ఆక్వా రంగంలో 30% వృద్ధి సాధించాలని.. కలెక్టర్లు దీనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘2014-19 మధ్య రాష్ట్రంలో ఆక్వాకు స్వర్ణయుగమే. కొన్ని కారణాల వలన మన మార్కెట్‌ను ఇతర దేశాలు ఆక్రమించాయి. ఆక్వా రంగంలో మళ్లీ మనం పురోగమించాలి’ అని సూచించారు. మత్స్య, పశు సంవర్థక రంగాలపై సమీక్ష సందర్భంగా చంద్రబాబు పలు సూచనలు చేశారు.మీరేం కమిషనరయ్యా? నాణ్యమైన సీడ్‌ దొరకక రైతులు కోల్‌కతా నుంచి సీడ్‌ తెచ్చుకుంటున్నారని ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి ప్రస్తావించగా.. చంద్రబాబు సంబంధిత అధికారులను ప్రశ్నించారు. చెరువుల టెస్టింగ్‌ ఇతర విషయాలపై మత్స్యశాఖ కమిషనర్‌ డోలా శంకర్‌ ఇచ్చిన సమధానంపై ఆయన సంతృప్తి చెందలేదు. ‘మీరు చేసే కార్యక్రమాలు కలెక్టర్లకే తెలియడం లేదు. రైతుల్లోకి ఇంకేం తీసుకెళ్తారు? మీరేం కమిషనర్‌య్యా’ అని అసహనం వెలిబుచ్చారు. వచ్చే సమావేశానికి పూర్తి సన్నద్ధతతో రావాలని సూచించారు.