సేంద్రీయ కర్బనం పెంచితేనే నేల ఆరోగ్యం పదిలం

ఒక్కోసారి మట్టిలోని కార్బన్‌ను సేంద్రియ పదార్థంగా వ్యవహరిస్తుంటారు. సేంద్రియ పదార్థానికి కార్బన్ మూల పదార్థం కాబట్టి, నేలలో ఉండే కార్బన్‌కి సేంద్రియ పదార్థ సాంద్రతకి అనులోమ సంబంధం ఉంటుంది.

సేంద్రియ పదార్థం – సేంద్రియ కర్బనం :
నేలలో ఉండే కార్బన్ గురించి ప్రస్తావించినప్పుడు సేంద్రియ పదార్థంలో కార్బన్ శాతం ఎంత అనే అర్థంలోనే చూడాలి. నేలల్లో ఉండే సేంద్రియ పదార్థం సేంద్రియ కర్బనం స్థాయికి రెట్టింపుగా ఉంటుంది.

సేంద్రియ పదార్థం అంటే ఏమిటి?
మట్టిలో సేంద్రియ పదార్థం పరిమాణం సాధారణంగా తక్కువగానే ఉన్నప్పటికీ, నేల యొక్క భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలపై ఇది ఎంతో కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా మట్టి బరువులో సేంద్రియ పదార్థం సుమారు 1–6 శాతం వరకు ఉంటుంది. పరిమాణంలో తక్కువగా ఉన్నప్పటికీ, నేల ఆరోగ్యం, సారవంతత మరియు పంటల ఉత్పాదకతను నిర్ణయించే ముఖ్యమైన అంశాల్లో సేంద్రియ పదార్థం ఒకటి.
సేంద్రియ పదార్థంలో ప్రధానంగా మొక్కల మరియు జంతువుల అవశేషాలు, సూక్ష్మజీవుల జీవద్రవ్యరాశి (biomass), వాటి విచ్ఛిన్నం ద్వారా ఏర్పడే స్థిరమైన సేంద్రియ పదార్థాలు (హ్యూమస్) ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగస్‌లు, ఆల్గే, ప్రోటోజోవా వంటి సూక్ష్మజీవులు, అలాగే వానపాములు మరియు ఇతర నేలజీవులు సేంద్రియ పదార్థం విచ్ఛిన్నం మరియు పునర్వినియోగంలో కీలక పాత్ర పోషిస్తాయి.

సేంద్రీయ కర్బనం అంటే ఏమిటి?
సేంద్రీయ కర్బనం అనేది నేలలోని సేంద్రియ పదార్థంలో ఉండే ప్రధాన మూలకం. మొక్కల అవశేషాలు, వేర్లు, సూక్ష్మజీవుల అవశేషాలు, జంతు వ్యర్థాలు మరియు వాటి విచ్ఛిన్నం ద్వారా ఏర్పడే హ్యూమస్‌ వంటి పదార్థాలు నేలలో సేంద్రీయ కర్బనానికి ప్రధాన వనరులు.

సేంద్రీయ పదార్థంలో సుమారు 58 శాతం కర్బనం ఉంటుందని సాధారణంగా పరిగణిస్తారు. అందువల్ల నేలలోని సేంద్రియ పదార్థ స్థాయిని అంచనా వేయడానికి సేంద్రీయ కర్బనం (SOC) ఒక ముఖ్యమైన సూచికగా ఉపయోగిస్తారు.

వ్యవసాయ భూమికి సేంద్రీయ కర్బనం (Organic Carbon) జీవనాడి వంటిది. నేల ఆరోగ్యాన్ని, సారాన్ని మరియు పంటల ఉత్పాదకతను నిర్ణయించే ముఖ్యమైన సూచికల్లో ఇది ఒకటి. సాధారణంగా, ఆరోగ్యవంతమైన నేలలో సేంద్రీయ కర్బనం తగిన స్థాయిలో ఉంటుంది. నేలలోని సేంద్రీయ కర్బనం శాతాన్ని ఆధారంగా చేసుకుని నేలలను ఈ విధంగా వర్గీకరించవచ్చు:

  • 0.30% కంటే తక్కువ – అత్యంత తక్కువ సేంద్రీయ కర్బనం ఉన్న నేల
  • 0.30–0.50% – తక్కువ సేంద్రీయ కర్బనం ఉన్న నేల
  • 0.50–0.75% – మధ్యస్థ సేంద్రీయ కర్బనం ఉన్న నేల
  • 0.75–1.00% – అధిక సేంద్రీయ కర్బనం ఉన్న నేల
  • 1.00% కంటే ఎక్కువ – అత్యంత అధిక సేంద్రీయ కర్బనం ఉన్న నేల
    సేంద్రీయ కర్బనం స్థాయి పెరుగుతున్న కొద్దీ నేల భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మెరుగుపడి, నేల ఆరోగ్యం మరియు పంటల ఉత్పాదకతకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి.

భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించిన 70 సంవత్సరాల సమాచారాన్ని పరిశీలిస్తే, నేలలో సేంద్రీయ కర్బనం స్థాయి 1.00% నుండి 0.30%కి పడిపోయినట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు:
• అధికంగా మరియు నిరంతరంగా సాగు చేయడం (Intensive cultivation)
• నీటిపారుదల ఆధారిత సాగు
• రసాయన ఎరువులపై అధికంగా ఆధారపడటం (అసమతుల్య పోషకాల నిర్వహణ)
• సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు, కంపోస్టు వినియోగం తగ్గడం
• పంట అవశేషాలను నేలలో కలపకుండా కాల్చివేయడం లేదా తొలగించడం

వ్యవసాయ నేలల్లో సేంద్రీయ కర్బనం క్షీణించే ధోరణి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో నేల సారం, ఉత్పాదకత గణనీయంగా తగ్గి, అనేక ప్రాంతాలు భూమి క్షీణత (Land degradation)కు గురయ్యే ప్రమాదం ఉంది. నేల సేంద్రీయ కర్బనాన్ని కోల్పోయినప్పుడు దాని భౌతిక, రసాయనిక మరియు జీవసంబంధ లక్షణాలు క్రమంగా దెబ్బతిని, నేల ఆరోగ్యం మరియు పంటల ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి, నేల ఆరోగ్య నిర్వహణలో సేంద్రీయ కర్బనం పరిమాణాన్ని పెంచడం అనేది నేల యాజమాన్య చర్యలన్నింటికంటే అత్యంత ముఖ్యమైనది.

నేలలో సేంద్రీయ కర్బనాన్ని పెంచే దిశగా చేపట్టవలసిన ప్రధాన చర్యలు:

  1. వ్యవసాయ భూమిని అవసరమైన మేరకే తేలికగా మరియు పరిమితంగా దున్నాలి, తద్వారా నేల నిర్మాణం మరియు సేంద్రీయ పదార్థం సంరక్షించబడతాయి.
  2. నేలను తరచుగా ప్రత్యక్ష సూర్యరశ్మికి గురికాకుండా చూడాలి, ఇందుకోసం పంట అవశేషాలు, కవర్‌ క్రాప్స్‌ లేదా ఇతర సహజ కవచాలను వినియోగించాలి.
  3. నేల ఉపరితలాన్ని సాధ్యమైనంత వరకు సేంద్రీయ అవశేషాలతో కప్పి ఉంచాలి (మల్చింగ్‌), తద్వారా నేల తేమ సంరక్షణతో పాటు సేంద్రీయ కర్బనం పెరుగుదలకు దోహదపడుతుంది.
  4. నేలలో సహజంగా జరిగే పోషక చక్రాలను ప్రోత్సహించాలి, తద్వారా పోషకాల పునర్వినియోగం మరియు నేల సారం సహజంగా కొనసాగుతుంది.
  5. పంటలు నేల నుంచి తీసుకునే పోషకాలను సకాలంలో తిరిగి అందిస్తూ, నేలలో పోషకాల సమతుల్యతను కాపాడాలి. ఇందుకోసం నేల పరీక్ష ఆధారిత సమగ్ర పోషక యాజమాన్యాన్ని అనుసరించాలి.
  6. నేల జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించాలి, తద్వారా ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు, వానపాములు మరియు ఇతర నేల జీవుల కార్యకలాపాలు మెరుగుపడతాయి.
  7. నేల కోతను మరియు అదుపులేని నీటి ప్రవాహాన్ని నివారించాలి, తద్వారా సేంద్రీయ కర్బనం సమృద్ధిగా ఉండే పైమట్టి నష్టాన్ని తగ్గించి, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చు.
  8. పచ్చిరొట్ట ఎరువుల సాగు (Green manuring) – జనుము, జీలుగు, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలను పెంచి పూత దశలో నేలలో కలపాలి.
  9. జీవ ఎరువుల వినియోగం – రైజోబియం, అజోస్పిరిల్లం, ఫాస్ఫేట్‌ సొల్యూబిలైజింగ్‌ బ్యాక్టీరియా (PSB), మైకోరైజా వంటి జీవ ఎరువులను అవసరానికి అనుగుణంగా ఉపయోగించాలి.
  10. మల్చింగ్‌ (Mulching) – పంట అవశేషాలు, గడ్డి, ఆకులు లేదా ఇతర సేంద్రియ పదార్థాలతో నేల ఉపరితలాన్ని కప్పడం ద్వారా తేమను సంరక్షించి, సేంద్రీయ పదార్థం చేరికను పెంచాలి.
  11. సమతుల్య పోషక యాజమాన్యం (Integrated Nutrient Management) – సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు మరియు రసాయన ఎరువులను నేల పరీక్ష ఆధారంగా సమతుల్యంగా వినియోగించి, నేల సేంద్రియ పదార్థం మరియు సూక్ష్మజీవుల కార్యకలాపాలను ప్రోత్సహించాలి.
  12. ప్రత్యామ్నాయ పంట పద్ధతులు: పలు కారణాల వల్ల నేలలో సేంద్రీయ కర్బనం తగ్గి ఎడారిగా మారుతోంది. ఇటువంటి సందర్భంలో వెంటనే నేలను సాంప్రదాయ వార్షిక పంటల నుండి మార్చి, తక్కువ నేలను కదిలించే మరియు ఎక్కువ వేరు వ్యవస్థ కలిగిన వృక్ష ఆధారిత వ్యవసాయానికి మారాలి. బహువార్షిక వృక్ష ఆధారిత వ్యవసాయంలో పెంచే పంటలు విస్తారమైన వేరు వ్యవస్థను కలిగి ఉండి, వార్షిక పంటలతో పోలిస్తే వాతావరణంలోని కర్బనాన్ని అధికంగా నేలలో స్థిరీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
    ఉదాహరణకు: 1. మెట్ట తోటల పెంపకం 2. వ్యవసాయ అటవీ పద్ధతులు 3. అటవీ పంటలు 4. బహువార్షిక మేత పంటలు మొదలైనవి.

బి. చంద్ర శేఖర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ (మృత్తికా శాస్త్రం) మరియు జి. సతీష్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ (స్టాటిస్టిక్స్), పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258

Read More

ఎల్‌నినో నేపథ్యం లో ఉత్తర కోస్తా జిల్లాలలో ఖరీఫ్ సాగు పరిస్థితి రబీ పంటల ప్రణాళిక మరియు ఉద్యాన పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే ఒక వాతావరణ పరిణామం. ఈ సముద్ర ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు ప్రపంచంలోని అనేక ప్రాంతాల వాతావరణంపై ప్రభావం చూపుతాయి. మన భారతదేశంలో ఎల్‌నినో పరిస్థితుల వల్ల నైరుతి రుతుపవనాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ఎల్నినో ప్రభావం వల్ల విఫలమై సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యి ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.

ఉత్తరకోస్తా జిల్లాలలో నైరుతి రుతుపవనాలు పై ఎల్‌నినో ప్రభావం
2026 జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నమోదైన వర్షపాతం పరిస్థితిని గమనించినట్లయితే అనకాపల్లి జిల్లాలో, ఖరీఫ్ సాధారణ వర్షపాతం 479.6 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 229.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యి సాధారణంతో పోలిస్తే 52.2 శాతం లోటు నమోదు అయ్యింది. విశాఖపట్నం జిల్లాలో, సాధారణ వర్షపాతం 427 మిల్లీమీటర్లు కాగా, వాస్తవ వర్షపాతం 175.7 మిల్లీమీటర్లు నమోదు అయ్యి 58.9 శాతం లోటు లో ఉంది. విజయనగరం జిల్లాలో, సాధారణ వర్షపాతం 484.4 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 288.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 40.4 శాతం లోటు ఉంది. శ్రీ కాకుళం జిల్లాలో, సాధారణ వర్షపాతం 503 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 293.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 41.7 శాతం లోటు ఉంది. ఈ లోటు వర్షపాతం వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గి పోవడమే కాక సాగులో ఉన్న పంటల దిగుబడులపై ప్రభావం చూపనుంది. ఎల్నినో ప్రభావం వల్ల అనకాపల్లి జిల్లాలో 26,434 హెక్టార్లు, విశాఖపట్నం జిల్లాలో 2,586 హెక్టార్లు. విజయనగరం జిల్లాలో 24,289 హె . విస్తీర్ణం ఖాళీగా సాగు కాకుండా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇతర నీటి వనరులు ఉండడం వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం అంతగా తగ్గలేదు.

  సెప్టెంబర్ మాసము లో బంగాళాఖాతం లో తీవ్ర అల్పపీడనం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలలో మంచి వర్షపాతం నమోదు అయ్యి రబీ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అల్పపీడనం వల్ల అనకాపల్లి జిల్లాలో 310.4 మి.మీ, విశాఖపట్నం జిల్లాలో 363.8 మి.మీ, విజయనగరం జిల్లాలో 288.4 మి.మీ అలాగే శ్రీకాకుళం జిల్లాలో 330.5 వర్షపాతం నమోదు అయ్యింది. భూగర్భజలమట్టం కూడా పెరగడం రబీ సాగుకు చాలా అనుకూలంగా ఉంది. నీటిలభ్యతను బట్టి రబీ పంటల ప్రణాళికను రూపొందించుకోవాలి.

ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లోని మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం ఆర్ధిక శాస్త్రవేత్తలు రాబోయే కాలం లో ఏ ఏ పంటలకు మార్కెట్ డిమాండ్ ఉంటుందో ముందుగానే తెలియజేస్తారు. మొక్కజొన్న: ప్రస్తుత ధర క్వింటాల్ రూ. 2,580. అదే జనవరి 2027: రూ. 3,080-3,388. ఫిబ్రవరి 2027 రూ. 3,190-3,445 వరకు ఉండవచ్చును. ఈ విధంగా అన్ని పంటలకు ప్రస్తుత మార్కెట్ ధర రాబోయే కాలంలో మార్కెట్ ధర ముందుగానే రైతులు తెలుసుకోవచ్చు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకొని రబీ పంటల ప్రణాలళికను రూపొందించుకోవాలి.

ఉత్తర కోస్తా జిల్లాల రబీ పంటల ప్రణాళిక
ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా అన్ని అంశాలను పరిగణ లోనికి తీసుకొని రబీ పంటల ప్రణాలళికను రూపొందించడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 73,376 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది. వరి – 6,929 హెక్టార్లలో సాగు చేయనున్నారు. అలాగే మిగిలిన విస్తీర్ణంలోఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి , పప్పుదినుసు పంటలైన పెసర , మినుము వేరుశనగ, చెరకు, ఉలవలు, నువ్వులు, పొద్దుతిరుగుడు మరియు జీలుగ పంటలను సిఫారసు చేయడం జరిగింది.

అలాగే విజయనగరం జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 69030 హెక్టార్లు కాగా, రబీ 2026–27లో సుమారు 1,000 హెక్టార్లలో వరి సాగు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన జొన్న, మొక్కజొన్న, రాగి, ఉలవలు పప్పుదినుసు పంటలైన పెసర, మినుము శనగ, వేరుశనగ, చెరకు, నువ్వులు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

విశాఖపట్నం జిల్లాలో రబీ 2026–27 సీజన్‌కు సంబంధించి విశాఖపట్నం జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 3125 హెక్టార్లు. 596 హెక్టార్లలో వరి మిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి, ఉలవలు పప్పుదినుసు పంటలైన పెసర, మినుము, వేరుశనగ, చెరకు, నువ్వులు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

అనకాపల్లి జిల్లాలో రబీ 2026–27 సీజన్‌కు సంబంధించి జిల్లాలో సాధారణ రబీ విస్తీర్ణం మరియు ఖరీఫ్ లో సాగు చెయ్యకుండా మిగిలిన విస్తీర్ణం కలిపి 22,689 హెక్టార్లు. 3200 హెక్టార్లలో వరిమిగిలిన విస్తీర్ణంలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, రాగి, ఉలవలు, అలసందలు, పప్పుదినుసు పంటలైన పెసర, మినుము, వేరుశనగ, చెరకు, నువ్వులు, పొద్దుతిరుగుడు, జనుము పంటలను సిఫారసు చేయడం జరిగింది.

రకాల ఎంపిక మరియు విత్తన లభ్యత
వరి లో స్వల్పకాలిక రకాలైన NLR-3449, MTU-1064, MTU-1061, MTU-1121 మరియు RNR-15048
మొక్కజొన్న లోమార్కెట్ లో దొరికే ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను ఉపయోగించవచ్చు.
రాగి: వేగావతి, ఇంద్రావతి మరియు శ్రీ చైతన్య.
పెసర: ఎల్.జి.జి-630, ఎల్.జి.జి -607, ఎల్.జి.జి -574, టి.ఎం.-96-2 మరియు ఐ.పి.ఎం.-2-14
మినుము: ఎల్.బి.జి-904, టి.బి.జి-129, ఎల్.బి.జి-884, జి.బి.జి-1, టి.బి.జి-104, ఎల్.బి.జి-752 మరియు పి.యు-31.
ఉలవలు: ఎ.టి.పి-11 మరియు వి.జెడ్.ఎమ్-1.
అలసంద: రకాలు ఆర్కా సమృద్ధి, ఆర్కా మంగళ మరియు ఆర్కా అర్జున్
వేరుశెనగ: రకాలు టి.జి.సి.ఎస్. 1694 మరియు కె.-6.
నువ్వులు: రకాలు వై.ఎల్.ఎమ్ -66 మరియు వై.ఎల్.ఎమ్ -146.
పొద్దుతిరుగుడు: ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను ఉపయోగించవచ్చు.
జనుము: ఎస్.హెచ్-4, సువిన్

రబీ పంటల సాగుకు అవసరమైన విత్తనాల్లో కొంతమేర రైతుల వద్దనే అందుబాటులో ఉన్న సొంత విత్తనాన్ని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా పప్పుధాన్యాలు, నువ్వులు, రాగి, చెరకు పంటల్లో రైతుల వద్ద సుమారు 30 శాతం వరకు సొంత విత్తనం అందుబాటులో ఉంటుంది

మిగిలిన నాణ్యమైన విత్తనాలను ఏపీ సీడ్స్, విజయనగరం, కృషి విజ్ఞాన కేంద్రం, ఆముదాలవలస, వ్యవసాయ పరిశోధనా కేంద్రం రాగోలు, వ్యవసాయ కళాశాల నైరా, వ్యవసాయ పరిశోధనా కేంద్రం యలమంచిలి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అనకాపల్లి మరియు ఇతర ANGRAU విత్తన విక్రయ కేంద్రాల ద్వారా పొందవచ్చు.

రబీ పంటలు విత్తే కాలం
రబీ పంటల సాగులో సరైన సమయంలో విత్తనాలు విత్తడం చాలా ముఖ్యమైన విషయం. పంటను బట్టి అనుకూలమైన విత్తే సమయం మారుతుంది. కాబట్టి రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో విత్తడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు.

మొక్కజొన్న అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. జొన్న పంటను అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు. రాగి పంటకు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విత్తే సమయం అనుకూలంగా ఉంటుంది. పెసర మరియు మినుము పంటలను అక్టోబర్ నెలలో విత్తుకోవచ్చు. శనగ పంటను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. ఉలవ పంటకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తే సమయం అనుకూలంగా ఉంటుంది. వేరుశనగ పంటను నవంబర్ 15 నుంచి డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. అలాగే జనుము పంటను అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు.

పప్పుదినుసు పంటలైన మినుము పెసర సాగు చేసినప్పుడు పూత మరియు కాయ దశలో ఒక తేలికపాటి తడిని ఇవ్వవలిసి ఉంటుంది. బరువు నేలలలో అయితే మినుము తేలికపాటి నేలలలో అయితే పెసర పంటను వేసుకోవడంమంచిది.

జనుము పంటను రబీ కాలంలో విత్తనోత్పత్తి కోసం రైతులు సాగు చేస్తారు. అయితే జనుము పంటను లోతట్టు ప్రాంతాలలో వెయ్యకూడదు. తేమ ఎక్కువ అయితే జనుము పంట తట్టుకోలేదు. అలాగే కాయ దశలో పురుగు ఆశించే అవకాశం ఉన్నందున పంటను పరిశీలిస్తూ తగిన సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి.

ఎల్‌నినో నేపథ్యంలో ఉధ్యాన వన తోట పంటలలో సూచనలు
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ, సెప్టెంబరు నెలలో కురిసిన వర్షాలతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భూగర్భజల లభ్యత కొంత మెరుగుపడింది. ఈ పరిస్థితులను బట్టి రైతులు తమ వద్ద ఉన్న నీటి వనరులను అంచనా వేసుకొని టమాటా, మిరప, వంకాయ, బెండ, ఉల్లి వంటి కూరగాయలను సాగు చేసుకోవచ్చు. పంటను ఎంచుకునేటప్పుడు నీటి అవసరంతో పాటు స్థానికంగా ఉన్న మార్కెట్‌ డిమాండ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కూరగాయల సాగుకు మంచి నాణ్యత కలిగిన నారును ఉపయోగించడం వల్ల పంట ప్రారంభ దశలోనే మంచి మొక్కల పెరుగుదల సాధ్యమవుతుంది. నర్సరీలను నీరు నిల్వ ఉండని ప్రదేశాల్లో ఏర్పాటు చేసి, అవసరమైనంత తేమను మాత్రమే అందిస్తూ, తెగుళ్లు మరియు వ్యాధుల లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించాలి.

మామిడి, జీడి, కొబ్బరి, అరటి వంటి పండ్ల తోటల్లో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. బిందు సేద్యం, చెట్ల చుట్టూ మల్చింగ్‌ చేయడం వంటి పద్ధతులతో నేలలో తేమను నిలుపుకోవడంతో పాటు నీటి వృథాను తగ్గించవచ్చు. ముఖ్యంగా పూత, పిందె దశల్లో నీటి కొరత రాకుండా చూసుకోవాలి. తోటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ తెగుళ్లు, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే మంచి దిగుబడితో పాటు రైతులకు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

*డా .వి .గౌరి, డా.ఎన్.రాజ్ కుమార్, *డా.ఎ.అలివేణి, *డా.ఎన్.భారతి, డా.ఎం.బి.జి.ఎస్.కుమారి, డా.కె.లక్ష్మణ, డా. కె.భాగ్యలక్ష్మి మరియు *డా. సి.హెచ్.ముకుందరావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లి, ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, Ph: 6304852859, 8074670166

Read More

ఔషధ మొక్క… చెంగల్వ కోస్టు

సాధారణ నామం: ఎలిగెంట్ కాస్టన్, కేవుకంద, బోగచ్చిక దుంప, బేసికదుంప
శాస్త్రీయ నామం: కోస్టస్ స్పీసియోసస్
కుటుంబం: జింజిబెరేసి

ఇది అల్లం దుంప వంటి వేరుగల మొక్క. దుంప అల్లం కంటే పెద్దగా ఉంటుంది. కొమ్మలు సాధారణంగా వర్తులాకారపు వంపు కలిగి 1-2 మీ. ఎత్తు పెరుగుతాయి. కణుపుకు ఒకటి చొప్పున సామాన్య పత్రాలు దీర్ఘచతురస్రాకారములో ఉండి మెత్తని నూగు కలిగి ఉంటాయి. పుష్పాలు తెల్లగా, పెద్దవిగా కొమ్మచివర దట్టమైన గుత్తివలె ఏర్పడతాయి. రక్షక పత్రాలు ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఫలాలు కూడా ఎర్రగా ఉంటాయి. దీనిని దుంపల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దుంపలకు లేదా కొమ్ములకు ఔషధ గుణాలున్నాయి. ఈ దుంపల నుండి డయోస్ జెనిన్ అనే స్టిరాయిడ్ లభిస్తుంది.
  • విరేచనకారి, క్రిమిసంహారి, జీర్ణశక్తిని అభివృద్ది చేస్తుంది. జ్వరము, చర్మవ్యాధులు, ఉబ్బు కామెర్లకు ఉపయోగపడుతుంది. పాము కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. గర్భనిరోధక మందుల తయారీలో డయోస్‌జెనిన్ స్టిరాయిడ్ ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • చెంగల్వకోస్టుని విస్తృతంగా అలంకరణ మొక్కగా పెంచుతారు. చెంగల్వకోస్టు ద్రావణాలు (2500, 5000, 10000, 20000 పిపియం) ప్లూటెల్లా క్లైలోస్టెల్లా లార్వాలపై గణనీయమైన నివారణ చర్య చూపాయి. ఇథనాల్ ద్రావణం అత్యంత సమర్ధవంతంగా ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా లార్వాలను నివారించింది. లార్వాలపై ద్రావణాల ప్రభావం ఈ క్రింది క్రమంలో ఉంది.
  • ఇథనాల్ & క్లోరోఫాం & బ్యూటనాల్ & నీరు (అశిష్ కుమార్, అతని అనుచరులు, 2016).
  • చెంగల్వకోస్టు ద్రావణం షిగెల్లా, స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియా కోలి, క్లెబ్సియెల్లా న్యుమోనియే, సూడోమోనాస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, సాల్మొనెల్లాపై గణనీయమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి. చెంగల్వకోస్టు ద్రావణం నుండి వేరు చేసిన అవినోకోసైడఎ, ట్రెగోజెనిన్, సపోనిన్‌బి, సపోనిన్‌సి, బోట్రైటిస్ సినరియా, ఆల్టర్నేరియా టెన్యుస్సిమా, ఫ్యుజేరియంపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించాయి (సింగ్, అతని అనుచరులు, 1992).
  • చెంగల్వకోస్టు ద్రావణం రెండు మచ్ౘ్ల ఎర్రనల్లి, టెట్రానైకస్ అర్టికె ఆడపురుగుల పునరుత్పత్తిని, పొదిగిన గుడ్ల శాతాన్ని, గుడ్లు పెద్ద పురుగుల దశకు చేరే శాతాన్ని, జీవిత చక్రంలో ప్రతిదశ సమయాన్ని సమర్ధవంతంగా అరికట్టింది. ఈ ద్రావణం 79.67% లార్వాలను అకారిసైడల్ చర్య ద్వారా చంపింది. గుడ్లు పొదిగే సమయాన్ని బాగా పెంచింది (ఇస్మాయిల్, 2017).
  • చెంగల్వ కోస్టు (కోస్టస్ స్పీసియోసా), కోస్టస్ లాసెరస్, కోస్టస్ గ్లోబోసస్ దుంపల నుండి వేరు చేసిన డయోస్‌జెనిన్ ప్లూటెల్లా క్లైలోస్టెల్లాపై తక్కువ స్పర్శ, ఓవిసైడల్ చర్యను ప్రదర్శించింది. కాని అధిక శక్తివంతమైన కీటకపెరుగుదల క్రమబద్ధీకరణ చర్య, అధిక గుడ్లు పెట్టకుండా నిరోధించే చర్యను ప్రదర్శించింది. లార్వా, ప్యూపాల రూపాలలో కూడా మార్పు తెచ్చింది. కాని ప్లూటెల్లా క్లైలోస్టెల్లా నాశించే పారసైటాయిడ్, కొటీసియా ప్లూటెల్లాకు ఎలాంటి హాని చేయలేదు (పిపిత్‌సంగ్‌చన్ అండ్ మొరాల్లోరెజెసస్, 2005).
  • చెంగల్వకోస్టు వేరు ద్రావణం డెంగ్యూ మరియు యెల్లో ఫీవర్ వాహకం ఈడెస్ ఈజిప్టిపై గణనీయమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. అందువలన దీనిని డెంగ్యు మరియు యెల్లోఫీవర్ నివారణలో ఉపయోగించవచ్చు (అడెబాజొ, అతని అనుచరులు, 2012).
  • చెంగల్వకోస్టు దుంపను నలగ్గొట్టి పేస్టు చేసి దాని నుండి రసం పిండాలి. ఈ రసాన్ని నీటిలో కలిపి వరి చేలో పంటపై పిచికారి చేసి రైస్‌హిస్పా (తాటాకు తెగులు)ని నివారించవచ్చు. ఈ పద్ధతిని అస్సామ్‌లో కామ్‌రూప్ జిల్లాలోని అమ్‌టోలా గ్రామ రైతులు ఆచరిస్తున్నారు (హరేన్‌కల్టియా, 2003).
  • చెంగల్వకోస్టు ద్రావణం రెండు మచ్చల ఎర్రనల్లి టెట్రానైకస్ అర్టికెని అకారిసైడల్ చర్య ద్వారా నియంత్రించింది (ఇస్మాయిల్).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

కాయతొలుచు పురుగు నివారణకు పచ్చిమిర్చి – వెల్లుల్లి ద్రావణం

పచ్చిమిర్చిలో ‘కాప్సిసిన’ అనే ఆల్కలాయిడ్ మరియు వెల్లుల్లిలో ‘అల్లెసిస’ అనే ఆల్కలాయిడ్‌లు ఉంటాయి. వీటి ప్రభావం వల్ల పురుగుకు స్పర్శ చర్య ద్వారా ‘తిమ్మిరి’ గుణాన్ని కలిగిస్తాయి. దీనివలన పురుగు మొక్క పై నుండి క్రిందపడి చనిపోతుంది.
శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, ఎర్రగొంగళి పురుగు (మూడవ దశ వరకు) నివారణకు ఈ ద్రావణాన్ని పత్తి, కంది, శనగ, వేరుశనగ, ఆముదం, వంగ, టమాట, మిరప పంటలలో రైతులు పురుగు ఉధృతిని బట్టి వాడవచ్చు.

కావలసిన పదార్థాలు :
పచ్చిమిర్చి : 3 కిలోలు
వెల్లుల్లి : అరకిలో
కిరోసిన్ : పావులీటరు (250 మి.లీ.)
సబ్బుపొడి : 100 గ్రా.

తయారు చేసే విధానం :

  • 3 కిలోల పచ్చిమిరప కాయలను కాడలు తీసి వాటిని మెత్తగా నూరి, దానిని 10 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా బాగా నానబెట్టాలి.
  • అరకేజి వెల్లుల్లిపాయలను పొట్టుతీసి వాటిని బాగా నూరి 250 మి.లీ. కిరోసిన్‌లో ఒక రాత్రంతా నానబెట్టాలి.
  • మర్నాడు పచ్చిమిర్చి ద్రావణాన్ని ఒక పలుచని గుడ్డతో వడపోయాలి.
  • మిరప ద్రావణం, వెల్లుల్లి ద్రావణం, 100 గ్రాముల సబ్బుపొడి ద్రావణం, ఈ మూడింటిని బాగా కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి.
  • ఈ విధంగా తయారు చేసిన ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పొలంలో సాయంత్రం పూట పిచికారి చేయాలి.

ఉపయోగాలు: పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణాన్ని వంగలో వచ్చే కాయతొలుచు పురుగు నివారణకు, బెండ, టమాట పంటల నాశించే కాయతొలుచు పురుగుల నివారణకు, పత్తిలో వచ్చే కాయతొలుచు పురుగుల నియంత్రణకు వాడి మంచి ఫలితాలు సాధించవచ్చు.

జాగ్రత్తలు :

  • ఈ ద్రావణం చాలా శక్తివంతమైన క్రిమిసంహారకంగా పనిచేస్తుంది.
  • ఈ ద్రావణం పంటలపై పిచికారి చేసిన 4-5 రోజుల తర్వాత పశువుల పేడ, మూత్రం ద్రావణం పిచికారి చేయడం చాలా మంచిది. దీని వలన పంటలకు పోషకాలు లభించి ఆరోగ్యవంతంగా ఉంటాయి.
  • ఈ ద్రావణం తయారు చేయునపుడు ఒంటికి నూనె రాసుకోవటం అవసరం.
  • పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పంటలపై పిచికారి చేయునపుడు ఒంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
  • పంట కాలంలో 1-2 సార్లు మాత్రమే ఈ ద్రావణాన్ని వాడాలి.
  • తయారు చేసిన ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.
    పచ్చిమిర్చికి ప్రత్యామ్నాయంగా ఎండుమిర్చిని కూడా ఉపయోగించవచ్చు.
Read More

ఔషధ మొక్క…. కొత్తిమీర

కొతిమీర 50 సెం.మీ. ఎత్తు పెరిగే మెత్తని మొక్క. ఆకులు అనేక ఆకారాలలో ఉంటాయి. మొక్క మొదలు వద్ద ఆకులు వెడల్పుగా ఉండి అనేక భాగాలుగా ఉంటాయి. పూత వచ్చే కాండాలపై ఆకులు సన్నగా ఈకలులా ఉంటాయి. పూలు చిన్న అంబెల్‌పై ఏర్పడతాయి. తెలుపు లేదా లేత పింకు రంగులో ఉంటాయి. కాయ గుండ్రంగా 2-6 మి.మీ. పొడవు, 3-5 మి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.

సాధారణ నామం : కోరియాండర్ శాస్త్రీయ నామం : కోరియాండ్రం సెటైవం కుటుంబం: ఎపియేసి (అంబెల్లిఫెరే)

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • కొతిమీర బహుళ ఆరోగ్య ప్రయోజనాలు గల మొక్క. ఇది అద్భుతమైన ఆకలిని కలిగిస్తుంది. కడుపులో జీర్ణాశయంలో అనేక ఎంజైములు, జీర్ణ రసాలు స్రవించడానికి సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచి విరేచనం సాఫీగా అయేలా చేస్తుంది. ఇది ఆహారంలో పీచు పదార్థం అందిస్తుంది. జీర్ణకోశంలో వాయువులను విడుదల చేస్తుంది. మలబద్దకం, మొల్లలు, కడుపునొప్పికి ప్రయోజనకారి. దగ్గు తగ్గించడానికి, నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఒక అద్భుత యాంటిసెప్టిక్. కఫాన్ని తగ్గించి, జ్వరాన్ని పోగొట్టి చల్లదనాన్ని ఇస్తుంది.
  • కొతిమీరలో అనేక పోషక విలువలుండటం వలన దీనిని “ప్రపంచ అద్భుత హెర్బల్ మొక్క”గా పరిగణిస్తారు. ఇది అనేక పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్, యాంటిసెప్టిక్, బాధనాశక, ఉత్తేజిత, శిలీంద్రనాశక లక్షణాలు కలిగి ఉంటుంది.
  • కొతిమీర విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఎసెన్షియల్ ఆయిల్స్, ఆమ్లాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఆకులలో కాల్షియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్, సోడియం ఉంటాయి.
  • 100 గ్రా. కొతిమీరలో 3.67 గ్రా. పిండిపదార్థాలు, 2.13 గ్రా. ప్రోటీన్లు, 0.52 గ్రా. కొవ్వు, 2.80 గ్రా. పీచు, 23 కి. క్యాలరీల శక్తి, 62 మైక్రోగ్రాముల ఫోలియేట్స్, 1.11 మి.గ్రా. నియాసిన్, 0.55 మి.గ్రా. పాంటోథీనిక్ యాసిడ్, 0.14 మి.గ్రా. పైరిడాక్సిన్, 0.16 మి.గ్రా. రైబోఫ్లేవిన్, 0.067 మి.గ్రా. థయామిన్, 6748 ఐయు విటమిన్ ఎ, 27 మి.గ్రా. విటమిన్ సి, 2.50 మి.గ్రా. విటమిన్ ఇ12, 310 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటాయి.
  • కొతిమీర కొలెస్టరాల్‌ని తగ్గిస్తుంది. జీర్ణకోశ కదలికలు సాఫీగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్‌కి మంచిది. అల్ౙీమర్ వ్యాధిని తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మూత్రనాళ వ్యాధులను నివారించి మూత్రం సాఫీగా పారేలా చేస్తుంది. మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
  • కొతిమీరలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ కీళ్ళ నొప్పుల వల్ల కలిగే శరీర వాపుని తగ్గిస్తుంది. మొటిమలను తొలగిస్తుంది. గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. కండ్ల కలక చకిత్సకు అద్భుత ఔషధం కొతిమీరలో ఉండే బీటాకెరోటిన్, యాంటిఆక్పిడెంట్లు కంటి సంబంధిత సమస్యలను నివారిస్తాయి. నోటి పుండ్ల నివారణకు ఇంటిమందు. ఎముకలను బలపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తుంది. రుతు సమస్యలకు మహిళలు 5 గ్రా. కొత్తిమీర, ఒక చెంచా పంచదార అర లీటరు నీటిలో కలిపి మరగించిన కషాయాన్ని వడపోసి రోజుకి 3 సార్లు సేవించాలి. కేశ నష్టాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కోలన్ క్యాన్సర్‌ని నివారిస్తుంది.
  • కొతిమీర చట్నీ తయారు చేసి వడ్డించవచ్చు. పొడి చేసిన గింజలను కేకుల తయారీలో ఉపయోగించవచ్చు. గ్రైప్ వాటర్ తయారీలో ఉపయోగిస్తారు. కొతిమీర యాంటిసెప్టిక్, అనాల్ౙెసిక్, అఫ్రోడియాసిక్, యాంటిస్పాస్మోడిక్, డియోడరెంట్, ఫంగిసైడల్, స్టిమ్యుటెంట్, స్టమకిక్, యాంటి బయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కొతిమీరలో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. యాంటిక్యాన్సర్, యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

వ్యవసాయరంగంలో

  • కొతిమీర గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్‌లో లినలూల్ (57.57%), జిరానిల్ అసిటేట్ (15.09) ఎక్కువగా ఉంటాయి. ఈ రసాయనాలు ట్రైబోలియం కాస్టానియం కంటే కొల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించాయి. (ఖని, రహ్‌దారి, 2012).
  • టమాట పంటలో కొతిమీరని అంతరపంటగానే వేయడం వల్ల వివిధ రసం పీల్చే పురుగులు, తెల్లదోమ (బెమిసియా టబాసి), పేనుబంక (ఎఫిస్‌గాసిపి), జాసిడ్స్ (ఎంపోవాస్కాస్పీసీస్), తామర పురుగులు (త్రిప్స్ టబాసి), రెండు మచ్ౘ్ల ఎర్రనల్లి (టెట్రానైకస్ అర్టికె) సమర్ధవంతంగా, గణనీయంగా నివారించబడ్డాయి. ఈ పరిశోధనా ఫలితాలు ఆర్థిక పంటలతో ఆకర్షక మొక్కలను పెంచే పద్ధతిని సమగ్ర సస్యరక్షణ పథకాలలో ఒక భాగంగా సిఫారసు చేసి ఆర్థిక పంటలను పురుగుల బారి నుండి రక్షించవచ్చని వెల్లడించాయి (అబోషనాబ్, అతని అనుచరులు, 2017).
  • సహజ సుగంధపంటలైన పైపర్‌నైగ్రం, క్యూమినం సిమ్నియం, సిన్నమోమం వెరం, అల్లియం సెటైవం, కోరియాండ్రం సెటైనం, కర్కుమ, ఫీనిక్యులం వుల్గేర్, ట్రైగొనెల్లా ఫీనం గ్రీకం, సైజిగియం ఆరోమాటికం, క్యాప్సికం, జింజిబర్ అఫిసినాలిస్, మురయూ కోయినిగీ, బ్రాసికా నైగ్రా, సోడియం క్లోరైడ్‌లను కలిపిన మిశ్రమాన్ని పాటింగ్ మట్టితో కలిపి మొక్కలకు వేయాలి. ఈ జీవ పురుగు మందు వికర్షక చర్య, జీర్ణాశయంలో నిలిచిపోవడం, పక్షవాతం, ఊపిరాడకుండా చేయడం ద్వారా పురుగులను నివారిస్తాయి. ఈ జీవమందుని పొడిరూపంలో లేదా ద్రవరూపంలో పంటపై పిచికారి చేసి పురుగులను 48-72 గంటలలో నివారించవచ్చు. (గండిఐషాడోటి, 2012). ఈ జీవ పురుగు మందుని చ.మీ.కి. 100-500 గ్రా. చొప్పున వేయాలి.

జీవపురుగుమందులోని పదార్థాలు
మొక్క శాతం
పైపర్ నైగ్రమ్ 25.75
క్యుమినం సైమినం 15.45
సిన్నమోమం వెరమ్ 11.05 కోరియాండ్రం సెటైవం 12.80
కర్కుమ 7.44
ఫీనిక్యులం వుల్గేర్ 2.37
ట్రైగోనెల్లా ఫీనంగ్రీకం 3.65
సైజిగియం ఆరోమాటికం 2.58
క్యాప్సికం 1.38
జింజబర్ అఫిసినానిస్ 3.36
మురయా కోయినిగీ 1.60
బ్రాసికా నైగ్రా 0.03
సోడియం క్లోరైడ్ 0.17

  • కొతిమీర ఎసెన్షియల్ ఆయిల్ ఆల్టర్నేరియా టెన్యుయిస్, ఆస్పర్ౙిల్లస్ ఒరైజె, పెనిసిలియంక్రైసోజినం శిలీంద్రాలనరికట్టాయి (డోవిగిచ్, 1971)
  • జాన్‌కౌస్కా & జైట్కా (2016) క్యారట్ పంటలో కొతిమీర (కోరియాండ్రం సెటైవం), సమ్మర్ సావొరి (సాటురేజ హార్టెన్సిస్) అంతర పంటలప్రభావంపై అధ్యయనం చేశారు. అంతర పంటలు క్యారట్‌రస్ట్‌ఫ్లెå (సైలారోజే) వలన వేర్లకు కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించాయి. అంతర పంటలు వేసిన క్యారట్ క్షేత్రంలో ఆకులపై సిల్లిడ్ (ట్రైయజా విరిడ్యులా), పేనుబంక, వేర్లపై నులిపురుగుల నష్టం గణనీయంగా తక్కువగా ఉంది. కొతిమీర, సావరి అంతర పంటలుగా వేయడం వలన క్యారట్ పంటలో ప్రయోజనకర కీటకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రయోగాలు జరిపిన అన్ని సంవత్సరాలలో కొతిమీరని అంతర పంటగా వేసిన క్యారట్ క్షేత్రంలో బదనికలు అక్షింతల పురుగులు, సిర్పిడ్ ఈగల సంఖ్య అధికంగా ఉంది.
  • కొతిమీరలో ఉన్న లిమలూల్ (68.2%), పైనీన్ (5.5%), టెర్పినిన్ (5.5%) అనే ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే అకాంతోసెరిడస్ ఒబ్టెక్షన్‌పై ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించాయి (రిగ్నాల్ట్‌రోగర్, 1997).
  • కొతిమీర మొక్కలు పురుగుల సహజశత్రువులైన అల్లిక రెక్కల పురుగు (క్రైసోవా), అక్షింతల పురుగులు (కాక్సినెల్లిడ్స్), హోవర్ ఈగలు, పరాన్నజీవులైన చిన్న కందిరీగలను ఆకర్షిస్తాయి.
  • కాలీఫ్లవర్ పంటనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాకెå్ౙలోసెల్లా సమగ్ర సస్యరక్షణ పథకంలో కొతిమీరని కాలీఫ్లవర్‌లో అంతర పంటగా వేయడం ఒక పద్ధతి.

కాలీఫ్లవర్ పంటలో డైమండ్ బ్యాక్ మాత్ యాజమాన్యానికి సిఫారసు చేసిన సమగ్ర సస్యరక్షణ పథకం
క్ర.సం. ట్రీట్‌మెంట్ మోతాదు/ప్లాట్ ఎన్నిసార్లు ఉపయోగించాలి
1. కొతిమీరని అంతర పంటగా సాగు చేయడం అర కిలో విత్తనం ఒకసారి
2. రసాయన పురుగుమందు లోర్స్‌బాన్ (2%) పిచికారి 16 మి.లీ/8 లీ. 3 సార్లు
3. 2% వేపగింజల కషాయం పిచికారి 16 మి.లీ./8 లీ. 3 సార్లు
4. 2% వేపనూనె పిచికారి 16 మి.లీ./8 లీ. 3 సార్లు
5. జీవనియంత్రణట్రైకోగ్రామాకిలోనిస్ (పారసైటాయిడ్) ప్యూపాల కార్డు
(పర్వీన్, ఖాన్)

  • కొతిమీర గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్ స్పోడోప్టెరా లిట్టొరాలిస్ 3వ దశ లార్వాలపై అత్యధిక ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది. (సౌగ్విర్, అతని అనుచరులు, 2013).
  • కూరగాయల సాగులో కొతిమీరను సహవాస పంటగా వేస్తే పేనుబంకను వికర్షిస్తుంది. ఎర్రనల్లి, పొటాటో బీటిల్స్ ఆశించకుండా చేస్తుంది.
    కొతిమీర సహజ శత్రువుల జీవిత కాలాన్ని పెంచుతుంది. అల్లిక రెక్కల పురుగు, హోవర్ ఈగ, ట్రైకోగ్రామా కిలోనిస్ పారసైటాయిడ్‌ని ఆకర్షిస్తుంది (టినాకా, 2014).
  • ఇర్వింగ్, అతని అనుచరులు (2014) కొత్తిమీర డాలికోగెనిడియా టస్మానికా సహజ శత్రువు జీవిత కాలాన్ని పెంచుతుందని నిరూపించారు.
  • కొతిమీర నుండి సృష్టించిన కొత్త సస్యరక్షణ ఎసెన్షియల్ ఆయిల్ ఉత్పత్తులు మూడు పేనుబంక జాతులు మాక్రోసైఫం రోజే, ఎఫిస్ నెరీ, ఎఫిస్ పోమి లపై గట్టి కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (అటనసోప, 2017).
  • బెల్‌పెప్పర్‌లో అధిక నష్టం కలిగించే యూరోపియన్ కార్న్‌బోరర్, ఆస్ట్రినియా న్యూబిలాలిస్ సంరక్షణ జీవనియంత్రణకు అధ్యయనం జరిపారు. కొతిమీర, డిల్, బక్‌వీట్ అంతర పంటలను 3 బదనికలు చిన్నపైరేట్‌నల్లి (ఓరియస్ ఇన్సిడియోసస్), పింక్ మచ్చల అక్షింతల పురుగు (కోలియోయెగిల్లా మాక్యులేటస్), ఆకుపచ్చ అల్లిక రెక్కల పురుగు (క్రైసోపాస్పీ.)ని ఆకర్షించడానికి ఎంచుకున్నారు. వీటిని బెల్ పెప్పర్ ప్లాట్ల దక్షిణహద్దులో ఒకదాని తర్వాత ఒకటి 5వరుసల్లో నాటారు. బెల్ పెప్పర్ పంటలో కొతిమీర, డిల్‌ని కలిపి రెండు వరుసల్లో నాటారు. బక్ వీట్‌ని పంటలేని భూమిలో ఒక వరుసలో నాటారు.
  • పరిశోధనా ఫలితాలు అంతర పంటలు బెల్‌పెప్పర్‌ని తీవ్రంగా ఆశించే యూరోపియన్ కార్న్‌బోరర్‌ని సమర్ధవంతంగా నివారించాయని వెల్లడించాయి. అంతర పంటలు చిన్నపైరేట్ నల్లి, పింక్ మచ్చల అక్షింతల పురుగులు అధికంగా యూరోపియన్ కార్న్‌బోరర్ గుడ్లను తినడాన్ని ప్రోత్సహించాయి. (బికర్‌టన్, హోమిల్టన్, 2017).
  • ఫాబా చిక్కుడు రకాలలో కొతిమీరని అంతరపంటగా వేయడం వలన పేనుబంక పురుగులు, ఎఫిస్ క్రాక్సివొర గణనీయంగా తగ్గిపోయాయి. బదనికలు, గింజ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ప్లాట్ చుట్టూ కొతిమీర స్ట్రిప్ వేసిన 843 రకం ఫాబి చిక్కుడు ప్లాటులో అతి తక్కువ పేను బంక పురుగుల సంఖ్య నమోదైంది (రిజ్క్, 2011).
  • గ్రీన్‌హౌస్ టమాట సాగులో తెల్లదోమ, ట్రైఎల్యురాడెస్ వేపొరేరియంపై వికర్షక పంటలు తులసి, పుదిన, డిల్, వెల్లుల్లి, ఉల్లి, పార్ల్సీ, కొతిమీర ప్రభావంపై అధ్యయనం చేపట్టారు. ముందుగా వికర్షక పంటల విత్తనాలను చల్లి తర్వాత టమాట నారు మొక్కలను నాటారు. కొతిమీరపై అతి తక్కువ తెల్లదోమలు నమోదవడం వలన దీనిని అత్యుత్తమ వికర్షక మొక్కగా సిఫారసు చేశారు (తస్లి, అతని అనుచరులు, 2017).
  • కొతిమీర పురుగు వికర్షిణిగా పనిచేస్తుంది. కొతిమీర కషాయం తయారు చేయడానికి 200 గ్రా. ధనియాలను దంచి 1 లీ. నీటిలో కలిపి 10ని. మరిగించాలి. తర్వాత ఈ కషాయాన్ని 2 లీ. నీటిలో కలపాలి. ఉదయంవేళ ఈ కషాయాన్ని 2 లీ. నీటిలో కలిపి పురుగాశించిన మొక్క భాగాలపై పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు. (పట్నాయక్, 2017).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

కోళ్ల పరిశ్రమపై ఎల్ నినో ప్రభావం -నివారణ చర్యలు

కోళ్ల పరిశ్రమ తక్కువ సమయంలో అధిక మాంసం మరియు గుడ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ప్రపంచ ఆహార వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అయితే ఆధునిక కోళ్లు అధిక ఉత్పాదకత కలిగి ఉండటం వల్ల వాతావరణ మార్పులకు, ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువగా సున్నితంగా ఉంటాయి.

ఎల్ నినో –దక్షిణ ఆసిలేషన్ (ENSO) అనేది ప్రపంచ వాతావరణంలో మార్పులకు కారణమయ్యే ముఖ్యమైన సముద్ర–వాతావరణ పరిస్థితి. ఎల్ నినో ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం మారడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రతి ఎల్ నినో సంవత్సరంలో అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన ప్రభావం ఉండదు. స్థానిక వాతావరణం, రుతుపవనాలు మరియు ఇతర పరిస్థితులు ప్రభావాన్ని నిర్ణయిస్తాయి.
అధిక ఉష్ణోగ్రత మరియు తేమ ఉన్నప్పుడు కోళ్లు ఉష్ణ ఒత్తిడికి (Heat Stress) గురవుతాయి.

ఉష్ణ ఒత్తిడి వల్ల కోళ్లలో వచ్చే మార్పులు
కోళ్లలో చెమట గ్రంథులు లేకపోవడం, అధిక జీవక్రియ మరియు వేగవంతమైన పెరుగుదల కారణంగా వేడి పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది.

వేడి ఒత్తిడి సమయంలో:
• మేత తీసుకోవడం తగ్గుతుంది.
• నీటి అవసరం పెరుగుతుంది.
• పాంటింగ్ (నోటి ద్వారా వేగంగా శ్వాస తీసుకోవడం) పెరుగుతుంది.
• శరీరంలోని ఆమ్ల–క్షార సమతుల్యత మారుతుంది.
• రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
• పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది.

బ్రాయిలర్ కోళ్లలో:
• శరీర బరువు పెరుగుదల తగ్గుతుంది.
• ఫీడ్ కన్వర్షన్ రేషియో (FCR) పెరుగుతుంది.(BAD SIGN)

లేయర్ కోళ్లలో:
• గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది.
• గుడ్ల బరువు తగ్గుతుంది.
• పెంకు నాణ్యత తగ్గుతుంది.

నివారణ చర్యలు

  1. షెడ్ నిర్వహణ మరియు ఉష్ణోగ్రత నియంత్రణ
    కోళ్లు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకునే జీవులు. అధిక వేడి సమయంలో శరీరాన్ని చల్లబరచడానికి ఎక్కువ శక్తిని ఉపయోగిస్తాయి.

అనుకూల ఉష్ణోగ్రత:
• బ్రాయిలర్ మరియు లేయర్ కోళ్లకు: 18°C–24°C
• కోడిపిల్లలకు మొదటి వారంలో: 32°C–35°C
• తరువాత ప్రతి వారం క్రమంగా ఉష్ణోగ్రత తగ్గించాలి.

27°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వచ్చినప్పుడు:
• మేత తీసుకోవడం తగ్గుతుంది.
• బరువు పెరుగుదల తగ్గుతుంది.
• గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది.

రైతులు చేయవలసినవి:
• షెడ్లో మంచి గాలి ప్రసరణ ఉండాలి.
• ఫ్యాన్లు సక్రమంగా పనిచేసేలా చూడాలి.
• పైకప్పుకు తెలుపు రంగు వేయడం లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉపయోగించడం మంచిది.
• అవసరమైతే కూలింగ్ ప్యాడ్లు, స్ప్రింక్లర్లు ఉపయోగించాలి.

2 . తేమ శాతం (Humidity) నియంత్రణ
షెడ్లో ఉష్ణోగ్రతతో పాటు తేమ కూడా ముఖ్యమైనది.
అనుకూల తేమ శాతం: 50–70%
• తేమ తక్కువగా ఉంటే దుమ్ము పెరిగి శ్వాసకోశ సమస్యలు వస్తాయి.
• తేమ ఎక్కువగా ఉంటే శరీరం నుంచి వేడి బయటకు పోదు.
• తడి లిట్టర్ వల్ల అమ్మోనియా పెరిగి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

  1. గాలి నాణ్యత మరియు వెంటిలేషన్
    మంచి గాలి ప్రసరణ కోళ్ల ఆరోగ్యానికి అవసరం.
    • అమ్మోనియా (NH₃): 10–20 ppm కంటే తక్కువగా ఉండాలి.
    • కార్బన్ డయాక్సైడ్ (CO₂): 3000 ppm కంటే తక్కువగా ఉండాలి.

వేసవిలో:
• టన్నెల్ వెంటిలేషన్ ఉపయోగించాలి.
• షెడ్లో గాలి నిలిచిపోకుండా చూడాలి.
• చిన్న పిల్లలపై నేరుగా బలమైన గాలి తగలకుండా జాగ్రత్త పడాలి.

  • దాణా నిర్వహణ
    వేడి సమయంలో కోళ్లు తక్కువగా మేత తీసుకుంటాయి. కాబట్టి దాణా నాణ్యత చాలా ముఖ్యం.
    దాణాలో తప్పనిసరిగా ఉండాల్సినవి:
    • శక్తి (Energy)
    • మాంసకృత్తులు (Protein)
    • అమినో ఆమ్లాలు
    • కాల్షియం
    • ఫాస్ఫరస్
    • ఖనిజ లవణాలు
    • విటమిన్లు
    • యాంటీ ఆక్సిడెంట్లు
    కొంతమేరకు కొవ్వును శక్తి వనరుగా ఉపయోగించడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి తగ్గుతుంది.
  1. నీటి నిర్వహణ
    వేడి సమయంలో నీరు కోళ్లకు అత్యంత అవసరం.
    రైతులు:
    • ఎల్లప్పుడూ శుభ్రమైన చల్లటి నీరు అందుబాటులో ఉంచాలి.
    • నీటి ట్యాంకులను ఎండ నుంచి రక్షించాలి.
    • పైపులు మరియు డ్రింకర్లను శుభ్రంగా ఉంచాలి.
    • నిపుల్ డ్రింకర్లలో నీటి ప్రవాహాన్ని పరిశీలించాలి.
    • ఎలక్ట్రోలైట్స్ వాడినప్పుడు పైపులు మూసుకుపోకుండా జాగ్రత్త పడాలి.
    • నీటి నాణ్యతను (pH, సూక్ష్మజీవులు) పరీక్షించాలి.
  2. దాణా పదార్థాల నిల్వ మరియు ఖర్చు నియంత్రణ
    ఎల్నినో కారణంగా పంట దిగుబడి తగ్గితే మొక్కజొన్న, సోయాబీన్ వంటి దాణా పదార్థాల ధరలు పెరగవచ్చు.
    కాబట్టి:
    • అవసరమైన దాణా పదార్థాలను ముందుగానే నిల్వ చేసుకోవాలి.
    • ఒకే సరఫరాదారుపై ఆధారపడకూడదు.
    • బఫర్ స్టాక్ ఉంచుకోవాలి.
    • దాణాలో తేమ మరియు నాణ్యతను పరీక్షించాలి.
    • పొడి, గాలి ప్రసరణ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలి.
    • నేలపై కాకుండా ప్యాలెట్లపై (PALLOT) నిల్వ చేయాలి.
  3. ప్రత్యామ్నాయ దాణా పదార్థాల వినియోగం
    ధరలు పెరిగినప్పుడు స్థానికంగా లభించే ప్రత్యామ్నాయ పదార్థాలను ఉపయోగించవచ్చు.
    ఉదాహరణలు:
    • బియ్యం నూక
    • తౌడు
    • జొన్నలు
    • సజ్జలు
    • DDGS
    అయితే వీటిని నిపుణుల సూచన మేరకు సరైన మోతాదులో మాత్రమే ఉపయోగించాలి.
  4. మైకోటాక్సిన్ నియంత్రణ
    తేమ ఎక్కువగా ఉన్నప్పుడు దాణాలో బూజు మరియు మైకోటాక్సిన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
    నివారణ:
    • దాణాను పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి.
    • బస్తాలను నేలకు లేదా గోడలకు ఆనించి పెట్టకూడదు.
    • బూజు వాసన ఉన్న దాణాను ఉపయోగించకూడదు.
    • అవసరమైతే మైకోటాక్సిన్ పరీక్ష చేయించాలి.
  5. బయోసెక్యూరిటీ మరియు వ్యాధి నియంత్రణ
    వ్యాధులను నివారించడానికి బయోసెక్యూరిటీ చర్యలు తప్పనిసరి.

ముఖ్యమైన చర్యలు:
• సరైన సమయంలో టీకాలు వేయించాలి.
• అవసరమైతే సీరం టెస్టింగ్ చేయించాలి.
• ఫారంలో పరిశుభ్రత పాటించాలి.
• అనవసర వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించాలి.
• షెడ్ చుట్టూ పురుగుల నియంత్రణ చేయాలి.
• రెండు బ్యాచ్ల మధ్య షెడ్ను పూర్తిగా శుభ్రపరచాలి.
• కనీసం 15 రోజులు షెడ్ ఖాళీగా ఉంచడం మంచిది.
• చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో తొలగించాలి.
• ఎలుకలు, అడవి పక్షులు ఫారంలోకి రాకుండా చూడాలి.
ఎల్ నినో పరిస్థితుల్లో ఫోర్స్డ్ మోల్టింగ్ (Forced Molting) సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
• ఎల్ నినో లేదా అధిక ఉష్ణోగ్రతల సమయంలో దాణా ఖర్చులు పెరగడం, గుడ్ల నాణ్యత తగ్గడం వంటి కారణాలతో కొంతమంది రైతులు ఫోర్స్డ్ మోల్టింగ్ విధానాన్ని అనుసరిస్తారు.
• ఫోర్స్డ్ మోల్టింగ్ సమయంలో కోళ్ల గుడ్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసి, తరువాత మళ్లీ సాధారణ ఉత్పత్తి దశకు తీసుకువస్తారు.
• ఈ సమయంలో సరైన పోషక నిర్వహణ లేకపోతే, తిరిగి గుడ్ల ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు గుడ్ల పెంకు నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది.
• ముఖ్యంగా మోల్టింగ్ సమయంలో కాల్షియం సరైన స్థాయిలో అందకపోతే, తరువాతి దశలో గుడ్ల పెంకులు పలుచగా మారడం, విరిగే గుడ్ల సంఖ్య పెరగడం జరుగుతుంది.
• కాబట్టి ఫోర్స్డ్ మోల్టింగ్ సమయంలో కూడా కోళ్ల శరీర అవసరాలకు అనుగుణంగా కాల్షియం మరియు ఇతర ఖనిజ లవణాల సమతుల్యతను తప్పనిసరిగా పాటించాలి.
• మోల్టింగ్ అనంతరం తిరిగి గుడ్ల ఉత్పత్తి ప్రారంభించే సమయంలో మంచి నాణ్యమైన దాణా, సరైన కాల్షియం, ఫాస్ఫరస్ మరియు విటమిన్ D₃ అందించడం ద్వారా గుడ్ల పెంకు నాణ్యతను మెరుగుపరచవచ్చు.
• ఫోర్స్డ్ మోల్టింగ్ను శాస్త్రీయ పద్ధతిలో మాత్రమే నిర్వహించి, నిపుణుల సలహా మేరకు పోషక నిర్వహణ చేపట్టడం మంచిది.
ఎలక్ట్రోలైట్స్ వినియోగం సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
• వేడి ఒత్తిడి (Heat Stress) సమయంలో కోళ్లలో నీటి లోపం మరియు శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడేందుకు రైతులు ఎలక్ట్రోలైట్స్ను నీటిలో కలిపి ఇస్తారు.
• అయితే ఎలక్ట్రోలైట్స్ను అవసరానికి మించి అధిక మోతాదులో ఉపయోగించినప్పుడు, వాటిలోని లవణాల సాంద్రత పెరిగి డ్రింకర్ లైన్లు మరియు నిపుల్ డ్రింకర్లు (Nipple Drinkers) మూసుకుపోయే అవకాశం ఉంటుంది.
• నిపుల్స్ బ్లాక్ అయినప్పుడు నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కోళ్లకు తగినంత నీరు అందక డీహైడ్రేషన్ (నీటి లోపం), ఉష్ణ ఒత్తిడి తీవ్రత పెరగడం మరియు మరణాలు సంభవించే ప్రమాదం ఉంటుంది.
• కాబట్టి రైతులు:
o ఎలక్ట్రోలైట్స్ ను ఎల్లప్పుడూ సూచించిన మోతాదులో మాత్రమే ఉపయోగించాలి.
o నిపుల్ డ్రింకర్లలో నీటి ప్రవాహాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.
o డ్రింకర్ లైన్లను తరచుగా శుభ్రపరచాలి.
o నీటి సరఫరాలో ఏవైనా ఆటంకాలు ఉంటే వెంటనే సరిచేయాలి.
• సరైన నీటి నిర్వహణ మరియు నిపుల్ డ్రింకర్ల పర్యవేక్షణ ద్వారా వేడి ఒత్తిడి సమయంలో కోళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

రైతులకు చివరి సూచనలు
ఎల్ నినో మరియు వేడి పరిస్థితుల్లో కోళ్ల ఉత్పత్తిని కాపాడుకోవడానికి:
✅ వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలి.
✅ షెడ్లో సరైన గాలి ప్రసరణ కల్పించాలి.
✅ ఎల్లప్పుడూ శుభ్రమైన నీరు అందించాలి.
✅ నాణ్యమైన సమతుల్య దాణా ఇవ్వాలి.
✅ బయోసెక్యూరిటీ నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
✅ వ్యాధులు రాకముందే నివారణ చర్యలు తీసుకోవాలి.

శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఎల్నినో మరియు వేడి ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించి, కోళ్ల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను కాపాడుకోవచ్చు.

డా కే నాగరాజ కుమారి, సీనియర్ శాస్త్రవేత్త, డా కే ఆనందరావు, ప్రధాన శాస్త్రవేత్త
గేదెల పరిశోధన స్థానం, వెంకట రామన్నగూడెం-534102,
శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
Ph: 9848916904

Read More

మన్యంలో పసిడి కాంతులు: కొండ చరియలపై వలిసెల సాగు విధానాలు

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ముఖ్యమైన నూనెగింజల పంట వలిశెలు. మన రాష్ట్రంలో ఈ పంట 6000 హెక్టార్లలో సాగు చేబడుతూ, 2 వేల టన్నుల ఉత్పత్తి నిస్తున్నది. సరాసరి దిగుబడి హెక్టారుకు 390 కిలోలు వస్తుంది. గింజలో నూనె శాతం 35-45 వరకు వుంటుంది. ఈ నూనెను కేవలం వంటల్లోనే కాకుండా సబ్బులు, వార్నిష్ ల తయారీలోనూ, సౌందర్య సాధనాల తయారీలోను విరివిగా వాడతారు. నూనె తీయగా మిగిలిన పిండిని పశువుల దాణాగా, ఎరువుగా కూడా వాడుతారు. మన రాష్ట్రంలో ఈ పంటను ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదవరిలోని ఏజెన్సీ ప్రాంతాలలో సాగు చేస్తున్నారు.

విత్తే సమయం : ఆగస్టు రెండవ పక్షం నుండి సెప్టెంబర్ మొదటి పక్షం వరకు వితటానికి అనుకూలం. విత్తటం ఆలస్యం అయితే పూత, గింజకట్టు దశల్లో పైరు వర్షాభావానికి లోనై దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి.

రకాలు:
కే.జి.ఎన్.– 2 : 50 రోజుల్లో పూతకు వస్తుంది. 190 సెం. మీ., ఎత్తు పెరుగుతుంది. కాలపరిమితి 100-110 రోజులు. ఎకరాకు 4 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. ప్రస్తుత సాగులో వున్న దేశవాళి రకం కంటే ఇది 40-50 శాతం ఎక్కువ.
జె. ఎన్.ఎస్. -6 : ఎకరాకు 3-4 క్వింటాళ్లు దిగుబడినిచ్చి 110 రోజుల్లో కోతకొస్తుంది.
జె. ఎన్.ఎస్. -28 : ఎకరాకు 4-5 క్వింటాళ్లు దిగుబడినిచ్చి 100-110 రోజుల్లో కోతకొస్తుంది.
జె. ఎన్.ఎస్. -30 : ఎకరాకు 4-5 క్వింటాళ్లు దిగుబడినిచ్చి 110 రోజుల్లో కోతకొస్తుంది.

నేలలు: తేలికపాటి గరప నేలలు, కొండ వాలు భూములు, పోడు నెలలు, తేమ నిల్వ యుంచుకొని మురుగు నీరు పోయే వసతి గల అన్నీ రకాల నెలలు అనుకూలం.

నేల తయారీ: నేలను 2-3 సార్లు బాగా దున్ని మెత్తగా తేయారు చేసి విత్తుకోవాలి.

విత్తటం: ఎకరాకు 3 కిలోల విత్తనం అవసరం. సాధారణంగా గిరిజన రైతులు విత్తనాలను నేలపై వెదజల్లి చెట్టు కొమ్మను నేలపై లాగి విత్తనాన్ని మట్టితో కలియబెడతారు. కాని వరుసల మధ్య 30 సెం. మీ, వరుసలలోని మొక్కల మధ్య 10 సెం. మీ., దూరంలో విత్తితే దిగుబడులు బాగుంటాయి.

ఎరువులు: ఆఖరి దుక్కిలో ఎకరాకు 2.5 టన్నుల పశువుల ఎరువు వేయాలి.

  • అజోస్పైరిల్లం (Azospirillum): ఈ బ్యాక్టీరియా గాలిలో ఉండే నత్రజనిని గ్రహించి మొక్కల వేర్లకు సహజంగా అందిస్తుంది. ఎకరాకు 0.5 లీటర్ల ద్రావణాన్ని పశువుల ఎరువుతో కలిపి నేలలో వేయాలి.
  • వేపపిండి (Neem Cake Powder): ఇందులో నత్రజని ఉండటమే కాకుండా భూమిలోని పురుగులను (Nematodes) నివారిస్తుంది. అంతేకాకుండా పంట మధ్యలో తేనెపెట్టెలు ఏర్పాటు చేసినట్లయితే పరపరాగా సంపర్కానికి దోహదపడి దిగుబడి మరియు తేనె ద్వారా ఆదాయం పొందవచ్చు.

అంతరకృషి: విత్తిన 5 రోజుల తర్వాత 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కలుపు తీయాలి. బంగారు తీగ అనే సంపూర్ణ కాండ పరాన్నజీవి నాటిన నెల రోజుల్లో ఈ పంటను ఆశించి ఎక్కువగా నష్ట పరుస్తుంది. వలిశెల విత్తనాల్లో బంగారు తీగ విత్తనాలు కలియడం ద్వారా లేదా భూమిలో ఉన్న బంగారు తీగ విత్తనాలు ద్వారా ఇది బాగా వ్యాప్తి చెందుతుంది. దీనిని ఈ క్రింది పద్ధతులలో నివారించవచ్చు.

జల్లెడ పద్ధతి: ఈ పద్ధతిలో వలిశెల విత్తనాలను 0.85 – 1.00 మి. మీ., రంధ్రాలు గల జల్లెడతో జల్లించి బంగారు తీగ (ఆకాశ పందిరి) విత్తనాలను వేరు చేయాలి.

ఉప్పునీటి ద్రావణం పద్ధతి: ఒక ఎకరాకు కావలసిన 3 కిలోల విత్తనాన్ని 20 లీటర్ల నీటికి 3 కిలోల ఉప్పు కలిపిన ఆ ద్రావణంలో వేసి బాగా కలియబెట్టినట్లైతే ఆకాశ పందిరి విత్తనాలు అడుగుకు, వలిశెల విత్తనాలు నీటి పైభాగానికి చేరుతాయి. ఈ విధంగా పై భాగానికి చేరిన వలిశెల విత్తనాలను పైకి తీసి మంచి నీటితో మరోసారి శుభ్రం చేసి పొడిగుడ్డపై ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి.

కలుపును సమర్ధవంతంగా నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు:

  • చేతితో కలుపు తీయడం (Hand Weeding): వలిశెల పంట కలుపు పోటీకి చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి విత్తిన 20 మరియు 35 రోజులలో రెండు సార్లు చేతితో కలుపు తీయడం అత్యంత ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. దీనివల్ల రసాయనాల అవసరం లేకుండా పంట దిగుబడి పెరుగుతుంది.
  • వేసవి లోతు దుక్కులు (Summer Deep Ploughing)
  • ఆకాశ పందిరి (Cuscuta) నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు:
  • వలిశెల పంటలో అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క ఆకాశ పందిరి (Cuscuta). దీనిని రసాయనాలు లేకుండా అరికట్టడానికి క్రింది జాగ్రత్తలు తప్పనిసరి.
  • జల్లెడ పట్టడం (Seed Sieving): విత్తే ముందే వలిశెల విత్తనాలను 1 mm పరిమాణమున్న జల్లెడతో బాగా జల్లెడ పట్టాలి. దీనివల్ల వలిశెల విత్తనాలతో కలిసిపోయిన ఆకాశ పందిరి విత్తనాలు వేరు చేయబడతాయి.
  • కలుపు రహిత విత్తనాలు: ఆకాశ పందిరి లేదా ఇతర కలుపు సమస్య లేని పొలాల నుండి సేకరించిన నాణ్యమైన శుభ్రమైన విత్తనాలను మాత్రమే సాగుకు ఎంపిక చేసుకోవాలి.
  • వరుసలలో విత్తటం: విత్తనాన్ని వారుసలలో విత్తుకోవటం వలన ఆకాశ పందిరి పక్క వరుసలలో పాకకుండా అరికట్టవచ్చు. అంతేకాకుండా పొలంలో ఆకాశపందిరి పూతదశకు రాక ముందే పీకి వేసి గుంతలో పూడ్చటం లేదా తగలబెట్టడం వలన కూడా దీని ఉధృతిని తగ్గించవచ్చు.

సస్యరక్షణః ఈ పంటకు పురుగులు, తెగుళ్లు బెడద చాలా తక్కువ. అయితే, ఏజెన్సీ ప్రాంతంలో పొగాకు లద్దె పురుగు వాతావరణ పరిస్థితులను బట్టి అడపా దడపా ఆశించే అవకాశం ఉంది.

పురుగులు:
పొగాకు లద్దె పురుగు: గుడ్లు నుండి వెలువడిన లద్దె పురుగులు ఆకులను విపరీతంగా తిని, ఆకులు లేకుండా చేస్తాయి. పూత తగ్గిపోయి, గింజ కట్టదు. దిగుబడి తగ్గుతుంది. నివారణకు గ్రుడ్ల సముదాయాలు, లార్వాల ఏరివేత; లింగాకర్షక బుట్టలు (Pheromone Traps): ఎకరాకు 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను (Spodolure) అమర్చాలి; రాత్రి వేళల్లో రెక్కల పురుగులను ఆకర్షించడానికి పొలంలో అక్కడక్కడా కాంతి ఉచ్చులను (లైట్ ట్రాప్స్) ఏర్పాటు చేసి, వాటి కింద కిరోసిన్ లేదా సబ్బు నీటితో కూడిన పాత్రలను ఉంచాలి.

పెనుబంక, దీపపు పురుగులు: తల్లి, పిల్ల పురుగులు ఆకుల్లోని రసాన్ని పీల్చివేస్తాయి. మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. పూత మరియు గింజ కట్టడం బాగా దెబ్బతింటుంది. వీటి నివారణకు సోలార్ కాంతి ఉచ్చులు (Solar Light Traps): ఇవి పగటిపూట చార్జ్ అయి, రాత్రి వేళల్లో ఆటోమేటిక్గా వెలుగుతాయి. పురుగులు ఈ కాంతికి ఆకర్షించబడి కింద ఉన్న నూనె/సబ్బు నీటి పాత్రలో పడి చనిపోతాయి.

  • మార్కెట్లో లభించే Hedo Mini Solar Insect Light Trap లేదా Chipku Mini Solar Insect Trap వంటి వాటిని ఎకరాకు 1-2 చొప్పున అమర్చుకోవచ్చు.
  • పేనుబంక మరియు పచ్చదోమలు పసుపు రంగుకు ఎక్కువగా ఆకర్షించబడతాయి. ఎకరాకు 15 నుండి 20 పసుపు రంగు జిగురు అట్టలను పంట ఎత్తులో అమర్చడం ద్వారా రెక్కలున్న పేనుబంక పురుగులు వీటికి అంటుకుని నశిస్తాయి.
  • మిత్ర పురుగుల సంరక్షణ
  • తీవ్రమైన నీటి పిచికారీ (Water Spray): తోటల్లో లేదా చిన్న పొలాల్లో పేనుబంక ఎక్కువగా ఉన్నప్పుడు, పవర్ స్ప్రేయర్ ద్వారా కేవలం స్వచ్ఛమైన నీటిని వేగంగా (ఫోర్స్) ఆకులపై పిచికారీ చేయడం ద్వారా పేనుబంక కొట్టుకుపోతుంది.

తెగుళ్లు:
ఆకుమచ్చ తెగుళ్లు : ఆకులపైన చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. గాలిలో తేమ శాతం ఎక్కువైనప్పుడు ఈ మచ్చలు పెద్దవై ఒక దానితో ఒకటి కలసి ఆకులు ఎండిపోతాయి. తెగులు కలుగజేసే శిలీంధ్రాలు గింజ మీద మరియు కోత తర్వాత మిగిలిన ఆకులు, మోళ్లు పైన ఉండటం వలన, వాతావరణ అనుకూలతను బట్టి పంట ఏ దశలోనైనా తెగులు ఆశించవచ్చు. వీటి నివారణకు ట్రైకోడెర్మా విరిడి (Trichoderma Viride): భూమి ద్వారా, విత్తనాల ద్వారా వ్యాపించే శిలీంధ్రాలను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. లీటరు నీటికి 3 నుండి 5 గ్రాముల ట్రైకోడెర్మా పొడిని కలిపి ఆకులపై పిచికారీ చేయాలి (or) సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ (Pseudomonas fluorescens) ఇది బ్యాక్టీరియా మరియు ఫంగస్ వల్ల వచ్చే ఆకుమచ్చల తీవ్రతను తగ్గిస్తుంది. లీటరు నీటికి 5 నుండి 10 మి.లీ. చొప్పున కలిపి ఆకులపై పిచికారీ చేయడం వల్ల మొక్కకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బూడిద తెగులు: విత్తిన 35-40 రోజుల తరువాత గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద రంగులో చిన్న చిన్న మచ్చలు కనబడతాయి. ఈ మచ్చలు ఆకు అంతటా వ్యాపించటం వలన ఆకులు రాలిపోతాయి. దీని నివారణకు పుల్లటి మజ్జిగ ద్రావణం బాగా పులిసిన మజ్జిగను (5–6 రోజులు పులియబెట్టినది) ఎకరాకు 5 లీటర్ల చొప్పున సరిపడా నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

పంటకోతః పంట 95–110 రోజుల్లో కోతకొస్తుంది. మొక్కల ఆకులు ఎండిపోయి మరియు పుష్పగుచ్ఛము నల్లగా మారినప్పుడు మాత్రమే పంటకోత ప్రారంభించాలి. మొక్కలను నేల మట్టం వరకు కోసి ఎండలో ఆరబెట్టి, కట్టెలతో కొట్టి గింజలను వేరు చేయాలి. తర్వాత గింజలను 3-5 రోజుల వరకు ఎండలో ఆరబెట్టి బస్తాల్లో నిల్వ చేయాలి.
వలిశెల పంటలో తేనెటీగల పెట్టెలు 10×3 మీటర్ల దూరంలో పెట్టుకొని రైతు యొక్క నికర ఆదాయం పెంచుకోవచ్చు. ఐరోపా తేనెతీగలు ఉన్నా, పుట్ట తేనెటీగలు విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి.

సంకలనం:
శ్రీ పి. జోగారావు, శాస్త్రవేత్త (మృత్తికా శాస్త్ర విభాగం) డా.కె. బయపురెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త (మొక్కల జన్యు శాస్త్ర విభాగం) డా.డి. వెంకటేష్ బాబు, శాస్త్రవేత్త (పంట శరీరధర్మ శాస్త్ర విభాగం) శ్రీ బి.ఎన్.సందీప్ నాయక్, శాస్త్రవేత్త (సేద్య విభాగం) డా.డి.ఆదిలక్ష్మి, ఏడీఆర్, ఆర్.ఎ.ఆర్.ఎస్, చింతపల్లి

Read More

ఎల్ నినో-మారుతున్న వాతావరణం:పరాన్నజీవి వ్యాధులపై ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు మానవులు, పశువులు మరియు పర్యావరణ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవల నేపాల్లో సంభవించిన తీవ్ర వరదలు మరియు హిమాలయ ప్రాంతంలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని మరోసారి వాతావరణ మార్పుల ప్రభావాలపై ఆలోచించేలా చేశాయి. ఈ మార్పుల్లో ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ (El Niño–Southern Oscillation – ENSO) ఒక ముఖ్యమైన వాతావరణ ప్రక్రియ. ఎల్ నినో సమయంలో ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమలో మార్పులు సంభవిస్తాయి.

2027 వరకు ఎల్ నినో (అధిక ఉష్ణోగ్రతల) ప్రభావం తగ్గే అవకాశం లేదని భారత వాతావరణ శాస్త్ర విభాగం (India Meteorological Department – IMD) హెచ్చరిస్తోంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్షపాతం, కరువులు, వరదలు వంటి వాతావరణ మార్పులు మానవ–పశు ఆరోగ్యం, పశుపోషణ, వ్యవసాయం, ఆహార–నీటి భద్రత మరియు పర్యావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అదేవిధంగా, పరాన్నజీవులు, వాటి మధ్యస్థ అతిథులు, వాహకాలు మరియు అతిథి జంతువుల పరస్పర సంబంధాలను ప్రభావితం చేసి, పరాన్నజీవుల అభివృద్ధి, జీవన సామర్థ్యం మరియు వ్యాప్తిని మార్చగలవు. అనేక పరాన్నజీవుల గుడ్లు, లార్వాలు మరియు ఇతర అభివృద్ధి దశలు పర్యావరణ ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి. అనుకూలమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గుడ్ల నుంచి లార్వాల అభివృద్ధి వేగవంతమవుతుంది. కొన్ని పరాన్నజీవుల జీవచక్రం త్వరగా పూర్తవుతుంది మరియు కొన్ని వాహకాల సంఖ్య కూడా పెరగవచ్చు. అయితే, అత్యధిక ఉష్ణోగ్రతలు మరియు తీవ్రమైన ఎండలు కొన్ని పరాన్నజీవుల గుడ్లు మరియు స్వేచ్ఛా జీవన దశల జీవన సామర్థ్యాన్ని తగ్గించవచ్చు.

గొర్రెలు మరియు మేకల్లో కనిపించే ముఖ్యమైన జీర్ణాశయ నెమటోడ్ పరాన్నజీవి Haemonchus contortus. దీనిని సాధారణంగా Barber’s pole worm అని పిలుస్తారు. ఇది రక్తాన్ని పీల్చడం ద్వారా తీవ్రమైన రక్తహీనత, బలహీనత మరియు కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతుంది.

ఈ పరాన్నజీవి గుడ్డు నుంచి సంక్రమణకు కారణమయ్యే మూడవ దశ లార్వా (L3) వరకు అభివృద్ధి చెందడానికి ఉష్ణోగ్రత మరియు తేమ వంటి పర్యావరణ పరిస్థితులు అవసరం. తగిన వర్షపాతం, నేల తేమ మరియు మితమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గుడ్లు వేగంగా అభివృద్ధి చెంది L3 లార్వాలుగా మారి పచ్చికపైకి చేరతాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఎల్ నినో సమయంలో తక్కువ వర్షపాతం, పొడి పరిస్థితుల కారణంగా లార్వాల అభివృద్ధి తగ్గవచ్చు. అయితే ఎల్ నినో తర్వాత తేమ మరియు వర్షపాతం పెరిగే పరిస్థితులు ఏర్పడితే సంక్రమణ పరిస్థితులు మళ్లీ మారవచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పచ్చికపై కొత్తగా లార్వాల అభివృద్ధి తగ్గినప్పటికీ, ఇప్పటికే జంతువుల్లో ఉన్న పరాన్నజీవి భారం కొనసాగవచ్చు. అంతేకాకుండా కరువు వల్ల మేత కొరత ఏర్పడి జంతువుల పోషక స్థితి మరియు రోగనిరోధక శక్తి తగ్గితే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

ఎల్ నినో (అధిక ఉష్ణోగ్రతల) ప్రభావం తగ్గగానే వచ్చే అధిక వర్షపాతం మరియు వరదల సమయంలో పశువుల మలం నీటి వనరుల్లోకి చేరడం వల్ల Cryptosporidium, Giardia, Entamoeba వంటి నీటి ద్వారా వ్యాపించే పరాన్నజీవుల సంక్రమణ ప్రమాదం పెరగవచ్చు. కరువు సమయంలో సురక్షితమైన నీటి వనరులు తగ్గిపోవడం వల్ల మానవులు మరియు పశువులు పరిమితమైన లేదా కలుషితమైన నీటి వనరులను ఉపయోగించే పరిస్థితి ఏర్పడవచ్చు.

మరో వైపు ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమలో మార్పులు దోమలు, ఈగలు, గోమార్లు మరియు పేలు వంటి వాహకాల సంఖ్య, అభివృద్ధి మరియు కాలానుగుణ కార్యకలాపాలను ప్రభావితం చేయవచ్చు. ఫలితంగా మలేరియా, ట్రీపానాసోమా, థిలేరియా, బెబేసియా, లీష్మానియాసిస్ మరియు ఫైలేరియాసిస్ వంటి పరాన్నజీవి వ్యాధుల వ్యాప్తి విధానాల్లో మార్పులు సంభవించవచ్చు.

పరాన్నజీవి వ్యాధులను ఎలా ఎదుర్కోవాలి?

మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పరాన్నజీవి నియంత్రణలో ముందస్తు ప్రణాళిక చాలా అవసరం.

1.వాతావరణ ఆధారిత పర్యవేక్షణ: ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమ సమాచారాన్ని పరాన్నజీవి వ్యాధుల పర్యవేక్షణతో అనుసంధానం చేయాలి.
2. లక్ష్యిత నులిపురుగు నివారణ: అవసరం లేని blanket deworming కు బదులుగా, మల పరీక్ష, వ్యాధి లక్షణాలు మరియు స్థానిక వ్యాధి పరిస్థితుల ఆధారంగా చికిత్స చేయాలి.
3. FAMACHA విధానం: Haemonchus contortus ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కంటి పొర ఆధారంగా రక్తహీనత ఉన్న జంతువులను గుర్తించి, అవసరమైన వాటికి మాత్రమే చికిత్స చేయడం ప్రయోజనకరం.
4. పోషకాహార నిర్వహణ: కరువు మరియు మేత కొరత సమయంలో తగిన ప్రోటీన్ మరియు శక్తి (ఎనర్జీ) పోషక పదార్థాలు అందించడం ద్వారా జంతువుల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచాలి.
5. సురక్షితమైన నీరు: మానవులు మరియు పశువులకు శుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలి.
6. వాహకాల పర్యవేక్షణ: వాటి ఋతువుల ఆధారిత కార్యకలాపాలు క్రమం తప్పకుండా పర్యవేక్షించి అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలి. పర్యావరణ పరిశుభ్రత, నిల్వ నీటి తొలగింపు, పురుగుమందుల వినియోగం మరియు వాహక నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేయాలి.
7. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: El Niño వాతావరణ హెచ్చరికలను పశువుల వ్యాధుల నిఘా మరియు పర్యవేక్షణతో అనుసంధానం చేయాలి.

ఎల్ నినో (El Niño) అనేది ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఒక శక్తివంతమైన క్లైమేట్ డ్రైవర్. ఇది కేవలం పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల మార్పులకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పరాన్నజీవి వ్యాధుల (parasitic diseases) వ్యాప్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కేవలం రోగ నిర్ధారణ, చికిత్స మాత్రమే సరిపోవు. కాబట్టి భవిష్యత్తులో పరాన్నజీవి వ్యాధుల నియంత్రణ రోగ నిర్ధారణ మరియు చికిత్సకే పరిమితం కాకుండా, వాతావరణ అంచనా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, లక్ష్యిత నులిపురుగు నివారణ, FAMACHA విధానం, పరమాణు స్థాయి పర్యవేక్షణ మరియు వన్ హెల్త్ (మానవ–పశు–పర్యావరణ ఆరోగ్య సమగ్ర విధానం) విధానాలను సమన్వయం చేయాలి.

“వాతావరణాన్ని అర్థం చేసుకుంటే పరాన్నజీవి వ్యాధుల ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు; ముందస్తు అంచనా ఉంటే సమర్థవంతమైన నియంత్రణ సాధ్యమవుతుంది.”

Dr. వి. జ్ఞానీ చరిత, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి, Dr. పి వి రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పరాన్న జీవశాస్త్ర విభాగం. పశు వైద్య కళాశాల, ప్రొద్దటూరు-516360, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఆంధ్ర ప్రదేశ్. Ph: 9100771767

Read More

పంటల్లో బెట్టను తట్టుకునేందుకు పశువుల పేడ, మూత్రం ద్రావణం

పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలు, ద్రావణాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా పశువుల పేడ, మూత్రం ద్రావణం ఒకటి.

పశువుల పేడ, మూత్రం ద్రావణం మొక్కలకు తక్షణ శక్తిని ఇస్తుంది. కాబట్టి వర్షాభావ పరిస్థితులలో తెగుళ్లు/పురుగుల సమస్య నుంచి తేరుకుంటున్నప్పుడు దీనిని వాడుకోవచ్చు. పశువుల పేడ, పశువుల మూత్రంలో చాలా రకాల పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇవి పంటకు హానిచేసే తెగుళ్ళను నివారించడంలో ఉపయోగ పడతాయి.

ఈ ద్రావణంలో ఉన్న పోషకాల (నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు సూక్ష్మ పోషకాలు) వల్ల పంటలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఈ ద్రావణాన్ని పంటకాలంలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు: పశువుల పేడ : 5 కిలోలు; పశువుల మూత్రం : 5 లీటర్లు; సున్నం : 150 గ్రా॥

తయారు చేసే విధానం:

  • 5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల మూత్రం తీసుకుని, 5 లీటర్ల నీటిని కలిపి ఒక తొట్టిలో నిలువ చేయాలి.
  • తొట్టిపై మూత పెట్టి, 4 రోజులపాటు ఆ మిశ్రమాన్ని మురగబెట్టాలి.
  • పై మిశ్రమాన్ని ప్రతిరోజు కర్రతో, సవ్య మరియు అపసవ్య దిశలలో బాగా కలియపెట్టాలి.
  • ఈ మిశ్రమానికి 4 రోజుల తర్వాత కొద్దిగా నీరు చేర్చి, వడపోసి, 150 గ్రాముల సున్నం కలపాలి.
  • ఈ ద్రావణానికి 100 లీటర్ల నీటిని కలిపి ఒక ఎకరం పొలంలో ఒకసారి పిచికారీ చేయాలి.

జాగ్రత్తలు:

  • పశువుల పేడ, మూత్రం ద్రావణం చిక్కగా ఉంటుంది. అందువల్ల వడపోయటానికి ముందు ఒక మెష్‌నిగానీ, పలుచటి గోనెసంచిని గానీ ఉపయోగించాలి.
  • తర్వాత దానికి నీరు కలిపి పలుచటిగుడ్డతో వడపోసుకోవాలి.
  • తయారు చేసిన ద్రావణాన్ని వెంటనే ఉపయోగించుకోవాలి.
  • ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ద్రావణం చెడిపోయే అవకాశం ఉంది.
    పంటలలో తెగుళ్ళ సమస్య వుంటే పశువుల పేడ, మూత్రం ద్రావణానికి ఇంగువ కలిపి పిచికారీ చేసుకోవాలి.

ఉపయోగాలు:

  • ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తే దాని ఘాటైన వాసనకు రెక్కల పురుగులు పంటపై గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు.
  • ఈ ద్రావణాన్ని పంటలలో పిచికారీ చేయటం వల్ల పంటలు బెట్టను సుమారు వారం రోజులవరకూ తట్టుకుంటాయి.
  • ఈ ద్రావణం పంటలలో వ్యాధినిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. ఈ ద్రావణాన్ని బాగా వడపోసి “డ్రిప్” లేదా “స్ప్రింక్లర” పద్దతి ద్వారా పంటలకు అందజేయవచ్చు.
  • పశువుల పేడ, మూత్రం ద్రావణాన్ని కూరగాయ పంటలలోనూ, ఇండ్ల వద్ద పెంచే ఆకుకూరలపైనా ఉపయోగించి మంచి ఫలితాలు పొందవచ్చు. పశువుల పేడ, మూత్రం, ఇంగువ ద్రావణం వరి పైరులో వచ్చే అగ్గి తెగులును సమర్ధవంతంగా నివారిస్తుంది. 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారీ చేయాలి
Read More

వ్యాధుల నుంచి మీ పాడి ఫారం సురక్షితమేనా? – ఈ 10 అంశాలతో మీరే తెలుసుకోండి

“పశువుకు వ్యాధి ఎలా వచ్చింది?” అనే ప్రశ్నతో పాటు… “అది మన ఫారంలోకి ఎలా వచ్చింది?” అని కూడా ఆలోచించాలి.

పాడి ఫారంలో ఒక పశువుకు వ్యాధి వస్తే, అది ఆ ఒక్క పశువుతోనే ఆగిపోతుందని చెప్పలేం. కొత్తగా తెచ్చిన పశువులు, బయట నుంచి వచ్చే వ్యక్తులు, వాహనాలు, అపరిశుభ్రమైన పాక, మేత, నీరు, పరికరాలు ఇలా అనేక మార్గాల్లో వ్యాధులు ఫారంలోకి రావచ్చు. ఒక పశువు నుంచి మరో పశువుకు కూడా వ్యాపించవచ్చు.
అందుకే పశువులకు చికిత్స చేయించడమే కాకుండా, వ్యాధులు ఫారంలోకి రాకుండా, వచ్చినా ఇతర పశువులకు వ్యాపించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనికి పెద్ద పెద్ద ఏర్పాట్లు అవసరం లేదు. రోజూ మనం చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు.
మరి మీ పాడి ఫారంలో అలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారా? ఈ 10 అంశాలతో మీరే తెలుసుకోండి.

  1. కొత్తగా తెచ్చిన పశువులను వెంటనే మందలో కలుపుతున్నారా?
    కొత్తగా తెచ్చిన పశువు చూడటానికి ఆరోగ్యంగా కనిపించినా, దానితో పాటు వ్యాధులు కూడా ఫారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెంటనే మందలో కలపకుండా కనీసం 3 వారాల పాటు వేరుగా ఉంచి ఆరోగ్యాన్ని గమనించడం మంచిది. ఈ సమయంలో పశువులో ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే పశువైద్యుని సంప్రదించాలి. అంతా సరిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే మందలో కలపడం మంచిది.
  2. అనారోగ్య పశువులను వేరుగా ఉంచే ఏర్పాటు ఉందా?
    మందలో ఏదైనా పశువు అనారోగ్యానికి గురైతే, వీలైనంత వరకు మందకు కొంత దూరంగా, ఇతర పశువులతో కలవకుండా ఉంచడం మంచిది. అనారోగ్య పశువుకు మేత, నీరు పెట్టేందుకు వాడే తొట్లు, బకెట్లు కూడా ఇతర పశువులకు వాడకుండా చూడాలి. ముందుగా ఆరోగ్యంగా ఉన్న పశువుల పనులు చూసుకొని, చివరగా అనారోగ్య పశువు దగ్గరకు వెళ్లాలి. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ, పశువైద్యుని సలహాతో చికిత్స చేయిస్తే మిగతా పశువులకు వ్యాధి వ్యాపించే అవకాశాన్ని తగ్గించవచ్చు.
  3. మీ పాడి ఫారంలోకి వచ్చే వ్యక్తులు, వాహనాల రాకపోకలను గమనిస్తున్నారా?
    పాడి ఫారానికి వివిధ పనుల కోసం బయట వ్యక్తులు, ఇతర రైతులు, వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. వీటి ద్వారా ఒక ఫారం నుంచి మరో ఫారానికి మట్టి, పేడతో పాటు వ్యాధులు కూడా చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చే వ్యక్తులు పశువుల దగ్గరకు నేరుగా వెళ్లకుండా చూసుకోవాలి. వాహనాలను కూడా వీలైనంత వరకు పశువుల పాకకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ఇతర పశువుల ఫారాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులు, వాహనాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
  4. పశువుల పాకలోకి వెళ్లే ముందు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకుంటున్నారా?
    మన చేతులు, కాళ్లు, చెప్పులకు అంటుకున్న మట్టి, పేడ ద్వారా కూడా వ్యాధులు ఒక చోటు నుంచి మరో చోటుకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చిన వెంటనే పశువుల దగ్గరకు వెళ్లకుండా చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం మంచిది. ముఖ్యంగా పశువుల సంతకు, మరో పాడి ఫారానికి వెళ్లి వచ్చినప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం. వీలైతే పశువుల పాకలో వేసుకునేందుకు వేరే చెప్పులు ఉంచుకోవాలి. వాటిని బయట ఇతర పనులకు ఉపయోగించకూడదు. అనారోగ్య పశువును చూసిన తర్వాత చేతులు, చెప్పులు శుభ్రం చేసుకొని, ఆ తర్వాతే ఇతర పశువుల దగ్గరకు వెళ్లాలి. ఈ చిన్న అలవాట్లు బయట నుంచి లేదా ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాధులు చేరే అవకాశాన్ని తగ్గిస్తాయి.
  5. పాకను శుభ్రంగా, పొడిగా ఉంచుతున్నారా?
    పశువుల పాకలో పేడ, వ్యర్థాలు పేరుకుపోయి, నేల ఎక్కువసేపు తడిగా ఉంటే పశువులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే పేడ, ఇతర వ్యర్థాలను రోజూ తొలగించాలి. మూత్రం, మురికి నీరు పాకలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్లేలా కాలువలు ఉండాలి. తొలగించిన పేడను పాక దగ్గరే పోగు చేయకుండా, నిర్ణీత ప్రదేశంలో సేకరించి సేంద్రియ ఎరువు తయారీకి లేదా వీలైతే బయోగ్యాస్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. పశువులు పడుకునే ప్రదేశంలో తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే పాకలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాకలో అపరిశుభ్రతను తగ్గించి, పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
  6. మేత, తాగునీరు కలుషితం కాకుండా కాపాడుతున్నారా?
    పశువులకు ఇచ్చే మేత, తాగునీరు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. మేతలో పేడ, మట్టి లేదా ఇతర మలినాలు కలవకుండా చూసుకోవాలి. మేతను తేమ తగలకుండా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. బూజు పట్టిన లేదా చెడిపోయిన మేతను పశువులకు ఇవ్వకూడదు. మేత తొట్లు, నీటి తొట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. తొట్టెలో మిగిలిపోయి చెడిపోయిన మేతను తొలగించి, తాజా మేత వేయాలి. పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలి. ఇలా మేత, నీటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తే వాటి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించవచ్చు. అలాగే పశువులకు సమతుల్య మేతతో పాటు తగిన ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా అందించాలి.
  7. పాలు పితికే పాత్రలు, ఇతర పరికరాలను శుభ్రంగా ఉంచుతున్నారా?
    పాలు పితికే సమయంలో పరిశుభ్రత పాటించడం పశువుల ఆరోగ్యంతో పాటు పాల నాణ్యతకు కూడా చాలా ముఖ్యం. పాలు పితికే ముందు చేతులు, పొదుగును శుభ్రంగా కడిగి, పొదుగును పొడి గుడ్డతో తుడవాలి. పాలు పితికే పాత్రలను ప్రతి సారి ఉపయోగించిన తర్వాత బాగా కడిగి ఆరబెట్టాలి. పాలు పితికే యంత్రాలు, ఇతర పరికరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పాలు పితికిన తర్వాత చనుమొనలను పశువైద్యుడు సూచించిన టీట్ డిప్పింగ్ ద్రావణంలో ముంచడం మంచిది. ఇలా సరైన పద్ధతిలో పాలు పితకడం వల్ల మాస్టిటిస్ (పొదుగు వాపు) వచ్చే అవకాశాన్ని తగ్గించడంతో పాటు నాణ్యమైన పాలను పొందవచ్చు.
  8. ఈగలు, దోమలు, ఎలుకల బెడదను తగ్గిస్తున్నారా?
    పశువుల పాకలో ఈగలు, దోమలు, ఎలుకలు ఎక్కువగా ఉంటే పశువులకు ఇబ్బంది కలిగించడంతో పాటు వివిధ రకాల వ్యాధులు వ్యాపించడానికి కూడా కారణమవుతాయి. అందుకే పాకలో పేడ, మిగిలిపోయిన మేత పేరుకుపోకుండా, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దాణా నిల్వ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచి, దాణా చెల్లాచెదురుగా పడకుండా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుల సూచనలతో ఈగలు, దోమలను దూరంగా ఉంచే రిపెల్లెంట్లను, ఎలుకల నియంత్రణకు తగిన పద్ధతులను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల లంపీ స్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి), సర్రా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
  9. టీకాలు, నట్టల మందులు సమయానికి వేయిస్తున్నారా?
    వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించడం కంటే, ముందుగానే నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందుకే పశువులకు అవసరమైన టీకాలను సమయానికి వేయించడంతో పాటు, నట్టల నివారణకు కూడా సకాలంలో మందులు ఇవ్వాలి. పశువుల వయస్సు, ఆరోగ్య పరిస్థితి, ప్రాంతంలో వచ్చే వ్యాధులను బట్టి పశువైద్యుని సూచనతో వీటిని పాటించాలి. టీకాలు, నట్టల మందులు ఇచ్చిన తేదీలను చిన్న పుస్తకంలో లేదా మొబైల్లో నమోదు చేసుకుంటే, తదుపరి ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోవడం సులభమవుతుంది.
  10. పశువు ఆరోగ్యంలో మార్పు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారా?
    రోజూ కొద్దిసేపు పశువులను దగ్గరగా గమనించడం అలవాటు చేసుకోవాలి. పశువు సాధారణంగా ఎలా ఉంటుందో తెలిసినప్పుడే దాని ఆరోగ్యంలో వచ్చే మార్పులను త్వరగా గుర్తించవచ్చు. మేత తినకపోవడం, నీరసంగా ఉండటం, జ్వరం, దగ్గు, విరేచనాలు, పాల దిగుబడి అకస్మాత్తుగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. అనారోగ్యంగా ఉన్న పశువును వీలైనంత వరకు ఇతర పశువులతో కలవకుండా ఉంచి, వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. మందలోని ఇతర పశువుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో గమనించాలి. ఒకటి కంటే ఎక్కువ పశువుల్లో ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తే మరింత అప్రమత్తంగా ఉండి, వెంటనే పశువైద్యునికి తెలియజేయాలి. వ్యాధిని తొలిదశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల చికిత్స త్వరగా ప్రారంభించడంతో పాటు, ఇతర పశువులకు వ్యాధి వ్యాపించే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

మరి… మీ పాడి ఫారం ఎంతవరకు సురక్షితం?
ఈ 10 అంశాల్లో మీరు ఇప్పటికే పాటిస్తున్నవి ఏవి? ఇంకా మెరుగుపరచుకోవాల్సినవి ఏవి? ఒకసారి మీరే పరిశీలించుకోండి.

పశువుల కొనుగోలు నుంచి రోజువారీ సంరక్షణ, మేత, నీరు, పాలు పితకడం, టీకాలు, ఆరోగ్య పరిశీలన వరకు ప్రతి దశలో సరైన పద్ధతులు పాటించడం ముఖ్యం. వీటిని రోజువారీ ఫారం నిర్వహణలో భాగంగా చేసుకుంటే పశువుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు పాడి ఫారాన్ని మరింత సురక్షితంగా నిర్వహించవచ్చు.

Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
Dr. బద్దం అఖిల , టీచింగ్ ఫాకల్టీ,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య కళాశాల, కోరుట్ల, PVNRTVU. 7093198419

Read More