ఈ మొక్క దాదాపు 2-4 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. ఒక మొక్క నుంచి 6-10 పిలకలు వస్తాయి. పువ్వులు ఊదారంగులో ఉండి మంచి సువాసన కలిగి ఉంటాయి. పువ్వుల కంకి భూమి స్థాయిలో ఏర్పడుతుంది. పూల కంకులు కొన్ని రకములలో నిటారుగా మరికొన్నింటిలో నేల బారుగా పెరుగుతాయి. పువ్వుల నుండి కాయ తయారవ్వటానికి 4 నెలలు పడుతుంది. ఒక్కొక్క కాయలో 10 నుంచి 20 దాకా విత్తనాలు ఉంటాయి. కాయలు సెప్టెంబరు నుండి డిశంబరు వరకు కోతకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైన చింతపల్లి, సప్పర్లలో అటవీశాఖకు చెందిన కాఫీ తోటలలో అక్కడక్కడ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయమునకు చెందిన మిరియాల తోటలలో అంతర పంటగా ఏలకులను పండించటం జరుగుతున్నది. ఈ పంటను విత్తనం ద్వారా వ్యాప్తి చేయవచ్చు.
సాధారణ నామం : లెస్సర్ కార్డమమ్, కార్డమమ్, యిలాచి శాస్త్రీయ నామం : ఎలెట్టేరియా కార్డమం కుటుంబం: జింజిబెరేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- కాయలు మరియు విత్తనాలను ఔషధములుగా వాడుతున్నారు. వీటి నుండి తయారుచేయబడు ఆవిరయ్యే నూనెలో బోర్నియాల్, కాంఫర్, పైనిన్, సినియోల్, కారియోపిల్లిన్, కార్వోన్, టెర్పినియోల్, టెర్పినీన్, పొటాషియం మరియు మాంగనీస్ లభిస్తాయి. విత్తనములలో పాల్మైటిక్ మరియు ఓలిక్ క్రొవ్వు ఆమ్లములు కలవు.
- ఏలకులు వాంతులను, కడుపులో నొప్పి, శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం, కడుపుబ్బరం, చెడుశ్వాసలను అరికడతాయి. వంటలలో సుగంధ ద్రవ్యంగా వాడతారు. కామప్రవృద్ధికి, జీర్ణశక్తికి తోడ్పడుతుంది. గుండె సంబంధిత సమస్యలలో కూడా ఉపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో
- యాలకుల ఎసెన్షియల్ ఆయిల్ టమాట పంట నాశించే లీఫ్మైనర్ని అత్యంత సమర్ధవంతంగా నివారించింది (చెగిని అండ్ అబ్బాసిపోర్, 2016).
- యాలకుల ఎసెన్షియల్ ఆయిల్ బ్రూచిడ్ బీటిల్, కొల్లసోబ్రూకస్ మాక్యులేటస్, రెడ్ఫ్లోర్ బీటిల్, ట్రైబోలియం కాస్టానియం, ఫ్లోర్మాత్, ఎఫెస్టియా క్యూహ్మియెలాపై విష చర్యను ప్రదర్శించింది. ఎసెన్షియల్ ఆయిల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ ఆడపురుగులు గుడ్లు పెట్టకుండా నిరోధించాయి. నిల్వధాన్యంలో ఆశించే పురుగుల నియంత్రణకు ఏలకుల ఎసెన్షియల్ ఆయిల్ మంచి ఎంపిక (అబ్బాసిపొర్, అతని అనుచరులు, 2011)
- యాలకుల ఎసెన్షియల్ ఆయిల్ ఎస్కెరిచియాకోలి, సాల్మొనెల్లాస్పీ., స్టెఫైలోకోకస్ ఆరియస్, ప్రోటియస్ వుల్గారిస్పై యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది (టెనెవ, అతని అనుచరులు, 2016).
- యాలకుల కాయ, ఆకుల ద్రావణం, ఎసెన్షియల్ ఆయిల్ స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్న్యుమానియే, సూడోమోనాస్ ఈరూజినోసా, ఎస్కెరిచియాకోలి, ఎంటరోబాక్టర్ స్పీ., క్లెబ్సియెల్లాన్యుమోనియే, సెర్రెషియా స్పీ., సాల్మొనెల్లాటైఫి పై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి
- అల్లం, యాలకుల పొడి ఖర్ౙూర పండ్ల నిల్వలో ఆశించే ఒరైజోఫిలస్ సురినామెన్సిస్ పెద్ద పురుగులపై విషపూరిత చర్యను ప్రదర్శించాయి (క్వాతాని, అతని అనుచరులు, 2012).
……………………………………………………………………………………………………………………………..
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

