ANGRAU వైస్‌ఛాన్స్‌లర్ (ఇన్‌ఛార్జి )గా డా. పాలడుగు సత్యనారాయణ

ఆంధ్రా రైస్‌మాన్‌గా పేరొందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. పాలడుగు సత్యనారాయణ ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ (ఇంఛార్జి)గా నియమితులయ్యారు. ప్రస్తుతం వీరు వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులుగా పనిచేస్తూ ఉన్నారు. వీరు 1983 బ్యాచ్ బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి. వీరి కృషితో 40కు పైగా అధిక దిగుబడినిచ్చే రకాలు వరి పంటలో రావటం జరిగింది. దేశంలో దాదాపు 7 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో వీరు అభివృద్ధి చేసిన వంగడాలు సాగులో ఉండటం వీరి ప్రత్యేకత. వీరికి డా. ఎం.ఎస్. స్వామినాథన్ పురస్కారంతో పాటు 2012లో రైతునేస్తం పురస్కారం, మరెన్నో ఇతర పురస్కారాలు లభించాయి. వీరి మార్గదర్శనంలో విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని, రైతుల హృదయ స్పందన కావాలని, ఆ ప్రయత్నంలో విజయవంతం కావాలనీ మనఃపూర్వకముగా ‘రైతునేస్తం’ కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తోంది.

Read More

రేపు తిరుపతిలో ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళన కార్యక్రమం తిరుపతి మహతి ఆడిటోరియంలో రేపు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ప్రథమ ప్రోత్సాహకులు డాక్టర్ కోటపాటి గంగాధరం అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్, విశ్రాంత ఐఏఎస్ విజయకుమార్, ఎంపీ గురుమూర్తి, రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ చైర్మన్ సావల రేవద్దత్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హాజరవుతారన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అయ్యపనాయుడు, రాంజీ, జయరాం, పరమేశ్వరి పాల్గొన్నారు.

Read More

నకిలీ విత్తనాల వలన రైతులకు పరిహారం

హైదర్‌గూడలోని శ్రీకాంత్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, ధన్య సీడ్స్ సంస్థలను నకిలీ మిరప విత్తనాల విక్రయం కేసులో నష్టపోయిన రైతులకు రూ.16.80 లక్షలు చెల్లించాలంటూ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన ఎనిమిది మంది రైతులు 2017లో వేర్వేరుగా దాఖలు చేసిన ఫిర్యాదులను విచారించిన అనంతరం ఒక్కో రైతుకు రూ.2 లక్షల పరిహారం, కేసు ఖర్చులు రూ.10 వేల చొప్పున చెల్లించాలని స్పష్టంచేసింది. ఏ. వీరన్న, జి. వెంకన్న, ఎం. ముఖేష్, రామ్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఉపేందర్, టి.వెంకట్‌రెడ్డి, వి. యాకుబ్ రెడ్డి 2016 జులైలో శ్రీకాంత్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నుంచి ‘ధన్య మిరప విత్తనాలు’ కొనుగోలు చేశారు. టాటా సంస్థ ఉత్పత్తిగా ప్రచారం చేసిన ఈ విత్తనాలు తెలంగాణ వాతావరణానికి సరిపోతాయని డీలర్ హామీ ఇవ్వడంతో ఒక్కొక్కరు రూ.300కి ఒక ప్యాకెట్ చొప్పున అవసరమైనన్ని కొనుగోలు చేశారు. వీటిని పొలంలో చల్లగా నవంబరు నాటికి మొక్కలు ఏపుగా పెరిగినా పూత, దిగుబడి రాలేదు. దీంతో 2016 నవంబరు 29న మహబూబాబాద్ ఏఈవోకు ఫిర్యాదు చేయగా.. డిసెంబరు 17న జిల్లా హార్టికల్చర్, సెరీకల్చర్ అధికారి ఆధ్వర్యంలోని అధికారుల బృందం వారి పొలాలను పరిశీలించి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా రైతులంతా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ విత్తనాలు నాణ్యమైనవే అని నిర్ధారించే ల్యాబ్ రిపోర్టులున్నాయని ప్రతివాదులు కమిషన్‌కు తెలుపగా… ఆ రిపోర్టుల్లో తేదీల వ్యత్యాసం ఉందని, ప్రభుత్వ ల్యాబ్ సర్టిఫికేషన్ లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఇనెస్పెక్షన్‌కు కంపెనీ ప్రతినిధి ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం రైతులకు పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది.

Read More

లాభదాయక పంట ఆయిల్‌పామ్‌

వరి, పత్తి రైతులతో పోలిస్తే ఆయిల్‌ పామ్‌ రైతులు ఎక్కువగా లబ్ది పొందుతున్నారని, దేశంలో ఇతర అన్ని పంటల కంటే ఆయిల్‌ పామ్‌ అత్యంత లాభదాయక పంట అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అధ్యయనంలో వెల్లడయింది. దేశీయ అవసరాలకు వినియోగించే నూనెల్లో పామాయిల్‌ దిగుమతులు అత్యధికంగా 21 శాతంగా ఉన్నాయని, దాన్ని తగ్గించే దిశగా సాగు మరింత పెరగాలని, 2047 నాటికి 50% వరకు స్వయం సమృద్ధి సాధించాలని నిర్దేశించింది. దేశవ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ సాగు, వినియోగం, ఇతర ప్రయోజనాలపై భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) నేతృత్వంలో కేంద్రం అధ్యయనం నిర్వహించి, ఆ నివేదిక-2025 ను తాజాగా విడుదల చేసింది. ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
దేశంలో వంట నూనెల వార్షిక తలసరి వినియోగం 19.7 కిలోలుగా ఉంది. వినియోగంలో 16.9 మిలియన్‌ టన్నులు భారత్‌ దిగుమతి చేసు కుంటోంది. అందులో 56% పామాయిలే. ఇది ప్రపంచ పామాయిల్‌ దిగు మతులలో 21 శాతం. వినియోగం ఇదే స్థాయిలో ఉంటే 2047 నాటికి డిమాండ్‌ 66.8 మిలియన్‌ టన్నులకు చేరుతుంది.
లాభం-ఖర్చు నిష్పత్తి పామాయిల్‌ పంటకు అధికంగా ఉంది. ఆయిల్‌పామ్‌కు పెట్టిన రూ. 1 ఖర్చుకు రూ.1.49 లాభం వస్తోంది. వరిలో అయితే రూ.1 ఖర్చుకు.. లాభం రూ.1.03, పత్తిలో రూ.1 ఖర్చుకు లాభం 1.13 శాతంగా ఉంది.
అభివృద్ధికి సూచనలు
ఆయిల్‌పామ్‌ దిగుబడి హెక్టారుకు 2.4 మెట్రిక్‌ టన్నులుగా ఉంది. దాన్ని 4-5 మెట్రిక్‌ టన్నులకు పెంచే దిశగా ప్రణాళిక అవసరం.
దేశంలో ప్రస్తుతం వరి, పత్తి తదితర పంటలు సాగయ్యే 1.6 కోట్ల ఎకరాలు ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలంగా ఉన్నాయి.
నర్సరీలు, శుద్ధి సామర్థ్యాలు పెంచేదిశగా పెట్టుబడులను ప్రోత్సహించాలి.
రైతులకు మార్కెటింగ్‌ వనరులను అందుబాటులోకి తేవాలి. చిన్న రైతులకు తేలికగా రుణ లభ్యత ఉండేలా చూడాలి.

Read More

అన్నదాతా సుఖీభవ మరియు పీఎం కిసాన్‌ నిధులు ఆగస్టు 2న విడుదల

ఆగస్టు 2న పీఎం కిసాన్‌ 20వ విడత వాయిదా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కానుంది. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు రూ. 831.60 కోట్లు అందుతాయి. అదే రోజు అన్నదాతా సుఖీభవ సొమ్ము కూడా రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. పీఎం కిసాన్‌ నుంచి రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీభవ కింద తొలివిడతగా రూ. 5 వేలు అందించనున్నాయి. రాష్ట్రంలో అన్నదాతా సుఖీభవ పథకానికి 46.64 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. వీరిలో 46.20 లక్షల కుటుంబాల్లోని రైతులు ఈకేవైసీ పూర్తి చేయగా.. ఇంకా 40,346 మంది రైతులు ఈకేవైసీ చేయాల్సి ఉంది. కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక కౌలు రైతులకు రెండో విడతలో.. మొదటి, రెండో విడత నిధులను కలిపి జమ చేస్తారు.

Read More

రైతునేస్తం వ్యవసాయ కుటుంబ మాసపత్రిక2025 రైతునేస్తం పురస్కారాల దరఖాస్తులకు ఆహ్వానం

‘రైతునేస్తం’ 21వ వార్షికోత్సవ సందర్భంగా సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ ‘పద్మశ్రీ’ డా|| ఐ.వి. సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులతోపాటు అగ్రి ఇన్నోవేషన్స్‌ను అవార్డులతో సెప్టెంబర్‌లో జరగబోయే వార్షికోత్సవ వేడుకలో ఘనంగా సత్కరించనుంది.
పురస్కారాలకు దరఖాస్తు చేసుకునే వ్యవసాయ, అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, అగ్రి ఇన్నోవేషన్స్‌, రైతులు ‘రైతునేస్తం’ వెబ్‌సైట్‌ https://rythunestham.in/awards నుండి అప్లికేషన్‌ ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, దాన్ని పూరించి, దానికి వారి పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరచి ఆగస్టు 31వ తేదీలోగా ‘ఎడిటర్‌, రైతునేస్తం, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌ – 500004. ఫోన్‌: 9676 79 77 77 (లేదా) ‘రైతునేస్తం’, డో.నెం. 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మం||, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ – 522 017, ఫోన్‌: 97053 83666 చిరునామాలకు పంపగలరు లేదా editor@rythunestham.in కు ఇ-మెయిల్‌ చేయవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. ఈ వార్షికోత్సవం సెప్టెంబర్‌లో ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడుతుంది.

Read More

కోకోకు అంతర్జాతీయ ధరలపై 5-10% అధికంగా ఇవ్వాలి

  • ప్రాసెసింగ్‌ సంస్థలకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

స్థానిక రైతుల నుంచి నాణ్యమైన కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్‌ ధరల కంటే 5% నుంచి 10% అధికంగా చెల్లించి కొనాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాసెసింగ్‌ సంస్థలను ఆదేశించారు. ఆఫ్‌ సీజన్‌ కోకో బీన్స్‌కు ఎంత చెల్లిస్తారో కూడా ముందే తెలియజేయాలని సూచించారు. ప్రాసెసింగ్‌ సంస్థలు దీనిపై సోమవారం లోపు తమ నిర్ణయాన్ని చెప్పాలన్నారు. కోకో రైతులు, ప్రాసెసింగ్‌ సంస్థల ప్రతినిధులు, ఉద్యానశాఖ అధికారులతో గురువారం ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు. 700 టన్నుల ఆఫ్‌ సీజన్‌ కోకో బీన్స్‌ నిల్వలున్నాయని, వాటిని ముందు కొనుగోలు చేసేలా చూడాలని రైతులు మంత్రిని కోరారు. నాణ్యత పేరుతో ధర తగ్గిస్తున్నారని వాపోయారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర కిలో రూ.680-720 ఉండగా, రాష్ట్రంలో రూ.550 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. రైతుల సమస్యలపై ప్రాసెసింగ్‌ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. 25 ఏళ్లుగా లేని నాణ్యత, గ్రేడింగ్‌ సమస్య ఇప్పుడే ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. కోకోలో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు.

Read More

బడ్జెట్‌ సందర్భంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల గురించి శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగం

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం. ఎస్‌. స్వామినాథన్‌ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి.*

”వ్యవసాయం గాడి తప్పితే మరేదీ సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు.”*

మన రాష్ట్ర వ్యవసాయ రంగం 62 శాతం జనాభాకు ఆసరాగా ఉంటూ, మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం. వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. వివిధ వ్యవసాయ పథకాల క్రింద చెల్లించవలసిన 5,510 కోట్ల రూపాయల బకాయిలలో 693 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన క్రింద చేపట్టే డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకం కొన్ని సంవత్సరాలుగా అమలు కాలేదు. ఈ సందర్భంగా డ్రిప్‌ ఇరిగేషన్‌ ఈ దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియచెప్పాల్సి ఉంది. డ్రిప్‌ ఇరిగేషన్‌ గురించి ఎవ్వరూ ఆలోచన చేయని 90వ థకంలో ఇజ్రాయిల్‌ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు గారు. అధ్యయనానికి ఇజ్రాయిల్‌కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను. ముగ్గురు ఐ.ఏ.ఎస్‌. అధికారులను, నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుగారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ తర్వాత డ్రిప్‌ ఇరిగేషన్‌ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్‌ ఫోర్సుకు ఆయనే నేతృత్వం వహించారు. ఇవాళ డ్రిప్‌ లేని రాష్ట్రంలేదు.. పొలం లేదు. వాట్‌ చంద్రబాబు నాయుడు గారు థింక్స్‌ టుడే… నేషన్‌ థింక్స్‌ టుమారో…. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం ఆలోచిస్తారో… అదే రేపు దేశం ఆలోచిస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం 176 కోట్ల రూపాయలను విడుదల చేసి, అదనంగా 85 వేల హెక్టార్లను డ్రిప్‌ ఇరిగేషన్‌ క్రింద తీసుకురావడానికి అనుమతులు ఇచ్చింది. జీవితంలో ఒక్కసారైనా డాక్టర్‌, లాయర్‌, పోలీస్‌ మరియు బోధకుడు అవసరమని చెబుతూ ఉంటారు. కానీ రైతు ప్రతిరోజూ అవసరం. మూడు పూటలా అవసరం. కాబట్టి అలాంటి అన్నదాతలకు ప్రగాఢ కృతజ్ఞతా భావంతో మేం మరో సూపర్‌ సిక్స్‌ హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియచేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా… అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20 వేల రూపాయలు అందించేలా కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాం. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తామనే మ్యానిఫెస్టోలోని మరో హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

*రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌*

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు భారీ మేలు కలిగేలా కేటాయింపులు రాష్ట్ర రైతుకు వెన్నుదన్నుగా నిలిచేలా 2025-25 వార్షిక వ్యవసాయ బడ్జెట్‌ను ఇవాళ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టారు. సాధారణ బడ్జెట్‌ అనంతరం దీనిని అసెంబ్లీ ముందుకు తెచ్చారు. రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ ప్రతిపాదనలను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమన్నారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయంపై కూటమి సర్కార్‌ ఫోకస్‌ పెట్టిందని తెలిపారు. వ్యవసాయం ప్రాథమిక రంగంగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భూమి కలిగిన వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత్‌ భారత్‌కు అనుసంధానంగా ఏపీని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.

*భారీగా కేటాయింపులు*

వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆయా రంగాలకు భారీగా కేటాయింపులు చేసింది. ఎరువులు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ యంత్రాల రాయితీ, డ్రోన్ల రాయితీకి సంబంధించి భారీగా కేటాయించారు. ఈ కేటాయింపుల వల్ల రైతులకు భారీగా మేలు చేకూరనుంది. శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ 2025-26 ను మంత్రి పి. నారాయణ ప్రవేశపెట్టారు.

Read More