ప్రకృతి ఒడిలో జీవించే అనేక జీవరాశుల్లో మనిషి ఒకడు. మానవుడికి ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకోవటం తెలిసేకొద్దీ మనుషుల జనాభా వేగంగా పెరిగింది. తన సౌకర్యాల కోసం అడవుల్ని నరికి, పరిశ్రమల్ని నెలకొలిపి, గనుల్ని తవ్వి, రవాణా సాధనాలను పెంచుకొని, అనేక విధాలుగా ప్రకృతి రూపాన్ని మార్చేశాడు. ప్రకృతిని ఆవరించి ఉన్న పర్యావరణాన్ని సైతం కలుషితం చేశాడు. ఒక రక్షా కవచంలా ఉన్న ‘ఓజోన్‌’ పొరలో రంధ్రం ఏర్పడి, అతి నీల లోహిత కిరణాలు భూమిపై దాడిచేస్తున్నాయి. మంచు పర్వతాలు కరిగి, సముద్ర నీటిమట్టం పెరిగి, ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిని చేరుకుంటున్నాయి. వాతావరణ మార్పులు మానవుల సుస్థిర జీవనాన్ని అభివృద్ధినీ సవాలు చేసే స్థితికి చేరుకున్నాయి. ఒకవైపు ప్రకృతి, వాతావరణ కాలుష్యపు ధాటికి అల్లల్లాడుతుంటే, మరోవైపు మానవుల జీవన ప్రమాణాల్లో ఉన్న అసమానతలు తీవ్రమౌతున్నాయి.

ప్రపంచ దేశాల ఐక్య కార్యాచరణ:
21వ శతాబ్దపు ప్రారంభంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల’ను రూపొందించింది. ఎనిమిది లక్ష్యాల ఈ ప్రణాళికను 191 దేశాలతోపాటు 22 అంతర్జాతీయ సంస్థలు సమర్థించి, 2015లోగా వాటిని సాధించాలని తీర్మానించాయి. 2015లో జరిగిన సమీక్షలో కొన్ని లక్ష్యాలు చాలావరకు నెరవేరాయని అంచనా వేసింది. రోజుకి 1.25 డాలర్ల కన్నా తక్కువ ఆదాయం కలవాళ్ళు 1990లో 190 కోట్ల మంది ఉండగా, వారి సంఖ్య 2015 కల్లా సగానికి తగ్గిందని సంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ వాతావరణ భద్రత విషయంలో లక్ష్యాలు నెరవేరలేదనే అవగాహనకు ఆ సమావేశం వచ్చింది. ఓజోన్‌ పొరకు హాని కలిగించే కర్బన ఉద్గారాలు కొంత తగ్గినా ఓజోన్‌ పొరను పూర్వ స్థాయికి చేర్చడానికి 2050 వరకు పడుతుందని ఆ సమావేశం భావించింది. కాని అడవుల్ని నరకటం ఆగలేదనీ, కార్బన్‌డైఆక్సైడ్‌ సాంద్రత 1990తో పోలిస్తే 50 శాతం పెరిగిందనీ ఆందోళనను వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి తాజాగా 17 లక్ష్యాలతో ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల’ను ప్రకటించింది. గత ధోరణులు కొనసాగితే 2030కల్లా ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడు పెరుగుతాయనీ, కాని దేశాల ఐక్యకార్యాచరణతో ఆ పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడుకి పరిమితం చేయాలని తీర్మానించాయి. 2015 డిసెంబరులో పారిస్‌ నగరంలో జరిగిన ఈ సమావేశం 2030కల్లా కార్బన్‌ డైఆక్స్‌డ్‌ స్థాయిని 2010తో పోలిస్తే 45 శాతం తగ్గించాలని నిర్ణయించాయి. అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, కువైట్‌ వంటి కొన్ని దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేయకున్నా 193 దేశాలు అందులో భాగమయ్యాయి. తాజాగా అమెరికా పారిస్‌ ఒప్పందంలో చేరడానికి నిర్ణయించడంతో వాతావరణ లక్ష్యాల సాధనపై ఆశలు పెరిగాయి. ప్రపంచ దేశాలు ఆమోదించిన ‘వాతావరణ అనుకూల వ్యవసాయం’ అనే వ్యూహంలో మూడు అంశాలున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి, ఆదాయం దీర్ఘకాలంలో సుస్థిరంగా పెరగటం మొదటి అంశం. వాతావరణ మార్పుల్ని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవటం రెండవది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ‘గ్రీన్‌ హౌస్‌ వాయువు’లను సక్రమంగా తగ్గిస్తూ వాటిని పూర్తిగా నివారించటం మూడవ అంశం. ఆహార భద్రతకు హానికలగకుండా వాతావరణ మార్పుల్ని నిరోధించగలిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించి, అమలు చేయటం అన్ని దేశాల కర్తవ్యం. ఈ సంవత్సరం జూన్‌ 5వ తేదీన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా ‘ప్రకృతి పునరుజ్జీవం’ అనే నినాదంతో జరుగుతున్న సమావేశానికి పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇస్తున్నది.
పారిస్‌ ఒప్పంద లక్ష్యాలు:
ప్రపంచంలో పారిశ్రామికీకరణ 1700-1750 సంవత్సరాల మధ్య ప్రారంభమైంది. అప్పటి ఉష్ణోగ్రతల్ని సహజంగా మార్పు చెందిన వాటిగా పరిగణించి, ఆ తర్వాత వచ్చిన ఉష్ణోగ్రతల మార్పుని మానవుల పెరిగిన కార్యక్రమాల వల్ల వచ్చినట్లుగానూ పరిగణిస్తున్నారు. కాని ఆ కాలంలో నమ్మదగిన ఉష్ణోగ్రతల రికార్డులు లేవు. అందుకే 1850-1900 మధ్య సగటు ఉష్ణోగ్రతను పారిశ్రామికీకరణకు ముందు ఉష్ణోగ్రతగా ప్రామాణికంగా తీసుకున్నారు. దానితో పోలిస్తే 2100 సంవత్సరంలో సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీలకన్నా ఎక్కువ పెరగవచ్చని అంచనా వేశారు. ఆ పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడుకి పరిమితం చేయాలంటే ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించటానికి ప్రయత్నించాలని పారిస్‌ ఒప్పందం పేర్కొన్నది. గాలిలో 78.07 శాతం నత్రజని, 20.95 శాతం ఆక్సిజన్‌ ఉంటుంది. ఇవి కాక 0.9 శాతం ఆర్గాన్‌, 0.04 శాతం కార్బన్‌ డైఆక్సైడ్‌, నీటి ఆవిరి వగైరా ఉంటాయి. కార్బన్‌ డైఆక్సైడ్‌ సాంద్రత పెరిగేకొద్దీ, ఉష్ణోగ్రత పెరుగుతుంది. 1850-1900 మధ్యకాలంతో పోలిస్తే ఇప్పటికే ఉష్ణోగ్రత 1.2 డిగ్రీల సెంటీగ్రేడు పెరిగింది. అంటే వచ్చే 79 సంవత్సరాల్లో ఉష్ణోగ్రత మరో 0.3 డిగ్రీల సెంటీగ్రేడు కన్నా ఎక్కువ పెరగకూడదని పారిస్‌ ఒప్పంద లక్ష్యం. పారిస్‌ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, ప్రస్తుత విధానాలను కొనసాగిస్తే ఈ శతాబ్దాంతానికి ఉష్ణోగ్రత 0.8 డిగ్రీలుగానీ, అంతకన్నా ఎక్కువగానీ పెరగవచ్చు. ప్రపంచ దేశాలన్నిటిలోనూ కలిపి వెలువడుతున్న కర్బన ఉద్గారాల్లో భారత్‌ వాటా 6.5 శాతమని 2014లో అంచనా వేశారు. అత్యధికంగా చైనాలో, ఆ తర్వాత అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ల తర్వాత భారత్‌ నాల్గవ స్థానంలో ఉంది. తలసరి కర్బన ఉద్గారాలను పరిగణనలోకి తీసుకుంటే అత్యధికంగా అమెరికాలో 15.74 మెట్రిక్‌ టన్నులు, చైనాలో 7.72 మెట్రిక్‌ టన్నులు, యూరోపియన్‌ యూనియన్‌లో 6.97 మెట్రిక్‌ టన్నులతో పోలిస్తే భారత్‌లో 1.83 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌తో సమానమైన ఉద్గారాలు వెలువడుతున్నాయి.
భారత్‌ ప్రకటించిన మూడు చర్యలు
భారతదేశం స్వచ్ఛందంగా మూడు కార్యక్రమాల ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని ప్రకటించింది. ఆర్థికాభివృద్ధి వేగానికీ, కర్బన ఉద్గారాల విడుదలకు సంబంధం ఉన్నది. 2005లో ఉదాహరణకు ఆర్థికాభివృద్ధి 6 శాతం ఉన్నదనుకోండి. అప్పుడు విడుదల చేసిన కర్బన ఉద్గారాలతో పోలిస్తే, 2030లో అదే ఆరు శాతం ఆర్థికాభివృద్ధి ఉన్నా విడుదలయ్యే కర్బన ఉద్గారాలను 33 నుండి 35 శాతం తగ్గేలా కార్యాచరణ ఉంటుందని ప్రకటించింది. 2015కి ముందు దేశంలో కర్బన ఉద్గారాల విడుదలలో వృద్ధి సాలీనా 4.8 శాతంగా ఉండేది. ఉద్గారాల విడుదల వృద్ధి రేటు 2015లో 2.5 శాతానికీ, 2016, 2017 సంవత్సరాల్లో 2.9 శాతానికి తగ్గిందని భారత్‌ ప్రకటించింది. 2005తో పోలిస్తే 2014 కల్లా కర్బన ఉద్గారాల రేటు 21 శాతం తగ్గిందని నీతి ఆయోగ్‌ ప్రకటించింది. తాజాగా ప్రధానమంత్రి ప్రకటనలో ఉద్గారాలు 24 శాతం తగ్గినట్లు చెప్పారు. 2030 నాటికి 33 నుండి 35 శాతం తగ్గుదలను సాధించటం సాధ్యమౌతుందని భావించవచ్చు. ప్రపంచంలోని చాలా దేశాలు 1990 తర్వాత కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించగలుగుతున్నామని చెబుతున్నాయి. జాతీయాదాయంలో పారిశ్రామిక రంగం వాటా తగ్గి, సేవా రంగ వాటా పెరగటమే ఇందుకు కారణం కావచ్చు.
మన దేశం చేపట్టిన రెండవ కార్యక్రమం విద్యుతుత్పాదనలో పునరుత్పాదక రంగం వాటాలను 2030 కల్లా 40 శాతానికి పెంచటం. బొగ్గు ఆధారిత ధర్మల్‌ విద్యుత్‌ వాటాను తగ్గించి, మైక్రో ఎలక్ట్రిక్‌, న్యూక్లియర్‌ విద్యుత్‌తోపాటు సౌర, పవన విద్యుత్‌ను పెంచడం ద్వారా కాలుష్యం తగ్గి, కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించటమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇప్పటికే కాలుష్యరహిత విద్యుదుత్పత్తి స్థాపనా సామర్థ్యం 38 శాతానికి చేరినట్లు అంచనా. 2030 నాటికి ఈ లక్ష్యాన్ని అధిగమించడం కూడా సులువుగానే జరగవచ్చు.
మూడవ కార్యక్రమం అటవీ భూముల శాతాన్ని పెంచటం. ప్రతి ఏటా దేశంలో కోట్ల కొద్దీ మొక్కలను నాటుతున్నా వాటిలో బ్రతికి చెట్లవుతున్నవి లక్షల సంఖ్యలోనే ఉన్నాయి. విపరీతమైన జన సమ్మర్థం వల్ల అటవీ భూముల్ని విస్తరించే లక్ష్యం నెరవేరేలా కన్పించడం లేదు.
వ్యవసాయంలో రావలసిన మార్పులు
అన్నిరంగాలతోపాటు వ్యవసాయరంగం కూడా కర్బన ఉద్గారాల విడుదలకు సహకరించక తప్పదు. దేశంలో విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో 18 శాతం వ్యవసాయరంగం నుండే వెలువడుతున్నాయి. మూడు అంశాల కార్యక్రమం ద్వారా వ్యవసాయరంగం నుండి వెలువడుతున్న ఉద్గారాలను 18 శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మొదటిది రసాయనిక, ఎరువుల్ని సమర్థవంతంగా వినియోగించడం నత్రజని ఎరువుల వృధా వాడకాన్ని తగ్గించడం ద్వారా దీనిని సాధించవచ్చు. రెండవ కార్యక్రమం భూమిని తక్కువగా దున్నడం. లోతుగా దున్నకుండానే రెండవ పంటను కొన్ని యంత్రాలతో విత్తడం ద్వారా ఇది సాధ్యపడుతుందని అనుభవం నిరూపించింది. వరిలో నీటి నిర్వహణను మెరుగుపరచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని పరిశోధనలు తెలియజేశాయి. ముందు నాటినప్పుడు నాలుగంగుళాల నీటిని పెట్టి, దానిని క్రమంగా రెండంగుళాలకు తగ్గించి, మళ్ళీ దానిని క్రమంగా నాలుగంగుళాలకు పెంచడం వల్ల నీటి వినియోగాన్ని, కర్బన ఉద్గారాలను తగ్గించే అవకాశాలున్నాయి. పంటల సరళిలో కూడా మార్పులు రావలసిన అవసరం ఉంది. ప్రపంచంలో మొక్కజొన్న, గోధుమ, వరి పంటలు అత్యధికంగా పండించబడుతున్నాయి. ప్రపంచంలో 41 శాతం వ్యవసాయ భూమి ఈ పంటలతో సాగవుతున్నది. ఈ మూడు పంటలే 64 శాతం కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. భారతదేశంలో కూడా ఈ మూడింటి సంయుక్త వాటా ఎక్కువగా ఉన్నది. మెట్టపంటలైన జొన్న, సజ్జ, రాగి, చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజల పంటలు తక్కువ నీటిని వినియోగించడంతోపాటు, తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇచ్చే ధాన్యాలను మార్చడంతో మొక్కజొన్న, గోధుమ, వరి పంటల విస్తీర్ణాన్ని తగ్గించి కొంతవరకు మెట్టపంటల సాగుని పెంచడంతో ఉద్గారాల ఉత్పత్తిని తగ్గించవచ్చు. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ నీటి ఎద్దడిని తట్టుకోగలిగిన మెట్ట పంటల ప్రాధాన్యత పెరుగుతుంది. నత్రజని స్థిరపరచగలిగిన ‘లెగ్యూమ్‌’ జాతి పంటల సాగుని పెంచడం వల్ల కూడా ఉద్గారాల నిష్పత్తిని తగ్గించవచ్చు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఆఫ్రికాలోనూ, భారత ఉపఖండంలోనూ రానున్న థాబ్దాల్లో వర్షపాతం తగ్గవచ్చని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో నీటినీ, ఎరువులనూ సమర్థవంతంగా వినియోగించగల మెట్ట పంటల ప్రాధాన్యం పెంచాల్సిన అవసరం ఉంది. సేంద్రియ వ్యవసాయానికిచ్చే ప్రాధాన్యతను పెంచి, ప్రోత్సాహకాలనివ్వడం ద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని కొంత తగ్గించాలి. పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ విధానాలకు పరిశోధనా, విస్తరణ మద్దతుని పెంచడం కూడా అవసరం. వ్యవసాయాభివృద్ధి వ్యూహాన్ని మార్చకుండా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించడం సాధ్యం కాదు. వాతావరణ మార్పుల్ని అడ్డుకోలేకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకుని, మంచి దిగుబడినివ్వగలిగిన పంటలు, రకాలు రూపొందించడానికి పరిశోధనల్ని ఉధృతం చేయాలి. పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అందించటంతోపాటు, కర్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు నేటి వ్యవసాయ రంగానికి అవసరం.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
(రిటైర్డ్‌ ఞ కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608