భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 74 సంవత్సరాలు పూర్తయి, 75వ సంవత్సరంలో అడుగు పెట్టాము. ఈ సమయంలో దేశ జనాభా నాలుగు రెట్లు పెరగ్గా, ఆహార ధాన్యాల లభ్యత ఆరు రెట్లు పెరిగింది, దిగుమతులపై ఆధారపడే స్థితి నుంచి అంతో ఇంతో ఎగుమతులు చేసే స్థితికి దేశం ఎదిగింది. ఇందుకు పగలనక, రాత్రనక శ్రమించే రైతులు, వ్యవసాయ కార్మికులే కారణం. అయితే వారి శ్రమకు ఫలితాన్ని పెంచటానికి వ్యవసాయ శాస్త్రజ్ఞులు, విస్తరణాధికారులు కూడా దోహదపడుతున్నారు. వీరిని తయారు చేసి, శిక్షణనిచ్చే వ్యవసాయ కళాశాలలు విశ్వవిద్యాలయాలు తమ విద్యాప్రమాణాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. భారతదేశంలో వ్యవసాయ విద్యను అందించే విశ్వవిద్యాలయాలు ప్రభుత్వరంగంలో 75 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ, వెటర్నరీ, డెయిరీ, వ్యవసాయ ఇంజనీరింగ్‌, హోమ్‌సైన్స్‌, హార్టికల్చర్‌, ఫారెస్ట్రీ, ఫుడ్‌సైన్స్‌ విద్యనందిస్తున్న విశ్వవిద్యాలయాలు 64 ఉన్నాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో నడుస్తున్న విశ్వవిద్యాలయ హోదా కలిగిన సంస్థలు నాలుగు, కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మూడు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వ్యవసాయ విభాగాలు కల్గినవి నాలుగు ఉన్నాయి. విద్య ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ విభాగాలు కలిగిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు పుట్టగొడుగుల్లా ఆవిర్భవిస్తున్నాయి.


పోటీ ప్రపంచంలో విద్యాప్రమాణాలు
ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో విద్యాప్రమాణాలు పెరుగుతున్నాయి. ఆర్థిక ప్రగతిలో దేశాల మధ్య పోటీ ఉన్నట్లుగానే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశ్వవిద్యాలయాలు తమ స్థానాన్ని మెరగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధినీ, ఆవిష్కరణలను ఎప్పటికప్పుడు తమ పాఠ్యాంశాలుగా మారుస్తున్నాయి. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటూ, ప్రతిభ గల ఉపాధ్యాయులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి. ఎంత మంచి విశ్వవిద్యాలయంలోనైనా విద్యార్థులు అండర్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌, డాక్టరేట్‌ల కోసం చదవరు. ఒక్కో డిగ్రీని ఒక్కో విశ్వవిద్యాలయం నుండి పొందుతూ, భిన్నమైన దృక్పథాలను ఆకళింపు చేసుకుంటారు. విజ్ఞానాన్ని చదివి, వల్లెవేయటం కాకుండా స్వతంత్రంగా ఆలోచించే శక్తిని సంపాదించుకొని, సమస్యలకు పరిష్కారాలు వెదుకుతారు. కొన్ని దేశాలలోని విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ నిధులతోపాటు, ప్రైవేటు రంగ పెట్టుబడులను కూడా ఆకర్షించగలుగుతున్నాయి. ఆ విశ్వవిద్యాలయాల నుండి డిగ్రీలు పొందిన పూర్వ విద్యార్థులు కూడా భారీగా విరాళాలనిస్తుంటారు. విశ్వవిద్యాలయాల నిర్వహణతోపాటు, పాఠ్యాంశాల మార్పు విషయంలోనూ పూర్తి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. ఫీజుల్ని కూడా అవసరాన్ని బట్టి పెంచుకుంటూ, నిధులకొరత లేకుండా, తమ నాణ్యతా ప్రమాణాలను వృద్ధి చేసుకుంటుంటాయి. మనదేశంలోని విశ్వవిద్యాలయాలు పూర్తిగా ప్రభుత్వ నిధులపై ఆధారపడి ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్‌, అకడమిక్‌ కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటుంది. అరకొర వసతులు, కాలం చెల్లిన పాఠ్యాంశాలు, బోధనా సిబ్బంది నిర్లిప్తత వల్ల నాణ్యతా ప్రమాణాలు స్తబ్దుగా ఉంటున్నాయి. స్థానిక విద్యార్థులకు, స్థానిక ఉపాధ్యాయులకు ప్రాధాన్యతనిచ్చే విధానాల వల్ల అదే విశ్వవిద్యాలయంలో అన్ని డిగ్రీలు పొంది, అక్కడే ఉద్యోగాల్లో చేరటంతో పోటీ పడే శక్తి సన్నగిల్లుతుంది. ఎక్కువమంది ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళే కాని స్వతంత్రంగా పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు అరుదుగా ఉంటున్నారు. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య సంబంధాలు తక్కువగా ఉంటున్నాయి. ఇతర విశ్వవిద్యాలయాల్లో ఉన్న అవలక్షణాలే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కూడా ఉంటున్నాయి. దేశంలో అగ్రస్థానంలో ఉన్న విశ్వవిద్యాలయాలు కూడా ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో తక్కువ స్థానాల్లో ఉంటున్నాయి. దేశం అభివృద్ధి కావాలంటే విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెరగాలి.


ప్రపంచ బ్యాంకు పథకాలు
అభివృద్ధి చెందుతున్న భారత్‌ వంటి దేశాలకు ప్రపంచ బ్యాంకు తక్కువ వడ్డీకి, దీర్ఘకాలంలో తీర్చుకునేలా అభివృద్ధి రుణాలనందిస్తుంది. వ్యవసాయ పరిశోధన, బోధన, విస్తరణలకు కూడా మన దేశానికి ప్రపంచ బ్యాంకు రుణాలనందించింది. మన దేశంలో 126 అగ్రో-ఎకలాజికల్‌ జోన్లు ఉన్నాయి. వాతావరణం, వ్యవసాయ భూముల సారం, నీటి వసతి వంటి అనేక అంశాల ఆధారంగా దేశాన్ని ఈ ‘జోన్లు’గా విభజించారు. వ్యవసాయంలో ఉండే స్థానిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనటానికి ఒక పరిశోధనా స్థానాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని భారత వ్యవసాయ పరిశోధనా మండలి భావిచింది. ‘జాతీయ వ్యవసాయ పరిశోధనా పథకం’ పేరిట దేశంలో ఉన్న 126 జోన్లలోనూ మౌలిక సదుపాయాలు, తగినంత సిబ్బంది కలిగిన పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయటంలో ఈ ప్రపంచ బ్యాంకు ప్రాజక్టు పదేళ్ళ కాలంలో సాయపడింది. దానికి కొనసాగింపుగా ‘జాతీయ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన పథకం’ అమలయింది. దేశాన్ని ఐదు వ్యవసాయ ప్రాంతాలుగా విభజించి, వాటికనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించటానికి ఈ పథకం కృషి చేసింది. నీటి వసతి కల ప్రాంతాలు, వర్షాధార ప్రాంతాలు, సముద్రతీర ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, కొండ ప్రాంతాలుగా విభజించి, వాటికనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించటానికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో ఉన్న పరిశోధనా కేంద్రాలు, వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న పరిశోధనా కేంద్రాలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ పథకంలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలోనూ ‘అగ్రికల్చరల్‌ టెక్నాలజీ మేనేజిమెంట్‌ ఏజన్సి’ (ఆత్మ)లు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ‘నేషనల్‌ అగ్రికల్చరల్‌ ఇన్నోవేషన్‌ ప్రాజక్టు’లో ఒకవైపు పరిశోధనలకు ఊతమిస్తూనే, నిరూపించబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాల్లో పరీక్షించటం, విస్తరించటంపై ఈ పథకం దృష్టి పెట్టింది. అనేక కేంద్రాల్లో ‘అగ్రి-బిజినెస్‌ ఇంకుబేటర్ల’ను ఏర్పాటు చేసి ఔత్సాహికులను చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయటానికి ప్రేరేపించింది. పరిశోధనా రంగంలో ఇలా మూడు పెద్ద ప్రాజక్టులను నిర్వహించారు. విస్తరణను బలపరచటానికి ‘శిక్షణ-విస్తరణ’ (ట్రైనింగ్‌ అండ్‌ విజిట్‌) పథకాన్ని కొన్నాళ్ళ పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించారు. వ్యవసాయ విద్యాబోధనను మెరుగుపరచటానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ‘మానవ వనరుల అభివృద్ధి ప్రణాళిక’లను అమలు జరిపారు.


జాతీయ వ్యవసాయ ఉన్నత విద్యాపథకం
భారత వ్యవసాయ పరిశోధనా మండలి, ప్రపంచ బ్యాంకు చెరో రూ. 550 కోట్లు కలిపి రూ. 1100 కోట్ల ఉద్దేశించిన పెట్టుబడితో ఈ పథకాన్ని 2018లో ప్రారంభించారు. మూడు దఫాలుగా విశ్వవిద్యాలయాల నుండి ప్రతిపాదనలను ఆహ్వానించి, వాటిలో అర్థవంతమైన వాటిని ఎంపిక చేశారు. ఇప్పటికి 58 విశ్వవిద్యాలయాలను మూడు రకాల ఉపప్రాజెక్టుల క్రింద సహాయాన్నందిస్తున్నారు. త్వరలో మరో నాలుగు విశ్వవిద్యాలయాలకు కూడా మద్దతు లభించనుంది. ఏదో రకంగా మొత్తం 75 వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సహకారాన్ని అందించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కరోనా వల్ల ఈ ప్రాజెక్టులో ఉద్దేశించిన కార్యక్రమాలను పూర్తిగా అమలు జరప లేకపోయారు. 2022లో ముగియాల్సిన ఈ ప్రాజక్టుని మరో రెండేళ్ళు పొడిగించే అవకాశం కన్పిస్తున్నది.


మూడు రకాల ఉపప్రాజక్టులు
18 విశ్వవిద్యాలయాలను ‘సంస్థ అభివృద్ధి పథకం’ పరిధిలోకి తెచ్చారు. ఒక్కో విశ్వవిద్యాలయానికి రూ. 20 నుండి 25 కోట్ల రూపాయల నిధిని సమకూరుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని ‘ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని’ ఈ పథకానికి ఎంపిక చేశారు. వ్యవసాయ, వెటర్నరీ, మత్స్య, ఉద్యానవన, డెయిరీ, హోమ్‌ సైన్స్‌, వ్యవసాయ ఇంజనీరింగ్‌ కోర్సులు చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థుల్ని ఎంపిక చేసి, వారికి ఇతర దేశాల్లోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో మూడు నుండి ఐదు నెలల పాటు శిక్షణనకు పంపిస్తారు. అలాగే ఆ కళాశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులను కూడా కొందరిని ఎంపిక చేసి, వారికి ఇతర దేశాల్లోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో మూడు నుండి ఐదు నెలల పాటు శిక్షణకు పంపిస్తారు. అలాగే ఆ కళాశాల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులను కూడా కొందరిని ఎంపిక చేసి, వారిని కొన్ని అంశాల్లో శిక్షణకు పంపిస్తారు. ఈ పథకం క్రింద ఇప్పటికే కొన్నివేల మంది విద్యార్థులు, కొన్ని వందల మంది ఉపాధ్యాయులు శిక్షణ పొంది వచ్చారు. ఇది కాక, అధునాతనమైన క్లాస్‌ రూములు, ఎలక్ట్రానిక్‌ బ్లాక్‌ బోర్డులు, దృశ్యశ్రవణ మాధ్యమాల్లో విద్యాబోధనకు అవసరమైన సామాగ్రిని సమకూరుస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే నూతన కోర్సులను ప్రారంబిస్తున్నారు. పరిశ్రమలతో విశ్వవిద్యాలయాలను అనుసంధించే కార్యక్రమాలను విస్తృతపరుస్తున్నారు. కొన్ని రకాల పరిశోధనలను నిర్వహించటానికి పరిశ్రమ వర్గాలు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాయి. ప్రతి విశ్వవిద్యాలయంలోనూ ఒకే ‘ఉద్యోగకల్పన’ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్లకు మెరుగైన ఉద్యోగాలు లభించేలా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా వ్యవసాయ రంగ కోర్సులపై ఆసక్తి పెరిగి, ప్రతిభావంతులైన విద్యార్థులు వాటిల్లో చేరేలా చేయాలని సంకల్పం. అలాగే విద్యార్థులు త్వరగా గ్రాడ్యుయేట్లయ్యేలా, వారికి ఆకర్షణీయమైన జీతాలు లభించేలా ఈ పథకం ప్రయత్నిస్తుంది. మహిళలకు, వెనకబడ్డ కులాల విద్యార్థులకు న్యాయమైన వాటా ఉండేలా నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఈ పథకం అమలవుతున్న విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ‘మెరుగైన సంతృప్తి’ని వ్యక్తం చేస్తున్నారు.


మరో 16 విశ్వవిద్యాలయాల్లో ‘సైన్స్‌, టెక్నాలజీలలో ఆధునిక కేంద్రాల’ను ఏర్పాటు చేశారు. కొన్ని జటిల సమస్యలకు పరిష్కారాలు కనుగొని, వాటిని రైతుల క్షేత్రాల్లో ప్రదర్శిస్తున్నారు. పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, డాక్టరేట్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు వారి ఆసక్తి మేరకు కొందరిని ఎంపిక చేసి విదేశీ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ కేంద్రాలొక్కక్కటికి రూ. 15 నుండి 20 కోట్ల వరకు నిధుల్ని సమకూరుస్తున్నారు. ప్రతి భావంతులైన శాస్త్రవేత్తలు కొన్ని నెలల పాటు విదేశీ విశ్వవిద్యాలయాల పరిశోధనా కేంద్రాల్లో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. జంతువుల్ని కోయాల్సిన అవసరం లేకుండా వాటి అవయవ నిర్మాణం, పనితీరులను అభ్యయం చేసేలా 3-డి సాంకేతికత, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (కృత్రిమ మేథ) లను మేళవించి ‘ఎలక్ట్రానిక్‌ డిసెక్షన్‌’ పరిజ్ఞానాన్ని రూపొందించారు.
కొత్తగా ఏర్పాటైన విశ్వవిద్యాలయాలకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి విద్యావిభాగపు గుర్తింపు పొందటానికి అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకోవటానికి రూ. 5 నుండి 10 కోట్ల రూపాయల నిధుల్ని మూడవ పథకం అందిస్తుంది. 24 విశ్వవిద్యాలయాలకు ప్రయోగశాలలు, అధునాతన క్లాసు రూమ్‌లు ఏర్పరచుకునే వీలు కల్పించి, త్వరగా గుర్తింపు పొందేలా ఈ పథకం సహకరించింది. తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు విశ్వవిద్యాలయాలు ఈ పథకం క్రింద లాభపడ్డాయి. దాదాపు అన్ని కొత్త విశ్వవిద్యాలయాలు, త్వరగా గుర్తింపుని పొందటానికి ఈ పథకం సహకరిచింది. దేశంలో వ్యవసాయ రంగ కోర్సులలో విద్యా ప్రమాణాలను పెంచటానికి ‘జాతీయ వ్యవసాయ ఉన్నత విద్యా ప్రాజక్టు’ దోహదపడుతున్నది. ప్రపంచంలోని అత్యుత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో సంబంధాలను పెంచుకొని, విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన విద్య, శిక్షణ కల్పించి, భవిష్యత్‌ అవసరాలకు తగిన విద్యను గడపటానికి ఈ ప్రాజక్టు చేస్తున్న కృషి ఫలవంతమై, దేశపు వ్యవసాయరంగాన్ని పరిపుష్టం చేస్తుందని ఆశిద్దాము.


డా|| కిలారు పూర్ణచంద్రరావు,
ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
(రిటైర్డ్‌ & కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608