గొల్లపుల్లేడు 1-3 మీ. ఎత్తు పెరిగే ఒక పొద లేక 9 మీ. ఎత్తు పెరిగే ఒక చిన్న చెట్టు. ఆకులు వివిధ రూపాలలో ఉంటాయి. కొన్ని ఆకులు అండాకారంలో ఉంటాయి. మరికొన్ని బల్లెం ఆకారంలో ఉంటాయి. ఆకులు 4-7.5 సెం.మీ. పొడవు, 1-1.5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి, రెసిన్ లాంటి పదార్థాన్ని స్రవిస్తాయి. ఆకులు తోలు లాగా గట్టిగా ఉంటాయి. పూలు సాధారణంగా కొమ్మల చివర ఏర్పడతాయి. పూలు పసుపు రంగు నుండి నారింజ ఎరుపు రంగులో ఉంటాయి. కాయ 1.5 సెం.మీ. వెడల్పున్న కాప్సూల్. కాయలు ఎరుపు రంగులో ఉండి పండినపుడు గోధుమరంగులోకి మారతాయి.

సాధారణ నామం : హాప్‌బుష్ శాస్త్రీయ నామం : డోడొనియా విస్కోసా కుటుంబం: సాపిండేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ప్రపంచ వ్యాప్తంగా సాంప్రదాయ ఔషధరంగంలో గొల్లపుల్లేడు అనేక ప్రయోజనాలు కలిగి ఉంది. దీనిని అనేక జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. కాండం లేదా ఆకుల కషాయాలను గొంతునొప్పి చికిత్సలో ఉపయోగిస్తారు. కాండాన్ని కీళ్ళ నొప్పుల నివారణకు ఫ్యూమిగెంట్‌గా ఉపయోగిస్తారు.
  • వేరు కషాయాన్ని జలుబు పోగొట్టడానికి ఉపయోగిస్తారు. ఆకులను దురద, జ్వరం, వాపులు, నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు. ఆకులు, వేర్లను పంటి నొప్పులు, తలనొప్పి నివారణకు ఉపయోగిస్తారు. మొక్కభాగాల నుండి తయారు చేసిన లోషన్‌ని బెణుకులు, కాలిన గాయాలు, వ్రణాల చికిత్సకు ఉపయోగిస్తారు. అజీర్తి, అల్సర్లు, డయేరియా, మలబద్ధకం వంటి జీర్ణాశయ సమస్యలను ఆకులు లేదా వేర్ల కషాయం త్రాగించి నివారిస్తారు. ఈ మొక్క వేర్ల కషాయం లేదా తాజా వేర్లను బాలింతలు పాల ఉత్పత్తి పెరగడానికి తీసుకుంటారు. పూల నుండి తయారు చేసిన పానీయాన్ని టానిక్‌గా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • గొల్లపుల్లేడు పెట్రోలియం ఈథర్ ద్రావణం (3%) ప్రత్తి, బెండ, వంగ పంటలనాశించే మచ్ౘ్ల కాయతొలుచు పురుగు, ఈరియాస్ విట్టేల్లా పై అత్యధిక యాంటీఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.
  • గొల్లపుల్లేడు ద్రావణం అలసంద బీటిల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులను 100% చంపింది (డిమెట్రి, అతని అనుచరులు, 2015).
  • లెపిడాప్టెరా పురుగులపై ఈ మొక్క కీటకనాశన లక్షణాలు రిపోర్టు చేయబడ్డాయి (మలర్‌వన్నన్ అండ్ సుభాషిణి, 2007; మలర్ వన్నన్, అతని అనుచరులు, 2008, 2009, షార్బి, అతని అనుచరులు, 2009).
  • ఈ మొక్క నుండి అనేక ఫ్లేవనాయిడ్లు, డైటెర్పెనిక్ యాసిడ్లు, సపోనిన్లు వేరు చేయబడ్డాయి (నియు, అతని అనుచరులు, 2010).
  • ఇథనాల్ ఆకు ద్రావణం రొఫాలోసైఫం మేడిస్ (పేనుబంక), ఎపిలాక్న పీన్యులేట (అక్షింతల పురుగు)లను పంటల ఆకులపై రసం పీల్చకుండా, తినకుండా డిటరెంట్ చర్యను ప్రదర్శించింది. ఇతర ఫ్రాక్షన్స్ మైజస్ పెర్సికె (పేనుబంక), స్పోడోప్టెరా లిట్టురాలిస్ (లద్దెపురుగు) పైన కూడా డిటరెంట్ చర్యలను ప్రదర్శించాయి. ఆకు ద్రావణం నుండి వేరు చేసిన మిశ్రమం, లుపియాల్, మైజస్ పెర్సికె, ఎపిలాక్న పీన్యులేట రెండింటిపై డిటరెంట్ చర్యను ప్రదర్శించింది. స్టిగ్మాస్టెరాల్ మిశ్రమం కేవలం పేనుబంక పురుగులపైన మాత్రమే డిటరెంట్ చర్య ప్రదర్శించింది. స్టిగ్మాస్ 7ఎన3ఆల్ కేవలం మైజస్‌పెర్సికె పైన మాత్రమే ఈ చర్య ప్రదర్శించింది. కాంపౌండ్ (మిశ్రమం) 4 కేవలం ఎపిలాక్న పీనిక్యులేట పైన మాత్రమే డిటరెంట్ చర్య ప్రదర్శించింది (మార్టినడయాజ్, అతని అనుచరులు, 2015).
  • ఈ మొక్క ఆకుల పెట్రోలియం ఈదర్, హెక్సేన్, క్లోరోఫాం, ఎసిటోన్, నీటి ద్రావణాలు క్షేత్ర ప్రయోగాలలో ఈరియాస్ విట్టేటు లార్వాలను సమర్ధవంతంగా అరికట్టాయి (మలర్వన్నన్, అతని అనుచరులు, 2007). అంతేగాక ఈ ద్రావణాలు హెలికోవర్ప ఆర్మిజరా గుడ్లపై గుడ్లనాశక చర్యను కూడా ప్రదర్శించాయి (మలర్వన్నన్, 2003)
  • ఆకులు, కాడల నుండి తీసిన ద్రావణాలు పేనుబంక (రొపాలోసైఫం పడి, మైజస్‌పెర్సికె) పురుగులు, అక్షింతలపురుగు (ఎపిలాక్న పీనిక్యులేట)పై మంచి డిటరెంట్ చర్యను ప్రదర్శించాయి. ప్రయోజనకర తేనెటీగల (ఎపిస్ మెల్లిఫెర్)కు ఎటువంటి హాని కలిగించలేదు (కాస్టిల్లో, అతని అనుచరులు, 2009).
  • గింజల ద్రావణం సైటోఫిలస్ ఒరైజె పై బలమైన స్పర్శ చర్యను ప్రదర్శించింది (జావొ, అతని అనుచరులు, 2006).
  • గొల్లపల్లేడు మొక్క క్రూడ్ ద్రావణం చెదలు, ఒడొంటోటెర్మస్ ఒబెసస్ వర్కర్ పురుగులను చంపింది. చెట్లలో చెదలు చేసే టనెల్ నిర్మాణాన్ని కూడా నివారించింది. దీనిని చెదల నివారణకు శక్తివంతమైన పురుగు మందుగా కూడా ఉపయోగించవచ్చు. (నిసార్, అతని అనుచరులు, 2015).
  • కోళ్ళ నుండి వేరు చేసిన సాల్మొనెల్లా స్పీసీస్ పెరుగుదలని గొల్లపల్లేడు మొక్క ఇథనాల్ ద్రావణం 71.19% అరికట్టింది. ఈ ఔషధ మొక్క నుండి తయారు చేసిన సహజ మందులు యాంటిబాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వలన వైద్యరంగంలో ఉపయోగించవచ్చు. (ఆల్‌బకర్, అతని అనుచరులు, 2014).
  • గొల్లపల్లేడు ఆకుల ద్రావణం ట్రోగోడెర్మా గ్రానోరియం 3వ దశ లార్వాలను వికర్షణ చర్య ద్వారా సమర్ధవంతంగా నివారించింది (యూసఫ్ అండ్ సత్తి, 2012).
    ……………………………………………………………………………………………………………………………..
    రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.