మనదేశంలో వ్యవసాయ సంబంధిత ఆర్థికాభివద్ధికి పశుసంపద పాత్ర చాలా ముఖ్యమైనది. మన దేశంలో పశుసంపద సమృద్ధిగా ఉంది. సన్నకారు రైతులు, భూమిలేని నిరుపేదలు సంవత్సరం పొడవునా ఆదాయం పొందాలంటే, పశువులకు ఆహారం సంవత్సరం పొడవునా లభించాలి. మనదేశంలో పశుగ్రాసాల సాగు 4 శాతం భూవిస్తీర్ణంలో మాత్రమే జరుగుతుంది. దీనివలన సంవత్సరం పొడవు పశుగ్రాసాలు దొరకడం లేదు. మన దేశంలో ఉన్న పశుసంపదకు కావలసిన దానికి 43 శాతం దాణా దినుసులు, 44 శాతం ఎండుమేత, 38 శాతం పచ్చిమేత తక్కువగా లభ్యం అవుతూన్నాయి. దీనికి కారణాలేమిటంటే, దేశ జనాభా పెరగడం, పశువుల సంఖ్య పెరగడం, పంట భూముల విస్తీర్ణం పెరగడం, ఉన్న పంటభూముల మీద ఆహారధాన్యాల ఉత్పత్తి కొరకు వత్తిడి పెరగడం, అధిక లాభం కొరకు వాణిజ్య పంటలు పండించటం మొదలగునవి.
పై కారణాలవల్ల పచ్చిక బయళ్ళ విస్తీర్ణం మరియు పశుగ్రాసాల సాగు తగ్గాయి. అందే సమయంలో ఆహార పంటలు, వాణిజ్య పంటల విస్తీర్ణం పెరగడం వల్ల వ్యవసాయ వ్యర్థ పదార్థాల ఉత్పత్తి ఎక్కువ అయ్యింది. ప్రస్తుతం భారతదేశంలో సుమారుగా 50 కోట్ల టన్నుల వ్యవసాయ వ్యర్థ పదార్థాలు లభ్యమవుతున్నాయి. వీటినే సాంప్రదాయేతర ఆహార పదార్థాలు అని కూడా అంటారు. తగ్గిన పచ్చిక బయళ్ళు, పశుగ్రాసాల సాగు వల్ల సాంప్రదాయేతర ఆహార పదార్థాలను పశువుల మేతగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప, సజ్జ చొప్ప, కంది కట్టె, ప్రత్తి కట్టె, మొక్కజొన్న కండెలు, ప్రొద్దు తిరుగుడు కట్టె, గింజలు తీసిన ప్రొద్దు తిరుగుడు పూలు మొదలగునవి మనకు సాధారణంగా వ్యవసాయంలో లభించే వ్యర్థ పదార్థాలు.
ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను పశువుల ఆహారంలో సంపూర్ణ సమీకృత ఆహారంలో నిర్ధిష్ట పరిమాణంలో ఇచ్చి పాలు, మాంసాన్ని చౌకగా ఉత్పత్తి చేయవచ్చు.
వ్యవసాయ వ్యర్థ పదార్థాలను, సాంప్రదాయేతర పదార్థాలను ఒక నిర్దిష్ట పరిమాణంలో మాత్రమే దాణాలో వినియోగించాలి. ఎందుకంటే వాటిలో పీచుపదార్థాన్ని లిగ్నిన్ ఎక్కువగా ఉండి పశువు తినడానికి ఇష్టపడదు. వాటిలో పోషక విలువలు కూడా తక్కువగా ఉంటాయి. కొన్నింటిలో విషపదార్థాలు ఉండి వాటి వినియోగాన్ని తగ్గించడం కాకుండా పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
వాటిని పశువుల ఆహారంగా మార్చడానికి వివిధ పద్ధతులు కలవు. అందులో ముఖ్యంగా వ్యర్థ పదార్థాలను కత్తిరించి మేపడం గాని, పొడి చేయడం ద్వారా గాని, గుళికల రూపంలో అందించవచ్చు. ఈ పద్ధతులే కాకుండా వ్యర్థ పదార్థాలను సుపోషకం చేయడానికి వివిధ పద్ధతులున్నాయి. అందులో భాగంగా సోడియం హైడ్రాక్సైడ్ రసాయన ద్రావణంతో పిచికారి చేసి మగ్గనివ్వడం ద్వారా గాని, మరొక పద్ధతిలో 4 శాతం యూరియా ద్రావణంతో పిచికారీ చేసి, 30 రోజులు గాలి చొరబడకుండా మగ్గనివ్వాలి. దీని వల్ల వ్యర్ధపదార్ధాలు సులభంగా జీర్ణమవడమే కాకుండా, నత్రజని శాతం పెరుగుతుంది. ఈ పద్ధతి శాస్త్రీయ పరంగా మంచి పద్ధతి అయినా, అంతగా ప్రాచుర్యం పొందలేదు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యర్ధ పదార్థాలను ఈ పద్ధతిలోని లోపాలను అధిగమిస్తూ, సులభంగా సంపూర్ణ సమీకృత ఆహారంగా మార్చుకోవచ్చు. ఈ సమీకృత ఆహారంలో వ్యవసాయ వ్యర్ధ పదార్థాలను, సాంప్రదాయేతర మరియు సాంప్రదాయ బద్ధంగా శక్తిని మరియు మాంసకృత్తులనిచ్చే దాణా దినుసులను నిర్ణీత పరిమాణంలో లేదా నిష్పత్తిలో కలిపి పశువులకు కావలసిన అన్ని పోషక పదార్థాలను చాలినంతగా లభించేటట్లు తయారు చేయవచ్చు.
ఈ ఆహారం తయారీలో, ఎండుమేతతో సహా, అన్ని దాణా దినుసులను పొడిగొట్టే యంత్రంతో పొడిచేసి, మిశ్రమం చేసే యంత్రంలో పంపుతారు. కొద్ది మోతాదులో వాడే దినుసులను ప్రిమిక్సుగా తయారు చేస్తారు. ప్రిమిక్స్‌తో పాటు 70 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేసిన మొలాసిస్ (బెల్లపు మడ్డి)ను కూడా తగిన మోతాదులో మిశ్రమ యంత్రంలో వేసి 10 నిమిషాల పాటు అన్ని పదార్థాలు బాగా కలియునట్లు కలుపుతారు. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమ ఆహారాన్ని సంపూర్ణ సమీకృత ఆహారం అని అంటారు. పొడి రూపంలో తయారైన ఆహారాన్ని పశువులకు పెట్టవచ్చు లేదా గుళికల రూపంలోకి మార్చి కూడా ఆహారంగా అందించవచ్చు.
సంపూర్ణ సమీకృత ఆహారం వల్ల ఉపయోగాలు
- సాంప్రదాయేతర, వ్యవసాయ వ్యర్థ పదార్థాల వినియోగం పెంచడానికి వీలవుతుంది.
- పశువులకు కావలసిన అన్ని పోషక పదార్థాలు సరియైన పాళ్ళలో లభిస్తాయి.
- మేత వృథా కాదు.
- మేతను తేలికగా జీర్ణం చేసుకోగలుగుతాయి.
- పశువు తీసుకునే ఆహారం 10 నుంచి 20 శాతం పెరుగుతుంది.
- రవాణా చేయడం, నిల్వ చేయడం చాలా తేలిక.
- పశువులు తమంతట తాముగా ఆహారాన్ని వెదికి ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు.
- వేసవి కాలం, వరదలు, అనావృష్టి పరిస్థితుల్లో ఇవి సరైన ప్రత్యామ్నాయ ఆహారం.
- పాల దిగుబడి రోజుకి పెరుగుతుంది.
- గొర్రెలలో 10-15 శాతం ఎక్కువ పెరుగుదల వస్తుంది.
- దాణా ఖర్చు 15-20 శాతం తగ్గుతుంది.
- గొర్రె పిల్లల్లో 100-140 గ్రా. వరకు ప్రతిరోజు పెరుగుదల పొందవచ్చు.
- మాంసం నాణ్యత కూడా పెరుగుతుంది.
- దూడలు రోజుకు సగటున 500 నుండి 700 గ్రాముల వరకు బరువు పెరగవచ్చు.
సంపూర్ణ సమీకృత ఆహారంలో వ్యవసాయ వ్యర్థపదార్థాల పాళ్ళ వివరాలు
- జొన్నచొప్ప / మొక్కజొన్న 50
- ప్రొద్దుతిరుగుడు కట్టె 40
- ప్రొద్దుతిరుగుడు పూలు 50
- గోధుమ చొప్ప 50
- ఎండిన చెట్ల ఆకులు 50-70
- వరిగడ్డి 50
- ప్రత్తి కట్టె 45
- సోయా కట్టె 50
- ఆయిల్ పామ్ పీచు 30
- చెరకు పిప్పి 20
పెరిగే దూడలకు సంపూర్ణ ఆహారం
ఆహార పదార్థం సంపూర్ణ దాణా (కిలోలు)
1 2 3 4
| మొక్కజొన్న కంకులు | – | 40 | – | – |
| ప్రొద్దుతిరుగుడు పువ్వులు | – | – | – | 40 |
| చెరకు పిప్పి | 40 | – | – | – |
| పత్తి కట్టె | – | – | 40 | – |
| మొక్కజొన్న గిoజలు | 15 | 10 | 23 | 30 |
| వేరుశనగ గానుగ చెక్క | 10 | 10 | 10 | 14 |
| పత్తి గింజల గానుగ చెక్క | – | – | 5.0 | – |
| నూనె తీసిన వరి తవుడు | 22.5 | 28.5 | 9.0 | – |
| మొలాసిస్ | 10 | 10 | 10 | 8 |
| యూరియా | 1.0 | – | 1.0 | 0.5 |
| గోధుమ తవుడు | – | – | – | 4.5 |
| ఖనిజ లవణాల మిశ్రమం | 1.0 | 1.0 | 1.0 | 2.0 |
| ఉప్పు | 0.5 | 0.5 | 1.0 | 1.0 |
| విటమిన్ల మిశ్రమం | 10గ్రా. | 10గ్రా. | 10గ్రా. | 10గ్రా. |
| మొత్తం | 100 | 100 | 100 | 100 |

దూడలు రోజుకు సగటున 500 నుంచి 700 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి.
పాడి పశువులకు సంపూర్ణ ఆహారం
ఆహార పదార్థం సంపూర్ణ దాణా (కిలోలు)
1 2 3 4
| మొక్కజొన్న కంకులు | 28.5 | – | – | – |
| ప్రొద్దుతిరుగుడు పువ్వులు | – | – | – | 40 |
| పత్తి కట్టె | – | – | 30 | – |
| చెరకు పిప్పి | – | 28.5 | – | – |
| మొక్కజొన్న గిoజలు | 19.0 | 19.0 | 24.0 | 24.0 |
| వేరుశనగ గానుగ చెక్క | 13.0 | 13.0 | 12.5 | 9.0 |
| పత్తి గింజల గానుగ చెక్క | – | – | 5.0 | 6.0 |
| నూనె తీసిన వరి తవుడు | 26.0 | 26.0 | 8.0 | 5.0 |
| మొలాసిస్ | 12.0 | 12.0 | 8.0 | 10.0 |
| యూరియా | – | – | 0.5 | 0.5 |
| గోధుమ తవుడు | – | – | 9.0 | 6.5 |
| ఖనిజ లవణాల మిశ్రమం | 1.0 | 1.0 | 2.0 | 2.0 |
| ఉప్పు | 0.5 | 0.5 | 1.0 | 1.0 |
| విటమిన్ల మిశ్రమం | 10గ్రా. | 10గ్రా. | 10గ్రా. | 10గ్రా. |
| మొత్తం | 100 | 100 | 100 | 100 |
పాల దిగుబడి రోజుకు 8 నుంచి 10 లీటర్లు.

పై విధంగా తయారు చేసుకున్న సంపూర్ణ సమీకృత ఆహారాన్ని దూడలకు వాటి శరీర బరువులో 3-4 శాతం మరియు పాడి పశువులకు 2.5-3.0 శాతం మేపినట్లయితే పైన సూచించిన విధంగా వాటి బరువు పెరుగుదల, పాల దిగుబడి పొందవచ్చు. అలాగే రైతులు వ్యవసాయ వ్యర్థాలను వాడుకొని పశుపోషణ ఖర్చు తగ్గించుకోవచ్చు.
డా|| రమేష్‌బాబు పి., అసిస్టెంట్ ప్రొఫెసర్, & హెడ్, యానిమల్ న్యూట్రిషన్ విభాగం,
పశువైద్య కళాశాల, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,
ప్రొద్దటూరు – 516 360.
ఇ-మెయిల్:drrameshbabu4u@gmail.com
