రికార్డు దిశగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు

2021-22 సంవత్సరంలో భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని అంచనాలు వెలువడుతున్నాయి. 2021 ఏప్రిల్‌ నుండి నవంబరు వరకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 31.05 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయనీ, గత సంవత్సరం ఇదే కాలంలో జరిగిన ఎగుమతులతో పోలిస్తే 23.21 శాతం ఎక్కువనీ అధికారికంగా ప్రకటించారు. మిగిలిన నాలుగు నెలల్లో మరో 19 బిలియన్‌ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరగవచ్చని ఆశిస్తున్నారు. 2020-21 సంవత్సరంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 41.25 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ సంవత్సరం చివరి వరకు 20 శాతం వృద్ధి కొనసాగితే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్‌ డాలర్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తున్నది. 2017-18, 2018-19 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 38 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగా, 2019-20లో అవి 35.16 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 2020-21 సంవత్సరంలో కరోనా ప్రభావం ఉన్నా వ్యవసాయ ఎగుమతులు 17.34 శాతం వృద్ధిని సాధించాయి. 2021-22లో వ్యవసాయ ఎగుమతుల వృద్ధి మరింత వేగం పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.


తొమ్మిదో స్థానంలో భారత్‌
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో 2019లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు 118.3 బిలియన్‌ డాలర్ల ఆర్జనతో అగ్రస్థానంలో నిలిచింది. పువ్వులు, మొక్కల వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆధిక్యం కలిగిన నెదర్లాండ్స్‌ 79 బిలియన్‌ డాలర్లు ఆర్జించి ద్వితీయ స్థానంలో ఉంది. జర్మనీ (70.8 బిలియన్‌ డాలర్లు), ఫ్రాన్స్‌ (68 బిలియన్‌ డాలర్లు), బ్రెజిల్‌ (55.4 బిలియన్‌ డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చైనా, మెక్సికో, మలేషియాల తర్వాత భారత్‌ తొమ్మిదో స్థానంలో నిలిచినట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం భారత్‌ తన స్థానాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో యూరోపియన్‌ యూనియన్‌ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో 16.1 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, అమెరికా 13.8 శాతం వాటాతోనూ, బ్రెజిల్‌ 7.8 శాతం వాటాతోనూ, చైనా 5.4 శాతం వాటాతోనూ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


2019లో భారతదేశపు వాటా 3.1 శాతంగా ఉంది. 2020-21లో అది 3.6 శాతానికి పెరిగినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడినప్పుడు భారతదేశపు వాటా 1.5 శాతం మాత్రమే. గత 25 సంవత్సరాల్లో ఈ వాటా రెట్టింపైంది. ప్రపంచ జనాభాలో ఆరవవంతు ప్రజలు కలిగి, వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయమైన వాటా కలిగిన భారతదేశపు వాటా మరింత పెరగాల్సిన అవసరం ఉంది. 2021-22 సంవత్సరంలో భారతదేశం 21 మిలియన్‌ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసి ప్రథమ స్థానంలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు, పీతలు వంటి ఉత్పత్తుల ఎగుమతులు 8 బిలియన్‌ డాలర్ల విలువను అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి. సోయాచిక్కుడు, మొక్కజొన్న, గోధుమల ఎగుమతుల్లో అమెరికాకు, పామాయిల్‌ ఎగుమతిలో ఇండోనేషియాకు అగ్రస్థానం ఉన్నట్లుగా బియ్యం ఎగుమతుల్లో ప్రథమ స్థానాన్ని, చేపల ఎగుమతిలో ద్వితీయ స్థానాన్ని, పత్తి ఎగుమతుల్లో మూడవ స్థానాన్ని సాధించటం గర్వకారణం. పశుమాంసం, పంచదార, నూనె తీసిన చెక్క, ఆముదం, వేరుశనగ, తాజాపండ్లు, తాజా కూరగాయలు, ప్రాసెస్‌ చేసిన పండ్ల రసాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారం మొదలైన ఇతర ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా ఉన్నాయి. వ్యవసాయ ఎగుమతుల్లాగానే వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల్లో కూడా మంచి వృద్ధి కనిపిస్తుంది. గత 15 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు ఏడు రెట్లు పెరగ్గా, దిగుమతులు ఎనిమిదిరెట్లు పెరిగాయి. దిగుమతుల్లో వంటనూనెలు 54 శాతం ఆక్రమించగా, తాజా పండ్లు, అపరాలు, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు కలిపి మరో 26 శాతం విలువ కలిగి ఉన్నాయి. అయినా 2019-20లో వ్యవసాయ ఎగుమతుల ద్వారా 2.52 లక్షల కోట్ల రూపాయలను ఆర్జించగా, దిగుమతుల ద్వారా 1.47 లక్షల కోట్లు ఖర్చయ్యాయి. 2019-20లో 1.05 లక్షల కోట్ల రూపాయల వ్యాపార మిగులుండగా, 2020-21లో అది 1.33 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. మొత్తం దేశంలో ఉత్పత్తయిన వ్యవసాయ ఉత్పత్తుల విలువలో ఎనిమిది శాతంగానూ, నికర వ్యాపార మిగులు నాలుగు శాతంగానూ ఉన్నాయి. వ్యవసాయ ఎగుమతులు దిగుమతులకన్నా ఎక్కువగా ఉండి, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరం వ్యాపార మిగులుని కలిగి ఉండటం అభినందనీయం.


మొత్తం ఎగుమతుల్లో తగ్గుతున్న వాటా
2000-01 సంవత్సరం నాటికి మొత్తం దేశపు ఎగుమతుల విలువలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 20 శాతంగా ఉండేది. 2019-20లో అది 11 శాతానికి తగ్గింది. మొత్తం దేశపు ఎగుమతులు 2019-20లో 313.3 బిలియన్‌ డాలర్లుండగా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 35.16 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అయితే కరోనా ప్రభావంతో దేశపు మొత్తం ఎగుమతుల విలువ 2020-21లో ఏడు శాతం తగ్గి, 291.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. కరోనా ప్రభావం వల్ల అనేక దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గి, కొరత ఏర్పడింది. కాని భారతదేశంలో కరోనా కాలంలో కూడా వ్యవసాయ ఉత్పత్తులు పెరగటం వల్ల ఎగుమతుల ద్వారా 41.25 బిలియన్‌ డాలర్లుని ఆర్జించగలిగాము. వ్యవసాయ ఉత్పత్తుల విలువ మొత్తం దేశపు ఎగుమతుల్లో 14 శాతంగా ఉంది. 2020-21లో మొత్తం వ్యాపారలోటు 72.01 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా తగ్గినా కూడా వ్యాపార లోటు దాదాపు 20 శాతంగా ఉంది. 2021-22 లో ముడి చమురు ధరలు భారీగా పెరగటం వల్ల ఈ సంవత్సరం వ్యాపారలోటు దాదాపు 35 శాతానికి చేరుకోవచ్చు. వ్యవసాయ వాణిజ్యంలో మిగులు పెరగటం వల్ల దేశపు వ్యాపారలోటుని కొంతవరకు పూడ్చగలుగుతున్నది.


భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రధాన మార్కెట్లుగా అమెరికా, చైనా, బంగ్లాదేశ్‌, యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌, వియత్నాం, సౌదీఅరేబియా, ఇండోనేషియా, నేపాల్‌, ఇరాన్‌, మలేషియాలు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఇండోనేషియా మార్కెట్లో రెట్టింపయ్యాయి. బంగ్లాదేశ్‌కు జరిగిన ఎగుమతుల్లో 96 శాతం, నేపాల్‌కు జరిగిన ఎగుమతుల్లో 57 శాతం వృద్ధి నమోదైంది. సేంద్రియ ఆహార ఎగుమతులు 51 శాతం పెరిగి, 1.04 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. యూరోప్‌కు చేస్తున్న బాస్మతీ బియ్యం ఎగుమతులు మాత్రం పురుగుమందుల అవశేషాల కారణంగా దెబ్బతిన్నాయి. యూరోపియన్‌ దేశాలు పురుగుమందుల అవశేషాల విషయంలో కఠిన నిబంధనలను విధించడం వల్ల బాస్మతీ ఎగుమతిదారులు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇందుకోసం పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రసాయనిక పురుగు మందుల వాడకాన్ని నిషేధించింది. పురుగు మందులు, శిలీంద్రనాశకాల వాడకాన్ని తగ్గించగలిగితే మన వ్యవసాయ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది.


ఎగుమతి ప్రోత్సాహకాలు
భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరగటానికి భారత ప్రభుత్వం కొంతమేరకు ప్రోత్సాహకాలను అందిస్తున్నది. మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులను అనేక దేశాలకు ఎగుమతి చేయడానికి, అధిక విలువ కలిగిన, విలువ జోడించిన ఉత్పత్తుల వాణిజ్యానికి ప్రాధాన్యమిస్తున్నది. ప్రపంచవాణిజ్యంలో భారత వాటాను రెట్టింపు చేయాలనే దీర్ఘకాల లక్ష్యంతో ఎగుమతిదారులు ఎదుర్కుంటున్న వ్యాపార అడ్డంకులను అధిగమించటానికి, వివిధ దేశాలు పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలను చేరుకోవటానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నది. కొత్తగా ఎగుమతి కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఎగుమతిదారులకు అవసరమైన ధృవపత్రాలను ఆన్‌-లైన్‌ పద్ధతిలో అందించటం, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించటానికి కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేయడం, ధృవపత్రాల కాలపరిమితి ముగుస్తున్నప్పుడు వాటిని పునరుద్ధరించడం వంటి చర్యలు ఎగుమతిదారులకు సాయపడుతున్నాయి. అనేక వ్యవసాయ ఉత్పత్తులకు, ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఉత్పత్తులకు రవాణా సబ్సిడీని, మార్కెటింగ్‌ సహకారాన్ని అందిస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, ప్రాసెసింగ్‌ అభివృద్ధి అథారిటీ (ఏపిఇడిఏ), సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపిఇడిఏ), టొబాకో బోర్డు, కాఫీ బోర్డు, టీ బోర్డు, సుగంధద్రవ్యాల బోర్డు, రబ్బర్‌ బోర్డు వంటి సంస్థల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, ఎగుమతులకు ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ట్రిబ్యునళ్ళు, కోర్టుల్లో భారత్‌కు వ్యతిరేకంగా ఇతర దేశాలు పలు ఫిర్యాదులు చేస్తున్నాయి. పంచదార ఎగుమతులకు భారత ప్రభుత్వం సబ్సిడీలను ఇస్తున్నదనే ఫిర్యాదుపై ఇటీవల భారత్‌కు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ కోర్టు ఆదేశాలనిచ్చింది. దానిపై మనదేశం వేసిన అప్పీలు విచారణలో ఉన్నది. ఇలాగే ఇతర దేశాలు అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన పలు ఫిర్యాదులు విచారణలో ఉన్నాయి. వ్యాపార పరంగా ఉన్న చిక్కులు కారణంగా 1994 తర్వాత మరో వ్యాపార ఒప్పందానికి ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాల ఆమోదాన్ని సంపాదించలేకపోతున్నది.


దేశంలో పెరుగుతున్న వైరుధ్యాలు
దేశంలో ధనికులు, పేదల మధ్య ఆదాయ పరంగానూ, సంపద పరంగానూ వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. 1991లో ప్రారంభమైన ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలు ఈ వ్యత్యాసాలు పెరగటానికి కారణమయ్యాయి. గత రెండేళ్ళుగా కరోనా ప్రభావంతో అధిక సంఖ్యాకులు ఉపాధిని, జీవనాధారాన్ని కోల్పోగా, ధనికుల సంపద మాత్రం విపరీతంగా పెరిగింది. వరుసగా మూడేళ్ళపాటు వాతావరణం అనుకూలించడంతో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ఆ ప్రభావం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై కూడా పడింది. కాని వ్యవసాయదారుల ఆదాయాలు పెరగలేదు. వ్యవసాయరంగానికీ, ఇతర రంగాలకు మధ్య వ్యాపార తులనాత్మకత దెబ్బతిన్నది. ధరల వ్యవస్థ రైతులకు వ్యతిరేకంగా మారి, అధికోత్పత్తి, ఎగుమతుల పెరుగుదల వల్ల కలిగే ప్రయోజనాలు దోపిడీకి గురయ్యాయి. ఒకవైపు ఆహార భద్రతా సూచీలో భారత్‌ ఇతర దక్షిణాసియా దేశాల కన్నా వెనకబడి ఉందని అంతర్జాతీయ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు గోదాములు ఆహార ధాన్యాలతో నిండి, ఎగుమతులు పెరుగుతున్నాయి. 9 శాతం నిరుద్యోగంతో ఉపాధి లేని పెరుగుదల ఒక సమస్యగా నిలిచింది. రైతులకు ప్రయోజనం చేకూర్చని వ్యవసాయోత్పత్తుల పెరుగుదల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నది. ఆదాయ పంపిణీలో తీవ్రమౌతున్న అసమానతలు విధాన లోపాలను ఎత్తి చూపుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో వృద్ధినీ, ఎగుమతుల్లో పెరుగుదలను రైతులకు ప్రయోజనకరంగా మార్చటం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సమస్య!


డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
(రిటైర్డ్‌ & కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More

సేంద్రియ పద్ధతులే శరణ్యం

లావణ్యా రమణారెడ్డి

పెరుగుతున్న ప్రజల ఆహార అవసరాలను తీర్చే ధ్యేయంతో వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టబడినవి. రసాయనాలు వచ్చిన కొత్తలో రైతులు తమ పంటల సాగులో రసాయనాలు వినియోగించటానికి విముఖత చూపగా శాస్త్రవేత్తలు బలవంతంగా కొంతప్రాంతంలో తగు మోతాదులో రసాయనాలు వినియోగించడము జరిగింది. రసాయనాలు వినియోగించిన ప్రాంతంలో పంటలు ఆశాజనకంగా కనిపించటముతో రైతులు రసాయనాలు వినియోగిస్తూ పంటలు సాగు చేయడం మొదలయ్యింది. అప్పట్లో శాస్త్రవేత్తల సలహాల మేరకు ఎక్కువ మొత్తంలో సేంద్రియ పదార్థాలను మరియు కొద్ది మొత్తంలో రసాయనాలను వినియోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తూ వస్తున్న కాలంలో వివిధ రకాల కారణాల వలన కొంత మంది రైతులు సేంద్రియ పదార్థాలను ప్రక్కన పెట్టి పూర్తిగా రసాయనాలనే ఉపయోగిస్తూ పంటలు పండించడము మొదలు పెట్టారు. సేంద్రియ పదార్థాలను అసలు వినియోగించకుండా విచక్షణా రహితంగా రసాయనాలు వినియోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తూండడము వలన మొక్కలలో రోగనిరోధక శక్తి తగ్గడము, చీడపీడల ప్రభావం పెరగటం, కొన్ని రకాల చీడపీడలు రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ రసాయనిక పురుగుమందులకు నివారణకాకపోవడంతో రైతులు చీడపీడల నివారణకు ఎక్కువగా ఖర్చుపెట్టవలసి వస్తుంది. అయినా చీడపీడలు నివారించలేక పంటను నష్టపోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సంవత్సరం మిరప రైతుల పరిస్థితి పరిశీలిస్తే విచక్షణా రహిత రసాయనాల వినియోగం వలన జరిగే ప్రమాదం అర్థం అవుతుంది. మిగతా పంటలతో పోల్చుకుంటే మిరప పంటకు చీడపీడల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ చీడపీడలను నివారించటానికి రైతులు యేయేటికాయేడు కొత్త మందులను వినియోగిస్తూ వస్తున్నారు. విచక్షణా రహిత రసాయనాలకు అలవాటు పడిన చీడపీడలు రోగనిరోధక శక్తిని పెంచుకొని నివారణ కాలేని పరిస్థితులు ఈ సంవత్సరం మిరప రైతులకు ఎదురయ్యింది. కొత్త రకం తామర పురుగులు మరియు నల్లి లాంటి పురుగులు మిరప రైతులను ఇబ్బందికి గురి చేసినవి. చేస్తున్నవి. ఎన్ని రకాల రసాయనిక మందులు ఉపయోగించినా కూడా ఈ చీడపీడలను నివారించలేక కొంతమంది మిరప రైతులు తమ పంటను పీకివేసి జొన్న, సోయా, మినుము, నువ్వు లాంటి పంటలు వేసుకుంటున్నారు. కొంతమంది వచ్చినకాడికి దిగుబడి వస్తుందనే ఆశతో మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన అన్ని నివారణా మార్గాలవైపు పరుగులు తీస్తున్నారు. మొత్తానికి ఈ సంవత్సరం మిరప రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులలో సేంద్రియ పద్ధతిలో మిరపను సాగు చేస్తే ఫలితాలు ఉంటవి అని నిరూపిస్తూ పంటల సాగుకు సేంద్రియ పద్ధతులే శరణ్యం అని అంటున్నారు నాగర్‌కర్నూలు జిల్లా, కారువంగ గ్రామానికి చెందిన సేంద్రియ రైతు దంపతులు లావణ్యా రమణారెడ్డి.


రసాయనిక వ్యవసాయం చేస్తూ నష్టాలపాలై వ్యవసాయాన్ని వదలి వేరే రంగంలో అడుగుపెట్టాలనే యోచనలో ఉన్నప్పుడు సేంద్రియ సాగు గురించి తెలుసుకుని తమ సాగులో సేంద్రియ పద్ధతులను ఆచరించడం మొదలు పెట్టారు. అప్పటినుంచి పెట్టుబడులు తగ్గడముతో పాటు మొదటలో దిగుబడులు కూడా తగ్గుతూ ఉన్నా కూడా ఏ మాత్రం వెనుకంజ వేయకుండా తమ సేంద్రియ సాగుని కొనసాగిస్తూ వస్తున్నారు. క్రమంగా దిగుబడులు పెరగడము మొదలయ్యింది. వచ్చిన దిగుబడులను సొంతంగా వినియోగదారులకు అమ్మడం మొదలుపెట్టారు. ఈ పరిణామాల వలన తమ పంటలసాగు లాభాల బాటలో పయనించడం మొదలయ్యింది. ఇంక వెనుకడుగు వేయకుండా తమ సేంద్రియ సాగును కొనసాగిస్తూ వివిధ రకాల పంటలలో అంటే మిరప, ప్రత్తి, కంది, వరి, జొన్న, సజ్జ, నువ్వులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర లాంటి చాలా రకాల పంటలు పూర్తి సేంద్రియ పద్ధతులలో పండిస్తూ అత్యధిక దిగుబుడలు అంటే రసాయనసాగు చేసే రైతులతో సమానంగా, కొన్ని పంటలలో రసాయనిక సాగు చేసే రైతుల కంటే ఎక్కువ దిగుబడులు సాధిస్తూ లాభసాటి సాగును కొనసాగిస్తున్నారు. మిగతా పంటలు ప్రక్కన పెడితే మిరప పంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.


గత 20 సంవత్సరాల నుంచి పూర్తి సేంద్రియ పద్ధతులతో మిరప పంటను పండిస్తూ వస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే మిరప పంటకు చాలా ప్రత్యేకత ఉంది. మిరప పంటకు పెట్టుబడులు ఎక్కువ. మిరప పంటకు చీడపీడల ప్రభావం ఎక్కువ. చీడపీడల నివారణకు రసాయనిక పద్ధతులు పాటించే రైతులు విపరీతంగా రసాయనాలు పిచికారి చేస్తుంటారు. కొంతమంది రైతులు నెలకు 6 సార్లకు తగ్గకుండా రసాయన కీటకనాశనులను పిచికారి చేయడంతోపాటు ఎకరానికి 30 బస్తాలకు పైగా రసాయన ఎరువులు అందిస్తూ మిరప పంటను సాగు చేసే రైతులు ఉన్నారు అంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. అందువలన మిరప రైతులకు పెట్టుబడులు ఎక్కువగా అవుతుంటాయి. ఈ సంవత్సరం చీడపీడలను నివారించలేక రసాయన పద్ధతులు పాటించిన రైతులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులో కూడా పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తున్న లావణ్యారమణారెడ్డి గారి మిరప తోట ఆరోగ్యంగా ఉంది. పంటను గమనించినట్లయితే ఎకరానికి 20 క్వింటాళ్ళ ఎండుమిరప దిగుబడి వచ్చేలా ఉంది.


సొంత పంట నుంచి నాటు విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తనాలను బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకుని నారుపోసుకున్నారు. 35-40 రోజుల వయస్సు గల నారుని బీజామృతంలో ముంచి నారు నాటించారు. దుక్కిలో ఎకరానికి 300 కిలోల ఘనజీవామృతం అందించారు. పంటకాలం మొత్తం ఎకరానికి 500 లీటర్ల వరకు ద్రవజీవామృతం భూమికి అందించారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, థపర్ణి కషాయం, విషముష్టి కషాయం, పుల్లటి మజ్జిగలను అవసరాన్ని బట్టి పిచికారి చేసుకుంటూ వచ్చారు. పంటలో అంతర సేద్యం ఆపి వేసిన తరువాత ధనియాలు, ఉల్లి, వెల్లుల్లి, సోంపు, మెంతి, జీలకర్ర, ఆవాలు మొదలగు అంతర పంటలు నాటించారు. పంటలో అక్కడక్కడా ఎర పంటలుగా ఆముదాలు, బంతి మొక్కలు నాటించడంతో పాటు పచ్చ పురుగు మరియు లద్దె పురుగుకు సంబంధించి లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేశారు. ఎకరానికి 30 చొప్పున బులుగు రంగు మరియు పసుపు రంగు జిగురు అట్టలను అమర్చారు. అంతకుమించి ఎలాంటి రసాయనాలు వినియోగించలేదు. అయినాకాని రసాయనాలు వినియోగించిన పంటలతో పోలిస్తే వీరి మిరప పంట ఆరోగ్యంగా, ఆకర్షణగా ఉంది. 4 ఎకరాల మిరపలో ఒక్క మొక్క కూడా బొబ్బర మొక్క ఇప్పటి వరకు అంటే జనవరి 26 వ తారీఖు వరకు కనిపించలేదు. మొక్క ఎదుగుదల కూడా బాగా ఉంది. కొన్ని చోట్ల 5 అడుగుల వరకు మిరప పంట పెరిగింది. వాస్తవంగా పంట ఎదుగుదలను చూస్తే ఎకరానికి 40 క్వింటాళ్ళ దిగుబడి దాటవచ్చు అనిపిస్తుంది. కాని పంటను గమనించినట్లయితే ఎకరానికి 20 క్వింటాళ్ళకు తగ్గదు అనేలా ఉంది. వీరి పంటలో తాలు కాని, మచ్చ ఉన్న కాయలు కాని ఎక్కువగా లేవు. 10 శాతం కన్నా తక్కువే తాలు లేదా మచ్చ కాయలు ఉన్నాయి. మరిన్ని వివరాలు 7730061819 కి ఫోను చేసి తెలుసుకోగలరు.


– డి. ప్రసాద్‌, రైతునేస్తం ప్రత్యేక ప్రతినిధి

Read More

స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతున్న ‘ఇక్రిశాట్‌’

ఇక్రిశాట్‌… అంతర్జాతీయ స్థాయిలో మెట్టపంటల గురించి పరిశోధనలు చేసే వ్యవసాయ సంస్థ. ప్రపంచంలోని సబ్‌ సహారా దేశాలను ఆకలి నుండి విముక్తి చేసి, ఆయా దేశాల్లోని నిరుపేదల జీవితంలో వెలుగులు నింపేందుకు పనిచేస్తోన్న ఓ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. తాగునీటికే కష్టమై, బతుకు దుర్బరమై, రోజువారీ జీవితమే గడవటం కష్టంగా ఉన్న ఆఫ్రికాఖండంలోని నిరుపేద దేశాలతో పాటు ప్రపంచంలోని మెట్టప్రాంతాలలో జీవన స్థితిగతులు మెరుగుపడేందుకు వ్యవసాయరంగంలో మౌలిక మార్పులు తీసుకొచ్చి వారికి వెలుతురుతోవలు చూపేందుకు నిర్విరామంగా గత 49 సంవత్సరాలుగా పనిచేస్తోన్న సంస్థ. ఈ సంస్థ తన ప్రయాణంలో 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. స్వర్ణోత్సవాలను భారత ప్రధాని ఫిబ్రవరి 5న లాంఛనంగా ప్రారంభిస్తారు.


గత ఐదు థాబ్దాల ఇక్రిశాట్‌ను పరిశీలిస్తే కంది, శనగ, వేరుశనగ, జొన్న, సజ్జ పంటల పరిశోధనలో అత్యుత్తమ పరిశోధనలు జరిపారు. ఈ ఐదు పంటలు తీవ్ర వర్షాభావాన్ని కూడా తట్టుకుని రైతుకు కొంత దిగుబడినిచ్చే శక్తి కల్గి ఉన్నాయి. వాటి ఈ ప్రత్యేక లక్షణాలు ఆధారంగా ఆ పంటల్లో కనీస దిగుబడులు పెంచేందుకు చేసిన శ్రమ ఫలించింది. వీరు తీసుకొచ్చిన రకాలు, హైబ్రిడ్లు, సాగు పద్ధతులు ఆయా ప్రాంతాలలో గణనీయమైన మార్పుకు దోహదపడ్డాయి. పంటలలో సాగు విధానాలు, రకాల అభివృద్ధితోపాటు నీటి సంరక్షణ పద్ధతులు, అతి తక్కువ ఖర్చుతో భూమి యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ విధానాలు, వాటర్‌షెడ్‌ పరిజ్ఞానం, యాంత్రీకరణ విధానాలు సత్ఫలితాలనిచ్చాయి. మనదేశం, మన రాష్ట్రాల్లో కూడా వీటి ప్రభావం స్పష్టంగా కనిపించింది. అన్నిరంగాలలో వెనుకబడిన పలు ఆఫ్రికాదేశాలకు అండగా నిలిచాయి. కొండంత భరోసా నిచ్చాయి.


తన 50 యేళ్ల గమనంలో ఎందరో భారతీయ శాస్త్రవేత్తలను అక్కున చేర్చుకుంది. విశ్వశాస్త్రవేత్తలయ్యేలా చేయడంలో కీలక భూమిక నిర్వహించింది. అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవటానికి ప్రేరణగా నిలిచింది. ఎంతోమంది విద్యార్థులు పరిశోధనలకు, ఆధునిక విజ్ఞాన ధోరణులు, పోకడలు, పద్ధతులు ఇక్కడివారికి తెల్సుకోవటానికి, ముందుకు సాగేందుకు ఓ బాట చూపిందనటంతో సందేహం లేదు. అందువల్ల ఇక్రిశాట్‌ ప్రభావాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా అంచనా వేసేందుకు కొలమానాలు లేవు. అంకెలు, లెక్కలతో తీరేది కాదు. మానవ అభివృద్ధిని ఏ పరిమితులుకు లోబడి కొలవాలి? ఎలా అంచనా వేయాలి? ఎలా అర్థం చేసుకోవాలి? వీటన్నింటికీ సమాధానం కాలమాన పరిస్థితులు ఆధారంగానే అంచనా వేయాల్సిఉంటుంది.


అందువల్ల ‘ఇక్రిశాట్‌’ 1972 నుండి కాలంతో పాటు మారుతూ వస్తుంది. దాని చిహ్నం లోగోలో కూడా మార్పులు కన్పిస్తాయి. దానికొచ్చే నిధుల ప్రవాహంలో కూడా తీవ్రమైన మార్పులు వచ్చాయి. నిధులలేమి వెంటాడుతూ ఉంది. ‘ఇక్రిశాట్‌’ కూడా తన నిధులను తను సమీకరించుకునే ప్రయత్నంలో భాగంగా కొత్తమార్పులకు తెర తీసింది. గతంకంటే పారదర్శకత పెరిగింది. భాగస్వామ్యం ఎక్కువయింది. అక్కడ ఉన్న శాస్త్ర, సాంకేతిక వనరుల బదిలీతోపాటు సద్వినియోగం చేసుకునేందుకు చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో భారతీయ పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు రంగంలోని కంపెనీలు వారికి కావల్సిన ఒప్పందాలు, అవగాహనలు కుదుర్చుకున్నాయి. మరెన్నో అంకుర కంపెనీలు వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయి. ఒకరకంగా ఇవన్నీ శుభపరిణామాలే.


వ్యవసాయ పరిశోధనల పరంపరకొనసాగాలి. అది సమస్త మానవాళికి ఉపయోగకరంగా ఉండాలి. ఆకలి, పేదరికంలేని ప్రపంచం కావాలి. ఆ దిశగా చిత్తశుద్ధితో అడుగువేసే ఏ సంస్థ అయినా చిరకాలం వర్ధిల్లాలి.

– వేంకటేశ్వరరావు

Read More

తక్కువ పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకం

మన దేశ జనాభా ఏఏటికాయేడు పెరుగుతూ వస్తుంది. జనాభాతో పాటు నిరుద్యోగుల సంఖ్య కూడా ప్రతి ఏడూ పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా మన దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలకే ఉంది కాని మరే ఇతర రంగాలకు లేదనే విషయం అక్షర సత్యం. కాని ఈ వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలను స్వయం ఉపాధిగా ఎంచుకునే వారు సక్రమంగా ఆదాయం సంపాదించగలుగుతున్నారా? లేదా? అనే విషయాన్ని కక్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లాభాలు రాకపోయినా పరవాలేదు కాని నష్టాలు రాకూడదు. నస్టాలు వచ్చినట్లయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గతాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించగలవు అనుకున్న అనేక వ్యవసాయ అనుబంధరంగాలు ఔత్సాహికులకు నిరాశనే మిగిల్చాయి. అందుకు ఉదాహరణగా ఈము పక్షుల పెంపకాన్ని చెప్పుకోవచ్చు. ఈము పక్షుల పెంపకం ఉపాధి అవకాశం కాగలదని చాలామంది ఇందులో అడుగుపెట్టడం జరిగింది. ఈము పక్షుల పెంపకం ఎక్కువ పెట్టుబడితో కూడుకున్న పని అయినా కాని ఉజ్వల భవిష్యత్తు ఉందని చాలామంది ఈము పక్షుల పెంపకం చేపట్టి మార్కెటింగ్‌ అవకాశాలు లేక ఈము పక్షుల పెంపకం చేపట్టిన వారిలో ఎక్కువ శాతంమంది చేతులు కాల్చుకున్నారు. మొదటలో వీటి పెంపకం చేపట్టిన వారు మాత్రమే గుడ్లను, చిన్న పిల్లలను అమ్మకం చేసుకుని లాభాలు గడించి ఉండవచ్చు కాని మిగతావారందరూ ఆర్థికంగా చాలా నష్టపోయారనే విషయం అందరికి తెలుసు. ఇదేబాటలో అనేక వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే ఔషధ మొక్కల పెంపకం, జీవ ఇంధన పంటలు మొదలగు వాటిలో కూడా యువత, రైతులు నష్టాలను చవిచూశారు, చూస్తున్నారు. కాని ఇంకా, ఇంకా కొత్త పంటలు, కొత్తరంగాల గురించి ఎదురు చూస్తూనే ఉండవలసిన పరిస్థితి మనది. ఈ పరిస్థితిని ఎవరూ మార్చలేము. పరిస్థితిని మార్చలేకపోయినా కాని నష్టాలను తగ్గించుకోగలిగితే కొంతలోకొంత మేలు అనే విషయం ప్రతి ఒక్కరూ అంగీకరించేదే. పుట్టగొడుగుల పెంపకాన్ని ఒక్కసారి గమనిస్తే గత 20 సంవత్సరాల ముందు నుంచే పుట్టగొడుగుల పెంపకం గురించి వింటున్నాము. చాలామంది ఇందులో అడుగుపెట్టి కొనసాగించలేకపోతున్నారు. సరైన కారణాలు ఎవరూ సక్రమంగా వివరించలేకపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా, యువతకు శిక్షణను అందించే లక్ష్యంతో కొర్నెపాడులోని ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టి కొనసాగిస్తున్నాము. వీటి పెంపకం, మార్కెటింగ్‌లో మా అనుభవాన్ని ఇక్కడ వివరిస్తున్నాము.

నిరుద్యోగులకు పుట్టగొడుగుల పెంపకం మంచి ఉపాధి అవకాశంగా ఉంటుందని అధికారులు, నిపుణులు, పుట్టగొడుగుల పెంపకందారులు చెబుతున్నారు. వీటిగురించి తెలుసుకునేందుకు అనేకమంది యువత అవకాశము ఉన్నచోట శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ తీసుకున్న వారిలో కొంతమంది పుట్టగొడుగుల పెంపకాన్ని చేపడుతున్నారు. కాని ఇందులో విజయం సాధించినవారు మాత్రం అతి తక్కువ మంది మాత్రమే ఉంటున్నారు. ఎక్కువ శాతం మంది కొంతకాలం వీటి పెంపకం చేపట్టి వివిధ రకాల కారణాల వలన ప్రక్కకు తప్పుకుంటున్నారు. మరల కొత్త యువత శిక్షణ తీసుకుంటున్నారు. మరలా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి మరియు నష్టాల నుండి బయట పడటానికి మా అనుభవంలో తెలుసుకున్న విషయాలను పాఠకుల ముందుంచుతున్నాం.
పుట్టగొడుగుల పెంపకం గురించి ఇక్కడ విపులంగా వివరించడం లేదు. వాటి పెంపకం గురించి పూర్తి సమాచారం కొరకు యూట్యూబ్‌లో చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. రైతునేస్తం యూట్యూబ్‌ ఛానల్‌లో కూడా వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలు చూసినట్లయితే పుట్టగొడుగుల పెంపకం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
పుట్టగొడుగుల పెంపకంలో ప్రధానంగా రెండు ప్రాసెస్‌లు ఉంటాయి. మొదటి ప్రాసెస్‌లో గడ్డిని సేకరించి ముక్కలుగా చేసుకుని స్టెరిలైజ్‌ చెయ్యడం, ఆరబెట్టడం, వరిగడ్డి, స్పాన్‌ కవర్లలో వేసి ఆ కవర్లను చీకటి గదిలో ఉంచినట్లయితే 21 రోజులలో మైసీలియం అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందిన మైసీలియం బ్యాగులను 21 రోజుల తరువాత చీకటిగదిలో నుంచి తీసి వెలుతురు గదిలో ఉంచాలి. వెలుతురు గది అనేది వీటి పెంపకంలో ఉండే రెండవ ప్రాసెస్‌. మైసీలియం బ్యాగులను మధ్యకు కోసి కేసింగ్‌ మట్టిని పెట్టాలి. కేసింగ్‌మట్టిలో మట్టితో పాటు, కోకోపిట్‌, చాక్‌పౌడర్‌లు కలిపి స్టీమ్‌ చేసి తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మట్టిని కట్‌ చేసిన మైసీలియం బ్యాగులపై పెట్టి వాటిని వెలుతురుగదిలో పెట్టి నీటిని చిలకరిస్తున్నట్లయితే 5 నుంచి 7 రోజులలో వాతావరణం అనుకూలంగా ఉంటే పుట్టగొడుగులు రావటం మొదలవుతుంది. వెలుతురు గదిలో ఉష్ణోగ్రత తగు విధంగా ఉండేలా జాగ్రత్త పడాలి.
పుట్టగొడుగుల పెంపకం యొక్క రెండు ప్రాసెస్‌లు గమనించినట్లయితే మొదటి ప్రాసెస్‌ కొంచెం రిస్కుతో కూడుకొని ఉన్నది మరియు గడ్డి ముక్కలుగా కట్‌ చేయడానికి గాని మరి ఇతర అవసరాలకు గాని యంత్రాలు కొనుగోలు చేసినట్లయితే పెట్టుబడి కూడా ఎక్కువగా అవుతుంది. అన్ని సక్రమంగా జరిగితే కొనసాగించవచ్చు. ఒకవేళ అనుకోని కారణాల వలన పెంపకం నుంచి వెనుదిరిగితే ఎక్కువగా నష్టాలు చవిచూడవలసి వస్తుంది. కాబట్టి కొత్తగా పుట్టగొడుగుల పెంపకం చేపట్టేవారు చీకటిగది ప్రాసెస్‌ చెయ్యకుండా, కేవలం వెలుతురు గది ప్రాసెస్‌తోనే మొదలు పెట్టవచ్చు. అందుకు అనుకూలంగా చీకటి గది ప్రాసెస్‌ చేసిన మైసీలియం బ్యాగులు సరఫరా చేసే వారు అందుబాటులో ఉన్నారు కాబట్టి రెండు మూడు సార్లు చీకటి గది ప్రాసెస్‌ చేసిన మైసీలియం బ్యాగులు కొనుగోలు చేసుకుని కేసింగ్‌ చేసుకుని వెలుతురు గది ప్రాసెస్‌ చేసినట్లయితే అందులో ఉండే సాధకబాధకాలు ప్రత్యక్షంగా చూడడానికి అవకాశం ఉంటుంది. అన్నీ కక్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత తమ స్వీయ అనుభవం తెలుసుకున్న తరువాత నిర్ణయం తీసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే లాభాలు వచ్చినా రాకపోయినా ఎక్కువగా నష్టాలు భరించవలసిన పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. నష్టాలు వచ్చినా కూడా తక్కువగా అంటే 20 వేల రూపాయల లోపు నష్టంతోనే బయటపడవచ్చు.


మేము కూడా మొదటి ప్రాసెస్‌లో అడుగుపెట్టకుండా మైసీలియం బ్యాగులను కొనుగోలు చేసి వెలుతురు గది ప్రాసెస్‌ను మాత్రమే చేపడుతున్నాము. ఇంకా కొంత కాలం పరిశీలించిన తరువాత చీకటి గది ప్రాసెస్‌ను కూడా మొదలు పెడతాము. వెలుతురు గది కోసం సుమారు 300 చదరపు అడుగుల గదిని కేటాయించి అందులో 6 చెక్క స్టాండులను పెట్టాము. ఈ 6 స్టాండులు 300 ఫుల్‌ బ్యాగులు అంటే 600 అర బ్యాగులకు అనుకూలంగా ఉంది. 300 మైసీలియం బ్యాగులను కొనుగోలు చేసుకుని, సొంతంగా స్టెరిలైజ్‌ చేసుకున్న కేసింగ్‌ సాయిల్‌ను ఉపయోగించి కేసింగ్‌ చేసిన అర సంచులను వెలుతురు గదిలో ఉంచి అవసరాన్ని బట్టి నీటిని చిలకరిస్తూ వస్తున్నాము. గదిలో ఉష్ణోగ్రత విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఉష్ణోగ్రత ఎక్కువ అయినపుడు తగ్గించటానికి పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఉష్ణోగ్రత ఎక్కువ అయినప్పుడు అన్ని కిటికీలు, తులపులు కొంచెంసేపు తెరచి ఉంచడంతోపాటు, అవకాశం ఉన్న చోట కిటకీలకు, తలుపులకు వెలుపల వైపు జనపనార గోతాలు వ్రేలాడదీసి తరచుగా నీటిని చల్లుతూ వచ్చాము. ఇలాంటి చర్యలు చేపట్టి ఉష్ణోగ్రతను తగ్గించగలిగాము. కాని చలికాలంలో ఉష్ణోగ్రత బాగా తగ్గినపుడు పెంచడం కొంచెం కష్టంగానే ఉంది. కొందరి సలహా మేరకు రూమ్‌ హీటరును ఏర్పాటు చేశాము కాని పుట్టగొడుగులు మాడిపోవడం గమనించి ఆపి వేశాము. ఇంకొకరి సలహా ప్రకారం రూమ్‌లో స్టీలు లేదా అల్యూమినియం (ప్లాస్టిక్‌ బకెట్‌ వద్దు) బకెట్‌లో నీటిని నింపి ఆ నీటిని ఎలక్ట్రికల్‌ వాటర్‌ హీటర్‌తో వేడి చేస్తుండగా 2 లేదా 3 గంటలలో 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడము గమనించాము. ప్రస్తుతానికి ఈ పద్ధతినే పాటిస్తూ ఉష్ణోగ్రతను పెంచుతూ వస్తున్నాము.

మార్కెటింగ్‌ విషయానికి వస్తే మార్కెట్‌ రిటైల్‌గా కిలో 300/-ల వరకు నడుస్తుంది. హోల్‌సేల్‌లో కిలో 140 నుంచి 180/-లు బల్క్‌, కిలో 200 నుంచి 250/-లు (200 గ్రాముల ప్యాకెట్స్‌) ప్యాకెట్స్‌ నడుస్తుంది. కాని మార్కెట్‌ చేసేవారు నిరంతర సరఫరా అడుగుతున్నారు. రేటు ఏది అయినా కాని నిరంతర సరఫరా అందించగలిగితే మార్కెటింగ్‌ ఇబ్బందులు ఉండకపోవచ్చు అనే విషయం మాకు అర్థం అయ్యింది. కాని నిరంతరం సరఫరా అందివ్వగలగటం అంత సులభం కాదు అని మా అనుభవంలో అర్థం అయ్యింది. నిరంతరం సరఫరా అందివ్వాలంటే పెద్ద మొత్తంలో పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టాలి. వీటికి నిల్వ సామర్థ్యం కూడా 4 నుంచి 6 రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి పెద్ద మొత్తంలో దిగుబడి తీయగలిగితే ఏ విధంగా వినియోగించుకోగలమో ఆలోచించుకోవాలి. సమయానికి అమ్ముకోలేని పుట్టగొడుగులను ఎండబెట్టి డ్రై పుట్టగొడుగులుగా మరియు డ్రై పుట్టగొడుగుల పౌడర్‌గా అమ్ముకోవలసి ఉంటుంది. లేదా పచ్చళ్లు తయారు చేసి అమ్ముకోవలసి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు అవకాశాలు ఉన్నవి. మరిన్ని వివరాలు 98493 12629 కి ఫోను చేసి తెలుసుకోగలరు

Read More

ఆరోగ్యం… ఆనందం… తృప్తి లేని జీవితం వ్యర్థం

ఆరోగ్యం, ఆనందం, తృప్తి.. వీటన్నింటికి అవినాభావ సంబంధం ఉంది. వీటన్నింటికి మన జీవనశైలితో విడదీయరాని బంధం ఉంది. జీవనశైలి సరిగ్గా ఉంటేనే అన్ని సరిగ్గా ఉంటవి. లేనట్లయితే జీవితం వ్యర్థం అవుతుంది. జీవనశైలి ఎలా ఉండాలి అనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ప్రస్తుత సమాజాన్ని గమనించినట్లయితే 90 శాతం పైగా ప్రజలు తమ తమ జీవన శైలిని సమర్థించుకొంటూ ఉంటారు అనేది అక్షర సత్యం. ఎవరు దేనిని సమర్థించుకున్నా మన జీవనశైలి అనేది మన ఆరోగ్యాలను కాపాడేదిగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా జీవించగలము. ఈ విషయం కరోనా వలన అందరికీ అర్థం అయ్యి ఉండవచ్చు. ఇంకా అర్థం కాలేదు అంటే వారిని ఎవరూ బాగు చేయలేము. అందుకే మనము ఆరోగ్యం మరియు జీవనశైలి, ఆనందం లాంటి వాటిని గురించి మాట్లాడాలనుకుంటే కరోనా కంటే ముందు, కరోనా తరువాత అని మొదలు పెట్టవచ్చు. కరోనా కంటే ముందు చాలామంది ఆరోగ్యానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వలేదు అని చెప్పవచ్చు. చాలామంది డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవితాలను కొనసాగించారు అని చెప్పవచ్చు. డబ్బు సంపాదన కొరకు తమ ఆరోగ్యాన్ని, కుటుంబాలను ఫణంగా పెట్టినవారు చాలామంది ఉన్నారు. కరోనా సమయంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన తరువాత అర్థం అయ్యింది ఎంత విలువైన వాటిని కోల్పోయారో అని. అంతా అయిపోయిన తరువాత తెలుసుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టే కరోనా తరువాత చాలామందిలో మార్పు వచ్చింది. ఆరోగ్యం విలువ అందరికీ తెలిసి వచ్చింది. డబ్బు ఎంత ఉన్నా కూడా ఆరోగ్యం సక్రమంగా లేకుంటే డబ్బు ఆరోగ్యాన్ని కాపాడలేదని కరోనా సమయంలో చాలామంది ఉదాహరణలు తెలియచెప్పినవి. దాని పర్యవసానమే ప్రస్తుతం చాలామది ఆరోగ్యానికి ప్రాముఖ్యతను ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే జీవన శైలివైపు అడుగులు వేస్తున్నారు. మన ఆరోగ్యం మనం తినే ఆహారం, పీల్చే గాలి, శారీరక శ్రమ, మన ఆలోచనలు, మనశ్శాంతి లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మనం తినే ఆహారం ఎలాంటి విష రసాయనాలు లేకుండా ప్రకృతి సిద్ధంగా పండింది అయి ఉండాలి. పీల్చేగాలి ఎలాంటి కాలుష్యం లేకుండా ఉండాలి. మనం చేసే వృత్తిలో శారీరక శ్రమ ఇమిడి ఉండాలి. విపరీతమై కోర్కెలు పెట్టుకొని అవి ఎలా తీరాలి అనే ఆలోచనలు లేకుండా ఉండాలి. కుటుంబ సభ్యులు మరియు తోటి సమాజంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనశ్శాంతితో జీవించగలగాలి. వీటన్నింటితో పాటు ఇంకా కొన్ని అంశాలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి కాని వాటి పరిష్కారం మన చేతులలో ఉండకపోవచ్చు. మన చేతులలో లేని వాటి గురించి ఎంత ఆలోచించినా ఫలితం ఉండదు. మన చేతులలో ఉన్నవాటిని సక్రమంగా పెట్టుకోవడమే మనం చేయవలసింది. మన చేతులలో ఉన్న వాటికి సరైన పరిష్కారం అడవి వాతావరణంలో జీవనాన్ని కొనసాగించడమే. మరీ అడవి వాతావరణం అంటే ఇబ్బంది కావచ్చు కాబట్టి ప్రస్తుతం ఉన్న కార్లు, సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌, కరెంట్‌ లాంటి సౌకర్యాలను వినియోగించుకుంటూ మన చుట్టు ప్రక్కల ప్రాంతాన్ని అడవిలాగా మార్చుకుంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇది చాలా చాలా తక్కువమందికి సాధ్యం అవుతుంది. అలాంటి అతి తక్కువమందిలో నరసన్న, పద్మావతి దంపతులు మొదటి వరుసలో ఉన్నారు అని చెప్పవచ్చు.
ఉన్నత చదువులు చదివిన నరసన్న మరియు పద్మావతి ఇద్దరు డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో వారిరువురికి పరిచయం అయ్యి ఆ పరిచయం పెళ్ళి వరకు వెళ్ళింది. డిడిఎస్‌లో వీరు శాశ్వత వ్యవసాయం (పెర్మాకల్చర్‌) విధానాన్ని రెండున్నర ఎకరాలలో క్షేత్ర స్థాయిలో అమలు పరిచారు. ఈ విధానం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని గ్రహించి, ఈ విధానాన్ని తోటి రైతులకు తెలియపరచాలంటే సొంతంగా భూమి కొనుగోలు చేసి అందులో పెర్మాకల్చర్‌ విధానాన్ని మొదలుపెట్టి అందరికీ ప్రత్యక్షంగా చూపించగలిగితే ఫలితం బాగా ఉంటుందని గ్రహించి దానినే వారి లక్ష్యంగా నిర్ధారించుకుని 1997వ సంవత్సరంలో జహీరాబాద్‌ సమీపంలో 111/2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి నగరంలో విలాసవంతమైన జీవితం కంటే పొలంలో ఉంటేనే ఆరోగ్యంగా ఆనందగా జీవితాలను కొనసాగించటానికి అనుకూలంగా ఉంటుందని తెలుసు కాబట్టి పొలంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని వివిధ రకాల మొక్కలు నాటటం ప్రారంభించారు.


జీవితమంటే ఉన్నత చదువులు చదవడం, మంచి జీతము వచ్చే ఉద్యోగాలు చేయటమో, ఆర్థికంగా బాగా లాభాలు ఉండే వ్యాపారమో లేదా ఇంకేదైనా వ్యాపకము చేయడమో కాదు. వాటివలన ఎవరికి వారు విలాసంవతమైన జీవితాలను అనుభవించవచ్చు కాని తోటి సమాజానికి పెద్దగా ఫలితం లేకపోగా ఈ ఉరుకుల పరుగుల జీవితములో మనకు తెలియకుండా ఎంతో విలువైన వాటిని కోల్పోవచ్చు. కాబట్టి ఇది సరైన జీవితము కాదు. ఇలాంటి జీవితాలలో విజయం వలన పొందే సంతోషం అందుతుంది. కాని తృప్తిని పొందలేము. ఎందుకనగా ప్రస్తుత సమాజంలో డబ్బు సంపాదన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రకృతిని ఇబ్బంది పెట్టడము లేదా సమాజాన్ని ఇబ్బంది పెట్టడము లేదా ప్రకృతి వనరులను ఎక్కువగా వినియోగించటం లేదా వృథా చేయడం లాంటివి తప్పనిసరిగా ఇమిడి ఉంటవి కాబట్టి వీటిలో వాస్తవమయిన తృప్తి ఉండదు. నిజమైన తృప్తి పొందాలంటే ప్రకృతి నుంచి తక్కువ తీసుకుని ఎక్కువ ఇవ్వాలి అప్పుడే నిజమైన తృప్తి దొరుకుతుంది. అట్టి అవకాశం పెర్మాకల్చర్‌తోనే సాధ్యం అని నమ్మిన ఆదర్శ దంపతులు శాశ్వత వ్యవసాయంను తమ జీవిత లక్ష్యంగా ఎంపిక చేసుకుని అటువైపు అడుగులు వేసి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎదుర్కొంటూ పదకొండున్నర ఎకరాలలో ఒక అడవిని సృష్టించారు.
1997వ సంవత్సరంలో ఈ భూమి కొనుగోలు చేసిన సమయంలో ఈ ప్రాంతం అంతా మనుషులు తిరగటానికి కూడా అనుకూలంగా లేకుండా ఉండేది. నేల కూడా అంత బలమైన నేల కాదు. కొంత లోతు వరకే మట్టి ఉంది. లోపల అంతారాయిగా ఉండేది. అలాంటి నేలను సాగుకు మరియు నివాసానికి అనుకూలంగా మార్చడం ఒక యజ్ఞం లాంటిదే అయినా కాని నరసన్న, పద్మ దంపతులు ఒకరికొరకు తోడుగా ఉంటూ నేలను అనుకూలంగా మార్చడము ప్రారంభించారు. అవసరమయిన చెట్లను ఉంచి కొత్తగా వీరు వివిధ రకాల మొక్కలను, విత్తనాలను ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఒక్క చెట్టు పెట్టితే ఆ చెట్టుకు వచ్చిన పండ్లు తిన్న పకక్షులు రెట్టల ద్వారా వేసిన విత్తనాల ద్వారా మొలసిన చెట్లే ఎక్కువగా ఉన్నవి. ఉదాహరణకు సీతాఫలం, బొప్పాయి, చింత మొదలగు చాలా రకాల చెట్లు 60 శాతానికి పైగా ప్రకృతి సిద్ధంగా మొలసినవే ప్రస్తుతానికి పెద్ద పెద్ద వృక్షాలు అయినవి. కేవలం రెండు ఎకరాల పొలాన్ని వివిధ రకాల పంటలు అనగా సజ్జ, జొన్న, పెసర, మినుము, కంది, వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు పండించటానికి ఉంది. మిగతా పొలం అంతా కూడా చెట్లతో నిండి ఒక అడవిలాగా తయారు చేశారు. ఈ పొలంలో చేసేది తక్కువ పొందేది ఎక్కువ. పండ్ల మొక్కలకు ఎలాంటి పనులు చెయ్యరు. కేవలం దిగుబడిని పొందుతుంటారు. పెసర, మినుము, కంది లాంటి పంటలు మరియు వివిధ రకాల కూరగాయలలో కేవలం కలుపుని నివారిస్తుంటారు. అంతకు మించి ఏమీ చెయ్యరు. దిగుబడి గురించి ప్రాకులాడకుండా వచ్చిన దిగుబడితో తృప్తి పొందుతుంటారు. ఎలాంటి కషాయాలు, మిశ్రమాలు, ద్రావణాలు ఉపయోగించరు. మొక్కలను ప్రకృతి సిద్ధంగా పెరిగేందుకు అవకాశం ఇస్తే వాటి బాగోగులు ప్రకృతే చూసుకుంటుంది అనే విషయాన్ని బాగా అవగాహన చేసుకుంటున్నారు. అడవిలో ఏ విధంగా పెద్ద చెట్ల కింద చిన్న చిన్న మొక్కలు మనుగడ సాధిస్తుంటాయో అదే విధంగా పెద్ద పెద్ద చెట్ల క్రింద పసుపు, అల్లం, బచ్చలి, బొప్పాయి లాంటి మొక్కలు వాటంతటవే పెరుగుతుండటం ఇక్కడ గమనించవచ్చు.
పెర్మాకల్చర్‌ గురించి ప్రతి నెల ఇక్కడ శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటారు. ఈ శిక్షణా తరగతులకు మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఔత్సాహికులు హాజరవుతుంటారు. శిక్షణా తరగతులకు వచ్చిన వారికి ప్రకృతి ఒడిలో నివాసం ఏర్పాటు చేయటంతో పాటు ఈ పొలంలో పండిన పంటలతోనే ఆహారాన్ని అందిస్తుంటారు. బయట నుంచి అతి తక్కువగా కొనుగోలు చేస్తూ మిగతావి అన్ని కూడా తామే సొంతంగా పండించిన వాటితో తమ ఆహార అవసరాలు తీర్చుకుంటుంటారు. నరసన్న, పద్మలకు ఇద్దరు సంతానం. వారు కూడా ఉన్నత చతువులు చదివి అమెరికాలో కొద్దికాలం ఉన్న తరువాత తిరిగి వచ్చి తల్లిదండ్రులతో కలసి ఉంటూ పెర్మాకల్చర్‌ ఫామ్‌లో తమ వంతు పాత్రను పోషించడంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల రైతులకు, మహిళలకు వ్యవసాయంపై, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ ఇక్కడ (అడవిలోనే) అవసరమయిన సౌకర్యాలతో నివాసం ఉంటూ, ఆరోగ్యంగా, ఆనందంగా సంతోషంగా, తృప్తిగా జీవితాలని కొనసాగిస్తున్నారు.

అమెరికా కంటే అరణ్యంలోనే తృప్తి: – స్నేహ, నరసన్న కుమార్తె


ప్రస్తుతం మన సమాజంలో గమనించినట్లయితే చదువుకున్న యువతీయువకులలో ఎక్కువమంది లక్ష్యం అమెరికా వెళ్ళాలని ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు ఇంకొంచెం ముందడుగువేసి అమెరికాలో ఉండే అబ్బాయిని అయితే లేదా పెళ్ళి అయిన తరువాత అమెరికా వెళ్తామంటేనే పెళ్ళి చేసుకుంటాము అనేవాళ్ళు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. మన యువతకు అమెరికా అంటే అంత పిచ్చిగా మారింది. అమెరికా వీసాకొరకు ఎన్నో పూజలు చేసిన వారు కూడా ఉన్నారు అనడములో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పరిస్థితులు నెలకొన్న నేటి పరిస్థితిలో నరసన్న కుమార్తె స్నేహ ఇక్కడ డిగ్రీ వరకు చదివి ఉన్నత విద్య కొరకు అమెరికా వెళ్ళి అక్కడ విద్య పూర్తి చేసి కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి తన లక్ష్యం తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ ఫెర్మాకల్చర్‌ని విస్తృత పరచడం కాబట్టి మంచి ఉద్యోగాన్ని వదలి ఇండియా తిరిగి వచ్చి తమ అరణ్యంలో నివాసం ఉంటూ అమెరికా కంటే అరణ్యంలోనే బెటర్‌ అని అంటున్నారు. ఇక్కడ తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ, పెర్మాకల్చర్‌ శిక్షణా తరగతులు తీసుకుంటూ చుట్టుప్రక్కల ప్రాంతాల రైతులకు ఈ పెర్మాకల్చర్‌పై అవగాహన కల్పించడంతో పాటు మహిళకు ఆరోగ్యం మరియు పోషకాహార విషయంలో అవగాహన కల్పిస్తూ ఆనందంగా, తృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

శాశ్వత వ్యవసాయమే సరైన వ్యవసాయం

హరిత విప్లవం వచ్చిన తరువాత మన రైతులు చాలామంది ఏక పంట విధానానికి అలవాటు పడ్డారు. ఏక పంట విధానం వలన అనేక ఇబ్బందులు ఉంటాయి. జీవవైవిధ్యం దెబ్బతింటుంది. రసాయనాలు ఎక్కువగా ఉపయోగించవలసి వస్తుంది. కాబట్టి ఏక పంట విధానం ఎప్పటికీ సక్రమం కాదు. కాని రైతులు తమ పరిస్థితుల వలన ఏక పంట విధానానికి అలవాటు పడ్డారు. అది తప్పు కాదు. ఎవరి పరిస్థితులు వారివి. కాని సరైన వ్యవసాయం అంటే శాశ్వత వ్యవసాయం. శాశ్వత వ్యవసాయంలో పండ్ల మొక్కలు, చెట్లు కూడా ఉంటాయి కాబట్టి కుటుంబానికి అవసరమైన ఆహారంలో చాలా వరకు సొంతంగా పండించుకోవటానికి అవకాశం ఉంటుంది. రైతు తన ఆహారాన్ని తానే సొంతంగా పండించుకోవడమే సరైన వ్యవసాయం. అది ఈ శాశ్వత వ్యవసాయంలో కుదురుతుంది కాబట్టి శాశ్వత వ్యవసాయమే సరైన వ్యవసాయం అని నరసన్న, పద్మ అంటున్నారు.

తక్కువ ఖర్చుతో తాత్కాలిక నివాస సౌకర్యం
ఇక్కడ శిక్షణ గురించి వచ్చే వారికి నివాసం కొరకు ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో నివాస సౌకర్యాలనిస్తుంటారు. చిన్న చిన్న టెంట్ల లాంటివి ఏర్పాటు చేస్తారు. ఈ టెంట్లను వేసవి కాలంలో చెట్ల క్రింద ఏర్పాటు చేసుకోవచ్చు. చలికాలంలో మరియు వర్షాకాలంలో రేకుల కింద ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ టెంట్లు ఒక చోట నుండి ఇంకొక ప్రాంతానికి ఇబ్బంది లేకుండా ఒక సంచి లాగా తీసుకెళ్ళవచ్చు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే నివాసాలని వారు ఇక్కడ ఏర్పాటు చేశారు.

మరిన్ని వివరాలు 9440826722 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

Read More

కంది సాగులో ఎకరాకు లక్ష ఆదాయం

సాధారణంగా మనకు వాణిజ్య పంటలు అనగానే ప్రత్తి, వరి, మిరప, చెరకు, మొక్కజొన్న లాంటివే గుర్తుకు వస్తుంటవి. అపరాల సాగును పెద్దగా పట్టించుకోరు. పట్టించుకొన్నా కూడా మినుము పంట గురించి ఎక్కువ శ్రద్ధ పెడతారు కాని కంది పంట గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టరు. కంది అనగానే ఏ పంటలు వెయ్యటానికి కుదరని నేలలోనే కందిని వేస్తుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నవి. ప్రధానంగా కదిలో పెద్దగా ఆదాయం లేకపోవచ్చు. దానికి తోడు ఇది దీర్ఘకాలిక పంట. ఇలాంటి కారణాల వలన కందికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత మన రైతులు ఇవ్వడం లేదని చెప్పవచ్చు. ప్రాముఖ్యత పెరగాలంటే కంది పంటలో మెలకువలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని సాగుచేస్తూ కంది సాగు రైతులు గిట్టుబాటుగా మార్చుకోవాలి. రైతుకు గిట్టుబాటు కావాలంటే మంచి దిగుబడి పొంది మంచి ధరకు అమ్ముకోగలిగితే పంటసాగు లాభదాయకంగా ఉంటుంది. సక్రమమయిన మెళకువలు పాటిస్తే కందిలో ఎకరానికి 1100 కిలోల దిగుబడి పొందవచ్చని తన అనుభవం ద్వారా తెలుసుకున్నాడు వికారాబాద్‌ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన నారాయణ.


నారాయణది వ్యవసాయ నేపథ్యం. వీరికి, వీరి పెద్దలకి కంది సాగులో 40 సంవత్సరాలపైగా అనుభవం ఉంది. కందితోపాటు శనగ, పెసర, మినుము, వెల్లుల్లి, అల్లం మొదలగు పంటల సాగులో నారాయణకు అనుభవం ఉంది. నారాయణ 15కు పైగా పశువులను పోషిస్తున్నాడు. వాటి ద్వారా వచ్చిన ఎరువును 9 ఎకరాల పొలానికి అందిస్తుంటాడు. రసాయన పద్ధతులు పాటించిన సందర్భంలో కూడా భూమికి తగినంత పశువుల ఎరువును అందిస్తుండేవాడు. రసాయన పద్ధతులు పాటిస్తున్న నారాయణ సుభాష్‌ పాలేకర్‌ సెమినార్‌కి హాజరయ్యి అక్కడ తెలుసుకున్న విషయాలతో తన పంటల సాగును సేంద్రియంలోకి మార్చాలని తలచి రసాయనాలను మానివేసి గత 5 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్ధతులనే పాటిస్తున్నాడు.


దుక్కిలో పశువుల ఎరువుతోపాటు ఘనజీవామృతం అందించి జూన్‌ మాసంలో బోదెలపై రీసర్చ్‌ స్టేషన్‌ నుంచి తెచ్చుకున్న ఎండుతెగులు తట్టుకొనే రకాన్ని జంటసాళ్ళ పద్ధతిలో నాటించాడు. జంటసాళ్ళ మధ్యదూరం 41/2 అడుగులు, సాలుకి సాలుకి మధ్య దూరం 9 అడుగులు పాటించాడు. అంతర పంటగా మినుము పంట వేశాడు. వాతావరణం సక్రమంగా లేనందువలన మినుములో సరైన దిగుబడి పొందలేదు. ప్రస్తుతం అంతర పంటగా కొంత ప్రాంతంలో అల్లం ఉంది. అక్టోబరు, నవంబరు మాసాలలో కొంత ప్రాంతంలో వెల్లుల్లిని అంతర పంటగా వేయాలనుకుంటున్నాడు. అవకాశాన్నిబట్టి జీవామృతాన్ని నేలకు అందించడంతో పాటు పంటపై పిచికారి చేసుకుంటూ వస్తున్నాడు. పంట చిన్న వయస్సులో ఆశించే ఆకుచుట్టు పురుగును వేపనూనెను పిచికారి చేసి నివారించుకున్నాడు. శనగపచ్చ పురుగు నివారణకి ఎన్‌పివి ద్రావణం సొంతంగా తయారు చేసుకుని పిచికారి చేయడంతో పాటు నీమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, థపర్ణి కషాయాల లాంటి వాటిని పిచికారి చేసి నివారించు కుంటున్నాడు. నారాయణ అనుభవం ప్రకారం నీటివసతి వున్నవారు మే నెలలో కంది విత్తనాలు నాటుకోగలిగితే మంచి దిగుబడి వస్తుంది. కందిని నాటే సమయంతో సంబంధం లేకుండా నవంబరు, డిసెంబరు, జనవరి మాసాలలోనే పూతకు వస్తుంది. కందికి పూత సమయములో పంటకు నీరు అందించకూడదు. నీరు అందిస్తే పూత రాలిపోతుంది. పిందె థలో మరియు కాయ థలో నీరు అందించగలిగితే దిగుబడి పెరుగుతుంది. కంది మొక్కల తలలను తుంచి వేయగలిగితే కొమ్మల సంఖ్య పెరిగి దిగుబడి పెరుగుతుందంటున్నాడు. నారాయణ తన పంటలో 60, 90, 120 రోజులకు కంది మొక్క తలలను తుంచుతుంటాడు. కలుపును ఆవుమూత్రం, ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారి చేసి నివారించుకున్నాడు.

కంది మొక్కల తలలు తుంచడం
కంది పంటలో అధిక దిగుబడి పొందాలంటే మొక్కల తలలను తప్పనిసరిగా తుంచాలి. కంది పంట వయస్సు 60 రోజుల సమయంలో కత్తెర సహాయంతో కంది మొక్కల తలలను మొదటిసారిగా తుంచుతుంటాడు. తలతుంచుటం వలన ప్రక్కకొమ్మల సంఖ్య పెరుగుతుంది. మరలా కంది మొక్క వయస్సు 90 రోజులపుడు మరలా రెండవసారి మరియు దీర్ఘకాలం పంట అయితే 120 రోజులపుడు 3వసారి తలలు తుంచాలి. 2వ సారి మరియు 3వ సారి తలలు తుంచటానికి బ్యాటరీ స్ప్రేయరు ఉపయోగిస్తున్నాడు. బ్యాటరీ స్ప్రేయరుకు చిన్న బ్లేడ్‌ కలిగిన బ్రష్‌ కట్టర్‌ లాంటి పరికరాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈ పరికరాన్ని మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నాడు. ఈ పరికరం అన్ని బ్యాటరీ స్ప్రేయర్లకు అనుసంధానం చేసుకోవచ్చు. ఒక మనిషి రోజుకు ఒక ఎకరంలో కంది మొక్కల తలలను తుంచవచ్చని నారాయణ తన అనుభవంలో తెలుసుకున్నాడు.


కలుపు నివారణ కోసం…
150 లీటర్ల నీటిలో 50 లీటర్ల ఆవుమూత్రం, 4 కిలోల ఉప్పు 60 నుండి 100 నిమ్మకాయలు కలిపి ఎకరం పొలంలో కంది పంటపై పడకుండా కలుపు పైన బ్యాటరీ స్పేయరు పిచికారి చేసి కలుపుని నివారించుకున్నాడు. ఈ ద్రావణాన్ని 10 రోజుల విరామంతో 3 సార్లు పిచికారి చేసిన యెడల ఫలితం బాగా ఉంటుందని నారాయణ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు. ఈ ద్రావణం పిచికారి చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. పొరపాటున పంటపై పిచికారి చేసినట్లయితే పంట కూడా మాడిపోతుంది కాబట్టి కేవలం కలుపు మొక్కలపై మాత్రమే పడేలా బ్యాటరీ స్ప్రేయరు యొక్క నాజిల్‌ను ఉపయోగించాడు. అంతర పంటలలో కలుపును మనుషుల సహాయంతో నివారించుకుంటున్నాడు.


పంట కోతను మిషన్‌తో కోయించకుండా మనుషుల సహాయంతో కోయిస్తున్నాడు. నారాయణ తన పంట దిగుబడిలో ఎక్కువ శాతం విత్తనాల కొరకు తోటి రైతులకు అమ్ముతుంటుంటాడు కాబట్టి కల్తీలు నివారించడానికి మనుషుల సహాయంతో కోయిస్తుంటాడు. అన్ని మెళకువలు పాటించి పొందిన కందులను విత్తనాల కొరకు అయితే కిలో 110/-ల చొప్పున అమ్ముతున్నాడు. విత్తనాలకు పనికిరాని కందులను సుమారు కిలో 100/-ల చొప్పున మరియు కొన్ని కందులను కందిపప్పు చేయించి కిలో కందిపప్పు 150/-ల చొప్పున అమ్ముతూ వస్తున్నాడు. అన్ని మెళకువలను శ్రద్ధగా పాటిస్తూ గత పంటకాలంలో ఎకరానికి 1100 కిలోల దిగుబడి పొంది ఎకరానికి లక్ష రూపాయల ఆదాయాన్ని పొందాడు. ఈ సంవత్సరం పంటను గమనించినట్లయితే ఎకరానికి 1200 కిలోల కంటే ఎక్కువ దిగుబడి వచ్చేలా ఉంది. అంతర పంటల ద్వారా వచ్చే ఆదాయం అదనం. పాడి పశువులను పోషిస్తూ నాటు ఆవుల వ్యర్థాలతో జీవామృతం మరియు వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకుంటూ కంది పంటను విజయవంతంగా సేంద్రియంలో సాగు చేస్తూ తన సాగుని లాభాల బాటలో నడిపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9949556911 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

Read More

ఆకుపచ్చ తెలంగాణకు మరో ఆభరణం ‘అగ్రి హబ్‌’

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన అగ్రి ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు, చేవెళ్ళ ఎంపి రంజిత్‌ రెడ్డి, రాజేంద్రనగర్‌ ఎంఎల్‌ఎ ప్రకాశ్‌గౌడ్‌, ఎల్‌బి నగర్‌ ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంఎల్‌ఎ కిషన్‌రెడ్డి, జగిత్యాల ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్‌, రంగారెడ్డి జెడ్‌పి ఛైర్‌పర్సన్‌ అనితాహరినాథరెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావులు పాల్గొన్నారు. తరువాత మంత్రులు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్ళని పరిశీలించారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ వి. ప్రవీణ్‌రావు స్వాగతోపన్యాసం చేశారు. నాబార్డ్‌ సహకారంతో ఈ హబ్‌ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ సాయంతో దేశంలో ఏడు ఇంక్యుబేటర్లు ఏర్పాటు అయ్యాయని నాబార్డ్‌ ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు వివరించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు. రీసెర్చ్‌, టెక్నాలజీలు కలిస్తే రైతాంగానికి మరింత మేలు జరుగుతుందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో దేశంలో ఆకలిచావులు లేవని గోవిందరాజులు అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఆహారపు అలవాట్లు బాగా మారాయని అందుకు అనుగుణంగా కొత్త వెరైటీలు తీసుకురావాలని ఆయన సూచించారు. అదేవిధంగా సమీకృత వ్యవసాయ పద్ధతులపై వర్సిటీలు పనిచేయాలన్నారు. ప్రస్తుత తరుణంలో వ్యవసాయరంగంలో స్టార్టప్‌లు చాలా అవసరమన్నారు. ఈ అగ్రిహబ్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని గోవిందరాజులు అభిలషించారు.

భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కేసీఆర్‌ అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కేటిఆర్‌ అన్నారు. ప్రపంచం అబ్బురపడే విధంగా స్వల్పకాలంలోనే కాళేశ్వరం ప్రాజక్ట్‌ పూర్తి చేసిన ఘనత కేసిఆర్‌కి దక్కిందన్నారు. మిషన్‌ కాకతీయ, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్ట్‌లు వంటి వాటి ద్వారా రాష్ట్రంలో, ప్రతి నీటిబొట్టు ఒడిసిపట్టడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేటిఆర్‌ అన్నారు. నేడు తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందని ఆహారభద్రత ఒక సవాల్‌గా ఉండేదని దీన్ని విజయవంతంగా అధిగమించగలిగామని వివరించారు. వైవిధ్యానికి ఆలవాలమైన భారతదేశంలో విభిన్న ఆహారపు అలవాట్లు ఉన్నాయన్నారు. పౌష్ఠికాహార భద్రత ఆధించడం నేడు మన ముందున్న సవాల్‌ అని కేటిఆర్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 24 గంటలు ఉచిత కరెంట్‌, విత్తనాలు, ఎరువులు, రుణాలు రైతాంగానికి అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఆహారధాన్యాల సేకరణ పూర్తిస్థాయిలో చేపట్టామన్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న చేరుకోలేదని కేటిఆర్‌ అభిప్రాయపడ్డారు. రైతులు ఉత్పత్తి, ఉత్పాదకత, లాభదాయకతలనే మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారన్నారు. నేడు తెలంగాణలో రెండో హరిత విప్లవం, నీలివిప్లవం పెద్ద ఎత్తున వచ్చాయన్నారు. ఈ అధునాతన టెక్నాలజీల వల్ల సామాన్యులకి ఏ రకంగా ప్రయోజనం కలుగుతుందనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ 24 గంటలూ ఆలోచిస్తున్నారని కేటిఆర్‌ అన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో భారతదేశం అందరికంటే ముందుంటుందని అన్నారు. ఈ అగ్రికల్చర్‌ హబ్‌ సామాన్య రైతులకి కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని కేటిఆర్‌ సూచించారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే రైతులకి, వారి పిల్లలకి కూడా అగ్రిహబ్‌ తలుపులు తెరిచి ఉంచాలన్నారు. అదేవిధంగా ఈ పరిజ్ఞానాన్ని తెలుగులో అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రైతాంగం పంటల వైవిధ్యకత వైపు మళ్లేలా చర్యలు తీసుకోవాలని ఇంకా విస్తృతంగా పరిశోధనలు చేపట్టాలని కేటిఆర్‌ వర్సిటీకి సూచించారు.
తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వివరించారు. ఆహారధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్‌ని సైతం అధిగమించిందన్నారు. అయితే, పెరుగుతున్న ఉత్పత్తికి అనుగుణంగా వ్యవసాయాధారిత పరిశ్రమలు మరిన్ని రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఆహారానికి ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. నూతన ఆవిష్కరణల సాయంతో సమతుల్య, పౌష్ఠికాహారం అందరికీ అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ అన్నింటికీ అనువైన ప్రాంతం అని వివరించారు. ప్రభుత్వపరంగా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రైతాంగం కూడా సంప్రదాయ పద్ధతుల్నించి బయటకొచ్చి నూతన సాంకేతికతలవైపు మారాలని నిరంజన్‌రెడ్డి సూచించారు.
వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగంపై పరిశోధనలు విస్తృతం కావాలన్నారు. ఉపకులపతి డాక్టర్‌ వి. ప్రవీణ్‌రావు నేతృత్వంలో వర్సిటీ అద్భుతంగా పనిచేస్తున్నదని మంత్రి అభినందించారు. ప్రపంచంలోని అత్యుత్తమ వర్సిటీల స్థాయికి ఎదగడానికి వర్సిటీ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అతిత్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేతులమీదుగా వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించనున్నామని ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పరిశోధనల కోసమే వర్సిటీకి 100 కోట్లు ఇచ్చామన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా నూనెగింజల ఉత్పత్తి పెంచుకోవలసిన అవసరం ఉందని నిరంజన్‌రెడ్డి అభిప్రాయమపడ్డారు.
ఈ సందర్భంగా అగ్రిహబ్‌కి సంబంధించిన పుస్తకాల్ని విడుదల చేశారు. కొన్ని సంస్థల ఉత్పత్తుల్ని ప్రారంభించారు. కొన్ని సంస్థలలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల ప్రతినిధులు, వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. అగ్రిహబ్‌ ఎండి డాక్టర్‌ కల్పనాశాస్త్రి వందన సమర్పణ చేశారు.
– వన్నోజు సుధాకర్‌, ప్రజా సంబంధాల అధికారి, PJTSAU

Read More

ఇవి మీకు తెలుసా?

1) ఒక ఎకరాకు = 40 గుంటలు
2) ఒక ఎకరాకు = 4840 చదరపు గజాలు
3) ఒక ఎకరాకు = 43,560 చదరపు అడుగులు
4) ఒక గుంటకు = 121 చదరపు గజాలు
5) ఒక గుంటకు = 1089 చదరపు అడుగులు
6) ఒక చదరపు గజానికి 3 x 3 = 09 చదరపు అడుగులు
7) 121 x 09 = 1089 చదరపు అడుగులు
8) 4840 చదరపు గజాలు x 09 = 43,560 చదరపు అడుగులు
9) ఒక సెంట్‌కు = 48.4 చదరపు గజాలు
10) ఒక సెంట్‌కు = 435.6 చదరపు అడుగులు

భూమి సర్వే కోసం అత్యవసరమైన సమాచారం:
Common Terminology in Revenue Department

గ్రామ కంఠం: గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.
అసైన్డ్‌భూమి: భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.
ఆయకట్టు: ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.
బంజరు భూమి (బంచరామి): గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.
అగ్రహారం: పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.
దేవళ్‌ ఇనాం: దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.
అడంగల్‌ (పహాణీ): గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాంతంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు.
తరి: సాగు భూమి ఖుష్కీ: మెట్ట ప్రాంతం
గెట్టు: పొలం హద్దు కమతం: భూమి విస్తీర్ణం
కౌల్దార్‌: భూమిని కౌలుకు తీసుకునేవాడు
ఇలాకా: ప్రాంతం; ఇనాం: సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి
బాలోతా ఇనాం: భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వమిచ్చే భూమి
సర్ఫేఖాస్‌: నిజాం నవాబు సొంత భూమి
సీలింగ్‌: భూ గరిష్ఠ పరిమితి
సర్వే నంబర్‌: భూముల గుర్తింపు కోసం కేటాయించేది
నక్షా: భూముల వివరాలు తెలిపే చిత్రపటం
కబ్జాదార్‌: భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి
ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ): భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.
ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌: దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.
బందోబస్తు: వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.
బీ మెమో: ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.
పోరంబోకు: భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.
ఫైసల్‌ పట్టీ: బదిలీ రిజిస్టర్‌
చౌఫస్లా: ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.
డైగ్లాట్‌: తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.
విరాసత్‌/ఫౌతి: భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.
కాస్తు: సాగు చేయడం మింజుములే: మొత్తం భూమి.
మార్ట్‌గేజ్‌: రుణం కోసం భూమిని కుదవపెట్టడం.
మోకా: క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్‌).
పట్టాదారు పాస్‌ పుస్తకం: రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.
టైటిల్‌ డీడ్‌: భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.
ఆర్వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌): భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.
ఆర్‌ఎస్సార్‌: రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.
పర్మినెంట్‌ రిజిస్టర్‌: సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.
సేత్వార్‌: రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.
జసాదాబైనామా: భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.
దస్తావేజు: భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.
ఎకరం: భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40 గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.
అబి: వానకాలం పంట
ఆబాది: గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు
అసైన్‌మెంట్‌: ప్రత్యేకంగా కేటాయంచిన భూమి
శిఖం: చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం
బేవార్స్‌: హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.
దో ఫసల్‌: రెండు పంటలు పండే భూమి
ఫసలీ: జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.
జనాలా: వ్యవసాయేతర భూమి
ఇస్తిఫా భూమి: పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి
ఇనాం దస్తర్‌దాన్‌ : పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి
ఖాస్రాపహానీ : ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.
గైరాన్‌: సామాజిక పోరంబోకు
యేక్‌రార్‌నామా: ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం. – ‘రైతునేస్తం’ ప్రత్యేక ప్రతినిధి

Read More

రైతులు బ్రహ్మస్వరూపులు

‘రైతునేస్తం’ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో నాబార్డ్‌ ఛైర్మన్‌ డా|| చింతల గోవిందరాజులు

ఆగస్టు 2న హైదరాబాదు శివారు తారామతిపేటలో సేంద్రియ రైతు నాగరత్నం నాయుడిగారి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో నాగరత్నంనాయుడి గారి సహకారంతో ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ వారు సేంద్రియ వ్యవసాయ శిక్షణా కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చరిత్రని ఒక్కసారి పరిశీలించినట్లయితే … కొన్నివేల సంవత్సరాల క్రితం ఆది మానవులు అందరూ మాంసాహారులే. అప్పట్లో వ్యవసాయం అనేది ప్రత్యేకంగా చేసేవారు కాదు. అడవులలో దొరికే పండ్లు, దుంపలు, కందమూలాలతోపాటు జంతువులను వేటాడుతూ.. వీటినే ఆహారంగా తీసుకుని జీవిస్తూ ఉండేవారు. ఏరోజుకారోజు అవసరమైన ఆహారాన్ని సేకరించి ఆరోజు పొట్టనింపుకునేవారు. ఆహారం కోసం ప్రతిరోజు వేటాడవలసిందే. ప్రస్తుతం జంతువులు వాటి పొట్ట నింపుకోవడం కొరకు ఏవిధంగా ఏరోజుకారోజు శ్రమిస్తవో అదేవిధంగా మనుషులు కూడా ఆరోజుకు కావలసిన ఆహారాన్ని శ్రమించి పొందుతుండేవారు. మగవారు వేటకువెళ్ళి జంతువులను వేటాడుతుండేవారు కాబట్టి ఆ సమయములో ఇంటివద్ద ఉండే మహిళలు తమ చుట్టుప్రక్కల ఉన్న మొక్కల యొక్క విత్తనాలను సేకరించి భద్రపరచి మరలా తిరిగి నాటుకుంటూ వస్తుండేవారు. కాబట్టి భూమిపై మొట్టమొదట వ్యవసాయం మొదలు పెట్టింది మహిళలే అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి. ప్రవీణ్‌ రావు, తెలంగాణ ఉద్యానశాఖ కమిషనర్‌ ఎల్‌. వెంకట్రామిరెడ్డి, నాబార్డ్‌ తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వై. కృష్ణారావు, తెలంగాణ పశువైద్య, పశుసంవర్దకశాఖ డైరెక్టరు వి. లక్ష్మారెడ్డి, సేంద్రియరైతు నాగరత్నం నాయుడు, ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ చైర్మన్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.


ఒకప్పుడు అందరూ చేసింది ప్రకృతి వ్యవసాయమే
గ్రీన్‌ రెవల్యూషన్‌ రాకముందు అందరూ చేసింది ప్రకృతి వ్యవసాయమే. రసాయనాలు రాకముందు ప్రతి రైతు ఇంట్లో పశువులు, కోళ్ళు, మేకలు లాంటివి ఉండేవి కాబట్టి వాటి వ్యర్థాలను పంటలసాగులో ఉపయోగిస్తూ తమ సాగును కొసాగిస్తుండేవారు. రసాయనాలు ప్రవేశపెట్టబడిన తరువాత శాస్త్రవేత్తల సూచనలు ప్రక్కకు నెట్టి రైతులు విచక్షణారహితంగా రసాయనాలను వాడుతూ పంటల సాగు చేస్తూ ఉండటం వలన నేల, నీరు, వాతావరణం, ఆహారం మొత్తం కలుషితం అవుతున్నాయి. రైతులు విచక్షణా రహితంగా రసాయనాలను ఉపయోగించకుండా శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ సేంద్రియ పదార్థాలను కూడా తగినంతగా ఉపయోగిస్తూ అత్యవసరమయితేనే తప్ప రసాయనాల జోలికి పోకుండా సాగును కొనసాగించినట్లయితే పరిస్థితులు ఇంతగా దిగజారేవి కావు. కేవలం విచక్షణా రహిత రసాయనాల వినియోగం వలననే పరిస్థితులు చేయి దాటిపోతున్నవి కాబట్టి తిరిగి మనము సేంద్రియ సాగు గురించి మాట్లాడవలసి వస్తుంది అని గోవిందరాజులు గతాన్ని ప్రస్తుత పరిస్థితులతో పోల్చారు.


నూనెలు వాడకం ఎక్కువ
ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో నూనెల వాడకం ఎక్కువ అని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మనం నూనెను తాగుతాము అదే అమెరికాలాంటి దేశాలలో నూనెని ఆహారంలో ఉపయోగిస్తారు కాని తాగరు. మన వంటకాలలో గారెలు, బూరెలు, పూరీలు లాంటి వాటికి నూనెలను ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. దేవుడికి అందించే ప్రసాదాలలో కూడా నూనెలు ఎక్కువగా అవసరమయ్యే గారెలు, వడలు లాంటివి తప్పనిసరిగా ఉంటవి. ఇతర దేశాలలో దేవుళ్ళకు అందించే ప్రసాదాలలో నూనెలు ఎక్కువగా ఉపయోగించరు. మనం తినే ఆహారాలనే దేవుళ్ళకు కూడా ప్రసాదాలుగా అందిస్తుంటాము. ప్రసాదాలను దేవుళ్ళు తినరు. వాటిని మనమే తింటాము కాబట్టి వాటినే మనం ప్రసాదాలుగా అందిస్తుంటాము. కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తింటూ అందుకు తగిన శారీరక శ్రమ చేయలేకపోవటం వలన సమాజంలో రక్తపోటు, మధుమేహం లాంటి రోగాలు సర్వసాధారణమయ్యాయి. వ్యవసాయం చేయకముందు ఇలాంటి రోగాలు లేవు. అపుడు అందరూ తమ ఆహారం కొరకు శారీరక శ్రమ తప్పనిసరిగా చేసేవారు. కాని నేడు శారీరక శ్రమ అవసరము లేకపోవడంతోపాటు, అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడంతో రక్తపోటు, మధుమేహం లాంటి రోగాలు మనలను వెంటాడుతున్నాయి. నూనెలకు గిరాకి ఏరోజుకారోజు పెరుగుతూ ఉంది కాబట్టి రైతులు నూనె గింజల సాగు పెంచవచ్చు. నూనెగింజ పంటలలో పామాయిల్‌ సాగు బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మనం పామాయిల్‌ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. మలేషియా, సింగపూర్‌ లాంటి దేశాలలో పామాయిల్‌ సాగు ఎక్కువగా ఉంది. అక్కడ వారు మన దేశానికి పామాయిల్‌ పంపిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పామాయిల్‌ను సాగు చేసినట్లయితే తక్కువ శ్రమతో రైతులు మంచి ఫలితాలను పొందవచ్చు. పామాయిల్‌ సాగు చాలా సులభం. 365 రోజులు నీటి వసతి ఉంటే పామాయిల్‌ సాగును చేపట్టవచ్చు. మన అదృష్టం కొద్దీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన తెలంగాణలో రైతులకు నీటి సమస్య లేదు. నీటి వృథాను తగ్గించేందుకు డ్రిప్‌ సౌకర్యం ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి పామాయిల్‌ సాగు వలన రైతులకు పలు విధాలుగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి రైతులు ఆ దిశగా ఆలోచించవచ్చు.


రైతు సంఘాలకు నాబార్డ్‌ నుంచి ప్రోత్సాహం
పరిస్థితులకి అనుకూలంగా రైతులు మారుతూ ఉండాలి. వ్యవసాయ భూమి స్థిరంగా ఉంది. రైతుల సంఖ్య పెరిగింది. ఉన్న భూమిని రైతులు పంచుకోవలసిందే కాబట్టి ఒకప్పుడు పెద్దపెద్దగా ఉండే కమతాలు ఇప్పుడు చిన్నచిన్న కమతాలు అయ్యాయి. రైతుల సంఖ్య పెరిగింది కాబట్టి మంచి ఫలితాలు పొందాలంటే రైతులు సంఘాలుగా ఏర్పడాలి. రైతు సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రైతు సంఘాలకు నాబార్డు నుంచి మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలని డా|| గోవిందరాజులు రైతులకు విజ్ఞప్తి చేశారు.


కోతుల సమస్యకి పరిష్కారం – పామాయిల్‌ సాగు
ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య కోతులు. పంటలను కోతులు నాశనం చేస్తున్నాయి. మిగతా పంటలతో పోల్చుకుంటే పామాయిల్‌ పంటను కోతులు పాడుచేయలేవు. మనం పామాయిల్‌ను మలేషియా, సింగపూర్‌ల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. తెలంగాణ రైతులు పామాయిల్‌ సాగు మొదలుపెట్టినట్లయితే ఆయిల్‌ దిగుమతులు తగ్గి నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించడంతోపాటు ఈ పంటను కోతులు ఏమీ చేయలేవు కాబట్టి కోతుల బెడద నుంచి రైతులు బయటపడవచ్చు. పామాయిల్‌ సాగు పెరిగితే అనేకమందికి ఉపాధి అవకాశాలు పెరగటంతోపాటు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రైతులు సక్రమంగా పామాయిల్‌ సాగును సద్వినియోగం చేసుకుంటే క్రూడ్‌ ఆయిల్‌కు గల్ఫ్‌ దేశాలు హబ్‌ అయినట్లు పామాయిల్‌కి తెలంగాణ హబ్‌ కాగలదని గోవిందరాజులు అన్నారు.


అన్నం పండించే రైతులు బ్రహ్మకంటే గొప్పవారు
ప్రపంచంలో అందరికి అత్యవసరం ఆహారం. మనిషి ఎన్ని వందల కోట్లు కూడబెట్టినా కూడా డబ్బు తిని బ్రతకలేడు. బంగారం తిని బ్రతకలేడు. మనిషి బ్రతికి ఉన్నంతకాలం తప్పనిసరిగా అన్నం తినవలసిందే. అన్నం లేకుండా జీవితాలను కొనసాగించలేడు. అందుకే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు. ఆ అన్నాన్ని పండించే రైతులు బ్రహ్మకంటే గొప్పవాళ్ళు అని రైతు గొప్పతనాన్ని గోవిందరాజులు గుర్తు చేశారు.


ప్రముఖ సేంద్రియ రైతు నాగరత్నం నాయుడిగారి సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్‌ వారు ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయ శిక్షణా కేంద్రం ప్రారంభించటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కేంద్రం ద్వారా రైతులకు శిక్షణను అందించడంతోపాటు రైతులను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తూ రైతులను సంఘటితపరచడానికి కూడా కృషి చేస్తే ఫలితాలు బాగుంటాయని డా|| జి.ఆర్‌. చింతల అభిప్రాయపడ్డారు.


విలువ జోడింపుతోనే రైతులకు అధిక లాభాలు – ప్రొ|| వి. ప్రవీణ్‌రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి

పరిస్థితులకు అనుకూలంగా రైతులు కూడా మార్పు చెందవలసిందే. మన రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. అవసరమైన దానికంటే ఎక్కువగా ఆహారధాన్యాలను పండిస్తున్నారు. అదే సమయంలో అపరాలు, నూనెగింజల ఉత్పత్తిలో మనం వెనుకబడి ఉన్నాము. వరి పంట సరిగ్గా లేని గుజరాత్‌ రాష్ట్రంలో వడ్లకు విలువజోడించే పరిశ్రమలు ఎక్కువగా స్థాపించారు. అందుకనే మన దగ్గర నుంచి ముడి సరుకు కొనుగోలు చేసుకుని వాటికి విలువ జోడించి తిరిగి మనకే అమ్ముతున్నారు. కాబట్టి రైతులు పంటల సాగుతో పాటు విలువ జోడింపు కూడా మొదలుపెట్టినపుడే ఆర్థిక ఫలితాలను పొందవచ్చు. ఉత్తర తెలంగాణలో సోయాబీన్‌ పంటను ఎక్కువగా పండిస్తారు కాబట్టి అక్కడ సోయాబీన్‌కు విలువ జోడించగలిగితే ఫలితాలు బాగా ఉంటవి. పంట మార్పిడి తప్పనిసరిగా చేపట్టాలి. మన నేలలలో సేంద్రియ కర్బనం చాలా వేగంగా తగ్గుతుంది కాబట్టి పచ్చిరొట్ట పైర్లను వేసి నేలలో సేంద్రియ కర్బనం పెరిగే చర్యలు చేపట్టాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ వి. ప్రవీణ్‌రావు అన్నారు.


కే.సి.ఆర్‌ వ్యవసాయాన్ని పండగలా చేశారు : అరికెపూడి గాంధి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు
మన ప్రియతమ ముఖ్యమంత్రి స్వయంగా రైతు. వారికి వ్యవసాయ క్షేత్రం ఉంది. రైతుల కష్టాలు స్వయంగా క్షేత్రస్థాయిలో చూశారు కాబట్టి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు నేరుగా నగదును అందిస్తున్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నారు. అనేక ప్రాజక్టుల ద్వారా తెలంగాణలో నీటివసతి పెంచటం జరిగింది. భవిష్యత్తు అంతా వ్యవసాయానిదే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ‘రైతు దేశానికి వెన్నెముక’ అనే విషయం అందరికీ తెలుసు. అలాంటి వెన్నెముకను కాపాడవలసిన బాధ్యత అందరిపైనా ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రియతమ ముఖ్యమంత్రి కే.సి.ఆర్‌. నాయకత్వంలో మన వ్యవసాయం పండగలా మారిందని నిస్సందేహంగా చెప్పవచ్చని శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధి అన్నారు.


రైతుల అభ్యున్నతికి నాబార్డ్‌ కృషి చేస్తుంది – వై. కృష్ణారావు, నాబార్డ్‌ తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌
రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించటానికి నాబార్డ్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వ్యవసాయం చేసే రైతులతోపాటు పశుపోషకులకు, చేపల పెంపకందార్లకు, మిగతా వ్యవసాయ అనుబంధరంగాలలో ఉండే ఔత్సాహికులకు నాబార్డ్‌ సహకారం అందిస్తుంది. రైతులు సంఘాలుగా ఏర్పడి ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ ప్రారంభించినట్లయితే వారికి సుమారు 20 లక్షల రూపాయలను గ్రాంటుగా అందిస్తుంది. అలాగే నాప్‌ కిసాన్‌ ద్వారా 50 ఎఫ్‌పిఓలకి గ్రాంటు అందించాము. తెలంగాణలోని ఇంద్రవల్లి రైతు సంఘానికి 6 కోట్ల వ్యవసాయ రుణాన్ని అందించి అక్కడ సేంద్రియ పద్ధతిలో ప్రత్తి పండించే రైతులను ప్రోత్సహిస్తున్నాము. ఆ సంఘంలో 98%కి పైగా రైతులు గిరిజనులే. ఆ సంఘం వారు సొంతంగా జిన్నింగ్‌ మిల్లు పెట్టుకున్నారు. ఈ విధంగా రైతు అభ్యున్నతికి నాబార్డ్‌ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని నాబార్డ్‌ వారి స్కీములను వివరించారు.


ఆకుకూరలు, కూరగాయలతోనే పోషకాలలో సమతుల్యత సాధ్యం – ఎల్‌. వెంకట్రామిరెడ్డి, ఉద్యాన శాఖ కమీషనర్‌
మనం తినే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ప్రధాన పాత్రను పోషిస్తవి. అవసరమయిన పోషకాలను సమతుల్యంగా పొందాలంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు తప్పనిసరిగా ఆకుకూరలు మరియు కూరగాయలను అవసరమయిన మేరలో తమ ఆహారంలో చేర్చుకోవాలి. అందరికి అవసరమయినంత మొత్తంలో మనం సాగు చేయలేకపోతున్నాము కాబట్టి వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము కాబట్టి రైతులు ఆకుకూరలు, కూరగాయలు సాగు విస్తీర్ణాన్ని పెంచవచ్చు. అదేవిధంగా నూనెగింజలలో కూడా మనం స్వయం సమృద్ధిని సాధించలేకపోయాం. చాలావరకు నూనెలను మనం దిగుమతి చేసుకుంటున్నాము కాబట్టి నూనెగింజలలో ప్రత్యేకించి పామాయిల్‌ సాగుకు తెలంగాణ రాష్ట్రంలో మంచి భవిష్యత్‌ ఉంది కాబట్టి రైతులు ఆదిశగా ఆలోచించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ కమీషనర్‌ ఎల్‌. వెంకట్రామిరెడ్డి రైతులకు సూచించారు.


సమగ్ర వ్యవసాయంతోనే రైతులకు లాభాలు – డా|| వి. లక్ష్మారెడ్డి, పశువైద్య, పశుసంవర్థక శాఖ సంచాలకులు, తెలంగాణ
సాగు నీటి వసతి పెరిగిన తరువాత తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారింది. వ్యవసాయంతోపాటు అనుబంధరంగాలను కూడా ఆదరించినపుడే రైతులు ఆర్థికంగా ఎదగగలరు. మన రాష్ట్రంలో పశుగ్రాసాల సాగు పెరిగిన తరువాత పాడి పరిశ్రమ ఊపందుకుంది. గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం బాగా సహకారాలు అందిస్తుంది. పెరటికోళ్ళకు కూడా రోజురోజుకు గిరాకి పెరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వీటితోపాటు చేపల పెంపకం కూడా చేపట్టవచ్చు. ఈ విధంగా ఒక్క వ్యవసాయంపైనే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా ఆదరిస్తూ సమగ్ర వ్యవసాయం చేయగలిగితే రైతుల లాభాలు పెరుగుతవని పశుసంవర్థకశాఖ డైరెక్టరు డా|| వి. లక్ష్మారెడ్డి అన్నారు.


రైతు సేవలో ‘రైతునేస్తం’ – యడ్లపల్లి వేంకటేశ్వరరావు, ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ ఛైర్మన్‌
రైతులకు తమకు చేతనయినంతలో చేదోడుగా ఉండాలన్నదే మా లక్ష్యం. ఈ లక్ష్యంతోనే రైతునేస్తం మాసపత్రికను ముద్రించడముతోపాటు యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా రైతులకు ఉపయోగపడే వీడియోలను అందరికీ చేరుస్తున్నాము. రసాయనిక వ్యవసాయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నవి కాబట్టి దానికి పరిష్కారం సేంద్రియ సాగే అని నమ్మి సేంద్రియ సాగును ప్రోత్సహించే లక్ష్యంతో గుంటూరు సమీపములో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్‌లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాము. అది తెలంగాణలోని రైతులకు దూరం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడ శిక్షణా తరగతులు మొదలుపెడితే బాగా ఉంటుందని భావించి నాగరత్నం నాయుడి గారికి తెలియపరచగా వారు వెంటనే స్పందించి అందుకు అంగీకరించటం జరిగింది. నాగరత్నం నాయుడుగారి వ్యవసాయ క్షేత్రం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి శనివారం ఇక్కడ సేంద్రియ సాగుతో పాటు పశుపోషణ, కోళ్ళ పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం, యంత్ర పరికరాల వినియోగం లాంటి వాటిపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. కాబట్టి ఈ ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ ఛైర్మన్‌, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా|| యడ్లపల్లి వేంకటేశ్వరరావు ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయం తక్కువేమీ కాదు… వ్యవసాయమే అసలైనది : ప్రముఖ సేంద్రియ రైతు నాగరత్నం నాయుడు
ఏదైనా ఆగవచ్చు కాని వ్యసాయం ఆగకూడదు అని అందరికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందని, ఇతర రంగాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు మూతబడతాయో నమ్మకం లేదు. వ్యవసాయరంగం ఎప్పుడూ మూతపడదు. మనిషి బ్రతికి ఉన్నంతకాలం వ్యవసాయం కొనసాగవలసిందే కాబట్టి వ్యవసాయం తక్కువ అనే భావనలో ఉన్నవారు వ్యవసాయమే అసలైన వృత్తి అని తెలుసుకుంటున్నారు. ఈ శిక్షణా తరగతులకు మా క్షేత్రాన్ని ఎంపిక చేసుకోవడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని సేంద్రియ రైతు నాగరత్నం నాయుడు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

– డి. ప్రసాద్‌, ‘రైతునేస్తం’ ప్రతినిధి

Read More

జాతీయ వ్యవసాయ ఉన్నత విద్యాపథకం

భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 74 సంవత్సరాలు పూర్తయి, 75వ సంవత్సరంలో అడుగు పెట్టాము. ఈ సమయంలో దేశ జనాభా నాలుగు రెట్లు పెరగ్గా, ఆహార ధాన్యాల లభ్యత ఆరు రెట్లు పెరిగింది, దిగుమతులపై ఆధారపడే స్థితి నుంచి అంతో ఇంతో ఎగుమతులు చేసే స్థితికి దేశం ఎదిగింది. ఇందుకు పగలనక, రాత్రనక శ్రమించే రైతులు, వ్యవసాయ కార్మికులే కారణం. అయితే వారి శ్రమకు ఫలితాన్ని పెంచటానికి వ్యవసాయ శాస్త్రజ్ఞులు, విస్తరణాధికారులు కూడా దోహదపడుతున్నారు. వీరిని తయారు చేసి, శిక్షణనిచ్చే వ్యవసాయ కళాశాలలు విశ్వవిద్యాలయాలు తమ విద్యాప్రమాణాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. భారతదేశంలో వ్యవసాయ విద్యను అందించే విశ్వవిద్యాలయాలు ప్రభుత్వరంగంలో 75 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ, వెటర్నరీ, డెయిరీ, వ్యవసాయ ఇంజనీరింగ్‌, హోమ్‌సైన్స్‌, హార్టికల్చర్‌, ఫారెస్ట్రీ, ఫుడ్‌సైన్స్‌ విద్యనందిస్తున్న విశ్వవిద్యాలయాలు 64 ఉన్నాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో నడుస్తున్న విశ్వవిద్యాలయ హోదా కలిగిన సంస్థలు నాలుగు, కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మూడు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వ్యవసాయ విభాగాలు కల్గినవి నాలుగు ఉన్నాయి. విద్య ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ విభాగాలు కలిగిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు పుట్టగొడుగుల్లా ఆవిర్భవిస్తున్నాయి.


పోటీ ప్రపంచంలో విద్యాప్రమాణాలు
ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో విద్యాప్రమాణాలు పెరుగుతున్నాయి. ఆర్థిక ప్రగతిలో దేశాల మధ్య పోటీ ఉన్నట్లుగానే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశ్వవిద్యాలయాలు తమ స్థానాన్ని మెరగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధినీ, ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు తమ పాఠ్యాంశాలుగా మారుస్తున్నాయి. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటూ, ప్రతిభ గల ఉపాధ్యాయులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి. ఎంత మంచి విశ్వవిద్యాలయంలోనైనా విద్యార్థులు అండర్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌, డాక్టరేట్‌ల కోసం చదవరు. ఒక్కో డిగ్రీని ఒక్కో విశ్వవిద్యాలయం నుండి పొందుతూ, భిన్నమైన దృక్పథాలను ఆకళింపు చేసుకుంటారు. విజ్ఞానాన్ని చదివి, వల్లెవేయటం కాకుండా స్వతంత్రంగా ఆలోచించే శక్తిని సంపాదించుకొని, సమస్యలకు పరిష్కారాలు వెదుకుతారు. కొన్ని దేశాలలోని విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ నిధులతోపాటు, ప్రైవేటు రంగ పెట్టుబడులను కూడా ఆకర్షించగలుగుతున్నాయి. ఆ విశ్వవిద్యాలయాల నుండి డిగ్రీలు పొందిన పూర్వ విద్యార్థులు కూడా భారీగా విరాళాలనిస్తుంటారు. విశ్వవిద్యాలయాల నిర్వహణతోపాటు, పాఠ్యాంశాల మార్పు విషయంలోనూ పూర్తి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. ఫీజుల్ని కూడా అవసరాన్ని బట్టి పెంచుకుంటూ, నిధులకొరత లేకుండా, తమ నాణ్యతా ప్రమాణాలను వృద్ధి చేసుకుంటుంటాయి. మనదేశంలోని విశ్వవిద్యాలయాలు పూర్తిగా ప్రభుత్వ నిధులపై ఆధారపడి ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్‌, అకడమిక్‌ కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటుంది. అరకొర వసతులు, కాలం చెల్లిన పాఠ్యాంశాలు, బోధనా సిబ్బంది నిర్లిప్తత వల్ల నాణ్యతా ప్రమాణాలు స్తబ్దుగా ఉంటున్నాయి. స్థానిక విద్యార్థులకు, స్థానిక ఉపాధ్యాయులకు ప్రాధాన్యతనిచ్చే విధానాల వల్ల అదే విశ్వవిద్యాలయంలో అన్ని డిగ్రీలు పొంది, అక్కడే ఉద్యోగాల్లో చేరటంతో పోటీ పడే శక్తి సన్నగిల్లుతుంది. ఎక్కువమంది ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళే కాని స్వతంత్రంగా పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు అరుదుగా ఉంటున్నారు. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య సంబంధాలు తక్కువగా ఉంటున్నాయి. ఇతర విశ్వవిద్యాలయాల్లో ఉన్న అవలక్షణాలే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కూడా ఉంటున్నాయి. దేశంలో అగ్రస్థానంలో ఉన్న విశ్వవిద్యాలయాలు కూడా ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో తక్కువ స్థానాల్లో ఉంటున్నాయి. దేశం అభివృద్ధి కావాలంటే విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెరగాలి.


ప్రపంచ బ్యాంకు పథకాలు
అభివృద్ధి చెందుతున్న భారత్‌ వంటి దేశాలకు ప్రపంచ బ్యాంకు తక్కువ వడ్డీకి, దీర్ఘకాలంలో తీర్చుకునేలా అభివృద్ధి రుణాలనందిస్తుంది. వ్యవసాయ పరిశోధన, బోధన, విస్తరణలకు కూడా మన దేశానికి ప్రపంచ బ్యాంకు రుణాలనందించింది. మన దేశంలో 126 అగ్రో-ఎకలాజికల్‌ జోన్లు ఉన్నాయి. వాతావరణం, వ్యవసాయ భూముల సారం, నీటి వసతి వంటి అనేక అంశాల ఆధారంగా దేశాన్ని ఈ ‘జోన్లు’గా విభజించారు. వ్యవసాయంలో ఉండే స్థానిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనటానికి ఒక పరిశోధనా స్థానాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని భారత వ్యవసాయ పరిశోధనా మండలి భావిచింది. ‘జాతీయ వ్యవసాయ పరిశోధనా పథకం’ పేరిట దేశంలో ఉన్న 126 జోన్లలోనూ మౌలిక సదుపాయాలు, తగినంత సిబ్బంది కలిగిన పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయటంలో ఈ ప్రపంచ బ్యాంకు ప్రాజక్టు పదేళ్ళ కాలంలో సాయపడింది. దానికి కొనసాగింపుగా ‘జాతీయ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన పథకం’ అమలయింది. దేశాన్ని ఐదు వ్యవసాయ ప్రాంతాలుగా విభజించి, వాటికనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించటానికి ఈ పథకం కృషి చేసింది. నీటి వసతి కల ప్రాంతాలు, వర్షాధార ప్రాంతాలు, సముద్రతీర ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, కొండ ప్రాంతాలుగా విభజించి, వాటికనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించటానికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో ఉన్న పరిశోధనా కేంద్రాలు, వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న పరిశోధనా కేంద్రాలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ పథకంలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలోనూ ‘అగ్రికల్చరల్‌ టెక్నాలజీ మేనేజిమెంట్‌ ఏజన్సి’ (ఆత్మ)లు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ‘నేషనల్‌ అగ్రికల్చరల్‌ ఇన్నోవేషన్‌ ప్రాజక్టు’లో ఒకవైపు పరిశోధనలకు ఊతమిస్తూనే, నిరూపించబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాల్లో పరీక్షించటం, విస్తరించటంపై ఈ పథకం దృష్టి పెట్టింది. అనేక కేంద్రాల్లో ‘అగ్రి-బిజినెస్‌ ఇంకుబేటర్ల’ను ఏర్పాటు చేసి ఔత్సాహికులను చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయటానికి ప్రేరేపించింది. పరిశోధనా రంగంలో ఇలా మూడు పెద్ద ప్రాజక్టులను నిర్వహించారు. విస్తరణను బలపరచటానికి ‘శిక్షణ-విస్తరణ’ (ట్రైనింగ్‌ అండ్‌ విజిట్‌) పథకాన్ని కొన్నాళ్ళ పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించారు. వ్యవసాయ విద్యాబోధనను మెరుగుపరచటానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ‘మానవ వనరుల అభివృద్ధి ప్రణాళిక’లను అమలు జరిపారు.


జాతీయ వ్యవసాయ ఉన్నత విద్యాపథకం
భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ప్రపంచ బ్యాంకు చెరో రూ. 550 కోట్లు కలిపి రూ. 1100 కోట్ల ఉద్దేశించిన పెట్టుబడితో ఈ పథకాన్ని 2018లో ప్రారంభించారు. మూడు దఫాలుగా విశ్వవిద్యాలయాల నుండి ప్రతిపాదనలను ఆహ్వానించి, వాటిలో అర్థవంతమైన వాటిని ఎంపిక చేశారు. ఇప్పటికి 58 విశ్వవిద్యాలయాలను మూడు రకాల ఉపప్రాజెక్టుల క్రింద సహాయాన్నందిస్తున్నారు. త్వరలో మరో నాలుగు విశ్వవిద్యాలయాలకు కూడా మద్దతు లభించనుంది. ఏదో రకంగా మొత్తం 75 వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సహకారాన్ని అందించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కరోనా వల్ల ఈ ప్రాజెక్టులో ఉద్దేశించిన కార్యక్రమాలను పూర్తిగా అమలు జరప లేకపోయారు. 2022లో ముగియాల్సిన ఈ ప్రాజక్టుని మరో రెండేళ్ళు పొడిగించే అవకాశం కన్పిస్తున్నది.


మూడు రకాల ఉపప్రాజక్టులు
18 విశ్వవిద్యాలయాలను ‘సంస్థ అభివృద్ధి పథకం’ పరిధిలోకి తెచ్చారు. ఒక్కో విశ్వవిద్యాలయానికి రూ. 20 నుండి 25 కోట్ల రూపాయల నిధిని సమకూరుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని ‘ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని’ ఈ పథకానికి ఎంపిక చేశారు. వ్యవసాయ, వెటర్నరీ, మత్స్య, ఉద్యానవన, డెయిరీ, హోమ్‌ సైన్స్‌, వ్యవసాయ ఇంజనీరింగ్‌ కోర్సులు చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థుల్ని ఎంపిక చేసి, వారికి ఇతర దేశాల్లోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో మూడు నుండి ఐదు నెలల పాటు శిక్షణనకు పంపిస్తారు. అలాగే ఆ కళాశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులను కూడా కొందరిని ఎంపిక చేసి, వారికి ఇతర దేశాల్లోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో మూడు నుండి ఐదు నెలల పాటు శిక్షణకు పంపిస్తారు. అలాగే ఆ కళాశాల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులను కూడా కొందరిని ఎంపిక చేసి, వారిని కొన్ని అంశాల్లో శిక్షణకు పంపిస్తారు. ఈ పథకం క్రింద ఇప్పటికే కొన్నివేల మంది విద్యార్థులు, కొన్ని వందల మంది ఉపాధ్యాయులు శిక్షణ పొంది వచ్చారు. ఇది కాక, అధునాతనమైన క్లాస్‌ రూములు, ఎలక్ట్రానిక్‌ బ్లాక్‌ బోర్డులు, దృశ్యశ్రవణ మాధ్యమాల్లో విద్యాబోధనకు అవసరమైన సామాగ్రిని సమకూరుస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే నూతన కోర్సులను ప్రారంబిస్తున్నారు. పరిశ్రమలతో విశ్వవిద్యాలయాలను అనుసంధించే కార్యక్రమాలను విస్తృతపరుస్తున్నారు. కొన్ని రకాల పరిశోధనలను నిర్వహించటానికి పరిశ్రమ వర్గాలు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాయి. ప్రతి విశ్వవిద్యాలయంలోనూ ఒకే ‘ఉద్యోగకల్పన’ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్లకు మెరుగైన ఉద్యోగాలు లభించేలా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా వ్యవసాయ రంగ కోర్సులపై ఆసక్తి పెరిగి, ప్రతిభావంతులైన విద్యార్థులు వాటిల్లో చేరేలా చేయాలని సంకల్పం. అలాగే విద్యార్థులు త్వరగా గ్రాడ్యుయేట్లయ్యేలా, వారికి ఆకర్షణీయమైన జీతాలు లభించేలా ఈ పథకం ప్రయత్నిస్తుంది. మహిళలకు, వెనకబడ్డ కులాల విద్యార్థులకు న్యాయమైన వాటా ఉండేలా నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఈ పథకం అమలవుతున్న విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ‘మెరుగైన సంతృప్తి’ని వ్యక్తం చేస్తున్నారు.


మరో 16 విశ్వవిద్యాలయాల్లో ‘సైన్స్‌, టెక్నాలజీలలో ఆధునిక కేంద్రాల’ను ఏర్పాటు చేశారు. కొన్ని జటిల సమస్యలకు పరిష్కారాలు కనుగొని, వాటిని రైతుల క్షేత్రాల్లో ప్రదర్శిస్తున్నారు. పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, డాక్టరేట్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు వారి ఆసక్తి మేరకు కొందరిని ఎంపిక చేసి విదేశీ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ కేంద్రాలొక్కక్కటికి రూ. 15 నుండి 20 కోట్ల వరకు నిధుల్ని సమకూరుస్తున్నారు. ప్రతి భావంతులైన శాస్త్రవేత్తలు కొన్ని నెలల పాటు విదేశీ విశ్వవిద్యాలయాల పరిశోధనా కేంద్రాల్లో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. జంతువుల్ని కోయాల్సిన అవసరం లేకుండా వాటి అవయవ నిర్మాణం, పనితీరులను అభ్యయం చేసేలా 3-డి సాంకేతికత, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (కృత్రిమ మేథ) లను మేళవించి ‘ఎలక్ట్రానిక్‌ డిసెక్షన్‌’ పరిజ్ఞానాన్ని రూపొందించారు.
కొత్తగా ఏర్పాటైన విశ్వవిద్యాలయాలకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి విద్యావిభాగపు గుర్తింపు పొందటానికి అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకోవటానికి రూ. 5 నుండి 10 కోట్ల రూపాయల నిధుల్ని మూడవ పథకం అందిస్తుంది. 24 విశ్వవిద్యాలయాలకు ప్రయోగశాలలు, అధునాతన క్లాసు రూమ్‌లు ఏర్పరచుకునే వీలు కల్పించి, త్వరగా గుర్తింపు పొందేలా ఈ పథకం సహకరించింది. తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు విశ్వవిద్యాలయాలు ఈ పథకం క్రింద లాభపడ్డాయి. దాదాపు అన్ని కొత్త విశ్వవిద్యాలయాలు, త్వరగా గుర్తింపుని పొందటానికి ఈ పథకం సహకరిచింది. దేశంలో వ్యవసాయ రంగ కోర్సులలో విద్యా ప్రమాణాలను పెంచటానికి ‘జాతీయ వ్యవసాయ ఉన్నత విద్యా ప్రాజక్టు’ దోహదపడుతున్నది. ప్రపంచంలోని అత్యుత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో సంబంధాలను పెంచుకొని, విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన విద్య, శిక్షణ కల్పించి, భవిష్యత్‌ అవసరాలకు తగిన విద్యను గడపటానికి ఈ ప్రాజక్టు చేస్తున్న కృషి ఫలవంతమై, దేశపు వ్యవసాయరంగాన్ని పరిపుష్టం చేస్తుందని ఆశిద్దాము.


డా|| కిలారు పూర్ణచంద్రరావు,
ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
(రిటైర్డ్‌ & కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More