పశువులలో వచ్చే బ్యాక్టీరియల్‌ వ్యాధులు

పశువులలో వచ్చు అతి ముఖ్యమైన బ్యాక్టీరియల్‌ వ్యాధులు క్షయ వ్యాధి. జోన్స్‌ వ్యాధి, ఆక్టినోమైకోసిస్‌, ఆక్టినో బాసిల్లాసిస్‌, ఆంత్రాక్స్‌, హిమరేజిక్‌ సెప్టిసీమియ బ్రుసెల్లోసిస్‌ మరియు క్లాస్ట్రీడియల్‌ వ్యాధులు.

క్షయవ్యాధి: దీనినే ట్యూబర్‌క్యులోసిస్‌ అందురు. ఇది మైకోబ్యాక్టీరియం అను వ్యాధి కారకము ద్వారా వస్తుంది. ఇది వ్యాధిగ్రస్త పశువుల పాలు వాటి దూడలు త్రాగుటవలన దూడలలో మరియు శ్వాస ద్వారా కూడ వ్యాపించును. వ్యాధిగ్రస్త పశువులు రోజు రోజుకు కృషించిపోవుట, పౌష్టికాహారము తీసుకున్నప్పటికి ఆరోగ్యం క్షీణించి పోవుట, తెమరుతో కూడుకొనిన మరియు విపరీతమైన దగ్గు వంటి లక్షణాలను కలిగి ఉండును.

జోన్స్‌ వ్యాధి : దీనినే పారాట్యుబర్‌ క్యులోసిస్‌ అని కూడా అందురు. ఇది మైక్రోబ్యాక్టీరియా పారాట్యుబర్‌ క్యులోస్‌ అను వ్యాధి కారకము ద్వారా కలుగును. కలుషిత ఆహార పదార్థాల ద్వారా వ్యాధి వ్యాప్తి జరుగును. వ్యాధి గ్రస్త పశువులు శారీరకంగా కృషించిపోవుట, పాలదిగుబడి తగ్గిపోవుట అబార్షన్స్‌, అధిక దాహరం ఉండి దుర్వాసన లేని, సాఫ్ట్‌గా మరియు పలుచగ విరోచనాలు ఉండును. సాధారణంగా జ్వరము ఉండదు.

ఆక్టినోమైకోసిస్‌ : దీనినే లంపీజా అని కూడా అందురు. ఆక్టినోమైసిస్‌బోవిస్‌ అను వ్యాధి కారకము సాధారణంగా పశువుల నోట్లో ఉండి, ఎప్పుడైన నోట్లో గాయాలైనపుడు, పళ్ళు వచ్చేటపుడు, ఈ వ్యాధి కారకము. ఆయా భాగాలలో చేరి వ్యాధిని కలుగజేయును. వ్యాధి లక్షణాలు, తొలిథలో క్రింది దవడ బయటివైపున నొప్పిలేని గడ్డలుగా వచ్చును. క్రమేన ఈ గడ్డలలో పసుపు పచ్చని, చిక్కని శ్లేష్మముతో కూడిన చీము చేరి, ఆ భాగము నొప్పిని కలిగించును. ఈ గడ్డలలో సల్ఫర్‌ గ్రాన్యూల్స్‌ అను పసుపు పచ్చని సూక్ష్మకణికలుంటాయి. ఈ వ్యాధితో బాధపడే పశువులు ఆహారం తీసుకోలేక, నీరసించిపోయి, నోటిలో దుర్వాసన మరియు పళ్ళు పదులైపోవుట, లాలాజలం / చొంగ ఎక్కువ కారుట వంటి లక్షణాలను చూపును. 

ఆక్టినోబాసిల్లోసిస్‌ : దీనినే ఉడన్‌ టంగ్‌ లేదా నాలుక వాపు వ్యాధి అని కూడా అందురు. ఈ వ్యాధి కారకము అనగా ఆక్టినోబాసిల్లస్‌ లిగ్నిరేసి, లంపీజా కారకము మాదిరిగానే పశువు నోట్లో ఉండి, నోట్లో ఏవైన గాయాలు అయినపుడు, ఆ గాయము యొక్క ప్రదేశాన్ని చేరి వ్యాధిని కలిగించును. వ్యాధి లక్షణాలు ముఖ్యంగా అతిగా వాచిపోయి, గట్టిగా మారిన నాలుక మరియు ఇది నోటి నుండి బయటకు వేలాడుతుంది. అందువలన పశువు నోటిని పూర్తిగా మూయలేకపోవుట జరుగును. అంతేగాక లాలాజలం అధికంగా కారుట, శ్వాస తీసుకొనుట కష్టంగా ఉండి, నాలుకపైన పుండ్లు ఏర్పడి, వాటి నుండి చీముతో కూడిన పసుపు పచ్చని స్రావాలు కలిగి, సల్ఫర్‌ గ్రాన్యూల్స్‌ని కలిగి ఉండును. 

ఆంత్రాక్స్‌ : దీనినే దొమ్మరోగము, ఊల్‌ సార్టర్స్‌ వ్యాధి, స్లీనిక్‌ ఫీవర్‌ అని కూడా అందురు. ఇది బాసిల్లస్‌ ఆంత్రాసిస్‌ అను వ్యాధి కారకము వలన కలుషిత పదార్థాలను తినటం వలన, కలుషిత గాలి పీల్చుట ద్వారా వ్యాపించును. ఈ వ్యాధిసోకిన పశువులు మరణాల బారినపడుతూ, అధిక ఉష్ణోగ్రత అనగా 107ఓFగా ఉండును. అంతేకాక గడ్డకట్టని, టారీ రంగులో ఉండే రక్తము అన్ని సహజ రంధ్రాలనుంచి కారుట చూడవచ్చును. ఈ యొక్క వ్యాధి సోకిన మరియు వ్యాధి లక్షణాలను చూపిన పశువులలో శవ పరీక్షలో పశువులను తెరువకుండా జాగ్రత్తగా డిస్పోజ్‌ చేయవలెను. ఎందుకనగ ఈ వ్యాధి సోకిన పశువులను కాని, వాటి ఉత్పత్తులను కాని తాకినపుడు మనుషులలో సోకును. ఈ వ్యాధి సోకిన మనుషులలో మాలిగ్నెంట్‌ పుస్ట్యూల్స్‌ లేదా మాలిగ్నెంట్‌ కార్బంకుల్స్‌ అనునవి శరీరంపై రావటం, ఊపిరితిత్తుల వ్యాధిని కలిగి ఉండటం చూడవచ్చును.

గొంతువాపు వ్యాధి: దీనినే హిమరేజిక్‌ సెప్టిసీమియా లేదా షిప్పింగ్‌ ఫీవర్‌ అని కూడా అందురు. ఇది పాశ్చురెల్లా మల్టోసిడా అని కారకము ద్వారా వచ్చును. ఈ కారకము పశువు శ్వాస నాళంలో జీవిస్తూ, కరువు కాటకాలు, తుఫానులు, అధిక దూరాలు రవాణా చేయునపుడు, పశువు ఒత్తిడికి గురైనపుడు ఈ కారకము ఊపిరితిత్తులను చేరి వ్యాధిని కలిగించును. ఈ వ్యాధి సోకిన పశువులు అధిక జ్వరము అనగా 104-106 ఓF ఉండి, భ్రాంకోన్యుమోనియా, కష్టంగా శ్వాస తీసుకోవటం వంటి వ్యాధి లక్షణాలను కలిగి ఉండును.

క్లాస్ట్రీడియల్‌ వ్యాధులు: ఇందులో అతి ముఖ్యమైనవి జబ్బువాపు వ్యాధి మరియు ఎర్రమూత్ర వ్యాధి. జబ్బు వ్యాధినే బ్లాక్‌లెగ్‌ లేదా నల్ల జబ్బు అనువు కూడా అందురు. వ్యాధి కారకము క్లాస్ట్రీడియంతో పైగా ఉండును. ఇది కలుషిత ఆహారము, గాయాల ద్వారా వ్యాప్తి చెందును. 6 నెలల నుండి 2 సంవత్సరాల వయస్సుగల పశువులలో చూడవచ్చును. ఈ వ్యాధి సోకిన పశువులు చనిపోయి కనిపించడం, 106 ఓF జ్వరము, కుంటుట, కండరాల వాపు, ముఖ్యంగ జబ్బు వాచిపోయి, ముట్టినపుడు నొప్పి కలుగకుండ ఉండి కిర్‌కిర్‌మను క్రిపిటేటింగ్‌ శబ్దాలు వచ్చును. బ్యాసిల్లరీ హీమోగ్లోబినూరియా లేదా ఎర్రమూత్ర వ్యాధి క్లాస్ట్రీడియం హీమోలైటికమ్‌ అను కారకము ద్వారా కలుగును. దీనివలన పశువు శరీర ఉష్ణోగ్రత 104-107 F గా / అధికంగా ఉండి, నలతగా ఉండును. ఈ వ్యాధి సోకిన పశువులలో ఎర్ర రక్త కణాలు చనిపోవటంవలన మూత్రం ఎర్రగపోవుట బయటకి కనిపించే శ్లేష్మపొరలు పాలిపోయి ఉండి పసుపు రంగును కలిగి ఉండును. ఇవేకాక పాలదిగుబడి తగ్గిపోవుట, ఆకలి లేకపోవుట, నెమరు వేయకపోవుట, మలబద్ధకం, వెన్ను వంగిపోయి కష్టంగా నడుచుట, నాడి మరియు శ్వాసవేగం అధికంగా ఉండటం వంటి లక్షణాలను చూపిస్తూ 12-24 గంటలలో మరణించును.

కోల్‌బాసిల్లోసిస్‌ : దీనినే పారుడు రోగము, తెల్లబేదులు, స్కోర్స్‌ లేదా వైట్‌ డయోడియ అని కూడా అందురు. ఈ వ్యాది అప్పుడే జన్మించిన లేగదూడలో సాధారణంగా వచ్చును. ఇది పశ్చిరేశియా కోలై అను వ్యాధి కారము వలన వస్తుంది. ఈ వ్యాధి 2 వారాలు వయస్సులోపు దూడలలో కూడా కలుగును. ఈ వ్యాధి సోకుట అనునది ముఖ్యంగా ఆహారం సరిగ అందించకపోవుట, ముర్రుపాలు సరిగ్గా త్రాగించకపోవుట, క్రిక్కిరిసి ఉన్న షెడ్లు, పాకలలో శుభ్రత లోపము, వాతావరణంలో తేడాలు, అధిక వేడి / చలి మొదలగు పరిస్థితులు, శారీరక మరియు భౌతిక ఒత్తిడి, ప్రతికూల వాతావరణం మరియు అపరిశుభ్రత పరిస్థితులలో జరుగును. గర్భాశయంలో ఉన్న శిశువుకు తల్లి రక్తం ద్వారా మరియు సరిగా కత్తిరించని నాభినాళం ద్వారా జీర్ణాశయం చేరి, వ్యాధినిరోధకశక్తి క్షీణించినపుడు, ఈ జీవి విడుదల చేయు విషపదార్థాల వలన అధికంగా పారుకొనుట మరియు నేలపై సాగిలపడుట వంటి వ్యాధి లక్షణాలను చూపును.

ఇలాంటి వ్యాధులు పశువుల్లో వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరుచేసి, సరైన చికిత్స అందించి, ఆరోగ్యంగా ఉన్న పశువులలో సరైన సమయంలో టీకాలు వేయించినట్లయితే మరియు అన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే పశువులలో వ్యాధులు రాకుండా నివారించవచ్చు.

డా|| ఎం. జీవనలత, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌, సెల్‌ : 94902 92468; డా|| ఎం.కె. శ్రీకాంత్‌, పశువైద్యాధికారి, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌. సెల్‌: 96526 55255

Read More

ప్రణాళికతోనే పాడి పదిలం

యాంత్రిక జీవనంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, సామాజికంగా గ్రామాలలో వ్యవసాయ కుటుంబాల్లో వస్తున్న మార్పులు, వ్యవసాయం, పాడి పరిశ్రమల్లో కూలీల కొరత, ప్రకృతి వైపరీత్యాలు, సకాలంలో సేవలందడంలో జాప్యం – వెరసి, పాడి కొంతమేరకు నిరాదరణకు గురవుతోంది అనేది నిజం!

అరకొర వసతులు, పెట్టుబడి లేమి, గిట్టుబాటు ధర లభించక పోవడం లాంటి అంశాలు పాడి ప్రాభవాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి.

నేడు క్షేత్రస్థాయిలో పశువుల నాణ్యత, పాలకు గిట్టుబాటు ధర, పశుఆరోగ్యం, పశుగ్రాస కొరత, దూడల మరణాలు, మేపుకు తగిన ఫలితాలు చాలా వరకు ప్రభావితం చేస్తున్నాయి.

ఈ అంశాలను కొంతమేరకు అధిగమించేలా విజయడెయిరీ అడుగులు వేస్తోంది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా కనిష్టంగా రూ. 50 వేలు, గరిష్టంగా రూ. 10 లక్షల వరకు ముద్ర పథకం ద్వారా ఋణ సదుపాయం కల్పించేలా ఒప్పందం చేసుకుంది. వాసిగల పశువులను రైతులు కొనుగోలు చేసేలా కొన్నిచోట్ల ఎన్‌డిడిబి వారి డెయిరీ సేవల విభాగం సహకారంతో మేలు జాతి పాడిపశువులను రైతులకు అందిస్తోంది. ఈతల మధ్య కాలాన్ని తగ్గించి, మేలు జాతి పెంపొందేలా 1962 సేవలు, గోపాల మిత్రల సేవలు అందేలా ఆదేశాలు జారీ అయినాయి.

పునరుత్పత్తి సమస్యల నివారణకు గ్రామాల్లో పశువైద్య శిబిరాల ఏర్పాటు జరుగుతోంది. అందుబాటులో ఉన్న బీమా సంస్థలచే ‘పశుబీమా’ కు సహకరిస్తుంది. పాల ఉత్పాదకత పెరిగేలా సబ్సిడిపై విజయ పశుదాణా, ప్రాంతీయ ఖనిజలవణ మిశ్రమాలను అందిస్తోంది.

ఈలాంటి ఒకే గొడుగు కింద సేవలు అందేసరికి, పాడిరైతుల్లో కొత్త ఉత్సాహం వెల్లివిరిస్తోంది. ఇప్పటికే విజయ తెలంగాణ డెయిరీలున్న జిల్లాలో ఎస్‌బిఐ అధికారుల నిరంతర సమీక్షలతో రుణ జారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. అంతేకాక, స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు పాడి పశువులకై రుణాలు అందిస్తున్నారు. ఆఖజూస్త్రఆ ద్వారా మినిడెయిరీ ఫారాలు, ఐశిబిదీఖితిచీ |దీఖిరిబి ద్వారా ఎస్‌బిఐ ద్వారా రూ. కోటి వరకు రుణాలు అందచేస్తున్నారు. 

గిట్టుబాటు ధరలు

విజయ తెలంగాణ డెయిరీ కేజి వెన్నకు రూ. 810/-, ఆవుపాలు కేజీ ఘన పదార్థాలకు రూ. 350/- చెల్లిస్తుంది. బ్యాంక్‌ ఖాతా ద్వారా పాడిరైతులకు ప్రతి 15 రోజులకోసారి ఖచ్చితంగా పాల డబ్బులు చేరుతున్నాయి. ఇటీవల తీసుకొచ్చిన ‘పాలమిత్ర యాప్‌’ ద్వారా గ్రామ స్థాయిలో పాలనాణ్యత ధర సంక్షిప్త సందేశం ద్వారా రైతుకు చేరేలా చర్యలు తీసుకుంది. వెన్నశాతం మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలు, నాణ్యతా ప్రమాణాలు, సహకార సంఘాల ఏర్పాటు ఆవశ్యకత లాంటి అంశాలపై విజయ శిక్షణా కేంద్రం ద్వారా నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది.

సకాలంలో పాడి పశువులు ఎదకు రావడానికి గ్రామాల్లో గోపాలమిత్రల సేవలు వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈతల మధ్య కాలాన్ని తగ్గించి, ఏడాదికో దూడ పొందేలా విజయ డెయిరీ క్షేత్ర పర్యవేక్షకులు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల విజయ శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా వీరోజిరావు చేరాక, పశుసంవర్ధక సేవలతో అనుసంధానం ఇంకా మెరుగైంది.

దాణా ఖర్చు తగ్గిస్తూ, పాల దిగుబడి పెంచడానికి అనువైన మార్గాలను రైతులకు తెలుపుతూ, 1962 అంబులెన్స్‌ సేవలు విజయ పాడి రైతుల దరి చేరేలా చర్యలు తీసుకున్నారు.

పాల ఉత్పత్తి వ్యయంలో ప్రధాన పాత్ర పోషించే జాతి, మేత, పునరుత్పత్తి అంశాలను పాడి రైతుకు వివరిస్తూ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సేవలు విస్తృతమవుతున్నాయి.

పాల సేకరణ పరంగా సుదూర ప్రాంతాల్లో సైతం మినీ పాలశీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ, పాడి రైతుల పాలకు గిరాకీ కల్పిస్తోంది. నిర్వహణ భారం అధికమైనా, వినియోగదారులపై అదనపు భారం పడకుండా, పాడి రైతులకు పక్షానికోసారి పాలడబ్బులు చెల్లిస్తూ, పాడి రైతు శ్రేయస్సుకోరే సహకార డెయిరీ వ్యవస్థను కాపాడుకోవాలి. పాలసేకరణ మరింత పెంచి విజయ తెలంగాణ జెండా ఎగిరేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పాడి రైతుపైనుంది.

మధుసూదనరావు, ఉపసంచాలకులు, విజయ డెయిరీ, ఆదిలాబాద్‌, ఫోన్‌: 91211 60553

Read More

గొర్రెల పెంపకంతో 50 లక్షల సబ్సిడి

వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను ఆదరించడము మనదేశంలో సర్వసాధారణం. గతంలో చాలామంది రైతుల ఇళ్ళలో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళ లాంటివి తప్పనిసరిగా ఉండేవి. కాని రానురాను వివిధ రకాల కారణాల వలన ఈ రంగాలన్నీ విడిపోయినవి. అతికొద్ది మంది రైతులు మాత్రమే నాటి దారిలో నడుస్తున్నారు. చాలామంది రైతులు కేవలం పంటల సాగునో, కేవలం పశుపోషణనో, కేవలం గొర్రెల పెంపకం, కేవలం కోళ్ళ పెంపకం కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వలన రైతులు అన్ని సందర్భాలలో లాభాల బాటలో నడవలేకపోతున్నారు. దానికితోడు కొన్ని రకాల జాతులు ప్రత్యేకించి గొర్రెలలో కొన్ని రకాల జాతులు అంతరించి పోతున్నాయి. అంతరించిపోతున్న జాతులను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం తమ వంతు బాధ్యతగా రైతులకు సబ్సిడీలను అందిస్తూ అంతరిస్తున్న జాతుల అభివృద్ధికి కృషి చేస్తున్నది. కొంతమంది రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం ఎన్‌ఎల్‌ఎం స్కీం ద్వారా భారీ మొత్తంలో సబ్సిడిని  అందిస్తూ గొర్రెలు, కోళ్ళు, పందుల పెంపకాన్ని ప్రోత్సహించడాన్ని తెలుసుకున్న ఖమ్మం జిల్లా, ముత్తగూడెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు అనుముల రామిరెడ్డి గొర్రెల పెంపకాన్ని చేపట్టి 50 లక్షల సబ్సిడీకి అర్హత పొందాడు.

రామిరెడ్డిది వ్యవసాయ నేపథ్యం. వారి తాత, తండ్రుల నుండి వ్యవసాయమే ప్రధాన వృత్తిగా చేస్తున్న కుటుంబం వారిది. వ్యవసాయంతో పాటు పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం లాంటి వాటిని కూడా పంటల సాగుకు అనుబంధంగా చేస్తూ వస్తున్నాడు. కాని కొన్ని రకాల కారణాల వలన ఇటీవలకాలంలో గొర్రెల పెంపకానికి దూరం జరిగి వివిధ పంటల సాగు, పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, వానపాముల ఎరువు తయారీ లాంటివి కొనసాగిస్తూ వస్తున్నాడు. వానపాముల ఎరువు తయారీ విషయానికొస్తే పెద్ద మొత్తంలో తయారు చేస్తూ తమ పంటల సాగులో వినియోగిస్తూ అవసరమైన వారికి అమ్మకం చేస్తూ లాభాలను గడిస్తున్నారు. ఆ ప్రాంతంలో అభ్యుదయ రైతు రామిరెడ్డి గారు అనడములో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో అవార్డులు, సత్కారాలు రామిరెడ్డి గారిని వరించాయి. తనకు వచ్చిన గుర్తింపు తోటి రైతులకు మరియు మన భూమిని కాపాడుకోవడానికి, సమాజానికి నాణ్యమైన పంట ఉత్పత్తులు అందచేయటానికి ఉపయోగడపాలని ఆలోచిస్తూ సమీకృత వ్యవసాయం చేయగలిగితే ప్రయోజనం ఉంటుందని ఆలోచించి అందులో భాగంగా తమకు అప్పటికే పశువులు, కోళ్ళు ఉన్నాయి కాబట్టి గొర్రెల పెంపకం మరలా చేపడితే, అదీను భారీ ఎత్తులో చేపడితే అన్ని రకాలుగా ఫలితాలు ఉంటాయని గ్రహించి అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ ఎన్‌ఎల్‌ఎం స్కీం గురించి తెలుసుకుని అటువైపు అడుగులు వేశారు.

ఎన్‌ఎల్‌ఎం స్కీము గురించిన సమాచారాన్ని ఇండియన్‌ బ్యాంక్‌ వారి ద్వారా తెలుసుకుని అందుకు అవసరమైన నియమ నిబంధనలు తెలుసుకుని, ఎన్‌ఎల్‌ఎం స్కీములో పెద్ద ప్రాజెక్టు అయినటువంటి కోటి రూపాయల ప్రాజక్టును ఎంపిక చేసుకొని రెండు నెలలలో స్కీములో అర్హత పొంది 25 లక్షల రూపాయల సబ్సిడీ అందుకున్నారు. మిగతా 25 లక్షల సబ్సిడీ మూడు సంవత్సరాల తరువాత పొందుతాను అని రామిరెడ్డి వివరించాడు. 

ఎన్‌ఎల్‌ఎం స్కీములో గొర్రెల పెంపకంతో పాటు, పాడి పశువులు, కోళ్ళ పెంపకం, పందుల పెంపకం లాంటి వాటిని కూడా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా అందరూ కూడా కోటి రూపాయల ప్రాజక్టు గురించి ఆలోచించకుండా రైతులు వారి వారి స్థాయిలను బట్టి ప్రభుత్వం సరళతరం చేసిన స్కీములను ఉపయోగించుకోవచ్చు. ఈ స్కీములో 20 లక్షల ప్రాజక్టు కూడా ఉంది. 20 లక్షల ప్రాజెక్టులో 10 లక్షల సబ్సిడీ, సొంత డబ్బులు రెండు లక్షలు, బ్యాంకులోను 8 లక్షలు పొందవలసి ఉంటుంది. కాబట్టి రైతులు వారి వారి పరిస్థితులను బట్టి ఎన్‌ఎల్‌ఎం స్కీమును ఉపయోగించుకోవచ్చు. రైతులందరికి అందుబాటులో ఉండాలనే, ప్రభుత్వం స్కీమును సరళతరం చేసిందని రామిరెడ్డి వివరించాడు.

పంటల సాగుకు అవసరమైనంత సేంద్రియ ఎరువు అందుబాటులో ఉంచడంతోపాటు, అంతరించిపోతున్న, తరిగిపోతున్న జీవ సంపదను అభివృద్ధి పరచాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఎన్‌ఎల్‌ఎం స్కీము ద్వారా భారీ మొత్తంలో సబ్సిడీ అందిస్తుంది కాబట్టి అర్హత ఉన్న రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకుని ఎన్‌ఎల్‌ఎం స్కీము లక్ష్యాలను నెరవేర్చాలని రామిరెడ్డి తోటి రైతులను కోరుకుంటున్నాడు. మరిన్ని వివరాలు 94403 54113 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

పశుగ్రాసాలు

ఎన్‌ఎల్‌ఎం స్కీము ద్వారా గొర్రెల పెంపకం చేపట్టిన వారు గొర్రెలను బయటకు తిప్పకుండా షెడ్‌లోనే పోషించాలి కాబట్టి అందుకు అవసరమైన పశుగ్రాసాలలో దుబ్బుజొన్న ప్రస్తుతం 6 ఎకరాలలో సాగులో ఉంది. మూడు ఎకరాలలో సూపర్‌ నేపియర్‌, 5 ఎకరాలలో హెడ్జ్‌లూసర్న్‌, రెండు ఎకరాలలో అవిశ మరియు పిల్లిపెసర లాంటి పశుగ్రాసాల పెంపకానికి ప్రణాళిక వేసుకున్నాడు. పశుగ్రాసాల పెంపకానికి గొర్రెల వ్యర్థాలను ఉపయోగిస్తారు కాబట్టి నాణ్యమైన పశుగ్రాసాలను తక్కువ సాగు ఖర్చుతో పొందవచ్చని రామిరెడ్డి వివరిస్తున్నాడు.

నియమ నిబంధనలు

ఎన్‌ఎల్‌ఎం స్కీములో కోటి రూపాయల ప్రాజెక్టుకు సంబంధించిన, రామిరెడ్డి గారు వివరించిన నియమనిబంధనలు:

  • సొంత డబ్బులు 10 లక్షలకు తగ్గకుండా పెట్టుబడి పెట్టాలి.
  • బ్యాంకు నుండి 40 లక్షలకు తగ్గకుండా లోను పొందాలి.
  • బ్యాంకు నుండి లోను పొందాలంటే బ్యాంకు వారికి తప్పనిసరిగా పట్టణ ఆస్తిని 60 లక్షల రూపాయలకు తగ్గకుండా గ్యారంటీగా చూపించాలి.
  • ఒక్కొక్క గొర్రెకు 16 చదరపు అడుగులకు తగ్గకుండా 525 గొర్రెలకు (500 ఆడగొర్రెలు+25 గొర్రెపొట్టేళ్ళు) సరిపోను షెడ్‌ని నిర్మించుకోవాలి.
  • 525 గొర్రెలకు సరిపోను పశుగ్రాసాలు సాగు చేయాలి.
  • గొర్రెల పెంపకంలో అనుభవం ఉన్న ధృవీకరణ పత్రాన్ని సంబంధిత అధికారుల నుంచి పొందాలి.
  • 5 ఎకరాలకు తగ్గకుండా సొంత పొలం లేదా 8 సంవత్సరాల కౌలు పొలం చూపించాలి.
  • షెడ్‌లో 525 గొర్రెల పెంపకానికి అవసరమైన నీటి వసతి, పశుగ్రాసాల మేపునకు సంబంధించి, దోమల నుండి రక్షణ లాంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలి.
  •   గొర్రెలను తప్పనిసరిగా షెడ్‌లోపలే మేపాలి. బయట కొండల మీద, అడవులలో మేపకూడదు. 

ఇలాంటి నియమనిబంధనలను రామిరెడ్డి గారు పాటించి కేవలం రెండు నెలలో మొదటి విడత సబ్సిడీ అయిన 25 లక్షల రూపాయలను ఇటీవలే పొందడము జరిగింది. ప్రాజక్టును ఎలాంటి పొరపాట్లు చేయకుండా మూడు సంవత్సరాలు కొనసాగించి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చగలిగితే మిగతా 25 లక్షల సబ్సిడీని పొందవచ్చు అని రామిరెడ్డి ప్రస్తుత తన అనుభవాన్ని వివరించాడు. 

Read More

రాజస్థాన్‌ కామధేనువు… రాథి జాతి ఆవు

మన దక్షిణాది రాష్ట్రాలలో అంతగా కనిపించకపోయినప్పటికీ రాజస్థాన్‌ రాష్ట్రంలో లాభదాయకమైనదేకాక అక్కడి గో ప్రేమికులు భక్తి భావంతో ఆదరించే రాథిజాతి పశువులు రాజస్థాన్‌ రాష్ట్రపు అధిక వేడిని, అనావృష్టిని, మేత కొరత తదితర ప్రతికూల పరిస్థితులలో పాల ఉత్పత్తితోపాటు వ్యవసాయ గ్రావిూణ రవాణాలోనూ ప్రసిద్ధిగాంచాయి. రాజస్థాన్‌ బికనీర్‌ జిల్లాలోని లుంకరాన్సర్‌ తాలూకాతో రాథిజాతి పశువుల ప్రధాన ఉత్పత్తి కేంద్రము అక్కడ నుండి ఈ పశువుల్ని దిగుమతి చేసుకోవచ్చు. ఈ జాతి ఆవును జమదగ్ని మహాముని ఆశ్రమంలో పూజలు అందుకుంటూ వుండేదని రాజస్థానీయుల నమ్మకం. ఈ ఆవులను రాజస్థాన్‌ రాణులు అని కూడా పిలుస్తారు. 

సింథి, సాహివాల్‌ మరియు తార్పార్కర్‌ జాతి పశువుల జన్యుకలయిక ద్వారా స్థిరమైన జాతిగా రాథిజాతి ఆవిర్భవించిందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. రాథిజాతి పశువులలో ఉపతెగలైన రాథి పశువులు పాల ఉత్పత్తికి, రాథ్‌ పశువులు పని చేయడానికి పేరుగాంచాయి. మధ్యస్థమైన శరీర బరువు కలిగిన రాథి పశువులు రోజుకు సగటున 5 నుండి 10 లీటర్ల పాలను, గరిష్ఠంగా రోజుకు ఇరవై లీటర్ల వరకు పాలను 4.4 నుండి 9.00 శాతం వెన్నతో అందిస్తూ యజమానులకు మంచి లాభాలను ఆర్జించగలవు. ఈత మొత్తంలో 1500 నుండి 3000 లీటర్ల పాలను వీటి నుండి ఆశించవచ్చు.

గోధుమ రంగు చర్మం విూద తెల్లని మచ్చలు చారలు కలిగి, విశాలమైన నుదురు ప్రకాశవంతమైన కళ్లు, ఆకర్షణీయమైన మధ్యస్థంగా వుండే గంగడోలు చిన్న మూపురం పొడవైన తోక కలిగిన ఈ పశువుల కొమ్ములు కొంత సన్నగా ప్రక్కకు, వెనక్కు తిరిగి వుంటాయి. 

వ్యాధి నిరోధక శక్తితోపాటు మంచి శరీరదారుఢ్యం కలిగిన రాథి జాతి ఆవులు ఉత్పత్తి చేసే ఎ2 పాలు ఉన్నతమైన పోషక విలువలతోపాటు అనేక ఔషధ సుగుణాలను కలిగి మలబద్ధకం, అజీర్తి, కీళ్లవాతం, నరాలు-నాడీమండల సమస్యలు కలిగిన వారికి ఈ పాలలోని యాంటి ఆక్సిడెంట్సుతోపాటు ప్రత్యేక ఎమైనో ఆమ్లాలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే దేశీ గోవుల ఎ2 పాలన్నింటిలో రాథిజాతి ఆవుపాలు ఉత్తమమైనవిగా గుర్తించబడ్డాయి.

పర్యావరణ మార్పులవల్ల ఏటేటా మన వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ వున్నాయి. కాబట్టి భవిష్యత్తులో నాణ్యమైన ఎ2 పాల ఉత్పత్తికి ఇతర దేశీ ఆవులకంటే మన తెలుగు రాష్ట్రాలలో ఎండ తీవ్రతను సమర్థంగా భరించగల ఈ రాథిగోవుల పెంపకం ద్వారా ఎక్కువ వెన్నతో ఎడాది పొడవునా సుస్థిరంగా పాలను ఉత్పత్తి చేయవచ్చును. ఈ ఆవుల పాలు, నెయ్యిలకు ఇతర పశువుల ఉత్పత్తులకంటే ఎక్కువ డిమాండుతోపాటు అధిక ధరలు కూడా కొనసాగుతున్నాయి. సింథి, సాహివాల్‌, గిర్‌ పశువులకంటే తక్కువ శరీర బరువులు కల్గిన రాథి ఆవుల నిర్వహణ ఖర్చులు కూడా తక్కువే. పిండమార్పిడి ద్వారా అత్యుత్తమ స్థాయి సెక్స్‌డ్‌ వీర్యం వల్ల అత్యంత విలువైన రాతి జాతి ఆవు పిండాలను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తిచేసి, ప్రత్యేక సాంకేతిక పద్ధతిలో సేకరించి సాధారణ స్థాయి ఆవుల గర్భాలలో ప్రవేశపెట్టి తొమ్మిది నెలలు పెంచి, రోజుకు 15-20 లీటర్ల పాలను ఉత్పత్తి చేయగల ఎంతో లాభదాయకమైన గో సంతతిని పొందవచ్చును.

జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌డిడిబి) ఆనంద్‌ (గుజరాత్‌) వారు 2002 నుండి ఈ విశిష్ఠమైన గో సంతతి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ కృషిలో రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ మరియు కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖలు, విశ్వవిద్యాలయాలు పాలుపంచుకుంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో రానున్న రోజుల్లో అత్యధిక వేసవి తాపాలను తట్టుకుంటూ విలువైన పాలను అందించుటలో రాథిజాతి గోవుల అవసరం వుంది.  

డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611

Read More

భారీవర్షాలు – వరదలలో పశుసంరక్షణ

ఈ సంవత్సరం జూలై మొదటి వారాంతం వరకు మన వాతావరణ శాఖ, ఎలినినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావం ఉండవచ్చునని, నీటి ఎద్దడిని ఎదుర్కొనడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే వారి అంచనాలకు పూర్తి విరుద్ధంగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, దాదాపు దేశంలోని అన్ని నదులకు వరదలు సంభవించుట మనం చూస్తున్నాము. మన తెలుగు రాష్ట్రాలలో గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరద నీరు చేరటం, జూలై ఆఖరివారంలో ప్రారంభమైంది. వాగులు, కాల్వలు, చెరువులు పొంగుట, అనేక చోట్ల చెరువుగట్లు కూడా ధ్వంసం అగుటతో పాటు ప్రాజెక్టులకు కూడా ముప్పు వాటిల్లింది. వరంగల్‌, హైదరాబాద్‌ నగరాలలో కురిసిన భారీ వర్షాల వల్ల ఇటీవలకాలంలో మనం ఎన్నడూ చూడని విధంగా రోడ్లతో పాటు, భవనాలు కూడా ధ్వంసం అయ్యాయి. పదుల సంఖ్యలో జన నష్టంతో పాటు వేలాది మూగ జీవులు ప్రాణాలు కోల్పోయాయి. పిడుగుపాటు, వడగళ్ల వల్ల పశువులతో పాటు, జీవాల మందలు కూడా మరణించాయి. సుమారు రెండు వారాలుగా అనేక ప్రాంతాలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల, పొలాలను ముంచి వేసిన వరద నీటి వల్ల పచ్చిక కుళ్లిపోయి పశువులకు మేత అందని పరిస్థితితో పాటు వరద నీటిలో కొట్టుకుపోయిన గడ్డి వాములు, వాన నీటితో తడిచి కుళ్లి-బూజుపడుతున్న గ్రాసాలు, దాణాల వల్ల పశువులు, జీవాలు, కోళ్ల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడింది. వాతావరణంలో అనూహ్యంగా, అకస్మాత్తుగా సంభవించే అతివృష్టి, పిడుగుపాటు, వరదలను ముందుగా ఖచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితుల్ని ప్రస్తుతం మనం చూస్తూ వున్నాము. కాబట్టి పశుపోషకులు, జీవాల పెంపకందారులు రాబోయే రెండు-మూడు నెలల వరకు చాలా అప్రమత్తంగా ఉండాలి. గతంలో నవంబరు నెలలో కూడా ఉప్పెనలు వచ్చి అనూహ్య నష్టాలను చవిచూచిన అనుభవాలను మనం మరచిపోకూడదు. అయినా వాతావరణ శాఖ సూచనలను విస్మరించకూడదు. సాధారణంగా వారి సూచనలు శాస్త్రీయ అధ్యయనాల మీదనే ఆధారపడి మాత్రమే ఉంటాయని అర్థం చేసుకోవాలి.

ఇక వరదలు, వానలు, పిడుగుపాట్లు, వడగళ్ల వానలు వల్ల సంభవించే నష్టాల గురించి చర్చిద్దాము.

ఆకస్మికంగా వచ్చే పిడుగు పాట్ల నుండి పశువులను, జీవాలను కాపాడుట ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చు. అయినా పిడుగుపాటుకు అవకాశాలు ఎక్కువగా ఉండే పెద్ద చెట్ల క్రింద, విద్యుత్‌ స్తంభాల వద్ద పశువుల్ని బంధించి ఉంచుట క్షేమం కాదు. వాటిని ఆరుబయలు ప్రదేశంలో కొంత స్వేచ్ఛగా ఉంచుట మంచిది. వడగళ్ల బారి నుండి రక్షించుటకు పశువుల్ని వీలైతే సిమెంటు శ్లాబులు క్రింద లేదా పటిష్టమైన రేకుల షెడ్ల క్రింద ఉంచి రక్షించాలి.

ఇప్పటి ఆకస్మిక వరదలలో వందలాది పశువులు, వేలాది జీవాలు వరద నీటిలో కొట్టుకుపోయిన వార్తల్ని దృష్టిలో ఉంచుకొని, పశువుల్ని, జీవాలను, ఎత్తయిన రక్షిత స్థలాలకు తరలించాలి. లోతట్టు ప్రాంతాలలోని పశువుల పాకలలోని పశువుల్ని సులువుగా విడుదల చేసి రక్షించుకునే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జులై 26న వచ్చిన వరదల నుండి పశువులను డాబా పైకి తరలించి రక్షించిన దృశ్యాలను కొన్ని ప్రాంతాలలో చూశాను. వీలైతే ఇటువంటి జాగ్రత్తలు కూడా మంచివే.

ముసురు రోజుల్లో సుదీర్ఘంగా రొచ్చు, బురద, పేడ వంటి అశుభ్రాల మీద నిలబడిన పశువుల గిట్టలు, కాళ్లు పుండ్లు పడటం సాధారణం! సత్వరమే తగిన చికిత్సలు చేయకపోతే ఫుట్‌రాట్‌ వంటి మొండి సమస్యలు తలెత్తి పశువులు, జీవాలు తీవ్రమైన బాధలకు గురౌతాయి. ఇటువంటి సందర్భాలలో కాళ్లను, గిట్టలను మైలుతుత్తుం (2%) ద్రావణంలో ముంచుట లేదా ఈ ద్రావణం గుండా నడిపించుట మంచిది. కాళ్లకు, గిట్టలకు వేపనూనె పూస్తే స్వల్పమైన పుండ్లు త్వరగా నయమౌతాయి.

అనేక రోజుల పాటు పడే వానల వల్ల ఏర్పడే చలి వాతావరణం, చిత్తడి పరిసరాల వల్ల దూడలు ప్రాణాల కోల్పోయే ముప్పు ఎక్కువ కాబట్టి వీటిని చలిగాలుల నుండి రక్షించే జాగ్రత్తలు తీసుకుని పొడివాతావరణంలో ఉంచాలి.

ఈ సంవత్సరం జూలై మాసంలో కూడా తీవ్రమైన ఎండలు కొనసాగి, ఆకస్మికంగా భారీ వానలు, వరదలు వచ్చాయి. ఈ ఆకస్మిక వాతావరణ మార్పుల వల్ల పశువులు-జీవాల సహజమైన వ్యాధినిరోధక శక్తులు క్షీణించి, అవి అనేక అంటురోగాలకు సులువుగా బలైపోతాయి. కాబట్టి వెంటనే వీటికి గురక, దొమ్మ, పి.పి.ఆర్‌., గాలికుంటు వంటి ఆయా ప్రాంతాలలో ఉనికిలో ఉన్న ప్రమాదకరమైన వ్యాధుల నివారణ టీకాలు ఒకేసారి ఒక ప్రాంతం లేదా మందలో కనీసం 90 శాతం పశువులు లేదా జీవాలకు టీకాలు వేయించాలి. అనేక అంటువ్యాధి క్రిముల్ని వ్యాపింపచేసే ఈగలు, దోమలు, గోమార్లు, పిడుదుల నివారణకు డి.డి.టి., గమాక్సిన్‌, డెల్టామెథ్రిన్‌, సైపర్‌మెథ్రిన్‌ వంటి కీటకనాశకాలను పాకలు, కొట్టాలు, పరిసరాలలో స్ప్రే చేసి ఈ స్థలాలను పొడిగా ఉంచాలి. ఇందుకు తాత్కాలికంగానైనా మురుగు పారుదల ఏర్పాట్లు చేయుట అవసరం.

ఇటీవల నాలుగు సంవత్సరాలుగా పశువులు, జీవాలకు తీవ్రమైన సమస్యగా ఎదురైన లంపీస్కిన్‌ డిసీజ్‌ వ్యాధి నివారణకు అవసరమైన టీకాలు, ఇతర ఆరోగ్య భద్రతా చర్యల్ని వెంటనే చేపట్టాలి.

ప్రస్తుతం మన గేదెలు ఎక్కువగా నిండు చూడి థలో ఉండి, స్వల్పకారణాలకే గర్భస్రావాలకు లోనయ్యే ముప్పు ఉంది. ఇందుకు మేత కొరత, పరిసరాల అశుభ్రతతో పాటు క్షీణించిన వ్యాధినిరోధక శక్తి, వత్తిళ్లను తట్టుకోగల శక్తి తదితర కారణాలను గుర్తించి, తగిన నష్టనివారణ చర్యల్ని వెంటనే చేపట్టాలి.

క్షీణించిన పరిశుభ్రత, పోషణ, యాజమాన్య నిర్వహణ తదితర కారణాల వల్ల, బాలింత పశువులలో పొదుగు వాపు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇంతేకాక వరదలు ఇతర విపత్తుల వల్ల సకాలంలో నిర్ణీత సమయానికి పాలుపిండకపోతే పొదుగులు నిండిపోయి పొదుగువాపు ముప్పు ఎక్కువగా ఉంటుంది.

మేత సమస్య: వరదల వల్ల పశువులు ఎదుర్కొనే ప్రధాన సమస్య మేత కొరత, గడ్డివాములు వరదలలో కొట్టుకుపోవటం, మేతలు, గ్రాసాలు బూజుపట్టి ముక్కిపోయి వాటిని తిన్న పశువులు, జీవాలకు ప్రాణహాని జరగటం పరిపాటి. పచ్చికబీళ్లు వరద నీరు, బురదలలో మునిగిపోయి అందుబాటులో లేకపోవుట, పారా ల్యూసర్న్‌ వంటి పొట్టి రకం గ్రాసాలతో పాటు ఎదిగే థలో ఉన్న సూపర్‌ నేపియర్‌ వంటి పొడవు గ్రాసాలు కూడా చనిపోవటం జరగవచ్చు. ఇందువల్ల ఎదురయ్యే మేత సమస్యను ప్రత్యామ్నాయ మేతలు అంటే సుబాబుల్‌, మర్రి, రావి, అరటి తోట వ్యర్థాలు, మామిడి ఆకులు, నేరేడు, మారేడు, తుమ్మ, అవిసె, మునగ, వేప వంటి ఆకుల్నే కాక కొంత పరిమితంగా (అంటే మొత్తం మేతలో 25 శాతానికి మించకుండా) ఇప్పుడు విరివిగా లభిస్తున్న గుర్రపుడెక్కను కూడాను మేపవచ్చును. ఈ మేతల్ని అలవాటు చేయుటకు మొదట్లో వాటి మీద బెల్లం లేదా వరి తవుడును జల్లి మేపాలి. కూరగాయలు, ఆకుకూరల వ్యర్థాలు కూడా పశువులకు మంచి పోషకాలను అందించగలవు.

అజొల్లా-హైడ్రోపోనిక్‌ గ్రాసాల సాగును ఇంటి మిద్దెల మీద కూడా చేపట్టి నాటిన 7-8 రోజుల్లో కిలో విత్తు నుండి 7-8 కిలోల పుష్టివంతమైన పచ్చని మేతను పొందవచ్చును. ఎక్కువ మొలకెత్తే సామర్థ్యం కలిగిన జొన్నలు, మొక్కజొన్నలు, ఓట్స్‌, పెసలు, శనగలు, ఉలవల నుండి ట్రేలలో అత్యంత మేలైన పచ్చిగ్రాసాలు పొందవచ్చును.

అజొల్లా అనే ఫెర్న్‌ మొక్కను ప్లాస్టిక్‌ టార్పాలిన్‌తో ఏర్పాటు చేసిన నీటి మడుగులలో పెంచితే పచ్చిమేతల సాగుకు భారీ విస్తీర్ణమైన సాగుభూముల అవసరమే ఉండదు. వరి గడ్డితో పాటు హైడ్రోపోనిక్‌ గ్రాసాలను, అజొల్లాను మేపగల్గితే అన్ని రోజులలోనూ పశువుల ఆహార అవసరాలు చాలా వరకు తీరగలవు.

ప్రమాదాలు, రోగాలు, వరదల వల్ల పశువుల్ని కోల్పోయినప్పుడు జరిగే నష్టాలకు పరిహారం పొందుటకు వెంటనే పశువులన్నింటినీ బీమా చేయించి వాటి చెవులకు బిగించిన నెంబరు పోగులు ఊడిపోకుండా జాగ్రత్త వహించాలి.      

 – డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611

Read More

వర్షాకాలంలో పశువుల వ్యాధుల నివారణకు తీసుకోవలసిన చర్యలు

వర్షాకాలం పెరిగిన తేమ, వర్షపాతం మరియు తేమతో కూడిన పరిస్థితులను తెస్తుంది, ఇది జంతువులలో వ్యాధుల వ్యాప్తికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలదు. జంతువుల ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని కాపాడటానికి ఈ కాలంలో నివారణ చర్యలను అమలు చేయడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో జంతువులకు వచ్చే వ్యాధులను నివారించడానికి ఇక్కడ కొన్ని కీలక చర్యలు సూచించబడ్డాయి:

సరైన షెల్టర్‌ మరియు హౌసింగ్‌: జంతువుల ఆశ్రయాలు మరియు గృహ నిర్మాణాలు బాగా నిర్వహించబడుతున్నాయని, శుభ్రంగా మరియు సరిగ్గా వెంటిలేషన్‌ చేయబడిందని నిర్ధారించుకోండి. తగినంత వెంటిలేషన్‌ తేమను తగ్గించడానికి మరియు వ్యాధికారక పెరుగుదలను తగ్గించడానికి సహాయపడుతుంది. నీటి ప్రవేశాన్ని నిరోధించడానికి మరియు జంతువుల కోసం పొడి పరుపు ప్రాంతాలను నిర్వహించడానికి పైకప్పులు లేదా గోడలలో ఏవైనా లీకేజీలను మరమ్మతు చేయండి.

జీవ భద్రత, పరిశుభ్రత పద్ధతులు: వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి కఠినమైన బయోసెక్యూరిటీ మరియు పరిశుభ్రత ప్రోటోకాల్‌ను నిర్వహించండి. ఇందులో ఇవి ఉన్నాయి:

  • పరిమితం చేయబడిన యాక్సెస్‌: వ్యాధికారక కారకాలను ప్రవేశపెట్టే ప్రమాదాన్ని తగ్గించడానికి జంతువుల ఆవరణలోకి సందర్శకులు, అనధికార సిబ్బంది ప్రవేశాన్ని పరిమితం చేయండి.
  • ఫుట్‌బాత్‌లు మరియు హ్యాండ్‌వాషింగ్‌: ఎంట్రీ పాయింట్‌ల వద్ద ఫుట్‌బాత్‌లను అమలు చేయండి మరియు జంతువుల ఆవరణలోకి ప్రవేశించే వ్యక్తులందరికీ హ్యాండ్‌వాష్‌ సౌకర్యాన్ని అందించండి.
  • క్రిమిసంహారక: జంతువులతో సంబంధంలోకి వచ్చే పరికరాలు, దాణా తొట్టెలు, నీటి పాత్రలు మరియు ఇతర ఉపరితలాలను క్రమం తప్పకుండా శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.
  • వ్యర్థ పదార్థాల నిర్వహణ: వ్యాధికారక క్రిములను సంతానోత్పత్తి ప్రదేశంగా ఉపయోగపడే సేంద్రియ పదార్థాలు పేరుకుపోకుండా నిరోధించడానికి జంతువుల వ్యర్థాలను సరిగ్గా నిర్వహించండి మరియు పారవేయండి.

నీటి నిర్వహణ: జంతువులకు శుభ్రమైన మరియు కలుషితం కాని నీటి వనరులను నిర్వహించండి. కింది వాటిని పరిగణించండి:

  • నిలిచిపోయిన నీటిని నిరోధించండి: దోమలు మరియు ఇతర వ్యాధి వాహకాలను ఆకర్షించే విధంగా నిలిచిపోయిన నీరు ఏర్పడకుండా సరైన డ్రైనేజీని నిర్ధారించుకోండి.
  • క్లీన్‌ వాటర్‌ కంటైనర్లు: బ్యాక్టీరియా పెరుగుదల మరియు కలుషితాన్ని నివారించడానికి నీటి కంటైనర్లను క్రమం తప్పకుండా శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.
  • నీటి వనరుల నాణ్యత: కలుషితాలు లేకుండా మరియు జంతువుల వినియోగం కోసం సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి నీటి వనరుల నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించండి.

టీకాలు వేయడం మరియు నులిపురుగుల నివారణ: మీ జంతు జాతుల నిర్దిష్ట అవసరాలకు మరియు మీ ప్రాంతంలో ప్రబలంగా ఉన్న వ్యాధులకు అనుగుణంగా సమగ్రమైన టీకా, నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని అనుసరించండి. సరైన టీకా, నులిపురుగుల నిర్మూలన షెడ్యూల్‌ను నిర్ణయించడానికి, సకాలంలో పరిపాలనను నిర్ధారించడానికి పశువైద్యుడిని సంప్రదించండి.

పోషకాహార నిర్వహణ: రోగనిరోధక వ్యవస్థ మరియు జంతువుల మొత్తం ఆరోగ్యానికి తోడ్పడేందుకు బాగా సమతుల్య ఆహారాన్ని అందించండి. అచ్చు పెరుగుదల మరియు మైకోటాక్సిన్‌ కలుషితాన్ని నివారించడానికి ఫీడ్‌ పొడి పరిస్థితులలో నిల్వ చేయబడిందని నిర్ధారించుకోండి. ఫీడ్‌ నాణ్యతను పర్యవేక్షించండి మరియు ఏదైనా చెడిపోయిన లేదా కలుషితమైన ఫీడ్‌ను విస్మరించండి.

తెగులు, వెక్టర్‌ నియంత్రణ: వర్షాకాలంలో వృద్ధి చెందే తెగుళ్లు మరియు వ్యాధి వాహకాలను నియంత్రించడానికి చర్యలను అమలు చేయండి. జంతువులకు వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు, ఈగలు, పేలు, ఈగలు మరియు ఇతర తెగుళ్ల ఉనికిని తగ్గించడానికి తగిన పురుగుమందులు మరియు వికర్షకాలను ఉపయోగించండి.

పర్యవేక్షణ మరియు ముందస్తు గుర్తింపు: ఆకలి తగ్గడం, నీరసం, ప్రవర్తనలో మార్పులు, శ్వాసకోశ బాధ లేదా అతిసారం వంటి ఏదైనా అనారోగ్య సంకేతాల కోసం జంతువులను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. వ్యాధులను ముందస్తుగా గుర్తించడం వలన సత్వర పశువైద్య జోక్యం, తగిన చికిత్స ప్రోటోకాల్‌ల అమలుకు వీలు కల్పిస్తుంది.

వెటర్నరీ కేర్‌: వ్యాధి నివారణ, రోగ నిర్ధారణ మరియు చికిత్సపై మార్గదర్శకత్వం అందించగల పశువైద్యునితో మంచి పని సంబంధాన్ని ఏర్పరచుకోండి. జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు తలెత్తే ఏవైనా ఆరోగ్య సమస్యలను వెంటనే పరిష్కరించడానికి రెగ్యులర్‌ వెటర్నరీ చెక్‌-అప్‌లు మరియు సంప్రదింపులు అవసరం.

రికార్డ్‌ కీపింగ్‌: టీకాలు, నులిపురుగుల నిర్మూలన, చికిత్సలు మరియు ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సంఘటనల యొక్క ఖచ్చితమైన మరియు నవీకరించబడిన రికార్డులను నిర్వహించండి. జంతువుల ఆరోగ్య పోకడలను పర్యవేక్షించడానికి, వ్యాధి వ్యాప్తిని ట్రాక్‌ చేయడానికి మరియు సమర్థవంతమైన వ్యాధి నిర్వహణను సులభతరం చేయడానికి ఈ రికార్డులు విలువైనవి.

ఈ నివారణ చర్యలను అమలు చేయడం ద్వారా, జంతువుల యజమానులు, సంరక్షకులు వ్యాధి వ్యాప్తి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు మరియు వర్షాకాలంలో జంతువుల శ్రేయస్సును ప్రోత్సహిస్తారు. సరైన జంతు ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని నిర్వహించడానికి క్రమమైన పర్యవేక్షణ, సకాలంలో పశువైద్య సంరక్షణ, మంచి పరిశుభ్రత పద్ధతులకు కట్టుబడి ఉండటం చాలా అవసరం.   దీ

డా. ఎస్‌.వంశీ కృష్ణ, ఖ.ఙ.ఐబీ., ఆనీ.ఈ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఞ హెడ్‌, వెటర్నరీ మైక్రోబయాలజీ విభాగం, పశు వైద్య కలశాల, మమ్నూర్‌, వరంగల్‌, పి.వి.నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, తెలంగాణ మొబైల్‌: 8712908696

Read More

గోదానం కన్నా గోవుకు దానం మిన్న

హిందూ సాంప్రదాయంలో అనాదిగా పితృకర్మల సందర్భంగానూ, పర్వదినాల సందర్భంగానూ మరియు దేవతలకు మొక్కుబడిగానూ గోవులను పేద బ్రాహ్మణులకు దానం ఇచ్చే ఆచారం కొనసాగుతూ ఉంది. అదే విధంగా గ్రామాలలోని తమ పితృదేవతల పేరిట ఆంబోతులను గ్రామఆస్తిగా దానం చేస్తూ వదిలే సాంప్రదాయం ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది. ఈ ఆంబోతు స్వేచ్ఛగా ఎవరి పొలాలలోకి ప్రవేశించి మేసినా, కొంత నష్టం చేసినా గ్రామ కట్టడిగా ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. ఒకనాడు అనేక గ్రామాలలో 3-4 బ్రాహ్మణ కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా ఉంటూ, పేదరికంలో ఉండి కొన్ని సందర్భాలలో ఆ కుటుంబాలలోని పిల్లలకు, వృద్ధులకు కూడా సరిపడిన పాలు ఉండేవి కావు.ఇటువంటి పేదలకు గ్రామ పెద్దల నుండి దానంగా అందిన గోవులు గృహావసరాలను తీర్చడమే కాక, దేవాలయ పూజారుల ద్వారా దేవతార్చనకు, ప్రసాదాల తయారీకి కూడా వినియోగపడేవి. అదనపు పాల విక్రయం ద్వారా కొంత ఆదాయం కూడా లభించేది. ఇందుకు గ్రామ పెద్దలు బ్రాహ్మణులు, పూజారుల వద్ద ఉన్న గోమాతలకు అవసరమైన మేతను కూడా ఉచితంగా అందించేవారు. అదేవిధంగా గత ఐదు థాబ్దాలుగా మన గ్రామాలకు కృత్రిమ గర్భోత్పత్తి సదుపాయాలు విస్తరించినందున అంతకు ముందు గ్రామాలలో వదిలే ఆంబోతుల వల్ల కలిగే పశుసంతతి కంటే మెరుగైన సంతతి జన్మించే అవకాశాలు ఏర్పడ్డాయి. అంతేకాక పూర్వపు కమతాలు విభజనలు పంపిణీల కారణంగా బాగా కుదించుకుపోవుట మరియు సేద్యపు ఖర్చులు అనేక రెట్లు పెరిగిపోవుట వల్ల, ఆంబోతులు తమ పొలాల మీద పడి ధ్వంసం చేస్తే ఆ నష్టాన్ని భరించే శక్తిని కోల్పోయి, ఈ ఆంబోతుల పట్ల విముఖతను చూపుతున్నారు. కొన్ని సందర్భాలలో హింసించి తరుముతూ చంపటానికి సైతం వెనుకాడటం లేదు. కీటకనాశక రసాయనాలు జల్లిన పైర్లలోకి ప్రవేశించిన వృషభరాజులు పొలాలలోనే మరణిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం గోదానం పొందిన బ్రాహ్మణులు, పురోహితులు, అర్చకులు సైతం గోపోషణకు అవసరమైన కనీస వసతి – మేత- నిర్వహణ అవసరాలను సమకూర్చలేక వారి కుటుంబ అవసరాలకు ఇతరుల నుండి పాలను కొనుగోలు చేయుటకే మొగ్గు చూపుతున్నారు ఈ పరిస్థితి చిన్న చిన్న గృహాలలో నివసించే దానగ్రహీతలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలలో చిన్న అపార్ట్‌మెంట్లలో నివసించే దానగ్రహీతలకు కనీసం ఒక చిన్న పుంగనూరు గోవును సైతం పెంచుట అసాధ్యం. అయితే మనం వీరికి గోదానాలు చేస్తూనే ఉన్నాము. మొన్న కోవిడ్‌ సందర్భంలో అనూహ్య స్థాయిలో సంభవించిన మరణాల వల్ల గోదానాల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే ఈ గోదానాలన్నీ ఒక తంతు మాత్రంగానే కొనసాగి, దానాన్ని స్వీకరించిన వెంటనే ఆ గోవును వేరొకరికి విక్రయించటమో, బదిలీ చేయటమో జరుగుతోంది తప్ప గోదానం యొక్క అసలు య్రోజనం కనిపించడం లేదు. ఇది గోవును దానంగా పొందిన బ్రాహ్మణుని ప్రమేయం లేకుండా లేదా అతనికి తెలియకుండానే ఈ గోవులు ఒక థలో కబేళాలకు తరలిపోతూ హిందువుల మత విశ్వాసానికి మనోభావాలకు, దాన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా తీవ్రమైన అపచారాలకు బలి అవుతున్నాయి.

మరొకవైపు మన పట్టణ పరిసరాలు, గ్రామాలలో అనేక స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు, గోప్రేమిక సంఘాలు అనేక గోశాలలను నిర్వహిస్తున్నాయి. వీటిలో అనాధ గోవులు-దూడలు-ఇతర వృద్ధ, వికలాంగ పశువుల సంఖ్య నానాటికీ పెరిగిపోతూ ఉన్నాయి. వీటికి సరియైన మేతల్ని, దాణాల్ని అందించలేక నిర్వాహకులు సతమతమౌతూ ఉన్నారు. దినదినానికీ పెరుగుతున్న గోసంతతికి అవసరమైన కనీస వసతి సౌకర్యాలు కూడా కుదించుకుపోతున్నాయి. హేతుబద్ధతలేని కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా ఈ గోశాల నిర్వాహకులు తీవ్రమైన కూలీల సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు. మనం పితృదేవతల పేర ఈ గోమాతల అన్నార్తిని తీర్చడానికి ధన రూపంగానూ, గ్రాసాల రూపంగానూ అందిస్తే, భారీ ఖర్చుతో పితృకార్యాల (దినాలు, తద్దినాలు, సంవత్సరికాలు) సందర్భంగా చేసే గోదానాల కంటే గోవుల ఆకలిని తీరుస్తూ, వాటికి మెరుగైన సౌకర్యవంతమైన జీవనాన్ని అందిస్తే మంచిది. ఇది పసుపు, కుంకుమలు అద్ది పూలమాలలతో గోవుల్ని పూజించుట, గోవుల చుట్టూ ప్రదక్షిణలు చేయుట కంటే మెరుగైన పుణ్యకార్యమని నా అభిప్రాయం. గోపూజల సందర్భంగా గోవుకు అందించే మేతలు, పళ్ళు, ఫలహారాలలో గానీ, పూలదండలలో గానీ ఎటువంటి ప్లాస్టిక్‌ మరియు తగరాలు, దారాలు వంటి హానికరమైన పదార్థాలు కలవకుండా జాగ్రత్త వహించండి. మన హిందూ సాంప్రదాయంలో జరిగే తద్దినాలు, స్మారకాలు సందర్భంలో భారీ ఖర్చుతో ఏర్పాటు చేసే భోజనాలు, తదితర ఏర్పాట్లతో పాటు దానమిచ్చే గోవుల కొనుగోలుపై వెచ్చిందలచిన సొమ్ములో కనీసం ఒక పదోవంతు వ్యయాన్ని అయినా మేతల రూపంలోగానీ, విరాళాల రూపంలోకానీ తమకు సమీపంలోని నిజాయితీతో, సమర్థతతో, గోప్రేమికుల నిర్వహణలో నడుస్తున్న గోశాలలకు విరాళంగా అందించవచ్చును. స్తోమతను బట్టి గోశాలలో అదనపు షెడ్లు, ఫ్యాన్లు, నీటి తొట్టెలు వంటి అదనపు నిర్మాణాలను తమ పెద్దల పేర ఏర్పాటు చేయవచ్చు. స్థోమత అవకాశాలను బట్టి పశుగ్రాసాల సాగుకు గోశాలలకు భూదానం చేయవచ్చును.

   పై అంశాల ఆధారంగా గోశాలలలోని గోమాతల ఆకలిని, బాధలను తగ్గించగల్గితే అంతకంటే పుణ్యకార్యం వేరొకటి ఉండదని నా నమ్మకం. అందుకే గోదానం కన్నా గోవుకు దానమే మిన్న అని అంటాను. మరి మీరేమంటారు.   

డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611

Read More

గరిటెడైనను చాలు ఖరము పాలు…

‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు’ అంటూ వేమన గాడిద పాలను తృణీకరించాడు గానీ, గాడిద పాలకు గ్లోబల్‌ మార్కెట్లో గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. వేమన గాడిద పాలను సరిగా విలువ కట్టలేకపోయాడు. ఇప్పటి పరిస్థితులను అంచనా వేసి ఉన్నట్లయితే, ‘గరిటెడైనను చాలు ఖరము పాలు’ అంటూ పద్యాన్ని తిరగ రాసేవాడేమో.

ఎందుకంటే, గరిటెడు గాడిద పాల ధర కడివెడు గంగిగోవు పాల ధర కంటే ఎక్కువే మరి. మన దేశంలో గాడిద పాల వినియోగం చాలాకాలం నుంచే ఉన్నా, పాల కోసం గాడిదల పెంపకం పారిశ్రామిక స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఉపఖండ ప్రాంతాలను విడిచిపెడితే, ప్రపంచంలో మిగిలిన చాలా దేశాల్లో గాడిద పాల వినియోగం పారిశ్రామిక స్థాయికి చేరుకుంది. వయసు మళ్లే ప్రక్రియను గాడిద పాలు ఆలస్యం చేస్తాయనే నమ్మకం క్రీస్తుపూర్వం నాటి నుంచే ఉండేది. గాడిద పాల ఔషధ  లక్షణాలపై తాజా వైద్య పరిశోధనల ఫలితాలు  ఆ నమ్మకాన్ని బలపరుస్తున్నాయి.

సంచారజాతుల వారు గాడిదలను తోలుకుంటూ వీధుల్లో తిరుగుతూ, వాటి పాలను అమ్మడం భారత్‌లోనే కాదు, అర్జెంటీనా, చిలీ వంటి లాటిన్‌ అమెరికా దేశాల్లోనూ మామూలే. ఉబ్బసంతో బాధపడే చిన్న పిల్లలకు గాడిద పాలు పట్టడం మన దేశంలో చాలాకాలంగా కొనసాగుతున్న పద్ధతి. గాడిద పాలు తాగే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే నమ్మకం కూడా ఉంది.గాడిద పాల ఔషధ విలువలపై జనంలో బాగా నమ్మకం ఉండటంతో వీటి ధర చాలా ఎక్కువ. లీటరు గాడిద పాల ధర దాదాపు రెండువేల రూపాయల వరకు ఉంటుంది.

ఔషధప్రాయమైన వినియోగం కోసం సుమారు 25-30 మిల్లీలీటర్ల మోతాదుల చొప్పున అమ్ముతుంటారు. ఒక్కో మోతాదు ధర రెండువందల రూపాయలకు పైమాటే. మన ఇండ్ల దగ్గరకు వచ్చే వారు ఒక చిన్న జండు బాంబ్‌ ఖాళీ గా ఉంది దాని నిండుగా గాడిద పాలు ఇస్తే వంద రూపాయలు తీసుకుంటాడు. మన దేశంలో గాడిద పాలను ఔషధప్రాయంగా మాత్రమే వినియోగిస్తారు. లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లోనైతే ఔషధంగా మాత్రమే కాదు, తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా కూడా పిల్లలకు పడతారు.

డాంకీ మిల్క్‌ బ్యూటీ’, ‘డాంకీస్‌ అండ్‌ కో’ వంటి కంపెనీలు గాడిదపాలతో సౌందర్య సాధనాలు మొదలుకొని, నవయవ్వన ఔషధాల వరకు నానా ఉత్పత్తులను తయారు చేస్తూ మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటున్నాయి.

మిల్క్‌సౌడర్‌, సబ్బులు, ఫేస్‌క్రీములు, కాన్సంట్రేటెడ్‌ యాంటీ ఆక్సిడెంట్‌ క్యాప్సూల్స్‌, ‘నేచురల్‌ వయాగ్రా’వంటి ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. యూరోపియన్‌ దేశాలతో పాటు చైనా, జపాన్‌, కొరియా వంటి ప్రాచ్య దేశాలు కూడా గాడిద పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.

తాజా పరిశోధనల్లో తేలిన విశేషాలు

పోషక విలువల ప్రకారం తల్లిపాలకు దగ్గరగా ఉండేవి గాడిద పాలేనని ఆధునిక పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా గాడిద పాలలో లాక్టోజ్‌ దాదాపు తల్లిపాలకు సమానంగా ఉంటుందని, కొవ్వుశాతం చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. స్థూలకాయం నుంచి బయటపడేందుకు కూడా గాడిదపాల వినియోగం శ్రేయస్కరమని వారు సూచిస్తున్నారు.

జనాభాలో దాదాపు 2-6 శాతం ప్రజలకు ఆవుపాలు సరిపడవని, ఆవు పాల వల్ల వారు అలెర్జీలతో బాధపడుతున్నారని, అలాంటి వారికి గాడిద పాలు మేలు చేస్తాయని ఐక్యరాజ్య సమితి అధ్యయనం తేల్చింది. గాడిద పాలలో విటమిన్‌-సి, బి, డి-12, ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆవుపాలతో పోలిస్తే, గాడిద పాలలో విటమిన్‌-సి అరవై రెట్లు ఎక్కువగా ఉంటుంది.

కీలకమైన ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది. గాడిద పాల వినియోగం ఫలితంగా ఉబ్బసం, సొరియాసిస్‌, ఎగ్జిమా వంటి వ్యాధులు నయమైనట్లు ఇటీవల సైప్రస్‌ వర్సిటీ శాస్త్రవేత్త, డెయిరీ సైన్స్‌ లెక్చరర్‌ డాక్టర్‌ ఫోటిస్‌ పాపడెమాస్‌ నిర్వహించిన పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. సైప్రస్‌తోపాటు ఫ్రాన్స్‌, బెల్జియం, ఇటలీ, స్పెయిన్‌, హాలండ్‌, సెర్బియా, బోస్నియా వంటి దేశాల్లో పాల కోసం గాడిదల పెంపకం పరిశ్రమ స్థాయిలో కొనసాగుతోంది.

యూరోప్‌లో సేకరించిన గాడిద పాలలో దాదాపు సగానికి సగం సౌందర్య పోషణకు ఉపయోగపడే ఉత్పత్తుల తయారీకే తరలిపోతోంది. ఈ దేశాల్లో గాడిద పాలను నేరుగా తాగడంతో పాటు వివిధ ఆహార ఉత్పత్తులనూ తయారు చేస్తున్నారు. సైప్రస్‌లోనైతే గాడిద పాలతో మధువును కూడా తయారు చేస్తున్నారు. యూరోపియన్‌ దేశాల్లో గాడిద పాలతో తయారయ్యే చీజ్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దీని కిలో ధర 1350 డాలర్ల వరకు ఉంటుంది. గాడిద పాలతో చీజ్‌ తయారు చేయాలంటే, ఒక కిలో చీజ్‌ తయారీకి దాదాపు వంద కిలోల పాలు అవసరమవుతాయని స్విస్‌ షెఫ్‌ జీన్‌ మైకేల్‌ ఎవెక్వోజ్‌ చెబుతున్నారు.

వయసు మళ్లిన వారికి గాడిద పాలు బలవర్ధకమైన ఆహారంగా ఉపయోగపడతాయని ఒక పరిశోధనలో తేలిన విషయాన్ని ‘ఇంటర్నేషనల్‌ డెయిరీ జర్నల్‌’ వెల్లడించింది. అంత విస్తృతంగా కాకపోయినా, మన దేశంలోనూ గాడిద పాల గుణగణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. గాడిద పాలలో యాంటీ-కేన్సర్‌ లక్షణాలు, లైంగిక సామర్థ్యాన్ని పెంచే లక్షణాలు ఉన్నాయని లక్నో యూనివర్సిటీ పరిశోధకులు కొద్ది సంవత్సరాల కిందటే వెల్లడించినా, పెద్దగా ప్రచారం లభించలేదు.

కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహకారంతో డాక్టర్‌ అయినాక్షి ఖరే నేతృత్వంలో లక్నో వర్సిటీ బృందం గాడిద పాలపై పరిశోధనలు సాగిస్తోంది. గాడిద పాలు ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేయలేకపోయినా, రోగుల జీవితకాలాన్ని పొడిగించేందుకు గణనీయంగా దోహదపడగలవని లక్నో వర్సిటీ పరిశోధకుడు దేశ్‌ దీపక్‌ చెబుతున్నారు.

గాడిద పాలలోని పోషకాల ప్రాముఖ్యత

1. ఇందులో పెద్ద మొత్తంలో బి, బి12, సి విటమిన్లతోపాటు న్యూట్రిన్లు ఉంటాయి. 

2. తల్లి పాలతో సమానమైన స్థాయిలో కాలరీలు, మినరల్స్‌ ఉంటాయి. ఈ పాలు గేదె పాలతో సమానమైన బలం ఉంటుందని భావిస్తారు. 

3. అప్పుడే పుట్టిన పిల్లల్లోని ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నివారణకు గాడిద పాలతో పరిష్కారం అవుతుందని నమ్మకం ఉంది. 

4. అప్పుడే పుట్టిన పిల్లలో క్షయ, ఆస్తమా, గొంతు సంబంధిత వ్యాధుల నివారణకు తయారుచేసే ఆయుర్వేద మందులలో గాడిద పాలను వినియోగిస్తారు. 

5.  గాడిద పాలలో ప్రొటీనులు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. కానీ మినరల్స్‌, విటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి. 

6. ఆవుల వల్ల వచ్చే అలెర్జీ సంబంధిత వ్యాధులు గాడిద పాలతో నయమవుతాయి. 

7. నవజాత శిశువులకు పూర్తి ఆహారాన్ని అందించడంతోపాటు వారిలోని చర్మవ్యాధులను నయం చేస్తుంది. 

8. గాడిద పాలలో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లల్లో ఎముకల పటిష్టత, విరిగిన ఎముకలను అతికించే స్వభావం అధికంగా ఉంటుంది. 

9. తల్లిపాలతో పోల్చుకుంటే కనీసం 60 రెట్ల విటమిన్‌ సి ఉంటుంది. అందుకే గాడిద పాల కోసం ఎగబడుతున్నారు.  

గాడిద పాలతో చేసిన ఛీజ్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఛీజ్‌.. అని ప్రకటించింది సెర్బియాకు చెందిన ఒక సంస్థ. గాడిదల్లో అత్యంత శ్రేష్టమైన జాతి ‘బాల్కన్‌’. ఈ జాతి గాడిద పాల నుంచే చీజ్‌ను తయారు చేస్తారు. ముందస్తు ఆర్డరు ఇచ్చిన వాళ్లకే బాల్కన్‌ డాంకీ ఛీజ్‌ అందుతుంది.

నవయవ్వన సాధనం!

గాడిదపాలు నవయవ్వన సాధనం కాగలదా? అంటే, ఇప్పటి వరకు వెలువడిన తాజా పరిశోధనలు ఔననే అంటున్నాయి. అంతేకాదు, గాడిదపాలతో దీర్ఘాయువు కూడా సాధ్యమేనంటున్నారు. ఈక్వెడార్‌లో దాదాపు ఏడేళ్ల కిందట మారియా ఎస్తర్‌ డి కాపోవిల్లా అనే మహిళ తన 116 ఏళ్ల వయసులో మరణించింది. బాల్యం నుంచి ఆమె రోజూ గాడిద పాలే తాగేది. కాపోవిల్లా మృతి దరిమిలా శాస్త్రవేత్తలు గాడిద పాలలో దీర్ఘాయువు కలిగించే లక్షణాలపై సాగించిన పరిశోధనల్లోనూ ఆశాజనకమైన ఫలితాలే వచ్చాయి. గాడిద పాలలో ఇన్ని విశేషాలు ఉన్నా, మన దేశంలో గాడిద పాల ఉత్పత్తి పారిశ్రామిక స్థాయికి చేరుకోకపోవడం గమనార్హం.

డాక్టర్‌ జి. రాంబాబు, పశు వైద్యాధికారి, కడప. సెల్‌: 9618499184

Read More

పాడి పశువులలో యుక్త వయస్సును ప్రభావితం చేసే అంశాలు యాజమాన్య పద్ధతులు

పశువులలో జననేంద్రియ వ్యవస్థ  పూర్తిగా అభివృద్ధి చెంది పునరుత్పత్తి జరపగలిగే విధముగా అండములను విడుదల చేసే థను ప్యూబర్టీ లేదా యుక్త వయస్సు అని అంటారు. సకాలములో యుక్త వయస్సుకు రాని పశువులను మేపుట రైతన్నలకు వ్యయముతో కూడిన పని. పశువులలో యుక్తవయస్సు వాటి జీవిత కాల సంతానోత్పత్తిపై చాలా ప్రభావం చూపిస్తుంది. పశువులు సరైన సమయానికి యుక్త వయస్సుకి చేరుకోవటం వలన సంభోగాన్ని త్వరగా ప్రారంభించవచ్చు. తద్వారా సంవత్సరానికి ఒక దూడను పొందటం సులువు అవుతుంది మరియు దీని వలన పశువుల యొక్క జీవిత కాలంలో వాటి నుండి ఉత్పత్తి  అయ్యే దూడల సంఖ్య పెరుగుతుంది.  తద్వారా రైతుల ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. 

యుక్త వయస్సును ప్రభావితం చేసే ప్రాధమిక అంశాలు 

పశువు యొక్క ఎన్నిక

ప్యూబర్టీ అనేది జన్యు మరియు జన్యు రహిత  కారణాల మీద ఆధారిపడి ఉంటుంది. అలాగే యుక్త వయస్సుకు చేరుకోవడం అనే అంశము వాటి యొక్క జాతుల మీద ఆధారిపడి ఉంటుంది. దేశవాళి పశువుల కంటే సంకర జాతి పశువులు యుక్త వయస్సుకి త్వరగా  రావటం గమనించవచ్చును. అలాగే వ్యవసాయానికి వాడే పశువుల కంటే పాలకొరకు వాడే  పశువులు  యుక్త వయస్సును  త్వరగా చేరుకుంటాయి. కోడె దూడల కంటే పెయ్య దూడలు యుక్తవయస్సుకి త్వరగా వస్తాయి. 

పశువు యొక్క వయస్సు మరియు శరీర బరువు

యుక్త వయస్సును ప్రభావితము చేయు అంశాలలో మరియొక ప్రధాన అంశము పశువు యొక్క శరీర బరువు. పెయ్యల పరిపక్వత వాటి వయస్సు కంటే కూడా శరీర బరువు మీద ఎక్కువశాతం  ఆధార పాడి ఉంటుంది.  సహజంగా సరి అయిన బరువు ఉన్న పశువులు తక్కువ బరువు కలిగిన పశువులతో పోల్చిన త్వరగా యుక్త వయస్సుకు రావడము  గమనించవచ్చును. సాధారణంగా పెయ్యలు వాటి వయోజన బరువులో 2/3 వంతు లేదా 60- 65 శాతము వృద్ధి చెందినప్పుడు ప్యూబర్టీ థకు చేరుకొనును మరియు ఆ థలో జననేంద్రియాల ఎదుగుదల సక్రమముగా జరిగి సంపర్కానికి సిద్ధమవును. దీనితో పాటుగా శరీరములోని  అన్నీ భాగాలు మరియు క్షీర గ్రంధులు కూడా బాగా వృద్ధి చెందటంతో పెయ్య యొక్క జీవిత కాల పాల ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకొనుటలో దోహదపడును. 

సమతుల్య పోషకాహారం మరియు పెరుగుదల

పశువు యుక్త వయస్సుకి చేరుకోవడానికి ప్రధాన అంశము అయిన శరీర బరువును చేరుకొనుటకు ప్రత్యక్ష మార్గము సమతుల్య పోషకాహారం అందచేయడము. ఈ విధానము దూడలకు ముర్రు పాలు పట్టడముతో మొదలయిన వాటి జీవిత కాల సహజ రోగ నిరోధక శక్తి నిర్వహణకు ఎంతగానో తోడ్పడును,  సమతుల్య పోషకాహార నిర్వహణలో భాగంగా కౌమార థకు చేరుకొనిన పశువులకు సమపాళ్ళలో పచ్చి మరియు ఎండు గడ్డిని, మరియు దాణాను అందిస్తూ అదనంగా ఖనిజ లవణముల మిశ్రమమును ఇచ్చినట్లయితే యుక్త వయస్సుకు అవసరమగు మంచి శరీర బరువును సకాలములో పొందగలవు. అసంపూర్ణ పోషణ వలన పెయ్యలలో ఎదుగుదల తగ్గిపోయి ప్యూబర్టీనీ  చేరుకోవాటానికి  చాలా ఆలస్యమవును. ఇటువంటి పశువులకు సమతుల్య పోషణను అందించిన యెడల అవి కూడా మంచి శరీర బరువుని పొంది, ప్యూబర్టీ థకు చేరి పునరుత్పత్తి సామర్థ్యమును పెంచుకొను ఆస్కారం కలదు.

వాతావరణ ప్రభావం

పశువులలో యుక్త వయస్సును ప్రభావితం చేసే కాలానుగుణ అంశాలలో ఋతువు అనేది ప్రధానమైనది. పాడి పశువులలో శీతాకాలం లేదా శరధృతువు అనేది యుక్త వయస్సు  ప్రారంభానికి అనుకూలంగా ఉంటుంది. కావున వసంత ఋతువు లేదా వేసవి కాలం లో పుట్టిన పెయ్యల కంటే  శీతాకాలంలో జన్మించిన పెయ్యలు 7 నెలల వయస్సుకి వచ్చేటప్పటికి వేసవి కాల ఉష్ణోగ్రత మరియు సూర్య కాంతి ప్రసరణ వలన యుక్త వయస్సుకు త్వరగా రావడము గమనించవచ్చును. వాతావరణం సానుకూలంగా లేనప్పటికీ నాణ్యమైన మేత, దాణ మరియు ఇతర జాగ్రత్తలు తీసుకున్న యెడల దీనిని అధిగమించవచ్చును. 

పోతులకు సమీపముగ ఉంచడం

కోడెలకు సమీపములో లేని పెయ్యలతో పోల్చిన సమీపములో ఉన్న పెయ్యలు త్వరితగతిన యుక్తవయస్సుకు చేరుకొనును. కావున పెయ్యలను కోడెలతో ఉంచుట ద్వారా లేక కలిపి మేతకి పంపుట ద్వారా కలిగే బాహ్య సంకేతాల వలన మరియు పశువుల మూత్రం మరియు లాలజలం నుండి విడుదలయ్యే ప్రత్యేకమైన రసాయనాల వలన  పెయ్య యొక్క జననేంద్రియాలు త్వరగా పరిపక్వత చెంది త్వరితగతిన ప్యూబర్టీ థను చేరుకొనును.  

హార్మోన్లు: యుక్త వయస్సు ప్రారంభములో హార్మోనుల పాత్ర చాలా కీలకమైనది.  ప్రాధమిక హార్మోనుల ఉత్పత్తి పశువు పోషణ, శరీర బరువు, కేంద్ర నాడీ వ్యవస్థ  మరియు ప్రత్యుత్పత్తి హార్మోనులను స్రవించు గ్రంధుల పని తీరును బట్టి  ఆధారపడి ఉండును. పశువులో ఉత్పత్తి అయిన ఈ హార్మోనులు, ఇతర ప్రత్యుత్పత్తి హార్మోనులను ప్రేరేపించి అండోత్పత్తికి అలాగే అండము విడుదలకు సహకరించును.తద్వారా పశువు త్వరితగతిన యుక్త థకు చేరి ఎద లక్షణాలను చూపును. 

వ్యాధులు: పశువుల యుక్తవయస్సు పైన దుష్ప్రభావాన్ని చూపు ప్రధాన కారణాలలో ఒకటి పశువులు వ్యాధి బారిన పడడము. ఈ వ్యాధులు  ప్రత్యక్షంగా పునరుత్పత్తి అవయవాల పైన చేదు ప్రభావాన్ని చూపుతూ లేదా పరోక్షంగా పశువుల జీవ క్రియ మరియు పోషక వినియోగములో ఆటంకం కలిగిస్తూ పశువు యుక్త వయస్సు చేరుకొనుటను ఆలస్యము చేయును.  

యాజమాన్య పద్ధతులు

  • పశువుల ఎన్నికలో మెళకువలు పాటించాలి.
  • దూడ వయస్సు నుంచే పోషణ నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి. దూడలకు ముర్రు పాలను పట్టుట వాటి  వ్యాధి నిరోధక శక్తిని పెంచుటలోనూ మరియు త్వరితగతిన యుక్త థకు చేరుకొనుటలో ఉపయోగపడును.
  • కౌమార థలో ఉన్న పశువులకు తప్పనిసరిగా సమతుల్య ఆహారమును, ఖనిజ లవణ మిశ్రమాన్ని తగు మోతాదులో అందించాలి.
  • సకాలంలో సరైన మోతాదులో నట్టల నివారణ మందులను త్రాపాలి.
  • కాలానుగుణంగా వ్యాధి నోరోధక టీకాలను సకాలంలో అందించాలి.
  • ప్రతీసారీ మందలో ఉండే పశువులతో కలపడం కంటే బయట పశువులతో దాటించడం వలన పుట్టే దూడలు యుక్తవయస్సుకు  వచ్చే కాలం మరింత తగ్గుతుంది.
  • పశువులను అధిక వేడిమి, వేడి గాలుల నుంచి రక్షణ కల్పించాలి.
  • పశువులకు తగు వ్యాయామమును కల్పించుట వలన మంచి దేహ ధారుడ్యము కలిగి త్వరగా యుక్త థకు చేరుకొనును.
  • యుక్త వయస్సుకు త్వరగా రాని పశువులను కొంత కాలము మగ పశువులతో కలిపి ఉంచుట సత్ఫలితాలను ఇచ్చును.

పైన తెలిపిన యాజమాన్య పద్ధతులు ఫలించని యెడల రైతులు ఆలస్యము చేయక  తమ పశువుకు పశు వైద్యునిచే పరీక్ష చేయించి తగిన వైద్యము అందించాలి. 

డా. కె. హిమ బిందు (7780726071), పి.జి. విద్యార్ధిని,

డా. యస్‌.రాధిక (6281354568) పి.జి, సహాయ ఆచార్యులు, 

పశు గర్భకోశ శాస్త్ర మరియు ప్రసూతి విభాగము, ఎన్‌.టి.ఆర్‌ పశు వైద్య కళాశాల, గన్నవరం,

శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి.

Read More

వానాకాలంలో పశుసంరక్షణ

ఈ సంవత్సరంతో పాటు రాబోయే 4-5 సంవత్సరాల వరకు వేసవి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, ఇందుకు విశ్వంలోని ఎల్‌నినో ప్రభావమే కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. దీని ప్రభావంతో రాబోయే వానాకాలం, శీతాకాలంలలో సైతం గతంలో మనకు కనిపించని వాతావరణ వైపరీత్యాలను ఎదుర్కొనే ముప్పులేకపోలేదు. ఉదాహరణకు గత ఏప్రిల్‌-మే నెలల్లో అనూహ్యంగా ఎదురైన అకాల వర్షాలు, వడగళ్ల వానలు, గాలి దుమారాలు, పిడుగుపాట్ల వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో జరిగిన పంట నష్టాలు, వాననీటిలో మునిగిన కల్లాలు, తడిసిన ధాన్యాలు, నీట తడిచిన మొక్కజొన్న, మిరప, పత్తి పంటలకేకాక తడిచిన గడ్డివాములకు కూడా జరిగిన నష్టాలు అపారం. పిడుగు పాట్లు, వడగళ్ల వానల వల్ల వందల సంఖ్యలో జీవాలు, పశువులు ప్రాణాలు కోల్పోవటమో లేదా తీవ్రంగా గాయపడటమో జరిగి పశుపోషకులు కూడా తీవ్ర నష్టానికి గురైనారు. కొందరు రైతులు ఈ నష్ట భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇటువంటి విపత్తులను రాబోయే  రోజుల్లోనైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ముందు ప్రణాళికలతో రైతాంగము మరియు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండుట చాలా అవసరం. పటిష్టమైన సమాచార వ్యవస్థ ద్వారా వాతావరణ హెచ్చరికలను రైతాంగానికి సకాలంలో అందించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. 

ఇక నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత సహజమైన వర్షాలు పడినప్పటికీ, గత వేసవి తీవ్రతలకు ఆకస్మికంగా మారిన వాతావరణ మార్పులకు, మేత సమస్యలకు గురైన పశువులలో వ్యాధినిరోధక శక్తి క్షీణించి, అవి సులువుగా అనేక రకాల వ్యాధులకు లోనై, ప్రాణాలను సైతం కోల్పోయే ముప్పు ఉండవచ్చు. ఇంతేకాక వేసవి తీవ్ర తాపానికి గురైన ఆరేడు నెలల చూడి పశువులలో గర్భస్రావాల సమస్య కూడా తీవ్రంగానే ఉండవచ్చు. మేపు లోపాలు, వాతావరణ తీవ్రతల కారణాల వల్ల చూడి థలోని పశువులలో పాల ఉత్పత్తి వ్యవస్థ కూడా కుంటుపడి రాబోయే ఈతలో ఆశించిన పాల ఉత్పత్తి ఉండక పోవచ్చును. కాబట్టి వేసవిలోనే కాక వర్షాకాలంలో కూడా చూడి పశువులకు అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలనూ తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేని ఎడల పాడి రైతు భారీగా నష్టపోయే ముప్పు ఉంటుంది.

వానలు, ముసురు, తుపాన్లు, వరదల రోజుల్లో గాలికుంటు, జబ్బవాపు, గురక, కుందేటి వెర్రి, ఎర్రమూత్ర వ్యాధి, లంపీస్కిన్‌ డిసీజ్‌, జీవాలలో చిటుక రోగం వంటి అనేక రకాల వ్యాధి క్రిముల్ని వ్యాపింప చేసే దోమలు, ఈగలు, పిడుదులు, గోమార్ల నిర్మూలన పట్ల ప్రత్యేక వ్రద్ధ వహించాలి. ఇందుకు పశువులను, పాకలను, పాకల పరిసరాలను పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మురుగు నిల్వ లేకుండా పటిష్టమైన మురుగు పారుదల ఏర్పాట్లు చేసుకొనుట చాలా అవసరం. కేవలం పాకలలోని అశుభ్రత వల్లనే ఎదురయ్యే పొదుగువాపు వ్యాధిని నివారించుటలో పాకల పరిశుభ్రత కీలక పాత్ర వహిస్తుంది. పాకలలో నాపరాళ్లను పరచి నేలను ఏర్పాటు చేసే పద్ధతి మంచిది కాదు. ఏదైనా ఒక నాపరాయి గిట్టల తాకిడికి పగిలినప్పుడు లేదా వాటి అతుకులు ఊడినప్పుడు వాటి క్రింద చేరిన మురుగు, బురదల వల్ల ఇతర నాపరాళ్లు కూడా కృంగిపోయి పగిలి పోవటం, పాక అంతా మురుగుమయమై పోయి పొదుగు వాపు వ్యాధి ప్రబలటమే కాక, పాల నాణ్యత కూడా క్షీణిస్తుంది. ఈ అశుభ్రత వల్ల దూడల మరణాలు కూడా పెరుగుతాయి. పటిష్టమైన కాంక్రీటు నేలను, తగిన వాలు, గరుకుతో ఏర్పాటు చేసుకొనుట ఉత్తమం.

వాతావరణంలో ఆకస్మిక మార్పులు నిర్వహణ లోపాలు అశుభ్రత, పోషణ లోపాల వల్ల వానాకాలంలో చూడి పశువులలో గర్భస్రావాలు, మెయ్యదిగటం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురుకావచ్చు. దీనిని నివారించుటకు పశువైద్య నిపుణుడితో సంప్రదించి అవసరమైతే అవసరమైన హార్మోన్ల ఇంజక్షన్లు వాడవలసి ఉంటుంది.

గత మూడేళ్లుగా మన పశు సంపదను, తీవ్రంగా దెబ్బ తీస్తున్న లంపీస్కిన్‌ డిసీజ్‌ నివారణకు కూడా టీకాలు వేయించుట చాలా అవసరం. రోగగ్రస్త పశువులను గుర్తించిన వెంటనే వాటిని ఇతర పశువుల నుండి దూరంగా వేరు చేయుట చాలా అవసరం. 

గర్భస్రావాలకు లోనైన పశువుల్ని, జీవాలను కక్షుణ్ణంగా గమనించి, వాటి మాయతో పాటు, స్రావాలను కూడా దగ్ధం చేయుట లేదా లోతుగా నేలలో పూడ్చి వేయాలి తప్ప, ఆరుబయళ్ల లోనూ నీటి వనరులలోనూ వదలివేయకూడదు. ఈ స్రావాలు, రక్తపు నమూనాలు మాయలను సమీపంలోని ప్రభుత్వ పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాలకు తీసుకు వెళ్లి పరీక్షలు చేయించి అంటురోగాలను గుర్తించి తగిన నివారణ చర్యల్ని చేపట్టాలి.

ముర్రా గేదెల పోషకుల పాలిట కొరకరాని కొయ్యగా ఉన్న ఎలర్జిక్‌ మామైటిస్‌ (ఖైలైటిస్‌) రొమ్ము వాపులను ఎంతో కొంత మేరకు నివారించేందుకు, ఆఖరి నెల చూడి థలో ఐవర్‌మెక్టిన్‌ ఇంజక్షను 7-8 మిల్లీలీటర్లు చర్మం క్రిందకు ఇంజక్షను 20 రోజులకొకసారి చేయిస్తే ఎలర్జిక్‌ మామైటిస్‌ వచ్చే అవకాశాలు తగ్గటంతో పాటు, పశువులకు అనేక రకాల ఇతర అంటు రోగాలను ప్రత్యక్షంగానే కాక, పరోక్షంగా కూడా కలిగించే వివిధ రకాల బాహ్య (దోమలు, కీటకాలు, పేలు, పిడుదులు వగైరా) మరియు అంతర్గత (నులిపురుగులు, జలగ వ్యాధి క్రిములు, ప్రేగులు, రక్తం మరియు వివిధ శరీర అవయవాలలో వృద్ధి చెందే) పరాన్న జీవుల బెడద చాలా వరకు తగ్గుతుంది. 

భారీవర్షాలు వరదల వల్ల నీటి వనరులు బురద మయమై పోవుట, మురుగునీరు త్రాగునీటి వనరులతో కలిసి పోవుట వల్ల అనేక రకాల వ్యాధి క్రిములు, కీటకాలు వృద్ధి చెంది పశువుల ఆరోగ్యాలకు, ప్రాణాలకు హాని చేయవచ్చును. వాతావరణ తేమ వల్ల వరిగడ్డితో పాటు దాణాలు కూడా బూజు పట్టి ఎఫ్లాటాక్సిన్లతో విషతుల్యమై దూడలతో పాటు పెద్ద పశువుల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్ల వచ్చును. బురద నీటి తేటపరచుటకు పటిక పొడి లేదా మునగ గింజల పొడి లేదా చిల్ల (ఇండుప) గింజ పొడులను వాడి తేట నీటిని పశువులు త్రాగుటకు అందించాలి. లేదా స్వచ్ఛంగా ఉండే బావి నీరు కూడా శ్రేష్టమే! అవసరమైతే మరిగించి చల్లార్చిన నీటిని సైతం అందించవలసి ఉంటుంది. పశువుల్ని బైటకు వదిలే ముందే శుభ్రమైన నీటిని సమృద్ధిగా త్రాగనిస్తే బైట కలుషితమైన, అశుభ్రమైన నీటిని త్రాగవలసిన అవసరం వాటికి ఉండదు.

వరదల సమయంలో పశునష్టం జరుగకుండా వాతావరణ శాఖ సూచనలను గుర్తించి పశువుల్ని ముందుగా ఎత్తైన ప్రాంతాలకు తరలించటం, విపత్తు సమయాలలో పశువుల్ని సులువుగా కట్టుకొయ్యల నుండి విడుదల చేసే ఏర్పాట్లు చేయటం మంచిది. ముసురు రోజుల్లో మేత కొరత ఏర్పడితే నేరేడు, మారేడు, గుర్రపు డెక్క, మునగ, అవిసె, అరటి, మల్బరీ, సుబాబుల్‌ వంటి ఆకులతోను, కూరగాయలు, పండ్లు, ఆకుకూరల వ్యర్థాలతోనూ కొంతవరకైనా పశువుల ఆకలి తర్చీవచ్చును. 

ముసురు, వరద, తుపాను సమయాలలో చలులు, అశుభ్రతల కారణంగా దూడలు ఎక్కువ సంఖ్యలో మరణించవచ్చును. కనీసం ఈ రోజుల్లోనైనా దూడలకు వెచ్చని శుభ్రమైన వసతి ఏర్పాట్లు చేసి సంరక్షించుట చాలా అవసరం! నేటి దూడలే కదా రేపటి కామధేనువులు!

మానవ అంచనాలకు అందని ప్రకృతి విపత్తుల వల్ల పశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు సంభవించే నష్టాలకు పరిహారం పొందుటకు పశువులన్నింటికీ వెంటనే బీమా చేయించుకోవాలని, ఇందుకు ప్రభుత్వాలు, పాల సహకార సంఘాలు, ప్రైవేటు డెయిరీ యాజమాన్యాలు అందిస్తున్న సబ్సిడీలు, సహాయ సహకారాలను సద్వినియోగ పరచుకోవాలనీ నా సూచన.

డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611

Read More