ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులలో మన పశువులను మరియు కోళ్లను కాపాడుకుందాం ఇలా..!- డా. జి. మిథున్
ఎండలు ముదురుతున్న కొద్దీ మనుషులకే కాదు, పశువులు-కోళ్లకు కూడా వేడి ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు మేత, తాగునీటి లభ్యత తగ్గితే పశువుల ఆరోగ్యం, పాలు, మాంస ఉత్పత్తి, కోళ్లలో గుడ్లు, మాంస ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం రండి.
మన పశువులు ఎంత వేడిని తట్టుకోగలవు?
• సంకర జాతి (క్రాస్‌బ్రీడ్) ఆవులు: 27°C వరకు మాత్రమే హాయిగా ఉంటాయి
• మన దేశీ ఆవులు (ఒంగోలు లాంటివి): 33°C వరకు తట్టుకుంటాయి
• గేదెలు: 36°C వరకు తట్టుకుంటాయి
అంటే ఒంగోలు, పుంగనూరు లాంటి మన స్థానిక జాతులు ఎండను ఎక్కువగా తట్టుకుంటాయి. అందుకే వీటిని పూర్తిగా వదిలేయకుండా పెంచుకోవడం మంచిది.
ఉష్ణ ఒత్తిడి (ఎండదెబ్బ/ వేసవితాపం) – గుర్తించడం, వెంటనే చేయాల్సినవి
లక్షణాలు: మేత మానేయడం, నోరు తెరిచి రొప్పుతూ ఊపిరి తీయడం, నాలుక వేలాడేసి చొంగ కార్చడం, పాలు దిగుబడి తగ్గడం, పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోవడాన్ని మనం చూడవచ్చును. చిన్న దూడలు, చూడి పశువులు, గేదెలపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
వెంటనే చేయాల్సినవి:
• జ్వరం తగ్గించే మందులు ఈ సమయమునందు ఉపయోగపడవు – చల్లటి నీళ్లతోనే చికిత్స.
• తడి గోనె సంచి లేదా గుడ్డను పశువు శరీరంపై కప్పి, తరచూ చల్లటి నీటితో తడపాలి.
• ఫ్యాన్/స్ప్రింక్లర్లను ప్రతి అరగంటకోసారి 5 నుండి 10 నిమిషాలు వేయడం మంచిది.
• ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని పశువులకి తాగించాలి. ఇంటి వద్దనే ఎలక్ట్రోలైట్ ద్రావణం తయారి: పెద్ద పశువులకు, 20 లీటర్ల నీళ్లలో 160 గ్రా ఉప్పు + పొటాషియం క్లోరైడ్ 20 గ్రా (4 స్పూన్లు) + కాల్షియం క్లోరైడ్ 10 గ్రా + ప్రొపైలిన్ గ్లైకాల్ 300 మి.లీ కలిపి తాగించాలి.
• పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తే పశువైద్యుడిని వెంటనే సంప్రదించాలి.
షెడ్డు మరియు నీళ్ల ఏర్పాట్లు
• పైకప్పుకు తెల్ల సున్నం వేస్తే లోపలి వేడి 2°C వరకు తగ్గుతుంది – చాలా చౌక ఉపాయం.
• షెడ్డు గోడలకు తడి గోనె సంచులు కట్టి రోజుకు 3-5 సార్లు తడపాలి.
• వరిగడ్డి లేదా కొబ్బరాకులతో పైకప్పు కప్పితే వేడి తగ్గుతుంది.
• ప్రతి పశువుకు రోజుకు 40 నుండి 60 లీటర్ల నీళ్లు కావాలి – నీళ్ల తొట్టెలు నీడలో పెట్టాలి.
• మేతకు ఉదయం 6 – 11, సాయంత్రం 4 – 6 గంటల మధ్యే పంపాలి. మధ్యాహ్నం షెడ్డులోనే ఉంచాలి.
గ్రాసం మరియు దాణా ఏర్పాట్లు
కరువును తట్టుకునే మేత రకాలు (APBN-1, CO-4, CO-5, తెలంగాణ జొన్న CSV-41 వంటివి) ఇప్పుడే వేసుకోవాలి.
మిగిలిన మేతను నిల్వ చేసుకునే 2 పద్ధతులు:
- సైలేజి (మాగుడు గడ్డి): పచ్చిమేతను చిన్న ముక్కలుగా కోసి, గాలి చొరబడకుండా గుంతలో లేదా సైలేజ్ బంకర్‌లో బాగా నొక్కి కుదించి, పైభాగాన్ని ప్లాస్టిక్ లేదా టార్పాలిన్‌తో గట్టిగా మూసివేయాలి. సుమారు 3 నుండి 4 వారాలు పులియబెట్టిన తర్వాత సైలేజ్‌గా ఉపయోగించుకోవచ్చు. గాలి, నీరు లోపలికి చొరబడకుండా చూడటం మంచి నాణ్యమైన సైలేజ్‌కు అత్యంత ముఖ్యం.
- యూరియా గడ్డి: 100 కిలోల వరిగడ్డికి 4 కిలోల యూరియా 50 నుండి 60 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి, గాలి తగలకుండా 3 వారాలు మూసి ఉంచాలి.
మేత దొరకనప్పుడు: వేరుశనగ పొట్టు, పత్తి లేదా మొక్కజొన్న కాడలు, రావి-మర్రి-మామిడి-వేప ఆకులు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు వాడుకోవచ్చు.
దాణాలో కలపాల్సినవి: రోజుకు మినరల్ మిక్చర్ 50-100 గ్రా, టన్ను దాణాకు విటమిన్-సి 100 గ్రా + విటమిన్-ఇ 50 గ్రా.
రైతులు మర్చిపోకూడని విషయం – పునరుత్పత్తి
ఎండ వేడికి ఆవులు/గేదెల్లో ఎద లక్షణాలు సరిగ్గా కనిపించవు (సైలెంట్ హీట్), గర్భం ఆలస్యమవుతుంది, పదే పదే కట్టు సూది వేయించినా కట్టు నిలవదు (రిపీట్ బ్రీడింగ్). దీనికి పరిష్కారాలు:
• రోజుకు 2 సార్లు (తెల్లవారుజామున, సాయంత్రం) ఎద లక్షణాల కోసం పశువును జాగ్రత్తగా గమనించాలి.
• పదేపదే ఎదకు వచ్చినా గర్భం దాల్చని పశువులను పశువైద్యుడితో పరీక్షించించి, ఆయన సూచన మేరకు PGF2 వంటి హార్మోన్ చికిత్సను చేయించాలి.
• పశువు ఈనిన తేదీ, మరలా కట్టిన తేదీ వంటి ముఖ్యమైన వివరాలను రాసి పెట్టుకోవాలి.
వ్యాధులు మరియు పురుగుల నియంత్రణ
వేసవికాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వంటి వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉన్నందున, పశువులకు అవసరమైన టీకాలను పశువైద్యుల సూచన మేరకు సకాలంలో వేయించాలి.
కాలేయ పురుగులు, గోమార్లు, పేలు వంటి పరాన్నజీవుల నియంత్రణకై:
• దవడ కింద వాపు, కళ్లు లేదా చిగుళ్లు తెల్లగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
• పశువైద్యుల సూచన లేకుండా ఒకే రకం డీవార్మింగ్ మందును పదేపదే ఉపయోగించకూడదు.
• పశువుల పేడ, మురుగునీరు షెడ్ పరిసరాల్లో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.
కోళ్ల పెంపకందారులకు జాగ్రత్తలు
కోళ్లకు చెమట గ్రంథులు ఉండవు కాబట్టి వేసవి వేడిని తట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల వేసవిలో నీటి అవసరం 3 నుండి 4 రెట్లు పెరిగే అవకాశం ఉన్నందున, ఎప్పుడూ చల్లటి, పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి. ట్యాంకులో వేడెక్కిన నీటిని ముందుగా తొలగించి కొత్త నీరు పెట్టాలి. ఈ వేసవి సమయంలో కోళ్లు తగినంత నీరు తాగేలా 0.2% ఉప్పు కలిపిన నీటిని అందించవచ్చు.
• షెడ్ పైకప్పుకు సున్నం పూత వేయడం, తడి గోనె సంచులు ఏర్పాటు చేయడం ద్వారా లోపలి వేడిని తగ్గించాలి.
• వేడి తక్కువగా ఉండే సమయాల్లోనే మేతను అందించడం మంచిది; ముఖ్యంగా తెల్లవారుజామున 4-5 గంటల మధ్య, రాత్రి 12-1 గంటల మధ్య మేత ఇవ్వవచ్చు.
• ఇంటి వద్ద దాణా తయారు చేసేటప్పుడు 5 భాగాల మొక్కజొన్న + 2 భాగాల జొన్న/సజ్జలు + 2 భాగాల వేరుశనగ/సోయా పిండి + గుడ్డు పెంకుల పొడి మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.
• వేసవి కాలంలో షెడ్‌లోని కోళ్ల సంఖ్యను సుమారు 10% తగ్గించి, వాటికి తగినంత స్థలం కల్పించాలి.
• న్యూకాజిల్ (రాణిఖేత్), గంబోరో వంటి వ్యాధులకు సంబంధించిన టీకాలను నిర్ణీత సమయంలో వేయించాలి.
ప్రభుత్వ పథకాల సాయం
• జాతీయ పశుసంపద మిషన్ (NLM): పశుగ్రాస యూనిట్లు, సైలేజ్/హే యూనిట్లకు 50% సబ్సిడీ (గరిష్టం రూ.50 లక్షలు) కోసం ఈ nlm.udyamimitra.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
• అన్నదాత సుఖీభవ పథకం: అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా ఈ పధకం ద్వారా ఆర్థిక సాయం. దీన్ని మేత కొనుగోలు, షెడ్డు మరమ్మతులకు వాడుకోవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
- పశువులకు తగినంత నీరు తరచుగా అందించాలి.
- నీడ, గాలి ప్రసరణ ఉండేలా చూడటం మరియు తడి గోనె సంచులతో వేడి తగ్గించడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలి.
- ముందుగానే మేత పండించి, అవసరమైనంత నిల్వ చేసుకోవాలి. తీవ్ర ఎండలో పశువులను కట్టివేయడం మానివేయ్యాలి. ఎద లక్షణాలను జాగ్రతగా గమనించుకోవాలి.
- కోళ్లకు చల్లటి నీరు, అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందించి వేడి ఒత్తిడిని తగ్గించాలి.
- నష్టభయంతో పశువులను తొందరపడి అమ్మకుండా, ప్రభుత్వ సహాయ పథకాలను వినియోగించుకోవాలి.
స్థానిక పశువైద్యులు, పశుసంవర్ధక శాఖ అధికారుల సలహాలు తీసుకుంటూ ఈ జాగ్రత్తలు పాటిస్తే మన పశు సంపదపై ఎల్‌నినో ప్రభావాన్ని బాగా తగ్గించుకోవచ్చు.
డా. జి. మిథున్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (CTF),
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్యా విభాగము,
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,
పశువైద్య కళాశాల, గరివిడి. మొబైల్: 7799804000.






























