తొలకరి వర్షాలతోనే రైతులు ఖరీఫ్ (వానాకాలం) సీజన్ పనులకు సన్నాహాలు జరుగుతువుంటాయి. ఈ సంవత్సరంకు గాను మనకు నైరుతి రుతుపవనాలు చాలా తొందరగా (ముందస్తుగా) వచ్చేస్తున్నాయని మన వాతావరణ విభాగం వారు తెలియజేస్తున్నారు.
ఖరీఫ్ 2022-2023 త్వరలో మొదలవుతుంది. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గతంలో వ్యవసాయ పనులలో, వ్యయంలో (ఆర్థికంగా) గాని మరియు వనరులను ఉపయోగించడంలో గతంలో చేసిన పొరపాట్లను తిరిగి చేయకుండా ఈ తొలకరిలో సరైన సన్నాహాలను చేసుకొన్నట్లయితే రైతన్నకు లాభసాటి వ్యవసాయం సాధ్యమే. అలా కాని పక్షంలో రైతు వ్యవసాయంలో భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
మనకున్న (రైతు) నేల రకం, నీటి వసతి, పెట్టుబడి లభ్యత, కుటుంబ పరిస్థితి మరియు ఆర్థిక స్థితిగతులు వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని పంటలను మరియు విత్తన రకాలను ఎన్నుకోవాలి. మన పరిస్థితులకు అనుగుణంగా మన వ్యవసాయ ప్రణాళిక ఉండాలి. నీటి వసతి, మరియు వర్షాధారిత నేలలో కొన్ని దీర్ఘకాలిక, మరికొన్ని స్వల్పకాలిక ఆదాయ వనరులను ఇచ్చేవిధంగా ఉండాలి. ఎప్పటికి వేరే వాళ్ళను అనుకరించే విధంగా ఉండకూడదు.
సాధ్యమైన వరకు నేల సారవంతతను పెరిగే విధంగా…
చెరువు మట్టిని పంటపొలాలకు వేసవిలో తోలుకోవాలి.
పొలంలో గొర్రెల మందలకు తోలాలి (పెట్టాలి)
పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు మరియు గొర్రెల ఎరువులను పంట పొలాల భూములలో తప్పకుండా వాడాలి.
నీటి తడులు ఇచ్చే అవకాశం ఉన్న చోట వేసవిలో పచ్చిరొట్ట ఎరువులను (జీలుగ/పెసర/జనుము) వేసి అవి పూత థకు చేరుకొనే సమయంలో రోటావేటర్ సహాయంతో నేలలో కలియదున్నాలి.
పంటల ఎన్నిక / పంటల ప్రణాళిక
ఎండాకాలంలో మట్టి నమూనా పరీక్షలు తప్పని సరిగా చేయించాలి. మట్టి నమూనాలలో వచ్చిన ఫలితాలకు సమతుల్యమైన ఎరువులను సమయానుసారంగా శాస్త్రీయ పద్ధతిలో వాడాలి.
వాతావరణం సూచనలు, భూగర్భ జలాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ వాటికి అనుగుణంగా పంటలను సాగు చేసుకోవాలి.
పంటలలో మన వాతావరణ పరిస్థితులకు మరియు మన పరిస్థితులకు అనువైన రకాలను అలాగే మన ప్రాంతంలో చీడపీడలను తట్టుకొనే రకాలను ఎన్నిక చేసుకోవాలి.
ఏక పంటకు బదులు బహుళ పంటల సాగు పద్దతిని ఎన్నుకోవాలి. దీర్ఘకాలిక పంటలకు బదులుగా 2-3 స్వల్పకాలిక పంటలు, తక్కువ పెట్టుబడి అవసరమున్న పంటలను ఎన్నుకోవాలి. మరీ ముఖ్యంగా అంతరపంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. పంటల మార్పిడి లేక రకాల మార్పిడి తప్పకుండా పాటించాలి.
అవసరానుసారంగా మండల వ్యవసాయ అధికారులకు, ఏరువాక కేంద్రాలను, శాస్త్రవేత్తలను మరియు కిసాన్ కాల్ సెంటర్లను సంప్రదించి సందేహాలను (వ్యవసాయ పనులలో) నివృత్తి చేసుకోవాలి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమతుల సహాయాన్ని, మార్కెటింగ్, గిడ్డంగులు మరియు తక్కువ వడ్డీతో పంట రుణాలను వాటి మాఫీ సదుపాయాలను రైతులు వినియోగించుకోవాలి.
విత్తనాలను సర్టిఫైడ్ డీలర్ల వద్ద మాత్రమే కొనాలి. అలాగే రశీదు తప్పక తీసుకొని భద్రపరచుకోవాలి.
సమగ్ర సుస్థిర వ్యవసాయం చేపట్టాలి. అనగా వ్యవసాయంతో పాటు పెరటి కోళ్ళ పెంపకం, పాడి గేదెల పెంపకం మరియు పందిరి కూరగాయలు మొదలైనవి చేపట్టాలి.
ఈ విధంగా రైతులు సరైన ప్రణాళికలను ఖరీఫ్‌కు ముందుగా రూపొందించుకొని, పంటలపై పెట్టుబడిని తగ్గుంచుకుని, పంట ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచుకొని, వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించి వ్యవసాయాన్ని ఈ ఖరీఫ్ సీజన్‌లో పండగ లాగా చేసుకోవాలి. జి
నది వ్యవసాయక దేశం. అనాదిగా మన ప్రదాన వృత్తి వ్యవసాయం. అయినా కాని రైతులు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు అంటున్నారు. గిట్టుబాటు కాకపోయినా పంటల సాగు ఆగుతుందా? అంటే ఆగడము లేదు. పంటల సాగు నిరంతరం కొనసాగుతుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. రైతులు పంటల సాగు కొనసాగించడం వలననే కరోనా సమయంలో అన్ని ఆగినవి కానీ రైతు కాడి ఆగలేదు. కాబట్టి మన అవసరాలకు మించి ఆహారాన్ని అన్నదాతలు పండించగలిగారు. వరి ఉత్పత్తి పెరగబట్టే ప్రభుత్వాలు వరి సాగును నియంత్రించడం జరిగింది. అంటే రైతులకు పంటల సాగు గిట్టుబాటు అయినా, కాకపోయినా కూడా వ్యవసాయం ఆగడం లేదు. రైతులందరికీ పంటల సాగు గిట్టుబాటు కావడం లేదా? అంటే సమాధానం కాదు అని వస్తుంది. అంటే కొంతమంది రైతులు లాభాల సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు సాగులో నష్టాలను భరించవలసి వస్తుందనేది మన వ్యవసాయ రంగం సారాంశం. ఏది ఏమైనా కానీ వ్యవసాయంలో అవసరమైన అన్ని మెళకువలు అంటే పెట్టుబడులు తగ్గించుకొని, నాణ్యమైన దిగుబడి పొంది ఆ దిగుబడికి విలువ జోడించి నేరుగా వినియోగదారులకు అమ్మగలిగితే రైతులు తమ సాగులో లాభాలు గడించగలరు అని అనేకమంది రైతుల అనుభవాలు చెబుతున్నాయి. ఈ కోవకే చెందుతారు పశ్చిమగోదావరి జిల్లా రావులపాలెంకి చెందిన వీరారెడ్డి.
వీరారెడ్డి జీవితం అనేక మలుపులు తిరిగింది. ఒకానొక సమయంలో ఆర్థిక సమస్యల నుంచి బయట పడటానికి చెరకు సాగు మొదలు పెట్టారు. మొదటగా ఒక ఎకరంలో చెరకును పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించి ఆ చెరకును అదేవిధంగా చెరకుగా అమ్మకం చేసినట్లయితే సరైన ఆదాయం రాదు అని గ్రహించి చెరకుకు విలువ జోడించి రసం చేసి, చెరకు రసాన్ని నేరుగా వినియోగదారులకు అమ్మగలిగితే మంచి ఆదాయం వస్తుందని గ్రహించి ఆ దిశగా అడుగులు వేశారు. వీరారెడ్డి గారు కౌలుకు తీసుకున్న పొలం ప్రధాన రహదారి ప్రక్కనే ఉండడం వలన చెరకు రసంను మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం కుదిరింది. తాను పండించే చెరకుకు ఎలాంటి రసాయనాలు వేయకుండా పశువుల ఎరువు తోలించడంతో పాటు అవసరాన్ని బట్టి ద్రవజీవామృతం, ఘనజీవామృతం లాంటివి అందిస్తూ వస్తున్నారు. ఇంకా అవసరమనుకుంటే ఫిష్ ఎమినో యాసిడ్ కూడా పంటకు అందిస్తూ వస్తుంటారు. చెరకు రసం తీసిన పిప్పిని కూడా బాగా కుళ్ళించి దానిని కూడా చెరకు సాగుకు ఉపయోగిస్తూ ఎలాంటి రసాయనాల అవసరం లేకుండా ఎకరానికి 40 టన్నులకు తగ్గకుండా చెరకు దిగుబడిని పొందుతూ ఆ దిగుబడిని రసం తీసి లీటరు 60/-ల చొప్పున అమ్ముతూ వస్తున్నారు.
ఒక దుకాణంతో, ఒక ఎకరంతో మొదలైన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి 22 బ్రాంచిలకు, 22 ఎకరాలకు ఎదిగింది. ప్రస్తుతం వీరారెడ్డి గారు మొత్తం 22 ఎకరాలలో చెరకు పంటను సాగు చేస్తున్నారు. 22 ఎకరాల చెరకుగాను ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో 22 దుకాణాలను ఏర్పాటు చేసి సంవత్సరం పొడవునా చెరకు రసం మార్కెటింగ్ చేస్తూ వస్తున్నారు. చెరకు రసంలో ఉండే పోషకాలను వినియోగదారులకు తెలియపరుస్తూ శీతల పానీయాలకు బదులుగా చెరకు రసాన్ని వినియోగిస్తే లభించే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు తెలియపరుస్తూ రోజు రోజుకు తన వ్యాపారాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
చెరకు రసం తీయడానికి పలు రకాల మిషన్‌లు ఉపయోగించి చివరకు లక్షన్నర విలువ చేసే మిషన్ అయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకుని అన్నీ ఆ మిషన్లనే ఏర్పాటు చేశారు. మిషను మరియు దుకాణంకి కావలసిన అన్ని ఏర్పాట్లకు కలసి ఒక్కొక్క దుకాణానికి 8 లక్షల రూపాయలు ఖర్చు చేసి 22 బ్రాంచిలను ప్రారంభించి అన్ని బ్రాంచీలను విజయవంతంగా నడిపిస్తున్నారు. సొంత దుకాణాల ద్వారా చెరకు రసాన్ని అమ్మకం చేయడంతో పాటు శుభకార్యాలకు, పెళ్ళిళ్లకు, పంక్షన్లకు కూడా చెరకు రసాన్ని సరఫరా చేస్తున్నారు. ఇందుకుగాను ముందుగా వచ్చిన ఆర్డరు ప్రకారం అవసరమైన చెరకు ముక్కలను రిఫ్రిజిరేటర్‌లో పెట్టి అవసరమైన చల్లదనం వచ్చిన తరువాత ఆ చెరకు ముక్కలను కూల్ బాక్స్‌లో పెట్టి ఫంక్షన్ జరిగే ప్రాంతానికి చల్లబరచిన చెరకు ముక్కలు మరియు రసం తీసే మిషను తీసికెళ్ళి అక్కడకూడా తాజా చెరకు రసాన్ని తీసి అందిస్తున్నారు.
చెరకు సాగుకు కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. చెరకు విత్తనం నాటడానికి, సేంద్రియ పదార్థం అందించటం, చెరకు నరకడము ఇలాంటి పనులన్నింటికి కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే చెరకును చెరకు రసంగా మార్చాలంటే కూలీల అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది. చెరకు గడను పై చెత్త తొలగించడం, ఉప్పు నీటిలో ఒకసారి, మంచి నీటిలో ఒకసారి కడగడం, శుభ్రంగా కడిగిన గడలను ముక్కలుగా కట్ చేసి ట్రేలలో అమర్చడం, కట్ చేసే సమయంలో ఏదైనా తెగులు ఆశించిన భాగాన్ని తొలగించడం, సిద్ధమైన చెరకు ముక్కలను అవసరమైన ప్రాంతానికి రవాణా చేయడం లాంటి వాటన్నింటికి కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందుకుగాను వీరారెడ్డి గారు మొత్తం సుమారుగా 150 మంది కూలీలను నియమించుకుని ప్రతినిత్యం వారికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు.
మామూలుగా చెరకును అదేవిధంగా చెరకు ఫ్యాక్టరీకి అమ్మకం చేసినట్లయితే టన్నుకు 3000/-ల వరకు రావచ్చు. అదే చెరకు రసం చేసే వారికి అమ్మకం చేసినట్లయితే టన్నుకు 5000/-ల వరకు రావచ్చు. అదే తానే సొంతంగా చెరకు రసాన్ని తీసి అమ్మినట్లయితే టన్ను చెరకు నుంచి 30000/-ల స్థూల ఆదాయం పొందవచ్చు. టన్ను చెరకు నుంచి 500 లీటర్ల చెరకు రసం పొందవచ్చు. లీటరు 60/-లకు అమ్మకం చేసినా కూడా 30,000/-ల స్థూల ఆదాయం వస్తుంది. ఈ రకంగా వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించగలిగితే రైతు లాభా బాటలో నడవడం తధ్యం అని వీరారెడ్డి నిరూపిస్తున్నారు. చెరకుతోపాటు కొద్ది ప్రాంతంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు కూడా పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నారు. మరిన్ని వివరాలు 95333 61515 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
ఎకరానికి 9 లక్షల ఆదాయం
చెరకు అందరికీ తెలిసిన పంట. రసాయనాలతో చెరకును పండించేవారు ఎకరానికి 60 టన్నులకు పైబడే దిగుబడి తీస్తున్నారు. ఏది ఏమైనా కానీ సగటున కనీసం 40 టన్నుల వరకు తీస్తున్నారు. సేంద్రియ సాగు పద్ధతులు వచ్చిన తరువాత చెరకు రైతులు సేంద్రియబాట పడుతున్నారు. మిగతా పంటలతో పోల్చుకుంటే చెరకు సేంద్రియ సాగుకు బాగా అనుకూలం. అన్ని మెళకువలు సక్రమంగా తీసుకోగలిగితే చెరకులో సేంద్రియ పద్ధతులు పాటించిన మొదటి సంవత్సరం నుంచే రసాయనాలతో సమానంగా దిగుబడి తీయవచ్చని అనేకమంది రైతులు నిరూపిస్తున్నారు. వీరారెడ్డిగారు 22 ఎకరాలలో చెరకును సాగు చేస్తూ ఎకరానికి సంవత్సరానికి సగటున 30 టన్నుల దిగుబడి తీస్తున్నారు. చెరకును రసం తీసి లీటరు 60/-లకు తగ్గకుండా అమ్మకం చేస్తున్నారు. టన్ను చెరకు నుంచి 500 లీటర్లకు తగ్గకుండా చెరకు రసం వస్తుంది. లీటరు 60 రూపాయలు చొప్పున 500 లీటర్లకు 30,000/- అంటే టన్ను చెరకు 30,000/-లు. ఎకరానికి 30 టన్నుల దిగుబడి సాధిస్తూ, 30 టన్నుల చెరకును రసం తీసి అమ్ముతూ టన్ను చెరకు నుంచి 500 లీటర్లు అంటే 30 టన్నుల చెరకు నుంచి 15000 లీటర్ల రసం పొంది లీటరు 60/-ల చొప్పున మొత్తం ఎకరం చెరకును చెరకు రసం చేసి 9 లక్షల రూపాయల స్థూల ఆదాయం గడిస్తున్నారు. రసం తీయగా వచ్చిన పిప్పిని కుళ్ళించి మరలా చెరకు సాగుకు వినియోగిస్తున్నారు కాబట్టి సాగు ఖర్చులు కూడా తగ్గించుకుంటున్నారు.
ప్రతి మనిషికి గాలి, నీరు తరువాత ప్రాథమిక అవసరాలు ఆహారం మరియు రక్షణ. ప్రస్తుత పరిస్థితులు గమనించినట్లయితే వివిధ రకాల కారణాల వలన ప్రతి దేశం వారు విదేశీయుల నుండి, పొరుగు లేదా శత్రు దేశాల నుండి తమ దేశాన్ని, తమ దేశ ప్రజలను రక్షించుకోవడం కొరకు లక్షల కోట్లు ఖర్చు చేయవలసి వస్తుంది. విదేశీ శత్రువులనుండి మన దేశాన్ని సైనికులు ప్రతిక్షణం కాపాడుతూ ఉంటారు. సైనికులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రతికూల పరిస్థితులలో కూడా దేశ రక్షణ కోసం అనునిత్యం పాటుపడుతుంటారు. అనివార్య పరిస్థితులలో యుద్ధంలాంటిది సంభవిస్తే తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడటానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. మనం క్షేమంగా ఉంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతున్నామంటే అది మొత్తం మన సైనికుల త్యాగం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ, ప్రతిక్షణం జై జవాన్ అంటూ సైనికుల త్యాగాలను గుర్తిస్తూ వారికి జేజేలు పలకవలసిందే. అదేవిధంగా పెరుగుతున్న జనాభా అందరికీ ఆహారం అందుతుందంటే మరియు కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో కూడా అన్ని ఆగినవి కాని ఒకటి మాత్రం ఆగలేదు. అదే వ్యవసాయం. రైతులు స్వేదం చిందిస్తూ సేద్యం చేస్తూ కరోనాలాంటి విపత్కర పరిస్థితులలో కూడా తమ కాడిని ఆపకుండా పంటల సాగు చేశారు, చేస్తున్నారు కాబట్టే మన ఆకలి తీరుతుంది. పంటల సాగులో చాలావరకు రైతులు నష్టాల పాలవుతున్నారు. నష్టాలను భరించలేని కొంతమంది రైతులు తమ కుటుంబాలను అనాధలను చేసి లోకాన్ని విడిచి పెడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా రైతు పంటల సాగును ఆపడం లేదు. రైతు తమని తాము త్యాగం చేసుకుంటూ సేద్యం చేస్తున్నారు కాబట్టే మన కడుపులు నిండుతున్నవి కాబట్టి మనందరం రైతులకు రుణపడి ఉన్నాము. రైతు వేళ్లు మట్టిలోకి వెళితేనే మన వేళ్లు నోట్లోకి వెళుతున్నాయనే విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు, ప్రతి రోజు జై కిసాన్ అంటూ రైతులకు జేజేలు పలకవలసిందే. జై జవాన్… జైకిసాన్ అని జేజేలు పలికించుకున్న వ్యక్తి ఒకరే అయితే అంతకు మించిన అదృష్టం ఉండదు. అలాంటి అదృష్టవంతులు అతి తక్కువమంది ఉంటారు అనడంలో సందేహం లేదు. అలాంటి తక్కువమందిలో ముందువరుసలో ఉంటారు కడప జిల్లా, కోడూరు గ్రామానికి చెందిన వెంకటరామరాజు.
వెంకటరామరాజుది వ్యవసాయ నేపథ్యం. పియుసి వరకు చదివిన వెంకటరామరాజు చదువు పూర్తి అయిన తరువాత వాయుసేనలో సైనికునిగా బాధ్యతలు చేపట్టి అందులో కొనసాగుతూ వస్తున్నారు. 15 సంవత్సరాలు వాయుసేనలో సేవలు అందించిన తరువాత అందులోనే కొనసాగే అవకాశం ఉన్నా కూడా స్వతంత్ర జీవనానికి, మన దేశ అభివృద్ధికి వ్యవసాయమే సరైన దారి అని నమ్మి వాయుసేనలో పదవీ విరమణ పొంది ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా వ్యవసాయరంగంలో అడుగుపెట్టారు. తోటి రైతుల లాగానే వ్యవసాయంలో అవసరమైన మార్పులను చేపడుతూ పంటల సాగు కొనసాగిస్తూ వస్తున్న సమయంలో రసాయనిక వ్యవసాయం వలన సంభవిస్తున్న అనర్థాల నుండి బయట పడటానికి సేంద్రియ సాగే సరైనదని అని తెలుసుకోవడం జరిగింది. ఈ మార్పుకు సుభాష్ పాలేకర్ అవగాహనా సదస్సులు బాగా ఉపయోగపడినవి. హైదరాబాదు మరియు తిరుపతిలో జరిగిన సుభాష్ పాలేకర్ అవగాహనా సదస్సులకు హాజరయ్యి ప్రకృతి సాగులో మన నాటు ఆవు ప్రాముఖ్యత మరియు ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతి సాగు ఆవశ్యకతను గుర్తించి తన రసాయనిక సేద్యాన్ని ప్రకృతిసాగులోకి మార్చారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వివిధ పంటలు సాగు చేయడంతో పాటు పంటల సాగులో తన అనుభవాలను, తాను నేర్చుకున్న సాంకేతికతను తోటి రైతులకు తెలియజేస్తూ విజ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు.. విజ్ఞానం అందరికి సంబంధించినది కాబట్టి తాను తెలుసుకున్న విజ్ఞానం తనతో అంతం కాకుండా అందరూ నేర్చుకున్నప్పుడే ఆ విజ్ఞానానికి సరైన అర్థం ఉంటుందనే లక్ష్యంతో వివిధ ప్రాంతాలలోని రైతులకు తన క్షేత్రస్థాయి అనుభవాలను నిస్వార్థంగా తెలియపరుస్తూ జై విజ్ఞాన్ అనే మూడవ నినాదాన్ని వెంకటరామరాజు జత చేశారు. ఈ జైవిజ్ఞాన్ అనే నినాదం వెనక వ్యవసాయ శాస్త్రవేత్త డా|| స్వామినాధన్ ఆలోచన ప్రధానమైనది. ఒకానొక సమయంలో వెంకటరామరాజుకి డా|| స్వామినాథన్‌ని కలిసే అవకాశం లభించింది. ఆ సందర్భంలో జరగిన సంభాషణల ఫలితమే జై విజ్ఞాన్ అనే నినాదం. జై జవాన్, జై కిసాన్.. జై విజ్ఞాన్ అనే మూడు నినాదాలకు వెంకటరామరాజు న్యాయం చేకూరుస్తున్నారు.
వెంకటరామరాజుకు వివిధ పంటల సాగులో మంచి అనుభవం ఉంది. వీరి ప్రతిభను గుర్తించి అనేక అవార్డులు, రివార్డులు వీరిని వరించినవి. మన దేశంలోనే కాకుండా ఇథోపియా లాంటి దేశాలలో కూడా వ్యవసాయరంగంలో వెంకటరామరాజు తన సేవలను అందించారు. వీరికి వివిధ పంటల సాగులో మంచి అనుభవం ఉన్నా కూడా, ప్రత్యేకించి అరటి మరియు బొప్పాయి పంటల సాగులో వీరికి సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం కడప జిల్లా కోడూరు ప్రాంతంలో తోటి రైతుల భాగస్వామ్యంతో అరటి మరియు బొప్పాయి పంటలను సుమారు 15 ఎకరాలలో పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు. జీవన ఎరువులు మరియు ట్రైకోడెర్మావిరిడి, సూడోమోనాస్ లాంటి జీవ శిలీంద్ర నాశినులతో అభివృద్ధి పరచుకున్న పశువుల ఎరువును దుక్కిలో అందించడంతోపాటు అవసరాన్ని బట్టి పైపాటుగా అందిస్తుంటారు. క్రమంతప్పకుండా జీవామృతాన్ని భూమికి అందించడంతోపాటు వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలను పంటపై పిచికారి చేస్తూ పంటలను చీడపీడల నుంచి కాపాడుకుంటున్నారు. చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలలో భాగంగా జిగురు అట్టలు, సోలార్ లైట్‌ట్రాప్‌ని ఉపయోగిస్తున్నారు. 15 ఎకరాలలో ఉన్న అరటి మరియు బొప్పాయి మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి. చుట్టుప్రక్కల రసాయన వ్యవసాయం చేసే తోటలతో పోల్చుకుంటే రాజు గారు సాగు చేసే బొప్పాయి, అరటి పంటలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. పూర్తి సేంద్రియ పద్ధతులతో పంటలు సాగు చేస్తూ తోటి రైతులు సేంద్రియంవైపు అడుగులు వేయటానికి రాజుగారు కృషి చేస్తున్నారు. మరిన్ని వివరాలు 9652902972 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
ఉద్యమాలలో వెంకటరామరాజు
రైతు సమస్యల కోసం, ప్రజల సమస్యల కోసం ఉద్యమాలు అవసరమయితే ఆ ఉద్యమంలో వెంకట రామరాజు ముందువరుసలో ఉంటుంటారు. వివిధ శాఖలకు చెందిన అధికారులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ అధికారులకు సూచనలు, సలహాలను అందిస్తూ ప్రత్యేకించి వ్యవసాయ శాఖ ఉద్యానశాఖ వారితో క్రమం తప్పకుండా కలుస్తూ రైతులకు అవసరమైన చర్యలు ఆయా అధికారులు తీసకునేలా వారితో చర్చలు జరుపుతూ అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా వెంకటరామరాజు గుర్తింపు పొందారు.
జార్జిబుష్‌కి నాగలిని బహూకరించిన వెంకటరామరాజు
జార్జ్‌బుష్ (జూనియర్) అమెరికా ప్రెసిడెంటుగా ఉన్న సందర్భంలో 2006 వ సంవత్సరంలో మన రాష్ట్రాన్ని సందర్శించారు. జార్జిబుష్ తన సందర్శనలో భాగంగా రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొంతమంది రైతులను కలశారు. జార్జిబుష్‌ని కలిసిన రైతులలో వెంకటరామరాజు, చింతల వెంకట రెడ్డి, నాగరత్నం నాయుడు, మేకల లక్ష్మీనారాయణ లాంటి వారు ఉన్నారు. వెంకటరామరాజు ఒక నాగలిని జార్జిబుష్‌కి బహుమానంగా అందించారు. ఆ నాగలిని భుజంపై పెట్టుకుని జార్సిబుష్ ఫొటోలు దిగారు. నాగలితో పాటు పెద్ద పనసకాయ, ప్రకృతి సిద్ధంగా పండించిన మస్క్‌మెలన్, ఎర్ర అరటి పండ్లను కూడా వెంకటరామరాజు జార్జిబుష్‌కు అందించారు. జార్జిబుష్ అమెరికా తిరిగి వెళ్ళిన తరువాత వెంటరామరాజుని అభినందిస్తూ ఒక అభినందన పత్రాన్ని పంపడం, వెంకటరామరాజు నైపుణ్యానికి నిదర్శనం.
ఈ సంవత్సరం భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవ్వచ్చని శాస్త్రవేత్తల అంచనా. మన పొలంలో ఎప్పుడు ఎంత పడింది అనేది ఎక్కడికక్కడ గమనించాల్సిందే. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను జూన్4న, తెలంగాణాను జూన్ 7న మూడు నాలుగు రోజుల తేడాతో తాకవచ్చు. ఈ నేపథ్యంలో జూన్ నెల (రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తెలు)లో చేయవలసిన వ్యవసాయ కార్యక్రమాలను గురించి తెలుసుకుందాం.
పంటచేతికొచ్చే సమయానికి పండిన సరుకు, లాభానికి అమ్ముడు పోతుందనే నమ్మకమున్న పంటలను, రకాలను ఎంపిక చేసుకుని సాగు చేద్దాం.
టమాట: ఇప్పుడు టమాట చిల్లరగా వంద రూపాయల దాకా అమ్ముతున్నారు. నీళ్లున్న ఎక్కువ మంది రైతులు, టమాట సాగు వైపు మొగ్గు చూపే అకాశముంది. విస్తీర్ణం బాగా పెరిగితే పంట చేతికొచ్చేటయానికి (విత్తిన 90 రోజులకు లేక నాటిన 60 రోజులకు పంటచేతికి రావడం మొదలవుతుంది) ధరలు తగ్గే అవకాశముంది. వర్షానికి కూడా టమాట సాగు చేయడం పలు ప్రాంతాలలో అలవాటుంది. వర్షాధార పంట చేతికొచ్చే టయానికి టమాట ధర బాగా తగ్గే అవకాశముంది. విపరీత వర్షాలు, ముసురు, మేఘావృత వాతావరణం వలన ఏ ప్రాంతంలోనైనా పంట దెబ్బతింటే అప్పుడు టమాట రేట్లు పెరుగుతాయి. టమాట ధర జూన్ నెలలో కూడా ఎక్కువగానే ఉండే పరిస్థితి కనబడుతున్నది. జూలై 3వ వారం, ఆ తర్వాత వర్షాధార ఆకుకూరలు, కూరగాయలు మార్కెట్‌కు వచ్చినపుడు ఈ పంట ధర తగ్గే అవకాశముంది.
కొత్తిమీర: జూన్ మొదట్లో రుతుపవనాలు మొదలయ్యే వరకు వేడి వాతావరణమే ఉంటున్నందున, ధనియాలు మొలకెత్తి, పెరగడానికి పాక్షికంగా నీడ/ఎండ ఉండి, నీటి లభ్యత ఉన్న ప్రాంతాలు కొత్తిమీర సాగుకు అనుకూలం. మొక్కజొన్నలో అంతర పంటగా పందిరి కూరగాయల పొలాల్లో, మామిడి, మునగ, కొబ్బరి మొదలగు తోట పంటల్లోని ఖాళీ జాగాల్లో, పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లు, షేడ్‌నెట్ల క్రింద, చెట్ల కొమ్మలతో ఏర్పాటు చేసిన పందిర్ల క్రింద, కొత్తిమీర సాగు చేసి జూన్‌లో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. జూన్‌లో కూడా చల్లగా ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో, తక్కువ వర్షపాతం పడే ప్రాంతాల్లో (అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో) కొత్తిమీరను అనుకూలంగా పండించి, ఇతర ప్రాంతాలకు పంపవచ్చు. ఈ నెలలో అత్యధిక వర్షపాతమున్న ప్రాంతాల్లో జూన్‌లో విత్తినపుడు కొత్తిమీర దెబ్బతినే అవకాశముంది.
ఫ్రెంచిచిక్కుడు: ఈ పంటకూడా కొత్తిమీర లాగానే, అధిక ఎండను, వేడిని తట్టుకోలేదు. కనుక పాక్షిక ఎండ/నీడ ఉన్న ప్రదేశాలలో ఈ పంటను పండించి, అధిక ధరను పొందే వీలుంది.
ఆకుకూరలు: వర్షాధారంగా వచ్చే ఆకుకూరలు జూలై 3వ వారం నుండి ఎక్కువగా ఉంటాయి. ఆలోపు చేతికొచ్చే ఆకుకూరలకు ఎక్కువ ధర పొందవచ్చు. వీటిని ఎండలకు కూడా పండించవచ్చు. తక్కువ పొలంలో, తక్కువ నీటితో మంచి లాభాలు పొందవచ్చు. పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర, పొన్నగంటి కూర, కొయ్యగూర, సోయకూర, గంగవాయిలాకు మొదలైనవి.
సిరిధాన్యాలతో పాలకూర, తోటకూర, పొన్నగంటికూర, కొయ్యగూర, గంగవాయిలాకు మొదలగు ఆకుకూరలను కలిపి వండుకోవచ్చు. తక్కువ క్యాలరీలు కలిగి, ఎక్కువ బల్క్ ఉన్న ఆహారం తయారవుతుంది. దీనిని తినే దాని వలన మధుమేహాన్ని సులభంగా కంట్రోల్‌లో ఉంచవచ్చు. ఆచరించిన అనుభవంతో తెలుపుతున్నాను. మధుమేహగ్రస్తులు అలవాటుపడితే ఆకుకూరలకు విపరీతమైన గిరాకీ ఏర్పడవచ్చు. ఖచ్చితంగా సుగర్ వ్యాధి అదుపులోకొస్తుంది. రైతులు పండించిన ఆకుకూరలకు మంచిధర రావడం జరుగుతుంది. అన్నికాలాల్లో దొరికే ఆకుకూరలు (ముఖ్యంగా చప్పగా ఉన్న ఆకుకూరలు) సిరిధాన్యాల బియ్యంతో కలిపి వండుకోవడం కూడా చాలా సులభం. మధుమేహాన్ని చాలావరకు ప్రపంచం నుండి తరిమికొట్టవచ్చు. మధుమేహపు మందులను మానేయవచ్చు. ఆచరించి చూడండి. వివరాలకు 94944 08619 కు ఫోన్ చేయవచ్చు.
సిరిధాన్యాలు: కొర్రలు, ఆరికలు, సామలు, ఊదలు, అండుకొర్రలు విత్తడానికి జూన్ నెల కూడా అనుకూలమే. వర్షాధారంగా, రసాయనిక ఎరువులు వాడకుండా పండించిన ఈ పంటలకు అత్యధిక ధర ఇచ్చి రైతుల వద్దకే వచ్చి కొనుక్కెళ్లే వాళ్లున్నారు. ఈ విధంగా పండిస్తున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకునే అవకాశం బాగుంది. వాట్సాప్ ఖర్చు లేకుండా అందుబాటులో ఉంది.
కూరగాయలు: పలు కూరగాయ పంటలను జూన్ మొదటి నుండి విత్తుకోవచ్చు. భూమిలో తడిలేకపోతే నీరు పెట్టాల్సుంటుంది. వర్షం పుష్కలంగా పడితే, తేమ అనుకూలంగా ఉన్నపుడు విత్తుకోవచ్చు. కూరగాయల ఎగుమతులను విపరీతంగా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బెండ: జూన్‌లో విత్తవచ్చు. విత్తిన 45 రోజుల్లో తొలి కోత మొదలుపెట్టవచ్చు. సులభంగా పంట తీసుకోవచ్చు. సొంత విత్తులను నాటితే ఖర్చు తక్కువ. అత్యధిక దిగుబడులనిచ్చే రకాలు, హైబ్రిడ్‌లు మార్కెట్లో దండిగా దొరుకుతున్నాయి. ఎక్స్పోర్ట్‌కు అనుకూలాలు మెండు. ఎగుమతికనువైన రకాలు: వర్ష, విశాల్, నాథ్‌శోభ, పంజాబ్ పద్మిని.
వంగ: వర్షాకాలంలో నారు పోయడానికి జూన్-జూలై నెలలు అనుకూలం. 30-35 రోజుల నారు నాటవచ్చు. ఏ ప్రాంతానికి అనువైన రకాలను ఆ ప్రాంతంలో సాగు చేసి, మంచి ధర పొందవచ్చు. దేశవాళీ రకాలను, సొంత విత్తనాలను, ఆర్గానిక్ పద్ధతి ద్వారా పెంచి, సోషల్ మాధ్యమం ద్వారా ప్రచారం చేసుకుంటే ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చు. ఖర్చు తక్కువ. తప్పుడు ప్రచారం చేసుకుంటే అది బెడిసికొట్టి ఆ మనిషికి విలువ లేకుండా చేస్తుంది.అనుకూలమైన రకాలు: కోస్తాఆంధ్ర: పూసాపర్పుల్ క్లస్టర్, పూసాక్రాంతి, గులాబి; రాయలసీమ: రాయదుర్గం, పోలూరు వంగ, అర్కకుసుమాకర్; తెలంగాణ: శ్యామల, దేశవాళీ పచ్చ వంగ రకాలు, పూసా పర్పుల్ క్లస్టర్, పూసాక్రాంతి.
గోరుచిక్కుడు: వర్షాధారంగా పండించే మొండిజాతి పంట. నీటిఎద్దడిని, చీడపీడలను చాలావరకు తట్టుకుంటుంది. నీటి ఆధారంగా కూడా పండించి అధిక దిగుబడులు పొందవచ్చు. జూన్-జూలై నెలల్లో విత్తి అధిక దిగుబడి పొందవచ్చు. పశువుల దాణాగా, పచ్చిమేతగా, పచ్చిరొట్ట ఎరువుగా, దీని గింజలు గమ్ తయారీకి పనికొస్తాయి. లేత కాయలు, కూరగాయగా వాడుతారు. జూన్-జూలైలో విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: పూసామౌసమి, పూసాసదాబహార్, పూసానవబహార్, గౌరి.
పూలు: బంతి: ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. జూన్ రెండవ వారంలో నారు పోసుకుని, జూలై రెండవ వారంలో నాటడం అనుకూలం. మార్కెట్‌కు అక్టోబరులో తయారవుతుంది. పండుగకు అందివ్వాలంటే సుమారు 60 రోజులు ముందుగా నాటుకోవాలి.
గులాబి: జూన్ నుండి జనవరి వరకు నాటుకోవచ్చు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నాటడం అత్యంత అనుకూలం. హైబ్రిడ్ టీస్: పింక్ పాంథర్, ఆదిత్య, రక్తిమ; ఫ్లోరిబండాస్: ఆకాష్‌దీప్, రెడ్ ట్రెంప్, ల్యూటిన్; మినియేచర్: బేబి చాక్లెట్, ప్రీతి.
మల్లె: వర్షాకాలం ప్రారంభంలో జూన్-జూలైలో వేర్లు వచ్చిన పిలక మొక్కలు నాటాలి. గుండుమల్లెను 5þ5, జాజిమల్లెను 7þ7, కాగడమల్లెను 6þ5 అడుగుల ఎడంలో నాటాలి.
కనకాంబరం: మే-జూన్ నెలల్లో నారుపెంచి, ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ప్రధాన పొలంలో 60þ30 సెం.మీ. దూరంలో నాటాలి. సంవత్సరమంతా పూస్తుంది. చలికాలం, వేసవిలలో పూలదిగుబడి ఎక్కువ. వర్షాకాలంలో దిగుబడి తగ్గుతుంది.
వరి: భారతావనిలో వరి పంట దిగుబడి అవసరాల కంటే ఎక్కువైనందున ఈ పంటకు ప్రభుత్వాల ప్రోత్సాహం తగ్గుతున్నది. వరి తప్ప ఇతర పంటలు వేయలేని ఊటభూములు, కాలువల క్రింద, లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే పండించడం మంచిది. ఇంటి వాడకానికి, ఆర్గానిక్ పద్ధతిలో పంట పెట్టుకోవచ్చు. అధిక దిగుబడులకు జూన్‌లో ఎంత ముందుగా వీలయితే అంతముందుగా విత్తడం పూర్తి చేయండి. నాటు పెట్టడం కూడా నీటి లభ్యత ఉంటే, ఎంత లేత నారు నాటితే అంత దిగుబడులు పెరుగుతాయి. నీటి లభ్యత సరిగా లేనిచోట, నీటి లబ్యత మెరుగైన తర్వాతనే నారు పోయుట, నాటుట చేపట్టాల్సుంటుంది. ప్రభుత్వ ప్రొక్యూర్మెంటుపై ఆధారపడకుండా, స్వంతంగా మార్కెట్ చేసుకున్నా, గిరాకీ ఉన్న రకాలనే ఎంపిక చేసుకొని సాగు చేయడం బాధలను తగ్గిస్తుంది.
ప్రత్తి: చైనా నుండి దిగుమతులను కట్టడి చేయడం వలన, గులాబి రంగు పురుగు ఉధృతి ఎక్కువైనందున, దిగుబడి తగ్గినందున మార్కెట్‌లో ప్రత్తికి మంచి డిమాండ్ ఉంది. క్వింటాలు ప్రత్తి రూ. 10-12 వేలు పలుకుతున్నది. మంచి ప్రోత్సాహమున్నందున ఈ పంటను రైతులు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు. పూర్తిగా నమ్మకమైన డీలర్ల దగ్గర నమ్మకంగా క్రితం సంవత్సరంలో బాగా పండిన, గిరాకీ ఉన్న రకాలనే పండించండి. కొత్త రకాలు వేయాలనుకునేవాళ్లు, కొద్ది విస్తీర్ణంలో పరీక్షించి బాగా పండితే తదుపరి సంవత్సరం, అదే రకాన్ని ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టవచ్చు. అధిక సాంద్రత విధానంలో ప్రత్తిని పండించి, అధిక దిగుబడి పొందవచ్చు. ఈ విధానంలో ప్రత్తి పంట త్వరగా పూర్తవుతుంది. ప్రత్తి తర్వాత శనగ, పెసర, మినుము, నువ్వులు, వేరుశనగ పంటలను పెట్టుకోవచ్చు. అధిక సాంద్రత విధానాన్ని వర్షాధారంగాను, నీటితడులిచ్చి కూడా చేపట్టవచ్చు.
వేరుశనగ: జూన్ రెండవ పక్షం నుండి జూలై మొదటి వారంలోపు విత్తి అత్యధిక దిగుబడులు పొందవచ్చు. వేరుశనగ గింజలు పెద్దగా ఉండడం వలన, మొలకెత్తడానికి భూమిలో తగినంత తేమ అవసరం. జూలై మొదటి వారం తర్వాత ఎంత నిదానించి విత్తితే అంత దిగుబడి తగ్గుతుంది. కదిరి లేపాక్షి (కె-1812) బాగా దిగుబడినిస్తున్నప్పటికి కన్ఫెక్షనరీ (గింజలతో తయారైన పదార్థాలు) తయారీదారులు, దీని వాడకానికి ఇష్టపడుట లేదు. ఇందులో వగరు ఉండుట కారణమంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వారు రూపొందించిన టి.సి.జి.ఎస్-1694 గట్టి, కమ్మటి, లావుగింజలు, సమానమైన సైజుగల గింజలు కలిగి, అత్యధిక దిగుబడులను సైతం ఇస్తున్నది. దీనిని ప్రాచుర్యంలోకి తేవ డానికి, విరివిగా విత్తనోత్పత్తి చేపట్టవచ్చు.
ప్రతి పల్లె / జనావాసంలో రైతు ప్రజాసంఘాలు-రైతుల సత్వర ప్రగతికి సోపానాలు. పల్లెలోని ప్రజలంతా పెట్టుబడి పెడితే, ఆ పెట్టుబడి ముఖ్యంగా డబ్బులతో ఎక్కువ ఇబ్బందిపడే రైతులకు తక్కువ వడ్డీకే అప్పుగా దొరికితే, రైతుల అభివృద్ధి త్వరగా జరుగుతుంది. అందుకే ప్రతి పల్లె / జనావాసంలో రైతు ప్రజా సంఘాలు ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వానికి ప్రపోజల్ పంపండం జరిగింది. వీటి వలన రైతులు, ప్రజలు అందరు అన్ని విధాలా అభివృద్ధి (ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్) సాధించడానికి వీలవుతుంది. ఏం చేస్తే పల్లె ప్రజలు బాగా అభివృద్ధి సాధిస్తారో ఈ సంఘాల నాయకులు తీర్మానాల రూపంలో తెలుపుతారు. వారికి నచ్చిన విధంగా, వారి అభివృద్ధి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి, ప్రభుత్వం నుండి, వివిధ పార్టీల నుండి ప్రోత్సాహం లభిస్తే ప్రజలందరి సమగ్ర అభివృద్ధి సత్వరంగా జరగడానికి వీలవుతుంది. ఎఫ్.పి.ఓ.ల ఫెయిల్యూర్‌లను నివారించడానికి కూడా ఈ సంఘాలు బాగా పని చేస్తున్నాయి.
పలు పంటలపైన, ప్రజలందరి సత్వర, సమగ్ర అభివృద్ధిపైన వివరంగా తెలుసుకోగోరువారు 9494408619 కు ఫోను చేయవచ్చు. ఫేస్‌బుక్‌లో SALLA NARAYANASWAMY/Profsnswamy అకౌంట్లలో ఫొటోలతో కూడిన వివరణలను చూడవచ్చు. రైతులకు సలహాలు, సూచనలు ఉచితం.
ప్రణాళికతో ముందుకు సాగితే ఏ రంగంలో అయినా మంచి ఫలితాలు రాబట్టవచ్చు. మట్టి, నీరు, శ్రమతో సాగే వ్యవసాయంలోను ఎక్కువ రాబడి సాధించాలంటే సమగ్ర ప్రణాళిక, ఆచరణ కీలకం. ఈ సూత్రాల ఆధారంగానే.. పంటల సాగులో వైవిధ్యాన్ని, క్రమ పద్ధతిని పాటిస్తూ ఆదాయ సిరులు అందుకుంటున్నారు… రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం, లాలపేట్ గ్రామానికి చెందిన నేమూరి విష్ణువర్దన్ రెడ్డి. పాత్రికేయుడిగా సమాజాన్ని చైతన్యం పరుస్తూనే సహజ సేద్యం చేస్తూ తోటి కర్షకులకి ఆదర్శంగా నిలుస్తున్నారు. 18 ఎకరాల వ్యవసాయంలో ఇప్పటి వరకు అనేక రకాల పంటలు పండించారు. దేశీయ వరి సాగులో అధిగ దిగుబడులు సాధించారు. కొర్రలు, అండు కొర్రలు, పచ్చ జొన్నలు వంటి చిరుధాన్యాలను వైవిధ్యంగా సాగుచేశారు. కూరగాయలు పండించారు. ఇలా ప్రకృతి సేద్య విధానాలు, భిన్న పంటలు, స్వీయ మార్కెటింగ్ తో సేద్యంలోనే ఏటా రూ. 10 లక్షల ఆదాయం ఆర్జించవచ్చని నిరూపించారు. బహుళ పంటలపై ఆసక్తితో ఇదే వ్యవసాయ క్షేత్రంలో 5 లేయర్ సాగు విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారీ.. కలం పట్టిన హలం శ్రామికుడు.
విష్ణువర్దన్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబం. పదో తరగతి పూర్తయ్యాక వ్యవసాయంలో తండ్రికి తోడయ్యారు. సేద్యపు పనులు చేస్తూనే షాద్ నగర్ లో ఇంటర్మీడియెట్ చదివారు. దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. వ్యవసాయాన్ని కొనసాగిస్తూనే.. పాత్రికేయంపై ఇష్టంతో కలం పట్టారు. ప్రింట్ మీడియా జర్నలిస్టుగా అక్షర సేద్యం మొదలుపెట్టారు. ఇలా ఏకకాలంలో అటు రైతుగా, ఇటు పాత్రికేయుడిగా రాణించారు. వ్యవసాయం, లాభసాటి విధానాలు, పంటల యాజమాన్యంలో మేలైన పద్ధతులపై అనేక ఆర్టికల్స్ రాశారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న సమయంలో విష్ణు వర్దన్ తండ్రి క్యాన్సర్ బారిన పడి కన్నుమూశారు. పాత్రికేయుడిగా ఆహారం – ఆరోగ్యంపై ఉన్న అవగాహనతో తన తండ్రి అనారోగ్యానికి రసాయన వ్యవసాయమే కారణమని తెలుసుకున్నారు. తన తండ్రిని తమ నుంచి దూరం చేసిన క్యాన్సర్ భూతం.. మరొక కుటుంబంలో విషాదం నింపకుండా అడ్డుకోవాలని సంకల్పించారు. ఇందుకు ప్రకృతి వ్యవసాయమే ఉత్తమ విధానమని తెలుసుకుని.. శ్రీ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యారు. అలా తెలుసుకున్న విషయాలతో సహజ సేద్యం ప్రారంభించారు. 2017లో ముచ్చింతల్ లో జరిగిన పాలేకర్ 9 రోజుల శిక్షణా తరగతులకు హాజరై.. ప్రకృతి వ్యవసాయంలో సమగ్ర విషయాలను అవగతం చేసుకున్నారు. రెండు దేశీయ జాతి ఆవులను పోషిస్తూ 18 ఎకరాల్లో అన్ని పంటలను రసాయన రహితంగా, పూర్తి సహజంగా పండించడం మొదలు పెట్టారు. ఇందులో 9 ఎకరాల్లో ఏడాదికి 3 పంటలు తీసే సాగు విధానాలను పాటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. కేవలం ఒక పంటకు కట్టుబడి ఉంటే , మార్కెట్ ఒడిదుడుకులు.. ప్రకృతి ప్రతికూలతలను తట్టుకోవడం రైతుకి కష్టంగా మారుతుంది అంటారు.. రైతు విష్ణు వర్దన్ రెడ్డి. ప్రధాన పంటకు తోడుగా అంతర పంటలు సాగు చేస్తే .. ఒకదాంట్లో నష్టపోయినా, ఇంకొక్కటి గట్టెక్కిస్తుందని చెబుతారు. రైతు అంటే నష్టాలు, ఆత్మహత్యలు అనే మాటలు వినిపిస్తోన్న తరుణంలో వ్యవసాయ విధానంలో మార్పుతోనే ఆ పరిస్థితులను అధిగమించవచ్చని అంటున్నారు… ఈ ప్రకృతి రైతు.
పంటల సాగులో వైవిధ్యం ..
ముత్తాతలు, తాతలు వ్యవసాయం చేసే రోజుల్లో నేలలు సారవంతంగా ఉండేవి. వారు పాటించిన వ్యవసాయ పద్ధతులు అలాంటివి మరి. హరిత విప్లవం తర్వాత వచ్చిన మార్పులతో రసాయన ఎరువులు వినియోగం పెరిగింది. దిగుబడులపైనే దృష్టితో భూసారం తగ్గింది. అలాంటి నేలల్లో తిరిగి మళ్లీ పూర్వ వ్యవసాయ విధానాలు పాటించాలంటే.. ముందుగా నేలలో కర్బణ శాతం పెంచాలని నిర్ణయించుకున్నారు విష్ణు వర్దన్ రెడ్డి. పశువులు, గొర్రెలు – మేకల ఎరువు పోశారు. పచ్చిరొట్ట పైర్లు పెంచి కలియదున్నారు. సొంతంగా ఆవులు పెంచి వాటి ద్వారా వచ్చే మూత్రం, పేడతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసి నేలకు అందించారు. ఇలా నెమ్మదిగా భూసారం పెంచి.. తర్వాత పంటలపై దృష్టి సారించారు. ఉన్నది ఒకే బోరు. నిత్యం తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి మొదటికే మోసం వస్తుంది. అందుకే… కేవలం ఒక్క వరి పంటకే పరిమితం కాకుండా పంటల వైవిధ్యాన్ని పాటిస్తున్నారు. దేశవాలి వరి రకాలైన కృష్ణవ్రీహి, బ్లాక్ రైస్ సాగు చేస్తున్నారు. తెలంగాణ సోనా కూడా పండిస్తున్నారు. వీటితో పాటే అతి తక్కువ నీరు అవసరమైన చిరుధాన్య పంటలు కొర్రలు, అండు కొర్రలు, పచ్చ జొన్నలు… అంతర పంటలుగా కందులు, పప్పు శనగలు సాగు చేస్తున్నారు.
”చిరుధాన్యాలు 6 ఎకరాల్లో సాగు చేస్తాను. కొర్రలు రెండు రకాలు పండిస్తాను. ఎకరాకు మూడున్నర కిలోల విత్తనాలు అవసరమవుతాయి. వెదజల్లే పద్ధతిలో కలుపు తీయడం సమస్యగా ఉంటుందని, సాళ్ల పద్ధతిలో హై డెన్సిటీ విధానంలో విత్తుతాము. సాలుకి సాలుకి మధ్య ఫీటు దూరం పాటిస్తాము. తద్వారా అంతర కృషి చేసుకోవడానికి వీలవుతుంది. కొర్రలు, అండు కొర్రల్లో.. ఆరు సాళ్ల మధ్య ఒక సాలు కంది సాగు చేస్తాను. ఇది ఆరు నెలల పంట. చిరుధాన్య పంటలు 3 నెలల్లో కోతకు వస్తాయి. ఆ తర్వాత వాటి స్థానంలో పప్పు శనగ సాగు చేస్తాను. ఇది స్వల్పికాలిక పంటే కాబట్టి, కంది.. శనగ రెండు ఒకేసారి చేతికొస్తాయి. ఆ తర్వాత వేసవిలో కూరగాయలు పండిస్తుంటాను. ఇలా ఏడాదికి 3 పంటల సాగులో సాగుతుంటాను. కొర్రలు, అండు కొర్రల పంటలకు పిచ్చుకలు ఎక్కువగా వస్తాయి. డాక్టర్ ఖాదర్ వలి చెప్పినట్లుగానే మేము ఆ పిచ్చకులను తరమలేదు. అవి వచ్చి పంటపై ఏమైనా పురుగులు ఉంటే ముందు వాటిని తింటాయి. అలాగే పొలాల్లోనే రెట్ట వేస్తాయి. కంకుల మీద కొన్ని గింజలు తిన్నా.. పకక్షులు రావడం ద్వారా వచ్చే నష్టం కంటే కలిగే మేలే ఎక్కువ అని నేను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నాను. ఎకరానికి గరిష్ఠంగా కొర్రలు 8 క్వింటాళ్లు, అండుకొర్రలు 12 క్వింటాళ్లు వచ్చాయి. పచ్చ జొన్న ఎకరానికి 10 క్వింటాళ్లు వచ్చాయి. జొన్నలను ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి… ఈ పంట కోయక ముందే ఊరి వాళ్లే కొనుగోలు చేస్తారు. కొర్రలు, అండు కొర్రలు మార్కెట్‌లో మంచి ధరకే అమ్మాను. ఇక 3 ఎకరాల్లో దేశవాలి వరి పండించి, మార్కెట్‌లో మంచి ధరకే విక్రయిస్తుంటాను. ఉన్న కొద్ది పాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటు.. ఏడాదికి 3 పంటలు పండిస్తు వ్యవసాయంలో మంచి లాభాలు పొందుతున్నానని” సగర్వంగా చెబుతున్నారు ప్రాకృతిక వ్యవసాయ రైతు విష్ణువర్ధన్‌రెడ్డి.
కాలానికి అనుగుణంగా మార్పు అవసరం. వ్యవసాయానికి ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒకప్పుడు ఒక మోడల్ మంచి ఆదాయం ఇచ్చింది కదా అని ఎప్పుడూ విధానాన్ని పాటించలేం. పద్ధతుల్లో కొద్దిగా మార్పులు చేసుకుని, అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటే లాభాలు ఢోకా ఉండదంటారీ ప్రకృతి రైతు. ఇన్నాళ్లూ చిరుధాన్యాలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, వరి, ఉల్లిగడ్డ ఎక్కువగా సాగు చేసిన ఈ రైతు.. ఇప్పుడు సుభాష్ పాలేకర్ 5 లేయర్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 10 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో ఎన్నో విజయాలను అందుకుని తోటి రైతులకి స్ఫూర్తిగా నిలిచిన విష్ణవర్ధన్ 5 లేయర్ సాగులోను అద్భుత ఫలితాలు సాధిస్తారని రైతునేస్తం ఆశిస్తోంది. మరిన్ని వివరాలకు విష్ణువర్థన్‌రెడ్డిని ఫోన్ 95025 53483 ద్వారా సంప్రదించగలరు.
ఏడాదికి రూ. 10 లక్షల నికర ఆదాయం : విష్ణు వర్దన్ రెడ్డి
రసాయన ఎరువులు, పురుగు మందులతో వ్యవసాయం చేసిన రోజుల్లో ఎంత పంట పండినా లాభం మిగిలేది కాదు. పెట్టుబడి అలా ఉండేది. ప్రకృతి వ్యవసాయంలోకి దిగాక, నావరకు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెట్టుబడి ఎకరానికి రూ. 20 వేలు మించడం లేదు. నేను పండించిన వరి, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలకు మార్కెట్‌లో మంచి రేటు వస్తోంది. పంటల సాగులో వైవిధ్యం పాటించడం ద్వారా ఏడాదికి ఖర్చులన్నీ పోను రూ. 10 లక్షల వరకు నికర ఆదాయం అందుకోగలిగాను. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతోనే నా ఇద్దరు కొడుకులని అమెరికాలో చదివించగలిగాను. ఇప్పుడు వారిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసి అమెరికాలోనే స్థిరపడ్డారు. ఒక రైతుగా ఇంతకంటే ఆనందం ఏముంటుంది. ఈ పదేళ్ల ప్రకృతి వ్యవసాయంలో అనేక పంటలు పండించాను. వరి, ఉల్లిగడ్డ, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు సాగు చేశాను. పంటల ఎంపికలో నిత్యం మార్పులు చేస్తూనే ఉంటాను. రైతులు ఎప్పుడు ఒకే పంట వేయకూడదు. ప్రధాన పంటకు తోడుగా అంతర పంటలు సాగు చేయాలి. ఉన్న వ్యవసాయ భూమి ద్వారా ప్రతి నెలా ఆదాయం వచ్చేలా ప్రణాళికబద్దంగా ముందుకు సాగాలి. ఆవులు పెంచాలి. గో మూత్రం, పేడ వ్యవసాయంలో ఉపయోగించాలి. ముఖ్యంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగానికి స్వస్తిపలకాలి. సొంతంగా కషాయాలు, మిశ్రమాలు తయారు చేసుకోవాలి. చీడ పీడల నివారణకు ప్రకృతిలోనే అనే పరిష్కారాలు ఉన్నాయి. వాటిపై అవగాహన పెంచుకొని, క్రమంగా పాటస్తే వ్యవసాయంలో పెట్టుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. మన పంటలు తిన్న ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. వెరసి, రైతుగా మనకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యాన్ని పంచామన్న ఆత్మ సంతృప్తి దక్కుతాయి.
మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఎక్కువగా వర్షంపై ఆధారపడి ఉంటుంది. అందువలన రైతులు ఖరీఫ్‌లో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేస్తారు. ఖరీఫ్‌లో సాగు చేసినప్పుడు, వివిధ చీడ పురుగులు పంటలని ఆశించి నష్టం కలుగచేస్తాయి. వీటి నివారణకి కేవలం పంటకాలంలో రసాయనిక మందులపైనే ఆధారపడకుండా, ముందు జాగ్రత్తగా కొన్ని సస్యరక్షణ చర్యలు వేసవిలో చేపట్టినట్లయితే ఖరీఫ్‌లో వచ్చే చీడపురుగులు కొంతవరకు అదుపులో ఉంచవచ్చు.
పంటల అవశేషాలను తొలగించాలి: ఇంతకు ముందు సాగు చేసిన పంట అవశేషాలను పూర్తిగా తొలగించడం వలన కొన్ని పురుగులు కోశస్థథలను నాశనం చేసి, తర్వాత సాగు చేసే పంటకి ఈ పురుగులు ఆశించకుండా చేయవచ్చు. ప్రత్తిలో చివరిసారి ప్రత్తిని ఏరిన తర్వాత మిగిలిపోయిన, గులాబిరంగు కాయతొలుచు పురుగు ఆశించిన పచ్చికాయలను తినడానికి మేకలను / గొర్రెలను చేలల్లో మేపాలి.
ఉదా: వరిలో ప్రధానమైన కాండము తొలిచే పురుగును, ప్రత్తిలో గులాబిరంగు కాయతొలచు పురుగును పంటల అవశేషాలను తొలగించడం వలన నియంత్రించవచ్చు.
వేసవి దుక్కులు: పంటలను కోసిన తర్వాత మే నెలలో వర్షాలు పడగానే లేదా జూన్‌లో తొలకరి వర్షాలు పడగానే లోతుగా పొలాన్ని దున్నాలి. లోతుగా దుక్కులు చేసుకున్నట్లయితే ముఖ్యంగా భూమిలోపల ఉండే పురుగుల కోశస్థథలు, కొన్నింటి పిల్లపురుగు థలు బయటపడి ఎండతాకిడికి/పకక్షులతాకిడికి గురై చనిపోతాయి. దీనివలన తర్వాత పంట కాలంలో వీటి ఉధృతి తక్కువగా ఉండేటట్లు చేయవచ్చు.
ఉదా:
వరిలో కాండంతొలుచు, రెల్ల రాల్చు, లద్దె పురుగులు
ప్రత్తిలో పొగాకు లద్దె, శనగపచ్చ, మచ్చల కాయ తొలుచు పురుగులు
మిరప, టమాట, బెండలో కాయతొలుచు పురుగులు
వేరుశనగ పంటలో ఎర్రగొంగళి, శనగపచ్చ, పొగాకు లద్దె పురుగులు
గుమ్మడి, బీర, దొండ, కాకర, పొట్లకాయ పంటలలో పండు ఈగ
కలుపు మొక్కలను తొలగించుట: చాలా రకాల పురుగులు ఒకే పంటపైనే కాకుండా ఇతర మొక్కలపైన (కలుపు మొక్కలు) కూడా ఉంటూ వాటి మనుగడ సాగిస్తాయి. ముఖ్యంగా కలుపు మొక్కలను ఆశించి, పురుగులు పంటలు విత్తుకోగానే వాటిని ఆశించి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. అందువలన వేసవిలో ముఖ్యంగా పంటలు విత్తుకునే ముందే కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
ఉదా:
వరి పంటను సాగు చేసే ముందు గరిక, తుంగ మొదలగు కలుపు మొక్కలను లేకుండా చేయడం ద్వారా వరిలో ప్రధానమైన ఉల్లికోడు, ఆకు ముడత, కంకినల్లి మొదలగు పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు.
ప్రత్తిలో వయ్యారిభామ, తుత్తురు బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చేయడం ద్వారా పిండినల్లి సమస్యను తగ్గించవచ్చు.
పొలం గట్ల మీద, గట్ల ప్రక్కన కలుపు మొక్కలు లేకుండా చేయడం ద్వారా ఎలుకల సమస్యను తగ్గించవచ్చు. ఎలుకల నివారణకి రైతులందరూ సామూహికంగా నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఫలితం ఉంటుంది.
పంటకాలాన్ని పొడిగించుట: నీటివసతి సౌకర్యం ఉన్నప్పటికీ, కొన్ని రకాల పంటలను కాలపరిమితికి మించి సాగు చేయకూడదు. ఉదాహరణకి ప్రత్తిలో పంటకాలాన్ని పొడిగించినట్లయితే లేదా కార్శి పంటగా సాగు చేసినట్లయితే, ప్రత్తిలో ప్రధానమైన గులాబిరంగు, కాయతొలిచే పురుగు సమస్య తర్వాత పంటలో చాలా తీవ్రంగా ఉండి నష్టం ఎక్కువగా ఉంటుంది.
పంట విత్తే సమయము – ప్రణాళిక తయారీ: చాలా పంటలలో, పంటను ఆలస్యంగా విత్తినట్లయితే పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. కావున పంటలను నిర్ధేశించిన సమయంలోనే విత్తుకొనే విధంగా ప్రణాళికను ముందుగానే తయారు చేసుకోవాలి.
పైన చెప్పిన పద్ధతులను రైతులు ముందస్తు చర్యగా వేసవిలో పాటించినట్లయితే, రాబోవు ఖరీఫ్ సాగు కాలంలో వివిధ చీడపురుగుల ఉధృతి నష్టపరిమితి స్థాయిలోపు ఉండి, ఉధృతి మరింత పెరగకుండా చేయవచ్చును. తద్వారా రసాయన పురుగు మందుల పిచికారి ఖర్చు తగ్గించి అధిక నికరాదాయం పొందటానికి ఆస్కారం ఉంటుంది.
వేపగింజల కషాయం తయారీ
వర్షాకాలంలో సాగు చేసే పంటలపై ఆశించే చీడ పురుగుల నివారణకి వాడుకొనుటకు గాను, వేపగింజలను ముందుగానే సమీకరించుకొని ఎండబెట్టుకోవాలి. వీటి నుంచి వేపగింజల కషాయం తయారు చేసుకొని పురుగులు ఆశించిన తొలిథలో పిచికారి చేసుకోవచ్చు. ఆఖరి దుక్కిలో వేప చెక్కను వేసినట్లయితే పసుపులో దుంపఈగ, మిరపలో నులిపురుగులను నియంత్రించవచ్చు.
గుమ్ముడాల యశస్విని,
డి. సాయిచరణ్,
కూసరి సుప్రియ,
ఈర్ల స్రవంతి,
బి. మాధురి,
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం,
ఆఫ్ సీజన్‌లో పంటల సాగును ఎలా చేస్తారు. ఇది ప్రధానంగా వేసవిలో తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు పంట ఉత్పాదకత చాలా కష్టంగా ఉంటుంది. ఫలితంగా, పాలీహౌస్ లేదా రక్షిత సాగు ద్వారా పంటలు పండించవచ్చు. పాలీహౌస్ వ్యవసాయం అనేది అధిక-విలువైన, ప్రత్యేకమైన పంటల యొక్క ప్రత్యేక, నియంత్రిత పర్యావరణ సాగు, అధిక మార్కెట్ ధరలను పొందవచ్చు (కత్తిరించిన పూలు, ఆఫ్-సీజన్‌లో పండించిన కూరగాయలు, తక్కువ-సీజన్ ఆకుకూరలు, మైక్రోగ్రీన్‌లు మొదలైనవి). గ్రీన్‌హౌస్‌లో పండించిన పండ్లకు ప్రజలు అధిక ధరలను చెల్లించగలరు కాబట్టి, మీరు అధిక-స్థాయి వినియోగదారులకు ఆరోగ్యకరమైన, పురుగుమందులు లేని తాజా ఉత్పత్తులను పండించి అందించవచ్చు.
భారతదేశంలో, పాలీహౌస్ వ్యవసాయం నెమ్మదిగా ప్రజాదరణ పొందుతోంది. పాలీహౌస్ వ్యవసాయం రైతుకు చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే, చాలా మందికి పాలీహౌస్ లేదా గ్రీన్‌హౌస్ అంటే ఏమిటో తెలియదు, కాబట్టి ఈ ఆర్టికల్‌లో, పాలీహౌస్‌లు మరియు దాని ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదాన్ని మేము వివరిస్తాము. పాలీహౌస్ అంటే ఏమిటి?
పాలీహౌస్, తరచుగా గ్రీన్‌హౌస్ అని పిలుస్తారు, ఇది గాజు లేదా పాలిథిలిన్ వంటి పదార్థాలతో నిర్మించిన భవనం లేదా నిర్మాణం, దీనిలో మొక్కలు నియంత్రిత పర్యావరణ పరిస్థితులలో పెరుగుతాయి మరియు అభివృద్ధి చెందుతాయి. నిర్మాణం యొక్క పరిమాణం డిమాండ్‌ను బట్టి చిన్న గుడిసెల నుండి పెద్ద నిర్మాణాల వరకు ఉంటుంది. అన్నింటికంటే మించి, గ్రీన్‌హౌస్ అనేది ఒక గాజు నిర్మాణం, దీని ఇంటీరియర్‌లు సూర్యరశ్మికి గురైనప్పుడు వేడెక్కుతాయి, ఎందుకంటే నిర్మాణం గ్రీన్‌హౌస్ వాయువు బయటకు రాకుండా చేస్తుంది. బయట గడ్డకట్టే సమయంలో, మొక్కలు జీవించడానికి లోపల ఉష్ణోగ్రత తగినంత వెచ్చగా ఉంటుంది. గ్రీన్‌హౌస్, పాలీహౌస్ ఫార్మింగ్ మధ్య వ్యత్యాసం:
పాలీహౌస్ అనేది ఒక రకమైన గ్రీన్‌హౌస్ లేదా మరొక విధంగా చెప్పాలంటే, పాలిథిలిన్ కవర్‌తో కూడిన గ్రీన్‌హౌస్ యొక్క చిన్న వెర్షన్. చవకైన నిర్మాణ ఖర్చులు మరియు నిర్వహణ సౌలభ్యం కారణంగా పాలీహౌస్ వ్యవసాయం భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక ప్రముఖ గ్రీన్‌హౌస్ పద్ధతి. పాలీహౌస్‌లో పండే పంటలు:
* కార్నేషన్, జెర్బెరా మరియు ఆర్చిడ్ వంటి పువ్వులను కూడా సులభంగా పెంచవచ్చు పాలీహౌస్ వ్యవసాయం యొక్క ప్రయోజనాలు:
ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ఇష్టపడే రైతులకు పాలీహౌస్ ఎంతో మేలు చేస్తుంది. పాలీహౌస్ యొక్క కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:
* మొక్కలను నియంత్రిత ఉష్ణోగ్రతలో పెంచడం వల్ల పంట నష్టం లేదా నష్టం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
* మీరు ఏడాది పొడవునా పంటలను పండించవచ్చు మరియు ఏదైనా నిర్దిష్ట సీజన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.
* పాలీహౌస్‌లో తెగుళ్లు మరియు కీటకాలు తక్కువగా ఉంటాయి.
* బాహ్య వాతావరణం పంటల పెరుగుదలపై ఎలాంటి ప్రభావం చూపదు.
* పాలీహౌస్‌లో ఉత్పత్తి యొక్క నాణ్యత స్పష్టంగా ఎక్కువగా ఉంటుంది.
* పాలీహౌస్‌లో అలంకారమైన పంటల ప్రచారం కూడా అప్రయత్నంగా చేయవచ్చు.
* పాలీ హౌస్ ఏ సీజన్‌లోనైనా మీ మొక్కలకు సరైన పర్యావరణ సౌకర్యాలను అందిస్తుంది.
* ఇది దాదాపు 5 నుండి 10 రెట్లు దిగుబడిని కూడా పెంచుతుంది.
* తక్కువ పంట కాలం
* ఎరువులు వేయడం సులభం మరియు బిందు సేద్యం సహాయంతో స్వయంచాలకంగా నియంత్రించబడుతుంది.
పాలీహౌస్ రకాలు:
పర్యావరణ నియంత్రణ వ్యవస్థల ఆధారంగా పాలీహౌస్‌లు రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి:
* సహజంగా వెంటిలేషన్ చేయబడిన పాలీహౌస్ – ఈ రకమైన పాలీహౌస్ లేదా గ్రీన్‌హౌస్‌లో ప్రతికూల వాతావరణం మరియు సహజ తెగుళ్లు మరియు అనారోగ్యాల నుండి పంటలను రక్షించడానికి తగిన వెంటిలేషన్ మరియు ఫాగర్ సిస్టమ్ మినహా పర్యావరణ నియంత్రణలు లేవు.
* పర్యావరణపరంగా నిర్వహించబడే పాలీహౌస్‌లు – ఈ నిర్మాణాలు కాంతి, ఉష్ణోగ్రత, తేమ మరియు ఇతర కారకాలను నియంత్రించడం ద్వారా పంటల పెరుగుతున్న సీజన్‌ను విస్తరించడానికి లేదా ఆఫ్-సీజన్ దిగుబడిని పెంచడానికి రూపొందించబడ్డాయి.
ముగింపు:
ఓపెన్ ఫీల్డ్ ఫార్మింగ్‌తో పోలిస్తే పాలీహౌస్ లేదా గ్రీన్‌హౌస్ ఫార్మింగ్‌లో దిగుబడి 4-8 రెట్లు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఫలితంగా, రైతులు బహిరంగ పొలాల్లో పని చేయకుండా, పాలీహౌస్ నిర్మించడాన్ని పరిగణించవచ్చు. ఉదాహరణకు సంగారెడ్డి ప్రాంతంలోని రైతులు, వర్షపాతం మరియు ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్పాదకత తక్కువగా ఉన్నప్పుడు మే నుండి ఆగస్టు వరకు పాలీ హౌస్‌లలో టమోటాలు పండించడం ద్వారా అధిక రాబడిని సాధించారు.
ఎం. భార్గవ్ రెడ్డి, యంగ్ ప్రొఫెషనల్-2,
నేషనల్ అకాడమి ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్,
మన తెలుగు రాష్ట్రాల్లో పండించే అపరాల్లో పెసర, మినుము ముఖ్యమైనవి. సుమారుగా 65-80 రోజుల్లో కోతకు వచ్చే ఈ పంటలు 1.5 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతున్నది. సాగు నీటి లభ్యత ఎక్కువగా ఉండటం వలన రైతులు వేసవి పప్పుధాన్యాల సాగు చేసుకోవచ్చు. పెసర, మినుము పంటలు తక్కువ కాల పరిమితి కల్గి ఉంటం వల్ల మరియు తక్కువ నీటి వసతి ఉన్నచోట కూడా పండించేందుకు అనుకూలంగా ఉంటుంది. అన్ని కాలాల్లో పండించే ఈ పప్పు దినుసులు మన ఆహారంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
మానవ శరీరానికి అవసరమైన మాంసకృత్తులు, ఖనిజ లవణాలను అందించడమేకాకుండా నత్రజని స్థిరీకరణ ద్వారా నేలను సారవంతం చేస్తుంది. పప్పుదినుసులు తలసరిగా రోజుకు 80 గ్రా. తీసుకోవలసి ఉండగా ప్రస్తుతం కేవలం 31 గ్రా. మాత్రమే అందుబాటులో వున్నాయి. ఈ వ్యత్యాసాన్ని పూడ్చడానికి ప్రస్తుతం మన భారతదేశం 3 మిలియన్ టన్నుల అపరాలను దిగుమతి చేసుకుంటుంది. పెసర, మినుము మనకు కావాల్సిన మాంసకృత్తులు అందించడమే కాకుండా పంట మార్పిడి జరిగి భూసారం పెరిగి ప్రధాన పంటల్లో స్థిరమైన దిగుబడి సాధించుటకు దోహదపడుతుంది.
మినుము, పెసర సాగులో సమస్యలు:
* అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోకపోవడం నిస్సారమైన భూముల్లో వర్షాధారంగా సాగుచేయడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, చౌడు విస్తీర్ణం పెరగటం
* సరైన సమయంలో కలుపు నివారణ చేయకపోవటం వరి మాగాణుల్లో ఊద మరియు బంగారు తీగ ప్రధాన సమస్య
* తెగుళ్ళకు, పురుగులకు లొంగిపోవటం- తెగుళ్ళల్లో పల్లాకు, మొవ్వుకుళ్ళు, ఆకుముడత, ఎండు తెగులు, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు మరియు పురుగుల్లో మారుకా మచ్చల పురుగు, రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగు ప్రధాన నష్టాన్ని కలుగజేస్తున్నాయి.
* పండించిన పంటకు సరైన ధర రాకపోవడం. కాబట్టి రైతులు సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేస్తే, వాణిజ్య పంటలతో పోటీగా ఆదాయాన్ని పొందవచ్చు. వేసవి పెసర/మినుము సాగు అవకాశాలు:
ఈ అపరాల సాగుకు సుమారు 300 మి.మీ. నీరు అవసరం ఉంటుంది. కొద్దిపాటి నీటిసదుపాయం ఉన్న రైతులు కీలక థల్లో 3-4 నీటితడులు ఇచ్చినట్లయితే ఈ పంటలను సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. వాణిజ్య పంటలైనటువంటి ప్రత్తి, మిరప, పసుపు అలాగే యాసంగి మొక్కజొన్న, వేరుశనగ, వరి తీసిన తరువాత ఖాళీగా ఉన్న భూముల్లో పెసర, మినుము సాగుచేయవచ్చు. వేసవిలో సాగుచేసే పెసర, మినుము పంటల్లో చీడపీడల బెడద తక్కువగా ఉండటం వలన తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చు. నేలలు:
నీటి వసతి కలిగిన ఎర్ర నేలలు, సారవంతమైన మురుగు నీరుపోయే సౌకర్యం గల నల్ల నేలలు కూడా అనుకూలం. నీరు బాగా ఇంకి తేమను పట్టి ఉంచే మధ్యస్థ బరువైన నేలలు అనుకూలమైనవి. సమస్యాత్మక భూములు ముఖ్యంగా చౌడు భూములు ఈ పంటల సాగుకి పనికిరావు.
యంజిజి-295: కాపు పైభాగాన గుత్తులుగా వస్తుంది. గింజ మధ్యస్థ లావుగా ఉండి, సాదాగా ఉంటుంది. మొవ్వుకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. పంట కాలం 65-70 రోజులు, దిగుబడి: 5-6 క్వి/ ఎకరానికి.
యంజిజి-347: కాపు పైభాగాన ఉండి ఒకేసారి కోతకు వస్తుంది. ముదురు ఆకుపచ్చ మరియు సాదా గింజలు. పల్లాకు తెగులు మరియు బెట్టను కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి : 5-6 క్వి/ఎకరం.
యంజీజీ-348: గింజ మధ్యస్థ లావుగా ఉండి, లేత ఆకుపచ్చలో సాదాగా ఉంటుంది. బెట్టను కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం : 65-70 రోజులు. దిగుబడి: 5-6 క్వి/ఎకరం.
యంజిజి-351: లేత ఆకుపచ్చ, సాదా, మధ్యస్థ లావు గింజ ఉండి, పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. పంట కాలం 70 రోజులు. దిగుబడి 6-6.5 క్వి/ఎకరం.
యంజిజి-385: మొక్కలు నిటారుగా, గుబురుగా పెరిగి కాయలు గుత్తులుగా వ్యాపించి ఉండి ఒకేసారి కోతకు వస్తుంది. గింజలు మధ్యస్థ లావుగా, ముదురు ఆకుపచ్చగా మెరుస్తూ ఉంటాయి. మొవ్వుకుళ్ళును, ఆకుముడతను సమర్ధవంతంగా తట్టుకుంటుంది. పంట కాలం : 70-76 రోజులు. దిగుబడి 6-6.4 క్వి/ఎకరం.
డబ్ల్యుజిజి-37: గింజ మెరుస్తూ మధ్యస్థ లావుగా ఉండి, ఒకేసారి కాపుకు వచ్చి పల్లాకు తెగులును తట్టుకుంటుంది. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.
డబ్ల్యుజిజి -42: పొడవైన కాయలు, లావు పాటి మెరుపు గింజలు కలిగి, పల్లాకు తెగులును సమర్ధవంతంగా తట్టుకునే రకం. పంట కాలం 55-60 రోజులు. దిగుబడి 4-5 క్వి/ఎకరం.
టీయం-96-2: గింజలు లావుగా ఉండి, బూడిద తెగులును తట్టుకునే పాలిష్ రకం. వరి మాగాణుల్లోకి అనువైనది. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.
ఐపియం-2-14: మొక్క నిటారుగా పెరిగి ఒకేసారి కోతకు వచ్చి, మధ్యస్థ లావు గింజలు కలిగి, పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. పంట కాలం 60-65 రోజులు. దిగుబడి : 5-6క్వి/ఎకరం. వేసవికి అనుకూలమైన మినుము రకాలు – లక్షణాలు
యంబిజి-207: పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. పంట కాలం 75-80 రోజులు. దిగుబడి 7.2-8 క్వి/ఎకరం. వరి మాగాణులకు అనువైన రకం.
డబ్ల్యుబిజి-26: అన్ని కాలాలకు అనువైన సాదా రకం. కణుపుల మధ్య దూరం తక్కువ. గుత్తుల కాడ చిన్నగా ఉండి, కాయలు ఎక్కువ. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. దిగుబడి 4-4.8 క్వి/ఎకరం.
పియు-31: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకునే సాదా రకం. కాయల మీద నూగు ఉంటుంది. తక్కువ కాల పరిమితి గల రకం. పంటకాలం 65-70 రోజులు. దిగుబడి 6-6.8 క్వి/ఎకరం.
యల్బిజి-752: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకొనే పాలిష్ రకం. వరి మాగాణుల్లో ఆలస్యంగా విత్తుకొనుటకు అనువైన రకం. పంట కాలం 75-80 రోజులు. దిగుబడి 8-8.5 క్వి/ఎకరం.
ఎల్బిజి-787: అన్ని కాలాలకు అనువైన, మధ్యస్థ కాల పరిమితి కలిగి పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. కాయలు ప్రధాన కాండం మీద కణుపుల వద్ద కూడా కాస్తాయి. పంట కాలం 75-80 రోజులు. దిగుబడి 8.0-8.8 క్వి/ఎకరం.
టిబిజి-104: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును తట్టుకొనే పాలిష్ రకం. కాయలపై నూగు ఉంటుంది. పంట కాలం 70-75 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం.
జిబిజి-1: అన్ని కాలాలకు అనువైన పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. కాయలపై నూగు ఉంటుంది. పంట కాలం 70-75 రోజులు. దిగుబడి 5-6 క్వి/ఎకరం. నేల తయారీ: యాసంగి పంట తీసేసిన తరువాత కలుపు మొక్కలు, పంట అవశేషాలు లేకుండా నేల విత్తుటకు సిద్ధం చేయాలి. భూమిని 2-3 సార్లు బాగా దున్ని, 2 సార్లు గుంటక తోలి, చదును చేయాలి. వీలైతే ఒక నీటి తడి ఇచ్చి కూడా విత్తనాన్ని విత్తుకోవచ్చు.
విత్తనం/విత్తే పద్ధతి: ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసర ముంటుంది. గొర్రుతో సాళ్ళ మధ్య 22.5-25 సెం.మీ. (9-10 అంగుళాలు), మొక్కల మధ్య 10 సెం.మీ. (4 అంగుళాలు) ఉండేలా వరుసల్లో విత్తుకోవాలి. విత్తే సమయం: వేసవిలో సాగుచేయడానికి ఫిబ్రవరి నుండి మార్చి మొదటి పక్షం వరకు పెసర, మినుము పంటలు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు పూత, కాయ థల్లో ఉష్ణోగ్రత పూత రాలటం, గింజ కట్టడం వంటి సమస్యల దిగుబడి తగ్గే ప్రమాదముంది. 19
కలుపు యాజమాన్యం: విత్తిన 25 రోజుల వరకు పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.
అంతరకృషి: విత్తనం ఎద బెట్టిన పంటల్లో సాళ్ళ మధ్య గొర్రుతో కాని, గుంటకతోగాని 20-25 రోజుల సమయంలో అంతరకృషి చేసుకున్నట్లయితే కలుపు నివారించబడి పంట ఏపుగా పెరుగుతుంది. అదే విధంగా బెట్ట పరిస్థితుల నుంచి పంటను కొంతవరకు కాపాడుకోవచ్చు.
కసనబోయిన క్రిష్ణ, పిహెచ్.డి. స్కాలర్,
ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్, హైదరాబాద్.
జి. పరిమళ, బాదవత్ కిషోర్, పిహెచ్.డి. స్కాలర్,
బిధాన్ చంద్ర కృషి విద్యాలయం, మోహన్‌పూర్, వెస్ట్ బెంగాల్;
నందిగాం స్వాతిరేఖ, పిహెచ్.డి. స్కాలర్,
ఆచార్య ఎన్.జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
పంటల సాగులో విత్తనాలది ప్రముఖ పాత్ర అనే విషయం అందరికీ తెలిసిందే. పంటల సాగుకు సంబంధించి మిగతా అన్ని అంశాలు సక్రమంగా ఉండి విత్తనాలు నాణ్యమయినవి ఉపయోగించకుంటే ఫలితాలు సక్రమంగా రావు. భూమిలో ఉండే పోషకాలను గ్రహించే శక్తి ఆ విత్తనాలకు ఉండాలి. సహజంగా ప్రకృతి సిద్ధంగా పెరిగిన విత్తనాలకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి రోడ్ల వెంబడి, పొలం గట్ల మీద, పొలంలో మొలిచే కలుపు మొక్కలు, కొండలమీద, అడవులలో పెరిగే మొక్కలు… ఇలాంటివి అన్నీ పరిశీలిస్తే…. ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి పోషక లోపం లేకుండా, ఎలాంటి చీడపీడలు ఆశించకుండా వాటి పరిధిలో అవి పెరుగుతూ తగినంత దిగుబడిని లేదా ఫలసాయాన్ని అందిస్తుంటాయి. కాని మనం రైతు స్థాయిలో వేసే విత్తనాలకి మాత్రం బయట నుంచి అన్నీ అందించవలసిన పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి అని రాజు ఆలోచించసాగాడు.
ఇందుకు ప్రధాన కారణం ఏమిటి? రైతులు మొదటి నుండి ఈ సమస్యలు ఎదుర్కొన్నారా? లేక ఇటీవలే ఈ పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందా? అనే విషయాలు అధ్యయనం చేస్తే.. వ్యవసాయంలో రసాయనాలు, అధిక దిగుబడిని ఇచ్చు వంగడాలు ప్రవేశపెట్టకమునుపు చాలావరకు విత్తనాలు రైతుస్థాయిలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలోనే రైతుల ద్వారా చేతులు మారుతుండేవి. అప్పుడు అందుబాటులో ఉన్న విత్తనాలు అన్నీ నాటురకాలే. అవి చీడపీడలను తట్టుకుంటూ, వాటి పరిధిలో అవి దిగుబడులను ఇస్తూ ఉండేవి. కానీ పెరుగుతున్న ప్రజల ఆహార అవసరాలను తీర్చే లక్ష్యంతో అధిక దిగుబడిని ఇచ్చు వంగడాలను అభివృద్ధి చేసి వాటిని ఉపయోగించటం మొదలయ్యింది. అధిక దిగుబడిని ఇచ్చు వంగడాలను సాగు చేసినట్లయితే అందుకు అవసరమైన పోషకాలను కూడా అందించగలిగినపుడే సరైన దిగుబడి వచ్చేది. లేనట్లయితే సరైన దిగుబడి వచ్చేది కాదు. ఆవిధంగా విత్తనాల స్వచ్ఛతను కోల్పోయాము కాబట్టే రైతులు తమ సాగుని లాభాల బాటలో నడిపించలేకపోతున్నారు.
పంటలసాగు లాభాల బాటలో నడిపించాలంటే రసాయనాలను దూరం పెట్టడముతో పాటు విత్తనాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించి సూటి రకాలు లేదా నాటు రకాలు ఉపయోగించగలిగితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని నిపుణులు, అధికారులు, అనుభవజ్ఞులు ప్రచారం చేస్తుండగా రైతులు నెమ్మదినెమ్మదిగా నాటు విత్తనాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇదే కోవకు చెందుతారు నాగర్‌కర్నూలు జిల్లా, గుమ్మకొండకు చెందిన బైరిపాగ రాజు.రాజుది వ్యవసాయ నేపథ్యం. తోటి రైతుల లాగానే రాజు కూడా తన పంటల సాగులో వివిధ రకాల హైబ్రిడ్ విత్తనాలను, రసాయనాలను వినియోగిస్తూ తన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండడం లేదు, పంటల సాగులో పెట్టుబడులు పెరిగి కొన్నిసార్లు నష్టాలను చవిచూడవలసి వస్తుంది. నష్టాల సాగుని కొనసాగించలేక పరిష్కార మార్గాలవైపు ఆలోచిస్తుండగా ప్రకృతి వ్యవసాయం గురించి తెలిసింది. అదే సమయంలో అంటే 2014 వ సంవత్సరం సుభాష్ పాలేకర్ ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ సదస్సుకు హాజరయ్యి అక్కడ తెలుసుకున్న విషయాలతో తన రసాయనిక సేద్యాన్ని ప్రకృతి సేద్య విధానంలోకి మార్చాలని నిర్ణయం తీసుకుని అటువైపు అడుగులు వేసి 2014వ సంవత్సరం నుండి తన సాగులో రసాయనాలు ఆపివేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించడం మొదలు పెట్టారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో ప్రధానమయినవి నాటు విత్తనాలు మరియు ఆవు వ్యర్థాలు కాబట్టి వీటిని తప్పకుండా ఉపయోగిస్తూ వస్తున్నారు.మొత్తం 8 ఎకరాలలో వివిధ రకాల పంటలు ప్రకృతిసేద్య విధానంలో సాగు చేస్తూ వస్తున్నారు.
ఇందుకుగాను ఒక దేశీయ ఆవును పోషిస్తూ వాటి వ్యర్థాలతో వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకుంటూ తన సాగులో వినియోగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాటు విత్తనాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కనుక తప్పనిసరిగా నాటు విత్తనాలు వినియోగిస్తున్నారు. నాటు విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ నుంచి సేకరించి వివిధ రకాల కూరగాయలు, పురాతన వరి రకాలు, వేరుశనగ, కంది, పెసర, పుచ్చ మొదలగు పంటలు సాగు చేస్తూ తన పంట నుంచి విత్తనాలను సేకరించి తోటి రైతులకు అందిస్తూ వస్తున్నారు. 2021వ సంవత్సరం రబీలో వేరుశనగ, పుచ్చ, టమాట మొదలగు పంటలు సాగు చేశారు. టమాట:
448 రకం విత్తనాలకు సంబంధించిన 25 రోజులు పెరిగిన నారుని నాటించారు. దుక్కిలో ఘనజీవామృతంతో పాటు పశువుల ఎరువు అందించారు. మొక్క నాటిన రోజు నుంచి క్రమం తప్పకుండా జీవామృతాన్ని భూమికి అందిస్తూ రావడంతో పాటు అవసరాన్ని బట్టి అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, థపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగ, ఫిష్ ఎమినో యాసిడ్, ఉపయోగిస్తూ వస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతూ వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెట్ చేసుకుంటూ మంచి ఆదాయం గడిస్తున్నారు. పుచ్చ:
ఒక ఎకరంలో పుచ్చ పంటను సాగు చేశారు. ఇందుకుగాను నల్ల రకం నాటు విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తనాలను బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకుని ఉపయోగించారు. ఎకరానికి 500 గ్రాముల విత్తనం అవసరం పడింది. దుక్కిలో ఘనజీవామృతంతో పాటు, పశువుల ఎరువు కూడా అందించారు. క్రమం తప్పకుండా జీవామృతాన్ని భూమికి అందించడంతో పాటు అవసరాన్ని బట్టి అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, పేడ+ఇంగువ ద్రావణం, సివిఆర్ గారి మట్టి ద్రావణం పంటపై పిచికారీ చేస్తూ వచ్చారు. ఎకరానికి సుమారు 20,000/- వరకు ఖర్చు చేశారు. 15 టన్నుల వరకు దిగుబడి తీసి టన్ను 10000/-లకు అమ్మకం చేశారు. కొన్ని కాయల నుంచి విత్తనాలను సేకరించి తరువాత తన సాగుకి ఉపయోగించడానికి, తోటి రైతులకు అందించాలనుకుంటున్నారు. వేరుశనగ:
మూడు ఎకరాలలో వేరుశనగను సాగు చేశారు. ఇందుకుగాను కదిరి లేపాక్షి 1812 రకం సొంత విత్తనాన్ని వినియోగించారు. ఎకరానికి 60 కిలోల విత్తనం అవసరం పడింది. విత్తనం నాటిన తరువాత ప్రతి 15 రోజులకు స్ప్రింక్లర్స్ సహాయంతో నీటిని అందిస్తూ జీవామృతాన్ని పొలంపై చల్లించారు. ఈ విధంగా 5 సార్లు అంటే పంట కాలంలో ఎకరానికి 1000 లీటర్ల జీవామృతాన్ని భూమికి అందించారు. విత్తనం నాటిన 25-30 రోజుల మధ్యలో కూలీల సహాయంతో కలుపును నివారించారు. అవసరమయితే ఎద్దులతో కూడా అంతరకృషి చేస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి ఫిష్ ఎమినోయాసిడ్, పుల్లటి మజ్జిగ, నూనెలను పంటపై పిచికారి చేస్తూ చీడపీడలను నివారించారు. తన వేరుశనగ సాగు అనుభవంలో ఎకరానికి 12 క్వింటాళ్ళు కాయలు అధిక దిగుబడి పొందారు. చుట్టు ప్రక్క రసాయన పద్ధతులు పాటించే రైతులకంటే 2 లేదా 3 క్వింటాళ్ళు కాయలు అధికంగా పొందుతున్నారు. వేరుశనగ కాయలను అదేవిధంగా అమ్మకుండా విత్తనాలను తీసి తోటి రైతులకు విత్తనాల కొరకు మంచి ధరకు అమ్ముతుంటారు. అడవి పందుల నుంచి పంటను రక్షించడం:
వేరుశనగ పంటకు అడవి పందుల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొలం చుట్టూ చీరలు కట్టి లేదా వివిధ రకాల శబ్దాలు చేసే మైకు ఏర్పాటు చేసి తన వేరుశనగ పంటని అడవి పందుల బారి నుంచి రక్షించుకుంటున్నారు.కంది, బీర, సొర, 5 రకాల వంగ, పురాతన వరి రకాలు, పుచ్చ, వేరుశనగ మొదలగు విత్తనాలను సొంతంగా ఉపయోగించుకుంటూ తోటి రైతులకు మంచి ధరకు అమ్ముతూ తన సాగుని లాభాల బాటలో నడిపిస్తున్నారు.
మరిన్ని వివరాలకు బైరిపాగ రాజును 81868 86807 ఫోన్ నెంబర్‌లో సంప్రదించగలరు.
అనాదిగా మన ప్రధాన వృత్తి వ్యవసాయం. ఎప్పటి నుంచో మన రైతులు వివిధ రకాల పంటలు పండిస్తూ ప్రజల ఆకలిని తీరుస్తూ తమ సాగుని కొనసాగిస్తూ వస్తున్నారు. వివిధ రకాల పద్ధతులు పాటిస్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ స్వేదం చిందించి సేద్యం చేస్తూ అందరి ఆకలిని తీర్చుతున్నారు గాని తమ ఆకలిని సక్రమంగా తీర్చుకోలేకపోతున్నారు. ఎక్కువమంది రైతులు పంటల సాగులో నష్టాలను చవిచూస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతూ పెళ్ళాం పుస్తెలను తెగనమ్ముతూ సాగుని కొనసాగిస్తున్నారు. అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మన ఆకలిని తీర్చే అన్నదాతలు లోకాన్ని విడిచి, కుటుంబ సభ్యులను అనాధలను చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులకు కారణాలు ఏమిటి? రైతుల సమస్యలకు పరిష్కారాలు దొరకవా? అని ఆలోచించి ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు కావాలంటే వ్యవసాయంలో మెరుగయిన పద్ధతుల గురించి కక్షుణ్ణంగా అధ్యయనం చేసి పరీక్షించి క్షేత్రస్థాయిలో విజయం సాధించే అంశాలను రైతు లోగిళ్ళకు చేర్చగలగాలి. ఆవిధంగా చేసినపుడే మన రైతు మనుగడ సాగించగలడు. లేనట్లయితే మన భవిష్యత్తు అంధకారమే అనే విషయం అక్షర సత్యం. ఈ విషయాన్ని గ్రహించి రైతుబిడ్డగా తనవంతు బాధ్యత నిర్వర్తించాలనే తలంపుతో మెరుగయిన వ్యవసాయ పద్ధతుల పరిశోధనలో ముందుకు సాగుతున్నారు మన రైతునేస్తం జిట్టా బాల్‌రెడ్డి.
బాల్‌రెడ్డిది వ్యవసాయ నేపథ్యం. పరిస్థితుల ప్రభావం మరియు వివిధ రకాల కారణాల వలన బాల్‌రెడ్డి జీవితం అనేక మలుపులు తిరిగి ప్రస్తుతానికి వ్యవసాయ పరిశోధనలో స్థిరపడింది. యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరిలోని ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి తన పరిశోధనలకు వేదిక అయ్యింది. ఈ క్షేత్రానికి అమేయ కృషి వికాస కేంద్రం అని నామకరణం చేసి, అనేక ప్రయోగాలకు వేదిక చేసుకుని వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తున్నారు. ఈ యజ్ఞంలో తన అర్ధాంగి జ్యోతిరెడ్డిని కూడా భాగస్వామిని చేసి మహిళలు తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు, మనం ఏరంగంలో ఉన్నా కూడా కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అని తెలియచెబుతున్నారు. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయంలో అదీను సేంద్రియ వ్యవసాయంలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. కుటుంబ సభ్యుల సహకారం లేనిదే సేంద్రియ వ్యవసాయం ముందుకు సాగదని బాల్‌రెడ్డి వివరించారు.
ప్రస్తుతం మన రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పెట్టుబడులు పెరగడం. పెట్టుబడులు పెరగటానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు వ్యవసాయం చేసే ప్రతి రైతూ పాడి పశువులను పోషిస్తూ పాడి ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతూ పశువ్యర్థాలను పంటలకు అందిస్తూ నాణ్యమైన దిగుబడి పొందుతూ ఉండేవారు. కాని రాను రాను వివిధ రకాల కారణాలు, వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టడం వలన రైతులు పాడిపశువులకు దూరం జరిగి పూర్తిగా రసాయనాలమీదనే ఆధారపడి పంటలు సాగు చేయటానికి అలవాటు పడ్డారు. విచక్షణా రహితంగా రసాయనాలు ఉపయోగించడం వలన పంటలపై చీడపీడల ప్రభావం పెరిగింది. వీటి నివారణకు తిరిగి రసాయన పురుగు మందులు లాంటి వాటి కోసం మరలా ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ విధంగా పంటల సాగు ఖర్చు ఏఏటికాయేడు పెరుగుతూ వస్తుంది. దీనికి పరిష్కారం రైతులు రసాయనాలకు దూరం జరిగి తిరిగి పశుపోషణ చేపట్టి పశువ్యర్థాలను మరియు వివిధ రకాల సేంద్రియ పద్ధతులను ఉపయోగిస్తూ పంటల సాగు కొనసాగించడమే కాబట్టి బాల్‌రెడ్డి ఆ దారిలో నడుస్తూ గత 10 సంవత్సరాలకు పైగా ఈ క్షేత్రంలో ఏ విధమైన రసాయనాలు వినియోగించకుండా పూర్తి ప్రాకృతిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పంటల సాగు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇందుకుగాను పాడి పశువులను కూడా పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటల సాగులో వినియోగిస్తూ వస్తున్నారు. ఈ పద్ధతిలో రసాయనాలకు దూరం జరగడం జరిగింది కానీ పశువుల ఎరువు మరియు జీవామృతం లాంటి వాటిని మొక్కలకు అందించాలంటే కూలీలపై ఆధారపడవలసి వస్తుంది. కూలీ రేట్లు పెరగటంతో పాటు కొంతమంది కూలీలు గోవు వ్యర్థాలతో తయారు చేసిన జీవామృతం లాంటి వాటి వాసన భరించలేక పనికి దూరంగా ఉంటున్నారు. దానికి పరిష్కారంగా మానవ వనరుల వినియోగం లేకుండా జీవామృతం లేక ద్రవ సేంద్రియ ఎరువులను భూమికి అందించటానికి సులువైన పద్ధతిని పరిశోధించి అమలు పరుస్తున్నారు. ఈ పద్ధతి వలన ఒక దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లు కూలీల ఖర్చు తగ్గడముతో పాటు, కూలీల అవసరం లేకుండా చేయడం మరియు ఎరువుల యొక్క వృథాని తగ్గించడం జరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరగడం బాల్‌రెడ్డి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ పద్ధతికిగాను వారు 12000 లీటర్ల సామర్ధ్యం గల కుంటను తవ్వించి ఆ కుంటలో నీరు ఇంకకుండా నల్లరంగు ప్లాస్టిక్ పట్టాను పరచారు. ఆవు మూత్రం, ఆవుల పాక కడిగిన నీటిని ఒక పంపు సహాయంతో ఈ కుంటలోకి వచ్చేలా ఏర్పాటు చేసుకుని అందులో నీటిని, పేడను మరియు ఇతర పదార్థాలను కలిపి పంటలకు అందిస్తుంటారు. పంటలకు అందించటానికి కూడా మానవ వనరుల వినియోగం లేకుండా మాములుగా పంటలకు నీటిని అందించే పైపుకి అనుసంధానం అయ్యి జీవామృతం మరియు నీరు కలిసి వెళ్ళేలా ఏర్పాట్లు చేసుకున్నారు. (ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు బాక్స్ చూడగలరు), మానవ వనరులతో పాటు ప్రస్తుతం రైతులు ఉపయోగించే రసాయనిక పురుగు మందులు కూడా సాగు పెట్టుబడులను పెంచుతున్నాయి. విచక్షణా రహితంగా రసాయనాలు ఉపయోగించడంతో పాటు సారం లేని నేలలో పెరిగిన మొక్కలో రోగనిరోధక శక్తి లోపించడం వలన పంటలపై చీడపీడల ప్రభావం పెరిగి రసాయనాలు ఉపయోగించే కొలది చీడపీడలు నిరోధక శక్తిని పెంచుకుని ఎంత ఖర్చు పెట్టి రసాయనాలు ఉపయోగించినా కూడా చీడపీడలు నివారించలేకపోవడం లాంటి పరిస్థితులు రైతులకు ఎదురవుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఇటీవల మిరప రైతులు ఎదుర్కొన్న నల్ల తామర పురుగు. మిరప రైతులను నల్ల తామర పురుగు విపరీతంగా ఇబ్బందులకు గురి చేసింది. కొంతమంది రైతులు వీటిని నివారించలేక పంటను వదలి వేసుకున్నారు. ఇలాంటి సమస్యలకు హోమియో మందులు పనిచేస్తాయి అని గ్రహించి తాను సాగు చేసే పంటలపై హోమియో మందులు పరీక్షించి విజయం సాధించిన తరువాత తోటి రైతులకు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం అనేకమంది మిరపతో పాటు ఇతర పంటల సాగు చేసే రైతులు బాల్‌రెడ్డి సలహాల మేరకు హోమియోమందులు ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో తమ పంటలను చీడపీడల నుండి రక్షించుకున్నారు అని బాల్‌రెడ్డి వివరించారు. ఈ హోమియో మందులు రైతులు ఎవరికి వారు వారికి అందుబాటులో ఉన్న హోమియో దుకాణాల నుంచి నాణ్యమైనవి కొనుగోలు చేసుకుని ఉపయోగించవచ్చు. కాని మోతాదు మాత్రం తప్పనిసరిగా పరిమితులకు లోబడే వినియోగించాలి. మోతాదు పెంచినట్లయితే పంట నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి హోమియో మందుల వివరాలు మరియు మోతాదు వివరాలు ఆయనను సంప్రదించి నిర్ధారించుకోవాలని బాల్‌రెడ్డి రైతులను కోరుతున్నారు
రైతులు పెట్టుబడులు తగ్గించడంతో పాటు సంవత్సరం పొడవునా పంట దిగుబడులు అందుబాటులో ఉన్నట్లయితే రైతులకు ఆదాయం పెరుగుతందని గ్రహించారు బాల్‌రెడ్డి. అటువైపు ఆలోచించి పండ్ల మొక్కలను ఉదాహరణగా తీసుకుంటే మామిడి, బత్తాయి లాంటి పండ్లు సంవత్సరములో కొన్ని నెలలు మాత్రమే పంట దిగుబడి వచ్చే రకాలు ప్రస్తుత మన రైతులు సాగు చేస్తున్నారు. దానికి పరిష్కారంగా వియత్నాం, మలేషియా, ఫిలిప్పెయిన్స్ మొదలగు దేశాలలో అందుబాటులో ఉండే పండ్ల మొక్కలు సంవత్సరం పొడవునా పంట దిగుబడిని ఇచ్చే వాటిని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తెప్పించి తమ పరిశోధనా క్షేత్రంలో పరిశీలిస్తున్నారు. పరిశోధించి అన్ని అంశాలు అనగా దిగుబడి, రుచి, నేల అనుకూలత, చీడపీడలను తట్టుకునే గుణం లాంటి వాటిని ప్రత్యక్షంగా తమ క్షేత్రంలో పరిశీలించి అన్నీ అనుకూలంగా ఉంటేనే రైతులకు అందచేస్తూ ఏ అంశంలోనైనా తనకు నమ్మకం కుదరకపోతే ఆ రకాన్ని తన క్షేత్రానికే పరిమితం చేస్తూ రైతులకు చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని బాల్‌రెడ్డి వివరించారు. కుటుంబ సభ్యుల సహకారంతో పంటలసాగు, పశుపోషణని కొనసాగిస్తూ మెరుగయిన వ్యవసాయ పద్ధతుల పరిశోధనలో చిత్తశుద్ధితో బాల్‌రెడ్డి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరిన్ని వివరాలు 8978221966 కి ఫోను చేసి తెలుసుకోగలరు. ఖర్చు లేకుండా జీవామృతాన్ని పంటలకు అందించే పద్ధతి
ప్రకృతి వ్యవసాయంలో మన దేశీయ గోవులు, ఆగోవుల వ్యర్థాలతో తయారు చేసుకొనే జీవామృతం లాంటివి ప్రముఖపాత్రను పోషిస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ జీవామృతంలో పిండి, ఆవుపేడ మొదలగునవి కలుపుతారు, కాబట్టి వడకట్టడం ఇబ్బందులతో కూడుకుని ఉంది. కాబట్టి జీవామృతాన్ని పంటలకు అందించాలంటే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది రైతులు కూలీల సహాయంతో మొక్కల పాదులలో పోయిస్తున్నారు. కాలువల ద్వారా నీటిని అందించే రైతులుకు పెద్దగా ఇబ్బంది ఉండదు కాని రెయిన్‌గన్, స్ప్రింక్లర్స్, డ్రిప్పు ద్వారా పంటలకు నీటిని అందించే రైతులు జీవామృతం మొక్కలకు అందించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి రైతులు మరియు తన సౌకర్యార్థం బాల్‌రెడ్డి ఒక పద్ధతిని అమలు పరుస్తున్నారు. తాను కూడా పంటలకు నీరు అందించటానికి డ్రిప్పు వ్యవస్థని ఉపయోగిస్తున్నారు కాబట్టి కొత్త పద్ధతి గురించి శోధించి ఏలాంటి ఇబ్బంది లేకుండా జీవామృతం పంటలకు అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకుగాను సుమారు 6 అడుగుల లోతులో 12000 లీటర్ల సామర్థ్యం గల చిన్న కుంటను తవ్వించి ఆ కుంటలో అడుగు భాగాన నీరు ఇంకకుండా ప్లాస్టిక్ షీట్ పరిచారు. మాములుగానే బాల్‌రెడ్డి పంటలకు నీటిని అందించడానికి ఫారమ్ పాండు తవ్వుకున్నారు. ఈ ప్రాతంలో నీటి లభ్యత సక్రమంగా ఉండదు కాబట్టి బోరు నుంచి నేరుగా డ్రిప్పుద్వారా పంటకు అందించడంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఫారమ్‌పాండు తవ్వించి అందులో ప్లాసిక్ షీటు పరచి బోర్ల నుండి ఫారమ్ పాండ్‌లోకి నీటిని నింపి ఫారమ్ పాండులోని నీటిని మోటారు సహాయంతో పంటలకు డ్రిప్పు ద్వారా పంపిస్తుంటారు. జీవామృతం టాంకులో అందుకు అవసరమయిన పదార్థాలను కలిపి జీవామృతం తయారు చేసుకుంటారు. ఈ జీవామృతం ఫిల్టరు అవటానికి వీలుగా 4 లేదా 5 వరుసల నైలాన్ మెష్‌ను ఫుట్‌వాల్‌కి చుట్టి ఆ ఫుట్‌వాల్‌ని జీవామృతం టాంకులో వదులుతారు. ఈ ఫుట్‌వాల్ జీవామృతం ట్యాంకులో అడుగువరకు వెళ్ళకుండా ఎంతలోతులో ఫుట్‌వాల్ ఉండాలో అంత పొడవు తాడు కట్టి ఆ తాడు చివర రెండు ప్లాసిటక్ డబ్బాలను కట్టి ఫుట్‌వాల్‌ని జీవామృతం ట్యాంకులో వదులుతారు. ఆ ఫుట్‌వాల్‌కి కట్టిన ప్లాస్టిక్ డబ్బాలు జీవామృతం ట్యాంకులో పైన తేలుతూ ఫుట్ వాల్‌ను అడుగు వరకు చేరకుండా ఆపుతాయి కాబట్టి అడుగున పేరుకున్న మడ్డి (దీనిని తరువాత మొక్కల పాదులలో లేదా నేలకు అందిస్తుంటారు) అలానే ఉంటూ పైన ఉన్న జీవామృతం మాత్రమే ఫుట్‌వాల్‌కి అమర్చిన పైపు ద్వారా పంటలకు నీరు అందించే ట్యాంకులో అమర్చబడిన పైపుకు అనుసంధానం చేయబడుతుంది. ఈ మధ్యలో ఒక వాల్‌ని కూడా అమర్చి అవసరము లేకుంటే వాల్‌ని మూసివేస్తే జీవామృతం వెళ్ళకుండా కేవలం నీరు మాత్రమే వెళ్ళేలా ఏర్పాట్లు చేసుకున్నారు. పంటకు నీటిని అందించే సమయంలో నీటితో కలిసి పీడనశక్తి ద్వారా జీవామృతం కూడా వెళుతుంది కాబట్టి జీవామృతం యొక్క వినియోగ శక్తి మెరుగవడంతో పంటలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. జీవామృతంతో పాటు కోడి ఎరువు మరియు ఏవిధమైన సేంద్రియ లేదా ప్రకృతిసిద్ధమైన ఎరువులను మనుషుల సహాయం అవసరం లేకుండా ఈ పద్ధతి ద్వారా పంటలకు పంపించడం వలన ఖర్చు తగ్గిస్తున్నాయని, ఈ పద్ధతిని చాలామంది రైతులు అనుసరిస్తూ తమ సాగు ఖర్చు తగ్గించుకుంటున్నారని బాల్‌రెడ్డి వివరించారు.