”నేటి మేలు జాతి దూడలే రేపటి మేలుజాతి పాడి పశువులు” ఇది గమనించి పాడి రైతులు దూడల పోషణ, వాటి యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాడి రైతు రోజువారీ పనుల మూలంగా దూడల పెంపకంలో వారికి తెలియకుండానే పునరుత్పత్తి పరంగా, ఆర్ధికంగా వెనకబడుతున్నాడు. దూడలను సరిగ్గా పోషించకపోవటం వల్ల ముఖ్యంగా లేగదూడలు బలహీనంగా ఉండి తక్కువ శరీర బరువును కలిగి ఉంటాయి. అందుమూలంగా అవి త్వరగా యుక్తవయస్సుకు రావు. తద్వారా ఎదకు సరైన వయస్సులో రావు. సరైన పోషణ మరియు యాజమాన్య పద్ధతులు లేని మగదూడలు యుక్తవయస్సు వచ్చాక నాణ్యమైన వీర్యాన్ని ఇవ్వవు, శరీర బరువు, సౌష్టవం కూడా సరిగ్గా ఉండక మార్కెట్‌లో మంచి ధర పలకదు. కాబట్టి రైతాంగం దూడలను పెంచటంలో మెలకువలను తెలుసుకుని ఆచరిస్తే మంచి లాభాలను చూడవచ్చు”.


పాటించవలసిన సులభమైన శాస్త్రీయమైన పద్ధతులు

  1. దూడలు పుట్టగానే ముక్కు రంధ్రాలను, నోటిని, చెవులను శుభ్రం చేయాలి. ముక్కు రంధ్రాలకు ఉన్న మ్యూకస్‌ను శుభ్రం చేసి శ్వాస సరిగ్గా తీసుకునేట్లు చూసుకోవాలి. పొడిగుడ్డతో దూడ శరీరాన్ని శుభ్రం చేసి గోనె సంచిలో పడుకోబెట్టాలి.
  2. శుభ్రం చేసిన తరువాత బొడ్డునరంను బొడ్డు కింద నుండి 2 అంగుళాలు వదిలి శుభ్రమైన తాడుతో కట్టి కత్తిరించాలి. తరువాత టింక్చర్‌ అయోడిన్‌ అద్దాలి. పై పద్ధతులను పాటించకపోవటం వల్ల బొడ్డు నుండి సూక్ష్మజీవులు దూడ శరీరంలోకి వెళ్లి బొడ్డు రోగాన్ని, (బొడ్డు ఉబ్బడం, గడ్డలు కట్టడం, హెర్నియా వంటి లక్షణాలు) కీళ్ళవాపు రోగాన్ని కూడా కలుగజేస్తాయి.
  3. దూడ పుట్టిన 30 నిమిషాలలో జున్నుపాలు త్రాగించాలి. దూడలకు వాటి శరీర బరువులో 10% చొప్పున రోజుకు 3 సార్లు త్రాగించాలి (6 గంటల వ్యవధితో). జున్ను పాలు దూడ జీర్ణాశయాన్ని, ప్రేగులను శుభ్రం చేసి మొదటి పేడను (మ్యూకేనియం) విసర్జించేలా చేస్తాయి. దాని ద్వారా జీర్ణక్రియ మెరగవుతుంది.
  4. జున్నుపాలు ఎక్కువ త్రాగిస్తే విరేచనాలు కలుగుతాయి. తక్కువ అయితే బలహీనంగా ఉంటాయి. అందువల్ల జున్ను పాలను దాని శరీర బరువులో 10% వంతు మాత్రమే త్రాగించాలి.
  5. జున్ను పాలను సరిపడా త్రాగించటం వల్ల యాంటిబాడీలు పాల ద్వారా తల్లి శరీరం నుండి దూడలు చేరి రోగనిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా కాపాడుతాయి. తద్వారా ఆరోగ్యంగా ఉండి, త్వరగా ఎదుగుతాయి.
  6. పాలు నెల రోజుల పాటు రోజుకు రెండుసార్లు ఇవ్వాలి. కొందరు రైతులు చేపుకోసం పాలు పిండేముందు, తరువాత పాలు ఇవ్వటం వల్ల ఆ పాలలో వెన్నశాతం ఎక్కువగా ఉండి అరగక, తెల్లగా పారుతుంటాయి.
  7. దూడ పూర్తి ఎదుగుదలకు పాలు మాత్రమే సరిపోవు కాబట్టి, పాలతో పాటు ఘన ఆహారం దాణా, గడ్డి రూపంలో ఇవ్వాలి.
  8. దూడలు ఎండు గడ్డిలో ఉండే, సెల్యులోస్‌ను సమర్ధవంతంగా జీర్ణించుకోలేవు. కావున వాటికి పప్పుజాతి లేత ఆకులు (అలసంద, లూసర్న్‌, పిల్లిపెసర) మేతగా 6 లేదా 7వ రోజు నుండి దూడలకు అందించాలి.
  9. దానితో పాటు 2వ వారం నుండి సమీకృత దాణా అందించాలి. దాని వల్ల దూడలు త్రాగే పాల శాతం తగ్గి దాణాతో ఎదుగుతాయి. దాణాను నెల వయస్సు వరకు 300 గ్రా, 2వ నెలకల్లా 1 కిలో/రోజుకు అలా 3 నుండి 6 నెలల వయస్సు వచ్చే వరకు ఇవ్వాలి. దాణాలో ఉన్న లవణాలు ‘రూమెన్‌’ ఎదుగుదలకు దోహదపడతాయి.
  10. 3వ నెల నుండి పప్పుజాతి, ఎండుగడ్డి, పచ్చిమేత ఇచ్చే మోతాదు పెంచటం వల్ల దాణా మోతాదు తగ్గుతుంది.
  11. 3వ నెల తరువాత ‘రూమెన్‌’ కాస్త అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎండుగడ్డి, పచ్చిగడ్డి 5:2 నిష్పత్తిలో ఇవ్వాలి.
  12. మేతతోపాటు పరిశుభ్రమైన నీటిని అందివ్వాలి (2వ వారం నుండి శరీర బరువులో 10% నీటిని ప్రతిరోజు అందివ్వాలి).
  13. దూడల ఎదుగుదలకు ఆటంకం కలగకుండా ఉండాలి అంటే సరైన సమయంలో నట్టల మందు త్రాగించాలి. పుట్టిన వారం నుండి 10 రోజుల వయస్సులో పైమాజిన్‌ అనే నట్టల మందును 200 మి.గ్రా./కిలో శరీర బరువు చొప్పున త్రాగించాలి. తరువాత ప్రతీ నెల 3 నెలల వయస్సు వచ్చే వరకు ఏదైనా నట్టల మందును వాడాలి (ఉదా|| ఆల్‌బెండజోల్‌ 5-10 మి.గ్రా/కిలో, ఫెన్‌బెండజోల్‌ 5-7 మి.గ్రా./కిలో). తరువాత ప్రతీ 2 నెలలకు ఒకసారి అలా 1 సంవత్సరం పాటు ఇవ్వాలి. తరువాత ప్రతీ 6 నెలలకు ఒకసారి 2-3 సం|| వయస్సు వరకు వాడాలి.
  14. నట్టల నివారణ చర్యలు పాటించకపోవటం వల్ల ఏలికపాములు, బద్దె పురుగులు, జలగలు వంటి అంతర పరాన్నజీవులు జీర్ణాశయంలో, పేగులలో ఉండి పోషక పదార్థాలు దూడకు అందనివ్వకుండా చేసి, రక్తాన్ని పీల్చి బలహీనం చేస్తాయి. కొన్నిసార్లు పేగులో అడ్డంపడి పొట్టలు ఉబ్బి, గుండ్రంగా మారే అవకాశం ఉంటుంది. నట్టల వలన దూడలు సన్నగా బలహీనంగా ఉండి త్వరగా ఎదగవు. (శరీర బరువు సరిగ్గా రావు). ఎదకు సరైన సమయంలో రావు. కావున నట్టల మందు వాడాలి.
  15. బాహ్యపరాన్న జీవుల వల్ల బాక్టీరియల్‌, వైరల్‌, ప్రోటోజోవన్‌ రోగాలు సంక్రమించే ప్రమాదం ఉంది కావున బాహ్య పరాన్నజీవుల నివారణకు బ్యుటాక్స్‌/ఎక్టోమిన్‌ వంటి మందులను 1 మి.లీ. /2 లీ. నీటిలో కలిపి శరీరంపై పిచికారీ చేయాలి. పిచికారీ చేసేటప్పుడు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు రంధ్రాలలో పడకుండా చూసుకోవాలి.
  16. ప్రతీ 6 నెలలకు ఒకసారి వెంట్రుకలను కత్తిరించటం వల్ల కూడా బాహ్యపరాన్న జీవులను నిర్మూలించవచ్చు.
  17. బాహ్య మరియు అంతర పరాన్న జీవుల నిర్మూలనకు ఐవర్‌మెక్టిన్‌ 1 మి.లీ. /50 కిలోలు శరీర బరువు చొప్పున చర్మం కింద ఇంజక్షన్‌ను ఇవ్వాలి.
  18. పాకలను ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. గాలి, వెలుతురు ధారాళంగా వీచేలా నిర్మించాలి. పాకల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. పకల చుట్టూ నీడనిచ్చే చెట్లను పెంచాలి.
  19. తక్కువ స్థలంలో ఎక్కువ దూడలను ఉంచరాదు, 3 నెలల వయస్సు వరకు ఒక దూడకు 1 చ.మీ. పాకలో, 2 చ.మీ. స్థలం పాక బయట తిరగడానికి అవసరమవుతుంది. 3 నెలల తరువాత ఒక దూడకు 2 చ.మీ. స్థలం పాకలో, 4 చ.మీ. స్థలం పాక బయట ఉండేలా చూడాలి.
  20. గాలికుంటు, గొంతువాపు, బ్రుసెల్లోసిస్‌, దొమ్మరోగం వంటి అంటువ్యాధులు సోకకుండా సరైన సమయాల్లో టీకాను వేయించాలి.
    గమనిక : పై విధంగా సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే సంకరజాతి పెయ్యలు 11/2-2 సం||ల వయస్సులో, మేలుజాతి గేదెదూడలు (పడ్డకు) 21/2-3 సం||లో చూలికట్టుటకు అనువైన శరీర బరువుకు వస్తాయి. తద్వారా మన ఇంట్లోనే మేలుజాతి పాడి పశువులను, నాణ్యమైన ఆంబోతులను, దున్నలను తయారు చేసుకుని రైతులు లాభాలను పొంది ఆర్థికంగా బలపడతారు.

  1. డా. ఎన్‌. వేణుమాధవ్‌ (7989846261), టీచింగ్‌ ఫ్యాకల్టీ, పశువైద్య కళాశాల, కోరుట్ల; డా. ఎన్‌. రమ్య (9121213070), పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు, ప్రాథమిక పశువైద్యశాల, తుంగూర్‌, జగిత్యాల జిల్లా.