హైదర్‌గూడలోని శ్రీకాంత్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, ధన్య సీడ్స్ సంస్థలను నకిలీ మిరప విత్తనాల విక్రయం కేసులో నష్టపోయిన రైతులకు రూ.16.80 లక్షలు చెల్లించాలంటూ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన ఎనిమిది మంది రైతులు 2017లో వేర్వేరుగా దాఖలు చేసిన ఫిర్యాదులను విచారించిన అనంతరం ఒక్కో రైతుకు రూ.2 లక్షల పరిహారం, కేసు ఖర్చులు రూ.10 వేల చొప్పున చెల్లించాలని స్పష్టంచేసింది. ఏ. వీరన్న, జి. వెంకన్న, ఎం. ముఖేష్, రామ్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఉపేందర్, టి.వెంకట్‌రెడ్డి, వి. యాకుబ్ రెడ్డి 2016 జులైలో శ్రీకాంత్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నుంచి ‘ధన్య మిరప విత్తనాలు’ కొనుగోలు చేశారు. టాటా సంస్థ ఉత్పత్తిగా ప్రచారం చేసిన ఈ విత్తనాలు తెలంగాణ వాతావరణానికి సరిపోతాయని డీలర్ హామీ ఇవ్వడంతో ఒక్కొక్కరు రూ.300కి ఒక ప్యాకెట్ చొప్పున అవసరమైనన్ని కొనుగోలు చేశారు. వీటిని పొలంలో చల్లగా నవంబరు నాటికి మొక్కలు ఏపుగా పెరిగినా పూత, దిగుబడి రాలేదు. దీంతో 2016 నవంబరు 29న మహబూబాబాద్ ఏఈవోకు ఫిర్యాదు చేయగా.. డిసెంబరు 17న జిల్లా హార్టికల్చర్, సెరీకల్చర్ అధికారి ఆధ్వర్యంలోని అధికారుల బృందం వారి పొలాలను పరిశీలించి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా రైతులంతా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ విత్తనాలు నాణ్యమైనవే అని నిర్ధారించే ల్యాబ్ రిపోర్టులున్నాయని ప్రతివాదులు కమిషన్‌కు తెలుపగా… ఆ రిపోర్టుల్లో తేదీల వ్యత్యాసం ఉందని, ప్రభుత్వ ల్యాబ్ సర్టిఫికేషన్ లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఇనెస్పెక్షన్‌కు కంపెనీ ప్రతినిధి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం రైతులకు పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది.

17 Apr, 2026
