సాధారణంగా మనకు వాణిజ్య పంటలు అనగానే ప్రత్తి, వరి, మిరప, చెరకు, మొక్కజొన్న లాంటివే గుర్తుకు వస్తుంటవి. అపరాల సాగును పెద్దగా పట్టించుకోరు. పట్టించుకొన్నా కూడా మినుము పంట గురించి ఎక్కువ శ్రద్ధ పెడతారు కాని కంది పంట గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టరు. కంది అనగానే ఏ పంటలు వెయ్యటానికి కుదరని నేలలోనే కందిని వేస్తుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నవి. ప్రధానంగా కదిలో పెద్దగా ఆదాయం లేకపోవచ్చు. దానికి తోడు ఇది దీర్ఘకాలిక పంట. ఇలాంటి కారణాల వలన కందికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత మన రైతులు ఇవ్వడం లేదని చెప్పవచ్చు. ప్రాముఖ్యత పెరగాలంటే కంది పంటలో మెలకువలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని సాగుచేస్తూ కంది సాగు రైతులు గిట్టుబాటుగా మార్చుకోవాలి. రైతుకు గిట్టుబాటు కావాలంటే మంచి దిగుబడి పొంది మంచి ధరకు అమ్ముకోగలిగితే పంటసాగు లాభదాయకంగా ఉంటుంది. సక్రమమయిన మెళకువలు పాటిస్తే కందిలో ఎకరానికి 1100 కిలోల దిగుబడి పొందవచ్చని తన అనుభవం ద్వారా తెలుసుకున్నాడు వికారాబాద్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన నారాయణ.
నారాయణది వ్యవసాయ నేపథ్యం. వీరికి, వీరి పెద్దలకి కంది సాగులో 40 సంవత్సరాలపైగా అనుభవం ఉంది. కందితోపాటు శనగ, పెసర, మినుము, వెల్లుల్లి, అల్లం మొదలగు పంటల సాగులో నారాయణకు అనుభవం ఉంది. నారాయణ 15కు పైగా పశువులను పోషిస్తున్నాడు. వాటి ద్వారా వచ్చిన ఎరువును 9 ఎకరాల పొలానికి అందిస్తుంటాడు. రసాయన పద్ధతులు పాటించిన సందర్భంలో కూడా భూమికి తగినంత పశువుల ఎరువును అందిస్తుండేవాడు. రసాయన పద్ధతులు పాటిస్తున్న నారాయణ సుభాష్ పాలేకర్ సెమినార్‌కి హాజరయ్యి అక్కడ తెలుసుకున్న విషయాలతో తన పంటల సాగును సేంద్రియంలోకి మార్చాలని తలచి రసాయనాలను మానివేసి గత 5 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్ధతులనే పాటిస్తున్నాడు.
దుక్కిలో పశువుల ఎరువుతోపాటు ఘనజీవామృతం అందించి జూన్ మాసంలో బోదెలపై రీసర్చ్ స్టేషన్ నుంచి తెచ్చుకున్న ఎండుతెగులు తట్టుకొనే రకాన్ని జంటసాళ్ళ పద్ధతిలో నాటించాడు. జంటసాళ్ళ మధ్యదూరం 41/2 అడుగులు, సాలుకి సాలుకి మధ్య దూరం 9 అడుగులు పాటించాడు. అంతర పంటగా మినుము పంట వేశాడు. వాతావరణం సక్రమంగా లేనందువలన మినుములో సరైన దిగుబడి పొందలేదు. ప్రస్తుతం అంతర పంటగా కొంత ప్రాంతంలో అల్లం ఉంది. అక్టోబరు, నవంబరు మాసాలలో కొంత ప్రాంతంలో వెల్లుల్లిని అంతర పంటగా వేయాలనుకుంటున్నాడు. అవకాశాన్నిబట్టి జీవామృతాన్ని నేలకు అందించడంతో పాటు పంటపై పిచికారి చేసుకుంటూ వస్తున్నాడు. పంట చిన్న వయస్సులో ఆశించే ఆకుచుట్టు పురుగును వేపనూనెను పిచికారి చేసి నివారించుకున్నాడు. శనగపచ్చ పురుగు నివారణకి ఎన్‌పివి ద్రావణం సొంతంగా తయారు చేసుకుని పిచికారి చేయడంతో పాటు నీమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, థపర్ణి కషాయాల లాంటి వాటిని పిచికారి చేసి నివారించు కుంటున్నాడు. నారాయణ అనుభవం ప్రకారం నీటివసతి వున్నవారు మే నెలలో కంది విత్తనాలు నాటుకోగలిగితే మంచి దిగుబడి వస్తుంది. కందిని నాటే సమయంతో సంబంధం లేకుండా నవంబరు, డిసెంబరు, జనవరి మాసాలలోనే పూతకు వస్తుంది. కందికి పూత సమయములో పంటకు నీరు అందించకూడదు. నీరు అందిస్తే పూత రాలిపోతుంది. పిందె థలో మరియు కాయ థలో నీరు అందించగలిగితే దిగుబడి పెరుగుతుంది. కంది మొక్కల తలలను తుంచి వేయగలిగితే కొమ్మల సంఖ్య పెరిగి దిగుబడి పెరుగుతుందంటున్నాడు. నారాయణ తన పంటలో 60, 90, 120 రోజులకు కంది మొక్క తలలను తుంచుతుంటాడు. కలుపును ఆవుమూత్రం, ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారి చేసి నివారించుకున్నాడు.
కంది మొక్కల తలలు తుంచడం
కంది పంటలో అధిక దిగుబడి పొందాలంటే మొక్కల తలలను తప్పనిసరిగా తుంచాలి. కంది పంట వయస్సు 60 రోజుల సమయంలో కత్తెర సహాయంతో కంది మొక్కల తలలను మొదటిసారిగా తుంచుతుంటాడు. తలతుంచుటం వలన ప్రక్కకొమ్మల సంఖ్య పెరుగుతుంది. మరలా కంది మొక్క వయస్సు 90 రోజులపుడు మరలా రెండవసారి మరియు దీర్ఘకాలం పంట అయితే 120 రోజులపుడు 3వసారి తలలు తుంచాలి. 2వ సారి మరియు 3వ సారి తలలు తుంచటానికి బ్యాటరీ స్ప్రేయరు ఉపయోగిస్తున్నాడు. బ్యాటరీ స్ప్రేయరుకు చిన్న బ్లేడ్ కలిగిన బ్రష్ కట్టర్ లాంటి పరికరాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈ పరికరాన్ని మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నాడు. ఈ పరికరం అన్ని బ్యాటరీ స్ప్రేయర్లకు అనుసంధానం చేసుకోవచ్చు. ఒక మనిషి రోజుకు ఒక ఎకరంలో కంది మొక్కల తలలను తుంచవచ్చని నారాయణ తన అనుభవంలో తెలుసుకున్నాడు.
కలుపు నివారణ కోసం…
150 లీటర్ల నీటిలో 50 లీటర్ల ఆవుమూత్రం, 4 కిలోల ఉప్పు 60 నుండి 100 నిమ్మకాయలు కలిపి ఎకరం పొలంలో కంది పంటపై పడకుండా కలుపు పైన బ్యాటరీ స్పేయరు పిచికారి చేసి కలుపుని నివారించుకున్నాడు. ఈ ద్రావణాన్ని 10 రోజుల విరామంతో 3 సార్లు పిచికారి చేసిన యెడల ఫలితం బాగా ఉంటుందని నారాయణ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు. ఈ ద్రావణం పిచికారి చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. పొరపాటున పంటపై పిచికారి చేసినట్లయితే పంట కూడా మాడిపోతుంది కాబట్టి కేవలం కలుపు మొక్కలపై మాత్రమే పడేలా బ్యాటరీ స్ప్రేయరు యొక్క నాజిల్‌ను ఉపయోగించాడు. అంతర పంటలలో కలుపును మనుషుల సహాయంతో నివారించుకుంటున్నాడు.
పంట కోతను మిషన్‌తో కోయించకుండా మనుషుల సహాయంతో కోయిస్తున్నాడు. నారాయణ తన పంట దిగుబడిలో ఎక్కువ శాతం విత్తనాల కొరకు తోటి రైతులకు అమ్ముతుంటుంటాడు కాబట్టి కల్తీలు నివారించడానికి మనుషుల సహాయంతో కోయిస్తుంటాడు. అన్ని మెళకువలు పాటించి పొందిన కందులను విత్తనాల కొరకు అయితే కిలో 110/-ల చొప్పున అమ్ముతున్నాడు. విత్తనాలకు పనికిరాని కందులను సుమారు కిలో 100/-ల చొప్పున మరియు కొన్ని కందులను కందిపప్పు చేయించి కిలో కందిపప్పు 150/-ల చొప్పున అమ్ముతూ వస్తున్నాడు. అన్ని మెళకువలను శ్రద్ధగా పాటిస్తూ గత పంటకాలంలో ఎకరానికి 1100 కిలోల దిగుబడి పొంది ఎకరానికి లక్ష రూపాయల ఆదాయాన్ని పొందాడు. ఈ సంవత్సరం పంటను గమనించినట్లయితే ఎకరానికి 1200 కిలోల కంటే ఎక్కువ దిగుబడి వచ్చేలా ఉంది. అంతర పంటల ద్వారా వచ్చే ఆదాయం అదనం. పాడి పశువులను పోషిస్తూ నాటు ఆవుల వ్యర్థాలతో జీవామృతం మరియు వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకుంటూ కంది పంటను విజయవంతంగా సేంద్రియంలో సాగు చేస్తూ తన సాగుని లాభాల బాటలో నడిపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9949556911 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

Ramesh v
October 30, 2024Thanks for giving information in telugu