వండని వంట… నువ్వుల కారం పిండి

కావాల్సిన పదార్థాలు

  • తెల్లనువ్వులు
  • జీలకర్ర – కొంచెం
  • ఎండుమిర్చి – సరిపడా
  • ఉప్పు – రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
తెల్ల నువ్వులు శుభ్రం చేసుకుని, ఎండలో పెట్టి, కొంచం సేపు ఎండగానే, తెచ్చి పక్కన పెట్టుకోవాలి, (ఎక్కువ సేపు ఎండలో పెడితే నూనె వస్తుంది) నువ్వులతోపాటు మిర్చి, జీలకర్ర కూడా ఎండబెట్టుకోవాలి. తరువాత అన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మిక్సీ పట్టకూడదు.. నూనె వస్తుంది… అలానే రోట్లో దంచుకోవచ్చు కూడా.. తరువాత ఉప్పు కలిపి వాడుకోవడమే… నువ్వుల కారపు పిండిని నేరుగా అన్నంలో వేసుకుని, పచ్చి నూనె వేసుకొని తినవచ్చు. లేదా కూరలు, పులుసులో కూడా కలిపి వాడుకోవచ్చు.

రచన: సంధ్య శశికాంత్, వాకలపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

సేంద్రీయ కర్బనం పెంచితేనే నేల ఆరోగ్యం పదిలం

ఒక్కోసారి మట్టిలోని కార్బన్‌ను సేంద్రియ పదార్థంగా వ్యవహరిస్తుంటారు. సేంద్రియ పదార్థానికి కార్బన్ మూల పదార్థం కాబట్టి, నేలలో ఉండే కార్బన్‌కి సేంద్రియ పదార్థ సాంద్రతకి అనులోమ సంబంధం ఉంటుంది.

సేంద్రియ పదార్థం – సేంద్రియ కర్బనం :
నేలలో ఉండే కార్బన్ గురించి ప్రస్తావించినప్పుడు సేంద్రియ పదార్థంలో కార్బన్ శాతం ఎంత అనే అర్థంలోనే చూడాలి. నేలల్లో ఉండే సేంద్రియ పదార్థం సేంద్రియ కర్బనం స్థాయికి రెట్టింపుగా ఉంటుంది.

సేంద్రియ పదార్థం అంటే ఏమిటి?
మట్టిలో సేంద్రియ పదార్థం పరిమాణం సాధారణంగా తక్కువగానే ఉన్నప్పటికీ, నేల యొక్క భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలపై ఇది ఎంతో కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా మట్టి బరువులో సేంద్రియ పదార్థం సుమారు 1–6 శాతం వరకు ఉంటుంది. పరిమాణంలో తక్కువగా ఉన్నప్పటికీ, నేల ఆరోగ్యం, సారవంతత మరియు పంటల ఉత్పాదకతను నిర్ణయించే ముఖ్యమైన అంశాల్లో సేంద్రియ పదార్థం ఒకటి.
సేంద్రియ పదార్థంలో ప్రధానంగా మొక్కల మరియు జంతువుల అవశేషాలు, సూక్ష్మజీవుల జీవద్రవ్యరాశి (biomass), వాటి విచ్ఛిన్నం ద్వారా ఏర్పడే స్థిరమైన సేంద్రియ పదార్థాలు (హ్యూమస్) ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగస్‌లు, ఆల్గే, ప్రోటోజోవా వంటి సూక్ష్మజీవులు, అలాగే వానపాములు మరియు ఇతర నేలజీవులు సేంద్రియ పదార్థం విచ్ఛిన్నం మరియు పునర్వినియోగంలో కీలక పాత్ర పోషిస్తాయి.

సేంద్రీయ కర్బనం అంటే ఏమిటి?
సేంద్రీయ కర్బనం అనేది నేలలోని సేంద్రియ పదార్థంలో ఉండే ప్రధాన మూలకం. మొక్కల అవశేషాలు, వేర్లు, సూక్ష్మజీవుల అవశేషాలు, జంతు వ్యర్థాలు మరియు వాటి విచ్ఛిన్నం ద్వారా ఏర్పడే హ్యూమస్‌ వంటి పదార్థాలు నేలలో సేంద్రీయ కర్బనానికి ప్రధాన వనరులు.

సేంద్రీయ పదార్థంలో సుమారు 58 శాతం కర్బనం ఉంటుందని సాధారణంగా పరిగణిస్తారు. అందువల్ల నేలలోని సేంద్రియ పదార్థ స్థాయిని అంచనా వేయడానికి సేంద్రీయ కర్బనం (SOC) ఒక ముఖ్యమైన సూచికగా ఉపయోగిస్తారు.

వ్యవసాయ భూమికి సేంద్రీయ కర్బనం (Organic Carbon) జీవనాడి వంటిది. నేల ఆరోగ్యాన్ని, సారాన్ని మరియు పంటల ఉత్పాదకతను నిర్ణయించే ముఖ్యమైన సూచికల్లో ఇది ఒకటి. సాధారణంగా, ఆరోగ్యవంతమైన నేలలో సేంద్రీయ కర్బనం తగిన స్థాయిలో ఉంటుంది. నేలలోని సేంద్రీయ కర్బనం శాతాన్ని ఆధారంగా చేసుకుని నేలలను ఈ విధంగా వర్గీకరించవచ్చు:

  • 0.30% కంటే తక్కువ – అత్యంత తక్కువ సేంద్రీయ కర్బనం ఉన్న నేల
  • 0.30–0.50% – తక్కువ సేంద్రీయ కర్బనం ఉన్న నేల
  • 0.50–0.75% – మధ్యస్థ సేంద్రీయ కర్బనం ఉన్న నేల
  • 0.75–1.00% – అధిక సేంద్రీయ కర్బనం ఉన్న నేల
  • 1.00% కంటే ఎక్కువ – అత్యంత అధిక సేంద్రీయ కర్బనం ఉన్న నేల
    సేంద్రీయ కర్బనం స్థాయి పెరుగుతున్న కొద్దీ నేల భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మెరుగుపడి, నేల ఆరోగ్యం మరియు పంటల ఉత్పాదకతకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి.

భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించిన 70 సంవత్సరాల సమాచారాన్ని పరిశీలిస్తే, నేలలో సేంద్రీయ కర్బనం స్థాయి 1.00% నుండి 0.30%కి పడిపోయినట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు:
• అధికంగా మరియు నిరంతరంగా సాగు చేయడం (Intensive cultivation)
• నీటిపారుదల ఆధారిత సాగు
• రసాయన ఎరువులపై అధికంగా ఆధారపడటం (అసమతుల్య పోషకాల నిర్వహణ)
• సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు, కంపోస్టు వినియోగం తగ్గడం
• పంట అవశేషాలను నేలలో కలపకుండా కాల్చివేయడం లేదా తొలగించడం

వ్యవసాయ నేలల్లో సేంద్రీయ కర్బనం క్షీణించే ధోరణి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో నేల సారం, ఉత్పాదకత గణనీయంగా తగ్గి, అనేక ప్రాంతాలు భూమి క్షీణత (Land degradation)కు గురయ్యే ప్రమాదం ఉంది. నేల సేంద్రీయ కర్బనాన్ని కోల్పోయినప్పుడు దాని భౌతిక, రసాయనిక మరియు జీవసంబంధ లక్షణాలు క్రమంగా దెబ్బతిని, నేల ఆరోగ్యం మరియు పంటల ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి, నేల ఆరోగ్య నిర్వహణలో సేంద్రీయ కర్బనం పరిమాణాన్ని పెంచడం అనేది నేల యాజమాన్య చర్యలన్నింటికంటే అత్యంత ముఖ్యమైనది.

నేలలో సేంద్రీయ కర్బనాన్ని పెంచే దిశగా చేపట్టవలసిన ప్రధాన చర్యలు:

  1. వ్యవసాయ భూమిని అవసరమైన మేరకే తేలికగా మరియు పరిమితంగా దున్నాలి, తద్వారా నేల నిర్మాణం మరియు సేంద్రీయ పదార్థం సంరక్షించబడతాయి.
  2. నేలను తరచుగా ప్రత్యక్ష సూర్యరశ్మికి గురికాకుండా చూడాలి, ఇందుకోసం పంట అవశేషాలు, కవర్‌ క్రాప్స్‌ లేదా ఇతర సహజ కవచాలను వినియోగించాలి.
  3. నేల ఉపరితలాన్ని సాధ్యమైనంత వరకు సేంద్రీయ అవశేషాలతో కప్పి ఉంచాలి (మల్చింగ్‌), తద్వారా నేల తేమ సంరక్షణతో పాటు సేంద్రీయ కర్బనం పెరుగుదలకు దోహదపడుతుంది.
  4. నేలలో సహజంగా జరిగే పోషక చక్రాలను ప్రోత్సహించాలి, తద్వారా పోషకాల పునర్వినియోగం మరియు నేల సారం సహజంగా కొనసాగుతుంది.
  5. పంటలు నేల నుంచి తీసుకునే పోషకాలను సకాలంలో తిరిగి అందిస్తూ, నేలలో పోషకాల సమతుల్యతను కాపాడాలి. ఇందుకోసం నేల పరీక్ష ఆధారిత సమగ్ర పోషక యాజమాన్యాన్ని అనుసరించాలి.
  6. నేల జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించాలి, తద్వారా ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు, వానపాములు మరియు ఇతర నేల జీవుల కార్యకలాపాలు మెరుగుపడతాయి.
  7. నేల కోతను మరియు అదుపులేని నీటి ప్రవాహాన్ని నివారించాలి, తద్వారా సేంద్రీయ కర్బనం సమృద్ధిగా ఉండే పైమట్టి నష్టాన్ని తగ్గించి, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చు.
  8. పచ్చిరొట్ట ఎరువుల సాగు (Green manuring) – జనుము, జీలుగు, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలను పెంచి పూత దశలో నేలలో కలపాలి.
  9. జీవ ఎరువుల వినియోగం – రైజోబియం, అజోస్పిరిల్లం, ఫాస్ఫేట్‌ సొల్యూబిలైజింగ్‌ బ్యాక్టీరియా (PSB), మైకోరైజా వంటి జీవ ఎరువులను అవసరానికి అనుగుణంగా ఉపయోగించాలి.
  10. మల్చింగ్‌ (Mulching) – పంట అవశేషాలు, గడ్డి, ఆకులు లేదా ఇతర సేంద్రియ పదార్థాలతో నేల ఉపరితలాన్ని కప్పడం ద్వారా తేమను సంరక్షించి, సేంద్రీయ పదార్థం చేరికను పెంచాలి.
  11. సమతుల్య పోషక యాజమాన్యం (Integrated Nutrient Management) – సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు మరియు రసాయన ఎరువులను నేల పరీక్ష ఆధారంగా సమతుల్యంగా వినియోగించి, నేల సేంద్రియ పదార్థం మరియు సూక్ష్మజీవుల కార్యకలాపాలను ప్రోత్సహించాలి.
  12. ప్రత్యామ్నాయ పంట పద్ధతులు: పలు కారణాల వల్ల నేలలో సేంద్రీయ కర్బనం తగ్గి ఎడారిగా మారుతోంది. ఇటువంటి సందర్భంలో వెంటనే నేలను సాంప్రదాయ వార్షిక పంటల నుండి మార్చి, తక్కువ నేలను కదిలించే మరియు ఎక్కువ వేరు వ్యవస్థ కలిగిన వృక్ష ఆధారిత వ్యవసాయానికి మారాలి. బహువార్షిక వృక్ష ఆధారిత వ్యవసాయంలో పెంచే పంటలు విస్తారమైన వేరు వ్యవస్థను కలిగి ఉండి, వార్షిక పంటలతో పోలిస్తే వాతావరణంలోని కర్బనాన్ని అధికంగా నేలలో స్థిరీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
    ఉదాహరణకు: 1. మెట్ట తోటల పెంపకం 2. వ్యవసాయ అటవీ పద్ధతులు 3. అటవీ పంటలు 4. బహువార్షిక మేత పంటలు మొదలైనవి.

బి. చంద్ర శేఖర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ (మృత్తికా శాస్త్రం) మరియు జి. సతీష్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ (స్టాటిస్టిక్స్), పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258

Read More

కూరగాయ పంటల్లో సత్ఫలితాలకు హెర్బల్ టీ

కావలసిన పదార్థాలు :
పిచ్చి తులసి లేదా తులసి, పాలకొడిస, తుత్తురు బెండ, పొగాకు, బోగన్ విల్లియా (కాగితం పూలు), వేప, టేకు ఆకులు, కలబంద, బొప్పాయి, ఆవు మూత్రం, పశువుల పేడ, బెల్లం

తయారు చేసే విధానం :

  • పైన తెలిపిన ఆకులను 5 కిలోలు తీసుకొని ముద్దగా చేయాలి.
  • ఈ మిశ్రమానికి 5 కిలోల పశువుల పేడను, 100 గ్రాముల బెల్లం పొడిని కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని ఒక కుండలో తీసుకొని ప్రతిరోజూ ఒక కర్రతో 7 రోజుల వరకూ కలుపుతూ ఉండాలి.
  • 7 రోజుల తర్వాత “హెర్బల్ టీ” తయారవుతుంది. ఈ మిశ్రమానికి 5 లీటర్ల నీరు కలిపి పలుచని గుడ్డతో వడపోయాలి.
  • ఈ మిశ్రమాన్ని 100 లీటర్ల నీటితో కలిపి ఒక ఎకరా పొలంలో పంటపై పిచికారి చేయాలి.

ఎలా పనిచేస్తుంది? : పైన తెలిపిన వివిధ రకాల ఆకులలో ఎన్నో రకాల “ఆల్కలాయిడ్లు” ఉండుట వలన పురుగుల నియంత్రణలోనే కాకుండా కొన్ని రకాల తెగుళ్ళను అరికట్టడంలోనూ ఉపయోగపడుతుంది.

ఉపయోగాలు : ఇది చాలా శక్తివంతమైన ద్రావణం. ఈ ద్రావణం పంటలలో వచ్చే కీటక నియంత్రణలోనే కాకుండా వరిలో వచ్చే ఆకుమచ్చ తెగులు నివారణలో కూడా బాగా పని చేసినట్లు రైతుల అనుభవం. ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోనూ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా కూరగాయల పంటలలో ఉపయోగించి సత్ఫలితాలు పొందవచ్చు.

Read More

“నేల గుణాన్ని బట్టి నిర్ధిష్టమైన పోషక యాజమాన్యం – ఆవశ్యకత, అవకాశాలు”

నేల ప్రకృతిలోని ప్రముఖ సహజమైన పునరుత్పాదక లేని వనరు (Non-renewable resources). రాళ్ళు, ఖనిజాలు విచ్ఛిత్తి చెందటంద్వారా ఒక అంగుళం నేల తయారవడానికి 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. ఆహారోత్పత్తికి, గ్రామీణ ప్రజల ఉపాధికి, పర్యావరణ సమతుల్యానికి ఆరోగ్యమైన నేల అత్యావశ్యకం. మనదేశంలో, రాష్ట్రంలో వివిధ రకాల నేలలున్నాయి, ఆయానేలల గుణాలు, లక్షణాలు నిర్ధిష్టమైనవి మరియు వాటిలో ఉత్పాదకత భిన్నగా ఉంటుంది.

వ్యవసాయ రంగం స్థిరంగా, లాభసాటిగా సాగాలంటే భూమి ఆరోగ్యం చాలా ముఖ్యం. రసాయన ఎరువులను విచక్షణారహితంగా వాడటం, నేల కోతను ప్రేరేపించే సాగుపద్దతుల వల్ల నేల క్షీణత జరుగుతుంది. ఇటీవలి కాలంలోని కొన్ని అధ్యయనాల నివేదికల ప్రకారం మనదేశంలోని సాగుకు యోగ్యమైన భూమిలో 50 శాతం వరకు క్షీణత సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో, నేల గుణాన్ని బట్టి నిర్ధిష్టమైన పోషక యాజమాన్యం (Site-Specific Nutrient Management – SSNM) చేపట్టడం అత్యంత ఆవశ్యకమైన పద్ధతిగా శాస్త్రవేత్తలు పరిగణించారు. పంటకు ఏ సమయంలో, ఎంత మొత్తంలో, ఏ రకమైన పోషకాలు కావాలో నేల స్వభావాన్ని బట్టి అందించడమే ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం.

నేల గుణాన్ని బట్టి నిర్ధిష్టమైన పోషక యాజమాన్యం చేపడితే నేల ఆరోగ్యం మరియు సారం సంరక్షింపబడి సుస్థిరమైన వ్యవసాయ దిగుబడులు సాధించవచ్చు.

  1. నేల రకాలు – వాటి సహజ గుణాలు
    మన రాష్ట్రంలో వివిధ రకాల నేలలు ఉన్నాయి. ఒక్కో నేలకు ఒక్కో రకమైన భౌతిక, రసాయన లక్షణాలు కల్గి పోషక సామర్థ్యంలో వ్యత్యాసం ఉంటుంది:

నల్ల రేగడి నేలలు: ఇవి నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కొంచెం క్షార లక్షణాన్ని కలిగివుంటాయి. వీటిలో పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉన్నప్పటికీ, నత్రజని (నెట్రోజన్), భాస్వరం (ఫాస్ఫరస్, జంకు, ఇనుము ధాతు లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఎర్ర నేలలు: ఇవి త్వరగా నీటిని పీల్చుకుంటాయి కానీ నిల్వ ఉంచలేవు. వీటిలో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సేంద్రియకర్బనం శాతం చాలా తక్కువగా ఉంటుంది.
ఇసుక / చల్కా నేలలు: పోషకాలను పట్టి ఉంచే గుణం వీటికి చాలా తక్కువ. సూక్ష్మపోషకాల లోపం (జింక్, ఇనుము) వీటిలో అధికం.

చౌడు నేలలు: తెల్ల చౌడు నేలల్లో లవణాల శాతం ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలు పోషకాలను గ్రహించలేవు. వీటికి ప్రత్యేక యాజమాన్యం అవసరం. నల్లచౌడు నేలల్లో ఉదజని సూచి 8.5 కంటే అధికంగా ఉండి మార్పిడిచెందే సోడియం అధికంగా 15 శాతం కంటే ఎక్కువ ఉంటుంది. ఈ నేలల భౌతిక లక్షణాలు మొక్కల పెరుగుదలకు అవరోధం కల్గిస్తాయి. నత్రజని, భాస్వరం, జం కు, ఇనుము, బోరాన్ వంటి పోషకాల లోపాలు అధికంగా ఉంటాయి.

ఒండ్రు నేలలు : ఈ నేలలు నదీ తీరాలలోనూ, నది సముద్రంలో కలిసే ప్రాంతంలోనూ విస్తరించి ఉంటాయి. ఇవి స్వభావ రీత్యా సారవంతమైన నేలలు. నేల భౌతిక లక్షణాలు కూడా సాగుకు అనుకూలం. ఈ నేలల్లో అధిక సాంద్ర పంటల సాగువల్ల సూక్ష్మ ధాతువులతో పాటు నత్రజని, భాస్వరం లోపాలు కనిపిస్తున్నాయి.

  1. నిర్ధిష్ట పోషక యాజమాన్యం అంటే ఏమిటి?
    సాధారణంగా రైతులు అందరికీ వర్తించే ఒకే రకమైన ఎరువుల సిఫార్సులను (Blanket Recommendations) పాటిస్తారు. కానీ, ఒకే పొలంలో ఒక వైపు ఉన్న నేల గుణానికి, మరోవైపు ఉన్న నేల గుణానికి తేడా ఉండవచ్చు. భూసార పరీక్షల ఆధారంగా, ఆయా నేలలో ఉన్న పోషకాల లభ్యతను బట్టి, పండించే పంట దిగుబడి లక్ష్యాన్ని బట్టి ఖచ్చితమైన మోతాదులో పోషకాలను అందించడాన్నే “నిర్దిష్టమైన పోషక యాజమాన్యం” అంటారు. ఇది ‘సరైన ఎరువు మోతాదు, సరైన సమయంలో ఎరువు వెయ్యడం, మరియు ఎరువును సరైన పద్ధతిలో వెయ్యడం’ (4Rs) అనే సూత్రంపై పనిచేస్తుంది.
  2. పోషక యాజమాన్యం
    భూసార పరీక్షలు (Soil Testing): ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి పొలంలో మట్టి నమూనాలను సేకరించి పరీక్షించాలి. దీనివల్ల నేల పి.హెచ్ (pH), విద్యుత్ వాహకత (EC), సేంద్రీయ కర్బనం మరియు ప్రధాన, సూక్ష్మ పోషకాల లభ్యత తెలుస్తుంది.

సేంద్రీయ ఎరువుల వాడకం: పశువుల ఎరువు, కంపోస్ట్ లేదా పచ్చిరొట్ట ఎరువులు (జీలుగ, జనుము) భూమిలో వేసి కలయదున్నాలి. ఇది నేల భౌతిక స్థితిని మెరుగుపరుస్తుంది. సిఫారసు చేసిన పోషకాలను అందించాలి.

ఆధునిక పరికరాల వాడకం: లీఫ్ కలర్ చార్ట్ (Leaf Color Chart – LCC), క్లోరోఫిల్ మీటర్ల ద్వారా పంట ఆకుల రంగును బట్టి లోపాన్ని గుర్తించి, అవసరమైన మేరకే పోషకాలను వాడవచ్చు.

  1. నేల గుణాన్ని బట్టి తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు

ఆమ్ల నేలలు (Acid Soils): పి.హెచ్ 6.5 కంటే తక్కువ ఉన్న నేలల్లో సున్నం ఎరువు వాడి నేల స్వభావాన్ని మార్చాలి. భూసార పరీక్ష చేయిస్తే ఎకరాకు ఎంత సున్నం కావాలో పరీక్షించి చెప్తారు. కట్టెజనుము వంటి పచ్చిరొట్ట పైరు సాగుచేసి పైరుపూతదశలో నేలలో కలియదున్నాలి.

క్షార/చౌడు నేలలు (Saline/Alkaline Soils): పి.హెచ్ 8.5 కంటే ఎక్కువ ఉన్న చౌడు నేలల్లో జిప్సం వేసి నెలలో కలియదున్ని బాగు చేయాలి. భూసార పరీక్ష చేయిస్తే ఎకరాకు ఎంత జిప్సం ఎరువు కావాలో పరీక్షించి చెప్తారు. మురుగునీటి నిల్వలను బయటకు పంపే డ్రైనేజీ వసతి కల్పించాలి. ధయించా వంటి పచ్చిరొట్ట పైరు సాగుచేసి పైరుపూతదశలో నేలలో కలియదున్నాలి.

తేలికపాటి నేలలు: ఇసుక శాతం ఎక్కువ ఉన్న నేలల్లో ఎరువులు కడిగిపోతాయి (Leaching). కాబట్టి ఎరువులను ఎక్కువ విడతలుగా, తక్కువ మోతాదులో ఇవ్వాలి. వేసవిలో ఎకరాకు 20 టన్నుల చొప్పున చెరువు లోపలి మట్టిని తోలాలి. సేంద్రీయ ఎరువులని అధికంగా వాడాలి.

  1. ఈ నిర్ధిష్ట పోషక యాజమాన్యం పద్ధతి వల్ల కలిగే ప్రయోజనాలు
    నేల గుణగణాలు ముందే తెలుస్తాయి: భూసార పరీక్ష వల్ల నేల గుణగణాలు ముందే తెలుస్తాయి కాబట్టి అవసరమైన యాజమాన్య చర్యలు తీసుకొనే వీలుంటుంది.

పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది: అనవసరమైన ఎరువుల వాడకం తగ్గి, రైతుకు డబ్బు ఆదా అవుతుంది.

నాణ్యమైన, అధిక దిగుబడి: మొక్కకు కావాల్సిన పోషకాలు సరైన సమయంలో అందడం వల్ల పంట ఆరోగ్యంగా పెరిగి ఆశించిన దిగుబడి వస్తుంది.

*నేల ఆరోగ్యం రక్షణ: రసాయనాల అవశేషాలు పేరుకుపోకుండా నేల జీవశక్తి, మిత్ర పురుగులు (వానపాములు వంటివి) సంరక్షించబడతాయి.

పర్యావరణ సమతుల్యత: భూగర్భ జలాలు కలుషితం కాకుండా, పర్యావరణానికి మేలు జరుగుతుంది.
నేల గుణాన్ని బట్టి నిర్ధిష్టమైన పోషక యాజమాన్యాన్ని చేపట్టడం అనేది ఆధునిక వ్యవసాయంలో ఒక విప్లవాత్మక అడుగు. “ఆరోగ్యకరమైన నేల – ఆరోగ్యకరమైన పంట – సంపన్నమైన రైతు” అనే నినాదంతో ప్రతి రైతు తమ పొలంలో భూసార పరీక్షలు చేయించి, లభించిన నివేదికల ఆధారంగానే పోషకాలను అందించాలి. ఇది వసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా, రాబోయే తరాలకు సారవంతమైన భూములను అందించడానికి దోహదపడుతుంది.

అనీల్ కుమార్ కీర్తి, పి. గురుమూర్తి, టి. మౌనిక
వ్యవసాయ కళాశాల బాపట్ల మరియు నైరా
Ph: 9491567949

Read More

ఔషధ మొక్క… జీలకర్ర / జీరా

జీలకర్ర క్యుమినం సైమినం మొక్క యొక్క ఎండబెట్టిన గింజలు. ఈ మొక్క 30-35 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. జీలకర్ర ఒక పుష్పించే మొక్క. ఇది ఒక వార్షిక హెర్బల్ మొక్క. కాండం నుండి సన్నని కొమ్మలు వస్తాయి. కాండం 20-30 సెం.మీ. పొడవు, 3-5 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటుంది. ప్రతి కొమ్మ 2-3 ఉపకొమ్మలు కలిగి ఉంటుంది. అన్ని కొమ్మలు ఒకే ఎత్తుకు పెరుగుతాయి కనుక మొక్క ఒకే విధమైన క్యానపి కలిగి ఉంటుంది. కాండం బూడిద వర్ణం లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకులు 5-10 సెం.మీ. పొడవుండి దారం వంటి చిన్న ఆకులు కలిగి ఉంటుంది. పూలు చిన్నవిగా, తెలుపు లేదా పింకు రంగులో ఉంటాయి. కాయ 4-5 మి.మీ. పొడవుండి రెండు మీసోకార్ప్‌లను కలిగి ఉంటుంది. ప్రతి మీసోకార్ప్‌లో ఒక గింజ ఉంటుంది. జీలకర్ర గింజలకు 8 నిలువాటి బోదెలుంటాయి. ఇవి పసుపుగోధుమ రంగులో ఉంటాయి.

సాధారణ నామం : క్యూమిన్ శాస్త్రీయ నామం : క్యూమినం సైమినం కుటుంబం: ఎపియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • జీలకన్రు పురాతన కాలం నుండి ఆహారం రుచి పెంచడానికి, ఔషధ ప్రయోజనాలకు, అనేక సంప్రదాయ వంటిళ్లలో ఉపయోగిస్తున్నారు. దీనికి జీర్ణశక్తిని పెంచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, మొలలు, ఆస్త్మా, బ్రోంకైటిస్ చికిత్స వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కల్గించే గుణం ఉంది.
  • దీనిని భోజనానికి ముందు ఆకలి పెరగడానికి (అపెటైజర్‌గా) ఉపయోగిస్తారు.
  • మజ్జిగ, కొన్ని నూనె చుక్కల మిశ్రమాన్ని జీలకర్రతో కలిపి వేయిస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. దీనిని సాధారణంగా సుగంధ ద్రవ్యాలు, నూనె అధికంగా ఉపయోగించిన ఆహారం తిన్న తర్వాత తీసుకుంటారు.
  • భోజనానికి ముందు వేడి నీటిలో 2 చెంచాల జీలకర్రను కలిపి త్రాగితే తీవ్ర అజీర్తి నయమవుతుంది.
  • 2 గ్రా. జీలకర్రను కొతిమీర రసం, యాలకులు, ఉప్పుతో కలిపి తీసుకుంటే ఎసిడిటి, హైపర్ ఎసిడిటి, కడుపులో మంటలు, గ్యాస్ సమస్యలకు మంచి ఫలితాలు లభిస్తాయి. భోజనానికి ముందు కొంచెం జీలకర్ర నమిలితే నోటి దుర్వాసనకి అద్భుత ఫలితాలనిస్తుంది.
  • మలబద్ధకం, కడుపులో నులిపురుగులు, జ్వరంతో బాధపడేవారు వేడి నీటిలో ఒక చెంచా జీలకర్ర కలిపి రోజుకి 3-4 సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
  • పురుగులు కాటు వేసిన చోట జీలకర్ర, నెయ్యి పేస్టు పూస్తే బాధ తగ్గుతుంది. దీనిని అన్ని వంటకాలలో ఉపయోగిస్తారు. నోటి దుర్వాసన పోవడానికి జీలకర్ర రసం నోటిలో పోసుకొని పుక్కిలించాలి. బాలింతరాళ్ళకు జీలకర్ర ఇస్తే గర్భాశయం శుభ్రపరచబడి, పాల ఉత్పత్తి పెరుగుతుంది.

వ్యవసాయరంగంలో

  • జీలకర్ర ఎసెన్షియల్ ఆయిల్ (1.25%) పేనుబంక, రైపిసెఫాలస్ మైక్రోప్లస్‌పై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (మార్టినెజ్‌వెలాజ్‌క్వెజ్, అతని అనుచరులు, 2011).
  • జీలకర్ర ఎసెన్షియల్ ఆయిల్ పేనుబంక నాశక చర్యను ప్రదర్శించింది (టుని అండ్ సాహిన్‌కయ, 1998).
  • ఎండిన జీలకర్ర గింజల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ నీటి ద్రావణం (6.25-1000 పిపియం) ఈడెస్ ఈజిప్టి దోమ 2వ దశ లార్వాలను అతి సమర్ధవంతంగా నివారించింది (పురోహిత్, అతని అనుచరులు, 1983).
  • జీలకర్రను జీవ పురుగు మందు తయారీలో ఉపయోగిస్తారు. ఈ జీవ పురుగు మందుని పాటింగ్ మట్టితో కలిపి, పంటపై చల్లి పురుగులను 72 గంటలలో చంపవచ్చు.

జీవ పురుగు మందు తయారీకి కావలసిన పదార్థాలు :
పాటింగ్ మట్టిలో కలిపే ఫార్ములేషన్
సుగంధ ద్రవ్యం శాతం సుగంధ ద్రవ్యం శాతం
నల్ల మిరియాలు 25.75 జీలకర్ర 15.45
దాల్చిన చెక్క 11.05 వెల్లుల్లి 12.03
ధనియాలు 12.80 పసుపు 7.44
సోపు 2.37 మెంతి 3.65
లవంగం 2.58 మిరప 1.38
అల్లం 3.36 కరివేపాకు 1.60
ఆవాలు 0.37 సోడియం క్లోరైడ్ 0.17

ఈ జీవ పురుగుమందుని పాటింగ్ మట్టిలో కలపాలి. ఇది 72 గంటలలో పురుగులను చంపుతుంది.
పంటపై చల్లే పురుగు మందు ఫార్ములేషన్

సుగంధ ద్రవ్యం	శాతం	సుగంధ ద్రవ్యం	శాతం
నల్లమిరియాలు	20-30	జీలకర్ర	10-20
దాల్ౘ్ిన చెక్క	5-15	వెల్లుల్లి	5-20
ధనియాలు	5-20	పసుపు	3-15
సోపు	0.01-10	లవంగం	0.01-10
మిరప	0.01-10	అల్లం	0.01-10
కరివేపాకు	0.01-5	ఆవాలు	0.01-5
  • పైన పేర్కొన్న పదార్థాలన్నీ పొడి రూపంలో ఉంటాయి. ఈ జీవ పురుగు మందుని పొడి రూపంలో చదరపు మీటరుకి 100-500 గ్రా. పొడిని చల్లాలి (డోటి, 2012).
  • జీలకర్ర ఎసెన్షియల్ ఆయిల్ ప్రత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, ఆలుగడ్డ, టమాట పంటలకు తీవ్ర నష్టం కలిగించే నల్ల లద్దె పురుగు అగ్రోటిస్ ఇప్సిలాన్‌పై ఉదర, స్పర్శ చర్యలను ప్రదర్శించింది
  • అనేక యాంటి బయాటిక్స్‌ని తట్టుకునే క్ౙాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ పలు కూరగాయల పంటల్లో తీవ్ర నష్టం కలిగిస్తుంది. యాలకలు, పసుపు, అల్లం, జీలకర్ర, లవంగం, పాప్పిగింజలు, ఫెనెల్, ఆవాలు, వెల్లుల్లి, మిరియాలు, మెంతులు, దాల్చిన చెక్క, ఇంగువ, ధనియాల నీటి ద్రావణాలు విడివిడిగా, 26 కలిపిన ద్రావణాలు ఈ బాక్టీరియం పెరుగుదల నరికట్టాయి (డిబ్రిట్టో, అతని అనుచరులు, 2011). అన్ని సుగంధ ద్రవ్యాలను కలిపిన ద్రావణం అత్యంత సమర్ధవంతంగా ఈ బాక్టీరియం పెరుగుదల నరికట్టింది.
  • జీలకర్ర, ఇతర సుగంధ ద్రవ్యాలు అపరాల గింజలను పల్స్ బీటిల్, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ వల్ల నష్టపోకుండా కాపాడాయి (మహ్ది, అతని అనుచరులు, 2008; ఇస్లాని, అతని అనుచరులు, 2013).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఎల్‌నినో నేపథ్యం లో ఉత్తర కోస్తా జిల్లాలలో ఖరీఫ్ సాగు పరిస్థితి రబీ పంటల ప్రణాళిక మరియు ఉద్యాన పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే ఒక వాతావరణ పరిణామం. ఈ సముద్ర ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు ప్రపంచంలోని అనేక ప్రాంతాల వాతావరణంపై ప్రభావం చూపుతాయి. మన భారతదేశంలో ఎల్‌నినో పరిస్థితుల వల్ల నైరుతి రుతుపవనాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ఎల్నినో ప్రభావం వల్ల విఫలమై సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యి ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.

ఉత్తరకోస్తా జిల్లాలలో నైరుతి రుతుపవనాలు పై ఎల్‌నినో ప్రభావం
2026 జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నమోదైన వర్షపాతం పరిస్థితిని గమనించినట్లయితే అనకాపల్లి జిల్లాలో, ఖరీఫ్ సాధారణ వర్షపాతం 479.6 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 229.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యి సాధారణంతో పోలిస్తే 52.2 శాతం లోటు నమోదు అయ్యింది. విశాఖపట్నం జిల్లాలో, సాధారణ వర్షపాతం 427 మిల్లీమీటర్లు కాగా, వాస్తవ వర్షపాతం 175.7 మిల్లీమీటర్లు నమోదు అయ్యి 58.9 శాతం లోటు లో ఉంది. విజయనగరం జిల్లాలో, సాధారణ వర్షపాతం 484.4 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 288.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 40.4 శాతం లోటు ఉంది. శ్రీ కాకుళం జిల్లాలో, సాధారణ వర్షపాతం 503 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 293.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 41.7 శాతం లోటు ఉంది. ఈ లోటు వర్షపాతం వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గి పోవడమే కాక సాగులో ఉన్న పంటల దిగుబడులపై ప్రభావం చూపనుంది. ఎల్నినో ప్రభావం వల్ల అనకాపల్లి జిల్లాలో 26,434 హెక్టార్లు, విశాఖపట్నం జిల్లాలో 2,586 హెక్టార్లు. విజయనగరం జిల్లాలో 24,289 హె . విస్తీర్ణం ఖాళీగా సాగు కాకుండా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇతర నీటి వనరులు ఉండడం వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం అంతగా తగ్గలేదు.

  సెప్టెంబర్ మాసము లో బంగాళాఖాతం లో తీవ్ర అల్పపీడనం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలలో మంచి వర్షపాతం నమోదు అయ్యి రబీ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అల్పపీడనం వల్ల అనకాపల్లి జిల్లాలో 310.4 మి.మీ, విశాఖపట్నం జిల్లాలో 363.8 మి.మీ, విజయనగరం జిల్లాలో 288.4 మి.మీ అలాగే శ్రీకాకుళం జిల్లాలో 330.5 వర్షపాతం నమోదు అయ్యింది. భూగర్భజలమట్టం కూడా పెరగడం రబీ సాగుకు చాలా అనుకూలంగా ఉంది. నీటిలభ్యతను బట్టి రబీ పంటల ప్రణాళికను రూపొందించుకోవాలి.

ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లోని మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం ఆర్ధిక శాస్త్రవేత్తలు రాబోయే కాలం లో ఏ ఏ పంటలకు మార్కెట్ డిమాండ్ ఉంటుందో ముందుగానే తెలియజేస్తారు. మొక్కజొన్న: ప్రస్తుత ధర క్వింటాల్ రూ. 2,580. అదే జనవరి 2027: రూ. 3,080-3,388. ఫిబ్రవరి 2027 రూ. 3,190-3,445 వరకు ఉండవచ్చును. ఈ విధంగా అన్ని పంటలకు ప్రస్తుత మార్కెట్ ధర రాబోయే కాలంలో మార్కెట్ ధర ముందుగానే రైతులు తెలుసుకోవచ్చు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకొని రబీ పంటల ప్రణాలళికను రూపొందించుకోవాలి.

ఉత్తర కోస్తా జిల్లాల రబీ పంటల ప్రణాళిక
ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా అన్ని అంశాలను పరిగణ లోనికి తీసుకొని రబీ పంటల ప్రణాలళికను రూపొందించడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 73,376 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది. వరి – 6,929 హెక్టార్లలో సాగు చేయనున్నారు. అలాగే మిగిలిన విస్తీర్ణంలోఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి , పప్పుదినుసు పంటలైన పెసర , మినుము వేరుశనగ, చెరకు, ఉలవలు, నువ్వులు, పొద్దుతిరుగుడు మరియు జీలుగ పంటలను సిఫారసు చేయడం జరిగింది.

అలాగే విజయనగరం జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 69030 హెక్టార్లు కాగా, రబీ 2026–27లో సుమారు 1,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, రాగి, ఉలవలు పప్పుదినుసు పంటలైన పెసర, మినుము శనగ, వేరుశనగ, చెరకు, నువ్వులు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

విశాఖపట్నం జిల్లాలో రబీ 2026–27 సీజన్‌కు సంబంధించి విశాఖపట్నం జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 3125 హెక్టార్లు. 596 హెక్టార్లలో వరి మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి, ఉలవలు పప్పుదినుసు పంటలైన పెసర, మినుము, వేరుశనగ, చెరకు, నువ్వులు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

అనకాపల్లి జిల్లాలో రబీ 2026–27 సీజన్‌కు సంబంధించి జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 22,689 హెక్టార్లు. 3200 హెక్టార్లలో వరిమిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి, ఉలవలు, అలసందలు, పప్పుదినుసు పంటలైన పెసర, మినుము, వేరుశనగ, చెరకు, నువ్వులు, పొద్దుతిరుగుడు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

రకాల ఎంపిక మరియు విత్తన లభ్యత
వరి లో స్వల్పకాలిక రకాలైన NLR-3449, MTU-1064, MTU-1061, MTU-1121 మరియు RNR-15048
మొక్కజొన్న లోమార్కెట్ లో దొరికే ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను ఉపయోగించవచ్చు.
రాగి: వేగావతి, ఇంద్రావతి మరియు శ్రీ చైతన్య.
పెసర: ఎల్.జి.జి-630, ఎల్.జి.జి -607, ఎల్.జి.జి -574, టి.ఎం.-96-2 మరియు ఐ.పి.ఎం.-2-14
మినుము: ఎల్.బి.జి-904, టి.బి.జి-129, ఎల్.బి.జి-884, జి.బి.జి-1, టి.బి.జి-104, ఎల్.బి.జి-752 మరియు పి.యు-31.
ఉలవలు: ఎ.టి.పి-11 మరియు వి.జెడ్.ఎమ్-1.
అలసంద: రకాలు ఆర్కా సమృద్ధి, ఆర్కా మంగళ మరియు ఆర్కా అర్జున్
వేరుశెనగ: రకాలు టి.జి.సి.ఎస్. 1694 మరియు కె.-6.
నువ్వులు: రకాలు వై.ఎల్.ఎమ్ -66 మరియు వై.ఎల్.ఎమ్ -146.
పొద్దుతిరుగుడు: ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను ఉపయోగించవచ్చు.
జనుము: ఎస్.హెచ్-4, సువిన్

రబీ పంటల సాగుకు అవసరమైన విత్తనాల్లో కొంతమేర రైతుల వద్దనే అందుబాటులో ఉన్న సొంత విత్తనాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా పప్పుధాన్యాలు, నువ్వులు, రాగి, చెరకు పంటల్లో రైతుల వద్ద సుమారు 30 శాతం వరకు సొంత విత్తనం అందుబాటులో ఉంటుంది

మిగిలిన నాణ్యమైన విత్తనాలను ఏపీ సీడ్స్, విజయనగరం, కృషి విజ్ఞాన కేంద్రం, ఆముదాలవలస, వ్యవసాయ పరిశోధనా కేంద్రం రాగోలు, వ్యవసాయ కళాశాల నైరా, వ్యవసాయ పరిశోధనా కేంద్రం యలమంచిలి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అనకాపల్లి మరియు ఇతర ANGRAU విత్తన విక్రయ కేంద్రాల ద్వారా పొందవచ్చు.

రబీ పంటలు విత్తే కాలం
రబీ పంటల సాగులో సరైన సమయంలో విత్తనాలు విత్తడం చాలా ముఖ్యమైన విషయం. పంటను బట్టి అనుకూలమైన విత్తే సమయం మారుతుంది. కాబట్టి రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో విత్తడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు.

మొక్కజొన్న అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. జొన్న పంటను అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు. రాగి పంటకు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విత్తే సమయం అనుకూలంగా ఉంటుంది. పెసర మరియు మినుము పంటలను అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు. శనగ పంటను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. ఉలవ పంటకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తే సమయం అనుకూలంగా ఉంటుంది. వేరుశనగ పంటను నవంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. అలాగే జనుము పంటను అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు.

పప్పుదినుసు పంటలైన మినుము పెసర సాగు చేసినప్పుడు పూత మరియు కాయ దశలో ఒక తేలికపాటి తడిని ఇవ్వవలిసి ఉంటుంది. బరువు నేలలలో అయితే మినుము తేలికపాటి నేలలలో అయితే పెసర పంటను వేసుకోవడంమంచిది.

జనుము పంటను రబీ కాలంలో విత్తనోత్పత్తి కోసం రైతులు సాగు చేస్తారు. అయితే జనుము పంటను లోతట్టు ప్రాంతాలలో వెయ్యకూడదు. తేమ ఎక్కువ అయితే జనుము పంట తట్టుకోలేదు. అలాగే కాయ దశలో పురుగు ఆశించే అవకాశం ఉన్నందున పంటను పరిశీలిస్తూ తగిన సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి.

ఎల్‌నినో నేపథ్యంలో ఉధ్యాన వన తోట పంటలలో సూచనలు
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ, సెప్టెంబరు నెలలో కురిసిన వర్షాలతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భూగర్భజల లభ్యత కొంత మెరుగుపడింది. ఈ పరిస్థితులను బట్టి రైతులు తమ వద్ద ఉన్న నీటి వనరులను అంచనా వేసుకొని టమాటా, మిరప, వంకాయ, బెండ, ఉల్లి వంటి కూరగాయలను సాగు చేసుకోవచ్చు. పంటను ఎంచుకునేటప్పుడు నీటి అవసరంతో పాటు స్థానికంగా ఉన్న మార్కెట్‌ డిమాండ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కూరగాయల సాగుకు మంచి నాణ్యత కలిగిన నారును ఉపయోగించడం వల్ల పంట ప్రారంభ దశలోనే మంచి మొక్కల పెరుగుదల సాధ్యమవుతుంది. నర్సరీలను నీరు నిల్వ ఉండని ప్రదేశాల్లో ఏర్పాటు చేసి, అవసరమైనంత తేమను మాత్రమే అందిస్తూ, తెగుళ్లు మరియు వ్యాధుల లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించాలి.

మామిడి, జీడి, కొబ్బరి, అరటి వంటి పండ్ల తోటల్లో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. బిందు సేద్యం, చెట్ల చుట్టూ మల్చింగ్‌ చేయడం వంటి పద్ధతులతో నేలలో తేమను నిలుపుకోవడంతో పాటు నీటి వృథాను తగ్గించవచ్చు. ముఖ్యంగా పూత, పిందె దశల్లో నీటి కొరత రాకుండా చూసుకోవాలి. తోటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ తెగుళ్లు, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే మంచి దిగుబడితో పాటు రైతులకు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

*డా .వి .గౌరి, డా.ఎన్.రాజ్ కుమార్, *డా.ఎ.అలివేణి, *డా.ఎన్.భారతి, డా.ఎం.బి.జి.ఎస్.కుమారి, డా.కె.లక్ష్మణ, డా. కె.భాగ్యలక్ష్మి మరియు *డా. సి.హెచ్.ముకుందరావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లి, ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, Ph: 6304852859, 8074670166

Read More

వండని వంట… ఆరోగ్యకరమైన చాక్లెట్

కావాల్సిన పదార్థాలు

  • కోకో పౌడర్ (తీపి లేనిది) – అరకప్పు
  • తినే కొబ్బరి నూనె – అర కప్పు
  • పొడి బెల్లం – అర కప్పు
  • జీడి పప్పు పలుకులు – 1½ టేబుల్ స్పూను
  • ఎండు ద్రాక్ష పలుకులు – 1 ½ టేబుల్ స్పూన్

తయారుచేయు విధానం: కోకో పౌడర్, బెల్లం పొడి మరియు కొబ్బరి నూనెను బ్లెండర్ లేదా మిక్సీజార్‌లో వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమానికి జీడి పప్పు మరియు ఎండు ద్రాక్ష పలుకులు వేసి, చాక్లెట్ మౌల్డ్‌లో పోసి రెండు గంటల పాటు ఫ్రిడ్ౙ్‌లో పెట్టాలి.

గమనికః కొబ్బరి నూనె వద్దు అనుకున్నవారు ఉప్పు లేని వెన్నను కరగబెట్టి వాడుకోవచ్చు. జీడిపప్పు మరియు ఎండు ద్రాక్ష బదులుగా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్ వాడుకోవచ్చు.

రచన: విజయలక్ష్మి గిరినాథం, బెంగళూరు, కర్నాటక

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

డైరీ పశువులలో లూజ్ హౌసింగ్ సిస్టమ్ విధానం (Loose Housing System)

పరిచయం
పాడి పశువుల పెంపకంలో సరైన గృహ వసతి లేదా పశువుల షెడ్ చాలా ముఖ్యమైనది. పశువులకు మంచి గాలి, సరైన నీడ, పరిశుభ్రమైన నేల, స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటే అవి ఆరోగ్యంగా ఉండి మంచి పాల ఉత్పత్తిని ఇస్తాయి. పశువులను ఎల్లప్పుడూ ఒకే చోట కట్టివేయకుండా, వాటికి స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించే విధానాన్ని లూజ్ హౌసింగ్ సిస్టమ్ లేదా స్వేచ్ఛా గృహ విధానం అంటారు.

ఈ విధానంలో పశువులను సాధారణంగా ఒక పెద్ద ప్రదేశంలో స్వేచ్ఛగా ఉంచుతారు. పశువులకు విశ్రాంతి తీసుకోవడానికి కప్పు ఉన్న ప్రదేశం, బయట తిరగడానికి ఓపెన్ యార్డ్, మేత మరియు నీరు తీసుకోవడానికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు.

లూజ్ హౌసింగ్ సిస్టమ్ అంటే ఏమిటి?
లూజ్ హౌసింగ్ విధానంలో పశువులను వ్యక్తిగతంగా రోజంతా కట్టివేయరు. ఒకే వయస్సు లేదా ఒకే రకమైన పశువులను ఒక సమూహంగా ఉంచుతారు. పశువులు తమకు ఇష్టమైన విధంగా షెడ్‌లో లేదా బయట ఉన్న ఓపెన్ ప్రదేశంలో తిరగవచ్చు. వర్షం, ఎండ, చలి నుండి రక్షణ కోసం ఒక భాగంలో కప్పు ఏర్పాటు చేస్తారు. మిగిలిన భాగాన్ని ఓపెన్ యార్డ్‌గా ఉంచుతారు.

ఈ విధానం ముఖ్యంగా క్రింది పశువులకు అనుకూలంగా ఉంటుంది:
• పాలిచ్చే ఆవులు మరియు గేదెలు
• గర్భిణీ పశువులు
• ఎదుగుతున్న దూడలు
• హీఫర్లు
• పొడి పశువులు
అయితే పాల ఉత్పత్తి, వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితిని బట్టి పశువులను వేర్వేరు సమూహాలుగా ఉంచడం మంచిది.

లూజ్ హౌసింగ్ షెడ్‌లో ఉండవలసిన ముఖ్యమైన భాగాలు

  1. కప్పు ఉన్న ప్రదేశం
    పశువులు ఎండ, వర్షం మరియు చలి నుండి రక్షణ పొందడానికి కప్పు ఉన్న ప్రదేశం అవసరం. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పశువులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాయి.
    షెడ్‌లో:
    • తగినంత గాలి ప్రసరణ ఉండాలి.
    • పైకప్పు ఎత్తుగా ఉండాలి.
    • లోపల వేడి ఎక్కువగా ఉండకూడదు.
    • వర్షపు నీరు లోపలికి రాకుండా చూడాలి.
    • నేల పొడిగా మరియు పరిశుభ్రంగా ఉండాలి.
  2. ఓపెన్ యార్డ్
    కప్పు ఉన్న ప్రదేశం ముందు లేదా పక్కన పశువులు స్వేచ్ఛగా తిరగడానికి ఓపెన్ యార్డ్ ఏర్పాటు చేయాలి.
    ఈ ప్రదేశంలో పశువులు:
    • స్వేచ్ఛగా తిరుగుతాయి.
    • ఎండలో నిలబడతాయి.
    • ఒకదానితో ఒకటి సహజంగా కలుస్తాయి.
    • వ్యాయామం పొందుతాయి.
    ఓపెన్ యార్డ్‌లో నీరు నిల్వ ఉండకుండా సరైన డ్రైనేజీ ఉండాలి. వర్షాకాలంలో బురద ఏర్పడకుండా నేలను సక్రమంగా నిర్వహించాలి.
  3. మేత తొట్టి
    పశువులకు పచ్చిమేత, పొడి మేత మరియు దాణా అందించడానికి సరైన మేత తొట్లను ఏర్పాటు చేయాలి.
    మేత తొట్టి:
    • శుభ్రంగా ఉండాలి.
    • పశువులకు సులభంగా అందుబాటులో ఉండాలి.
    • మేత వృథా కాకుండా నిర్మించాలి.
    • ఒక పశువుకు తగినంత స్థలం ఉండాలి.
    దాణా తొట్టి నిర్మాణానికి అవసరమైన కొలతలు
    అంశం శాస్త్రీయ కొలత
    • దాణా తొట్టి వెడల్పు 0.6–0.75 m
    • దాణా తొట్టి లోతు 0.4–0.5 m
    • ఒక్క పశువుకు దాణా స్థలం 0.6–0.75 m
    • నీటి తొట్టి అంచు ఎత్తు సుమారు 0.5–0.6 m
    • ప్రతి పశువుకు కనీసం 60–75 సెం.మీ. దాణా స్థలం కల్పించడం మంచిది.
    పశువులు మేత కోసం పోటీ పడకుండా తగినంత పొడవు ఉన్న ఫీడింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం.
  4. నీటి సదుపాయం
    పాడి పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండాలి. ప్రత్యేకంగా పాలిచ్చే పశువులు ఎక్కువ నీరు తాగుతాయి. కాబట్టి నీటి తొట్టిని:
    • ప్రతిరోజూ శుభ్రం చేయాలి.
    • ఎల్లప్పుడూ నీటితో నింపి ఉంచాలి.
    • పశువులు సులభంగా చేరుకునే ప్రదేశంలో ఏర్పాటు చేయాలి.
    వేసవికాలంలో చల్లని మరియు పరిశుభ్రమైన నీరు అందించడం మరింత ముఖ్యం.

లూజ్ హౌసింగ్ సిస్టమ్‌లో పశువులకు అవసరమైన స్థలం
పశువుల సంఖ్యను బట్టి సరైన స్థలం ఏర్పాటు చేయాలి. చాలా తక్కువ ప్రదేశంలో ఎక్కువ పశువులను ఉంచకూడదు. ఇలా చేస్తే పశువుల మధ్య పోటీ, కొట్లాటలు మరియు వ్యాధుల సమస్యలు పెరుగుతాయి.
సాధారణంగా ఒక పెద్ద పశువుకు:
• విశ్రాంతి కోసం కప్పు ఉన్న స్థలం అవసరం.
• స్వేచ్ఛగా తిరగడానికి ఓపెన్ ప్రదేశం అవసరం.
పశువుల జాతి, పరిమాణం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి స్థల అవసరం మారుతుంది.
చిన్న దూడలు, పెద్ద పశువులు మరియు గర్భిణీ పశువులను ఒకే సమూహంలో ఉంచకుండా వేర్వేరుగా ఉంచడం మంచిది.

షెడ్ దిశ: సాధారణంగా షెడ్‌ను తూర్పు–పడమర దిశలో ఏర్పాటు చేయడం మంచిది. దీనివల్ల వేసవిలో నేరుగా పడే సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. అయితే స్థానిక గాలి దిశ, భూమి పరిస్థితి మరియు నీటి పారుదల కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

నేల నిర్మాణం
• నేల గట్టిగా, జారిపోని విధంగా ఉండాలి.
• కాంక్రీట్ ఫ్లోర్ అయితే పశువులు జారకుండా రఫ్ ఫినిష్ ఇవ్వాలి.
• మూత్రం, నీరు నిల్వ ఉండకుండా స్వల్ప వాలు ఉండాలి.
• నేల ఎప్పుడూ తడిగా ఉండకుండా చూడాలి.
• తడి, జారుడు నేల వల్ల కాళ్ల వ్యాధులు, లేమినెస్ మరియు గాయాలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
షెడ్ నిర్మాణానికి అవసరమైన కొలతలు
అంశం శాస్త్రీయ కొలత
ఒక వయోజన ఆవు/గేదెకు మొత్తం స్థలం 3.5–4.5 m²
కప్పబడిన విశ్రాంతి స్థలం 3.0–3.5 m²/పశువు
ఓపెన్ వ్యాయామ ప్రదేశం 7–10 m²/పశువు
షెడ్ వెడల్పు 8–12 m
పశువుల షెడ్ పొడవు అవసరానికి అనుగుణంగా
షెడ్ ఎత్తు (ఈవ్స్ వద్ద) 3–4 m
పైకప్పు మధ్య ఎత్తు 4–5 m
దాణా తొట్టి వెడల్పు 0.6–0.75 m
దాణా తొట్టి లోతు 0.4–0.5 m
ఒక్క పశువుకు దాణా స్థలం 0.6–0.75 m
నీటి తొట్టి అంచు ఎత్తు సుమారు 0.5–0.6 m
ఫ్లోర్ వాలుదనం 1:40–1:60
షెడ్ చుట్టూ డ్రైనేజీ మంచి నీటి పారుదల తప్పనిసరి

గమనిక: జాతి, పశువు పరిమాణం, వాతావరణం మరియు నిర్వహణ విధానాన్ని బట్టి కొలతల్లో స్వల్ప మార్పులు చేయవచ్చు.

లూజ్ హౌసింగ్ విధానం యొక్క ప్రయోజనాలు

  1. పశువులకు స్వేచ్ఛ : ఈ విధానంలో పశువులను ఎల్లప్పుడూ కట్టివేయరు. అందువల్ల అవి స్వేచ్ఛగా తిరగగలవు. సహజంగా నడవడం వల్ల పశువులకు మంచి వ్యాయామం లభిస్తుంది.
  2. పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది: స్వేచ్ఛగా తిరగడం వల్ల పశువుల రక్త ప్రసరణ మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పశువులు ఎక్కువ సమయం ఒకే చోట నిలబడాల్సిన అవసరం ఉండదు. సరైన పరిశుభ్రత మరియు నిర్వహణ ఉంటే అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చు.
  3. వేడి ఒత్తిడి తగ్గుతుంది: మన దేశంలో వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు పశువులపై ప్రభావం చూపుతాయి. లూజ్ హౌసింగ్ షెడ్‌లో మంచి గాలి ప్రసరణ ఉంటే పశువులకు వేడి ఒత్తిడి తగ్గుతుంది.
    అవసరమైతే:
    • ఫ్యాన్లు
    • ఫాగర్లు లేదా స్ప్రింక్లర్లు
    • మంచి నీడ
    వంటి సదుపాయాలు ఏర్పాటు చేయవచ్చు.
  4. పశువుల ప్రవర్తనను సులభంగా గమనించవచ్చు
    పశువులు స్వేచ్ఛగా ఉన్నప్పుడు వాటి సహజ ప్రవర్తనను రైతు గమనించవచ్చు.
    ఉదాహరణకు:
    • మేత తినడం
    • నీరు తాగడం
    • విశ్రాంతి తీసుకోవడం
    • ఈస్ట్రస్ లేదా వేడి లక్షణాలు చూపడం
    • ఇతర పశువులతో ప్రవర్తించడం వంటి విషయాలను సులభంగా గమనించవచ్చు.
  5. నిర్మాణ వ్యయం కొంత తగ్గవచ్చు
    సాంప్రదాయ పద్ధతిలో ప్రతి పశువుకు ప్రత్యేకంగా కట్టే స్టాల్ నిర్మించాల్సి రావచ్చు. కానీ లూజ్ హౌసింగ్ విధానంలో పశువులను సమూహంగా ఉంచవచ్చు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో నిర్మాణ ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది.
  6. శ్రమ అవసరం తగ్గుతుంది
    సరైన పద్ధతిలో షెడ్‌ను రూపొందిస్తే పశువుల నిర్వహణలో శ్రమను తగ్గించవచ్చు.
    ముఖ్యంగా:
    • మేత పంపిణీ
    • నీటి సరఫరా
    • పేడ తొలగింపు
    వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.

లూజ్ హౌసింగ్ విధానం వల్ల కలిగే నష్టాలు లేదా సమస్యలు
ప్రతి విధానానికి కొన్ని ప్రయోజనాలు, కొన్ని పరిమితులు ఉంటాయి. లూజ్ హౌసింగ్ విధానంలో కూడా సరైన నిర్వహణ లేకపోతే సమస్యలు వస్తాయి.

  1. పశువుల మధ్య పోటీ: బలమైన పశువులు బలహీనమైన పశువులను మేత లేదా నీటి దగ్గర నుండి తరిమివేయవచ్చు.
    అందువల్ల:
    • తగినంత మేత తొట్టి స్థలం
    • తగినన్ని నీటి తొట్లు
    • సరైన పశువుల సంఖ్య ఉండాలి.
  2. కొట్లాటలు జరిగే అవకాశం: కొత్త పశువును సమూహంలోకి తీసుకువచ్చినప్పుడు ఇతర పశువులతో కొట్లాటలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్త పశువులను వెంటనే ప్రధాన సమూహంలోకి చేర్చకుండా కొంతకాలం జాగ్రత్తగా గమనించడం మంచిది.
  3. పరిశుభ్రత సమస్యలు: పేడ మరియు మూత్రం సరిగా తొలగించకపోతే షెడ్‌లో అపరిశుభ్రత ఏర్పడుతుంది.
    దీనివల్ల:
    • ఈగలు పెరగడం
    • దుర్వాసన రావడం
    • వ్యాధులు వ్యాపించడం
    • పాదాల సమస్యలు రావడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి షెడ్‌ను ప్రతిరోజూ శుభ్రం చేయాలి.

లూజ్ హౌసింగ్ షెడ్ నిర్వహణ
లూజ్ హౌసింగ్ విధానం విజయవంతం కావడానికి సరైన నిర్వహణ చాలా అవసరం.

ప్రతిరోజూ చేయవలసిన పనులు

  1. పేడను తొలగించాలి: పశువుల విశ్రాంతి ప్రదేశం మరియు ఓపెన్ యార్డ్‌లో పేరుకుపోయిన పేడను క్రమం తప్పకుండా తొలగించాలి.
  2. నీటి తొట్టిని శుభ్రం చేయాలి: నీటి తొట్లో మురికి, పేడ లేదా మేత పడకుండా చూడాలి. పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.
  3. మేత తొట్టిని శుభ్రంగా ఉంచాలి: పాత లేదా పాడైన మేతను తొలగించి తాజా మేత ఇవ్వాలి.
  4. అనారోగ్య పశువులను వేరుగా ఉంచాలి: అనారోగ్యంగా ఉన్న పశువులను వెంటనే గుర్తించి ఇతర పశువుల నుండి వేరుగా ఉంచాలి. అవసరమైతే పశువైద్యుని సలహా తీసుకోవాలి.
  5. పశువుల ఆరోగ్యాన్ని గమనించాలి: ప్రతిరోజూ పశువులలో ఆకలి, పాల ఉత్పత్తి, నడక, శరీర ఉష్ణోగ్రత, మలం మరియు మూత్రం, ఈస్ట్రస్ లక్షణాలు వంటి అంశాలను గమనించాలి.
    ముగింపు: లూజ్ హౌసింగ్ సిస్టమ్ అనేది పాడి పశువులను ఆరోగ్యంగా, సౌకర్యవంతంగా మరియు సహజ వాతావరణంలో పెంచడానికి ఉపయోగపడే మంచి గృహ నిర్వహణ విధానం. ఈ విధానంలో పశువులకు కప్పు ఉన్న విశ్రాంతి ప్రదేశం, స్వేచ్ఛగా తిరగడానికి ఓపెన్ యార్డ్, సరైన మేత మరియు శుభ్రమైన నీరు అందించబడతాయి.
    పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మరియు సంక్షేమం మెరుగుపడటానికి సరైన గృహ వసతి చాలా అవసరం. లూజ్ హౌసింగ్ విధానంలో మంచి డ్రైనేజీ, పరిశుభ్రత, గాలి ప్రసరణ, తగినంత స్థలం మరియు సరైన నిర్వహణ ఉండాలి. సరైన ప్రణాళికతో లూజ్ హౌసింగ్ విధానాన్ని అమలు చేస్తే పశువులకు సౌకర్యవంతమైన జీవన వాతావరణం కల్పించడంతో పాటు రైతుకు పాడి పరిశ్రమ నిర్వహణలో మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
    రైతులకు ముఖ్య సందేశం

“మంచి షెడ్ – ఆరోగ్యకరమైన పశువు; ఆరోగ్యకరమైన పశువు – అధిక ఉత్పత్తి; అధిక ఉత్పత్తి – అధిక ఆదాయం.”

డా జె. సాయి కిరణ్ (శాస్త్రవేత, ఎల్ పి ఎం)
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్
Ph: 8121451017

Read More

‘రైతునేస్తం’2026 రైతునేస్తం పురస్కారాల దరఖాస్తులకు ఆహ్వానం

అక్టోబర్ 31లోగా దరఖాస్తులు పంపండి

‘రైతునేస్తం’ సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ ‘పద్మశ్రీ’ డా॥ ఐ.వి. సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులతోపాటు అగ్రి ఇన్నోవేషన్స్‌ను ప్రతి ఏటా ‘రైతునేస్తం పురస్కారం’ పేరుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఈ వేడుకను త్వరలో ఘనంగా నిర్వహించనున్నాము.

పురస్కారాలకు దరఖాస్తు చేసుకునే వ్యవసాయ, అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, అగ్రి ఇన్నోవేషన్స్, రైతులు ‘రైతునేస్తం’ వెబ్‌సైట్ https://rythunestham.in/awards నుండి అప్లికేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూరించి, దానికి వారి పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరచి అక్టోబర్ 31వ తేదీలోగా ‘ఎడిటర్, రైతునేస్తం, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ – 500004. ఫోన్: 9676 79 77 77 (లేదా) ‘రైతునేస్తం’, డో.నెం. 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మం॥, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ – 522 017, ఫోన్: 97053 83666 చిరునామాలకు పంపగలరు లేదా editor@rythunestham.in కు ఇ-మెయిల్ చేయవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. ఈ వేడుక త్వరలో ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడుతుంది.

యడ్లపల్లి వేంకటేశ్వరరావు
‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత
చైర్మన్ – రైతునేస్తం ఫౌండేషన్
ఫోన్: 9490559999, 98490 05182

Read More

ఎల్‌నినో – పశుసంపదపై ప్రభావం

రైతులు, పశుపోషకులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
మన దేశ వ్యవసాయం, పశుపోషణ రెండూ వాతావరణ పరిస్థితులపై ఎంతో ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ, నీటి లభ్యత వంటి అంశాలు పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో మార్పులకు కారణమయ్యే ముఖ్యమైన సహజ పరిస్థితుల్లో ఎల్‌నినో (El Niño) ఒకటి.

ఎల్‌నినో ప్రభావం నేరుగా ప్రతి ప్రాంతంలో ఒకే విధంగా కనిపించదు. అయితే ఇది ప్రపంచ వాతావరణ నమూనాల్లో మార్పులకు కారణమై, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షపాతంలో మార్పులు కలిగించవచ్చు. ఈ మార్పులు వ్యవసాయంతో పాటు పశుసంపదపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఎల్‌నినో అంటే ఏమిటి?
ఎల్‌నినో అనేది మధ్య మరియు తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే వాతావరణ పరిస్థితి.

సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చే ఈ మార్పులు వాతావరణంలోని గాలి ప్రసరణ, మేఘాల ఏర్పాట్లు మరియు వర్షపాత నమూనాలను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతంలో అసాధారణ మార్పులు సంభవించవచ్చు.

భారతదేశంలో కూడా ఎల్‌నినో సంవత్సరాల్లో వర్షపాతంలో మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఎల్‌నినో సంవత్సరంలో భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో కరువు లేదా తక్కువ వర్షపాతం తప్పనిసరిగా జరుగుతుందని చెప్పలేం. ఇతర వాతావరణ వ్యవస్థలు కూడా వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి.

ఎల్‌నినో వల్ల పశుసంపదకు కలిగే ప్రధాన సమస్యలు
ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం లేదా వర్షపాతం తగ్గడం వంటి పరిస్థితులు ఏర్పడితే పశుపోషణలో అనేక సవాళ్లు ఎదురవుతాయి.

  1. అధిక ఉష్ణోగ్రతలు – Heat Stress
    పశువులకు అధిక ఉష్ణోగ్రతలు చాలా ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా పాడి పశువులు, అధిక పాల ఉత్పత్తి కలిగిన ఆవులు మరియు గేదెలు వేడి ఒత్తిడికి ఎక్కువగా గురవుతాయి.
    వాతావరణణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పశువులు తమ శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థాయిలో ఉంచుకోవడానికి ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి.

Heat Stress వచ్చినప్పుడు:
• మేత తీసుకోవడం తగ్గుతుంది.
• నీరు ఎక్కువగా తాగుతాయి.
• శ్వాస వేగం పెరుగుతుంది.
• నోటి ద్వారా ఎక్కువగా శ్వాస తీసుకోవచ్చు.
• నీడను ఆశ్రయిస్తాయి.
• పాల దిగుబడి తగ్గవచ్చు.
• పునరుత్పత్తి సామర్థ్యం ప్రభావితమవుతుంది.
• గర్భధారణ రేటు తగ్గే అవకాశం ఉంటుంది.
అందువల్ల వేసవిలో పశువులకు నీడ, గాలి ప్రసరణ మరియు తగినంత నీరు అందించడం అత్యంత ముఖ్యమైన విషయం.

  1. నీటి కొరత
    వర్షపాతం తగ్గడం వల్ల చెరువులు, బోర్లు, బావులు మరియు ఇతర నీటి వనరుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంటుంది.

పశువులకు నీరు కేవలం దాహం తీర్చడానికి మాత్రమే కాదు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, జీర్ణక్రియ, పాల ఉత్పత్తి మరియు శరీరంలోని అనేక జీవక్రియలకు నీరు అవసరం.
వేడి వాతావరణంలో నీటి అవసరం మరింత పెరుగుతుంది.

అందువల్ల రైతులు:
“నీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇవ్వడం” కాకుండా
“ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం” అనే పద్ధతిని పాటించాలి.
నీటి తొట్లను ప్రతిరోజూ శుభ్రం చేయాలి. నీరు మురికిగా ఉండకుండా చూడాలి.

  1. పశుగ్రాస కొరత
    వర్షపాతం తగ్గితే పచ్చిమేత ఉత్పత్తి తగ్గుతుంది. పంటల దిగుబడి తగ్గడం వల్ల పంట అవశేషాల లభ్యత కూడా ప్రభావితమవుతుంది.
    దీంతో:
    పచ్చిమేత తగ్గుతుంది → మేత ధర పెరుగుతుంది → పశువుల పోషణ ఖర్చు పెరుగుతుంది.
    పచ్చిమేత కొరత ఏర్పడినప్పుడు పశువులకు కేవలం పొడి మేత మాత్రమే ఇవ్వడం వల్ల సమతుల్య పోషణ అందకపోవచ్చు.
    అందువల్ల రైతులు ముందుగానే:
    • ఎండుగడ్డి
    • పంట అవశేషాలు
    • సైలేజ్
    • హే
    • పచ్చిమేత విత్తనాలు
    • అవసరమైన concentrate feed
    వంటి వాటిని ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకోవాలి.
  2. పాల ఉత్పత్తిపై ప్రభావం
    Heat Stress వల్ల పశువులు సాధారణంగా మేత తీసుకోవడం తగ్గిస్తాయి. మేత తీసుకోవడం తగ్గితే శరీరానికి అందే పోషకాలు తగ్గుతాయి.
    దీని ప్రభావం పాల ఉత్పత్తిపై పడవచ్చు.
    ప్రత్యేకంగా అధిక పాలిచ్చే పశువుల్లో:
    వేడి ఒత్తిడి → Feed intake తగ్గడం → శక్తి లోపం → పాల ఉత్పత్తి తగ్గే అవకాశం
    అలాగే పాలలో కొవ్వు, ప్రోటీన్ వంటి నాణ్యతా అంశాలు కూడా పశువు ఆరోగ్యం మరియు ఆహారంపై ఆధారపడి మారవచ్చు.
  3. పశువుల పునరుత్పత్తిపై ప్రభావం
    అధిక ఉష్ణోగ్రతలు పశువుల reproductive performance ను కూడా ప్రభావితం చేయవచ్చు.
    వేడి కాలంలో:
    • Heat signs స్పష్టంగా కనిపించకపోవచ్చు.
    • Estrus duration తగ్గవచ్చు.
    • Conception rate తగ్గవచ్చు.
    • Early embryonic loss ప్రమాదం పెరగవచ్చు.
    అందువల్ల రైతులు వేసవిలో ఈస్ట్రస్ గుర్తింపు, సరైన సమయానికి కృత్రిమ గర్భధారణ మరియు గర్భ నిర్ధారణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
  4. గొర్రెలు మరియు మేకలపై ప్రభావం
    ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, మేత కొరత మరియు నీటి కొరత ఏర్పడితే గొర్రెలు, మేకలు కూడా ప్రభావితమవుతాయి.
    ముఖ్యంగా చిన్న వయస్సు పిల్లలు, గర్భిణీ జంతువులు మరియు బలహీనమైన జంతువులు ఎక్కువ జాగ్రత్త అవసరమైనవి.
    వీటిలో:
    • మేత తీసుకోవడం తగ్గడం
    • బరువు పెరుగుదల తగ్గడం
    • డీహైడ్రేషన్
    • బలహీనత
    • ఉత్పాదకత తగ్గడం
    వంటి సమస్యలు రావచ్చు.
    కాబట్టి గొర్రెలు, మేకలకు ఉదయం మరియు సాయంత్రం మేత అందించడం, మధ్యాహ్నం వేడి సమయంలో నీడ కల్పించడం మంచిది.
  5. కోళ్లపై ప్రభావం
    అధిక ఉష్ణోగ్రతలు కోళ్లలో కూడా Heat Stress కు కారణమవుతాయి.
    Heat Stress సమయంలో:
    • Feed intake తగ్గుతుంది.
    • Water intake పెరుగుతుంది.
    • Egg production తగ్గవచ్చు.
    • Egg shell quality ప్రభావితమవుతుంది.
    • Mortality పెరిగే ప్రమాదం ఉంటుంది.
    కాబట్టి poultry sheds లో ventilation చాలా ముఖ్యమైనది.
    షెడ్‌లో గాలి సరిగా ప్రసరించేలా చూడాలి. తాగునీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.
  6. వ్యాధులపై ప్రభావం
    వాతావరణ మార్పులు పశువుల ఆరోగ్యంపై పరోక్షంగా ప్రభావం చూపవచ్చు. అధిక వేడి, పోషక లోపాలు, నీటి కొరత వంటి పరిస్థితులు పశువులపై stress పెంచవచ్చు.
    అందువల్ల రైతులు సాధారణ vaccination schedule ను పాటించాలి.
    అలాగే:
    టీకాలు
    అవసరమైనప్పుడు డీవార్మింగ్
    ఈగలు, పేలు, ఇతర ectoparasites నియంత్రణ
    షెడ్ పరిశుభ్రత
    అనారోగ్య పశువులను ముందుగా గుర్తించడం
    వంటి చర్యలు చేపట్టాలి.
  7. పశువులకు నీడ కల్పించడం
    వేసవి పరిస్థితుల్లో పశువులకు మంచి నీడ చాలా అవసరం.
    షెడ్:
    • గాలి ప్రసరణకు అనుకూలంగా ఉండాలి.
    • పైకప్పు అధిక వేడిని లోపలికి రానివ్వకుండా ఉండాలి.
    • పశువులకు తగినంత స్థలం ఉండాలి.
    • నేల పొడిగా, పరిశుభ్రంగా ఉండాలి.
    సాధ్యమైన చోట్ల చెట్లను పెంచడం ద్వారా సహజ నీడను కూడా కల్పించవచ్చు.
  8. పశువులను చల్లబరచడం
    అధిక వేడి సమయంలో పశువులను చల్లబరచడానికి నీటితో శరీరాన్ని తడపడం లేదా సరైన పద్ధతిలో cooling చేయడం ఉపయోగపడుతుంది.
    అయితే షెడ్‌లో తేమ ఎక్కువగా పేరుకుపోకుండా గాలి ప్రసరణ కూడా ఉండాలి.
    నీరు + నీడ + గాలి ప్రసరణ + సరైన cooling అనేవి Heat Stress నియంత్రణలో ముఖ్యమైన అంశాలు.

రైతులు ముందుగానే చేయాల్సిన ప్రణాళిక
ఎల్‌నినో లేదా ఇతర వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి రైతులు ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి.

రైతుల కోసం ముఖ్యమైన సూచనలు
నీటి ప్రణాళిక:
వేసవి ప్రారంభానికి ముందే పశువుల తాగునీటి వనరులను సిద్ధం చేసుకోవాలి.
మేత ప్రణాళిక:
అవసరమైన పచ్చిమేత, ఎండుమేత మరియు సైలేజ్‌ను ముందుగానే నిల్వ చేసుకోవాలి.
షెడ్ నిర్వహణ:
గాలి ప్రసరణ మరియు నీడ ఉండేలా షెడ్‌ను సిద్ధం చేసుకోవాలి.
ఆరోగ్య నిర్వహణ:
టీకాలు, పరాన్నజీవుల నియంత్రణ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు కొనసాగించాలి.

పాలిచ్చే పశువులపై ప్రత్యేక శ్రద్ధ:
అధిక పాలిచ్చే ఆవులు, గేదెలకు నీరు, మేత మరియు cooling పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
గర్భిణీ పశువులు:
గర్భిణీ పశువులకు వేడి ఒత్తిడి రాకుండా ప్రత్యేక సంరక్షణ ఇవ్వాలి.
చిన్న పిల్లలు:
దూడలు, గొర్రె పిల్లలు, మేక పిల్లలను అధిక వేడి మరియు డీహైడ్రేషన్ నుంచి రక్షించాలి.

మొత్తం మీద, ఎల్‌నినో అనేది సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులతో ప్రారంభమయ్యే ఒక సహజ వాతావరణ పరిస్థితి. దీని ప్రభావం ప్రాంతాన్ని బట్టి మారుతుంది. అయితే అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు మరియు నీటి లేదా మేత లభ్యతలో సమస్యలు ఏర్పడితే పశుసంపదపై వాటి ప్రభావం గణనీయంగా ఉండవచ్చు.
ముందుగానే ప్రణాళిక చేసుకుంటే వాతావరణ మార్పుల వల్ల పశువులపై వచ్చే ఒత్తిడిని చాలా వరకు తగ్గించవచ్చు.
“వాతావరణాన్ని మనం నియంత్రించలేం…
కానీ వాతావరణ మార్పులకు పశుసంపదను సిద్ధం చేయగలం.”

రైతు ముందుచూపుతో నీరు, మేత, షెడ్ మరియు పశువుల ఆరోగ్యాన్ని నిర్వహిస్తే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా పశుసంపదను ఆరోగ్యంగా, ఉత్పాదకంగా కాపాడుకోవచ్చు.

  • డా. జి. రాంబాబు, పశు వైద్యాధికారి, కడప జిల్లా, ఫోన్: 9618499184, 9494588885
Read More