మూలాలను మరువకూడదు

మనది వ్యవసాయక దేశం. ఆది నుంచి మన ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఒకప్పుడు 90 శాతానికి పైగా ప్రస్తుతం 70 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయాన్ని మన ప్రజలు మన సంస్కృతి, సంప్రదాయాలలో భాగంగానే చూస్తారు. అందుకనే చాలామంది పొలాన్ని అమ్మటానికి ఇష్టపడరు. కొంతమంది పొలం ఉండికూడా వ్యవసాయ రంగానికి దూరంగా జరిగిన వారు కూడా తమ పొలాన్ని అమ్మకుండా కొనసాగిస్తుండటము మన దేశంలో సహజం. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం మరియు వివిధ రకాల కారణాల వలన చాలామంది వ్యవసాయ రంగం నుండి వేరే రంగాలవైపు వెళ్ళినా కాని తమ మూలాలను మరవకుండా తమ ఆలోచనలను వ్యవసాయరంగం చుట్టూ తిప్పుతూనే ఉంటారు. ఒకప్పుడు వ్యవసాయంలో ఆర్థికంగా అభివృద్ధి చెందడము కుదరదు కాబట్టి వ్యవసాయరంగాన్ని వదలి వేరే ఉద్యోగ, వ్యాపార రంగాలలో అడుగు పెట్టి ఆర్థికంగా ఒకస్థాయికి చేరుకున్న తరువాత తిరిగి వ్యవసాయం గురించి ఆలోచించే వారి సంఖ్య ప్రస్తుత తరుణంలో రోజు రోజుకి పెరుగుతూ ఉంది. 

గతంతో పోల్చుకుంటే సేంద్రియ సాగు గురించి అవగాహన పెరిగిన తరువాత, ప్రధానంగా కరోనా తరువాత వ్యవసాయ రంగం గురించి ఆలోచించడంలో వేగం పెరిగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందులో భాగంగానే గతంలో వ్యవసాయ రంగం నుంచి వేరే రంగంవైపు వెళ్ళిన వారు తిరిగి వ్యవసాయరంగం వైపు ఆలోచిస్తూ తమ మూలాలను మరవకూడదు అనే తపనతోపాటు ఆరోగ్యం కాపాడుకోవాలంటే వ్యవసాయ రంగమే సరైన రంగం అని తలచి వ్యవసాయ రంగం వైపు వేగంగా అడుగులు వేసే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ ఉంది. ఇదే విధంగా ఆలోచించి తమ మూలాలను మరవకూడదనే తలంపుతో పారిశ్రామిక రంగంలో రాణిస్తూ కూడా తమ వ్యవసాయ నేపధ్యాన్ని మరవకుండా తిరిగి వ్యవసాయ రంగంలో అడుగుపెట్టి వినూత్న ఆలోచనలలో వివిధ రకాల పంటలను  పూర్తి సేంద్రియ పద్ధతులలో పండిస్తూ మన దేశీయ గోజాతులతో గో-శాలను నిర్వహిస్తున్నారు కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, చిక్కవరం గ్రామానికి చెందిన సురేంద్రబాబు. 

సురేంద్రబాబు గారిది వ్యవసాయ నేపథ్యం. వీరి పూర్వీకుల నుంచి వ్యవసాయం చేస్తున్న చరిత్ర వీరిది. అయినా కాని అందరిలాగానే వ్యవసాయరంగాన్ని వీడి పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టడం జరిగింది. పారిశ్రామిక రంగంలో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటు రాణించగలిగి ఒక గుర్తింపు సంపాయించారు. గుర్తింపుతో పాటు ఆర్థికంగా ఎదిగిన తరువాత తమ మూలాలను మరవకూడదు అని గ్రహించి 2020వ సంవత్సరంలో తిరిగి వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టారు. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు కాబట్టి తాము చేసే వ్యవసాయం నలుగురికి ఉపయోగపడేదిగా, మన సంస్కృతి, సాంప్రదాయ, సనాతన ధర్మాలను కొనసాగించేదిగా, తమ ఆరోగ్యాలను కాపాడేదిగా ఉండాలనే తలంపుతో అడుగులు వేయడం జరిగింది. సురేంద్రబాబు తన ఆలోచనలతో పాటు తన అర్థాంగి విశాలాక్షి అభీష్టం మేరకు అందరికి ఉపయోగపడేలా ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకోగా అందుకు రంగారావు మరియు ఇతరుల సలహాలు, సంప్రదింపులతో తన వ్యవసాయ క్షేత్రాన్ని ఒక నందనవనంగా తీర్చిదిద్ది వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు. 

సురేంద్ర బాబు గారికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి తన వ్యవసాయంలో వ్యాపార ధోరణిని ప్రక్కనబెట్టి ఆరోగ్యానికి, ఆధ్యాత్మకతకు ప్రాధాన్యాన్ని ఇచ్చారు. అందులో భాగంగానే నక్షత్రవనాన్ని నిర్మించి ఆ నక్షత్రవనంలో వివిధ రకాల ఔషధ గుణాలున్న ఆయుర్వేద మొక్కలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు. ఈ నక్షత్ర వనంలో మల్టి విటమిన్‌, కొవెల్‌ బంక, కుందేటి చెవులు, రుద్రాక్ష, మిరియాలు, తిప్పతీగ, రణపాల, లక్ష్మితరు, ఇన్సులిన్‌, బిర్యాని ఆకు, యాలకులు మొదలగు ఔషధ మొక్కలను నక్షత్రపు ఆకారపు తోటలో పెంచుతూ మధ్యలో వన దుర్గ మరియు ధన్వంతరి స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రతి పౌర్ణమి రోజున వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నారు. పౌర్ణమి రోజున అనేకమంది హోమంతో పాటు ఇక్కడ జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొని ఒక వేడుకలాగా జరుపుతుంటారు. ఈ హోమం ద్వారా వచ్చిన బూడిదను పంటల సాగులో వినియోగిస్తూన్నారు. ఈ నక్షత్ర వనంలో వివిధ రకాల ఔషధ గుణాలున్న మొక్కల మధ్య ధ్యానం చేయడం వలన ఆరోగ్యం బాగుంటుందనే తలంపుతో ఈ నక్షత్రవనాన్ని ఏర్పాటు చేశారు. 

నక్షత్రవనంలో వివిధ రకాల ఔషధ గుణాలున్న మొక్కల పెంపకంతో పాటు అవకాశం ఉన్న చోట వివిధ రకాల ఆకుకూరలు మరియు కూరగాయలను సాగు చేస్తున్నారు. సుమారు 15 కుటుంబాల అవసరాలను తీర్చటానికి అవసరమయిన అన్ని రకాల ఆకుకూరలు, టమాట, వంగ, మిరప, సొర, బీర, కాకర వంటి కూరగాయలను సాగు చేస్తూ తమ సొంత వినియోగానికి ఉపయోగిస్తున్నారు. వీటి సాగుకు ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా కేవలం పంచగవ్య, హోమంలో లభించే బూడిద, గోవ్యర్థాలను మాత్రమే ఉపయోగిస్తున్నారు.

సేంద్రియ సాగులో మన దేశీయ జాతి గోవు ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిన వీరు వివిధ రకాల దేశీ గోజాతుల గోశాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి వీరి గోశాలలో 80 దూడలు 100 పెద్ద పశువులు ఉన్నాయి. ప్రధానంగా గిర్‌, పుంగనూరు, తార్‌పార్కర్‌, రాఠి, సాహివాల్‌ జాతికి చెందిన గోవులను పోషిస్తున్నారు. రోజుకి 80 లీటర్ల చొప్పున పాల దిగుబడి పొందుతున్నారు. గోవులను ఒకే ప్రాంతంలో కట్టివేయకుండా ఫ్రీగ్రేజింగ్‌ పద్ధతిలో పెంచుతున్నారు. ఈవిధంగా ఫ్రిగ్రేజింగ్‌ పద్ధతిలో పెంచటం వలన ఆవులకు నడవటానికి అవకాశం ఉండటంతో పాటు తమకు ఇష్టం వచ్చినగ్రాసాలను తినటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆవుల ద్వారా వచ్చిన పాలు, పేడ, మూత్రం లాంటివి నాణ్యంగా ఉంటాయనే లక్ష్యంతో ఈ పెంపక విధానాన్ని ఎన్నుకున్నారు. గోవులకు మేతగా సూపర్‌ నేపియర్‌, పిల్లిపెసర, అలసంద మొదలగు పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు. దాణాగా ఎండుగడ్డి, పెసరపొట్టు, మినుపపొట్టు, వేరుశనగ పొట్టు లాంటివి వినియోగిస్తున్నారు. 

వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలతో పాటు వరి, మామిడి పంటలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తున్నారు. 1262 రకం వరిలో కేవలం ఎకరానికి 20,000/-ల ఖర్చుతో ఎకరం నుంచి సుమారు 39 బస్తాల వడ్లను దిగుబడి పొందడము జరిగింది. సుమారు 25 సంవత్సరాల వయస్సు గల మామిడి తోటను గత మూడు సంవత్సరాల నుంచి సేంద్రియ సాగు పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతున్నారు. ముందు ముందు మామిడి కాయలను వేరే దేశాలకు ఎగుమతి చేయాలనే ధ్యేయంతో ఉన్నారు. వీరు సాగు చేసే పంటలకు పశువుల ఎరువు, పంచగవ్య, థపర్ణి కషాయం, జీవామృతాలను ఉపయో గిస్తుంటారు. పశువుల పాక శుభ్రం చేసే సమయంలో వచ్చే వ్యర్థాలను నేరుగా పొలానికి పంపించే ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ క్షేత్రంలో ఆరోగ్యకర వాతావరణం ఏర్పడి ఉదయం, సాయంకాలం సమయంలో వివిధ రకాల పకక్షులు దర్శనమిస్తుంటాయి. మరిన్ని వివరాలు 99856 92555కి ఫోను చేసి తెలుసుకోగలరు.   

– వై. శ్రవణ్‌ కుమార్‌,  స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

నడి వేసవిలో వర్షభీభత్సం

భారత దేశంలో రుతుపవనాల ద్వారానే ఎక్కువ భాగం వర్షపాతం నమోదవుతున్నది. మొత్తం సంవత్సరంలో దేశంలో సగటున 1160 మిల్లీమీటర్ల వర్షం కురుస్తున్నది. అందులో 75 నుండి 80 శాతం జూన్‌ నుండి సెప్టెంబరు మాసాల్లో నైరుతీ రుతుపవనాల ద్వారా లభిస్తున్నది. అక్టోబరు 15 తర్వాత వచ్చే ఈశాన్య రుతుపవనాల ద్వారా మరో 15 శాతం వర్షపాతం నమోదవుతున్నది. మార్చి నుండి మే వరకు ఉష్ణ వాతావరణం ఉంటుంది. అయితే వేసవి కాలంలో కూడా అప్పుడప్పుడు కొన్ని వర్షాలు పడతాయి. దేశంలో సగటున 76 మిల్లీమీటర్లు ఏప్రిల్‌లో, 40 మిల్లీమీటర్లు మేలో వర్షం పడుతుంది. అందులో ఎక్కువ భాగం తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోనే కురుస్తుంది. కాని మార్చి 1వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాపితంగా సగటున 28 శాతం అధిక వర్షపాతం కురిసింది. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణంగా ఈ నెలల్లో 200 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. కాని ఈ సంవత్సరం 29 శాతం తక్కువగా 141.5 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. వాయువ్య భారతంలో 18 శాతం ఎక్కువ వానపడగా, మధ్య భారతంలో 268 శాతం అధికంగా వర్షాలు ముంచెత్తాయి. దక్షిణ భారతదేశంలో సాధారణ వర్షపాతం 54.2 మిల్లీమీటర్లే కాగా, ఈ సంవత్సరం 88 శాతం అధికంగా 102 మిల్లీమీటర్ల వానలు కురిశాయి. ఏప్రిల్‌, మే మాసాల్లో సాధారణంగా విజయవాడ ప్రాంతంలో 26 మిల్లీ మీటర్లు, హైదరాబాద్‌ ప్రాంతంలో 57 మిల్లీమీటర్లు, విశాఖపట్నం ప్రాంతంలో 87 మిల్లీమీటర్లు 60 సంవత్సరాల సగటుగా నమోదయ్యాయి. కాని ఈ సంవత్సరం మార్చి 14 నుండి మే ఏడవ తేదీ వరకు సాధారణ వర్షపాతానికి మూడు నాలుగు రెట్లు వర్షాలు కురిసాయి. వర్షాలతో పాటు గాలి తీవ్రత, వడగండ్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటం వల్ల వరి, మొక్కజొన్న, మిర్చి, పసుపు వంటి పంటలతో పాటు మామిడి వంటి ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. అకాల వర్షాలవల్ల రైతులు పంటల్ని సరిగా నూర్చుకోలేక, ఎండబెట్టలేక కొంత దిగుబడిని నష్టపోవటం జరిగింది. వరి, మొక్కజొన్న, జొన్న గింజలు మొలకలు వచ్చి, నాణ్యతను కోల్పోయి, అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. కల్లాల్లో ఎండుమిర్చి, పసుపు తడిసి, కుళ్ళిపోయాయి. 

అపారనష్టం… 

చేతికొస్తుందనుకొన్న పంట ఆఖరి నిమిషంలో చేజారడం రైతులను నిరాశకు గురి చేస్తున్నది. తెలంగాణలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాలు వస్తున్నాయి. మొత్తం అధిక వర్షాల వల్ల రైతులకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఈ రెండు రాష్ట్రాల్లో నష్టం జరిగి ఉంటుంది. రైతుల్ని ఆదుకోవటానికి ప్రధానమంత్రి 2016లో ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’ ను తెచ్చారు. అప్పటి వరకు దేశంలో 30 శాతం మంది రైతులు ‘పంట బీమా’ పథకంలో పాల్గొంటున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. దేశంలో కనీసం 50 శాతం మంది రైతులు ఈ పథకంలో చేరి, లబ్ధి పొందటం లక్ష్యంగా ఈ పథకం రూపొందింది. గత ఆరేడేళ్ళగా అమలవుతున్న ఈ పథకం పట్ల రైతులు ఏ మాత్రం సంతృప్తిగా లేరు. అనేక రాష్ట్రాలు ఈ పథకం నుండి వైదొలగాయి. ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్‌ కూడా వైదొలగటం విశేషం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు రెండు కూడా అసంతృప్తితో పథకం నుండి బయటకు వచ్చాయి. ఇప్పుడు దేశంలో కేవలం 10 నుండి 15 శాతం రైతులు మాత్రమే ఇందులో చేరుతున్నారు. ఈ పథకం వల్ల రైతుల కంటే ఇన్సూరెన్సు కంపెనీలే ఎక్కువగా లాభిస్తున్నాయనే అసంతృప్తితో అనేక రాష్ట్రాలు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన నుండి వైదొలగాయి. ఆంధ్రప్రదేశ్‌ అందుకు ప్రత్యామ్నాయంగా ‘వై.ఎస్‌.ఆర్‌. ఫ్రీ పంట బీమా యోజన’ను తీసుకు వచ్చింది. రైతులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇందులో చేరవచ్చు. 22 రకాల పంటలు ఈ పథకంలో అర్హత కలిగి ఉంటాయి. అంటే ఈ పంటలు పండించే రైతులు అ పథకంలో ప్రీమియం చెల్లించకుండానే చేరవచ్చు. కౌలుదార్లు కూడా ఇందులో చేరే అవకాశం ఉంది. రైతులకు ప్రీమియం భారం లేకుండా ఉండటంతో జనాదరణ పొందింది. కొన్ని సీజన్లలో కొందరు రైతులకు నష్టపరిహారం కూడా లభించింది. అయితే రైతు భరోసా కేంద్రాలు అవసరమైన మేరకు పనిచేయటం లేదని రైతులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా పంటల్ని సేకరించటానికి అవి చొరవ చూపడటం లేదని, సేకరించిన ధాన్యాలకు చాలా ఆలస్యంగా డబ్బులు చెల్లిస్తున్నారని ఆందోళన చేస్తున్నారు. రైతులు కోతకోసిన పంటల్ని నిలవ చేయటానికి గోడౌన్లు లేక, మిల్లర్లకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్న మిల్లర్లు బస్తాకు ఐదు నుండి పన్నెండు కిలోలు అదనంగా తీసుకుంటున్నారనీ, ఒక లారీకి పదివేలకు పైగా కోత పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. పంటరాశులపై కప్పి, రక్షించడానికి టార్పాలిన్లు కూడా అందించటం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. పొగాకు, మొక్కజొన్న, పసుపు, మిర్చి వంటి పంటల్లో నష్టం అపారంగా ఉంటున్నదని రైతులు చెబుతున్నారు. పంట అంచనాలు బాగానే ఉన్నాయి కాబట్టి రైతులకు నష్ట పరిహారం లభించకపోవచ్చు. నష్టం పంటకల్లాల్లో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి పంట బీమా పథకం ద్వారా రైతులకు లబ్ది చేకూరకపోవచ్చు. ప్రభుత్వం ప్రత్యేక సాయాన్ని ప్రకటిస్తే తప్ప రైతులకు ఉపశమనం కలగదు.

తెలంగాణ రాష్ట్రం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన నుండి బయటకు వచ్చింది కాని ప్రత్యేకంగా తమ స్వంత బీమా పథకాన్ని తేలేదు. అయితే ముఖ్యమంత్రి గారు నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి, ఎకరాకు నష్టహారంగా పదివేల రూపాయల సాయం చేస్తామని ప్రకటించారు. అయితే ఈ పరిహారాన్ని కొన్ని ప్రాంతాలకు, ఒక దఫా వర్షాలకే పరిమితం చేస్తారా, అన్ని ప్రాంతాల్లోనూ గత మూడు మాసాల్లో కురిసిన అధిక వర్షాలకు నష్టపోయిన రైతులందరికీ ఇస్తారా అనేది వేచి చూడాలి. నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారాన్ని అందించటానికి కొన్ని వందల కోట్ల రూపాయలు అవసరమౌతాయి.

తుఫాన్ల బెడద

మే మాసంలో ఒకటి రెండు తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో పుట్టిన ‘మోచా’ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తక్కువగానే ఉండటంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. కొద్దిపాటి గాలులు, చిరుజల్లులను మినహాయిస్తే ప్రమాదం తప్పినట్లే. రానున్న ఇరవై రోజుల్లో మరో తుఫాను పుట్టవచ్చు. అది ‘మోచా’ లాగానే తేలిగ్గానే ఉండవచ్చు. ఒక్కోసారి మే నెలలో వచ్చే తుఫాన్లు భారీ నష్టాన్ని కూడా కలిగించవచ్చు. మే 15 లోగా పంటలన్నీ ఇళ్ళకు చేరుకోవచ్చు. మేలో కురిసే ఎండాకాలపు వానలు రైతులు భూమిని దున్ని, విత్తటానికి తయారుగా ఉండటానికి సాయపడతాయి. జూన్‌లో రుతుపవనాలు రాగానే విత్తనాలు చల్లుకునే అకాశం కల్పిస్తాయి. రుతుపవనాల కన్నా ముందుగా వచ్చే వానలు రైతులకు బాగానే ఉపయోగపడతాయి. అయితే విపరీతమైన గాలులు, భారీ వర్షాలు వస్తే మాత్రం నష్టాలు, కష్టాలు తప్పవు. 

తప్పుకుంటున్న కేంద్రం

గత కొన్నేళ్ళగా కేంద్రప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు అర్థమౌతుంది. కనీస మద్దతు ధరల్ని ప్రకటించే కేంద్ర ప్రభుత్వానికి వాటిని నిలపాల్సిన బాధ్యత కూడా ఉంది. ధరలు మార్కెట్లో తగ్గి, కనీస మద్ధతు ధర కన్నా తక్కువ స్థాయికి వచ్చినపుడు రాష్ట్రాలతో సేకరణ వ్యూహాన్ని రూపొందించి, వ్యవసాయ ఉత్పత్తుల్ని సేకరించాలి. కాని క్రమేపీ ఆ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటున్నది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా ఉండాలి. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన విఫలమైన పరిస్థితుల్లో, కేంద్రం తన అధికార బృందాలను పంపి నష్టాలను అంచనా వేసి, కొంతమేరకైనా సాయాన్నందించాలి. వచ్చే సంవత్సరం ఎన్నికలున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొంత మేరకు రాష్ట్రాల విజ్ఞప్తులకు స్పందించే అవకాశముంది. కాని ఇప్పటికి కేంద్ర బృందాలను అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రాష్ట్రాలకు పంపలేదు. కాని రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం రూపంలోగానీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో గానీ సాయం అందించే అవకాశాలున్నాయి. నష్టం వేల కోట్ల రూపాయల్లో ఉంటే, సాయం వందల కోట్లలోనే ఉండవచ్చు.

వాతావరణం మారుతున్నదా?

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పుల గురించి చర్చ జరుగుతున్నది. ఉష్ణోగ్రతలు పారిశ్రామీకకరణకు ముందుతో పోలిస్తే ఎంతమేరకు పెరుగుతున్నాయి? 21వ శతాబ్దం చివరకు ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 నుండి 2.0 డిగ్రీలకే పరిమితమవుతుందా లేక 2.0 డిగ్రీల సెంటీగ్రేడుని మించుతుందా అనే విషయంపై పర్యావరణవేత్తలు చర్చించుకుంటున్నారు. కార్బన్‌డైఆక్సైడ్‌ సాంద్రత పెరుగుతుందనేది నిర్వివాదాంశం. కార్బన్‌మోనాక్సైడ్‌, మిథేన్‌ వంటి ప్రమాదకరమైన వాయువులు పర్యావరణానికి సవాలుగా తయారయ్యాయి. ఓజోన్‌ పొరలో రంధ్రాలు ఏర్పడటం, పెద్దవి కావటం నీలలోహిత కిరణాలు ప్రకృతిపైన, మనుషులపైన విపరీత ప్రభావం కలిగించవచ్చని దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. బొగ్గు, క్రూడాయిల్‌, గ్యాస్‌ వంటి ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించి, సూర్యరశ్మి, పవనశక్తి, హైడ్రో ఎలక్ట్రిక్‌ వంటి పునరుత్పాదక శక్తి కలిగిన వనరుల్ని ఎక్కువగా వాడాలని అన్ని దేశాలు నిర్ణయించాయి. కాని కార్యాచరణలో అభివృద్ధి చెందిన దేశాలు వెనుకంజ వేస్తున్నాయి. పారిస్‌, క్యోటో ఒప్పందాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. అన్ని దేశాలూ బాధ్యతల్ని పంచుకోకుంటే భూగోళం వేడెక్కక తప్పదు. అది వర్షపాతంపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాల్లోని వర్ధమాన దేశాల్లో వర్షపాతం తగ్గుతుందని అంచనాలు ఈ దేశాల్లో పేదరికం, ఆకలి బాధలు పెరుగుతాయనే భయాలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే ‘ఎల్‌నినో’ ప్రభావంతో భారత్‌ వంటి దేశాల్లో వర్షాలు తగ్గుతాయనే ఆందోళనలున్నాయి. 2023-24లో వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉంటుందనే అంచనాలే కొంత ఆందోళన కలిగిస్తున్నది.

తగ్గని వర్షపాతం:

గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఒక సంవత్సరంలో కురిసే వర్షపాతంలో మార్పు లేదని భారత వాతావరణ సంస్థ చెబుతున్నది. అయితే రుతుపవనాల ప్రారంభం, గమనం, ముగింపులో సంవత్సరాల మధ్య తేడా ఉంటున్నది. ఈ సంవత్సరం నడి వేసవిలో వర్షాలు ఎక్కువగా ఉండటాన్ని కూడా తాత్కాలికమార్పే కాని దీర్ఘకాలమార్పు కాదనే అర్థం చేసుకోవాలి. కాని రైతులు ఒక వాతావరణ క్రమాన్ని బట్టి తమ పంటల సరళిని, పొలం పనుల్ని నిర్ణయించుకుంటారు. ఊహించని సమయంలో వర్షాలు పడటం వల్ల రైతులు ఒక విధంగా ‘షాక్‌’కి గురయ్యారు. ఆకస్మిక మార్పుల వల్ల కలుగుతున్న నష్టాలను వారే ఎక్కువగా భరించాల్సి వస్తున్నది. దిగుబడులు బాగుండి, ఆదాయాలు తగ్గడం ఆరుదుగా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో రైతుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తమ పంటల బీమా పథకం ఎందుకు విఫలమైందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎన్నో రాష్ట్రాలు వైదొలగటం, రైతుల సంఖ్య తగ్గిపోవటం, కొన్ని కంపెనీలు కూడా ఈ పథకం నుండి తప్పుకోవటం, రైతుల్ని కష్టాల్లో ఆదుకోలేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని, కొత్త పథకాన్ని రూపొందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఏదో ఒక్కో చిన్న రైతుకి ఏటా ఆరువేలిస్తున్నాము కాబట్టి మద్దతు ధరల్ని కాపాడము, సేకరణ మద్దతు నందించం, ప్రకృతి వైపరీత్యాల నుండి రైతుల్ని రక్షించం అనే వైఖరి సమంజసం కాదు. రైతుబంధు సాయాన్నిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం, నవరత్నాలిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తప్పించుకోవటం సమర్ధనీయం కాదు. అనేక వైపరీత్యాల నెదుర్కుంటూ, రైతు కూలీలు కష్టించి, దేశంలో ఆహార కొరత రాకుండా చేస్తున్న రైతు కూలీల జీవన స్థితిగతుల గురించి ఆలోచించాలి. కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి.   

డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, 

(రిటైర్డ్‌ & కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More

సొంత మార్కెటింగ్‌, శారీరక శ్రమ చేయగలిగితే ఉద్యోగం తప్సనిసరి కాదు

మన దేశ జనాభా ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఇటీవలే మన జనాభా చైనాను దాటి జనాభాలో ప్రపంచంలో మొదటి స్థానాన్ని సంపాదించింది. జనాభాతో పాటు నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న నిరుద్యోగులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పెరగడము లేదు. కొంతమంది నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. మిగతా నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం అన్వేషించాలి. ఉపాధి అవకాశాల గురించి ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్న ప్రజల జీవనశైలి ప్రకారం అందరికి నచ్చే ఉపాధి అవకాశాలు సరైన మొత్తంలో అందుబాటులో ఉండడము లేదు. మనది వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్యకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా మన దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలకే ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాబట్టి నిరుద్యోగులు తమ జీవన శైలిని మార్చుకొని వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను స్వయం ఉపాధిగా మలచుకున్నట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. కాని ఈ రంగాలలో శారీరక శ్రమతో పాటు ఇతర సమస్యలు ఉంటున్నాయి కాబట్టి ఈ రంగాలను ఉపాధి అవకాశాలుగా ఎంచుకోవటానికి ఎక్కువమంది యువత ముందుకు రావడము లేదనే విషయం ప్రస్తుత సమాజాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది. కాని కొంతమంది యువత అన్ని సమస్యలను ఎదుర్కోగలమనే నమ్మకంతో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలవైపు అడుగులు వేస్తూ స్వయం ఉపాధి మార్గాలుగా ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. కొంతమంది ఇంకొంత ఆదర్శంగా ఆలోచించి చేస్తున్న ఉద్యోగాలను వదలి కూడా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలను స్వయం ఉపాధి మార్గాలుగా ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. ఈ రంగాలలో విజయం సాధించిన వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమకు వెనుకంజ వేయకుండా, సొంత మార్కెటింగ్‌ వ్యవస్థను సృష్టించుకున్న వారు తప్పనిసరిగా వ్యవసాయం రంగంలో విజయం సాధిస్తూ ఉద్యోగంలో వచ్చిన జీతం కంటే ఎక్కువ ఆదాయాన్ని తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఆనందకరమైన జీవితాలను గడుపుతూ ఆడుతూ, పాడుతూ, శ్రమిస్తూ… సంపాయిస్తున్నారు. ఈ కోవకే చెందుతాడు హైదరాబాదు శివారు తురకపల్లి మండలం మాధపురం గ్రామంకి చెందిన జైపాల్‌రెడ్డి.

వ్యవసాయ నేపధ్యానికి చెందిన జైపాల్‌రెడ్డి ఐఐటి చదివి ఇసిఐఎల్‌లో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి కొనసాగిస్తున్నాడు. 2009లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి తన చదువుకు సంబంధించిన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో ప్రకృతి వ్యవసాయం గురించి, ఆరోగ్యం గురించి, మన ఆరోగ్యం కాపాడుటలో ప్రకృతి వ్యవసాయం ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయాలను రాజీవ్‌ దీక్షిత్‌ మరియు సుభాష్‌ పాలేకర్‌ వంటి వారి ద్వారా తెలుసుకుని తాను కూడా సమాజానికి మంచి ఆహారాన్ని అందించాలని ఆలోచించ సాగాడు. తన లక్ష్యం నెరవేరాలంటే చేస్తున్న ఉద్యోగాన్ని వదలడముతో పాటు అప్పటి వరకు తన తల్లిదండ్రులు చేస్తున్న రసాయనిక సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చగలగాలి. ఈ రెండు పనుల వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా చేస్తున్న ఉద్యోగాన్ని 2019 సం||లో వదలి వేసి తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నా కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టాడు. 

మంచి జీతాన్ని వదులుకొని వ్యవసాయంలోకి అదీను శారీరక శ్రమ ఎక్కువగా ఉండే సేంద్రియ సాగులోకి జయపాల్‌రెడ్డి అడుగు పెట్టడము వారి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. వారికి ఇష్టం లేకపోవడానికి మన సమాజ పరిస్థితులే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. మన సమాజంలో ఎక్కువ మంది ప్రజలు డబ్బు సంపాదనే ధ్యేయంగా పెరుగుతున్నారనే విషయం అక్షర సత్యం. ప్రస్తుతంతో పోల్చుకుంటే గత రెండు మూడు థాబ్దాల క్రితం ఈ పరిస్థితులు మన సమాజంలో ఇంకా ఎక్కువగా ఉండేవి. గతాన్ని అంటే 30, 40 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మనిషి పుట్టింది డబ్బు సంపాదన కొరకు, సుఖాలను అనుభవించుట కొరకే అని భావించే వారే అప్పటి సమాజంలో 90 శాతానికి పైగా ఉన్నారనే విషయం అక్షర సత్యం. కాబట్టే అప్పట్లో ప్రజలు అన్నీ ఫణంగా పెట్టి డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవితాలను కొనసాగించే వారు. కొంతమంది అయితే తమ ఆరోగ్యాలను, ప్రాణాలను ఫణంగా పెడుతూ డబ్బు సంపాదన కోసం వెంపర్లాడేవారు అనే విషయం అందరికీ తెలిసిందే. అందువలన అప్పట్లో ఆరోగ్యం కోసం పెద్దగా ఆలోచించే వారు కాదు. కాని రాను రాను ఎక్కువమంది ప్రజలకు డబ్బు అందుబాటులోకి రావడము, కొంతమందికి అవసరానికి మించి డబ్బు అందుబాటులోకి రావడము మొదలవటం, ఉపాధి అవకాశాలు పెరగడము లాంటి వివిధ రకాల పరిస్థితుల వలన గతంతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువమందికి కనీస అవసరాలు తీర్చుకోవటానికి అవసరమయినంత డబ్బు అందుబాటులోకి వచ్చిందని చెప్పవచ్చు. గతంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి అందుబాటులో లేని డబ్బు ప్రస్తుత పరిస్థితులలో కనీస అవసరాలతో పాటు విలాస వంతమైన, సౌకర్యవంతమైన జీవితాలను కొనసాగించటానికి కూడా అవసరమైన డబ్బు ఎక్కువమందికి అందుబాటులోకి రావటం వలన కొంతమందికి కోల్పోతున్న ఆరోగ్యం గురించి చర్చ మొదలయ్యింది. కరోనా సమస్య, సామాజిక మాధ్యమాలు వేగంగా అభివృద్ధి చెందడంతో సమాచారం చాలా వేగంగా ప్రపంచం మొత్తం తెలవటానికి అవకాశాలు అందుబాటులో ఉండడము లాంటి కారణాల వలన ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరిగి ఆరోగ్యానికి సరైన దారి సేంద్రియ ఆహారం అని అందరికీ తెలిసి వచ్చింది కాబట్టి ఎక్కువ మంది యువత సేంద్రియం వైపు అడుగులు వేస్తున్నారు. జయపాల్‌ రెడ్డి కూడా ఈ బాటలోనే నడుస్తానంటే అప్పటి పరిస్థితులు ప్రత్యక్షంగా అనుభవించిన వీరి తల్లిదండ్రులు జయపాల్‌ రెడ్డిని వ్యతిరేకించారు. ఇంకా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయినాకాని జయపాల్‌ రెడ్డి వెనుకంజ వేయకుండా చేస్తున్న ఉద్యోగాన్ని వదలి సేంద్రియ సాగులో అడుగు పెట్టి ఇందులోనే తన ఆదాయం పెంచుకొనే మార్గాలను అన్వేషిస్తూ 2019 నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాడు.

2019లో ప్రకృతి సాగులోకి అడుగు పెట్టిన జయపాల్‌ రెడ్డి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వచ్చాడు కాబట్టి ఉద్యోగంలో వచ్చిన డబ్బు తప్పనిసరిగా పొందాలనే లక్ష్యంతో మార్గాలు అన్వేషిస్తూ సొంత మార్కెటింగ్‌ మరియు అనుబంధ రంగాలను ఆదరించడమే అని గ్రహించి తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు మంచి ధరలకు అమ్మడంతో పాటు మన దేశీయ జాతి ఆవులను కొనుగోలు చేసి వాటి ద్వారా వచ్చిన పాలను, నెయ్యిని మంచి ధరలకు నేరుగా వినియోగదారులకు అమ్ముతూ వస్తూ ఉద్యోగంలో సంపాదించిన దానికంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాడు.

పూర్తి సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల కూరగాయలు, మామిడి, మన పురాతన వరి రకాలను పండిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం మామిడి, వరి పంటలు సాగులో ఉన్నాయి. గత సంవత్సరం వరకు వివిధ రకాల కూరగాయలు సాగు చేశాడు. ప్రస్తుతం కూరగాయలు సాగులో లేవు. వాటితో పాటు మన దేశీ జాతి ఆవులను పోషిస్తూ వాటికి అవసరమయిన పశుగ్రాసాలను సొంతంగా సాగు చేస్తున్నాడు.

వరి: ప్రతి సంవత్సరం వరి సాగు చేస్తుంటాడు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు మొదలు పెట్టిన తరువాత నూతన వరి వంగడాలను ప్రక్కన పెట్టి మన పురాతన వరి రకాలను మాత్రమే సాగు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు నవారా, బహురూపి, కర్పూరకేలి, రత్నచోడి, మైసూర్‌ మల్లిక, ఇంద్రాణి, కుజుపటాలియా లాంటి రకాలను మాత్రమే సాగు చేశాడు. మన పురాతన వరి రకాలలో మన ఆరోగ్యాన్ని కాపాడే లక్షణాలు ఉంటాయని భావించి ఆ రకాలనే సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం మూడు ఎకరాలలో మైసూర్‌ మల్లికు మరియు కుజుపటాలియా రకాలు సాగులో ఉన్నాయి. సొంత విత్తనాలను ఎకరానికి 10 కిలోల చొప్పున నారు పోసుకుని 20 రోజులు పెరిగిన నారుని ప్రధాన పొలంలో నాటించాడు. సొంత ఆవుల ద్వారా వచ్చిన ఎరువు కుప్పపై జీవామృతాన్ని చల్లి ఆ ఎరువుకుప్పను ఘనజీవామృతంగా మార్చుకుని దుక్కిలో ఎకరానికి ఒక ట్రక్కు చొప్పున ఘనజీవామృతాన్ని అందించారు. నవంబరు 20న నారు పోసుకుని డిసెంబరు 10న నారు నాటించారు.  నారు నాటిన తరువాత ప్రతి 10 లేదా 15 రోజులకు ఒకసారి ఎకరానికి 200 లీటర్ల చొప్పున జీవామృతం మరియు గో-కృపామృతాలను మార్చి మార్చి భూమికి అందిస్తూ వస్తున్నాడు. అవసరాన్ని బట్టి పుల్లటి మజ్జిగ, జీవామృతం, వేపకషాయాలను పంటపై పిచికారి చేయించారు. అంతకు మించి ఏమీ చేయలేదు. పంట మే మూడవ వారంలో కోత కోయించాడు. ఎకరానికి 70 కిలోల బస్తాలు 25 వరకు దిగుబడి వచ్చింది. గత పంటకాలంలో 3 ఎకరాలకు గాను 4200 కిలోల బియ్యాన్ని పొంది కిలో 70/- నుంచి 80/- ల వరకు అమ్మకం చేశాడు.

మామిడి: తెలిసిన వారికి చెందిన 7 ఎకరాల మామిడి తోటలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ తాను మార్కెటింగ్‌ చేసుకోగలిగిన మొత్తంలో మామిడి కాయలను తోట యజమాని నుంచి కొనుగోలు చేస్తూ నేరుగా వినియోగదారులకు మంచి ధరలకు అమ్మకం చేస్తుంటాడు. ప్రతి 30 రోజులకు ఎకరానికి 200 లీటర్ల చొప్పున జీవామృతం లేదా గోకృపామృతాలను మార్చి మార్చి డ్రిప్పు ద్వారా మామిడి మొక్కల పాదులలో అందిస్తుంటారు. అవసరాన్ని బట్టి థపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగలను పంటపై పిచికారి చేయిస్తుంటారు. తనకున్న ఆవులను 7 ఎకరాల మామిడి తోటలో తిరగనిస్తుంటారు. బంగినపల్లి, రసాలు, థేరి రకాలను సాగు చేస్తూ కిలో 100 నుంచి 120/-లకు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తూ ఉంటాడు.

ఆవులు: ప్రస్తుత పరిస్థితులలో మనదేశీ జాతి ఆవులయిన ఒంగోలు, గిర్‌, సాహివాల్‌, తార్‌పార్కర్‌ మొదలగు గోవుల పాలు మరియు నెయ్యిలకు గిరాకీ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దానిని గమనించి జయపాల్‌ రెడ్డి దేశీ జాతి ఆవులతో పశుపోషణ మొదలు పెట్టాడు. పశుపోషణలో ఆర్థికంగా ఫలితాలు సాధించాలంటే గిర్‌, కాంగ్రెజ్‌, సాహివాల్‌ జాతులు మొదటి వరుసలో ఉంటాయని గ్రహించి ఈ జాతులనే కొనుగోలు చేస్తూ తన పశు సంపదను అభివృద్ధి పరుస్తున్నాడు. మొదటలో 2020వ సంవత్సరములో రెండు గిర్‌ ఆవులను కొనుగోలు చేశాడు. ప్రతి సంవత్సరం కొన్ని ఆవులను కొనుగోలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల అంటే రెండు నెలల క్రితం 1,20,000/-లు వెచ్చించి గిర్‌ ఆవును కొనుగోలు చేశాడు. ఆ ఆవు మే 2వ తారీఖున ఈనింది. ప్రస్తుతం అది రెండు పూటలా కలిపి 8 లీటర్ల పాలు ఇస్తుంది. పూటకి లీటరు చొప్పున దూడకు వదలగా పూటకు 4 లీటర్ల పాలు ఇస్తుంది. ఈ ఆవు పాల దిగుబడి పెరుగుతూ కొన్ని రోజులు గడిచే సరికి రోజుకి 16 నుంచి 20 లీటర్లు పాలు పొందగలననే నమ్మకంతోనే జయపాల్‌ రెడ్డి ఆ ఆవును 1,20,000/-లకు కొనుగోలు చేశాడు. మొత్తం 15 ఆవులను, ఒక ఎద్దును, 10 దూడలను పోషిస్తున్నాడు. 15 ఆవులలో 9 ఆవులు ప్రస్తుతానికి పాలు ఇస్తున్నాయి. ఆవులలో గిర్‌, కాంగ్రెజ్‌, సాహివాల్‌, రాఠి, రెడ్‌సింధి రకాలు ఉన్నాయి. దూడలలో 5 మగవి, 5 ఆడవి ఉన్నాయి. 9 ఆవుల నుండి రోజుకు రెండు పూటలు కలిపి సగటున 60 లీటర్ల పాల దిగుబడి పొందుతున్నాడు. ఒక రోజు పాలను నెయ్యి చేస్తుంటాడు. ఒక రోజు పాలను వినియోగదారులకు అమ్ముతుంటాడు. అంటే రోజు మార్చి రోజు అంటే నెలలో 15 రోజుల పాలను నెయ్యి (పాలను పెరుగు చేసి, ఆ పెరుగు చిలికి వెన్న చేసి వెన్న నుంచి నెయ్యి) చేస్తుంటాడు. నెలకు 50 నుంచి 60 లీటర్ల నెయ్యి పొంది లీటరు 2500/-లు (మిషను సహాయంతో వెన్న పొంది, ఆ వెన్నతో చేసిన నెయ్యి) మరియు లీటరు 3500/- (మనిషి చిలికి వెన్న పొంది ఆ వెన్న నుంచి పొందిన నెయ్యి) ల చొప్పున అమ్మకం చేస్తున్నాడు. నెలకు 15 రోజులు రోజుకు 60 లీటర్ల చొప్పున పాలను లీటరు 100/- నుంచి 120/-లకు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తున్నాడు. ఆవులను సాధ్యమయినంత వరకు స్వేచ్ఛగా తిరగనిస్తుంటాడు. వీటికి పశుగ్రాసంగా సూపర్‌ నేపియర్‌, మొక్కజొన్నలను సాగు చేస్తున్నాడు. ఈ పశుగ్రాసాలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతోనే సాగు చేస్తున్నాడు. ఈ పశుగ్రాసాలతో పాటు వేరుశనగ చెక్క, దాణాలను కూడా అందిస్తున్నాడు. తాను పోషించే ఆవుల గర్భధారణ కొరకు ఎలాంటి కృత్రిమ పద్ధతులవైపు ఆలోచించకుండా తాను పోషిస్తున్న గిర్‌, కాంగ్రెజ్‌ కలయికలతో ఉన్న ఎద్దునే ఉపయోగిస్తున్నాడు.

ఏది ఏది ఏమైనా కాని చేస్తున్న ఉద్యోగాన్ని వదలి తల్లిదండ్రులను ఎదిరించి సేంద్రియ సాగు చేస్తూ తన భూమిని, ప్రకృతిని తనవంతుగా కాపాడుతూ తాము ఆరోగ్యకరమైన ఆహారం తింటూ సమాజానికి ఆరోగ్యకర ఆహారాన్ని అందిస్తూ ఉద్యోగంలో కంటే ఎక్కువగా సంపాదిస్తూ శారీరక శ్రమ, సొంత మార్కెటింగ్‌ చేయగలిగితే ఉద్యోగం చేయనవసరం లేదు అని జయపాల్‌ రెడ్డి నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9666167923కి ఫోను చేసి తెలుసుకోగలరు.

శారీరక శ్రమ తప్పనిసరి

తాను చేసే సేంద్రియ సాగు మరియు పశుపోషణలో శారీరక శ్రమ తప్పనిసరిగా ఉంటుంది. సేంద్రియ సాగులో వినియోగించే వివిధ రకాల కషాయాలు మరియు ద్రావణాలు సొంతంగా తయారు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వచ్చిన దిగుబడికి మంచి ధర లభించాలంటే సొంతంగా మార్కెటింగ్‌ చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి శారీరక శ్రమ చేయగల వారికి సేంద్రియ పద్ధతులు ఆరోగ్యకరమైన వ్యాపకం అని నిస్సందేహంగా చెప్పవచ్చని జయపాల్‌ రెడ్డి అంటున్నాడు.

రోజుకి 20 లీటర్ల పాలు ఇచ్చే గిర్‌ ఆవు

మన దేశీ జాతి ఆవులు అనగానే పాలు సక్రమంగా పొందలేము అనే అభిప్రాయం రైతులలో ఉంది. అందువలననే విదేశీ జాతులవైపు పశుపోషకులు మొగ్గు చూపుతున్నారు. తాను పోషించే ఆవులలో రోజుకు 10 నుంచి 12 లీటర్ల పాలు ఇచ్చే గిర్‌, కాంగ్రెజ్‌, సాహివాల్‌ ఆవులు ఉన్నాయి. రోజుకు రెండు పూటలు కలిపి 16 నుంచి 20 లీటర్ల పాలు ఇచ్చే గిర్‌ ఆవును రెండు నెలల క్రితం 1,20,000/-లు వెచ్చించి కొనుగోలు చేయడం జరిగింది. ఈ ఆవు ఇటీవల ఈనడము జరిగింది. ప్రస్తుతానికి పూటకు 5 లీటర్ల చొప్పున (దూడ తాగే పాలతో కలిపి) రోజుకు 10 లీటర్ల చొప్పున ఇస్తుంది. క్రమేపి పాల దిగుబడి పెరిగి రోజుకు రెండు పూటలు కలిపి 16 నుంచి 20 లీటర్ల పాలను ఈ ఆవు నుంచి పొందుతానని జయపాల్‌రెడ్డి అంటున్నాడు.

ఎక్కడికి అక్కడే మార్కెట్లు సృష్టించుకోవాలి

మార్కెట్‌ గురించి దూరం ఆలోచించకుండా ఈ పద్ధతులు పాటించే వారు తమ ప్రాంతాలకు సమీపములోనే మార్కెట్‌ను సృష్టించుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ జీవితాలను కొనసాగించవచ్చు. ఇష్టం లేకుండా ఒకరి దగ్గర ఉద్యోగం చేయకుండా తమ కాళ్ళపై తామే నిలబడుతూ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాలకు ఇదే సరైన దారి కాబట్టి ఈ దారిలో నడవటానికి లక్షల మందికి అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగులు ఈ దిశగా ఆలోచన చేయాలని జయపాల్‌ రెడ్డి కోరుతున్నాడు. 

నాణ్యమైన ఉత్పత్తులు వినియోగదారులకు అందించడము ముఖ్యం

ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది ప్రజలకు ఆరోగ్యం గురించి, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలనే విషయాల గురించి అవగాహన పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంది కాబట్టి ఈ పరిస్థితులను మనము అనుకూలంగా మలచుకోవాలంటే నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించగలిగితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయనే దానికి తానే ఉదాహరణ అని జయపాల్‌ రెడ్డి అంటున్నాడు. తాను మొదటలో బియ్యం, కూరగాయలను వినియోగదారులకు ఇవ్వడంతో మొదలు పెట్టి ప్రస్తుతం మామిడి కాయలు, ఆవు పాలు, ఆవు నెయ్యి లాంటి ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మగలుగుతున్నాడు. ఒక పంట కాలానికి తాను పొందే 4000 కిలోలపైగా దేశీ రకం బియ్యం, నెలకు 50 నుండి 60 లీటర్ల నెయ్యి, నెలకు 800 నుంచి 900 లీటర్ల ఆవు పాలు, సంవత్సరానికి సుమారుగా 5000 కిలోల మామిడి కాయలు నేరుగా వినియోగదారులకు అమ్మగలుగు తున్నాను. నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ వినియోగదారులకు నమ్మకం కలిగించగలిగితే ఉజ్వల భవిష్యత్తుకు అవకాశాలు మెండుగా ఉంటాయని జయపాల్‌ రెడ్డి నిరూపిస్తున్నాడు.

Read More

మట్టిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది

ఆదిలక్ష్మి, రైతు శిక్షణా కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌

మట్టి అన్నింటికీ మూలం. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న బంగారం, రాగి, వెండి, ఇనుము లాంటి ఖనిజాలు అన్నీ కూడా మట్టిలోనుండే వస్తున్నాయి. వివిధ రకాల పంటలను మట్టిలోనే పండిస్తున్నాము. చేదుగా ఉండే కాకరకాయ, తీపిగా ఉండే మామిడికాయ, సువాసనలు అందించే మల్లెపూలు, రంగురంగుల మందార పూలు ఈ విధంగా చూసుకుంటే వివిధ రకాల రుచులు, వివిధ రకాల సువాసనలు, వివిధ రకాల రంగుల పంటలన్నీ కూడా మట్టి ద్వారానే మనం పొందుతున్నాము. మనిషితో పాటు ఏ జీవి చనిపోయినా కుడా మట్టి తనలో కలుపుకుంటుంది. ఇలాంటి ఎన్నో గొప్ప గుణాలున్న మట్టిని రసాయనాలు వేసి పాడు చేస్తున్నాము. కాబట్టి అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా మేల్కొని రసాయనాలను వీడి సేంద్రియ సాగు బాటపట్టి మట్టిని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై  ఉందని ఏప్రిల్‌ 9న ‘నాబార్డు’ వారి సహకారంతో  రైతునేస్తం ఫౌండేషన్‌  ఆధ్వర్యంలో మెదక్‌ జిల్లా, నర్సపూర్‌లోని శ్యామసుందర్‌ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ సాగు విధానం, కషాయాలు, మిశ్రమాల తయారీతోపాటు రైతులు పండిరచిన వ్యవసాయ దిగుబడులకు విలువ జోడిరపు వంటి అంశాలపై జరిగిన అవగాహన సదస్సులో రాజేంద్రనగర్‌ రైతు శిక్షణా కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆదిలక్ష్మి అన్నారు. కార్యక్రమంలో ఏ.ఈ.ఓ. విజృంభణ, సేంద్రియ రైతులు శ్యామసుందర్‌ రెడ్డి, బాలేష్‌, క్రాంతి కిరణ్‌, రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

రైతులు ఏక పంట విధానానికి స్వస్తి పలికి బహుళ పంటల విధానాన్ని చేపట్టడంతోపాటు గొర్రెలు, మేకలు, కొళ్ళను కూడా పెంచుకుంటూ సమగ్ర వవ్యవసాయ విధానాలను అవలంబించగలిగితే ఫలితాలు ఆశాజనకంగా   ఉంటాయని తన సొంత అనుభవాన్ని శ్యామసుందర్‌ రెడ్డి వివరించారు. వేసవి కాలంలో ఆకు కూరలకు గిరాకీ బాగా ఉంటుంది కాబట్టి నీడ అందుబాటులో ఉండే ప్రదేశాలలో వివిధ రకాల ఆకు కూరలను, కూరగాయలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తూ వచ్చిన దిగుబడులను నేరుగా వినియోగదారులకు అమ్మకం చేసినట్లయితే సేంద్రియ సాగులో లాభాలు తప్పనిసరిగా వస్తాయని తన సొంత అనుభవాన్ని సేంద్రియ రైతు బాలేష్‌ వివరించారు. సేంద్రియ సాగు ఆవశ్యకత, వివిధ పంట ఉత్పత్తులకు విలువ జోడిరపుకు సంబంధించిన సమాచారాన్ని  రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై. వేంకటేశ్వరరావు విపులంగా వివరించారు. శిక్షణకు హాజరైన రైతులు శ్యామసుందర్‌ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రాన్ని ప్రత్యక్షంగా తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాజరైన రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు.

Read More

తమలపాకు – సస్యరక్షణ

పురుగులు: తమలపాకు తోటల్లో తీగలను ఆశించే ప్రధానమైన పురుగులు పొగాకు లద్దె పురుగు, అగ్గిపురుగు, తెల్లనల్లి, ఎర్రనల్లి. అవిశ మొక్కలను చిత్తపురుగులు, బర్మా పురుగు, పొగాకు లద్దె పురుగు, ఆకుముడత పురుగు, ఎర్రనల్లి ప్రధానంగా ఆశిస్తాయి. 

పొగాకు లద్దెపురుగు: ఈ పురుగు ముందుగా అవిశ మొక్కలను ఆశించి అవిశ ఆకులను తిని వేయుట వలన అవిశ మొక్కలు తమలపాకు తీగలకు సరిపోయే నీడను అందించలేవు. తమలపాకుల తీగలను ఆశించినప్పుడు తమలపాకులపై రంధ్రాలు ఏర్పడతాయి. లింగాకర్షణ బుట్టలు హెక్టారుకు పది చొప్పున జూలై నుండి తోటల్లో అమర్చుకోవాలి. జల్లెడ చేసిన అవిశ ఆకులను, తమలపాకులను తొలగించాలి. అక్టోబరు, నవంబరు నెలల్లో 5శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి (ఎకరాకు ఒక లీటరు వేపనూనె చొ||న) కోతకు వచ్చిన ఆకులు కోసిన తరువాత పిచికారి చేయాలి. 

అగ్గిపురుగు : లేత తమలపాకుల నుండి తల్లిపురుగులు, పిల్లపురుగులు రసం పీల్చడం వలన ఆకులపై కాలిన మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు 5 శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి (ఎకరాకు 400 మిల్లీ లీటర్లు) కోతకు వచ్చిన ఆకులు కోసిన తరువాత పిచికారి చేయాలి. 

తెల్లనల్లి/ఎర్రనల్లి : తెల్లనల్లి లేత ఆకుల నుండి రసం పీల్చడం వలన ఆకులు ముడతబడతాయి. ఎర్రనల్లి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఎరుపు లేదా గోధుమరంగు మచ్చలు కనబడతాయి. నివారణకు డిసెంబరు జనవరి నెలల్లో లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పాడిని కలిపి (ఎకరాకు 800 గ్రా.) పిచికారి చేయాలి. అదే విధంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 15 రోజుల వ్యవధిలో రెండు పర్యాయములు పిచికారి చేయాలి. 

చిత్తపురుగు : అవిశ విత్తనము నాటిన 15 నుండి 20 రోజులకు ఈ పురుగు ఆశించిన ఆకులపై రంధ్రాలు చేసి మొక్కల మొదళ్ళను కొరికి వేయును. నివారణకు 5శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

అవిశ గొంగళి పురుగులు: ఆవిశ ఆకులను ఆకుపచ్చ రంగులో ఉండే సెమీలూపర్‌, ఆకుముడత పురుగులు ఆశించుట వలన, అవిశ మొక్కలు ఆకులు లేని మోడులై, కొత్తగా నాటిన తమలపాకు తీగలకు కావలసిన నీడను ఇవ్వలేవు. దీని ఫలితంగా, తీగలు అధిక సూర్యరశ్మికి గురై ఎండిపోతాయి. వీటి నివారణకు తగిన చర్యలు చేపట్టాలి. తీగ నాటిన తర్వాత 5 శాతం వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

కాండము తొలుచు పురుగు (బర్మా పురుగు): ఈ పురుగు తాకిడి ఆగష్టు నెలలో ప్రారంభమై మార్చి నెల వరకు ఉంటుంది. అవిశ మొక్కల కాండపు లోపలి భాగాన్ని గొంగళి పురుగు తొలిచి వేయడం వలన మొక్క బలహీనపడి విరిగిపోతుంది. దీని నివారణకు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 2-3 సార్లు అవిశ మొక్కల తలలను గిల్లి వేయాలి. పురుగు తొలి థలోనే ఉన్నప్పుడు 5 శాతం వేపగింజలు కలిపి కషాయం లేదా వేపనూనె 5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి పిచికారి చేయాలి. అవిశ కాండం తొలిచే పురుగు తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో అవిశ తోట సాగు క్లిష్టతరంగా ఉన్నపుడు అవిశ మొక్కలకు ప్రత్యామ్నయంగా తమలపాకు తీగలకు నీడను కల్పించడానికి హరిత గృహాలు/షేడ్‌నెట్లను ఏర్పరచి కూడా తమలపాకు తోటలను సాగు చేయవచ్చును. ఈ షేడ్‌ నెట్‌ విధానంలో షేడ్‌నెట్‌ లోపల మొక్కలకు వెదురుగెడలను పాతి తమలపాకు తీగలను నాటేటప్పుడు వెదురుగెడలకు పాకించి నాటుకోవాలి. ఈ షేడ్‌నెట్‌ విధానం ద్వారా అవిశ మొక్కల నుండి తమలపాకు తీగలకు ఆశించే పురుగులను అరికట్టవచ్చు. 

సర్పిలాకారపు తెల్లదోమ: ఇటీవల కాలంలో తమలపాకు తోటలలో ముఖ్యంగా కొబ్బరి తోటలు మరియు జామ తోటల సమీపంలో సాగు చేస్తున్న తమలపాకు రైతులకు మరో సమస్యగా మారిన పురుగు సర్పిలాకారపు తెల్లదోమ. ఇప్పటి వరకు తమలపాకు తోటలలో ఈ పురుగు తీవ్రత తక్కువగానే ఉంది. అయినప్పటికీ తమలపాకు రైతులు ముందు జాగ్రత్త చర్యలు అవలంబించినట్లయితే సర్పిలాకారపు తెల్లదోమ నుండి తమలపాకు తోటలను కాపాడవచ్చు. గత 3 సం||ల నుండి సర్పిలాకారపు తెల్లదోమ ప్రధానంగా కొబ్బరితోటలు, ఇతర ఉద్యాన పంటలైన జామ, ఆయిల్‌పామ్‌, అరటి, సీతాఫలం మరియు సపోట తోటలలో పొడి వాతావరణంలో ముఖ్యంగా అక్టోబరు నుండి మార్చి వరకు ఆశించడం వలన దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. తల్లి రెక్కల పురుగు ఆకు అడుగుబాగాన తెల్లటి వలయాల మాదిరిగా గుడ్లను పెడుతుంది. ఈ సర్పిలాకారపు తెల్లదోమ పిల్లపురుగులు మరియు తల్లి పురుగులు ఆకులు అడుగుభాగాన గుంపులుగా చేరి రసం పీల్చడం వలన ఆకులు నాణ్యత, పరిమాణం కోల్పోతాయి. పురుగు ఉధృతి అధికమైనప్పుడు నల్లని మసిలాంటి బూజుతెగులు ఆకుల పైన వృద్ధి చెందుతుంది. తద్వారా ఆకు మార్కెట్‌కు పనికి రాకుండా పోవడం వలన దిగుబడి తగ్గే అవకాశం ఉంది. తమలపాకులను నేరుగా తింటాము కాబట్టి రసాయనిక పురుగు మందులను పిచికారి చేయరాదు. ఈ పురుగు నివారణకు కింద ఉదహరించిన యాజమాన్య పద్ధతులను రైతులు పాటించినట్లయితే పురుగును చాలావరకు అదుపులో ఉంచవచ్చు. పురుగు ఉనికిని గమనించడానికి పసుపు రంగు జిగురు అట్టలను ఎకరానికి 5 చొప్పున ఏర్పరచుకోవాలి. తెల్లదోమ ఆశించిన తీగలను విత్తనపు తీగగా ఎంచుకోరాదు. మిత్రపురుగులైన ఎన్కార్సియా గుడెలోపే అనే పరాన్నజీవి సర్పిలాకార తెల్లదోమ యొక్క పిల్ల పురుగులను సహజంగా అదుపులో ఉంచుతాయి. పరాన్న జీవి ఆశించి నల్లగా మారిన పిల్లపురుగులను ఆకుల మీద గమనించగానే ఇటువంటి ఆకులను మిగతా తమలపాకు తోటల్లో తెల్ల దోమ ఆశించిన తీగల దగ్గరలో ఉంచడం వలన పరాన్నజీవి కొత్త తోటలలో వృద్ధి చెంది తెల్లదోమను అదుపులో ఉంచుతుంది. డైకోక్రెసా అస్టుర్‌ గుడ్లను లేదా పిల్లపురుగులను 500 నుండి 1000 ఎకరానికి చొప్పున 15 రోజుల వ్యవధిలో తోటల్లో విడుదుల చేయాలి. మిత్రపురుగుల ఉనికి ఉన్నప్పుడు ముందుగా 1 శాతం అజాడిరక్టిన్‌ 1500 పిపిఎం లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున పిచికారి చేయాలి. పురుగును నియంత్రించే శిలీంధ్రం ఇసారియ ఫ్యుమసోరోసే (1þ108 కణాలు / మి.లీ.) 6 మిల్లీ లీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

మిత్రపురుగులు: తమలపాకు తోటల్లో ఆశించే హాని కలుగచేసే పురుగులను వివిధ రకాల మిత్ర పురుగులైన అక్షింతల పురుగులు సాలీళ్లు మరియు పరాన్న జీవులు సహజంగానే కొంతవరకు అదుపులో ఉంచుతాయి. 

తెగుళ్ళు: తమలపాకు తోటలలో కనిపించే తెగుళ్ళలో ఎండుతెగులు మరియు ఆకుమచ్చ తెగుళ్ళ ప్రధానమైనవి. 

ఎండు తెగులు లేదా ఆకు /మొదలుకుళ్ళు తెగులు : ఆకులపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు గాని గాఢ మరియు లేత గోధుమ రంగు వలయాలతో మచ్చలు వచ్చి నల్లగా మారతాయి. మచ్చలు ఉన్న ఆకుల నుండి శిలీంధ్రము భూమిలో చేరి వృద్ధి చెందుతుంది. తీగ మీద తెగులు లక్షణాలు కనిపించే నాటికి చాలా ముందుగానే శిలీంద్రం ఆశిస్తుంది. తెగులు తీగ మొదట్లో ఆశించినప్పుడు వేర్లు గోధుమ రంగు నుండి నల్లగా మారి కుళ్ళుతాయి. దీని నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా తెగులు ఆశించకుండా నివారించుకోవాలి. నివారణకు తెగులు సోకిన ఆకులను మరియు తీగలను ఏరి కాల్చివేయాలి. మొదటి సం||రం తోటల్లో తెగులు లక్షణాలు కనిపించినప్పటి నుంచి నవంబరు నుండి ఫిబ్రవరి వరకు తప్పనిసరిగా నెలకొకసారి 1% బోర్డోమిశ్రమాన్ని 1 మీటరు నిలువు దూరానికి ఒక లీటరు వంతున (ఎకరాకు 40 కిలోల మైలుతుత్తం, 40 కిలోల సున్నం చొప్పున 4000 లీటర్ల నీటిలో కలిపి) పాదుల్లో పోసుకుని మరియు 0.5% బోర్డోమిశ్రమాన్ని 15 రోజులకొకసారి (ఎకరాకు 200 లీటర్లు) ఆకులపై పిచికారి చేయాలి. 2వ సం||పు తోటల్లో బోర్డోమిశ్రమాన్ని పైన తెలిపినట్లు ఆగస్టు నుండి సెప్టెంబరు వరకు వాడాలి. మూడు సంవత్సరములకు ఒకసారి మొక్కజొన్న లేదా జొన్నలతో పంట మార్పిడి చేసుకోవాలి. విత్తనపు తీగలను ఆరోగ్యవంతమైన తోటల నుండి తీసుకొని, విత్తన తీగశుద్ధి చేసుకొని తీగలను క్రొత్త తోటల్లో నాటుకోవాలి. 

బాక్టీరియా ఆకుమచ్చ: ఆకుల అడుగుభాగాన నీటిలో తడిచినట్లు గోధుమరంగు చదరపు మచ్చలు ఏర్పడి, క్రమేణా పెద్దవై, నలుపు రంగుకి మారి ఆకులు కుళ్ళిపోతాయి. కాండముపై నల్లని మచ్చలు ఏర్పడి, పగుళ్ళు ఏర్పడతాయి. నివారణకు విత్తనపు తీగలను ఆరోగ్యవంతమైన తోటల నుండి తీసుకొని, విత్తన తీగశుద్ధి చేసుకొని తెగులు ఆశించకుండా కాపాడుకోవాలి. తెగులు కనిపించిన వెంటనే 0.5% బోర్డో మిశ్రమము నెలకు ఒకసారి చొ||న ఆకులపై పిచికారి చేయుట వలన ఈ తెగులును సమర్ధవంతంగా నివారించుకోవచ్చు. 

కొలిటోట్రైకం ఆకుమచ్చ తెగులు: తెగులు సోకిన ఆకులపై భాగాన గుండ్రని గోధుమ రంగుతో కూడిన పసుపు రంగు అంచుగల మచ్చలేర్పడి క్రమేపి నల్లబడి ఆకు అంతా వ్యాపిస్తాయి. దీని నివారణకు 0.5% బోర్డోమిశ్రమాన్ని (ఎకరాకు 600 గ్రా. చొ||న) ఆకులపై పిచికారి చేయాలి. 

ఎకరానికి తీగశుద్ధి చేయడానికి కావలిసిన బోర్డో మిశ్రమము తయారికి కావలసిన పదార్ధములు : 

మైలుతుత్తం  – 1 కిలో

సున్నం  – 1 కిలో

నీరు  – 200 లీటర్లు

బోర్డో మిశ్రమమును (0.5%) తయారుచేయు విధానము: 

ముందుగా రెండు మట్టి లేక ప్లాస్టిక్‌ లేక సిమెంటు పాత్రలలో ఒక్కొక్క దానిలో 100 లీటర్ల చొప్పున నీటిని తీసుకోవాలి. ఒకదానిలో మెత్తగా పొడిచేసిన ఒక కిలో మైలతుత్తంను వేసి పూర్తిగా నీటిలో కరిగేలా కర్రతో కలపాలి. రెండవ దానిలో 100 లీటర్ల నీటిలో ఒక కిలో పొడిసున్నం వేసి అదే విధముగా కలపాలి. రెండు పూర్తిగా కరిగిన తరువాత మైలుతుత్తం ద్రావణమును నెమ్మదిగా సున్నం ద్రావణములో కర్రతో కలుపుతూ పోయాలి. సున్నం ద్రావణమును మైలుతుత్తం ద్రావణములో పోయరాదు. పై విధముగా తయారుచేసిన మిశ్రమాన్ని ఇనుప బ్లేడును గాని కొడవలిని గాని 2 నిముషాలు ముంచి పరీక్ష చేయాలి. ఇనుప బ్లేడు మీద రాగి రంగు మచ్చలు ఏర్పడినట్లయితే మిశ్రమములో మైలతుత్తం ఎక్కువ ఉన్నదని తెలుస్తుంది. కాబట్టి మరి కొంచెము పొడి సున్నం కలిపి కలియబెట్టి మరల పరీక్ష చేయాలి. మిశ్రమంలో మైలుతుత్తం ఎక్కువగా లేదని నిర్ధారణ చేసుకొన్న తరువాత ఆ మిశ్రమాన్ని తీగచుట్టలపై పిచికారి చేయాలి. 

డా. పి. సునీత (80085 96235), సీనియర్‌ శాస్త్రవేత్త (ఎంటమాలజి), డా. వై.యస్‌.ఆర్‌. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం. 

Read More

వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు డ్రోన్‌ ల వినియోగం

భారత దేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం, సుమారు 77 శాతం ప్రజానీకం వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల ద్వారా ఉపాధి పొందుతున్నారు ,భారత దేశ ఆర్థిక వ్యవస్థ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 17.5 శాతం వ్యవసాయ రంగం ద్వారా సమకూరుతుంది. అయితే మారుతున్న కాలం తో పాటు, పెరుగుతున్న జనాభాకి సరిపడా ఆహారం పండించాలన్నా, వ్యవసాయంలో పెరుగుతున్న వ్యవసాయ కూలీల కొరతను అధిగమించాలన్నా వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికలతో కూడిన మార్పు రావాలి. వ్యవసాయం హైటెక్‌ పరుగులు పెడుతోంది. వాతావరణ పరిస్థితులు మొదలుకుని నాట్లు వేయడం, విత్తనాలు జల్లడం, కలుపు తీయడం, కోతలు కోయడం వరకూ అన్ని పనుల్లోనూ రోబోలు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. దుక్కిదున్నే ట్రాక్టర్‌ నుంచి పంట కోసే మిషన్ల వరకూ ఇప్పుడు అందుబాటులో ఉండగా పంటలు ఎప్పుడు వేయాలి, ఎప్పుడు కోయాలి, పురుగు పడితే ఏం చేయాలనేది చెప్పేందుకు మొబైల్‌ యాప్‌లు రెడీ అయ్యాయి. నూతన ప్రయోగాలతో పాటు సరికొత్త ఆవిష్కరణలు, యంత్రాలు తయారు అవుతున్నాయి. 

అయితే మారుతున్న కాలం తో పాటు, వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికలతో కూడిన డ్రోన్‌ల యొక్క వినియోగాన్ని పెంచడం ఎంతయినా అవసరం. డ్రోన్‌ అనేది వినేందుకు కొత్త గా ఉన్నా వ్యవసాయ రంగ పనుల్లో దీని పాత్ర అమోఘంగా ఉంటుంది. డ్రోన్‌ అనేది ఒక వైమానిక వాహనం. ఇది పంటలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడం వల్ల పంటలపై తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయవచ్చు. డ్రోన్‌ లకు ఉండే అధునాతన సెన్‌సార్లు, డిజిటల్‌ ఇమేజ్‌ ద్వారా తమ పొలం యొక్క చిత్రాన్ని స్పష్టంగా చూడవచ్చు. పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు, చీడపీడలు వస్తే వెంటనే గుర్తించి, తగిన నివారణ చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. ఒక డ్రోన్‌ పది నిమిషాల్లో ఎకరా పొలంపై మందులు చల్లగలదు.

భారతదేశంలో వ్యవసాయ డ్రోన్‌ ధర

ఒక వ్యవసాయ డ్రోన్‌ తరచుగా ఇంటర్నెట్‌ ఆధారిత స్మార్ట్‌ టెక్నాలజీని ఉపయోగించి పిచికారీ మరియు పంట ఆరోగ్య పర్యవేక్షణ వంటి ఖచ్చితమైన వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తుంది, దీని ధర 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉండవచ్చు. ఇది మొదట్లో కొంత ఖరీదైనదిగా అనిపించినా రానున్న రోజులలో చాల చవుకగా లభించే అవకాశాలు వున్నాయి.

వ్యవసాయంలో డ్రోన్‌ పాత్ర అమోఘం. ముఖ్యంగా వ్యవసాయ రంగ వెలుగు కనిపిస్తోంది. కూలీలు, మందుల పిచికారీ సమస్యలకు తరుణోపాయంగా ఆశలు కల్పిస్తోంది. రెండు థాబ్దాల క్రితం వరకు నిఘా కార్యకలాపాలకే పరిమితమైన ఈ బుల్లిమానవ రహిత విమానం ప్రతి చోట తన ఉనికిని చాటుతోంది. రక్షణ, భద్రత మొదలు వైద్యం, ఆర్ధికం, మైనింగ్‌, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, సరకు రవాణా వరకు ప్రతి రంగంలో విశిష్ట సేవలందిస్తోంది. ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. నెమ్మదినెమ్మదిగా సరికొత్త రూపు సంతరించుకుని, బహుళ సౌకర్యాలతో నిఘా విభాగం, రక్షణ గోడలు దాటుకుని ఇప్పుడు పొలంలోకి అడుగు పెట్టింది.

పెద్ద కమతాల్లో పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా రైతులు, వ్యవసాయ, పారిశ్రామికవేత్తలు డ్రోన్ల మీదే ఆధారపడుతున్నారు. పెద్ద పెద్ద తోటలు, డెయిరీ ఫారాల్లో అడుగడుగునా నడవలేనిచోట డ్రోన్‌ని వినియోగించి క్షణాల్లో వీడియో తీసి ఆ దృశ్యాలని కంప్యూటర్లో చూసి పంటల స్థితిగతులు, చీడపీడల ప్రభావం అంచనావేసి తదనుగుణంగా చేపట్టాల్సిన చర్యలు నిర్థారించుకుంటున్నారు. మట్టి నాణ్యత విశ్లేషణ, వాతావరణం, పంట దిగుబడి అంచనాలకి సైతం డ్రోన్లనే వాడుతున్నారు.

కంపెనీలు సైతం వ్యవసాయ రంగానికి అనువైన డ్రోన్‌లని ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి. పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు రైతులకు కలిగే అరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. పిచికారీ కోసం గంటల తరబడి రైతులు పొలాల్లో శ్రమిస్తుంటారు. సరైన రక్షణ లేకుండా ఈ క్రమంలో ఆ గాలిని పీలుస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గంలా నిలుస్తున్నాయి డ్రోన్లు. డ్రోన్ల సహాయంతో పురుగుమందుల పిచికారీ చేపట్టవచ్చు. రైతు ఆరోగ్యం కాపాడవచ్చు. ముఖ్యంగా పంటల్లో చీడపీడలు, తెగుళ్ల తాకిడి అధికమై వెంటనే పురుగు మందులు పిచికారీ చేయాల్సిన సమయంలో కూలీల కొరత, ఒకేసారి పెద్దకమతాల్లో మందులు చల్లే అవకాశం లేక రైతులు పంటని రక్షించుకోలేకపోతున్నారు. పొలాలకు పురుగు మందులు చల్లే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. డ్రోన్‌ వినియోగం వల్ల రైతులకు ఎలాంటి హాని ఉండదు. తక్కువ సమయంలో పని పూర్తి అవడమే కాక విస్తీర్ణాన్ని బట్టి పురుగు మందును అందుకు అవసరమైన నీటిని కలుపుకునే టెక్నాలజీని డ్రోన్‌లో పొందుపరిచారు. 

మామూలు స్ప్రే వల్ల పురుగు మందులు వృథా అయ్యే అవకాశం ఉంటుంది. డ్రోన్‌లో అందుకు ఆస్కారం ఉండదు. పది మంది కూలీలు చేసే పనిని డ్రోన్‌ ఒక్కటే చేస్తుంది. పది నిమిషాల్లో ఎకరం పొలంలోని పంటనంతటిపై మందు చల్లేస్తుంది. అది కూడా నిర్దిష్ట పరిమాణంలో పొలంలోని మొక్కలన్నింటికీ సమానంగా మందు పిచికారీ చేస్తుంది. సాధారణంగా పిచికారీ చేసే కంటే డ్రోన్‌ 40 నుంచి 60 శాతం సమర్థంగా మొక్కలకి మందు చేరవేస్తుంది. ప్రస్తుతం 3 లీటర్ల నుంచి 20 లీటర్ల వరకు పిచికారీ చేసే డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. 

డ్రోన్ల వాడకంతో మరో సౌలభ్యం కూడా ఉంది. మొబైల్‌ యాప్‌, జీపీఎస్‌ మ్యాపింగ్‌, వెబ్‌ల్యాండ్‌ అనుసంధానం ద్వారా పొలం సర్వే నంబర్లు, విస్తీర్ణం తెలియడంతో పాటు నిర్ణీత ప్రదేశంలోనే ఎగురుతూ మందుని చల్లుతుంది. మరోసారి అదే చోట మందు పిచికారీ చేయడం తేలికవుతుంది. రసాయన మందుల పిచికారీతో పాటు ఎరువులు వేసే డ్రోన్లని కూడా తయారీ సంస్థలు రూపొందించాయి. పంటకు ఏ పురుగు ఆశించింది? ఏ తెగులు వచ్చిందో తెలుసుకునేందుకు , పంటని విహంగ వీక్షణం చేసి సమస్యని గుర్తించే డ్రోన్లు వచ్చేశాయి. అత్యాధునిక పరికరాలతో నిమిషాలలో పొలాన్ని చుట్టేసి తెగుళ్ల గుట్టు చెప్పే నవీన డ్రోన్లు సిద్ధమయ్యాయి.

అత్యాధునిక డ్రోన్లు అన్ని కోణాల్లోనూ ఫోటోలు, వీడియోలు తీయగలవు. హెచ్‌డీ నాణ్యతతో, త్రీడైమెన్షన్‌లో దృశ్యాలని బంధించగలవు. అంతే కాకుండా డ్రోన్‌కి అనుసంధానం చేసిన కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ఫోను ద్వారా పైలట్‌ కంట్రోలర్‌ పొలంలో కావాల్సిన ప్రదేశంవైపు డ్రోన్‌, కెమెరాని తిప్పుతూ ఫోటోలు, దృశ్యాలు చిత్రీకరించే వెసులుబాటు ఉంది. అడ్వాన్స్‌డ్‌ సెన్సార్లు. డిజిటల్‌ ఇమేజింగ్‌ ద్వారా పంటకి సంబంధించిన నాణ్యమైన చిత్రాలు తీసుకుని విశ్లేషించే సౌలభ్యమూ ఉంది. మనిషి చూపుకి అందని ఎన్నో విషయాలు డ్రోన్‌ సెన్సార్లు పసిగడతాయి. సాధారణంగా బర్డ్స్‌ ఐ వ్యూ, ఇన్‌ఫ్రారెడ్‌ వ్యూ అనే రెండు విధాలుగా చిత్రాలు తీయవచ్చు. నీటి సమస్య, నేలతీరు, చీడపీడల ప్రభావం వంటి వాటిని మొదటిదాని ద్వారా తెలుసుకోవచ్చు. 

ఇన్‌ఫ్రారెడ్‌ వ్యూ ద్వారా ఆరోగ్యంగా ఉన్న మొక్కలు, చీడపీడలబారిన పడ్డ మొక్కల మధ్య తేడాని గుర్తించవచ్చు. మొక్క ఆకుల ఆరోగ్యం, నాణ్యత ఆధారంగా డ్రోన్లకి అమర్చిన ఇన్‌ఫ్రారెడ్‌ లైట్లు వెలుగుతాయి. ఈ లైట్లు వెలిగే తీరు, రంగులు బట్టి మొక్కల ఆరోగ్యం తెలుసుకోవచ్చు. ఇలా పొలంలో అణువణువునా తీసిన ఫోటోలు, దృశ్యాలని కంప్యూటర్‌ ద్వారా చూసి తదనుగుణంగా చీడపీడల నివారణ చర్యలు చేపట్టవచ్చు. పొలంలో దిగడం సాధ్యం కాని చోట గాల్లో అంచనాలు కట్టి వివరాలు నమోదు చేస్తున్నారు. రైతుల సహనాన్ని పరీక్షించి చివరికి ఉసూరుమనిపించే ఈ విధానం ఇకముందు మారబోతోంది. విలువైన సమయాన్ని ఆదాచేసి మనుషులు అడుగుపెట్టలేని ప్రాంతాల్లో సైతం అత్యంత నాణ్యమైన ఫోటోలు తీసే విహంగాలు అందుబాటులోకి వచ్చాయి. పంట నష్టం అంచనాలో సమగ్ర వివరాలకోసం అత్యాధునిక డ్రోన్‌ పరికరాల వాడకం ఈమధ్యకాలంలో మొదలైంది. మూడు కిలోమీటర్ల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల్లో పంటల స్థితిగతులను సర్వే చేసి ఫోటోలను తీసే డ్రోన్లను గతేడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బాపట్లలో తొలిసారి ప్రయోగాత్మకంగా వాడింది. 

డ్రోన్‌ల వాడకం ద్వారా ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో వివరాల సేకరణ సులభమవుతుంది. జీపీఎస్‌ పరిజ్ఞానం వల్ల ఏయే ప్రాంతాల్లో ఫోటోలు తీసిందనేది తెలియడమే కాకుండా. వాటి వివరాలను మ్యాపింగ్‌ చేస్తుంది. డ్రోన్ల ద్వారా అధికారులకి సర్వే నిర్వహణ తేలికవడంతో పాటు అటు రైతులకి సకాలంలో పరిహారం మంజూరయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఒక్క మందుల పిచికారీ, పంట నష్టం సర్వే మాత్రమే కాకుండా నీటి వనరులు, నేలలోని పోషకాలు గుర్తించే డ్రోన్లు తయారయ్యాయి. అపరాలు, వాణిజ్య పంటల ఎదుగుదల, చీడపీడల ఉదృతని సమీక్షించడానికి డ్రోన్‌ తీసిన ఛాయాచిత్రాలు, దృశ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అసలు ఈ డ్రోన్లు ఎలా పనిచేస్తాయి? డ్రోన్లను వినియోగించాలంటే ఎలాంటి అనుమతులు తీసుకోవాలి? కేంద్రం మార్గదర్శకాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. 

పైలట్‌ కంట్రోలర్‌, రెక్కలు, ఛార్జర్‌, బ్యాటరీలు, కెమెరాలు, నాజిల్స్‌ మెమొరీ కార్డులు, టాబ్లెట్‌, క్లౌడ్‌ ప్రాసెసింగ్‌కి సమాచారం పంపే సాఫ్ట్‌వేర్‌ ఇవీ ప్రాథమికంగా డ్రోన్‌ పరికరాలు. మైక్రో ఎలక్ట్రో మెకానికల్‌ సిస్టమ్స్‌, చిన్నపాటి జీపీఎస్‌ మాడ్యూల్స్‌, అధిక శక్తి కలిగిన కంప్యూటర్‌ ప్రాసెసర్లు, చిన్నపాటి డిజిటల్‌ రేడియోస్‌ అన్నవి డ్రోన్లలోని నూతనత్వాలు. మన దేశంలో ఐదు రకాల పరిమాణంలో డ్రోన్లు వాడడానికి కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. అవి నానో, మైక్రో, మిని, స్మాల్‌, లార్జ్‌. కనిష్టంగా 250 గ్రాములు, గరిష్టంగా 150 కిలోల వరకు బరువుంటాయి. డ్రోన్లు వినియోగించడానికి దేశంలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 250 గ్రాములకంటే తక్కువ బరువున్న నానోడ్రోన్ల వాడకానికి ఎటువంటి లైసెన్సు అవసరం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం డ్రోన్ల వాడకానికి సంబంధించి కొత్త విధానం తీసుకొస్తోంది. పరిమాణాన్ని బట్టి వాటిని వర్గీకరించి, డ్రోన్‌లకు విశిష్ట గుర్తింపు సంఖ్యలను, రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌లనూ తప్పనిసరి చేయబోతోంది. ఇక డ్రోన్‌ పనిచేసే విషయానికి వస్తే… పైలట్‌ కంట్రోలర్‌, మొబైల్‌ యాప్‌, స్మార్టుఫోన్‌ లేదా కంప్యూటర్‌ ఆదేశాల ద్వారా పనిచేస్తుంది. వైమానిక ఇమేజింగ్‌ మ్యాపింగ్‌ ద్వారా నిర్దిష్ట ప్రాంతంలో నడిపించవచ్చు. డ్రోన్‌ ప్రత్యేకతలు, పనితనంరీత్యా రోజు రోజుకి వీటి అవసరం, వినియోగం పెరుగుతోంది.

రైతులు ఎరువులు, పురుగుమందులు చల్లడానికి కూలీలను వెతుక్కోవాల్సిన తిప్పలు తప్పుతాయి. ఎంత పెద్ద కమతాల్లోనైనా పొలం గట్టుపైనే నిలబడి ఒక్క డ్రోన్‌తో నిమిషాల్లో మందులు పిచికారీ చేసేయవచ్చు. ఒక్కసారి డ్రోన్‌ని చేనంతా తిప్పేసి పంట ఎదుగుదల, చీడల జాడని పసిగట్టేయవచ్చు. సూక్ష్మంలో మోక్షంలా బుల్లి విహంగాలతో అద్భుత ప్రయోజనాలున్నా ప్రస్తుతానికైతే ఖరీదు మాత్రం కాస్త ఎక్కువే. డ్రోన్‌ సైజు, సామర్థ్యాన్ని బట్టి లక్షన్నర నుంచి 10 లక్షల వరకు పలుకుతున్నాయి. మిగతా యంత్రాల మాదిరిగా ప్రభుత్వమే ప్రతి గ్రామానికి సరఫరా చేస్తే సామాన్య రైతులు వినియోగించుకోగలుగుతారు. ఒకే రకం పంట పొలాల్లో ఒకేసారి పిచికారీ చేయడం వల్ల చీడపీడల తీవ్రత తగ్గుతుంది. ఈ పయనంలో కొన్ని సాంకేతిక అవరోధాలని అధిగమించాల్సిన అవసరముంది. నీడ, వెలుతురు సమస్యలతో ఫోటో నాణ్యత తగ్గే పరిస్థితులకి పరిష్కారం కనుగొనాలి. అలాగే డ్రోన్లు తీసిన ఫోటోలని పరిశీలించి నివారణ మార్గాలు సూచించే వ్యవస్థ, వ్యక్తులను తయారు చేయాలి. చట్టపరంగా, భద్రతపరంగా డ్రోన్లను ఉపయోగించడానికి పైలెట్లకి శిక్షణ ఇవ్వాలి. 

అన్నింటికంటే ముఖ్యంగా పంటలపై మూడు నాలుగు అడుగుల ఎత్తు నుంచి గాలిలో రసాయన పురుగుమందులు పిచికారీ చేయడం ద్వారా తలెత్తే సమస్యలు, పర్యావరణ కాలుష్య, ఆరోగ్య ముప్పు అంశాలపై దృష్టి పెట్టాలి. అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేసేవారు డ్రోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎరువులు చల్లడానికి, శ్రమ, శక్తిని తగ్గించుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందులు చల్లడానికి ఉపయోగపడుతుండటంతో ఇవి ఎక్కువ మందినే ఆకర్షిస్తున్నాయి.

డ్రోన్‌ల వినియోగంలో సవాళ్లు:

డ్రోన్ల వినియోగం అనేది పూర్తిగా సాంకేతికతతో కూడుకునట్టువంటి అంశం, రైతులు సులువుగా వినియోగించలేరు మరియు డ్రోన్ల కొనుగోళ్లు అనేది సామాన్య చిన్న, సన్నకారు రైతులకు ఖర్చుతో కూడుకునట్టువంటిది మరియు డ్రోన్‌లను వినియోగించేటపుడు విద్యుత్‌ స్తంభాలు, పొలం మధ్యలోగల చెట్లు వీటికి అడ్డంకిగా మారవచ్చు.

డ్రోన్‌ల ఉపయోగం కొరకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ఎస్‌ వోపి (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) జారీ చేసింది, ఇది డ్రోన్లు, డ్రోన్‌ పైలట్లు మరియు డ్రోన్‌ ఆపరేటర్లు ఏరియల్‌ క్రిమిసంహారక పిచికారీ ఆపరేషన్‌ సమయంలో అనుసరించాల్సిన సూచనలు, నిబంధనలు మరియు ఆవశ్యకతలను జాబితా సూచిస్తుంది అవి :

  • క్రిమిసంహారిణి పిచికారీ చేసే ప్రాంతాన్ని డ్రోన్‌ ఆపరేటర్‌ ద్వారా డ్రోన్‌ పైలట్‌ ఆ పరిసరాలను ముందు మార్క్‌ చేయాలి.
  • ఆమోదించబడ్డ క్రిమిసంహారకాలను మాత్రమే ఉపయోగించాలి.
  • ప్రథమ చికిత్స సదుపాయాలను ఆపరేటర్‌లకు అందించాలి.
  • ఆపరేషన్‌కు సంబంధం లేని జంతువులు లేదా వ్యక్తులు నిర్ధిష్ట కాలం పాటు ఆపరేషన్‌ ఆవరణలోకి ప్రవేశించడానికి అనుమతించరాదు.
  • డ్రోన్‌ పైలట్‌లు క్రిమిసంహారకాల యొక్క క్లినికల్‌ ప్రభావాలతో సహా క్రిమిసంహారకాల స్పెషలైజేషన్‌లో ట్రైనింగ్‌ను పొంది ఉండాలి.

డా.ఎస్‌. లోకేష్‌ బాబు, శాస్త్రవేత్త (విస్తరణ విభాగం), ఫోన్‌: 99485 42942; డా. కిరణ్‌ కుమార్‌ రెడ్డి (పంట ఉత్పత్తి విభాగము), డా. విజయ్‌ కుమార్‌ నాయక్‌ (సస్య రక్షణ విభాగము), హరి సాదు, శాస్త్రవేత్త (మత్స్య విభాగం), డా. ఆర్‌. సుజాత, శాస్త్రవేత్త (గృహవిజ్ఞానం), డా. లలిత శివ జ్యోతి, ప్రోగ్రాం-కో ఆర్డినేటర్‌, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు. 

Read More

భూసార పరీక్ష కొరకు మట్టి నమూనా సేకరణ – జాగ్రత్తలు

ఆరోగ్యకరమైన మానవుల జీవన శైలికి పంచ భూతములలో ఒకటైన భూమి ప్రముఖ పాత్ర వహిస్తుంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహారము మరియు ఇతరత్ర ఉత్పత్తి చేయుట కొరకు రైతులు రసాయన వ్యవసాయం ఆచరించుట వలన భూమి తన అస్థిత్వము కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా మానవుల ఆరోగ్యం భూమి ఆరోగ్యంపై ఆధారపడింది కనుక భూమి ఆరోగ్యం కాపాడుకోవటం తప్పనిసరి. ఇందుకొరకు భారత ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికగా ప్రతి రైతు భూమిలో పరీక్ష జరిపి నేల ఆరోగ్య పత్రాలను అందజేయడానికి నడుం కట్టింది. నేల ఆరోగ్య పత్రంలో సూచించిన విధంగా మెరుగైన యాజమాన్య పద్ధతులను చేపట్టి సమస్య ఉన్న భూములలో కూడా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందిన రైతులు ఉన్నారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకొని వ్యవసాయంలో వ్యయం తగ్గించుకొని, సుస్థిర దిగుబడులతో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సన్నద్ధులు కావాలి.

ముఖ్యంగా నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్ధాలతో పాటు, అదనంగా వేసిన సేంద్రీయ మరియ రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతారు. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. దీనికి సంబంధించిన రైతులు తమ పొలంలోని మట్టిని వర్షాధార భూములలో 3 సంవత్సరాలకు ఒకసారి మరియు నీటి వసతి క్రింద 3 పంటలకొకసారి పరీక్ష చేరుంచుకుంటే మంచిది. పోషక పదార్ధాల గురించేకాక, భూమిలోని చౌడు  గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడా మట్టి పరీక్ష చేరుంచుకోవాలి.

భూసార పరీక్షలో అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం మట్టి నమూనాలను సేకరించడం. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరియైనది కానిచో, దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీని వలన చేరుంచిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్ధమవుతారు. కాబట్టి, మట్టి నమూనా సేకరణలో ఈక్రింది జాగ్రత్తలను తప్పక పాటించాలి.

  • మట్టి నమూనాలను సేకరించాల్సిన భూమిని ముందుగా నేల రంగు, ఎత్తు, వాలు, చౌడు మరియు పంట దిగుబడులు మొదలగు అంశాలపై పరిశీలన చేసి కంటికి కనిపించే లక్షణాలను బట్టి వివిధ భాగాలుగా విభజించాలి. ప్రతి భాగం నుండి పొలం విస్తీర్ణమును బట్టి నమూనాలను తీయాలి. కంటికి కనిపించే లక్షణాలలో ఎటువంటి తేడా లేనప్పుడు జిగ్‌జాగ్‌ పద్ధతిలో పొలమంతా తిరుగుతూ ఒక ఎకరా భూమిలో కనీసం 8 నుండి 10 మట్టి నమూనాలను తీయాలి.
  • పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుండి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలుపరాదు.
  • నమూనాలను తీయు స్థలంలో నేలపై ఉన్న ఆకులు, చెత్త, చెదారం తీసివేయాలి. తరువాత పొలంలో ”ఙ” ఆకారంలో గడ్డి జాతి పంటలైన వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, చెఱకు మొదలగు పంటలకు 15 సెం.మీ. వరకు మరియు లోతైన వేరు వ్యవస్థ గల వేరుశనగ, ప్రత్తి, అపరాలు, కూరగాయలు మొదలగు పంటలలో 30 సెం.మీ. వరకు పారతో గుంట తీసి, అందులో పైపొర నుంచి క్రింది వరకు ఒక ప్రక్కగా మట్టిని సేకరించాలి.
  • ఈవిధంగా ఒక ఎకరా విస్తీర్ణంలో 8-10 చోట్ల సేకరించిన మట్టిని ఒక దగ్గర చేర్చి, బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసుకొని, మిగతా భాగాలు తీసివేయాలి. ఈ విధంగా మట్టి 1/2 కిలో వచ్చే వరకు చేయాలి.
  • ఇలా సేకరించిన మట్టిలో రాళ్ళు, పంట వేర్లు, మొదళ్ళు లేనట్లుగా చూసుకొని, నీడలో ఆరనివ్వాలి.
  • మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని త్రవ్వి, సేకరించినప్పుడు 
  • గట్ల దగ్గరలోను, పంట కాల్వాలలోను మట్టిని తీసుకోరాదు.
  • చెట్ల క్రిందనున్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించరాదు.
  • ఎరువు (పశువుల పేడ, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట మొదలగునవి) కుప్పలు వేసి ఉంచిన చోట మట్టిని సేకరించరాదు.
  • ఎప్పుడు నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు.
  • పండ్ల తోటలకు అనువైన నేలలను గుర్తించునప్పుడు గాని, పండ్ల చెట్లకు ఏవైన పోషక పదార్ధాలు మరియు ఇతర సమస్యల గుర్తింపు కొరకు మట్టి నమూనాను ఈక్రింది విధంగా తీసుకోవాలి.
  • సాధారణంగా పంటను బట్టి 3 నుండి 5 అడుగుల (1-2 మీ.) లోతు గుంట త్రవ్వి, విడిగా ప్రతి అడుగుకు కొంత మట్టిని (నమూనా) సేకరించి, భూసార పరీక్షకు పంపాలి.
  • మట్టి నమూనా కొరకు గుంట త్రవ్వుతున్నప్పుడు ఏవైనా గట్టి పొరలు ఉన్నట్లరుతే వాటి లోతు మరియు వాటి లక్షణాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
  • పండ్ల తోటల విషయంలో ఇలాంటి నమూనా సేకరణ ఎకరాకు 2-4 చోట్ల నుంచి చేస్తే చాలా మంచిది.
  • ఇటువంటి నమూనాలను పరీక్ష కొరకు పంపునప్పుడు ”పండ్ల తోటలకు అనువైన పరీక్షల కొరకు” అని తెలియజేయాలి.
  • పొలంలో పలు ప్రాంతాల (8-10 చోట్ల) నుండి సేకరించిన మట్టిని లేదా పండ్ల తోట కొరకు తీసిన మట్టిని గాని, కలిపేందుకు యూరియా లేక ఇతర ఎరువుల సంచులను వాడరాదు. ఇందుకొరకు శుభ్రమైన ప్లాస్టిక్‌ షీటును ఉపయోగించుట మంచిది.
  • ఈ విధంగా సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరిన తరువాత మంచి ప్లాస్టిక్‌ బ్యాగులో గాని, గుడ్డ సంచిలో గాని, తమకు సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్షా కేంద్రానికి ఈ క్రింది సమాచారంతో పంపాలి.
  • రైతు పేరు, సర్వే నెంబరు, గ్రామం, మండలం.
  • కావలసిన భూసార / చౌడు / పండ్ల తోట ఎంపికకు పరీక్ష.
  • ఇంతకు మునుపు పంట, దానికి వాడిన ఎరువులు
  • వేయబోవు పంట
  • నేలలో గమనించిన ఏవేని సమస్యలు
  • నీటి సదుపాయం – సాగు చేయవలసిన పంట వివరాలు.
  • రైతులు కాగితంలో పైన తెలిపిన విషయాలను వ్రాసి మట్టి నమూనాతో పాటు సంచిలో వేసి భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. 

మరింత సమాచారం కొరకు సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌ 89856 20346.

డా|| యం. వెంకటరాములు, సీనియర్‌ శాస్త్రవేత్త (విస్తరణ శాస్త్రం); 

ఫోన్‌: 89856 20346

డా|| ఎ. లలిత, సీనియర్‌ శాస్త్రవేత్త, (విస్తరణ శాస్త్రం);

డా|| ఎ. మనోజ్‌, శాస్త్రవేత్త (విస్తరణ శాస్త్రం); వ్యవసాయ సమాచార మరియు ప్రసార కేంద్రం, లాం, డా|| కె.ఎస్‌. పూర్ణిమ, సీనియర్‌ శాస్త్రవేత్త (విస్తరణ శాస్త్రం); సార్వత్రిక మరియు దూర విద్యా కేంద్రం, లాం, గుంటూరు. ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.

Read More

టమాట పంటలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు

ముందుగా నేలలో పోషకాల యొక్క స్థితిని తెలుసుకోవడానికి భూసార పరీక్షలు చేయించాలి. మట్టి ఆరోగ్య కార్డును బట్టి సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టాలి.

  • నాణ్యమైన నారును ఎంచుకోవాలి. ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తున్న నర్సరీలను (40 మెష్‌ నెట్‌, రెండు గదుల ద్వారము, హార్టీకల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ నాణ్యమైన కోకోపీట్‌) ఎన్నుకోవాలి.
  • ఎకరాకు 8 నుంచి 12 టన్నుల పశువుల ఎరువును భూమికి అందించాలి. భూమిలో కర్బన శాతం పెరుగుతుంది. మొక్కకు అవసరమైన జీవన ఎరువులను పెంచుతుంది. నీరు, పోషకాలను నిలుపుకోవడానికి సహాయపడుతుంది.
  • జీవన శిలీంద్రనాశిని ట్రైకోడెర్మా, సూడోమోనాస్‌లు పంటలపై దాడి చేయగల శిలీంధ్రాలను అరికడతాయి. వేరుకుళ్ళు, మొదలకుళ్ళు పంట రోగాలను తగ్గిస్తుంది. మొక్కల వృద్ధికి సహాయపడుతుంది.
  • ఎత్తు మడులలో పంట సాగు చేయడం వలన నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మొక్క వేర్లకు తగినంత స్థలం లభించి ఏపుగా పెరుగుతుంది. 
  • వేప/కానుగ పిండిని ఎకరానికి 100-250 కిలోలు వేసుకోవాలి. భూమిలో ఉండే పురుగు ప్యూపా థను, నులి పురుగులను నియంత్రిస్తుంది.
  • ఆచ్ఛాదన/మల్చింగ్‌ 25-30 మైక్రాన్‌ మందం కలిగిన ప్లాస్టిక్‌ లేదా సేంద్రియ మల్చ్‌తో (వరిగడ్డి) కలుపును సమర్ధవంతంగా నివారించవచ్చు.
  • మొక్కల మధ్యదూరం 40-60 సెం.మీ. మరియు సాళ్ళ మధ్య దూరం 1-1.5 మీ. పాటించాలి. ఎకరానికి 6,666 (చలికాలం), 8000 (వేపవికాలం) మొక్కలుండాలి.
  • డ్రిప్పు ద్వారా బిందు సేద్యం. డ్రిప్పు నీటిని, ఎరువులను మొక్క వేరు భాగంలో అందించి ఉష్ణోగ్రత, తేమను నిర్వహిస్తుంది. పంట నాణ్యతను మెరుగుపరచి ఉత్పత్తిని పెంచుతుంది. 
  • ఎరువులను నీటి ద్వారా అందించడం (ఫెర్టిగేషన్‌) మొక్కకు పోషకాల లభ్యతను పెంచుతుంది. పంట పెరుగుదల మరియు దిగుబడిని ప్రభావితం చేయకుండా 20-40% ఎరువులను ఆదా చేస్తుంది. 
  • సూక్ష్మ పోషకాల కోసం కాల్షియం, మెగ్నీషియం, బోరాన్‌, ఇనుము, మాంగనీసు, మాలిబ్డినం, జింకు కలిగిన సూక్ష్మపోషకాల మిశ్రమంను పిచికారి చేసుకోవాలి. ఇది అధిక దిగుబడిని, స్థిరమైన వృద్ధిని ప్రోత్సహిస్తాయి మరియు పంట నాణ్యతను పెంచుతాయి.
  • పొలం చుట్టూ కంచె పంటలను వేసుకోవాలి. 3-4 వరుసల మొక్కజొన్న, జొన్న లేదా సజ్జ పంటలను టమాట నాట్లకు ముందే విత్తుకోవాలి.
  • ఎర పంటగా బంతి మొక్కను నాటుకోవాలి. 16 వరుసల టమాట నారుకు ఒక వరుస బంతి నారును వేసుకోవాలి. టమాట కాయతొలుచు పురుగులు మొదట టమాట పంటకు రాకుండా బంతి పువ్వులకు ఆకర్షించబడుతాయి.
  • రసం పీల్చే పురుగుల నివారణకై ఎకరాకు 40 నుండి 50 పసుపు-నీలం రంగు జిగురు అట్టలను అమర్చాలి. ఇవి పురుగులను ఆకర్షించి పంట నష్టం నుండి కాపాడతాయి.
  • ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. ఇవి మగ పురుగులను ఆకర్షించి సంతానోత్పత్తి కాకుండా నియంత్రించి, మొక్కలకు, కాయలకు నష్టం కాకుండా చేస్తాయి.
  • దీపపు ఎరలను పొలంలో అమర్చాలి, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు వాడాలి. హాని చేసే పురుగులను నియంత్రించవచ్చు.
  • మొక్క క్రింద ఉన్న 3-4 వరుసల ఆకులను మట్టికి తగలకుండా కత్తిరింపులు చేయాలి. దీనివలన ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు తెగులు సోకకుండా పంటను కాపాడుకోవచ్చు.
  • మొక్కలు నేలకు తగలకుండా కర్రల సహాయంతో ఊతము ఇవ్వాలి. దీనివలన మొక్క ఏపుగా పెరిగి తెగుళ్ళ ఉధృతి తగ్గి మంచి దిగుబడులు వస్తాయి. బలమైన గాలుల నుంచి మొక్కలకు రక్షణ లభిస్తుంది.
  • రసం పీల్చే పురుగులు, చిన్న థ పురుగులు నివారించడానికి 5% వేపగింజల కషాయం/వేప నూనెను పిచికారి చేయాలి. ఇది పంట పెరిగే థలో మాత్రమే వాడాలి.
  • పంటపై పురుగులు రాకుండా వారానికి ఒకసారి నివారణచర్యలు చేపట్టాలి. పురుగు/తెగుళ్ళు రాకముందే వేపనూనె/వేపగింజల కషాయం వంటి మందులను పిచికారి చేసుకోవాలి.
  • కాయలను గ్రేడింగ్‌, సార్టింగ్‌ చేయాలి. టమాట పంటను కోసిన తరువాత సూపర్‌ ఎ, సూపర్‌, ఫ్యాన్సీ, కమర్షియల్‌ గ్రేడ్లుగా గ్రేడింగ్‌ చేసి మార్కెట్‌కు పంపాలి. దీని వలన పంట దిగుబడులు పెరిగి రైతుకు మంచి ఆదాయం వస్తుంది.

డా. నాయుడు మాధవి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, హార్టీకల్చర్‌ విభాగం, ఎస్‌బివిఆర్‌ అగ్రికల్చరల్‌ కాలేజ్‌, బద్వేల్‌, ఫోన్‌: 9494881824

Read More

సమగ్ర వ్యవసాయంలో వ్యర్థాల వినియోగం – లాభాలు

వాతావరణ ఆటుపోట్లు, పెట్టుబడి పాట్లు పీడిస్తున్న నేటి సాగు రంగంలో రైతులు నిలదొక్కుకోలేని పరిస్థితి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, అన్నీ బాగుంటే పండిన పంటకు ధర దక్కని దుస్థితి. ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా పంటల సాగుపైనే ఆధారపడకుండా అనుబంధ రంగాలైన పశుపోషణ, జీవాలు, చేపలు, కోళ్ళ పెంపకాలను జోడిస్తే రైతులకు వివిధ రూపాలలో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దీనినే సమగ్ర వ్యవసాయం/సమీకృత వ్యవసాయం అంటారు. సమగ్ర వ్యవసాయంలో ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థ పదార్థం మరొక రంగానికి వనరులుగా ఉపయోగపడుతుంది. సమగ్ర వ్యవసాయంలో వచ్చిన పంట అవశేషాలు లేదా పశువుల పేడను కంపోస్టుగా వాడవచ్చు. అలాగే పాడి ఎక్కడైతే ఉందో అక్కడ బయోగ్యాస్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సమగ్ర వ్యవసాయంలో ఎక్కువ పచ్చిగడ్డి లభిస్తున్నట్లయితే సైలేజ్‌ లేదా మాగుడు గడ్డి కూడా తయారు చేసుకోవచ్చు.

సాధారణంగా రైతులు గ్రామాల్లో పశువుల పేడను, వ్యవసాయ వ్యర్థపదార్థాలను కుప్పలుగా వేస్తారు. ఇలా చేయడం వల్ల అవి ఎండకు ఎండి వానకు తడిసి సహజ పోషకాలను కోల్పోతాయి. 

రైతులు కొంత శ్రమపడి సేంద్రియ పదార్థాలను సేకరించి గుంటలో వేసి తగిన పరిస్థితులు కల్పిస్తే ఎరువుగా తయారవుతుంది. సాధారణ పరిస్థితుల్లో సేంద్రియ పదార్థాలు కుళ్ళటానికి చాలా నెలలు పడుతుంది. కుళ్ళే ప్రక్రియ చాలా త్వరగా జరగడానికి అనువైన పరిస్థితులను కల్పించడాన్ని కంపోస్టింగ్‌ అని అంటారు. ఇలా తయారైన ఎరువును కంపోస్టు అంటారు.

కంపోస్టింగ్‌కు అనువైన వ్యర్థ పదార్థాలు:

ఎండుగడ్డి / ఎండు ఆకులు / కలుపు మొక్కలు / గ్లైరిసీడియా కొమ్మలు / వివిధ (తర్వాత వచ్చిన) వ్యర్థ పదార్థాలు / కొమ్మల భాగాలు / పశువుల పేడ, గొర్రెల / కోళ్ళ పెంట, మూత్రములు / గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ స్లర్రీ మొదలైన వాటిని కంపోస్టు ఎరువు తయారు చేయడానికి వాడవచ్చు.

కంపోస్టు గుంట పరిమాణము: 5.25 మీ. þ 2 మీ. þ 1 మీ.

కంపోస్టింగ్‌ పద్ధతి:

  • 5.25 మీ. పొడవు, 2 మీ. వెడల్పు, 1 మీ. లోతు గుంటలను పొలంలో ఒక మూల వీలయితే చెట్ల నీడలో త్రవ్వాలి.
  • ఇలా త్రవ్విన గుంటలో నీరు నిలువకుండా సులభంగా ఇంకిపోవడానికి దిబ్బ అడుగున రాళ్లు, పెంకులు వంటివి 6 అంగుళాల మందము పరచాలి.
  • సేకరించిన వ్యర్థ పదార్థాలను, చెత్తను 6 అంగుళాల మందం వరకు నింపి దానిపై పేడను, ఆపైన రాక్‌ ఫాస్ఫేట్‌ సుమారు 1 కిలో చిలకరించాలి. ఈ పద్ధతిన పొరలు, పొరలుగా వ్యవసాయ, పశువుల వ్యర్థ పదార్థాలపై రాక్‌ ఫాస్ఫేట్‌ చిలకరించి ఈ విధంగా భూమి మట్టానికి 1-2 అడుగుల ఎత్తు వరకు అమర్చిన తర్వాత అందులో తేమను పెంచటానికి నీటిని చిలకరించవలెను. 
  • ఆ తర్వాత గాలి సోకకుండా, మట్టి, పేడ మిశ్రమంతో పూత పూయవలెను.
  • ఈ విధంగా చేసిన తర్వాత గుంతలో వేసిన సేంద్రియ పదార్థాలు కుళ్ళి సుమారు 75-90 రోజులలో మంచి సారవంతమైన కంపోస్టు తయారవుతుంది.
  • ఈ ప్రక్రియలో గుంతలో ఉత్పన్నమైన వేడికి (40-50 సెంటీగ్రేడ్‌) ఇందులోని హానికారక శీలీంద్రాలు, రోగకారక క్రిములు, కీటకాలు నశించును.

కంపోస్టింగ్‌ త్వరగా జరగడానికి అనువైన పరిస్థితులు పంట వ్యర్థ పదార్థాల ఎంపిక:

  • కంపోస్టు త్వరగా 3 నెలలోపు తయారు అవ్వాలి అంటే కర్బన, నత్రజని మోతాదు తక్కువ ఉన్న వ్యర్థ పదార్థాలు ఎన్నుకోవాలి. కర్బన, నత్రజని నిష్పత్తి ఏ పంట వ్యర్థాలలో తక్కువగా ఉంటే అవి త్వరగా కుళ్ళుతాయి.
  • పంట వ్యర్థ పదార్థాలు బాగా చిన్నవిగా ఉంటే త్వరగా కుళ్ళుతాయి.
  • గుంతలో ఎప్పుడూ తేమ తగినంత ఉండాలి. తేమ వలన కుళ్ళడానికి దోహదపడే సూక్ష్మజీవులు అధికంగా వృద్ధి చెంది ఎరువును తయారు చేయడానికి దోహదపడతాయి. అందుకు దిబ్బపై నీటిని చిలకరిస్తుండాలి.
  • ఎట్టి పరిస్థితులలోను కంపోస్టు గుంతలో నీరు నిల్వ ఉండకూడదు.
  • సాధ్యమైనంత వరకు తేమ త్వరగా ఆరిపోకుండా కంపోస్టు గుంతను చెట్ల నీడలో వేసుకోవాలి.

కంపోస్టు వాడడం వల్ల లాభాలు

  • నత్రజని, పొటాష్‌, భాస్వరం వంటి ప్రధాన పోషకాలే కాకుండా కాల్షియం, మెగ్నీషియం, బోరాన్‌, జింక్‌, మాంగనీస్‌ వంటి సూక్ష్మపోషకాలు కూడా పంటకు అందుతాయి.
  • పంటకు తెగుళ్ళను తట్టుకునే శక్తి పెరుగుతుంది. అందువల్ల క్రిమినాశక మందులకు అయ్యే ఖర్చు తగ్గుతుంది.
  • యూరియా, డిఎపి, పొటాష్‌ వంటి ఎరువులు వాడనక్కర లేదు.
  • కంపోస్టు వాడితే పంటకు నీరు తక్కువ పట్టి నీరు ఆదా అవుతుంది.
  • పండిన పంట త్వరగా చెడిపోదు.
  • నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులు (సూక్ష్మ&క్రిములు) సంఖ్యను బాగా పెంచుతుంది. భూమికి సేంద్రియ కర్బనం లభిస్తుంది.
  • కంపోస్టు ఎరువులోని జిగురు పదార్థాలు మట్టిని పట్టుకొని ఉండటం వల్ల మట్టికోత తక్కువగా ఉంటుంది.
  • నేలలోకి గాలి బాగా వీచేలా, నీరు బాగా ఇంకేలా చేస్తుంది. నీటిని నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది.
  • ప్రతి ఏటా పంట దిగుబడి నిలకడగా ఉంటుంది.
  • అలాగే పంట అవశేషాలు, ఆవుపేడ, డెయిరీ నుంచి వచ్చిన పెంటను ఉపయోగించి వర్మికంపోస్టును తయారు చేసుకోవచ్చును. వర్మికంపోస్టు 2 నెలలలో ఒక సైకిల్‌ పూర్తవుతుంది.
  • పాడి ఉన్న ప్రదేశాల్లో బయోగ్యాస్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సాంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ సబ్సిడి మీద బయోగ్యాస్‌ ప్లాంట్‌ను నిర్మించి ఇవ్వటం జరుగుతుంది. బయోగ్యాస్‌ ప్లాంట్‌ సైజ్‌ ఉండే పశువులను బట్టి అలాగే ఇంట్లో ఉండే మనుషులను బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా 1 క్యూ.మీ. సైజు బయోగ్యాస్‌ ప్లాంట్‌కు 2 పాడి పశువులు అలాగే రోజుకి 25 కిలోల పేడ అనేది అవసరమవుతుంది. ఈ 25 కిలోల పేడను 25 లీ. నీటిలో కలిపి స్లర్రీ లాగా చేసుకోవాలి. బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఇన్‌లెట్‌లో పొయ్యాలి. ఇలా చేసాక మనకి గ్యాస్‌ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్‌ని వంట చేసుకోవడానికి వాడవచ్చు. అలాగే అవుట్‌లెట్‌ల నుంచి వచ్చే స్లర్రీని పొలాలకి వేయడం వలన నేల యొక్క సారవంతత గణనీయంగా పెరుగుతుంది. దాదాపు పశువుల పేడ కన్నా 3 రెట్లు నత్రజని ఈ బయోగ్యాస్‌లో ఉంటుంది.
  • ఈ సమగ్ర వ్యవసాయంలో ఎక్కువగా పచ్చిగడ్డి లభిస్తున్నప్పుడు సైలేజ్‌/మాగుడు గడ్డి తయారు చేసుకోవచ్చు. వేసవి కాలంలో పశుగ్రాసాల కొరత ఉన్నప్పుడు వీటిని వాడవచ్చు. దీని తయారి కోసం మామూలుగా గుంత పద్ధతి అయినా అవలంభించవచ్చు. లేదంటే సైలో బ్యాగ్స్‌ కూడా దొరుకుతున్నాయి. సైలేజ్‌ అంటే పచ్చిగడ్డిని నిల్వ చేసుకోవడం.   దీ

కంపోస్టింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • కుప్పలో వేడిమి 60-90 సెంటీగ్రేడ్‌ డిగ్రీల వరకు ఉండేలా చూసుకోవాలి.
  • కంపోస్టు కుప్పలోని అన్ని భాగాలకు గాలి బాగా ఆడాలి.
  • బెడ్‌లో వేసే వ్యర్థ పదార్థాలను 1-2 అంగుళాల సైజు ముక్కలుగా చేసి వేస్తే గాలి బాగా ఆడుతుంది.
  • కంపోస్టింగ్‌ ప్రక్రియ త్వరగా జరగడానికి బెడ్‌లో ఉదజని సూచిక 6.5-7.5 మధ్యలో ఉండేట్లు చూసుకోవాలి.

డా. జె.డి. సరిత, డా. కె. కళ్యాణి, కె. సాధన (9940236076)

డా. బి. పుష్పావతి, వ్యవసాయ కళాశాల, పాలెం, ప్రొఫెసర్‌ జయంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ. 

Read More

కర్షక మిత్ర 

పేరిశాస్త్రి తల్లి వైదేహి ఉదయమే లేచి పేరిశాస్త్రిని పెరట్లోకి తీసుకెళ్ళింది. అతడిని కొబ్బరిచెట్టు నీడన రాతిబండపై కూర్చోబెట్టింది. బాదం తైలంతో అతని తలని మర్ధన చేసింది. ఉష్ణం తగ్గాలని నిమ్మకాయ పిండి తలకి రాసింది. పేరిశాస్త్రి ముఖం మిలమిలా మెరవాలని దోసిడంత గోవు వెన్న తీసి ముఖానికి పూసింది. అరవై నిమిషాలు తైలంతో నానాక అతడి శరీరంపై  చేదబావిలోని చన్నీళ్ళను బొక్కనతో తోడి పోసింది. కుంకుడు కాయలతో తలని అంటి అభ్యంగన స్నానం పూర్తి చేయించింది. తన చీర కొంగుతో అతడి తలను ఆరబెట్టింది. విసన కర్ర తెచ్చి విసురుతూ కురులను వదులు చేసింది. తలకి సాంబ్రాణి పొగ వేసింది. పేరిశాస్త్రిని రచ్చబండ వద్దకి తీసుకెళ్ళి వేపచెట్టు కింద పసుపు కుంకుమలు పూసివున్న గంగమ్మ తల్లికి దండాలు పెట్టించింది.

ఇంటికి తీసుకెళ్ళి దోసిట్లో చద్ది అన్నం పోసి ఉల్లిపాయ ముక్క, పచ్చి మిరప అందించింది. కడుపు నిండా ఆరగించిన పేరిశాస్త్రి రేగుపండ్ల కోసం అడవికి బయలుదేరినాడు.

*    *     * 

పేరిశాస్త్రి తల్లి వైదేహికి పాతికేళ్ల వయస్సుకే వైధవ్యం ప్రాప్తించింది. ఏటిగట్టుకి ఈతకు పోయిన భర్త సదానంది శాస్త్రి ఏరు పెరిగి ఏటిలో ఎటో కొట్టుకు పోయినాడు. వైధవ్యం ప్రాప్తించే నాటికి పేరిశాస్త్రి చిన్న బిడ్డ. ఇంటవున్న గేదెల పాల విక్రయం ద్వారా జీవనం సాగిస్తోంది ఆమె.

తండ్రిని చూడకనే పేరిశాస్త్రి బాల్యం గడిచింది. ఆయా రుతువులలో ఫలించే అడవి ఫలాలను తెచ్చి పల్లెల్లోకి తీసుకెళ్లి అమ్ముతాడు పేరిశాస్త్రి. దాని ద్వారా లభించే నగదు, ధాన్యాలను గృహానికి చేరుస్తాడు.

*    *     * 

పేరిశాస్త్రి చిన్నగా నడుస్తున్నాడు. వడివడిగా నడిస్తే పుడమితల్లి గాయపడుతుందేమోనన్నంత చిన్నగా నడుస్తున్నాడు. అతడు గోదావరి నదికి అభిముఖంగా నడక సాగిస్తున్నాడు. అతడి మెత్తటి నడకను వెక్కిరిస్తున్నట్టుగా గోదావరి ఎగిరెగిరి ప్రవహిస్తోంది.

అడవిలో కావలసినన్ని రేగుపండ్లు సేకరించి బుట్టలలో, సంచులలో బిగించి ఇంటికి తీసుకెళ్తున్నాడు. గోదావరి నదిలో స్నానం చేస్తున్న ఓ పదహారేళ్ల పడుచుపిల్ల పేరిశాస్త్రిని చూసి సిగ్గుపడలేదు. నవ్వుతూ ఈదుకుంటూ వచ్చి ఒడ్డుపై వాలింది. ఆ పిల్ల ఒళ్ళు బంగారంలా మెరుస్తోంది. తడిసిన సొగసు రతీదేవిని అసూయపరిచేట్లుగా వుంది. సిగకొప్పు నల్ల చీకటి ముద్దలా వుంది. కొప్పులోని వాడిన మల్లెలు అలసిన మన్మథుడు రతీదేవిపై వాలి ఉన్నట్లుగా ఉంది. ఆ పిల్ల కిసుక్కున నవ్వితే మెరుపు మెరిసినట్లుగా వుంది. ఆ పిల్ల ముక్కు పుడక కాంతి సన్నని చీకటి దీపంలాగా ఉంది.

అలాంటి పిల్ల నది గట్టున కూర్చొని పేరిశాస్త్రిని మైలు దూరం నుంచి చూసి చూసి… విసిగింది. అతడి క్షణ వీక్షణానికై తహతహలాడింది. అయితే పేరిశాస్త్రిలో చలనం లేదు. తన మార్గంలో తను ఉన్నాడు. శుక్ర మహర్షిలా ఠీవిగా నడుస్తున్నాడు.

విసిగిన ఆ పిల్ల ‘తన బతుకెందుకింక’ అన్న ధోరణిలో గబుక్కున నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళింది.

*    *     * 

పేరిశాస్త్రి అడవిదాటి, నది దాటి, సేద్యపు గెనాలు దాటి పల్లెలోకి ప్రవేశించాడు. పల్లెకి దూరంగా ఒంటిగా వున్న తన ఇంటిలోకి పెరటిగుండా వెళ్ళినాడు. పెరట్లోని చేదబావి దగ్గర కొబ్బరి చెట్ల నీడన కూర్చొని తను తెచ్చిన రేగుపండ్లను ఆరపోశాడు. చెడిన పండ్లను ఏరి పారేస్తూ కిటికీగుండా ఇంటిలోకి చూసినాడు.

ఇంటిలోపల పట్టెమంచంపై రామశర్మ కూర్చొని ఉన్నాడు. అమ్మ పక్కనే నిలబడి ఉంది. రామశర్మ తన పల్లెలోని పడమటి వీధిలో కాపురముంటున్నాడు. పౌరోహిత్యం ద్వారా జీవనం సాగిస్తున్నాడు. పేరిశాస్త్రికి వరుసకు పెదనాన్న అవుతాడు.

పేరిశాస్త్రి పెరటినుండి ఇంటిలోపలికి వచ్చి రామశర్మ పాదాలకి నమస్కరించాడు. భయంగా, గౌరవంగా, దూరంగా నిలబడినాడు. ఇంటిముందు ముద్ద మందారం చెట్టులోని మందారాలు గాలికి అటూ ఇటూ ఊగుతున్నాయి.

*    *     * 

రామశర్మ కొడుకు సుధాకరం అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ చదివినాడు. బిడ్డకి మంచి భవిష్యత్తు ఉంటుందని కలలు కనినాడు. ఏ శాపం తగిలిందో ఏమో, సుధాకరానికి మూత్రపిండాల జబ్బు వచ్చింది. మూత్రనాళాలలో ఇన్‌ఫెక్షన్లు ప్రారంభమై క్రియాటిన్‌ స్థాయిలు పెరిగి మూత్రపిండాలు దెబ్బతిని డయాలసిస్‌ స్థాయి దాటి మూత్రపిండ మార్పిడి వరకు వచ్చింది.

”బిడ్డలాంటి బిడ్డ నీవు నాకు. కష్టపడి చదివిన నా సుధాకరం, నీవూ ఒకటే బాబు నాకు. ఒక్క మూత్రపిండమైనా మారిస్తే తన బతుకు తాను బతకగలడని యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు చెబుతున్నారు.

విదేశాలలో ఉద్యోగాలు సైతం వాడికోసం సిద్ధంగా ఉన్నాయి. అయినా వాడు మన తెలుగు రాష్ట్రాల ఎల్లలు దాటనంటాడు. తెలుగు రైతన్నలకు మంచి చెడ్డలు నేర్పతానంటాడు. దానికోసం ‘కర్షక మిత్ర’అనే సంస్థను చిన్న పల్లెటూరు, మన పొరుగూరు అయిన అనంతంపల్లిలో ఆఫీసు ఏర్పాటు చేసినాడు. భావసారూప్యం కలిగిన పదిమందితో జట్టు కట్టినాడు. ఆ పదిమందిలో అగ్రికల్చరల్‌ బి.యస్సీ. చేసిన వారు, హార్టికల్చర్‌, సెరికల్చర్‌ సబ్జక్టులలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసినవారు, ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజనీర్లు ఉన్నారు.

వారికి సహాయకరంగా ఇరవైమందితో అంకితభావం కలిగిన క్షేత్రస్థాయి బృందం ఒకటి ఏర్పడింది. అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌, ఫార్మ్‌ ఇంజనీరింగ్‌, అగ్రి టెక్నాలజీలలో డిప్లొమోలు చేసినవారు ఈ బృందంలో ఉన్నారు.

వీరంతా ఉత్తరాల ద్వారా, కరపత్రాల ద్వారా, ఫోన్ల ద్వారా, మొబైల్‌ మెసేజ్‌ల ద్వారా రైతులకు సలహాలు, సూచనలు ఉచితంగా ఇస్తారు. రైతుల పొలాల నుంచి ఇంటికి వచ్చినాక రాత్రిళ్లలో రచ్చబండ సమావేశాలు నిర్వహిస్తారు. దిగుబడి పెంచి, రాబడి గడించే సూచనలు చేస్తారు. అవసరమైతే పొలాలకు వెళ్ళడం, రైతులు ఇండ్లకి వెళ్ళడం చేస్తారు. వారి అవగాహనా సామర్థ్యాన్ని పెంచడానికి ప్రజెంటేషన్స్‌ చేస్తారు. అందుకై ఎల్‌.సి.డి. ప్రొజెక్టర్‌, ల్యాప్‌ టాప్‌, స్క్రీన్‌, రిమోట్‌ మరియు సి.డి. లు కొనుగోలు చేసారు.

అలాంటి సంస్థ నాయకుడి ఆరోగ్యం దెబ్బతినడంతో సంస్థ ఎటుపోతుందో తెలియడం లేదు. సంస్థ నిర్మాణం కోసం, వస్తు సామాగ్రి కోసం వాహనాలకోసం, జీతభత్యాలకోసం ఉన్న ఇల్లూ, వాకిలీ, నేలా, నగా అన్నీఅమ్మేశా. దిక్సూచి లేని సముద్ర ప్రయాణంలా ఉంది పరిస్థితి.

మంచి చదువు చదివినవాడు, పదిమందికీ పనికివస్తాడని ఆశించినాము. అయితే రోజు రోజుకీ వాడి ఆరోగ్యం క్షీణిస్తోంది. వయసు మీరిన నేను ఎక్కువకాలం బతకను. పదేళ్లక్రితమే భార్యను పోగొట్టుకున్నవాణ్ణి. ఇప్పుడు కొడుకునీ పోగొట్టుకోలేను. వాడి ఆదర్శాలనూ చంపలేను. నా శరీర నిర్మాణం సరిగా లేనందున నా అవయవదానం పనికిరాదు.

పెద్దమనసు చేసుకొని నీ మూత్రపిండం ఒక్కటి నా బిడ్డకి ఇస్తే మా ఇంటిదీపం వెలిగించిన వాడవవుతావు. నీకు తమ్ముడిలాంటి వాడు. వాడికి ఆయుష్షు ప్రసాదించు బాబూ! వాడు ఈ సమాజానికి చేయాల్సింది చాలా ఉంది బాబూ!” అని ఏడుస్తూ పేరిశాస్త్రి కాళ్లమీద పడినాడు.

తల్లి వైదేహి ససేమిరా ఒప్పుకోవద్దని పేరిశాస్త్రికి సైగలు చేస్తోంది. పమిటతో నోటికి కప్పి ఏడుస్తూ వుంది. ఆమె సైగలను పట్టించుకోలేదు అతడు.

పేరిశాస్త్రి తీక్షణంగా రామశర్మ కళ్లలోకి చూస్తూ, మౌనంగా, నిలబడినాడు. అలాగే పదిహేను నిమిషాలపాటు కళ్ళు మూసి దీర్ఘంగా ఉచ్చ్వాసనిశ్వాసాలు తీసినాడు.మనసుకి ఏదో బోధపడింది.

కళ్లు తెరిచి ”పెద్దనాన్నగారు, నా శరీరభాగం మన సుధాకరానికి ఉపయోగపడుతుందంటే రెండవ ఆలోచన చేయాల్సిన పనిలేదు. రైతు బాంధవుడు అతడు. అజ్ఞానం నీడలో, సాగుబడిలేక, దిగుబడిరాక దినదిన గండంతో సతమతమవుతున్న రైతుల చీకటి జీవితాల్లో చిన్న చిరుదివ్వె వెలిగించాలన్నది సుధాకరం తపన. అది ఎంతమందికి వెలుగు ప్రసాదిస్తుందనేది అప్రస్తుతం. ప్రయత్నం చాలు. మనందరం ఆ ప్రయత్నాన్ని స్వాగతిద్దాం. మనవంతు సాయం మనం చేద్దాం. మీరు మూత్రపిండ మార్పిడికి డాక్టర్లతో మాట్లాడి ఏర్పాటు చేసుకోండి” అని ధైర్యంగా సూటిగా రామశర్మకి చెప్పినాడు.

రెండు చేతులూ జోడించి కళ్లనీళ్లతో ”కృతజ్ఞతలు బాబూ!” అంటూ రామశర్మ బయలుదేరినాడు.

*    *     * 

వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చిన వైదేహి పేరిశాస్త్రికి నాలుగు అడుగులు దూరంలో నిలబడింది. ఆమె శరీరం చిన్నగా కంపిస్తోంది. కళ్లలోంచి కన్నీరు… వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తోంది.

తల్లి ఏడ్వడం సహించలేని పేరిశాస్త్రి వడివడిగా వస్తూ ”ఏడ్వకే అమ్మా!” అంటూ ఆమెను తన ఒడిలోకి తీసుకొని మౌనంగా భుజం తడుతూ ఓదార్చినాడు.

సొమ్మసిల్లినట్టుగా పడివున్న తన తల్లి ముఖాన్ని చల్లటి నీటితో శుభ్ర పరచాలని నీటితొట్టి వద్దకి పరుగు తీసినాడు. పరుగుతీసే సమయంలో అతడి కాలికి ముల్లు గుచ్చుకొంది. గట్టిగా ”అమ్మా!” అని అరిచినాడు.

వైదేహి ఉలిక్కిపడింది. పరుగెత్తుకెళ్ళి అతడిని తన ఒడిలోకి తీసుకొని కాలిలోని ముల్లు పెరికింది. పేరిశాస్త్రిని బాధ లాగుతోంది. అరిపాదంలో ఇరుక్కొని వున్న ముల్లుకొన నెప్పి పెడుతోంది.

ఆమె తనవద్ద వున్న పిన్నుతో ముల్లుకొనని తీసి పారేసింది. రక్తం వస్తోంది. ఆమె తన నోటిలోకి రక్తాన్నంతా లాక్కొంది.

రక్తం రావడం ఆగాక, చిన్నగా అరిపాదంపై ముద్దెట్టుకుంది. అతడి కళ్లలో కన్నీరు ”ఒక్కగానొక్క కొడుకువి, నన్ను అన్యాయం చేయకయ్యా!” అని చేతులు పట్టుకు అడిగింది. అతడు ఏడ్చాడు. చిన్న పిల్లాడిలా ఆమెను హత్తుకుపోయాడు.

”అమ్మా! అమ్మా! నీవు ధైర్యంగా ఉండవే! నీ కళ్లలో కన్నీళ్లు చూడలేను. నవమాసాలు నన్ను మోసి, పెంచి, పెద్ద చేసినదానవు. నేను నీ సృష్టినే అమ్మ! నీకు అన్యాయం ఎందుకు చేస్తానే!

పెద్ద చదువులు చదవకపోయినా, నాలో చిన్నప్పటి నుంచీ అన్నం పెట్టే రైతన్నలకి ఏమైనా, ఏదైనా సహాయం చేయాలనిపించేది. అది జరిగే వీలు నాకు కలగలేదు. సుధాకరం నా కలలని వాస్తవం చేసే యజ్ఞంలో ఉన్నాడు. ఆ యజ్ఞానికి నా వంతు ఆజ్యం పోస్తానమ్మా!”అన్నాడు.

వైదేహి తల్లడిల్లిపోయింది. 

‘ఒక్కగానొక్క కొడుకు. ‘నా’ అనే దిక్కు లేదు. ఏమి చేసేదబ్బా’ అనుకుంటూ మంచంపైని తుండుగుడ్డని లాక్కొని ముఖాన్ని దాచుకొని ఏడుస్తూ కూర్చుంది.

అమ్మ కాళ్లదగ్గర కూర్చున్నాడు పేరిశాస్త్రి.

”అమ్మా! గొప్ప చదువులు చదివినవాడిని కాను. మీరంతా చదవమనినా, చదవక తప్పించుకొని తిరిగినవాడిని. పట్టుమని పదివరకైనా చదవలేకపోయాను. ప్రపంచాన్ని చూసేకొద్దీ చదువు విలువ తెలుస్తోందమ్మా.

తమ్ముడు పెద్ద పెద్ద చదువులు చదివినాడు. ఎందరో జనాలకి సహాయం చేయాలని ఉన్నవాడు. నేను ఎంత ఎదిగినా నా పరిమితి చిన్నది. సుధాకరం బృందం పరిమితి పెద్దది.

నా శరీరంలోని ఒక భాగం ఒక సంఘసేవకుడి నిర్మాణాత్మక కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతున్నందులకు గర్వపడాలి. చిన్నప్పటి నుంచీ రైతులకు సహాయం చేయాలని ఉండేది. ఇప్పుడు అవకాశం వ్చచింది నాకు. కాదనవద్దమ్మా! ఒక్క మూత్రపిండం దానం చేసినంత మాత్రాన నా ప్రాణాలేమీ పోవమ్మా! నాకు పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. నీ బిడ్డ చేసే సాయంవల్ల నలుగురికీ మంచి జరుగుతుందే అమ్మా! ఓ బిడ్డ తల్లిలాగా ఆలోచించవద్దు. లబ్ధిపొందబోయే రైతుబిడ్డల తల్లిగా ఆలోచించు. అందరూ ‘నా’ వారు అనుకుంటే సమస్య ఉండదమ్మా!” అని ప్రాధేయపడినాడు.

వైదేహికి పేరిశాస్త్రి భగవద్గీతను బోధించే శ్రీకృష్ణుడిలా కనిపించాడు. ధర్మసూక్ష్మాలు బోధించే గౌతమ బుద్ధుడిలా అగుపించాడు.

అలాగే ఆమె అతడిని నెలల పసికందులా దగ్గరకు తీసుకున్నట్లు తీసుకొని ఆలింగనం చేసుకొంది. ఆకాశం నుంచి సన్నసన్న చినుకులు రాలడం ప్రారంభమయ్యింది. ఆకాశంలో తూర్పు దిక్కున ఇంద్రధనస్సు మొలిచింది.

ఇంటి పెరటి చింతచెట్టు గాలికి చిన్నగా సవ్వడి చేసింది. చింత చిగురు వారినిద్దరినీ పలకరిస్తున్నట్టుగా మెరుస్తూ ఉంది. లేత చింతకాయలు పేరిశాస్త్రిని ఆశీర్వదిస్తున్నట్లుగా అటూ ఇటూ ఊగుతున్నాయి.      *

ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు,  9393662821

‘ఆంధ్రభూమి’ మాసపత్రిక సెప్టెంబర్‌ 2018లో ప్రచురింపబడింది.

Read More