ఆరోగ్యం, ఆనందం, తృప్తి.. వీటన్నింటికి అవినాభావ సంబంధం ఉంది. వీటన్నింటికి మన జీవనశైలితో విడదీయరాని బంధం ఉంది. జీవనశైలి సరిగ్గా ఉంటేనే అన్ని సరిగ్గా ఉంటవి. లేనట్లయితే జీవితం వ్యర్థం అవుతుంది. జీవనశైలి ఎలా ఉండాలి అనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ప్రస్తుత సమాజాన్ని గమనించినట్లయితే 90 శాతం పైగా ప్రజలు తమ తమ జీవన శైలిని సమర్థించుకొంటూ ఉంటారు అనేది అక్షర సత్యం. ఎవరు దేనిని సమర్థించుకున్నా మన జీవనశైలి అనేది మన ఆరోగ్యాలను కాపాడేదిగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా జీవించగలము. ఈ విషయం కరోనా వలన అందరికీ అర్థం అయ్యి ఉండవచ్చు. ఇంకా అర్థం కాలేదు అంటే వారిని ఎవరూ బాగు చేయలేము. అందుకే మనము ఆరోగ్యం మరియు జీవనశైలి, ఆనందం లాంటి వాటిని గురించి మాట్లాడాలనుకుంటే కరోనా కంటే ముందు, కరోనా తరువాత అని మొదలు పెట్టవచ్చు. కరోనా కంటే ముందు చాలామంది ఆరోగ్యానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వలేదు అని చెప్పవచ్చు. చాలామంది డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవితాలను కొనసాగించారు అని చెప్పవచ్చు. డబ్బు సంపాదన కొరకు తమ ఆరోగ్యాన్ని, కుటుంబాలను ఫణంగా పెట్టినవారు చాలామంది ఉన్నారు. కరోనా సమయంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన తరువాత అర్థం అయ్యింది ఎంత విలువైన వాటిని కోల్పోయారో అని. అంతా అయిపోయిన తరువాత తెలుసుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టే కరోనా తరువాత చాలామందిలో మార్పు వచ్చింది. ఆరోగ్యం విలువ అందరికీ తెలిసి వచ్చింది. డబ్బు ఎంత ఉన్నా కూడా ఆరోగ్యం సక్రమంగా లేకుంటే డబ్బు ఆరోగ్యాన్ని కాపాడలేదని కరోనా సమయంలో చాలామంది ఉదాహరణలు తెలియచెప్పినవి. దాని పర్యవసానమే ప్రస్తుతం చాలామది ఆరోగ్యానికి ప్రాముఖ్యతను ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే జీవన శైలివైపు అడుగులు వేస్తున్నారు. మన ఆరోగ్యం మనం తినే ఆహారం, పీల్చే గాలి, శారీరక శ్రమ, మన ఆలోచనలు, మనశ్శాంతి లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మనం తినే ఆహారం ఎలాంటి విష రసాయనాలు లేకుండా ప్రకృతి సిద్ధంగా పండింది అయి ఉండాలి. పీల్చేగాలి ఎలాంటి కాలుష్యం లేకుండా ఉండాలి. మనం చేసే వృత్తిలో శారీరక శ్రమ ఇమిడి ఉండాలి. విపరీతమై కోర్కెలు పెట్టుకొని అవి ఎలా తీరాలి అనే ఆలోచనలు లేకుండా ఉండాలి. కుటుంబ సభ్యులు మరియు తోటి సమాజంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనశ్శాంతితో జీవించగలగాలి. వీటన్నింటితో పాటు ఇంకా కొన్ని అంశాలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి కాని వాటి పరిష్కారం మన చేతులలో ఉండకపోవచ్చు. మన చేతులలో లేని వాటి గురించి ఎంత ఆలోచించినా ఫలితం ఉండదు. మన చేతులలో ఉన్నవాటిని సక్రమంగా పెట్టుకోవడమే మనం చేయవలసింది. మన చేతులలో ఉన్న వాటికి సరైన పరిష్కారం అడవి వాతావరణంలో జీవనాన్ని కొనసాగించడమే. మరీ అడవి వాతావరణం అంటే ఇబ్బంది కావచ్చు కాబట్టి ప్రస్తుతం ఉన్న కార్లు, సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌, కరెంట్‌ లాంటి సౌకర్యాలను వినియోగించుకుంటూ మన చుట్టు ప్రక్కల ప్రాంతాన్ని అడవిలాగా మార్చుకుంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇది చాలా చాలా తక్కువమందికి సాధ్యం అవుతుంది. అలాంటి అతి తక్కువమందిలో నరసన్న, పద్మావతి దంపతులు మొదటి వరుసలో ఉన్నారు అని చెప్పవచ్చు.
ఉన్నత చదువులు చదివిన నరసన్న మరియు పద్మావతి ఇద్దరు డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో వారిరువురికి పరిచయం అయ్యి ఆ పరిచయం పెళ్ళి వరకు వెళ్ళింది. డిడిఎస్‌లో వీరు శాశ్వత వ్యవసాయం (పెర్మాకల్చర్‌) విధానాన్ని రెండున్నర ఎకరాలలో క్షేత్ర స్థాయిలో అమలు పరిచారు. ఈ విధానం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని గ్రహించి, ఈ విధానాన్ని తోటి రైతులకు తెలియపరచాలంటే సొంతంగా భూమి కొనుగోలు చేసి అందులో పెర్మాకల్చర్‌ విధానాన్ని మొదలుపెట్టి అందరికీ ప్రత్యక్షంగా చూపించగలిగితే ఫలితం బాగా ఉంటుందని గ్రహించి దానినే వారి లక్ష్యంగా నిర్ధారించుకుని 1997వ సంవత్సరంలో జహీరాబాద్‌ సమీపంలో 111/2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి నగరంలో విలాసవంతమైన జీవితం కంటే పొలంలో ఉంటేనే ఆరోగ్యంగా ఆనందగా జీవితాలను కొనసాగించటానికి అనుకూలంగా ఉంటుందని తెలుసు కాబట్టి పొలంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని వివిధ రకాల మొక్కలు నాటటం ప్రారంభించారు.


జీవితమంటే ఉన్నత చదువులు చదవడం, మంచి జీతము వచ్చే ఉద్యోగాలు చేయటమో, ఆర్థికంగా బాగా లాభాలు ఉండే వ్యాపారమో లేదా ఇంకేదైనా వ్యాపకము చేయడమో కాదు. వాటివలన ఎవరికి వారు విలాసంవతమైన జీవితాలను అనుభవించవచ్చు కాని తోటి సమాజానికి పెద్దగా ఫలితం లేకపోగా ఈ ఉరుకుల పరుగుల జీవితములో మనకు తెలియకుండా ఎంతో విలువైన వాటిని కోల్పోవచ్చు. కాబట్టి ఇది సరైన జీవితము కాదు. ఇలాంటి జీవితాలలో విజయం వలన పొందే సంతోషం అందుతుంది. కాని తృప్తిని పొందలేము. ఎందుకనగా ప్రస్తుత సమాజంలో డబ్బు సంపాదన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రకృతిని ఇబ్బంది పెట్టడము లేదా సమాజాన్ని ఇబ్బంది పెట్టడము లేదా ప్రకృతి వనరులను ఎక్కువగా వినియోగించటం లేదా వృథా చేయడం లాంటివి తప్పనిసరిగా ఇమిడి ఉంటవి కాబట్టి వీటిలో వాస్తవమయిన తృప్తి ఉండదు. నిజమైన తృప్తి పొందాలంటే ప్రకృతి నుంచి తక్కువ తీసుకుని ఎక్కువ ఇవ్వాలి అప్పుడే నిజమైన తృప్తి దొరుకుతుంది. అట్టి అవకాశం పెర్మాకల్చర్‌తోనే సాధ్యం అని నమ్మిన ఆదర్శ దంపతులు శాశ్వత వ్యవసాయంను తమ జీవిత లక్ష్యంగా ఎంపిక చేసుకుని అటువైపు అడుగులు వేసి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎదుర్కొంటూ పదకొండున్నర ఎకరాలలో ఒక అడవిని సృష్టించారు.
1997వ సంవత్సరంలో ఈ భూమి కొనుగోలు చేసిన సమయంలో ఈ ప్రాంతం అంతా మనుషులు తిరగటానికి కూడా అనుకూలంగా లేకుండా ఉండేది. నేల కూడా అంత బలమైన నేల కాదు. కొంత లోతు వరకే మట్టి ఉంది. లోపల అంతారాయిగా ఉండేది. అలాంటి నేలను సాగుకు మరియు నివాసానికి అనుకూలంగా మార్చడం ఒక యజ్ఞం లాంటిదే అయినా కాని నరసన్న, పద్మ దంపతులు ఒకరికొరకు తోడుగా ఉంటూ నేలను అనుకూలంగా మార్చడము ప్రారంభించారు. అవసరమయిన చెట్లను ఉంచి కొత్తగా వీరు వివిధ రకాల మొక్కలను, విత్తనాలను ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఒక్క చెట్టు పెట్టితే ఆ చెట్టుకు వచ్చిన పండ్లు తిన్న పకక్షులు రెట్టల ద్వారా వేసిన విత్తనాల ద్వారా మొలసిన చెట్లే ఎక్కువగా ఉన్నవి. ఉదాహరణకు సీతాఫలం, బొప్పాయి, చింత మొదలగు చాలా రకాల చెట్లు 60 శాతానికి పైగా ప్రకృతి సిద్ధంగా మొలసినవే ప్రస్తుతానికి పెద్ద పెద్ద వృక్షాలు అయినవి. కేవలం రెండు ఎకరాల పొలాన్ని వివిధ రకాల పంటలు అనగా సజ్జ, జొన్న, పెసర, మినుము, కంది, వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు పండించటానికి ఉంది. మిగతా పొలం అంతా కూడా చెట్లతో నిండి ఒక అడవిలాగా తయారు చేశారు. ఈ పొలంలో చేసేది తక్కువ పొందేది ఎక్కువ. పండ్ల మొక్కలకు ఎలాంటి పనులు చెయ్యరు. కేవలం దిగుబడిని పొందుతుంటారు. పెసర, మినుము, కంది లాంటి పంటలు మరియు వివిధ రకాల కూరగాయలలో కేవలం కలుపుని నివారిస్తుంటారు. అంతకు మించి ఏమీ చెయ్యరు. దిగుబడి గురించి ప్రాకులాడకుండా వచ్చిన దిగుబడితో తృప్తి పొందుతుంటారు. ఎలాంటి కషాయాలు, మిశ్రమాలు, ద్రావణాలు ఉపయోగించరు. మొక్కలను ప్రకృతి సిద్ధంగా పెరిగేందుకు అవకాశం ఇస్తే వాటి బాగోగులు ప్రకృతే చూసుకుంటుంది అనే విషయాన్ని బాగా అవగాహన చేసుకుంటున్నారు. అడవిలో ఏ విధంగా పెద్ద చెట్ల కింద చిన్న చిన్న మొక్కలు మనుగడ సాధిస్తుంటాయో అదే విధంగా పెద్ద పెద్ద చెట్ల క్రింద పసుపు, అల్లం, బచ్చలి, బొప్పాయి లాంటి మొక్కలు వాటంతటవే పెరుగుతుండటం ఇక్కడ గమనించవచ్చు.
పెర్మాకల్చర్‌ గురించి ప్రతి నెల ఇక్కడ శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటారు. ఈ శిక్షణా తరగతులకు మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఔత్సాహికులు హాజరవుతుంటారు. శిక్షణా తరగతులకు వచ్చిన వారికి ప్రకృతి ఒడిలో నివాసం ఏర్పాటు చేయటంతో పాటు ఈ పొలంలో పండిన పంటలతోనే ఆహారాన్ని అందిస్తుంటారు. బయట నుంచి అతి తక్కువగా కొనుగోలు చేస్తూ మిగతావి అన్ని కూడా తామే సొంతంగా పండించిన వాటితో తమ ఆహార అవసరాలు తీర్చుకుంటుంటారు. నరసన్న, పద్మలకు ఇద్దరు సంతానం. వారు కూడా ఉన్నత చతువులు చదివి అమెరికాలో కొద్దికాలం ఉన్న తరువాత తిరిగి వచ్చి తల్లిదండ్రులతో కలసి ఉంటూ పెర్మాకల్చర్‌ ఫామ్‌లో తమ వంతు పాత్రను పోషించడంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల రైతులకు, మహిళలకు వ్యవసాయంపై, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ ఇక్కడ (అడవిలోనే) అవసరమయిన సౌకర్యాలతో నివాసం ఉంటూ, ఆరోగ్యంగా, ఆనందంగా సంతోషంగా, తృప్తిగా జీవితాలని కొనసాగిస్తున్నారు.

అమెరికా కంటే అరణ్యంలోనే తృప్తి: – స్నేహ, నరసన్న కుమార్తె


ప్రస్తుతం మన సమాజంలో గమనించినట్లయితే చదువుకున్న యువతీయువకులలో ఎక్కువమంది లక్ష్యం అమెరికా వెళ్ళాలని ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు ఇంకొంచెం ముందడుగువేసి అమెరికాలో ఉండే అబ్బాయిని అయితే లేదా పెళ్ళి అయిన తరువాత అమెరికా వెళ్తామంటేనే పెళ్ళి చేసుకుంటాము అనేవాళ్ళు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. మన యువతకు అమెరికా అంటే అంత పిచ్చిగా మారింది. అమెరికా వీసాకొరకు ఎన్నో పూజలు చేసిన వారు కూడా ఉన్నారు అనడములో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పరిస్థితులు నెలకొన్న నేటి పరిస్థితిలో నరసన్న కుమార్తె స్నేహ ఇక్కడ డిగ్రీ వరకు చదివి ఉన్నత విద్య కొరకు అమెరికా వెళ్ళి అక్కడ విద్య పూర్తి చేసి కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి తన లక్ష్యం తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ ఫెర్మాకల్చర్‌ని విస్తృత పరచడం కాబట్టి మంచి ఉద్యోగాన్ని వదలి ఇండియా తిరిగి వచ్చి తమ అరణ్యంలో నివాసం ఉంటూ అమెరికా కంటే అరణ్యంలోనే బెటర్‌ అని అంటున్నారు. ఇక్కడ తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ, పెర్మాకల్చర్‌ శిక్షణా తరగతులు తీసుకుంటూ చుట్టుప్రక్కల ప్రాంతాల రైతులకు ఈ పెర్మాకల్చర్‌పై అవగాహన కల్పించడంతో పాటు మహిళకు ఆరోగ్యం మరియు పోషకాహార విషయంలో అవగాహన కల్పిస్తూ ఆనందంగా, తృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

శాశ్వత వ్యవసాయమే సరైన వ్యవసాయం

హరిత విప్లవం వచ్చిన తరువాత మన రైతులు చాలామంది ఏక పంట విధానానికి అలవాటు పడ్డారు. ఏక పంట విధానం వలన అనేక ఇబ్బందులు ఉంటాయి. జీవవైవిధ్యం దెబ్బతింటుంది. రసాయనాలు ఎక్కువగా ఉపయోగించవలసి వస్తుంది. కాబట్టి ఏక పంట విధానం ఎప్పటికీ సక్రమం కాదు. కాని రైతులు తమ పరిస్థితుల వలన ఏక పంట విధానానికి అలవాటు పడ్డారు. అది తప్పు కాదు. ఎవరి పరిస్థితులు వారివి. కాని సరైన వ్యవసాయం అంటే శాశ్వత వ్యవసాయం. శాశ్వత వ్యవసాయంలో పండ్ల మొక్కలు, చెట్లు కూడా ఉంటాయి కాబట్టి కుటుంబానికి అవసరమైన ఆహారంలో చాలా వరకు సొంతంగా పండించుకోవటానికి అవకాశం ఉంటుంది. రైతు తన ఆహారాన్ని తానే సొంతంగా పండించుకోవడమే సరైన వ్యవసాయం. అది ఈ శాశ్వత వ్యవసాయంలో కుదురుతుంది కాబట్టి శాశ్వత వ్యవసాయమే సరైన వ్యవసాయం అని నరసన్న, పద్మ అంటున్నారు.

తక్కువ ఖర్చుతో తాత్కాలిక నివాస సౌకర్యం
ఇక్కడ శిక్షణ గురించి వచ్చే వారికి నివాసం కొరకు ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో నివాస సౌకర్యాలనిస్తుంటారు. చిన్న చిన్న టెంట్ల లాంటివి ఏర్పాటు చేస్తారు. ఈ టెంట్లను వేసవి కాలంలో చెట్ల క్రింద ఏర్పాటు చేసుకోవచ్చు. చలికాలంలో మరియు వర్షాకాలంలో రేకుల కింద ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ టెంట్లు ఒక చోట నుండి ఇంకొక ప్రాంతానికి ఇబ్బంది లేకుండా ఒక సంచి లాగా తీసుకెళ్ళవచ్చు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే నివాసాలని వారు ఇక్కడ ఏర్పాటు చేశారు.

మరిన్ని వివరాలు 9440826722 కి ఫోను చేసి తెలుసుకోగలరు.