వర్షాధారంగా ఖరీఫ్‌లో వేసుకోదగ్గ అంతర పంటలు

మన రాష్ట్రంలోకి నైరుతి ఋతు పవనాలు జూన్‌ మొదటి వారంలోనే సరైన సమయానికే ప్రవేశించాయి. భారత వాతావరణ విభాగం వారు కూడా ఈ 2021వ సంవత్సరంలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపారు. సాధారణంగా చాలా మంది రైతులు ప్రతి సంవత్సరం ఒకే పంటను, ఒకే నేలలో వేసుకోవడం వల్ల నష్టపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా పంట ప్రకృతి వైపరీత్యాలకు గురైనపుడు పంట పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా ఏక పంట విధానం వలన కలుపు తీవ్రత పెరగడమే గాక, చీడ పీడల ఉదృతి అధికం అవుతుంది. భూమిలో ముడి పోషకాల లభ్యత తగ్గి భూమి నిస్సారం అవుతుంది. వీటిని అధిగమించాలి అంటే అంతర పంటల సాగు చేసుకోవాలి. రెండు పంటలను ఒకే నేలలో, ఒకే సమయంలో నిర్దిష్ట వరుసలలో కలిపి పండించడాన్నే అంతర పంటలు అంటారు.


అంతర పంటల ఆవశ్యకత
మన రాష్ట్రంలో వర్షాధారంగా ఖరీఫ్‌లో ముఖ్యంగా ప్రత్తి, మొక్కజొన్న, వేరుశనగ, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కంది మరియు ఇతర అపరాలను పండిస్తున్నారు. సాధారణంగా చాలా మంది రైతులు ఈ పంటలను ఏక పంటగా పండిస్తూ ఉంటారు. సహజ వనరులైన సూర్యరశ్మి, వర్షపు నీరు, పోషకాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలంటే అంతర పంటలు వేసుకోవడం తప్పనిసరి. కొందరు రైతులు అంతర పంటల వల్ల ప్రధాన పంట దిగుబడి తగ్గుతుందని, అంతర కృషి వీలు కాదని, కలుపు తీయుటకు కూలీల ఖర్చు పెరుగుతుందని అపోహపడుతుంటారు. కానీ, మనం సరియైన అంతర పంటను ఎన్నుకున్నట్లైతే, అవసరాన్ని బట్టి సాళ్ళ మధ్య దూరం మార్చుకున్నట్లైతే, ముఖ్య పంట దిగుబడి తగ్గకుండా ఉండటమే కాకుండా అంతర పంటల వల్ల అదనపు దిగుబడి వస్తుంది.


అంతరపంటలను ఎంచుకునేటపుడు పాటించాల్సిన సూత్రాలు
* ధాన్యపు పంటలు / చిరు ధాన్యాల పంటలతో అపరాలను అంతర పంటలుగా సాగు చేసుకోవాలి.
* ప్రధాన పంట దీర్ఘ కాలిక పరిమితి కలది అయితే, అంతర పంట స్వల్పకాల పరిమితి కలిగి ఉండాలి.
* ఒకపంట మరోపంటతో వనరులకోసం పోటీపడేలా ఉండకూడదు.
* ప్రధాన పంట ఎత్తుగా పెరిగేది అయితే, అంతర పంట పొట్టిగా, గుబురుగా పెరిగే దానిని ఎంచుకోవాలి.
* ఒక పంట లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంటే, మరొక పంట తక్కువ లోతు వేరు వ్యవస్థ కలిగి ఉండాలి.
* ఒకే జాతి / ఒకే కుటుంబానికి చెందిన పంటలను అంతర పంటలుగా వేసుకోకూడదు.
* ప్రధాన పంట యొక్క మొక్కల సాంద్రత నిర్దిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే, ఒకవేళ పంట మధ్య కాలంలో బెట్ట వస్తే అంతర పంటల మొక్కల సాంద్రతను తగ్గించుకొనే విధంగా ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.
* రెండు పంటలను సాగు చేసే యాజమాన్య పద్దతులు ఒకే విధంగా ఉంటే, సాగు చేయడం సులువుగా ఉంటుంది.


అంతర పంటల వలన కలిగే ప్రయోజనాలు :
* వాతావరణ పరిస్థితులు అనుకూలించినపుడు అంతర పంటల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల (బెట్ట /కరువు) ఒక పైరు దెబ్బ తిన్నపుడు మరో పైరు కనీసం కొంత దిగుబడి అయినా ఇస్తుంది. కావున అంతర పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర దిగుబడిని పొందవచ్చు.
ఉదా: వేరుశనగలో కందిని అంతర పంటగా సాగు చేస్తే, వేరుశనగ పంట కాలంలో మంచి వర్షం వస్తే వేరుశనగ దిగుబడి బాగా వస్తుంది. అలా కాకుండా, వేరుశనగ పంట కాలంలో బెట్ట వచ్చి, పంట చివరిలో వర్షం వస్తే, వేరుశనగ దిగుబడి తగ్గినప్పటికీ, చివర పడిన వర్షం కంది పంటకు ఉపయోగపడి (పూత/కాయ థలో) అధిక దిగుబడిని ఇస్తుంది.
* అంతర పంటలను సాగు చేయడం ద్వారా ప్రధాన పంట మొక్కల మధ్య ఉన్న స్థలం వృధా కాకుండా ఉపయోగపడును. స్థలమే కాకుండా సహజ వనరులైన సూర్యరశ్మి, నీరు మరియు పోషకాలు కూడా సమర్ధంగా వినియోగించుకోబడతాయి. ఉదా: కందిలో అంతర పంటగా సజ్జను సాగు చేసినట్లైతే, సజ్జ స్వల్ప కాలిక పంట (80-90 రోజులు) త్వరగా కోతకు వస్తుంది.ఈ పంటను కోసిన తర్వాత కంది పూతకు వస్తుంది కాబట్టి ఈ రెండు పంటలకు వనరుల కోసం ఎటువంటి పోటీ ఉండదు.
* అంతర పంటలను సాగు చేయడం ద్వారా నేల కోత తగ్గడమే గాక, భూమి పైన సారవంతమైన పొర కొట్టుకొని పోకుండా భూసారం పరిరక్షింపబడుతుంది. ఉదా: మొక్కజొన్న మరియు అలసంద పంటలను కలిపి సాగు చేసినపుడు, అలసంద పంట గుబురుగా పెరగడం వలన నేల కోతను నిరోధించే పంటగా వ్యవహరించి నేల కోతను నివారించడమే గాక, నీటి ఒరవడిని 20-30 శాతం వరకు తగ్గించి భూమిలోనికి ఇంకేలా చేసి వర్షపు నీటిని సంరక్షిస్తుందని వివిధ పరిశోధనల్లో తేలింది.
* ప్రధాన పంటల్లో అపరాలను అంతర పంటలుగా సాగు చేసినట్లైతే, ప్రధాన పంటకు కొంతమేరకు నత్రజనిని అందించడమే గాక, భూసారం వృద్ధి చెందుతుంది. ఉదా: సజ్జ లేదా కొర్ర వంటి చిరుధాన్య పంటల్లో కందిని అంతర పంటగా సాగు చేసినట్లు అయితే, కంది వేర్లలో ఉండే రైజోబియం బాక్టీరియా వాతావరణం లోని నత్రజనిని స్థాపించి, ప్రధాన పంటకు అందిస్తుంది.
* అంతర పంటలను సాగు చేయడం ద్వారా ఎత్తుగా పెరిగే మొక్క, పొట్టిగా ఉండే మొక్కకు నీడను ఇస్తుంది. తద్వారా మొక్క ఉపరితలం పైన, చుట్టు పక్కల వాతావరణం చల్లబడుతుంది. ఉదా: టమోటా ను జొన్న పంటలో సాగు చేసినట్లు అయితే , జొన్న పంట టమోటా పంటకు నీడను ఇవ్వడం ద్వారా చుట్టు పక్కల ఉష్ణోగ్రత తగ్గి, సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది.
* గాలి వేగం ఎక్కువగా ఉన్న సందర్భాలలో, పొడవుగా మరియు దృడంగా ఉన్న పంట గాలి వేగంను తగ్గించి అంతర పంటకు రక్షణ ఇస్తుంది. ఉదా: టమోటా పంటను, మొక్క జొన్న / జొన్న పంటల వరుసల మధ్య సాగు చేస్తే, అధిక గాలి వేగం ఉన్నపుడు, ఈ పంటలు గాలి నిరోధకాలుగా మారి టమోటా పంటకు రక్షణ ఇస్తాయి.
* అంతర పంటలను సాగు చేయడం వలన చాలా వరకు కీటకాలు మరియు తెగుళ్ళు ఉధృతి తగ్గుతుంది.ఉదా: టమోటాను అలసంద పంటతో కలిపి సాగుచేసినపుడు, టమోటాలో బాక్టీరియా విల్ట్‌ తెగులు తగ్గిందని పరిశోధనల్లో తేలింది.
* అంతర పంటలను సాగు చేయడం ద్వారా చాలా వరకు కలుపును నివారించవచ్చు. ఉదా: ప్రొద్దుతిరుగుడు పంటను వివిధ పంటల్లో అంతర పంటగా సాగు చేయడం ద్వారా ఈ పంట వేర్లు స్రవించే ద్రవాల వలన (అల్లీలోపతి ప్రభావం) కలుపు నివారించబడుతుంది.


ఎర పంటలు / రక్షణ పంటలు:
ఈ ఎర పంటలు పొలం మధ్యలో కానీ, చుట్టూ కానీ వరుసలలో వేసి పండించడం వలన చీడ పీడలు ముఖ్య పంటను కాకుండా ఎర పంట వైపు ఆకర్షింపబడతాయి. తద్వారా చీడ పీడలు పలుచబడి ముఖ్య పంటపై వాటి ఉధృతి తగ్గుతుంది. అంతే గాకుండా, ఈ ఎర పంటపై చీడను గమనించిన వెంటనే ఇతర పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో నివారించుకోవచ్చు. ఇక రక్షణ పంటలను పొలం చుట్టూ ఒకటి / రెండు వరుసలలో వేయడం వలన, వైరస్‌ తెగుళ్ళను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులు ముఖ్య పంటను ఆశించకుండా రక్షిస్తాయి. అంతే గాకుండా, గాలి ద్వారా వ్యాప్తి చెందే పురుగులు పైరును ఆశించడం తగ్గుతుంది.


కొన్ని ముఖ్యమైన ఎర పంటలు-ఉపయోగాలు :
* ప్రత్తితో పాటు బెండను ఒకటి /రెండు వరుసలలో వేయడం వలన దీపపు పురుగులు మరియు కాయ తొలుచు పురుగు ప్రత్తి నుండి బెండ వైపు మరిలేటట్లు చేయవచ్చు.
* ప్రత్తిలో కంది పంటను కలిపి వేయడం వలన, బూడిద రంగు ముక్కు పురుగు కంది వైపు ఆకర్షించబడి చీడ ఉధృతి తగ్గుతుంది.
* ప్రత్తిలో అలసంద / సోయాచిక్కుడు పంటలను సాగు చేయడం వలన రసం పీల్చే పురుగుల ఉదృతి తగ్గుతుంది.
* వేరుశనగలో సోయాచిక్కుడు పండించడం వలన ఆకు ముడుత ఉదృతి తగ్గుతుంది.
* వేరుశనగలో ఆముదం/ ప్రొద్దుతిరుగుడు మొక్కలు అక్కడక్కడా వేయడం వలన పొగాకు లద్దె పురుగు గుడ్లు పెట్టడానికి ఆకర్షింపచేయవచ్చు.
* తీగ కాయ గూరల్లో మధ్యలో మినుము పంటను వేయడం వలన పండు ఈగ ఆశించకుండా తగ్గించవచ్చు.
* కూరగాయల్లో బంతి మొక్కలను సాగు చేయడం వలన భూమిలో ఉన్న నులి పురుగులు నశిస్తాయి.

ఎ. మల్లీశ్వర రెడ్డి, శాస్త్రవేత్త (సేద్య విభాగం) ఫోన్‌: 99892 08210; బి. సహదేవ రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త (మెట్ట వ్యవసాయం) & అధిపతి, వ్యవసాయ పరిశోధన స్థానం, అనంతపురం.

Read More

కరోనా నేర్పిన గుణపాఠాలు

మనిషి నిత్యం విద్యార్థే. జీవితం ముగిసేవరకు ఏదో ఒకటి నేర్చుకోవలసిందే. కాని అందరూ ఈ వాస్తవాన్ని తెలుసుకోగలుగుతున్నారా? అంటే సమాధానం లేదు అని వస్తుంది. మనకి అహం (ఇగో) ఎక్కువ. ఆ ఇగో వాస్తవాన్ని గ్రహించటానికి అంగీకరించదు. అందువలననే మనలో చాలామంది తమకే మొత్తం తెలుసు అనుకుని మిడిసిపడుతుంటారు. అంతా తెలుసు కాబట్టి ఎదుటి వారి దగ్గరి నుంచి నేర్చుకోవలసింది ఏమి లేదు అనుకుంటుంటారు.
కాని ఇది తప్పు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకునే విషయం ఉంటుంది. మనకు తెలియని విషయాలను తోటివారి దగ్గర నుంచి, తోటి సమాజంనుంచి, వివిధ ప్రసారమాధ్యమాల ద్వారా తెలుసుకుంటూ పాఠాలు నేర్చుకోవలసిందే. లేదంటే ఏదో ఒకరోజు పరిస్థితులు గుణపాఠాన్ని నేర్పుతాయి. నేల విడిచి సాము చేస్తూ ఆకాశాన్ని, భూమిని పాతాళాన్ని జయించామనే మనిషిని ఒక చిన్న వైరస్‌ (కరోనా) ముప్పతిప్పలు పెడుతుంది. కరోనా దెబ్బకి ప్రపంచం మొత్తం తల్లక్రిందులవుతుంది. ప్రపంచం మొత్తం స్పంభించిపోయింది. లక్షల కుటుంబాలు అల్లకల్లోలం అయినవి. కంటికి కనిపించని అతి చిన్న వైరస్‌ మనల్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కాని ప్రకృతిలో ఇవన్నీ సహజం. ఇపుడు కరోనా, భవిష్యత్‌లో ఇంకో వైరస్‌ మనలని ఇబ్బంది పెట్టవచ్చు అనటంలో ఏలాంటి సందేహం లేదు. కాబట్టి భవిష్యత్తులో రాబోయే కరోనాలాంటి విపత్తుల నుండి తప్పించుకోవడానికి ప్రస్తుత కరోనానే దారి చూపిస్తుంది. ప్రస్తుత కరోనా పరిస్థితులను కక్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ రాబోయే విపత్తుల బారినపడకుండా ప్రతి ఒక్కరు ఎవరి ప్రయత్నం వారు చేయగలగాలి. ఎవరికి వారు ‘మనకెందుకులే’ అనుకుంటే మిగిలేది శూన్యం. ‘No One knows everything, but everyone knows something’ అనే సత్యాన్ని గ్రహించి మన ఇగోలు ప్రక్కకుపెట్టి మనకు తెలియని కుల-మత, ప్రాంత, ధనిక-పేద, ఆడ-మగ, చిన్న-పెద్ద, నలుపు-తెలుపు అనే తేడా లేకుండా విలువైన విషయాలను అందరి దగ్గర నుండి తెలుసుకుంటూ ప్రతిఒక్కరు తమ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండవలసిన అవసరాన్ని కరోనా తెలియ చెప్పింది అని నిస్పందేహంగా చెప్పవచ్చు. కరోనా నేర్పిన కొన్ని గుణపాఠాలని మాకు తెలిసినంతలో పాఠకులకు అందిస్తున్నాం.
పేద దేశాలలోనే కరోనా మరణాలు తక్కువ
కరోనా మహమ్మారి మనము గుణపాఠం నేర్చుకోవటానికి వచ్చిన అవకాశం అనవచ్చు. కరోనాతో గుణపాఠాలు నేర్చుకోకుంటే భవిష్యత్తులో కరోనా లాంటి ఇంకా ఎన్నో ఉపద్రవాలబారిన పడటాన్ని ఎవరూ తప్పించలేరు. ఎవరికి వారే తప్పించుకోగలరు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. మిగతా దేశాలతో పోల్చుకుంటే రెండవ వేవ్‌ మన భారతదేశాన్ని విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంది. ప్రపంచ దేశాల దృష్టిలో మన దేశం అభాసుపాలు అవుతుంది. కరోనా మరణాల రేటు ఎక్కువగా నమోదు అయిన అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ లాంటి దేశాలలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకున్న తరువాత కరోనా బాధితుల రేటు తగ్గుతూ వస్తుంది. మన దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అనేది ప్రభుత్వం చేతులలో ఉంది. ప్రభుత్వం వేగం పెంచే వరకు మన అందరం ఈ విపత్కర పరిస్థితులు ఎదుర్కోవలసిందే. అన్ని సక్రమంగా జరిగి ఇంకా కొన్ని నెలలలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి అయ్యి కరోనా బారి నుంచి తప్పించుకున్నామే అనుకోండి. మరి భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవం ఇంకొకటి రాదు అని గ్యారంటీ ఉందా? అని అడిగితే ‘లేదు’ అనే సమాధానం దొరుకుతుంది. అంటే భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు రావటానికి అవకాశాలు మెండుగా ఉంటాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఉదాహరణకు పంటలను ఒక్కసారి పరిశీలించినట్లయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త రోగం పంటలను ఆశిస్తుంది అనే విషయం రైతులందరికి తెలుసు. అందుకే ప్రతి 1 లేదా 2 సవత్సరాలకు వ్యవసాయంలో కొత్త రసాయనం ప్రవేశపెట్టబడుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. మిరప పంటను ఇబ్బంది పెట్టే బొబ్బర వైరస్‌ లాంటి తెగులుకు ఈ రోజు వరకు ఎలాంటి నివారణ మార్గాలు మార్కెట్‌లో అందుబాటులో లేవు. బొబ్బర వైరస్‌ రాకుండా మిరప పంటను కాపాడుకోవలసిందే కాని వైరస్‌ వచ్చిన మొక్కలను కాపాడలేము. పొలం మొత్తంలో అన్ని మొక్కలను బొబ్బర వైరస్‌ ఆశించదు. ప్రక్కప్రక్కనే ఉన్న కొన్ని మొక్కలకు బొబ్బర వైరస్‌ ఆశించకుండా ఆ మొక్కలు ఆరోగ్యంగానే పెరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏమై ఉంటుంది? ఆలోచించండి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కరోనా కూడా కొందరిని ఆశించి ఇబ్బంది పెడుతుంది. ఇంకొందరు ఏమి జాగ్రత్తలు తీసుకోకపోయినా ఆశించినది, ఆశించనిది అర్థం కావడం లేదు. దానికి తోడు ఈ వర్గం వారు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. ఈ రెండు వర్గాలకు చెందిన వారిని కక్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిశోధనతో భవిష్యత్‌ తరాలకు ఒక క్లారిటీ ఇచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతము కరోనా వైరస్‌ ఇబ్బంది పెడుతున్న వర్గంయొక్క జీవన సరళి, కరోనా వైరస్‌ ఇబ్బంది పెట్టనటువంటి వర్గం యొక్క జీవన సరళి పరిశోధించి వివరణ ఇవ్వగలిగితే ప్రయోజనం ఉంటుంది. ప్రజలు ఎవరికి వారు తమ చుట్టుప్రక్కల సమాజాన్ని అవగాహన చేసుకొని పరిశీలించి పరిశోధించగలిగితే కనీస అవగాహనకు రావచ్చు.

ప్రపంచ దేశాలన్నింటిని పరిశీలించినట్లయితే మనమందరం పేద దేశాలు అనుకునే ఆఫ్రికాలోని ఎక్కువ శాతం దేశాలలో కరోనా మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు నైజీరియాను తీసుకున్నట్లయితే నైజీరియా జనాభా 20 కోట్లకు పైమాటే. అంత జనాభాలో 18-05-2021 వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య కేవలం 2067. అదే అమెరికాలో తీసుకున్నట్లయితే అమెరికా జనాభా 32.82 కోట్లు. అమెరికాలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6,00,533. అమెరికాలో వ్యాక్సినేషన్‌ ఊపందుకుంది. కాబట్టి మరణాల రేటు తగ్గింది. లేనట్లయితే ఇంకా పెరిగి ఉండేది. అదేవిధంగా మన దేశాన్ని తీసుకున్నట్లయితే మన దేశంలో మే 18 వరకు కరోనా వలన మరణించిన వారి సంఖ్య 2,78,751. మన దేశ జనాభా 136.64 కోట్లు. ఆఫ్రికా దేశాలలో మరణాల రేటు చాలా తక్కువ. ఒక్క దక్షిణ ఆఫ్రికాలో మరణాలు రేటు ఎక్కువగా ఉంది. మిగతా దేశాలు అనగా నైజీరియా, ఉగాండా, ఇథోపియా లాంటి దేశాలలో మరణాలు రేటు తక్కువగా ఉంది. ఆఖరికి మన అందరము అనుకొన్నట్లు పోషకాహార లోపంతో విపరీతంగా బాధపడుతున్న సోమాలియాలో కూడా మరణాలు రేటు చాలా తక్కువ. సోమాలియాతో పోల్చుకుంటే అమెరికాలో మరణాల రేటు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది.
చాలామంది దృష్టిలో ఆఫ్రికా దేశాలు పేద దేశాలు. కాని కరోనాతో ఆ విషయాన్ని మరచి పోవచ్చు. ఆర్థికంగా ఆఫ్రికా దేశాలు పేద దేశాలు కావచ్చు కాని ఆరోగ్యపరంగా చూసుకుంటే అవి ఎన్నో రెట్లు ధనిక దేశాలు (ఆరోగ్యమే మహాభాగ్యము) అనే అవగాహనకు రావచ్చు. ఆఫ్రికా దేశాల గురించి ఇంకో విషయం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలతో పోల్చుకుంటే ఆఫ్రికా దేశాలలో శుభ్రత చాలావరకు తక్కువ అని చెప్పవచ్చు. నేను (ఈ వ్యాస రచయిత) నాలుగున్నర సంవత్సరాలు నైజీరియాలోని క్వారా స్టేట్‌, జబ్బా ప్రాంతంలో ఉన్నాను కాబట్టి అక్కడ శుభ్రత గురించి పరిశీలించిన అంశాలను కొన్నింటిని ఇక్కడ అవసరం కాబట్టి ప్రస్తావిస్తున్నాను. శుభ్రత విషయంలో బాహ్య శుభ్రత కంటే లోపల శుభ్రత ముఖ్యం అని తెలియ చేయటానికి మాత్రమే ప్రస్తావిస్తున్నాను. నైజీరియాలో ఒకే గిన్నలో ఎక్కువ మంది ఏలాంటి తేడాలు లేకుండానే ఎంగిలి అని భావించకుండా ఆహారాన్ని తింటుంటారు. చేతుల శుభ్రత గురించి ఎక్కువగా పట్టించుకోరు. నీటిని కూడా అక్కడ నదులు, కాలువలలో పారే నీటినే తాగుతుంటారు. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోరు. ఇంకా ఇంకా చాలా ఉన్నవి కాని అవి అన్ని ఇక్కడ ప్రస్తావించవలసి అవసరం లేదు కాబట్టి ప్రస్తావించడం లేదు. అక్కడ ప్రజలు పెద్దగా మాస్కులు ధరించలేదు. శానిటైజర్లు ఉపయోగించలేదు. టాంజానియాలో ఒక స్నేహితుడు ఉన్నాడు. అతనికి ఫోను చేసి ఈ విషయాలను ప్రస్తావించగా మేము మాస్కులు పెట్టుకోవడం లేదు. అతి జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని చెప్పడం జరిగింది. ఏలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా అక్కడ మరణాల రేటు మన కంటే తక్కువగా ఉంది అంటే మనము వారి వద్ద నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని సర్వేలు నిర్వహించి కరోనా వలన ఆఫ్రికా దేశాలలో మరణాల రేటు ఎందువలన తక్కువగా ఉందో తెలుసుకుని మనం తగిన జాగ్రత్తలు తీసుకో గలగాలి. లేనట్లయితే ప్రస్తుతం ఉన్న కరోనా నుంచి తప్పించుకున్నా రాబోవు రోజులలో కరోనాను మించిన ఎన్నో ఉపద్రవాలు రావచ్చు. ప్రకృతిలో ఇవన్నీ సహజం. వాటిని తట్టుకోలేకపోతే మనందరం మిగలటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నవి. డబ్బు, దేవుడు ఇవేవీ మనలను కాపాడలేవు. మన జీవన విధానాలే మనలను కాపాడగలవు.
ధర్మం చరణం గచ్ఛామి
మనం ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అని ప్రతి ఒక్కరు అంటారు. ఎంతమంది దానిని అమలుపరచడములో చిత్తశుద్ధితో ఉన్నారు. అంటే సమాధానం ప్రశ్నార్థకమే. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అన్ని సమస్యలలో విచిత్రమయిన సమస్య చనిపోయిన వారికి దహన సంస్కారాలు పూర్తి చేయడము. ఇదే అదనుగా చాలామంది మనిషి చావుని కూడా వ్యాపారం చేసుకుంటూ శవాల మీద కూడా డబ్బులు దండుకుంటున్నారు. చనిపోయినవారిని హాస్పిటల్‌ దగ్గర నుండి స్మశానవాటికకు అంబులెన్సు, అక్కడ దహన సంస్కారాలు పూర్తి చేయడానికి రూ. 25,000/- నుండి 45,000/- వరకు ఖర్చు చేయవలసి రావడము చాలా విషాదకరము. శవాలను కూడా వ్యాపారంగా మలచుకునే నీతిమాలిన, సిగ్గుమాలిన పరిస్థితులు నెలకొన్న సందర్భంలో ధర్మం ఇంకా బతికే ఉంది అని నిరూపిస్తున్నారు గుంటూరులో ఉన్న ‘అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌’ వారు. అమ్మ చారిటబుల్‌ ట్రస్టులో సుమారు 50 మంది సిబ్బంది ఉన్నారు. వీరి గురువుగారు జ్ఞాన ప్రసన్నగిరి. ట్రస్ట్‌ క్రింద 13 అంబులెన్సులు, ఒక ఫ్రీజరు వ్యాను ఉన్నవి. గుంటూరు నగరం మరియు ఆ చుట్టు ప్రక్కల దగ్గరి ప్రాంతాలలో చనిపోయిన వారి శవాలను అమ్మ చారిటబుల్‌ ట్రస్టువారు తమ అంబులెన్సుల ద్వారా ఉచితంగా స్మశాన వాటికలకు చేరుస్తుంటారు. ఎవరూ లేని అనాధ శవాలకు అన్ని ఖర్చులు భరించి దహన సంస్కారాలు పూర్తిచేస్తున్నారు. అమ్మ ట్రస్టు బృందం అంతాకూడా ఏలాంటి మాస్కులు లేకుండా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాస్కులు, గ్లౌజులు లేకుండా కోవిడ్‌ బారినపడి చనిపోయిన శవాలను కూడా పట్టుకుంటూ ఉంటారు. శవాలను పట్టుకోవటానికి అంటు లేదా కరోనా శవం కదా అని భయపడడము లాంటివి ఏమి ఉండదు. ‘నిస్వార్థంగా సేవ చేస్తూ, ధర్మాన్ని కాపాడితే ఆధర్మమే వారిని కాపాడుతుంది’ అని వారు నమ్ముతారు. ”ప్రార్థించే పెదవులకన్నా సహాయం అందించే చేతులు మిన్న” అని గట్టిగా నమ్ముతారు.
శవాలకు తగిన గౌరవం ఇవ్వడము కనీస బాధ్యత
వ్యక్తి చనిపోయిన తరువాత దగ్గరకి రావటానికి, ముట్టుకోవడానికి సొంత పిల్లలు, సమీప బంధువులు ముందుకు రావడము లేదు. బ్రతికి ఉండగా సహాయం పొందినవారు చనిపోయిన తరువాత ముఖం చాటేస్తున్నారు. మనిషి చనిపోతే అంటు అని, కీడు అని లేనిపోని మూఢ విశ్వాసాలలో కొందరు మగ్గిపోతున్నారు. పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం తప్పదు. ప్రతి ఒక్కరు ఏదో ఒకరోజు శవంగా మారవలసిందే. అప్పుడు మన పరిస్థితి కూడా ఇంతే కదా అని తెలుసుకుని శవాలకు తగిన గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి కనీస ధర్మం అని తెలియ చెప్పేందుకే మేము ఈ దహన సంస్కార కార్యక్రమాలు చేపడుతున్నాము. ప్రజలు ఈ విషయాలను గ్రహించగలిగితే మా లక్ష్యం నెరవేరినట్లే అని అమ్మ చారిటబుల్‌ ట్రస్టు గురువు జ్ఞాన ప్రసన్నగిరి అన్నారు.
మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది
గుంటూరులో మా సమీప బంధువు ఒక ప్రయివేటు హాస్పిటల్‌లో కరోనాతో చనిపోవడము జరిగింది. ఆ వ్యక్తి దహన సంస్కరాల గురించి అమ్మ చారిటబుల్‌ ట్రస్టు వారిని సంప్రదించగా వారి పద్ధతుల ప్రకారం అంబులెన్స్‌ హాస్పిటల్‌కి వచ్చింది. కరోనా బారినపడి చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళడానికి వచ్చిన అమ్మ చారిటబుల్‌ ట్రస్టు యొక్క అంబులెన్సు డ్రైవర్‌ మాస్కు పెట్టుకోలేదు మరియు చేతులకు గ్లౌజులు వేసుకోలేదు. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అమ్మ చారిటబుల్‌ ట్రస్టు అంబులెన్సు డ్రైవరు ముఖానికి మాస్కు మరియు చేతులకు గ్లౌజులు లేకుండానే శవాలను పట్టుకుంటున్నాడు. మా బంధువుల శవానికి దహన సంస్కారాలు పూర్తి చేయడానికి బొగ్గులకుంట స్మశానవాటికకు వెళ్ళి చూడగా అక్కడ మొత్తం శవాలు మరియు శవాల తాలూకు బంధువుల మయం అయ్యింది. దాదాపు 200 మందికిపైగా జనం అందరు మాస్కులు పెట్టుకొని కనిపించారు. కాని అమ్మ చారిటబుల్‌ ట్రస్టు సిబ్బంది ఎవరూ కూడా మాస్కులు పెట్టుకోలేదు గ్లౌజులు వేసుకోలేదు. అలానే శవాలను అంబులెన్సులోనుంచి తోపుడు బండిపై ఉంచడము, బండిని దహన కార్యక్రమాల వరకు లాక్కెళ్ళి శవాన్ని అప్పటికే పేర్చి ఉన్న కట్టెలపై పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేయడము జరుగుతుంది. అమ్మ చారిటబుల్‌ ట్రస్టు గురువు గారు జ్ఞాన ప్రసన్నగిరి కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. ఆ స్మశానంలో సుమారు 2 గంటలు గడపడము జరిగింది. ఆ రెండు గంటలు మేము కూడా ఆ శవాల మధ్యనే తిరిగాము. కాలుతున్న శవాలను అతి దగ్గర నుంచి చూడడము జరిగింది. రెండు గంటలలో 10పైగా శవాలకు మా కళ్ళ ముందే దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఇవన్నీ చూసిన నాకు అత్రుత ఆగలేక మాస్కులు, గ్లౌజులు ఉపయోగించకపోతే మీకు భయము లేదా అని అమ్మ చారిటబుల్‌ ట్రస్టు సిబ్బందిని అడగగా వారి వద్ద నుంచి వచ్చిన సమాధానం ”మనం ధర్మాన్ని కాపాడితే మనల్ని ఆ ధర్మం కాపాడుతుంది” అని. ఇకనైనా తోటి సమాజం కూడా ధర్మంగా జీవించగలిగితే కరోనా కాదు కాదా కరోనా తాత కూడా మనల్ని ఏమి చేయ్యలేదని అమ్మ చారిటబుల్‌ ట్రస్టు సిబ్బంది ద్వారా ప్రేరణ పొంది ధర్మంగా జీవించాలని కోరుకుందాం.


ప్రకృతికి దూరం జరిగితే వైరస్‌లు దగ్గరవుతుంటాయి
మిగతా అన్ని జంతువులలాగానే మనిషి కూడా ఒక జంతువే. వివిధ రకాల కారణాల వలన మనిషి తన సొంత తెలివితేటలతో మిగతా జంతువులకన్నా గొప్పగా భావిస్తూ ప్రకృతికి దూరం జరుగుతూ తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకొంటున్నాడు. అభివృద్ధి ముసుగులో అవసరాలను త్రోసిపుచ్చి అనుకరణలకు ప్రాముఖ్యతను ఇస్తూ ప్రకృతికి దూరం జరుగుతూ కృత్రిమ జీవనానికి అలవాటుపడుతున్నాడు. ఇదే మానవ వినాశనానికి మూలం అవుతుంది. ఎవరయితే ఆరోగ్యకర జీవనానికి అవసరమైన వృత్తిలో కొనసాగుతున్నారో అలాంటి వారిని కరోనా లాంటి వైరస్‌లు ఎక్కువగా ఇబ్బందులు పెట్టడం లేదు. ప్రస్తుతం ఉన్న వృత్తులలో వ్యవసాయ వృత్తి ఆరోగ్యకర వృత్తి అని చెప్పవచ్చు. ఆరోగ్యకర జీవనానికి అసరమైన జీవన సరళి వ్యవసాయంలో సహజసిద్ధంగా దొరుకుతుంది. అందుకనే వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడిన కొన్ని ఆఫ్రికా దేశాలతోపాటు ఇండియాలో కూడా మరణాల రేటు తక్కువగా ఉంది. వాస్తవంగా ఇండియాలో మరణాల రేటు ఉండవలసిన దానికంటే ఎక్కువగానే నమోదు అవుతుందని చెప్పవచ్చు. అందుకు ప్రధాన కారణాలు మన ప్రజలు వ్యవసాయ రంగానికి దూరమవుతూ ఉద్యోగ, వ్యాపార రంగాలకు వలసలు పోవటము, మన దేశంలో వైద్యం వ్యాపారం కావటం వలన మరణాల రేటు ఎక్కువ అవుతుంది. అంతే కాకుండా మన వ్యవసాయంలో రసాయనాలు ఎక్కువగా ఉపయోగించటం వలన ఆహార పదార్థాలలో ఉండే విషరసాయనాలు మనలోని వ్యాధి నిరోధక శక్తిని దెబ్తతీస్తున్నాయి. ఆఫ్రికా దేశాలలో గమనించినట్లయితే అక్కడ పంటల సాగులో రసాయనాలు అతి తక్కువగా వినియోగిస్తారు. కొన్ని పంటలలో అసలు వినియోగించరు కాబట్టి అక్కడ ప్రజలు తమ ఆహారంలో 60 శాతానికి మించి ప్రకృతి సిద్ధంగా పండించినవే ఎలాంటి ప్రాసెస్‌ చేయకుండా తాజావి తినడం వలన అక్కడ ప్రజలలో రోగనిరోధక వ్యవస్థ సహజంగా పనిచేస్తుండటం వలన కరోనా వారిని ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్పవచ్చు.
ప్రస్తుత కరోనా నుంచి గుణపాఠం నేర్చుకొని ప్రకృతికి అనుకూలంగా జీవిస్తూ రసాయనాలు లేని ఆహారాన్ని తింటూ, శారీరక శ్రమ చేస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయగలిగితేనే భవిష్యత్‌ ఆరోగ్యకరంగా, ఆనందంగా ఉంటుంది.


సేంద్రీయ ఉత్పత్తులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి
మన రోగనిరోధక వ్యవస్థ అనేది మన జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా, శారీరకశ్రమ చేస్తూ, ఆరోగ్యకరమయిన, పోషకాలు సమపాళ్ళలో ఉన్న ఆహారాన్నితింటూ మానసికంగా ఆనందంగా ఉంటారో అలాంటి వారిలో రోగనిరోధక వ్యవస్థ బలిష్టగా ఉంటుంది. ఇందుకు భిన్నంగా అంటే ప్రకృతికి విరుద్ధంగా, శారీరకశ్రమ లేకుండా, మనశ్శాంతిలేకుండా, కృత్రిమ రసాయనాలతో పండించిన ఆహారాలు తింటూ ఉండేవారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందువలననే కృత్రిమ జీవనశైలి అలవర్చుకున్న అభివృద్ధి చెందిన దేశాలలో కోవిడ్‌ మరణాలరేటు ఎక్కువగా ఉంది. ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలలోని ప్రజల యొక్క జీవన సరళి ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. నైజీరియా, ఇథోపియా, కెన్యా, సోమాలియా, టాంజానియాలాంటి దేశాలలో ఎక్కువ శాతం మంది ప్రజలు శారీరకశ్రమ ఇమిడి ఉన్న వ్యవసాయంలాంటి వృత్తులలో ఉంటూ, పెద్దగా రసాయనాలు లేకుండా పండించిన ఆహార పదార్థాలని తాజాగా వినియోగిస్తుంటారు. కొన్ని ఆఫ్రికా దేశాలలో ప్రతి 3 లేదా 4 రోజులకు సంతలు జరుగుతుంటవి. సంతలలో ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు తమ ఉత్పత్తులను తాజాగా తెచ్చి అమ్ముతుంటారు. 90 శాతానికి పైగా ప్రజలు సంతలలోని ఉత్పత్తులనే కొనుగోలు చేస్తుంటారు. వీరు తినే ఆహారం తాజాగా ఉంటుంది. మరియు పెద్దగా రసాయనాలు అందించకుండా అంటే సేంద్రియ లేదా ప్రకృతిసిద్ధంగా పండించినవి కాబట్టి ఆయా ఆహార పదార్థాలలో పోషకాలు సక్రమంగా ఉండే ఆహారాన్ని తింటున్నారు కాబట్టే అక్కడ ప్రజలలో రోగనిరోధకశక్తి బలంగా ఉండి కోవిడ్‌ వలన పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొలేదు. ఆయా దేశాలలోని ప్రజలు మాస్కులు పెట్టుకోవడము, శానిటైజర్లు వాడడములాంటి జాగ్రత్తలు కూడా సరిగ్గా పాటించలేదు. అయినా కాని కోవిడ్‌ వలన సంభవించిన మరణాలు చాలా తక్కువ.
అనుకరణలు ఆరోగ్యకరంగా ఉండాలి
అవసరాలకంటే అనుకరణలకు ప్రాధాన్యత ఇచ్చే సమాజంలో ప్రస్తుతము మనము జీవిస్తున్నాము. మనలో చాలమంది వారి అవసరాలను ప్రక్కకునెట్టి ప్రక్క ఇంటివారో, తమ బందువులో లేదా తొటివారో ఏమి కొనుగోలు చేస్తారో అవి కొనుగోలు చేస్తుంటారు. అదే వేరే వారు ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకుంటూ, ఏ మాత్రం బరువు పెరగకుండా, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ, ముడిబియ్యం, చిరుధాన్యాలు, సేంద్రియ ఉత్పత్తుల లాంటివి తింటూ ఆరోగ్య సమస్యలు పెద్దగా లేకుండా జీవితాలను సాదాసీదాగా గడుపుతుంటే ఇలాంటి వారిని చూసి ఏమి అనుసరించరు. ఎందుకంటే ఆరోగ్యానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరము లేదు అనుకునే ప్రజలు ఉన్న సమాజంలో మనము ఉన్నాము. కాని కరోనాతో అయినా గుణపాఠాలు నేర్చుకోగలగాలి. ఎందుకంటే మనది అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందని దేశాల మధ్యలో ఉన్నాము. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ”ఎవరో వస్తారు ఏదో చేస్తారు” అనే దానిని ప్రక్కకు పెట్టి తమకు తామే తోటి సమాజాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. ఇంటర్‌నెట్‌ పుణ్యమా అని ప్రపంచం మన అరచేతిలోకి వచ్చింది. కాబట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ దేశాలను, మన తోటివారిని, మన బంధువులను, మన ప్రక్క వారిని పరిశీలించుకుంటూ ఇతరులలో ఉన్న ఆరోగ్యకర అలవాట్లను అనుకరించటానికి ముందుకు నడిస్తే ఫలితం ఉంటుంది. అలా కాకుండా మన ప్రక్క వారి దగ్గర మనం నేర్చుకోవడానికి ఏమి ఉండదులే, ప్రభుత్వం అన్ని చూసుకుంటుందిలే అనుకుంటూ అశ్రద్ధ చేసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.
మనకు అహం (ఇగో) ఎక్కువ. తోటివారి నుండి ఏమయినా విలువైన విషయాలు నేర్చుకోవటానికి ఈ అహం అడ్డు వస్తుంది. ”ఇగో నెవర్‌ యాక్సెఫ్ట్‌ ద ట్రూత్‌” (అహం ఎప్పుడు వాస్తవాన్ని అంగీకరించదు) అనే విషయాన్ని కక్షుణ్ణంగా తెలుసుకుని కొన్ని విషయాలలో అహాన్ని ప్రక్కకు నెట్టి వాస్తవాన్ని గ్రహించటానికి విచక్షణతో ఆలోచించాలి. మనకు ఇంకొక రోగం ఏమిటంటే దూరపు కొండలు నునుపు. అంటే ఒక మంచి విషయాన్ని ఒక పేదవాడో, మన ఇంటి ప్రక్కన ఉన్నవాడో, మన ఊరివాడో, వయస్సులో చిన్నవాడో చెబితే అంగీకరించరు. అదే విషయాన్ని ఒక సెలబ్రెటినో, అమెరికాలో ఉండేవాడో, ఆర్థికంగా ఎదిగిన వాడో, వయస్సులో పెద్దవాడో చెబితే వింటారు. అంటే ఇక్కడ విషయం కంటే ఆ విషయాన్ని తెలియచెప్పిన వ్యక్తికి ప్రాముఖ్యత ఇస్తుంటారు. అంటే తమ బుర్రను తీసుకెళ్ళి వేరే వారి చేతులో పెడుతుంటారు. ఇది మంచి పరిణామం కాదు. మనందరికి బుర్ర ఉంది. కాబట్టి ఆ బుర్రతో ఆలోచించి విషయాన్ని చెప్పిన వారికంటే విషయానికి ప్రాముఖ్యతను ఇచ్చి తన సొంత బుర్రతో ఆలోచించగలిగితే ఫలితాలు అశాజనకంగా ఉంటాయి. లేనట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవలసిందే. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది. జరిగిపోయింది వెనకాలకు రాదు కాబట్టి ఇకనైనా ఈ కరోనాతో గుణపాఠం నేర్చుకుని అనవసరమయిన అనుకరణలను ప్రక్కకు పెట్టి ఆరోగ్యకరమయిన అనుకరణలకు ప్రాముఖ్యతను ఇచ్చి పాటించగలిగితే భవిష్యత్తులో ప్రకృతి సిద్ధంగా వచ్చే కరోనాలాంటి విపత్తులనుంచి బయట పడటానికి అవకాశం ఉంటుంది.


ఆదర్శంగా ఆలోచిద్దాం…
అక్కరకురాని ఆచారాలనుండి బయటపడదాం
తోడుగా నిలబడదాం : కరోనా మహమ్మారి వలన ముక్కు పచ్చలారని చిన్నారులు అనాధలవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఆదర్శంగా ఆలోచించాల్సి ఉంటుంది. పిల్లలు లేని దంపతులు చాలా మంది సమాజంలో కనిపిస్తున్నారు. ఇలాంటి వారు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి సంతాన సాఫాల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. 20 నుండి 30 శాతానికి మించి ఫలితాలు కనిపించడము లేదు. ఎంతఖర్చుపెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కనివారు పిల్లలు పుట్టడము లేదని కలతచెందకుండా ప్రస్తుత పరిస్థితులలో అనాథలయిన పిల్లలని దత్తత తీసుకోవచ్చు. మనం కష్టపడి సంపాదించిన సొమ్ము వేరేవారెవరో అనుభవించటమేమిటి? తమ కులం వారు దొరకడము లేదని కొందరు దత్తతకు ముందుకు రావడం లేదు. ఇలాంటి అక్కరకు రాని ఆచారాలను ప్రక్కకుపెట్టి ఆదర్శంగా ఆలోచించగలిగితే అనాధలయిన వారికి అండగా నిలిచిన వారు అవడముతోపాటు, సంతానం లేదు అనే బాధ నుండి బయటపడి మిగిలిన జీవితాన్ని పిల్లలతో అనుభవిస్తూ ఆనందంగా గడపవచ్చు.
కరోనా వలన జీవిత భాగస్వామిని కోల్పోయి మిగిలిన జీవితమంతా ఒంటరిగా గడపవలసి వచ్చిన వారు కొంత కాలం గడిచిన తరువాత తమ కుటుంబంలోని అందరి అభిప్రాయాలని తెలుసుకుని మరలా పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రాగలిగితే ఒకరికొకరు తోడు కాగలరు. దానికి తోడు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దటానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలోని పెద్దలు, ఇతర కుటుంబ సభ్యులు అక్కరకు రాని ఆచారాలను ప్రక్కకుపెట్టి ఆదర్శంగా ఆలోచించి జీవిత భాగస్వామిని కోల్పోయిన వారికి తోడును అందివ్వడానికి ముందుకు రాగలగాలి.
ఇటీవల కాలంలో వివిధ రకాల కారణాల వలన అబ్బాయిలకి వివాహం కొరకు అమ్మాయిలు దొరకడము లేదు. వయస్సు మీదపడి పెళ్ళిళ్లు కానివారు ఇక ముందు జరుగుతుంది అనే నమ్మకం కోల్పోయినావారు కాలంచెల్లిన ఆచారాలను ప్రక్కకు పెట్టి, వయస్సుతో పెద్దగా నిమిత్తం లేకుండా ఒంటరివారికి తోడుగా నడవడానికి ముందుకు నడవాలి. ఇలాంటి సందర్భాలలో ”ఎవరో వస్తారు ఏదో చేస్తారని” ఆలోచించకుండా ”ఎవరో ఒకరూ ఎప్పుడో అపుడు నడవరా ముందుగా” అనే నానుడి నిజం చేస్తూ ”మొదటి అడుగు ఒక్కటే” అని గుర్తించి తామే మొదటి అడుగు వేయగలిగితే వెనకాల కొన్ని వేల అడుగులు మొదటి అడుగుకి తోడవ్వటానికి సిద్ధంగా ఉంటాయని గుర్తుంచుకోండి.


రైతులను వివాహమాడేందుకు ముందుకు రావాలి
గత కొంతకాలం నుండి వ్యవసాయం చేసేవాడిని వివాహమాడటానికి అమ్మాయిలు ముందుకు రావడము లేదు. 20 ఎకరాల పొలము ఉన్న వాడికి పిల్లదొరకడము కష్టంగా ఉంది. కాని 20 వేల జీతం ఉన్నవాడికి పిల్లదొరుకుతుంది. 5 ఎకరాల పొలం ఉన్న వాడిని వదలి 50 వేల జీతం ఉన్నవాడిని పెళ్ళి చేసుకుంటున్నారు. కొంతకాలం గడిచిన తరువాత వారు ఆ జీతంతో ఆ పొలాన్నే కొనుగోలు చేస్తున్నారు. రైతులు కూడా తమ ఆడపిల్లలని తొటి రైతుకంటే ఉద్యోగ, వ్యాపార రంగాలలో స్థిరపడిన లేదా స్థిరపడే వారికి ఇవ్వడానికి మక్కువ చూపుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో ఈ ఇబ్బందులు ఎక్కువయినవి. కాని ‘ఇన్‌కం ఉన్నవాడికంటే ఇమ్యూనిటి ఉన్నవాడే గొప్పవాడు’అని కరోనా గుర్తు చేసింది. రైతు దగ్గర ఇన్‌కం ఉండకపోవచ్చు. కాని ఇమ్యూనిటి తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి రైతులను పెండ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రాగలితే భవిష్యత్‌ బాగా ఉండటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి.


ఆరోగ్యమే – మహాభాగ్యం
”ఇన్‌కం ఉన్న వాడికంటే ఇమ్మూనిటి ఉన్నవాడే గొప్పవాడు” అని కరోనా తెలియచెప్పింది. ఇప్పటివరకు ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అంత గొప్పవాడు అనుకున్నారు, అనుకుంటున్నారు. కాని ఇది వాస్తవం కాదు అని కరోనా వలన అందరికి తెలియవచ్చింది. ”డబ్బులు ఉంటే భాగవ్యంతులు, అదే ఆరోగ్యం ఉంటే మహాభాగ్యవంతులు” అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యమే మహాభాగ్యము అని నమ్మి, డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యమని తెలుసుకున్నారు కాబట్టి మహాభాగ్యవంతులు కావడానికి అవసరమయిన చర్యలు చేపట్టాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిసినా కూడా కొందరు దానిని అశ్రద్ధ చేస్తున్నారు కాబట్టి కరోనా వచ్చి మనకు గుర్తు చేసింది అనుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటే ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తూ రాబోయే కరోనాలాంటి విపత్తులను ఎదుర్కొనే శక్తివంతులము అవుతాము. అప్పుడే ఆరోగ్యాంధ్రప్రదేశ్‌, బంగారు తెలంగాణా సాధ్యమవుతుంది.


చివరకు మిగిలేది… మిగిల్చేది వ్యవసాయమే
ఏమైనా ఆగవచ్చు.. కాని వ్యవసాయం ఆగకూడదు.
ఎవరైనా విశ్రాంతి తీసుకోవచ్చు. కాని రైతుకు విశ్రాంతి లేదు.
స్వేదం చిందించి… సేద్యం చేసి…
ప్రజల ఆకలి తీర్చే అన్నదాత రైతు.
రైతు బాగుంటేనే… మనం బాగుంటాము…
మనం బాగుంటే…. దేశం బాగుంటుంది.
అన్నింటికంటే ఉత్తమమైన వృత్తి వ్యవసాయం.
రైతు దేశానికి వెన్నెముక అని అందరికి తెలుసు. రైతుపండించిన ఆహారంతో మనం ఆకలి తీర్చుకుంటున్నాము. రైతు లేకపోతే, రైతు వ్యవసాయం చేయకపోతే ప్రపంచం స్థంభించిపోతుంది. ప్రజల కడుపునింపే ఆహారాన్ని పండించేది రైతే. కాబట్టి గత సంవత్సరము కరోనా వలన లాక్‌డౌన్‌ మొదలయిన రోజు నుండి ఈ రోజు వరకు వ్యవసాయం ఆగలేదు. రైతు తన శ్రమని ఆపలేదు. ఈ మధ్యలో కొంతకాలం విమానాలు, ఫ్యాక్టరీలు, బస్సులు, రైళ్ళు చివరికి దేవుడి దర్శనాలు కూడా ఆగినవి. కాని రైతు కాడి మాత్రం ఆగలేదు, అంటేనే అర్థం అవుతుంది, రైతు విలువ ఏమిటో. లాక్‌డౌన్‌ అనగానే ప్రజలు ఎవరూ కార్ల కోసం పరుగులు పెట్టలేదు. సినిమాల కోసం పరుగులు పెట్టలేదు. కంప్యూటర్ల కోసం పరుగులు పెట్టలేదు. గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చీల కోసం పరుగులు పెట్టలేదు. రైతులు పండించే ఆహారం కోసం పరుగులు పెట్టారు. రైతు ఏ రోజూ తన సాగుని ప్రక్కకు నెట్టకుండా అన్ని అడ్డంకులను అధిగమిస్తూ పంటలసాగు చేస్తున్నారు. కాబట్టే పరుగులు పెట్టిన ప్రజలందరికి ఆహార ధాన్యాలు దొరుకుతున్నవి. లాక్‌డౌన్‌ భయంతో కొంతమంది అవసరానికి మించి ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. ఏ మాత్రం లోటు లేకుండా అడిగిన వారికి అడిగినన్ని ఆహార ధాన్యాలు దొరుకుతున్నవంటేనే తెలుస్తోంది. మన రైతుల గొప్పతనమేంటో. వ్యవసాయంలో ఆర్థికంగా లాభాలు ఏ మాత్రం రాకపోయినా కూడా ప్రజల కడుపునింపుతున్నామనే తృప్తితో రైతులు నష్టాలలో కూరుకుపోతూ కూడా పంటల సాగు కొనసాగిస్తున్నారు. ఏ రోజు విశ్రాంతి తీసుకోకుండా శ్రమించినా కూడా రైతులలో కరోనా బారినపడి ఇబ్బందిపడ్డ వారు మరియు మృత్యువాతపడ్డ వారు చాలా తక్కువమంది ఉన్నారు. వ్యవసాయేతర ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారు లాక్‌డౌన్‌ సమయములో అన్ని జాగ్రత్తలు పాటించి విశ్రాంతి తీసుకున్నా కూడా రైతు వర్గానికి కంటే ఎక్కువ శాతం మందే కరోనా బారినపడి ఇబ్బందులు పడడము మరియు మృత్యువాత పడడము జరిగింది. మనదేశంలోనే కాదు మిగతా దేశాలలో పరిశీలిస్తే వ్యవసాయాధారిత దేశాల కంటే ఇతర రంగాలపై ఆధారపడిన దేశాలలోనే కరోనా ప్రభావం వలన మృత్యువాతపడినవారు ఎక్కువ మంది ఉన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకున్న కొన్ని దేశాలలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరిగింది కాబట్టి సరిపోయింది, లేనట్లయితే ఏమిటి పరిస్థితి అని ఒక్కసారి ఆలోచించండి. మాస్కు పెట్టుకున్న వాడిని, పెట్టుకోనివాడిని, జాగ్రత్తలు పాటించినవాడిని, పాటించనివాడిని, ఏలాంటి తేడాలు లేకుండా కరోనా వెంబడించింది. వెంబడిస్తుంది. కాకపోతే కొంచెం ముందు లేదా కొంచెం వెనకాల అంతే తేడా. ఏదో సినిమాలో ”రావడము ఆలస్యం అవ్వవచ్చు కాని రావడము మాత్రం ఖాయం” అన్నట్లు కరోనా కూడా తీసుకున్న, తీసుకునే జాగ్రత్తలనుబట్టి కొంచెం ముందు, కొంచెం వెనక అంతే తేడా కాని రావడం మాత్రం ఖాయం. కాకపోతే ఎవరికి ఎంతవరకు ఇబ్బందులు పెట్టిందనేదే ఇక్కడ ముఖ్యం. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం వ్యవసాయేతరంగాలవారే కరోనా వలన ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వ్యవసాయమే మిగిలేది. వ్యవసాయమే మనల్ని మిగుల్చుతుంది అనే గుణపాఠం నేర్చుకుందాం !

  • డి. ప్రసాదరావు, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌, రైతునేస్తం వ్యవసాయ మాసపత్రిక
    సెల్‌: 98493 12629

Read More

వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని మార్చనున్నాయా?

ప్రకృతి ఒడిలో జీవించే అనేక జీవరాశుల్లో మనిషి ఒకడు. మానవుడికి ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకోవటం తెలిసేకొద్దీ మనుషుల జనాభా వేగంగా పెరిగింది. తన సౌకర్యాల కోసం అడవుల్ని నరికి, పరిశ్రమల్ని నెలకొలిపి, గనుల్ని తవ్వి, రవాణా సాధనాలను పెంచుకొని, అనేక విధాలుగా ప్రకృతి రూపాన్ని మార్చేశాడు. ప్రకృతిని ఆవరించి ఉన్న పర్యావరణాన్ని సైతం కలుషితం చేశాడు. ఒక రక్షా కవచంలా ఉన్న ‘ఓజోన్‌’ పొరలో రంధ్రం ఏర్పడి, అతి నీల లోహిత కిరణాలు భూమిపై దాడిచేస్తున్నాయి. మంచు పర్వతాలు కరిగి, సముద్ర నీటిమట్టం పెరిగి, ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిని చేరుకుంటున్నాయి. వాతావరణ మార్పులు మానవుల సుస్థిర జీవనాన్ని అభివృద్ధినీ సవాలు చేసే స్థితికి చేరుకున్నాయి. ఒకవైపు ప్రకృతి, వాతావరణ కాలుష్యపు ధాటికి అల్లల్లాడుతుంటే, మరోవైపు మానవుల జీవన ప్రమాణాల్లో ఉన్న అసమానతలు తీవ్రమౌతున్నాయి.

ప్రపంచ దేశాల ఐక్య కార్యాచరణ:
21వ శతాబ్దపు ప్రారంభంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల’ను రూపొందించింది. ఎనిమిది లక్ష్యాల ఈ ప్రణాళికను 191 దేశాలతోపాటు 22 అంతర్జాతీయ సంస్థలు సమర్థించి, 2015లోగా వాటిని సాధించాలని తీర్మానించాయి. 2015లో జరిగిన సమీక్షలో కొన్ని లక్ష్యాలు చాలావరకు నెరవేరాయని అంచనా వేసింది. రోజుకి 1.25 డాలర్ల కన్నా తక్కువ ఆదాయం కలవాళ్ళు 1990లో 190 కోట్ల మంది ఉండగా, వారి సంఖ్య 2015 కల్లా సగానికి తగ్గిందని సంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ వాతావరణ భద్రత విషయంలో లక్ష్యాలు నెరవేరలేదనే అవగాహనకు ఆ సమావేశం వచ్చింది. ఓజోన్‌ పొరకు హాని కలిగించే కర్బన ఉద్గారాలు కొంత తగ్గినా ఓజోన్‌ పొరను పూర్వ స్థాయికి చేర్చడానికి 2050 వరకు పడుతుందని ఆ సమావేశం భావించింది. కాని అడవుల్ని నరకటం ఆగలేదనీ, కార్బన్‌డైఆక్సైడ్‌ సాంద్రత 1990తో పోలిస్తే 50 శాతం పెరిగిందనీ ఆందోళనను వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి తాజాగా 17 లక్ష్యాలతో ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల’ను ప్రకటించింది. గత ధోరణులు కొనసాగితే 2030కల్లా ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడు పెరుగుతాయనీ, కాని దేశాల ఐక్యకార్యాచరణతో ఆ పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడుకి పరిమితం చేయాలని తీర్మానించాయి. 2015 డిసెంబరులో పారిస్‌ నగరంలో జరిగిన ఈ సమావేశం 2030కల్లా కార్బన్‌ డైఆక్స్‌డ్‌ స్థాయిని 2010తో పోలిస్తే 45 శాతం తగ్గించాలని నిర్ణయించాయి. అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, కువైట్‌ వంటి కొన్ని దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేయకున్నా 193 దేశాలు అందులో భాగమయ్యాయి. తాజాగా అమెరికా పారిస్‌ ఒప్పందంలో చేరడానికి నిర్ణయించడంతో వాతావరణ లక్ష్యాల సాధనపై ఆశలు పెరిగాయి. ప్రపంచ దేశాలు ఆమోదించిన ‘వాతావరణ అనుకూల వ్యవసాయం’ అనే వ్యూహంలో మూడు అంశాలున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి, ఆదాయం దీర్ఘకాలంలో సుస్థిరంగా పెరగటం మొదటి అంశం. వాతావరణ మార్పుల్ని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవటం రెండవది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ‘గ్రీన్‌ హౌస్‌ వాయువు’లను సక్రమంగా తగ్గిస్తూ వాటిని పూర్తిగా నివారించటం మూడవ అంశం. ఆహార భద్రతకు హానికలగకుండా వాతావరణ మార్పుల్ని నిరోధించగలిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించి, అమలు చేయటం అన్ని దేశాల కర్తవ్యం. ఈ సంవత్సరం జూన్‌ 5వ తేదీన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా ‘ప్రకృతి పునరుజ్జీవం’ అనే నినాదంతో జరుగుతున్న సమావేశానికి పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇస్తున్నది.
పారిస్‌ ఒప్పంద లక్ష్యాలు:
ప్రపంచంలో పారిశ్రామికీకరణ 1700-1750 సంవత్సరాల మధ్య ప్రారంభమైంది. అప్పటి ఉష్ణోగ్రతల్ని సహజంగా మార్పు చెందిన వాటిగా పరిగణించి, ఆ తర్వాత వచ్చిన ఉష్ణోగ్రతల మార్పుని మానవుల పెరిగిన కార్యక్రమాల వల్ల వచ్చినట్లుగానూ పరిగణిస్తున్నారు. కాని ఆ కాలంలో నమ్మదగిన ఉష్ణోగ్రతల రికార్డులు లేవు. అందుకే 1850-1900 మధ్య సగటు ఉష్ణోగ్రతను పారిశ్రామికీకరణకు ముందు ఉష్ణోగ్రతగా ప్రామాణికంగా తీసుకున్నారు. దానితో పోలిస్తే 2100 సంవత్సరంలో సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీలకన్నా ఎక్కువ పెరగవచ్చని అంచనా వేశారు. ఆ పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడుకి పరిమితం చేయాలంటే ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించటానికి ప్రయత్నించాలని పారిస్‌ ఒప్పందం పేర్కొన్నది. గాలిలో 78.07 శాతం నత్రజని, 20.95 శాతం ఆక్సిజన్‌ ఉంటుంది. ఇవి కాక 0.9 శాతం ఆర్గాన్‌, 0.04 శాతం కార్బన్‌ డైఆక్సైడ్‌, నీటి ఆవిరి వగైరా ఉంటాయి. కార్బన్‌ డైఆక్సైడ్‌ సాంద్రత పెరిగేకొద్దీ, ఉష్ణోగ్రత పెరుగుతుంది. 1850-1900 మధ్యకాలంతో పోలిస్తే ఇప్పటికే ఉష్ణోగ్రత 1.2 డిగ్రీల సెంటీగ్రేడు పెరిగింది. అంటే వచ్చే 79 సంవత్సరాల్లో ఉష్ణోగ్రత మరో 0.3 డిగ్రీల సెంటీగ్రేడు కన్నా ఎక్కువ పెరగకూడదని పారిస్‌ ఒప్పంద లక్ష్యం. పారిస్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, ప్రస్తుత విధానాలను కొనసాగిస్తే ఈ శతాబ్దాంతానికి ఉష్ణోగ్రత 0.8 డిగ్రీలుగానీ, అంతకన్నా ఎక్కువగానీ పెరగవచ్చు. ప్రపంచ దేశాలన్నిటిలోనూ కలిపి వెలువడుతున్న కర్బన ఉద్గారాల్లో భారత్‌ వాటా 6.5 శాతమని 2014లో అంచనా వేశారు. అత్యధికంగా చైనాలో, ఆ తర్వాత అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ల తర్వాత భారత్‌ నాల్గవ స్థానంలో ఉంది. తలసరి కర్బన ఉద్గారాలను పరిగణనలోకి తీసుకుంటే అత్యధికంగా అమెరికాలో 15.74 మెట్రిక్‌ టన్నులు, చైనాలో 7.72 మెట్రిక్‌ టన్నులు, యూరోపియన్‌ యూనియన్‌లో 6.97 మెట్రిక్‌ టన్నులతో పోలిస్తే భారత్‌లో 1.83 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌తో సమానమైన ఉద్గారాలు వెలువడుతున్నాయి.
భారత్‌ ప్రకటించిన మూడు చర్యలు
భారతదేశం స్వచ్ఛందంగా మూడు కార్యక్రమాల ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని ప్రకటించింది. ఆర్థికాభివృద్ధి వేగానికీ, కర్బన ఉద్గారాల విడుదలకు సంబంధం ఉన్నది. 2005లో ఉదాహరణకు ఆర్థికాభివృద్ధి 6 శాతం ఉన్నదనుకోండి. అప్పుడు విడుదల చేసిన కర్బన ఉద్గారాలతో పోలిస్తే, 2030లో అదే ఆరు శాతం ఆర్థికాభివృద్ధి ఉన్నా విడుదలయ్యే కర్బన ఉద్గారాలను 33 నుండి 35 శాతం తగ్గేలా కార్యాచరణ ఉంటుందని ప్రకటించింది. 2015కి ముందు దేశంలో కర్బన ఉద్గారాల విడుదలలో వృద్ధి సాలీనా 4.8 శాతంగా ఉండేది. ఉద్గారాల విడుదల వృద్ధి రేటు 2015లో 2.5 శాతానికీ, 2016, 2017 సంవత్సరాల్లో 2.9 శాతానికి తగ్గిందని భారత్‌ ప్రకటించింది. 2005తో పోలిస్తే 2014 కల్లా కర్బన ఉద్గారాల రేటు 21 శాతం తగ్గిందని నీతి ఆయోగ్‌ ప్రకటించింది. తాజాగా ప్రధానమంత్రి ప్రకటనలో ఉద్గారాలు 24 శాతం తగ్గినట్లు చెప్పారు. 2030 నాటికి 33 నుండి 35 శాతం తగ్గుదలను సాధించటం సాధ్యమౌతుందని భావించవచ్చు. ప్రపంచంలోని చాలా దేశాలు 1990 తర్వాత కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించగలుగుతున్నామని చెబుతున్నాయి. జాతీయాదాయంలో పారిశ్రామిక రంగం వాటా తగ్గి, సేవా రంగ వాటా పెరగటమే ఇందుకు కారణం కావచ్చు.
మన దేశం చేపట్టిన రెండవ కార్యక్రమం విద్యుతుత్పాదనలో పునరుత్పాదక రంగం వాటాలను 2030 కల్లా 40 శాతానికి పెంచటం. బొగ్గు ఆధారిత ధర్మల్‌ విద్యుత్‌ వాటాను తగ్గించి, మైక్రో ఎలక్ట్రిక్‌, న్యూక్లియర్‌ విద్యుత్‌తోపాటు సౌర, పవన విద్యుత్‌ను పెంచడం ద్వారా కాలుష్యం తగ్గి, కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించటమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇప్పటికే కాలుష్యరహిత విద్యుదుత్పత్తి స్థాపనా సామర్థ్యం 38 శాతానికి చేరినట్లు అంచనా. 2030 నాటికి ఈ లక్ష్యాన్ని అధిగమించడం కూడా సులువుగానే జరగవచ్చు.
మూడవ కార్యక్రమం అటవీ భూముల శాతాన్ని పెంచటం. ప్రతి ఏటా దేశంలో కోట్ల కొద్దీ మొక్కలను నాటుతున్నా వాటిలో బ్రతికి చెట్లవుతున్నవి లక్షల సంఖ్యలోనే ఉన్నాయి. విపరీతమైన జన సమ్మర్థం వల్ల అటవీ భూముల్ని విస్తరించే లక్ష్యం నెరవేరేలా కన్పించడం లేదు.
వ్యవసాయంలో రావలసిన మార్పులు
అన్నిరంగాలతోపాటు వ్యవసాయరంగం కూడా కర్బన ఉద్గారాల విడుదలకు సహకరించక తప్పదు. దేశంలో విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో 18 శాతం వ్యవసాయరంగం నుండే వెలువడుతున్నాయి. మూడు అంశాల కార్యక్రమం ద్వారా వ్యవసాయరంగం నుండి వెలువడుతున్న ఉద్గారాలను 18 శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మొదటిది రసాయనిక, ఎరువుల్ని సమర్థవంతంగా వినియోగించడం నత్రజని ఎరువుల వృధా వాడకాన్ని తగ్గించడం ద్వారా దీనిని సాధించవచ్చు. రెండవ కార్యక్రమం భూమిని తక్కువగా దున్నడం. లోతుగా దున్నకుండానే రెండవ పంటను కొన్ని యంత్రాలతో విత్తడం ద్వారా ఇది సాధ్యపడుతుందని అనుభవం నిరూపించింది. వరిలో నీటి నిర్వహణను మెరుగుపరచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని పరిశోధనలు తెలియజేశాయి. ముందు నాటినప్పుడు నాలుగంగుళాల నీటిని పెట్టి, దానిని క్రమంగా రెండంగుళాలకు తగ్గించి, మళ్ళీ దానిని క్రమంగా నాలుగంగుళాలకు పెంచడం వల్ల నీటి వినియోగాన్ని, కర్బన ఉద్గారాలను తగ్గించే అవకాశాలున్నాయి. పంటల సరళిలో కూడా మార్పులు రావలసిన అవసరం ఉంది. ప్రపంచంలో మొక్కజొన్న, గోధుమ, వరి పంటలు అత్యధికంగా పండించబడుతున్నాయి. ప్రపంచంలో 41 శాతం వ్యవసాయ భూమి ఈ పంటలతో సాగవుతున్నది. ఈ మూడు పంటలే 64 శాతం కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. భారతదేశంలో కూడా ఈ మూడింటి సంయుక్త వాటా ఎక్కువగా ఉన్నది. మెట్టపంటలైన జొన్న, సజ్జ, రాగి, చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజల పంటలు తక్కువ నీటిని వినియోగించడంతోపాటు, తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇచ్చే ధాన్యాలను మార్చడంతో మొక్కజొన్న, గోధుమ, వరి పంటల విస్తీర్ణాన్ని తగ్గించి కొంతవరకు మెట్టపంటల సాగుని పెంచడంతో ఉద్గారాల ఉత్పత్తిని తగ్గించవచ్చు. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ నీటి ఎద్దడిని తట్టుకోగలిగిన మెట్ట పంటల ప్రాధాన్యత పెరుగుతుంది. నత్రజని స్థిరపరచగలిగిన ‘లెగ్యూమ్‌’ జాతి పంటల సాగుని పెంచడం వల్ల కూడా ఉద్గారాల నిష్పత్తిని తగ్గించవచ్చు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఆఫ్రికాలోనూ, భారత ఉపఖండంలోనూ రానున్న థాబ్దాల్లో వర్షపాతం తగ్గవచ్చని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో నీటినీ, ఎరువులనూ సమర్థవంతంగా వినియోగించగల మెట్ట పంటల ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఉంది. సేంద్రియ వ్యవసాయానికిచ్చే ప్రాధాన్యతను పెంచి, ప్రోత్సాహకాలనివ్వడం ద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని కొంత తగ్గించాలి. పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ విధానాలకు పరిశోధనా, విస్తరణ మద్దతుని పెంచడం కూడా అవసరం. వ్యవసాయాభివృద్ధి వ్యూహాన్ని మార్చకుండా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించడం సాధ్యం కాదు. వాతావరణ మార్పుల్ని అడ్డుకోలేకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకుని, మంచి దిగుబడినివ్వగలిగిన పంటలు, రకాలు రూపొందించడానికి పరిశోధనల్ని ఉధృతం చేయాలి. పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అందించటంతోపాటు, కర్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు నేటి వ్యవసాయ రంగానికి అవసరం.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
(రిటైర్డ్‌ ఞ కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More

ప్రకృతి వ్యవసాయంతో అందరికీ ఆహారం అందించడం సాధ్యమేనా?

ముందుగా, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి రసాయన ఎరువులు, పెస్టిసైడ్స్‌ వాడకుండా తక్కువ దిగుబడులు వచ్చినా, కలుపు తీతకు కూలీల సమస్య ఉన్నా, కలుపునివారిణులు వాడకుండా డబ్బు ఖర్చు చేసుకుంటూ, స్వయంగా మార్కెట్‌ చేసుకుంటూ, వాటిలో కూడా నష్టాలను భరిస్తూ ఆరోగ్యకరమైన తిండిని కొందరు వినియోగదారులకు అయినా చేరేలా చేస్తున్న ప్రకృతి వ్యవసాయ రైతులకు, సేంద్రియ వ్యవసాయదారులకు నా కృతజ్ఞతలు.


ఇప్పుడు అత్యధిక జనాభాకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల గురించి అవగాహన ఉంది కానీ, ప్రతి ఒక్కరికి అవి చేరువలో లేవు. ఒకవేళ దేశం మొత్తం సేంద్రియ వ్యవసాయం చేపట్టినా దేశంలో అందరికీ ఆహారం సరిపోదని, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆహార మరియు పౌరసరఫరాల మంత్రిత్వశాఖ అధికారుల అంచనా.


నిజమే! అస్థిరమైన ఆహార పదార్థాల ధరలు, అనవసర అధిక ధాన్యాల ఉత్పత్తి, అధిక జనాభా వృద్ధిరేటు, ప్రతి ఇంటా జరిగే ఆహార పదార్థాల దుర్వినియోగం, అవసరమైన పంటలు మార్కెట్‌ కు అనుకూలంగా పండించుకునే వెసులుబాటు రైతులకు లేకపోవడం, అసలు మార్కెట్‌ మొత్తం రైతుల వెన్ను విరిచి ఉత్పత్తులను దండుకునే వ్యవస్థలు, దళారుల దౌర్జన్యం, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన లేకపోవడం, ప్రభుత్వం మద్దతు ధర ఆశ చూపించి రైతులను అప్పుల్లోకి తోసేయడం, ప్రతి సంవత్సరం పెరగడమే గానీ, తరగని రైతుల ఆత్మహత్యలు.


డొల్ల రాజకీయ విధానాలు
ఇవేమీ లెక్కల్లోకి తీసుకోకుండా, బయట వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా కేవలం పుస్తక జ్ఞానంతోనే చెప్పే వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్లేషకుల ప్రకారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మీద ఈ దేశం అసలు బ్రతకలేదు.


అయ్యా! వ్యవసాయ శాస్త్రవేత్తల్లారా. మీ విజ్ఞానాన్ని కించపరచాలని నా ఉద్దేశ్యం కాదు. ఏదైనా తప్పు రాస్తే క్షమించండి. అహర్నిశలు శ్రమించి రసాయన వ్యవసాయ పద్ధతులతో రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నడుపుతున్న గొప్ప విజ్ఞానం కల వ్యక్తులు మీరు. కానీ, మీ విజ్ఞానం ఎరువులు, పురుగుమందుల కంపనీల అభివృద్ధికి, రసాయన అవశేషాలతో సారవంతమైన భూములు, బంజరు భూములుగా మారడానికి, పెట్టుబడి అప్పుల వలలో పడి రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతుంది.


మన దేశంలో చిన్న కమతాలు గల రైతులు ఎక్కువ. వారు ప్రకృతి వ్యవసాయం చేయదలిస్తే ఓ గుంపుగా ఏర్పడి వ్యవసాయం చేస్తూ సమిష్టిగా మార్కెటింగ్‌ చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


విత్తనాలు రైతులే ఉత్పత్తి చేసుకోవాలి. ఒకే పద్ధతిలో కాకుండా భూసారాన్ని పెంచే ఇతర సేంద్రియ వ్యవసాయ పద్దతుల గురించి రైతులే తెలుసుకుని స్వయంగా పరిశోధనలు చేసుకోవాలి. దేశీ వంగడాలను కాపాడుకోవాలి. ఔత్సాహిక రైతులు, శాస్త్రవేత్తలు సేంద్రియ వ్యవసాయ విధానాలతో కొత్త రకం వంగడాలను స్వయంగా ఉత్పత్తి చేయాలి. అవి రసాయన ఎరువులపై, పెస్టిసైడ్లపై ఆధారపడకుండా ప్రకృతి సిద్ధంగా పండే పంటలను చేతికందించే విత్తనాలు కావాలి.
వినియోగదారుల నుండి కూడా ప్రకృతి పట్ల అవగాహన రావాలి. ఎవరికి వారు పెరటి స్థలాల్లో, డాబాలపై, ఖాళీ స్థలాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకు తింటే వ్యవసాయ భూములపై ఈ పంటలు పండించాల్సిన భారం తగ్గుతుంది. స్వయంగా వినియోగదారులే ఆహారాన్ని సమకూర్చే అడవులును సెంటు స్థలం దొరికినా ఏర్పాటు చేసుకోవాలి.
తద్వారా మనం స్వయంగా ఉత్పత్తి చేసుకుని పండించలేని ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ప్రాంతీయంగా మాత్రమే పండే సుగంధ ద్రవ్యాలు వినియోగదారుల డిమాండ్‌ మేరకు ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లోనే రైతులు పండిస్తారు.


అప్పుడు చాలా శాతం భూమి మిగలవచ్చు. ప్రభుత్వం చర్యలు తీసుకుని మరలా అడవులుగా ఆ స్థలాలను పునరుద్ధరణ చేయవచ్చు. తద్వారా భవిష్యత్తులో అడవులను, అడవి జంతువులను కాపాడవచ్చు.

”డబ్బు సంపాదిస్తున్నాం కదా.! కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పెరటిలో, డాబాలపై మిద్దెతోటలు నిర్మించుకుని, అందమైన లాన్లను, ఫ్లోరింగ్లను, గోల్ఫ్‌ కోర్ట్‌ వంటి విలాస ఆటలను పాడు చేసుకుని పండించుకుని తినాల్సిన ఖర్మ మాకేంటి? డబ్బులు విసిరేస్తే బోలెడు పండ్లు, కూరగాయలు కొనుక్కుని తినవచ్చు.” అని మీరు అనుకోవచ్చు.
అలా అనేవారు భూగ్రహ వినాశనానికి ఫ్యాక్టరీలు, ప్లాస్టిక్‌, కాలుష్యాల కంటే తామే మొదటి కారకులమని గ్రహించాలి.

తుమ్మూరి లక్ష్మీనారాయణ, B.Sc. (Ag.)

Read More

ఏరువాక జోరువాక కావాలి

ఏరువాక… ఏరువాక….
ఏరువాక…. రైతుల తొలి పండగ.

గతంలో ఎన్నడూ లేనంతగా ఈ పండగకు ప్రాచుర్యం పెరిగింది. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ప్రధాన స్రవంతి పత్రికలు కూడా ఏరువాక పండుగ ఔన్నత్యం, ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా వార్తలు రాశాయి. ఏరువాక ఒక్క రైతుల పండుగే కాదు. అది జాతికంతా బతుకునిచ్చే పర్వదినం. సమాజాన్ని బతికించే వెలుగువాక. కష్టనష్టాలు అధిగమించి, పంటకు ప్రాణం పోసే రైతు కొత్త ఆశలకు పురుడుపోసే పబ్బం. తొలకరి చినుకుల పలకరింతతో సమాజానికి అన్నంపెట్టే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుటమే ఏరువాక. వ్యవసాయానికి సంబంధించిన పండగే ఏరువాక.


తొలకరి వస్తే రైతు పులకరిస్తాడు. ఏరువాక సాగుతాడు. మేఘాలు ఆనందంతో వర్షిస్తే, రైతు మెతుకురాగం ఎత్తుకుంటాడు. సమాజం ఆకలి తీర్చటానికి పునాది వేస్తాడు. వైశాఖం ముగిసి జ్యేష్టం ప్రారంభమయిన తరువాత వర్షాలు కురవటం మొదలవుతాయి. ఒక వారం అటు ఇటు అయినా జ్యేష్ట పౌర్ణమి నాటికి తొలకరి చినుకు పడక మానదు. దీనితో భూమి మెత్తబడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయ పనులకు ఇది శుభారంభం. ప్రారంభమైన శుభారంభం జోరందుకోవాలి. దీనికోసం ముందుగా వరుణదేవుడి కరుణ కావాలి. ఈ ఏరువాక జోరువాక కావాలంటే నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండాలి. ఇంతవరకు పలకరింపే కాని జోరందుకోలేదు. పలకరింపు కోటి ఆశలు రేకెత్తించగా వర్షాల కోసం ఎదురుచూపులతో రైతులోకంలో అప్పుడే నిరాశ మొలకలు చిగురిస్తున్నాయి. నైరుతి జోరు పెరిగితేనే పొలం పనులు ఊపందుకుంటాయి. జులై మొదటి పక్షం నైరుతిని బట్టి సాగు పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నుంచి వాతావరణం పోకడననుసరించి ఆశనిరాశల పోరాటం ప్రారంభమవుతుంది. ఇప్పటికే రైతులు కావలసిన వనరులు అన్నింటిని సమకూర్చుకొని సాగుకు సిద్ధంగా ఉన్నారు. రుతుపవనాలు జోరందుకుంటే పొలం పనులు ఊపందుకుంటాయి.


గత పంటకాలం ఉత్పత్తుల మార్కెటింగ్‌లో రైతులు సవాలక్ష ఇబ్బందులు పడ్డారు. కరోనాతో రవాణా సౌకర్యాలు లేక పండ్ల రైతులు అష్టకష్టాలు పడ్డారు. ధరలు గిట్టుబాటు కాక మిరప, శనగల నిల్వలు శీతల గిడ్డంగులలో పేరుకుపోయాయి. ఈ అననుకూలతల మధ్య రైతులు ఈ పంటకాలానికి శ్రమయాగం ప్రారంభించారు. ఇప్పటికీ కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఆ నీలినీడలు పూర్తిగా తొలగిపోలేదు. అయినా బతుకుపోరులో ఏరువాక సాగకతప్పదు.


ఇప్పుడిప్పుడే అక్కడక్కడ మెరుపులు ఉరుములతో నైరుతీ నాట్యం మొదలయిందని, సేద్యపనులు ఊపందుకున్నాయని, రైతులు జోరుగా పొలం పనులు ప్రారంభించారని తెలుస్తోంది. ఈ వర్షపు జల్లు జోరు ఊపు కొనసాగాల్సిన అవసరముంది. అక్కడక్కడ చెదురుమదురుగా ఉన్న నైరుతి వేగంగా విస్తరిస్తేనే పంటకాలానికి ప్రాణం పోస్తోంది. ఈ నైరుతీ నైరాశ్యం మిగల్చకుండా, తొలకరి పలకరింపుతో రైతులలో చిగురించిన కోటి ఆశల పలకరింపు విజయతీరాలకు చేర్చాలని ‘రైతునేస్తం’ కోరుకుంటోంది. పంటకాలం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లి, రైతుల నికరాదాయం పెరగాలి. ఏరువాక ప్రారంభ జోరు పంటకాలం కడదాకా కొనసాగాలి. కరోనా మహమ్మారితో వచ్చిన నష్టాలను ఏరువాక జోరువాకతో అధిగమించి వ్యవసాయం సజావుగా సాగాలి. ఆ దిశగా ఏరువాక సాగి రైతుల ఆశలు సఫలం కావాలి.

  • వేంకటేశ్వరరావు
    ఎడిటర్‌ – రైతునేస్తం
Read More

వేసవి లోతు దుక్కులు – బహు ప్రయోజనాలు

ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగు చేసిన దీర్ఘకాలిక కంది, ఆముదం పంటలతో పాటు, రబీ లో సాగు చేసిన పంటల కోతలు, నూర్పిడులు కూడా చాలా వరకు పూర్తయ్యాయి. పొలాలన్నీ కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. సాధారణంగా చాలా మంది రైతులు ఖరీఫ్‌, రబీ పంటల కోతల తర్వాత మళ్ళీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. ”దున్నకుండా వేస్తే కోయ్యకుండా పోతుంది” అనేది తెలుగు నానుడి. విత్తనాలు విత్తాలన్నా, నారు నాటేయాలన్నా దుక్కిని దున్ని విత్తేందుకు, నాటేందుకు అనుకూలంగా తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ సామెత తెలియచేస్తుంది. దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలేయడం వలన కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు పెరిగి భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి, భూమిని సత్తువ లేకుండా నిర్వీర్యం చేస్తాయి. దీని వలన భూసారం తగ్గి పోవటమే కాకుండా, నీరు భూమి లోపలి పొరల నుండి గ్రహించబడి ఆవిరి అయిపోతుంది. అంతే కాకుండా ముడి పోషకాల కొరత ఏర్పడి తర్వాత పంటలకు అత్యధిక మోతాదుల్లో ఎరువులు వేయవలసిన అవసరం ఏర్పడుతుంది. కావున, ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సోదరులు వేసవి లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు వేసవిలో ముఖ్యంగా మే నెలలో కురిసే వర్షాలను సద్వినియోగపరుచుకొని దాదాపు 9 అంగుళాలకు తగ్గకుండా దుక్కులు చేసుకోవడం మంచిది. వీటినే వేసవి దుక్కులు (లేదా) ఎండు దుక్కులు అంటారు. వర్షాలకు ముందు భూమిని దున్నడం వలన తొలకరి వర్షాలు పడగానే మట్టి పెళ్లలు మెత్త పడతాయి. వర్షాలు పడిన తర్వాత నీరు బాగా ఇంకటం వలన అవసరమయితే ఈ నేలను మరోసారి దున్ని వెంటనే విత్తుకోవచ్చు.
లోతు దుక్కులకు ఉపయోగించే పనిముట్లు
కొయ్య నాగలి, రెక్కల నాగలి, పెద్ద మడక, మోల్డ్‌ బోర్డ్‌ నాగలి, పల్లెపు నాగలి, 5/7- కొయ్యల బాతు కాళ్ళ నాగలి.
వేసవి లోతు దుక్కుల వలన కలిగే ప్రయోజనాలు:
వేసవి లోతు దుక్కులతో భూమిలో తేమ నిల్వ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడం
సాధారణంగా చాలా మంది రైతులు సేద్యానికి గొర్రు, గుంటక, దంతె, కల్టివేటరు లాంటి పరికరాలను పదే పదే ఉపయోగించటం వలన నేల లోపల 3-5 అంగుళాల లోతులో గట్టి పొర ఏర్పడుతుంది. అందువల్ల నేలకు నీటిని పీల్చుకొనే సామర్ద్యం తగ్గుతుంది. కాబట్టి నేలను లోతుగా దున్నటం వల్ల ఈ గట్టి పొర ఛేదించబడి నేలకు నీటిని పీల్చుకొనే శక్తీ అధికమవుతుంది. అంతే కాకుండా భూమిలోని లోతైన పొరల నుంచి నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. లోతైన వేసవి దుక్కులు (30 సెం. మీ.) వాలుకు అడ్డంగా దున్నటం వలన వర్షపు నీరు వృధా పోకుండా భూమి లోపలి పొరల్లోకి చేరుతుంది. ఒకవేళ వాలుకు అనుకూలంగా దున్నితే నేల కోతకు గురయ్యే అవకాశం ఉంది. సాళ్ళ వెంట వర్షపు నీరు పరుగెత్తి సారవంతమైన మట్టినంతా ఒరవడికి గురిచేసి భూమిని నిస్సారంగా తయారు చేస్తుంది. వాలుకు అడ్డంగా దున్నుకోవటం వలన ఈ సమస్య అధిగమించబడి, భూమి ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకొనే సామర్ద్యాన్ని పెంపొందించుకుంటుంది. లోతు దుక్కుల వలన నేలలోని నీరు ఇంకని పొరలు తొలిగిపోయి, నీరు ఇంకే గుణం పెరుగుతుంది. దీని వలన భూమిపై పడిన ప్రతి వర్షపు నీటి బిందువు అక్కడికక్కడే ఇంకి, నీరు పరిరక్షింపబడుతుంది. తద్వారా నీటిని పరిరక్షించడమే కాకుండా నేల కోతను కూడా నివారిస్తుంది. వర్షాధార పంటలు వివిధ కీలక థల్లో బెట్టకు గురైనప్పుడు (లేదా) తక్కువ వర్షపాతం నమోదు అయినప్పుడు పంట వేర్లు లోతుగా పోవడం వలన నేల లోపలి పొరల్లోని తేమను మరియు పోషకాలను గ్రహించి బెట్టను తట్టుకునే శక్తిని చేకూరుస్తుంది.
వేసవి లోతు దుక్కులతో భూసారాన్ని పెంపొందించుకోవటం
వేసవిలో లోతు దుక్కి చేసినపుడు భూమి గుళ్ల బారి, గట్టి పొరలు ఏర్పడకుండా మెత్తగా తయారవు తుంది. అంతేగాకుండా, లోతు దుక్కుల వలన ఖరీఫ్‌, రబీ పంట అవశేషాలు, కలుపు మొక్కలు, పంట మొక్కల నుండి రాలిన ఆకులు వంటి వివిధ సేంద్రీయ పదార్థాలు ఎరువుగా మారతాయి. తద్వారా నేలలో తేమ శాతం పెరగడంతో పాటు సేంద్రీయ కర్బన శాతం, పోషక పదార్థాలు పెరుగుతాయి. దీని వలన మేలు చేసే సూక్ష్మ జీవులు గణనీయంగా వృద్ధి చెందటమే కాకుండా, వానపాములు కూడా వృద్ధి చెందుతాయి. తద్వారా భూసారం వృద్ధి చెందుతుంది. వేసవిలో లోతు దుక్కులు దున్నే ముందుగా భూమిలో పశువుల ఎరువు గానీ, కంపోస్టు గానీ, చెరువు మట్టిని గానీ వెదజల్లటం వలన నేల సారవంతం అవుతుంది. ఈ వేసవి లోతు దుక్కులు దున్నే ముందు పొలంలో పశువుల మందలు గానీ, గొర్రెల మందలు గానీ వదలాలి. ఇలా చేయడం వలన అవి విసర్జించే మల మూత్రాదులు భూమిలోనికి చేరటం వలన సేంద్రీయ పదార్ధం పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది. తద్వారా, ప్రత్యేకించి పశువుల ఎరువును (లేదా) రసాయన ఎరువును కొనవలసిన ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా సేంద్రీయ ఎరువులను అందించటం ద్వారా పండించే పంటల్లో స్థూల-సూక్ష్మ పోషక పదార్థాల లోపాలను నివారించుకోవచ్చు. అంతే కాకుండా లోతు దుక్కుల వలన భూమి లోపలి పొరల్లోని మట్టి భూమి పైకి, భూమి పైమట్టి లోపలి పొరల్లోకి కలసిపోవడం ద్వారా భూసారం సమానంగా మొక్కలకు అందుతుంది.
వేసవి లోతు దుక్కులతో కలుపు నివారణ
కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు భూసారాన్ని త్వరగా గ్రహించి ప్రత్యక్షంగా నష్టం కలిగించడంతో పాటు పరోక్షంగా చీడ పీడలకు ఆశ్రయమిచ్చి పంట నష్టానికి దోహదమవుతున్నాయి. ముఖ్యంగా బహు వార్షిక మొండి జాతి కలుపు మొక్కలైన తుంగ, గరిక, దర్భ, జమ్ము లాంటి సమస్యాత్మక కలుపు మొక్కలు అన్ని రకాల భూముల్లో, వివిధ పంటల్లో పెరిగి పంట మొక్కలతో పోటీ పడి సమస్యాత్మకంగా తయారవుతున్నాయి. వీటి వేర్లు, దుంపలు, కాయలు నేల లోపలి పొరల్లోకి బాగా విస్తరించి ఉండటం వలన నివారణ కష్టమవుతుంది. బహు వార్షిక మొండి జాతి కలుపు మొక్కలను పైపైన దున్నడం వలన పూర్తిగా నివారించడం జరుగదు. కావున లోతు దుక్కులు చేసినట్లైతే, తుంగ, గరిక లాంటి మొండి జాతి కలుపు మొక్కల వేర్లు, దుంపలు భూమి పైకి వచ్చి వేసవిలో ఉండే అధిక సూర్యరశ్మికి గురై నశిస్తాయి. అంతే గాక, నేల పైకి వచ్చిన వేర్లు, దుంపలు ఏరివేయటం ద్వారా వీటిని అరికట్టవచ్చు. వీటితో పాటు ఇతర గడ్డీ జాతి మొక్కలు, ద్విదళబీజ జాతి మొక్కల విత్తనాలు కూడా బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు గురవటం ద్వారా నశిస్తాయి. తద్వారా ఆ తర్వాత పంట కాలంలో కలుపు మందులకు, ఇతర క్రిమిసంహారక మందులకు వెచ్చించాల్సిన పెట్టుబడి ఖర్చు కూడా తగ్గిపోతుంది.
వేసవి లోతు దుక్కులతో చీడ పీడల నివారణ
సాధారణంగా పంట సాగులో ఉన్నపుడు వివిధ రకాల పురుగులు, తెగుళ్ళు ఆశిస్థాయి. ఈ పురుగుల యొక్క జీవిత చక్రంలో పంటకు నష్టం కలగ చేసేవి లార్వాలు మరియు తల్లి పురుగులు మాత్రమే. అయితే, ఈ చీడపీడల లార్వాలు తల్లి పురుగులుగా మారే క్రమంలో కోశస్థ థ (ప్యూపా)కు చేరుకుంటాయి. ఈ కోశస్థ థలు పంటలకు ఎలాంటి నష్టం కలగచేయవు. సాధారణంగా పొలంలో పంట లేనప్పుడు, వేసవి కాలంలో భూమి ఖాళీగా ఉంటుంది. ఈ చీడ పీడలకు కూడా ఆహారం లభ్యం గాక, కోశస్థథల్లో కానీ, సుప్తావస్థ థల్లో గానీ ఇతర కలుపు మొక్కల మీద కానీ ఆశ్రయం పొందుతూ ఉంటాయి. వేరుశనగ, చెరకు, పండ్ల చెట్లను ఆశించే వేరు పురుగులు, అపరాలు, కంది, ప్రత్తి మొదలైన పంటలను ఆశించే పచ్చ పురుగు, లద్దెపురుగు, బొంత పురుగు, దాసరి పురుగు కోశస్థ థలు భూమి లోనే ఉంటాయి. వరిని ఆశించే కాండం తొలుచు పురుగు యొక్క కోశస్థ థలు, వరి కోసిన దుబ్బుల్లోనే ఉంటాయి. వరిని, ఇతర పంటలను ఆశించే మిడుత పురుగులు నేలలో 5 సెం. మీ. లోతులో గుడ్లు పెడతాయి. ముఖ్యంగా ఇవి పొలం గట్ల ప్రక్కన గుడ్లు పెడతాయి. తొలకరి వర్షాలకు గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకు వస్తాయి. ఇంకా ఇతర తెగుళ్లను వ్యాప్తిచేసే అనేక శిలీంధ్రాలు కూడా భూమిలో ఆశ్రయం పొందుతుంటాయి. వేసవిలో లోతు దుక్కులు చేయటం వలన భూమిలో దాగి ఉన్న చీడ పీడల కోశాలు, గుడ్లు, ఇతర శిలీంద్ర జాలాలు కూడా బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు గురవటం ద్వారా నశిస్తాయి. అంతే గాకుండా, భూమి పైన బయట పడిన ప్యుపాలను, గుడ్లను కొంగలు, కాకులు మొదలైన పకక్షులు తిని నాశనం చేస్తాయి. దుక్కి దున్నేటపుడు, మనుషులు, పశువుల త్రోక్కిసలాటలో కొన్ని పురుగులు, ప్యుపాలు చనిపోతాయి. కావున సమగ్ర సస్యరక్షణలో వేసవి లోతు దుక్కులకు మొట్టమొదటి ప్రాధాన్యమివ్వాలి. తద్వారా పురుగు, తెగుళ్ల మందు ఖర్చు కొంతవరకు తగ్గుతుంది. వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.
కావున రైతు సోదరులు వేసవిలో కురిసే తొలకరి జల్లులను ఉపయోగించుకొని భూమిని బాగా దుక్కి చేసుకోవాలి. తద్వారా భూమిలో తేమను నిల్వ చేసుకొనే శక్తీ పెరగటమే కాకుండా, భూసారం కూడా పెంపొందించుకోవచ్చు మరియు నేల కోతను నివారించు కోవచ్చు. అంతే గాకుండా మొండి జాతి కలుపు మొక్కల నివారణతో పాటు చీడపీడలను కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. కావున రైతులు ప్రతీ 2-3 సంవత్సరాలకైనా వేసవిలో లోతుదుక్కులను (20-30 సెం.మీ.) చేసుకోవటం వల్ల అనేక లాభాలు పొంది, వర్షాధార పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు.
ఎ. మల్లీశ్వర రెడ్డి, శాస్త్రవేత్త (సేద్య విభాగం); బి. సహదేవ రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త (మెట్ట వ్యవసాయం) మరియు అధిపతి వ్యవసాయ పరిశోధన స్థానం, అనంతపురము.

Read More

శుభాభినందనలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన గౌ|| జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ గారిని 16 జూన్‌, 2021న హైదరాబాద్‌లో కలిసి అభినందనలు తెలియజేస్తున్న ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ ఛైర్మన్‌
డా|| యడ్లపల్లి వేంకటేశ్వరరావు. చిత్రంలో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్‌ కూడా ఉన్నారు.

Read More

ఆ ఇల్లు… కళాత్మక పెరటి తోట

20 ఏళ్లుగా సహజ పంటలని ఆస్వాదిస్తున్న దంపతులు


పెరిగిన ఆరోగ్య స్పృహ … ఇంటిపంట ఆవశ్యకతను తెలియచేసింది. పల్లె నుంచి పట్నం వరకు అంతా.. ఇంటి పంట మాధుర్యాన్ని రుచిచూస్తున్నారు. కొద్దిపాటి ఖాళీ ప్రదేశంలోనే ఒద్దికగా రకరకాల పంటలు పండించుకుంటూ ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని సొంతం చేసుకుంటున్నారు. కొందరు విలక్షణ ప్రయోగాలు, కృషితో తమ నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం గూడవల్లికి చెందిన పొట్లూరి సాంబశివరావు, ఉమాదేవి దంపతులు. వీరికి ఇల్లే లోకం. పెరటి తోటే సర్వస్వం. గత 30 సంవత్సరాలుగా పాల వ్యాపారం చేస్తున్న సాంబశివరావుకు పెరటి తోటంటే మక్కువ ఎక్కువ. అందుకే ఇంటి ముందున్న100 గజాల స్థలంలో 20 ఏళ్లుగా ఇంటి పంటలు పండిస్తున్నారు.
పెరటి కోట
సాంబశివరావు దంపతులు తమకి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పూలను సీజన్ల ప్రకారం పెంచుతూ గృహాన్ని పచ్చని లోగిలి చేశారు. ఆకు పచ్చని కోటగా మార్చేశారు. ఏదో ఆరోగ్యం కోసం నాలుగు రకాల పంటలు పెంచుదాం అనుకోకుండా అందులో తమ ప్రతిభ, కళాత్మకతని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా సాంబశివరావు పాల విక్రయ పనులు అయిపోయాక పెరటి తోటకే సమయమంతా కేటాయిస్తూ పందిర్లు, పూలతో నగిషీలు చెక్కుతున్నారు. ఆయా పర్వదినాలలో పండగ నేపథ్యానికి తగినట్లు ఇంటిని తీర్చిదిద్దుతారు. దీపావళి, సంక్రాంతి, కొత్త సంవత్సరం వేళ ఆకట్టుకునే విధంగా ముగ్గులు, దీపాలు, మొక్కల అలంకరణలతో సంప్రదాయం ఉట్టిపడేలా అలంకరిస్తారు.
విభిన్న పందిళ్లు
అందమైన తీగకు పందిరే ఆసరా. లతలు చూడముచ్చటగా పాకేలా ఈ కళాత్మక రైతు రకరకాల పందిళ్లు వేస్తారు. తీగజాతి కూరగాయల తీగలు సులభంగా సాగేలా రకరకాల ఆకృతులలో పందిళ్లు నిర్మిస్తారు. వేసిన పందిరి మళ్లీ వేయకుండా సీజన్‌ సీజన్‌, పంట పంటకూ మార్చుతూ తన అభిరుచిని చాటుకుంటున్నారు. ఒకసారి నిలువు, మరోసారి అడ్డం ఇంకోసారి పొడవు. ఇలా చక్కని డిజైన్లతో పందిళ్లు వేసి కర్రలు ఒద్దికగా కట్టి ఇంటికి నిండుదనం తెస్తారు. ఈ అందాల పందిళ్లపై చిక్కుడు, సొర, పొట్ల వంటి కూరగాయలు హొయలుపోతూ చక్కని కాపునిస్తాయి.
ముందస్తు పంటల ప్రణాళిక
పంటల ఎంపికలో సాంబశివరావుది ప్రత్యేక శైలి. ఏసీజన్‌లో ఏ పంట పండుతుందో తదనుగుణంగా పంటలు పెడుతుంటారు. వేసవిలో ఆకుకూరలు ఉండేలా వర్షాకాలం తీగజాతి కూరగాయలైన దొండ, బీర, చిక్కుడు వంటివి సాగుచేస్తారు. పూలలో బంతి, చామంతి, కనకాంబరాలను పూయిస్తారు. కనకాంబరంలో ఎరుపు, పసుపు రకాలు ఆకట్టుకుంటాయి. చామంతుల్లో 15 రకాలు కనువిందు చేస్తాయి. ఒక్కో చామంతి మొక్కకి కనీసం 200వరకు పూలు పూసి ఇంటిని శోభాయమానంగా వెలిగిస్తాయి. ఇక ఇంటిముందు ఒకవరుసలో బొప్పాయి, మిరపను వేశారు. మిరపలో నిరంతరం కాయలు అందివచ్చేలా, ఘాటు అధికంగా ఉండే నల్ల రకం మిరపను పండిస్తున్నారు. ప్రస్తుతం వేసవి మొదలైనందున చామంతి తీసేసి ఆకుకూరలు వేసే పనిలో నిమగ్నమయ్యారు
గోమయం, గోమూత్రంతోనే పోషణ
సాంబశివరావు దంపతుల పెరటి తోటలో చీడపీడల బెడద పెద్దగా లేదు. ప్రతి పంటా నాణ్యంగా ఎదుగుతోంది. మంచి దిగుబడినిస్తోంది. పోషణ, సస్యరక్షణ కోసం కేవలం గోమూత్రం, గోమయాన్నే వాడుతున్నారు. పూల చెట్లు అధికంగా ఉన్నందువల్ల పరపరాగ సంపర్కం అధికంగా జరిగి తెగుళ్ల బాధ లేకుండా మంచి పంట వస్తోందని సాంబశివరావు గర్వంగా చెబుతారు. చిక్కుడు, దొండ తదితర పంటలు ఇబ్బడి ముబ్బడిగా వస్తుంటే చుట్టుపక్కల వారికి పంచటం కూడా వారికి పనే.
ఆనంద జీవనం
ఒక్కొక్కరూ ఒక్కో పనిలో ఆనందం వెతుక్కుంటారు. సాంబశివరావుకి పెరటితోటలో పనంటే సరదా. విసుగు, విరామంలేకుండా రోజంతా వాటి పోషణ, పందిళ్ల ఏర్పాటు, తీగలు అల్లించడంలోనే గడుపుతారు. ఆ చేసే పని కూడా నలుగురూ మెచ్చేలా ఓపికగా మడులు చేసి మొక్కలని క్రమపద్ధతిలో పెంచుతారు. ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆయుర్వేద మొక్కలకూ పెరటిలో చోటు కల్పించి తిప్పతీగ, కలబంద, సరస్వతి వంటి వాటిని పెంచి నలుగురికీ ఇస్తున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన తన మనవళ్లకి వ్యవసాయం, పంటల విలువ తెలిసేలా పాఠాలు చెబుతారు. పెరటి తోట, మిద్దె పంట నేటి అవసరం అని చెప్పే సాంబశివరావు ఆరోగ్యంకోసం ఆమాత్రం కష్టం చేయాల్సిందేనని సూచిస్తారు. 6 పదుల వయసులో తామిద్దరం ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి 20 ఏళ్ల సొంతింటి పంటే కారణమని ఆ దంపతులు ఆత్మనిబ్బరంతో వివరిస్తారు. పెరటి తోట సేద్యంతో ప్రకృతి సేవలో తరిస్తున్న ఈ దంపతులకు అభినందనలు చెబుదామా!

  • పావులూరి కిశోర్‌బాబు, ఫ్రీలాన్స్‌ వ్యవసాయ జర్నలిస్టు, 99490 94370
Read More

దూడల పెంపకంలో నిర్లక్ష్యం వద్దు

”నేటి మేలు జాతి దూడలే రేపటి మేలుజాతి పాడి పశువులు” ఇది గమనించి పాడి రైతులు దూడల పోషణ, వాటి యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాడి రైతు రోజువారీ పనుల మూలంగా దూడల పెంపకంలో వారికి తెలియకుండానే పునరుత్పత్తి పరంగా, ఆర్ధికంగా వెనకబడుతున్నాడు. దూడలను సరిగ్గా పోషించకపోవటం వల్ల ముఖ్యంగా లేగదూడలు బలహీనంగా ఉండి తక్కువ శరీర బరువును కలిగి ఉంటాయి. అందుమూలంగా అవి త్వరగా యుక్తవయస్సుకు రావు. తద్వారా ఎదకు సరైన వయస్సులో రావు. సరైన పోషణ మరియు యాజమాన్య పద్ధతులు లేని మగదూడలు యుక్తవయస్సు వచ్చాక నాణ్యమైన వీర్యాన్ని ఇవ్వవు, శరీర బరువు, సౌష్టవం కూడా సరిగ్గా ఉండక మార్కెట్‌లో మంచి ధర పలకదు. కాబట్టి రైతాంగం దూడలను పెంచటంలో మెలకువలను తెలుసుకుని ఆచరిస్తే మంచి లాభాలను చూడవచ్చు”.


పాటించవలసిన సులభమైన శాస్త్రీయమైన పద్ధతులు

  1. దూడలు పుట్టగానే ముక్కు రంధ్రాలను, నోటిని, చెవులను శుభ్రం చేయాలి. ముక్కు రంధ్రాలకు ఉన్న మ్యూకస్‌ను శుభ్రం చేసి శ్వాస సరిగ్గా తీసుకునేట్లు చూసుకోవాలి. పొడిగుడ్డతో దూడ శరీరాన్ని శుభ్రం చేసి గోనె సంచిలో పడుకోబెట్టాలి.
  2. శుభ్రం చేసిన తరువాత బొడ్డునరంను బొడ్డు కింద నుండి 2 అంగుళాలు వదిలి శుభ్రమైన తాడుతో కట్టి కత్తిరించాలి. తరువాత టింక్చర్‌ అయోడిన్‌ అద్దాలి. పై పద్ధతులను పాటించకపోవటం వల్ల బొడ్డు నుండి సూక్ష్మజీవులు దూడ శరీరంలోకి వెళ్లి బొడ్డు రోగాన్ని, (బొడ్డు ఉబ్బడం, గడ్డలు కట్టడం, హెర్నియా వంటి లక్షణాలు) కీళ్ళవాపు రోగాన్ని కూడా కలుగజేస్తాయి.
  3. దూడ పుట్టిన 30 నిమిషాలలో జున్నుపాలు త్రాగించాలి. దూడలకు వాటి శరీర బరువులో 10% చొప్పున రోజుకు 3 సార్లు త్రాగించాలి (6 గంటల వ్యవధితో). జున్ను పాలు దూడ జీర్ణాశయాన్ని, ప్రేగులను శుభ్రం చేసి మొదటి పేడను (మ్యూకేనియం) విసర్జించేలా చేస్తాయి. దాని ద్వారా జీర్ణక్రియ మెరగవుతుంది.
  4. జున్నుపాలు ఎక్కువ త్రాగిస్తే విరేచనాలు కలుగుతాయి. తక్కువ అయితే బలహీనంగా ఉంటాయి. అందువల్ల జున్ను పాలను దాని శరీర బరువులో 10% వంతు మాత్రమే త్రాగించాలి.
  5. జున్ను పాలను సరిపడా త్రాగించటం వల్ల యాంటిబాడీలు పాల ద్వారా తల్లి శరీరం నుండి దూడలు చేరి రోగనిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా కాపాడుతాయి. తద్వారా ఆరోగ్యంగా ఉండి, త్వరగా ఎదుగుతాయి.
  6. పాలు నెల రోజుల పాటు రోజుకు రెండుసార్లు ఇవ్వాలి. కొందరు రైతులు చేపుకోసం పాలు పిండేముందు, తరువాత పాలు ఇవ్వటం వల్ల ఆ పాలలో వెన్నశాతం ఎక్కువగా ఉండి అరగక, తెల్లగా పారుతుంటాయి.
  7. దూడ పూర్తి ఎదుగుదలకు పాలు మాత్రమే సరిపోవు కాబట్టి, పాలతో పాటు ఘన ఆహారం దాణా, గడ్డి రూపంలో ఇవ్వాలి.
  8. దూడలు ఎండు గడ్డిలో ఉండే, సెల్యులోస్‌ను సమర్ధవంతంగా జీర్ణించుకోలేవు. కావున వాటికి పప్పుజాతి లేత ఆకులు (అలసంద, లూసర్న్‌, పిల్లిపెసర) మేతగా 6 లేదా 7వ రోజు నుండి దూడలకు అందించాలి.
  9. దానితో పాటు 2వ వారం నుండి సమీకృత దాణా అందించాలి. దాని వల్ల దూడలు త్రాగే పాల శాతం తగ్గి దాణాతో ఎదుగుతాయి. దాణాను నెల వయస్సు వరకు 300 గ్రా, 2వ నెలకల్లా 1 కిలో/రోజుకు అలా 3 నుండి 6 నెలల వయస్సు వచ్చే వరకు ఇవ్వాలి. దాణాలో ఉన్న లవణాలు ‘రూమెన్‌’ ఎదుగుదలకు దోహదపడతాయి.
  10. 3వ నెల నుండి పప్పుజాతి, ఎండుగడ్డి, పచ్చిమేత ఇచ్చే మోతాదు పెంచటం వల్ల దాణా మోతాదు తగ్గుతుంది.
  11. 3వ నెల తరువాత ‘రూమెన్‌’ కాస్త అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎండుగడ్డి, పచ్చిగడ్డి 5:2 నిష్పత్తిలో ఇవ్వాలి.
  12. మేతతోపాటు పరిశుభ్రమైన నీటిని అందివ్వాలి (2వ వారం నుండి శరీర బరువులో 10% నీటిని ప్రతిరోజు అందివ్వాలి).
  13. దూడల ఎదుగుదలకు ఆటంకం కలగకుండా ఉండాలి అంటే సరైన సమయంలో నట్టల మందు త్రాగించాలి. పుట్టిన వారం నుండి 10 రోజుల వయస్సులో పైమాజిన్‌ అనే నట్టల మందును 200 మి.గ్రా./కిలో శరీర బరువు చొప్పున త్రాగించాలి. తరువాత ప్రతీ నెల 3 నెలల వయస్సు వచ్చే వరకు ఏదైనా నట్టల మందును వాడాలి (ఉదా|| ఆల్‌బెండజోల్‌ 5-10 మి.గ్రా/కిలో, ఫెన్‌బెండజోల్‌ 5-7 మి.గ్రా./కిలో). తరువాత ప్రతీ 2 నెలలకు ఒకసారి అలా 1 సంవత్సరం పాటు ఇవ్వాలి. తరువాత ప్రతీ 6 నెలలకు ఒకసారి 2-3 సం|| వయస్సు వరకు వాడాలి.
  14. నట్టల నివారణ చర్యలు పాటించకపోవటం వల్ల ఏలికపాములు, బద్దె పురుగులు, జలగలు వంటి అంతర పరాన్నజీవులు జీర్ణాశయంలో, పేగులలో ఉండి పోషక పదార్థాలు దూడకు అందనివ్వకుండా చేసి, రక్తాన్ని పీల్చి బలహీనం చేస్తాయి. కొన్నిసార్లు పేగులో అడ్డంపడి పొట్టలు ఉబ్బి, గుండ్రంగా మారే అవకాశం ఉంటుంది. నట్టల వలన దూడలు సన్నగా బలహీనంగా ఉండి త్వరగా ఎదగవు. (శరీర బరువు సరిగ్గా రావు). ఎదకు సరైన సమయంలో రావు. కావున నట్టల మందు వాడాలి.
  15. బాహ్యపరాన్న జీవుల వల్ల బాక్టీరియల్‌, వైరల్‌, ప్రోటోజోవన్‌ రోగాలు సంక్రమించే ప్రమాదం ఉంది కావున బాహ్య పరాన్నజీవుల నివారణకు బ్యుటాక్స్‌/ఎక్టోమిన్‌ వంటి మందులను 1 మి.లీ. /2 లీ. నీటిలో కలిపి శరీరంపై పిచికారీ చేయాలి. పిచికారీ చేసేటప్పుడు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు రంధ్రాలలో పడకుండా చూసుకోవాలి.
  16. ప్రతీ 6 నెలలకు ఒకసారి వెంట్రుకలను కత్తిరించటం వల్ల కూడా బాహ్యపరాన్న జీవులను నిర్మూలించవచ్చు.
  17. బాహ్య మరియు అంతర పరాన్న జీవుల నిర్మూలనకు ఐవర్‌మెక్టిన్‌ 1 మి.లీ. /50 కిలోలు శరీర బరువు చొప్పున చర్మం కింద ఇంజక్షన్‌ను ఇవ్వాలి.
  18. పాకలను ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. గాలి, వెలుతురు ధారాళంగా వీచేలా నిర్మించాలి. పాకల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. పకల చుట్టూ నీడనిచ్చే చెట్లను పెంచాలి.
  19. తక్కువ స్థలంలో ఎక్కువ దూడలను ఉంచరాదు, 3 నెలల వయస్సు వరకు ఒక దూడకు 1 చ.మీ. పాకలో, 2 చ.మీ. స్థలం పాక బయట తిరగడానికి అవసరమవుతుంది. 3 నెలల తరువాత ఒక దూడకు 2 చ.మీ. స్థలం పాకలో, 4 చ.మీ. స్థలం పాక బయట ఉండేలా చూడాలి.
  20. గాలికుంటు, గొంతువాపు, బ్రుసెల్లోసిస్‌, దొమ్మరోగం వంటి అంటువ్యాధులు సోకకుండా సరైన సమయాల్లో టీకాను వేయించాలి.
    గమనిక : పై విధంగా సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే సంకరజాతి పెయ్యలు 11/2-2 సం||ల వయస్సులో, మేలుజాతి గేదెదూడలు (పడ్డకు) 21/2-3 సం||లో చూలికట్టుటకు అనువైన శరీర బరువుకు వస్తాయి. తద్వారా మన ఇంట్లోనే మేలుజాతి పాడి పశువులను, నాణ్యమైన ఆంబోతులను, దున్నలను తయారు చేసుకుని రైతులు లాభాలను పొంది ఆర్థికంగా బలపడతారు.

  1. డా. ఎన్‌. వేణుమాధవ్‌ (7989846261), టీచింగ్‌ ఫ్యాకల్టీ, పశువైద్య కళాశాల, కోరుట్ల; డా. ఎన్‌. రమ్య (9121213070), పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు, ప్రాథమిక పశువైద్యశాల, తుంగూర్‌, జగిత్యాల జిల్లా.
Read More