కొబ్బరి ఆగ్నేయాసియాకు చెందిన పంట మరియు ఆ ప్రాంతం అంతటా విస్తృతంగా సాగు చేయబడుతుంది. కొబ్బరిని ”జీవన వృక్షం” అని పిలుస్తారు. ఎందుకంటే దాని సాగు ముఖ్యమైన సాంస్కృతిక మరియు సామాజిక-ఆర్థిక కోణాలను కలిగి ఉంటుంది మరియు ఆసియా-పసిఫిక్ అంతటా లెక్కలేనన్ని సన్నకారుదారులకు జీవనోపాధిని కలిగిస్తుంది. భారతదేశం దీని ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో కొబ్బరి అనేక ప్రాంతాల్లో సాగు చేయబడుతుంది, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇంకా తమిళనాడులో ఎక్కువగా సాగు చేస్తున్నారు.

కొబ్బరిలో అనేక చీడ పురుగులు సోకినప్పటికీ నల్లముట్టె పురుగు గణనీయమైన ఉత్పత్తి నష్టాన్ని కలిగిస్తుంది. దేశంలోని కొబ్బరి పండించే అన్ని ప్రాంతాలలో ఈ పురుగు వ్యాప్తి చెంది ఉంది. కొబ్బరిను ఆశించు అన్నీ చీడ పురుగులలోకల్లా ఇది ప్రధానమైంది. కొబ్బరి నల్లముట్టె పురుగు శ్రీలంక మరియు బహుశా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉద్భవించింది. ఇది ఒలిగోఫాగస్ శాకాహారి, అనగా కొన్ని రకాల చెట్లను మాత్రమే ఆశిస్తుంది. ఇది ప్రధానంగా వివిధ తాటి జాతులతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ జాతుల అన్నిటిలోకల్లా కొబ్బరి ఈ పురుగుకు అనువైన పంట. ఈ పురుగు కొబ్బరిని కాకుండా ఆయిల్ పామ్, ఖర్జూరం, వక్క వంటి పంటలను కూడా ఆశిస్తుంది.
నల్లముట్టె పురుగు గుర్తింపు చిహ్నాలు
కొబ్బరి నల్లముట్టె పురుగు జీవిత చక్రంలో నాలుగు అభివృద్ధి థలు ఉంటాయి: గుడ్డు, లార్వా (గొంగళి పురుగు), కోశస్థథ మరియు తల్లి పురుగు థ.
గొంగళి పురుగు: ఇది ఆకుపచ్చని గోధుమ రంగులో ఉంటుంది. ముదురు గోధుమ రంగు తల మరియు ప్రోగ్వక్షం కలిగి ఉంటుంది. శరీరంపై గోధుమ రంగు చారలు ఉంటాయి.
కోశస్థథ: ఇది రెట్టలతో గూడుకట్టుకొని, ఒక పలుచటి పట్టు కోకన్‌లో కోశస్థ థను పూర్తి చేస్తుంది.
తల్లి పురుగు: నలుపుతో కూడిన లేత బూడిద రంగు మచ్చలను కలిగి ఉంటుంది.
తల్లి ఆడ పురుగు: పొడవైన యాంటెన్నా మరియు ముందు రెక్కలపై మూడు మందమైన మచ్చలు ఉంటాయి.
మగ పురుగు: వెనుక భాగం రెక్కలు అంచులు వెంట్రుకలను కలిగి ఉంటాయి.
నల్లముట్టె పురుగు గాయపరుచు లక్షణములు
ఈ పురుగు అన్ని వయసు కొబ్బరి చెట్లను ఆశిస్తుంది. కొబ్బరి దిగువ వరుసాకులలోని పత్రహరితమును గోకి తిని, రంపపు పొట్టు వంటి రెట్టలతో, నోటి దారాలతో గూళ్ళు కట్టి, ఆకులను అతికించి, ఆ గూళ్లలో ఉంటాయి.
మూడు లేదా నాలుగు ఆకులు మాత్రమే ఆకుపచ్చ రంగు కలిగి ఉండి, మిగిలిన ఆకులన్నీ ఎండిన మచ్చలు కలిగి ఉంటాయి.
ఈ పురుగు తీవ్రత పెరిగే కొద్ది మచ్చలన్నీ ఏకమై ఆకు పూర్తిగా ఎండిపోతుంది. ఇందుమూలంగా చెట్టుపై ఆకులన్నీ ఎండిపోయి వాలిపోతాయి. ఈ పురుగు ఆశించిన తోట అంతా కాలిపోయినట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు పురుగు ఉధృతి ఎక్కువ ఉన్నచో కాయలు కూడా దెబ్బతింటాయి.

ఈ పురుగు చిన్న మొక్కలను ఆశించినపుడు మొక్కలు గిడసబారి, ఆలస్యంగా కాపుకు వచ్చును. అలాగే పెద్ద మొక్కలను ఆశించిన యెడల ఆహారం తయారు చేయగల ఆకులలోని పత్రహరిత రేణువులను తినివేయుట వలన ఆహార సరఫరా తగ్గిపోయి చెట్టు కాపు తగ్గడమే కాక కాయ పరిమాణం కూడా తగ్గును. ఆకులు ఎండిపోవటం వలన పిందెలు రాలి, దిగుబడులు తగ్గుతాయి. ఈ పురుగు ఆశించిన పిమ్మట చెట్టు కోలుకోవడానికి రెండు నుండి మూడు సంవత్సరాలు పట్టును.

నల్లముట్టె పురుగు జీవిత చరిత్ర
తల్లి పురుగు 50 నుండి 490 వరకు పాత గూళ్లు ఉన్న దిగువ వరుస ఆకుల దగ్గర గుడ్లు పెడుతుంది. 5 రోజులలో ఈ గుడ్లు పొదగబడి, చిన్న లార్వాలు ఆకు తింటూ ఎదుగుతాయి. గొంగళి పురుగులు ఆకు మడతలలో తింటూ దాదాపు ఒక నెల ఎదుగుతాయి. రెట్టలతో గూడు కట్టుకొని, నిద్రావస్థ థను 10-12 రోజులలో పూర్తి చేసుకుని తల్లి (రెక్కల) పురుగుగా వెలువడుతుంది. ఈ విధంగా ఆరు నుండి ఏడు వారములలో జీవిత చక్రం పూర్తి అవుతుంది.

జీవనియంత్రణ పద్ధతుల ద్వారా నల్లముట్టె పురుగు నియంత్రణ
నల్లముట్టె పురుగు యొక్క లార్వా పరాన్న జీవులు (బదనిలు) అంటే బ్రాకాన్ హెబెటర్ మరియు గొనియోజస్ నెఫాంటిడిస్ ఈ చీడపీడను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి.
భారతదేశంలో ఈ గొనియోజస్ నెఫాంటిడిస్ ఏడాది పొడవునా సంభవిస్తుంది, ఫిబ్రవరిలో గరిష్ట కార్యకలాపాలు గమనించబడ్డాయి. దీని అభివృద్ధికి వెచ్చని మరియు పొడి వాతావరణం సానుకూలం, సాధారణంగా తేమతో కూడిన నెలల్లో తక్కువ పరాన్న జీవనం గమనించవచ్చు. ఆడ గొనియోజస్ నెఫాంటిడిస్ అతిధేయ లార్వాలను స్తంభింపజేసి అతిధేయ శరీర ద్రవాన్ని త్రాగి బతుకుతాయి. ఈ బదనిక 1 నుండి 2 వ థ లార్వాలను కుట్టడం మరియు పక్షవాతం చేయడం ద్వారా పురుగు వృద్ధిలో కొంతభాగాన్ని తగ్గించగలదు. ఒక ఆడ బదనిక 6-8 లార్వాలను నాశనం చేయగలదు. స్త్రీ సంతానం యొక్క అధిక నిష్పత్తితో సంవత్సరం పొడవునా జి. నెఫాంటిడిస్ సంభవించడం, అధిక అతిధేయ శోధన సామరథ్యం, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం మరియు పురుగువృద్ధి తగ్గించడం వలన ఇది నల్లముట్టె పురుగు నివారణకు బహుముఖ పరాన్న జీవిగా మారుతుంది.
సి. సెఫాలోనికా (వరి పురుగు) లార్వాలను జి. నెఫాంటిడిస్ యొక్క సామూహిక పెంపకానికి హోస్ట్‌గా ఉపయోగిస్తారు. జి. నెఫాంటిడిస్ యొక్క నిరంతర ఉత్పత్తికి ఒక శక్తివంతమైన మరియు ఆరోగ్యకరమైన సి.సెఫాలోనికా కాలనీ అవసరం.
పురుగు తక్కువ స్థాయిలో ఉన్నచో (1 లేదా రెండు ఆకులకు పురుగు ఉన్నచో) గొనియోజస్ నెఫాంటిడిస్ అనే బదనికను 10 పురుగులు మరియు బ్రాకాన్ హెబెటర్ 20 పురుగులు/చెట్టుకు చొప్పున తోటలో 10 శాతం చెట్లకు ఆశించినప్పుడు విడుదల చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు ఎక్కువ సంఖ్యలో బదనికలు విడుదల చేయాలి. మొత్తంగా 8-12 విడుదల చేస్తే మంచిది. కొబ్బరి చెట్ల పరిసరాల్లో ఉన్న తాటి చెట్లను కూడా ఈ పురుగు ఆశిస్తుంది కాబట్టి ఈ చెట్లపై కూడా బదనికలను విడుదల చేయాలి.

పరాన్న జీవుల విడుదల తర్వాత ఈ పురుగు సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్రభావిత తోటలలో నల్లముట్టె పురుగు యొక్క లార్వా సంఖ్య మూడు నెలల తర్వాత 34.1 నుండి 75.9 శాతానికి తగ్గిందని, పరాన్నజీవులు విడుదలైన ఆరు నెలల తర్వాత 59.6 నుండి 100.0 శాతానికి తగ్గిందని మరియు కొత్తగా ఉద్భవించిన ఆకులలో ఆకు నష్టం మరియు పురుగు సంఖ్య నమోదు కాలేదు అని పరిశోధనలలో వెల్లడయింది. ఈ పురుగు యొక్క ప్యూపల్ సంఖ్య కూడా ఆరు నెలల తర్వాత 33.3 నుండి 94.5 శాతానికి మరియు 92.8 నుండి 100.0 వరకు తగ్గుతుంది అని పరిశోధనలలో వెల్లడించారు.
ఈ విధంగా జీవ నియంత్రణ పద్ధతులని వినియోగించడం ద్వారా పురుగు బెడదని నివారించి మంచి దిగుబడులు పొందడమే కాకుండా రసాయన పురుగు మందుల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చును. అంతేకాకుండా రసాయన నియంత్రణ పద్ధతులతో కంటే ఈ జీవ నియంత్రణ పద్ధతులలో ఖర్చు తక్కువ కాబట్టి రైతుకు లాభసాటిగా ఉంటుంది.
యల్లపు రామ్మోహన్, లోక మౌనిక
డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం.

