ఇటుకల కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

ఇటుకల కిల్న్ అనేది ఇటుకలు లేదా రాళ్లతో శాశ్వతంగా నిర్మించే బయోచార్ తయారీ నిర్మాణం. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు ఈ పద్ధతి అనువైనది. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు సమూహాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామస్థాయి బయోచార్ ఉత్పత్తి కేంద్రాలు ఈ విధానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

ముందుగా కిల్న్ అడుగు భాగంలో పొడి చెక్కలు లేదా చిన్న కొమ్మలను అమర్చి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు లేదా ఇతర పొడి పంట అవశేషాలను పొరలుగా నింపాలి. పై పొర మండడం ప్రారంభమైన తర్వాత కిల్న్ లో గాలి ప్రవేశాన్ని క్రమంగా నియంత్రించాలి. దీంతో అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

అవశేషాలు ఎక్కువ భాగం నల్లని బయోచార్‌గా మారిన తర్వాత గాలి ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేసి కిల్న్ ను మూసివేయాలి. అనంతరం పూర్తిగా చల్లారిన తర్వాత బయోచార్‌ను బయటకు తీసి బూడిదను వేరుచేయాలి. అవసరమైతే బయోచార్‌ను చిన్న ముక్కలుగా చేసి కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఇటుకల కిల్న్ ద్వారా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో నాణ్యమైన బయోచార్‌ను తయారు చేయవచ్చు. ప్రారంభ నిర్మాణ వ్యయం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలం ఉపయోగించుకునే అవకాశం ఉండటం, ఉత్పత్తి వ్యయం తగ్గడం, పెద్ద ఎత్తున బయోచార్ తయారీకి అనువుగా ఉండటం వల్ల గ్రామీణ స్థాయిలో సామూహిక బయోచార్ ఉత్పత్తికి ఈ పద్ధతి ఉత్తమ ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.

Read More

వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వివిధ పంట రకాలు, ప్రయోజనాలు

పప్పు ధాన్యాలు ` నూనెగింజలు

మినుము :
ఆంధ్ర రాష్ట్రంలో మినుము 9.71 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 3.65 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 376 కిలోల దిగుబడి నిస్తుంది. రాష్ట్రంలో మినుమును తొలకరిలో, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు.

మినుము పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మినుములో అనువైన రకాలు :

జి.బి.జి-1 : ఈ రకం పంట కాలం 70-75 రోజలు, దిగుబడి 8-9 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. అన్ని కాలాలకు అనువైన రకం ఇది. వ్యవసాయ పరిశోధనా స్థానం, ఘంటశాల, కృష్ణాజిల్లా నుండి లభ్యం అవుతుంది- 9248838628

టి.బి.జి. 104 : పంట కాలం- 70-75 రోజలు, దిగుబడి, 8-9 క్వింటాళ్ళు. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. ఇది అన్ని కాలాలకు అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి, ప్రకాశం జిల్లా నుండి లభ్యం అవుతుంది – 9989623827.

ఎల్.బి.జి-352: ఈ రకం పంట కాలం 75-80 రోజలు . దిగుబడి 6-7 క్వింటాళ్ళు. వరి మాగాణుల్లో ఆలస్యముగా విత్తుటకు కూడా అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల, కృష్ణా జిల్లా నుండి లభ్యం అవుతుంది – ఫోన్ నంబర్- 8008201253.

ఎల్.బి.జి`904 మరియు టి.బి.జి-129 రకాలు కెవికె, రెడ్డిపల్లి, అనంతపూరం జిల్లా నుండి లభ్యం అవుతున్నాయి – ఫోన్ నెంబర్ -9989623825

పెసర :
ఆంధ్ర రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 2.59 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 0.81 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 313 కిలోల ఉత్పాదకతనిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, వేసవిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. కంది, ప్రత్తి మరియు పండ్ల తోటలలో అంతర పంటగా కూడా పండించవచ్చు.

ఎల్.జి.జి-574: ఈ రకం పంట కాలం 65-70 రోజులు. దిగుబడి 6 నుండి 7 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లి అనంతపురం నుండి లభిస్తుంది – 9989623825.

డబ్ల్యు.జి.జి.-42: ఇది ఖరీఫ్ పంటకు అనుకూలం, పంట కాలం 55-60 రోజులు. 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. ఇవి కెవికె, ఊటుకూరు, వై.యస్.ఆర్. కడప జిల్లాలో లభ్యం అవుతాయి. ఫోన్ నెంబర్:9848809236,

కంది : అనువైన రకాలు ఎల్.ఆర్.జి-52 రకం. వ్యవసాయ పరిశోధనా స్థానం, గరికపాడు, ఎన్.టి.ఆర్. జిల్లా నుండి లభ్యం అవుతుంది. ఫోన్ నెంబర్-9491003499 మరియు టి.ఆర్.జి.-59 మరియు జి.ఆర్.జి-152 రకాలు కెవికె, బనవాసి నుండి అభ్యం అవుతున్నాయి – 8074420092.

వేరుశనగ : పంట కాలం 105-110 రోజులు. ఇందులో కదిరి లేపాక్షి రకం తీవ్ర బెట్ట పరిస్థితులను తట్టుకుని 6-8 క్వింటాళ్ళు దిగుబడి ఇస్తుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లిలో లభ్యం అవుతుంది -9989623825, కదిరి చిత్రావతి కూడా లభ్యం అవుతుంది. కె-6, కదిరి, అమరావతి రకాలు వ్యవసాయ పరిశోధనా స్థానం, కదిరి నుండి లభ్యం అవుతున్నాయి. సంప్రదించవలసిన నంబరు – 9490081470. విశిష్ట రకం వ్యవసాయ పరిశోధనా స్థానం, ఊటుకూరు నుండి లభ్యం ఆవుతుంది. ఫోన్ నెంబర్ – 7981982531.

నువ్వులు : నువ్వులలో YLM-66 రకం,YLM-17 రకం ఖరీఫ్‌కు అనువైనవి. పంటకాలం 75-80 రోజులు, దిగుబడి 5-6 క్వింటాళ్ళు. ఇవి రాయలసీమకి ఆనుకూలం. వ్యవసాయ పరిశోధనా స్థానం, యలమంచిలి, అనకాపల్లి జిల్లా నుండి లభిస్తుంది. ఫోన్ నెంబర్: 9440977352, 9849275470.

ఆముదం : ఆముదం పంట కాలం 90-150 రోజులు, దిగుబడి 6 – 7 క్వింటాళ్ళు. ఇందులో కిరణ్ రకం బెట్టను తట్టుకుంటుంది. బూజు తెగులు తక్కువ. డి.సి.ఎస్-107 మరియు ప్రగతి ఎండు తెగులును తట్టుకుంటుంది. ఐ.సి.హెచ్- 66 ఎండు తెగులు మరియు బెట్టను తట్టుకుంటుంది. ఇవి వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం నుండి లభ్యం అవుతున్నాయి. ఫోన్ నెంబర్: 9989210879.

వరితో పోల్చితో చిరుధాన్యాల్లో అధిక పోషక విలువలు ఉన్నాయి. వీటిలో అధిక మాంసకృకృత్తులతో పాటుగా మంచి అమైనో ఆమ్లాలు ఉంటాయి. పిండి పదార్థాలు తక్కువ. పీచు పదార్థం ఎక్కువ ఉండి రాగి, కాల్షియం అధిక మోతాదులలో ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే తీవ్ర కరువు ప్రభావాన్ని తగ్గించడానికి, రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలను కాక నీటి ఎద్దడిని తట్టుకునే చిరుధాన్యాలను సాగు చేసుకున్నట్లయితే తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడులను సాధించవచ్చు.

జొన్న: ఇది అధిక కరువు నిరోధకత కలిగిన పంట. దీని లోతైన “వేరువ్యవస్థ కారణంగా సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలదు. ముఖ్యంగా చిరుధ్యాల సాగు అధికంగా ఉండే రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో ఇటీవల కాలంలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నల్లరేగడి నేలలుండి కెసి కెనాల్ ఆయకట్టు ప్రాంతాలైన ప్రొద్దుటూరు మరియు పులివెందుల ప్రాంతాలలో NTJ NJ-1 CSV-29 రకాలను సాగు చేయవచ్చు. అలాగే ఇవి ధాన్యం మరియు పశుగ్రాసం రెండింటిని అందిస్తాయి. సజ్జ పంట విషయానికి వస్తే తక్కువ తేమగల నల్లరేగడి నేలలలో ABH-1, CTP-8203 హైబ్రిడ్ రకాలను ఎంచుకోవచ్చు. ఆలస్యమైనా ఖరీఫ్ సీజన్‌లో ఆగష్టు రెండవ వారం నుండి సెప్టెంబర్ మొదటి వారం లోపు వేసుకోవచ్చు. ఎర్రనేలలు అధికంగా ఉన్న జమ్మలమడుగు మండలంలో కొర్రలు(స్వల్పకాలిక రకాలు) సియా`3223 (రేనాడు/గరుడ) లేదా సూర్యనంది వంటి అధిక దిగుబడులు ఇచ్చే రకాలు నాటుకోవచ్చు.

రాగి రకాలు చూసినట్లయితే గౌతమి (PR) వకుళ, చైతన్య మరియు ఇంద్రావతి వర్షాధార పరిస్థితులకు అనుకూలం. ఈ రకాలు బ్లాస్ట్ తెగులు మరియు తేమ ఒత్తిడిని అధికంగా తట్టుకుంటాయి. పంట ఏది వేసినా విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. సాళ్ళలో నాటడం వలన అప్పుడప్పుడు పడిన వర్షం బొట్టును కూడా ఒడిసి పట్టుకుని పంట నిలబడుతుంది. అలాగే అంతర పంటల సాగుకు కూడా అనుకూలం. కొర్ర లేదా జొన్నను కంది తో కలిపి 4:1 లేదా 5:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు. విత్తనం కొరకు భారత చిరుధ్యాల పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.ఫోన్ నంబరు : 040 – 24599300.

నీటి ఎద్దడిని తట్టుకునే పశుగ్రాస రకాలు
నీటి ఎద్దడిని (Drought) తట్టుకుని, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాస రకాలు పాడి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అనంతపురం, వై ఎస్ ఆర్ కడప జిల్లాల పరిసర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు ఈ క్రింది రకాల పశుగ్రాసాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి:

ధాన్యపు జాతి పశుగ్రాసాలు:

జొన్న గడ్డి రకాలు :
ఏకవార్షికాలు – పి.సి -9, ఎం.పి. చారి, పంత్ చారి-5,7, సి.ఎస్.వి. -30F,
32F,

బహు వార్షికాలు – ఎస్. ఎస్. జి 59 -3 , పూస చారి – 6, 23, సి.ఎస్.వి. -33 COFS 29 (కోఎస్ఎస్ 29) COFS 31 (కోఎస్ఎస్ 31). బహుళ కోతలు (మల్టీ కట్) జొన్న రకాలు. కరవును తట్టుకుని, వర్షాలు పడగానే మళ్లీ చిగురిస్తుంది.

సోర్గమ్ -సూడాన్ గడ్డి (SSG): ఇది జొన్న మరియు గడ్డి జాతుల సంకరం. ఇందులో కాండం మందంగా ఉండి రసం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని పెరుగుతుంది
సజ్జ గడ్డి రకాలు : జైంట్ బాజ్ర , ఎస్ – 530, జె-55 , కె – 533

కాయజాతి (లెగ్యూమ్) పశుగ్రాసాలు:
హెడ్జ్ లూసర్న్ (దశరథ గడ్డి): ఇది బహువార్షిక (3-4 ఏళ్లు వచ్చే) పశుగ్రాసం. ఇందులో ప్రోటీన్లు ఎక్కువ. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది.

అలసందలు / బొబ్బర్లు: వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలికంగా పండించడానికి ఇది అనువైన పశుగ్రాసం.
స్టైలో హేమాటా – ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దీనిని వర్షాధారంగా సారవంతం కాని భూముల్లో సాగుచేయవచ్చు. భూసారాన్ని పెంచుతుంది. మిశ్రమ పంట లాగా తోటల్లో సాగు చేయవచ్చు.

గడ్డి జాతులు:
బాజ్రా నేపియర్ హైబ్రిడ్ : నేపియర్ రకాల వేర్లు లోతుగా చొచ్చుకుపోయి నీటిని గ్రహిస్తాయి కాబట్టి కరవును తట్టుకుంటాయి.

అంజన్ గడ్డి – ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. తోటల్లో మిశ్రమ పంటగా సాగు చేసుకోవచ్చు
గిన్ని గడ్డి – ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో బాగా అనువైన రకం.

చెట్ల మేత:
సుబాబుల్ మరియు అవిశ: నీరు లేని సమయాల్లో వీటి కొమ్మలు, ఆకులను పశువులకు మేతగా వేయవచ్చు.

విత్తనాలు లభ్యత :
పశుగ్రాస విత్తనాలను ఆంధ్రప్రదేశ్ లోని పశువైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని పరిశోధన కేంద్రాలు, ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేదా వ్యవసాయ సంభందిత ఆన్లైన్ ప్లాట్ ఫారముల ద్వారా పొందవచ్చు.

రైతుల సమాచారం కోసం కెవికె శాస్త్రవేత్తలచే రూపొందించబడినది. సంప్రదించవలసిన చిరునామా, కెవికె, ఒనిపెంట`9398982828, 7032463875, 8121136184

డా. శ్రీవిద్య రాణి.ఎన్, శాస్త్రవేత్త, విస్తరణ విభాగం , డా.బి.ఎస్.కాంతి శ్రీ, శాస్త్రవేత్త, గృహవిజ్ఞాన విభాగం, డా. టి.విజయ నిర్మల, శాస్త్రవేత్త, పశుపోషణ విభాగం. Ph: 93989 82828

Read More

ఔషధ మొక్క… మోషపత్రి

మోషపత్రి ఒక వార్షిక మొక్క. దీని కాండం నిటారుగా ఉండి గోధుమ రంగు లేదా ఊదా గోధుమ రంగుతో ఉంటుంది. మొక్క నూగు లేకుండా సహజంగా 30 నుండి 100 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు 3-5 సెం.మీ. పొడవుండి 2 లేదా 3 చిన్న ఆకులుగా విడిపోతాయి. ఆకులు అధిక సువాసన కలిగి ఉంటాయి. ఎండిన ఆకులలో 0 నుండి 1.5% వరకు ఆర్టెమిసినిన్ రసాయనముంటుంది. పూలు 2-2.5 మి.మీ. వ్యాసంతో వదులుగా ఉన్న కంకులతో ఏర్పడతాయి. వాటి రంగు ఆకుపచ్ౘ్పసుపు రంగులో ఉంటుంది. గింజలు గోధుమ రంగులో 0.6-0.8 మి.మీ. వ్యాసంలో ఉంటాయి. సగటు 1000 గింజల బరువు 0.03 గ్రా.

సాధారణ నామం : స్వీట్ వార్మ్‌వుడ్/స్వీట్ అన్నీ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా యాన్యువా కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మోషపత్రిని సంప్రదాయకంగా మలేరియా అనుబంధ జ్వరాలతో సహా జ్వరాల చికిత్సకుపయోగిస్తారు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మోషపత్రిలో ఉండే ఆర్టెమిసినిన్ రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది.
  • మోషపత్రి రసంలో ఉండే ఆర్టెమిసినిన్, ఆర్టెసునేట్‌లు క్యాన్సర్ చికిత్సలో అధ్యయనం చేయబడుతున్నాయి. వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వచ్చే జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఇవి ముఖ్యంగా డీసెంట్రి, సాధారణ జలుబు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ నివారణలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆకలి లేకపోవడం, ఇతర జీర్ణ సంబంధ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. సోరియాసిస్, ఎక్ౙిమా వంటి చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • మోషపత్రి ఆకు ద్రావణం అధిక నష్టం కలిగించే లెస్సర్ మల్బరి పైరాలిడ్, గ్లెåఫోడెస్ పైలోయాలిస్ గుడ్లు పొదగడాన్ని అరికట్టింది (రోయాకోస్రలి, అతని అనుచరులు, 2010).
  • మోషపత్రి ఆకు ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగుల నివారణలో అనేక విధాలుగా బలమైన ప్రభావాన్ని చూపాయి. అవి వికర్షక, ఫూమిగెంట్, యాంటిఫీడెంట్, ఎంజైమ్‌ల చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పులు తెచ్చే పురుగులను నివారించాయి (సెండి, కోస్రలి, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూమిగెంట్ చర్య ద్వారా ఎర్ర చీమలను నివారించాయి (లియాంగ్ టాంగ్, అతని అనుచరులు, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ మరియు ద్రావణాలు వికర్షక, ఫ్యూమిగెంట్, యాంటీ పీడెంట్ చర్యలు, ఎంజైమ్ చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పు చర్యల ద్వారా పురుగులను సమర్ధవంతంగా నివారించాయి.
  • మోషపత్రి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే బీటిల్ ట్రైబోలియం కాస్టానియంని సమర్ధవంతంగా నివారించింది (జులాటి సెండి, అతని అనుచరులు, 2003)
  • మోషపత్రి వేరులోని ఎసెన్షియల్ ఆయిల్ 80% ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులను నివారించింది (గోయెల్, అతని అనుచరులు, 2007)
  • మోషపత్రి { మిరప ద్రావణాల మిశ్రమం ప్రత్తి పంటలో గులాబి రంగు కాయతొలుచు పురుగు (పెక్టినోఫొరా గాస్సిపియెల్లా)ను సమర్థవంతంగా నివారించింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు ట్రెబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లపై విషపూరిత మరియు వికర్షణ ప్రభావాలను చూపించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2000).
  • మోషపత్రి ద్రావణం (500 పిపియం మరియు 250 పిపియం) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట, రోటివెంక్యులస్ రెనిఫార్మిస్ నెమటోడ్లను నివారించింది (షకీల్, అతని అనుచరులు, 2004).
  • మోషపత్రి ఆల్కహాల్ ద్రావణం (32.69%) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట గుడ్లను అత్యంత సమర్థవంతంగా పొదగకుండా చేశాయి (కటారి, అతని అనుచరులు, 2011).
  • మోషపత్రి 15, 10, మరియు 5% మిథనాల్ ద్రావణాలు పొటాటో పొడి కుళ్లు కల్గించే శిలీంద్రం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలనరికట్టడం, శిలీంద్ర బీజాలు మొలకెత్తకుండా చేయడంలో అత్యుత్తమ ప్రభావం చూపాయి. మోషపత్రి15% మిథనాల్ ద్రావణం ఆలుగడ్డ దుంపల నిల్వ సమయంలో వేరుకుళ్ళు (డ్రైరూట్ రాట్) తెగులు ఆశించకుండా కాపాడింది (మసౌద్ జాకర్, 2014).
  • మోషపత్రి ద్రావణం క్యూలెక్స్ లార్వాలను నివారించింది (శర్మ, శ్రీవాస్తవ, 1998).
  • మోషపత్రి ద్రావణం కాలీఫ్లవర్ నాశించే డైమండ్ బ్యాక్‌మాత్ ప్లూటెల్లాక్ౙెలోస్టెల్లా గుడ్లను 77.7% చంపింది (రాకేష్‌కుమార్, అతని అనుచరులు, 2009).
  • మోషపత్రి ద్రావణం ప్రత్తి పంటనాశించే గులాబి రంగు కాయతొలుచు పురుగు లార్వాలు, జీవిత చక్రం, జీవిత కాలం, గుడ్లు పెట్టే సామర్థ్యం, గుడ్లు పొదిగే శాతంపై ప్రతికూల ప్రభావం చూపింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎండుఆకులు కలుపు మొక్క రెడ్‌రూట్ పిగ్ వీడ్‌పై అల్లెలోపతి ప్రభావం చూపాయి. (లైడాన్, అతని అనుచరులు, 1997).
  • మోషపత్రిలో ఉండే అర్టెమిసినస్ అనే రసాయనం స్ట్రెåగా విత్తనాలు మొలకెత్తడాన్ని నివారించింది. కాని చిక్కుడు, మొక్కజొన్న విత్తనాలపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (గోమెజ్, 2011).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారించడానికి ఉపయోగించవచ్చు. (మొటాగి, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి తాజా ఆకులు, ఎండిన పదార్థం నుండి తయారు చేసిన ద్రావణాలు బఠాణి పేనుబంక (ఆక్రితోసైఫం పైసమ్) రెక్కలు లేని ఆడపురుగులు, లార్వాలను చంపాయి. అంతేగాక, ఎండు పదార్థం కొలరాడో బీటిల్ పెద్ద పురుగులు తినడాన్ని అరికట్టాయి. ఎండు పదార్థం ద్రావణాలు (5%, 10%), తాజా ఆకుల ద్రావణం (30%) లీఫ్ బీటిల్ లార్వాల నష్టాన్ని తగ్గించాయి (మిలెనారూసిన్, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా హెర్బాఆల్పా ఎథిరిక్ ద్రావణం గ్రీన్‌పీచ్ ఎపిడ్, మైజస్ పెర్సికెని 100% నివారించింది (బిలాల్‌నియ, అతని అనుచరులు, 2015)
  • ఆర్టెమిసియా వుల్గారిస్ అద్భుతమైన యాంటిఫీడెంట్ లక్షణాలు కలిగి ఉంది (గురుసుబ్రమణ్యం, అతని అనుచరులు, 2008). ఈ మొక్కను పూత రాక ముందు సేకరించి ఆకులను, కాండాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఒక కిలో కత్తిరించిన ఆకులు, కొమ్మల ముక్కలను ఒక బకెట్‌లో తీసుకుని 10 లీ. నీరు పోసి 16-24 గంటలుంచాలి. తర్వాత ఈ ద్రావణాన్ని వడపోసి తేయాకు పంటనాశించే పురుగుల నివారణకు పిచికారి చేయాలి. 10% ద్రావణం పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు.
  • మోషపత్రి అగ్రో మరియు డిస్టిలేషన్ వ్యర్థాలనుపయోగించి తయారు చేసిన వర్మికంపోస్టు టమాట రూట్‌నాట్ నెమటోడ్‌ని సమర్థవంతంగా నివారించింది (పాండె & కల్రా, 2010).
  • ఆర్టెమిసియా స్పీసీస్‌ని టమాట రూట్‌నాట్ నెమటోడ్ యాజమాన్యంలో జీవ సేంద్రియ వ్యర్థంగాను, ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణం గాను ఉపయోగిస్తారు (బావ, అతని అనుచరులు, 2014, పాండె, 2005).
  • మెలాయిడోగైన్ ఇన్ కాగ్నిట (నెమటోడ్) యాజమాన్యంలో మోషపత్రి భూమి క్రింది భాగం (వేరువ్యవస్థ) వికర్షక చర్య ప్రదర్శిస్తుంది. మాషపత్రి వోలటైల్ రసాయనాలలో మోనోటెర్పిన్స్, సెస్క్యిటెర్పిన్స్ అధికంగా ఉంటాయి. అందువలన దీనిని \మాటలో అంతర పం\గా వేసి రూట్‌నాట్ నెమటోడ్‌ని నివారించవచ్చు. (సిడ్ని మ్వాంబ, 2016).
  • మోషపత్రి ద్రావణాన్ని ఉపయోగించి పొగాకు పంటనాశించే పేనుబంకను నివారించవచ్చు. ద్రావణం తయారీకి తాజా ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టి, ఆల్కహాల్‌లో రాత్రంతా నానబెట్టాలి. ఈ ద్రావణం పొగాకు పేనుబంకను సమర్ధవంతంగా చంపుతుంది. పొగాకు మొగ్గతొలిచే పురుగుని ఇథనాల్ ద్రావణం సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • మోషపత్రి మిథనాల్ ద్రావణం లెస్సర్ మల్బరి పై రాలిడ్ (గ్లెåసోడెస్ పైలాలిస్)ని పంటనాశించకుండా ఆటంక పరచింది (రోయాకోసార్వి, అతని అనుచరులు, 2010).
  • ప్రత్తి మరియు ఇతర ముఖ్య పంటలనాశించే శనగపచ్చ పురుగు (హెలివకోర్సా ఆర్మిజెరా) నివారణకు మాషపత్రి ఎసెన్షియల్ ఆయిల్‌ని సిఫారసు చేశారు (మహ్‌బేబ్‌కర్, అతని అనుచరులు, 2015).
  • మోషపత్రి ఎసెన్షియర్ ఆయిల్ మరియు ఆకు ద్రావణాలను హెలికోవర్మా ఆర్మిజరాలార్వాల ఆహారంలో కలిపితే లార్వాల బరువు 69.71% మరియు 60.21% తగ్గింది (నీలిమ అన్షుల్, ఆమె అనుచరులు, 2014)
  • గుమ్మడి నారు మొక్కలలో పురుగుల నివారణకు మాషపత్రి ద్రావణం పురుగులను తట్టుకునే చర్య కలిగి ఉంది (యుయు, 2017)
  • మాషపత్రి ఆకులు, కాండం, పూల నుండి తయారు చేసిన ద్రావణాన్ని గుమ్మడి ఆకు కణాలపై ఒక చదరపు సెంటీమీటరుకి 1.5 మి.గ్రా. చొప్పున పిచికారి చేస్తే 100% ఎపిలాక్నా పీన్సులేటా లార్వాలు 87% స్పోడోప్టెరా ఎరిడానియా లార్వాలు తినకుండా ఆటంక పరచబడ్డాయి (డిటర్రెంట్ చర్య). (మాగి, ఆమె అనుచరులు, 2005)
  • మోషపత్రి ద్రావణం పొటాటో సిస్ట్ నెమటోడ్ (గ్లోబోడెరా రోస్టోకైనెన్సిస్) చిన్న పురుగులను అతి సమర్ధవంతంగా నివారించింది. కాని మెలాయి డోగైన్ ఇన్‌కాగ్నిట చిన్న పురుగులు (జువైనైల్స్) ఎక్కువ కాలం బయలుపరిచితేనే చనిపోయాయి. దీనికి విరుద్ధంగా ఈ ద్రావణం ప్రభావం మెలాయిడోగైన్ గుడ్లు పొదగడాన్ని అత్యంత సమర్ధవంతంగా నివారించింది కాని గ్లోబొడెరాపై అత్యంత తక్కువ ప్రభావం చూపింది. సేంద్రియ వ్యవసాయంలో సుస్థిర నులిపురుగుల యాజమాన్యంలో మోషపత్రి ద్రావణం ముఖ్య పాత్రపోషిస్తుంది. (అడ్డాబ్బో, అతని అనుచరులు, 2013)
  • 15% మోషపత్రి ద్రావణం బంగాళాదుంపలలో ఫ్యుజేరియం సొలాని కలిగించే పొడి వేరుకుళ్ళుని సమర్ధవంతంగా నివారించింది (మసాద్‌జాకర్, 2014).
  • టెట్రానికస్ సిన్నబారినస్ (నల్లి)ని మోషపత్రి 5 మి.గ్రా./మి.లీ. అసిటోన్ ద్రావణం 100% నివారించింది (జాంగ్‌యోంగ్ క్వియాంగ్, అతని అనుచరులు, 2008).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పంటకాలం పెరుగుదలకు ‘వండర్ ఆయిల్స్’

ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది. 

ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.

Read More

పంట వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చే ట్రైకోడెర్మా విరిడె ద్రావణం

ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని రైతులే సులభంగా తయారు చేసుకునే పద్ధతిని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని 100 మి.లీ. సీసాల్లో నింపి వ్యవసాయ కార్యాలయాల ద్వారా రైతులందరికీ రూ. 20 కి. అందించనున్నారు. ఈ ఒక్కసీసా రూ. 40 వేల విలువైన 200కి. ట్రైకోడెర్మా విరిడె పొడితో సమానంగా పనిచేస్తుంది.

తయారీకి కావలసిన పదార్థాలు :

  • 200 లీ. నీరు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ లేదా సిమెంటు తొట్టి
  • 200 లీ. నీరు * 2 కి. బెల్లం
  • ట్రైకోడెర్మా విరిడె కల్చర్ (చిక్కని ద్రావణం) – 100 మి.లీ. సీసా

తయారీ పద్ధతి : నీడలో ఉంచిన డ్రమ్ములో 200 లీ. నీరు పోయాలి. 2 కిలోల బెల్లాన్ని పొడి చేసి నీటిలో వేసి కలిసేలా త్రిప్పాలి. సీసాలోని ట్రైకోడెర్మా విరిడె చిక్కని ద్రావణాన్ని బెల్లం కలిపిన నీటిలో పోసి కలియత్రిప్పాలి. డ్రమ్ముపైన మూత ఉంచాలి. ఉదయం, సాయంత్రం కర్రతో ఒక నిమిషం కలియత్రిప్పాలి. దీనిలో ట్రైకోడెర్మా విరిడె శిలీంద్రం విపరీతంగా పెరుగుతుంది. 4, 5 రోజులకు ద్రావణం వాడటానికి సిద్ధమౌతుంది.

ప్రతిసారి కొత్త సీసాలను కొనవలసిన అవసరం లేదు. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కలిపాక అందులో నుంచి 2 లీటర్ల ద్రావణాన్ని తీసి ప్రక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ద్రావణం తయారు చేసుకునేటపుడు 2 కిలోల బెల్లంతో పాటు 200 లీటర్ల నీటిలో కలిపితే రెండు రోజుల్లో మళ్ళీ సిద్ధమౌతుంది. బెల్లం రంగులో వుండే నీరు 2 రోజులకు తెల్లగా మారుతుంది. ఈ ద్రావణం రెండేళ్ళు నిల్వ ఉంటుంది. వెంటనే ప్రభావం చూపుతుంది. తయారు చేసుకున్న 5 లీటర్ల ద్రావణాన్ని ఒక క్యాన్‌లో పోసి మూత పెట్టుకోవాలి. 200 లీ. నీటిలో 2 కిలోల బెల్లంతోపాటు ఈ 5 లీటర్ల ద్రావణం కలపాలి. రెండురోజుల్లో మళ్ళీ వాడుకోవచ్చు. 15 రోజులకొకసారి పిచికారి, నెలకోసారి సాగునీరు లేదా డ్రిప్ ద్వారా ఇవ్వాలి.

ప్రయోజనాలు : విత్తనశుద్ధి : విత్తుకునే అరగంట ముందు విత్తనాలను ట్రైకోడెర్మా విరిడె ద్రావణంలో ముంచి తీయాలి. నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళడానికి : ఈ ద్రావణాన్ని పిచికారి చేస్తే పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారుతుంది.

కంపోస్టు తయారీలో : చెట్ల నీడలో ప్లాస్టిక్ షీట్ పరచి దానిపై పంట వ్యర్థాలను పొరలా వేయాలి. 10 లీ. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని పిచికారి చేయాలి. ఇలా 4Ð7 పొరల వరకు వేసుకుంటూ ద్రావణాన్ని పిచికారి చేయాలి. ప్రతి 7 రోజులకోసారి కంపోస్టుని తిరగెయ్యాలి. 60 శాతం తేమ ఉండేలా చూడాలి. 40 రోజులకు కంపోస్టు సిద్ధమౌతుంది.

ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కర్ణాటక, కేరళ రాష్ట్రాల సేంద్రియ రైతులు పంటలు, తోటల్లో వాడుతున్నారు. దీనిని 1:1 నిష్పత్తిలో కలిపి 15 రోజులకోసారి ఎకరా పంటపై పిచికారి చేయాలి. పంటకు నెలకోసారి కాలువల ద్వారా సాగు నీటితో కలిపి పారించాలి లేదా డ్రిప్ / స్ప్రింక్లర్ ద్వారా ఇవ్వవచ్చు. జీవామృతం ఇచ్చిన రోజునే ఈ ద్రావణాన్ని యిచ్చినా ఫర్వాలేదు. కానీ వేర్వేరుగా ఇవ్వాలి. భూమిలో నివసించే శిలీంద్రాల ద్వారా కలిగే మాగుడు తెగులు, వేరుకుళ్లు, ఎండు తెగుళ్లను సమర్దవంతంగా అరికడుతుంది.
Read More

పరిరక్షణ వ్యవసాయం: నేల ఆరోగ్యం, దిగుబడి మరియు వాతావరణ స్థితిస్థాపకతకు ఒక సుస్థిర మార్గం

పెరుగుతున్న జనాభా, నేల క్షీణత, అస్థిర వాతావరణం ఈ మూడు ఒత్తిళ్లు నేటి ప్రపంచ వ్యవసాయాన్ని చుట్టుముట్టాయి. లోతైన నాగలి దుక్కి మీద ఆధారపడిన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు నేల కోతకు, పోషకాల నష్టానికి కారణమవుతున్నాయని దశాబ్దాలుగా గుర్తించబడింది. ఈ నేపథ్యంలో, 1970లలో అమెరికాలో మొదలై బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా వంటి దేశాలకు విస్తరించిన పరిరక్షణ వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. 1970లో కేవలం 10 లక్షల హెక్టార్లలో ఉన్న పరిరక్షణ వ్యవసాయం విస్తీర్ణం, 2019 నాటికి 102 దేశాల్లో సుమారు 20.5 కోట్ల హెక్టార్లకు (ప్రపంచ సాగుభూమిలో దాదాపు 15%) పెరిగింది.

పరిరక్షణ వ్యవసాయం అనేది ఒకే ఒక్క పద్ధతి కాదు ఇది మూడు అంశాల సమీకృత వ్యవస్థ:
(1) కనీస యాంత్రిక నేల కదలిక, (2) పంట అవశేషాలు లేదా కవర్ పంటల ద్వారా నేలపై శాశ్వత సేంద్రియ కవచం, (3) పంట మార్పిడి లేదా అంతర పంటల ద్వారా జీవవైవిధ్యం.

తక్కువ కదలిక నేల కణాల నిర్మాణాన్ని కాపాడితే, ఉపరితల అవశేషాలు వర్షపు దెబ్బ నుండి, తేమ నష్టం నుండి ఆ నిర్మాణాన్ని కాపాడతాయి. పంట మార్పిడి జీవ కార్యకలాపాలను పునరుద్ధరించి, చీడపీడల చక్రాలను విచ్ఛిన్నం చేస్తుంది.

నేల ఆరోగ్యంపై ప్రభావం

పరిరక్షణ వ్యవసాయం వల్ల కలిగే జీవశాస్త్రపరమైన మార్పులు అత్యంత స్థిరంగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ ప్రకారం, అవశేషాల నిలుపుదలతో కూడిన సున్నా-దుక్కి పద్ధతి పై 20 సెం.మీ నేలలో సూక్ష్మజీవుల జీవద్రవ్యరాశిని 37% పెంచుతుంది (శిలీంధ్రాలలో 31%, బ్యాక్టీరియాలో 11% పెరుగుదల). ఇండో-గంగా మైదానాల్లో ఆరేళ్ల అధ్యయనంలో సున్నా-దుక్కి పద్ధతి ఎగువ 15 సెం.మీ నేలలో హెక్టారుకు సుమారు 2 టన్నుల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేసినట్లు తేలింది. అయితే ఈ కర్బన నిల్వ లోతును బట్టి మారుతుంది 60 సెం.మీ లోతు వరకు కొలిచినప్పుడు సాంప్రదాయ, సున్నా-దుక్కి పద్ధతుల మధ్య తేడా గణనీయంగా తగ్గిపోతుందని మరో అధ్యయనం హెచ్చరిస్తోంది. మృత్తిక స్థూల సాంద్రత విషయంలో మాత్రం సాహిత్యంలో నిజమైన భిన్నాభిప్రాయం ఉంది కొన్ని అధ్యయనాలు స్వల్ప పెరుగుదలను, మరికొన్ని తగ్గుదలను నివేదిస్తున్నాయి.

చిత్రం 1: పరిరక్షణ వ్యవసాయపు మూడు మూలస్తంభాలు పరస్పరం బలపరుచుకునే ఒక సమీకృత వ్యవస్థ.

దిగుబడి, ఆర్థిక అంశాలు
మెటా-విశ్లేషణ ప్రకారం, సున్నా-దుక్కి పద్ధతి సగటున 5.1% దిగుబడి తగ్గుదలకు దారితీస్తుంది. కానీ ఇది పంట, వాతావరణం మేరకు చాలా తేడాగా ఉంటుంది నూనెగింజలు, పత్తి, పప్పుధాన్యాలలో తగ్గుదల లేదు; మొక్కజొన్న, వరిలో ఎక్కువ తగ్గుదల (సుమారు 7.5%) కనిపించింది. పొడి వాతావరణాలలో వర్షాధార పంటలకు సున్నా-దుక్కి పద్ధతి సాంప్రదాయ పద్ధతితో సమానంగా లేదా మెరుగ్గా పనిచేస్తుంది. మలావిలో జరిగిన క్షేత్ర అధ్యయనాల్లో పరిరక్షణ వ్యవసాయ ఆధారిత మొక్కజొన్న పంట దిగుబడిని 22 – 31%, రైతు ఆదాయాన్ని 50 – 83% పెంచడంతో పాటు హెక్టారుకు 28–39 పని దినాల శ్రమను తగ్గించాయి. పంట మార్పిడి, సరైన పొషకాల యాజమాన్యం లేకుండా పరిరక్షణ వ్యవసాయం పూర్తి ప్రయోజనాలు అందించదని గమనించాలి.

వాతావరణ స్థితిస్థాపకత, కర్బన నిల్వ
ఉత్తర చైనా మైదానంలో జరిగిన ఎనిమిదేళ్ల వేడెక్కింపు ప్రయోగంలో, పరిరక్షణ వ్యవసాయం పద్ధతిలో నేల చల్లగా, తేమగా ఉండి, శీతాకాల గోధుమ దిగుబడి వేడెక్కింపు వల్ల 9.3% పెరిగింది. ఈ ప్రయోజనం సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత బలపడటం గమనార్హం ఇది స్థిరమైన, కాలానుగుణంగా పెరిగే ప్రయోజనమని సూచిస్తుంది. అదేవిధంగా, నో-టిల్ మరియు తగ్గిన దుక్కి పద్ధతులు నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలను సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే సుమారు 11% తగ్గిస్తాయని ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ తెలిపింది, ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కలుపు యాజమాన్యం, ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికత
నేల కదలిక తగ్గించడం వల్ల దుక్కి ఆధారిత కలుపు నియంత్రణ తొలగిపోతుంది కాబట్టి, విత్తడం, ఎరువులు, కలుపు/చీడ నియంత్రణ వంటి పనులను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడే జిపిఎస్-ఆధారిత యంత్రాలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్‌లు , జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, వేరియబుల్-రేట్ టెక్నాలజీ వంటి ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి. అవశేషాల కవచం వల్ల నేలపై కలుపు మొక్కలను గుర్తించడం కష్టతరం కావడంతో, డ్రోన్‌ చిత్రాల ఆధారంగా కృతిమ మేధస్సు (ఏ ఐ/ఎం ఎల్/డి ఎల్) సాయంతో కలుపు మ్యాపింగ్, స్థల-ఆధారిత హెర్బిసైడ్ ప్రయోగం వంటి పద్ధతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే యంత్రాలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం చిన్న, సన్నకారు రైతులకు ఈ సాంకేతికతలను చేరువ చేయడంలో పెద్ద అడ్డంకిగా మిగిలిపోయింది.

చిత్రం 2: ఖచ్చితమైన వ్యవసాయం మరియు కలుపు యాజమాన్యం. డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ మరియు కృతిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి కలుపు మొక్కలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం మరియు లక్షిత ప్రాంతాల్లో మాత్రమే నియంత్రణ చర్యలను చేపట్టే విధానాన్ని ఈ వైజ్ఞానిక చిత్రపటం వివరిస్తుంది. ఇది చిన్న రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి మరియు సాంకేతిక సవాళ్లను కూడా సూచిస్తుంది

సవాళ్లు, స్వీకరణలో అడ్డంకులు
పంట అవశేషాలను పశువుల మేతకు వాడాల్సిన అవసరం, యంత్రాలు-రుణాల లభ్యత, లింగ ఆధారిత అసమానతలు, విస్తరణ సేవల కొరత ఇవన్నీ ముఖ్యంగా చిన్నకారు, వర్షాధార రైతాంగంలో పరిరక్షణ వ్యవసాయం స్వీకరణను నెమ్మదిస్తున్నాయి. అదేవిధంగా, నేల కర్బన కొలత లోతు, నత్రజని ఆక్సైడ్ కొలత విధానాలలో ప్రామాణికత లేకపోవడం వంటి పద్దతిపరమైన అసమానతలు ఈ రంగంలో పరిష్కరించాల్సిన ముఖ్యమైన పరిశోధన అంతరాలుగా మిగిలాయి.

ముగింపు
పరిరక్షణ వ్యవసాయం నేల సూక్ష్మజీవుల ఆరోగ్యం, ఇంధన-శ్రమ ఆదా, నిర్దిష్ట పరిస్థితులలో దిగుబడి స్థిరత్వం వంటి నిజమైన ప్రయోజనాలను అందిస్తుందని ఈ సమీక్ష స్పష్టం చేస్తుంది. అయితే బల్క్ డెన్సిటీ, పరాగసంపర్క కీటకాలపై ప్రభావం వంటి అంశాల్లో సాహిత్యంలో ఇప్పటికీ నిజమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భవిష్యత్తులో పరిరక్షణ వ్యవసాయం ను కేవలం ఒక స్థిర ప్యాకేజీగా కాకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమర్చుకోగల సమీకృత వ్యవస్థగా, ఖచ్చితమైన సాంకేతికతతో మేళవించి అభివృద్ధి చేయడం ద్వారానే స్థిరమైన వ్యవసాయ లక్ష్యాలను చేరుకోవచ్చు.

ఇతర వివరముల కొరకు , ఈమెయిల్ మరియు ఫోన్: jcharleswesley@gmail.com, +91 8331816872, చార్లెస్ వెస్లీ జె., పిహెచ్.డి స్కాలర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. తిరుమలైకుమార్ ఆర్., అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. సరవణన్ ఎస్., ప్రొఫెసర్, వి.ఐ.టి, వెల్లూరు.

చార్లెస్ వెస్లీ జె¹, తిరుమలైకుమార్ ఆర్², సరవణన్ ఎస్³*
¹, ²&³ వి ఐ టి స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ అండ్ అడ్వాన్స్‌డ్ లెర్నింగ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రోనమీ, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), వెల్లూరు, తమిళనాడు, భారతదేశం.

Read More

ఆధునిక వ్యవసాయానికి మొబైల్ యాప్‌లు – రైతులకు డిజిటల్ మార్గదర్శి

“వ్యవసాయమే భారతదేశానికి వెన్నెముక” అనే మాట నేటికీ సత్యమే. అయితే నేటి రైతు వ్యవసాయం చేయడం అంత సులభం కాదు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కొత్తరకం పురుగులు–తెగుళ్ల విజృంభణ, నేల సారం తగ్గుదల, పోషక లోపాలు, నీటి కొరత వంటి ఎన్నో సమస్యలు పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన సమయంలో సరైన సమాచారం రైతుకు అందడం అత్యంత అవసరం. డిజిటల్ సాంకేతికత విస్తరించిన ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ రైతుకు మరో వ్యవసాయ పనిముట్టుగా మారింది. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఇప్పుడు రైతు తన పొలానికి సంబంధించిన అనేక విషయాలను క్షణాల్లో తెలుసుకునే అవకాశం కలిగింది. పురుగులు, తెగుళ్లను గుర్తించడం నుంచి వాతావరణ సూచనలు తెలుసుకోవడం వరకు, పంటల సాగు సలహాలు పొందడం నుంచి ఎరువులు, మందుల వినియోగంపై సూచనలు తెలుసుకోవడం వరకు అనేక సేవలు మొబైల్ యాప్‌ల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు మరియు వ్యవసాయ నిపుణుల నుంచి శాస్త్రీయ సలహాలను కూడా నేరుగా రైతుల చేతికి చేరవేస్తున్నాయి. దీనివల్ల రైతులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని నష్టాలను తగ్గించుకోవడంతో పాటు దిగుబడిని పెంచుకునే అవకాశం పొందుతున్నారు.

రైతులకు ఈ సేవలను మరింత చేరువ చేయడానికి భారత ప్రభుత్వంతో పాటు పలు వ్యవసాయ పరిశోధనా సంస్థలు అనేక మొబైల్ అప్లికేషన్లను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చాయి. వీటిని గూగుల్ ప్లే స్టోర్ లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్ల నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించవచ్చు. ఈ యాప్‌లు పరిశోధనలో రూపొందిన శాస్త్రీయ సాంకేతికతను నేరుగా రైతు పొలం వరకు తీసుకెళ్లే వారధిగా పనిచేస్తున్నాయి.

  1. Plantix (ప్లాంటిక్స్)
    ప్రపంచవ్యాప్తంగా రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్న వ్యవసాయ మొబైల్ అప్లికేషన్లలో ప్లాంటిక్స్ (Plantix) ఒకటి. రైతులు దీనిని “పంటల డాక్టర్” అని కూడా పిలుస్తుంటారు. పంటలో కనిపించే సమస్యలను వేగంగా గుర్తించి శాస్త్రీయ పరిష్కారాలను సూచించడం ఈ యాప్ ప్రత్యేకత. రైతులు పంట ఆకులు, కాండం, కాయలు లేదా ఇతర భాగాలపై కనిపించే లక్షణాలను మొబైల్‌తో ఫోటో తీసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే, కేవలం కొన్ని సెకన్లలోనే సమస్యను విశ్లేషించి అది పురుగు ఉధృతా, తెగులా లేదా పోషక లోపమా అనే విషయాన్ని గుర్తించి తెలియజేస్తుంది. అంతేకాకుండా సమస్యకు కారణాలు, నివారణ చర్యలు, సిఫారసు చేసిన పురుగుమందులు లేదా శిలీంద్రనాశకాలు, పోషక నిర్వహణ పద్ధతులను కూడా సూచిస్తుంది.

ఈ యాప్‌లో 700 కంటే ఎక్కువ పంటల పురుగులు, తెగుళ్లు మరియు పోషక లోపాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంది. రైతులు ప్రపంచంలోని ఇతర రైతులతో తమ అనుభవాలను పంచుకునే అవకాశం కూడా ఇందులో కల్పించారు. అలాగే, GPS సాంకేతికత ఆధారంగా సమీప ప్రాంతాల్లో ఏవైనా పురుగులు లేదా తెగుళ్లు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లయితే ముందుగానే హెచ్చరికలు అందిస్తుంది. స్థానిక వాతావరణ సమాచారాన్ని కూడా అందించడం వల్ల పిచికారీ, కలుపు నివారణ, నీటిపారుదల వంటి వ్యవసాయ పనులను సరైన సమయంలో చేపట్టేందుకు రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.

రైతులకు ఉపయోగాలు
పంటలో కనిపించే లక్షణాలు ఏ సమస్యకు సంబంధించినవో తెలియక రైతులు తరచూ అయోమయానికి గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో ప్లాంటిక్స్ యాప్ తక్షణమే సమస్యను గుర్తించి శాస్త్రీయ పరిష్కారాలను సూచించడం ద్వారా సరైన మందును, సరైన మోతాదులో, సరైన సమయంలో ఉపయోగించేందుకు దోహదపడుతుంది. దీంతో అనవసరంగా మందుల వినియోగం తగ్గి సాగు ఖర్చులు ఆదా కావడంతో పాటు పంటను నష్టాల నుంచి కాపాడుకోవచ్చు. రైతు చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను “వ్యవసాయ సలహాదారుగా” మార్చే యాప్‌లలో ప్లాంటిక్స్ ఒకటి.

  1. RiceXpert (రైస్ ఎక్స్‌పర్ట్)
    వరి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐసీఏఆర్–జాతీయ వరి పరిశోధన సంస్థ- కటక్ అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ రైస్ ఎక్స్‌పర్ట్ (RiceXpert). వరి సాగుకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఒకే వేదికపై రైతులకు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ యాప్, వరి రైతులకు డిజిటల్ వ్యవసాయ సహాయకుడిగా పనిచేస్తోంది.

పొలంలో కనిపించే పురుగులు, తెగుళ్లు, నులిపురుగులు (నెమటోడ్లు), కలుపు మొక్కలు, పోషక లోపాలు లేదా పోషకాల అధికత వంటి సమస్యలను రైతులు ఈ యాప్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. సమస్యకు సంబంధించిన ఫోటో, సందేశం లేదా వాయిస్ రికార్డును పంపితే నిపుణుల నుంచి శాస్త్రీయ సలహాలు అందుతాయి. అంతేకాకుండా, సమస్యకు అనుగుణంగా సిఫారసు చేసిన పురుగుమందు, దాని సరైన మోతాదు, ఎరువుల లెక్కింపు (Fertilizer Calculator) వంటి వివరాలను కూడా ఈ యాప్ అందిస్తుంది.

ఈ యాప్‌లో వివిధ వరి రకాలు, వ్యవసాయ యంత్రాలు, వాతావరణ సమాచారం, తాజా వ్యవసాయ వార్తలు, ఈ-సలహా (e-Advisory), ఈ-మార్కెటింగ్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. రైతులు తమ సందేహాలను నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలకు పంపి తక్షణ పరిష్కారం పొందవచ్చు. అలాగే వరి ఉత్పత్తులను కొనుగోలుదారులకు పరిచయం చేసే అవకాశాన్ని కూడా ఈ యాప్ కల్పిస్తుంది.

రైతులకు ఉపయోగాలు
వరి సాగులో ఎదురయ్యే సమస్యలను త్వరగా గుర్తించి, సరైన సమయంలో సరైన నివారణ చర్యలు చేపట్టేందుకు రైస్ ఎక్స్‌పర్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎరువులు, పురుగుమందులను ఖచ్చితమైన మోతాదులో వినియోగించడానికి మార్గనిర్దేశం చేయడం వల్ల సాగు ఖర్చులు తగ్గి, పంట దిగుబడి మరియు నాణ్యత మెరుగుపడతాయి. అంతేకాకుండా, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు నేరుగా రైతుల చేతికి చేరడం ద్వారా శాస్త్రీయ వరి సాగు మరింత సులభంగా మారుతుంది.

  1. Crop Doctor (క్రాప్ డాక్టర్)
    క్రాప్ డాక్టర్ (Crop Doctor) అనేది రైతులు తమ పంటల్లో వచ్చే సమస్యలను త్వరగా గుర్తించి, శాస్త్రీయ పరిష్కారాలను పొందేందుకు రూపొందించిన మొబైల్ అప్లికేషన్. దీనిని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం (IGKV), రాయ్‌పూర్ మరియు నేషనల్ ఇఇన్ఫర్ మాటిక్స్ సెంటర్ (NIC) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ యాప్ ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు కూడా సులభంగా ఉపయోగించుకునే విధంగా రూపొందించబడింది.

రైతులు పంటలో కనిపించే పురుగులు, తెగుళ్లు లేదా పోషక లోపాల లక్షణాలను మొబైల్‌తో ఫోటో తీసి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే, వాటిని విశ్లేషించి సంభావ్య సమస్యను గుర్తించి తగిన యాజమాన్య సూచనలను అందిస్తుంది. వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు వంటి ప్రధాన పంటలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి నివారణకు అవసరమైన శాస్త్రీయ సలహాలను అందించడం ఈ యాప్ ప్రత్యేకత. అదనంగా, ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, తాజా వ్యవసాయ సమాచారం వంటి ఉపయోగకరమైన వివరాలను కూడా రైతులకు చేరవేస్తుంది.

రైతులకు ఉపయోగాలు
పంటలో సమస్య కనిపించిన వెంటనే వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్మార్ట్‌ఫోన్ ద్వారానే ప్రాథమిక నిర్ధారణ చేసుకునే అవకాశం ఈ యాప్ కల్పిస్తుంది. సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల సరైన సమయంలో సరైన నివారణ చర్యలు చేపట్టవచ్చు. దీంతో పంట నష్టాన్ని తగ్గించడంతో పాటు, అనవసరంగా పురుగుమందులు లేదా ఎరువుల వినియోగాన్ని కూడా నివారించవచ్చు. రైతులకు శాస్త్రవేత్తల సలహాలను వేగంగా అందిస్తూ, పొలం మరియు వ్యవసాయ నిపుణుల మధ్య వారధిగా ఈ యాప్ సమర్థవంతంగా పనిచేస్తుంది.

  1. Kisan Suvidha (కిసాన్ సువిధా)
    రైతులకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని ఒకే వేదికపై అందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2016లో కిసాన్ సువిధా మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. రైతులు రోజువారీ వ్యవసాయ నిర్ణయాలను సులభంగా తీసుకునేందుకు అవసరమైన అనేక సేవలను ఈ యాప్ ఒకే చోట అందిస్తుంది. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు సులభంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ యాప్ ద్వారా రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పాటు ఐదు రోజుల వాతావరణ సూచనలను తెలుసుకోవచ్చు. దీనివల్ల పిచికారీ, కోత, నీటిపారుదల వంటి వ్యవసాయ పనులను వాతావరణానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకోవచ్చు. అదనంగా, వివిధ పంటలకు సంబంధించిన స్థానిక మార్కెట్ ధరలు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, గోదాములు, కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.

పంటల్లో వచ్చే పురుగులు, తెగుళ్లను గుర్తించి వాటి నివారణకు అవసరమైన సమీకృత పురుగు యాజమాన్య సూచనలు కూడా ఈ యాప్ అందిస్తుంది. అంతేకాకుండా, రైతులు తమ సందేహాలను వ్యవసాయ నిపుణులకు పంపించి వ్యక్తిగత సలహాలు పొందే అవకాశం కూడా కల్పించబడింది. దీంతో శాస్త్రీయ పద్ధతులను అనుసరించి పంటలను సమర్థవంతంగా నిర్వహించడం సులభమవుతుంది.

రైతులకు ఉపయోగాలు
వ్యవసాయానికి సంబంధించిన అనేక సేవలను ఒకే యాప్‌లో అందించడం కిసాన్ సువిధా ప్రత్యేకత. వాతావరణ సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చు. మార్కెట్ ధరల ఆధారంగా సరైన సమయంలో పంటను విక్రయించి మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. అలాగే, శాస్త్రీయ సలహాలు, పురుగులు–తెగుళ్ల నివారణ పద్ధతులు, వ్యవసాయ పరికరాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట పొందడం వల్ల రైతులు సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు శాస్త్రీయంగా, లాభదాయకంగా వ్యవసాయం చేయడానికి ఈ యాప్ ఎంతో దోహదపడుతుంది.

  1. ANGRAU DAATTC App
    ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) ఆధ్వర్యంలోని జిల్లా వ్యవసాయ సలహా మరియు శిక్షణ కేంద్రాలు రైతులకు శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని వేగంగా చేరవేయడానికి ANGRAU DAATTC Appను అభివృద్ధి చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ యాప్, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు రైతుల మధ్య సమర్థవంతమైన సమాచార వారధిగా పనిచేస్తోంది.

ఈ యాప్ ద్వారా రైతులు పంటల వారీగా సాగు సిఫారసులు, మెరుగైన వంగడాల వివరాలు, పురుగులు–తెగుళ్ల గుర్తింపు మరియు యాజమాన్య పద్ధతులు, పోషక నిర్వహణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వంటి శాస్త్రీయ సమాచారాన్ని పొందవచ్చు. అదనంగా, రైతులకు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలకు సంబంధించి వ్యవసాయ నిపుణుల సలహాలు, తాజా వ్యవసాయ సాంకేతికతలు, శిక్షణా కార్యక్రమాలు, క్షేత్ర ప్రదర్శనలు మరియు విశ్వవిద్యాలయం విడుదల చేసే తాజా సూచనలు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి.

ఈ యాప్‌లో రైతులు తమ పంటలో కనిపించే సమస్యలను ఫోటోల రూపంలో పంపించి శాస్త్రవేత్తల సలహాలు పొందే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా, జిల్లాల వారీగా రైతులకు అవసరమైన సాంకేతిక సమాచారం, హెచ్చరికలు మరియు అత్యవసర వ్యవసాయ సూచనలు సకాలంలో అందించడం ద్వారా పంట నష్టాలను తగ్గించేందుకు ఈ యాప్ దోహదపడుతోంది.

రైతులకు ఉపయోగాలు
ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ANGRAU DAATTC App ద్వారా స్థానిక పరిస్థితులకు అనుగుణమైన శాస్త్రీయ వ్యవసాయ సలహాలను సులభంగా పొందవచ్చు. పురుగులు, తెగుళ్లు, పోషక లోపాలు వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చు. అలాగే, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనులను ప్రణాళిక చేసుకోవడంతో పాటు, విశ్వవిద్యాలయం సిఫారసు చేసిన ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవడం, సాగు వ్యయాన్ని తగ్గించడం మరియు లాభదాయకమైన వ్యవసాయాన్ని సాధించడం సాధ్యమవుతుంది.

  1. Kapas Kisan (కపాస్ కిసాన్)
    పత్తి రైతులు తమ పంటను కనీస మద్దతు ధర కింద సులభంగా విక్రయించేందుకు భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ కపాస్ కిసాన్. పత్తి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా మరియు రైతు స్నేహపూర్వకంగా మార్చేందుకు ఈ యాప్‌ను రూపొందించారు.

ఈ యాప్ ద్వారా రైతులు ఇంట్లో నుంచే స్వీయ నమోదు చేసుకోవచ్చు. అనంతరం సమీపంలోని CCI కొనుగోలు కేంద్రంలో పత్తిని విక్రయించేందుకు తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ముందుగానే ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. పత్తి నాణ్యత పరీక్ష, ఆమోదించిన పరిమాణం, చెల్లింపు ప్రక్రియ వంటి వివరాలను కూడా రైతులు తమ మొబైల్‌లోనే రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, విక్రయించిన పత్తికి సంబంధించిన చెల్లింపు స్థితిని కూడా ఈ యాప్ ద్వారా సులభంగా పరిశీలించవచ్చు.

రైతులకు ఉపయోగాలు
కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ప్రభుత్వ MSP కొనుగోలు వ్యవస్థతో అనుసంధానమవుతారు. కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. మొత్తం కొనుగోలు ప్రక్రియ డిజిటల్ రూపంలో ఉండటంతో పారదర్శకత పెరిగి, చెల్లింపుల వివరాలు కూడా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు కనీస మద్దతు ధరను సకాలంలో పొందడంతో పాటు, పత్తి విక్రయ ప్రక్రియను సులభంగా, వేగంగా పూర్తి చేసుకోవచ్చు.

  1. APAIMS 2.0
    ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరియు వ్యవసాయ శాఖకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేయడానికి రూపొందించిన సమగ్ర మొబైల్ అప్లికేషన్ APAIMS 2.0. కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ (ML), ఉపగ్రహ సమాచారం, భౌగోళిక సాంకేతికతలను ఉపయోగించి రైతులకు వేగవంతమైన, పారదర్శకమైన మరియు శాస్త్రీయ సేవలను అందించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యం.

ఈ యాప్ ద్వారా రైతులు ఈ-పంట నమోదు, భూమి వివరాలు, రైతు యూనిక్ ఐడీ, ప్రభుత్వ పథకాల అర్హత, విత్తనాలు, ఎరువుల పంపిణీ, సబ్సిడీలు, పంటల స్థితి, వాతావరణ సమాచారం వంటి అనేక సేవలను ఒకే వేదికపై పొందవచ్చు. అంతేకాకుండా, పొలం స్థాయిలో పురుగులు, తెగుళ్లపై ముందస్తు హెచ్చరికలు, పంటల ఆధారంగా వ్యక్తిగత వ్యవసాయ సూచనలు, సమస్యలను ఫోటోల ద్వారా అధికారులకు పంపే సౌకర్యం కూడా ఇందులో ఉంది. రైతు సేవా కేంద్రాలు (RSKs), వ్యవసాయ అధికారులు మరియు రైతులను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానించడం ద్వారా వ్యవసాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించే ప్రయత్నం ఈ వ్యవస్థ చేస్తోంది.

రైతులకు ఉపయోగాలు
APAIMS 2.0 ద్వారా రైతులు ప్రభుత్వ వ్యవసాయ సేవలను కార్యాలయాల చుట్టూ తిరగకుండా మొబైల్‌లోనే పొందగలుగుతున్నారు. ఈ-పంట నమోదు, ప్రభుత్వ పథకాల లబ్ధి, విత్తనాలు మరియు ఎరువుల పంపిణీ వివరాలు, పంటలపై వ్యక్తిగత సలహాలు, వాతావరణ హెచ్చరికలు వంటి సేవలు ఒకే యాప్‌లో అందుబాటులో ఉండటం వల్ల సమయం, శ్రమ ఆదా అవుతాయి. అంతేకాకుండా, పొలం స్థాయిలో ముందస్తు పురుగు–తెగుళ్ల హెచ్చరికలు అందడం వల్ల రైతులు తక్షణ నివారణ చర్యలు చేపట్టి పంట నష్టాలను తగ్గించుకోవచ్చు. రాష్ట్రంలో డిజిటల్ వ్యవసాయానికి నాంది పలికిన సమగ్ర వ్యవసాయ వేదికగా APAIMS 2.0 రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోంది.

ముగింపు
వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో మొబైల్ అప్లికేషన్లు రైతుకు కొత్త బలంగా మారాయి. పంట సాగు ప్రారంభం నుంచి కోత వరకు ప్రతి దశలో రైతుకు అవసరమైన సమాచారం, శాస్త్రీయ సలహాలు, వాతావరణ హెచ్చరికలు, పురుగులు–తెగుళ్ల యాజమాన్యం, పోషక నిర్వహణ, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలను ఒకే వేదికపై అందిస్తూ వ్యవసాయాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. ప్లాంటిక్స్, రైస్ ఎక్స్‌పర్ట్, క్రాప్ డాక్టర్, కిసాన్ సువిధా, ఫార్మ్-ఓ-పీడియా, ఏఎన్‌జీఆర్‌ఏయూ డాట్టిక్, కపాస్ కిసాన్, ఏపీఏఐఎంఎస్ 2.0 వంటి మొబైల్ అప్లికేషన్లు రైతులకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. వీటి వినియోగం ద్వారా పురుగులు, తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా నివారించడంతో పాటు, ఎరువులు మరియు పురుగుమందులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించడం వల్ల సాగు వ్యయం తగ్గి పంట దిగుబడి, నాణ్యత, లాభదాయకత పెరుగుతాయి.
అయితే, ఈ మొబైల్ అప్లికేషన్లు రైతులకు సహాయక సాధనాలు మాత్రమే. వాటి ద్వారా అందిన సమాచారాన్ని స్థానిక పరిస్థితులు, నేల స్వభావం, వాతావరణం, పంట దశలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులు సూచించే సాంకేతిక సలహాలతో సమన్వయం చేసుకొని అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్సు, ఉపగ్రహ సాంకేతికత, డ్రోన్లు, సెన్సార్ ఆధారిత వ్యవసాయం, ఖచ్చితత్వ వ్యవసాయం వంటి ఆధునిక సాంకేతికతలు ఈ మొబైల్ అప్లికేషన్లతో మరింతగా అనుసంధానమవుతాయి. దీంతో రైతులకు ప్రాంతాలకనుకూలంగా, పంటనిర్దిష్టంగా, సమయానుకూలంగా మరింత ఖచ్చితమైన సలహాలు అందుబాటులోకి వస్తాయి. ఇది వ్యవసాయాన్ని ఉత్పాదకంగా, లాభదాయకంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
డిజిటల్ వ్యవసాయం అనేది భవిష్యత్తు కాదు… అది ఇప్పటికే వర్తమానమైంది. ఈ సాంకేతిక అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకుంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించడమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు–తెగుళ్ల వల్ల కలిగే నష్టాలను కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. అందువల్ల ప్రతి రైతు కనీసం తన పంటకు ఉపయోగపడే ఒకటి లేదా రెండు విశ్వసనీయ వ్యవసాయ మొబైల్ అప్లికేషన్లను వినియోగించడం నేటి అవసరం.

డా. ఏం. ఉదయ్ భాస్కర్, డా. ఏం. ఉషా
వ్యవసాయ విస్తరణ విభాగం, ఆచార్య ఎన్. జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూరు
ఫోన్: 9494666359

Read More

తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆకుకూరల సాగు

భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.

మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”

ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.

గోంగూర సాగు:
ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.

పాలకూర:
పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.

తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.

బచ్చలికూర :
బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.

చుక్క కూర:
చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

కొత్తిమీర:
కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.

పుదీన:
పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.

మెంతి కూర:
దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.

బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258

Read More

ఎల్ నినో పరిస్థితుల్లో రైతు ఆదాయ స్థిరత్వానికి వ్యూహాలు: అనుకూల పంటల ఎంపిక మరియు వ్యవసాయ రికార్డుల నిర్వహణ

భారతదేశ జనాభాలో సుమారు 68.84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, మొత్తం శ్రామిక శక్తిలో 54.6 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలంగాణలో కూడా సుమారు 61.12 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, దాదాపు 55 శాతం మంది వ్యవసాయ రంగంతో అనుసంధానమై ఉన్నారు. వ్యవసాయ గణాంకాల ప్రకారం భారతదేశంలో 86 శాతం కంటే ఎక్కువ వ్యవసాయ కమతాలు చిన్న మరియు సన్నకారు వర్గాలకు చెందుతాయి.

తెలంగాణ వ్యవసాయం నీటిపారుదల మరియు వర్షాధార వ్యవసాయ వ్యవస్థల సమ్మేళనంగా ఉండి, వర్షపాతం వ్యవసాయాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇటీవలి సంవత్సరాల్లో సాగునీటి వసతులు పెరిగినప్పటికీ, వాతావరణ మార్పులు రైతుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తీసుకునే ప్రతి పంట నిర్ణయం కుటుంబ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వర్షపాతం అస్థిరంగా ఉండే సంవత్సరాలలో పంటల ఎంపిక మరింత కీలకంగా మారుతుంది. ఎల్నినో (Elnino) వంటి వాతావరణ పరిస్థితులు వర్షపాతాన్ని ప్రభావితం చేసి వ్యవసాయ ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో సాధారణంగా రుతుపవనాల బలహీనత, సగటు కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. 2025-26 సంవత్సరానికి కూడా వాతావరణ పరిస్థితులపై ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశాలపై వివిధ వాతావరణ సంస్థలు సూచనలు చేస్తున్నాయి.

తెలంగాణలోని ప్రధాన పంటలు మరియు వాటిపై ఎల్ నినో ప్రభావం
వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో 2025 వానాకాలంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో వరి పంట 50.57 శాతం వాటాతో ప్రథమ స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో పత్తి 34.52 శాతం విస్తీర్ణాన్ని ఆక్రమించింది. ఈ గణాంకాలు రాష్ట్ర వానాకాల పంటల సరళిలో వరి మరియు పత్తి పంటల ప్రాబల్యాన్ని సూచిస్తున్నాయి. అయితే ఎల్నినో వంటి వాతావరణ అనిశ్చిత పరిస్థితులు ఎదురైనప్పుడు కేవలం సంప్రదాయ పద్ధతిలో వరి సాగుపైనే ఆధారపడకుండా, నీటి లభ్యత తక్కువగా అవసరం ఉన్న కందులు, పెసర వంటి పప్పుధాన్యాలు లేదా స్థానిక పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం.

డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన గణాంకాల ప్రకారం, ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో (2014-15 మరియు 2015-16) తెలంగాణలో ప్రధాన పంటల నికర ఆదాయంలో గణనీయమైన మార్పులు నమోదయ్యాయి.

2015-16 తీవ్రమైన ఎల్ నినోలో పరిస్థితి మరింత తీవ్రంగా కనిపించింది. వరి (-14007.72), మొక్కజొన్న – 11373.53), పత్తి (-10908.38), కందులు (-9818.09), పెసర (-5207.97) పంటలన్నింటిలోనూ నికర ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. ఇది తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో పంటలు ఎంతగా దెబ్బతింటాయో సూచిస్తుంది. అదే విధంగా తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు వర్షాభావాన్ని తట్టుకొని రైతులకు నష్టాలను తగ్గించే అవకాశాన్ని కల్పించాయి. దీనినిబట్టి ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాలలో అన్ని పంటలు ఒకే విధంగా ప్రభావితమవలేదని గమనించవచ్చు. కొన్ని సంవత్సరాలలో వరి అత్యధిక నష్టాలను చవిచూడగా, కొన్ని ప్రత్యామ్నాయ పంటలు లాభాలను మరియు తక్కువ నష్టాలను నమోదు చేశాయి.

అదేవిధంగా పంటల ఎంపికలో కూడా ఒకే సూత్రం అందరికీ వర్తించదు. రైతు నేల స్వభావం, నీటి వనరులు, గత అనుభవం, మార్కెట్ పరిస్థితులు మరియు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా తీసుకోవడానికి వ్యవసాయ రికార్డులు ఎంతో ఉపయోగపడతాయి. గత సంవత్సరాలలో ఏ పంటకు ఎంత ఖర్చు అయింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎంత ఆదాయం లభించింది, వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంట మెరుగ్గా నిలిచింది వంటి వివరాలు రికార్డుల ద్వారా స్పష్టంగా తెలుస్తాయి.

దీనికోసం రైతు పొలంలో జరిగే వివిధ కార్యకలాపాలకు వేర్వేరు రికార్డులు అవసరం. రైతు నిర్వహించుకోదలచిన ముఖ్యమైన రికార్డు రకాలు ఇవి:

  1. వ్యవసాయ దినచర్య రికార్డు
  2. పంటల వారీ ఖర్చు-ఆదాయ రికార్డు
  3. ఎరువుల వినియోగ రికార్డు
  4. పురుగుమందుల వినియోగ రికార్డు
  5. కార్మికుల వినియోగ రికార్డు
  6. యంత్రాల వినియోగ రికార్డు
  7. నీటి వినియోగ రికార్డు
  8. దిగుబడి రికార్డు
  9. పశుసంవర్ధక రికార్డు
  10. నిల్వ మరియు విక్రయాల రికార్డు

ప్రస్తుతం తెలంగాణలోని అభ్యుదయ రైతులు కొంతమంది ప్రధానంగా కాగితపు రికార్డుల ద్వారానే వ్యవసాయ సమాచారాన్ని నమోదు చేసి భద్రపరుస్తున్నారు. అయితే, కాలానుగుణంగా అందుబాటులోకి వచ్చిన వివిధ ఆధునిక పద్ధతులను కూడా వినియోగించి వ్యవసాయ రికార్డులను మరింత సమర్థవంతంగా భద్రపరచుకోవచ్చు. వీటిలో సంప్రదాయ కాగితపు పద్ధతులతో పాటు డిజిటల్ రికార్డు పద్ధతులు, స్మార్ట్ఫోన్ ఆధారిత పద్ధతులు మరియు ప్రభుత్వ డిజిటల్ వేదికలు ముఖ్యమైనవి. ఈ పద్ధతుల వివరాలు క్రింది చిత్రంలో చూపించబడ్డాయి.

వివిధ వ్యవసాయ రికార్డుల పద్ధతులు
ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరం గల అనుకూల పంటలను ఎంపిక చేసి సాగు చేయడం రైతుల ఆదాయ స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వాతావరణ మార్పులు మరియు వర్షాభావ పరిస్థితుల ప్రభావాలను తగ్గించడంలో ముఖ్యమైన వ్యూహంగా నిలుస్తుంది. అదే సమయంలో, పంటల ఎంపిక, ఖర్చులు, దిగుబడులు, ఆదాయం మరియు వనరుల వినియోగానికి సంబంధించిన వ్యవసాయ రికార్డులను క్రమం తప్పకుండా నమోదు చేసి భద్రపరచడం ద్వారా రైతులు గత అనుభవాలను విశ్లేషించి భవిష్యత్ సాగు నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా మరియు సమర్థవంతంగా తీసుకునే అవకాశం కలుగుతుంది. అందువల్ల, అనుకూల పంటల సాగుతో పాటు సమగ్ర వ్యవసాయ రికార్డుల నిర్వహణ కూడా వాతావరణ అనిశ్చితులను ఎదుర్కొంటూ స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవసాయాభివృద్ధికి కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది.

డా. డి. ఎ. రజిని దేవి, సహాయ ప్రొఫెసర్, వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం, వ్యవసాయ కళాశాల,రాజేంద్రనగర్
డా. కె. శేఖర్, సహాయ ప్రొఫెసర్, సేద్య విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, ఫోన్: 9032128184

Read More

గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం

     గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తోంది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనాధారంలో పశుపోషణకు ముఖ్యమైన స్థానం ఉంది. వ్యవసాయంతో పాటు పశువులను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో పశుపోషణ సంప్రదాయ పద్ధతులపై ఆధారపడగా, ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ యాప్‌లు, ఆన్‌లైన్ సేవలు వంటి సాంకేతిక సాధనాలు రైతులకు పశువుల సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, మార్కెటింగ్ మరియు ఆర్థిక లావాదేవీలలో సహాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ పశుపోషణలో డిజిటల్ విప్లవం రైతుల జీవితాలను సులభతరం చేస్తూ, వారి ఆదాయాన్ని పెంచే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది.

పశువులకు డిజిటల్ గుర్తింపు (RFID ట్యాగింగ్):
ప్రతి పశువు చెవికి ప్రత్యేకమైన డిజిటల్ కోడ్ కలిగిన ట్యాగ్‌ను (RFID – Radio Frequency Identification) అమర్చుతున్నారు. దీని ద్వారా పశువు పుట్టిన తేదీ, యజమాని వివరాలు, ఇచ్చిన టీకాలు, మరియు ఆరోగ్య చరిత్రను కేంద్ర ప్రభుత్వ నేషనల్ డిజిటల్ లైవ్ స్టాక్ మిషన్ (NDLM) డేటాబేస్ లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇది పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి మరియు నకిలీ పశువులను గుర్తించడానికి సహాయపడుతుంది.

పశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ- డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో పశువుల ఆరోగ్య పర్యవేక్షణ ఒకటి.

  • ప్రస్తుతం పశువులకు స్మార్ట్ కాలర్లు లేదా చెవులకు అమర్చే సెన్సర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పశువుల శరీర ఉష్ణోగ్రత, కదలికలు, ఆహారం తీసుకునే విధానం వంటి విషయాలను నిరంతరం గమనిస్తాయి.
  • పశువులో ఏదైనా అసాధారణ లక్షణం కనిపిస్తే వెంటనే రైతు మొబైల్‌కు సమాచారం చేరుతుంది. దీంతో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చు. ఫలితంగా పశువుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి.
  • మన దేశంలో కొన్ని AI ఆధారిత వ్యవస్థలు మాస్టైటిస్, లంపీ స్కిన్ డిసీజ్ వంటి వ్యాధులను కూడా ముందుగానే గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

పాల ఉత్పత్తి మరియు విక్రయాలలో డిజిటలైజేషన్:
పాల సేకరణ కేంద్రాలలో ‘ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్’ (AMCU) వచ్చాయి. వీటి ద్వారా పాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో నాణ్యత (ఫ్యాట్ శాతం) ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావడం వల్ల పారదర్శకత పెరుగుతుంది.

  • డిజిటల్ పరికరాలు పశువుల ఉత్పాదకతను కూడా పెంచుతున్నాయి. పశువులు ఎంత మేత తింటున్నాయి, ఎప్పుడు మేత ఇవ్వాలి, సంతానోత్పత్తికి సరైన సమయం ఎప్పుడు అనే విషయాలను ఇవి గుర్తించగలవు. అలాగే పాల ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కూడా విశ్లేషించగలవు.
  • దీంతో ప్రతి పశువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సాధ్యమవుతుంది. ఫలితంగా పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతోంది.

కృత్రిమ గర్భధారణ (AI) మరియు సంతానోత్పత్తి యాప్‌లు:
పశువుల ఈత సమయం, ఎదకు వచ్చే సమయం కచ్చితంగా తెలిస్తేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లు వచ్చాయి. ఇవి పశువుల ఆరోగ్య చక్రంను పర్యవేక్షించి, రైతులకు సరైన సమయానికి సూచనలు పంపుతాయి.

రైతుల చేతిలో స్మార్ట్‌ఫోన్ శక్తి- నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ రైతులకు ఒక ముఖ్యమైన సాధనంగా మారింది.
మొబైల్ యాప్‌ల ద్వారా రైతులు పశువైద్యుల సలహాలు పొందవచ్చు. టెలీమెడిసిన్ సేవలను ఉపయోగించవచ్చు. వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. వ్యాధులపై హెచ్చరికలు పొందవచ్చు. మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు. అలాగే పశువులు లేదా పాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. టీకాలు వేయాల్సిన తేదీలు, మందులు ఇవ్వాల్సిన సమయాల గురించి కూడా యాప్‌లు గుర్తు చేస్తాయి.

వ్యాధుల నియంత్రణలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర
పశువుల ప్రవర్తనలో ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే డిజిటల్ పరికరాలు వెంటనే హెచ్చరికలు పంపిస్తాయి. దీంతో వ్యాధులు ఎక్కువగా వ్యాపించకముందే అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పశువుల మరణాలు తగ్గడమే కాకుండా రైతులు ఆర్థిక నష్టాల నుంచి కూడా రక్షించబడతారు.

పశువైద్య సేవలు – ఈ-సంజీవని:
దూర ప్రాంతాల్లోని రైతులకు పశువైద్యుల సలహాలు, సూచనలు అందించడానికి టెలి-మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు, స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో కాల్స్ చేసి వ్యాధులను నిర్ధారించి, చికిత్స అందించవచ్చు.

మార్కెట్ అవకాశాల విస్తరణ- డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల రైతులు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించే అవకాశం పొందుతున్నారు.
దీంతో మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తులకు సరైన ధర లభిస్తుంది. మార్కెట్ సమాచారం సులభంగా అందుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే డిజిటల్ చెల్లింపుల వల్ల డబ్బు లావాదేవీలు మరింత సురక్షితంగా, వేగంగా జరుగుతున్నాయి.

పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల యాంటీబయాటిక్స్ అవసరానికి మించి వాడాల్సిన అవసరం తగ్గుతుంది. నీరు, మేత వంటి వనరుల వృథా తగ్గుతుంది. పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతుంది. దీంతో అందుబాటులో ఉన్న వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు
అయితే ఈ మార్పుల మధ్య కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఇంకా పూర్తిగా అందుబాటులో లేకపోవడం. డిజిటల్ పరిజ్ఞానం కొంతమందికి తక్కువగా ఉండటం. ఆధునిక పరికరాల ధరలు ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రైతులందరూ ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగించలేకపోతున్నారు.
అందుకే రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయి.

ముగింపు
డిజిటల్ టెక్నాలజీ సంప్రదాయ పశుపోషణ పద్ధతులను తొలగించడం లేదు. వాటిని మరింత మెరుగుపరుస్తోంది. రైతుల అనుభవానికి ఆధునిక సాంకేతికత తోడవడంతో పశుపోషణ మరింత సులభంగా, సమర్థవంతంగా మారుతోంది. ఆరోగ్యకరమైన పశువులు, అధిక ఆదాయం, బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో పశుపోషణలో డిజిటల్ సాధనాలు కూడా భూమి, నీరు, మేతల మాదిరిగానే అవసరమైనవిగా మారనున్నాయి.
ఈ డిజిటల్ విప్లవం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం వల్ల పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయి. యువత కూడా ఈ ఆధునిక పశుపోషణ పట్ల ఆసక్తి చూపుతున్నారు.

డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్‌సి.),
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. Ph: 9703121088

Read More