పాల ఉత్పత్తి – ఆదరవులు

పాడి పశువుల నుండి పాల ఉత్పత్తి అధికం చేయడానికి పాల రైతు మార్గాలు వెతుకుతూ ఉంటాడు. తోటి వారితో సంభాషిస్తాడు. పశు వైద్యుని సూచనలను అమలు చేస్తాడు. నిపుణులను సంప్రదిస్తాడు. అనుభవజ్ఞుల సలహాలను ఆచరిస్తాడు. తన ఆవు ఎక్కువ పాలు ఇవ్వడం గర్వకారణం. దూడలు చెంగు చెంగున గంతులేస్తుంటే మనసు ఉప్పొంగి పోతుంది. అయినా నేలాకరున లెక్కలు చూసుకుంటే లాభం కనిపించాలి. ఎంత ప్రేమ, అభిమానం ఉన్నా డబ్బు మిగలకపొతే పశువులను ఎల్లకాలం మేపలేరు. పాల దిగుబడికి బాలింత పశువులు ముఖ్యం గనుక ఈనటానికి ఇరవై రోజులు ముందు, ఈనిన తరువాత మూడు నెలలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయం క్లిష్టమైనది, ముఖ్యమైనది. హార్మోన్లు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి. ఆహారం చాలినంత తినలేవు. ప్రసవ వేదన వర్ణనాతీతం. శరీరంలో వేగంగా జరిగే మార్పులు. ఆందోళన, భయం, నీరసం, భ్రమ, మానసిక కల్లోలం ప్రతి తల్లిని ప్రసవ సమయంలో సహజంగా ఆవరిస్తాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

అందువలన పాడిపశువులు నిస్సత్తువతో నిస్సారమై పోకుండా రక్షించుకోవలసిన భాద్యత మనమీదే ఉంది. అందుకుగాను సమీకృతాహారాన్ని అందచేయాలి. అందులో మాంసకృత్తులు, పిండి పదార్ధములు, కొవ్వులు, పీచు, విటమినులు, ఖనిజాలు, లవణాలు, ఎంజైములతోబాటు మరికొన్ని ఆదరవులు (Additives) పొందు పరాచాలి. ఈ సంచికలో ఆదరవుల గురించి చర్చించుకుందాము.

ఫీడ్‌ అడిటివ్స్‌ (Feed Additives): మనభాషలో ఆదరవులు, సంకలనాలు అందాము. ప్రపంచ జనాభా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభాకి ఆహారావసరాలు పెరుగుతున్నాయి. జంతు సంబంధమైన ఉత్పత్తుల అవసరాలు అధికమౌతున్నాయి. వృక్షాలనుండి లభించే గింజలు, దినుసులు ఒకప్పుడు పశువుల మేతగా ఉపయోగపడేవి. ఇప్పుడు వాటిని మానవులకు ఆహారంగాను, ఔషధాలలోను, సౌందర్య సాధనాలలోను విరివిగా వాడుతున్నారు. గనుక పశువుల మేత తయారీ కష్టంగానూ, ప్రియంగాను మారింది. పాడిపశువుల మేత ఖరీదు ఎక్కువ, రాబడి తక్కువ అవ్వడం మూలాన పాల ఉత్పత్తికి, మాంసం ఉత్పత్తికి పశువుల పెంపకం ఆశించిన మేరకు పొందాలంటే శాస్త్రపరమైన అవగాహన అవసరం. అనుకోని అవాంతరాలు ఏర్పడినపుడు వెంటనే తేరుకోవాలి. ఫలితాలు ఆశించిన విధంగా రావాలంటే మంచి పాలన, పోషణ జరగాలి. మేత ఖర్చు తగ్గించడానికి శాస్త్రజ్ఞులు మార్గాలు వెతుకుతున్నారు. నిరంతర పరిశోధనల ఫలితం కొత్త కొత్త ఆదరవులను తయారుచేసి ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగిస్తున్నారు.       

ఒకప్పుడు పశు ఉత్పత్తులను పెంచడానికి అంటిబయోటిక్స్‌, హార్మోన్లు కొన్ని దేశాలలో విరివిగా వాడేవారు. మన దేశంలో పాలు పిండడానికి ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌ ఇప్పటకీ కొన్ని చోట్ల వాడుతూనే ఉన్నారు. ఇవి మనుషుల ఆరోగ్యానికి చేటుచేస్తాయి గనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వాటి వాడకం నిషేధించింది. పశ్చిమ దేశాల్లోను, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మొదలగు దేశాలలో వాటి స్థానే ఆదరవులు (Feed Additives) సంకలనాలు (Supplements) వాడకంలోకి వచ్చాయి. 

నెమరు వేయు జంతువులలో వాడుకలో ఉన్న ఆదరవులు:

*     ఆమైనో ఆసిడ్స్‌   *    అంటిబయోటిక్స్‌

*     అసిడిఫయర్స్‌    *     అంటిఆక్సిడెంట్స్‌

*    టాక్సిన్‌ బైన్డర్స్‌    *    ఎంజైములు

*    సుగంధ ద్రవ్యాలు  *    ఖనిజములు

*    విటమినులు      *    బఫర్స్‌

*    మొనేన్సిన్‌        *     ప్రోబయోటిక్స్‌

*    ఈస్ట్‌               *     యుక్కా

ఫీడ్‌ అడిటివ్స్‌ అనబడు ఆదరవులు కొద్ది మోతాదులో, ఒకటి లేక మరిన్నికలియకలో పశువుల ఉత్పత్తి, ఆరోగ్యం, మెరుగవ్వడానికి సహకరిస్తాయి. తద్వారా పెరుగుదల, బరువు, ఆరోగ్యం, రోగనిరోధకశక్తి, ప్రత్యుత్పత్తి మెరుగవుతాయి.  

అంటిబయోటిక్స్‌ సూక్షక్రిముల వలన కలుగు రోగాలను తగ్గించడానికి మాత్రమే వాడకానికి ఇప్పుడు అనుమతులున్నాయి. ఉత్పత్తి పెంచడానికి ఉపయోగించడం ప్రపంచమంతా నిషేధించారు. అంటిబయోటిక్స్‌ వాడకం విరివిగా విచ్చలవిడిగా విచిక్షణా రహితంగా జరగడం వలన సూక్ష్మక్రిములు (Bacteria) అలవాటుపడి ప్రతిఘటించడం మొదలుపెట్టి నాశనము కాకుండ  బలాన్నిపెంచుకుని సూపర్‌ బగ్స్‌ (Superbugs) మారి పెద్దఎత్తున మానవ మరణాలకు దారితీస్తున్నాయి. హార్మోన్ల వాడకం వలన పశు ఉత్పత్తులలో వాటి అవశేషాలు ముఖ్యంగా బాల బాలికలలో తీవ్రమైన మార్పులు తీసుకు వస్తాయి. ఇంకా కేన్సర్‌, తదితర రోగాలకు కారణ మౌతున్నాయి. అందువలన ఇతర వస్తువులను, పదార్ధాలను ఉపయోగించి ఆరోగ్యకరమైన, హాని కలిగించని విధంగా ఆదరవులను తయారు చేస్తున్నారు. ఆమైనో ఆసిడ్లు, ఎంజైములు, ఖనిజములు, విటమినులు ఎప్పుడు ఎలా వాడాలో గత సంచికలలో తెలుసుకున్నాము. మిగిలిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము.  

అసిడిఫయర్స్‌ (Acidifiers): ఫార్మిక్‌, సిట్రిక్‌, ప్రొపియోనిక్‌, లాక్టిక్‌. అసిటిక్‌, సోర్బిక్‌ అమ్లములను ప్రత్యేకంగా తయారుచేస్తారు. రూమేన్లో వాటి లక్షణాలు మారకుండా కేవలం ప్రేవులలో వినియోగం చెందేలా మార్పులు చేస్తారు. ఇంకా మేతలో దాగివున్న శిలీంధ్రాలను సైతం అణిచివేస్తాయి. కొవ్వు ఆమ్లముల (Fatty acids) తయారు చేస్తాయి.   

అంటిఆక్సిడెంట్స్‌ (Antioxidants) :  ఆహారంలో కొవ్వులుంటాయి. నిల్వ ఉంటే అవి మురిగి పోతాయి. చెడు వాసన వస్తాయి. జీర్ణం కావు. విటమిను ఏ, డి, ఈ లు, బి కాంప్లెక్స్‌ విటమినులు పనికిరాకుండా చేస్తాయి. లైసిన్‌ మొదలగు అమినో ఆసిడ్లు ఉపయోగపడవు. కొవ్వులు చెడిపోకుండా ఉండడానికి ఎతోక్సిక్యిన్‌ లేదా ఔకఊ మేతకు కలుపుతుంటారు. 

టాక్సిన్‌ బైన్డర్స్‌ (Toxin Binders): మైకోటాక్సిన్స్‌ అనగా శిలీంద్రముల నుండి ఉద్భవించే విష పదార్ధములు. వాతావరణంలో తేమ వేడి ఎక్కువగా ఉన్నపుడు బూజు  పడుతుంది. దానినుండి పుట్టే విషం మేతను కలుషితం చేసి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. విషాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు గనుక విషప్రభావం తగ్గించడానికి బైన్డర్స్‌ వాడతారు. ఈ బైన్డర్స్‌ విషాన్ని ఆకర్షించి జీర్ణం కాకుండా విష ప్రభావాన్ని తగ్గిస్తాయి. సోడియం బెంతోనైట్‌ అందుకు ఉపయోగపడుతుంది.  

సుగంధ ద్రవ్యాలు: అవులకు సునిశితమైన ముక్కు, నోరు ఉన్నాయి. సువాసనలను, రుచిని ఆస్వాదించ గలవు. మంచి వాసన, రుచిగల ఆహారాన్ని సంతోషంగా తింటాయి. మనిషి నాలుక గొంతులో 9,000 రుచిమొగ్గలుంటే, ఆవు నాలుక గొంతులో 25,000 రుచి మొగ్గలున్నాయి. గనుక రుచికరమైన ఆహారాన్ని ఎంత ఇష్టంగా తింటాయో ఊహించండి. పాలు ఉత్పత్తి చేయాలంటే మేత తృప్తిగా తినాలికదా! వెల్లుల్లి, సోపు, నల్లజీలకర్ర వాసనలు ఇష్టపడతాయి. చెరుకు మడ్డిని ఆస్వాదిస్తాయి.  

బఫర్స్‌:  రూమేన్లో ఆమ్లములు పెరగడం వలన జీర్ణశక్తి తగ్గి అనారోగ్యానికి గురిచేస్తుంది. మేతలో గింజల నిష్పత్తి అధికమైతే ఆమ్లములు ముంచుకొస్తాయి. పేడ పలచబడుతుంది. నురగ వస్తుంది. తిన్నది జీర్ణంకాక గింజలు పేడతో బహిష్కరించబడతాయి. జీర్ణమవ్వని జొన్న, సజ్జ గింజలను పేడలో చూడవచ్చును. నివారణకు మెగ్నీషియం ఆక్సైడ్‌ వంటసోడాల మిశ్రమము ఉపయోగిస్తారు.    

మొనేన్సిన్‌ : దీని వలన కొన్ని లాభాలున్నాయి. రూమేన్లోని సూక్ష్మక్రిములలో మంచివాటిని పెంపు చేస్తుంది. కీటోసిస్‌ వ్యాధి రాకుండ అడ్డుకుంటుంది. మొనేన్సిన్‌ అదనపు శక్తిని అందచేస్తుంది. అదనపు శక్తి బాలింత పశువుల పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇంకా కాక్సీడియోసిస్‌ వ్యాధిని రానివ్వదు.  

అప్టిజెన్‌ : అంతరాయం లేకుండా నత్రజనిని నెమ్మదిగా విడుదల చేస్తూ రూమేన్లోని సూష్మకణ జీవుల వృద్దికి తోడ్పడుతుంది. కొంత మేరకు సోయ, ఆవ తదితర చెక్కలను తగ్గించ వచ్చును. జీర్ణశక్తి పెరిగి ఎక్కువ ఆహారం వినియోగపడుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. దాణా తయారీలో నత్రజని కొరకు యూరియా కలుపుతుంటారు. నత్రజని శాతం పెరిగితే ప్రోటీన్‌ శాతం పరోక్షంగా పెరుగుతుంది. యూరియా తిన్న వెంటనే అమోనియా రక్తంలో అధికంగా కనిపిస్తుంది. తినడం అయిపోయిన తరువాత నత్రజని ప్రాబల్యం ఉండదు. అంటే యూరియా వలన ప్రయోజనం తాత్కాలికం. ఆప్టిజెన్‌ నెమ్మదిగ విడుదల అవ్వడంతో రోజంతా నత్రజని రక్తంలో ఉండడం మూలాన ప్రయోజనం ఎక్కువ సేపుంటుంది.    

ప్రోబయోటిక్స్‌:  ప్రతి ప్రాణి శరీరంలో సూష్మజీవులు మంచివి, హానికరమైనవి ఉంటాయి. వాతావరణం, ఒత్తడి, కాలుష్యం వలన శరీరం పట్టు తప్పినపుడు రోగనిరోధకశక్తి క్షీణించి హానికరమైన జీవుల ప్రభావం పెరిగి వ్యాధులు అంకురిస్తాయి. అలా జరగకుండా కాపాడడానికి మేలుచేసే సూష్మజీవులను మేతలో కలుపుతారు. పులిసిన పదార్ధములు మజ్జిగ, పెరుగు, తర్వాణి మొదలగు వాటిలో మేలు చేయు సూష్మ జీవులు అధికంగా ఉంటాయి.  

ఈస్ట్‌:  రూమేన్లో పీచు పదార్థాన్ని జీర్ణం చేయడానికి కొన్ని ప్రత్యేకతలు కలిగిన సూక్ష్మజీవులుంటాయి. వాటి సంఖ్య పెంచడానికి ఈస్ట్‌ కణాలు సహాయం చేస్తాయి. నెమరు వేయు జంతువుల ఆహారంలో పీచు ఎక్కువ. రొట్టె తయారీలో ఈస్ట్‌ను వాడతారు.

యుక్కా: రక్తంలో, పాలలో నత్రజని తగ్గిస్తుంది. అమ్మోనియా వాయువును అధీనంలో ఉంచుతుంది. రక్తంలో నత్రజని మితిమీరితే గర్భధారణ ఆలస్యమౌతుంది. యూరియా ఎక్కువ మోతాదులో దాణాలో కలపడం వలన దాణా ఖరీదు తగ్గవచ్చును. కాని ప్రత్యుత్పత్తికి ఇబ్బందులొస్తాయి. 

అనయానిక్‌ సాల్ట్స్‌: అమోనియం క్లోరైడ్‌, అమోనియం సల్ఫేట్‌, మెగ్నీషియం సల్ఫేట్‌, కేల్సియం క్లోరైడ్‌ మొదలగునవి పాలజ్వరం రాకుండా అడ్డుకుంటాయి. పాల ఉత్పత్తి ఉధృతంగా ఉన్న సమయంలో రక్తంలో కేల్సియం తగ్గకుండా చేస్తాయి. అవసరమైతే ఎముకలనుండి కాల్షియంను గ్రహించి రక్తంలో నింపుతాయి. రక్తంలో కాల్షియం సమస్థాయిలో ఉంచడానికి పారధార్మోన్‌ హార్మోన్‌ అవసరం. ఆనయానిక్‌ సాల్ట్స్‌ అందుకు ఉపయోగం. బాలింత ఆవు అధికంగా పాలు ఇస్తున్నపుడు రక్తంలోని కేల్సియం పాలద్వారా బయటకు పోతుంది. అలాంటప్పుడు కాల్షియం లోపం జరిగితే పాలజ్వరంతో పాడిపశువు అడ్డం పడుతుంది. 

ఆదరవులు వాడకంలో తెలుసుకోవలసిన విషయాలు: 

1. మన పాడిపశువు సామర్ధ్యం మనకు తెలిసి ఉండాలి. ఎన్ని పాలు ఇస్తుంది. ఎంతకాలం ఇస్తుంది. అన్న విషయాలు తెలియాలి. సాధారణ పశువులపై ఆశలు పెట్టుకుని అంచనాలు పెంచుకుని నిర్ణయాలు తీసుకుంటే భంగపడాలి. 

2. పశువును బట్టి పోషణ ఉండాలి. ఉత్పత్తికి తగ్గ పోషణ ఉందా! లేకుంటే ఎక్కడ లోపం ఉందో తెలుసుకుని లోటుపాట్లు సరిదిద్దుకోవాలి.  

3. పాలన అంటే పాడిపశువు సౌకర్యం ఉండడానికి మనం చేసే ప్రయత్నాలు. అందుకు కావాల్సిన వసతుల ఏర్పాట్లు. గాలి, వెలుతురు, నేల, పరుండే చోటు, తిరగడానికి జాగా, విశ్రాంతి ప్రదేశము, మల మూత్రాల తొలగింపు, దోమల, ఈగల బెడద, అందుబాటులో మేత, శుబ్రమైన నీరు మొదలగునవి. అన్నీ ముఖ్యమే. 

4. ఆరోగ్యంగా ఉన్న పశువే ఉత్పత్తి పెంచగలదు. వ్యాధుల రక్షణకు అవసరమైన టీకాలు వేయించాలి. పొదుగు వాపు, కాళ్ల నొప్పులు పశువుల ఫారంలో అడుగు పెట్టకూడదు. పరిసరాల శుభ్రత పాటించాలి.

5. ప్రత్యుత్పత్తి మెరుగ్గా ఉంటేనే ప్రతి సంవత్సరం ఒక దూడని పెట్టి ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తాయి. పునరుత్పత్తి నిర్విగ్నం గా సాగాలంటే ‘ఎద’ కు వచ్చిన పశువును గుర్తించి సకాలంలో సంపర్కం చేయించడం అవసరం. యజమాని గమనిస్తూ ఉండాలి. 

6. పైన ఉదాహరించిన ఆదరవులన్నిటిని ఆదరించలేము. నిపుణుల సలహాలు తీసుకోవాలి. సలహాలు ఇచ్చేవారికి మన ఫారం పద్ధతులు తెలిసి ఉండాలి. అప్పుడే పూర్తి న్యాయం జరుగుతుంది.

7. మనం తయారుచేసి మేపే మేతలో ఇవ్వన్నీ ఉండవు. బయట నుండి తెచ్చే దాణాలో తయారీదారు తనకు వీలున్న విధానంలో తయారుచేస్తాడు. గనుక మేత పూర్వాపరాలు నాణ్యత తెలియడానికి పరీక్షలు అవసరం. 

8. ఖర్చు పెట్టినపుడు సరిపడా ఆదాయం వచ్చిందా! మనకి నచ్చిందని లేదా ఎవరో చెప్పారని అనవసరపు ఖర్చు చేస్తున్నామా అన్న విషయం తెలుసుకోవడం తెలిసి ఉండాలి.   

పాడి రైతు, పశు పోషకుడు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇదంతా చెప్పడం జరుగుతుంది. ఇక ముందు పాడిపశువులు  ఫారాలలోనే ఉంటాయి. వ్యవసాయ భూములలో వాణిజ్య పంటలు పండుతున్నాయి. మరికొన్నిటిలో భవనాలు, కార్యాలయాలు మొలుస్తున్నాయి. ఇక చిన్నకమతాలెక్కడ సన్నకారు రైతులెక్కడ. రెండు మూడు ఆవులను గేదెలను ఎవరు సాకుతారు. 

పెద్ద సంఖ్యలో భారీ పెట్టుబడులతో పెంచేవారికి కొంతైన అవగాహన ఉండాలి కదా. భవిష్యత్తులో తక్కువ జాగాలో పాడిపశువులను పెంచాల్సి ఉంటుంది. దొరకిన పశుగ్రసాలు వాడాల్సి ఉంటుంది. ఇకమీదట సగటు ఆవులు గేదెలు ఫారాల్లో ఉండవు. నాటు ఆవులు, గేదెలు సంకరజాతి లో మార్పుచెందడం జరిగింది. మనదైన ఒంగోలు, పుంగనూరు, పొడ తూర్పు పాల ఉత్పత్తికి వాణిజ్య పరంగా అనువైనవి కావని తేలింది. వాటిని కొన్ని పరిశోధన కేంద్రాలలో పెట్టి మెరుగు పరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాణిజ్య పరంగా పాల ఉత్పత్తి చేయాలంటే ఆధికంగా ఉత్పత్తి చేయగల ఆవులను, గేదెలను పెంచాల్సి ఉంటుంది. 

అధికంగా పాలు పిండాలంటే …

1. జాతి ముఖ్యం. అందుకనే పాశ్చాత్య జాతులైన జెర్సీ, హోల్స్టీన్‌ ఫ్రిజియన్‌, బ్రౌన్‌ స్విస్‌ జాతులతో మన దేశవాళి పశువులను సంకరం చేస్తున్నాము. 

2. మంచిజాతి పశువుకు అధిక పోషణ చేయాలి. మేత, ఆహారం, పోషక పదార్ధాల ఆవశ్యకతను తెలుసుకున్నాం. మేతతో బాటు శుభ్రమైన మంచి నీరు ఏర్పాటు చేయాలి. 

3. సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పాటు చేయాలి. గాలి, వెలుతురు, నేల, చల్లదనం, సులభంగా తిరగడానికి వీలుండాలి. 

4. ప్రేమ, అభిమానం, ఆదరణ చూపించాలి. అరవడం, కొట్టడం, భయపెట్టడం పనికిరావు. 

5. రోగ నివారణ చేపట్టాలి. టీకాలు వేయించాలి. పొదుగు వాపు, కాళ్ల నొప్పులు, గర్భధారణ ఇక్కట్లు ఫారం లాభాలను కొల్లగొడతాయి. 

6. పాల ఉత్పత్తికి ప్రత్యుత్పత్తి మూలాధారం. ఒట్టిపోయే సమయం తక్కువగా ఉండాలి. ఎక్కువ కాలం పాలు ఇస్తూ ఉండాలి. అలా జరగాలంటే గర్బాధారణ సకాలంలో జరగాలి.

7. యజమాని ద్రుష్టి కేంద్రీకృతమై ఉండాలి. పర్యవేక్షణ, తనిఖీలు తప్పని సరిగా చేస్తుండాలి. 

8. సమాచారాన్ని నమోదు చేసుకుంటూ ఉండాలి. ప్రతి అవుకు సంబంధించిన సమాచారం సమయానికి ఉపయోగిస్తుంది. అది ఎంతో విలువైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. డానికి తోడు అనుభవం తోడైతే ఫారంలో పాల ఉత్పత్తి  అభివృద్ధిపథంలో నడుస్తుంది.    

ఇంతవరకు పోషణకు సంబంధించి మేత పరమైన విషయాలు తెలుసుకున్నాం. తదుపరి విషయం ప్రత్యుత్పత్తి. మున్ముందు తెలుసుకుందాం.  డా. నాగేశ్వరరావు, ఫోన్‌: 96521 05405

Read More

పాలకల్తీ గుర్తింపు, నివారణ

ఒకప్పుడు పసిపాపలు, రోగులు, వృద్ధులకు అవసరమైన పాలను కల్తీచేయుట మహాపాపమని మన పూర్వీకులు భావించేవారు. కానీ సమాజంలో స్వార్థము, ధనకాంక్ష పెరిగి నైతిక విలువలు క్షీణిస్తున్నకొద్దీ ప్రజల నిత్యావసరమైన పాలను నీరు మరియు వివిధ ఇతర పదార్థాలు, రసాయనాలను కలిపి కల్తీ చేసి విక్రయించే వాణిజ్య విషసంస్కృతి పెరిగిపోతూ ఉంది. వివిధ రకాల కల్తీలను వ్యాపారులు కనిపెడ్తూవుండగా, వాటిని కనుగొని, గుర్తించి నియంత్రించే సాంకేతిక విధానాలను కూడా మన శాస్త్రజ్ఞులు ఆవిష్కరిస్తూనే ఉన్నారు. పాలలోని విలువైన పోషక ఘనపదార్థాలైన వెన్న, వెన్నకాని పదార్థాలను వివిధ మార్గాల ద్వారా తొలగించి, పాల విలువను, నాణ్యతను తగ్గించుట కూడా కల్తీ క్రిందనే భావించబడ్తుంది. అముల్‌, విజయ, విశాఖ వంటి పేరెన్నికగన్న బ్రాండ్ల పాలు, పాల పదార్థాలకు నకిలీ బ్రాండ్లు తయారు చేసి మార్కెట్లో విక్రయించుట ద్వారా ట్రేడ్‌ మార్క్‌ చట్టానికి సైతం తూట్లు పొడుస్తున్న నకిలీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపవలసిన ప్రభుత్వం ఆశించిన స్థాయిలో తనవంతు పాత్రను నిర్వహించకపోవుట దురదృష్టకరము.

పాల కల్తీ వల్ల ముప్పు – ఎలా?

1. వినియోగదారుడు కొనుగోలు చేసిన పాలలో ఉండవలసిన పరిమాణంలో పోషక నపదార్థాలు తగ్గిపోవుట వల్ల ఆర్థికపరమైన నష్టము

2. పాల మీద ఆధారపడే పసిపిల్లలు, వృద్ధులు, రోగులకు అందవలసిన స్థాయిలో పోషకాలు అందనందువల్ల ఎదురయ్యే పోషకాహార లోపాలు

3. అనేక అంటురోగక్రిములు కలిగిన మురుగు-అశుభ్రమైన నీటితో కలుషితమైన నీటితో కల్తీ చేయబడిన పాలు మరియు సీసము, నైట్రేట్‌, మెర్క్యూరీ వంటి పారిశ్రామిక వ్యర్థాలను కలిగిన నీటితో కల్తీ చేయబడిన పాలమీద దీర్ఘకాలం ఆధారపడే వినియోగదారులు తీవ్రమైన అనారోగ్యాలకు గురౌతున్నారు. 

4. పచ్చి పాలను ఎక్కువ గంటలు-రోజులు నిల్వ ఉంచాలనే దురుద్దేశంతో ఫార్మలిన్‌ యాంటీబయోటిక్స్‌, సోడాబైకార్బొనేటు (వంటసోడా), డైక్రొమేట్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, ఫినాయిల్‌, యూరియా, డిటర్జంటు వంటి ప్రమాదకరమైన రసాయనాలను కలుపుట. కల్తీకి వినియోగించే కొన్ని పదార్థాలు కిడ్నీ, చర్మం, ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధులే కాక కాన్సర్స్‌ను కలిగించి ప్రాణాలకే ముప్పు తేవచ్చును.

5. వివిధ రకాల అన్యపదార్థాలతో పాలను కల్తీ చేయుట వల్ల పాలు సహజమైన రుచి, వాసన, నాణ్యతలను కోల్పోవటమేకాక ఈపాలతో చేసిన పాలపొడి పెరుగు, మజ్జిగ, కోవా, వెన్న, నెయ్యి వంటి పదార్థాల నాణ్యత కూడా క్షీణిస్తుంది. కొందరు వెన్న తీయగా వచ్చిన ‘వే’ ద్రవాన్ని పాలలో కల్తీ చేసి నీళ్ళు కిసిన పాలలో ఎస్‌.ఎస్‌.ఎఫ్‌ శాతాన్ని పెంచే కుతంత్రాలు కూడా పాల్పడవచ్చు. ఇందువల్ల పాలు విరిగిపోకుండా ఇతర రసాయనాలను కలిపి జాగ్రత్తపడ్తూ ఉంటాయి.

6. వివిధ రుతువుల మధ్య పాల ఉత్పత్తిలో భారీ వ్యత్యాసాలు కనిపించే గేదె పాడి ప్రాంతాలలో, పాల కొరత మరియు గిరాకీలు ఎక్కువగా ఉండే రోజులలో ముఖ్యంగా వేసవిలోనూ, పెళ్ళిళ్లు, జాతరలు, ఇతర పర్వదినాల సందర్భాలలో కల్తీ సమస్య మనకు ఎక్కువగా కనిపిస్తుంది.

వివిధ రకాల కల్తీలు:

నీటితో పాలను కల్తీ చేయుట:  పచ్చి పాలను సన్నని ధారగా గ్లాసు మీదగానీ స్టీల్‌ ప్లేటు మీదగానీ వీలుగా జారవిడిస్తే నీరు కలిసిన పాలలో లోపించిన చిక్కదనం స్పష్టంగా కనిపిస్తుంది. పాలలో సహజంగా ఉండవలసిన కనీస వెన్న (గేదెపాలు 6 శాతం – ఆవుపాలలో 3.0 శాతం) వెన్న కాని పదార్థం (గేదెపాలు 9.0 శాతం – ఆవుపాలలో 8.5శాతం) లేకపోవడాన్ని లాక్టోమీటరు మరియు బ్యుటిరోమీటరు లేదా ఎలక్ట్రానిక్‌ మిల్క్‌ టెస్టింగ్‌ మిషన్ల ద్వారా సులువుగా కనుగొనవచ్చును. అయితే పాలలో అత్యంత తేలికగా ఉండే వెన్నను (క్రొవ్వును) తొలగించి, ఆ తర్వాత అదేపాలను కొంత నీటితో కల్తీ చేస్తే పాల సాంద్రత అంతగా మారకపోవచ్చును. ఇటువంటి ద్విముఖ మోసాల పట్ల కూడా వినియోగదారులు జాగ్రత్తపడాలి. పాల విక్రయస్థాయిలో పాలప్యాకెట్ల నుండి సిరంజిలతో పాలను తస్కరించి నీటితో భర్తీ చేసే సంఘటనలు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి.

ఆవుపాలలో, నీటితోపాటు గేదె పాలను కలిపి విక్రయించుట

పర్వదినాలలో ఆవుపాలు అవసరమైన వినియోగదారులకు ఆవుపాలతో, గేదెపాలతోనే కాక నీటితో కొందరు కల్తీ చేసి విక్రయిస్తున్నారు. అనేక డెయిరీలు ఆవుపాల ఉత్పత్తిని ప్రోత్సహించుటకు ఆవుపాలలోని ఘనపదార్థాలకు అదనపు ధరను చెల్లిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఇటువంటి సందర్భాలలో నీళ్లతోపాటు గేదెపాలతో ఆవు పాలను కల్తీ చేయడాన్ని హంసటెస్టు అనే సులువుగా క్షేత్ర స్థాయిలోనే నిముషాలలో జరుపగల సీరం టెస్టింగుతో గుర్తించవచ్చును.

ఇటీవల ఆర్గానిక్‌ దేశీ ఆవుపాలకు గేదె పాలకంటే రెట్టింపు ధర పలుకుతోంది. దీనిని ఆసరాగా తీసుకొని దేశీఆవుపాలలో విదేశీ ఆవుల పాలను, గేదె పాలను, నీటిని, కొన్ని సందర్భాలలో పసుపు నీటిని కలిపి మోసాలు చేస్తున్నారు. నీరుతోపాటు పశువుల మూత్రం, తెల్ల పెయింట్‌, రిఫైన్డ్‌ ఆయిల్‌, ఆల్కలీ యూరియా, డిటర్జంట్‌, మెలామిన్‌ వంటి ప్రమాదకరమైన రసాయన పదార్థాలను చక్కెర, వంటనూనెలు, జంతువుల క్రొవ్వులు, నీటితో కలిపి కృత్రిమ పాలుగా చేసి, అసలు పాలతో కలిపి మార్కెట్లో విక్రయిస్తూ అత్యంత ఏహ్యమైన మోసాలకు కూడా కొందరు పాల్పడుతున్నారు. ఇటువంటి పాలకు సహజమైన, రంగు, రుచి, వాసనలు ఉండవు. ఈ పాలు సాధారణ గది ఉష్ణోగ్రతలో సైతం 6-7 గంటలు పులిసిపోకుండా, విరిగి పోకుండా, తోడు పెడితే పెరుగుగా మారకుండా ఉంటాయి. అనుమానించిన వెంటనే ఈ పాల నమూనాలను సంబంధిత కల్తీ నిరోధక శాఖ అధికారులకు పాల నమూనాతో సహా ఫిర్యాదు చేస్తే, వారు కొన్ని రసాయన పరీక్షలు, ఎలీసా, ఫేజ్‌, పి.సి.ఆర్‌. వంటి సీరమ్‌ పరీక్షలు మరియూ లిక్విడ్‌ క్రొమాటోగ్రాపీ వంటి ఆధునిక పరీక్షలు జరిపి కల్తీని నిర్ధారించగల్గుతారు. 

కల్తీలను గుర్తించే విధానాలు: 

పాలలో సహజంగా ఉండవలసిన నీటి శాతం కంటే ఎక్కువ ఉంటే పాలసాంద్రత తగ్గిపోతుంది. దీనిని సాధారణంగా లాక్టోమీటరుతో గుర్తించవచ్చు. ఇప్పుడు చాలా పాల సేకరణ కేంద్రాలలో వెన్న శాతంతో పాటు వెన్నకాని పదార్థాల (ఎస్‌.ఎన్‌.ఎఫ్‌)ను కూడా సులువుగా తెలుసుకునే ఎలక్ట్రానిక్‌ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. సరియైన పద్ధతిలో పాల నమూనా సేకరించి, ఖచ్చితమైన పరిమాణంలో టెస్టింగ్‌లో వాడితే పాలలో వెన్న-వెన్న కాని పదార్థాలను సులువుగా తెలుసుకోగలము.

కాలం వల్ల (ఏజింగ్‌) నాణ్యతను కోల్పోయే పాలను వాసనతో కనుగొనుట సాధ్యమే అయినప్పటికీ, ఎలక్ట్రానిక్‌ ముక్కు అనే పరికరంతో పరిమాణపూర్వకంగా ఖచ్చితంగా తెలుసుకోగలము.

ఆవుపాలలో గేదె పాలను కల్తీ చేయడాన్ని హంస టెస్టు ద్వారా ఒక నిముషంలో గుర్తించవచ్చును. పాలు:డిస్టిల్డ్‌వాటరు 1:10 నిష్పత్తిలో కలిపి, గ్లాసుస్లైడ్‌ మీద ఒక బొట్టు (చుక్క) వేసి, దీనితో హంస టెస్టు రియేజంటును కలిపితే పాల తరకలు అరనిముషంలో ఏర్పడితే ఆవుపాలలో గేదెపాలు కలిసినట్లు నిర్ధారణ అవుతుంది. 

చెక్కెరతో పాల కల్తీ: 5 మిల్లీలీటర్ల పాల నమూనాలో ఒక మిల్లీ లీటరు గాఢ హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం మరియు 0.1 గ్రాము రిసోర్సినాల్‌ కలిపి, టెస్ట్‌ట్యూబును నీళ్లలో ఉంచితే, పాలనమూనా ఎర్రగామారితే ఈ విధమైన కల్తీ నిర్ధారణ అవుతుంది.

గంజి-పిండి వంటి పదార్థాలతో పాలు కల్తీ జరిగితే 5 మిల్లీ లీటర్ల పాలనమూనాకు ఒక చుక్క 0.1 శాతం అయొడిన్‌ ద్రావణం కలిపితే నీలంరంగు కనిపిస్తే ఈ రకమైన కల్తీల నిర్ధారణ జరుగుతుంది.

ఫార్మలిన్‌ కలిసిన పాలను గుర్తించుట: టెస్ట్‌ట్యూబ్‌లో 10 మిల్లీలీటర్ల నమూనాను తీసుకుని దానికి 5 మిల్లీలీటర్లు గాఢ సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని, కొంచెం ఫెర్రిక్‌ క్లోరైడ్‌ను కలిపి, కదల్చకుండా ఉంచితే కొంతసేపటికి ఊదారంగు లేదా నీలంరంగు వలయం రెండు ద్రవాల మధ్య కనిపిస్తే అది ఫార్మలిన్‌ కల్తీని నిర్ధారిస్తుంది.

యూరియా గుర్తింపు: టెస్ట్‌ట్యూబ్‌లో 5.0 మిల్లీలీటర్ల నమూనాను తీసుకొని దానికి సమాన పరిమాణంలో పి-డైమిథైల్‌ ఎమైనోబెంజాల్‌డిహైడ్‌ రియేజెంటును కలిపినప్పుడు స్పష్టమైన పసుపురంగుకు మారితే యూరియా ఆ నమూనాలో ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.

బోరిక్‌ పౌడరు, బోరాక్స్‌ గుర్తింపు: టెస్ట్‌ట్యూబ్‌లో 5 మి.లీ. నమూనాకు 1.0 మి.లీ. గాఢ హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని కలిపి అందులో టర్మరిక్‌ పేపరును ముంచితే, ఆ పేపరురంగు పసుపు నుండి ఎర్రగా మారుతుంది.

డిటర్జంటును గుర్తించుట: టెస్ట్‌ ట్యూబులో 5.0 మి.లీ. పాల నమూనాను తీసుకొని దానికి 0.1 మి.లీ. 0.5% బ్రోయోక్రిసాల్‌ పర్సుల్‌ ద్రావణాన్ని కలిపినప్పుడు ఊదారంగు కనిపిస్తే అది డిటర్జంటు ఉనికిని స్పష్టం చేస్తుంది.

అధిక పాల దిగుబడికి, చేపుకు కొందరు పాలు పిండే ముందు చేపు ఇంజక్షను (ఆక్సిటోసిన్‌) అనే ఇంజక్షను ఇస్తారు. ఈ హార్మోను అవశేషాలు పాలద్వారా ప్రతిరోజూ అదే పాల మీద ఆధారపడే వినియోగదారుల ఆరోగ్యాలను పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇటువంటి అక్రమాలు మన దృష్టికి వస్తే స్థానిక వైద్యశాఖ/ఆహారకల్తీ నివారణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి.

నాణ్యమైన పాలపొడి, ద్రవరూపంలోని పాలలోని నీటిని, వెన్నను వివిధ శాస్త్రీయ మార్గాల ద్వారా తొలగిస్తేనే తయారవుతుంది. పాలను పొడి రూపంలో దీర్ఘకాలం నిల్వ చేసి, అవసరమైనప్పుడు స్టెరిలైజ్‌ చేసిన నీరు, పాశ్చురైజ్‌ చేసిన పాలు, వెన్ననూనె (బటర్‌ ఆయిల్‌)తో నిర్ణీత ప్రమాణాలలో కలుపుటను కల్తీగా భావించకూడదు. పాలలో సహజంగా ఉండవలసిన వెన్న, వెన్నకాని పదార్థాలు తప్ప, అన్యపదార్థాలు పాలలో కనిపించకూడదు.

పాలలోని వెన్న-వెన్నకాని పదార్థాల శాతాలను బట్టి పాలను స్కిమ్డ్‌మిల్క్‌ (వెన్న లేని పాలు) డబుల్‌ టోన్డ్‌ మిల్క్‌ 1.5 శాతం వెన్న, టోన్డ్‌ మిల్‌ (3.0 శాతం వెన్న) స్టాండర్డ్‌ మిల్క్‌ (4.5 శాతం వెన్న) హోల్‌ మిల్క్‌ (6.0 శాతం వెన్న) గా వివిధ డెయిరీలు వేర్వేరు ధరలకు విక్రయించుటను చట్టప్రకారం అనుమతించబడింది.

పైన పేర్కొన్న వివిధ కల్తీ గుర్తింపు పరీక్షలు మనకు కల్తీ జరిగినట్లు అనుమానించుటకు తప్ప నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు సరిపోవు. అనుమానితులపై జిల్లా కలెక్టరు, స్థానిక సంస్థ (పంచాయతీ-మున్సిపాలటీ, కర్పొరేషన్‌)ల అధికారులకు, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదును అవసరమైతే తాజా పాలనమూనాతో పాటు సమర్పించి చట్టపరంగా దోషుల్ని కోర్టు ఉత్తర్వుల ద్వారా శిక్షించవచ్చును.  

డా. ఎం.వి.జి. అహోబలరావు, 9393055611

Read More

వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో  పశువులకు   సంపూర్ణ సమీకృత ఆహార తయారీ

మనదేశంలో వ్యవసాయ సంబంధిత ఆర్థికాభివద్ధికి పశుసంపద పాత్ర చాలా ముఖ్యమైనది. మన దేశంలో పశుసంపద సమృద్ధిగా ఉంది. సన్నకారు రైతులు, భూమిలేని నిరుపేదలు సంవత్సరం పొడవునా ఆదాయం పొందాలంటే, పశువులకు ఆహారం సంవత్సరం పొడవునా లభించాలి. మనదేశంలో పశుగ్రాసాల సాగు 4 శాతం భూవిస్తీర్ణంలో మాత్రమే జరుగుతుంది. దీనివలన సంవత్సరం పొడవు పశుగ్రాసాలు దొరకడం లేదు. మన దేశంలో ఉన్న పశుసంపదకు కావలసిన దానికి 43 శాతం దాణా దినుసులు, 44 శాతం ఎండుమేత, 38 శాతం పచ్చిమేత తక్కువగా లభ్యం అవుతూన్నాయి. దీనికి కారణాలేమిటంటే, దేశ జనాభా పెరగడం, పశువుల సంఖ్య పెరగడం, పంట భూముల విస్తీర్ణం పెరగడం, ఉన్న పంటభూముల మీద ఆహారధాన్యాల ఉత్పత్తి కొరకు వత్తిడి పెరగడం, అధిక లాభం కొరకు వాణిజ్య పంటలు పండించటం మొదలగునవి.

పై కారణాలవల్ల పచ్చిక బయళ్ళ విస్తీర్ణం మరియు పశుగ్రాసాల సాగు తగ్గాయి. అందే సమయంలో ఆహార పంటలు, వాణిజ్య పంటల విస్తీర్ణం పెరగడం వల్ల వ్యవసాయ వ్యర్థ పదార్థాల ఉత్పత్తి ఎక్కువ అయ్యింది. ప్రస్తుతం భారతదేశంలో సుమారుగా 50 కోట్ల టన్నుల వ్యవసాయ వ్యర్థ పదార్థాలు లభ్యమవుతున్నాయి. వీటినే సాంప్రదాయేతర ఆహార పదార్థాలు అని కూడా అంటారు. తగ్గిన పచ్చిక బయళ్ళు, పశుగ్రాసాల సాగు వల్ల సాంప్రదాయేతర ఆహార పదార్థాలను పశువుల మేతగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప, సజ్జ చొప్ప, కంది కట్టె, ప్రత్తి కట్టె, మొక్కజొన్న కండెలు, ప్రొద్దు తిరుగుడు కట్టె, గింజలు తీసిన ప్రొద్దు తిరుగుడు పూలు మొదలగునవి మనకు సాధారణంగా వ్యవసాయంలో లభించే వ్యర్థ పదార్థాలు.

ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను పశువుల ఆహారంలో సంపూర్ణ సమీకృత ఆహారంలో నిర్ధిష్ట పరిమాణంలో ఇచ్చి పాలు, మాంసాన్ని చౌకగా ఉత్పత్తి చేయవచ్చు.

వ్యవసాయ వ్యర్థ పదార్థాలను, సాంప్రదాయేతర పదార్థాలను ఒక నిర్దిష్ట పరిమాణంలో మాత్రమే దాణాలో వినియోగించాలి. ఎందుకంటే వాటిలో పీచుపదార్థాన్ని లిగ్నిన్‌ ఎక్కువగా ఉండి పశువు తినడానికి ఇష్టపడదు. వాటిలో పోషక విలువలు కూడా తక్కువగా ఉంటాయి. కొన్నింటిలో విషపదార్థాలు ఉండి వాటి వినియోగాన్ని తగ్గించడం కాకుండా పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

వాటిని పశువుల ఆహారంగా మార్చడానికి వివిధ పద్ధతులు కలవు. అందులో ముఖ్యంగా వ్యర్థ పదార్థాలను కత్తిరించి మేపడం గాని, పొడి చేయడం ద్వారా గాని, గుళికల రూపంలో అందించవచ్చు. ఈ పద్ధతులే కాకుండా వ్యర్థ పదార్థాలను సుపోషకం చేయడానికి వివిధ పద్ధతులున్నాయి. అందులో భాగంగా సోడియం హైడ్రాక్సైడ్‌ రసాయన ద్రావణంతో పిచికారి చేసి మగ్గనివ్వడం ద్వారా గాని, మరొక పద్ధతిలో 4 శాతం యూరియా ద్రావణంతో పిచికారీ చేసి, 30 రోజులు గాలి చొరబడకుండా మగ్గనివ్వాలి. దీని వల్ల వ్యర్ధపదార్ధాలు సులభంగా జీర్ణమవడమే కాకుండా, నత్రజని శాతం పెరుగుతుంది. ఈ పద్ధతి శాస్త్రీయ పరంగా మంచి పద్ధతి అయినా, అంతగా ప్రాచుర్యం పొందలేదు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యర్ధ పదార్థాలను ఈ పద్ధతిలోని లోపాలను అధిగమిస్తూ, సులభంగా సంపూర్ణ సమీకృత ఆహారంగా మార్చుకోవచ్చు. ఈ సమీకృత ఆహారంలో వ్యవసాయ వ్యర్ధ పదార్థాలను, సాంప్రదాయేతర మరియు సాంప్రదాయ బద్ధంగా శక్తిని మరియు మాంసకృత్తులనిచ్చే దాణా దినుసులను నిర్ణీత పరిమాణంలో లేదా నిష్పత్తిలో కలిపి పశువులకు కావలసిన అన్ని పోషక పదార్థాలను చాలినంతగా లభించేటట్లు తయారు చేయవచ్చు.

ఈ ఆహారం తయారీలో, ఎండుమేతతో సహా, అన్ని దాణా దినుసులను పొడిగొట్టే యంత్రంతో పొడిచేసి, మిశ్రమం చేసే యంత్రంలో పంపుతారు. కొద్ది మోతాదులో వాడే దినుసులను ప్రిమిక్సుగా తయారు చేస్తారు. ప్రిమిక్స్‌తో పాటు 70 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వరకు వేడి చేసిన మొలాసిస్‌ (బెల్లపు మడ్డి)ను కూడా తగిన మోతాదులో మిశ్రమ యంత్రంలో వేసి 10 నిమిషాల పాటు అన్ని పదార్థాలు బాగా కలియునట్లు కలుపుతారు. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమ ఆహారాన్ని సంపూర్ణ సమీకృత ఆహారం అని అంటారు. పొడి రూపంలో తయారైన ఆహారాన్ని పశువులకు పెట్టవచ్చు లేదా గుళికల రూపంలోకి మార్చి కూడా ఆహారంగా అందించవచ్చు.

సంపూర్ణ సమీకృత ఆహారం వల్ల ఉపయోగాలు

  • సాంప్రదాయేతర, వ్యవసాయ వ్యర్థ పదార్థాల వినియోగం పెంచడానికి వీలవుతుంది.
  •  పశువులకు కావలసిన అన్ని పోషక పదార్థాలు సరియైన పాళ్ళలో లభిస్తాయి.
  • మేత వృథా కాదు.
  • మేతను తేలికగా జీర్ణం చేసుకోగలుగుతాయి.
  •  పశువు తీసుకునే ఆహారం 10 నుంచి 20 శాతం పెరుగుతుంది.
  •  రవాణా చేయడం, నిల్వ చేయడం చాలా తేలిక.
  • పశువులు తమంతట తాముగా ఆహారాన్ని వెదికి ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు.
  • వేసవి కాలం, వరదలు, అనావృష్టి పరిస్థితుల్లో ఇవి సరైన ప్రత్యామ్నాయ ఆహారం.
  • పాల దిగుబడి రోజుకి పెరుగుతుంది.
  • గొర్రెలలో 10-15 శాతం ఎక్కువ పెరుగుదల వస్తుంది.
  • దాణా ఖర్చు 15-20 శాతం తగ్గుతుంది.
  • గొర్రె పిల్లల్లో 100-140 గ్రా. వరకు ప్రతిరోజు పెరుగుదల పొందవచ్చు.
  • మాంసం నాణ్యత కూడా పెరుగుతుంది.
  • దూడలు రోజుకు సగటున 500 నుండి 700 గ్రాముల వరకు బరువు పెరగవచ్చు.

సంపూర్ణ సమీకృత ఆహారంలో వ్యవసాయ వ్యర్థపదార్థాల పాళ్ళ వివరాలు

  • జొన్నచొప్ప / మొక్కజొన్న 50
  • ప్రొద్దుతిరుగుడు కట్టె 40
  • ప్రొద్దుతిరుగుడు పూలు 50
  • గోధుమ చొప్ప 50
  • ఎండిన చెట్ల ఆకులు 50-70
  • వరిగడ్డి 50
  • ప్రత్తి కట్టె 45
  • సోయా కట్టె 50
  • ఆయిల్‌ పామ్‌ పీచు 30
  • చెరకు పిప్పి 20

పెరిగే దూడలకు సంపూర్ణ ఆహారం

ఆహార పదార్థం                సంపూర్ణ దాణా (కిలోలు)

                                1          2        3        4

మొక్కజొన్న కంకులు40
ప్రొద్దుతిరుగుడు పువ్వులు40
చెరకు పిప్పి40
పత్తి కట్టె40
మొక్కజొన్న గిoజలు15102330
వేరుశనగ గానుగ చెక్క10101014
పత్తి గింజల గానుగ చెక్క5.0
నూనె తీసిన వరి తవుడు22.528.59.0
మొలాసిస్‌1010108
యూరియా1.01.00.5
గోధుమ తవుడు4.5
ఖనిజ లవణాల మిశ్రమం1.01.01.02.0
ఉప్పు0.50.51.01.0
విటమిన్ల మిశ్రమం10గ్రా.10గ్రా.10గ్రా.10గ్రా.
మొత్తం100100100100
     

దూడలు రోజుకు సగటున 500 నుంచి 700 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి.

పాడి పశువులకు సంపూర్ణ ఆహారం

ఆహార పదార్థం                సంపూర్ణ దాణా (కిలోలు)

                                          1          2          3          4

మొక్కజొన్న కంకులు28.5
ప్రొద్దుతిరుగుడు పువ్వులు40
 పత్తి కట్టె30
 చెరకు పిప్పి28.5
మొక్కజొన్న గిoజలు19.019.024.024.0
వేరుశనగ గానుగ చెక్క13.013.012.59.0
పత్తి గింజల గానుగ చెక్క5.06.0
నూనె తీసిన వరి తవుడు26.026.08.05.0
మొలాసిస్‌12.012.08.010.0
యూరియా0.50.5
గోధుమ తవుడు9.06.5
ఖనిజ లవణాల మిశ్రమం1.01.02.02.0
ఉప్పు0.50.51.01.0
విటమిన్ల మిశ్రమం10గ్రా.10గ్రా.10గ్రా.10గ్రా.
మొత్తం100100100100
     

పాల దిగుబడి రోజుకు 8 నుంచి 10 లీటర్లు.

పై విధంగా తయారు చేసుకున్న సంపూర్ణ సమీకృత ఆహారాన్ని దూడలకు వాటి శరీర బరువులో 3-4 శాతం మరియు పాడి పశువులకు 2.5-3.0 శాతం మేపినట్లయితే పైన సూచించిన విధంగా వాటి బరువు పెరుగుదల, పాల దిగుబడి పొందవచ్చు. అలాగే రైతులు వ్యవసాయ వ్యర్థాలను వాడుకొని పశుపోషణ ఖర్చు తగ్గించుకోవచ్చు.  

డా|| రమేష్‌బాబు పి., అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, & హెడ్‌, యానిమల్‌ న్యూట్రిషన్‌ విభాగం,

పశువైద్య కళాశాల, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,

ప్రొద్దటూరు – 516 360.

ఇ-మెయిల్‌:drrameshbabu4u@gmail.com

Read More