పాషాణభేది మెత్తని కాండం కలిగి వాము ఆకును పోలి వుండే ఏక లేదా ద్వివార్షిక మొక్క. దీని ఆకుల నుండి ఎలాంటి వాసన రాదు. సుమారు 0.5-1.0 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. బాగా శాఖలు తొడిగి చిన్నపాటి పొదలా తయారవుతుంది. ప్రతికణుపు దగ్గర రెండు చొప్పున ఆకులు వస్తాయి. ఈ ఆకుల మొదళ్ళ నుండి మళ్ళీ ఆకులు పుడతాయి. అంచులు దంతాలు కలిగి ఉంటాయి. ఆకులు, కొమ్మలు నూగు కలిగి ఉంటాయి. దీనిని లేత కొమ్మల కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేస్తారు. వేర్లు క్యారట్ దుంపలలాగా ఉండి ప్రతి మొక్కకు 4-5 దుంపలు ఉంటాయి.

సాధారణ నామం : కోలియస్ / మెడిసినల్ కోలియస్ శాస్త్రీయ నామం : కోలియస్ ఫోర్‌స్కాహ్లీ కుటుంబం: లామినేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • కోలియస్ దుంపలను అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. దుంపల నుండి ఫోర్‌స్కోలిన్ అనబడు డైటెర్పనాయిడ్ (కోలియోనాల్) లభిస్తుంది.
  • పాషాణ భేది హృద్రోగాలు, ఊబకాయం, బ్రాంకైటిస్, ఉబ్బసం, నరాల బలహీనత, రక్తక్షీణత మొదలగు వ్యాధుల చికిత్సకు మరియు బలవర్థకమైన ఔషధంగా ఉపయోగపడుతుంది.
  • క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగించబడుతున్నది.

వ్యవసాయరంగంలో

  • పాషాణ భేది నుండి వేరు చేసిన ఫోర్‌స్కోలిన్ ద్రావణం నిమ్మ ఆకులను తినే పాపిలియో డెమోలియస్ 4వ దశ లార్వాలపై గణనీయమైన యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (శ్రీనివాసరావు, అతని అనుచరులు, 2014).
  • పాషాణభేది వేర్ల నుండి వేరు చేసిన డైటెర్పిన్, ఫోర్‌స్కోలిన్ పాపిలియో డెమోలియస్ నివారణకు సురక్షితమైన యాంటిఫెర్టిలిటి కారకం (శ్రీనివాసరావు అండ్ సబిత, 2017).
  • పాషాణ భేది ఆకుల ఇథనాల్ ద్రావణం (0.1%) ఈడెస్ ఈజిప్టి గుడ్లు పెట్టదాన్ని 77.3%, కూలెక్స్ క్వింక్విఫేసియెన్స్ గుడ్లు పెట్టడాన్ని 39.22% తగ్గించాయి (స్వాతి, ఆమె అనుచరులు, 2010).
  • పాషాణభేది వేర్ల ఇథనాల్ ద్రావణం కాండం, ఆకుల ఇథనాల్ ద్రావణం కన్నా క్లెబ్సియెల్లా న్యుమోనియే పై అత్యధిక యాంటిబ్యాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (రాజ్‌కుమార్ అండ్ మాలతి, 2015).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.