సర్ ర్థర్ కాటన్‌పై అభిమానంతో శ్రామికులకు రూ.20 లక్షల సాయం
ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకుంటూ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన కౌలు రైతు సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి) కొన్నేళ్లుగా తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న శ్రామికులకు రూ.20 లక్షలు అందజేసి ఆదర్శంగా నిలిచారు. కాటన్‌పై అభిమానంతో తన ఇంటి ముందు ఆయన విగ్రహాన్ని నిర్మించారు. ఏటా కాటన్ జయంతికి వేదపండితుల ఆశీర్వచనాలతో విగ్రహానికి పట్టువస్త్రాలు సమర్పించి, ధాన్యంతో అభిషేకాలు చేయిస్తుంటారు. ఈసారి కూడా యథావిధిగా ఆ కార్యక్రమాలన్నీ చేసి, ఏళ్ల తరబడి తన వద్ద పనిచేస్తున్న పది కుటుంబాలకు రూ. రెండేసి లక్షల చొప్పున రూ.20 లక్షలు అందజేశారు. రైతుల ప్రగతిలో శ్రామికుల కష్టాన్ని గుర్తించి వారికి బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ సాయం చేసినట్లు భాస్కరరెడ్డి తెలిపారు.











