ఏరువాక… ఏరువాక….
ఏరువాక…. రైతుల తొలి పండగ.
గతంలో ఎన్నడూ లేనంతగా ఈ పండగకు ప్రాచుర్యం పెరిగింది. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ప్రధాన స్రవంతి పత్రికలు కూడా ఏరువాక పండుగ ఔన్నత్యం, ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా వార్తలు రాశాయి. ఏరువాక ఒక్క రైతుల పండుగే కాదు. అది జాతికంతా బతుకునిచ్చే పర్వదినం. సమాజాన్ని బతికించే వెలుగువాక. కష్టనష్టాలు అధిగమించి, పంటకు ప్రాణం పోసే రైతు కొత్త ఆశలకు పురుడుపోసే పబ్బం. తొలకరి చినుకుల పలకరింతతో సమాజానికి అన్నంపెట్టే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుటమే ఏరువాక. వ్యవసాయానికి సంబంధించిన పండగే ఏరువాక.
తొలకరి వస్తే రైతు పులకరిస్తాడు. ఏరువాక సాగుతాడు. మేఘాలు ఆనందంతో వర్షిస్తే, రైతు మెతుకురాగం ఎత్తుకుంటాడు. సమాజం ఆకలి తీర్చటానికి పునాది వేస్తాడు. వైశాఖం ముగిసి జ్యేష్టం ప్రారంభమయిన తరువాత వర్షాలు కురవటం మొదలవుతాయి. ఒక వారం అటు ఇటు అయినా జ్యేష్ట పౌర్ణమి నాటికి తొలకరి చినుకు పడక మానదు. దీనితో భూమి మెత్తబడక మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయ పనులకు ఇది శుభారంభం. ప్రారంభమైన శుభారంభం జోరందుకోవాలి. దీనికోసం ముందుగా వరుణదేవుడి కరుణ కావాలి. ఈ ఏరువాక జోరువాక కావాలంటే నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండాలి. ఇంతవరకు పలకరింపే కాని జోరందుకోలేదు. పలకరింపు కోటి ఆశలు రేకెత్తించగా వర్షాల కోసం ఎదురుచూపులతో రైతులోకంలో అప్పుడే నిరాశ మొలకలు చిగురిస్తున్నాయి. నైరుతి జోరు పెరిగితేనే పొలం పనులు ఊపందుకుంటాయి. జులై మొదటి పక్షం నైరుతిని బట్టి సాగు పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నుంచి వాతావరణం పోకడననుసరించి ఆశనిరాశల పోరాటం ప్రారంభమవుతుంది. ఇప్పటికే రైతులు కావలసిన వనరులు అన్నింటిని సమకూర్చుకొని సాగుకు సిద్ధంగా ఉన్నారు. రుతుపవనాలు జోరందుకుంటే పొలం పనులు ఊపందుకుంటాయి.
గత పంటకాలం ఉత్పత్తుల మార్కెటింగ్‌లో రైతులు సవాలక్ష ఇబ్బందులు పడ్డారు. కరోనాతో రవాణా సౌకర్యాలు లేక పండ్ల రైతులు అష్టకష్టాలు పడ్డారు. ధరలు గిట్టుబాటు కాక మిరప, శనగల నిల్వలు శీతల గిడ్డంగులలో పేరుకుపోయాయి. ఈ అననుకూలతల మధ్య రైతులు ఈ పంటకాలానికి శ్రమయాగం ప్రారంభించారు. ఇప్పటికీ కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఆ నీలినీడలు పూర్తిగా తొలగిపోలేదు. అయినా బతుకుపోరులో ఏరువాక సాగకతప్పదు.
ఇప్పుడిప్పుడే అక్కడక్కడ మెరుపులు ఉరుములతో నైరుతీ నాట్యం మొదలయిందని, సేద్యపనులు ఊపందుకున్నాయని, రైతులు జోరుగా పొలం పనులు ప్రారంభించారని తెలుస్తోంది. ఈ వర్షపు జల్లు జోరు ఊపు కొనసాగాల్సిన అవసరముంది. అక్కడక్కడ చెదురుమదురుగా ఉన్న నైరుతి వేగంగా విస్తరిస్తేనే పంటకాలానికి ప్రాణం పోస్తోంది. ఈ నైరుతీ నైరాశ్యం మిగల్చకుండా, తొలకరి పలకరింపుతో రైతులలో చిగురించిన కోటి ఆశల పలకరింపు విజయతీరాలకు చేర్చాలని ‘రైతునేస్తం’ కోరుకుంటోంది. పంటకాలం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లి, రైతుల నికరాదాయం పెరగాలి. ఏరువాక ప్రారంభ జోరు పంటకాలం కడదాకా కొనసాగాలి. కరోనా మహమ్మారితో వచ్చిన నష్టాలను ఏరువాక జోరువాకతో అధిగమించి వ్యవసాయం సజావుగా సాగాలి. ఆ దిశగా ఏరువాక సాగి రైతుల ఆశలు సఫలం కావాలి.
- వేంకటేశ్వరరావు
ఎడిటర్ – రైతునేస్తం
