20 ఏళ్లుగా సహజ పంటలని ఆస్వాదిస్తున్న దంపతులు


పెరిగిన ఆరోగ్య స్పృహ … ఇంటిపంట ఆవశ్యకతను తెలియచేసింది. పల్లె నుంచి పట్నం వరకు అంతా.. ఇంటి పంట మాధుర్యాన్ని రుచిచూస్తున్నారు. కొద్దిపాటి ఖాళీ ప్రదేశంలోనే ఒద్దికగా రకరకాల పంటలు పండించుకుంటూ ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని సొంతం చేసుకుంటున్నారు. కొందరు విలక్షణ ప్రయోగాలు, కృషితో తమ నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం గూడవల్లికి చెందిన పొట్లూరి సాంబశివరావు, ఉమాదేవి దంపతులు. వీరికి ఇల్లే లోకం. పెరటి తోటే సర్వస్వం. గత 30 సంవత్సరాలుగా పాల వ్యాపారం చేస్తున్న సాంబశివరావుకు పెరటి తోటంటే మక్కువ ఎక్కువ. అందుకే ఇంటి ముందున్న100 గజాల స్థలంలో 20 ఏళ్లుగా ఇంటి పంటలు పండిస్తున్నారు.
పెరటి కోట
సాంబశివరావు దంపతులు తమకి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పూలను సీజన్ల ప్రకారం పెంచుతూ గృహాన్ని పచ్చని లోగిలి చేశారు. ఆకు పచ్చని కోటగా మార్చేశారు. ఏదో ఆరోగ్యం కోసం నాలుగు రకాల పంటలు పెంచుదాం అనుకోకుండా అందులో తమ ప్రతిభ, కళాత్మకతని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా సాంబశివరావు పాల విక్రయ పనులు అయిపోయాక పెరటి తోటకే సమయమంతా కేటాయిస్తూ పందిర్లు, పూలతో నగిషీలు చెక్కుతున్నారు. ఆయా పర్వదినాలలో పండగ నేపథ్యానికి తగినట్లు ఇంటిని తీర్చిదిద్దుతారు. దీపావళి, సంక్రాంతి, కొత్త సంవత్సరం వేళ ఆకట్టుకునే విధంగా ముగ్గులు, దీపాలు, మొక్కల అలంకరణలతో సంప్రదాయం ఉట్టిపడేలా అలంకరిస్తారు.
విభిన్న పందిళ్లు
అందమైన తీగకు పందిరే ఆసరా. లతలు చూడముచ్చటగా పాకేలా ఈ కళాత్మక రైతు రకరకాల పందిళ్లు వేస్తారు. తీగజాతి కూరగాయల తీగలు సులభంగా సాగేలా రకరకాల ఆకృతులలో పందిళ్లు నిర్మిస్తారు. వేసిన పందిరి మళ్లీ వేయకుండా సీజన్‌ సీజన్‌, పంట పంటకూ మార్చుతూ తన అభిరుచిని చాటుకుంటున్నారు. ఒకసారి నిలువు, మరోసారి అడ్డం ఇంకోసారి పొడవు. ఇలా చక్కని డిజైన్లతో పందిళ్లు వేసి కర్రలు ఒద్దికగా కట్టి ఇంటికి నిండుదనం తెస్తారు. ఈ అందాల పందిళ్లపై చిక్కుడు, సొర, పొట్ల వంటి కూరగాయలు హొయలుపోతూ చక్కని కాపునిస్తాయి.
ముందస్తు పంటల ప్రణాళిక
పంటల ఎంపికలో సాంబశివరావుది ప్రత్యేక శైలి. ఏసీజన్‌లో ఏ పంట పండుతుందో తదనుగుణంగా పంటలు పెడుతుంటారు. వేసవిలో ఆకుకూరలు ఉండేలా వర్షాకాలం తీగజాతి కూరగాయలైన దొండ, బీర, చిక్కుడు వంటివి సాగుచేస్తారు. పూలలో బంతి, చామంతి, కనకాంబరాలను పూయిస్తారు. కనకాంబరంలో ఎరుపు, పసుపు రకాలు ఆకట్టుకుంటాయి. చామంతుల్లో 15 రకాలు కనువిందు చేస్తాయి. ఒక్కో చామంతి మొక్కకి కనీసం 200వరకు పూలు పూసి ఇంటిని శోభాయమానంగా వెలిగిస్తాయి. ఇక ఇంటిముందు ఒకవరుసలో బొప్పాయి, మిరపను వేశారు. మిరపలో నిరంతరం కాయలు అందివచ్చేలా, ఘాటు అధికంగా ఉండే నల్ల రకం మిరపను పండిస్తున్నారు. ప్రస్తుతం వేసవి మొదలైనందున చామంతి తీసేసి ఆకుకూరలు వేసే పనిలో నిమగ్నమయ్యారు
గోమయం, గోమూత్రంతోనే పోషణ
సాంబశివరావు దంపతుల పెరటి తోటలో చీడపీడల బెడద పెద్దగా లేదు. ప్రతి పంటా నాణ్యంగా ఎదుగుతోంది. మంచి దిగుబడినిస్తోంది. పోషణ, సస్యరక్షణ కోసం కేవలం గోమూత్రం, గోమయాన్నే వాడుతున్నారు. పూల చెట్లు అధికంగా ఉన్నందువల్ల పరపరాగ సంపర్కం అధికంగా జరిగి తెగుళ్ల బాధ లేకుండా మంచి పంట వస్తోందని సాంబశివరావు గర్వంగా చెబుతారు. చిక్కుడు, దొండ తదితర పంటలు ఇబ్బడి ముబ్బడిగా వస్తుంటే చుట్టుపక్కల వారికి పంచటం కూడా వారికి పనే.
ఆనంద జీవనం
ఒక్కొక్కరూ ఒక్కో పనిలో ఆనందం వెతుక్కుంటారు. సాంబశివరావుకి పెరటితోటలో పనంటే సరదా. విసుగు, విరామంలేకుండా రోజంతా వాటి పోషణ, పందిళ్ల ఏర్పాటు, తీగలు అల్లించడంలోనే గడుపుతారు. ఆ చేసే పని కూడా నలుగురూ మెచ్చేలా ఓపికగా మడులు చేసి మొక్కలని క్రమపద్ధతిలో పెంచుతారు. ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆయుర్వేద మొక్కలకూ పెరటిలో చోటు కల్పించి తిప్పతీగ, కలబంద, సరస్వతి వంటి వాటిని పెంచి నలుగురికీ ఇస్తున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన తన మనవళ్లకి వ్యవసాయం, పంటల విలువ తెలిసేలా పాఠాలు చెబుతారు. పెరటి తోట, మిద్దె పంట నేటి అవసరం అని చెప్పే సాంబశివరావు ఆరోగ్యంకోసం ఆమాత్రం కష్టం చేయాల్సిందేనని సూచిస్తారు. 6 పదుల వయసులో తామిద్దరం ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి 20 ఏళ్ల సొంతింటి పంటే కారణమని ఆ దంపతులు ఆత్మనిబ్బరంతో వివరిస్తారు. పెరటి తోట సేద్యంతో ప్రకృతి సేవలో తరిస్తున్న ఈ దంపతులకు అభినందనలు చెబుదామా!

  • పావులూరి కిశోర్‌బాబు, ఫ్రీలాన్స్‌ వ్యవసాయ జర్నలిస్టు, 99490 94370