వడిసె కాలానుగుణంగా ఆకులు రాల్చుతూ మరల పుట్టించు ఒక చిన్న చెట్టు. బెరడు ముదురు గోధుమ రంగు, ఎరుపు రంగుతో కూడిన నలుపు రంగులో గరుకుగా ఉండి, నలుచదరపు కొయ్య పొలుసులుగా ఊడిపోతుంది. ఆకులు ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడి, రబ్బరులాగా, గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో 1.53 అం. పొడవు, రంగుతో ఆకు మొదలులో గుత్తులుగా ఏర్పడతాయి. క్యాప్సూల్ కొయ్యలాగా తొడిమ లేకుండా, గుండ్రంగా, 3 లేదా 4 చీలిన భాగాలు కలిగి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో దీని విషపూరిత స్వభావం ఒక సమస్య.
సాధారణ నామం : గరారి శాస్త్రీయ నామం : క్లిస్టాంతస్ కోల్లినస్ కుటుంబం: ఫిల్లాంతేసి
ఉపయోగాలు : వ్యవసాయరంగంలో
- వడిసాకు డికాక్షన్ (50%) వరి నాశించే తాటాకు తెగులు (హిస్పా), ఆకుచుట్టు పురుగు, కాండంతొలుచు పురుగులను నివారించింది. ప్రత్యేకంగా గొట్టం పురుగు (నిమ్‌ఫ్యులా డిపంక్టాలిస్)ని సమర్ధవంతంగా నివారించింది. ఈ ద్రావణాన్ని ఒకసారి పిచికారి చేస్తే అన్ని పురుగులు 12 గంటలలో సంహరించబడ్డాయి.. పంటకోత వరకు పురుగులు ఆశించలేదు (భారతి అహిర్వార్, ఆమె అనుచరులు, 2011).
- జార్ఖండ్‌లోని రాంచి జిల్లాకి చెందిన రైతులు వరిలో ఉల్లికోడు నివారణకు వడిసాకులను సేకరించి ఎకరానికి 40 కి. చొప్పున వేస్తారు.
- 100 చ.మీ.కి 5 కి. వడిసె తాజా ఆకులను చల్లి గొట్టం పురుగుని నివారించవచ్చు. (శ్రీవాస్తవ, అతని అనుచరులు, 2009)
- వడిసె ఆకులోని రసాయనాలు నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులను, పిండినల్లులను, లద్దె పురుగులు / లార్వాలను సమర్ధవంతంగా నివారిస్తాయి. దీనిని జీవ పురుగు మందుగా ఉపయోగించవచ్చు.(నమ్రతాకుమారి, ఆమె అనుచరులు, 2016).
- వడిసె మొక్కలోని పాలిఫినాలిక్ పదార్థం పల్స్ బీటిల్, చెదలు, ప్రత్తి ఆకు తినే ఆర్మివర్మ్‌పై కీటకనాశక చర్య ప్రదర్శించింది. అనేక నిల్వ ధాన్యాలనాశించే పురుగుల లార్వాలను సంహరించే శక్తిని ప్రదర్శించింది (పరితోష్ భట్టాచార్య, 2016).
- తోటకూర పంటపై వడిసె ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి తోటకూర ఆకులను తినే లార్వా (హైమెనియా రికర్వాలిస్)ల సంఖ్యను తగ్గించవచ్చు. (అరివుడైనంబి, అతని అనుచరులు, 2010)
- వడిసె ఆకు ద్రావణం ప్రయోగశాలలో ప్రత్తికాయతొలుచు పురుగు, హెలికోవర్ప ఆర్మిజరాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (దేశ్‌ముఖ్, అతని అనుచరులు, 2013).
- వడిసె లేత కొమ్మలను, పొడి ఆకుపొడిని వరి పొలంలో పురుగుల నివారణకు, నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు ఉపయోగించవచ్చు. (సౌమిత్‌బెహరా, అతని అనుచరులు, 2006).
- వడిసె ఆకులనుపయోగించి హెర్బల్ ద్రావణం తయారు చేసి అనేక పురుగులను నివారించవచ్చు.
హెర్బల్ ద్రావణం తయారు చేసే పద్ధతి :
కావలసిన పదార్థాలు :
వడిసె ఆకులు – 1కి.
ఉమ్మెత్త కాయలు – 1 కి.
మధుక లాంగిఫోలియాపిండి – 1 కి.
గన్నేరు పప్పు – 1 కి.
పొగాకు రద్దు – 500 గ్రా.
సున్నం – 250 గ్రా.
ఆవుమూత్రం – 5 లీ.
మట్టికుండ – 1
తయారు చేసే పద్దతి :
- ఒక మట్టి కుండలో వడిసె మొక్క ఆకులు, సన్నగా తరిగిన ఉమ్మెత్త కాయల ముక్కలు, గన్నేరు గింజలు అన్నింటినీ నూరి, మధుకలాంగి ఫోలియాపిండి, పొగాకు రద్దు, సున్నం కలిపి 5 లీ. ఆవు మూత్రం పోయాలి.
- మట్టి పాత్రను మూతతో కప్పి ఎరువు గుంత / మట్టిలో 7 రోజులు పూడ్చి ఉంచాలి.
- పై మిశ్రమాన్ని వడపోసి 1:10 నిష్పత్తిలో నీటితో కలిపి పిచికారి చేసి అన్ని పురుగులను నివారించవచ్చు.
- వడిసె ఆకులు వికర్షక చర్యతో చెదలను అరికడతాయి.
- వరిలో పసుపు రంగు కాండంతొలుచు పురుగు నివారణకు ఎకరానికి 80 కి. వడిసె ఆకులను వేయాలి.
- పశ్చిమ బెంగాల్‌కి చెందిన పురులియా గ్రామ రైతులు వరి చేలో ఎకరానికి 150 కి. వడిసె ఆకులను వేసి పసుపుపచ్చ కాండంతొలుచు పురుగు, గొట్టపు పురుగు, హిస్పాలను సమర్ధవంతంగా నివారించడమేగాక 20-40% అధిక దిగుబడులను పొందారు (కళ్యాణ్ కెవికె, పశ్చిమబెంగాల్, 2017)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.