వ్యాధుల నుంచి మీ పాడి ఫారం సురక్షితమేనా? – ఈ 10 అంశాలతో మీరే తెలుసుకోండి
“పశువుకు వ్యాధి ఎలా వచ్చింది?” అనే ప్రశ్నతో పాటు… “అది మన ఫారంలోకి ఎలా వచ్చింది?” అని కూడా ఆలోచించాలి.
పాడి ఫారంలో ఒక పశువుకు వ్యాధి వస్తే, అది ఆ ఒక్క పశువుతోనే ఆగిపోతుందని చెప్పలేం. కొత్తగా తెచ్చిన పశువులు, బయట నుంచి వచ్చే వ్యక్తులు, వాహనాలు, అపరిశుభ్రమైన పాక, మేత, నీరు, పరికరాలు ఇలా అనేక మార్గాల్లో వ్యాధులు ఫారంలోకి రావచ్చు. ఒక పశువు నుంచి మరో పశువుకు కూడా వ్యాపించవచ్చు.
అందుకే పశువులకు చికిత్స చేయించడమే కాకుండా, వ్యాధులు ఫారంలోకి రాకుండా, వచ్చినా ఇతర పశువులకు వ్యాపించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనికి పెద్ద పెద్ద ఏర్పాట్లు అవసరం లేదు. రోజూ మనం చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు.
మరి మీ పాడి ఫారంలో అలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారా? ఈ 10 అంశాలతో మీరే తెలుసుకోండి.
- కొత్తగా తెచ్చిన పశువులను వెంటనే మందలో కలుపుతున్నారా?
కొత్తగా తెచ్చిన పశువు చూడటానికి ఆరోగ్యంగా కనిపించినా, దానితో పాటు వ్యాధులు కూడా ఫారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెంటనే మందలో కలపకుండా కనీసం 3 వారాల పాటు వేరుగా ఉంచి ఆరోగ్యాన్ని గమనించడం మంచిది. ఈ సమయంలో పశువులో ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే పశువైద్యుని సంప్రదించాలి. అంతా సరిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే మందలో కలపడం మంచిది. - అనారోగ్య పశువులను వేరుగా ఉంచే ఏర్పాటు ఉందా?
మందలో ఏదైనా పశువు అనారోగ్యానికి గురైతే, వీలైనంత వరకు మందకు కొంత దూరంగా, ఇతర పశువులతో కలవకుండా ఉంచడం మంచిది. అనారోగ్య పశువుకు మేత, నీరు పెట్టేందుకు వాడే తొట్లు, బకెట్లు కూడా ఇతర పశువులకు వాడకుండా చూడాలి. ముందుగా ఆరోగ్యంగా ఉన్న పశువుల పనులు చూసుకొని, చివరగా అనారోగ్య పశువు దగ్గరకు వెళ్లాలి. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ, పశువైద్యుని సలహాతో చికిత్స చేయిస్తే మిగతా పశువులకు వ్యాధి వ్యాపించే అవకాశాన్ని తగ్గించవచ్చు. - మీ పాడి ఫారంలోకి వచ్చే వ్యక్తులు, వాహనాల రాకపోకలను గమనిస్తున్నారా?
పాడి ఫారానికి వివిధ పనుల కోసం బయట వ్యక్తులు, ఇతర రైతులు, వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. వీటి ద్వారా ఒక ఫారం నుంచి మరో ఫారానికి మట్టి, పేడతో పాటు వ్యాధులు కూడా చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చే వ్యక్తులు పశువుల దగ్గరకు నేరుగా వెళ్లకుండా చూసుకోవాలి. వాహనాలను కూడా వీలైనంత వరకు పశువుల పాకకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ఇతర పశువుల ఫారాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులు, వాహనాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. - పశువుల పాకలోకి వెళ్లే ముందు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకుంటున్నారా?
మన చేతులు, కాళ్లు, చెప్పులకు అంటుకున్న మట్టి, పేడ ద్వారా కూడా వ్యాధులు ఒక చోటు నుంచి మరో చోటుకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చిన వెంటనే పశువుల దగ్గరకు వెళ్లకుండా చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం మంచిది. ముఖ్యంగా పశువుల సంతకు, మరో పాడి ఫారానికి వెళ్లి వచ్చినప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం. వీలైతే పశువుల పాకలో వేసుకునేందుకు వేరే చెప్పులు ఉంచుకోవాలి. వాటిని బయట ఇతర పనులకు ఉపయోగించకూడదు. అనారోగ్య పశువును చూసిన తర్వాత చేతులు, చెప్పులు శుభ్రం చేసుకొని, ఆ తర్వాతే ఇతర పశువుల దగ్గరకు వెళ్లాలి. ఈ చిన్న అలవాట్లు బయట నుంచి లేదా ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాధులు చేరే అవకాశాన్ని తగ్గిస్తాయి. - పాకను శుభ్రంగా, పొడిగా ఉంచుతున్నారా?
పశువుల పాకలో పేడ, వ్యర్థాలు పేరుకుపోయి, నేల ఎక్కువసేపు తడిగా ఉంటే పశువులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే పేడ, ఇతర వ్యర్థాలను రోజూ తొలగించాలి. మూత్రం, మురికి నీరు పాకలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్లేలా కాలువలు ఉండాలి. తొలగించిన పేడను పాక దగ్గరే పోగు చేయకుండా, నిర్ణీత ప్రదేశంలో సేకరించి సేంద్రియ ఎరువు తయారీకి లేదా వీలైతే బయోగ్యాస్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. పశువులు పడుకునే ప్రదేశంలో తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే పాకలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాకలో అపరిశుభ్రతను తగ్గించి, పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. - మేత, తాగునీరు కలుషితం కాకుండా కాపాడుతున్నారా?
పశువులకు ఇచ్చే మేత, తాగునీరు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. మేతలో పేడ, మట్టి లేదా ఇతర మలినాలు కలవకుండా చూసుకోవాలి. మేతను తేమ తగలకుండా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. బూజు పట్టిన లేదా చెడిపోయిన మేతను పశువులకు ఇవ్వకూడదు. మేత తొట్లు, నీటి తొట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. తొట్టెలో మిగిలిపోయి చెడిపోయిన మేతను తొలగించి, తాజా మేత వేయాలి. పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలి. ఇలా మేత, నీటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తే వాటి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించవచ్చు. అలాగే పశువులకు సమతుల్య మేతతో పాటు తగిన ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా అందించాలి. - పాలు పితికే పాత్రలు, ఇతర పరికరాలను శుభ్రంగా ఉంచుతున్నారా?
పాలు పితికే సమయంలో పరిశుభ్రత పాటించడం పశువుల ఆరోగ్యంతో పాటు పాల నాణ్యతకు కూడా చాలా ముఖ్యం. పాలు పితికే ముందు చేతులు, పొదుగును శుభ్రంగా కడిగి, పొదుగును పొడి గుడ్డతో తుడవాలి. పాలు పితికే పాత్రలను ప్రతి సారి ఉపయోగించిన తర్వాత బాగా కడిగి ఆరబెట్టాలి. పాలు పితికే యంత్రాలు, ఇతర పరికరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పాలు పితికిన తర్వాత చనుమొనలను పశువైద్యుడు సూచించిన టీట్ డిప్పింగ్ ద్రావణంలో ముంచడం మంచిది. ఇలా సరైన పద్ధతిలో పాలు పితకడం వల్ల మాస్టిటిస్ (పొదుగు వాపు) వచ్చే అవకాశాన్ని తగ్గించడంతో పాటు నాణ్యమైన పాలను పొందవచ్చు. - ఈగలు, దోమలు, ఎలుకల బెడదను తగ్గిస్తున్నారా?
పశువుల పాకలో ఈగలు, దోమలు, ఎలుకలు ఎక్కువగా ఉంటే పశువులకు ఇబ్బంది కలిగించడంతో పాటు వివిధ రకాల వ్యాధులు వ్యాపించడానికి కూడా కారణమవుతాయి. అందుకే పాకలో పేడ, మిగిలిపోయిన మేత పేరుకుపోకుండా, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దాణా నిల్వ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచి, దాణా చెల్లాచెదురుగా పడకుండా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుల సూచనలతో ఈగలు, దోమలను దూరంగా ఉంచే రిపెల్లెంట్లను, ఎలుకల నియంత్రణకు తగిన పద్ధతులను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల లంపీ స్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి), సర్రా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. - టీకాలు, నట్టల మందులు సమయానికి వేయిస్తున్నారా?
వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించడం కంటే, ముందుగానే నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందుకే పశువులకు అవసరమైన టీకాలను సమయానికి వేయించడంతో పాటు, నట్టల నివారణకు కూడా సకాలంలో మందులు ఇవ్వాలి. పశువుల వయస్సు, ఆరోగ్య పరిస్థితి, ప్రాంతంలో వచ్చే వ్యాధులను బట్టి పశువైద్యుని సూచనతో వీటిని పాటించాలి. టీకాలు, నట్టల మందులు ఇచ్చిన తేదీలను చిన్న పుస్తకంలో లేదా మొబైల్లో నమోదు చేసుకుంటే, తదుపరి ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోవడం సులభమవుతుంది. - పశువు ఆరోగ్యంలో మార్పు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారా?
రోజూ కొద్దిసేపు పశువులను దగ్గరగా గమనించడం అలవాటు చేసుకోవాలి. పశువు సాధారణంగా ఎలా ఉంటుందో తెలిసినప్పుడే దాని ఆరోగ్యంలో వచ్చే మార్పులను త్వరగా గుర్తించవచ్చు. మేత తినకపోవడం, నీరసంగా ఉండటం, జ్వరం, దగ్గు, విరేచనాలు, పాల దిగుబడి అకస్మాత్తుగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. అనారోగ్యంగా ఉన్న పశువును వీలైనంత వరకు ఇతర పశువులతో కలవకుండా ఉంచి, వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. మందలోని ఇతర పశువుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో గమనించాలి. ఒకటి కంటే ఎక్కువ పశువుల్లో ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తే మరింత అప్రమత్తంగా ఉండి, వెంటనే పశువైద్యునికి తెలియజేయాలి. వ్యాధిని తొలిదశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల చికిత్స త్వరగా ప్రారంభించడంతో పాటు, ఇతర పశువులకు వ్యాధి వ్యాపించే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
మరి… మీ పాడి ఫారం ఎంతవరకు సురక్షితం?
ఈ 10 అంశాల్లో మీరు ఇప్పటికే పాటిస్తున్నవి ఏవి? ఇంకా మెరుగుపరచుకోవాల్సినవి ఏవి? ఒకసారి మీరే పరిశీలించుకోండి.
పశువుల కొనుగోలు నుంచి రోజువారీ సంరక్షణ, మేత, నీరు, పాలు పితకడం, టీకాలు, ఆరోగ్య పరిశీలన వరకు ప్రతి దశలో సరైన పద్ధతులు పాటించడం ముఖ్యం. వీటిని రోజువారీ ఫారం నిర్వహణలో భాగంగా చేసుకుంటే పశువుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు పాడి ఫారాన్ని మరింత సురక్షితంగా నిర్వహించవచ్చు.
Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
Dr. బద్దం అఖిల , టీచింగ్ ఫాకల్టీ,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య కళాశాల, కోరుట్ల, PVNRTVU. 7093198419


















