మామిడిలో పండు ఈగ ఉధృతి

వినూత్న పద్ధతులతో సమగ్ర యాజమాన్యం

మామిడి సాగులో మన దేశంది అగ్రస్థానం, బంగారు వర్ణంలో నోరూరించే మామిడి రుచిలో మధురంగా, అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది, అందుకే మామిడిని ”ఫల రాజు” అని పిలుస్తారు. మన దేశం ఉత్పత్తిలో మొదటి స్థానములో ఉన్నప్పటికీ ఎగుమతిలో మాత్రం వెనకబడే ఉంది. దీనికి గల ప్రధాన కారణం పండు ఈగ ప్రభావం. మన తెలుగు రాష్ట్రాలలో కూడా విస్తారంగా సాగు అవుతున్న ముఖ్యమైన వాణిజ్య పంటలలో మామిడి ఒకటి. సుమారుగా 7.7 లక్షల ఎకరాలలో  సాగు చేయబడి, ఏటా 25 నుండి 30 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. మన మామిడికి ఇతర దేశాలలో మంచి గిరాకీ ఉంది, కానీ పండు ఈగ ఆశించడం వల్ల మామిడి ఎగుమతి నిరాకరించబడుతుంది, అలాగే వివిధ దేశాల ప్రమాణాలను అందుకోలేకపోవడం మూలంగా ఆయా దేశాలు దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పండు ఈగ ద్వారా నష్టం మామిడి, జామ, సపోటా, అరటి, బొప్పాయి మరియు సీతాఫలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ పండు ఈగ ఆశించుట వలన కనీసముగా 25 శాతం, ఒకవేళ ఉదృతి ఎక్కువగా ఉన్నట్లైతే 100 శాతం వరకు నష్టం వాటిల్లుతుంది. ‘మేడి పండు చూడు మేలిమైయుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అనే నానుడి ఇప్పుడు మామిడికి కూడా వర్తిస్తుంది. ఈ పండు ఈగలు కాయ అభివృద్ధి చెందేటప్పుడు ఆశించి పక్వానికి వచ్చే వరకు ఈ నష్టం మనకి బయటికి ఏ మాత్రం కనబడదు, కాని తీరా పండ్లు కోసి చూస్తే అందులో తెల్లని పిల్ల పురుగులు గుజ్జును తింటూ ఉంటాయి. ఇలాంటి కాయల కొనుగోలుకు వ్యాపారులు, ఎగుమతిదార్లు ముందుకు రాక రైతులు నష్టపోతున్నారు.రైతు సంవత్సరం పొడువునా కష్టపడి మామిడి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్నో ఆశలతో ఎదురుచూసే సమయంలో పండు ఈగ ఆశించడం వలన రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. రైతులు పండు ఈగ నుండి పంటను కాపాడుకోవడానికి విపరీతమైన రసాయనిక మందులు వాడుతున్నారు, దీని వలన పండ్ల పై పురుగు మందు అవశేషాలు ఎక్కువవుతున్నాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే రసాయనిక మందులు వాడినా ప్రయోజం ఏ మాత్రం ఉండదు, ఎందుకంటే తల్లి ఈగలు కాయ చర్మాన్ని గుచ్చి లోపల గుడ్లు పెట్టి అందులోనే పొదగబడి గుజ్జుని తింటాయి. ఇక కోశస్థ థ భూమి లోపల జరుగుతుంది. ఎక్కడా మనం ఈ పండు ఈగ నష్టాన్ని గుర్తించలేము, ఇలాంటప్పుడు రసాయనిక మందులు పిచికారీ చేసినా పండు లోపల ఉన్న లార్వాను చేరలేవు. ఈ పండు ఈగను ఏ రసాయన మందులు గాని సమర్ధవంతంగా నివారించలేవు. కావున ఈ పండు ఈగ రాకుండా ముందస్తుగానే ఎలాంటి చర్యలు సకాలంలో చేపట్టాలి మరియు రసాయనిక మందులకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్దతులు అనుసరించాలి లేదా ఇంకా ఇతర నూతన సాంకేతిక పరిజ్ఞానాలు ఏమైనా ఉన్నాయా అని రైతులు ఈ కోణంలో ఒక్కసారి ఆలోచిస్తే మంచి నాణ్యమైన దిగుబడులు సాధించగలరు. ఇప్పుడు పండు ఈగ నష్టపరుచు విధానము మరియు సమగ్ర సస్య రక్షణ చర్యలు మరియు అధునాతన పద్ధతులు ఏం ఉన్నాయో తెలుసుకుందాం. 


పండు ఈగ రకాలు:

ఈ పండు ఈగలు ముఖ్యంగా మామిడి, జామ, అరటి, బొప్పాయి, సపోటా మరియు సీతాఫలంను ఆశించి నష్టపరుస్తాయి. 


పండు ఈగ వృద్ధికి అనుకూల సమయం, వాతావరణం:

*    పండు ఈగ ఉదృతి మార్చి, ఏప్రిల్‌ మాసంలో ప్రారంభమై సంతతిని వృద్ధి చేసుకుని  జూన్‌ మరియు జులై మాసంలో విజృంభిస్తుంది. 

*    కాయ అభివృద్ధి చెందే థలో లోపల ఉన్న గుడ్లు వేడికి పొదగబడి పిల్ల పురుగులుగా మారి లోపల కణజాలాన్ని తింటూ ఉంటాయి

*    వాతావరణంలో అధిక వేడి, చలి ఉన్నప్పుడు ఈ పండు ఈగలు తట్టుకోలేవు 

పండు ఈగ జీవిత చక్రం, నష్టపరుచు విధానం:

*    ఆడ పండు ఈగలు లేత గోధుమ రంగులో ఉండి పారదర్శకమైన రెక్కలు కలిగి ఉంటాయి. వీటి  వెనుక భాగం లో గుడ్లు పెట్టడానికి వీలుగా సూది లాంటి అండోత్సర్గంను కలిగి ఉంటాయి

 *    పండు ఈగ జీవిత చక్రం నాలుగు థలను కలిగి ఉంటుంది. గుడ్డు థ, లార్వా (మాగ్గోట్‌) థ, కోశస్థ థ మరియు తల్లి పురుగు థ. ఈ నాలుగు థల్లో లార్వా థ ప్రత్యక్షంగా అధికంగా ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. 

*    ఈ పండు ఈగలు 50 కిలో మీటర్ల వరకు కూడా వ్యాప్తి చెంది వేరే పంటలను ఆశ్రయించి దాని జీవిత చక్రం పూర్తి చేసుకుంటాయి. కింద రాలి కుళ్లిపోయిన పండ్లలో కూడా తన జీవిత చక్రాన్ని కొనసాగిస్తాయి. ఈ రెండు పద్ధతుల ద్వారా పండు ఈగలు తోటల్లో ఆశించే అవకాశం కలదు.

*    ఆడ తల్లి ఈగ కాయలు అభివృద్ధి చెందే థలో అనువుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని కాయ యొక్క చర్మం లోపలికి అండోత్సర్గంతో గుచ్చి రంద్రం చేసి సుమారుగా 100-500 గుడ్లను పెడుతుంది. తల్లి ఈగ తన జీవిత కాలంలో 1000  గుడ్లు పెడ్తుంది. 

*    ఈ గుడ్లు 2 నుండి 3 రోజులలో పిల్ల పురుగులుగా మారి లోపల ఉన్న కణజాలాన్ని తింటాయి. కాయలపై గుడ్లు పెట్టడానికి చేసిన రంద్రాల ద్వారా ఇతర శిలింద్రాలు మరియు బాక్టీరియా ఆశించి కాయలు మెత్తబడి కుళ్లిపోతాయి. 

*    ఈ లార్వా థ అంతా పండులోనే జరుగుతుంది, కావున నష్టాన్ని మనం పండు కోసే వరకు గుర్తించలేము. *    తదుపరి పిల్ల పురుగులు బాగా ఎదిగి కోశస్థ థకు చేరే ముందు పండ్ల నుండి ఎగిరిపడి భూమిలో కోశస్థ థను గడుపుతాయి. పిల్ల పురుగుల వలన తీవ్రమైన ఆర్థిక నష్టం కలుగుతుంది. 

*    కోశస్థ థ 10 – 40 రోజులలో వాతావరణ పరిస్థితులను బట్టి తల్లి ఈగలుగా మారుతాయి. 

*    ఈ ఆడ మరియు మగ ఈగలు సంపర్కం జరిపి గుడ్లను పెట్టి వాటి జీవిత చక్రాన్ని ప్రారంభిస్తాయి. ఇలా పండు ఈగలు సుమారుగా 40 నుండి 50 రోజులలో తమ జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. ఒక్కో పండు ఈగ వేల ఈగలను సృష్టించి తన సంతతిని పెంచుకుంటూ మన పంటకు నష్టాన్ని కలుగజేస్తాయి. కావున వీలైనంత త్వరగా సరైన యాజమాన్య పద్దతులను తీసుకోవడం ఎంతో ముఖ్యం.

*    పండు ఈగ ఆశించిన పండ్లు నాణ్యతను కోల్పోయి తినడానికి కాని, స్థానిక మార్కెట్లలో అమ్మడానికి కాని ఎగుమతికి గాని పనికిరావు.


సమగ్ర సస్యరక్షణ చర్యలు

*    పండు ఈగ కోశస్థ థ భూమిలో గడుపుతుంది, కావున వేసవి లో చెట్ల పాదులలో 10 సెం. మీ. లోతు వరకు దున్నుకుని మిథైల్‌ పారథియాన్‌ పొడిని 50 – 100 గ్రాముల  చొప్పున చల్లుకోవాలి.

*    పండు ఈగలు ఆశించి రాలిన పండ్లను ఏరి నాశనం చేయాలి. ఎండు కొమ్మలను తీసి వేయాలి మరియు కోత అనంతరం కొమ్మ కత్తిరింపులు చేసుకుంటే గాలి వెలుతురు బాగా ప్రసరిస్తాయి.

*    పండ్ల తోటల్లో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి మరియు పండ్ల తోటలకు దగ్గరగా జామ, బొప్పాయి, సీతాఫలం మరియు తీగ జాతి కూరగాయలు ఉన్నట్లైతే వాటిపై సరైన సస్య రక్షణ చర్యలు చేపట్టాలి, లేదంటే అవి వీటికి ప్రత్యామ్న్యాయ పంటలుగా తోడ్పడి వాటి జీవిత చక్రాన్ని సాగించడానికి మరియు సంతతిని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. 

*      పిందె కట్టిన 40 రోజుల తర్వాత కాయలకు బ్యాగులను తొడగాలి కొంత వరకు పండు ఈగ ఆశించే అవకాశం తగ్గుతుంది, కాని అన్ని కాయలకు కట్టడం సాధ్యం కాని పని మరియు ఖర్చుతో కూడుకున్న పని.

*      లింగాకర్షక బుట్టలు (మిథైల్‌ యూజినల్‌ ఎరలు), ఎకరానికి 6 నుండి 10 ఎర బుట్టలను పెట్టుకోవాలి. ఈ ఎర బుట్టలు పండు ఈగ ఉదృతిని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. 20 నుండి 30 బుట్టలను పెట్టుకున్నట్లైతే కొంత వరకు పురుగు ఉదృతిని తగ్గించవచ్చు, కాని ఈ మాస్‌ ట్రాప్పింగ్‌ ద్వారా కూడా పురుగు ఉదృతిని ఆర్థికంగా నష్టపరిచే స్థాయి లోపల ఉంచడం సాధ్యం కాదు. వివిధ రకాల చెక్కతో చేసిన లింగాకర్షక ఎరలు మార్కెట్లలో లభిస్తున్నాయి. వీటిని 30  నుండి 40  రోజులకొకసారి ఎరలని మార్చాల్సి ఉంటుంది మరియు పురుగు ఉదృతి బట్టి  3 నుండి 7 రోజులలో బుట్టలలో నీటిని మార్చాల్సి ఉంటుంది. ఈ ఎరల వలన పురుగు ఉదృతి మాత్రమే తెలుస్తుంది, కానీ అప్పటికే పండ్ల తోటల్లో జరగాల్సిన నష్టం జరిగి ఉంటుంది. పైగా ఈ చెక్క ఎరలు వాతావరణంలో జరిగే మార్పులను బట్టి సరిగ్గా పనిచేయవు. వర్షం పడిన రోజులలో పండు ఈగలను ఆకర్షించలేవు.

*      ఈ చెక్క ఎరల యొక్క లోపాలను మరియు పరిమితులను అధిగమించడానికి వినూత్నంగా పండు ఈగ ఉదృతి తెలుసుకోవడం కోసం ATGC బయోటెక్‌ సంస్థ ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా నానో టెక్నాలజీతో స్వీయ నియంత్రణ పద్దతిలో విడుదల చేసే టాబ్లెట్‌ ఎరను MANTRA ME అనే పేరుతో మార్కెట్‌ లోకి తీసుకురావడం జరిగింది. ఈ టాబ్లెట్ను లింగాకర్షక బుట్టల్లో ఉంచి పండ్ల తోటల్లో పెట్టినట్లయితే సమర్ధవంతంగా 120 రోజుల వరకు మగ ఈగలను ఆకర్షించి బుట్టలలో  పడేటట్లు చేస్తుంది. ఈ టాబ్లెట్‌ పనితనం చెక్క ఎరల కన్నా సమర్ధవంతంగా పనిచేస్తుందని  నిరూపించబడింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఎరలు పురుగు ఉదృతిని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి.

*      పండు ఈగలను ఆకర్షింపజేసి సమర్ధవంతంగా నివారించడానికి ఆకర్ష్‌ ME పేస్టును ఉపయోగించినట్లైతే మంచి ఫలితాలు సాధించవచ్చు. దీన్ని ఉపయోగించే విధానం మరియు ప్రయోజనాలు  వివరముగా వినూత్న పద్దతులలో తెలుసుకుందాం.

*      ఒక లీటరు నీటికి 5 శాతం వేప గింజల కాషాయం కలిపి మొదటి థగా కాయలు గోలి సైజులో ఉన్నప్పుడు మరియు రెండో విడత 15 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేసుకుంటే పురుగు ఉదృతిని తగ్గించవచ్చు

*      ఇక ఇవన్నీ చేసాక మాత్రమే రసాయనిక మందులను వాడాలి, కానీ ఈ మందులు పండు ఈగ ఉదృతిని తగ్గించడంలో అంతగా ప్రభావం చూపవు. వీటిలో ప్రోఫినోఫోస్‌ (50 ఇ. సి.) 1.5 మి. లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి. లీ. లేదా డెకామేత్రిన్‌ (2.8 ఇ. సి.) 0.5 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
పండు ఈగను సమర్ధవంతంగా అరికట్టుటలో వినూత్న పద్దతి: ఆకర్ష్‌ ME

*    ATGC  బయోటెక్‌ సంస్థ ప్రపంచంలోనే మొట్ట మొదటి సరిగా CREMIT అనే వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సహజసిద్ధంగా రూపొందించిన ఉత్పత్తి Akarsh ME

*      దీనికి మగ, ఆడ ఈగలను సైతం ఆకర్షింపగల సామర్థ్యం కలదు. 

*      దీనిలో ఏ రకమైన హానికరమైన పురుగు మందులు లేవు. ఇది అత్యంత సమర్థవంతంగా పండు ఈగను ఆకర్షించి చంపే జెల్‌ ఎర.

*      ఆకర్ష్‌ ME పేస్టు మామిడి. జామ, బొప్పాయి, సపోటా సీతాఫలం మరియు దానిమ్మ వంటి పండ్ల తోటల్లో వచ్చు వివిధ రకాల పండు ఈగ జాతులను ఆకర్షించి వాటిని నివారించడంలో సమర్ధవంతమైనది.

 *      ఈ ఆకర్ష్‌ ME పేస్టు (250 గ్రా.) ను ఏదేని ఆమోదించబడిన పురుగు మందులను (స్పైనోసాడ్‌ లేదా ఫిప్రూనిల్‌) 7.5 – 10 మి. లీ./250 గ్రా పేస్టు తో కలిపి మిశ్రమాన్ని చేయాలి.

 *      ఈ ఆకర్ష్‌ ME పేస్టుని పిందె నుంచి మొదలు పెట్టి ప్రతి 30-45 రోజులకొకసారి 2 పర్యాయాలు వాడినట్లైతే పండు ఈగను సంతతిని ముందునుంచే అరికట్టి వాటి సంతతి వృద్ధి పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టవచ్చని వివిధ పరిశోధనలు నిర్ధారించాయి.

 *      ఈ పేస్టును చెట్టు వయసుని బట్టి 1 నుండి 4 ప్రదేశాలలో కాండం లేదా కొమ్మ పైభాగంలో 1 – 2 గ్రా. మిశ్రమాన్ని చిన్న ముద్దలాగా చేసి పెట్టాలి.

*      ఈ పేస్టుకు మగ మరియు ఆడ ఈగలు కూడా ఆకర్షింపబడతాయి, తద్వారా వాటి సంతతిని మొదటి నుండే మన పండ్ల తోటల్లో ఉదృతిని సమర్ధవంతంగా నివారించవచ్చు. 

*      సామూహికంగా తోటి రైతులందరితో కలిసి వాడినట్లైతే పండు ఈగ ఉదృతిని పూర్తిగా నివారించవచ్చు.*      పక్క పొలాల్లో పండు ఈగ ఉదృతి ఎక్కువగా ఉన్నట్లైతే ఈ ఆకర్ష్‌ ఖజూ పేస్టును మన పండ్ల తోటల చుట్టూ ఉన్న చెట్లపై ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది.

*      ఈ ఆకర్ష్‌ ME పేస్టును పలు భారతీయ ఉద్యానవన  పరిశోధన కేంద్రాలు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయ  శాస్త్రవేత్తల ద్వారా పరీక్షించబడి ఆమోదించబడినది.

*      దీన్ని పండు పరిపక్వము థలోనే కాకుండా పిందె థ నుండి వాడినట్లైతే మంచి ఫలితాలు వస్తాయని వివిధ మామిడి రకాలలో పరీక్షింపజేసి నిరూపించబడినది.

*      శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు సెంటర్‌ అఫ్‌ ఎక్స్లెన్స్‌, ములుగు లో ఆకర్ష్‌ ME ని ఉపయోగించి పండు ఈగ ఉధృతిని సమర్ధవంతంగా అరికట్టే పద్దతిని క్షేత్ర స్థాయిలో రైతులకు ప్రదర్శన చేయడం జరిగింది.

*      వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు జరిగిన దీని పనితనంలో ఎలాంటి మార్పు ఉండదు. వర్షానికి రాలిపోదు మరియు ఎండకి కరిగిపోదు.

*      ఇతర రసాయనిక పురుగు మందులు వాడినా దీని ప్రభావం తగ్గదు.

*      ఆకర్ష్‌ ME వలన క్షేత్రంలోని మిత్ర పురుగులకు ఎటువంటి హాని జరగదు మరియు, ఇది సహజసిద్ధ ఉత్పాదన కావున పండ్లపై ఎటువంటి పురుగు మందుల అవశేషాలు ఉండవు.
పండు ఈగ ఉదృతి తెలుసుకునేందుకు: Mantra ME

*      ATGC బయోటెక్‌ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా నానో టెక్నాలజీతో స్వీయ నియంత్రణ పద్దతిలో విడుదల చేసే టాబ్లెట్‌ ఎర MANTRA ME. పండు ఈగ ఉదృతి తెలుసుకోవడం కోసం, చెక్క ఎరల యొక్క లోపాలను మరియు పరిమితులను అధిగమించడానికి వినూత్నంగా ఆవిష్కరించబడిన సరికొత్త ఉత్పాదన.

*      పండు ఈగ ఉదృతిని గమనించడానికి ఎకరాకు 5 ఎర (MANTRA ME) బుట్టలను పెట్టుకోవాలి. 25 -30 ఎర బుట్టలు (MANTRA ME) పెట్టుకున్నట్లైతే పురుగు ఉదృతిని మాస్‌ ట్రాప్పింగ్‌ పద్దతి ద్వారా తగ్గించవచ్చు. ఈ MANTRA ME ఒక్కో టాబ్లెట్‌ను ఒక్కో  McPhail ట్రాప్‌లలో ఉంచి పంట పొలాల్లో చెట్టు కొమ్మలకు వేలాడదీయాలి.

*      పంటల్లో ఉన్న పండు ఈగలు ఈ టాబ్లెట్‌ ఎరకు ఆకర్షింపబడి బుట్టలల్లో పడిపోతాయి.

*      ఈ MANTRA ME టాబ్లెట్‌ ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సమర్ధవంతంగా 60-90 రోజులు పనిచేయగలదు మరియు నీటిలో కూడా కరగదు. అదే చెక్కతో చేసిన లింగాకర్షక ఎరలు 30 నుండి 40  రోజులకొకసారి వాటిలోని ఎరలని మార్చాల్సి ఉంటుంది మరియు పురుగు ఉధృతి బట్టి 3 నుండి 7 రోజులలో బుట్టలలో నీటిని మార్చాల్సి ఉంటుంది.

ఇలా సమగ్ర సస్యరక్షణ చర్యలు సరైన సమయంలో పాటిస్తే మాత్రం పురుగు ఉదృతిని తగ్గించుకుని మంచి దిగుబడులు సాధించవచ్చు. రసాయనిక పురుగు మందులు వాడటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది, ప్రజల ఆరోగ్యానికి హాని, మిత్ర పురుగులు నశిస్తాయి, పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా పండ్లపై చేరతాయి.

ఇవన్నీ మామిడి మార్కెటింగ్‌ మరియు ఎగుమతిని దెబ్బతీస్తాయి. ఇక వివిధ రకాల ఎర బుట్టలను వాడటం వల్ల పురుగు ఉనికిని మాత్రమే పసికట్టగలం కానీ ఉదృతి తగ్గించలేము. బ్యాగింగ్‌ చేయడం ఖర్చుతో కూడిన పని. ఎన్ని రసాయనిక మందులు వాడినా లేని ప్రయోజనం ఆకర్ష్‌ ME పేస్టు వల్లే సాధ్యం మరియు పండు ఈగ బారి నుండి పంటకు రక్షణ కల్పిస్తుంది. ఈ ఉత్పాదనను మామిడిలోనే కాక వివిధ పండ్ల తోటల్లో వాడినప్పుడు ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని పండు ఈగను 45 రోజుల వరకు సమర్ధవంతంగా నివారించడంలో సత్తా చూపించిందని వివిధ పరిశోధనలలో తేలింది. నూతన టెక్నాలజీ ద్వారా రూపొందించబడిన ఆకర్ష్‌ ME పేస్టు వలన పర్యావరణ కాలుష్యం జరగదు, కూలీల ఖర్చు తక్కువ, మందులు పిచికారీ చేయాల్సిన పని లేదు, పేస్టు పెట్టడానికి ఏ పంపులు కూడా అవసరం లేదు. శ్రమ మరియు ఖర్చు కూడా తక్కువే అయినప్పటికీ పండు ఈగను సమర్ధవంతంగా ఎదుర్కోగలదు. కావున రైతులు అన్ని సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటిస్తూ, రసాయనిక మందుల వాడకం తగ్గించి ఇటువంటి నూతన పద్ధతుల పట్ల అవగాహన పెంచుకుని సేంద్రియ ఉత్పాదనలు వాడినట్లైతే మంచి నాణ్యమైన దిగుబడులు మీ సొంతం చేసుకోవచ్చు. ఇతర యాజమాన్య పద్దతులతో పాటు ఆకర్ష్‌ ME వాడినట్లైతే పురుగు మందుల అవశేషాలు ఉండవు కావున ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది.             

 డా. సౌజన్య బత్తుల, డా. శశిధర్‌ బూర్ల, డా. విజయ్‌ రెడ్డి, ATGC బయోటెక్‌, ఇన్నోవేషన్‌ స్క్వేర్‌,  బయోటెక్‌ పార్క్‌, శామీర్‌ పేట్‌, హైదరాబాద్‌, తెలంగాణ 500 078. ఫోన్‌: 8977632842

Read More

వ్యవసాయ వ్యర్థాల వినియోగంతో ప్రత్తిలో గులాబిరంగు పురుగు నివారణ

భారతదేశంలో ప్రత్తి పైరు 1300 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రత్తి సాగు 6.50 లక్షల హెక్టార్లలో, కర్నూలు, గుంటూరు, కృష్ణా, అనంతపురం, ప్రకాశం జిల్లాలలో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ప్రత్తిని ఆశించే అనేక రకాలైన పురుగులలో గులాబి రంగు పురుగు ముఖ్యమైనది. ఇటీవల కాలంలో ఈ పురుగు ఉద్ధృతి గణనీయంగా పెరగడమే కాకుండా పంట విత్తిన 75-80 రోజులకే ఆశించి నష్టం చేకూరుస్తుంది. ఈ పురుగు యాజమాన్యంకు కేవలం ఒక రసాయిన పురుగుమందులపై ఆధారపడకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టుట వలన గులాబి రంగు పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు.

ప్రత్తి తీసిన తర్వాత అవశేషాలను పంట చేలోనే ఎక్కువ కాలం ఉంచడం వల్ల గులాబి రంగు పురుగు పంట పొలంలో ఆశ్రయం పొంది దాని ఉధృతి పెరుగుతోంది. కొంత మంది రైతులు ప్రత్తి తీత మరియు తర్వాత విత్తే పంటల మధ్య ఉన్న సమయం తక్కువగా ఉండటం వల్ల పొలాలను వేగంగా సిద్ధం చేయడం కొరకు ప్రత్తి కట్టెలను కాల్చేస్తారు. కానీ అలా కాల్చడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి.
ప్రత్తి అవశేషాలను కాల్చడం వల్ల నష్టాలు

1. పంట తీసుకున్న అనంతరం ఎండిన మొక్కలను పంట చేలోనే కాల్చేయడం వల్ల భూమిలోని సారం దెబ్బతింటుంది. 

2. నేలలో ఉండే మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు హాని కలుగుతుంది.

3. కాల్చడం వల్ల భవిష్యత్తులో ఉద్గార వాయువుల పరిమాణం పెరిగి వాతావరణంలో తీవ్రమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.

4. భారత దేశంలో ప్రత్తి సాగు చేయడం ద్వారా సుమారు 25-30 మిలియన్‌ టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి కాగా, వాటిలో 48.9 శాతం అవశేషాలను కాల్చివేయడం జరుగుతోంది. ప్రత్తి పంట తీసిన తర్వాత ఏర్పడే అవశేషాలను మెలకువగా ఉపయోగిస్తే లాభదాయకంగా ఉంటుంది మరియు గులాబీ రంగు పురుగు నివారణకు కూడా లాభం చేకూరుస్తుంది.
ప్రత్తి వ్యవసాయ వ్యర్థాల వినియోగం

1. ప్రత్తి తీతల తర్వాత వచ్చే కాండాలు, ఆకులు మరియు పండిన కాయలను చేలో మేకలను, గొర్రెలను మరియు పశువులను తోలి మేపవచ్చు. లేదా ఇంటికి తీసుకెళ్లి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టి శీతాకాలపు మేతగా కూడా వాడవచ్చు.అయితే మొక్కల్లో పురుగుమందుల అవశేషాల స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని పశువులకు తినిపించరాదు.

2. ప్రత్తి మోళ్ళను ట్రాక్టరు ష్రెడ్డర్‌ తో భూమిలో కలియ దున్నుకోవచ్చు. ఇలా చేయడం వల్ల…

*    భూసారం పెంచడంతో పాటు తేమను సంరక్షించుకోవచ్చు. పత్తి పంట వల్ల ఒక హెక్టారుకు సుమారుగా 2 టన్నుల కాండాలను ష్రెడ్డింగ్‌ చేసి భూమిలో కలియ దున్నటం వలన భూమికి 12.4-20.0 కిలోల నత్రజని, 1.6 కిలోల భాస్వరం మరియు 12.2-13.6 కిలోల పొటాష్‌ లభ్యమవుతుంది.

*    అధికవర్షాలప్పుడు భూమి కోతకు గురికాకుండా ఉంచుతూ అలాగే వేసవి కాలంలో భూమి యొక్క ఉష్ణోగ్రతను మితంగా ఉంటుంది.

*    మెరుగైన వేరు వ్యాప్తి, అధిక సూక్ష్మజీవుల కార్యకలాపాలు ఉంటాయి.

3. ఎండిన ప్రత్తి కట్టెను పొడి చేసి వర్మీ కంపోస్ట్‌ తయారీలో వినియోగించవచ్చు.

4. పోడి చేసి చేలో చల్లితే కలుపు మొక్కలు పెరగకుండా కొంత వరకు అరికడుతుంది.

5. ప్రత్తి వ్యవసాయ వ్యర్థాలతో కంపోస్టుని కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా ప్రత్తి కాండాలలో ఎక్కువ ్పు/శ్రీ నిష్పత్తి మరియు అధిక లిగ్నోసెల్యులోజ్‌ శాతం ఉండటం వలన అవి సూక్ష్మజీవుల దాడికి నిరోధకంగా ఉండి కంపోస్ట్‌ తయారీకి 4-6 నెలల సమయం పడుతుంది.

అలా కాకుండా యాక్సిలరేటెడ్‌ కంపోస్టింగ్‌ ప్రక్రియలో డీకంపోజర్‌ను ఉపయోగించి తడి ప్రత్తి కట్టెలని అయితే 45 రోజుల్లో, ఎండిన ప్రత్తి కట్టెలని అయితే 60 రోజుల్లో పూర్తి చేయవచ్చు. ఈ విధంగా తయారైన కంపోస్టులో ఉన్న పోషక విలువలు (1.43:0.78:0.82 శాతం ఎన్‌పికె), పశువుల పేడ యొక్క పోషక విలువలు (0.5:0.2-0.4:3-5 శాతం ఎన్‌పికె) కంటే అధికంగా ఉంటుంది.

6. ప్రత్తి వ్యవసాయ వ్యర్థాలు ఆచ్ఛాదనగా ఉపయోగించుకోవచ్చు.

7. పుట్టగొడుగుల పెంపకంలో మైక్రో క్రిస్టలిన్‌ సెల్యులోజ్‌ కోసం ప్రత్తి కర్రను వినియోగించుకోవచ్చు.

8. ఎండిన ప్రత్తి కట్టెలను ప్యాకింగ్‌ మెటీరియల్‌, పార్టీకల్‌ బోర్డులు, హార్డ్‌ బోర్డులు, కరుగేటెడ్‌ బోర్డులు,  బాక్స్‌లు, పేపర్‌ పల్ప్‌ మరియు ప్లైవుడ్‌ తయారీకి ఉపయోగించుకోవచ్చు. వీటి తయారీ కోసం రైతులు ప్రత్తి కట్టెలను ఫ్యాక్టరీలకు అమ్మటం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో ఫ్యాక్టరీ యజమానులు తొలగించిన ప్రత్తి కట్టెలను టన్నుకు 300-400/- రూపాయల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన మన రైతులు కూడా ప్రత్తి కట్టెలను ఈ విధంగా సద్వినియోగం చేస్తే కేవలం ప్రతి కట్టె అమ్మకం ద్వారా ప్రతి రైతుకు హెక్టారుకు 1200-1600/- రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.

9. ప్రత్తి కట్టెతో పిడకలు తయారుచేసి ఫ్యాక్టరీల్లో, బ్రాయిలర్లలో బొగ్గుకు బదులుగా కూడా వాడవచ్చు.

10. ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థ అయిన కేంద్ర ప్రత్తి సాంకేతిక పరిశోధనా సంస్థ వారి గణాంకాల ప్రకారం ప్రత్తి అవశేషాలలో 58.5 శాతం సెల్లులోజ్‌, 14.4 శాతం హెమి సెల్యులోజ్‌ మరియు 21.4 శాతం లిగ్నిన్‌ ఉంటాయి. వీటి వలన ఈ అవశేషాలను జీవ శక్తిగా మార్చి బయోచార్‌, బయోగ్యాస్‌, ఇతనాల్‌  లాంటి జీవ ఇంధన తయారీకి ఉపయోగించడానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుతం రైతులు దూది సేకరణ తర్వాత మొక్కలను తొలగించడానికి ఎకరానికి 600/- దాకా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు కారణంగా ప్రత్తి సాగు రైతులకు భారంగా మారుతోంది. సాగుదారులు పెట్టుబడి ఖర్చు పెరిగి అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకతను తొలగించడం రైతుకు అదనపు భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యేకతలను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల ఏర్పాటుకు యువతకు చేయూతనిస్తూ గులాబిరంగు పురుగు నివారణకు తోడ్పాటు అందించాలి.      

ఎన్‌. చాముండేశ్వరి (ఎస్‌.ఆర్‌.ఎఫ్‌.),

 డా|| జె. మంజునాథ్‌ (కీటక శాస్త్రవేత్త), 

ఎమ్‌. శివ రామకృష్ణ (కీటక శాస్త్రవేత్త), 

డా|| డి. లక్ష్మి కళ్యాణి (సస్య విజ్ఞానము)

ఇ-మెయిల్‌: d.lakshmikalyani@angrau.ac.in

డా|| కె. మోహన్‌ విష్ణువర్ధన్‌ (సస్య ప్రజననము) 

డా|| బి. వెంకట రవి ప్రకాశ్‌ రెడ్డి (సస్య ప్రజననము)

డా|| కె. వెంకట రమణమ్మ (తెగుళ్ల విభాగము) 

డా|| ఎన్‌. సి. వెంకటేశ్వర్లు (ఏ.డి.ఆర్‌.),

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము, నంద్యాల.

Read More

వ్యవసాయరంగంలో సహకార వ్యవస్థల ప్రాముఖ్యత

మనుషులందరూ ఎవరికి వారుగా ఉంటే వ్యక్తులౌతారు, సంఘటితమైతే శక్తి అవుతారుఅందుకే పెద్దలు సంఘటన్‌ మే శక్తి హై” అని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరికి వారుగా ఉన్న రైతు సోదరులు అందరిని ఒక తాటిపైకి తీసుకువచ్చి సహకార రైతు సంఘాలు, ఖజ్పుఐ, రైతు సేవ సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పిఓ) ఏర్పాటు చేయడం ద్వారా అసంఘటిత రంగంలో ఉన్న రైతులు అందరినీ సంఘటిత రంగంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వము దేశ వ్యాప్తంగా 2023-24 నాటికి సుమారు 10,000 ఎఫ్‌పిఓల ఏర్పాటు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది. ఈ రైతు సంఘలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా వాటికి నాబార్డు, యన్‌.సి.డి.సి., నాబ్‌ కిసాన్‌ వంటి సంస్థల తరఫున ఆర్థిక సహాయ సహకారాలను అందజేస్తున్నారు.

రైతు సంఘాల ఏర్పాటుతో ప్రయోజనాలు:

1. రైతు ఉత్పత్తిదారుల సంస్థ: రైతులు ఎఫ్‌పిఓలుగా సంఘటితం అవ్వడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సంవత్సరానికి సుమారు 18 లక్షల రూపాయలు చొప్పున మూడు సంవత్సరాల వరకు ఆర్థిక సహకారాన్ని పొందే అవకాశం ఉంది. ఇట్టి డబ్బును సంఘాలు తమ సంఘంలో వ్యాపారానికి పెట్టుబడిగా వినియోగించుకోవచ్చు మరియు ఈ ఆర్థిక సహకారాన్ని సంఘాలు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉండదు.

2. ఈ సంఘాలకు వ్యాపారాభివృద్ధికి కావలసిన నైపుణ్యం పెంపుదల శిక్షణలను మరియు అవగాహన కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చేపడతాయి.

3. రైతులు సంఘాలుగా ఏర్పడడం వల్ల తమకు కావల్సిన ఎరువులు పురుగు మందులు, విత్తనాలు వంటి వ్యవసాయ ఇన్‌పుట్‌లను టోకుగా అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది.

4. కస్టం హైరింగ్‌ సెంటర్‌: వ్యవసాయ అవసరాలకు కావలసిన పనిముట్లను ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండేవిధంగా ఈ సంఘాలు కస్టం హైరింగ్‌ సెంటర్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ యంత్రాల ద్వారా సంఘంలోని సభ్యులు అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను అనుకున్న సమయానికి, అతి తక్కువ ధరలో వినియోగించుకునే అవకాశం ఉంది. అలాగే సంఘానికి కూడా ఆదాయం సమకూరుతుంది.

5. NABARD : నాబార్డ్‌ వంటి జాతీయ వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు ప్రత్యేకంగా ఈ రైతు సంఘాల నిర్వహణ కొరకు ”నాబ్‌ కిసాన్‌” అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసి అతి తక్కువ వడ్డీ రేటుతో అత్యధిక రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. అలాగే ‘గ్రామీణ బండారన్‌ యోజన’లో భాగంగా ఈ సంఘాలు కమ్యూనిటీ గోదాములు నిర్మించుకోవడానికి 25 శాతం సబ్సిడీ లేదా గరిష్ఠంగా రూ. 2.25 కోట్లు సబ్సిడీ మంజూరు చేస్తుంది. అంతేకాకుండా ‘క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌’లో భాగంగా ఈ సంఘాలు బయటి బ్యాంకులలో తీసుకునే రుణాలకు నాబార్డ్‌ పూచీకత్తు అందిస్తుంది.

6. NCDEX: నేషనల్‌ కమోడిటీ డెరివేటివ్‌ ఎక్స్ఛేంజ్‌ అనే జాతీయ సంస్థ ఈ రైతు సంఘాలకు ఆన్‌-లైన్‌ వేదికగా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో తమ పంట ఉత్పత్తులను అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా పంట కోత, పంట శుద్ధి మరియు రవాణా కొరకు అయ్యే ఖర్చులో 50-75 శాతం ఖర్చును ఈ సంస్థ రైతుకు అదనంగా చెల్లిస్తుంది.

7. Spice Board : జాతీయ సుగంధద్రవ్యాల బోర్డు వారు పసుపు ఉత్పత్తిదారుల సంస్థలకు బాయిలర్లు, పాలిష్‌ మిషిన్‌, పసుపు తీసే యంత్రాలు, టార్పాలిన్లు మొదలగు పరికరాలను 50 శాతం సబ్సిడీతో అందించడమే కాకుండా నాణ్యమైన పసుపు ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నేరుగా అమ్ముకునే అవకాశాలను రైతులకు కల్పిస్తున్నాయి.

8. e-NAM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ”ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌)” అనే జాతీయ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వ్యవస్థలో రిజిస్టర్‌ అయిన సంఘాలకు తమ పంట ఉత్పత్తులను జాతీయ మార్కెట్‌లో అనుకున్న రేటుకి అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.9. ఈ రైతు సంఘాలకు సుమారు 100 కోట్ల టర్నోవర్‌ వరకు కూడా ఆదాయపు న్ను నుండి మినహాయింపు ఇవ్వడం జరిగినది.10. పంటల ఉత్పత్తి, కోతలు, సేకరణ, గ్రేడింగ్‌, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలలో ఈ రైతు సంఘాలకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. రైతు సోదరులందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఈ చేయూతను వినియోగించుకొని రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మరియు సహకార సంఘాలుగా ఏర్పడి సమిష్టి కృషితో ఉమ్మడి విజయం సాధించి సహకార వ్యవస్థ యొక్క సత్ఫలితాలను ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.

బి. రాజ్‌కుమార్‌, వ్యవసాయ విస్తరణ అధికారి, నిర్మల్‌ జిల్లా. ఫోన్‌: 9014205493

Read More

రైతన్నా… వేసవి దుక్కులు చేసుకో… పంట దిగుబడి పెంచుకో

రాష్ట్రంలో ప్రతి రైతు తొలకరి వర్షాలు పండటంతోటే వ్యవసాయం సాగు పనులు ప్రారంభిస్తారు. ఇలా ఖరీఫ్‌, రబీ (యాసంగి) మరియు నీటి వసతి కల్గిన చోట వేసవి పంటలను కూడా వేస్తారు. ఇలా పండించినటువంటి పంటల కోతల అనంతరం మళ్ళీ ఖరీఫ్‌ పంటలు వేసుకోవడం ప్రారంభమై వర్షాలు మొదలయ్యే నాటికి భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. దీని ద్వారా కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు భూమిలో పెరిగి పురుగు మందుల అవశేషాలు కూడా భూమి లోపల ఉండిపోతాయి. ఈ కారణాల ద్వారా మనం (రైతన్న) వేసుకొనే వివిధ పంటలకు కావల్సిన లోతైన బీజపీఠం ఏర్పడదు, తద్వారా దిగుబడి తగ్గుతుంది.

వేసవి దుక్కుల ప్రాముఖ్యత: 

యాసంగి, వేసవి పంటలకు చేసేటటువంటి లోతు దుక్కులను వేసవి దుక్కులు అంటారు. ఎంత లోతుగా దుక్కి దున్నుకోవాలనేది మనం వేయబోయే పంటనుబట్టి కూడా ఉంటుంది. లోతు వేర్లు పంటలకైతే (కంది, ఆముదం, పత్తి మొ||) లోతుగా దున్నుకోవాలి. మొక్కజొన్న, జొన్న, వేరుశనగ మొదలగు పంటల వేర్లు మధ్యరకంగా లోతు ఉంటే 15-20 సెం.మీ. లోతు సరిపోతుంది. ముఖ్యంగా దున్నే విధానాన్ని, నేల స్వభావాన్ని బట్టి ఎంచుకోవాలి. లోతుగా నేలను తిరగబడేటట్టుగా దున్నాలనుకుంటే మోల్డుబోర్డు నాగలితో దున్నుకోవాలి. దుక్కిలో పశువుల ఎరువును భూమిలో కలిసేటట్లుగా మోల్డ్‌బోర్డ్‌ నాగలి ద్వారా చేసుకోవచ్చు. అలాగే డిస్క్‌లను వాడి కూడా గడ్డి, గరికను భూమిలో కలియదున్నవచ్చును. నేల లోపలి పొరలు గట్టిపడి మురుగు నీటి సౌకర్యం లేనపుడు, గాలి, నీటి శాతం తగ్గుతుంది. దీని ద్వారా మొక్కల వేర్లు పెరుగుదల పోషకాల లభ్యత, శ్వాసక్రియ (మొక్కలకు) లాంటి చర్యలు తగ్గి మొక్క చనిపోతుంది. లోతుగా దున్నినప్పుడు గట్టిపొర విచ్ఛిన్నమై నేల గుల్లగా తయారవడమే కాకుండా నేలలో గాలి శాతం మరియు నీటిని పీల్చుకునే లక్షణాలు పెరుగుతాయి. తద్వారా సూక్ష్మజీవుల సంతతి, చర్యలు పెరుగుతాయి. దీని వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు త్వరగా విచ్ఛిన్నమై పోషకాలుగా విడుదల అవుతాయి. మరియు కలుపు మొక్కల వేర్లు, పురుగు మందుల అవశేషాలు నేలలో ఉంటాయి. వీటిని లోతు దుక్కుల ద్వారా విష పదార్థాలు విచ్ఛిన్నమై పంటల దిగుబడి పెరుగుతుంది. మరియు వర్షపు నీరు లోపలి పొరలలోకి ఇంకి భూమి సారాన్ని పెంచుతుంది. వేసవి దుక్కి దున్నటం ద్వారా కలుపు మొక్కలన్నీ వేర్లతో పెకిలించి నేల లోపలి పొరల్లోకి చేరతాయి. దీని వలన సూర్యరశ్మి సోకి కలుపు మొక్కల విత్తనములు నిర్వీర్యం అవుతాయి. వేసవి దుక్కి దున్ని నేలను తిరగవేయడం వలన నేలలోని చీడపురుగు థలన్ని నేలపైకి రావడం వలన పకక్షులు వాటిని తిని చంపి వేస్తాయి. మరియు వేసవిలోని అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక చనిపోతాయి.


వేసవి దుక్కుల ద్వారా లాభాలు:

 నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. తద్వారా వివిధ పంటలకు కావలసిన లోతైన బీజ పీఠం ఏర్పడుతుంది. వేసవిలో దున్నే ముందు నేలలో పశువుల ఎరువుగాని, కంపోస్టుగాని మరియు చెరువులోని నల్లమట్టిని గాని వెదజల్లడం వలన నేల సారవంతమౌతుంది. దుక్కి (ఒండ్రుమట్టి) చేయడం కంటే ముందు పశువుల మందను గాని, గొఱ్ఱెలు లేదా మేకల మందను గాని ఉంచడం వల్ల వాటి ఎరువు నేలకు చేరి సేంద్రియ పదార్థం పెరిగి భూసారం పెరుగుతుంది. చెరువు మట్టిలో మనకు నత్రజని-0.3 శాతం, భాస్వరం – 0.2 శాతం మరియు పొటాష్‌-0.4 శాతం లభిస్తాయి. ఈ సారవంతమైన చెరువులోని ఒండ్రుమట్టిని పొలంలో వేసుకొని భూసారం పెంచుకోవచ్చు. వేసవిలో లోతు దుక్కులు చేయడం ద్వారా కలుపు మొక్కలు వాటి విత్తనాలు నశింపబడతాయి. మొండి జాతికి చెందిన తుంగ వంటి కలుపు మొక్కలు అన్ని రకాల నేలల్లో సమస్యాత్మకంగా మారుతున్నవి. ఇలాంటి కలుపు మొక్కల దుంపలు లోతు దుక్కులు చేయడం వలన సూర్యరశ్మికి బహిర్గతమై చనిపోతాయి.  మంచి నేలల్లో మట్టి రేణువులు 50 శాతం, నీరు 25 శాతం, గాలి 25 శాతం ఉంటుంది. ఇవి ఏ కారణం చేతనైనా నేల లోపలి పొరలు గట్టిపడి, మురుగునీరు పోవు మార్గం లేనపుడు గాలి మరియు నీటి శాతం మొక్కకు తగు మోతాదులో తగ్గుతుంది. దీని ద్వారా పంటల మొక్కల వేర్లు పెరుగుదల, పోషకాల లభ్యత తగ్గి, శ్వాసక్రియ లాంటి చర్యలు తగ్గుతాయి. వీటి ద్వారా పంట మొక్కలు చనిపోవడం జరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి వేసవి దుక్కులు చేయడం ద్వారా భూమిలోని గట్టి పొరలు విచ్ఛిన్నమై నేల గుల్లబారుతుంది. మరియు నేలలో గాలి శాతం, నీటిని పీల్చుకొనే లక్షణాలు పెరుగుతాయి. వీటి ద్వారా సూక్ష్మజీవుల సంతతి చర్యలు పెరుగుతాయి. కావున వేసవి దుక్కులు దున్నుకొని, నేల సారవంతత కాపాడుతూ అధిక దిగుబడులు పొందవచ్చు.        

ఎల్‌. శకుంతల, అగ్రానమి, ఎం.ఎస్సీ., 

ఈ. అజయ్‌ కుమార్‌, పి.హెచ్‌డి. స్కాలర్‌ (సాయిల్‌ సైన్స్‌), 

జె. కరుణాకర్‌ (ఎం.ఎస్సీ.) వెజిటబుల్‌ సైన్స్‌, 

కె. నవ్య, ఎం.ఎస్సీ (సాయిల్‌ సైన్స్‌), 

జె. కమలాకర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (సాయిల్‌ సైన్స్‌),

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఫోన్‌: 9490998056

Read More

వివిధ పంటల అవశేషాలు సద్వినియోగంలో మెలకువలు

తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, సోయాచిక్కుడు మరియు వేరుశనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న పెనుమార్పులను గమనించి రైతాంగం వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి. సహజ వనరులైన నేల, నీరు, గాలిని సంరక్షించుకుంటూ, ఉత్పాదకతను, లాభాలను పెంచుకోవాలి. పంటలలో గింజలు, అవశేషాలు ఉత్పత్తవుతున్నాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉపఉత్పత్తులను, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా అధిక నికర లాభం పొందవచ్చు. వ్యవసాయానికి పాడి, కోళ్ళు, గొర్రెల పెంపకం మంచి అనుబంధ వ్యాపకాలు, సమగ్ర వ్యవసాయం చేపట్టి, పంటల అవశేషాలను ఆధునిక పద్ధతులతో విలువలు జోడించిన మేతగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏదీ వృథా కాదు. మన ప్రధాన పంటల అవశేషాలను క్రింది విధంగా సద్వినియోగ పరచుకోవాలి.

వరి :  ఊక బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి సిమెంట్‌ మరియు ఉక్కు తయారీలో సంకలిత పదార్థంగా వాడతారు. నూకలను పులియబెట్టి బీరు, పిండితో ఇడ్లీ, దోశ, నూడుల్స్‌ తయారు చేస్తారు.

వరిగడ్డి: హెక్టారుకు 6-7.5 టన్నుల గడ్డి వస్తుంది. పంజాబ్‌, హర్యానా రాష్ట్రంలో వరిగడ్డిని తగులబెట్టడం ద్వారా కాలుష్యం పెరిగిపోతుంది. తగులబెట్టకుండా యూరియాతో మాగబెట్టి, పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోవాలి. పొలంలో కలియదున్నినప్పుడు కర్బన/నత్రజని నిష్పత్తి ఎక్కువవడం వల్ల పంటకు నత్రజని లభ్యత తగ్గుతుంది. కావున సిఫారసు చేసిన నత్రజనికి 25% అధిక నత్రజని వాడవలెను. ఈ క్రియవల్ల దీర్ఘకాలంలో నేల సేంద్రియ కర్బనం పెరుగుతుంది. జింక్‌, కాపర్‌, ఇనుము మరియు మాంగనీస్‌ సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది. పొలంలో గడ్డి తొలగించకుండానే ”హ్యాపీసీడ్‌ డ్రిల్లర్‌” యంత్రంతో మొక్కజొన్న, జొన్న మరియు ఇతర పంటలను విత్తుకోవచ్చు. యంత్రాలతో కట్టలు కట్టి విద్యుదుత్పత్తి చేయవచ్చు. పుట్టగొడుగుల పెంపకం మరియు పశువుల పాకలలో పాన్పుగా వాడటం ద్వారా పశువు ఆరోగ్యం, పాల ఉత్పత్తి పెంచడానికి వాడతారు. పనికిరాని గడ్డిని వానపాముల ఎరువుగా తయారు చేసుకోవచ్చు.

మొక్కజొన్న: మొక్కజొన్న కోత తర్వాత కాండం, ఆకులు, గింజలు ఒలిచిన కంకి మిగులుతాయి. పిండిపదార్థాలు కలిగిన ఈ చక్కెరలను పులియబెట్టి పెట్రోల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్‌ను తయారు చేస్తారు. గుజ్జు చేసి కాగితం తయారు చేయవచ్చు. మండించి విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. అవశేషాలను పిండి చేసి, సాంద్రీకృత దాణాతో 75:25 నిష్పత్తిలో కలిపి ఎండు టి.యం.ఆర్‌. (టోటల్‌ మినరల్‌ రేషన్‌) దాణాను తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా చూర్ణాన్ని ప్లాస్టిక్‌, జిగురు, వెనిగర్‌ మరియు కృత్రిమ తోళ్ళ తయారీలో పూరకంగా వాడుతారు. పనికి రాని చొప్పను మల్చింగ్‌గా, దొడ్డిలో పాన్పుగా లేదా వానపాముల ఎరువుగా వాడుకోవచ్చు. పంట పూతథలో బెట్టకొచ్చి లేదా ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే, అటువంటి చొప్పను ”సైలేజ్‌”గా మార్చుకొని వాడుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, రాగి వంటి చిరుధాన్యాల పంటల కంకులు కోసిన వెంటనే మిగతా మొక్కను సన్నగా కత్తిరించి డ్రమ్ములల్లో సైలేజ్‌ చేసుకోవడం ద్వారా నాణ్యమైన పశుగ్రాసాలు వృథా కాకుండా సమర్ధవంతంగా పశువులకు మేపుకోవచ్చును. 

ప్రత్తి: దూదిపోగా మిగిలిన కట్టె, ఆకులు, బెరడు కలిపి హెక్టారుకు 3 టన్నులు వస్తుంది. దూది తీసి వెంటనే నవంబరు నెలలో ఆకులను, మొగ్గలను మేకలకు, గొర్రెలకు మేపుకోవాలి. తర్వాత మొదళ్ళను తొలగించి ”గులాబి రంగు” పురుగు ఉత్పత్తిని తగ్గించాలి. కట్టెలను కొద్ది మొత్తంలో పంట చెరకుగా వాడి, పెద్ద మొత్తంగా చెక్క పరిశ్రమకు, కార్డ్‌బోర్డ్‌ పరిశ్రమకు, కాగితం, పరిశ్రమకు వాడవచ్చును. ప్రత్తి కట్టెలో 68% సెల్యులోస్‌, 26% లిగ్నిన్‌ మరియు 7% బూడిద ఉంటుంది. 1000 టన్నుల ప్రత్తి కట్టెతో 100 కె.వి. సామర్థ్యపు 5 విద్యుత్తు కేంద్రాలను ఒక సంవత్సరం నిర్వహించుటకు సరిపోతుంది. పత్తి కట్టెను ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ట్రాక్టరుతో నడిచే మల్టీక్రాప్‌ బయోష్రడ్డర్‌ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుళ్ళిపోతాయి. ఒక ఎకరం పత్తి కెట్టె నుంచి 10 కిలోల నత్రజని, 27 కిలోల పొటాష్‌ నేలకు అందించబడుతుంది. ప్రత్తి పంటను నేలలో కలియదున్నటం వల్ల సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. భూభౌతిక స్థితులు మెరుగుపడతాయి. మేలు చేసే సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి.

పంటల అవశేషాల వినియోగ లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు, రైతులతో అనుసంధానమై ప్రాంతీయ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రైతు సోదరులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆచరించి పశువులను, కోళ్ళను పెంచి పంటల అవశేషాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలి. వాతావరణ కాలుష్య నివారణ అందరి బాధ్యత. రైతుసోదరులు అధిక లాభాలను పొందుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.     

ఆర్‌. కార్తిక్‌, పిహెచ్‌.డి., జి. రజిత, పి.హెచ్‌.డి.,

అగ్రానమీ విభాగం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ,

రాజేంద్రనగర్‌, ఫోన్‌: 8179482273

Read More

రాయలసీమలో కొబ్బరి సాగు

సాధారణంగా కొబ్బరి అనగానే గోదావరి జిల్లాలు, సముద్రతీర ప్రాంతాలు, కేరళ లాంటి ప్రాంతాలలోనే పండుతుందంటుంటారు. కానీ ఇది సరైన అభిప్రాయం కాదు. కొబ్బరిని రాయలసీమలో కూడా పండించి విజయం సాధించి కొబ్బరి నుంచి ఆదాయం పొందవచ్చు అని నిరూపిస్తున్నారు కడప జిల్లా రాజంపేటకు చెందిన వెంకట నరసారెడ్డి.

వెంకట నరసారెడ్డిది వ్యవసాయ కుటుంబం. వీరి పూర్వీకుల నుంచి వ్యవసాయమే వీరి ప్రధాన వృత్తి. డిగ్రీ వరకు చదివిన నరసారెడ్డి ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా కుటుంబ వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అందరిలాగానే వ్యవసాయంలో వస్తున్న మార్పులను తన సాగులో కూడా అమలు పరుస్తూ అన్నిరకాల పద్ధతులు పాటిస్తూ వస్తున్న నరసారెడ్డి ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని తన పంటల సాగుని ప్రకృతి వ్యవసాయ విధానంలోకి 2011వ సంవత్సరంలో మార్చి అప్పటినుండి ఎలాంటి రసాయానాలు అందించకుండా కేవలం ప్రకృతి సేద్య విధానాలను అవలంభిస్తూ తన సాగును కొనసాగిస్తున్నారు. ఇందుకుగాను మన దేశీయ జాతి గోవులను పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటలసాగుకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఆవులు, ఎద్దులు కలిపి మొత్తం 14 పశువులను పోషిస్తున్నారు. ఇందులో ఒంగోలు, సాహివాల్‌, కాంగ్రెజ్‌, గిర్‌ రకాలైన మన దేశీయ జాతులు ఉన్నాయి. వీటికి అవసరమైన పశుగ్రాసాలను పూర్తి ప్రకృతి సేద్య విధానాలను సాగు చేస్తూ పశువులకు అందిస్తూ వస్తున్నారు.

మొత్తం వీరు 15 ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు. అందులో కొబ్బరి 31/2 ఎకరాలలో, 13/4  ఎకరాలలో మామిడి, 33/4  ఎకరాలలో నిమ్మ, 2 ఎకరాలలో అరటి, 11/2  ఎకరాలలో ఆముదం, మునగ పంటలు సాగు చేస్తూ మిగతా పొలంలో పశువులకుగాకు కో-4, సూపర్‌ నేపియర్‌, థరథ గడ్డి లాంటి పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. ఈ 15 ఎకరాలలో 2011వ సంవత్సరంనుండి ఎలాంటి రసాయానాలు ఉపయోగించకుండా కేవలం ప్రకృతి సేద్య పద్ధతులనే పాటిస్తు న్నారు. ప్రతి పంటకు క్రమం తప్ప కుండా పశువుల ఎరువు అందించడంతోపాటు జీవామృతం, వానాపాముల ఎరువులను అందిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో బెల్లం ధర పెరగటం మరియు బెల్లం సక్రమంగా అందుబాటులో ఉండకపోవడంతో జీవామృతాన్ని ఉపయోగించడం ఆపి వేసి ఆవు మూత్రాన్ని భూమికి అందిస్తున్నారు. వీరు సాగు చేసే పంటలకు చీడపీడల ప్రభావంగా తక్కువగా ఉంటుంది కాబట్టి కషాయాలు  మరియు ద్రావాణాల అవసరం పెద్దగా ఉండటం లేదు. తప్పనిసరి పరిస్థితులలో అవసరమైతే చీడపీడల నివారణకు వివిధ రకాలు ఆకులు, ఆవుమూత్రం, పేడల లాంటి వాటితో కషాయాలు తయారు చేయించి పంటలకు ఉపయోగించి చీడపీడలను నివారిస్తున్నారు.

కొబ్బరి:1985వ సంవత్సరంలో 31/2 ఎకరాలలో కొబ్బరి మొక్కలు నాటించారు. ఇందుకుగాను రాజంపేట నర్సరీ నుంచి ఈస్ట్‌కోస్టు రకం కొబ్బరి మొక్కలు తెప్పించి లైనుకి లైనుకి మరియు మొక్కకు మొక్కకు 18 అడుగుల దూరం పాటించి నాటించారు. ప్రస్తుతం 31/2 ఎకరాలకుగాను 375 కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరిలో అంతరపంటగా అవకాశాన్నిబట్టి అరటి సాగు చేస్తుంటారు. కొబ్బరి లైన్ల మధ్యలో ట్రెంచ్‌ తీసి ఆ ట్రెంచ్‌లోనే కొబ్బరి మొక్కల వ్యర్థాలను వేసి అక్కడే వీటిని అందింస్తుంటారు. కొబ్బరి మొక్కల పాదుల దగ్గర నీటిని అందించరు. ఈ పద్ధతిని గుజరాత్‌కి చెందిన ప్రముఖ ప్రాకృతిక రైతు కీ||శే|| భాస్కర్‌ సావే గారు పాటించారు. అదే పద్ధతిని నరసారెడ్డి గారు తెలుసుకుని తమ పొలంలో అమలు చేస్తూ తక్కువ శ్రమతో మంచి దిగుబడిని తీస్తున్నారు. ప్రస్తుతానికి సగటున ఒక్కొక్క చెట్టునుంచి సంవత్సరానికి సుమారు 200 కాయలవరకు పొందుతూ ఒక్కొక్క కొబ్బరి కాయను రూ. 15/- నుంచి 20/- ల వరకు అమ్మకం చేస్తూ వస్తున్నారు. దిగుబడిని కొయ్యకుండా ఎండి రాలి పడిపోయిన కొబ్బరికాయలను టెంకాయలుగా అమ్ముతున్నారు.

మామిడి: 1990వ సంవత్సరంలో మామిడి మొక్కలు నాటించారు. ప్రస్తుతం 90 చెట్లు ఉన్నాయి. వీటిలో తోతాపూరి, నీలం, బంగినపల్లి మొ||లగు రకాలు ఉన్నాయి. అన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడిని పొందుతున్నారు. 

నిమ్మ: మొత్తం 33/4 ఎకరాలలో నిమ్మసాగులో ఉంది. ఇందులో 13/4 ఎకరాలలో హైడెన్సిటీలో 650 నిమ్మ మొలకలు 2015లో నాటించారు. నిమ్మలో అంతరపంటగా 100 అరటి మొక్కలు సాగు చేస్తున్నారు. 2 ఎకరాలలో మామూలు పద్ధతిలో నిమ్మ మరియు అంతరపంటగా అరటి సాగుచేస్తున్నారు. 2021లో కురిసిన అధిక వర్షాలకు నిమ్మపంట దెబ్బతింది. పూత సక్రమంగా రాలేదు. కాబట్టి 2022 ఏప్రిల్‌ నేలలో నిమ్మకు గిరాయికి బాగా పెరిగింది. ఎపుడు లేనంత రేటు నిమ్మ రైతులకు దక్కుతుంది. 50 కిలోల బస్తా రూ. 3,500/- నుంచి 4,000/- వరకు నడుస్తుంది. కర్నూల్‌ ప్రాంతంలో వ్యాపారస్తులు రైతుల దగ్గరనుంచి ఒక్కొక్క నిమ్మకాయ రూ. 6/-ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నిమ్మ పంట రైతులకు మంచి ఆదాయం వస్తుంది. కానీ వీరివద్ద ప్రసుత్తం పంట లేదు. పంట రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని నరసారెడ్డి అన్నారు. 

అరటి: 2 ఎకరాలలో ఎలకి, అమృతపాణి రకాల అరటిని సాగుచేస్తున్నారు. అన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ ఆరోగ్యకరమైన అరటి పంటను పండించి మంచి ధరకు అమ్ముతూ వస్తున్నారు. 

ఆముదం, మునగ, పశుగ్రాసాలు: 11/2 ఎకరాలలో ఆముదం మరియు మునగ, మిగతా పొలంలో పశువులకు గాను పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. 2021 సం||లో కురిసిన అధిక వర్షాలకు ఆముదం, మునగ పంటలు దెబ్బతిన్నాయి. పశుగ్రాసాల విషయానికి వస్తే పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి ధాన్యపు జాతి, పప్పుజాతి పశుగ్రాసాలను తప్పనిసరిగా అందించాలి. కాబట్టి ఈ రెండు రకాలలో బహువార్షిక పంటలు ఎన్నుకున్నారు. ధాన్యాపు జాతి బహువార్షిక పశుగ్రాసం కో.4, సూపర్‌నేపియర్‌, పంటలు మరియు పప్పుజాతి బహువార్షిక పశుగ్రాస పంట అయిన థశరథగడ్డి (హెడ్జ్‌ లూసర్న్‌)లను పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆవులకు మరియు ఎద్దులకు అందిస్తూ వస్తున్నారు.

ఉన్నత చదువులు చదివిన నరసారెడ్డి వారి ప్రధాన వృత్తి అయిన వ్యవసాయంలో స్థిరపడి 15 ఎకరాల వ్యవసాయ భూమిలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ తన భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన భూమిని మరియు కలుషితంకాని గాలిని అందించడంతోపాటు ప్రస్తుత సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారానికి సేంద్రీయ సాగే శరణ్యం అని ఆ దారిలో నడుస్తూ అందుకు అవసరమైన పశువులను పోషిస్తూ వీటన్నింటి ద్వారా సంవత్సరానికి 8 లక్షలకు తగ్గకుండా ఆదాయం పొందుతూ కుటుంబ సభ్యుల సహకారాంతో పంటల సాగు చేస్తూ ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.

మరిన్ని వివరాలకు వెంకట నరసారెడ్డిని

ఫోన్‌: 81868 81889లో సంప్రదించండి.   

Read More

వ్యవసాయాధారిత పర్యాటకం

వ్యవసాయాధారిత పర్యాటకం పర్యాటక రంగంలో ఒక నూతన ఒరవడిగా చెప్పుకోవచ్చు. రోజువారి యాంత్రిక జీవనంతో విసిగి వేసారిపోయి ప్రకృతి ఒడిలో మట్టి వాసనకు దగ్గరగా సేద తీరాలనుకునే నగరజీవులు ఎంతోమంది. తాము తినే అన్నం ఎలా పండిస్తారో, తాగే పాలు ఎలా పితుకుతారో, టమాటో మరియు వంకాయ మొక్కలకి తేడా తెలియని కార్పొరేటు స్కూలు విద్యార్థులు చాలామందే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో రైతుల పొలాల్లో ఒక మోస్తరు మౌళిక సదుపాయాలు కల్పించటం ద్వారా వారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు సృష్టించుకోవచ్చు.

పొలాల్లో విడిది చేస్తూ, వ్యవసాయంలోని రోజువారి కార్యక్రమాలను తెలుసుకుంటూ రైతుల యొక్క సాధక బాధల్ని అర్థం చేసుకోవడానికి, మరుగున పడిపోయిన తమ మూలాలను గుర్తు చేసుకునేందుకు, పిల్లలకు వ్యవసాయం గురించి అవగాహన కల్పించేందుకు, యాంత్రిక జీవనానికి అలవాటు పడిన సగటు నగరజీవికి ఈ తరహా పర్యాటకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి పర్యాటకాన్ని ప్రోత్సహించడం వలన రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు సృష్టించినట్లే అవుతుంది.

ఈ తరహా పర్యాటకాన్ని ప్రోత్సహించడం వలన లాభాలు

* విడిది చేయడానికి, సందర్శించడానికి రుసుము వసూలు చేయడం ద్వారా, పండిన వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడం ద్వారా రైతులకు ఆదాయాన్ని కల్పించవచ్చు.*    గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువత మరియు మహిళలకు ఉపాధి దొరుకుతుంది. 

* ఆయా ప్రాంతాల్లో ఉండే కుటీర పరిశ్రమలకు (బొమ్మలు, చేనేత వస్త్రాలు, ప్రత్యేక తినుబండారాలు) ఊతం కల్పించినట్లు అవుతుంది. 

ప్రభుత్వ చొరవ అవసరం:

రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, గోదావరి, కృష్ణా జిల్లాలు ఈ తరహా పర్యాటకానికి చాలా అనువైనవిగా భావించవచ్చు. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో పాటు, వ్యవసాయ ఉద్యాన పంటల సాగు, డెయిరీ మరియు చేపల పెంపకం విరివిగా ఉండటం ఆ ప్రదేశాలకు కలిసివచ్చే అంశం. గత ప్రభుత్వం 2016-17లో ఈ తరహా పర్యాటకానికి ప్రోత్సాహం అందించే దిశగా ఆలోచనలు చేసినా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మరియు వ్యవసాయశాఖలు ఈ విషయమై దృష్టిసారిస్తే రైతులకు ఎంతో ప్రయోజనకరం.

మహారాష్ట్ర ఆదర్శం:

వ్యవసాయాధారిత పర్యాటకంలో మహారాష్ట్ర రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అగ్రిటూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను 2005లో ఏర్పరచి, రైతులకు శిక్షణ మరియు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 30 జిల్లాల్లో 320కి పైగా అగ్రిటూరిజం సెంటర్లు ఉన్నాయి. 2014వ సంవత్సరంలో 0.40 మిలియన్లు, 2015లో 0.53 మిలియన్లు, 2016లో 0.70 మిలియన్ల పర్యాటకులు ఈ కేంద్రాలను సందర్శించినట్లు ఏ.టి.డి.సి. సర్వే లెక్కలు చెబుతున్నాయి. గ్రామీణ మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగైనట్లు తెలిపింది. 2016వ సంవత్సరంలో ప్రత్యేక టూరిజం పాలసీని కూడా తీసుకువచ్చి, వ్యవసాయాధారిత పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా అడుగులు వేస్తోంది.             

దాదిమి అనిల్‌కుమార్‌ రెడ్డి, 

వ్యవసాయ విస్తరణ విభాగం పరిశోధక విద్యార్థి,

ICAR – NDRI, Ph: 8106490810, 8639689900

Read More

పాలేకర్‌ బాటలో విజయరామ్‌

రసాయనిక వ్యవసాయం వలన సంభవించిన, సంభవిస్తున్న అనర్ధాల నుండి బయటపడడానికి అనేకమంది నిపుణులు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, కొన్ని సంస్థలు రసాయనాలు అవసరం లేని వివిధ రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేస్తున్నారు. వీటిలో ఫుకుఓక ప్రకృతి వ్యవసాయ పద్ధతి, భాస్కరసావే పద్ధతి, చౌహాన్‌క్యూ పద్ధతి, నమ్మళ్వార్‌ పద్ధతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతి, సుభాష్‌పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి లాంటి వాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటిలో సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి చాలా వేగంగా రైతులోగిళ్ళకు చేరింది. ఇంకా చేరేతూనే ఉంది అని చెప్పవచ్చు. సుభాష్‌ పాలేకర్‌ వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఈ పద్ధతి గురించి ప్రచారం చేయడంతోపాటు, కొన్ని ప్రభుత్వాలు ఈ పద్ధతిని ప్రోత్సహించడం మరియు రైతులు అమలుపరచటానికి అనుకూలంగా ఉండడం, ఈ పద్ధతిలో మన దేశీయ జాతి గోవు ప్రముఖ పాత్రను పోషించటం లాంటి వివిధ రకాల కారణాల వలన మిగతా పద్ధతులతో పోల్చుకుంటూ సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి చాలా వేగంగా రైతు లోగిళ్ళకి చేరిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే సుభాష్‌పాలేకర్‌ వలననే రసాయన వ్యవసాయం వలన జరిగిన, జరిగే నష్టాలు రైతులు తెలుసుకుంటున్నారు. రసాయన రహిత వ్యవసాయం ఇంత వేగంగా రైతులకు తెలియడంలో సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి ప్రధాన పాత్ర పోషించింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ పద్ధతిని సుభాష్‌ పాలేకర్‌ ప్రచారం చేయకుండా ఉండి ఉంటే రసాయన రహిత వ్యవసాయం రైతులోగిళ్ళకు చేరటానికి చాలా సమయం పట్టేది కావచ్చు. పాలేకర్‌ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడం, వారి పుస్తకాలు చదివిన వారు, వారి సభలకు హాజరయ్యి ఈ పద్ధతుల గురించి తెలుసుకున్న చాలామంది రైతులు తమ రసాయనిక సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ బాట పట్టించారు. పట్టిస్తున్నారు. వ్యవసాయేతర ఉద్యోగ, వ్యాపారం లాంటి వేరే రంగాలలో ఉన్న వారు కూడా సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతుల గురించి తెలుసుకుని ఈ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతారు కృష్ణాజిల్లా, తరకటూరులో 8 ఎకరాలు, వికారాబాద్‌ సమీపములో 50 ఎకరాలు, రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 58 ఎకరాలలో ప్రకృతి సాగు చేస్తున్న విజయరామ్‌.

వాస్తవానికి విజయరామ్‌ ఆర్టిస్ట్‌ (బొమ్మలు గీస్తుంటారు). ఆర్టిస్ట్‌గా తన వృత్తిని కొనసాగిస్తూ హైదరాబాదు నగరంలో ఇందిరాపార్కు సమీపంలో ఒక మిఠాయి దుకాణాన్ని నడుపుతూ వస్తున్న సమయంలో నీటి యొక్క విలువను తెలుసుకుని నీటి సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని మిఠాయి దుకాణంకి వచ్చిన వినియోగదారులకు తెలియచేస్తూ ఉండేవారు. అందుకు సంబంధించి చార్టులను తయారు చేయించి అవసరమైన వారికి ఆ చార్టులను ఉచితంగా అందిస్తూ ఉండేవారు. ఆవిధంగా తన ఆలోచనలని సామాజిక రంగాలవైపు కూడా మళ్లించి కొనసాగుతున్న క్రమంలో 2010వ సంవత్సరంలో సుభాష్‌పాలేకర్‌ గారి జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి గురించి తెలుసుకొని తాను కూడా గో-ఆధారిత వ్యవసాయం చేయాలనే తలంపుతో అటువైపు అడుగులు వేసి ప్రకృతి వ్యవసాయంలో అడుగు పెట్టారు. ఈ పద్ధతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే తలంపుతో సుభాష్‌పాలేకర్‌ గారి ద్వారా సదస్సులు ఏర్పాటు చేయడంలో తనవంతు పాత్రను పోషించారు…. పోషిస్తూన్నారు.

గోఆధారిత వ్యవసాయంలో ప్రధానమయినవి మన దేశీయ జాతి గోవులు, మన పురాతన నాటు విత్తనాలు కాబట్టి తన సాగులో ఈ పద్ధతులను అమలుపరచడంతో పాటు అంతరించి పోతున్న మన పురాతన విత్తనాలను అభివృద్ధి చేసి వాటి లభ్యత పెంచాలనే తలంపుతో మన పురాతన విత్తనాల సేకరణకు నడుంబిగించి వాటిని సేకరిస్తూ అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. వీటన్నింటికిగాను కృష్ణాజిల్లా తరకటూరులోని 8 ఎకరాల పొలం, వికారాబాద్‌ సీమపంలోని 50 ఎకరాల పొలంలో పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తున్నారు. ఇందుకుగాను మన దేశీయ జాతులు ఒంగోలు, గిర్‌ లాంటి ఆవులను మరియు ఎద్దులను కలిపి సుమారు 120 మేరకు పశువులను పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటలసాగులో వినియోగిస్తున్నారు. ఆవు పాల ద్వారా మన తాత, ముత్తాతలు పాటించిన పద్ధతులతో నాణ్యమైన ఆవు నెయ్యిని తయారు చేసి అవసరమైన వారికి అమ్ముతూ వస్తున్నారు.

ప్రస్తుతం వరి, చెరకు, ఉల్లి, పసుపు, అల్లం, వివిధ రకాల కూరగాయలు అరటి మొదలగు పంటలతో పాటు 5 అంచెల పద్ధతిలో (పూర్తి వివరాల కొరకు బాక్స్‌ చూడగలరు) వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. దుక్కిలో ఘనజీవామృతం అందించడంతో పాటు జీవామృతాన్ని భూమికి అందిస్తుంటారు. అవసరాన్ని బట్టి జీవామృతం, నీమాస్త్రం, పుల్లటి మజ్జిగ లాంటి వాటిని పంటలపై పిచికారి చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతుంటారు. పంట దిగుబడిలో నాణ్యతకు, పోషకాలకు ప్రాముఖ్యతని ఇస్తూ ఎంత దిగుబడి వచ్చిందనే దానిని పట్టించుకోకుండా వచ్చిన దిగుబడి నాణ్యమైనదా కాదా అనే కోణంలో ఆలోచిస్తూ పంటల సాగు కొనసాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాటు విత్తనాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కాబట్టి తను సాగు చేసే పంటలన్నింటికీ నాటు విత్తనాలనే ఉపయోగిస్తున్నారు. నాటు విత్తనాలను తన పంటల సాగులో వినియోగించడంతోపాటు తోటి రైతులకు అందచేస్తుంటారు. మన పురాతన విత్తనాలు అంతరించి పోతున్నవి కాబట్టి అందుబాటులో ఉన్న పురాతన విత్తనాలను ప్రత్యేకించి వడ్లను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరించి వాటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అభివృద్ధిపరచి తోటి రైతులకు అందచేసి మన పురాతన విత్తన నిధిని కాపాడుటలో విజయరాం ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. పురాతన వడ్లలో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు అని తెలుసుకొని పురాతన విత్తనాల అభివృద్ధి మరియు పంపిణీని ఒక ఉద్యమంగా చేస్తున్నారు.

ఐదు అంచెల సాగు విధానం :

ఐదు అంచెల సాగు విధానాన్ని సుభాష్‌ పాలేకర్‌ బాగా ప్రచారం చేశారు. ఈ విధానంలో 36 అడుగుల దూరంలో మామిడి, నేరేడు లాంటి పెద్దగా ఎదిగే మొక్కలు పెంచుకొంటూ వాటి మధ్యలో వివిధ రకాల మొక్కలను, కూరగాయలు, ఆకుకూరలను 4 అంచలుగా సాగు చేయడం దాని ప్రధాన ఉద్దేశ్యం. ఈ విధానం 36þ36 అని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ 36þ36 విధానం ప్రచారంలోకి వచ్చిందేకాని క్షేత్రస్థాయిలో విజయం సాధించిన వారు పెద్దగా లేరు. కారణం ఈ విధానంలో దిగుబడులు సక్రమంగా రావడం లేదు అని తెలుసుకుని విజయరాం ఈ విధానానికి వేరే రూపం ఇచ్చారు. అంటే 36 కి బదులుగా 50 అడుగుల దూరం పాటిస్తే అన్ని అనుకూలంగా ఉంటాయని అనుభవ పూర్వకంగా తెలుసుకుని 50þ50 అడుగుల దూరంలో 5 అంచెలుగా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 50 అడుగుల దూరంలో మొదటి అంచెలో నేరేడు, మామిడి, పనస, బాదం లాంటి పెద్దగా ఎదిగే వృక్షాలు 50 అడుగులలో సగం అంటే 25 అడుగుల దూరంలో రెండో అంచెగా బత్తాయి, నిమ్మ, నారింజ లాంటి మొక్కలు, 25 అడుగులలో సగం అంటే 121/2 అడుగుల దూరంలో 3వ అంచెగా బొప్పాయి, అరటి లాంటి మొక్కలు, 121/2 లో సగం 61/4  లో 4వ అంచగా మునగ, అవిశ లాంటి మొక్కలు 61/4 అడుగులకు మధ్యలో సొర, బీర, కాకర, బెండ లాంటి కూరగాయలతోపాటు తోటకూర, గోంగూర, చుక్కకూర లాంటి ఆకుకూరలు, పసుపు, అల్లం, చేమ దుంపలాంటి పంటలు పండిస్తున్నారు. వీటన్నింటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులోనే పండిస్తున్నారు. 5 అంచెల విధానంలో లైనుకి లైనుకి 61/4 అడుగుల దూరం ఉంటుంది. లైనుకి లైనుకి మధ్య ఒక కాలువ చేసుకుని ఆ వచ్చిన మట్టి లైనులో ఎత్తుగా వేసుకోవడం వలన కలుపు సమస్య తగ్గడంతో పాటు లైనులో ఉన్న మొక్కలకు పోషకాలు బాగా అంది అవి ఆరోగ్యంగా పెరుగుతూ ఎలాంటి కషాయాలు, ద్రావణాలు అవసరం పడటంలేదు. తప్పనిసరి పరిస్థితులలో నీమాస్త్రం, పుల్లటిమజ్జిగ, జీవామృతం లాంటివి పంటపై పిచికారి చేస్తుంటారు. విజయరాం పండించే అన్ని పంటలకు నీటిని అందించటానికి ఎలాంటి డ్రిప్పు, స్ప్రింక్లర్‌ లాంటి విధానాలను ఉపయోగించకుండా కాలువల ద్వారానే నీటిని అందిస్తుంటారు. 5 అంచెల విధానంలో కాలువ ద్వారా నీటి అందిస్తూ ఆ కాలువలలో అరటి, బొప్పాయి లాంటి ఆకులు మల్చింగ్‌గా ఉపయోగిస్తుంటారు. 

ప్రకృతి వ్యవసాయంలో అడుగుపెట్టి, దేశీయ జాతి గోసంతతిని, మన పురాతన విత్తనాలను అభివృద్ధిపరుస్తూ తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తూ పంట దిగుబడులు ముఖ్యం కాదు, నాణ్యమైన దిగుబడులు ముఖ్యం అంటూ విజయరాం ముందుకు నడుస్తున్నారు. మరిన్ని వివరాలు 8374662262 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More

సమీకృత సేద్యంలో మల్లిఖార్జునరెడ్డి

మనది వ్యవసాయక దేశం అయినప్పటికీ వివిధ రకాల కారణాల వలన ఉన్నత చదువులు చదివిన రైతుల సంతానం వ్యవసాయరంగానికి దూరంగా ఉద్యోగ, వ్యాపార రంగాలలోకి వలసలు పోయి అందులో కొంతకాలం గడిచిన తరువాత కొంతమంది తిరిగి వ్యవసాయరంగంవైపు అడుగులు వేస్తున్నారు. వ్యాపార రంగంతో పోల్చుకుంటే ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఎక్కువగా తిరిగి వ్యవసాయ రంగంవైపు చూస్తున్నారు. కారణాలు ఏమయినా కాని మన వ్యవసాయ రంగానికి, మనదేశానికి ఇది శుభపరిణామం అని చెప్పవచ్చు. సాధారణంగా మన దేశంలోని ఎక్కువమంది యువతీయువకులు ప్రధాన ధ్యేయం ఉన్నత చుదువులు చదివి ఉన్నత ఉద్యోగాలలో చేరడం పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా వరకు అదేదారిలో నడుస్తున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలలో రాణిస్తూ వివిధ రకాల కారణాల వలన తిరిగి వ్యవసాయ రంగంలో అడుగుపెట్టడం వలన ఎప్పటి నుంచో వ్యవసాయంలో ఉంటూ అసంతృప్తితో కాలం వెల్లతీస్తున్న రైతులకు మనోధైర్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం, పెద్దకూర్మపల్లికి చెందిన మల్లిఖార్జున రెడ్డి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయరంగంలో అడుగుపెట్టి రాణిస్తున్నారు. 

మల్లిఖార్జున రెడ్డిది వ్యవసాయ నేపథ్యం. వరి సాగులో మల్లిఖార్జున రెడ్డి నాన్నగారు అధిక దిగుబడులు సాధించారు. అందరిలాగానే ఉన్నత చదువులు చదివిన మల్లిఖార్జున రెడ్డి ఉద్యోగ రంగంలో కొనసాగుతున్నారు. ఆ సమయంలో మార్కెట్‌లో దొరికే పప్పులు, నూనెలు అన్నీ కూడా కల్తీలు కావడం, తన స్నేహితులు కొందరు క్యాన్సరుతో ఇబ్బందులు ఎదుర్కోవడం దగ్గర నుంచి చూడడం జరిగింది. వీటన్నింటికి పరిష్కారం ఆలోచించసాగారు. వాటికి మరియు తమ ఆరోగ్యాలకు పరిష్కారం సేంద్రియ వ్యవసాయం అని నమ్మి 9 సంవత్సరాలు చేసిన ఉద్యోగాన్ని వదలి స్వగ్రామంలోని తండ్రి చేస్తున్న పంటల సాగులో అడుగుపెట్టారు వ్యవసాయంలో అడుగుపెట్టగానే సరిపోదు, వస్తున్న సంపాదనని వదలుకొని వచ్చాడు కాబట్టి ఒక వైపు సంపాదన గురించి ఆలోచించాలి, రెండోవైపు మన భవిష్యత్‌ తరాలకు కలుషితం కాని నేలను, వాతావరణాన్ని, ప్రస్తుత తరాలకు అవశేషాలు లేని ఆహారాన్ని అందించాలి. వీటన్నింటికి సరైనదారి  అదీను ఇప్పటి వరకు నేలలు రసాయనాలకు అలవాటు పడి ఉన్నాయి కాబట్టి ఒకేసారి మార్పుకు సహకరించకపోవచ్చు కాబట్టి మెల్లమెల్లగా రసాయనాలను తగ్గించుకుంటూ సేంద్రియ పదార్థాలు పెంచుకుంటూ వస్తే 5 సంవత్సరాలకి రసాయనాలను మానివేసి పూర్తి సేంద్రియ సాగుకి మరలడం జరిగింది. అంటే 2017 వ సంవత్సరం నుండి ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా పూర్తి సేంద్రియ పద్ధతులతో వరి, వస, పెసలు, మినుము, నూనెగింజల పంటలు పండించుకుంటూ వస్తున్నారు. పంటల సాగుతో పాటు సేంద్రియ సాగుకు అవసరమైన మనదేశీయ జాతి గోవులను పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగులో వినియోగిస్తున్నారు. వీటన్నింటితో పాటు రైతుకు అదనపు ఆదాయం కావాలంటే పంటల సాగు మరియు పశుపోషణతో ఆగకుండా సమీకృత సేద్యం తప్పనిసరి అని తెలుసుకుని గొర్రెలు, మేకలు, చేపలు, కోళ్ళు మొదలగు వాటిని పెంచుతూ తన సాగును లాభాల బాటలో నడిపిస్తున్నారు. 2021 ఖరీఫ్‌ మరియు రబీలలో 18 ఎకరాలలో వివిధ రకాల వడ్లను వెద పద్ధతిలో సాగు చేశారు. ఇందుకుగాను దుక్కిలో ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం అందించారు. ఆరుతడి పద్ధతిలో వరి పంటను సాగు చేశారు. ఆరుతడి పద్ధతిలో అయితే వేరువ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్క రోగనిరోధక శక్తిని పెంచుకుని పెరుగుతుంది కాబట్టి చీడపీడల ప్రభావం తగ్గడంతోపాటు దిగుబడులు పెరుగుతున్నవి కాబట్టి ఈ పద్ధతిని పాటిస్తున్నారు. కలుపు నివారణకు తాను సొంతంగా పైపు మరియు ఇనుప చైన్లతో తయారు చేసుకున్న పరికరాన్ని ఉపయోగించి కొంత వరకు నివారించుకోవడంతో పాటు మిగిలిన కలుపును మనుషుల సహాయంతో నివారించుకున్నారు. వరి పంటకు అవసరాన్ని బట్టి జీవామృతం, మట్టిద్రావణం, వేస్ట్‌డికంపోజర్‌, నీమాస్త్రం, ఇంగువ ద్రావణం, మారేడు కషాయం లాంటివి ఉపయోగిస్తూ వచ్చారు. పంటలో నీటి అవసరం తెలుసుకునేందుకు 6 అంగుళాల పివిసి పైపుకు రంధ్రాలు చేసి ఆ పైపును వరి పంటలో భూమిలో పెట్టి అందులో ఊరిన ఊట నీటిని పరిశీలిస్తూ ఆరుతడి పద్ధతిలో నీటిని అందిస్తూ వచ్చారు. ఖరీఫ్‌లో ఎకరానికి 2500 కిలోలు, రబీలో ఎకరానికి 3500 కిలోలు వడ్ల దిగుబడి సాధించి సంవత్సరానికి రెండు పంటలకు కలిపి ఎకరానికి 6000 కిలోల వడ్ల దిగుబడి పూర్తి సేంద్రియ పద్ధతిలో సాధించారు. వడ్లను అదేవిధంగా అమ్మకుండా విలువజోడించి అనగా వడ్లను మరపట్టించి బియ్యాన్ని అమ్మకం చేస్తున్నారు. వీటితో పాటు కొంత ప్రాంతంలో మన ప్రాచీన వరి రకాలను కూడా సాగు చేసి మంచి దిగుబడి తీసి ఆ వరిగడ్డిని (ఉప్పుద్రావణం కోటింగు ఇచ్చి) పశువులకు మేతగా అందిస్తూ వస్తున్నారు.

వస: ఒకటిన్నర ఎకరాలలో ఔషధ పంట అయిన వస పంటను సాగు చేశారు. ఇందుకు అవసరమయిన విత్తన మొక్కలను తెలిసినవారి నుండి తెప్పించుకుని నాటారు. ఎకరానికి 40000 మొక్కల చొప్పున ఎకరంన్నరకు 60,000 మొక్కలు అవసరం అయినవి. వస మొక్కలను వరి నారు మాదిరిగానే ‘శ్రీ’ పద్ధతిలో నాటించారు. వస పంటలో 3 నెలల వరకు కలుపు సమస్య ఉంటుంది కాబట్టి కోనోవీడరు తిప్పటానికి వీలుగా మొక్కలను 2021 సంవత్సరం జులై నెలలో నాటించారు. వస సాగుకు గాను ఔషధ మొక్కల బోర్డు నుంచి ఎకరానికి 14000/- ప్రోత్సాహాన్ని కూడా మల్లిఖార్జున రెడ్డి పొందారు. ఇది 9 నెలల పంట. 2022లో దిగుబడి వచ్చింది. ఎకరంన్నరకు గాను 30 క్వింటాళ్ళ దిగుబడి పొంది క్వింటా 8000/-లకు అమ్మకం చేశారు. ఎకరంన్నరకు గాను పెట్టుబడి 1,10,000 వరకు అయ్యింది. పెట్టుబడి పోను ఎకరంన్నరకు సుమారు 1,30,000 వరకు ఆదాయం వచ్చింది.
అజొల్లా: అడుగు లోతు 10 అడుగుల వెడల్పు మరియు పొడవులతో ఒక తొట్టెను నిర్మించుకుని అందులో అజొల్లాను పెంచుతున్నారు. తొట్టిలో అడుగున 2 అంగుళాల మందంలో మట్టి, సుమారు 20 కిలోల ఆవుపేడ, అగ్గిపెట్టె పరిమాణంలో మినరల్‌ మిక్చర్‌ వేసి నీటిని నింపి అజొల్లా కల్చర్‌ని తెచ్చివేశారు. ఈ తొట్టెను నీడలో ఏర్పాటు చేసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే 10 నుంచి 15 రోజులలో తొట్టి మొత్తం అజొల్లా అభివృద్ధి చెందింది. ప్రతిరోజు కొంత అజొల్లాను పశువులకు, కోళ్ళకు దాణాగా అందిస్తూ వస్తున్నారు. ప్రతివారం తప్పనిసరిగా అజొల్లా తొట్టిలోని నీటిని మార్చాలి. 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సుమారు 20 కిలోల పేడను అందించాలి. 6 నెలలకు ఒకసారి మట్టిని మారుస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటే 365 రోజులు అజొల్లాని పొందవచ్చు. అజొల్లాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కనుక పశువులు, కోళ్ళు లాంటి వాటికి దాణాగా అందిస్తే ఖర్చు తగ్గడంతో పాటు వాటి ఆరోగ్యం బాగా ఉంటుందని మల్లిఖార్జునరెడ్డి వివరించారు. వివిధ రకాల పంటల సాగుతో పాటు మన దేశీయ గోవులు మూడింటిని పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగులో వినియోగిస్తూ వాటి పాల ద్వారా వచ్చిన వెన్నతో నెయ్యి తయారు చేయించి నెయ్యిని అమ్ముతూ ఆదాయం పొందుతున్నారు. వాటితో పాటు 10 గొర్రెలు, 50 మేకలు (పిల్లలతో కలిపి) 50 కోళ్ళు, సుమారు 300 వరకు చేపలను కూడా పెంచుతూ రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే సమీకృత వ్యవసాయమే సరైన దారి అని నిరూపిస్తున్నారు. మల్లిఖార్జున రెడ్డి చేస్తున్న సమీకృత వ్యవసాయం ద్వారా అన్నీ కలిపి సంవత్సరానికి 10 లక్షలకు తగ్గకుండా ఆదాయాన్ని పొందుతూ కుటుంబ సభ్యుల సహకారంతో ఆనందంగా సేద్యాన్ని కొనసాగిస్తూ ఆరోగ్యంగా జీవితాన్ని గడుపుతున్నారు.

మరిన్ని వివరాలు 9704090613 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More

ప్రకృతి వ్యవసాయానికి చిరునామా సూర్యనారాయణమూర్తి

మన తాతముత్తాతలు వ్యవసాయంలో పెద్దగా ఏమీ చేసేవారు కాదు. విత్తనాలు వేసేవారు. దిగుబడి తీసుకునేవారు. కాని రాను రాను పంటల సాగుకి పశువుల ఎరువు అందించటం మొదలయ్యింది. అప్పటి వరకు పరవాలేదు. పశువుల ఎరువు అందించి ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించారు. విత్తనాలను కూడా బయట కొనుగోలు చేయకుండా తమ సొంత విత్తనాలను లేదా తమ ప్రాంతాలలో అందుబాటులో ఉండే విత్తనాలను ఉపయోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తూ దిగుబడి గురించి ఆలోచించకుండా ఎంత దిగుబడి వస్తే అంత దిగుబడి తీసుకుంటూ జీవితాలను గడుపుతూ వచ్చారు. కానీ రాను, రాను వ్యవసాయంలో సాంకేతికత పెరగడం, జనాభా పెరిగి వారి ఆహార అవసరాలను తీర్చటానికి వ్యవసాయంలో రసాయనాలు, అధిక దిగుబడి వంగడాలను ప్రవేశపెట్టటం జరిగింది. ఈ పరిణామాల వలన అనుకున్న లక్ష్యం నెరవేరింది కాని అనేక ఇబ్బందులు ఎదురవుతున్నవి. ఆ ఇబ్బందుల నుండి బయటకు రావడానికి రైతులు మరలా తిరిగి మన తాత ముత్తాతలు చేసిన పంటల సాగు విధానాలవైపు అడుగులు వేయాలని ప్రభుత్వాలు, అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. వీరి మాటలు విని వాస్తవం తెలుసుకున్న కొంతమంది రైతులు తమ సాగు పద్ధతులను మార్చుకుని ప్రకృతి సాగు విధానాలవైపు అడుగులు వేశారు. వేస్తున్నారు. ఇదేకోవకు చెందుతారు కోనసీమ జిల్లా గంగవరం గ్రామానికి చెందిన అల్లూరి సూర్యనారాయణమూర్తి. 

సూర్యనారాయణమూర్తిది వ్యవసాయ నేపధ్యం. మొదటి నుంచి అంటే గత 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. వారి ప్రాంతం పల్లపు ప్రాంతం కాబట్టి వరి ప్రధాన పంటగా సాగు చేస్తూ వస్తుంటారు. అందరి రైతుల మాదిరిగానే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన వరి సాగులో కూడా రసాయనాలు అందిస్తూ సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. ఎక్కువగా అధికంగా 50 బస్తాలకు పైగా దిగుబడి వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. దిగుబడి బాగానే వస్తుంది కాని వివిధ రకాల కారణాల వలన ఆదాయం రాకపోగా రసాయన పద్ధతులతో పండించిన బియ్యాన్ని తినడం వలన ఆరోగ్యాలు కూడా సక్రమంగా ఉండటం లేదు. దానికి పరిష్కారం ప్రకృతి వ్యవసాయం అని తెలుసుకొని తన సాగుని సేంద్రియ పద్ధతులలోకి మార్చాలనే లక్ష్యంతో రసాయనాలను తగ్గిస్తూ సేంద్రియ పదార్థాలను పెంచుతూ కొన్ని సంవత్సరాలు చేసిన తరువాత అంటే 2014 వ సంవత్సరం నుంచి పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వరి పంట సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రకృతి వ్యవసాయానికి మారిన మొదటలో దిగుబడులు తగ్గినవి కాబట్టి పశువుల ఎరువు, జీవామృతం లాంటివి భూమికి అందిస్తూ వస్తూ గత రెండు సంవత్సరాల నుంచి భూమికి ఏమీ అందివ్వడం లేదు. నారు నాటుకోవటం, కలుపు నివారించటం, దిగుబడి తీయటం అంతే అంతకు మించి ఏమీ చేయకుండా అసలయిన ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా సూర్యనారాయణమూర్తి నిలుస్తున్నారు.

5 ఎకరాలలో వరిని సాగు చేస్తున్నారు. 2021వ సంవత్సరం ఖరీఫ్‌లో బి.పి.టి. రకం పండించి 75 కిలోల బస్తాలు ఎకరానికి 28 చొప్పున దిగుబడి సాధించారు. రబీలో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకం వరిని సాగు చేసి ఎకరానికి 25 బస్తాల దిగుబడిని సాధించారు. సొంత విత్తనాలను లేదా బయట కొనుగోలు చేసుకున్న విత్తనాలను నారు పోసుకుని ఖరీఫ్‌లో అయితే 35 రోజుల పెరిగిన నారు, రబీలో అయితే 25 రోజులు పెరిగిన నారుని నాటిస్తుంటారు. కలుపు సమస్య నుండి పంటను రక్షించుకోవడానికి నారు నాటే పద్ధతినే అవలంభిస్తున్నారు. ప్రస్తుతం తాను సాగు చేస్తున్న వరి పంటకు ఎలాంటి పదార్థాలు అందించడం లేదు. రబీలో మాత్రం వేడి తగ్గడానికి ఎండుద్రాక్ష, బార్లీగింజలు, మజ్జిగల మిశ్రమాన్ని పిచికారి చేస్తుంటారు. అంతకుమించి ఏమీ చేయవలసిన అవసరం పడటం లేదు. వడ్లను బియ్యం ఆడించి నేరుగా వినియోగదారులకి బియ్యం అమ్మకం చేస్తున్నారు. 

సుమారు ఒక ఎకరం తొంభై సెంట్ల భూమిలో చుట్టూ 10 అడుగుల వెడల్పు 4 అడగుల లోతులో కందకం తవ్వి ఆ కందకంలో వచ్చిన మట్టిని మధ్యలో వేసి చదును చేయించారు. కందకంలో చేపలు పెంచుతూ మధ్యలో ఉన్న మట్టిలో వివిధ రకాల పంటలు అంటే తన కుటుంబానికి అవసరమైన అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వస్తుంటారు. ఈ ప్రాంతంలో సాగు చేసే పంటలలో సొర, బీర, కాకర, బెండ, వంగ, టమాట, సీతాఫలం, జామ, సపోట, వాటర్‌ యాపిల్‌ లాంటి తమ కుటుంబ ఆహారానికి అవసరమైన పంటలు ఉంటాయి. కందకంలో ప్రతి సంవత్సరం చేపలు పెంచి అవి పెరిగిన తరువాత వాటిని అమ్మి అదనపు ఆదాయాన్ని పొందుతుంటారు. 2021వ సంవత్సరం 200 చేప పిల్లలను పెంచారు. ఇందులో గడ్డి చేప, బొచ్చ, బంగారు తీగ, గచ్చ మొదలగు నాలుగు రకాలు ఒక్కొక్కటి 50 పిల్లల చొప్పున వేశారు. చేప పిల్లలకు ప్రతి రోజు 2 కిలోల చొప్పున తమ వడ్లను మర పట్టించినపుడు మిగిలే వృథాగా పోయే రద్దు నూకను అందిస్తుంటారు. రోజుకు 2 కిలోల చొప్పున నెలకు 60 కిలోల రద్దు నూకలను మాత్రమే అందిస్తుంటారు. తన వరి పంటలో వచ్చిన నూకలు చేపలకు ఆహారంగా సరిపోతుంటవి. బయట నుంచి ఏమీ కొనుగోలు చేయకుండా చేపలను పెంచుతుంటారు. నూకలను మరియు మట్టిని తింటూ చేపలు పెరుగుతుంటాయి. సంవత్సరంలో 1 కిలో వరకు తూగేలా బరువు పెరుగుతాయి. కిలో 250/-ల చొప్పున నేరుగా పొలం దగ్గర అమ్ముతుంటారు. వినియోగదారులు నేరుగా పొలం వద్దకు వచ్చి తమకు నచ్చిన రకాన్ని కొనుగోలు చేస్తుంటారు. వరి మరియు వివిధ రకాల కూరగాయలు, పండ్లు పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తూ చేపలకు కూడా బయట నుంచి కొనుగోలు చేసిన పదార్థాలను అందించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో పండించిన సొంత నూకలను అందిస్తూ నాణ్యమైన చేపలను పెంచి మంచి ధరకు అమ్ముతున్నారు. ఒక ఆవు మరియు రెండు గేదెలను పోషిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ తోటి సమాజానికి రసాయనాలు లేని ఆహారాన్ని అందిస్తూ సంవత్సరానికి ఎకరానికి లక్ష రూపాయలు పైగానే ఆదాయం గడిస్తూ నిజమైన ప్రకృతి వ్యవసాయానికి సూర్యనారాయణమూర్తి దారి చూపిస్తున్నారు.   

Read More