పశువైద్యంలో వ్యాధినిర్ధారణ అత్యంత ముఖ్యమైన, క్లిష్టమైన అంశం.
యజమానిని లేదా సంబంధిత వ్యక్తుల్ని, గోవుకు సోకిన వ్యాధి పూర్తి వివరాలు, పూర్వాపరాలు, వారు గమనించిన లక్షణాలు, మేపిన మేతల వివరాలు, ఇతర ప్రత్యేక అంశాలు, క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలి.
పరిసరాల్ని పరిశీలించాలి. లక్షణాలను స్వయంగా గమనించాలి.
గోవు యొక్క ప్రవర్తన, అవయవాలు అంటే నోరు, నాలుక, ముక్కు, కళ్లు, చెవులు, చర్మం, వెంట్రుకలు, గుండె, నాడి, శ్వాస, పొట్ట, గోవుల్లో అయితే యోని, చూడి గోవు అయితే అవసరాన్ని బట్టి గర్భకోశం, దానిలోని పిండాన్ని, పొదుగును, చన్నుల్ని, వృషభాల్లో అయితే బీర్జాలు, చేరు మొదలైన అవయవాల్ని, నడకను పరీక్షించాలి.
వ్యాధుల భేదాత్మక పరిశీలన (Differencial Diagnosis) ద్వారా ఏ జబ్బు అయి వుంటుందో ఆలోచించి, రోగాన్ని నిర్ధారించాలి.
శరీర ఉష్ణోగ్రత, పేడ, రక్తం, చీమిడి ఇంకా మరికొన్ని పరీక్షలు వ్యాధి నిర్ధారణకు ఉపకరిస్తాయి.
రోగనిర్ధారణ సామర్థ్యం వల్లనే వైద్యుని యొక్క ప్రతిభ ప్రకటితమవుతుంది.
ఇంతకుముందు చేసిన చికిత్సల వివరాలు తెలుసుకోవడం వలన, చికిత్సా ప్రణాళిక సమర్థవంతంగా రూపొందించుకునే వీలు కలుగుతుంది. దాని ఆధారంగా చేసే చికిత్స మెరుగైన సత్ఫలితాలను ఇస్తుంది. తరువాత చికిత్సా ఫలితాలను సమీక్షించుకోవడం వలన, పశ”వైద్యుని సామర్థ్యం ఇనుమడిస్తుంది. గోవు యొక్క బరువు ఆధారంగానే మందుల మోతాదులు నిర్ణయించబడతాయి.
గోవు బరువు లెక్కించు సూత్రం: పొడవు x (చుట్టుకొలత)² / 660 = శరీర బరువు (కిలో గ్రాములలో)
పొడవు… ముందు జబ్బనుంచి వెనుక తొడ వరకు (అంగుళాలలో) ఛాతీ చుట్టు కొలత…(అంగుళాలలో)
మోతాదుల నిర్ణయం: మందుల స్వభావం, వాటి సాంద్రతను బట్టి, బరువు ప్రాతిపదికగా వాడవలసిన మందుల మోతాదులు నిర్ణయించాలి.
గోవు బరువును, మందులో వుండే రసాయన శక్తిని ప్రాతిపదికగా మందు మోతాదును నిర్ణయించాలి. నిర్దిష్ట మోతాదులను మించి మందు వినియోగించరాదు.
ఏ విధంగా మందును శరీరంలోనికి పంపాలో, అలాగే పంపాలి. అంటే తినిపించవలసినవి, చర్మంపై వాడవలసినవి, కండకు చేసే ఇంజక్షన్లు (।/M), రక్తంలోకి ఎక్కించే ఇంజక్షన్లు (।/V), చర్మం క్రిందకు చేసే ఇంజక్షన్లు (S/C), దేనికవే చేయటంలో బహుజాగ్రత్త వహించాలి. రక్తంలోనికి ఎక్కించే ఇంజక్షన్లు నిదానంగా చేయాలి.
మందు మోతాదు నిర్ణయించటానికి పరిగణనలోనికి తీసుకునే పశువు బరువు షుమారు (కిలోలలో): లేగదూడ 25 కిలోలు 5-6 నెలల వయస్సున్న దూడ 60 కిలోలు సంవత్సరం వయస్సున్న దూడ 120-150 కిలోలు 3 సంవత్సరాలు పైబడిన ఆవు 250-300 కిలోలు గిత్తలు 300-400 కిలోలు ఆంబోతులు 500 కిలోలు పైగా ………………………………………………………………………………………. సకాలంలో వ్యాధి నిర్ధారణ – సరైన చికిత్సతో వ్యాధి నివారణ
——————————————————————————————————– రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.
పరిచయం పాడి పశువుల పెంపకంలో సరైన గృహ వసతి లేదా పశువుల షెడ్ చాలా ముఖ్యమైనది. పశువులకు మంచి గాలి, సరైన నీడ, పరిశుభ్రమైన నేల, స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటే అవి ఆరోగ్యంగా ఉండి మంచి పాల ఉత్పత్తిని ఇస్తాయి. పశువులను ఎల్లప్పుడూ ఒకే చోట కట్టివేయకుండా, వాటికి స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించే విధానాన్ని లూజ్ హౌసింగ్ సిస్టమ్ లేదా స్వేచ్ఛా గృహ విధానం అంటారు.
ఈ విధానంలో పశువులను సాధారణంగా ఒక పెద్ద ప్రదేశంలో స్వేచ్ఛగా ఉంచుతారు. పశువులకు విశ్రాంతి తీసుకోవడానికి కప్పు ఉన్న ప్రదేశం, బయట తిరగడానికి ఓపెన్ యార్డ్, మేత మరియు నీరు తీసుకోవడానికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు.
లూజ్ హౌసింగ్ సిస్టమ్ అంటే ఏమిటి? లూజ్ హౌసింగ్ విధానంలో పశువులను వ్యక్తిగతంగా రోజంతా కట్టివేయరు. ఒకే వయస్సు లేదా ఒకే రకమైన పశువులను ఒక సమూహంగా ఉంచుతారు. పశువులు తమకు ఇష్టమైన విధంగా షెడ్లో లేదా బయట ఉన్న ఓపెన్ ప్రదేశంలో తిరగవచ్చు. వర్షం, ఎండ, చలి నుండి రక్షణ కోసం ఒక భాగంలో కప్పు ఏర్పాటు చేస్తారు. మిగిలిన భాగాన్ని ఓపెన్ యార్డ్‌గా ఉంచుతారు.
ఈ విధానం ముఖ్యంగా క్రింది పశువులకు అనుకూలంగా ఉంటుంది: • పాలిచ్చే ఆవులు మరియు గేదెలు • గర్భిణీ పశువులు • ఎదుగుతున్న దూడలు • హీఫర్లు • పొడి పశువులు అయితే పాల ఉత్పత్తి, వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితిని బట్టి పశువులను వేర్వేరు సమూహాలుగా ఉంచడం మంచిది.
లూజ్ హౌసింగ్ షెడ్లో ఉండవలసిన ముఖ్యమైన భాగాలు
కప్పు ఉన్న ప్రదేశం పశువులు ఎండ, వర్షం మరియు చలి నుండి రక్షణ పొందడానికి కప్పు ఉన్న ప్రదేశం అవసరం. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పశువులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాయి. షెడ్లో: • తగినంత గాలి ప్రసరణ ఉండాలి. • పైకప్పు ఎత్తుగా ఉండాలి. • లోపల వేడి ఎక్కువగా ఉండకూడదు. • వర్షపు నీరు లోపలికి రాకుండా చూడాలి. • నేల పొడిగా మరియు పరిశుభ్రంగా ఉండాలి.
ఓపెన్ యార్డ్ కప్పు ఉన్న ప్రదేశం ముందు లేదా పక్కన పశువులు స్వేచ్ఛగా తిరగడానికి ఓపెన్ యార్డ్ ఏర్పాటు చేయాలి. ఈ ప్రదేశంలో పశువులు: • స్వేచ్ఛగా తిరుగుతాయి. • ఎండలో నిలబడతాయి. • ఒకదానితో ఒకటి సహజంగా కలుస్తాయి. • వ్యాయామం పొందుతాయి. ఓపెన్ యార్డ్‌లో నీరు నిల్వ ఉండకుండా సరైన డ్రైనేజీ ఉండాలి. వర్షాకాలంలో బురద ఏర్పడకుండా నేలను సక్రమంగా నిర్వహించాలి.
మేత తొట్టి పశువులకు పచ్చిమేత, పొడి మేత మరియు దాణా అందించడానికి సరైన మేత తొట్లను ఏర్పాటు చేయాలి. మేత తొట్టి: • శుభ్రంగా ఉండాలి. • పశువులకు సులభంగా అందుబాటులో ఉండాలి. • మేత వృథా కాకుండా నిర్మించాలి. • ఒక పశువుకు తగినంత స్థలం ఉండాలి. దాణా తొట్టి నిర్మాణానికి అవసరమైన కొలతలు అంశం శాస్త్రీయ కొలత • దాణా తొట్టి వెడల్పు 0.6–0.75 m • దాణా తొట్టి లోతు 0.4–0.5 m • ఒక్క పశువుకు దాణా స్థలం 0.6–0.75 m • నీటి తొట్టి అంచు ఎత్తు సుమారు 0.5–0.6 m • ప్రతి పశువుకు కనీసం 60–75 సెం.మీ. దాణా స్థలం కల్పించడం మంచిది. పశువులు మేత కోసం పోటీ పడకుండా తగినంత పొడవు ఉన్న ఫీడింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం.
నీటి సదుపాయం పాడి పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండాలి. ప్రత్యేకంగా పాలిచ్చే పశువులు ఎక్కువ నీరు తాగుతాయి. కాబట్టి నీటి తొట్టిని: • ప్రతిరోజూ శుభ్రం చేయాలి. • ఎల్లప్పుడూ నీటితో నింపి ఉంచాలి. • పశువులు సులభంగా చేరుకునే ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. వేసవికాలంలో చల్లని మరియు పరిశుభ్రమైన నీరు అందించడం మరింత ముఖ్యం.
లూజ్ హౌసింగ్ సిస్టమ్‌లో పశువులకు అవసరమైన స్థలం పశువుల సంఖ్యను బట్టి సరైన స్థలం ఏర్పాటు చేయాలి. చాలా తక్కువ ప్రదేశంలో ఎక్కువ పశువులను ఉంచకూడదు. ఇలా చేస్తే పశువుల మధ్య పోటీ, కొట్లాటలు మరియు వ్యాధుల సమస్యలు పెరుగుతాయి. సాధారణంగా ఒక పెద్ద పశువుకు: • విశ్రాంతి కోసం కప్పు ఉన్న స్థలం అవసరం. • స్వేచ్ఛగా తిరగడానికి ఓపెన్ ప్రదేశం అవసరం. పశువుల జాతి, పరిమాణం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి స్థల అవసరం మారుతుంది. చిన్న దూడలు, పెద్ద పశువులు మరియు గర్భిణీ పశువులను ఒకే సమూహంలో ఉంచకుండా వేర్వేరుగా ఉంచడం మంచిది.
షెడ్ దిశ: సాధారణంగా షెడ్‌ను తూర్పు–పడమర దిశలో ఏర్పాటు చేయడం మంచిది. దీనివల్ల వేసవిలో నేరుగా పడే సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. అయితే స్థానిక గాలి దిశ, భూమి పరిస్థితి మరియు నీటి పారుదల కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
నేల నిర్మాణం • నేల గట్టిగా, జారిపోని విధంగా ఉండాలి. • కాంక్రీట్ ఫ్లోర్ అయితే పశువులు జారకుండా రఫ్ ఫినిష్ ఇవ్వాలి. • మూత్రం, నీరు నిల్వ ఉండకుండా స్వల్ప వాలు ఉండాలి. • నేల ఎప్పుడూ తడిగా ఉండకుండా చూడాలి. • తడి, జారుడు నేల వల్ల కాళ్ల వ్యాధులు, లేమినెస్ మరియు గాయాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. షెడ్ నిర్మాణానికి అవసరమైన కొలతలు అంశం శాస్త్రీయ కొలత ఒక వయోజన ఆవు/గేదెకు మొత్తం స్థలం 3.5–4.5 m² కప్పబడిన విశ్రాంతి స్థలం 3.0–3.5 m²/పశువు ఓపెన్ వ్యాయామ ప్రదేశం 7–10 m²/పశువు షెడ్ వెడల్పు 8–12 m పశువుల షెడ్ పొడవు అవసరానికి అనుగుణంగా షెడ్ ఎత్తు (ఈవ్స్ వద్ద) 3–4 m పైకప్పు మధ్య ఎత్తు 4–5 m దాణా తొట్టి వెడల్పు 0.6–0.75 m దాణా తొట్టి లోతు 0.4–0.5 m ఒక్క పశువుకు దాణా స్థలం 0.6–0.75 m నీటి తొట్టి అంచు ఎత్తు సుమారు 0.5–0.6 m ఫ్లోర్ వాలుదనం 1:40–1:60 షెడ్ చుట్టూ డ్రైనేజీ మంచి నీటి పారుదల తప్పనిసరి
గమనిక: జాతి, పశువు పరిమాణం, వాతావరణం మరియు నిర్వహణ విధానాన్ని బట్టి కొలతల్లో స్వల్ప మార్పులు చేయవచ్చు.
లూజ్ హౌసింగ్ విధానం యొక్క ప్రయోజనాలు
పశువులకు స్వేచ్ఛ : ఈ విధానంలో పశువులను ఎల్లప్పుడూ కట్టివేయరు. అందువల్ల అవి స్వేచ్ఛగా తిరగగలవు. సహజంగా నడవడం వల్ల పశువులకు మంచి వ్యాయామం లభిస్తుంది.
పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది: స్వేచ్ఛగా తిరగడం వల్ల పశువుల రక్త ప్రసరణ మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పశువులు ఎక్కువ సమయం ఒకే చోట నిలబడాల్సిన అవసరం ఉండదు. సరైన పరిశుభ్రత మరియు నిర్వహణ ఉంటే అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చు.
వేడి ఒత్తిడి తగ్గుతుంది: మన దేశంలో వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు పశువులపై ప్రభావం చూపుతాయి. లూజ్ హౌసింగ్ షెడ్లో మంచి గాలి ప్రసరణ ఉంటే పశువులకు వేడి ఒత్తిడి తగ్గుతుంది. అవసరమైతే: • ఫ్యాన్లు • ఫాగర్లు లేదా స్ప్రింక్లర్లు • మంచి నీడ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయవచ్చు.
పశువుల ప్రవర్తనను సులభంగా గమనించవచ్చు పశువులు స్వేచ్ఛగా ఉన్నప్పుడు వాటి సహజ ప్రవర్తనను రైతు గమనించవచ్చు. ఉదాహరణకు: • మేత తినడం • నీరు తాగడం • విశ్రాంతి తీసుకోవడం • ఈస్ట్రస్ లేదా వేడి లక్షణాలు చూపడం • ఇతర పశువులతో ప్రవర్తించడం వంటి విషయాలను సులభంగా గమనించవచ్చు.
నిర్మాణ వ్యయం కొంత తగ్గవచ్చు సాంప్రదాయ పద్ధతిలో ప్రతి పశువుకు ప్రత్యేకంగా కట్టే స్టాల్ నిర్మించాల్సి రావచ్చు. కానీ లూజ్ హౌసింగ్ విధానంలో పశువులను సమూహంగా ఉంచవచ్చు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో నిర్మాణ ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది.
శ్రమ అవసరం తగ్గుతుంది సరైన పద్ధతిలో షెడ్‌ను రూపొందిస్తే పశువుల నిర్వహణలో శ్రమను తగ్గించవచ్చు. ముఖ్యంగా: • మేత పంపిణీ • నీటి సరఫరా • పేడ తొలగింపు వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
లూజ్ హౌసింగ్ విధానం వల్ల కలిగే నష్టాలు లేదా సమస్యలు ప్రతి విధానానికి కొన్ని ప్రయోజనాలు, కొన్ని పరిమితులు ఉంటాయి. లూజ్ హౌసింగ్ విధానంలో కూడా సరైన నిర్వహణ లేకపోతే సమస్యలు వస్తాయి.
పశువుల మధ్య పోటీ: బలమైన పశువులు బలహీనమైన పశువులను మేత లేదా నీటి దగ్గర నుండి తరిమివేయవచ్చు. అందువల్ల: • తగినంత మేత తొట్టి స్థలం • తగినన్ని నీటి తొట్లు • సరైన పశువుల సంఖ్య ఉండాలి.
కొట్లాటలు జరిగే అవకాశం: కొత్త పశువును సమూహంలోకి తీసుకువచ్చినప్పుడు ఇతర పశువులతో కొట్లాటలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్త పశువులను వెంటనే ప్రధాన సమూహంలోకి చేర్చకుండా కొంతకాలం జాగ్రత్తగా గమనించడం మంచిది.
పరిశుభ్రత సమస్యలు: పేడ మరియు మూత్రం సరిగా తొలగించకపోతే షెడ్లో అపరిశుభ్రత ఏర్పడుతుంది. దీనివల్ల: • ఈగలు పెరగడం • దుర్వాసన రావడం • వ్యాధులు వ్యాపించడం • పాదాల సమస్యలు రావడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి షెడ్‌ను ప్రతిరోజూ శుభ్రం చేయాలి.
లూజ్ హౌసింగ్ షెడ్ నిర్వహణ లూజ్ హౌసింగ్ విధానం విజయవంతం కావడానికి సరైన నిర్వహణ చాలా అవసరం.
ప్రతిరోజూ చేయవలసిన పనులు
పేడను తొలగించాలి: పశువుల విశ్రాంతి ప్రదేశం మరియు ఓపెన్ యార్డ్‌లో పేరుకుపోయిన పేడను క్రమం తప్పకుండా తొలగించాలి.
నీటి తొట్టిని శుభ్రం చేయాలి: నీటి తొట్లో మురికి, పేడ లేదా మేత పడకుండా చూడాలి. పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.
మేత తొట్టిని శుభ్రంగా ఉంచాలి: పాత లేదా పాడైన మేతను తొలగించి తాజా మేత ఇవ్వాలి.
అనారోగ్య పశువులను వేరుగా ఉంచాలి: అనారోగ్యంగా ఉన్న పశువులను వెంటనే గుర్తించి ఇతర పశువుల నుండి వేరుగా ఉంచాలి. అవసరమైతే పశువైద్యుని సలహా తీసుకోవాలి.
పశువుల ఆరోగ్యాన్ని గమనించాలి: ప్రతిరోజూ పశువులలో ఆకలి, పాల ఉత్పత్తి, నడక, శరీర ఉష్ణోగ్రత, మలం మరియు మూత్రం, ఈస్ట్రస్ లక్షణాలు వంటి అంశాలను గమనించాలి. ముగింపు: లూజ్ హౌసింగ్ సిస్టమ్ అనేది పాడి పశువులను ఆరోగ్యంగా, సౌకర్యవంతంగా మరియు సహజ వాతావరణంలో పెంచడానికి ఉపయోగపడే మంచి గృహ నిర్వహణ విధానం. ఈ విధానంలో పశువులకు కప్పు ఉన్న విశ్రాంతి ప్రదేశం, స్వేచ్ఛగా తిరగడానికి ఓపెన్ యార్డ్, సరైన మేత మరియు శుభ్రమైన నీరు అందించబడతాయి. పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మరియు సంక్షేమం మెరుగుపడటానికి సరైన గృహ వసతి చాలా అవసరం. లూజ్ హౌసింగ్ విధానంలో మంచి డ్రైనేజీ, పరిశుభ్రత, గాలి ప్రసరణ, తగినంత స్థలం మరియు సరైన నిర్వహణ ఉండాలి. సరైన ప్రణాళికతో లూజ్ హౌసింగ్ విధానాన్ని అమలు చేస్తే పశువులకు సౌకర్యవంతమైన జీవన వాతావరణం కల్పించడంతో పాటు రైతుకు పాడి పరిశ్రమ నిర్వహణలో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. రైతులకు ముఖ్య సందేశం
“మంచి షెడ్ – ఆరోగ్యకరమైన పశువు; ఆరోగ్యకరమైన పశువు – అధిక ఉత్పత్తి; అధిక ఉత్పత్తి – అధిక ఆదాయం.”
డా జె. సాయి కిరణ్ (శాస్త్రవేత, ఎల్ పి ఎం) కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్ Ph: 8121451017
ఆరోగ్యంగా పెరిగిన దూడలు భవిష్యత్తులో అధిక పాలు ఉత్పత్తి చేసే ఆవులు, గేదెలు లేదా మంచి శక్తి కల్గిన ఎద్దులుగా ఎదిగి రైతుకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. కాబట్టి దూడల పెంపకంకంలో శాస్త్రీయ పద్ధతులు అనుసరించడం వల్ల వాటి ఆరోగ్యంని కాపాడుకోవచ్చు. పుట్టిన మొదటి కొన్ని వారాలు, నెలలు దూడల జీవితంలో అత్యంత ముఖ్య దశ. ఈ దశలో దూడలకి మంచి పోషకాహారం, నట్టల నివారణ మందులు, రోగనిరోధక టీకాలు సకాలంలో అందించినట్లయితే దూడలు ఎలాంటి వ్యాధుల భారిన పడకుండా ఆరోగ్యముగా ఎదిగి రైతులకు ఆదాయాన్ని ఇస్తాయి.
దూడలలో పోషకాహారం లోపించండం లేదా పాకలలో పరిశుభ్రత పాటించకపోవడం వలన వాటికి అంటువ్యాధులు సంభవించి వాటి ఎదుగుదల మందగించడం,శరీర బరువు తగ్గడం, మరణాల రేటు పెరగడం మరియు భవిష్యత్తులో అధిక పాల ఉత్పత్తిని ఇచ్చే సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల వ్యాధులు వచ్చిన తరువాత చికిత్స చేయడం కంటే ముందుగా నివారణ చర్యలు తీసుకోవడం వలన అంటువ్యాధులు నివారించవచ్చు.
దూడలలో సాధారణంగా వచ్చే వ్యాధులు:
దూడలలో పుట్టిన వెంటనే చనిపోవడానికి గల ప్రధాన కారణాలు: కష్టప్రసవం (Dystocia), పుట్టిన వెంటనే ముక్కులోని జిగురు పదార్థాలు శుభ్రం చేయకపోవడం వలన ఊపిరి ఆడకపోవడం, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన లోపాల వలన మరియు పుట్టిన వెంటనే తగిన మోతాదులో ముర్రుపాలు అందించకపోవడం మరియు తల్లి పోషకాహార లోపం కూడా దూడలు పుట్టిన వెంటనే చనిపోవడానికి కారణాలు.
నాభి సంక్రమణ ( Navel ill): పుట్టిన వెంటనే నాభిని శుభ్రపర్చకపోతే సూక్ష్మజీవుల సంక్రమణ కలుగుతుంది. దీని వలన దూడలకి బొడ్డు వాపు మరియు తీవ్రమైన జ్వరం వస్తుంది. ఈ వ్యాధి నివారణకు పుట్టిన వెంటనే అయోడిన్ ద్రావణంతో నాభిని శుభ్రపరచాలి.
అతిసారవ్యాధి:
పుట్టిన దూడలలో అధికంగా కనిపించే వ్యాధులలో అతిసారం (Diarrhoea లేదా Scores) ఒకటి. ఈ వ్యాధి వల్ల దూడ శరీరంలో నీరు, ఖనిజలవణాలు వేగంగా కోల్పోయి నిర్జలీకరణకు గురవుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే కొద్ది గంటలలోనే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి పాడి రైతు ఈ వ్యాధి కారకాలు, లక్షణాలు మరియు నివారణ గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.
అతిసారం అంటే ఏమిటి ? దూడలు తరుచుగా నీటి వంటి లేదా పలుచటి మలాన్ని విసర్జించడం, సాధారణం కంటే ఎక్కువసార్లు మలం చేయడం, శరీరం నుంచి నీరు మరియు లవణాలు అధికంగా కోల్పోవడం వంటి పరిస్థితిని అతిసారం అంటారు. ఈ వ్యాధి స్వతంత్ర వ్యాధి కాకుండా బాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు లేదా పోషకాహార లోపల వల్ల కలుగుతుంది. ముఖ్యంగా పుట్టిన 5-30 రోజుల మధ్య ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అతిసారం కారణాలు ముఖ్యంగా రెండు రకాలు 1. ఇన్ఫెక్షియస్ కారణాలు ( సంక్రామక కారణాలు ) 2. నాన్ ఇన్ఫెక్షియస్ కారణాలు ( అసంక్రామక కారణాలు)
దూడలలో అతిసారం కలిగించే సంక్రామక కారణాలు (infectious causes) : సూక్ష్మజీవుల వలన కలిగే అతిసారన్ని సంక్రామక అతిసారం అంటారు. ఇది ఒక దూడ నుండి మరొక దూడకు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. వైరస్ కారకాలు : రోటా వైరస్, కరోనా వైరస్ బాక్టీరియా: ఇ. కోలై , సాల్మొనెల్లా spp., క్లోస్ట్రిడియం పరాన్నజీవులు: క్రిప్టోస్పోరిడియం, కాక్సిడియా
దూడలలో అతిసారం కలిగించే అసంక్రామక కారణాలు (Non infectious causes): ఇవి ఒక దూడ నుండి మరొక దూడకి వ్యాపించవు. ప్రధానంగా పోషణ, నిర్వహణ మరియు పర్యావరణ కారణాల వలన ఏర్పడుతాయి. వీటిలో ముఖ్య కారణాలు ● పుట్టిన వెంటనే తగిన పరిమాణంలో ముర్రుపాలు ఇవ్వకపోవడం ● అధికంగా లేదా తక్కువ పాలు ఇవ్వడం. ● అపరిశుభ్రమైన పాలని ఇవ్వడం. ● కలుషితమైన నీరు లేదా దాణా ఇవ్వడం. ● పోషకాహార లోపాలు. ● అప్పుడే పుట్టిన దూడకి సరిపోని వాతావరణం మరియు అపరిశుభ్రమైన పాకలో ఉంచడం, మొదలైనవి. అపుడే పుట్టిన దూడలకి రోగనిరోధకశక్తి తక్కువగా ఉండడం వల్ల సులభంగా వ్యాధికారక క్రిముల భారిన పడే అవకాశం ఉంటుంది.
దూడలలో అతిసారవ్యాధి ముఖ్య లక్షణాలు: ● తరుచుగా పలుచటి లేదా నీళ్ల లాంటి విరేచనాలు రావడం. ● మలం రంగు పసుపు, తెలుపు,ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఉండవచ్చు. ● విరేచనాల వలన శరీరంలో నీటి శతం తగ్గి కళ్ళు లోపలికి పోవడం,చర్మాన్ని పైకి లాగితే ఆలస్యంగా మామూలు స్థితికి రావడం. ● పాలు తాగడం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం గమనించవచ్చు. ● దూడలు తరుచుగా బలహీనంగా కనిపిస్తాయి, శరీర బరువు తగ్గుతుంది. ● ముఖ్యంగా బాక్టీరియా లేదా వైరస్ సంక్రమణలో జ్వరం ఉండవచ్చు. ● కళ్ళలో మెరుపు తగ్గి, చెవులు చల్లగా అనిపించడం. ● పొట్ట నొప్పి, అపుడప్పుడు పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. ● మూత్రవిసర్జన తగ్గడం , శరీరం పూర్తిగా ఎండిపోయినట్లు కనిపిస్తుంది. ● సకాలంలో చికిత్స చేయకపోతే మరణం కూడా సంభవించవచ్చు.
దూడలలో అతిసార వ్యాధి చికిత్స నివారణోపాయాలు:
● పుట్టిన దూడలకి మొదటి 2 గంటలలోపు తగిన మోతాదులో ముర్రుపాలు ఇవ్వాలి. ఇది రోగనిరోధకశక్తి పెంచి అతిసారాన్ని తగ్గిస్తుంది. ● దూడలను శుభ్రమైన, పొడి గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచాలి. ● కలుషితమైన నీరు, మేత ఇవ్వకూడదు. ● అనారోగ్య దూడలను ఆరోగ్యవంతమైన దూడల నుండి వేరుగా ఉంచాలి. ● దూడ నాభిని అయోడిన్ ద్రావణంతో శుభ్రపరచాలి. నాభి ద్వారా సంక్రమణలు జరగకుండా జాగ్రత్తపడాలి. ● పాలను నిర్ణీత సమయంలో తగిన మోతాదులో ఇవ్వాలి. ● దూడలకు సకాలంలో టీకాలు మరియు నట్టల నివారణ మందులు ఇవ్వాలి. ● వ్యాధి సోకిన దూడలకి అజాగ్రత్త చేయకుండా వెంటనే చికిత్స చేయించాలి. ఆంటీబయోటిక్స్ ఇంజెక్షన్లు ఇప్పించాలి. ● ద్రవాలు మరియు ఎలెక్ట్రోలైట్ థెరపీ చికిత్సలో అత్యంత ముఖ్యమైనది. ● దూడకి తీవ్రమైన నీరసం, కళ్ళ లోతు, లేచి నిలబడ లేకపోవడం లేదా 24 గంటలకు మించి తీవ్ర అతిసారం ఉంటే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
మలబద్దకం: చలికాలములో ఎక్కువగా దూడలలో మలబద్దకం కనిపిస్తుంది. ఈ వ్యాధి నివారణకు దూడకు తగిన మోతాదులో జున్నుపాలు లభించేట్లు చూడాలి. జున్నుపాలు దూడలలో మలబద్దకాన్ని నివారిస్తుంది. దూడకు ఎల్లప్పుడూ శుభ్రమైన నీరు అందించాలి. ఆకస్మికంగా ఆహరం మార్చకుండా , క్రమంగా మార్పులు చేయాలి. దూడలకు అప్పుడప్పుడు ఆముదము, అరటిపండు, లిక్విడ్ పరాఫిన్ వంటి మందులు అందించాలి. దూడలు ఎదిగే దశలో లేత గడ్డి ఎక్కువగా మేపిన మలబద్దకం తగ్గుతుంది. దూడలకు గడ్డి, దాణా వంటి ఘనపదార్థాలు జీర్ణించుకునే శక్తిని కలుగచేయుటకు తల్లి నెమరు వేసేటపుడు సొంగ తీసుకొని దూడ నోట్లో పెట్టినట్లయితే దూడ జీర్ణాశయంలో అందుకు కావాల్సిన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి.
దూడలలో నట్టల బెడద (Worm infestation):
దూడల కడుపులో గుండ్రటి పురుగులు, లివర్ ఫ్లూక్స్, బద్దె పురుగుల వంటి నట్టలు ఉండడం వల్ల మొదట అజీర్తి చేసి తరువాత పారుకుంటుంది. ● నట్టలు గల దూడ కడుపు ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఎదుగుదల మందగించి, దూడలు సరిగా మేత వేయవు. వెంట్రుకలు నిస్తేజముగా ఉండి దూడ బలహీనంగా చురుకుదనం కోల్పోయి ఉంటుంది. ● రక్తహీనత వల్ల కంటి పొరలు పాలిపోయినట్లు కనిపిస్తాయి. నట్టల నివారణకు దూడలకు వారం రోజుల వయస్సులో నట్టల నివారణ మందులు త్రాగించాలి. 30 వ రోజు వయసులోపల, తిరిగి 60 రోజుల వయస్సుకు నట్టల నివారణ మందులు తగిన మోతాదులో వాడాలి. కొత్తగా కొనుగోలు చేసిన దూడలకు నట్టల నివారణ చేసిన తరువాత ఇతర దూడలతో కలపాలి. మలపరీక్ష ద్వారా నట్టలను గుర్తించి అవసరమైన చికిత్స అందించాలి.
న్యుమోనియా (Pneumonia): చలి, తేమ మరియు పాకలలో గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, వైరస్ లేదా బాక్టీరియా సంక్రమణ వల్ల వస్తుంది.
దూడల కడుపులో బంతులు (Hair balls): దూడలు ఒకదానికొకటి నాకుకోవడం వల్ల లేదా గడ్డి తాడులు, ప్లాస్టిక్ వంటివి మింగడం వల్ల కడుపులో ఒకచోటచేరి బంతుల్లా తయారవుతాయి. ఇవి ప్రేగులలోకి చేరి ఆహారపదార్థాలకు అడ్డుపడతాయి. దీని వలన దూడలలో కడుపు నొప్పి సంభవిస్తుంది. దీనికి తగిన చికిత్స లేదు. బంతులు అడ్డుపడడం వలన కడుపు నొప్పి వస్తే శస్త్ర చికిత్స చేయించాలి.
దూడలలో డిప్తీరియా: ఇది ప్రధానముగా బాక్టీరియా వలన వస్తుంది. నోరు లేదా గొంతులో గాయాలు ఏర్పడినపుడు ఈ బాక్టీరియా ప్రవేశించి వ్యాధిని కల్గిస్తుంది. ఈ వ్యాధి వలన అధిక జ్వరం వస్తుంది. నోటి లోపల బూడిద రంగులో పుండ్లు ఏర్పడి, నోటి నుండి చొంగ కారుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక వంటి శబ్దాలు రావడం జరుగుతుంది. ● ఈ వ్యాధి నివారణకు పశువైద్యుడి సలహా మేరకు ఆంటిబయోటిక్ మందులు, సల్ఫా మందులు ఇప్పించాలి. ● దూడల పాకలు చలి, ఈదరగాడ్పులు రాకుండా పరిశుభ్రముగా ఉంచాలి.
దూడల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమైన సూచనలు:
1.దూడ పుట్టిన వెంటనే ముక్కు, నోరు శుభ్రం చేసి శ్వాస సులభంగా జరిగేలా చూడాలి.
పుట్టిన 2 గంటలలోపు ముర్రుపాలు తాగించాలి. 3.దూడను పరిశుభ్రమైన పాకలో ఉంచాలి. 4.పుట్టిన దూడ యొక్క నాభిని అయోడిన్ ద్రావణంలో ముంచాలి.
పరిశుభ్రమైన త్రాగునీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.
నట్టల నివారణ మందులు 10-15 రోజుల వయస్సులో ఒకసారి, 30 వ రోజు ఒకసారి, 60 వ రోజు ఒకసారి తగిన మోతాదులో ఇవ్వాలి.
2 వారాల వయస్సు నుంచి మెల్లిగా కాఫ్ స్టార్టర్ ని మేతగా ఇస్తూ, మూడో నెల వరకు పాలు, క్రమంగా ఘనమేత ఇవ్వాలి.
3 నెలల తరువాత పచ్చిమేత మరియు గడ్డి మేతని ఇవ్వాలి. 9.పాకలో ఖనిజమిశ్రమం కలిగివున్న రాళ్లను వ్రేలాడదీయాలి.
దూడలకు నెలకొకసారి వెంట్రుకలు గొరిగితే బాహ్యపారాన్నజీవుల వలన కలిగే వ్యాధుల నుండి కూడా రక్షించవచ్చు. 11.టీకాలు నిర్ణిత షెడ్యూల్ ప్రకారం చేయించడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
దూడల ఆరోగ్యంని ప్రతిరోజు గమనించి, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
ముగింపు : దూడలకు సరైన పోషణ, పాకలలో పరిశుభ్రత, సమయానికి నట్టల నివారణ మందులు, టీకాలు చేపట్టడం వలన భవిష్యత్తులో అధిక ఉత్పాదకత కలిగిన పాడి పశువులను తయారుచేయవచ్చు. రైతులు ఈ సూచనలు పాటిస్తే దూడల మరణాల రేటు తగ్గి, పాడి పరిశ్రమలో మంచి లాభాలు పొందగలుగుతారు.
రచయిత: డా. చంద్రగిరి ప్రజ్ఞ, సహాయ ఆచార్యులు, పశు జన్యు శాస్ర మరియు ప్రజనన విభాగం, పశు వైద్య కళాశాల, కోరుట్ల. 9014639814
గ్రామీణ తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని కూలీలు, మహిళా స్వయం సహాయక బృందాలు (Self Help Groups – SHGs) తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తెచ్చే పశు సంపద కోసం అన్వేషిస్తున్న తరుణంలో ‘సీమ పందుల పెంపకం’ ఒక ఆశాజనకమైన ఆర్థిక ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తోంది. దేశీయ (నాటు) పందులతో పోలిస్తే సీమ జాతులు వేగంగా బరువు పెరగడం, ఎక్కువ పిల్లలు ఈనడం (అధిక లిట్టర్ సైజు), తక్కువ మేతతో ఎక్కువ మాంసం ఉత్పత్తి చేయడం (మెరుగైన ఫీడ్ కన్వర్షన్ ఎఫిషియెన్సీ – FCE) వంటి లక్షణాలతో ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మాంసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, భారత పశు గణాంకాల (Basic Animal Husbandry Statistics – BAHS 2025) ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే మాంస ఉత్పత్తి సుమారు 2.46 శాతం వృద్ధి చెందింది. అయితే, పంది జనాభా వృద్ధి రేటు గత రెండు దశాబ్దాలుగా మందగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను, ఆధునిక వ్యాధి నివారణ చర్యలను, ప్రభుత్వ తోడ్పాటును సమన్వయం చేసుకుంటే పందుల పెంపకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే శక్తివంతమైన సాధనంగా మారగలదు.
సీమ మరియు సంకరీకరణ జాతుల పందులు మన దేశంలో సంప్రదాయకంగా పెంచే నాటు (దేశీయ) పందుల ఉత్పాదకత తక్కువగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా విదేశాల నుంచి తీసుకువచ్చి మన వాతావరణ పరిస్థితులకు అలవాటు చేసిన సీమ జాతులు (Exotic Breeds) అధిక ఉత్పాదకతను కలిగి ఉంటాయి. వీటిని దేశీయ పందులతో సంకరీకరణ చేసి, స్థానిక వాతావరణానికి అలవాటుపడే మేలుజాతి సంకర రకాలను (Crossbred Varieties) కూడా వివిధ రాష్ట్రాల పశువైద్య విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చేశాయి.
ప్రధాన సీమ జాతులు
లార్జ్ వైట్ యార్క్‌షైర్ (Large White Yorkshire) — పూర్తి తెలుపు రంగు, మేని మీద ‘ఫ్రెకిల్స్’ అనే నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది. ఒక్కో ఈతకు 11–12 పిల్లలు పుట్టే అధిక లిట్టర్ సైజు, మంచి మాతృత్వ లక్షణాలు దీని ప్రత్యేకత. మగ పంది 300–400 కిలోలు, ఆడ పంది 230–320 కిలోల వరకు బరువు పెరుగుతుంది.
ల్యాండ్‌రేస్ (Landrace) — పొడవైన శరీరం, తక్కువ కొవ్వు, అధిక మాంస దిగుబడినిచ్చే జాతి.
డ్యూరాక్ (Duroc) — ఎర్రటి రంగు, గట్టి శరీర నిర్మాణం, శీఘ్ర పెరుగుదల కలిగిన జాతి; సంకరీకరణకు మేలు జాతిగా వాడతారు.
హ్యాంప్‌షైర్ (Hampshire) — నాణ్యమైన మాంసం, చురుకైన స్వభావం కలిగిన జాతి.
తెలంగాణకు అనువైన సంకర జాతులు: పి.వి.నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం (PVNRTVU) ‘శిక్షణ’ పోర్టల్ ప్రకారం, తెలంగాణలో పెంపకానికి అనువైనవిగా ఈ కింది సంకర జాతులను గుర్తించారు
SVVU–T17 — శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం (SVVU), తిరుపతి అభివృద్ధి చేసిన సంకర జాతి. లార్జ్ వైట్ యార్క్‌షైర్‌ను స్థానిక దేశీయ పందితో సంకరీకరణ చేసి 75% సీమ వారసత్వంతో రూపొందించారు. 8 నెలల వయసుకు సగటున 70–75 కిలోల బరువు, ఒక్కో ఈతకు 8–12 పిల్లలు లభిస్తాయి; ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ, పేద రైతు కుటుంబాలకు జీవనోపాధి వనరుగా విస్తృతంగా వాడుతున్నారు (SVVU, 2021).
రాణి (Rani) — ఐ.సి.ఏ.ఆర్.-జాతీయ పంది పరిశోధనా కేంద్రం, గౌహతి 2016లో విడుదల చేసిన సంకర జాతి. సీమ జాతి హ్యాంప్‌షైర్‌ను ఈశాన్య భారత దేశీయ జాతి ఘుంగ్రూతో సమాన (50:50) వారసత్వంతో సంకరీకరణ చేశారు; ఆరు తరాలుగా జాతి లక్షణాలను స్థిరీకరించారు. 8 నెలల వధ వయసుకు సుమారు 75 కిలోల బరువు, 1.98 సెం.మీ. వెన్ను కొవ్వు మందం లభిస్తుంది; డ్యూరాక్‌తో సంకరీకరించి ‘ఆశ’ అనే మరో రకాన్ని కూడా అభివృద్ధి చేశారు (ICAR-NRCP, 2016).
TANUVAS KPM Gold — తమిళనాడు పశు వైద్య, జంతు శాస్త్రాల విశ్వవిద్యాలయం (TANUVAS) కింద పి.జి.ఆర్.ఐ.ఏ.ఎస్., కట్టుపాక్కంలో అభివృద్ధి చేసిన సంకర జాతి. లార్జ్ వైట్ యార్క్‌షైర్ (75%)ను తమిళనాడు దేశీయ పందితో (25%) సంకరీకరణ చేసి 2017లో విడుదల చేశారు. అధిక వ్యాధి నిరోధకత, 3% లోపు పాలు మాన్పే వయసు మరణాల రేటు, ఒక్కో ఈతకు సగటున 8.1 పిల్లలు దీని ప్రత్యేకతలు; స్థానిక వాతావరణ పరిస్థితులకు బాగా అలవాటుపడింది (TANUVAS, 2017).
ఐ.సి.ఏ. ఆర్.-జాతీయ పంది పరిశోధనా కేంద్రం (ICAR-National Research Centre on Pig – ICAR-NRCP), గౌహతి ఈ సీమ, సంకర జాతులను దేశీయ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయడంలో, రైతులకు మేలుజాతి కూనలను (piglets) సరఫరా చేయడంలో, శిక్షణలు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
శాస్త్రీయ పెంపక యాజమాన్య పద్ధతులు గృహ నిర్మాణం (షెడ్ నిర్మాణం): పందుల షెడ్డు ఎత్తైన ప్రదేశంలో, మంచి గాలి, వెలుతురు ఉండేలా నిర్మించాలి. ఈనే పందులకు వేరుగా ఫారోయింగ్ పెన్లు, పిల్లల కోసం క్రీప్ ఏరియా, వ్యాధి సోకిన పందులను వేరుచేసేందుకు ఐసొలేషన్ పెన్ ఏర్పాటు చేసుకోవాలి. నేల సులభంగా కడగగలిగేలా సిమెంట్‌తో వాలుగా ఉండాలి, తద్వారా మురుగునీరు సులభంగా బయటకు పోతుంది.
సంతానోత్పత్తి యాజమాన్యం: ఆడ పందులకు 8 నెలల వయసు, సుమారు 90–100 కిలోల బరువు వచ్చాక మొదటిసారి సంతానోత్పత్తికి ఉపయోగించాలి. గర్భధారణ కాలం సగటున 114 రోజులు (3 నెలలు, 3 వారాలు, 3 రోజులు) ఉంటుంది. పిల్లలను 6–8 వారాల వయసులో పాలు మాన్పించడం (weaning) శాస్త్రీయ పద్ధతి. సంతానోత్పత్తికి రెండు వారాల ముందు ఆడ పందికి కొంచెం ఎక్కువ దాణా ఇవ్వడాన్ని ‘ఫ్లషింగ్’ (Flushing) అంటారు; ఇది రోజుకు 0.7–0.9 కిలోల బరువు పెరుగుదలను, మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
మేత యాజమాన్యం పందుల పెంపకంలో మొత్తం ఖర్చులో 70–75 శాతం మేత ఖర్చే ఉంటుంది. కాబట్టి వయసు, శరీర బరువును బట్టి శాస్త్రీయంగా మేత మార్చడం లాభదాయకతను నిర్ణయిస్తుంది.
దశలవారీ మాంసకృత్తుల (ప్రొటీన్) అవసరం దశ/ వయసు ప్రోటీన్ % శక్తి (ME, కిలో క్యాలరీలు/కిలో మేత) 2–5 కిలోల బరువు పిల్లలు 24% 3,500 5–15 కిలోల బరువు 22% 3,500 15–35 కిలోల బరువు (గ్రోయర్) 18% 3,300 35–90 కిలోల బరువు (ఫినిషర్) 14% 3,300 గర్భిణి ఆడ పందులు 14% 3250 పాలిచ్చే ఆడ పందులు 15% 3300 కోడె పందులు (boars) 14% 3250
క్రీప్ ఫీడ్ మరియు తొలిదశ మేత పుట్టిన 45 నిమిషాల్లోపే పిల్లలకు మొదటి పాలు (కొలొస్ట్రమ్) తాగించడం చాలా ముఖ్యం; ఇందులో వ్యాధి నిరోధక శక్తినిచ్చే ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు), విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. 10వ రోజు నుంచి పాలు మాన్పించిన 2 వారాల వరకూ 18–20% ప్రొటీన్‌తో కూడిన క్రీప్ ఫీడ్ ఇవ్వాలి. మొక్కజొన్న, వేరుశనగ చెక్క, తవుడు, చేపల పొడి, ఖనిజ మిశ్రమం కలిపి తయారుచేసే ఈ దాణా వల్ల మాన్పించే సమయంలో ఒత్తిడి తగ్గి, త్వరగా బరువు పెరుగుతాయి.
గ్రోయర్ మరియు ఫినిషర్ దాణా గ్రోయర్ దశలో మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ తవుడు, చేపల పొడి, ఖనిజ మిశ్రమంతో కూడిన సమతుల్య దాణా ఇవ్వాలి. ఫినిషర్ దశలో మార్కెట్ బరువుకు తీసుకురావడానికి శక్తినిచ్చే దాణాతో పాటు నువ్వుల చెక్క వంటివి చేర్చవచ్చు.
పదార్థం పరిమాణం (100 కిలోల దాణాలో) మొక్కజొన్న 55 భాగాలు వేరుశనగ చెక్క 20 భాగాలు గోధుమ తవుడు 15 భాగాలు చేపల పొడి 8.5 భాగాలు ఖనిజ మిశ్రమం 1.5 భాగాలు ఉప్పు 0.5 భాగాలు ఈ మిశ్రమం ద్వారా మొత్తం 22% ప్రొటీన్ లభిస్తుంది.
గర్భిణి, పాలిచ్చే ఆడ పందుల మేత: గర్భిణి ఆడ పందికి రోజుకు 1.8–1.9 కిలోల దాణా ఇస్తే గరిష్ఠ జనన బరువు (Birth Weight), మాన్పే బరువు (Weaning weight) లభిస్తాయి. ఈనడానికి 4–5 రోజుల ముందు దాణాను సగానికి తగ్గించి, మలబద్ధకం రాకుండా గోధుమ తవుడు వంటి లఘువిరేచన పదార్థాలు చేర్చాలి. పాలిచ్చే ఆడ పందికి రోజుకు 3.5 కిలోల దాణాతో పాటు ప్రతి పిల్లకు అదనంగా 0.2 కిలోల చొప్పున, 14–23 లీటర్ల నీరు అవసరం.
నీటి అవసరం (రోజుకు): వర్గం నీరు (లీటర్లలో) కోడె పంది (boar) 45–50 ఈనే ఆడ పంది 18–22 పాలు మాన్పిన పిల్లలు 3.5–4 పాలిచ్చే ఆడ పంది 14–23
చౌక, స్థానిక మేత వనరులు దాణా ఖర్చు తగ్గించుకోవడానికి అజొల్ల, వరి తవుడు (75% వరకు), బ్రూవరీ వ్యర్థాలు (15% వరకు), అరటి వ్యర్థాలు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు, హోటల్ వంటగది వ్యర్థాలు వంటి స్థానిక వనరులను సమతుల్యంగా వాడుకోవచ్చు. అయితే, గార్బేజ్ ఫీడింగ్‌లో మాంసం ముక్కలను ఇవ్వకూడదు — ఇవి వ్యాధులను వ్యాప్తి చేయడంతో పాటు గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. పులిసిన లేదా నిల్వ ఉంచిన ఆహారాన్ని ఇస్తే సాల్మొనెల్లోసిస్ వంటి వ్యాధులు వచ్చి మరణాలకు దారితీయవచ్చు కాబట్టి ఉడికించిన వ్యర్థాలనే ఇవ్వాలి.
వ్యాధి వర్గం: బాక్టీరియా వ్యాధులు
ప్రధాన వ్యాధులు : బ్రూసెల్లోసిస్
ముఖ్య లక్షణాలు: గర్భస్రావం, వంధ్యత్వం
నివారణ / నియంత్రణ : సోకిన పందులను వేరుచేయాలి, పరీక్షలు నిర్వహించాలి. జూనోటిక్ వ్యాధి.
వ్యాధి : *లెప్టోస్పైరోసిస్
ముఖ్య లక్షణాలు: జ్వరం, విరేచనాలు, గర్భస్రావం
నివారణ / నియంత్రణ : పరిశుభ్రత, ఎలుకల నియంత్రణ, అవసరమైన టీకాలు
వ్యాధి : స్వైన్ ఎరిసిపెలాస్
ముఖ్య లక్షణాలు: అధిక జ్వరం, చర్మంపై వజ్రాకార మచ్చలు
నివారణ / నియంత్రణ : సమయానికి టీకాలు, యాంటీబయోటిక్ చికిత్స
వ్యాధి : అట్రోఫిక్ రైనైటిస్, సాల్మొనెల్లోసిస్, పాశ్చురెల్లోసిస్
ముఖ్య లక్షణాలు: శ్వాసకోశ సమస్యలు, విరేచనాలు
నివారణ / నియంత్రణ : పరిశుభ్రత, బయోసెక్యూరిటీ, వెటర్నరీ చికిత్స
వైరస్ వ్యాధులు: *
వ్యాధి : క్లాసికల్ స్వైన్ ఫీవర్ (CSF)
ముఖ్య లక్షణాలు: జ్వరం, ఆకలి తగ్గడం, అధిక మరణాలు
నివారణ / నియంత్రణ : సమయానికి టీకాలు వేయాలి
వ్యాధి : ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF)
ముఖ్య లక్షణాలు: అకస్మిక మరణాలు, అధిక మరణాల రేటు
నివారణ / నియంత్రణ : ప్రస్తుతం సమర్థవంతమైన టీకా లేదు. కఠినమైన బయోసెక్యూరిటీ పాటించాలి.
వ్యాధి: ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (FMD)
ముఖ్య లక్షణాలు: నోరు, కాళ్లపై బొబ్బలు
నివారణ / నియంత్రణ : టీకాలు, వ్యాధిగ్రస్త పందులను వేరుచేయాలి
వ్యాధి : స్వైన్ ఇన్ఫ్లుఎంజా
ముఖ్య లక్షణాలు: శ్వాసకోశ, జీర్ణకోశ సమస్యలు
నివారణ / నియంత్రణ : మంచి నిర్వహణ, అవసరమైన టీకాలు
*పరాన్నజీవి వ్యాధులు *
వ్యాధి : సార్కాప్టిక్ మేంజ్
ముఖ్య లక్షణాలు: తీవ్రమైన దురద, చర్మ సమస్యలు
నివారణ / నియంత్రణ : ఐవర్‌మెక్టిన్ చికిత్స, పరిశుభ్రత
వ్యాధి : రౌండ్‌వార్మ్, విప్‌వార్మ్, కిడ్నీ వార్మ్, లంగ్ వార్మ్
ముఖ్య లక్షణాలు: ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం
నివారణ / నియంత్రణ : ప్రతి 3 నెలలకోసారి డీవార్మింగ్ చేయాలి
వ్యాధి : ట్రైకినోసిస్
ముఖ్య లక్షణాలు: జూనోటిక్ వ్యాధి
నివారణ / నియంత్రణ : పంది మాంసాన్ని పూర్తిగా ఉడికించి తీసుకోవాలి
జూనోటిక్ వ్యాధులపై జాగ్రత్తలు బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, సాల్మొనెల్లోసిస్, ట్రైకినోసిస్ వంటి వ్యాధులు పందుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అందువల్ల చేతి తొడుగులు ఉపయోగించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాంసాన్ని పూర్తిగా ఉడికించి తినడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.
బయోసెక్యూరిటీ చర్యలు • కొత్తగా కొనుగోలు చేసిన పందులను 2–3 వారాలు క్వారంటైన్లో ఉంచాలి. • షెడ్డును, పరికరాలను, తాగునీటి పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రపరచి క్రిమిసంహారక మందులు ఉపయోగించాలి. • ప్రతి 3 నెలలకోసారి డీవార్మింగ్ చేయాలి. • టీకాల షెడ్యూల్‌ను తప్పకుండా పాటించాలి. • అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యుడిని సంప్రదించి, అనుమానాస్పద మరణాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
రైతులకు సూచన: “చికిత్స కంటే నివారణే ఉత్తమం.” పరిశుభ్రమైన నిర్వహణ, సమతుల్య పోషకాహారం, సమయానికి టీకాలు, క్రమం తప్పకుండా డీవార్మింగ్ చేయడం ద్వారా పందుల ఆరోగ్యాన్ని కాపాడి అధిక లాభాలు పొందవచ్చు.
ప్రభుత్వ పథకాలు — విధానాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పందుల పెంపకాన్ని ఒక వ్యవస్థాపక అవకాశంగా ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నాయి.
జాతీయ పశు సంపద మిషన్ (National Livestock Mission – NLM)
పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ పథకంలోని వ్యవస్థాపకత అభివృద్ధి ఉప-పథకం (Entrepreneurship Development Sub-Mission) కింద, పందుల పెంపక క్షేత్రాల ఏర్పాటుకు షెడ్ నిర్మాణం (ఈనే పందుల షెడ్, కోడె పందుల యూనిట్, ఫారోయింగ్ పెన్), మేలుజాతి పిల్ల పందుల కొనుగోలు, పరికరాలు, బీమా, పశు వైద్య సహాయం వంటి అంశాలపై 50% వరకు మూలధన రాయితీ లభిస్తుంది. వ్యక్తులు, రైతు ఉత్పత్తి సంఘాలు (FPO), స్వయం సహాయక బృందాలు (SHG), రైతు సహకార సంస్థలు (FCO), ఉమ్మడి బాధ్యతా బృందాలు (JLG) ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముగింపు సీమ, సంకర జాతుల పందుల పెంపకం తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలం, తక్కువ కాలంలో ఎక్కువ రాబడినిచ్చే గ్రామీణ ఉపాధి మార్గంగా విస్తరిస్తోంది. అయితే, శాస్త్రీయ యాజమాన్యం, దశలవారీ సమతుల్య మేత, కచ్చితమైన టీకా కార్యక్రమం, కఠినమైన బయోసెక్యూరిటీ చర్యలు పాటించకుండా చేపడితే — ముఖ్యంగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వంటి టీకా లేని వ్యాధుల నేపథ్యంలో — నష్టాలు తప్పవు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, రుణ సదుపాయాలు, విశ్వవిద్యాలయాల విస్తరణ సేవలను సద్వినియోగం చేసుకుంటూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే, తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలు సీమ పందుల పెంపకం ద్వారా నిలకడైన ఆదాయాన్ని, నిజమైన ఆర్థిక సాధికారతను సాధించగలరు. ఇందుకు పశు విస్తరణ విద్య, క్షేత్రస్థాయి శిక్షణలు, పశు వైద్యుల మార్గదర్శకత్వం అనునిత్యం అందుబాటులో ఉండటం అత్యవసరం. . డా. ఎం. అరవింద్ (పీజీ స్కాలర్), పశువైద్య & పశుసంవర్థక శాఖ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, సెల్: 8499884669.