భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) ఆధ్వర్యంలోని కేంద్ర వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (ICAR-CIAE), భోపాల్ శాస్త్రవేత్తలు పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు చిన్న స్థాయి మరియు పైలట్ స్థాయి బయోచార్ యూనిట్లను అభివృద్ధి చేశారు. పైలట్ ప్లాంట్‌లో ఒక్క సారి సుమారు 300 కిలోల పంట అవశేషాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది. ఇందులో బయోమాస్‌ను ఇంధనంగా ఉపయోగించి రియాక్టర్‌ను పరోక్షంగా వేడి చేస్తారు. బ్లోయర్ సహాయంతో దహన ప్రక్రియను కొనసాగిస్తారు. ఫర్నేస్‌ను అగ్నినిరోధక ఇటుకలతో నిర్మించగా, ఉష్ణోగ్రత సుమారు 350°C వరకు చేరుతుంది. ఈ విధానంలో సుమారు 33% బయోచార్ లభిస్తుంది. ఈ యూనిట్ ధర సుమారు రూ. 2.0-2.5 లక్షలు.
ఈ సాంకేతికత ద్వారా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చకుండా నాణ్యమైన బయోచార్‌గా మార్చి, నేల సేంద్రియ కార్బన్‌ను పెంచడంతో పాటు గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామీణ వ్యవసాయ సేవా కేంద్రాల ద్వారా ఈ యూనిట్ల వినియోగాన్ని విస్తరించడం ద్వారా స్థిరమైన, వాతావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించవచ్చు.
డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921
పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా పొగాకు కషాయం రైతులకు వివిధ పంటలలో పురుగుల నియంత్రణ కొరకు ఉపయోగపడుతుంది.
పొగాకులో “నికోటిన్” మూలపదార్థంగా ఉండడం వలన ఇది పురుగులను స్పర్శ చర్య ద్వారా నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
పొగాకు కషాయం పంటలలో వచ్చే పేనుబంక, పచ్చ దోమ, తెల్లదోమ నివారణకు ఉపయోగపడుతుంది.
కావలసిన పదార్ధాలు పొగాకు రద్దు : 1 కిలో (చిన్నచిన్న ఆకులు, కాడలు మొ॥) సబ్బు పొడి : 100 గ్రాములు (లేదా) కుంకుడు కాయలు : 500 గ్రాములు
తయారు చేసే విధానం
పొగాకు రద్దును 10 లీటర్ల నీటిలో అరగంట నుండి గంట సేపు బాగా ఉడక బెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ద్రావణం సుమారు 5 లీ. వరకు ఉంటుంది.
కషాయాన్ని ఒక కర్రతో కలియబెడుతూ ఉండాలి.
కషాయాన్ని బాగా చల్లార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి.
కషాయానికి 100 గ్రాముల సబ్బుపొడినిగానీ లేదా అరకిలో కుంకుడుకాయల రసాన్ని కానీ కలపాలి.
పై కషాయానికి 100 లీటర్ల నీటిని చేర్చి, ఒక ఎకరా పొలంలో సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.
జాగ్రత్తలు:
పొగాకు కషాయం తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
పొగాకు కషాయం పిచికారి చేసేటపుడు వంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
పంట కాలంలో ఒకటి, రెండు సార్లు మాత్రమే అవసరాన్ని బట్టి పంటపై పిచికారీ చేయాలి.
ఎక్కువ సార్లు పిచికారీ చేసిన ఎడ… పంటలను ఆశించి వుండే రైతుమిత్ర పురుగులు చనిపోయే ప్రమాదం ఉంది.
తయారు చేసిన ద్రావణాన్ని వెంటనే ఉపయోగించాలి. కషాయాన్ని నిల్వ ఉంచరాదు.
పశువైద్యులుగా మనకు లభించిన విద్య, అనుభవం, నైపుణ్యాలను మూగజీవుల ఆరోగ్యం కోసం ఉపయోగించడం ఒక గొప్ప బాధ్యత. అదే సేవను కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో గోసేవగా అందించే అవకాశం లభిస్తే, అది ఒక వృత్తిపరమైన అనుభవం మాత్రమే కాదు—జీవితాంతం గుర్తుండిపోయే ఆధ్యాత్మిక అనుభూతి.
తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “శ్రీవారి వైద్య సేవ (Sri Vari Vaidya Seva)” పశువైద్యులకు అలాంటి అపూర్వమైన అవకాశాన్ని కల్పిస్తోంది.
శ్రీవారి సన్నిధిలో పశుసేవ – ఒక గొప్ప భాగ్యం
శ్రీవారి వైద్య సేవ ద్వారా పశువైద్యులు TTD ఆధ్వర్యంలోని గోశాలల్లో పశువులకు వైద్య సేవలు అందించే అవకాశం పొందుతున్నారు.
పశువైద్య వృత్తిలో మనం ప్రతిరోజూ పశువులకు చికిత్స చేస్తూనే ఉంటాం. అయితే, తిరుమల శ్రీవారి సన్నిధిలో, గోమాతలకు సేవ చేయడం మన వృత్తికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పరిమళాన్ని అందిస్తుంది.
“గోసేవ – గోవింద సేవ” అనే భావనతో పనిచేస్తూ, గోమాత ఆరోగ్య పరిరక్షణలో మన వంతు పాత్ర పోషించడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. శ్రీవారి వైద్య సేవకు ప్రొఫైల్ నమోదు ఈ సేవలో పాల్గొనాలనుకునే అర్హత కలిగిన పశువైద్యులు ముందుగా TTD వెబ్‌సైట్/యాప్ ద్వారా తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. సాధారణంగా అవసరమైన వివరాలు/పత్రాలలో: ✅ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ✅ UG Degree Certificate ✅ PG Degree / PG Diploma Certificate ✅ VCI Registration Card ✅ Biodata / CV ఉంటే అదనంగా వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన విషయం ఈ సేవకు అవసరమైన అర్హతలను ముందుగానే పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా PG Degree లేదా PG Diploma అర్హత, సంబంధిత రిజిస్ట్రేషన్ తదితర TTD నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ప్రొఫైల్ నమోదు అనంతరం గోశాల డైరెక్టర్ అనుమతి పొందిన తరువాతే సేవా స్లాట్‌ను బుక్ చేసుకునే ప్రక్రియ కొనసాగుతుంది.
నా శ్రీవారి వైద్య సేవ అనుభవం
ఇటీవల నాకు కూడా శ్రీవారి వైద్య సేవలో పాల్గొనే అవకాశం లభించింది.
ముందుగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఆగస్టు 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు శ్రీవారి వైద్య సేవలో పాల్గొనడం జరిగింది.
ఈ సేవా కాలంలో నాతో పాటు డా. జి. శ్రీనివాసులు రెడ్డి గారు, సహాయ సంచాలకులు, పశుసంవర్ధక శాఖ, వైఎస్ఆర్ కడప జిల్లా కూడా పాల్గొని, కలిసి సేవలందించడం మరింత ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది.
ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు పశువైద్య అధికారులు కలిసి, తమ వృత్తిపరమైన అనుభవాన్ని ఉపయోగించి శ్రీవారి గోసంరక్షణ కార్యక్రమంలో సేవ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించింది.
శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సేవ
శ్రీవారి వైద్య సేవలో భాగంగా శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో పశువుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన వైద్య సేవలు అందించే అవకాశం లభించింది.
గోశాలలో పశువుల నిర్వహణ, పరిశుభ్రత, మేత, పశువైద్య సేవలు, జాతుల సంరక్షణ తదితర అంశాలను దగ్గరగా పరిశీలించాను. అక్కడ: 🐄 గిర్ 🐄 సాహివాల్ 🐄 కంక్రేజ్ 🐄 రెడ్ సింధీ 🐄 ఒంగోలు 🐄 పుంగనూరు వంటి అనేక విలువైన దేశీయ గో జాతులను చూడగలిగాము. జాతుల వారీగా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసి నిర్వహించడం, పాలిచ్చే పశువులు, గర్భిణీ పశువులు, పొడి పశువులు, దూడలకు ప్రత్యేక నిర్వహణ చేయడం ఎంతో అభినందనీయం.
వసతి మరియు భోజన సదుపాయాలు
శ్రీవారి వైద్య సేవలో పాల్గొనే పశువైద్యులకు TTD కల్పిస్తున్న సదుపాయాలు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి.
మాకు వేదిక్ విశ్వవిద్యాలయంలోని వశిష్ఠ అతిథి గృహంలో వసతి ఏర్పాటు చేశారు.
అదేవిధంగా పద్మావతి వసతి గృహంలో టిఫిన్, భోజనం, డిన్నర్ వంటి ఆహార సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు.
సేవ చేయడానికి వచ్చిన వైద్యులకు వసతి, భోజనం వంటి ప్రాథమిక అవసరాల గురించి ఆందోళన లేకుండా, సేవపై పూర్తి దృష్టి పెట్టేలా ఈ ఏర్పాట్లు ఎంతో ఉపయోగపడ్డాయి.
అంతేకాకుండా గోశాల మరియు వసతి గృహాల మధ్య రాకపోకల కోసం ఒక కారును కూడా TTD ఏర్పాటు చేసింది.
ఈ రవాణా సదుపాయం వల్ల ప్రతిరోజూ నిర్ణీత సమయానికి గోశాలకు చేరుకోవడం, సేవ పూర్తయిన తరువాత వసతి గృహానికి తిరిగి రావడం ఎంతో సౌకర్యవంతంగా జరిగింది.
TTD అందించిన ఈ సదుపాయాలు సేవలో పాల్గొన్న వైద్యులకు ఎంతో సహాయకరంగా నిలిచాయి.
వైద్య సేవలో పొందిన అనుభవం శ్రీవారి వైద్య సేవలో భాగంగా వివిధ రకాల పశువైద్య కేసులను పరిశీలించి చికిత్స అందించే అవకాశం లభించింది. ముఖ్యంగా: 🔹 గర్భ నిర్ధారణ (Pregnancy Diagnosis – PD) 🔹 మావి నిలిచిపోవడం (Retained Placenta) 🔹 గర్భాశయ వాపు / గర్భాశయ ఇన్ఫెక్షన్ (Endometritis) 🔹 పునరుత్పత్తి సంబంధిత సమస్యలు 🔹 మళ్లీ మళ్లీ గర్భం దాల్చకపోవడం (Repeat Breeding) 🔹 కాళ్లు మరియు కీళ్లకు సంబంధించిన సమస్యలు 🔹 గాయాలకు చికిత్స మరియు నిర్వహణ 🔹 వ్యాధి నివారణ మరియు ఆరోగ్య పరిరక్షణ చర్యలు 🔹 గాలికుంటు వ్యాధి (FMD) టీకాలు 🔹 నులిపురుగుల నివారణ / నులిపురుగుల మందులివ్వడం (Deworming) 🔹 పోషకాహార లోపాలు మరియు సంబంధిత సమస్యలు వంటి అంశాలలో సేవలందించగలిగాము.
కొన్ని రిటెయిన్‌డ్ ప్లాసెంటా మరియు ఎండోమెట్రైటిస్ కేసుల్లో అవసరమైన చికిత్స, గర్భాశయానికి తగిన విధంగా చికిత్సా చర్యలు మరియు సహాయక చికిత్స అందించడం జరిగింది.
అదేవిధంగా డ్రై మరియు మిల్క్ జంతువులలో Pregnancy Diagnosis (PD) నిర్వహించి, పునరుత్పత్తి స్థితిని అంచనా వేయడం జరిగింది.
గాలికుంటు వ్యాధి టీకాలు కూడా పశువులకు అందించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇలాంటి కేసుల ద్వారా పశువైద్య సేవను అందించడంతో పాటు, ఒక పెద్ద స్థాయి గోశాలలో జరుగుతున్న శాస్త్రీయ పశు నిర్వహణను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించింది.
శాస్త్రీయ మేత నిర్వహణ – ఒక మంచి అనుభవం
గోశాలలో మేత నిర్వహణ కూడా క్రమబద్ధంగా ఉంది.
పాలిచ్చే పశువులకు ఉత్పత్తి అవసరాలకు అనుగుణంగా కాన్సంట్రేట్ ఫీడ్ అందించడం, పొడి మేతను అందించడం, మధ్యాహ్నం సూపర్ నేపియర్ పచ్చిమేత ఇవ్వడం గమనించాము.
చాఫ్ కట్టర్ ఉపయోగించి పచ్చిమేతను తరిగి అందించడం వల్ల మేత వృథా తగ్గడం, పశువులు సులభంగా మేత తీసుకోవడం వంటి ప్రయోజనాలు కనిపించాయి.
అదేవిధంగా దేశీయ గో జాతుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ఆకట్టుకుంది.
గోశాలతో పాటు ఆలయ ఏనుగుల సంరక్షణ
ఈ సేవలో భాగంగా తిరుచానూరు గోశాల మరియు అమ్మవారి ఆలయానికి చెందిన ఏనుగులను కూడా పరిశీలించే అవకాశం లభించింది.
ఏనుగుల నిర్వహణ, షెడ్ల పరిశుభ్రత, పాదాల ఆరోగ్యం వంటి అంశాలను పరిశీలించడం జరిగింది.
ఏనుగుల పాదాల వద్ద గాయం/సమస్య కనిపించిన సందర్భంలో అవసరమైన చికిత్సా సలహాలు మరియు నిర్వహణ సూచనలు ఇవ్వడం జరిగింది.
గోమాతలతో పాటు ఆలయ ఏనుగులకు కూడా ఆరోగ్య పరిరక్షణ అందించడం ద్వారా ఈ సేవ మరింత విస్తృతమైన పశుసేవగా అనిపించింది.
ఈ సేవలో నాకు మరో ప్రత్యేకమైన అనుభూతి డా. జి. శ్రీనివాసులు రెడ్డి గారు, సహాయ సంచాలకులు, పశుసంవర్ధక శాఖ, వైఎస్ఆర్ కడప జిల్లాతో కలిసి సేవ చేయడం.
ఇద్దరం కలిసి గోశాలలోని పశువుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన వైద్య సేవలను అందించాము.
వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ, వివిధ కేసులపై చర్చించుకుంటూ, గోశాల నిర్వహణను పరిశీలిస్తూ గడిపిన ఈ రోజులు మాకు ఎంతో విలువైన అనుభవాన్ని అందించాయి.
శ్రీవారి సన్నిధిలో ఇద్దరు పశువైద్యులు కలిసి గోసేవ చేయడం మా వృత్తి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
పశుసేవతో పాటు కుటుంబానికి శ్రీవారి దర్శన భాగ్యం
శ్రీవారి వైద్య సేవలో నాకు అత్యంత ఆనందాన్ని కలిగించిన అంశాలలో ఒకటి కుటుంబ సభ్యులకు కూడా తిరుమల శ్రీవారి దర్శనం పొందే అవకాశం.
పశువైద్యునిగా మనం ఎప్పుడూ విధుల్లో నిమగ్నమై ఉంటాం. కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ, వృత్తిపరమైన బాధ్యతలు, సమయాభావం వంటి కారణాల వల్ల అనేక సందర్భాల్లో అది సాధ్యం కాదు.
అలాంటి సమయంలో శ్రీవారి వైద్య సేవ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది.
నేను శ్రీవారి సన్నిధిలో గోసేవ చేస్తుంటే… నా కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనం చేసుకుని ఆనందాన్ని పొందడం… ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఒక పశువైద్యునికి సేవా సంతృప్తి, కుటుంబ సభ్యులకు శ్రీవారి దర్శన ఆనందం—రెండూ ఒకేసారి లభించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.
Break Darshan – ఒక ప్రత్యేకమైన అవకాశం సేవా కాలాన్ని పూర్తిచేసిన పశువైద్యులకు TTD నిబంధనలకు అనుగుణంగా Break Darshan అవకాశం కల్పించడం ఈ సేవలో మరో ప్రత్యేకత. సేవలో పాల్గొనే ముందు తాజా TTD నిబంధనలు, అర్హతలు, దర్శన విధానం, ఛార్జీలు మరియు కుటుంబ సభ్యులకు వర్తించే నియమాలను తప్పనిసరిగా అధికారికంగా నిర్ధారించుకోవాలి. కానీ ఆ అవకాశం లభించినప్పుడు, పశుసేవ అనంతరం కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోవడం నిజంగా ఒక మరపురాని అనుభూతి.
TTDకి హృదయపూర్వక కృతజ్ఞతలు పశువైద్యులకు సేవ చేసే అవకాశం కల్పించడమే కాకుండా, వసతి, భోజనం, రవాణా వంటి సదుపాయాలను ఏర్పాటు చేసి, వైద్యులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవ చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానముల యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ముఖ్యంగా గోశాల డైరెక్టర్, పశువైద్య అధికారులు, వెటర్నరీ అసిస్టెంట్లు, అటెండర్లు మరియు సిబ్బంది అందరూ ఎంతో సహకారంతో పనిచేయడం అభినందనీయం. వారి సమన్వయం, పశువుల పట్ల శ్రద్ధ, గోశాల పరిశుభ్రత మరియు నిర్వహణ తీరు ఎంతో ఆకట్టుకున్నాయి.
ప్రతి పశువైద్యుడు ఒక్కసారైనా ఈ సేవలో పాల్గొనాలి నా అనుభవం ఆధారంగా, అర్హత కలిగిన ప్రతి పశువైద్య మిత్రుడు తన జీవితంలో కనీసం ఒక్కసారైనా శ్రీవారి వైద్య సేవలో పాల్గొనాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇది కేవలం ఒక సేవా కార్యక్రమం కాదు. ఇది— 🐄 గోసేవ 🩺 వైద్య సేవ 🙏 దైవ సేవ 👨👩👧👦 కుటుంబ ఆనందం 🌺 శ్రీవారి దర్శన భాగ్యం 📚 వృత్తిపరమైన అనుభవం అన్నీ కలిసిన ఒక అపూర్వమైన అనుభవం. పశువైద్యునిగా మనం సంపాదించిన జ్ఞానాన్ని ఒక మూగజీవి ఆరోగ్యానికి ఉపయోగించడం గొప్ప విషయం. అదే జ్ఞానాన్ని శ్రీవారి సన్నిధిలో గోమాతల సేవకు వినియోగించే అవకాశం రావడం మరింత గొప్ప అదృష్టం.
ముగింపుగా… శ్రీవారి వైద్య సేవ అనేది కేవలం పశువైద్య సేవ కాదు… ఇది పశుసేవతో ప్రారంభమై, దైవసేవగా మారే పవిత్రమైన ప్రయాణం. మన చేతులతో గోమాతకు వైద్యం అందిస్తూ… మన హృదయంతో శ్రీవారిని స్మరిస్తూ… మన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తూ… “గోవిందా… గోవిందా…” అని పలకడం— ఒక పశువైద్యుని జీవితంలో నిజంగా మరచిపోలేని అనుభూతి. పశువులకు మన వైద్యం – శ్రీవారికి మన సేవ – కుటుంబానికి శ్రీవారి దర్శనం. ఈ మూడు కలిసిన చోటే శ్రీవారి వైద్య సేవ యొక్క అసలైన గొప్పతనం. 🌺 గోసేవ – గోవింద సేవ 🌺 🩺 పశుసేవ – పరమ సేవ 🩺 🙏 శ్రీవారి సన్నిధిలో సేవ – అపూర్వమైన భాగ్యం 🙏 🌺 గోవింద… గోవింద… 🌺 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
కలెండ్యులా ఒక తక్కువ కాలం జీవించే, సువాసన గల బహువార్షిక హెర్బల్ మొక్క. 80 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. నిటారుగా పెరిగే కొమ్మలు కలిగి ఉంటుంది. ఆకులు కోడిగుడ్డు ఆకారంబల్లెం ఆకారంలో, 5-17 సెం.మీ. పొడవుండి, రెండువైపులా నూగు కలిగి ఉంటాయి. పూలు సంవత్సరం పొడవునా ఏర్పడతాయి. ఇన్‌ఫ్లోరెసెన్స్ పసుపు రంగులో ఉంటుంది. పూగుత్తి 4-7 సెంమీ. వ్యాసం కలిగి ఉంటుంది. కాయలు ముళ్ళు కలిగి ఉండి వంగిన ఏకిన్.
సాధారణ నామం : కలెండ్యులా శాస్త్రీయ నామం : కలెండ్యులా అఫిసినాలిస్ కుటుంబం: కాంపోజిటె
ఉపయోగాలు : ఔషధరంగంలో …
కలెండ్యులాని గొంతునొప్పి, నోటివాపు చికిత్సలో ఉపయోగిస్తారు. క్యాన్సర్, కడుపులోని డుయోడినల్ అల్సర్స్ చికిత్సలో ఉపయోగిస్తారు.
నొప్పులు తగ్గడానికి కలెండ్యులా పేస్టుని చర్మంపై పూస్తారు. గాయాలు, కాలిపుండ్లు మానడానికి ఉపయోగిస్తారు.
కలెండ్యులా టింక్చర్లు, ఆయింట్‌మెంట్లను కాలిన ప్రదేశాలు, గాయాలు, తెగినచోట త్వరగా మానడానికి ఉపయోగిస్తారు. ఇవి గాయమున్న చోటికి రక్తాన్ని ప్రసరింపజేసి చర్మం కొత్త కణాలేర్పరుచుకోవడానికి దోహదపడతాయి. పిల్లల్లో చెవి ఇన్‌ఫెక్షన్స్ మానడానికి కలెండ్యులా చుక్కలను చెవిలో వేస్తారు. డెర్మటైటిస్ నివారణలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
కల్యెండ్యులా ఇథనాల్ ద్రావణం (30 మైక్రోమీటర్లు/మి.లీ.) లోని రసాయనాలు తామర పురుగులు, త్రిప్స్‌టబాసిపై అత్యధిక విషచర్యను ప్రదర్శించాయి. (నజ్‌మిజాడే, అతని అనుచరులు, 2013).
క్యలెండ్యులా ద్రావణం పిచికారి చేసిన ట్రీట్‌మెంట్‌లో వెస్టర్న్‌ఫ్లవర్ త్రిప్స్ పిల్ల పురుగులు అరికట్టబడ్డాయి (రజావి అండ్ అహ్మరి, 2016) కిచెన్ గార్డెన్‌లో ఆకులు తినే పురుగులను, ఆస్పరాగస్ బీటిల్స్, టమాట కొమ్ము పురుగులను నివారించడానికి పురుగు మందు తయారు చేసుకుని వాడవచ్చు.
పురుగు మందు తయారు చేసే విధానం :
ఒక కప్పు (225 గ్రా.) కలెండ్యులా ఆకులను నూరి 500 మి.లీ. నీటితో కలపాలి. 24 గంటలు నానబెట్టాలి. పలుచని గుడ్డ ద్వారా వడపోయాలి. దీనికి 1.5 లీ. నీటిని కలిపి తర్వాత 5 మి.లీ. (1/4 చెంచా) లిక్విడ్‌సోప్ కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
కలెండ్యులా ఆకులు, పూల ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర పోషక ఫిజియాలజీని మార్పు చేసి చంపుతాయి. అందువలన కలెండ్యులా ద్రావణాన్ని వృక్ష సంబంధ పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (మెథిని, ఆమె అనుచరులు, 2012).
కలెండ్యులా మొక్క పైభాగాల ద్రావణం క్యాబేజి బటర్‌ఫ్లెå, పొటాటో బీటిల్ పై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (వార్ౙినియాక్, 2002).
కలెండ్యులా మొక్కలో సెస్కిటెర్పిన్లు, ఫ్లావనాయిడ్స్, ట్రైటెర్పినాయిడ్ సపోనిన్±్స, ట్రైటెర్పిన్ ఆల్కహాల్స్ ఉంటాయి (అహ్మద్, అతని అనుచరులు, 1993).
కలెండ్యులా ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర పెరుగుదల, ఫిజియాలజీపై అనేక ప్రభావాలను చూపుతాయి. అధిక గాఢత వద్ద లార్వాల పెరుగుదల, ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. బహుశ టెర్పిన్లు లార్వాలు తిన్న ఆహారం జీర్ణమయి, గ్రహించకుండా జోక్యం కలిగించుకుని ఉంటాయి (మెథిని, ఆమె అనుచరులు, 2009).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.