పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా పొగాకు కషాయం రైతులకు వివిధ పంటలలో పురుగుల నియంత్రణ కొరకు ఉపయోగపడుతుంది.
- పొగాకులో “నికోటిన్” మూలపదార్థంగా ఉండడం వలన ఇది పురుగులను స్పర్శ చర్య ద్వారా నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
- పొగాకు కషాయం పంటలలో వచ్చే పేనుబంక, పచ్చ దోమ, తెల్లదోమ నివారణకు ఉపయోగపడుతుంది.
కావలసిన పదార్ధాలు
పొగాకు రద్దు : 1 కిలో (చిన్నచిన్న ఆకులు, కాడలు మొ॥)
సబ్బు పొడి : 100 గ్రాములు (లేదా)
కుంకుడు కాయలు : 500 గ్రాములు
తయారు చేసే విధానం
- పొగాకు రద్దును 10 లీటర్ల నీటిలో అరగంట నుండి గంట సేపు బాగా ఉడక బెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ద్రావణం సుమారు 5 లీ. వరకు ఉంటుంది.
- కషాయాన్ని ఒక కర్రతో కలియబెడుతూ ఉండాలి.
- కషాయాన్ని బాగా చల్లార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి.
- కషాయానికి 100 గ్రాముల సబ్బుపొడినిగానీ లేదా అరకిలో కుంకుడుకాయల రసాన్ని కానీ కలపాలి.
- పై కషాయానికి 100 లీటర్ల నీటిని చేర్చి, ఒక ఎకరా పొలంలో సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.
జాగ్రత్తలు:
- పొగాకు కషాయం తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
- పొగాకు కషాయం పిచికారి చేసేటపుడు వంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
- పంట కాలంలో ఒకటి, రెండు సార్లు మాత్రమే అవసరాన్ని బట్టి పంటపై పిచికారీ చేయాలి.
- ఎక్కువ సార్లు పిచికారీ చేసిన ఎడ… పంటలను ఆశించి వుండే రైతుమిత్ర పురుగులు చనిపోయే ప్రమాదం ఉంది.
- తయారు చేసిన ద్రావణాన్ని వెంటనే ఉపయోగించాలి. కషాయాన్ని నిల్వ ఉంచరాదు.

