్లాడని భారతీయులు చాలా తక్కువగా ఉంటారు. అందువలననో ఏమోగాని ఎంతటి వారైనా ఏ రంగంలోని వారైనా, వారి వారి రంగంలో ఎంతో ఎత్తుకి ఎదిగిన వారైనా వారి మొక్క చివరి మజిలీగా వ్యవసాయం ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ ప్రముఖులు కె. చంథ్రేఖరరావు గారికి, నారా చంద్రబాబు నాయుడి గారికి వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవి. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్‌. రాజశేఖరరెడ్డి గారికి వ్యవసాయ క్షేత్రం ఉంది. వీరితోపాటు మనదేశంలో అనేకమంది రాజకీయ నాయకులకు వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలితకి వ్యవసాయ క్షేత్రం ఉంది. 

ప్రముఖ సినీనటులు పవన్‌కళ్యాణ్‌, ప్రకాష్‌రాజ్‌ మరియు తదితరులకు కూడా సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న జైన్‌ ఇరిగేషన్‌, రిలయన్స్‌, చందనబ్రదర్స్‌, అగ్రిగోల్డ్‌, శివశక్తి బయోటెక్‌… ఇలా చెప్పుకుంటూ పోతే ఇతర రంగాలలో ఉన్న చాలామందికి వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. ఈ విధంగా అన్ని రంగాలలో ఉన్నవారు చాలా మంది వ్యవసాయంతో సంబంధాలు కలిగి ఉన్నారు. అదే విధంగా ఉద్యోగాలలో ఉన్నవారు కూడా పదవీ విరమణ  తరువాత మరి కొంత మంది ఉద్యోగాలు కొనసాగిస్తూ కూడా వ్యవసాయం చేసేవారు మనకు తారసపడడము మామూలే. మనదేశంలో ఎక్కువమంది యువతరం తమ లక్ష్యంగా ఎంపిక చేసుకునే రంగం సాఫ్ట్‌వేర్‌. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం సాధించడమే ధ్యేయంగా పెట్టుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి సాఫ్ట్‌వేర్‌ రంగంలో కూడా విసిగివేసారిపోయిన యువత ఆ రంగం నుంచి వ్యవసాయరంగం వైపు అడుగులు వేయడం, అదీనూ సేంద్రీయ వ్యవసాయం చేయటానికి ముందుకు రావటం సర్వసాధారణమైన విషయం అని అందరికీ తెలిసిందే. కారణము ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరియొక్క చివరి మజిలీ వ్యవసాయం. అదీనూ ఈ మధ్య కాలంలో అయితే సేంద్రియ వ్యవసాయం అనేది అర్థమవుతుంది. అదేకోవకు చెందినవారు సుకవాశి హరిబాబు. 

గుంటూరు జిల్లా, తెనాలి ప్రాంతానికి చెందిన హరిబాబు తెనాలి వి.యస్‌.ఆర్‌. కాలేజీలో బి.కామ్‌. పూర్తి చేసి ఎం.కాం.లో చేరి కొన్ని అనివార్య కారణాల వలన ఎం.కాం. మధ్యలోనే ఆపివేయటం జరిగింది. తెనాలి వి.యస్‌.ఆర్‌. కాలేజీలో చదువుకునే రోజులలో విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు. 

చదువు అవగానే హైదరాబాద్‌ వెళ్ళి కొంతకాలం, కొన్ని ప్రభుత్వశాఖలలో కాంట్రాక్టరుగా వ్యాపారం చేయటము జరిగింది. పరిస్థితులు అనుకూలించక వ్యాపారాన్ని మానివేసి కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన వ్యాపారం చేయటము జరిగింది. ఇందులో కూడా హరిబాబు ఇమడలేకపోయారు. ఈ రెండు వ్యాపారాలలో ఇమడలేకపోవటానికి ప్రధాన కారణం ప్రభుత్వ శాఖలలో ఉన్న అవినీతే అని హరిబాబు తన ఆవేదనను వ్యక్తం చేశారు. తరువాత కొన్ని సంవత్సరాలు సినీ పరిశ్రమలో ఫైనాన్సియర్‌గా వ్యాపారం చేశారు. ఇందులోను ఇమిడలేక సొంతంగా బుల్లితెర సీరియల్స్‌ నిర్మించడం జరిగింది. 600 ఎపిసోడ్‌ల సీరియల్స్‌ ‘జీవన తీరాలు’ మరియు ‘జీవన సంధ్య’లను నిర్మించినందుకుగాను ఈ రెండు సీరియల్స్‌కు వరుసగా మూడు సంవత్సరాలలో రెండింటికి కలిపి 6 నంది అవార్డులు అందుకుని హ్యాట్రిక్‌ సాధించిన ఘనుడు హరిబాబు. అదే సమయములో ‘కలహాల కాపురం’ అనే సీరియల్‌ కూడా నిర్మించి జెమిని టి.వి. ద్వారా ప్రసారం చేయటము జరిగింది. 

ఎన్నిరకాల వ్యాపారాలు చేసినా, సేవారంగంలో, సినీ, బుల్లితెర రంగంలో ఉన్నా కూడా తన వ్యాపకం అయిన వ్యవసాయాన్ని మాత్రం వదలకుండా హైదరాబాదు గచ్చిబౌలిలో 2 ఎకరాలలో సుమారు 30 రకాల పండ్ల మొక్కలను 1987 నుంచి 2005 వరకు పెంచటము జరిగింది. ఆ సమయంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ రకాల మొక్కలను సాగుచేసిన అనుభవంతో 2013 మరియు 2014 సంవత్సరాలలో హైదరాబాదు శివారు మహేశ్వరం మండలం అమీర్‌పేట గ్రామంలో 10 ఎకరాల భూమిని కొనుగోలుచేసి వెంటనే వివిధ రకాల మొక్కల పెంపకం చేపట్టారు. ఇక్కడ వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుండి 2015 డిసెంబరు వరకు రసాయనాలను ఉపయోగిస్తూ వచ్చారు.  2015 డిసెంబరులో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని గురించి తెలుసుకోవటము జరిగింది. వెంటనే రసాయన వ్యవసాయాన్ని మానివేసి ప్రకృతి వ్యవసాయాన్నే చేయాలని నిర్ణయం తీసుకొని ఆవులను పోషిస్తూ 2016 జనవరి నుండి రసాయనాలను ఉపయోగించటము మానివేసి ప్రకృతి వ్యవసాయం చేయటము మొదలు పెట్టడము జరిగింది.  జీవామృతం చేసుకోవటానికి తోట మధ్యలో పెద్ద సిమెంట్‌ తొట్టెలను ఏర్పాటు చేసుకొని అందులో తయారు చేసుకొన్న జీవామృతాన్ని మొక్కలకు అందిస్తున్నారు. జీవామృతంతో పాటు వివిధ రకాల నూనెలను కూడా కలుపుకుని మొక్కలకు అందిస్తున్నారు. మొత్తం 10 ఎకరాలలో ఉన్న వివిధ రకాల మొక్కలను పొలంలో ఉన్న ఒకే ఒక్క 2 అంగుళాల నీటి సామర్థ్యం గల బోర్‌వెల్‌తో పండించటం జరుగుతుంది.

రైతులు అధిక ఆదాయం పొందాలంటే దేశంలో ఉన్న అవినీతి మరియు దళారీ వ్యవస్థ అంతం అవటంతోపాటు రైతులు కూడా వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంలో ఇంటెన్సివ్‌గా చేయాలి. అప్పుడే రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలడు అని హరిబాబు అభిప్రాయపడ్డారు. ఎవరు ఎన్ని గొప్పగొప్ప వృత్తులలో ఉన్నాకూడా చివరిగా సేదతీరేది మాత్రం వ్యవసాయంలో అనేది ఎంతోమంది అనుభవాలు చెప్పకనే చెబుతున్నవి. నేను కూడా వ్యాపారరంగం, సినీ రంగం, రాజకీయ రంగం, బుల్లితెర రంగం, వ్యవసాయ రంగం మరియు సామాజిక సేవారంగం అన్నింటిలో అనుభవం గడించాను. కానీ చివరిగా వ్యవసాయ రంగంలోనే ప్రస్తుతము తృప్తిగా సేదతీరటం జరుగుతుంది. నా అనుభవం నేర్పిన పాఠం ఏమిటంటే మనషులను నమ్ముకోవటం కంటే మొక్కలను నమ్ముకోవటమే ఉత్తమం. అందుకనే తాను వివిధ రకాల మొక్కలను పెంచుతున్నాను అనే అభిప్రాయంలో హరిబాబు ఉన్నారు. 

వివిధ రకాల మొక్కల పెంపకం…

ఎక్కువ రకాల మొక్కలను పెంచడంలో బహుశా హరిబాబుకు ఎవరూ సాటి ఉండకపోవచ్చు. తన 10 ఎకరాల పొలములో అటవీ మొక్కలైన టేకు, ఎర్రచందనం, శ్రీగంధం, సిల్వర్‌ఓక్‌, పహజన్‌, రోజ్‌ఉడ్‌, ఔషధ మొక్కలైన శతావరి, అశ్వగంధ, బిళ్ళగన్నేరు, రుద్రాక్ష, మారేడు, వేప, తులసి, అడ్డసర, కలబంద, నేలవేము, మాసపత్రి, సుగంధద్రవ్య మొక్కలైన లవంగం, బిర్వాని ఆకు, దాల్చిన చెక్క, యాలకలు, జాజికాయ, మిరియాలు, తమలపాకు మరియు పండ్ల మొక్కలైన లిచి, మామిడి, పనస, సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం, నారింజ, సపోట, దానిమ్మ, జామ, డ్రాగన్‌ఫ్రూట్‌, వివిధరకాల చెర్రిమొక్కలు, రంబూటన్‌, జబోడిక, కొబ్బరి, అరటి మరియు చెరకు, వాక్కాయ, కూరగాయలతోపాటు ఇంకా అనేక రకాల మొక్కలను పెంచుతున్నారు. వివిధ రకాల మొక్కలను అందుబాటును బట్టి కర్నాటకలోని మడికెరి, అగుంబే, శృంగేరి, బెంగుళూరు, కేరళలోని కేసర్‌గౌడ్‌, త్రిచూర్‌లతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కడియంలనుంచి సేకరించాడు.

  హరిబాబు సాగుపట్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి పెరిగింది. ఎందరో వారి క్షేత్రాన్ని సందర్శిస్తూ, వారి విధానాల గురించి తెలుసుకుంటున్నారు. ఆ దిశగా మేము కూడా ప్రయాణిస్తామని ప్రతిజ్ఞ చేయటం ఓ శుభ పరిణామం. 

జీవామృతం, నూనెల మిశ్రమం 

తయారీ మరియు వాడకం

200 లీటర్ల సామర్థ్యంగల ప్లాస్టిక్‌ డ్రమ్ములో 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కిలోల ఆవుపేడ, 2 కిలలో బెల్లం, 2 కిలోల ఉలవ పిండి, 1 కిలో గట్టు మట్టి మరియు వివిధ రకాల నూనెల మిశ్రమము 1 1/2 కిలోలు, మిగిలినది నీరు పోసుకొని మొత్తం కలిపి 2,3 రోజులు నిల్వ ఉంచిన తరువాత చెట్టు వయస్సును బట్టి ఒక్కొక్క చెట్టుకు 2 నుంచి 5 లీటర్ల చొప్పున 15 నుంచి 20 రోజులకు ఒకసారి అందిస్తుంటారు. అదే దాషామాలో ఎక్కువ మొత్తంలో జీవామృతాన్ని పెద్ద సిమెంటు తొట్టెల్లో కూడా తయారుచేసుకుంటూ ఉంటారు. 

నూనెల మిశ్రమం : వేపనూనె 15 కిలోలు, చేప నూనె 5 కిలోలు, పత్తి నూనె 15 కిలోలు, కొబ్బరి నూనె 15 కిలోలు, వేరుశనగ నూనె 15 కిలోలు, అవనూనె 15 కిలోలు, ప్రొద్దుతిరుగుడు నూనె 15 కిలోలు, సీతాఫలం విత్తనాల నూనె 5 కిలోలు, తవుడు నూనె 15 కిలోలు, కుసుమ నూనె 15 కిలోలు మరియు నువ్వుల నూనె 15 కిలోలు. ఈ నూనెలన్నింటిని కలిపి నూనెల మిశ్రమం తయారు చేసుకొని 9 కిలోల ఈ నూనెల మిశ్రమానికి 1 లీటరు ఎమల్సిఫైర్‌ కలుపుకుని ఉపయోగిస్తుంటారు. 

సుకవాశి హరిబాబు  Cell: 8985753339

హైదరాబాద్‌

Read More