మన దేశ జనాభా ఏఏటికాయేడు పెరుగుతూ వస్తుంది. జనాభాతో పాటు నిరుద్యోగుల సంఖ్య కూడా ప్రతి ఏడూ పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా మన దేశంలో వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలకే ఉంది కాని మరే ఇతర రంగాలకు లేదనే విషయం అక్షర సత్యం. కాని ఈ వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలను స్వయం ఉపాధిగా ఎంచుకునే వారు సక్రమంగా ఆదాయం సంపాదించగలుగుతున్నారా? లేదా? అనే విషయాన్ని కక్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లాభాలు రాకపోయినా పరవాలేదు కాని నష్టాలు రాకూడదు. నస్టాలు వచ్చినట్లయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గతాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించగలవు అనుకున్న అనేక వ్యవసాయ అనుబంధరంగాలు ఔత్సాహికులకు నిరాశనే మిగిల్చాయి. అందుకు ఉదాహరణగా ఈము పక్షుల పెంపకాన్ని చెప్పుకోవచ్చు. ఈము పక్షుల పెంపకం ఉపాధి అవకాశం కాగలదని చాలామంది ఇందులో అడుగుపెట్టడం జరిగింది. ఈము పక్షుల పెంపకం ఎక్కువ పెట్టుబడితో కూడుకున్న పని అయినా కాని ఉజ్వల భవిష్యత్తు ఉందని చాలామంది ఈము పక్షుల పెంపకం చేపట్టి మార్కెటింగ్‌ అవకాశాలు లేక ఈము పక్షుల పెంపకం చేపట్టిన వారిలో ఎక్కువ శాతంమంది చేతులు కాల్చుకున్నారు. మొదటలో వీటి పెంపకం చేపట్టిన వారు మాత్రమే గుడ్లను, చిన్న పిల్లలను అమ్మకం చేసుకుని లాభాలు గడించి ఉండవచ్చు కాని మిగతావారందరూ ఆర్థికంగా చాలా నష్టపోయారనే విషయం అందరికి తెలుసు. ఇదేబాటలో అనేక వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే ఔషధ మొక్కల పెంపకం, జీవ ఇంధన పంటలు మొదలగు వాటిలో కూడా యువత, రైతులు నష్టాలను చవిచూశారు, చూస్తున్నారు. కాని ఇంకా, ఇంకా కొత్త పంటలు, కొత్తరంగాల గురించి ఎదురు చూస్తూనే ఉండవలసిన పరిస్థితి మనది. ఈ పరిస్థితిని ఎవరూ మార్చలేము. పరిస్థితిని మార్చలేకపోయినా కాని నష్టాలను తగ్గించుకోగలిగితే కొంతలోకొంత మేలు అనే విషయం ప్రతి ఒక్కరూ అంగీకరించేదే. పుట్టగొడుగుల పెంపకాన్ని ఒక్కసారి గమనిస్తే గత 20 సంవత్సరాల ముందు నుంచే పుట్టగొడుగుల పెంపకం గురించి వింటున్నాము. చాలామంది ఇందులో అడుగుపెట్టి కొనసాగించలేకపోతున్నారు. సరైన కారణాలు ఎవరూ సక్రమంగా వివరించలేకపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా, యువతకు శిక్షణను అందించే లక్ష్యంతో కొర్నెపాడులోని ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టి కొనసాగిస్తున్నాము. వీటి పెంపకం, మార్కెటింగ్‌లో మా అనుభవాన్ని ఇక్కడ వివరిస్తున్నాము.

నిరుద్యోగులకు పుట్టగొడుగుల పెంపకం మంచి ఉపాధి అవకాశంగా ఉంటుందని అధికారులు, నిపుణులు, పుట్టగొడుగుల పెంపకందారులు చెబుతున్నారు. వీటిగురించి తెలుసుకునేందుకు అనేకమంది యువత అవకాశము ఉన్నచోట శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ తీసుకున్న వారిలో కొంతమంది పుట్టగొడుగుల పెంపకాన్ని చేపడుతున్నారు. కాని ఇందులో విజయం సాధించినవారు మాత్రం అతి తక్కువ మంది మాత్రమే ఉంటున్నారు. ఎక్కువ శాతం మంది కొంతకాలం వీటి పెంపకం చేపట్టి వివిధ రకాల కారణాల వలన ప్రక్కకు తప్పుకుంటున్నారు. మరల కొత్త యువత శిక్షణ తీసుకుంటున్నారు. మరలా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి మరియు నష్టాల నుండి బయట పడటానికి మా అనుభవంలో తెలుసుకున్న విషయాలను పాఠకుల ముందుంచుతున్నాం.
పుట్టగొడుగుల పెంపకం గురించి ఇక్కడ విపులంగా వివరించడం లేదు. వాటి పెంపకం గురించి పూర్తి సమాచారం కొరకు యూట్యూబ్‌లో చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. రైతునేస్తం యూట్యూబ్‌ ఛానల్‌లో కూడా వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలు చూసినట్లయితే పుట్టగొడుగుల పెంపకం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
పుట్టగొడుగుల పెంపకంలో ప్రధానంగా రెండు ప్రాసెస్‌లు ఉంటాయి. మొదటి ప్రాసెస్‌లో గడ్డిని సేకరించి ముక్కలుగా చేసుకుని స్టెరిలైజ్‌ చెయ్యడం, ఆరబెట్టడం, వరిగడ్డి, స్పాన్‌ కవర్లలో వేసి ఆ కవర్లను చీకటి గదిలో ఉంచినట్లయితే 21 రోజులలో మైసీలియం అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందిన మైసీలియం బ్యాగులను 21 రోజుల తరువాత చీకటిగదిలో నుంచి తీసి వెలుతురు గదిలో ఉంచాలి. వెలుతురు గది అనేది వీటి పెంపకంలో ఉండే రెండవ ప్రాసెస్‌. మైసీలియం బ్యాగులను మధ్యకు కోసి కేసింగ్‌ మట్టిని పెట్టాలి. కేసింగ్‌మట్టిలో మట్టితో పాటు, కోకోపిట్‌, చాక్‌పౌడర్‌లు కలిపి స్టీమ్‌ చేసి తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మట్టిని కట్‌ చేసిన మైసీలియం బ్యాగులపై పెట్టి వాటిని వెలుతురుగదిలో పెట్టి నీటిని చిలకరిస్తున్నట్లయితే 5 నుంచి 7 రోజులలో వాతావరణం అనుకూలంగా ఉంటే పుట్టగొడుగులు రావటం మొదలవుతుంది. వెలుతురు గదిలో ఉష్ణోగ్రత తగు విధంగా ఉండేలా జాగ్రత్త పడాలి.
పుట్టగొడుగుల పెంపకం యొక్క రెండు ప్రాసెస్‌లు గమనించినట్లయితే మొదటి ప్రాసెస్‌ కొంచెం రిస్కుతో కూడుకొని ఉన్నది మరియు గడ్డి ముక్కలుగా కట్‌ చేయడానికి గాని మరి ఇతర అవసరాలకు గాని యంత్రాలు కొనుగోలు చేసినట్లయితే పెట్టుబడి కూడా ఎక్కువగా అవుతుంది. అన్ని సక్రమంగా జరిగితే కొనసాగించవచ్చు. ఒకవేళ అనుకోని కారణాల వలన పెంపకం నుంచి వెనుదిరిగితే ఎక్కువగా నష్టాలు చవిచూడవలసి వస్తుంది. కాబట్టి కొత్తగా పుట్టగొడుగుల పెంపకం చేపట్టేవారు చీకటిగది ప్రాసెస్‌ చెయ్యకుండా, కేవలం వెలుతురు గది ప్రాసెస్‌తోనే మొదలు పెట్టవచ్చు. అందుకు అనుకూలంగా చీకటి గది ప్రాసెస్‌ చేసిన మైసీలియం బ్యాగులు సరఫరా చేసే వారు అందుబాటులో ఉన్నారు కాబట్టి రెండు మూడు సార్లు చీకటి గది ప్రాసెస్‌ చేసిన మైసీలియం బ్యాగులు కొనుగోలు చేసుకుని కేసింగ్‌ చేసుకుని వెలుతురు గది ప్రాసెస్‌ చేసినట్లయితే అందులో ఉండే సాధకబాధకాలు ప్రత్యక్షంగా చూడడానికి అవకాశం ఉంటుంది. అన్నీ కక్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత తమ స్వీయ అనుభవం తెలుసుకున్న తరువాత నిర్ణయం తీసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే లాభాలు వచ్చినా రాకపోయినా ఎక్కువగా నష్టాలు భరించవలసిన పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. నష్టాలు వచ్చినా కూడా తక్కువగా అంటే 20 వేల రూపాయల లోపు నష్టంతోనే బయటపడవచ్చు.


మేము కూడా మొదటి ప్రాసెస్‌లో అడుగుపెట్టకుండా మైసీలియం బ్యాగులను కొనుగోలు చేసి వెలుతురు గది ప్రాసెస్‌ను మాత్రమే చేపడుతున్నాము. ఇంకా కొంత కాలం పరిశీలించిన తరువాత చీకటి గది ప్రాసెస్‌ను కూడా మొదలు పెడతాము. వెలుతురు గది కోసం సుమారు 300 చదరపు అడుగుల గదిని కేటాయించి అందులో 6 చెక్క స్టాండులను పెట్టాము. ఈ 6 స్టాండులు 300 ఫుల్‌ బ్యాగులు అంటే 600 అర బ్యాగులకు అనుకూలంగా ఉంది. 300 మైసీలియం బ్యాగులను కొనుగోలు చేసుకుని, సొంతంగా స్టెరిలైజ్‌ చేసుకున్న కేసింగ్‌ సాయిల్‌ను ఉపయోగించి కేసింగ్‌ చేసిన అర సంచులను వెలుతురు గదిలో ఉంచి అవసరాన్ని బట్టి నీటిని చిలకరిస్తూ వస్తున్నాము. గదిలో ఉష్ణోగ్రత విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఉష్ణోగ్రత ఎక్కువ అయినపుడు తగ్గించటానికి పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఉష్ణోగ్రత ఎక్కువ అయినప్పుడు అన్ని కిటికీలు, తులపులు కొంచెంసేపు తెరచి ఉంచడంతోపాటు, అవకాశం ఉన్న చోట కిటకీలకు, తలుపులకు వెలుపల వైపు జనపనార గోతాలు వ్రేలాడదీసి తరచుగా నీటిని చల్లుతూ వచ్చాము. ఇలాంటి చర్యలు చేపట్టి ఉష్ణోగ్రతను తగ్గించగలిగాము. కాని చలికాలంలో ఉష్ణోగ్రత బాగా తగ్గినపుడు పెంచడం కొంచెం కష్టంగానే ఉంది. కొందరి సలహా మేరకు రూమ్‌ హీటరును ఏర్పాటు చేశాము కాని పుట్టగొడుగులు మాడిపోవడం గమనించి ఆపి వేశాము. ఇంకొకరి సలహా ప్రకారం రూమ్‌లో స్టీలు లేదా అల్యూమినియం (ప్లాస్టిక్‌ బకెట్‌ వద్దు) బకెట్‌లో నీటిని నింపి ఆ నీటిని ఎలక్ట్రికల్‌ వాటర్‌ హీటర్‌తో వేడి చేస్తుండగా 2 లేదా 3 గంటలలో 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడము గమనించాము. ప్రస్తుతానికి ఈ పద్ధతినే పాటిస్తూ ఉష్ణోగ్రతను పెంచుతూ వస్తున్నాము.

మార్కెటింగ్‌ విషయానికి వస్తే మార్కెట్‌ రిటైల్‌గా కిలో 300/-ల వరకు నడుస్తుంది. హోల్‌సేల్‌లో కిలో 140 నుంచి 180/-లు బల్క్‌, కిలో 200 నుంచి 250/-లు (200 గ్రాముల ప్యాకెట్స్‌) ప్యాకెట్స్‌ నడుస్తుంది. కాని మార్కెట్‌ చేసేవారు నిరంతర సరఫరా అడుగుతున్నారు. రేటు ఏది అయినా కాని నిరంతర సరఫరా అందించగలిగితే మార్కెటింగ్‌ ఇబ్బందులు ఉండకపోవచ్చు అనే విషయం మాకు అర్థం అయ్యింది. కాని నిరంతరం సరఫరా అందివ్వగలగటం అంత సులభం కాదు అని మా అనుభవంలో అర్థం అయ్యింది. నిరంతరం సరఫరా అందివ్వాలంటే పెద్ద మొత్తంలో పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టాలి. వీటికి నిల్వ సామర్థ్యం కూడా 4 నుంచి 6 రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి పెద్ద మొత్తంలో దిగుబడి తీయగలిగితే ఏ విధంగా వినియోగించుకోగలమో ఆలోచించుకోవాలి. సమయానికి అమ్ముకోలేని పుట్టగొడుగులను ఎండబెట్టి డ్రై పుట్టగొడుగులుగా మరియు డ్రై పుట్టగొడుగుల పౌడర్‌గా అమ్ముకోవలసి ఉంటుంది. లేదా పచ్చళ్లు తయారు చేసి అమ్ముకోవలసి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు అవకాశాలు ఉన్నవి. మరిన్ని వివరాలు 98493 12629 కి ఫోను చేసి తెలుసుకోగలరు