సర్వోన్నత న్యాయమూర్తిగా రైతుబిడ్డ

చెమట చుక్కల సుగంధం

తొలకరి చినుకుల సౌందర్యం

మట్టి వాసన పరిమళం     

పల్లె శ్రమైక జీవన మమకారం

ఆస్వాదించిన ఓ రైతుబిడ్డ జస్టిస్ ఎన్.వి. రమణగా సుపరిచితులయిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ దేశ సర్వోన్నత న్యాయస్థానం సర్వోన్నత న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన ఏప్రియల్ 24 చరిత్రలో మరువరాని రోజు. ఎప్పుడో 1966 జూన్ 30న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేసి తొలి తెలుగుబిడ్డగా చెరగని ముద్ర వేశారు. 55 సంవత్సరాల తరువాత చరిత్రని తిరగరాసి ఇన్నేళ్ళకు మరో తెలుగువారు మరీ ముఖ్యంగా రైతుబిడ్డ రమణ ఆ ఉన్నతపదవి అలంకరించటం ఓ గొప్ప విషయం. కోకా సుబ్బారావు రాజమహేంద్రవరం ముద్దుబిడ్డ కాగా, రమణ అదే రాజమహేంద్రవరం అల్లుడు కావటం యాదృచ్ఛికం.

కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్ట్ 27వ తేదీన రైతుకుటుంబంలో జన్మించారు. తండ్రి గణపతిరావు, తల్లి సరోజని గృహిణి. రమణ బాల్యం పుగాకు సాగుతో ముడిపడి ఉంది. పుగాకు సేద్యం అంటేనే కష్టనష్టాల సాగు. నారుమడులు పోయటం, నారు ప్రధాన పొలంలో నాటటం, ఆ తరువాత ఆకు కోత, ఆకుగుచ్చటం, ఆకు ఎండబెట్టటం, మండె వేయటం, చెక్కులు కట్టటం, వాటిని అమ్మటం, ఆ తరువాత సరుకు కొన్న వ్యాపారస్థుడి దగ్గర నుండి రావల్సిన డబ్బు వసూలు చేసుకోవటం వరకూ ఉండే సాదకబాధకాల సారం బాల్యంలోనే గ్రహించారు. ఆ అనుభవసారం వారి ఎదుగుదలకు పునాది వేసిందని చెప్పవచ్చు.

ఆ రైతు జీవితం నేపధ్యంలోనే విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలతో కళాశాల అధ్యక్షుడయ్యారు. నాగార్జున విశ్వవిద్యాలయ జీవితం ప్రగతిశీల భావాలతో సాగింది. తెలుగు సాహిత్య ప్రభావం వారి ఆలోచనలు, వ్యక్తిత్వం మీద కన్పిస్తోంది. శ్రీశ్రీ, కాళోజీ, దాశరధి, గోపీచంద్, రావిశాస్త్రి, బుచ్చిబాబు, సంజీవదేవ్, దిగంబర కవిత్వంతో పాటు ప్రాచీనాంధ్ర సాహిత్య సౌరభాలను ఆకళింపు చేసుకుని అక్కున చేర్చుకున్నారు. కర్ణాటక సంగీతమంటే చెవులు కోసుకుంటారు. తెలుగు పద్యమంటే ఎనలేని ప్రీతి. వారికి అవధానం ఇష్టమైన ప్రక్రియ. ప్రజా వాగ్గేయకారులు వంగపండు, గద్దర్ పాటలలోని మానవీయ మర్మతను కూడా తన మనసులో నింపుకున్నారు. వీటన్నింటి ప్రభావంతో న్యాయమూర్తిగా ఎన్నో మానవీయ తీర్పులు ఇచ్చినా వీరి సాహిత్య అభినివేశం ముందు అవి మరుగున పడ్డాయి. ఆ తీర్పులను గమనిస్తే వారికి శ్రమవిలువ పట్ల ఉన్న అపారమైన గౌరవం తెలుస్తుంది. మానవ హక్కుల పట్ల మమకారం, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కాపాడాలనే ఆకాంక్ష, మహిళా సాధికారత పట్ల సానుకూలత, ఆర్థిక అసనమానతలు పోవాలనే ప్రగతి దృష్టి దర్శనమిస్తాయి. ఈ క్రమంలో రమణలో మనకు ఆధ్యాత్మిక అభ్యుదయవాది కన్పిస్తారు. సంప్రదాయాలతో, ఆధునిక భావాలు, హేతుబద్ధత కలగలిపి మూర్తీభవించిన స్ఫూర్తి కన్పిస్తోంది. వారి ఆహార్యంలో, నడకలో ఓ తాత్వికత గోచరిస్తుంది. ఒక తత్వవేత్త కన్పిస్తారు.

న్యాయవాది వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగారు. తొలి రోజుల్లో కంఠంనేని రవీందర్ రావు దగ్గర కొద్దినెలలు జూనియర్‌గా పనిచేశారు రమణ. ఆ తరువాత ఏరాసు అయ్యపరెడ్డి వద్ద ఒక దశాబ్దకాలం పాటు జూనియర్ గా చేశారు. 1998 ఏప్రిల్ లో అదనపు అడ్వకేట్ జనరల్ అయ్యారు. 2000 జూన్ 27న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 13 నుంచి మే 20 వరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తిగా పనిచేసి 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, మొన్న ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేశారు.

బాల్యంలో, విద్యార్థిదశలో తాను న్యాయవాదిని అవుతాననీ, న్యాయమూర్తిగా ఎదుగుతాననీ, సర్వోన్నత న్యాయస్థానం సర్వోన్నత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతానని ఊహించి ఉండరు. కానీ రైతు జీవితంలో ఉండే కష్టపడేతత్వంకు రైతు జీవితం నేర్పే క్రమశిక్షణ, కార్యదక్షతలు అండగా నిలిచి ఈ స్థాయికి ఎదిగారు.

రైతుబిడ్డ రమణ భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ, దేశస్వాతంత్ర్య సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతూ భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ‘‘రైతునేస్తం” మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. వారు తెలుగుజాతి కీర్తిని రెపరెపలాడించగలరని విశ్వసిస్తోంది. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

– వేంకటేశ్వరరావు, పద్మశ్రీ పురస్కార గ్రహీత,

‘రైతునేస్తం’ సంపాదకులు

Read More