ముందుగా, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి రసాయన ఎరువులు, పెస్టిసైడ్స్‌ వాడకుండా తక్కువ దిగుబడులు వచ్చినా, కలుపు తీతకు కూలీల సమస్య ఉన్నా, కలుపునివారిణులు వాడకుండా డబ్బు ఖర్చు చేసుకుంటూ, స్వయంగా మార్కెట్‌ చేసుకుంటూ, వాటిలో కూడా నష్టాలను భరిస్తూ ఆరోగ్యకరమైన తిండిని కొందరు వినియోగదారులకు అయినా చేరేలా చేస్తున్న ప్రకృతి వ్యవసాయ రైతులకు, సేంద్రియ వ్యవసాయదారులకు నా కృతజ్ఞతలు.


ఇప్పుడు అత్యధిక జనాభాకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల గురించి అవగాహన ఉంది కానీ, ప్రతి ఒక్కరికి అవి చేరువలో లేవు. ఒకవేళ దేశం మొత్తం సేంద్రియ వ్యవసాయం చేపట్టినా దేశంలో అందరికీ ఆహారం సరిపోదని, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆహార మరియు పౌరసరఫరాల మంత్రిత్వశాఖ అధికారుల అంచనా.


నిజమే! అస్థిరమైన ఆహార పదార్థాల ధరలు, అనవసర అధిక ధాన్యాల ఉత్పత్తి, అధిక జనాభా వృద్ధిరేటు, ప్రతి ఇంటా జరిగే ఆహార పదార్థాల దుర్వినియోగం, అవసరమైన పంటలు మార్కెట్‌ కు అనుకూలంగా పండించుకునే వెసులుబాటు రైతులకు లేకపోవడం, అసలు మార్కెట్‌ మొత్తం రైతుల వెన్ను విరిచి ఉత్పత్తులను దండుకునే వ్యవస్థలు, దళారుల దౌర్జన్యం, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన లేకపోవడం, ప్రభుత్వం మద్దతు ధర ఆశ చూపించి రైతులను అప్పుల్లోకి తోసేయడం, ప్రతి సంవత్సరం పెరగడమే గానీ, తరగని రైతుల ఆత్మహత్యలు.


డొల్ల రాజకీయ విధానాలు
ఇవేమీ లెక్కల్లోకి తీసుకోకుండా, బయట వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా కేవలం పుస్తక జ్ఞానంతోనే చెప్పే వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్లేషకుల ప్రకారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మీద ఈ దేశం అసలు బ్రతకలేదు.


అయ్యా! వ్యవసాయ శాస్త్రవేత్తల్లారా. మీ విజ్ఞానాన్ని కించపరచాలని నా ఉద్దేశ్యం కాదు. ఏదైనా తప్పు రాస్తే క్షమించండి. అహర్నిశలు శ్రమించి రసాయన వ్యవసాయ పద్ధతులతో రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నడుపుతున్న గొప్ప విజ్ఞానం కల వ్యక్తులు మీరు. కానీ, మీ విజ్ఞానం ఎరువులు, పురుగుమందుల కంపనీల అభివృద్ధికి, రసాయన అవశేషాలతో సారవంతమైన భూములు, బంజరు భూములుగా మారడానికి, పెట్టుబడి అప్పుల వలలో పడి రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతుంది.


మన దేశంలో చిన్న కమతాలు గల రైతులు ఎక్కువ. వారు ప్రకృతి వ్యవసాయం చేయదలిస్తే ఓ గుంపుగా ఏర్పడి వ్యవసాయం చేస్తూ సమిష్టిగా మార్కెటింగ్‌ చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


విత్తనాలు రైతులే ఉత్పత్తి చేసుకోవాలి. ఒకే పద్ధతిలో కాకుండా భూసారాన్ని పెంచే ఇతర సేంద్రియ వ్యవసాయ పద్దతుల గురించి రైతులే తెలుసుకుని స్వయంగా పరిశోధనలు చేసుకోవాలి. దేశీ వంగడాలను కాపాడుకోవాలి. ఔత్సాహిక రైతులు, శాస్త్రవేత్తలు సేంద్రియ వ్యవసాయ విధానాలతో కొత్త రకం వంగడాలను స్వయంగా ఉత్పత్తి చేయాలి. అవి రసాయన ఎరువులపై, పెస్టిసైడ్లపై ఆధారపడకుండా ప్రకృతి సిద్ధంగా పండే పంటలను చేతికందించే విత్తనాలు కావాలి.
వినియోగదారుల నుండి కూడా ప్రకృతి పట్ల అవగాహన రావాలి. ఎవరికి వారు పెరటి స్థలాల్లో, డాబాలపై, ఖాళీ స్థలాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకు తింటే వ్యవసాయ భూములపై ఈ పంటలు పండించాల్సిన భారం తగ్గుతుంది. స్వయంగా వినియోగదారులే ఆహారాన్ని సమకూర్చే అడవులును సెంటు స్థలం దొరికినా ఏర్పాటు చేసుకోవాలి.
తద్వారా మనం స్వయంగా ఉత్పత్తి చేసుకుని పండించలేని ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ప్రాంతీయంగా మాత్రమే పండే సుగంధ ద్రవ్యాలు వినియోగదారుల డిమాండ్‌ మేరకు ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లోనే రైతులు పండిస్తారు.


అప్పుడు చాలా శాతం భూమి మిగలవచ్చు. ప్రభుత్వం చర్యలు తీసుకుని మరలా అడవులుగా ఆ స్థలాలను పునరుద్ధరణ చేయవచ్చు. తద్వారా భవిష్యత్తులో అడవులను, అడవి జంతువులను కాపాడవచ్చు.

”డబ్బు సంపాదిస్తున్నాం కదా.! కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పెరటిలో, డాబాలపై మిద్దెతోటలు నిర్మించుకుని, అందమైన లాన్లను, ఫ్లోరింగ్లను, గోల్ఫ్‌ కోర్ట్‌ వంటి విలాస ఆటలను పాడు చేసుకుని పండించుకుని తినాల్సిన ఖర్మ మాకేంటి? డబ్బులు విసిరేస్తే బోలెడు పండ్లు, కూరగాయలు కొనుక్కుని తినవచ్చు.” అని మీరు అనుకోవచ్చు.
అలా అనేవారు భూగ్రహ వినాశనానికి ఫ్యాక్టరీలు, ప్లాస్టిక్‌, కాలుష్యాల కంటే తామే మొదటి కారకులమని గ్రహించాలి.

తుమ్మూరి లక్ష్మీనారాయణ, B.Sc. (Ag.)