పపటాకు 1.8 మీటర్ల ఎత్తు పెరిగే వార్షిక మొక్క. ఇది విపీరతంగా పెరిగి కలుపు మొక్కలా తయారవుతుంది. ఆకులు వ్యతిరేక దిశలో ఏర్పడి 3 నుండి 5 అండాకారంలో వున్న చిన్న ఆకులు కలిగి వుంటాయి. మొక్క సంవత్సరంలో ఏ సమయంలోనైనా పూయవచ్చు. పూలు పొడవాటి కాడల మీద చిన్న గుత్తులుగా ఏర్పడతాయి. కాయలు కొద్దిగా వంకరగా, బిర్రుగా, గరుకుగా, నలుపు కడ్డీలులాగా వుంటాయి. కాయలు నక్షత్రం ఆకారంలో గుండ్రని గరుకైన అంచులు కలిగి సుమారు 1-2 సెం.మీ. వ్యాసంలో వుంటాయి. ఉత్తర భారతదేశంలో లేత ఆకులు, కొమ్మలను చేపల కూరలో చేపలతో కలిపి వండుకు తింటారు.

సాధారణ నామం : బ్లాక్ జాక్ / బెగ్గర్‌టిక్ శాస్త్రీయ నామం : బిడెన్స్ పైలోసా కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • పపటాకు ఫార్ములేషన్ యాంటి డయాబెటిక్ డ్రగ్స్‌తో కలిపి వాడితే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులలో డయాబెటిస్ నియంత్రణలో వుంటుంది.
  • చైనాలో, ఈశాన్య ఉత్తర భారతదేశంలో ప్రజలు ఔషధంగా ఉపయోగిస్తారు. మొత్తం మొక్క లేదా వివిధ భాగాలను వాపు, రోగనిరోధక సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, కీళ్ళ నొప్పులు, అంటువ్యాధులు, క్యాన్సర్లు, గాయాలు వంటి 40 జబ్బులకు పైగా చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • దక్షిణాఫ్రికాలో దీనిని పందులకు మేతగా ఉపయోగిస్తారు.
  • పపటాకు ఎసిటోన్ ద్రావణాన్ని చిక్కుడు గింజల నిల్వదశలో ఆశించే అకాంతో సెలిడెస్ ఒబ్టెక్టస్, జాట్రోటెస్ సబ్‌సాసియేటస్ పురుగుల నివారణలో మొట్టమొదటిసారిగా ఉపయోగించి 100 శాతం నివారణ సాధించారు. పపటాకు ఒక అద్భుతమైన వృక్ష సంబంధ పురుగుమందు. దీనిని అధిక పరిమాణంలో లెగ్యూమ్ జాతి పంటల ధాన్యాన్ని పురుగులాశించకుండా నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు. (రేణుక, ఆమె అనుచరులు, 2014) రసాయన పురుగుమందులకు ఈ కలుపు మొక్క ఒక అద్భుత ప్రత్యామ్నాయం.
  • పపటాకు తాజా ఆకులనుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ బంబార వేరుశనగ నిల్వ సమయంలో ఆశించే పురుగు కాల్లసోబ్రోకస్ మాక్యులేటస్‌ను, శిలీంద్రాలు ఆస్పర్ౙిల్లస్, పెనిసిలియం, ఫ్యుజేరియం, మ్యూకార్‌లను సమర్థవంతంగా నివారించింది. పపటాకు ఎసెన్షియల్ ఆయిల్ పురుగు, శిలీంద్ర నాశక లక్షణాలు ఈ పరిశోధన ద్వారా విశదమయ్యాయి (అగస్టిన్‌గేడౌమ్, అతని అనుచరులు, 2016)
  • పపటాకు తాజా ఆకుల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యాన్ని పురుగులాశించకుండా కాపాడుతుంది (ఆగస్టిన్ గేడౌమ్, అతని అనుచరులు, 2016)
  • పేనుబంక, లద్దె పురుగులు, చెదల నివారణకు మొత్తం మొక్క, దాని గింజలనుపయోగించి ఫార్ములేషన్ తయారు చేసుకోవచ్చు. మొదట ముదిరిన గింజలను నీటిలో 10 ని॥ మరిగించాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం నీటితోపాటు చిన్న సబ్బు ముక్క లేదా కొంచెం సబ్బు పొడి కలపాలి. ఈ ద్రావణాన్ని వడకట్టి నారుమడి, కూరగాయల పం\ల్లో పిచికారి చేయవచ్చు. మొత్తం మొక్కను కూడా బాగా దంచి రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచి, మరునాడు వడపోసి పిచికారి చేసే ముందు చిన్న సబ్బు ముక్క కలిపి పిచికారి చేయవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.