సీమ పందుల పెంపకంరైతుల ఆర్థిక సాధికారతకు శాస్త్రీయ ప్రత్యామ్నాయం

గ్రామీణ తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని కూలీలు, మహిళా స్వయం సహాయక బృందాలు (Self Help Groups – SHGs) తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తెచ్చే పశు సంపద కోసం అన్వేషిస్తున్న తరుణంలో ‘సీమ పందుల పెంపకం’ ఒక ఆశాజనకమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తోంది. దేశీయ (నాటు) పందులతో పోలిస్తే సీమ జాతులు వేగంగా బరువు పెరగడం, ఎక్కువ పిల్లలు ఈనడం (అధిక లిట్టర్ సైజు), తక్కువ మేతతో ఎక్కువ మాంసం ఉత్పత్తి చేయడం (మెరుగైన ఫీడ్ కన్వర్షన్ ఎఫిషియెన్సీ – FCE) వంటి లక్షణాలతో ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మాంసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, భారత పశు గణాంకాల (Basic Animal Husbandry Statistics – BAHS 2025) ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే మాంస ఉత్పత్తి సుమారు 2.46 శాతం వృద్ధి చెందింది. అయితే, పంది జనాభా వృద్ధి రేటు గత రెండు దశాబ్దాలుగా మందగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను, ఆధునిక వ్యాధి నివారణ చర్యలను, ప్రభుత్వ తోడ్పాటును సమన్వయం చేసుకుంటే పందుల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే శక్తివంతమైన సాధనంగా మారగలదు.

సీమ మరియు సంకరీకరణ జాతుల పందులు
మన దేశంలో సంప్రదాయకంగా పెంచే నాటు (దేశీయ) పందుల ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా విదేశాల నుంచి తీసుకువచ్చి మన వాతావరణ పరిస్థితులకు అలవాటు చేసిన సీమ జాతులు (Exotic Breeds) అధిక ఉత్పాదకతను కలిగి ఉంటాయి. వీటిని దేశీయ పందులతో సంకరీకరణ చేసి, స్థానిక వాతావరణానికి అలవాటుపడే మేలుజాతి సంకర రకాలను (Crossbred Varieties) కూడా వివిధ రాష్ట్రాల పశువైద్య విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేశాయి.

ప్రధాన సీమ జాతులు

  • లార్జ్ వైట్ యార్క్‌షైర్ (Large White Yorkshire) — పూర్తి తెలుపు రంగు, మేని మీద ‘ఫ్రెకిల్స్’ అనే నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది. ఒక్కో ఈతకు 11–12 పిల్లలు పుట్టే అధిక లిట్టర్ సైజు, మంచి మాతృత్వ లక్షణాలు దీని ప్రత్యేకత. మగ పంది 300–400 కిలోలు, ఆడ పంది 230–320 కిలోల వరకు బరువు పెరుగుతుంది.
  • ల్యాండ్‌రేస్ (Landrace) — పొడవైన శరీరం, తక్కువ కొవ్వు, అధిక మాంస దిగుబడినిచ్చే జాతి.
  • డ్యూరాక్ (Duroc) — ఎర్రటి రంగు, గట్టి శరీర నిర్మాణం, శీఘ్ర పెరుగుదల కలిగిన జాతి; సంకరీకరణకు మేలు జాతిగా వాడతారు.
  • హ్యాంప్‌షైర్ (Hampshire) — నాణ్యమైన మాంసం, చురుకైన స్వభావం కలిగిన జాతి.

తెలంగాణకు అనువైన సంకర జాతులు:
పి.వి.నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం (PVNRTVU) ‘శిక్షణ’ పోర్టల్ ప్రకారం, తెలంగాణలో పెంపకానికి అనువైనవిగా ఈ కింది సంకర జాతులను గుర్తించారు

SVVU–T17 — శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం (SVVU), తిరుపతి అభివృద్ధి చేసిన సంకర జాతి. లార్జ్ వైట్ యార్క్‌షైర్‌ను స్థానిక దేశీయ పందితో సంకరీకరణ చేసి 75% సీమ వారసత్వంతో రూపొందించారు. 8 నెలల వయసుకు సగటున 70–75 కిలోల బరువు, ఒక్కో ఈతకు 8–12 పిల్లలు లభిస్తాయి; ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ, పేద రైతు కుటుంబాలకు జీవనోపాధి వనరుగా విస్తృతంగా వాడుతున్నారు (SVVU, 2021).

రాణి (Rani) — ఐ.సి.ఏ.ఆర్.-జాతీయ పంది పరిశోధనా కేంద్రం, గౌహతి 2016లో విడుదల చేసిన సంకర జాతి. సీమ జాతి హ్యాంప్‌షైర్‌ను ఈశాన్య భారత దేశీయ జాతి ఘుంగ్రూతో సమాన (50:50) వారసత్వంతో సంకరీకరణ చేశారు; ఆరు తరాలుగా జాతి లక్షణాలను స్థిరీకరించారు. 8 నెలల వధ వయసుకు సుమారు 75 కిలోల బరువు, 1.98 సెం.మీ. వెన్ను కొవ్వు మందం లభిస్తుంది; డ్యూరాక్‌తో సంకరీకరించి ‘ఆశ’ అనే మరో రకాన్ని కూడా అభివృద్ధి చేశారు (ICAR-NRCP, 2016).

TANUVAS KPM Gold — తమిళనాడు పశు వైద్య, జంతు శాస్త్రాల విశ్వవిద్యాలయం (TANUVAS) కింద పి.జి.ఆర్.ఐ.ఏ.ఎస్., కట్టుపాక్కంలో అభివృద్ధి చేసిన సంకర జాతి. లార్జ్ వైట్ యార్క్‌షైర్ (75%)ను తమిళనాడు దేశీయ పందితో (25%) సంకరీకరణ చేసి 2017లో విడుదల చేశారు. అధిక వ్యాధి నిరోధకత, 3% లోపు పాలు మాన్పే వయసు మరణాల రేటు, ఒక్కో ఈతకు సగటున 8.1 పిల్లలు దీని ప్రత్యేకతలు; స్థానిక వాతావరణ పరిస్థితులకు బాగా అలవాటుపడింది (TANUVAS, 2017).

ఐ.సి.ఏ. ఆర్.-జాతీయ పంది పరిశోధనా కేంద్రం (ICAR-National Research Centre on Pig – ICAR-NRCP), గౌహతి ఈ సీమ, సంకర జాతులను దేశీయ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయడంలో, రైతులకు మేలుజాతి కూనలను (piglets) సరఫరా చేయడంలో, శిక్షణలు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

శాస్త్రీయ పెంపక యాజమాన్య పద్ధతులు
గృహ నిర్మాణం (షెడ్ నిర్మాణం): పందుల షెడ్డు ఎత్తైన ప్రదేశంలో, మంచి గాలి, వెలుతురు ఉండేలా నిర్మించాలి. ఈనే పందులకు వేరుగా ఫారోయింగ్ పెన్‌లు, పిల్లల కోసం క్రీప్ ఏరియా, వ్యాధి సోకిన పందులను వేరుచేసేందుకు ఐసొలేషన్ పెన్ ఏర్పాటు చేసుకోవాలి. నేల సులభంగా కడగగలిగేలా సిమెంట్‌తో వాలుగా ఉండాలి, తద్వారా మురుగునీరు సులభంగా బయటకు పోతుంది.

సంతానోత్పత్తి యాజమాన్యం: ఆడ పందులకు 8 నెలల వయసు, సుమారు 90–100 కిలోల బరువు వచ్చాక మొదటిసారి సంతానోత్పత్తికి ఉపయోగించాలి. గర్భధారణ కాలం సగటున 114 రోజులు (3 నెలలు, 3 వారాలు, 3 రోజులు) ఉంటుంది. పిల్లలను 6–8 వారాల వయసులో పాలు మాన్పించడం (weaning) శాస్త్రీయ పద్ధతి. సంతానోత్పత్తికి రెండు వారాల ముందు ఆడ పందికి కొంచెం ఎక్కువ దాణా ఇవ్వడాన్ని ‘ఫ్లషింగ్’ (Flushing) అంటారు; ఇది రోజుకు 0.7–0.9 కిలోల బరువు పెరుగుదలను, మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.

మేత యాజమాన్యం
పందుల పెంపకంలో మొత్తం ఖర్చులో 70–75 శాతం మేత ఖర్చే ఉంటుంది. కాబట్టి వయసు, శరీర బరువును బట్టి శాస్త్రీయంగా మేత మార్చడం లాభదాయకతను నిర్ణయిస్తుంది.

దశలవారీ మాంసకృత్తుల (ప్రొటీన్) అవసరం
దశ/ వయసు ప్రోటీన్ % శక్తి (ME, కిలో క్యాలరీలు/కిలో మేత)
2–5 కిలోల బరువు పిల్లలు 24% 3,500
5–15 కిలోల బరువు 22% 3,500
15–35 కిలోల బరువు (గ్రోయర్) 18% 3,300
35–90 కిలోల బరువు (ఫినిషర్) 14% 3,300
గర్భిణి ఆడ పందులు 14% 3250
పాలిచ్చే ఆడ పందులు 15% 3300
కోడె పందులు (boars) 14% 3250

క్రీప్ ఫీడ్ మరియు తొలిదశ మేత
పుట్టిన 45 నిమిషాల్లోపే పిల్లలకు మొదటి పాలు (కొలొస్ట్రమ్) తాగించడం చాలా ముఖ్యం; ఇందులో వ్యాధి నిరోధక శక్తినిచ్చే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు), విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. 10వ రోజు నుంచి పాలు మాన్పించిన 2 వారాల వరకూ 18–20% ప్రొటీన్‌తో కూడిన క్రీప్ ఫీడ్ ఇవ్వాలి. మొక్కజొన్న, వేరుశనగ చెక్క, తవుడు, చేపల పొడి, ఖనిజ మిశ్రమం కలిపి తయారుచేసే ఈ దాణా వల్ల మాన్పించే సమయంలో ఒత్తిడి తగ్గి, త్వరగా బరువు పెరుగుతాయి.

గ్రోయర్ మరియు ఫినిషర్ దాణా
గ్రోయర్ దశలో మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ తవుడు, చేపల పొడి, ఖనిజ మిశ్రమంతో కూడిన సమతుల్య దాణా ఇవ్వాలి. ఫినిషర్ దశలో మార్కెట్ బరువుకు తీసుకురావడానికి శక్తినిచ్చే దాణాతో పాటు నువ్వుల చెక్క వంటివి చేర్చవచ్చు.

పదార్థం పరిమాణం (100 కిలోల దాణాలో)
మొక్కజొన్న 55 భాగాలు
వేరుశనగ చెక్క 20 భాగాలు
గోధుమ తవుడు 15 భాగాలు
చేపల పొడి 8.5 భాగాలు
ఖనిజ మిశ్రమం 1.5 భాగాలు
ఉప్పు 0.5 భాగాలు
ఈ మిశ్రమం ద్వారా మొత్తం 22% ప్రొటీన్ లభిస్తుంది.

గర్భిణి, పాలిచ్చే ఆడ పందుల మేత:
గర్భిణి ఆడ పందికి రోజుకు 1.8–1.9 కిలోల దాణా ఇస్తే గరిష్ఠ జనన బరువు (Birth Weight), మాన్పే బరువు (Weaning weight) లభిస్తాయి. ఈనడానికి 4–5 రోజుల ముందు దాణాను సగానికి తగ్గించి, మలబద్ధకం రాకుండా గోధుమ తవుడు వంటి లఘువిరేచన పదార్థాలు చేర్చాలి. పాలిచ్చే ఆడ పందికి రోజుకు 3.5 కిలోల దాణాతో పాటు ప్రతి పిల్లకు అదనంగా 0.2 కిలోల చొప్పున, 14–23 లీటర్ల నీరు అవసరం.

నీటి అవసరం (రోజుకు):
వర్గం నీరు (లీటర్లలో)
కోడె పంది (boar) 45–50
ఈనే ఆడ పంది 18–22
పాలు మాన్పిన పిల్లలు 3.5–4
పాలిచ్చే ఆడ పంది 14–23

చౌక, స్థానిక మేత వనరులు
దాణా ఖర్చు తగ్గించుకోవడానికి అజొల్ల, వరి తవుడు (75% వరకు), బ్రూవరీ వ్యర్థాలు (15% వరకు), అరటి వ్యర్థాలు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు, హోటల్ వంటగది వ్యర్థాలు వంటి స్థానిక వనరులను సమతుల్యంగా వాడుకోవచ్చు. అయితే, గార్బేజ్ ఫీడింగ్‌లో మాంసం ముక్కలను ఇవ్వకూడదు — ఇవి వ్యాధులను వ్యాప్తి చేయడంతో పాటు గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. పులిసిన లేదా నిల్వ ఉంచిన ఆహారాన్ని ఇస్తే సాల్మొనెల్లోసిస్ వంటి వ్యాధులు వచ్చి మరణాలకు దారితీయవచ్చు కాబట్టి ఉడికించిన వ్యర్థాలనే ఇవ్వాలి.

వ్యాధి వర్గం: బాక్టీరియా వ్యాధులు

ప్రధాన వ్యాధులు : బ్రూసెల్లోసిస్

ముఖ్య లక్షణాలు: గర్భస్రావం, వంధ్యత్వం

నివారణ / నియంత్రణ : సోకిన పందులను వేరుచేయాలి, పరీక్షలు నిర్వహించాలి. జూనోటిక్ వ్యాధి.

వ్యాధి : *లెప్టోస్పైరోసిస్

ముఖ్య లక్షణాలు: జ్వరం, విరేచనాలు, గర్భస్రావం

నివారణ / నియంత్రణ : పరిశుభ్రత, ఎలుకల నియంత్రణ, అవసరమైన టీకాలు

వ్యాధి : స్వైన్ ఎరిసిపెలాస్

ముఖ్య లక్షణాలు: అధిక జ్వరం, చర్మంపై వజ్రాకార మచ్చలు

నివారణ / నియంత్రణ : సమయానికి టీకాలు, యాంటీబయోటిక్ చికిత్స

వ్యాధి : అట్రోఫిక్ రైనైటిస్, సాల్మొనెల్లోసిస్, పాశ్చురెల్లోసిస్

ముఖ్య లక్షణాలు: శ్వాసకోశ సమస్యలు, విరేచనాలు

నివారణ / నియంత్రణ : పరిశుభ్రత, బయోసెక్యూరిటీ, వెటర్నరీ చికిత్స

వైరస్ వ్యాధులు: *

వ్యాధి : క్లాసికల్ స్వైన్ ఫీవర్ (CSF)

ముఖ్య లక్షణాలు: జ్వరం, ఆకలి తగ్గడం, అధిక మరణాలు

నివారణ / నియంత్రణ : సమయానికి టీకాలు వేయాలి

వ్యాధి : ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF)

ముఖ్య లక్షణాలు: అకస్మిక మరణాలు, అధిక మరణాల రేటు

నివారణ / నియంత్రణ : ప్రస్తుతం సమర్థవంతమైన టీకా లేదు. కఠినమైన బయోసెక్యూరిటీ పాటించాలి.

వ్యాధి: ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (FMD)

ముఖ్య లక్షణాలు: నోరు, కాళ్లపై బొబ్బలు

నివారణ / నియంత్రణ : టీకాలు, వ్యాధిగ్రస్త పందులను వేరుచేయాలి

వ్యాధి : స్వైన్ ఇన్‌ఫ్లుఎంజా

ముఖ్య లక్షణాలు: శ్వాసకోశ, జీర్ణకోశ సమస్యలు

నివారణ / నియంత్రణ : మంచి నిర్వహణ, అవసరమైన టీకాలు

*పరాన్నజీవి వ్యాధులు *

వ్యాధి : సార్కాప్టిక్ మేంజ్

ముఖ్య లక్షణాలు: తీవ్రమైన దురద, చర్మ సమస్యలు

నివారణ / నియంత్రణ : ఐవర్‌మెక్టిన్ చికిత్స, పరిశుభ్రత

వ్యాధి : రౌండ్‌వార్మ్, విప్‌వార్మ్, కిడ్నీ వార్మ్, లంగ్ వార్మ్

ముఖ్య లక్షణాలు: ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం

నివారణ / నియంత్రణ : ప్రతి 3 నెలలకోసారి డీవార్మింగ్ చేయాలి

వ్యాధి : ట్రైకినోసిస్

ముఖ్య లక్షణాలు: జూనోటిక్ వ్యాధి

నివారణ / నియంత్రణ : పంది మాంసాన్ని పూర్తిగా ఉడికించి తీసుకోవాలి

జూనోటిక్ వ్యాధులపై జాగ్రత్తలు
బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాల్మొనెల్లోసిస్, ట్రైకినోసిస్ వంటి వ్యాధులు పందుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అందువల్ల చేతి తొడుగులు ఉపయోగించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాంసాన్ని పూర్తిగా ఉడికించి తినడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.

బయోసెక్యూరిటీ చర్యలు
• కొత్తగా కొనుగోలు చేసిన పందులను 2–3 వారాలు క్వారంటైన్‌లో ఉంచాలి.
• షెడ్డును, పరికరాలను, తాగునీటి పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రపరచి క్రిమిసంహారక మందులు ఉపయోగించాలి.
• ప్రతి 3 నెలలకోసారి డీవార్మింగ్ చేయాలి.
• టీకాల షెడ్యూల్‌ను తప్పకుండా పాటించాలి.
• అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యుడిని సంప్రదించి, అనుమానాస్పద మరణాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలి.

రైతులకు సూచన: “చికిత్స కంటే నివారణే ఉత్తమం.” పరిశుభ్రమైన నిర్వహణ, సమతుల్య పోషకాహారం, సమయానికి టీకాలు, క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయడం ద్వారా పందుల ఆరోగ్యాన్ని కాపాడి అధిక లాభాలు పొందవచ్చు.

ప్రభుత్వ పథకాలు — విధానాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పందుల పెంపకాన్ని ఒక వ్యవస్థాపక అవకాశంగా ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నాయి.

జాతీయ పశు సంపద మిషన్ (National Livestock Mission – NLM)

పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ పథకంలోని వ్యవస్థాపకత అభివృద్ధి ఉప-పథకం (Entrepreneurship Development Sub-Mission) కింద, పందుల పెంపక క్షేత్రాల ఏర్పాటుకు షెడ్ నిర్మాణం (ఈనే పందుల షెడ్, కోడె పందుల యూనిట్, ఫారోయింగ్ పెన్), మేలుజాతి పిల్ల పందుల కొనుగోలు, పరికరాలు, బీమా, పశు వైద్య సహాయం వంటి అంశాలపై 50% వరకు మూలధన రాయితీ లభిస్తుంది. వ్యక్తులు, రైతు ఉత్పత్తి సంఘాలు (FPO), స్వయం సహాయక బృందాలు (SHG), రైతు సహకార సంస్థలు (FCO), ఉమ్మడి బాధ్యతా బృందాలు (JLG) ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముగింపు
సీమ, సంకర జాతుల పందుల పెంపకం తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలం, తక్కువ కాలంలో ఎక్కువ రాబడినిచ్చే గ్రామీణ ఉపాధి మార్గంగా విస్తరిస్తోంది. అయితే, శాస్త్రీయ యాజమాన్యం, దశలవారీ సమతుల్య మేత, కచ్చితమైన టీకా కార్యక్రమం, కఠినమైన బయోసెక్యూరిటీ చర్యలు పాటించకుండా చేపడితే — ముఖ్యంగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వంటి టీకా లేని వ్యాధుల నేపథ్యంలో — నష్టాలు తప్పవు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, రుణ సదుపాయాలు, విశ్వవిద్యాలయాల విస్తరణ సేవలను సద్వినియోగం చేసుకుంటూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే, తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలు సీమ పందుల పెంపకం ద్వారా నిలకడైన ఆదాయాన్ని, నిజమైన ఆర్థిక సాధికారతను సాధించగలరు. ఇందుకు పశు విస్తరణ విద్య, క్షేత్రస్థాయి శిక్షణలు, పశు వైద్యుల మార్గదర్శకత్వం అనునిత్యం అందుబాటులో ఉండటం అత్యవసరం.
.
డా. ఎం. అరవింద్ (పీజీ స్కాలర్), పశువైద్య & పశుసంవర్థక శాఖ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌, సెల్‌: 8499884669.

Read More

గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం

     గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తోంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనాధారంలో పశుపోషణకు ముఖ్యమైన స్థానం ఉంది. వ్యవసాయంతో పాటు పశువులను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో పశుపోషణ సంప్రదాయ పద్ధతులపై ఆధారపడగా, ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ యాప్‌లు, ఆన్‌లైన్ సేవలు వంటి సాంకేతిక సాధనాలు రైతులకు పశువుల సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, మార్కెటింగ్ మరియు ఆర్థిక లావాదేవీలలో సహాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం రైతుల జీవితాలను సులభతరం చేస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది.

పశువులకు డిజిటల్ గుర్తింపు (RFID ట్యాగింగ్):
ప్రతి పశువు చెవికి ప్రత్యేకమైన డిజిటల్ కోడ్ కలిగిన ట్యాగ్‌ను (RFID – Radio Frequency Identification) అమర్చుతున్నారు. దీని ద్వారా పశువు పుట్టిన తేదీ, యజమాని వివరాలు, ఇచ్చిన టీకాలు, మరియు ఆరోగ్య చరిత్రను కేంద్ర ప్రభుత్వ నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (NDLM) డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి మరియు నకిలీ పశువులను గుర్తించడానికి సహాయపడుతుంది.

పశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ- డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో పశువుల ఆరోగ్య పర్యవేక్షణ ఒకటి.

  • ప్రస్తుతం పశువులకు స్మార్ట్ కాలర్లు లేదా చెవులకు అమర్చే సెన్సర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పశువుల శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఆహారం తీసుకునే విధానం వంటి విషయాలను నిరంతరం గమనిస్తాయి.
  • పశువులో ఏదైనా అసాధారణ లక్షణం కనిపిస్తే వెంటనే రైతు మొబైల్‌కు సమాచారం చేరుతుంది. దీంతో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చు. ఫలితంగా పశువుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి.
  • మన దేశంలో కొన్ని AI ఆధారిత వ్యవస్థలు మాస్టైటిస్, లంపీ స్కిన్ డిసీజ్ వంటి వ్యాధులను కూడా ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

పాల ఉత్పత్తి మరియు విక్రయాలలో డిజిటలైజేషన్:
పాల సేకరణ కేంద్రాలలో ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్’ (AMCU) వచ్చాయి. వీటి ద్వారా పాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో నాణ్యత (ఫ్యాట్ శాతం) ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావడం వల్ల పారదర్శకత పెరుగుతుంది.

  • డిజిటల్ పరికరాలు పశువుల ఉత్పాదకతను కూడా పెంచుతున్నాయి. పశువులు ఎంత మేత తింటున్నాయి, ఎప్పుడు మేత ఇవ్వాలి, సంతానోత్పత్తికి సరైన సమయం ఎప్పుడు అనే విషయాలను ఇవి గుర్తించగలవు. అలాగే పాల ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కూడా విశ్లేషించగలవు.
  • దీంతో ప్రతి పశువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సాధ్యమవుతుంది. ఫలితంగా పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతోంది.

కృత్రిమ గర్భధారణ (AI) మరియు సంతానోత్పత్తి యాప్‌లు:
పశువుల ఈత సమయం, ఎదకు వచ్చే సమయం కచ్చితంగా తెలిస్తేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు వచ్చాయి. ఇవి పశువుల ఆరోగ్య చక్రంను పర్యవేక్షించి, రైతులకు సరైన సమయానికి సూచనలు పంపుతాయి.

రైతుల చేతిలో స్మార్ట్‌ఫోన్ శక్తి- నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ రైతులకు ఒక ముఖ్యమైన సాధనంగా మారింది.
మొబైల్ యాప్‌ల ద్వారా రైతులు పశువైద్యుల సలహాలు పొందవచ్చు. టెలీమెడిసిన్ సేవలను ఉపయోగించవచ్చు. వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. వ్యాధులపై హెచ్చరికలు పొందవచ్చు. మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు. అలాగే పశువులు లేదా పాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. టీకాలు వేయాల్సిన తేదీలు, మందులు ఇవ్వాల్సిన సమయాల గురించి కూడా యాప్‌లు గుర్తు చేస్తాయి.

వ్యాధుల నియంత్రణలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర
పశువుల ప్రవర్తనలో ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే డిజిటల్ పరికరాలు వెంటనే హెచ్చరికలు పంపిస్తాయి. దీంతో వ్యాధులు ఎక్కువగా వ్యాపించకముందే అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పశువుల మరణాలు తగ్గడమే కాకుండా రైతులు ఆర్థిక నష్టాల నుంచి కూడా రక్షించబడతారు.

పశువైద్య సేవలు – ఈ-సంజీవని:
దూర ప్రాంతాల్లోని రైతులకు పశువైద్యుల సలహాలు, సూచనలు అందించడానికి టెలి-మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు, స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో కాల్స్ చేసి వ్యాధులను నిర్ధారించి, చికిత్స అందించవచ్చు.

మార్కెట్ అవకాశాల విస్తరణ- డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించే అవకాశం పొందుతున్నారు.
దీంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తులకు సరైన ధర లభిస్తుంది. మార్కెట్ సమాచారం సులభంగా అందుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే డిజిటల్ చెల్లింపుల వల్ల డబ్బు లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా జరుగుతున్నాయి.

పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల యాంటీబయాటిక్స్ అవసరానికి మించి వాడాల్సిన అవసరం తగ్గుతుంది. నీరు, మేత వంటి వనరుల వృథా తగ్గుతుంది. పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతుంది. దీంతో అందుబాటులో ఉన్న వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు
అయితే ఈ మార్పుల మధ్య కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోవడం. డిజిటల్ పరిజ్ఞానం కొంతమందికి తక్కువగా ఉండటం. ఆధునిక పరికరాల ధరలు ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రైతులందరూ ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగించలేకపోతున్నారు.
అందుకే రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి.

ముగింపు
డిజిటల్ టెక్నాలజీ సంప్రదాయ పశుపోషణ పద్ధతులను తొలగించడం లేదు. వాటిని మరింత మెరుగుపరుస్తోంది. రైతుల అనుభవానికి ఆధునిక సాంకేతికత తోడవడంతో పశుపోషణ మరింత సులభంగా, సమర్థవంతంగా మారుతోంది. ఆరోగ్యకరమైన పశువులు, అధిక ఆదాయం, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో పశుపోషణలో డిజిటల్ సాధనాలు కూడా భూమి, నీరు, మేతల మాదిరిగానే అవసరమైనవిగా మారనున్నాయి.
ఈ డిజిటల్ విప్లవం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వల్ల పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయి. యువత కూడా ఈ ఆధునిక పశుపోషణ పట్ల ఆసక్తి చూపుతున్నారు.

డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్‌సి.),
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. Ph: 9703121088

Read More

పశుపోషణలో మునగ ప్రాముఖ్యత

మన దేశంలో ప్రాచీనకాలం నుండి ప్రకృతిలో సహజంగా లభించే అనేక రకాలయిన చెట్లకు, వాటి ఆకులు, కాయలు, వేర్లు మరియు ఇతర భాగాలకు వైద్యపరంగా చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నాము. కొన్ని రకాల మొక్కలకు ప్రత్యేక ఔషధ గుణాలు ఉండట, మరికొన్ని రకాల మొక్కల్లో మాంసకృత్తులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అధిక మోతాదులో ఉండటం వలన వీటి వినియోగం ఇటు మానవ మనుగడలోనే గాక, అటు పశువైద్యంలో కూడా గణనీయంగా పెరిగింది. నేటి కాలంలో పూల మొక్కల నుండి అటవీ వృక్షాల వరకు, వాటిలో ఉండే ఔషధ విలువలు మరియు ఆరోగ్యానికి అవి చేసే మేలు, వాటి ఇతర భాగాల్లో ఇమిడి ఉండే పోషక పదార్థాల గురించి అన్ని కోణాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

ప్రకృతి మనకు అందించిన అత్యంత పోషక విలువలు ఉన్న మొక్క ‘మునగ’. ‘పోషకాల గని’గా పేరొందిన మునగ అటు మానవ మనుగడలోనేగాక, పశుపోషణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగ చెట్టు యొక్క ఆకులు, కాయలు, విత్తనాలు మరియు ఇతర భాగాల్లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు మరియు విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి.

మునగ సాగు – వివరాలు:
మునగ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జులై మొదటి వారం నుండి అక్టోబర్, చివరి వారం వరకు మునగను విత్తుకోవచ్చు. పి.కే.యం-1, పి.కే.యం.2 వంటి రకాలను పెంచుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుంది. కావున పశువుల మేతకు ఈ రకాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 20-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు మునగ ఏపుగా పెరుగుతుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువగా పెరగకపోవచ్చు. కావున దిగుబడి అధికంగా ఉన్నప్పుడు మునగ ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టుకొని నిల్వ చేసుకొని ఎండాకాలంలో ఇతర ప్రశుగ్రాసాలతో కలిపి ఇవ్వవచ్చు.
ప్రత్యేకంగా పశుగ్రాసం కోసం మాత్రమే మునగను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మునగ విత్తనాలను సాళ్ళల్లో 3-5 సెం.మీ. లోతులో నాటుకోవాలి. రెండు సాళ్ల మధ్య దూరం 30 సెం.మీ. మరియు రెండు మొక్కల మధ్య దూరం 20 సెం.మీ. ఉండేవిధంగా చూసుకోవాలి. ఈ విధానంలో ఎకరాకు 25-35 కిలోల విత్తనం సరిపోతుంది. నాటిన రెండు వారాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాలు ఎక్కువగా లేనప్పుడు మునగ కొమ్మలను కత్తిరించి కూడా నాటుకోవచ్చు. నాటిన తరువాత 3 నెలలకు మొదటి కోతను తీసుకోవచ్చు.

పోషక విలువలు:
పచ్చి మునగ ఆకుల్లో 16% మాంసకృత్తులు, 18% పీచుపదార్థాలు ఉంటాయి. ఎండిన ఆకులు లేదా పొడిలో 28% వరకు మాంసకృత్తులు, 15% పీచు పదార్థాలు, 3.65% కాల్షియం, 0.3% ఫాస్ఫరస్, 0.5% మెగ్నీషియం, 1.5% పొటాషియం, 8.25% కాపర్ ఉంటాయి. అంతేగాక జింక్, మాంగనీస్, ఐరన్ వంటి మూలకాలు అధిక మోతాదులో ఉంటాయి. పచ్చి మునగ ఆకుల్లో కొద్ది మొత్తంలో ‘సపోనిన’ అనే పదార్థాలు ఉండటం వల్ల కొద్దిగా చేదుగా ఉంటాయి. పచ్చి మునగ ఆకులను పాడి పశువులకు ప్రతీరోజు 5-10 కిలోల వరకు, దూడలకు 1-2 కిలోల వరకు ఇవ్వవచ్చు. ఎండిన మునగ ఆకులను లేదా మునగ పొడిని పాడి పశువులకు రోజుకు 200 గ్రాముల వరకు మరియు దూడలకు 50 గ్రాముల వరకు ఇవ్వవచ్చు.

ప్రయోజనాలు:

  • పశులు జీర్ణవ్యవస్థలో మీథేన్ అనే గ్యాస్ వెలువడుతుంది. పశువుల కడుపులో ఉండే మిథనోజెనిర్ బ్యాక్టీరియా ఈ గ్యాస్‌ని విడుదల చేస్తాయి. ఈ మీథేన్ గ్యాస్ పరిమాణం అనేది పశువులు తీసుకునే ఆహారాన్ని బట్టి విడుదలవుతుంది. పశువుల మేతలో మునగ ఆకును లేదా పొడిని ఇచ్చినట్లయితే ఈ బ్యాక్టీరియా సంఖ్య తగ్గి మీథేన్ గ్యాస్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల వాతావరణంలో కొంతమేర మీథేన్ గ్యాస్ విడుదల తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది.
  • పాడి పశువుల్లో పాల దిగుబడి పెరగడమే కాకుండా, పాలల్లో వెన్నశాతం పెరుగుతుంది.
  • పశువులు, దూడల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • పాడిపశువులు ఈనిని తరువాత మళ్ళీ త్వరగా ఎదకు రావడం మరియు చూడికట్టడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • కాల్షియం అధికంగా ఉండటం వలన ఎదిగే దూడల్లో ఎముకలు పటిష్టంగా తయారవుతాయి.
  • అనేక పోషకాలు ఉండటం వల్ల పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉంటాయి.

డా.డి. వెంకటేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశుగణ సముదాయం, పశువైద్య కళాశాల, కోరుట్ల, ఫోన్: 9951534076

Read More

పొదుగు వాపు వ్యాధి (మాస్టైటిస్) కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు నివారణ చర్యలు

మాస్టైటిస్ అంటే క్షీర గ్రంధి లేక పొదుగు యొక్క వాపు. ఇది పొదుగు యొక్క భౌతిక, రసాయన మరియు సూక్ష్మజీవుల మార్పులను కలుగజేస్తుంది. ఇది ప్రధానంగా పాలలో సోమాటిక్ కణాల పెరుగుదల మరియు క్షీర కణజాలంలోని రోగ లక్షణ మార్పుల ద్వారా గుర్తించబడుతుంది. ఇది పాడి పరిశ్రమలో అత్యంత సాధారణమైన మరియు ఆర్థికంగా నష్టాన్ని కలిగించే వ్యాధులలో ఒకటి. ఇది పాల నాణ్యతను మరియు ఉత్పత్తిని తగ్గేలా చేస్తుంది. మాస్టైటిస్ అనే పదము గ్రీకు పదం. “మాస్టో” అంటే క్షీర గ్రంధిని సూచిస్తుంది మరియు “ఐటిస్” అంటే వాపు అని అర్థం.

పొదుగు వాపుకు ముందస్తు కారణాలు

  • సాధారణంగా పొదుగు వాపు ఎక్కువ ఈతలు ఈనిన పశువులలో చూడవచ్చు.
  • తక్కువ దిగుబడి నిచ్చే వాటికంటే అధిక దిగుబడినిచ్చే పాడి ఆవులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.
  • అన్య దేశ మరియు సంకరజాతి ఆవులకు పొదుగు వాపు ఎక్కువగా వస్తుంది.
  • పొదుగు నుండి అసంపూర్ణంగా పాలు పితకడం
  • జన్యుపరమైన కారణాలు అనగా పొడవాటి చనులు, కిందకు ఉండే పొదుగు
  • గాయాలు గల చనులు, పొదుగు వ్యక్తిగత అపరిశుభ్రత, అపరిశుభ్ర మైన పరిసరాలు మొదలైనవి పొదుగు వాపు కు దోహదపడతాయి.

కారణాలు
పొదుగు వాపుకు కారణాలుగా వివిధ రకాల సూక్ష్మక్రిములు సూచింపబడతాయి. అవి బ్యాక్టీరియా (సూక్ష్మజీవులు), వైరస్ (సూక్ష్మతి సూక్ష్మక్రిములు), ఫంగస్ (శిలీంద్రాలు) మరియు మైకోప్లాస్మా.
పొదుపు వాపుకు కారణమయ్యే అతి ముఖ్యమైన బ్యాక్టీరియాలు- స్టెఫిలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ అగలక్షియే, స్ట్రెప్టోకోకస్ జూఎపిడెమికస్, స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్, క్లెబ్సియెల్లా, మైకోబాక్టీరియం బోవిస్, ఎస్చేరిచియా కోలై, బ్రూసెల్లా అబోర్టస్; సూడోమోనాస్ మొదలగునవి
మాస్టైటిస్కు కారణమయ్యే శిలీంధ్ర జీవులు- ట్రైకోస్పోరాన్, ఆస్పెర్‌గిల్లస్ ఫ్యూమిగాటస్, ఆస్పెర్‌గిల్లస్ మిడులస్; కాండిడా జాతులు.

వ్యాప్తి విధానం
చనుల యొక్క రంద్రాల ద్వారా ఇన్ఫెక్షన్ క్షీర గ్రంధికి చేరుకుంటుంది పొదుగు మరియు పర్యావరణం లో నివసించే సూక్ష్మ క్రిములు వంటివి అనుకూలమైన పరిస్థితులలో వృద్ది చెంది కణజాలాలపై దాడి చేయటం వలన చాలా హానికరమైన ప్రభావం ఏర్పడుతుంది. ఆవు యొక్క చర్మ ఉపరితలం మీద అనేక క్రిములు నివాసం కలిగి ఉండవచ్చు మరియు అక్కడ నుండి ఆ క్రిములు పాలు పితికే వారి ద్వారా కలుషితం చెంది వ్యాధి వచ్చే అవకాశం ఉండవచ్చు. పాలు పితికే వారి చేతులు, బట్టలు మరియు పాలు పితికే యంత్రాల కప్పుల ద్వారా వ్యాధి సోకిన పొదుగు భాగం నుండి వ్యాధి సోకని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన గ్రంధి నుండి వచ్చే స్రవాలు, నేలను కలుషితము చేయడం ద్వారా వ్యాధి సంక్రమణ చెందుతుంది.

పొదుపు వాపు రకాలు
1) వ్యాధి లక్షణాల ఆధారంగా
a) క్లినికల్ మాస్టైటిస్
ఇందులో పొదుగు వాపు లక్షణాలైన వాపు, వేడి, ఎరుపు రంగు, తీవ్రమైన నొప్పి ఉంటుంది.
b) సబ్ క్లినికల్ మాస్టైటిస్
ఈ రకంలో పొదుగు నందు ఎటువంటి బాహ్య లక్షణాలు కనపడవు కానీ పాలలో మార్పులు అంటే సోమాటిక్ కణాలు, తెల్ల రక్తకణాలు (ల్యూకోసైట్లు) మరియు ఎపితీలియల్ కణాలలో మార్పు, పాల పిహెచ్ (PH)లో మార్పులు గమనించవచ్చు.
2) పొదుగు వాపు తీవ్రత ఆధారంగా
a) తేలికపాటి మాస్టైటిస్
పాలలో స్వల్ప మార్పులు, పలుకులు లేదా గడ్డ కట్టడం గమనించవచ్చు.
b) తీవ్రమైన మాస్టైటిస్
పాలలో మార్పులు మరియు పొదుగులో వాపు మరియు నొప్పితో పాటు మరింత స్పష్టమైన మార్పులు గమనించవచ్చు.
c) అతితీవ్రమైన మాస్టైటిస్
శారీరక సంబంధ సంకేతాలైన జ్వరం, ఆకలి లేకపోవటం మరియు తీవ్రమైన పొదుపు వాపు వంటి లక్షణాలను గమనించవచ్చు.
3) కాలవ్యవధి ఆధారంగా
a) అతి తీవ్రమైన మాస్టైటిస్
తీవ్రమైన లక్షణాలతో ఆకస్మికంగా ప్రారంభమవుతుంది తరచుగా శారీరక సంబంధమైన అనారోగ్యానికి దారితీస్తుంది.
b) తీవ్రమైన మాస్టైటిస్
గుర్తించదగిన లక్షణాలతో త్వరగా ప్రారంభమవుతుంది
c) సబక్యూట్ (తక్కువ తీవ్రమైన) మాస్టైటిస్
తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటాయి ఇది తీవ్రమైన మాస్టైటిస్ కంటే తక్కువ తీవ్రమైనది
d) దీర్ఘకాలిక మాస్టైటిస్
నిరంతర వాపు కలిగి ఉండి సమయానుకూలంగా వ్యాధి లక్షణాలు కనబడతాయి.
4) కారణ కారక ఆధారంగా
a) సంక్రమించే (కంటేజియస్) మాస్టైటిస్
ఇది ప్రధానంగా పాలు పితికే ప్రక్రియలో ఒక ఆవు నుండి మరొక ఆవుకు వ్యాప్తిస్తుంది. కలుషితమైన పాలు పితికే పరికరాలు, చేతులు మరియు బెడ్డింగ్ వస్తువుల ద్వారా పాలు పితికే సమయంలో వ్యాప్తిస్తాయి.
వ్యాధికారకాలు: స్టెఫిలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ అగలక్షియే మరియు మైకోప్లాస్మా జాతులు.
b) పర్యావరణ (ఎన్విరాన్మెంటల్) మాస్టైటిస్
ఇది ఆవు పరిసరాలలో ఉన్న కలుషితమైన బెడ్డింగ్ వస్తువులు, నేల, నీరు మరియు ఎరువు వంటి వాటి వల్ల సంభవిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లు సాధారణంగా పాలు పితికే సమయాల మధ్య సంక్రమిస్తాయి వ్యాధికారకాలు: ఎస్చరీషియా కోలై, క్లెబ్సియెల్లా మరియు స్ట్రెప్టోకోకస్ యుబేరిస్.

వ్యాధి అభివృద్ధి చెందే ప్రక్రియ
ఇది మూడు దశలుగా వివరించవచ్చు. సూక్ష్మ క్రిములు చనుల ద్వారా చొరబడుట, ఇన్ఫెక్షన్ మరియు వాపు కలుగజేయుట.

  1. మొదట వ్యాధికారక సూక్ష్మ క్రిములు చనుమొనల చివర నుండి పాల గ్రంధిలోనికి చొరబడతాయి.
  2. ఇన్ఫెక్షన్ దశ అంటే వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెంది, క్షీర కణజాలంపై దాడి చేస్తాయి.
  3. వాపు దశలో పొదుగు యొక్క వాపు, పాలలో మార్పులు అంటే పాలుగడ్డ కట్టడం, విరిగిపోవడం అనే లక్షణాలు కలిగి ఉండవచ్చు.

పొదుగు వాపు లక్షణాలు
పొదుగుకు సంబంధించిన లక్షణాలు:

  • ఉద్దరoవాపు లేదా పొదుగు వాపు
  • గ్రంధి భాగం బాగా ఉబ్బిపోవడం
  • ఉష్ణోగ్రత పెరగడం, స్పర్శకు వేడిగా ఉండటం, ఎరుపు రంగులో మారడం
  • తీవ్రమైన నొప్పి
    పాలలో మార్పులు
  • పాలు నీరు లాగా ఉండటం
  • పాలు గడ్డకట్టడం లేదా రక్తపు చుక్కలు గమనించవచ్చు
  • కొన్ని సందర్భాల్లో తీవ్రమైన వాసన కూడా గమనించవచ్చు.
    తీవ్రమైన మాస్టైటిస్ లో కనిపించే ఇతర శారీరక సంభందిత లక్షణాలు
  • జ్వరము
  • ఆహారం తినకపోవడం
  • నీరసంగా ఉండటం
  • దాహం ఎక్కువగా ఉండటం
  • డిహైడ్రేషన్
  • పాల ఉత్పత్తి తగ్గిపోవడం చూడవచ్చు.

మాస్టైటిస్ నిర్ధారణ పద్ధతులు
క్లినికల్ మాస్టైటిస్ ను కళ్ళతోనే పాలలో కలిగే మార్పుల ద్వారా గుర్తించవచ్చు. సబ్ క్లినికల్ మాస్టైటిస్ ను పరీక్షల ద్వారానే నిర్ధారించుకోవాలి.

  1. భౌతిక పరిశీలన (ఫిజికల్ ఎగ్జామినేషన్): పొదుగు భాగాన్ని పరిశీలించి, వాపు, ఉష్ణోగ్రత, నొప్పిని గుర్తించడం. పాల ప్రవాహాన్ని గమనించడం. పాల రంగు, వాసన, గడ్డలు కట్టడం లాంటి లక్షణాలను పరిశీలించడం.
  2. క్యాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్ (CMT): పాలలో సోమాటిక్ కణజాలాన్ని అంచనా వేయటానికి ఉపయోగిస్తారు. పాలకు ఒక రియేజెంట్ ను జతచేసి దాని చిక్కదనాన్ని (జెల్ ఫార్మేషన్) గమనించడం ద్వారా మాస్టైటిస్ ను గుర్తించవచ్చు. సబ్ క్లినికల్ మాస్టైటిస్ ను గుర్తించడానికి ఈ టెస్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది చాలా సరళమైన, త్వరిత పరీక్ష. తక్కువ ఖర్చుతో ఫీల్డ్‌లోనే నిర్వహించగలిగే పరీక్ష.

కావాల్సిన పరికరాలు:

  • CMT ప్లేట్ (4 కువెట్లు ఉన్న ప్లాస్టిక్ ట్రే)
  • స్పెషల్ రియేజెంట్ (CMT, లిక్విడ్ ఆధారిత డిటర్జెంట్)
  • పాల నమూనాలు (ప్రతి ఉద్ధర భాగం నుంచి)

పరీక్ష పద్ధతి:

  1. గేదె యొక్క పొదుగు నాలుగు భాగాల నుండి పాలను CMT ప్లేట్‌లో ఒక్కో కువెట్లలో తీసుకోవాలి
  2. ప్రతి పాల నమూనాలోకి CMT రియేజెంట్ ను కలపాలి (సమాన 1:1 నిష్పత్తిలో)
  3. ప్లేట్‌ను సున్నితంగా 10 సెకన్లపాటు కలియబెట్టాలి
  4. జెల్ ఫార్మేషన్ స్థాయి (చిక్కదనం) ఆధారంగా ఫలితాన్ని గమనించాలి

ఫలితాల వివరణ:
రియాక్షన్ ఫలితాలు సోమాటిక్ సెల్ కౌంట్ అంచనా
పలుచగా ఉండి పాలలో ఎటువంటి మార్పు లేకపోవటం నెగటివ్ <200,000 కణాలు/ml చిక్కగా సబ్ క్లినికల్ మాస్టైటిస్ 200,000 – 500,000 స్పష్టమైన జెల్ పాజిటివ్ (క్లినికల్ మాస్టైటిస్) >500,000
చాలా గట్టి గడ్డలు శక్తివంతమైన పాజిటివ్ >1,000,000

జాగ్రత్తలు:
పరిశుభ్రమైన వాతావరణంలో చేయాలి
తాజా పాల నమూనాలను మాత్రమే ఉపయోగించాలి
వాసన లేదా రంగు మార్పుతో పాటు ఫలితాన్ని అర్థం చేసుకోవాలి

  1. పాల కల్చర్ మరియు సెన్సిటివిటీ టెస్ట్ (ABST): పాలు శుభ్రంగా సేకరించి, ల్యాబ్ లో కల్చర్ చేసి మాస్టైటిస్ కలిగించే బ్యాక్టీరియా ఏవో గుర్తించవచ్చు. తగిన యాంటీబయాటిక్ ను ఎంచుకునేందుకు ఈ టెస్ట్ చాలా దోహదపడుతుంది.
  2. సొమాటిక్ కణజాలం కౌంట్ (సొమాటిక్ సెల్ కౌంట్) (SCC): పాలలో తెల్ల రక్త కణాల సంఖ్య ఆధారంగా ఇన్ఫెక్షన్ తీవ్రతను అంచనా వేయవచ్చు. రెండు లక్షల కణాల కంటే ఎక్కువగా ఉంటే మాస్టైటిస్ ను సూచిస్తుంది.
  3. ఎలక్ట్రికల్ కండక్టివిటీ టెస్ట్: పాలలో ఉన్న అయాన్ల పరిమాణం మార్పు ఆధారంగా పాలు మాస్టైటిస్ వలన ప్రభావితమైందో లేదో చెప్పగలదు. ఇది వేగమంతమైన ఫీల్డ్ టెస్ట్.
  4. పాల యొక్క పీహెచ్ (PH) పరీక్ష: మాస్టైటిస్ ఉన్న పాలలో పిహెచ్ పెరుగుతుంది. 6.6 కంటే ఎక్కువగా ఉంటుంది.
  5. తర్మోగ్రఫీ: ఇన్ఫ్రారేడ్ కెమెరాలతో పొదుగుభాగం ఉష్ణోగ్రతను అంచనా వేయడం ద్వారా గుర్తించవచ్చు. పొదుగు వాపు వ్యాధి సంభందమైన మార్పులను తేలికగా గుర్తించవచ్చు.

చికిత్స:
(A) యాంటీబయాటిక్స్ (Antibiotics)
• ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే బ్యాక్టీరియాలను వృద్ధిచెందకుండా, యాంటీబయాటిక్ లను ఉపయోగిస్తారు. ఇవి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ (ABST) ఆధారంగా ఇచ్చినట్లయితే చికిత్సకు అగు ఖర్చులు తగ్గించుకోవచ్చు.

ఇంట్రామామరీ యాంటీబయాటిక్స్ (పొదుగులోకి ప్రత్యక్షంగా ఇవ్వడం):
o Cloxacillin
o Amoxicillin
o Cephalosporins

సిస్టమిక్ యాంటీబయాటిక్స్ (ఇంజెక్షన్లు రూపంగా):
o Enrofloxacin
o Penicillins
o Oxytetracycline
o Cephalosporins

(B) యాంటీ-ఇన్ఫ్లమేటరీ మందులు (Anti-inflammatory drugs)
• పొదుగు యొక్క వాపు మరియు నొప్పి తగ్గించడానికి ఈ మందులు వాడతారు.
ఉదాహరణలు:
o Flunixin meglumine
o Meloxicam

తీవ్రమైన కేసులలో శస్త్రచికిత్స:
వ్యాధి తీవ్రంగా ఉండి, చీముతో ఉన్నప్పుడు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. వ్యాధిని నివారించడానికి, ఆ పొదుగు భాగాన్ని తొలగించడం అవసరమవుతుంది.

నివారణ మరియు నియంత్రణ:

  • ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నియంత్రిoచడానికి వ్యాధిసోకిన పశువులను వేరుచేయాలి.
  • పశువైద్యులు సూచించిన విధంగా వ్యాధి సోకిన పశువులకు చికిత్సను క్రమం తప్పకుండా అందించాలి.
  • మాస్టైటిస్ ఉన్న పశువులను రోజుకు 3-4 సార్లు పాలను పూర్తిగా పిండాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
  • పాలు పితికే ప్రాంతాలను శుభ్రంగా మరియు పొడిగా ఉంచాలి.
  • బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి సరైన వెలుతురు, గాలి మరియు మంచి పారిశుధ్యాన్ని పాటించాలి.
  • పశువులకు శుభ్రమైన మంచినీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
  • గడ్డి లేదా ఇసుక వంటి శుభ్రమైన మరియు పొడి బెడ్డింగ్ పదార్థాలను ఉపయోగించాలి.
  • విటమిన్లు మరియు ఖనిజ లవణాలతో కూడిన సమతుల్య పోషకాహారాన్ని అందించడం ద్వారా పశువు యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు.
  • పాలు పితికే ముందు, తరువాత పొదుగును శుభ్రంగా కడిగి, మెత్తని పొడి గుడ్డతో తుడవాలి.
  • పాలు పితికేవారు చేతులు శుభ్రంగా కడుక్కొని పాలను పిండాలి.
  • పాలు పితికిన తర్వాత చనుమొనల ద్వారం దాదాపు ఇరవై నిమిషాలు తెరుచుకొని ఉంటుంది. ఈ సమయంలో సూక్ష్మక్రిములు పొదుగు లోనికి చొరబడి వ్యాధిని కలుగజేస్తాయి. అందువలన, పాలు పితికిన తర్వాత చనుమొనలను క్రిమిసంహారక ద్రావణంలో ముంచడం వల్ల పొదుగు వాపును నివారించవచ్చు. ఈ పద్ధతిని టీట్ డిప్పింగ్ (Teat dipping) అంటారు. దీని ద్వారా పొదుగు వాపుకు ప్రధాన కారణాలైన సూక్ష్మక్రిములు చనుమొనల నుంచి లోనికి ప్రవేశించకుండా అడ్డుపడుతుంది. పోవిడోన్ ఐయోడిన్ లేదా క్లొర్‌హెక్సిడిన్ ఉత్పత్తులను టీట్ డిప్పింగ్ కొరకు ఉపయోగించవచ్చు.
  • తరచుగా CMT పరీక్షలు నిర్వహించడం ద్వారా సబ్ క్లినికల్ మాస్టైటిస్ ను గుర్తించి చికిత్స చేయడంతో పొదుగు వాపును అరికట్టవచ్చు.
  • డ్రై కౌ థెరపీ (Dry Cow Therapy) పాటించడం ద్వారా పొదుగు వాపును నివారించవచ్చు.
    డ్రై కౌ థెరపీ అనేది పశువు పాలివ్వడం ఆపిన తర్వాత (లాక్టేషన్ ముగిసినప్పుడు), తదుపరి ప్రసవానికి ముందు ఉన్న డ్రై పీరియడ్ (సుమారు 60 రోజుల పాటు ఉంటుంది) సమయంలో పొదుగు లోనికి యాంటిబయాటిక్ లను వాడడం. ఈ చికిత్స ద్వారా:
    • డ్రై పీరియడ్ లోఉన్న మాస్టిటిస్ ఇన్ఫెక్షన్లు నయం అవుతాయి
    • కొత్తగా వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు
    • తదుపరి లాక్టేషన్‌కి మేలైన పాల ఉత్పత్తి కలుగుతుంది.
    డ్రై కౌ థెరపీ రకాలు
  1. బ్లాంకెట్ డ్రై కౌ థెరపీ (BDCT): ఇందులో ఇన్ఫెక్షన్ స్థితితో సంబంధం లేకుండా, పాలిచ్చే కాలం చివరిలో అన్ని పశువులకు యాంటీబయాటిక్స్‌ చికిత్స చేయడం జరుగుతుంది.
  2. సెలెక్టివ్ డ్రై కౌ థెరపీ (SDCT): కేవలం ఇన్ఫెక్షన్ ఉన్న లేదా అనుమానం ఉన్న పశువులకు మాత్రమే యాంటిబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది.

Dr పి. రేవతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్టుమెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్, కాలేజీ ఆఫ్ వెటర్నరీ సైన్సు, ప్రొద్దుటూరు, ఆంధ్రప్రదేశ్. Ph: 9966038791
Dr ఆర్. సుధాకర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, వెటర్నరీ డిస్పెన్సరీ, దేవగుడి (మం), వై.యస్.ఆర్ కడప (జిల్లా), ఆంధ్రప్రదేశ్.

Read More

తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల్లో స్థానిక విషపూరిత మొక్కలు, వాటి యొక్క ప్రబావం

తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకం కొంతమంది రైతులకు ముఖ్యమైన ఉపాధి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇచ్చే పశుపాలనగా ఇది గుర్తింపు పొందింది. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అడవుల తగ్గుదల, పచ్చిక కొరత, పశుపోషణ లోపాల వల్ల గొర్రెలు, మేకలు తినరాని కొన్ని స్థానిక మొక్కలను తిని విషబాధకు గురవడం మన రాష్ట్రంలో తరచూ కనిపిస్తోంది. ఈ సమస్య వల్ల జంతువులు అనారోగ్యానికి గురై, కొన్నిసార్లు మరణించడమూ జరుగుతుంది. అందుకే రైతులు ఈ విషయంలో అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

విషపూరిత మొక్కలు అంటే ఏమిటి?
గొర్రెలు, మేకలు సాధారణంగా పచ్చిక, ఆకులు, కొమ్మలు తింటాయి. కానీ కొన్ని మొక్కల్లో సహజంగానే విషపదార్థాలు ఉంటాయి. అలాంటి మొక్కలను జంతువులు తిన్నప్పుడు ఆ విషపదార్థాలు శరీరంలోకి వెళ్లి జీర్ణక్రియ, నరాలు, కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. దీనినే మొక్కల వల్ల వచ్చే విషబాధ అంటారు.

ఈ విషబాధ ఎక్కువగా:
• వేసవిలో పచ్చిక కొరత ఉన్నప్పుడు
• కరవు పరిస్థితుల్లో
• అడవుల్లో మేపేటప్పుడు
• పొలాల అంచుల్లో నిర్లక్ష్యంగా మేపినప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది.

తెలంగాణలో సాధారణంగా కనిపించే విషమొక్కలు

లంతెన (గండ్ల పూల చెట్టు)

ఈ మొక్క తెలంగాణ అంతటా విస్తృతంగా కనిపిస్తుంది. దీని ఆకులు, పువ్వులు తిన్న గొర్రెలు, మేకల్లో:
• ఆకలి తగ్గిపోవడం
• నోరు పచ్చగా మారడం
• కడుపు ఉబ్బడం
• బలహీనత
• క్రమంగా చనిపోవడం కనిపిస్తాయి.

తుమ్మ చెట్టు

తుమ్మ ఆకులు ఎక్కువగా తింటే:
• నోటిలో గాయాలు
• మేత తినకపోవడం
• జీర్ణక్రియ లోపించడం వంటివి వస్తాయి

కందగడ్డి / అడవి కంద

ఇవి తిన్నప్పుడు:
• వాంతులు
• విరేచనాలు
• నడవలేకపోవడం
• అకస్మాత్తుగా పడిపోవడం కనిపిస్తాయి.

నల్ల ఉసిరి / అడవి ఉసిరి

ఇది తినడం వల్ల:
• కాలేయానికి నష్టం
• కళ్లు పసుపు రంగులో మారడం
• మూత్రం ముదురు రంగులో రావడం వంటివి కనిపిస్తాయి.

అడవి పొగాకు

ఈ మొక్క తిన్న మేకల్లో:
• నరాల బలహీనత
• వణుకు
• శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
• చనిపోవడం కూడా జరుగుతుంది.

విషబాధకు కారణాలు

  1. పచ్చిక కొరత వేసవిలో పచ్చిక దొరకకపోవడంతో జంతువులు దొరికిన మొక్కలన్నీ తింటాయి.
  2. ఖనిజాల లోపం ఉప్పు, ఖనిజాల లోపం ఉన్నప్పుడు జంతువులు అసాధారణంగా ఇతర మొక్కలను తింటాయి.
  3. అడవుల్లో నిర్లక్ష్య మేపకం అడవుల్లో ఎటువంటి నియంత్రణ లేకుండా మేపితే విషమొక్కలు తినే ప్రమాదం ఎక్కువ.
  4. పొలాల్లో రసాయనాల ప్రభావం మందులు పిచికారీ చేసిన తర్వాత మేపడం వల్ల విషబాధ వస్తుంది.

లక్షణాలు (గుర్తించే విధానం)
విషమొక్కలు తిన్న గొర్రెలు, మేకల్లో సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి:
• మేత తినకపోవడం
• ఎక్కువగా నోరు నుంచి నురుగు రావడం
• కడుపు నొప్పి, ఉబ్బరం
• విరేచనాలు లేదా మలబద్ధకం
• నడవలేక కూలిపోవడం
• శ్వాస వేగంగా తీసుకోవడం
• అకస్మాత్తుగా మరణం

లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలి.
చికిత్స (ప్రాథమిక చర్యలు)

  1. వెంటనే వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం ఇవ్వాలి
  2. అనుమానాస్పద మొక్కలు తినకుండా జంతువులను వేరుచేయాలి
  3. శుద్ధమైన నీరు ఇవ్వాలి
  4. డాక్టర్ సూచన మేరకు:
    o యాంటీడోట్ మందులు
    o గ్లూకోజ్ డ్రిప్
    o కాలేయ రక్షక మందులు ఇవ్వాలి

గమనిక: ఇంటి చిట్కాలు వాడకూడదు, తప్పనిసరిగా వైద్యుడి సలహా తీసుకోవాలి.

నివారణ చర్యలు (అత్యంత ముఖ్యమైనవి)
• పశువులకు సరిపడా పచ్చిక, ఎండుగడ్డి అందించాలి
• ఉప్పు, ఖనిజ మిశ్రమం తప్పనిసరిగా ఇవ్వాలి
• పొలాల అంచుల్లో, అడవుల్లో విషమొక్కలను తొలగించాలి
• మందులు పిచికారీ చేసిన పొలాల్లో మేపకూడదు
• రైతులకు విషమొక్కలపై శిక్షణ ఇవ్వాలి

సారాంశం
తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు, మేకల్లో స్థానిక మొక్కల వల్ల వచ్చే విషబాధలు రైతులకు పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నాయి. కానీ సరైన అవగాహన, జాగ్రత్తలు, సమయానికి చికిత్స ద్వారా ఈ నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. పశువుల ఆరోగ్యం కాపాడితేనే రైతు ఆర్థికంగా ముందుకు సాగగలడు. అందుకే ప్రతి పశుపోషకుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), Ph: 8121451017, కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం

గొర్రెల పెంపకదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణ కోసం ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది.

చిటుకు వ్యాధి గొర్రెలలో ఆకస్మిక మరణాలకు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు గొర్రెలు మేత తినకపోవడం, నీరసం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి.

అందువల్ల ఈ వ్యాధి నివారణకు టీకా వేయించడం అత్యంత అవసరం. టీకా ద్వారా గొర్రెలను చిటుకు వ్యాధి నుండి రక్షించడంతో పాటు, రైతులు ఎదుర్కొనే ఆర్థిక నష్టాలను కూడా తగ్గించవచ్చు.

కావున అన్ని గొర్రెల కాపరులు, పెంపకదారులు తమ గ్రామాలలో నిర్వహించే ఉచిత టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి గొర్రెకు తప్పనిసరిగా టీకా వేయించాలి.

గొర్రెల ఆరోగ్యం – రైతు అభివృద్ధికి పునాది.
చిటుకు వ్యాధికి టీకానే రక్షణ!

Read More

ఎల్‌నినో ప్రభావం ఉన్న చోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పశుగ్రాసానికి కొరత రావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు. ఎల్‌నినో ప్రభావంపై చర్చ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ పశుగ్రాస కొరత రాకుండా జాగ్రత్తలను ప్రస్తావించారు. ఉపాది హామీ పథకం కింద ప్రైవేటు భూముల్లోనూ పశుగ్రాసం సాగుకు అనుమతించామని పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. ‘ఇప్పటివరకు 3,458 ఎకరాలను ఉపాది హామీ పథకం కిందకు తెచ్చి, అక్కడ గ్రాసం సాగుకు విత్తనాలు అందించాం. అనంతపురం జిల్లాలో చెరువు భూముల్లోనూ సాగు కోసం పశు గ్రాసం విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామ’ని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరాయుడు తెలిపారు. పలు సందేహాలు లేవనెత్తిన సీఎం.. గ్రాసం సాగుకు ఎంత బడ్జెట్ కావాలని ప్రశ్నించారు. రూ.700 కోట్ల అవసరమని డైరెక్టర్ చెప్పగా, ‘రూ.1,000 కోట్ల వరకైనా పర్లేదు. ఎల్‌నినో ప్రభావం ఉన్నచోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు చేపట్టండి. కలెక్టర్లు వెంటనే ఈ సాగు మొదలు పెట్టించాలి’ అని ఆదేశించారు.

Read More

గుడ్లు తలసరి వినియోగం 103 నుంచి 106కి పెరిగింది

మన దేశంలో గుడ్ల ఉత్పత్తి 14,911 కోట్లకు చేరుకుంది. 2023-24తో పోలిస్తే 4.44% వృద్ధి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తిలో భారత్ (చైనా తర్వాత) రెండో స్థానంలో ఉంది. దేశంలో ఏడాదికి (2024-25 లో) తలసరి వినియోగం 106 గుడ్లకు చేరింది. అంతకుముందు ఏడాది తలసరి వినియోగం 103 గుడ్లుగా ఉంది. ప్రధానంగా 2024-25 లో రెండు తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర పశు సంవర్ధకశాఖ సోమవారం ప్రాథమిక గణాంకాల నివేదిక-2025ను విడుదల చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు…
2018-19 నుంచి 2024-25 వరకు దేశంలో గుడ్ల ఉత్పత్తి 10,380 కోట్ల నుంచి 14,911 కోట్లకు పెరిగింది. 2024-25లో వాణిజ్య కోళ్ల ఫారాలు 12,598 కోట్ల గుడ్లు, నాటుకోళ్ల పెంపకం ద్వారా 2,313 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. గుడ్ల ఉత్పత్తిలో తొలి 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (18.37%), తమిళనాడు (15.63%), తెలంగాణ (12.98%), పశ్చిమ బెంగాల్ (10.72%), కర్ణాటక (6.67%) నిలిచాయి. ఈ 5 రాష్ట్రాలే 64.37% వాటాను కలిగి ఉన్నాయి. 4 దక్షిణాది రాష్ట్రాల్లోనే సగానికి (50 శాతానికి పైగా ఉత్పత్తి అవుతుండటం విశేషం.
2018-19 నుంచి 2024-25 వరకు తలసరి వినియోగం ఏడాదికి 79 నుంచి 106 గుడ్లకు పెరిగింది. గుడ్ల తలసరి వినియోగంలో జాతీయ సగటు (106) ను మించిన రాష్ట్రాలు 8 మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (516), తెలంగాణ (510), తమిళనాడు (302), హరియాణా (299), పంజాబ్ (164) తలసరి వినియోగంలో ముందున్నాయి.

పురోగతికి దోహదపడిన అంశాలు..
దేశంలో పౌష్ఠికాహారం పై అవగాహన పెరగడంతో పాటు ఆధునిక కోళ్ల ఫారాల్లో శాస్త్రీయ విధానాలు, మెరుగైన దాణా, వ్యాధి నిరోధక టీకాలను వినియోగించడం వల్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
మాంసం, ఇతర ప్రొటీన్ ఆహారాలతో పోలిస్తే, గుడ్డు సామాన్యులకు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. గుడ్లలోని అద్భుత పోషక విలువల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వినియోగదారులు గుర్తిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో అందించడం... అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, పిల్లలకు పంపిణీ చేయడం గుడ్ల వినియోగం పెరగడానికి దోహదపడుతున్నాయి.
Read More

పశు పోషకులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డ్

ఆంధ్రప్రదేశ్ పభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ (పీకేసీసీ) పథకానికి శ్రీకారం చుట్టింది. పశు పోషకులు వారి వద్దనున్న పశువుల సంఖ్యను బట్టి ఎలాంటి పూచీ కత్తూ లేకుండా 7శాతం వడ్డీపై రూ.1.60 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. తీసుకున్న రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే వడ్డీలో 3 శాతం రాయితీ ఇస్తారు. అంటే 4 శాతం వడ్డీ కడితే సరిపోతుంది. సొంత భూమి లేదా కౌలు భూమి ఉన్న పశు పోషకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ పథకానికి అరుÝలని పశు సంవర్ధకశాఖ సంచాలకుడు టి.దామోదరనాయుడు సోమవారం తెలిపారు. గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లు పెంచే రైతులు ఎవరైనా ఈ పథకం కింద రుణాలు పొందవచ్చని సూచించారు. సమీప బ్యాంకులకు వెళ్లి పీకేసిసీ దరఖాస్తు పొందవచ్చు. భూమి పత్రాలు, ఆధార్, పశువుల వివరాలు, సంబంధిత పశు వైద్యాధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, రైతు ఫొటో సమర్పించాలి. బ్యాంకు నిబంధనల ప్రకారం రుణాన్ని మంజూరు చేస్తారు.

Read More

పశువులకు వసతిగృహాలు

ఉపాధి హామీ పథకం నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ఐదు చొప్పున పశు వసతిగృహాలను నిర్మించి పశువులకు ఆశ్రయం కల్పిస్తూ, పోషణ, వైద్య సేవలు అందించనున్నారు. ఇప్పటికే 8 జిల్లాల్లో వీటికి భూ కేటాయింపులు పూర్తి కావచ్చాయని పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ టి. దామోదర్ నాయుడు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లోనూ స్థలాల కేటాయింపులపై అధికారులు సమీక్షిస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యం నిర్దేశించినట్లు చెప్పారు. ఈ వసతిగృహాలకు జంతు ప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని కోరారు. ఈ వసతిగృహాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ స్థలాన్ని సమకూర్చనుండగా, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మాణ బాధ్యతలు తీసుకోనుంది. ఎంపిక చేసిన స్వయం సహా యక సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఒక్కో వసతిగృహాన్ని అర ఎకరం స్థలంలో రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఒక్కో చోట 20-25 పెద్ద పశువులకు ఆశ్రయం కల్పిస్తారు. అదే ప్రాంగణంలో గడ్డి సాగుతో పాటు తాగునీటి వసతి కల్పిస్తారు.

Read More
  • 1
  • 2