ఎండాకాలంలో పశువుల సంరక్షణ

ఎండాకాలంలో తీవ్రమైన ఎండల వల్ల పశువులు అధిక వేడి లేదా తాపానికి గురై ఉత్పాదక శక్తి కోల్పోవడమే కాకుండా కొన్ని సందర్భాలలో మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కనుక వేసవి కాలంలో వేడి నుండి పశువులను మరియు గొర్రెలు, మేకలను సంరక్షించుకోవడానికి తగిన సూచనలను పాటించవలసి ఉంటుంది. మొదటగా పశువులను గాని గొర్రె, మేక పిల్లలను గాని వీలైనంత వరకు ఉదయం 10 గంటల లోపు మరియు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటకు మేపుకు తీసుకెళ్లాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పశువుల కొట్టాలలోనే ఉంచాలి. పశువుల కొట్టాలు లేదా షెడ్‌ సౌకర్యం లేని వారు చెట్ల నీడలో పశువులను ఉంచవచ్చును. పశుగ్రాస వసతి సమృద్ధిగా ఉన్నప్పుడు షెడ్లలో మేపడమే శ్రేయస్కరము. కొట్టాలు లేదా షెడ్‌ చుట్టుపక్కల నీడనిచ్చే చెట్లను పెంచుకుంటే పశువులకు వేసవికాలంలో చల్లదనాన్ని అందిస్తాయి. పగటి సమయాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొట్టాలు లేదా షెడ్లకు గోనె సంచులు కట్టి తడపడం వలన లోపల వాతావరణం చల్లగా మారి పశువులకు అనుకూలంగా ఉంటుంది. 

ఎండాకాలంలో ప్రతి పశువుకు రోజుకు సుమారు 60 నుంచి 70 లీటర్ల త్రాగునీరు అవసరం అవుతుంది. కావున వేసవిలో తగినంత త్రాగునీరు పశువులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా పచ్చి మేత అందించాలి. మరియు దాణాను తడిపి ఇవ్వడం మంచిది. వాణిజ్యపరంగా పాడి పశువులు మరియు గొర్రెల, మేకల పెంపకం చేపట్టేవారు షెడ్లలో ఫ్యాన్లు, ఫాగర్సు, స్ప్రింక్లర్స్‌ ఏర్పరచుకొని ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేయవచ్చును. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దాణాతో పాటు ఖనిజ లవణాల మిశ్రమము మరియు పుష్కలంగా త్రాగునీరు ఇవ్వడం వలన పశువులు బలహీన పడకుండా తొందరగా డీహైడ్రేషన్‌కు గురికాకుండా సంరక్షించుకోవచ్చు. వేసవి తాపానికి గురైన పశువులు అధిక శరీర ఉష్ణోగ్రతను కలిగి, అధిక శ్వాస తీసుకుంటూ ఇబ్బంది పడుతుంటాయి. అలాంటి పశువులను గమనించి వెంటనే తల మరియు శరీర భాగాలను నీటితో తడుపుతూ సమీప పశు వైద్య అధికారిచే చికిత్స చేయించుకోవాలి. అదేవిధంగా కోళ్లకు వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా షెడ్‌పై స్ప్రింక్లర్లను మరియు షెడ్లు లోపల ఫాగర్స్‌ను ఏర్పాటు చేసుకున్నట్లయితే చల్లటి వాతావరణాన్ని అందించగలం. పైన తెలిపిన విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని వేసవికాలంలో పశువుల యాజమాన్య పద్ధతులను సరిగ్గా పాటించినట్లయితే ఎండ వేడి నుంచి పశువులను సంరక్షించుకోవచ్చు.           దీ

డా|| కె. అర్చన, సబ్జక్ట్‌ మేటర్‌ స్పెషలిస్ట్‌, కెవికె, రామగిర్‌ కిల్లా.

Read More

పారదర్శకత ‘విజయ’ ప్రత్యేకత

ఒక నమ్మకం… రోగి గొంతులో అమృతమవుతుంది. ఒక విశ్వాసం… ఆటగాడికి ఊపిరి అవుతుంది. ఒక భరోసా… చంటి పిల్ల ఆకలి తీరుస్తుంది. దైనందిన జీవితంలో అంతర్బాగమైన పాలు, పాల ఉత్పత్తులు కేవలం నాణ్యత, నమ్మకం, విశ్వసనీయత పునాదులపై నిలుస్తుంది.

చిన్న, సన్నకారు రైతుల నుండి ప్రామాణిక పద్ధతుల్లో సేకరించి, నాణ్యతా పరీక్షలు చేసి, 24 గంటల్లో శుద్ధీకరించి ప్యాకింగ్‌ చేసి ఇవ్వగల సత్తా ఒక్క సహకార డెయిరీలకే సాధ్యం.

పాడి రైతుల నుండి మంచి పాలకు మంచి ధర అందించాలనే సమాఖ్య ఛైర్మన్‌ సోమ భరత్‌ కుమార్‌, ఎం.డి. అధర్‌ సిన్హాల స్వప్నం ఫలించి ‘పాలమిత్ర యాప్‌’ అందుబాటులోకి తేబడింది. రైతు చెంతనే పాల పరీక్ష జరిపి, వెనువెంటనే అతడి చరవాణికి పాల కొలత, ధర, పాలకు వచ్చే మొత్తం డబ్బులు సంక్షిప్త సమాచారం రూపంలో అందించే దిశగా ‘విజయ తెలంగాణ’ పారదర్శకతకు పెద్దపీట వేసింది. పైలట్‌ ప్రాజెక్టుగా మొదట జనగామ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ప్రారంభించి, క్రమేపి అన్ని జిల్లాల్లో ఈ విధానాన్ని విస్తరించడం జరుగుతుంది. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 పాల పరిధుల్లో 5250 పై చిలుకు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా, 1,50,000 పైగా పాడి రైతులు పాలను విజయ డెయిరీకి అందిస్తున్నారు.

ఈ యాప్‌ ద్వారా 15 రోజులకోసారి పాల పైకం, రైతు బ్యాంక్‌ అకౌంట్‌లో జమ అవుతుంది. పాల సేకరణ స్థాయిలోనే పాల కొలత, నాణ్యత నమోదు చేయబడతాయి. అంతేకాక, పాడి రైతులకు వెనువెంటనే సంక్షిప్త సందేశం రూపంలో పాల వివరాలు చేరవేయబడతాయి. రిజిస్టర్లలో, పుస్తకాల్లో కాకుండా పాల కొనుగోలు వివరాలు మొబైల్‌ యాప్‌ ద్వారా సరళంగా నమోదు చేసే వాలున్న ఈ ‘యాప్‌’ సహకార రంగంలోనే ఒక మైలు రాయి. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ ద్వారా ఈ యాప్‌ వెలువరించబడగా, రోజు వారీ పాల ధర తెలవడం రైతు కష్టానికి తగు ప్రతిఫలం అందించినట్లవుతుంది. 

అంతేకాక, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా పాడి పశువుల కొనుగోలుకు ఒప్పందం చేసుకుని పాడి రైతులకు భరోసా కల్పిస్తోంది విజయ తెలంగాణ.

పాడి పరిశ్రమ పసిడి బాటలో నడవడానికి కావలసిన పశుదాణా, లవణ మిశ్రమం, దాణా పోషఖాలు అందిస్తోంది.

మౌలిక స్థాయిలో పాడి రైతుల సంఘాల ఏర్పాటు, మూతబడిన సుమారు 70 బల్క్‌కూలింగ్‌ యూనిట్లను పాడిరైతులు/ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నిర్వహణ ఖర్చులు అందించి నడిచేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని, రాబోవు కొన్ని నెలల్లో అందుబాటులోకి వచ్చే మెగా డెయిరీ పాల నిర్వహణ సామర్థ్యం పూర్తిగా వినియోగించుకునేలా అడుగులు వేస్తోంది.

శిక్షణలు, సామర్థ్యాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామ స్థాయిలో నాణ్యమైన పాలసేకరణ, గ్రామాల్లో వినియోగించే పాల పరీక్షా పరికరాల పనితీరు మెరుగుపర్చడం లాంటి చర్యలు చేపట్టింది. అవకాశమున్న చోట తెలంగాణ ఆగ్రో కేంద్రాల ద్వారా పాలసేకరణ కూడా చేపడుతూ పాడి పశువుల కొనుగోలుకై ముద్ర, పిఎంఈజిపి, కెసిసి ఋణాలు, పశుసంవర్థక శాఖతో వైద్యశిబిరాలు, గోపాలమిత్రల సేవలను పాల ఉత్పత్తి పెంపుదలకు ఉపయోగించుకోవడం లాంటి పలు చర్యలతో స్వయం సమృద్ధి దిశగా విజయ తెలంగాణ అడుగులు వేస్తోంది.  

మధుసూదనరావు, ఉప సంచాలకులు, విజయ డెయిరీ, ఆదిలాబాద్‌

Read More

పశువుల్లో గాలికుంటు వ్యాధి  నివారణ, చికిత్స, నియంత్రణ

మనుషులలో కరోనా వైరస్‌ లాగానే పశుగణాలను కూడా వేధిస్తున్న అంటువ్యాధుల్లో మహా ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధిని ఆంగ్లంలో ‘ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌’ అని అంటారు.

కలుషితమైన గాలి ద్వారా సోకే ఈ గాలికుంటు వైరస్‌ వ్యాధి ఒకప్పుడు మార్చి నుండి సెప్టెంబర్‌ మాసాల మధ్య వ్యాపించేది, కానీ ఈ మధ్యకాలంలో ఏడాది పొడవునా పశువులు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధి పశువులలోనే కాక సన్నజీవాలకు వ్యాప్తి చెందుతుంది.

పరిచయం: ఎఫ్‌.యం.డి. (ఫుట్‌ అంట్‌ మౌత్‌ డిసీజ్‌) అనగా గాలికుంటు వ్యాధి అని అంటారు. ఈ వ్యాధి ముఖ్యంగా వైరస్‌ (జుచీశినీళిఖీరిజీతిరీ) వలన వ్యాప్తి చెందుతుంది. ఎఫ్‌.యం.డి. (గాలికుంటు వ్యాధి) అనేది వేగంగా ఒక పశువు నుండి మరొక పశువుకు వ్యాప్తి చెందును. (ఇది ఇన్ఫెక్షియస్‌ మరియు కంటేజియస్‌ వ్యాధి). ఈ వ్యాధి ప్రత్యేకంగా రెండు గిట్టలు కలిగినటువంటి జంతువులు ఉదా: ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులకు వ్యాపిస్తుంది.

కారకము

  • ఈ వ్యాధి 7 రకములు కలిగి ఉన్న జుచీశినీళిఖీరిజీతిరీ వలన కలుగుతంది.
  • మన దేశంలో ం, జు, ్పు, జురీరిబి-| రకాలు వలన వ్యాప్తి చెందుతుంది.
  • ఈ వ్యాధి పశువులకు అన్నింటికీ సోకుతుంది కానీ. ఈ వ్యాధి బారిన పడినటువంటి పశవుల మరణాలు చాలా తక్కువగా ఉంటాయి.

వ్యాధి వ్యాప్తి

  • పశువులు తినే గడ్డి, మేత, కలుషితమైన గాలి ద్వారా సోకే అవకాశం కలదు. అలాగే పశువుల శాఖలో పనిచేయువారి వలన, గడ్డి కోయు యంత్రాల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది.
  • తల్లి పాల ద్వారా దూడలకు వ్యాప్తి చెంది మొత్తం పశుగణం అంతా వ్యాధిబారిన పడే ప్రమాదం కలదు. కావున రైతులు జాగ్రత్త వహించి, తగిన నివారణ చర్యలు ముందుగా తీసుకోవలెను.

వ్యాధి లక్షణాలు:

  • వ్యాధి సోకిన పవువులు ఈ క్రింది తీవ్రమైన లక్షణాలను చూపుతాయి.
  • ఈ వ్యాధిబారిన పడిన పశువులు అధిక జ్వరం (105-106 డిగ్రీ ఫారెన్‌హీట్‌) (40-41 డిగ్రీ సెంటీగ్రేడ్‌)తో బాధపడుతుంటాయి. మరియు మేత తినడం ఆపివేయును.
  • పాలిచ్చే పశువుల యందు పాలదిగుబడి గణనీయంగా తగ్గిపోవును.
  • ఒకటి లేదా రెండు రోజులలో జ్వరం తగ్గుముఖం పట్టినప్పటికీ నోరు మరియు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి ఉండును, నోటి నుండి తీగల వంటి జొల్లు కారడం మరియు అధికంగా లాలాజలం ఊరడం అనేది జరుగుతుంది.
  • వ్యాధి సోకిన పశువు నోరు తెరచి గమనించినట్లయితే నోటి లోపల మరియు నాలుకపై పుండ్లు (1-2 సెం.మీ. డయామీటర్‌) కనిపించును. అంతేకాక గిట్టల మధ్యన పుండ్లు ఉండటంవలన పశువు సరిగా నడవలేక పోతుంది. వీటిని గమనించిన వెంటనే పశువైద్యులని సంప్రదించాలి.

చికిత్స: పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణంతో గిట్టల మధ్య పుండ్లను బాగా శుభ్రంగా కడగవలెను.

  • నోటిలోని పుండ్లను ఉప్పు నీటితో కడగవలెను. అలాగే బోరిక్‌ పౌడర్‌+గ్లిసరిన్‌ పేస్ట్‌ను పూత ముందుగా రాసినట్లయితే పుండ్లు తగ్గుముఖం పడతాయి.
  • నోటిలో పుండ్లు ఉండటం చేత మేత తీసుకొనలేవు కాబట్టి మెత్తటి పదార్థాలను అనగా రాగి జావ త్రాగించడం వంటివి, గంజి లాంటి ద్రవ పదార్థాలను మేతగా ఇవ్వవలెను.
  • పుండ్ల పైన ఈగలు వాలకుండా మరియు యాంటిసెప్టిక్‌ ఆయింట్‌మెంట్‌లని ఉపయోగించవలెను.
  • బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌ ఆంటిబయోటిక్‌ మందులు మరియు శ్రీఐజు|ఈని మూడు నుండి ఐదు రోజుల వరకు వాడవలెను.
  • ఈ వ్యాధి సోకడం వలన శక్తి కోల్పోతాయి. కాబట్టి మల్టీ విటమిన్‌ సిరప్‌లు మరియు లివర్‌ టానిక్‌ మందులను వాడుకోవలెను.

నివారణ చర్యలు

  • వ్యాధి సోకిన తరువాత మందులు వాడినప్పటికీ తక్కువ ఫలితాలను ఇచ్చును. కాబట్టి ముందస్తు టీకాలు వేయించుకోవాలి.
  • ఈ వ్యాధి సోకకుండా ఉండుటకు వేయు టీకాలు ముఖ్యంగా రెండు దఫాలుగా వేస్తారు. అనగా 6 నెలలకి ఒకసారి టీకాలు వేయించుకోవాలి.
  • ఈ వ్యాధి సోకకుండా వేయు టీకా మందులను ఫిబ్రవరి/మార్చి మరియు ఆగస్టు/సెప్టెంబర్‌ మాసాల యందు వేస్తూ ఉంటారు.
  • చిన్నపాటి జ్వరం మరియు పాలు తగ్గినప్పటికీ అధైర్యపడకుండా ఈ టీకాలు వేయించుకున్నట్లయితే పశువులలో ఈ వ్యాధి వ్యాపించకుండా నివారించవచ్చును.
  • 4 నెలలు మరియు ఆపై వయస్సు కలిగిన దూడలకి, పశువులకి టీకాలు వేయించాలి.

నియంత్రణ: వ్యాధి సోకిన పశువుల నుండి ఆరోగ్యకరమైన పశువులను దూరంగా ఉంచాలి. పశువులు ఉండు ప్రదేశం నందు వాషింగ్‌ సోడా లేదా సున్నం పిచికారి చేయడం వలన వైరస్‌ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన పశువులకు కూడా టీకాలు వేయించాలి.   

డా. యం. వెంకట ప్రసన్న, ఎం.వి.ఎస్‌.సి., పశువైద్యురాలు, మైదుకూరు. సెల్‌: 83097 24436

Read More

పాడిపశువుల ఎంపికలో మెళకువలు

పాడి పరిశ్రమను కొత్తగా చేపట్టే వారికి, పాడి పశువుల ఎంపిక పెద్ద సమస్యగా కనిపిస్తుంది. ముఖ్యంగా, ఇటీవల తెలంగాణలో ‘దళితబంధు’లో భాగంగా, పాడి పరిశ్రమ పట్ల కొంతమంది ఆసక్తి చూపడం సంతోషించదగిన విషయం. కానీ, పూర్తి అవగాహన, పాడి ఉత్పత్తుల మార్కెటింగ్‌ పట్ల నిర్దిష్ట దృక్పథం లేకపోతే, పాడిపరిశ్రమ లేదా గేదెలతోనా పాడి పరిశ్రమ చేపట్టడం, దాని వలన లాభనష్టాలు సరైన రీతిలో లబ్దిదారులకు వివరించకపోవడం వలన, ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు. వీలైనంత వరకు, పక్క రాష్ట్రాల నుండి పాడి పశువుల కొనుగోలు చేస్తే, వాతావరణపరంగా, అవి పాల దిగుబడి స్థిరంగా ఇస్తాయి. మంచి పాడిపశువుల ఎంపికలో పాడి పశువుల జాతి, వాటి వంశ చరిత్ర పాల ఉత్పత్తి వివరాలు, శరీర లక్షణాలు అనే నాలుగు ప్రధాన అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఆవుల్లో మంచి దేశవాళీ ఆవులుగానీ, సంకరజాతి జెర్సీ, హెచ్‌.ఎఫ్‌. జాతులు, గేదెల్లో జాఫ్రాబాదీ, గ్రేడెడ్‌ ముర్రా జాతులు ఎంపిక చేయడం మంచిది. రోజుకు కనీసం 10 లీ. తక్కువగాకుండా పాల దిగుబడి ఉన్న పాడిపశువులు ఎంపిక చేయాలి. 2-6 పళ్ళు వేసిన పాడి పశువులను, దూడతో సహా కొనుగోలు చేయాలి. సాధారణ శరీర లక్షణాలకు 30 మార్కులు, పాడి లక్షణాలకు 20 మార్కులు, శరీర సామర్థ్యానికి 20 మార్కులు, పొదుగు ఆకారం, స్థితికి 30 మార్కుల స్కోర్‌ కార్డ్‌పై మార్కులు వేసుకుని అంచనా వేయాలి.

పాడి పశువు ఆరోగ్యంగా, చురుకుగా, ఆకర్షణీయంగా ఆడలక్షణాలు ఉండాలి. శాంత స్వభావం, వెనకనుండి త్రికోణాకారంలో ఉండి, పొదుగు, రోమాలు ఆరోగ్యంగా ఉండేలా చూడాలి. చర్మం శుభ్రంగా ఎలాంటి చర్మ వ్యాధులు లేకుండా, కాలిగిట్టలు మందమైన అరికాళ్ళతో, డొక్కలు నిండుగా ఉండేలా చూడాలి. పాలనరాలు పొదుగుకు ఇరువైపులా, స్పష్టంగా పైకి ఉబ్బి ఉండాలి.

వీలైనంతవరకు రైతువద్ద పశువుల కొనుగోలు చేయాలి. పాలను రెండు, మడు రోజులు పిండి, చూసి తీసుకోవాలి. టీకాలు వేయించినవి, పొదుగువాపు లాంటి వ్యాధులు లేని పాడి పశువులకు ఎంపిక చేయాలి. కొనేచోట, పాడిపశువుకు అలవాటైన ఆహారాన్ని తెలుసుకుని, పశువు కొనుగోలు, తర్వాత, 5-6 రోజులు అదే ఆహారాన్ని ఇస్తూ, స్థానికంగా దొరకే పశుగ్రాసాలు, దాణా అలవాటు చేయాలి. బీమా విషయంలో రవాణా బీమా పశువుకు బీమా తప్పకుండా చేయించాలి. పాడి పశువు కొనుగోలు చేయడానికి మూడు నెలల ముందు నుంచే పశుగ్రాసాల పెంపకం చేపట్టాలి.

ఏదిఏమైనా, దూడలు తెచ్చుకుని 1-2 సం|| మన ప్రాంతాల్లో మేపి, వాటితో పాడిపరిశ్రమ విస్తరించడం అనేది శ్రేయోదాయకం. అప్పుడే స్థిరమైన పాల దిగుబడి, పాడి విస్తరణ సాధ్యపడుతుంది.

మధుసూదనరావు, ఉపసంచాలకులు, విజయడెయిరీ, ఆదిలాబాదు.

ఫోన్‌ : 9121160553

Read More

పాడిపశువులలో ఎదను గుర్తించటం, కృత్రిమ గర్భధారణ ప్రాముఖ్యత

పాడి పశువుల ఉత్పాదక శక్తి పశువుల పునరుత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. పాడి పశువులలో ఎదను సరైన సమయంలో గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయడం అతి ముఖ్యమైనది. ఇలా చేయడం ద్వారా వలన ఈతల మధ్య వ్యవధి తగ్గి పాడి పరిశ్రమ లాభదాయకంగా కొనసాగుతుంది. యుక్త వయస్సు వచ్చిన ఆడ పశువుల్లో అండాశయంలో ఉత్పత్తి అయిన హార్మోన్ల వలన అసహజమైన లక్షణాలను ప్రదర్శిస్తాయి. ఈ స్థితిని ఎద అని అంటారు.

దేశవాళి పశువులు 3-4 సంవత్సరాల వయస్సులో ఎదకు వచ్చి 4-5 సంవత్సరాలలో మొదటి ఈత ఈనుతాయి. అదే సంకరజాతి పశువులు ఒకటిన్నర సంవత్సరం వయస్సులోపు ఎదకు వచ్చి 2-3 సంవత్సరాల వయస్సులో తొలి ఈత ఈనుతాయి.  సాధారణంగా పశువులు 3 వారాలకొకసారి ఎదకు వస్తాయి. ఎద కాలం ఆవులలో 18-24 గంటలు, గేదల్లో 24-36 గంటలు ఉంటుంది. ఎద కాలంలోనే పశువులు సంపర్కానికి సిద్దంగా ఉండి మగ పశువుల్ని దాటనిస్తాయి.


పశువుల్లో ఎద లక్షణాలు: 

ఎద కాలం సాధారణంగా మూడు థలుగా విభజించవచ్చును. మొదటి థలో మానం నుండి పలుచని తీగలు వేస్తుంది. రెండవ థలో మానం నుండి కోడిగ్రుడ్డు  తెల్ల సొన లాగ చిక్కగా తీగలు వేస్తుంది. మూడవ థలో అండము విడుదలయి, వీర్య కణముతో కలిసి ఫలదీకరణం చెందుతుంది. గేదేలలో కంటే ఆవులలో ఎద లక్షణాలు తేలికగా గుర్తించవచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రత్యేకించి గేదేలలో ఎద కాలం 8-12 గంటలు మాత్రమే ఉంటుంది.


గేదేలలో మూగ ఎద: 

ఆవులలో లాగా గేదెలు ఎద లక్షణాలను స్పష్టంగా బహిర్గతం చేయలేక పోవడాన్ని మూగ ఎద అంటారు. గేదె మానం తెరచి చూస్తే లోపలి పొర ఎర్రగా ఉంటుంది. తీగలు తోకను, మానం పై అతుక్కొని ఆరిపోయి ఉంటాయి. గేదె అరుపు తక్కువ స్థాయిలో ఉంటుంది. మూగ ఎదను టీజర్‌ ఆంబోతు ద్వారా గుర్తించవచ్చు.
ఎదకు రాకపోవటం:

 ఇది రెండు రకాలుగా ఉంటుంది. 1. ఆలస్యంగా పొర్లుకు రావటం 2.ఈనిన తరువాత సకాలంలో ఎదకు రాకపోవటం*    బాహ్య పరాన్నజీవులు, అంతర పరాన్నజీవుల బెడద, వ్యాధుల బారిన పడటం మరియు ఎక్కువ కొవ్వుపట్టిన పశువు ఎదకు సరిగా రాదు.*    వేసవిలో అధిక వాతావరణ ఉష్ణోగ్రత, వడగాల్పు, గాలిలో అధిక తేమ శాతం ఉన్నప్పుడు పశువు ఎదకు రావటం కష్టం.*    పశువు శరీరంలో కాపర్‌, కోబాల్ట్‌, మాంగనీస్‌ మొదలైన ముఖ్యమైన ఖనిజాలు లోపించడం*    పుష్టికరమైన ఆహరం లోపించడం, విటమిన్‌ ‘ఎ’ లోపించడం, అండాశయంలో కాయతో పాటు ఇతర లోపాలు ఏర్పడటం, వ్యాధుల బారిన పడటం, పశువు ముసలిది కావటం, పుట్టుకతోనే కొన్ని లోపాలు సంక్రమించడం, అండాశయం సక్రమంగా వృద్ది చెందకపోవటం.
పశువు సకాలంలో ఎదకు రావాలంటే….

*    పశువులలో పునరుత్పత్తి సామర్థ్యం పెంచుటకు మేపు చాలా ముఖ్యం. పచ్చిగడ్డి కొరత నివారించటానికి సైలేజ్‌ గడ్డిని తయారుచేయడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి.

*    బాహ్య పరాన్నజీవులు,అంతర పరాన్నజీవులను నిర్మూలించాలి.

*    అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల నుండి పశువుల్ని సంరక్షించాలి. పశువు పై నీళ్ళు చల్లుతూ శీతల పరిస్థితిని కల్పించాలి. 

*    పశుపోషకుడు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు (ఈనిన 45 రోజుల తరువాత) పరిశీలిస్తే ఎదలోని పశువుల్ని సులభంగా గుర్తించవచ్చును.

*    మూగ ఎద, బలహీనమైన ఎదల సమస్యలు ఉన్న పశువులకు ప్రతిరోజు 500-1000 గ్రాముల మొలకెత్తిన ఉలవలు, శనగలు, గోధుమలను వంటి ధాన్యాలను 20-30 రోజులు మేపాలి.

*    గర్భకోశ వ్యాధులకు తగిన వైద్యం చేయించి ఫలితాలు పొందాలి వైద్యం చేసిన తరువాత కూడా చూడి కట్టించడం లేకపోయినచో పశువును మంద నుండి తొలగించాలి.

*    విటమిన్‌ ఏ, డి, ఇ లను ఇంజక్షన్‌ రూపంలోనూ, కాపర్‌, భాస్వరం, జింక్‌, సెలీనియం మొదలగు ఖనిజ లవణాలను మినరల్‌ మిక్సర్‌ రూపంలో రోజుకు 50 గ్రాములు అందించాలి.

*    ఎక్కువ కొవ్వు పట్టిన గేదెకు/ఆవుకు సరిపోను వ్యాయామం కల్పిస్తే చాలు చురుకుగా తయారయ్యి పశువులు ఎదకు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి.

*    పశువు ఈనడానికి రెండు మాసాలు ముందు నుండి పాలు పితకడం మాని వేసినచో ఈనిన తర్వాత ఎదకు తొందరగా రావచ్చును. సైక్లోమిన్‌ బిల్లలను వారానికి ఒకటి చొప్పున పశువులు ఎదకు వచ్చేంతవరకు ఇవ్వాలి. జెనోవా లేక ప్రజానా మందులను రోజుకు మూడు చొప్పున రెండు రోజులు వాడాలి.

*    పశువు ఈనిన తర్వాత మొదటి సారి 11 నుండి 17 రోజుల్లో ఎదకు వస్తాయి కానీ ఆ రెండవ సారి 35 నుంచి 45 రోజుల్లో ఎదకు వచ్చినప్పుడు చూడి కట్టిస్తే 90% పశువుల్లో చూడి నిలిచే అవకాశాలు ఉంటాయి.

*    పశువులలో హార్మోన్‌ లోపాలు ఉన్నవని గ్రహించినచో  హార్మోన్లు వాడి పశువులను ఎదకు తేవచ్చును.

*    పశు గర్భకోశ ద్వారంలోకి లుగాల్స్‌ అయోడిన్‌ పంపించి అండాశయాన్ని సున్నితంగా మర్దించి చురుకుగా తయారు చేయించినచో పశువు ఎదకు రావచ్చును.

ఎదలో ఉన్నప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

*    రైతులు తమ పశువు ఎద లక్షణాలను గుర్తించి సరైన సమయంలో గర్భధారణ చేయించినచో సకాలంలో గర్భం ధరించి, తిరిగి సకాలంలో పాల ఉత్పత్తి మొదలవుతుంది.

*    పశువు ఈనిన 45 రోజుల తర్వాత వచ్చే మొదటి ఎదలో గర్భధారణ చేయించినచో చూడి నిలిచే శాతం అధికంగా ఉంటుంది. గర్భధారణ చేయించిన తరువాత 17 నుండి 26 రోజుల మధ్య క్రమం తప్పకుండా పశువును జాగ్రత్తగా పరిశీలించి తిరిగి ఎదకు వచ్చినదీ లేనిది నిర్ణయం తీసుకొని, అవసరమైనచో తిరిగి గర్భధారణ చేయించాలి.

*    రైతులు పశువు మొదటి ఎదకాలం జాగ్రత్తగా గమనించి వెంటనే గర్భధారణ చేయించడం మంచిది.*    మూగ ఎదకు వచ్చిన పశువులలో ఎద మామూలు కాలం కన్నా ఎక్కువ కాలం ఉండవచ్చును అందుచేత రెండవసారి ఇన్సెమినేషన్‌ చేయించవలసి వస్తే చేయించాలి.

 *    కొన్ని పశువులలో ఎద36 గంటలు దాటి మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉండవచ్చును. కనుక గర్భధారణ చేసిన తర్వాత పశువును మూడు నుంచి నాలుగు రోజులు జాగ్రత్తగా గమనించి అవసరమైనచోతిరిగి గర్భధారణ చేయించాలి.

*    10 నుండి 15 శాతం పశువులు ఎక్కువగా గేదేలలోను, సంకరజాతి పశువులలోను ఎదకు వచ్చిన 7 నుండి 10 రోజుల లోపు మళ్ళీ వస్తాయి (ఐచీజిరిశి నీలిబిశి). కనుక గర్భధారణ చేసిన ఏడవ రోజు నుండి పదవ రోజు వరకూ పశువును జాగ్రత్తగా పరిశీలించి అవసరమైనచో గర్భధారణ చేయించాలి.

*    అరుదైన సందర్భాలలో 4 నుంచి 5 రోజులలో లేక ప్రతి వారం అస్తవ్యస్తంగా పశువులు ఎదకు వస్తాయి.

 *    కొన్ని సందర్భాలలో 3 నుంచి 5 నెలల చూడి కాలంలో పశువులు ఎదకు వస్తాయి. దీనిని చూడి ఎద అని అంటారు. గర్భధారణ చేయించకూడదు. రైతులు పశువుల ఎద లక్షణాలను పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం సకాలంలో చూడి కట్టించుటకు ఇది చాలా అవసరం.

*    గర్భధారణ ఎద మధ్య థ నుండి చివరి థ వరకు చేయించవచ్చు. ఈ థలో చూడి కట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

*    పశువు అరవగానే వీర్య దానం చేయించరాదు. ఎద మొదలైన 12 గంటల తర్వాత గర్భధారణ చేయించాలి అనగా ఉదయం ఎదకు వస్తే సాయంత్రం, సాయంత్రం ఎదకు వస్తే మరుసటి రోజు ఉదయం గర్భధారణ చేయించాలి. ఆరు గంటల తేడాతో రెండుసార్లు గర్భధారణ చేయిస్తే ఫలితాలు బాగుంటాయి.గేదేలలో ఎద కాలం 24 నుంచి 36 గంటలు ఉంటుంది. అది ఎదకు వచ్చిన 24 గంటల తర్వాత వీర్యదానం చేయించాలి అనగా ఉదయం ఎదకు వచ్చిన మేరకు మరుసటి రోజు ఉదయం సాయంత్రం వరకు వచ్చిన గేదెకు మరుసటి రోజు సాయంత్రం చూడి కట్టించాలి.చూడి కట్టించడం ఆలస్యం చేస్తే కట్టు నిలిచే అవకాశాలు తగ్గిపోతాయి.

*    సరైన సమయంలో గర్భధారణ చేస్తే 70 శాతం పశువులు మొదటి సారే చూడి కడతాయి.

 *    పశువులు ఎదకు రావడానికి వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ తక్కువగా ఉన్న సమయాలు మిక్కిలి అనుకూలంగా ఉంటాయి.

*    సహజ సంపర్కం: ఒక ఆవునుగానీ, గేదెనుగానీ ఎదకు వచ్చినప్పుడు ఆబోతు చేతగాని/ దున్నపోతు చేతగాని దాటించి గర్భధారణ చేయడాన్ని సహజ సంపర్కం అంటారు. ఈ పద్ధతి పూర్వకాలం నుండి ఆచరణలో ఉన్న పద్ధతి.

*    కృత్రిమ గర్భోత్పత్తి : మేలు జాతి ఆబోతు వీర్యాన్ని పరికరాల సహాయంతో శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ఆడ పశువు గర్భకోశంలో సకాలంలో ప్రవేశపెట్టి గర్భం ధరించేటట్లు చేసే ప్రక్రియనే శాస్త్రీయ గర్భోత్పత్తి లేదా కృత్రిమ గర్భధారణ అంటారు.


కృత్రిమ గర్భధారణ లాభాలు :

*    పాల దిగుబడులు పెంచుటకు అధిక పాల దిగుబడి ఇచ్చే మేలుజాతి పశువులను ఉత్పత్తి చేయడానికి కృత్రిమ గర్భధారణ పద్ధతి అనుసరించాలి.

*    తక్కువ ఖర్చుతో జాతిని మెరుగుపరచి అధిక పాల దిగుబడి పొందవచ్చు.

*    అధిక పాల సార కలిగిన ఆంబోతుల వీర్యాన్ని ప్రపంచంలోని ఏ మూల నుంచైనా తెచ్చుకొనవచ్చు.

*    మినీ డెయిరీలలో ఆబోతు మేపటం ఖర్చుతో కూడుకున్న పని. గర్భధారణ వల్ల తక్కువ ఖర్చుతో చూడి కట్టించుకొనవచ్చు.

*    కృత్రిమ గర్భధారణ పద్ధతిలో ఆబోతులకు ఉండే సుఖవ్యాధులు లేదా ఆవులలోని గర్భకోశ వ్యాధులు, ఆంబోతుల ద్వారా ఇతర పశువులకు సంక్రమించకుండా నిరోధించవచ్చు. 


గర్భధారణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు 

*    ఎద లక్షణాలు కనిపించగానే పశువును వేరు చేసి కట్టి ఉంచాలి.

*    తొలిసారి గర్భధారణ చేసే పడ్డలు/పెయ్యలు బాగా బలంగా ఉండి, తగిన ఎత్తు పెరిగి ఉండాలి. సుమారుగా ఆవు దూడలు 200 నుండి 250 కిలోల బరువు, గేదె దూడలు 250 నుంచి 300 కిలోల బరువు ఉంటే మంచిది.*    ఆరోగ్యంగా ఉన్న పశువులకు మాత్రమే గర్భధారణ చేయించాలి. 

*    అనారోగ్యంగా ఉన్న పశువులకు, తగినంత బలంగా లేని పశువులకు, గర్భవాతం ఉన్న పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించరాదు.

*    పాడి పశువులు వేసే తీగలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఎద మధ్య థ నుండి చివరి థ వరకు పశువు మానం నుండి తీగలు బాగా వేస్తుంది. తీగలు తొడ పైన, తోకకు అంటుకొని మెరుస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో గర్భధారణ చేయించి మంచి ఫలితాలను పొందవచ్చు.

*    ఇన్సెమినేషన్‌ చేసేముందు,  చేసిన తర్వాత పశువుకు విశ్రాంతినిచ్చి బెదరకుండా చూడాలి. పశువును కొట్టడం,  పరిగెత్తించడం చేయ కూడదు. ఉద్రేకానికి గురికాకుండా మూడు రోజులు జాగ్రత్తలు తీసుకోవాలి.

*    కృత్రిమ గర్భధారణ చేసే పశువును ఏకాంతంగా చల్లని ప్రదేశంలో ఉంచటం మంచిది.

 *    వీర్యదానం చేయించగానే చల్లని నీరు శరీరంపై చల్లడం మంచిది.

*    వీర్య దానం చేసిన తర్వాత 3 నుంచి 4 రోజుల వరకూ,15 నుంచి 26 రోజుల మధ్య, 38 నుంచి 48 రోజుల మధ్య పశువు ఎదకు వచ్చుచున్నది లేనిది గమనించాలి. ఎదకు రాకుంటే 60 రోజుల తర్వాత చూడి పరీక్ష చేయించాలి. 

*    కృత్రిమ గర్భధారణ చేసిన తేదీ, పశువును తిరిగి ఎద గురించి పరిశీలించవలసిన తేదీలు, చూడి పరీక్షకు తీసుకువెళ్ళవలసిన తేదీలు రాసి పెట్టుకోవాలి. 


టి. విజయ నిర్మల, శాస్త్రవేత్త, ఫోన్‌: 8121136184; 

ఎ. దేవివరప్రసాద్‌రెడ్డి, శాస్త్రవేత్త, 

కె. వెంకట సుబ్బయ్య, శాస్త్రవేత్త, 

ఇ.కరుణశ్రీ, ప్రధాన శాస్త్రవేత్త 

బి. శ్రీనివాసులు, విస్తరణ సంచాలకులు, 

కృషి విజ్ఞాన కేంద్రం, డా. వై.ఎస్‌.ఆర్‌, ఉద్యాన విశ్వవిద్యాలయం,

వెంకటరామన్నగూడెం, ప.గో. జిల్లా. 

Read More

జీవాల్లో చిటుకు వ్యాధి 

చిటుకు వ్యాధి బాగా మేసి బలిష్టంగా ఉన్న గొర్రెల్లో, మేకల్లో వస్తుంది. క్లాస్ట్రీడియం పెర్‌ఫ్రింజెన్స్‌(టైప్‌-డి) అనబడే సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉన్న జంతువుల పేగులలో చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఆహారంలో పిండి పదార్థాల శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సూక్ష్మజీవులు వృద్ధి చెంది విష పదార్థాలను విడుదల చేస్తాయి. అతిగా తినడం వల్ల వస్తుంది కాబట్టి దీనిని తినే వ్యాధి అంటారు. ఈ వ్యాధి సోకిన కొద్ది సమయంలోనే తీవ్రరూపం దాల్చడం వల్ల గొర్రెలు చిటికెలో మరణిస్తా యి. అందువల్ల దీనిని చిటుకు రోగంగా పిలుస్తారు. ఈ రోగం వస్తే జీవాలను రక్షించడం చాలా కష్టం. అందువలన గొర్రెల కాపలదారులు జాగ్రత్త వహించాలి. 

వ్యాధి ఎలా వస్తుందంటే?: 

గొర్రె లేదా మేక పిల్లలు చాలా ఎక్కువగా పాల ను తాగినప్పుడు, ఎక్కువగా దాణా మేసినప్పుడు, ఇతర వ్యాధులు సోకినప్పుడు, జీవాల్లో సహజ వ్యాధి నిరోధకశక్తి క్షీణించడం వల్ల, పరాన్నజీవులు జీవాల కడుపులో ఎక్కువగా ఉన్నప్పుడు, ఇతర ఏవైనా కారణాల వల్ల పేవుల కదలిక తగ్గినప్పుడు ఈ వ్యాధి ప్రబలుతుంది.


లక్షణాలు: 

ఈ వ్యాధి సోకిన జీవాలు అకస్మాతుగా మేత మేయడం మానేస్తాయి. పొట్ట భాగాన్ని కాళ్లతో కొట్టుకోవడం, తరచు కిందికి పైకి లేవడం, పక్కలకి తిరిగి పడుకోవడం వంటివి చేస్తాయి.సూక్ష్మజీవులు విడుదల చేసిన విష ప్రభావం మెదడుపై ప్రభావం చూపడం వల్ల కాళ్లు చాపి తల మెడ భాగం వెనక్కి విరుచుకోవడం చేస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన కొద్ది నిమిషాల్లోనే జీవాలు చనిపోతాయి. సూక్ష్మజీవులు విడుదల చేసిన విషపదార్ధల వలన కొన్నిసార్లు, జీవాలు విడుదల చేసిన విషపదార్థాల వల్ల కొన్నిసార్లు జీవాల్లో పారుడు, విరేచనాల లక్షణాలు కనబడతాయి. వ్యాధితో మరణించిన గొర్రెలలో మూత్రపిండాలు లావుగా, మెత్తగా మారిపోతాయి. సూక్ష్మజీవుల విషపదార్ధాల వల్ల పేగులు నల్లగా మారిపోతాయి.


చికిత్స: 

తీవ్రమైన థలో ఈ వ్యాధి చికిత్సకు నయం కాదు. గొర్రె లేదా మేక పిల్లలకు 5మి.లీ యాంటి టాక్సిన్‌ను చర్మం కింది పొరల్లో ఇవ్వాలి. తద్వారా మనం వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. వ్యాధి తీవ్రతను తక్కువగా ఉన్నప్పుడు పెన్సిలిన్‌ గొర్రె బరువును బట్టి ఇవ్వాలి. యాంటిసిడ్‌ యాంటి బ్లోట్‌ మందులను తాగించాలి. థయామిన్‌(బి1) విటమిన్‌ను కండకు ఇంజక్షన్‌ చేయాలి. విష పదార్థాల ప్రభావం తగ్గించడానికి కార్టికోస్టిరాయిడ్స్‌ రక్తము ద్వారా ఇవ్వాలి.


నివారణ చర్యలు: 

జీవాలకు పిండి పదార్థాలు దాణా ఎక్కువ మోతాదులో పెట్టకూడదు.గొర్రె, మేక పిల్లలకు దాణాలో ఇచ్చే పెల్లెట్ల మోతాదును 3-4 బాగాలుగా విభచించి ఇవ్వాలి. ప్రతి సంవత్సరం పశు సంవర్ధక శాఖ వారు ఏప్రిల్‌, మే నెలలలో చిటుకు వ్యాది నివారణ టీకాలు పంపిణీ చేస్తుంది. ఈ టీకా మందుని మొదటిసారి ఆరు వారాల పైబడిన పిల్లలన్నింటికి ఇచ్చి ఆ తర్వాత మూడు వారాల లోపు రెండవ డోస్‌ ఇప్పించాలి.అంతే కాకుండా ప్రతి సంవత్సరం ఈ టీకాలును క్రమం తప్పకుండా చేయించాలి.గర్భంతో ఉన్న జీవాలకు ఈనటానికి 2-3వారాల ముందు ఈ టీకా మందు ఇస్తే పుట్టే పిల్లలకు 8 వారాల వరకు ఈ వ్యాధినుంచి రక్షణ కలుగుతుంది.   
డా. జి. రాంబాబు, పశు వైధ్యాధికారి, కడప. ఫోన్‌: 9618499184

Read More

వేసవిలో పశువుల సంరక్షణ – యాజమాన్య పద్ధతులు

వేసవిలో పశువుల సంరక్షణ చాలా అవసరం. ప్రస్తుతం రోజురోజుకీ వేసవి తాపం పెరిగిపోతున్నది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివలన పశువులు వడదెబ్బకు గురవుతున్నాయి. దీనివలన పాల దిగుబడి తగ్గిపోతుంది. రొప్పుతూ మేత మేయక, శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగి, రోగ నిరోధక శక్తిని కోల్పోతాయి. దీనివలన రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, దేశ ఆర్థిక ప్రగతికి నష్టం వాటిల్లుతోంది. అందుకు వేసవిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పశువులను సంరక్షించుకోవటంతో పాటు, పాడికి రక్షణ ఇచ్చిన వాళ్ళం అవుతాం.

వేడి ఒత్తిడి – ప్రభావం: పశువులు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. ముఖ్యంగా ఆవుల కంటే గేదెలు ఉష్ణ తాపానికి ఎక్కువగా గురవుతాయి. ఎందుకంటే గేదెల్లో నల్లని శరీరం వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది మరియు చెమట గ్రంధులు తక్కువగా ఉంటాయి. దేశీయ ఆవులు, సంకర జాతి ఆవులు మరియు విదేశీ జాతి ఆవులు కంటే ఎక్కువ వేడిని తట్టుకోగలవు. ఎందుకంటే దేశీ ఆవులు తక్కువ వేడి ఉత్పత్తి చేస్తాయి మరియు వేడి కోల్పోయే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ వరకు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత ఒక్కోసారి 110 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ వరకు పెరగటం, వాతావరణ ఉష్ణోగ్రత (అనుకూల ఉష్ణోగ్రతలు 24-260బీ సంకరజాతి ఆవులకు, 330బీ దేశి ఆవులకు మరియు 360బీ గేదెలు) పెరగడం వలన అంతర్గత ఉష్ణోగ్రత సరిగ్గా సమతుల్యంలో ఉండక పెరుగుతుంది. దీనివలన చెమటలు, నోటి నుండి చొంగ ధారాళంగా కారుతుంది. నోటిద్వారా శాసించటం (పాంటింగ్‌). విశ్రాంతి లేకపోవడం. ముట్టె ఎండిపోతుంది. ఎక్కువ దాహానికి గురవుతాయి. మరీ ముఖ్యంగా మేతను సరిగా తినకపోవడం జరుగుతుంది. దీని వలన శరీరంలో గ్లూకోజు నిల్వలు తరిగిపోయి పశువులు క్రమంగా నీరసించి, బలహీనపడతాయి. ఒక్కొక్కసారి అపస్మారక స్థితికి చేరుకొని మరణిస్తాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో (కోస్తా జిల్లాలు) ఉష్ణోగ్రత ప్రభావానికి పశువులకు వడదెబ్బ తగులుతుంది. దీనివలన ఆవులు మరియు గేదెలు ఎండ తీవ్రతకు గురై పాల దిగుబడి తగ్గిపోతుంది. పాలలో వెన్న శాతం, మాంసకృత్తులు శాతం తగ్గుతుంది. పశువులు త్వరగా పొదుగు వాపు లాంటి వ్యాధుల బారిన పడతాయి. పునరుత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోతాయి. పెరుగుతున్న పశువులలో బరువు పెరుగుదల తగ్గుతుంది. ఎద లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి క్షీణించి పోయి, ట్రీపనోసో మీయాసిస్‌, ఫైలేరియాసిస్‌ మరియు మైక్రోఫైలేరియా వంటి వ్యాధులకు గురవుతాయి. కొన్ని సందర్భాల్లో పశువుని కోల్పోవలసి వస్తుంది. దీని ప్రభావం రైతు ఆర్థిక పరిస్థితిపై పడుతుంది.హార్మోన్ల సమతుల్యత కోల్పోయి సరైన సమయంలో ఎదకు రాక పోవడం జరుగుతుంది మరియు ఈతల మధ్య వ్యవధి పెరిగి రైతులకు నష్టం వాటిల్లుతుంది.
యాజమాన్య పద్ధతులు: 

దేశవాళి ఆవులు వేసవిని, ఎండలను తట్టుకుంటాయి. కాబట్టి గేదెలకు మరియు సంకరజాతి ఆవులకు వేసవి నుండి రక్షణ కల్పించాలి. ముఖ్యంగా గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పశువులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం.

గృహవసతి – సంరక్షణ:

ఎండ నుండి పశువులను రక్షించాలంటే వాటిని ఎల్లప్పుడూ చల్లగా చెట్ల నీడలో కట్టి పెట్టాలి. పశువుల షెడ్ల చుట్టూ నీడనిచ్చే చెట్లను పెంచడం చాలా మంచిది ఎందుకంటే పశుగ్రాసాల్లా ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో చెట్ల నీడ అందుబాటులో లేని పరిస్థితుల్లో పశువులను పై కప్పు గల పాకలో పెట్టటం మంచిది.  గృహ వసతి అనేది ఎండ తీవ్రత నుండి రక్షణ కల్పించే విధంగా అనువుగా ఉండాలి. పశువుల పాకలు ఎత్తయిన ప్రదేశంలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఉండాలి. పాకల ఎత్తు 9-15 అడుగుల ఎత్తు ఉండేలా చూసుకోవాలి. పశువుల షెడ్లలో పైకప్పు రేకులతో ఉంటే దానిని వరిగడ్డి తో గాని తాటాకులతో గాని కప్పడం మంచిది. దాన్ని తరచుగా నీటితో తడుపుతూ ఉంటే మంచిది. పశువుల షెడ్ల చుట్టూ చాపలు మరియు గోతాములతో కప్పి మధ్యాహ్న సమయంలో నీటితో తడపడం వలన పాకలు, షెడ్లు చల్లగా ఉంటాయి మరియు సూర్యరశ్మి నేరుగా పడకుండా చేస్తూ చల్లని వాతావరణ పరిస్థితులను సమకూరుస్తాయి. షెడ్లలో ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఫ్యాన్లు షెడ్లలోని తేమ మరియు వేడిని సమతుల్యం చేస్తాయి. షెడ్లలో ఎల్లప్పుడూ నీటిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

ఎందుకంటే నీరు ఎక్కువగా తాగిన కొద్ది శరీరంలో వేడి తగ్గిపోతుంది. పగటిపూట గేదెలను రెండు మూడుసార్లు నీటితో కడగటం మంచిది. అదేవిధంగా గేదెలను మధ్యాహ్నం 2-3 గంటలు చెరువులో ఉండటం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల పశువులను వేడి తాపం నుండి కాపాడుకుని, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి సామర్థ్యాన్ని సక్రమంగా ఉంచుకోవచ్చు.


అధిక వేడి తాపం వలన పశువులు వేసవికాలంలో ఎక్కువగా ఆహారం మరియు మేతను తీసుకోలేవు మరియు జీర్ణ వ్యవస్థ సన్నగిల్లుతుంది. దీనివల్ల పాల దిగుబడి మరియు పునరుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అందువలన వేసవిలో పశువుల పోషణ ఎంతైనా అవసరం.


పశువులను ఉదయం 10 గంటల లోపు మరియు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మేతకు పంపడం అనువైన సమయం. మిట్టమధ్యాహ్నం 11 నుంచి 3 గంటల లోపు మేపుకు పంపినట్లయితే, వేసవి తాపానికి గురై వడదెబ్బ తగిలే ఆస్కారం ఉంది. ముఖ్యంగా పాల దిగుబడి తగ్గిపోతుంది. పశువులు వేసవిలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువగా జీర్ణించుకోలేవు. కాబట్టి వాటిని తగ్గించి, శక్తినిచ్చే పిండి పదార్థాలు అయినటువంటి గంజి, జావ లాంటి పదార్థాలు ఎక్కువగా ఇవ్వడం మంచిది. ఇది గేదెలలో మరీ ముఖ్యం. అధిక వేడి వలన శరీరంలో జీర్ణక్రియ సరిగ్గా జరగదు. దీని వల్ల జీర్ణరసాలు తగిన మోతాదులో ఉత్పత్తి కావు. అందువల్ల పశువులను రోజుకు రెండు మూడు సార్లు నీటితో కడిగి నట్లయితే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా జావ, మినరల్‌ మిక్చర్‌, ఉప్పుకలిపిన ద్రావణం తగిన మోతాదులో మిశ్రమ దాణతో కలిపి ఇవ్వటం మంచిది. 

విటమిన్‌ ఏ సరైన మోతాదులో శరీరంలో ఉన్నట్లయితే, పశువులు వేసవిలో ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకుంటాయి. విటమిన్‌ ఎ, ఒక పశువుకి ఒక రోజుకి 1 గ్రాము చొప్పున అందించాలి. ఈ విధంగా ఎనిమిది నుంచి పది రోజులు నెలకి అందించాలి. వేసవిలో పొటాషియం లవణాలు ఎక్కువగా అవసరమవుతాయి. అందువలన పొటాషియం క్లోరైట్‌ లవణాన్ని అందించాలి.

వేసవిలో పశువులు పచ్చిమేతను మాత్రమే తింటాయి. ముఖ్యంగా సంకరజాతి ఆవులు, విదేశీ ఆవులు పచ్చిమేత లేనిదే వేడిని తట్టుకోలేవు. పాల దిగుబడిని బట్టి దాణాను పశువులకు ఇవ్వాలి. పశుగ్రాసాలను చాప్‌ కట్టర్‌తో అంగుళం సైజులో కత్తిరించి మేపాలి. దీని వలన మేత వృధా కాకుండా ఉంటుంది. పచ్చిమేతను పగటిపూట, ఎండు గడ్డిని రాత్రిపూట ఇవ్వడం మంచిది. కొన్ని సందర్భాల్లో పచ్చిమేత లేనప్పుడు, ఖనిజ లవణాలు, మిశ్రమ దాణాలను ఇచ్చి అధికంగా మేపాలి. ఈవిధంగా సమృద్ధిగా వేసవిలో పోషణ ఇవ్వడం వలన పశువులు ఆరోగ్యంగా ఉండి, పాల దిగుబడి సాఫీగా సాగుతుంది.
ఆరోగ్య సంరక్షణ: 

ఎండ తాపానికి గురైన వెంటనే పశువులను నీడలో చెట్టు కింద ఉంచటం మంచిది. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేటట్టు చూసుకోవాలి. శరీరంపై చల్లని నీటిని చల్లాలి. గ్లూకోజ్‌ సెలైన్‌, సోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని ఎక్కించాలి. వేసవిలో ఎండ వేడికి రోగనిరోధక శక్తిని కోల్పోతాయి. దీని వలన జబ్బ వాపు వ్యాధి, గొంతువాపు వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అందువలన వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వటం మంచిది. రెండు 4 నుంచి 8 నెలల వయసున్న దూడలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అలాగే అంతర పరాన్నజీవుల కోసం నట్టల నివారణ మందులు వేయించాలి. పరిశుభ్రమైన నీటిని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి. దాహానికి బురద నీరు, అపరిశుభ్రమైన నీరు త్రాగి పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులకు ఆస్కారం ఉంది. అందువలన మనమే మంచినీటి కుంటలను పశువులకు అందుబాటులో ఉంచాలి. ఎప్పటికప్పుడు పాకలను శుభ్రం చేస్తూ ఉండాలి.

వేసవి కాలంలో ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు వీచడం వలన పాడి పశువులు తీవ్ర అనారోగ్యానికి, అసౌకర్యానికి లోనుకావడం జరుగుతుంది. దీనివలన వాటి ఉత్పత్తి మరియు పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. కావున మన రైతాంగం పైన ఉదహరించిన యాజమాన్య పద్ధతులను వేసవిలో చేపట్టినట్లయితే పశువులను సంరంక్షించడమే కాకుండా, పాడికి రక్షణ కల్పించి, దేశం ఆర్థికంగా మెరుగుపడుతుంది. 
డా. యు. వినోద్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డా. జి. సుష్మ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌; డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అనిమల్‌ జెనిటిక్స్‌ అండ్‌ బ్రీడింగ్‌, పశు వైద్య కళాశాల, తిరుపతి. ఫోన్‌: 9492298321

Read More

డెయిరీ ఫారం ప్రారంభించాలంటే…

పాలకు స్థిరంగా గిరాకీ పెరుగుతూనే ఉంది. మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటే డెయిరీ ఫారాన్ని లాభదాయకంగా నిర్వహించుకోవచ్చు.పాలు, పాల ఉత్పత్తుల అవసరం అనుదినం ప్రతి కుటుంబానికీ ఉంటుంది. పెరుగుతున్న జనాభాతో పాటు పట్టణీకరణ, సగటు కొనుగోలు సామర్థ్యం పెరగడం వల్ల పాలు, పాల ఉత్పత్తులకు క్రమేణా డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాడి రైతులతో పాటు, ఔత్సాహికులు, నిరుద్యోగ యువత అధిక పాల సార కలిగిన మేలు జాతి ఆవులు లేదా గేదెలతో పాడి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఎంత మంది చేపట్టినా గిరాకీ పెరుగుతూనే ఉండే రంగం ఇది.
    అయితే, పాడి పశువుల పెంపకం చెప్పినంత, విన్నంత సులభం కాదు. పశువుల పెంపకంపై ప్రేమ ఉండాలి. శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతే విజయం మీ వెంటే ఉంటుంది. మేలు జాతి పాడి పశువుల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆశించిన పాల ఉత్పత్తి పొందినప్పుడే పశుపోషణ లాభదాయకమవుతుంది.


పాడి పరిశ్రమను ఎవరెవరు చేపట్టవచ్చు?
    డెయిరీ ఫారాన్ని సంపన్నులు, నిరుపేదలు, పురుషులు, స్త్రీలు, ప్రగతిశీల రైతులు, విశ్రాంత ఉద్యోగులు, స్వయం సహాయక బృందాలు, మహిళా సంఘాలు, సహకార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు, నిరుద్యోగులు.. ఎవరైనా చేపట్టవచ్చు.
    పాడి పశువుల పోషణపై ఆసక్తి, వాటిని ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి. పాడి పశువుల పెంపకం చేపట్టబోయే ముందు కొన్ని డెయిరీ ఫారాలను కక్షుణ్ణంగా పరిశీలించాలి. రెండు నుంచి 10 పాడి పశువుల వరకు నౌకర్లపై ఆధారపడకుండా స్వయంగా రైతు కుటుంబమే నిర్వహించుకునేలా సంసిద్ధులై ఉండాలి. గడ్డి కోయడం దగ్గర నుంచి పాలు పితకడం వరకు అన్ని పనులను నేర్చుకోవాలి. ఒత్తిడులను ఎదుర్కొనేమనో నిబ్బరం కలిగి ఉండాలి.

 
తెలుసుకోవాల్సిన విషయాలు
    పాడి పరిశ్రమ స్థాపించే ముందు లాభాల బాటలో నడిచే డెయిరీకి స్వయంగా వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును, సమస్యలను కక్షుణ్ణంగా, శ్రద్ధగా గమనించాలి. సందేహాలను తీర్చుకోవాలి. వినడం కన్నా చూడటం ద్వారా త్వరగా విషయ పరిజ్ఞానం కలుగుతుంది. కష్టేఫలి అని పెద్దలు చెప్పినట్లు.. నౌకర్లపై ఆధారపడకుండా, స్వయంగా కష్టపడి, పర్యవేక్షించి, పూర్తి సమయాన్ని వెచ్చించగలిగినప్పుడే విజయం చేకూరుతుంది.


కావల్సిన వసతులు
    పాడి పరిశ్రమను నెలకొల్పే ప్రదేశాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు అనేక విషయాలను ఆలోచించాలి. రవాణా సౌకర్యం, రోడ్డు సౌకర్యం, విద్యుత్‌ సదుపాయం ఎలా ఉందో చూసుకోవాలి. నీటి లభ్యత, బోరు, పశుగ్రాసం పెంపకానికి తగినంత భూమి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవే కాకుండా చుట్టూ కంచె నిర్మించడం, పని వారి లభ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి లభ్యత తగ్గుతుంటే, అవసరం పెరుగుతోంది. ప్రతి సంకరజాతి ఆవు లేదా ముర్రా గేదెకు రోజుకు 75-80 లీటర్ల నీరు అవసరం. వేసవిలో ఇది వంద లీటర్లకు పెరుగుతుంది. ఏడాది పొడవునా పశుగ్రాసం సాగు చేసుకోవడానికి అదనంగా నీరు అవసరం. కాబట్టి, నీటి లభ్యత అనేది అతి ముఖ్యమైన సంగతి.


ఎలాంటి పాడి పశువులను కొనుగోలు చేయాలి?
    పాడి పరిశ్రమను పెట్టాలనుకునే వారు ఆ ప్రాంతంలో ఆవు పాలకు గిరాకీ ఉందా లేదా గేదె పాలకు గిరాకీ ఉందా అనేది ముందుగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. గేదె పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుచిగా ఉంటాయి. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో గేదె పాలకు గిరాకీ ఉంటుంది.


10 ఆవులు, గేదెలకు ఎంత భూమి అవసరం?
    ఒక్కో గేదె లేదా ఆవుకు 32 చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది. ప్రతి 5 పాడి పశువులకు పశుగ్రాసాల సాగుకు ఒక ఎకరా భూమి, ఇతర వసతులకు 300 చదరపు గజాల స్థలం అవసరం. 10 ఆవులు లేదా గేదెల పెంపకానికి కనీసం రెండెకరాల భూమి అవసరమవుతుంది. షెడ్డు నిర్మాణానికి, ఇతర అవసరాలకు మరో పది కుంటలు లేదా పావెకరం భూమి అవసరం.


సంకర జాతి ఆవులు, గేదెలు ఎక్కడ దొరుకుతాయి?
    హెచ్‌.ఎఫ్‌., జెర్సీ సంకర జాతి ఆవుల్లో పాల సార అధికంగా ఉంటుంది. ఇవి కర్ణాటక, తమిళనాడుల్లోని చింతామణి, కోలార్‌, బెంగళూరు సబర్బన్‌ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో దొరుకుతాయి. ఇవి రోజుకు 12 నుంచి 24 లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయి. వీటి ధర మార్కెట్‌లో రూ. 65 వేల నుంచి లక్షపైన ధర పలుకుతాయి. గ్రేడెడ్‌ ముర్రా, ముర్రా అనేవి మేలైన సంకర జాతి గేదెలు. ముర్రా జాతి గేదెలు రోజుకు 8 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తాయి. వీటి ధర మార్కెట్‌లో రూ. 75 వేల నుంచి లక్ష పైన పలుకుతాయి. గ్రేడెడ్‌ ముర్రా గేదెలు గోదావరి ప్రాంతాల్లో దొరుకుతాయి. ముర్రా జాతి గేదెలు హరియాణాలోని రోహ్‌ాహతక్‌, గుజరాత్‌లోని మెహసన ప్రాంతాల్లో దొరుకుతాయి.

మేలైన పాడి, అనుబంధ వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయి?
    పాడి పశువులను పెంచే రైతులు ఎక్కువగా పాల వ్యాపారానికి పరిమితం అవుతుంటారు. అయితే, పెరుగు, వెన్న, నెయ్యి, క్రీమ్‌ వంటి వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేసి అమ్మగలిగితే అధికాదాయం పొందవచ్చు. అంతేకాదు.. పేడతో గోబర్‌ గ్యాస్‌, వర్మీకంపోస్టు వంటివి తయారు చేయవచ్చు. పాల శీతలీకరణ, పాల సేకరణ, దూడల పెంపకం చేపట్టవచ్చు.


ఎన్ని రకాల పశుగ్రాసాలు పెంచాలి?
    అనేక రకాల పశుగ్రాసాలు సాగు చేసుకోవడం ద్వారా పోషక లోపం లేకుండా పాడి పశువులను లాభదాయకంగా పెంచుకోవచ్చు. డెయిరీ ఫారం ప్రారంభానికి 2-3 నెలలు ముందు నుంచే పశుగ్రాసాల సాగు చేపట్టాలి. పప్పుజాతి పశుగ్రాసాలు పావు వంతు, ధాన్యపు జాతి పశుగ్రాసాలు ముప్పావు వంతు విస్తీర్ణంలో సాగు చేయాలి. గట్లవెంబడి పశుగ్రాసంగా పనికి వచ్చే సుబాబుల్‌, స్టైలో వంటి జాతుల చెట్లు పెంచుకోవాలి.
పప్పు జాతి పశుగ్రాసాలు రెండు రకాలు: 1. ఏక వార్షికాలు: లూసర్న్‌, బెర్సీమ్‌. వీటిని సాధారణంగా సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నెలల్లో నాటుకోవాలి. 2. బహువార్షికాలు: లూసర్న్‌ కో, సుబాబుల్‌, హెడ్జ్‌ లూసర్న్‌, స్టైలో, జనుము.
ధాన్యపు జాతి పశుగ్రాసాలు రెండు రకాలు: 1. ఏకవార్షికాలు: పిసి-23, ఎస్‌.ఎస్‌.జి., జొన్న (మల్టీకట్‌). 2. బహువార్షికాలు : సూపర్‌ నేపియర్‌, ఎన్‌బి-21, కో-4, కో-5, ఎస్‌ఎన్‌-ఎపిబిఎన్‌. వీటిని జూన్‌-జూలైలలో వర్షాకాలంలో నాటుకోవాలి. చలికాలంలో వీటి ఎదుగుదల తక్కువగా ఉంటుంది.


ఎవర్ని సంప్రదించాలి?
    పాడి పరిశ్రమను స్థాపించదలచిన వారు మొదట బ్యాంకు వారితో, బీమా కంపెనీ వారితో, పశువైద్య నిపుణులతో సంప్రదించి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. పాల వినియోగదారులైన హాస్టళ్లు, హోటళ్లు, ఆసుపత్రులతోపాటు సమీప ప్రాంతాల్లోని సాధారణ పాల వినియోగదారులతో, పాల ఉత్పత్తిదారుల సంఘాలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. పశుగ్రాస విత్తనాల విక్రయ కేంద్రాలతోనూ మంచి సంబంధాలను పెంపొందించు కోవాలి


పాడి పరిశ్రమలో రికార్డుల నిర్వహణ
    మేలైన పాడి పశువులను వాణిజ్య స్థాయిలో పెంచి లాభాలు ఆర్జించాలనుకునే వారు కొన్ని వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేసుకుంటూ, సమీక్షించుకుంటూ ముందడుగు వేయాలి.
*    మేపు రికార్డులు: పశువులకు ఎంత మేత వేస్తున్నదీ రాసి పెట్టుకోవాలి.
*    ఆరోగ్య సంబంధ రికార్డులు: పశువుల ఆరోగ్య రక్షణకు ఎప్పుడెప్పుడు ఏమేమి మందులు వాడిందీ రాసుకోవాలి.
*   పాల ఉత్పత్తి రికార్డులు: ఒక్కో పశువు రోజుకు ఎన్ని పూటలు, ఎన్నెన్ని పాలు ఇస్తున్నదో రాసుకోవాలి.
*   పునరుత్పత్తి రికార్డులు: ప్రతి పశువు ఎదకు వచ్చిన తేదీ, కృత్రిమ గర్భధారణ చేయించిన తేదీ, ఈనిన తేదీ తదితర వివరాలను రాసి పెట్టుకోవాలి.
*    ఆర్థిక రికార్డులు: రోజువారీగా రాబడి, ఖర్చుల వివరాలను రాసుకోవాలి.


పాడి పశువుల ఎంపిక ఎలా?
    పాడి పశువు త్రికోణాకారంలో ఉండాలి. చురుకైన కళ్లు, మృదువైన చర్మం కలిగి ఉండాలి. పొదుగు నాలుగు భాగాలూ శరీరానికి అతుక్కొని, మృదువుగా, పెద్దవిగా, సమానంగా ఉండాలి. నాలుగు చనుమొనలు సమానంగా ఉండాలి. తొడలు దృఢంగా, కాళ్లు పొట్టిగా ఉండాలి. పొదుగుకు రక్తం సరఫరా చేసే పాలనరం స్పష్టంగా వంకరలు తిరిగి ఉండాలి. కడుపు పెద్దదిగా విశాలంగా ఉండాలి.
పశువుల షెడ్డు నిర్మించేదెలా?

    డెయిరీ ఫారం పెట్టాలనుకునే వారు స్థలాన్ని ఎంపిక చేసుకునే ముందు రవాణా, విద్యుత్తు, నీరు లభ్యత, మార్కెటింగ్‌ సదుపాయాలను దృష్టిలో పెట్టుకోవాలి. పశువుల షెడ్డు తూర్పు పడమర దిశగా గాలి, వెలుతురు ఉండేలా, కాస్త ఎత్తులో నిర్మించుకోవాలి. డెయిరీ ఫారం చుట్టూ పశుగ్రాసానికి అక్కర వచ్చే చెట్లు పెంచాలి. షెడ్డును సులభంగా కడగడానికి నీళ్లు కొట్టే ప్రెషర్‌ పంపును సమకూర్చుకోవాలి. మేత వృథా కాకుండా చూసుకోవడానికి పచ్చి మేతను ముక్కలు చేసి వేయాలి. 

డెయిరీని ఏర్పాటు చేయదలచినవారు గమనించాల్సిన ముఖ్యాంశాలు
1.    పాడి పశువుల పెంపకంపై ఆసక్తి – ఆశావహ దృక్పథం,
2.    వసతులు-వనరులు,
3.    మేలుజాతి పాడి పశువులు,
4.    పాడి పశువుల మేపు,
5.    ఖర్చు తగ్గింపు, ఉత్పత్తి పెంపు,
6.    పశు ఆరోగ్య సంరక్షణ,
7.    పునరుత్పత్తి యాజమాన్యం,
8.    దూడల పోషణ,
9.    శుభ్రమైన పాల ఉత్పత్తి,
10.    పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌.


డెయిరీ ఫారం పెట్టే రైతులకు శిక్షణ ఎవరిస్తారు?
స్థానిక పశు సంవర్థక శాఖ అధికారులు, వెటర్నరీ విశ్వవిద్యాలయాలతోపాటు జాతీయ డెయిరీ పరిశోధనా సంస్థ – కర్నాల్‌, జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు – ఆనంద్‌, భారతీయ ఆగ్రోఇండస్ట్రీస్‌ ఫెడరేషన్‌- పుణే వంటి సంస్థలు మేలు జాతి పాడి పశువుల పోషణలో రైతులకు శిక్షణ ఇస్తున్నాయి.


రుణాలు… సబ్సిడీలు
మేలైన పాడి పశువుల పెంపకాన్ని ప్రారంభించే బలహీన వర్గాల వారు రుణాలు, సబ్సిడీలపై సమాచారం కోసం దగ్గర్లోని సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాలను, సంబంధిత ప్రభుత్వ శాఖలు / కార్పొరేషన్ల అధికారులను సంప్రదించవచ్చు. నాబార్డు, డీఆర్‌డీఏ, ఎస్సీ కార్పొరేషన్‌, బీసీ కార్పొరేషన్‌, మైనారిటీ కార్పొరేషన్‌, ట్రైబల్‌ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన వంటి సంస్థలను సంప్రదించాలి. జనరల్‌ అభ్యర్థులు బ్యాంకులను సంప్రదించి రుణం పొందవచ్చు. ప్రాజెక్టు వ్యయంలో 75% బ్యాంకు రుణంగా ఇస్తుంది. ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకొని మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటే డెయిరీ ఫారాన్ని అత్యంత లాభదాయకంగా నిర్వహించుకోవచ్చు.

Read More

ఆవు / గేదె జాతి పశువులలో  తిమ్మిర్లు / రిళ్లలు

తిమ్మిర్లు లేదా రిళ్ళలు అనేది మోకాలి ఎముకల సంబంధిత వ్యాధి. ఎక్కువగా ఆవు జాతి, గేదె జాతి పశువులలో వస్తుంది. ఈ వ్యాధి వెనుకకాళ్ళలో వస్తుంది. అందువల్ల పశువులు సరిగ్గా నిలబడలేవు. నేలమీద కూర్చోలేవు. నడవలేవు, వెనకకాళ్ళను దేకుతూ నడుస్తాయి. అందువల్ల రైతు వాటిని పొలం దున్నడానికి వాడలేడు. పాల దిగుబడి కూడా తాత్కాలికంగా తగ్గుతుంది. రైతు ఈ వ్యాధి మూలంగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అంతగా లేదు కాని, పశువులు మానసికంగా ఒత్తిడికి గురై సరిగ్గా పనిచేయలేవు.

ఈ వ్యాధి అంటువ్యాధి కాని, ప్రాణాంతకమైనది కాని కాదు. దీనిని శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు.

కారణాలు: 

1. ఈ వ్యాధి వంశపారంపర్య కారణాల వల్ల ఒక తరం నుండి మరొక తరంకు సంక్రమిస్తుంది.

2. మోకాలి చిప్ప అరగటం వల్ల మోకాలి చిప్ప తొంటి ఎముక పైభాగాన అంటిపెట్టుకుంటుంది, దీని వల్ల కూడా తిమ్మిర్లు రావచ్చు.

3. మోకాలి ఎముకలు దృఢంగా లేకపోవడం మరియు జాయింట్‌ చుట్టూ ఉన్న స్నాయువులు బలంగా లేకపోవడం

4. ఎత్తు పల్లాలు ఉన్న ప్రదేశాలలో పశువులను వ్యవసాయానికి వాడటం/కొండలు, గుట్టల లాంటి ప్రదేశాలలో పశువులను వ్యవసాయానికి వాడటం/కొండలు, గుట్టల లాంటి ప్రదేశాలలో పశువులను వినియోగించడం.

5. సరియైన వ్యాయామం లేకపోవడం వల్ల జాయింట్‌ చుట్టూ ఉన్న కండరాలు బలంగా లేక మోకాలి చిప్ప పటుత్వాన్ని కోల్పోవడం వల్ల కూడా తిమ్మిర్లు రావచ్చు. 

6. సరియైన పోషణ లేకపోవడం వల్ల తొంటి ఎముక క్రింది భాగం (మోకాలి చిప్ప అతుక్కొనే చోట) బలహీనపడి మోకాలి చిప్ప తేలికగా కదలకుండా జాయింట్‌ మీద అంటిపెట్టుకోవడం వల్ల రిల్లలు రావచ్చు. 

7. విరామం లేకుండా ఎక్కువగా పనిచేయడం వల్ల రావచ్చు.

8. అధికంగా పాలు ఇచ్చే పశువులలో కూడా ఈ తిమ్మిర్లు/రిల్లలు రావచ్చు.

లక్షణాలు

1. తిమ్మిరి ఉన్న కాలు యొక్క మోకాలు ముడుచుకోదు. దాని వల్ల కాలు సాగదీసినట్టు ఉండి సరిగ్గా నిలబడలేదు.

2. నడిపించినప్పుడు తిమ్మిరి ఉన్న కాలు గెంటుతుంది లేదా దాని గిట్టలు నేలకు రాకుతూ నడుస్తుంది.

3. కొన్నిసార్లు విశ్రాంతి సమయంలో బాగానే ఉండి కాస్త పొలంలో నడవగానే తిమ్మిర్లు వస్తాయి.

4. కొన్నిసార్లు ఈ తిమ్మిర్లు కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు చూడవచ్చు (ఉంటాయి). మళ్లీ సాధారణంగా అవుతుంది. ఇలా ఉంటే తిరిగి మళ్లీ వచ్చే అవకాశాలు ఉంటాయి.

5. కొన్నిసార్లు ఒక కాలు కాని రెండు వెనుక కాళ్లు ఒకేసారి కాని తిమ్మిర్లు రావచ్చు.

చికిత్స మరియు నివారణ చర్యలు

1. తిమ్మిర్లు వచ్చిన వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్యాధికారి వద్దకు తీసుకెళ్ళాలి, పశువైద్యాధికారులు మోకాలికి సర్జరీ చేసి తిమ్మిర్లు తీస్తారు.

2. ప్రథమ చికిత్సగా మోకాలిని తడిమి చూసి మోకాలి చిప్ప పెద్ద కనుక స్థిరపడినట్లు ఉంటే వెంటనే మోకాలి చిప్పను క్రిందకు జారే విధంగా తాడాలి. అలా చేస్తే మోకాలి చిప్ప ఎద స్థానానికి వచ్చి ఎప్పటి లాగానే సాధారణ స్థితికి వస్తుంది. 

నివారణ చర్యలు

1. ముఖ్యంగా కొండప్రాంతాలు, ఎత్తు పల్లాలు ఉన్న ప్రాంతాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అవి ఏమిటంటే ఆవు జాతి, గేదె జాతి పశువులకు నిర్ణీత శారీరక శ్రమ మరియు విశ్రాంతి అవసరం.

2. ఎక్కువగా ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాలలో పశవులకు తక్కువ బరువు వేయాలి.

3. సరియైన పోషణ ఉండాలి. ముఖ్యంగా లవణాలు ఉన్న సమీకృత దాణాను వాడాలి.

4. సమాంతరంగా ఉన్న దారిలోనే పశువులను నడిపించాలి.

5. తిమ్మిర్లు రాకుండా మోకాలికి పటుత్వాన్ని పెంచే పట్టీలు (మమోకాలు పట్టీలు) వాడాలి.

డా. ఎన్‌. వేణుమాధవ్‌ (7989846261, 9490448540), (ఎం.వీ.ఎస్సీ), టీచింగ్‌ ఫ్యాకల్టీ, డా. ఎన్‌. రమ్య, ఎం.వీ.ఎస్సీ., అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పశువైద్య కళాశాల, కోరుట్ల

Read More

వేసవిలో పశుసంరక్షణ

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణంలో వచ్చే మార్పులు పశువులకు ప్రతికూలంగా మారతాయి. కనుక వేసవిలో పశువులకు ప్రత్యేక యాజమాన్యం అవసరం.

ఆవులకంటే గేదెలు ఎక్కువ ఉష్ణతాపానికి గురవుతాయి. గేదెల శరీరం నలుపురంగులో ఉండటం, శరీరం క్రింద కొవ్వు ఉండడం, స్వేదగ్రంథుల సంఖ్య తక్కువగా ఉండటం మొదలగు కారణాల వల్ల గేదెలు అధిక ఉష్ణతాపానికి లోనవుతాయి. సంకరజాతి ఆవులు వేసవి తీవ్రతను తట్టుకోలేవు. అలాగే కోళ్ళ మీద వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వేసవిలో సాధారణంగా వచ్చే సమస్యలు

పాల దిగుబడి తగ్గటం: పశువులు మేత తక్కువ తింటాయి. వేసవిలో దాహంతో ఎక్కువ నీళ్ళు త్రాగి, 30-40% తక్కువ ఆహారం తీసుకుంటాయి. తద్వారా పోషకాలన్నీ అందవు. అంతేకాక జీర్ణక్రియ కుంటుబడుతుంది. పెద్దపొట్టలో అసిటిక్‌ ఆమ్లం ఉత్పత్తి తగ్గి పాలల్లో వెన్నశాతం పాల ఉత్పత్తి శాతం తగ్గుతుంది. కాబట్టి ఎక్కువ పోషకాల్ని తక్కువ పరిమాణం గల దాణాలో అందేవిధంగా చూడాలి. మాంసకృత్తులు, కొవ్వుపదార్థాలు, శక్తి, విటమిన్లు, ఖనిజలవణాలు సక్రమంగా అందేలా దాణాని తయారు చేసుకోవాలి.

పచ్చగడ్డి కొరత: వేసవిలో పచ్చగడ్డి కొరత సాధారణంగా చూస్తాము. ధాన్యపు జాతికి చెందిన నేపియర్‌ వంటి బహువార్షిక పశుగ్రాసాలు సాగు చేసుకుంటే సంవత్సరం పొడవునా పచ్చిమేత దిగుబడి ఉంటుంది. వీటిని ఒకసారి నాటితే 3-4 సంవత్సరముల వరకు నిరంతరంగా పలుకోతలు తీసుకోవచ్చు. ఈ విధంగా వేసవిలో కూడా పచ్చగడ్డి అందించే విధంగా జాగ్రత్త వహించాలి. పచ్చగడ్డి లభ్యంకాని సమయాల్లో మాగుడుగడ్డి, యూరియా గడ్డిని పశువుల కందించాలి. సుబాబుల్‌, అవిశ ఆకులు, రెమ్మల్ని దాణాలో కలిపి ఇవ్వాలి. ఎండుమేత మేపినపుడు విటమిన్‌ ‘ఎ’ అదనంగా ఇవ్వాలి. ఎండుగడ్డిని ఎప్పుడూ రాత్రివేళల్లో మేపాలి. ఖనిజలవణ మిశ్రమాన్ని ప్రతిరోజు 30-40 గ్రాములు అందివ్వాలి. 

వ్యాధులు/ఆరోగ్య సమస్యలు

వడదెబ్బ: వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ అధికమైనపుడు పశువులు ఎక్కువగా వడదెబ్బకు లోనవుతాయి. పశువులను గాలి ప్రసరణ సరిగ్గాలేని ప్రాంతాల్లో, తక్కువ స్థలంలో ఎక్కువ పశువులను కిక్కిరిసి ఉంచినప్పుడు, నీటి సౌకర్యం అందుబాటులో లేనప్పుడు పశువులు అధిక శ్రమకు లోనవుతాయి. ఇలాంటి సందర్భంలో వడగాలుల తాకిడికి లోనైనప్పుడు వడదెబ్బకు గురవుతాయి. సాధారణంగా పశువులు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వడదెబ్బ బారిన పడతాయి. తెల్లజాతి పశువులకంటే నల్లజాతి పశువులు ఎక్కువగా, త్వరగా వడదెబ్బకు లోనవుతాయి. వేసవికాలంలో బయట ఉష్ణోగ్రత, పశువుల శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువైనపుడు మెదడులోని హైపోతలామన్‌ స్వేద గ్రంథుల నిర్వహణపై పర్యవేక్షణ కోల్పోతుంది. ఆ సందర్భాల్లో చర్మంపై గల స్వేదగ్రంథులు చెమట అధికంగా ప్రసారం చేసి పశువులను అధిక ఉష్ణోగ్రతలకు లోనుకాకుండా కాపాడతాయి. చెమట ద్వారా శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ కోల్పోయి, శరీర ప్రక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడి వేగం పెరుగుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మూత్రవిసర్జన కుంటుపడుతుంది. పశువుల ఆరోగ్య పరిస్థితి విషమించి, అపస్మారక స్థితిలోకి వెళ్ళి శ్వాస ఆడక మరణిస్తాయి.

లక్షణాలు: వడదెబ్బ తగిలిన పశువుల శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీ ఫారెన్‌హీట్‌ కంటే ఎక్కువగా ఉంటుంది. చర్మం సున్నితత్వం కోల్పోయి గట్టిపడుతుంది. నోటివెంట చొంగపడుతుంది. పశువులు బలహీనంగా, సరిగ్గా నడువలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి.  

చికిత్స: వడదెబ్బకు లోనైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే నీడ ప్రాంతానికి మార్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేర్చడానికి చల్లటి నీటితో పలుసార్లు కడగాలి. తడిగోనె సంచులు కప్పి నీళ్ళు చల్లాలి. త్రాగునీరు ఇచ్చి వెంటనే చికిత్స చేయించాలి.

శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీ ఫారెన్‌హీట్‌ దాటితే శ్వాస పీల్చటం కష్టమవుతుంది. ఫిట్సు లక్షణాలతో పశువులు క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళి మరణిస్తాయి. వడదెబ్బ ప్రభావం వల్ల చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. పునరుత్పత్తి ప్రక్రియ కుంటుపడి, తాత్కాలిక వంధ్యత్వం సంభవింస్తుంది. పాడిపశువుల్లో పాల దిగుబడి తగ్గిపోతుంది.

గొంతువాపు, జబ్బవాపు: వేసవిలో పశువుల్లో వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండి, ముందే టీకాలు వేయించాలి.

పరాన్నజీవులు: బాహ్యపరాన్నజీవులు, వాటి కాటు ద్వారా సంభవించే వ్యాధుల నివారణకు బాహ్యపరాన్నజీవులు నిర్మూలన మందుల్ని పిచికారి చేయాలి. దూడల వెంట్రుకలు కత్తిరించాలి. పశువుల పొడవాటి వెంట్రుకలు కత్తిరించాలి. అంతరపరాన్నజీవుల నిర్మూలనకు నట్టల నివారణ మందులు పశువులకు తాగించాలి. 

జీర్ణకోశ సమస్యలు: దాహార్తితో ఉన్న పశువులు మురికినీళ్ళు త్రాగటం వల్ల, పారుడు వంటి జీర్ణకోశ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి గ్రామాల్లో నీటితొట్లు శుభ్రపరచి, పరిశుభ్రమైన త్రాగునీళ్ళను అన్నివేళలా అందుబాటులో ఉంచాలి.

పునరుత్పత్తలో సమస్యలు: వేసవిలో పునరుత్పత్తి ప్రక్రియ కుంటుపడుతుంది. అధిక వేడివల్ల ఎఫ్‌ఎస్‌హెచ్‌ హార్మోన్‌ ఉత్పత్తి కుంటుపడుతుంది. శరీరంలో గ్లూకోజ్‌ పరిమాణం తగ్గుతుంది. అందువల్ల అండాశయాల్లో స్థబ్ధత, అండోత్పత్తిలో వ్యత్యాసాలు సంభవించి పశువులు తిరిగి పొర్లుతుంటాయి. వేసవిలో ఎక్కువ ఎండుగడ్డి సంగ్రహించడం వల్ల కూడా విటమిన్‌ ఎ, కాల్షియం, కాపర్‌, మెగ్నీషియం మొదలగు ఖనిజలవణాల లోపం కూడా ఏర్పడి, పశువుల్లో తాత్కాలిక వంధ్యత్వం ఏర్పడుతుంది. పశువుల ఎదలక్షణాల్ని వేసవి తాపం వల్ల ప్రస్ఫుటంగా బహిర్గతం చేయలేవు. పశువుల్ని జాగ్రత్తగా గమనిస్తూ, టీజర్‌బుల్‌ సహాయంతో ఎదగుర్తించి వీర్యదానం చేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో ఆవులకంటే గేదెల సంఖ్య ఎక్కువ. గేదెలకు సంవత్సరం పొడవునా ఎదకొచ్చి పొర్లే స్వభావం ఉన్నప్పటికి, వేసవి వల్ల పునరుత్పత్తి ప్రక్రియకు విఘాతం కలగడం వల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి వేసవిలో చాలా గేదెలు ఈనవు, వేసవి వచ్చేసరికి కొన్ని పాడిగేదెల్లో అత్యధిక పాలదిగుబడి కాలం పూర్తవడం వల్ల వేసవిలో పాలకు కొరత ఏర్పడుతుంది. కాబట్టి డిమాండ్‌ అధికంగా ఉండే వేసవిలో పాలు ఉత్పత్తి చేయాలంటే రైతులు పశువులపై వేసవి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి.

పొదుగువాపు: వేసవిలో ‘కొరినీబ్యాక్టీరియం పయోజన్స్‌’ అనే సూక్ష్మక్రియ వల్ల పెయ్యలు, వట్టిపోయిన పశువుల్లో పొదుగువాపు ఎక్కువగా/సాధారణంగా వస్తుంది. ఈ వ్యాధి వల్ల పొదుగు బాగా వాచి, గట్టిగా తయారవుతుంది. పొదుగులో పాలు చెడిపోవుట వలన దుర్వాసనలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో రొమ్ము పూర్తిగా పాడై కింద పడిపోతుంది. పశువు జ్వరంతో బాధపడుతుంది. సూక్ష్మక్రియ ద్వారా విడుదలయ్యే విషపదార్థాలు రక్తమంతా వ్యాపించి పశువు చనిపోతుంది. వ్యాధి నుండి కోలుకున్న పశువులలో దెబ్బతిన్న పొదుగుభాగం జీవితాంతం పనిచేయదు.

వేసవిలో పశువుల సంరక్షణకు తీసుకోవలసిన చర్యలు

*      వేసవిలో పగటివేళల్లో పశువుల్ని మేతకు వదలకూడదు. ఉదయం (10 గంటల ముందు), సాయంత్రం (5 గంటల తర్వాత) చల్లగా ఉండే సమయాల్లో మాత్రమే బయట తిరగనివ్వాలి. ముఖ్యంగా గేదెలు 80 శాతం ఎండవేడిమి స్వీకరించి, 20% వేడి మాత్రమే రిఫ్లెక్ట్‌ చేస్తాయి. కాబట్టి పశువుల్ని మేతకు మండుటెండల్లో పంపించడం వల్ల మేత లభ్యంకాకపోగా, చాలా దూరం నడవడం వల్ల శక్తి కోల్పోతాయి. నీరసపడతాయని గమనించాలి.

*    గృహవసతి యాజమాన్యం: 38 డిగ్రీ సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సందర్భాల్లో శీతల స్థితి కల్పించాలి. అందుకుగాను పశువుల కొట్టాలు 10-12 అడుగుల ఎత్తు ఉండేలా నిర్మించాలి. గాలి వీయడానికి అనుకూలంగా ప్రక్కగోడను పూర్తిగా కప్పివేయకుండా వదిలివేయాలి.

*    వేసవిలో తాటాకుల కొట్టం పశువులకు అనుకూలంగా ఉంటుంది. సిమెంట& రేకుల షెడ్‌పై గడ్డిపరచి మధ్యాహ్నం వేళల్లో నీళ్ళు చిలకరిస్తుండాలి.

*    వడగాలుల నిరోధానికి షెడ్‌ ఒక ప్రక్క పరదాలు కట్టి నీళ్ళు చల్లుతుండాలి.

*    పాకల చుట్టూ త్వరగా ఎదిగి నీడను, పశుగ్రాసాన్నిచ్చే చెట్లు పెంచాలి. అవసరమైతే షెడ్‌లోపల ఫ్యాన్స్‌, కూలర్స్‌, స్ప్రింక్లర్స్‌ ఏర్పాటు చేయాలి.

*    పాకల్లో పశువుల్ని కిక్కిరిసి ఉంచకూడదు. ప్రతి ఆవుకు 3 చ.మీ. కనీస స్థలం ఉంచాలి.

*    నీటి చెరువులు, కుంటలు ఉన్నచోట పశువులను నీళ్ళలో ఈదులాడనివ్వాలి.

*    పశువులపై మధ్యాహ్నం వేళల్లో 3-4 సార్లు నీళ్ళు చల్లుతుండాలి. ఇలా చేయగలిగితే ఈదటానికి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉండదు.

*    రాత్రి సమయంలో ఆరుబయట విడిచిపెట్టినచో వేడి నుండి ఉపశమనం లభిస్తుంది.

*    పునరుత్పత్తి మెరుగుపరచడానికి ఎదలక్షణాలను క్రమంగా గమనించాలి. ఉదయం తోక, మడి వద్ద మట్టి అంటుకొని ఉందేమో చూడాలి. చల్లటి వేళల్లో (ఉదయం / సాయంత్ర సమయాల్లో) పశువులను కట్టించాలి.

ఈ విధంగా పశుపోషకులు మేలైన యాజమాన్య పద్ధతులు పశుపోషణ విషయాల్లో స్వల్ప శ్రద్ధ తీసుకోవటం ద్వారా ఎండవేడిమి బారి నుండి పశువుల్ని రక్షించుకోవాలి.  డా. ఎ. అనిత, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎల్‌పిఎం విభాగం, ఎన్టీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌, గన్నవరం – 521 102. ఫోన్‌: 9492514967

Read More