తేనెపట్టుల ప్రవాసము (Migration of Bee Honeycolonies)
సంవత్సరం పొడవునా సాధారణంగా ఏ ప్రాంతంలోకూడా పుష్పించే మొక్కలు ఉండవు, అయినప్పటి తేనెటీగలు వాటి రోజూవారి అవసరములకొరకు పుప్పాడిని, మకరంధమును సేకరించుకొని తేనెను ఉత్పత్తిచేస్తాయి. ఒకవేళ పుప్పొడి మరియు మకరందము లభ్యము కాని పక్షంలో అనుబంధ ఆహారాన్ని అందించవలసి ఉంటుంది. క్యాలెండరును బట్టి తేనెటీగలకు పుష్పజాతులు లభ్యమయ్యే ప్రాంతాలకు తేనెపట్టులను తీసుకుని పోవలసియుంటుంది. దీనినే తేనెపట్టుల ప్రవాసము (Migration) అంటారు. పెద్ద ఎత్తున దీనిని అవలంభించినప్పుడు తేనెటీగల పెంపకంలో తేనెపట్టుల ప్రవాసము (Migratory Bee keeping) అంటారు.

వాణిజ్యపరంగా తేనెటీగల పెంపకమును చేపట్టినపుడు తేనెపట్టుల ప్రవాసము అనునది చాలా ముఖ్యమైనది. దీని ముఖ్యఉద్దేశ్యము
- తేనె ఉత్పత్తిని పెంచుట కొరకు
- తేనెపట్టులను బలపరచుకొని, విభజించుకొనడానికి
- అనుబంధ పోషణ ఖర్చు తగ్గించుకొనడానికి మరియు తేనెటీగల పరాగ సంపర్కము ద్వారా పంటల ఉత్పత్తి పెంచుకొనడానికి
- అడవి మరియు వ్యవసాయ మొక్కలలో జీవవైవిద్యమును పరపరాగ సంపర్కము ద్వారా కాపాడుకొనుటకు గాను తేనెపట్టుల ప్రవాసము ఉపయోగపడును.
గుర్తించకొనదగిన విషయాలు (Points to consider)
తేనెటీగల పెంపకము యొక్క ముఖ్యవుద్దేశ్యము ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొని తేనె దిగుబడిని పెంచుకొనడము. అందుకనే తేనెటీగల పెంపకముదారులు తేనెటీగలకు ఆహారమును సరఫరా చేయు మొక్కలను మొదటిగా గుర్తించవలెను. తేనెపట్టులను మార్చుటకు (Migration) లేదా ప్రవాసము కొరకు అగు ఖర్చును తెలుసుకొనాలి మరియు సరైన శాస్త్రీయ పరిజ్ఞానము మరియు నిపుణత, పట్టులను ప్రవాసము చేయుటకు ఉండాలి. తేనెపట్టులను ప్రవాసము కొరకు ప్రణాళిక వేయునపుడు (Migration) ఈ క్రింది సూచనలు పాటించాలి.
ప్రవాసము చేయు స్థలము ఎంపిక
- తేనెపట్టులు మార్చుకునే ప్రదేశములో లభ్యమయ్యే మొక్కలు, చెట్లు, వృక్షములు ఏరకమునకు చెందినవో, ఏ సీజనులో ఎంతకాలం పుష్పిస్తాయో ఎంత విస్తీర్ణములో ఉన్నవో, ప్రస్తుతం తేనెపట్టులున్న ప్రదేశం కంటే కొత్తగా పట్టులు పెట్టుకొను ప్రాంతములో ఎంత తేనెదిగుబడి వస్తుందో అంచనా వేసుకొనాలి.
- తేనెపట్టులకు లభ్యమయ్యే పుష్పజాతుల పంటల మీద పురుగుమందులు పిచికారీ చేస్తారేమోనన్న విషయాన్ని స్థానిక వాతావరణ పరిస్థితులను గూర్చిన వివరణను సంపాదించాలి.
- ప్రకృతి సిద్ధముగా తేనెపట్టులపై దాడిచేయు శత్రువుల విషయమైన సమాచారాన్ని సేకరించి, శత్రువుల దాడి తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొనాలి.
- తేనెపట్టులు పెట్టుకున్న ప్రాంతంనుండి ఎంతదూరంలో తేనెటీగలకు పుప్పొడిని, మకరందాన్నిచ్చే పుష్పజాతులు ఉన్నవో అంచనా వేసుకొనాలి.
- తేనెటీగల పట్టుల ప్రవాసము కొరకు ఎంత లాభము, ఎంత నష్టము ఉంటుందో విశ్లేషణ చేసుకొనాలి.
తేనెపట్టుల ఎంపిక మరియు ప్రవాసము కొరకు తేనెపట్టులను సిద్ధపరచుట
- బలమైన, ఆరోగ్యకరమైన మరియు తేనెను సేకరించగల పట్టులను మాత్రమే ప్రవాసం (Migration) కొరకు ఎంపిక చేసికొనాలి.
- తేనెపట్టులను ప్రవాసము తీసుకొని వెళ్ళడానికి ముందు కనీసం రెండు నెలలు నుండి బలవరచుకొనాలి.
కావలసిన వస్తువులు, పరికరములన్నీ ఉదాహరణకు తేనె అరలు, ఫ్రేములు, కృత్రిమ మైనపు అట్టలు, తేనె యంత్రము మరియు తేనెను సేకరించి నిల్వవుంచుకొనుటకు కావలసిన పాత్రలు సిద్ధపరచుకొనవలెను.

తేనెపట్టుల ప్రవాసము కొరకు తగిన సమయము (Timing of Migration)
తేనెటీగలకు పుప్పొడిని, మకరందమును అందించే ఎక్కువ మొక్కలు పుష్పించేదశలో ఉన్నపుడు తేనెపట్టులను ప్రవాసము తీసుకువెళ్ళవలెను (కనీసం 5 శాతం పుష్పములు ఉన్నపుడు).
తేనెపట్టులను సిద్దపరచుట (Preparation of Bee colonies)
తేనెపట్టులను చాల జాగ్రత్తగా ప్రవాసముకొరకు సిద్ధపరచుకొనవలెను. ఈ సిద్దపరచడం సరిగా చేయకపోయినట్లుయితే కొన్ని ఈగలు వెనుక వదిలి పెట్టబడి లేక ప్రవాసం చేయునపుడు చనిపోతాయి.
తేనేపెట్టెలను క్రింద చెప్పబడిన విధముగా సిద్ధపరచుకొనాలి
- తేనెపట్టులను శుభ్రపరచాలి.
- అధికముగా ఉన్న తేనెను, తేనెయంత్రంతో తీసుకొనాలి మరియు తేనెగదిని తీసివేయాలి. తేనెతో నింపబడిన ఫ్రేములతో పాటుగా ప్రవాసము చేసినట్లయితే తేనెటీగలు చనిపోతాయి. ఫ్రేములను పట్టులలో గట్టిగా బిగించుకోనాలి.
- తేనెపట్టుల ప్రవాసము సుదీర్ఘమైనదైనట్లయితే (Long distance) అనుబంధ ఆహారాన్ని (Supplementary feeding) ఏర్పాటు చేసుకొనాలి.
- చెక్కలతో (Wooden reapers) పై నుండి క్రిందివరకు అడుగుబల్లను, తేనెగదిని, పిల్లలగదితో బిగించుకొనాలి. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉన్నసమయంలో పట్టులను ప్రవాసం తీసుకొని వెళ్ళునపుడు వైరుల వలతో ఉన్న లోపలిమూతను వాడుకొనాలి.
- సుదీర్ఘప్రవాసం అయితే, వేడిగా ఉన్న సమయంలో పైమూతను (Outer cover) తీసివేసుకొనాలి.
- వైరుతోగాని, పెట్టె బెల్టుతో గాని లేక త్రాడుతోగాని పట్టును బయట కవరును తీయకుండానే కొద్ది దూరపుప్రవాసముల విషయమంలో కట్టుకొనాలి.
- కూలిఈగలన్నీ సాయంత్రమునకు పట్టుకు చేరుకున్న తరువాత వైరునెట్ తోగాని, గుడ్డముక్కతో గాని పట్టుద్వారమును మూసివేయాలి. ద్వారము వద్ద ఈగలన్నీ గుమికూడి గుంపుగా ఉన్నట్లయితే నీరుచల్లిగాని, లేక పొగబారించుట ద్వారా గాని ఈగలు పట్టులోనికి వెళ్లునట్లుగా ప్రాత్సాహించాలి.
తేనెపట్టుల ప్రవాసము (Bee colonies migration)
- తేనెపట్టులను, ట్రక్కు లేక ట్రాక్టరు లేక ఆటోరిక్షా, కూలికి మనుష్యులను పెట్టుకొనిగాని ఒకచోట నుండి మరొకచోటికి మార్చుకొనవచ్చును లేక వివిధ పద్దతులను కలిపిగాని, తేనెపట్టులు మొదటిస్థానం నుండి తేనెటీగలకు ఆహారం లభించే స్థలానికి మార్చుకొనవచ్చును.
- సాధ్యమయినట్లయితే పట్టుల ప్రవాసమును రాత్రిపూట (శీతాకాలం సా||గం.5.00ల నుండి ఉ॥ గం.10.00లు, ఎండాకాలం అయితే సా||గం. 7.00ల నుండి ఉగం. 7.00ల మధ్య) చేపట్టాలి.
- తేనెపట్టుల మధ్య గాలి ప్రవహించేలా ఉండాలి.
- తేనెపట్టులను జాగ్రత్తగా ట్రక్కులలో భద్రంగా చేర్చుకొనాలి.
- వాహనము నెమ్మదిగా సాధ్యమైనంతవరకు ఏవిధమైన ఒడిదుడుకులు లేకుండా నడపాలి.
- వాహనాన్ని ఎక్కువసేపు ఆపి ఉంచకూడదు. ఒకవేళ రోజంతా లేక ఇంకా ఎక్కువసమయము ఆపివేయాల్సివస్తే పట్టులను వాహనంనుండి దింపి, పట్టుల ద్వారములను తెరచి, ఈగలు ఆహర సేకరణ కొరకు వదలాలి. రాత్రి అయిన తర్వాత తిరిగి ప్యాకింగ్ చేసి తిరిగి వాహనములోనికి లోడు చేసుకొనాలి.
- గమ్యస్థానము చేరుకున్న తరువాత వాహనమునుండి నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా పట్టులను దించుకొనాలి.
- ఒక గ్రూపుగా పట్టులను పెట్టుకొనాలి. కనీసం పట్టుకు పట్టుకు మధ్య 5 అడుగులు (1.5మీ) వుండునట్లుగా అమర్చుకొనవలెను.
- పట్టులను ఆ ప్రాంతంలో పెట్టుకున్న తరువాత పట్టులద్వారాలకున్న గుడ్డ లేక వైరుజల్లెడను ఒకదాని తర్వాత ఒకటి ఒకవైపు ప్రారంభించి రెండవవైపుకు వెళుతూ తీసివేయాలి.
- ద్వారాల్ని తెరచిన 30నిమిషముల తర్వాత లేక ప్రొద్దుపొడవగానే, ఈగలు బయటకు ఎగురు చున్నవో లేదో గమనించుకోవాలి. ఒకవేళ రెండురోజుల వరకు ఒకపట్టులోని ఈగలు బయటకు ఎగరని పక్షంలో (ఒకవేళ ఈగలు తేనెతోతడిసి చనిపోయిన ఈగలు లేక నేలమీద పారాడుతున్న ఈగలు) ఏమైనప్పటికీ వెంటనే పట్టును పరిశీలించుకొని తగిన చర్యలు చేపట్టాలి.
- పట్టులను కొన్ని రోజులకు ప్రతిసారి పరిశీలించుకొనాలి. పిల్లలగది ఈగలతో నిండిపోయిన వెంటనే తేనె అరను ఏర్పాటుచేసికొనాలి. తేనె అరలో పాతమైనపుఅట్టలు లేక కృత్రిమ మైనపు అట్టలను పెట్టుకొనాలి.
డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Ph: 9493304643
జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.

